రాధికాసాంత్వనము (ముద్దుపళని)/ప్రస్తావన

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


ప్రస్తావన


సీ. శ్రీపరిపూర్ణమౌ వ్రేపల్లెవాడలో
నందగోపాలునిమందిరమున
నవతీర్ణుఁడై మేనయత్తయౌ రాధికా
విధుముఖిచేఁ బ్రేమఁ బెంపుఁగనుచుఁ
దనమేనమామకూఁతు నిళాలతాంగిని
బెండ్లాడి యామెతో వేడ్క నుండఁ
దనవియోగముచేతఁ దాళఁజాలక చాలఁ
జింతిల్లుచుండుటఁ జిల్కవలన
తే. విని మిథిలనుండి యింటికి వేగ వచ్చి
చతురగతులను రాధికాసాంత్వనమ్ముఁ
జేసి దక్షిణనేత నా వాసిఁ గన్న
చిన్నికృష్ణుని మనసులో నెన్నుచుందు.

నేను జిన్ననాఁటనుండియు సంగీతవిద్యతోపాటుగా సాహిత్యవిద్యయందుఁగూడఁ గొంచెము గొప్పపరిశ్రమచేయుచు మాదేశభాషయగు కన్నడములోను తెలుఁగులోను బెక్కుగ్రంథములు చదివితిని. తరువాత బెంగుళూరినుండి యీ చెన్నపట్టణమునకు వచ్చినది మొదలుగా నఱవములోఁ గూడ ననేకగ్రంథములఁ జదువుచుంటిని. అయినను నాకాంధ్రభాషాగ్రంథములయందుఁ గలయభిరుచి పైభాషలలో నంతగా లేకపోయినది ఇట్లుండఁగా "వేలాంవెఱ్ఱి” అనుసామెతగాఁ జాలదినములనుండి తెలుఁగుబాసలోఁ గవిత్వము చెప్పవలయు నను కుతూహలము కూడఁ గలిగి పట్టుదలతో మరల భారతాదిగ నాంధ్రగ్రంథములు చదివితిని. పదపడి బ్రహ్మశ్రీ శతావధానులు తిరుపతి వేంకటేశ్వరకవులు విరచించిన శ్రవణానందము మొదలగు గ్రంథములు చదువుచుండఁగ వారి “పాణిగృహీత" యను ప్రబంధములోని

తే. రాధికాసాంత్వనమ్మును రచనఁ జేసి
పేరు గనుముద్దుపళని తెల్వియును విజయ
నగర భూపాలుఁ డుంచిననాతి చాటు
పద్యములు గాంచి యాకీర్తి పడయ నెంచి.

అను పద్యమును జూచి రాధికాసాంత్వనమును గడుఁగుతూహలముతోఁ గొని చదువఁగా నందు ముద్రాసమయమునఁ దటస్థించిన తప్పు లెన్నియో కన్పట్టినవి. అయ్యయో! ఇయ్యది మంచిప్రతి దొరకకపోయినదే యని విచారించుచుండఁగా దైవవశమున నామిత్రు లొకరు చాలకాలము క్రిందట వ్రాసిన వ్యాఖ్యానసహితమైన యొకవ్రాఁతప్రతిని నాకుఁ బంపించిరి. అదియు నచ్చుప్రతియు సరి చూడఁగాఁ జాలవ్యత్యాసము గనుపించినది. మంగళాచరణము మొదలు షష్ఠ్యంతములవఱకును గల పీఠిక లేకపోవుటయే కాక మధ్యమధ్యను గొన్నిపద్యములుకూడ లేవు. మఱికొన్ని చోట్ల పద్యములచరణములే విడువఁబడియున్నవి. ఇట్టి ముద్దుల మూటగట్టు రాధికా సాంత్వనమును రచించినది 

