రాధికాసాంత్వనము (ముద్దుపళని)/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

(ఇళాదేవీయ మనునామాంతరముగల)

రాధికాసాంత్వనము

ప్రథమాశ్వాసము

శ్రీలఁ జెలంగురాధికను – జెల్వరొ ని న్నిల రూపరేఖలన్
బోలుదు రేపడంతు లన మోహపుటాలిని నిప్పు డెన్నెదో
హాళిని నన్నుఁ గూర్చి యని యల్గిన యచ్చెలిఁ గౌఁగిలించు గో
పాలునిఁ జిన్నికృష్ణునిఁ గృపాళునిఁ గొల్తు నభీష్టసిద్ధికై. 1

సీ. రహి ముద్దుటడుగులు రాజీవములఁ గేరఁ

బ్రపదముల్ తాఁబేటవగలఁ బోర
సరసోరుకాండముల్ సౌకర్య మేపార
లేఁగౌను సింగంపులీలఁ జీరఁ
జనువళుల్ త్రిక్రమీసౌజన్యమునఁ దేఱ
భుజము లారామతాస్ఫూర్తి మీఱ
రమణీయముఖకాంతి రామచంద్రునిఁ జేరఁ
జిరునవ్వు బలుతెల్వి గరిమఁ గోరఁ
తే. గన్నుఁగవ శ్రుతిలంఘియై కలిమి గులుకఁ
దనరుమధురాధరము కల్కితనము చిల్కఁ
జెలఁగుశుకవాణ రుక్మిణీజలజపాణి
భావభవుమాత సంపద లీవుఁ గాత. 2

చ. నెఱిగమనంబు వేణియును నిక్కుచనుంగవ మీఁదిపాదముల్
కరులును శేషభోగియు నగంబులు నాదిమకూర్మరాజమై
వఱలఁగఁ బొల్చు గంధవతి భామ మనోహరరూపసత్త్వతన్
నరకుని గాంచి పెంచుగతి నన్ గృప నెప్పుడుఁ బ్రోచుఁ గావుతన్. 3

ఆ. శ్రీనివాసుఁ డైన శేషుని భజియించి
ఘనశరీరుఁ డైన గరుడుఁ బొగడి
యఘవిదారి యైన హరిచమూపతి నెంచి
పరమసూరిజనులఁ బ్రస్తుతింతు. 4

మ. క్షితి వాల్మీకిపరాశరప్రియసుత శ్రీకాళిదాసాదిసం
స్కృతవిద్వత్కవితాజ్ఞులం బొగడి భక్తిన్ నన్నయార్యుండు స
న్మతి యౌ తిక్కన సోమభాస్కరులు శ్రీనాథుండు భీముండు నాఁ
గృతు లౌ నాంధ్రకవీంద్రులం దలఁతు యుక్తిన్ మత్కృతిప్రౌఢికిన్. 5

తే. పొత్తమున నుండుశల్యంబు లెత్తి వైచి
శాస్త్రయుక్తిని గొని భేషజంబు సేయఁ
గఁ దగునాక్షేపజీవకవులఁ దీర్పఁ
జనదు కృతుల నమంగళజనులు వారు. 6

చ. చెలువుగఁ బూర్వసత్కవులు చేసినకబ్బము లెన్నొ యుండఁగాఁ
జెలిమిని నీకృతిన్ గణన సేతురె సత్కవు లందు రేమొకొ
భళి కయికొందు రె ట్లనిన బద్మపుఁదేనియ నానుతుమ్మెదల్
పులిసి హసించకే యితరపుష్పమరందము లోలిఁ గ్రోలవే. 7

వ. అని యిష్టదేవతానమస్కారంబును, గవిసత్కారంబును, గుకవితిరస్కారంబునుం గావించి యెద్దియేనియు నొక్క శృంగారప్రబంధంబు నిబంధింపం దలంచి హరివాసరంబునం శ్రీహరిం బ్రార్థించి మన్నిశాంతంబున నిదురింపుచున్న నన్నిశాంతంబున. 8

సీ. కటిఁ జుట్టి కట్టిన కనకాంబరముతోడ
మెఱుఁగుచామనిచాయమేనితోడ
నాసికతుదఁ గల్గు నవమౌక్తికముతోడ
జిగిలికస్తురిబొట్టుమొగముతోడఁ
గరుణారసముఁ జిల్కు కన్నుఁదమ్ములతోడ
నెమ్మిరెక్కతురాయినీటుతోడ
గుదికొని వెన్నాడు కుసుమపుంజముతోడఁ
జంద్రసూర్యాదిభూషాళితోడఁ
తే. బ్రతి యెఱుంగని దివ్యరూపంబుతోడ
సొగసు గనుపించు మవ్వంపుసొంపుతోడ
రాధికామణికైదండ రమణఁ బూని
చిన్నికృష్ణుండు కలను బ్రసన్నుఁ డయ్యె. 9

తే. ఇట్లు గనుపట్టునతని నే నెలమిఁ గాంచి
లేచి సాష్టాంగవందనం బాచరింప
శౌరి నను జూచి మేఘగంభీరరవము
దనరఁగా బల్కెఁ గరుణామృతంబు లొల్క.


తే. చిన్నికృష్ణుండ నే నాదుచిత్తమునకు
సమ్మతంబైన రాధికాసాంత్వనంబు
తగ నొనర్పు మదీయాంకితముగ నీవు
లలితగుణపేటి శ్రీముద్దుపళనిబోటి. 11

వ. అని యానతిచ్చి యంతర్ధానుం డగుటయు నేను నిదుర మేల్కాంచి యీశుభస్వప్నం బెవ్వరితోడ విన్నవించెద నని యూహించి యుభయవేదాంతప్రతిష్ఠాపనాచార్యుండును, నిరుపమౌదార్యగాంభీర్యధుర్యుండును, బాషండషండగిరతండమహాఖండలుండును, బాలితభక్తమండలుండును, దిరుమలతాతాచార్యవర్యకులకలశపారావారతారాధారుండును, మదీయపూర్వజన్మతపఃఫలసారుండును, సుగుణాభిరాముండును నగు వీరరాఘవదేశికసార్వభౌమునిసన్నిధానంబున కరిగి సాష్టాంగదండప్రణామంబు లాచరించి తత్కటాక్షంబునుం గాంచి యీశుభస్వప్నంబు విన్నవించినఁ దత్సన్నిధానంబునం గలసకలకళావల్లభు లగువిద్వజ్జనంబులు న న్నవలోకించి సాక్షాచ్ఛ్రీమన్నారాయణాపరావతారుం డగువీరరాఘవధీరుచరణారవిందంబు లాశ్రయించినదాన వగుటంజేసి దేవదేవుం డగుశ్రీకృష్ణదేవుండు సాక్షాత్కరించె దీన నీకు నధికశ్రేయఃప్రాప్తి యగు నదియునుం గాక. 12

సీ. ఏరాజు కువలయం బెల్ల రంజిలఁ జేసి
జైవాతృకాఖ్య నిచ్చలుఁ దలిర్చు
నేలోకబాంధవుం డిలఁ దమంబు లడంచి
చక్రప్రమోదంబు సంఘటించు
నేఘనుండు శరంబు లేవేళఁ గురియించి
పరవాహినుల నెల్ల భంగపఱచు
నేయీశుఁ డార్యావనాయత్తమతిఁ గాంచి
కీర్తింప సర్వజ్ఞమూర్తి యౌను
తే. వాఁడు నృపమాత్రుఁడే రఘూద్వహదయాప్ర
వాహవర్ధితభోసలాన్వయపయోధి

సోమతొళజేంద్రవరతనూజుండు శ్రీప్ర
తాపసింహక్షమాపాలతల్లజుండు. 13

సీ. తనయార్యనుతమహౌదార్యవిస్ఫురణంబు
లేఖద్రుఁ బం డ్లిగిలింపఁజేయ
దనరామభక్తిప్రధానమానసశుద్ధి
నారదు వెలవెలఁ బాఱఁ జేయఁ
దనసర్వవిద్యావధానమేధాస్ఫూర్తి
పన్నగేంద్రునితలల్ వంపఁ జేయఁ
దనయభేద్యగభీరతానారతఖ్యాతి
యంబోధి భంగపా టందఁజేయ
తే. నమర శీతాద్రిసేతుమధ్యావనీత
లాంతరనిరంతరయశోవిలాసభాస
మానభోసలతొళజరాణ్మణిసుతప్ర
తాపసింహేంద్రమౌలి ప్రతాపహేళి. 14

తే. ఆమహారాజుకృపఁ జెందినట్టినీకు
నిట్టిభాగ్యంబు లద్భుతం బేమి తెల్ప
సార మగునీదువిస్తారచర్య లెల్ల
వినుము వినుపింతు మని యిట్టులనిరి కరుణ. 15

సీ. శ్రీరమణీకుచశిఖరాగ్రముల నేవి
చిగురుజొంపంబులై జిగి చెలంగు
స్మరరిపుబ్రహ్మాదిమకుటంబులం దేవి
పద్మరాగంబులై ప్రభ లొసంగు
మౌనిరాణ్మానసమానసంబుల నేవి
కమలవనంబులై ఘన మెసంగుఁ
జిరతరశ్రుతివధూసీమంతముల నేవి
యరిదికుంకుమపట్టులై వెలుంగు

తే. నట్టిసర్వజ్ఞమౌళిశృంగాగ్రనటన
పటుతరక్రమజగతీపావనప్ర
తీతచారిత్రసురధునీతిలకజన్మ
పదము లనుపమశ్రీవిష్ణుపదము లమరు. 16

తే. ఆమహీనాథుపదపద్మమందుఁ బుట్టి
సురుచిరఖ్యాతిఁ గనె నీతి శూద్రజాతి
దాన నయ్యావయసెలంగె దానకర్ణుఁ
డితఁడెయం చని జను లెన్నఁ జతురుఁ డగుచు. 17

