రాధికాసాంత్వనము (ముద్దుపళని)/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీరస్తు

(ఇళాదేవీయ మనునామాంతరముగల)

రాధికాసాంత్వనము

తృతీయాశ్వాసము

శ్రీమహిళాప్రియనాయక
సామజరాజాపవర్గసంధాయక భ
క్తామితకామితదాయక
భూమీప్రియ చిన్నికృష్ణ పోషితకృష్ణా. 1

తే. అవధరింపుము దేవ దివ్యానుభావ
వ్యాసమునిసూతి జనకభూవిభుని జూచి
చొక్కటపుజీనిచక్కెరయుక్కెరలకు
లెక్క యై మించునుడిచవు లెక్కఁ బలికె. 2

చ. అపుడు చెలంగి పొంగి యిళ హామికతో విడివడ్డరైకతో
గపురపుతావివీడియము ఘమ్మని క్రమ్ముముఖాంబుజంబుతో
గపురపుటారజంబు గమకంబు నయంబు భయంబుఁ జూపుచున్
విపులతరస్తనాగ్రముల వెన్నునిఱొమ్మునఁ గ్రుమ్మి నెమ్మితోన్. 3

చ. పరవశుఁ డైనశౌరిఁ గని పంకజలోచన రాధికామణిం
దొరఁగు మటంచు వేఁడుకొనెఁ ద్రోయక మాధవుఁ డిచ్చె నమ్మికల్
పురుషుల కేటి సత్యములు పూనికె లేడవి నమ్మికేది నీ
మరు లిటు కొండ లై పెరుగుమాత్రమె కాని కురంగలోచనా. 4

వ. అనిన విని ఘనాఘననిస్వనంబువిన్న చిన్నిరాయంచచందంబున గబ్బిబెబ్బులిమ్రోఁతలాకర్ణించిన కన్నెసారంగంబుతెఱంగున బిడాలఘోషంబాలకించిన బాలశుకంబురకంబున సింహనాదం బాలకించి బెగడిన పెంటియేనుంగుతెఱంగున బెగ్గడిల్లి యాపాదమస్తకంబునుం జల్లు మని పులకలు మొలకలెత్త గుండె గభీలనన్ వకావకలై తల్లడిల్ల డిల్లవడి యారామకారునిచే ఖండితం బయినకదళికాకాండంబుచందంబున నందనందనునిపైఁ జెందినవలపు నిలుపోపం జాలక చాల కరంగి జాలిమాలి నేలవ్రాలి మూర్ఛిల్లిన న్గనుంగొని చెంగట మెలంగుమెఱుంగుబోణు లెలుంగుదిగులున నమ్మకచెల్ల యీహల్లకపాణి నింక నమ్మగఁ జెల్లదను నుల్లసంబున నుల్లసిల్లుచు నవ్వల్లవపల్లవాధర నెత్తి యొత్తుపయ్యెదచెఱంగుల స్వేదబిందుసందోహంబులం బో నొత్తి చల్లనిపటీరనీరపూరంబు చల్లి నల్లకల్వరేకులు తుదల నల్లిబిల్లిగాఁ గనుపట్టువట్టివేళ్ళవీవనలు విసరి కెందమ్మిదళంబులం గట్టినకపురంపుపొట్లమ్ములం గర్ణంబులం గీలించి శైత్యోపచారంబుల సేద దేర్చఁ బెద్దయుం బ్రొద్దునకు ముకుళితంబు లగుకనుదమ్ములు విచ్చి పదాహతిఁ బొరలునురగాంగనభంగి బుసగొట్టుచుఁ గటితటంబు లుబుక ముక్కుపుటము లదర రాకానిశాకరబింబంబుడంబును విడంబించునెమ్మొగంబు జేవురింపఁ బ్రచండమారుతతండంబునం దవిలి వడంకు కెందలిరాకువీఁక బింబాధరంబు కంపింప మరుఁ డురువడి నొర వెరికి విరహులయురంబులు దూసిపోవం గ్రుమ్మి తదీయరక్తంబు లంటఁదీసి ధళధళఝళిపించుతళుకుకత్తుల జిత్తులం బెట్టుచుఁ గ్రొత్తలత్తుక చొత్తిల్ల మత్తిల్లుబిత్తరపుఁజూపులు కడకన్నులం గ్రుమ్మరింప డగ్గరి హెగ్గడికత్తియలు బెగ్గడిల్లి యవల నివలఁ దొలంగి నిలువ సాకారం బగుశోకంబురీతి సాక్షాత్కరించినకోపంబుభాతి సశరీరం బగుబడలిక కైవడిం గనుపట్టుచుఁ గలికిచిలుకం దిలకించి [1]క్రోధమూర్ఛితయై కొంతతడ వూరకుండి వెండియుఁ దెలివి దెచ్చుకొని బెట్టునిట్టూర్పులు నిగుడించి గద్గదన్వరంబున ని ట్లనియె. 5