ముద్దుపళని


ఈమెను గూర్చి మ॥రా॥శ్రీ కందుకూరి వీరేశలింగముపంతులవారు తమయాంధ్రకవులచరిత్రములో వ్రాయించిన పఙ్క్తులు కొన్ని యవసరమునుబట్టి యిం దుదాహరించుచున్నాను. “ముద్దుపళని పద్యకావ్యములు చేసిన స్త్రీలలో నొకతె. ఈముద్దుపళని వేశ్యాంగన. ఇది రాధికాసాంత్వన మను నాలుగాశ్వాసముల శృంగారప్రబంధమును రచించెను. దీనితల్లి పేరు ముత్యాలు. అది తంజాపూరు సంస్థాన ప్రభు వయిన ప్రతాపసింహుని యుంపుడుకత్తె యయినట్లు…గద్యములో వ్రాయఁబడినదానినిబట్టి యూహింపఁ దగియున్నది. దీనికే ఇళాదేవీయ మనునామాంతరము గలదు” అని యున్నది. ఇందు "తల్లి పేరు ముత్యా లనియు, గద్యములో వ్రాయఁబడినదానినిబట్టి యూహింపదగియున్నది" అనియు వ్రాయుటచే శ్రీపంతులవారుకూడఁ బీఠికను జూచినట్టు గన్పట్టదు. పీఠికలోఁ గవయిత్రి వంశవర్ణనము గలదు. ముత్యా లనునతఁడు పళనికిఁ దండ్రి. “ముద్దు” అనునది యుపనామము. పళని యనఁగా దక్షిణదేశములోని సుబహణ్యస్వామి వేంచేసియున్న దివ్యస్థలమునకుఁ బేరు. చాలచోట్ల బిడ్డలకు దేవస్థలముల పేరులే యుంచుచుండుట వాడుక యున్నది. ఈ ప్రబంధములో యశోదకు మేనగోడలును శ్రీకృష్ణునికి భార్యయు నగు నిళాదేవిచరిత్ర ముండుటచే దీని కిళాదేవీయ మను నామాంతరము వచ్చినది.

“ఇది సంగీతసాహిత్యభరతశాస్త్రములలోఁ బ్రవీణురాలైనట్టు తానే చెప్పుకొన్నది. దీని కవిత్వము నాతికఠినమై మృదువుగా నుండినందుకు సందేహము లేదు. దీనికి మంచి సంస్కృతాంధ్ర సాహిత్యమును గలదు. అందందుఁ దప్పు లున్నవి కాని యట్టి తప్పులు పురుషులకవిత్వమునందు సయిత మనేకగ్రంథములలో గానంబడుచున్నవి” అని శ్రీపంతులవారే యొప్పుకొనిరి. బాగుగా నాలోచించినచో శబ్దమునుబట్టియో అర్థమునుబట్టియో భావములనుబట్టియో రసమునుబట్టియో ఔచితినిబట్టియో యెటులయిన నేమి తప్పులేకుండ భారతము మొదలుగా నేగ్రంథమును లేదు. ఇట్లుండఁగా స్త్రీలు వ్రాసిన గ్రంథములలోఁ దప్పు లుండుట యొకతప్పు కాదు. “అయినను గ్రంథములోని భాగము లనేకములు స్త్రీలు వినఁదగినవియు, స్త్రీనోటినుండి రాఁదగినవియుఁ గాక దూష్యములై యున్నవి” అని శ్రీపంతులవారు వ్రాసిరేకాని తారాశశాంకవిజయము, హంసవింశతి, వైజయంతీవిలాసము మొదలగు గ్రంథములలోనివానికన్న నెక్కువగా నిందు దూష్యము లున్నవా! అదిగాక స్త్రీలు పురుషులవలన వినఁగూడక పోవచ్చును గాని తమలోఁ దాము చదువుకొనుటకు బాధక మే మున్నది? ఇంతకును నిది భగవచ్చరిత్రము, తారాశశాంకవిజయాదులవలె స్త్రీలకుఁ జెడుబుద్దులు గఱపువిషయ మేదియును నిందు లేదే. “ఇది జారత్వమే కులవృత్తిగాఁ గల వేశ్య యగుటచే స్త్రీజనస్వాభావిక మైనసిగ్గును విడిచి శృంగారరస మనుపేర సంభోగాదివర్ణనములను బుస్తకమునిండ మిక్కిలి పచ్చిగాఁ జేసినది” అని వ్రాసిరి. అగ్నిసాక్షికముగా నొకమగనిం గట్టుకొని రెండవమగనితోఁ బోవుట జారత్వ మనిపించుకొనును గాని వేశ్య జారిణి యనిపించుకోదు. బ్రహ్మసృష్టినాఁటినుండియు వచ్చుచున్న మాజాతికిఁ గులవృత్తి యెట్టిదో ఆసంగతియంతయు వాత్స్యాయనకామసూత్రములఁ జూచువారికి యథార్థము గోచరించును.