తే. ఆతఁ డెంతయుఁ గాంచెఁ జెంగాతివలన
నతుల యగుముద్దుతంజనాయకిని బ్రేమ
నాడి బొంకనివాని ముత్యాలుఘనుని
తంజనాయకి వారలఁ దత్తు గొనియె. 18

క. అల తంజనాయకీమణీ
కలిమియుఁ జెలిమియు గణింపఁగాఁ దర మగునే
తెలివో గెలివో వలపుల
చెలువన్ గెలువన్ దలంచుఁ జెలువముచేతన్. 19

సీ. వీణ వాయించెనా వివిధచిత్రాద్భుత
ప్రతిమ లెల్లను తలల్ పరఁగ నూఁచు
ఠీవి నటించెనా దేవలోకపురంభ
కొంచక యౌదల వంచుకొనును
గానంబు వినుపింపఁ బూనెనా యామహా
గిరిరాజ మైనను గరఁగిపోవు
సభల మాటాడెనా చల్లఁగాఁ బన్నీరు
చిలికినఠేవను జెలువు మీఱు
తే. నని దొరాదొర లెన్నఁగాఁ ఘనత కెక్కి
ప్రోడచేడెలలో నీడుజోడు లేక

తతసుగుణపేటి దివ్యసౌందర్యవాటి
యతనుమదఘోటి తంజనాయకివధూటి 20

క. ఆరాజవదన ప్రోవఁగ
నారీమణి ముద్దుతంజనాయకి ముత్యాల్
ధీరుఁడుఁ జెలఁగిరి కుంతియు
నారయ వసుదేవునటుల ననుకూలముగాన. 21

క. అలముద్దుతంజనాయకి
నలు వందెను గలిమిఁ దంజనాయకి యనఁగా
వలపులదొర యైనను గని
వలపులు గొనునట్టిమేనివలపులు చెలఁగన్. 22

సీ. ఈవిచేతనె కాదు ఠీవిచేతను గూడ
శశిరేఖ నెంతయుఁ జ క్కడంచుఁ
జూపుచేతనె కాదు రూపుచేతను గూడ
హరిణీవిలాసంబు నౌఘళించు
గోరుచేతనె కాదు సౌరుచేతను గూడ
దారావినోదంబు నాఱడించుఁ
దళుకుచేతనె కాదు కులుకుచేతను గూడ
హేమాతిశయమును హీన మెంచు
తే. నని కవుల్ మెచ్చఁ దనరె నొయ్యార మెచ్చ
నన్నిటను జాణ సకలవిద్యాప్రవీణ
మేటిమరుదంతి యింతులమేలుబంతి
హారిగుణ ముద్దుతంజనాయకిమిటారి. 23

క. ఆముద్దుతంజనాయకి
ప్రేమను గొని కనియెఁ దీవె విరిఁ బడసె ననన్
భూమీశు లెంచఁ దగునఖ
రామాద్భుతసుగుణమణిని రామామణినిన్. 24

సీ. ఏరామ కట్టించి యిడె నగ్రహారంబు
పుడమి రామాంబాఖ్యపుర మనంగ
నమర నేధన్య దివ్యాలయం బొనరించి
తిరము గాఁగ శివప్రతిష్ఠ జేసె
నెంచి యేపుణ్య పెట్టించె నందనవని
కొఱ లేనివీరు లెత్తి కొమరు మిగుల
నేమాన్య జీవనం బెసఁగఁ దటాకంబు
ఘటియించె సేతుమార్గంబునందు
తే. మేటి యెవ్వతె గండరకోటలోన
మఱియు నిత్యాన్నదానాది మహిమ లంది
పార్వతీశులనిత్యోత్సవము లొనర్చె
నట్టిరామామణివధూటి నలవె పొగడ. 25

సీ. ముదమొప్పఁ దనగోము మోము గాంచినవాఁడె
తేజ మొందినరాజరాజు గాఁగఁ
బ్రతి లేనితనకటిప్రతిమఁ జెందినవాఁడె
తెఱఁ గొందుభూతలాధిపుఁడు గాఁగ
గొమ రొప్పఁ దనగబ్బిగుబ్బ లంటినవాఁడె
నిరుపమదుర్గాధినేత గాఁగ
నలువు మీఱినతననాభి చేకొనువాఁడె
వైభవోన్నతచక్రవర్తి గాఁగఁ
తే. జెలఁగుకలిమియుఁ జెలిమియుఁ దెలివి గలిగి
కళయుఁ జెలువము తళుకును బెళుకు నళుకు
చెలువు గులికెడువలపులసొలపు మిగుల
మిగులు రామావధూటి యన్ సుగుణపేటి. 26

సీ. నారదుం డలవిష్ణునామకీర్తనభక్తి
నీరదుం డౌదార్యసారయుక్తి

రాముఁ డద్భుతదయారసనిరంతరబుద్ది
సోముఁ డంచితకళాసుప్రసిద్ధి
రారాజు భీమవిక్రమనికారస్ఫూర్తి
భోజరాజు కళాప్రభూతకీర్తి
జిష్ణుఁడు వైభవశ్రీవిలాసఖ్యాతిఁ
గృష్ణుఁడు భరతశాస్త్రీయజాతి
తే. ననఁగ నను వొందు బ్రహ్మవిద్యాప్రవీణ
సరస తిరుమల తాతయాచార్యపాద
తోయరుహమత్తచంచరీకాయతాత్మ
పాలితాశ్రితజనుఁడు ముత్యాలు ఘనుఁడు. 27

తే. అట్టి ముత్యాలు ఘనుఁడు తాఁ జెట్టఁ బట్టెఁ
దనకు ననుకూల యగునట్టి ధర్మపత్ని
యౌ నటంచును మానితానూనసుగుణ
పేటి మేటివధూటి శ్రీపోటిబోటి. 28

సీ. శ్రీలక్షణమున లక్ష్మిని సాటి యనవచ్చుఁ
జంచల యై ధాత్రి మించదేని
వైభవంబున శచీవనిత నీ డనవచ్చుఁ
బలుగాకిపుత్త్రులఁ బడయదేని
భూతిపెంపున శైలపుత్త్రి జో డనవచ్చు
విభుమేను సగము గావింపదేని
నిశ్చలక్షమ ధారుణిని సరి యనవచ్చుఁ
బతులను బెక్కండ్రఁ బడయదేని
తే. యనఁగ ననుపమసకలగుణాభిరామ
యగుచు బాంధవజనకోటి యభినుతింప
సొంపు మీఱఁగఁ బెంపెక్కు సంపదాఢ్య
హారిగృహవాటి శ్రీపోటి యవ్వధూటి. 29

సీ. సాహిత్యవిద్యావిశారద శారద
యై ముద్దుపళని నా నమరు నిన్ను
గురుతరం బై తగు గుణగణప్రౌఢివే
లాయుతుం డైనవేలాయుధాఖ్యు
భరతభావాభావభావజగురుఁడు నాఁ
గొమరుఁ జెందెడు ముద్దుకొమరువరుని
రూపవిభ్రమకళారూఢి నెంతయు రతీ
దేవి యౌ ముద్దులక్ష్మీవధూటి
తే. బుద్ది నల్లారుముద్దైన ముద్దయాఢ్యుఁ
దీటు లేనట్టిపద్మావతీలలామఁ
దెలివి మీఱు రామస్వామి నెలమిఁ గాంచె
మేటిముత్యాలు పోటివధూటివలన. 30

క. వెలసితివి వారిలో
న్దెలిచుక్కలలోనఁ జెలఁగు నెలరేక యనన్
లలితకళావిభవంబులు
వల నొప్పఁగ మేటిముద్దుపళనివధూటి. 31

సీ. ఏనాతి నీరీతి నెంతొ భక్తి చెలంగ
వ్రాయించె జయధాటి రామకోటి
ఏనారి నీదారి నెలమి విద్వచ్ఛ్రేణిఁ
దనియించె నెర మెచ్చి ధనము లిచ్చి
ఏకల్కి నీపోల్కి నిలఁ గీర్తిఁ గైకొనె
గబ్బముల్ చేనంది ఘనతఁ జెంది
ఏబాల నీలీల నిటు దొరాదొరలచేఁ
బొగ డొందె గడిదేఱి పొలుపు మీఱి
తే. తలఁప నేధీర నీమేరఁ దాతయార్యు
పాదముల వ్రాలె మది నెంచి ప్రస్తుతించి



కలరె నీసాటి ముత్యాలుకన్న మేటి
ప్రబలగుణపేటి శ్రీముద్దుపళనిబోటి. 32

సీ. చెన్నొందు రంభ గాకున్నచోను బ్రతాప
సింహేంద్రుపెంపును జెంద నేల
ప్రతి లేనియలకల్పలతిక గాకున్నచో
లలి ముద్దులక్ష్మితోఁ బుట్ట నేల
తగుదివ్యసుగుణరత్నంబు కాకున్నచో
ముత్యాలలోనుండి పొదల నేల
యిల సుగంధప్రద మిదియె కాకున్నచో
శ్రీనివాసప్రాప్తిఁ జెలఁగ నేల
తే. వీఁక గలచంద్రరేఖయె కాక యున్న
లలితసకలకళాప్రౌఢి వెలయ నేల
యని పొగడ మేటియై మీఱె నతనుఘోటి
భవ్యవాగ్ధాటి శ్రీముద్దుపళనిబోటి. 33

ఉ. పున్నమచందమామ కెనఁబోలుముఖంబు ముఖానురూపమౌ
తిన్ననిపల్కు పల్కులను దేఱిన సద్దయ సద్దయారసో
త్పన్నఁపుఁజూపు చూపున ధ్రువం బగునీవియు సొమ్ము లౌచు మే
న న్నలు వొంద నొప్పు నరనాథులు మెచ్చఁగ ముద్దులక్ష్మియున్. 34