శా. ఏమేమీ వెర పింత లేకయె యిళాహేమాంగి యి ట్లాడెనే
యామాట ల్విని మంచి దం చనియెనే యాధూర్తగోపాలుఁడుఁన్
రామా యట్లనె కాని మంచిపని [2]రారాపేల యేమాయె నా
భామారత్నము గూడి తా సుఖము మై వర్ధిల్లినం జాలదే. 6

సీ. మఱచెనో నాచేతి మణితంబు లన్నియుఁ
బలుకనేర్చిననాఁటి పంజరింపు
తెలియదో నా చేతి దేశ్యంపుగుజరాతి
విత మెఱింగిననాఁటి వేఁడుకోళ్లు
ఎంచదో నాచేత నిల జంత్రగాత్రంబు
లభ్యసించిననాటియణకులెల్ల
వేఁడదో నాచేత వెడవిల్తుశాస్త్రంబు
లెఱుఁగఁబూనిననాఁటి తిరుగుమరుగు
తే. గణన సేయదొ మరుసాము గమనములకుఁ
దాను నాచేతఁబడిన బెత్తంపుపెట్లు
పరులు గని కేరి నవ్వ దబ్బర మురారి
లాలనకె పొంగి యిప్పు డిళాలతాంగి. 7

తే. నిన్నఁగుప్పయు నేఁడాళ్లు నెలఁత తాను
గోరి నామీఁదఁ జేసెనే కారుబారు
ముక్కుపచ్చలు మానక మునుపె బిరుదు
పిచ్చుక యెదిర్చి కాట్లాడ వచ్చినటుల. 8

తే. వెనుకఁ గొప్పును ముందఱఁ జనులు గేలి
సేయనాయెను నా చెంతఁ జేయు వింత

తాను బెంచినపొట్టేలు తనదుచేన
సన్నఁబడుసామ్య మాయెనో చిన్నిచిలుక. 9

తే. తనదుమ ట్టెంత తా నెంత తానె యింత
చేయఁజూచిన నే నెంత సేయరాదు
వేలు వాచిన ఱోలంతవిరివి యైన
ఱోలు వాచిన నది యెంత బోలు గాదు? 10

తే. వారిజూక్షుని నాపగవారివెంట
ననుప గోరంతయైనను మనసు లేదు
నందుఁ డనుపఁగఁ గని మన మందునందు
కొంటి తడ సేయరాదని యుంటిఁ గాని. 11

ఆ. కుట్టఁ దేలు కుట్టకున్నఁ గుమ్మరబూచి
తోసిరా జటంచుఁ జేసి చెలియ
దానివేలు దీసి దానికన్ పొడిచిన
యటులఁ జేయకున్న నగునె చిలుక. 12

ఆ. తగరు కొండమీఁదఁ దాఁకఁ గోరినదారి
నెదురు దన్నుఁ దెలియ కింత పలికె
నెంతమీను వచ్చి యెంతమీనును మ్రింగెఁ
గానఁ ద్రుళ్ళునెద్దె గంత మోయు. 13