సిగ్గనునది స్త్రీజనమునకేకాని పురుషులకుమాత్రము స్వాభావికము కాదు కాఁబోలును. ఇక్కవయిత్రి వేశ్యగనుక సిగ్గుమాలి సంభోగాదివర్ణనములు పచ్చిగా వ్రాసిన వ్రాయవచ్చును. కాని శిష్టు లనిపించుకొన్న పురుషు లట్లు వ్రాయఁగూడదుగద? అట్టి మహానుభావులు మాత్రము తమతమగ్రంథములలో నంతకన్న నెక్కువపచ్చిగా వర్ణనలు చేయలేదుకాఁబోలును. వేయేల? శ్రీపంతులువారే తమకవులచరిత్రలో “వేశ్యాసంపర్కమువలన నెట్టిదృఢమనస్కులకును ననర్థములు వచ్చునని చూపుటకయి యింతవఱకుఁ గల్పింపఁబడినకథ నీతిబోధకముగానే యున్నది కాని తరువాతికథమాత్రము నీతిబాహ్యముగా నున్నది” అనియు, “ఇటువంటి సిద్ధాంతములే మన దేశములో నీతికిని మతమునకును గూడ నమితమైన చెఱుపును గలుగఁజేయుచున్నవి. నీతిని విడిచినమత మెప్పుడును దేవునికిఁ బ్రీతికరము కానేరదు” అనియు నిందించి తరువాత దమస్వహస్తముతో సరిచూచి యచ్చొత్తింప నిచ్చిన వైజయంతీవిలాసములోని పచ్చవిల్తుని పచ్చికపట్టుకన్నను, వీరే స్వయముగ రచించిన [1]రసికజనమనోరంజనములోని బూతులకన్నను నిందుఁ బచ్చిబూతులు కన్పట్టుచున్నవా!

ఈ గ్రంథము రస మొల్కుచుండుట చేతను, ఇది రచించినది స్త్రీయేగాక మాజాతిలోఁబుట్టిన దగుటచేతను దీనిని మంచిప్రతిగా ముద్రింపవలయు ననుతలంపుతో వ్రాతప్రతిని ముద్రితపుస్తకమును సరిచూచి నామనసున కింపైనపాఠము నుంచి యొకప్రతి పనిఁ బూని వ్రాసితిని. ఇటీవల బ్రహ్మశ్రీ వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారు ప్రాచీనప్రబంధములను మంచిస్థితిలోనికిఁ దెచ్చుచుండుటచే దీనినిగూడ వారే యచ్చొత్తించినచోఁ జాల బాగుగ నుండు నని యెంచి యీప్రతి యనేక వందనములతో వారియొద్దకుఁ బంపించితిని. ఇది వ్రాసినదియు సవరించినదియు స్త్రీయే యగుటచేతను గలిగినతప్పుల నొప్పులుగా గమనింతు రని స్త్రీల యందు గారవము గలవారిని బ్రార్థించుచున్నాను.

ఇట్లు,
సహృదయవిధేయురాలు
బెంగుళూరు-నాగరత్నము.


సౌమ్యసంవత్సరపు మహాశివరాత్రి.
చెన్నపట్టణము 9.3.1910

  1. వీ రధికారమం దుండుటచే మదరాసు విశ్వవిద్యాలయములో దీనిని వీరు బఠనీయగ్రంథముగా నిర్మించుకొనిరి.