క. పద్మారిఁ గేరుమోమును
బద్మాస్త్రుఁడు గోరుగోము బలువాల్ గన్నుల్
పద్మాళి దూఱు ననఁ దగి
పద్మావతిరీతిఁ దనరుఁ బద్మావతియున్. 35

సీ. ఘటియింప నేర్తువు కవనజాతు లెఱింగి
పలుకులకల్కి వెల్వెలనఁ బాఱ
నీయఁగా నేరుతు విలఁ గోరినవరాలు
నగరాజుసుకుమారి సగము గాఁగ

చెల్లింప నేర్తువు చెప్పినరీతిగాఁ
గని ద్రౌపదీసతి కాన కేగ
నటియింప నేర్తువు నవరసంబుల నంటి
తగురంభ యనిమిషత్వము వహింప
తే. నీదె మఱి యుక్తి పరికింప నీదె శక్తి
నీదె నెరపద్దు సరయఁగా నీదె ముద్దు
సరసముగఁ జేసి రాధికాసాంత్వనమ్ము
భక్తి హరి కిమ్ము శ్రీముద్దుపళనిబోటి. 36

వ. అని నియోగించిన నేనును బ్రబంధనిబంధనోద్యుక్త నై. 37

షష్ఠ్యంతములు


క. శ్రీకృష్ణదేవునకుఁ గరు
ణాకరచారిత్రవిలసదనుభావునకున్
గోకులజప్రియభావున
కాకృతిజితశంబరార్యహంభావునకున్. 38

క. కౌస్తుభయుతవిస్తృతవ
క్షస్తలునకు భక్తలోకసంరక్షణతా
నిస్తులునకు శ్రుతిమస్తక
వాస్తునకు సమస్తవిబుధపరవస్తునకున్. 39

క. శౌరికి జనవాంఛితసహ
కారికిఁ బాండవకులోపకారికి నచలో
ద్ధారికిఁ గలికలుషౌఘవి
దారికి దనుజేంద్రమదమతంగజహరికిన్. 40

క. అర్జునమదనాభ్యాసున
కర్జునకరకాంతిమందహాసున కతిభ
క్తార్జునకృతసహవాసున
కర్జునవాసునకు ద్వారకావాసునకున్. 41

క. కరుణావర్ధిష్ణునకున్
బరమమునిప్రకరహృదయవర్తిష్ణునకున్
గురుకులగిరిజిష్ణునకున్
జిరగుణయుతవిష్ణునకును శ్రీకృష్ణునకున్. 42

వ. అంకితంబుగా నాయొనర్పం బూనిన రాధికాసాంత్వనం బను శృంగారప్రబంధంబునకుఁ గథాక్రమం బెట్టి దనిన. 43

క. శ్రీవనితావరశుభ్రయ
శోవారిధిపూర్ణచంద్రు శుకయోగీంద్రున్
భావించి చూచి జనక
క్ష్మావరుఁ డి ట్లనియె భక్తిసంభ్రమపరుఁ డై. 44

సీ. మునినాథ [1]మును నేను బొందుగా హరికథ
ల్వీనులవిందుగా వింటి నందు
నందుతోఁబుట్టు గోవిందుని కత్త యై
వరగుణాకర యన వఱలు రాధ
తా నెత్తి పెంచఁగాఁ దగునిళాసతిమీఁద
వడి నేల బలుకారుబారు చేసి
గోపాలదేవు పైఁ గోపించె నపు డెట్లు
దక్షిణనాయకాధ్యక్షుఁ డైన
తే. దేవకీసూనుఁ డానారితీరు దీఱఁ
దీరుగా నేలె నవి యింపు దేఱునటుల
నాన తీవయ్య బహుసావధానమతిని
విని కృతార్థుఁడ నయ్యెద విమలహృదయ. 45

క. అన విని శుకయోగీంద్రుఁడు
వనజాక్షునిదివ్యపాదవనరుహయుగళిన్
దనివారఁ దలఁచి యి ట్లనెఁ
గనులం దానందబాష్పకణములు దొలుకన్. 46

సీ. ఏవంకఁ జూచిన నేణీవిలోచనా
రతికూజితార్భటీరావచయము
లేచాయఁ జూచిన నిందుబింబాననా'
వల్లకీవాదనవైభవంబు
లేఠావు చూచిన నిభరాజగామినీ
[2]సంగీతసాహితీసంభ్రమంబు
లేదిక్కు చూచిన నింద్రనీలాలకా
భరతశాస్త్రోక్తభావాభినయము
తే. గీ. లెందుఁ జూచిన గోపికాబృందగీత
మదనగోపాలసత్కథామహిమ లలర
నంగభవమల్లరంగ మై రంగుమీఱు
బహుతరస్త్రీలతోడ వ్రేపల్లెవాడ. 47

తే. గీ. అందుఁ జెన్నొందునందునిమందిరమున
వాస మై యుండుఁ గౌస్తుభోద్భాసితుండు
దానవవిదారి [3]యిష్టహృత్తాపహారి
భవ్యగుణపాళి మదనగోపాలమౌళి. 48

సీ. కువలయామోదంబు గొనవచ్చుసత్కీరి
నిశికాంతుఁ డగుట సందియము గలదె
కమలాభిరుచిహేతుకం బైనతేజంబు
దిననాథుఁ డగుట సందియము గలదె
దానవారిసమృద్ది దనరించునస్త్రంబు
దేవేంద్రుఁ డగుట సందియము గలదె
హంసాహితశ్రీల నలరారునెమ్మేను
నీలాబ్ద మగుట సందియము గలదె
తే. గీ. యినకరదళోపలాలన గనుపదంబు
లంబుజాతంబు లన సందియంబు గలదె

యని తనుగురించి బుధజను లభినుతింప
ఠీవిఁ దళుకొత్తు శ్రీకృష్ణదేవుఁ డనఁగ 49

సీ. సవరంపుపరువంపు సవరంపురుచి నింపు
నెరసొంపు గలజంపుకురులతోడ
నలువొందునెలలందుఁ గళలెందుఁ [4]దగఁజిందు
తొగవిందుజిగిఁ జెందు మొగముతోడ
నునుదమ్ములను దిమ్ములను నిమ్ములనయమ్ము
గనునొమ్ము సిరిగ్రమ్ముఁకనులతోడ
[5]నొగిఁ బ్రబ్బుబిగిరబ్బు నగుమబ్బు బిగి నుబ్బు
లను ద్రొబ్బుగననబ్బు తనువుతోడఁ
తే. గీ. [6]దనర వ్రేపల్లెలోఁ గలతలిరుఁబోండ్లు
హరికపటచర్యలకు మోహితాత్మ లైరి
యెప్పుడును జేరి మెప్పించు చొప్పుఁ జూచి
మరులుపూనరె సతు లైన మౌను లైన 50

సీ. గురుకుచకుంభము ల్కుధరము ల్గా కున్న
గోపాలకరఘాతిఁ గొనఁగ నేల
కలికివాల్గన్నులు కలువలు గాకున్న
హరి[7]చూపుకాంతిచే నలర నేల
తుల మించుమైదీఁగె యలమించు గాకున్నఁ
గృష్ణాంబుధరముతో నెనయ నేల
శ్రీపాదపద్మము ల్చిగురులు గాకున్న
మాధవుచేఁ జెల్వ మంద నేల



తే. గీ. యనుచు బుధకోటి పొగడఁగాఁ దనరు [8]కోటి
యన్నువులమిన్న నందుని కన్నఁజిన్న
వారిధరవేణి రాధికాకీరవాణి
ప్రబలును జెలంగ హరిప్రాణపద మనంగ. 51

వ. అదియునుం గాక. 52

సీ. నెరికొప్పు మినుకొప్పు నిడుదపెన్నెరులతో
నునుజూపు లీనెడు కనులతోడఁ
గళలు దేఱుచు మీఱు కలికినెమ్మోముతో
విడికెంపు గనుపింపు పెదవితోడ
గెఱగట్టుకొని పుట్టు నెఱపూపచనులతో
గడుసన్నగిలుచున్న కౌనుతోడ
జిగి హెచ్చుచును వచ్చు చికిలిలేఁదొడలతో
జడతలొల్కుచుఁ గుల్కునడలతోడ
తే. గీ. రమణఁ బాల్గాఱు చెక్కుటద్దములతోడ
మేల్మి గనుపట్టు చిన్నారి మేనితోడఁ
దేజరిల్లును బే రిళాదేవి యనఁగ
రాజగోపాలుపట్టంపురాణి యగుచు. 53

ఆ. వె. ఆమెఁ గూడి దానవాళికిఁ గాలుఁడు
గోపసతులకెల్లఁ గుసుమశరుఁడు
జలజజాదిసురల కలపరబ్రహ్మంబు
తల్లిదండ్రులకును దనయుఁ డగుచు. 54

సీ. మోహించి యొకక్రేవ ముగ్గభామామణు
ల్తళుకుఁజూపులఁ గల్వదండ లొసఁగ
మన్నించి యొకచోట మధ్యాణుమధ్యలు
దెలినవ్వులను సుమాంజలులు [9]నెరప



భావించి యొక ప్రక్కఁ బ్రౌఢచంద్రానన
ల్ఘనకుచలికుచము ల్గాన్క లీయ
లాలించి యొకయిక్క లోలలోలాక్షులు
లలి మానధనములు లంచ మంప
తే. గీ. నందఱకు నన్నివగల నానంద మిచ్చి
చల్ల సేయఁగ నింటింటఁ జంద్రుఁ డగుచు
మందలో నుండు మన్మథమన్మథుండు
ప్రాభవస్ఫూర్తి రాజగోపాలమూర్తి. 55

తే. గీ. విడక దాదు లడుగులకు మడుఁగు లొత్తఁ
గను యశోదయు గారామునను జూడ
గరిమ నందుఁడు గన్నులఁ గప్పుకొనగ
రాధ పోషింపఁదగు నిళారాజవదన. 56