సీ. ఆశుకవిత్వంబు లల్లితేనే సరా
చిత్రప్రబంధము ల్సేయ వలదె
గోటిచేతను వీణె మీటితేనే సరా
కొంచక రా ల్గరఁగించ వలదె
పదచాళిరాగము ల్పాడితేనే సరా
హిత వొప్ప వర్ణంబు లెత్త వలదె
అలనాట్యభేదమ్ము లాడితేనే సరా
నవరసంబుల నంటి నడువ వలదె

తే. వింతవింతగఁ గలసినయంత సరియె
యెమ్మెకానిమనోభావ మెఱుఁగ వలదె
యేమినేరని నిన్నటియింతమొటికె
నన్ను విడనాడనా కోరెఁ జిన్నిచిలుక. 14

తే. కాని పదరకు మిఁకమీఁద దానిమోము
గనఁగ వల దని శౌరిని గట్టిపెట్టి
బింకములు కూల నరకాలఁ బెట్టి నేల
రాచకున్నను నాపేరు రాధ గాదు. 15

క. అన విని శుక మి ట్లనియెను
వనితా యేమందు దానివగలో త్రుళ్ళో
మినుకో తెలివో గెలివో
విను వెన్నకుఁ బండ్లు వచ్చువిత మాయెఁ గదే. 16

తే. చూపులోపల నొకవింతచూపుతళుకు
నడుపులోపల నొకవింతనడుపుబెళుకు
నుండు నునికికి నొకవింతనుండుకులుకు
వచ్చెఁగదవమ్మ మనయిళావనిత కిపుడు. 17

తే. లేనిపట్టింపు లెల్లను బూని చాన
నేనె యెదురైన నిం తైనఁ గాని చూడ
దల్పునకుఁ గల్మి వచ్చిన నర్ధరాత్రి
గొడుగు తెమ్మన్నకత గాను కోమలాంగి. 18

తే. పడఁతి మును దెల్పనా పదింబదిగ నేను
దాని వినయంపుపోకిళ్లు తగ నెఱింగి
మానిసిని జేయవలదమ్మ దీనిఁ జేర్చి
తెలియ నిది మేకవన్నియపులి యటంచు. 19

వ. అనిన మధురవాణి యనుమధుపవేణి యవ్విరిబోణి నవలోకించి యిట్లనియె. 20

క. [3]ని న్నెఱుఁగదు త న్నెఱుఁగదు
తన్నుం దనమ ట్టెఱుంగు దామోదరుఁడే
[4]తన్నుండె నిన్ను విడుచు న
[5]టన్న న్మఱి దీని నగరె హాహా జనముల్. 21

క. నిన్నుండే మానిసి యై
నిన్నే వెలి సేయఁ బూనె నెలఁత భళారే
కొన్నంగడిలోపలనే
యన్నన్నా మాఱుబేర మగునే చెలియా. 22

ఆ. ఈఁక తోఁక లేని శ్రీకృష్ణుమాటలు
పొలఁతి నమ్మి నానఁ బోసికొనియెఁ
దగిలెనా తగులును దప్పెనా తప్పును
నాతి వెఱ్ఱివానిచేతిరాయి. 23

తే. కుమ్మరికిఁ జూడ నొకయేడు గుదియ కొక్క
పెట్టటన్నట్టు దీనియెబ్బెట్టుతనము
లెల్ల నిదె తీరు నొకసారి యిటకు శౌరి
వచ్చి నిన్నేల, నిందుకు వగవనేల. 24

వ. అనిన విని రాధావధూరత్నం బి ట్లనియె. 25

తే. కోటిమదనులఁగడవ్రేలిగోట గెలుచు
సుందరాకృతితోడ నానంద మిచ్చు
దివ్యసుందరగోపాలదేవుఁ జూచి
వసుధలోపల వలవనివారు గలరె. 26