సీ. శౌరిని గని రాధ చనుగుత్తు లివిగా కొ
మ్మన లేవె తన కింత యను నిళయును
మురవైరిఁ గని రాధ మోవిపం డిదుగొ కొ
మ్మన లేదె తన కింత యను నిళయును
వరుని గన్గొని రాధ నెరిపింఛ మిదిగొ కొ
మ్మన లేదె తన కింత యను నిళయును
బద్మాక్షుఁ గని రాధ పలుకెంపు లివిగొ కొ
మ్మన లేవె తన కింత యను నిళయును
తే. గీ. హరిని గని రాధ యలయాట లాడుదాము
పడుకటింటికి రమ్మని తొడరి పిల్వ
నాడ నేఁగూడ వచ్చెద నను నిళయును
నవ్వి రాధికామాధవుల్ రవ్వ సేయ. 57

సీ. మురువుగా దాఁగిలిమూఁత లాడెడు వేళ
యదురాయలకుఁ బల్మ రెదురుపడును

రీతిగా గుజగుజరేకు లాడెడువేళ
మదనగోపాలుని గదిసి నిలుచుఁ
గొమురుగా వెన్నెలకుప్ప లాడెడువేళ
మురవైరిచేఁ గను ల్మూయనిచ్చు
గుములుగా గుజ్జెనగూడు లాడెడువేళఁ
గంసవిద్వేషి చెంగట వసించు
తే. గీ. నెట్టు లైనను దేవకిపట్టికరము
గరము తను సోఁకఁగాఁ గనికరముచేత
సుదతి యలనాఁడె సైగఁగాఁ జూచుఁ బ్రోడ
లమ్మ చెల్ల యిదెంతచిత్రాంగి యనఁగ. 58

సీ. పాడించు నొకవేళ బహుదేశ్యరాగము
ల్సాగించు నొకవేళ జంత్రవాద్య
మెటిఁగించు నొకవేళ భరతశాస్త్రప్రౌఢి
బట్టించు నొకవేళ భావరసము
నెగడించు నొకవేళ నెరికావ్యసంగతు
లనుపించు నొకవేళఁ గవనరీతి
బోధించు నొకవేళఁ బూవిల్తుశాస్త్రంబుఁ
జదివించు నొకవేళ శయ్య లోలి
తే. గీ. నూఱి పోయు మఱొకవేళ నారజంబు
వచ్చె ననిపించు నొకవేళ వాద్యవిధము
నెపుడు చూతునో యిదె శౌరి నెనయ ననుచు
దయ నపుడు పొంగి యిళకు రాధాలతాంగి. 59

కం. నలు గలఁదు జలక మార్చును
జలువలు గట్టించు షడ్రసాన్నము లుంచున్
దెలనాకుమడుపు లిచ్చును
గలికీ రమ్మనుచుఁ దీసి కౌఁగిటఁ జేర్చున్. 60

సీ. ఒమ్ముగా దిమ్ము లై రొమ్ము రావలె నంచుఁ
గులదేవతల నెల్లఁ గోరి కొలుచు
నిడుద లై మెఱుఁగెక్కి నెరికురుల్ పెరుఁగంగ
దిన మొకతైలంబు దెచ్చి యంటుఁ
గలికి కన్నెరికంబు దొలఁగఁ జెంచుల కెంతొ
యిచ్చి తీసినమందు లిచ్చు నిచ్చ
[10]నెప్పు డీడేరునో యీముద్దరా లని
యుపవాస మొకవేళ నుండనియదు
తే. గీ. వగలు గైసేసి చెలి యుండు సొగసుఁ జూచి
దృష్టిపై దృష్టి తీసుక తెఱవ నాదు
సవతి వౌదువె యని చెక్కుఁ జఱచి మోము
మోమునఁ గదించి నూఱాఱు ముద్దు లిడును. 61

కం. సతి నిట్లు రాధికామణి
సతతము గసుగందనీక చనువున మనిచెన్
రతిమగనితోఁటలోపల
లతకూనను బెంచినటుల లలితము గాఁగన్. 62

తే. గీ. కొమ్మ కటు యౌవ్వనవసంతఁగుణ మెసంగఁ
దొలుతఁ గనుపట్టుబాల్యజాతులు దొలంగెఁ
గరము చివురులు తొవ రెక్కెఁ గడమతావు
లొఱపు మీఱెను గోకిలస్వరము లొదవె. 68

సీ. అధరబింబంబున కరుదెంచుచిలుకల
పలుకులో యన ముద్దుపలుకు లమరె
ముఖచంద్రమండలంబును గ్రహింపఁగ వచ్చు
పెనురాహువో యన వేణి యమరె
నలు వొందునాభిపున్నాగంబునకుఁ బాఱు
నళులబా రనఁగ నూఁగారు దనరెఁ

బదపద్మయుగళంబు గదిసి పో కున్న రా
యంచ యంచన మందయాన మెసఁగె
తే. మీరుబహునవశ్రీ ల్చెందినారు గనుక
విన్నవించెద నని తళ్కుబెళ్కు లమరఁ
జేరెనో తెల్ప ననఁ గను ల్చెవులఁ జేరె
రమణి కటు చాలయౌవనారంభ వేళ. 64

తే. [11]గుబ్బగుబ్బలులను ద్రొబ్బి నిబ్బరముగ
గుబ్బెతకు [12]గబ్బిసిబ్బెంపుఁగుబ్బ లుబ్బె
సరసయౌవనమానససరసిలోనఁ
బొడము బంగరునునుదమ్మిమొగ్గ లనఁగ. 65

తే. అరయఁ దనజోడుబయలాయెననెడువంత
చిత్తముననాటనానాఁటఁ జిక్కెఁగౌను
మానహానికి సైతురే మహిని దలఁప
బట్ట గట్టినబలుగుణ వంతు లెల్ల. 66

సీ. వెన్నునిముఖచంద్రబింబంబు కళ దేఱఁ
దరుణిలోచనకుముదంబు లలరె
శౌరికిఁ జికురాంధకారము ల్పెరుఁగంగ
ముకురాస్య నఖరతారకలు వెలసె
వనజాక్షువక్షఃకవాటంబు జిగి మీఱ
బిబ్బోకవతిచనుగుబ్బ లుబ్బె
స్వామికి భుజకల్పశాఖలు బలియంగ
నతనాభికిని బాహులతిక లెనసె
తే. హరికి యౌవనవాసంత మతిశయిల్ల
నాతికిని బికకలకంఠనాద మొదవె
భళిర యిటువంటి యీసతీపతులజాతి
రీతు లమ్మయ్య యని రతిప్రియుఁడు వొగడ.

ఆ. చికిలి సానఁ దీర్చు జీవరత్నమురీతిఁ
బరువమైన కుసుమవల్లిపగిది
మెఱుఁగు చేసినట్టి మేల్మిబొమ్మవితాన
రమణి దనరె జవ్వనమున నపుడు. 68

తే. శుభదినంబున సప్తమశుద్ధి గలిగి
చెలఁగువేళను గురుమాపుచీరతోడ
సరసరుచిరాన్నభోజనోత్తరమునందు
నీ డెఱుంగనిచేడియ యీడు మీఱె. 69

సీ. మనయశోదను జీరి మనయిళ పుష్పించె
నని చెప్పి బహుమతు లందరమ్మ
తెలియఁగా రోహిణీదేవిని రప్పించి
యాచిన్నెలో కావొ యరయరమ్మ
చుట్టపక్కాలకు శుభపత్రికలు వ్రాసి
పంప మామకు శ్రుతపఱచరమ్మ
దినశుద్ధి లగ్నంబు గని సాంగ్యములు దెల్ప
వేగ గర్గుని బిలిపించరమ్మ
తే. కలికిలతకూన పుష్పిణిగాఁ జెలంగె
నెవరు గన్నారు మాధవు నెనసె నేమొ
మందు లీవలె సాంబ్రాణి మధురమధువు
మంచిఖర్జూరములను దెప్పించరమ్మ. 70

క. అనువనితల గుసగుసలను
విని కనులను జలము లొలుకఁ బెనుసిగ్గు[13]పడన్
వనజాక్షిని గని రాధిక
చినిచిన్నెలకన్నె నెన్ని చేసెద రనుచున్. 71

సీ. అంటు గల్గినవారి నంటుకో నియమించి
పడఁతిని మగరాలపలక నుంచి

విప్రసువాసినీవితతిచేఁ బాడించి
ననమేనఁ గుంకుమనలుగు లుంచి
చలువగొజ్జఁగినీట జలకంబు లాడించి
తడి యొత్తి కురులార్చి జడ ఘటించి
పస మించు కెంబట్టుపావడ బిగియించి
రంగు చెంగావికోకను [14]గదించి
తే. రవికె దొడిగించి సొమ్ము లలంకరించి
జాజు లెనయించి కల్పముల్ సంఘటించి
యరుఁగుపై నుంచి పాలు పం డ్లలవరించి
క్రోల నిప్పించి చిమ్మిలి గొట్టఁ బంచి. 72

తే. భేరి మొదలగువాద్యము , ల్భోరు[15]కొనఁగ
వరుస నెనయించి చెలికొడిఁబ్రాలుగట్టి
కుంకుమరసంబు కస్తూరి కుసుమములును
బంధుమిత్రాప్తతతి కిచ్చి పంచి రాధ. 73

తే. చాన ని ట్లరపడకింటిలోని కనిచి
మొల్లపూఁబాన్పుపై నత్తమిల్ల నునిచి
దగ్గఱను నింబదళము బెత్తంబు నునిచి
[16]యుగ్మలుల నందు జాగరం బుండఁ బనిచి. 74

తే. మాంత్రికులఁ బిల్చి యిలుచుట్టు మంత్రయంత్ర
తంత్రములఁగూర్చి నల్దెసల్ తప్పిదారి
భూతముల నెందుఁ జొరనీక భూతిఁ జల్లి
కలికిఁ గాపాడెఁ గనురెప్ప గాచినటుల. 75

తే. వేడ్కఁ గావించి మరునాడు పిట్టుఁ బెట్టి
[17]కలశముల నెత్తి సీమసీమలకుఁ దనియఁ
బంచి పంచమదినమునఁ బసపు నూనె
యందఱికిఁ బోసి చెలిని బెండ్లరుఁగు నుంచి. 76



తే. గీ. తరుణు లప్పుడు సంపెంగతైల మంటి
మించుఁబోఁడిని దాన మాడించి రెలమిఁ
దమ్మిగుమ్మితిదొరచేతి తలిరుటాకు
చికిలిబాకును దేజుమాల్ చేసినటుల. 77

సీ. పరిమళంబులు ముట్టి కురు లార్చె నొకభామ
చక్కగా జడ వేసె నొక్కలేమ
కస్తూరితిలకంబు ఘటియించె నొకజంత
బుక్కాము మైఁజిల్కె నొక్కకాంత
కెంబట్టుపావడ గీలించె నొకబోటి
యొగి రైక ముడి వెట్టె నొక్కజోటి
హొంగోక మొలఁగట్టె నొకమదావళయాన
యొదవించె మణిభూష లొక్కచాన
తే. తరుణి యొక్కతె నిల్వుటద్దంబుఁ జూపె
[18]రమణి యొక్కతె మేన గందము నలందెఁ
[19]బడఁతి యొక్కతె యగురుధూ పంబు వైచెఁ
జేడియకు నిట్లు రాధ కైసేయువేళ. 78

తే. తెఱవ యీరీతి నిండుముస్తీబుతోడ
నుల్లసిల్లెను మల్లెపూఁజల్లు లలర
నవ్వగలచివ్వలకుఁ గాలు ద్రవ్వుకొనుచు
మరునిపడివాగెపై గోవ మట్ట మనఁగ. 79

క. అంతటఁ గాంత లిళాసతి
వింతఁగఁ గైసేసి తెచ్చి వెల గలమగరా
సంతనల మంతు కెక్కిన
దంతపుపనిచవికెలోన దయ దనివారన్. 80



తే. మేల్మి పచ్చలగద్దియమీఁద నుంచి
చేరి యనసూయ మొదలగు పేరఁటాండ్రు
మన యిళామాధవులకు శోభన మటంచుఁ
జల్లఁగాఁ బాడి సుంకులు చల్లి రపుడు. 81

సీ. చెక్కుటద్దములపైఁ జెమటబిందువు లూరఁ
గస్తూరితిలకంబు గరఁగి జాఱఁ
గరకంకణంబులు ఘల్లుఘల్లని మ్రోయ
నలువంకఁ జూపు వెన్నెలలు గాయ
స్తసభార మోర్వక తనుమధ్య మసియాడ
నించుమోహంబుతో నీవి నీడ
గబ్బిసిబ్బెపుటుబ్బుగుబ్బచన్గవ పొంగ
బాహుమూలోజ్వలప్రభ లెసంగఁ
తే. గటితలంబునఁ గీల్జడ నటన మాడ
[20]గగనమున కేగునిట్టూర్పు గాడ్పుతోడఁ
దాళగతు లొప్ప సంపెంగతైల మంటెఁ
దమక మెదనాటి హరికి రాధావధూటి. 82

తే. చెలులచే యానుకొని లేచి కలికి యిడిన
పాదుకలు మెట్టి రాజసప్రౌఢి నేగి
మేటిమగరాలముక్కాలిపీటమీద
శౌరి కూర్చుండె మజ్జనసదనమునను. 83

క. లికుచకుచ శౌరి కత్తరి
లికుచరసం బిడియె నఖరరేఖలచే నొ
క్కొకటిగఁ జి క్కెడలింపుచుఁ
బ్రకటితఘననీలకేశపాశంబందున్. 84

క. కుంకుమ నలు గిడె నొకచెలి
పంకజదళనేత్రు మేనభావములోనన్.



డెం కగుననురాగరసం
బింకఁగ వెలిఁ దీసి విభున కిప్పించె ననన్. 85

క. గంధామలకము వెట్టెను
గంధేభసమానయాన గనుకనిఁ గరమున్
గంధతను లంది యియ్యఁగ
గంధవతీధవున కపుడు గరిమ దలిర్పన్. 86

తే. పసిఁడిగిండులచే ముంచి పడఁతు లియ్య
జలక మార్చెను జెలువ గొజ్జంగినీట
రమణునకు రాధ మదనసామ్రాజ్యమునకుఁ
జెలగి పట్టాభిషేకంబుఁ జేసె ననఁగ. 87

సీ. కురు లార్చె నొకలేమ సురటి నొక్కతె వీవ
పరిమళాగురులధూపముల నొసఁగి
సిగ వైచె నొకభామ నిగరాలతాయెతు
ల్గీలించి జంటరుమాలు గట్టి
విరు లుంచె నొకరామ విదళించి పన్నీటఁ
బద నిచ్చి గోవజవ్వాజిఁ జమిరి
పట మిచ్చె నొకచాన యటు విప్పి నలుగంగ
నీక తావులు గట్టి నెగయఁ బట్టి
తే. తిలకవతి యోర్తు కస్తూరితిలక మునిచె
గంధగజయాన యొక్కతె గంధ మలఁదెఁ
దడవుగా నోర్తు రత్నాలతొడవు లిడియె
శౌరికిని జాల సయ్యలంకారవేళ. 88

క. ఎనిమిదిదిక్కులరాజుల
ఘనకీర్తులు వచ్చి యతనిఁ గవిసె ననంగా
నునుముత్తెపుఁ జౌకట్టులు
వినుతాంగి యిడంగ శౌరి వీనుల మెఱసెన్. 89



తే. కళలు పదియాఱు నేఁ గంటి ఘనునిమోము
గనియె నరువదినాలుగుకళ లటంచుఁ
[21]గలఁగి కమలారి హరిపదాక్రాంతుఁ డయ్యె
ననఁగ మగరాల పెండియం బునిచె నొకతె. 90

క. మగువ యిడ హరియురంబునఁ
దగియెన్ జిగిచిలుకతాళి ధర నాతనిబల్
సొగసు గని చిత్తజన్ముఁడు
దెగి పాఱఁగఁ బట్టు వడిన తేజి యనంగన్. 91

క. మగరాలపతక మొక చెలి
దగిలింపఁగ శౌరియెదను దగె నాలోనన్
[22]వగ నీనుతొగలరాయఁడు
సొగ సగుతల్లీలఁ దొంగి చూచె ననంగన్. 92

తే. కూర్మి నిఁక ని ట్లిళాదేవి గోరు లుంచు
ననెడువగ గోళ్ళకుతికంటు నునిచె నొకతె
యందులకు రాధ కెంపుల నందగించు
నిట్టు లనఁ గౌస్తుభము శౌరి కిడియె నొకతె. 93

తే. రమణి గీలించు తారహారము మురారి
యురమున వెలింగె నెదలోన మెఱయుచున్న
తనవరుని బంపి మఱి యిళాతరుణి నెనయు
మనుచుఁ దారక లటువలెఁ గొనె ననంగ. 94

తే. చాన గీలించునీలకంజాతసరము
మెఱసెఁ జిన్నికృష్ణునివిప్పుటురమునందు
మారు లేనితన్మోహనాకారమునకుఁ
జంచలాక్షులు దృష్టి తాఁకించి రనఁగ. 95

తే. పడఁతి గట్టిన కాంచనాంబరము దనరె
నంబుజాక్షుని స్వచ్ఛదేహంబుమీఁద

నతనియెద నిండి తగునా దయారసంబు
పైని దానిట్టులను గానవచ్చె ననఁగ. 96

క. తొగమగనిబావ నిట్టుల
వగగాఁ గైసేసి తెచ్చి పనిహర్వులహో
న్మగరాలచవికెలోపలఁ
దగుపచ్చలపీట నునిచి తరుణులు వేడ్కన్. 97

తే. చని యిళాదేవిఁ గని లగ్న సమయమాయె
రమ్ము మాయమ్మ యని క్రమ్మి కొమ్మ లెల్ల
బలిమిఁ గొని పిల్వ రాధికభయముచేతఁ
దగ్గి దిగ్గున లేచి నున్ సిగ్గు మాని. 98

చ. వలపులచంద్రకావిజిగి, పావడరంగు లెసంగఁ బైఠిణీ
జిలిబిలి చీరకుచ్చెళులు చిందులు ద్రొక్కఁగ జంటిరైకలో
వలిచనుగుబ్బ లుబ్బఁగను బంగరుటందెలు ఘల్లుఘల్లనన్
జలజదళాక్షి వచ్చె రభసంబున నయ్యదురాజునొద్దకున్. 99

తే. అపుడు సుముహూర్త మనుచు గర్గాదిమునులు
శోభనముఁ జేసి రానిత్యశోభనులకు
వాద్యములు మ్రోయ నిఖలదిక్పతులు పొగడ
నాప్తబంధుసుహృత్కోటి తృప్తిఁ బొంద. 100

క. అవ్వేళను హరియు నిళా
యౌవ్వతరత్నంబు బాంధవావలితోడన్
బువ్వము దిని రారుచులకు
నువ్వి ళ్ళూరుచును మెప్పు లొసఁగుచు నంతన్. 101

క. నందుం డందఱఁ బరమా
నందంబును నొందఁ జేసె నయ్యైమర్యా
దం దగుసూనృతభాషా
సందోహముచేఁ బటాదిసత్కారములన్. 102

తే. అంత సంతోషసంభరితాంతరంగుఁ
డగుచుఁ దాంబూలఫలదాన మాచరించి
యతివయును దాను క్షీరాన్న మారగించి
యువతి యిడురత్నపాదుకాయుగళి తొడిగి. 103