తే. దాని నెంతయు నన నేల తలఁచి చూడఁ
దప్పుతంటలకొఱగానిదానవారి

ననవలెను గాని తెగ నిండదొనకుఁ దీసి
యేయువాఁ డేయ న మ్మేమిసేయుఁ జిలుక. 27

ఆ. నందసుతుఁడు మున్ను నామీఁది ప్రేమచే
నొకటి సేయఁబోయి యొకటి సేయు
[6]అత్త నెత్తిఁ జేతు లంగడిలోఁ గన్ను
లాయె ననుచుఁ జెలియ లరసి నవ్వ. 28

వ. అని మఱియు నారాధావధూటి తనచేటీరత్నంబున కి ట్లనియె. 29

ఆ. తగులుదాఁక మేళ మగపడ్డఁ దాళముల్
గాఁగఁ జేసినట్టికాంత వింత
గట్టు చేరినంతఁ బుట్టివానికి బొమ్మ
గట్టు సామ్య మాయెఁ గదవెచెలియ. 30

సీ. కీరవాణులచేతఁ గీళ్ళాకు లంపితే
శిరసావహించు నో సరసిజాక్షి
నాతి యెవ్వతె యైన నామేర వేఁడితే
కను లెఱ్ఱఁజేయు నోకంబుకంఠి
యెలమి నాకోసర మెంతవారల నైనఁ
దెగనాడఁ దలఁచు నోచిగురుఁబోఁడి
యేఁ జూచి చూడక యేమాటఁ జెప్పిన
జవదాఁట వెఱచు నోసన్నుతాంగి
తే. యేపదార్థంబు లైన నాయెదుటఁ బెట్ట
కెవరికి నొసంగఁబోవఁ డోయిందువదన
చేరి యటు లున్నవిభుఁ డిట్లు చేసె నేని
తిరుగ బ్రతుకాడవలెనఁటే శరదవేణి.

క. మున్నెంతో చను వొప్పఁగ
మన్నించినవిభుఁడు వెనుక మార్మొగ మైనన్
గన్నియ బలిమిని వేడుక
విన్నదనం బదియె కాదె విధుబింబాస్యా. 32

సీ. మేను మే నానిన మేను సోఁక దటంచుఁ
గలపంబు లొల్లఁ డోకలువకంటి
పరులు వచ్చిన రిత్త పలుక నయ్యీ నని
తెర యెత్త నియ్యఁ డోశరదవేణి
అలమి కౌఁగిటఁ జేర్ప నడ్డ మయ్యీ నని
హారంబు లొల్లఁ డోహంసగమన
గాసిల్లి నాతొడల్ కండె లయ్యీ నని
పుంభావ మొల్లఁ డోపువ్వుఁబోఁడి
తే. మణిగుణంబులదారిని ననఁగి పెనఁగి
కుసుమగంధంబులట్టులఁ గూడి మాడి
చెలఁగి తిలతై లములరీతిఁ గలసి మెలసి
యున్న విభుఁ డెట్లు చేసె నోసన్నుతాంగి. 33

క. అల్లునిమంచితనంబును
గొల్లనిరసికతయు లేదు కోరితి నీరెం
డల్లనె చూచియుఁ గనియును
బల్లములోఁ బడినదానిభంగిని జెలియా. 34

క. నెరతన ముడి గింటింటికిఁ
దిరుగుచు బతిమాలు హరికి దెఱవలు కఱవా
తిరిపెం బెత్తెడువానికి
బెరుగుంగూ డేమిబ్రాఁతి విధుబింబముఖీ. 35

క. కలలో నైనను బాయక
కలకాలము నున్ననిభుఁడె కసుగాయకు నై

పలచన చేసె నటన్నం
జెలియా మగవారిచనవు చెడ్డది సుమ్మీ. 36

క. అనువనజాక్షిని గని తాఁ
గనికరమునఁ జిలుక పలికెఁ గానీ వమ్మా
వనజాక్షువింత లెఱుఁగవె
కని తెల్పిన భారతంబుకత లై పెరుఁగున్. 37