చ. చలువ లెసంగుచప్పరపు జంత్రపుబొమ్మలు పావురంబులున్
గిలకలమంచము న్విరులు నించిన సెజ్జయుఁ గీచుబుఱ్ఱయున్
దలగడదిండ్లు దోమతెర తళ్కనుడోలిక నిల్వుటద్దముల్
గలపడకింటి కేగి యటఁ గంజవిలోచనుఁ డుండె నత్తఱిన్. 104

సీ. వలిపెచెంగావిపావడకొసల్ బిగియించి
కుంకుమపువ్వంచు కోక గట్టి
కలపంబు నెమ్మేనఁ గలయంగ మేదించి
హవణిల్లుముత్యాలరవికె దొడిగి
గేదంగిరేకుల గీల్ జడ ఘటియించి
చంద్రసూర్యాదిభూషణము లుంచి
పొలుపుసంచపురేకుబుక్కాము మైఁ జల్లి
కస్తూరితిలకంబు సిస్తుపఱచి
తే. గోవజవ్వాజి మెడను గీల్కొల్పి జఘన
మునకు నగురుసాంబ్రాణిక్రొంబొగలు పట్టి
కనులఁ గాటుకరేకలు కదియఁ దీర్చి
రాధికామణి యిళకు నలంకరించి. 105

క. నిద్దపుటద్దముఁ జూపిన
ముద్దియ తగె నబ్ధిమధ్యమున బింబిత మై
ముద్దులు గులికెడుకలుముల
ముద్దులగుమ్మయన భువనమోహిని యగుచున్. 106

సీ. ఎటు తాళ నున్నదో యీకొమ్మ కెమ్మోవి
కైటభారాతిపల్గాటులకును



ఎటు లోర్వ నున్నవో యీకన్నె చన్నులు
గోపసింహుని గోటి గుమ్ములకును
ఎటు లాన నున్నవో యీతన్వి లేఁదొడల్
చాణూరహరుమారుసాదనలకు
ఎటు లాగ నున్నదో యీనాతి నునుమేను
దంతిమర్దనుకౌఁగిలింతలకును
తే. నంచుఁ దను గేలి యొనరించు మించుఁబోండ్లఁ
గాంచి తలవంచి సిగ్గుచేఁ గలఁకఁబాఱు
వారిజానన వీనులవద్దఁ జేరి
బుద్ధిగా నిట్టు లను రాధ బుజ్జగించి, 107

సీ. చెలువుండు కౌఁగిటఁ జేర్చినయపు డీవు
గుబ్బల మెలమెల్లఁ గ్రుమ్మవమ్మ
విభుఁడు చెక్కిలి ముద్దు పెట్టినయపు డీవు
నలరుమో వొక్కింత యానవమ్మ
సామి పైకొని రతి సల్పినయపు డీవు
నించుక యెదురొత్తు లియ్యవమ్మ
ప్రాణేశుఁ డలకేళి బడలినయపు డీవు
పురుషాయితము వేగఁ బూనవమ్మ
తే. అతఁడు నవరసరసికశిఖావతంసుఁ
డధికసుకుమారమూర్తి వీ వతని నెటుల
వలచి వలపించుకొనియదో పలికినాను
నాన గొనఁబోకు నామీఁది యాన నీకు. 108

క. అని మనసిజుగమనమ్ములు
విను మని యుపదేశ మిచ్చి వే లె మ్మిదిగో
యెనసెను శుభలగ్నము ప్రియు
నెనయఁగ వలె వేళ తప్పనియ్యక యనుచున్. 109

క. మరుగంధసింధురంబును
గరముం గదలించి తెచ్చుకరణిని దెఱవన్
వరుకడకు బలిమిజులుములు
మెఱయఁగఁ గొని తెచ్చి పలికె మెల్లన హరితోన్. 110

సీ. పదపద్మముల నొప్పు బంగారు గొలుసులు
మేలు గుల్కెడునిగళాలు గాఁగఁ
గటితటి నటియించు గంటలమొలనూలు
పాలాదిగంటలచాలు గాఁగ
నల్లచీమలబారు నా మూరునూఁగారు
మేర మీఱినమదధార గాఁగ
గబ్బిసిబ్బెపుటుబ్బు గుబ్బగుబ్బలు లెంతొ
మంతుగన్ వింతకుమ్భములు గాఁగ
తే. గందవడిలోనదుమ్మాడి మందగతుల
వచ్చె నెరితావి కళులచాల్వల గొనంగఁ
జిన్నిమరుదంతి ని న్నొకసన్నఁ జూడ
సరస నెక్కెడు మీఁదిపైసరము లేగ. 111

సీ. ఈగోటిమీటుల కీకుచగిరులట్ల
పొంగి తాళవు దీని మొగ్గచన్ను
లీపంటిగంటుల కీమోవిపగడంబు
వగను దాళదు దీని చిగురుఁబెదవి
ఈమారుసాధన కీయూరుకాండంబు
లటుల తాళవు దీన్నియనఁటితొడలు
ఈకౌఁగిలింతల , కీతనుకనకంబు
వలెను దాళదు దీనికి మొలకమేను
తే. నీకు సరి యగునటు లెల్ల నేను గాను
పొల మెఱుంగని దిది వట్టి ముగ్ధ గాని



తెలిసి యెటు లేలెదో నీకుఁ దెలుపవలెనె
దేవ దక్షిణనాయకాధిపుఁడ వీవు. 112

సీ. కొననాల్కఁ గొని మోవి చెనకి చూతువు గాని
యదరంటఁగా నొక్కి యానఁబోకు
ముద్దుచెక్కులఁ జిన్నిముద్దు లుంతువు గాని
జగిగోటికత్తులఁ జీరఁబోకు
మొనవేళ్ళఁ జనుమొనల్ పుడుకు దింతియ కాని
వగవగ బిగిపట్టు పట్టఁబోకు
రతి కేళి మెల్లమెల్లన సల్పుదువు గాని
దురుసుపైసరములు నెరపఁబోకు
తే. వెఱ్ఱినై తెల్పెదను గాని వెలఁది నీవు
వలపులను మించి గడిదేరి వద్దఁ జేరి
మారుసాములఁ జలపోరి పోరువేళ
నాదుగురికట్లు నిలుచునా నలిననయన. 113

తే. అంచు హరిచేతి కిళ నొప్పగించి రాధ
వత్తు నేఁ గూడ నని చెలి పైఁటఁ బట్ట
వేగ వచ్చెద నని విడిపించుకొనుచుఁ
జనియె మది ఖేదమోదముల్ పెనగొనంగ. 114

వ. ఇట్లమ్మందయాన యమందయానంబునఁ బడుకయిలు వెల్వడి రత్నముద్రికాలంకృతం బైనకేంగేల నొక్కబాలికామణిం జెయ్యానుకొని యవ్వాసుదేవు నెడఁబాసిపోవంజాలనిచిత్తంబుతోన తత్తరపడి యమ్మత్తకాశినులం గని తలు పోర సేయుండను నెపమున తిరిగి తిరిగి చూచుచు రాజసం బవలంబించి యెవ్వరితోడం బలుకక డగ్గుత్తియ నడంపుచుఁ గేళి పూగుత్తు లాఘ్రాణించుపోలిక బెట్టునిట్టూర్పులు నిగుడింపుచుఁ జెందొగలవిందుఁ గనుచందంబున వదనారవిందం బెత్తి కందోయిం గ్రందుకొను బాష్పబిందుబృందంబులఁ జిప్పిలనీక రెప్పల నార్చుచు హరివిరహభరంబునం దాఁకి జారినకరకంకణంబులం గని చేయెత్తి కప్పుకొప్పు దిద్దుకొనుచొప్పునఁ గప్పుచుఁ గుచలికుచంబులం దగదగ మని తగులుకొనుచిగురువిలుగలతులువసెగలఁ దగిలి చిటిలి పెటిలి పడుతారహారంబులం బయలుపడనీక పయ్యెద చెఱంగున మఱుంగు సేయుచు నిజమందిరంబుఁ బ్రవేశించి యం దొక్క చొకాటంపుసులుపుపట్టుమేలుకట్టులం గనుపట్టుకట్టాణిముత్తియంపుజల్లులతో నల్లిబిల్లిగా నల్లుకొనుబొండుమల్లియలపూదండలం దగిలి రొదలు సేయు తుమ్మెదలగరులనిగనిగలకుం బదు లనఁగఁ దగిలి మగరాలసోరనగండ్లనుండి వెలికి నిగుడునగురుసాంబ్రాణిపొగల మగుడం ద్రోయుచుఁ దెరగంటిమచ్చకంటులనెరినెరుల వరలువిరులచేరులనెత్తావుల నత్తమిల్లి మత్తిల్లి వచ్చుకమ్మతెమ్మెరలనగ మిగులుమగరాలసౌధంబున నెంతయు వింతవింతపనిసంతనల మంతు కెక్కుజీవదంతపుఁజప్పరకోళ్ళమంచంబుపై రవిబింబంబుడంబు విడంబించుకెంబట్టుపరుపున రాజినశిఖారేఖల సెకమీఱుసూరెపుటంబుతలగడఁ జేరి యొక్కపల్లవపాణి పదపద్మంబులు పట్టుచుండఁ బవ్వళించి యాత్మగతంబున.

ఆ. సొమ్ము లియ్య వచ్చు సొ మ్మంద మియ వచ్చు
నియ్యరాని ప్రాణ మియ్య వచ్చుఁ
దనదువిభుని వేరుతరుణి చేతికి నిచ్చి
తాళ వశమె యెట్టి దానికైన. 116

సీ. నాతి యింతకు మున్నె నాసామి మధురాధ
రామృతమ్మును జూఱలాడ కున్నె
యతివ యింతకు మున్నె హరివిప్పుటురముపై
గుబ్బలకసి దీఱఁ గ్రుమ్మ కున్నె
రమణి యింతకు మున్నె రమణుకౌఁగిటఁ జేరి
పారావతధ్వనుల్ పలుక కున్నె
చాన యింతకు మున్నె శౌరి పైకొన వెను
దియ్యక యెదురొత్తు లియ్య కున్నె
తే. మున్నె యది జాణ సిగ్గుచే నున్నఁ గాని
విభుఁడు వగఁ జేసి తనువ్రీడ వీడఁ జేసి



చేరగాఁ దీసి యందందుఁ జేయి వేసి
కొమ్మ నిటమున్నె తా దిద్దుకొనక యున్నె. 117

క. అని చింతింపుచు నచ్చటఁ
గనువిలుతునిబారి కలికి • కను మూయక లో
వనరుచు నుండెను రాధిక
వనరుహదళనయనుఁ డచట వనితామణితోన్. 118

క. చెలియా వింటినె రాధా
జలజేక్షణమాట లెల్లఁ జక్కఁగ ననినన్
గలకంఠీమణి సిగ్గునఁ
దల వంచుకొనంగఁ జూచి , దయ దైవారన్. 119

సీ. చిన్ననాఁటనె చెల్మిఁ జేసితి మెడ లేక
మన కేటిసిగ్గులే మధురవాణి
నేఁ బల్కఁగా లేదె నినుఁ జూచి ననుఁజూచి
యీవేళ మాటాడ విందువదన
కూడి యిన్నా ళ్ళాట లాడమో యెటుపోయె
దాయాట లీయాట లంబుజాక్షి
పోనిపోనీ నేను బొరుగూరివాఁడనా
నీకు మేనరికంబు నీలవేణి
తే. యళుకు లేటికె ననుఁ జూచి కులుకులాడి
మోముఁ జూడవె మో మెత్తి మోహనాంగి
ముద్దుగా ముద్దు లియ్యవె ముద్దుగుమ్మ
మాటు కేగకె నాయాన మందయాన. 120

క. మనరాధ దెలిపె నేటికి
ననువుగ నాల్మగనియాట లాడక యున్నన్
మనసిజభూతము వెఱపుం
గనిపించు నటంచు వేగఁ గదియుద మబలా. 121



క. చన దిటు లూరక యుండఁగఁ
గనువినుదయ్యంబు గదుమఁగా వచ్చినయా
వెనుక నెటు దాగువారము
మనసిగ్గులు దాని నెదిరి మార్కొన వనుచున్. 122

చ. గమగమతావులం గులుకు కప్పురబాగము లిచ్చి వేడ్కతో
సమముగఁ గ్రొత్తముత్తియపు సన్నపుసున్నముఁ బెట్టి చొక్కపుం
దమలపుటాకుఁ జుట్టి వనితామణి చేతి కొసంగఁ బోవుచోఁ
గొమిరె నయంబుతోఁ గొనిన గోపకులాభరణుండు ప్రేమతోన్. 123

సీ. ఉసికొల్పి వంచించి దుసుకులచనుదోయి
చేనంట సమ్మ నొచ్చీనె యనును
మొనసి యేమరఁ జేసి మో వాన గమకింప
వడి నుల్కి కరపల్లవములఁ గప్పు
నల్లందులకుఁ జొచ్చి యటు నీవి వదలింప
మిట్టిమీనై [23]బెట్టు కొట్టుకాడు
విభుఁ డందుఁ జెనకి తా , వికవిక నవ్వుచో
నటు గిరుక్కున మళ్ళి యలుక నించు
తే. తను గురించినఁ గని తనకనులు మూయుఁ
గవకవల్ నించుచో వేళ్ళు చెవులఁ జొనుపు
కొను నిళామానినియు ముగ్ధతనముఁ బూని
రాజగోపాలసంగమారంభవేళ. 124

వ. అంత. 125

ఉ. ముద్దులబెట్టు కొంత జిగిమోముగదింపుల వింత మోహపున్
సుద్దులచే రవంత తెలిచూపుల నంత విరాళిచేతలం
బద్దుల సుంత పావురపుపల్కులు పల్కి కలంతసిగ్గు పో
దిద్దు మురారి నారి నటు తెప్పునఁ బైకొని మోవి యానుచున్. 126



మ. అలరు ల్వాడ రుమాల వీడ నెదపై హారాళు లల్లాడఁ ద
ళ్కులచౌక ట్లసియాడఁ బావురపుఁబల్కుల్ పల్కుచున్ గుల్కుచున్
బలు జోకొట్టుచు మబ్బుదట్టుచును బైపై నిక్కుచున్ సొక్కుచున్
గళ లెల్ల న్గరఁగించి [24]యేలె సొగయం గంజాస్త్రుకయ్యంబునన్. 127

చ. గొనకొనుసిగ్గు మోహమును గూడఁగ నొక్కటి కొక్క టెక్కుడై
పెనఁగొను కేలు మోముపయిఁ బెట్టుక మెల్లన వ్రేళ్ళసందులన్
గనుఁగవ రెప్ప లార్పక యెఁగాదిగఁ గన్గొనె శౌరివక్త్రమున్
మనసిజకేళినైపుణిని మానక మానిని యప్పు డెంతయున్. 128

చ. ఉలుకును గొట్టుకాడు నగు నూర్పు లడంపుచు నూర కుండు లోఁ
గలఁగును బల్కఁబోవుఁ దట కాపడుఁ గన్గొనుఁ గన్మొగుడ్చు మైఁ
బులకలు దార్చు గ్రుక్కు లిడు బొమ్మెల మై మరచున్ సుఖోన్నతిం
దలకొని పారవశ్యమునఁ దామరసాక్షి య దేమి చెప్పుదున్. 129

సీ. మో మొకించుక యెత్తి మోవి యానఁగ నొత్తి
యది యిది చాలించి యట్టె యుండుఁ
గౌఁగిలింపఁగఁ జూచి కరపద్మములఁ జాచి
యందు కిందుకుఁ బోక యట్టె యుండుఁ
జనులఁ గ్రుమ్మఁగఁ గోరి సరస మెల్లనఁ జేరి
యవల కీవల కేగ కట్టె యుండుఁ
బౌరుషరతి కెచ్చి పైకొన గమకించి
యటు నిటులను జేయ కట్టె యుండు
తే. ముద్దు లిడ వచ్చి యందందుఁ బ్రొద్దు పుచ్చు
బలుకఁగా మీఱు నెలు గెత్తి • కలఁకఁబాఱు
విడె మొసఁగఁ బోవు సగమాకు మడిచి మానుఁ
దీరి తీరనిసిగ్గునఁ దెఱవ యపుడు. 130

వ. ఇట్ల నేకవిధంబుల నిళామాధవులు భంగరానంగసంగరక్రీడాపరవశు లై యున్నయెడ. 131



చ. భువిఁ బథికాళి యాత్రలకుఁ బోవఁగ నైష్ఠికవిప్రసంఘముల్
జవమున లేచి తానములు సల్ప రతాంతరసుప్తదంపతుల్
గవిసి రమింప వేళ యిది గాదె యటంచుఁ ద్రిభంగుల న్నెరా
హవణికె నుగ్గడించెఁ జరణాయుధబోధకయూధ ముద్ధతిన్. 132

ఉ. అంతట దిగ్గునఁ బరుపు నంటక లేచి పయంట దిద్దుచున్
వంతను గొంత దాచి బలవంతపుహాయి రవంత పూని చె
ల్మింతులు చెంతలం బిలువ కేగిన దేమొ యటంచు నల్క రాఁ
గంతునితండ్రిని న్గదియఁగాఁ జని రాధిక తల్పు తట్టినన్. 133

తే. [25]చేరి యందాఁక వారు చౌశీతిబంధ
[26]గతులఁ బెనఁగి చాలక పునా రతులఁ గలసి
బడలికలు దీఱ నొక్కింత పవ్వళించి
మదవతీకృష్ణు లప్పుడు నిదుర లేచి. 134

సీ. మిసిమి చెక్కు-లఁ దమ్మరసము నాథుఁడు పెంపఁ
బికవాణిమోవి కాటుకను బెంపఁ
జెదరిన ముంగురుల్ శ్రీనివాసుఁడు దిద్దఁ
గాంత జారినతిలకంబు దిద్ద
నలగోరువంకల నతఁడు కుంకుమ నించ
గలికి పల్లంటికిఁ గఫుర ముంచఁ
గప్పు పెన్నెరికొప్పు కాంతుఁ డల్లనఁ బాపఁ
జెలియ హారావళుల్ చిక్కుఁ బాపఁ
తే. జుట్టి సగమాకు నోటికి సుదతి యొసఁగ
మరలిమురవైరి కొఱికిన మడుపులొసఁగ
నట్టియెడ రాధకరకంకణాళి ఘల్లు
రనఁగ వినె నుల్లములు ఝల్లుమనఁగ నులికి. 186

తే. గీ. కలికి వే లేచి గడె దీసి తలుపు దెఱవ
శౌరి రమ్మన రాధిక చేరఁ బోవు
నంతకును మున్నె హరిచెవిచెంతఁ జేరి
చెలువు చిలుకఁగ ననె నాతి చేతిచిలుక. 136

సీ. నాతికీల్గొప్పున నల్లకల్వలు గావు
విరవాదిశరము లో సరసిజాక్ష
నెలఁతనాసికయందు నీలంపుమణి గాదు
ముక్కరముత్యంబు మురవిఫాల
వనిత పాలిండ్లపై వలచుకస్తురి గాదు
మలయజపంకంబు మదనజనక
తరుణినెమ్మేనఁ గదంబపుప్పొడి గాదు
వెలిదమ్మిపుప్పొడి విమలచరిత
తే. మరునిశరవహ్ని దరికొని మదిని బొదలి
వెలికి విసరంగ దాని లోపల నడంచి
యిదిగొ వచ్చెను బరితాప మడఁప ఘనుఁడ
వీ వటంచును రాధ యిదెంతధీర. 137