సీ. కొననాల్కఁ గొని దానిననమోవి చెనకితే
కసుగందునో యంచుఁ గలవరించు
మొన వేళ్ళ మెలమెల్లఁ జనుమొనల్ నిమిఱితే
తగిలి నొచ్చునొ యంచుఁ దత్తరించు
వదన మించుక నాభిపై ముద్దాడి
బరువాయెనో యంచుఁ బలవరించు
గోటిచేఁ గప్పుముంగురులు చి క్కెడలించి
చురుకునేమో యంచుఁ బరితపించు
తే. జాజిపూఁదేనె గొనుతేఁటిఁజాడ నమరి
తాను రతి చేసి దాని పాదమ్ము లొత్తు
వలచువారును వలపించువారు లేరొ
వార లీబూమె లొనరింప లేరు గాని. 38

తే. దొరకరానిపదార్థంబు దొరకి నటుల
ఱొమ్ముననె కాని డించఁ డేయిమ్ము నైనఁ
బెట్టుచోటను బెట్టక వెలఁది నిపుడె
కట్టి కాచుక యున్నాఁడు కదలనియఁడు. 39

సీ. కనకాంగికట్టువర్గమె వల్లెవా టాయెఁ
గొమ్మపావడ చుట్టుకొనుట కాయె
నలివేణి నెమ్మోము నిలువుటద్దం బాయెఁ
జెలిగోటిలత్తుక తిలక మాయె

దరుణిలేనునుతొడ ల్తలగడదిం డ్లాయె
వెలఁదిగుబ్బలు చెంపబిళ్ళ లాయె
లలితాంగిచెమ్మట ల్చలువపన్నీ రాయెఁ
గలికిమేను నలుంగుకలప మాయె
తే. బోటి పడకిల్లు జిగికొల్వుఁకూట మాయె
లోలలోచనతోడిదే లోక మాయెఁ
బలుకు లేటికి నిపు డిళాభామనుండి
యచట శౌరికి దొరతన మమరె నమ్మ. 40

తే. మగువ యదిగాక యిఁక నొక్కమాటగలదు
వినుము వలపులదొరసాని యనెడు పేరు
దాని కిచ్చెను నినుఁ బిల్వఁబో నటంచు
నెటుల నో రాడెనో శౌరి కెఱుఁగనమ్మ. 41

తే. రాధలోనను నాలోన రమణి యెవతె
తెలుపుమా యంచు నాసతోఁ బలుక నాతఁ
డన్ని టను మీర లొక్కరూ పైనఁగాని
మురిపెమున నీవె హెచ్చనె మోహనాంగి. 42

వ. అనిన విని రాధావధూరత్నం బిట్లనియె. 43

ఉ. ఎల్ల జగంబుల న్మనుచు నేలిక కంజుభవాదిమౌనిహృ
త్ఫుల్లసరోజరాజములఁ బూని వెలింగెడితేజ మిందిరా
హల్లకపాణిబాహువుల కబ్బనిదివ్యసుఖంబు చిత్ర మీ
వల్లవకామినీచరణవారిజసేవకు లెస్సఁ జిక్కెఁగా. 44
.
తే. వారి వీరిని నన నేల వీరి వారి
గలగలపు చేయున న్నన వలయుఁగాక
తెఱఁ గెఱుంగక యపు డట్టు దిమ్మగొంటి
తలఁపఁ దననుండిరానట్టి తప్పు గలదె. 45

తే. ఎల్లవారికి శకునంబు లెల్లఁ బలికి
బల్లి తాఁ బోయి తొట్టిలోఁ బడినరీతి
నొకరి నననేల తాఁ జేసికొనినపనికి
వెనుకఁ జింతించు టెల్లను వెఱ్ఱితనము. 46

ఆ. హద్దుముద్దుమీఱి యాఁడుది మగఁ డంచుఁ
గూడి మాడి యాడఁ జూడఁ దలఁచి
బలిమి విందుఁ బెట్టి పగ గొన్నచందానఁ
బెండ్లి చేసి నేనె బేల నైతి. 47

ఆ. నక్క యురులలోనఁ జిక్కుకొన్నవితానఁ
గోరి మనము చేసికొన్నపనికి
బేగులోనితీఁటవిత మాయె ననఁగ రా
దత్తకొంగు తొలఁగినటులఁ జిలుక. 48

చ. కరి తరుమంగ వాఁడి గలకంటకము ల్వని మేనఁ గాడఁగా
సరి పడఁ బోవఁ బాము గని జాలిన మధ్యమసీమ నెల్క వే
కొఱికెడువేరు పట్టి చుఱుకుల్ తగఁ గందురుటీఁగ లెల్లెడం
గరువఁగఁ దేనెఁ గ్రోలఁ జనుకామినితో సరి యైతిఁ గీరమా. 49

తే. నీవు పోయినపనికి రానీవు కొదవ
పట్టి పల్లార్చి దేవకిపట్టినిటకు
దోడుకొని వత్తు వనుచు నీతోడు చిలుక
నెమ్మి కన నెమ్మనమ్మున నమ్మియుంటి. 50

తే. దాని వెలి చేసి శౌరి నెట్లైనఁ గాని
తోడి తెచ్చునుపాయంబు దోఁచ లేదొ
తోఁచ కాడితి నీ కేల తోఁచ నిచ్చు
ముందుపడ నాదుతలవ్రాత ముద్దుచిలుక. 51

వ. అనిన విని బెట్టులికి చిలుక యక్కిలికించితవతీతిలకంబుం దిలకించి యీబాల యింతబేల యగునే యని బెట్టునిట్టూర్పు నిగుడించి యిట్లనియె. 52

సీ. చిక్కనికౌఁగిళ్ళఁ జిక్కి మై మఱచుచు
ఱొమ్ము ఱొమ్మున నాని రోజుకొనుచు
నొక్కరికెమ్మోవి యొక్కరు మార్చుచుఁ
గలగల్పుమణితము ల్పలుకుకొనుచు
నెదురుయ్యలల నెక్కి యెలనాగయును దాను
జిగినోటిమడుపులు చేకొనుచును
గళ లీనుచెక్కుల నెలవంక లీనఁగాఁ
దిలకము ల్కొనగోళ్ళ దిద్దుకొనుచు
తే. నచట వేసినతెర వేసినట్టులుండ
సరిగచౌశీతిబంధము ల్సలుపుకొనుచుఁ
జెలఁగు వనమాలిఁ జేరితి సిగ్గుమాలి
వరుస నెటు తోడితెత్తు నోవన్నెలాఁడి. 53

క. తల కెక్కినవలపున హరి
యలయిళ దాసానుదాసుఁడై మెలఁగంగాఁ
గలవె యిఁక నేటియాసలు
కలి పోసినవెనుక నుట్టి కనుఁగొనుమాడ్కిన్. 54

వ. అనిన విని మనస్సునఁ బట్టరానికినుక పొడమినంత. 55

చ. అదరెడుమోవి తొట్రుపడుయానముఁ గుచ్చెల జాఱుపైఁటయున్
జెదరినముంగురుల్ మిగులఁ జింతిలుచిత్తము వాడుమోము లోఁ
బొదలెడివాంఛ గద్గదిక మోడ్పుకనుంగవ మీఱ మారుచే
బెదరుచు లేచి యామెలఁత వెన్నునిపైఁ దగుమచ్చరంబునన్. 56

సీ. జడ వేగ వదలించి ముడిపూలు విదలించి
యలజడిఁ గీల్గంటు నందగించి
కలసొమ్ము లెడలించి వలయము ల్చిట్లించి
నుదుటఁ గస్తురిబొట్టు కదియ నుంచి

కాటుక సమయించి కలపము ల్తెమలించి
సరసవాసనకట్టు సంఘటించి
దుగరైక తొలగించి జిగిచల్వ నటు డించి
మాసినచీర సమ్మతి ధరించి
తే. [7]వెతల మితి మీఱి వేసారి విధిని దూఱి
యలమటలఁ దారి జీవపుటాస లాఱి
పడకయిలు చేరి కంకటిపైని జేరి
పొరలె మరు లూరి చిలువరాపొలఁతిదారి. 57