చ. జలరుహపత్రనేత్ర విను చందనగంధివిరాళి యెంతొ మై
నిలఁ గలసొమ్ము లంగజుని యింగలమందుఁ గరంగి పూదె లై
మిలమిల డొల్లి రాఁ జెలులు మిణ్గురుబూచు లటంచుఁ బట్టి చే
తులు సెగ లంటి పొక్క వెతతో విదలింతురు మిట్టమీను లై. 138

తే. లేమకును నీవు పొత్తున లేనియట్టి
వాసరము లెల్ల శ్రీహరి వాసరములు
మానినికి నీవు ప్రక్కను లేనియట్టి
రాతి రెల్లను మఱి శివరాత్రి యరయ. 139

క. కన లేదో విన లేదో
కనులార న్వీనులారఁ గాంతులు కాంతల్



ఘనవిరహాగ్నిని స్రుక్కగఁ
గన విన లే దిట్టివలపు కంజదళాక్షా. 140

క. అనిపలుకు చిలుకపలుకులు
విను వనజదళాక్షుఁ జేరి • వేడ్కను రాధా
ఘనవేణి యిళను జూపుచుఁ
దనదగు ప్రేమాతిశయము దనరఁగ నగుచున్. 141

సీ. చిగురాకుజిగి నూకు చెలియ కెమ్మోవికా
గజిబిజిమొనపంటిగంటు లెల్ల
ననచెండులను జెండు నాతి లేఁజనులకా
కఱకుగోటిపిరంగినఱుకు లెల్ల
నునునాచులను నేచు, వనిత పెన్నెరులకా
కక్కసం బగుపెక్కుచిక్కు లెల్ల
మరువంపుగురి దింపు మగువ నెమ్మేనికా
విడువని మరుసాము బడలి కెల్ల
తే. నకట మగలకుఁ దమయక్కరైనఁజాలు
నబలలా గెంచి లాలించ రనుచు నిళకు
వగచుగతి రాధ తనలోని వంతఁ దెలియఁ
జేసె శౌరికి నన్యాపదేశముగను. 142

చ. అది విని శౌరి రాధకర మల్లనఁ బట్టి బిరాన చేసరాల్
గుదురుగఁ గంకణంబులును గూడఁగ ఘల్లుమటంచు మ్రోయఁగాఁ
గదియఁగఁ దీసిన న్గలికి కాంతుని పేరెద వ్రాలె నంతలో
గుదిగొను సిగ్గుచే నిళయు గొబ్బునఁ జాటున కేగె నవ్వుచున్. 148

తే. మాయురే బొబ్బ హాయిరే మజ్ఝ భళిరె
కలిసి విరిశయ్య మత్తేభములవితాన
నీడు లే దని వలపులఱేఁడు పొగడ
నపుడు వారిర్వు రాకయ్య మందుకొనిరి. 144



వ. ఇట్లు విడిఁబడి. 145

సీ. కొసరుపల్కులఁ గ్రమ్మిఁ గోటికత్తులఁ జిమ్మి
కాసెలోఁ జెయి వేసి కదియఁదీసి
కన్నాత లాలించి కౌఁగిటఁ గదియించి
సరిబిత్త లల నెత్తి చనులనొత్తి
యల్లందులకుఁ జొచ్చి కల్లమ్ములకు వచ్చి
మెఱుఁగుచెక్కిలి గొట్టి కురులు పట్టి
తొడకంబముల నాని తోపునూకుల నూని
సందుచేసుక నొక్కి ముందు కెక్కి
తే. యదలుపులు [27]కీలుగొట్లు నెయ్యంపుతిట్లు
గళరవంబులు దుడుకులు చెలఁగ రాధ
మాధవుండును గడి దేరి మారుసాము
హాయిగాఁ జేసి సరి గెల్పు లంది రపుడు. 196

వ. అంత రాధాకృష్ణులు పరస్పరము సంభాషించి రది యెట్లనిన. 147

సీ. మగడ యాపని దీఱె మఱియొక యాటాడి
నాకును గట్టిగా న్యాయ మొసఁగి
పొలఁతి నీ పెందొడపుణ్యంబు నా కందె
లేఁతచిన్నది వట్టిరోఁత నాకు
నీకు దానికి నింత నేస్త మాయెను గృష్ణ
పొంతగా నినుఁ గూడి యింత బాగ
చెలియ నిమ్మళముగఁ జేసితివో లేక
యది చేసెనో నన్ను నడుగ వలదు
తే. బాగు బా గన గట్టిగాఁ బని యొసంగ
నియ్యరా కృష్ణ నాకును నిమ్ముగాను
ఠీవి వయసున గుణమున నీవె పెద్ద
రయము రయమునఁ గావింపు రతిని రాధ. 148

సీ. అధరామృతంబు నీ వానితివో కృష్ణ
యది లేఁజిగురువగ రంతె రాధ
కఠినస్తనము లెదఁ గలఁచితివో కృష్ణ
యవి లేతలికుచంబు లంతె రాధ
లలితోరు లూరుల మెలఁచితివో కృష్ణ
యవియనంటులత్వక్కు లంతె రాధ
లీలాంగములు కౌఁగిలించితివో కృష్ణ
యవి ననలతకూన లంతె రాధ
తే. చతురసమరతిసుఖ మొనర్చితివొ కృష్ణ
నవసమాగమమున సౌఖ్య మవునె రాధ
యుపరతుల నిన్నుఁ గూడెనేమోయి కృష్ణ
యాచమత్కృతి ముగ్ధ కెట్లబ్బు రాధ. 149

వ. ఆసమయమునందు. 150

సీ. కాలివాల్ పిట్టల కలకలంబులు మీఱెఁ
బగడకన్గల యొజ్జ బయలుదేఱె
నెలరాజు పశ్చిమాచలరాజముం జేరె
బలుచంద్రకాంతపుశిలలు పేరెఁ
దారకాగణముల తళుకు లెల్లెడ జాఱె
దీపంబు లెల్లను తెల్లఁబాఱె
నతనుఁడు రే యెల్ల ననిఁ జేసి వేసారె
ధర వియోగులపరితాప మాఱెఁ
తే. దమ్ము లలరారెఁ గలువల తావు దీఱెఁ
గోకములు తేఱెను జకోరకులము తారె
నినుడు గడిదేఱె నిరులు మొయిండ్లఁ దూఱెఁ
దెలివి చేకూఱె భల్లునఁ దెల్లవాఱె. 151

మ. యమునాతీరవిహార హారసదృశోద్యత్కీర్తిసంభార భా
రమణీయాకృతిమార మారసికతాప్రావీణ్యసంసార సా
రమరందోక్తివిచార చారణనుతప్రఖ్యాతవిస్తార తా
రమహీభృత్సమధీర ధీరమునివాళారాధార రాధారతా. 152

క. ధీరాభిమతోద్దారా
ధారావర కృత్తమత్త దానవవారా
వారాశినిభగభీరా
భీరాహిత్యామరాద్రివిశ్రుత ధీరా. 153

మాలిని. కలికలుషవిఫాలా కాంచనోద్భాసిచేలా
గళధృతవనమాలా కాంతరాధావిలోలా
బలభదుపలనీలా పాండవత్రాణశీలా
తిలకితగుణజాలా దేవకీదేవిబాలా. 154

గద్యము. ఇది శ్రీచిన్నికృష్ణకరుణాకటాక్షవీక్షణక్షణప్రవర్ధమానానూన
శృంగారరసప్రధాన సంగీత సాహిత్యభరతశాస్త్రాదివిద్యాపారంగత
శ్రీమత్తిరుమలతాతయాచార్య పాదారవిందమిళిందాయ
మానమానసచోళసింహాసనాధ్యక్షప్రతాపసింహ
మహారాజ బహూకృతానేకచామీకరాం
బరాభరణ ముత్యాలుగర్భశుక్తిముక్తా
యమాన ముద్దుపళని ప్రణీతంబైన
రాధికాసాంత్వనం బనుశృంగార
ప్రబంధంబునందుఁ బ్రథమా
శ్వాసము.

  1. విన్నపం బొక్కటి హరికథ (మూలము)
  2. సంగీతసాహిత్య [మూ.]
  3. దుష్టచిత్తాపహారి [మూ.]
  4. వగఁజెందు [మూ.]
  5. కలి మెప్పుడును గప్పు చెలి మెప్పుఁ గొను చొప్పు కర మొప్పు నెఱివిప్పుటురముతోడ [మూ.]
  6. మారుమా రని మారు ముమ్మారు మారి, మారు లేకయె మీఱు మైతీరుతోడఁ, దేజరిల్లెడు గోపాలదేవుఁ జూచి, మరులు పూనరె సతు లైన మౌను లైన [మూ.]
  7. చూచు కాంక్షచే [మూ.]
  8. బోటులందుఁ దలమిన్న [మూ.]
  9. ముడువ [మూ.]
  10. నెపు డీడు మీఱునో [మూ.]
  11. గబ్బిగుబ్బ [మూ.]
  12. బాలగను గబ్బి [మూ.]
  13. గొనన్ [మూ.]
  14. ధరించి [మూ.]
  15. కలగ [మూ.]
  16. ముద్దియల [మూ.]
  17. బండ్లపైఁ బెట్టి సీమసీమలును దనియ [మూ.]
  18. సకియ యొక్కతె యరవిరిసరులు దునిమె [మూ.]
  19. ముదిత యొక్కతె మేలిమిముసు గొసంగె [మూ.]
  20. ఘనతరం బైన [మూ.]
  21. యళికి [మూ.]
  22. దగ నీతోఁ గలిసెద నని [మూ]
  23. యట్టె [మూ.]
  24. యేలుకొనియెం [మూ.]
  25. చేరి యందాఁకఁ బెనఁగు చౌశీతిబంధ [మూ ]
  26. రతులుచాలక మతి పునారతులఁగలసి [మూ.]
  27. పొగడికలు [మూ.]