చ. పొరలును గొట్టుకాడు వెతఁ బొందును హా యనుఁ జింత నొందు ని
వ్వెఱపడు వాడు లోఁ గుములు వెఱ్ఱిగఁ బ్రేలు విరాళిఁ జెందు బల్
సొరుగును సొమ్మసిల్లు మదిఁ జొక్కు వితా కవు మారు దూఱు నా
తరుణిని గేరు మారుకొను తన్ హరి దూఱును బెట్టు మూర్ఛిలున్. 58

చ. ఉలుకును వెచ్చ నూర్చుఁ గడునుస్సు రనుం దల యూఁచు లేచు లోఁ
గలగఁబడున్ దిగుల్పడును గానిపను ల్తలపోయు వేసరుం
గలవల మందుఁ గల్గొను వికావిక నవ్వు భయంబుఁ జెందుఁ గ
న్గొలఁకుల నీరు నించు మదిఁ గొంకుఁ దలంకు వడంకు నెంతయున్. 59

ఉ. రా యను వింత పుట్టినది రా యనుఁ జూతువు గాని వేడ్క లే
రా యను మేలువార్త వినురా యను నావల పింత చేసె నౌ
రాయను నిన్ను దూఱ నగరా యను నంతియె కాదు కాని పో
రా యను దానిపొందె కనరా యను హా యదుశేఖరా యనున్. 60

సీ. ఏయెడ నాఱొమ్ముఁ బాయనివీణ నే
పాటలాధర గోట మీటునొక్కొ
నామాట మీరక నలు వొందుకీర మే
నెలఁతముంజేతిపై నిలుచునొక్కొ

యెలమి నాకనుసన్న మెలఁగు నేణాక్షు లే
నలినాక్షి యాజ్ఞలు నడుతురొక్కొ
నామొగంబున కొద్దికై మీఱునద్ద మే
సుందరీరత్నంబు చూచునొక్కొ
తే. తూగుటుయ్యల నెవ్వతె తూగునొక్కొ
పెట్టెసొమ్ముల నెవ్వతె పెట్టునొక్కొ
పొందుగా శౌరి నెవ్వతె పొందునొక్కొ
తెలియ దిటుమీఁదఁ బ్రాణము ల్నిలుప రాదు. 61

ఉ. అందఱిఱొమ్మురా ళ్ళుడిగె నందఱినెమ్మది చల్లనయ్యె నే
డందఱినెమ్మొగంబులును హాసములం జెలు వొందె నౌర గో
విందుఁడు దానిఁ గూడి నను వింత యొనర్చినయంత నక్కటా
కందక కంద నేమి కలకాలము నాదుమనంబుమాత్రమున్. 62

సీ. హరిని బాసిననన్నుఁ బరిహాస మొనరించు
మోహనాంగులనోరు మూసినటుల
నానాఁటఁ గృశియించు ననుఁజూచి కనుగీటు
పువ్వుబోణులకన్ను పొడిచినటులఁ
గడువిన్న నగునన్నుఁ గని సంతసం బందు
మెలఁతలఱొమ్ములు మెట్టినటుల
నెంచి న న్నిఁక త్రుళ్ళు నంచని తల లూఁచు
ముద్దుగుమ్మలతలల్ మొట్టినటుల
తే. యదువిభుని జేరి సామి రమ్మనుచుఁ జీరి
గెలివి యొనగూర్చి నిండుకౌఁగిటను జేర్చి
మురిపెమునఁ దొట్టి చిక్కనిముద్దు వెట్టి
మేలిమిని గూడఁ గలదె యీమేనితోడ. 63

క. అని మిగుల వగలఁ బొగులుచుఁ
దనపలుకుల కొద్ది కగుచుఁ దగురాచిలుకన్

గనుగొని వనరుచు రాధా
వనజేక్షణ పలికె వలపు వడ్డికిఁ బాఱన్. 64

మ. చిలుకా యెవ్వతె లేనిచోద లిడి డాచేతం గడం ద్రోయునో
బలిమిన్ రాధికదూత గావె యని కోపావేశతం జూచునో
నలి యాఁకంటికి ఖండచక్కెరలఖాణం బుంచునో యుంచదో
కలలో నంతకుఁ దాళలే వకట నీగారాబ మె ట్లున్నదో. 65

సీ. ఏసాంకవామోద యిఁక రాపు సేయునో
చూడఁజాలక రాజశుకములార
అంబుదాలక యేది యలజళ్ళఁ బెట్టునో
సైరింపలేక హంసంబులార
శరదిందుముఖి యేది విరసంబు చేయునో
నెమ్మి నెమ్మది మాని నెమ్ములార
మించుబోణి యెవర్తు మిఱుమిట్లు గొల్పునో
వైరంబు మీఱ గోర్వంకలార
తే. తేజరిల్లు నిళాండజరాజయాన
కాలరాచును మిము నెల్ల నేలఁ బెట్టి
మిగుల మునురీతి నావెన్క నెగిరిపడఁగ
వలదు మనుఁ డింక సన్మార్గవర్తు లగుచు. 66

తే. కలరవములార యిఁక నొక్కకలికి మిమ్ము
దప్పు లెంచక యాఁకలిదప్పు లెఱిఁగి
సనగ లులవలు నువ్వులు సన్నబియ్య
మునిచి పెంచునొ పెంచదో కనరు చేసి. 67

వ. అని నెచ్చెలులం జూచి యిట్లనియె. 68

సీ. హరిమధ్య యెవ్వతె కరికోఁత బెట్టునో
యదలించి మత్తేభయానలార

కనకాంగి యెవ్వతె కడుఁ గాఁకఁ జూపునో
విడివడి సమదాళివేణులార
శుకవాణి యెవ్వతె వికటించి పలుకునో
మొగ మెఱ్ఱఁ జేసి యోముగుదలార
అబ్జాస్య యెవ్వతె యఱగొఱల్ నించునో
పక్షపాతమునఁ బఁద్మాక్షులార
తే. యింక నేకలకంఠి తా నెగిరిపడునొ
పగను మీమీఁదఁ బల్లవపాణులార
మీరు కల నైన ననుఁ బాసి పో రటంచు
నమ్మియుండితి నిదివఱ కమ్మలార. 69

తే. ఒక్కపాటు నెఱుంగక యున్నమీకు
నకట నన్నుండి యీవెత లందవలసె
నినుముతోఁ గూడ నగ్నిహోత్రునకుఁ బెట్లు
తగులు నంచనుకతగాను తరుణులార. 70

సీ. ఈమేను దొరఁగిన నిఁక జీవునకు వేఱె
వరతను వబ్బ దన్ భ్రమను గాదు
పద్మాక్షుఁ డీవట్టిపడకల్లు గన్గొని
పరితాప మందు నన్భ్రమను గాదు
మనరాధ పోయెఁగా యని యిళాకలకంఠి
వగ లందునో యనుభ్రమను గాదు
చుట్టువాఱుక బెట్టు చుట్టంపుపూఁబోండ్లు
పలవింతురో యనుభ్రమను గాదు
తే. మంచి యేలికసాని లే దంచు మీర
లెగ్గు చెందెద రనుచు నే నిన్నినాళ్లు
నిలుపఁగూడని ప్రాణముల్ నిలుపుకొంటి
నిఁక నిలుపరాదు దయయుంచు డింతులార. 71

వ. అని విలపించుచుండుసమయంబున. 72

క. మరుఁ డురువడి నొఱ నరవిరి
కిరుసఝరీ లంచు దూసి కినిసి బిరానన్
పరుఁ జంటఁ జెమట పొడమఁగఁ
దరుణీమణియెదను దారిఁ దప్పక క్రుమ్మెన్. 73

క. తను వెల్ల జల్లు మనఁగా
ననమోవి చలింప మిగుల నడుము వడంకం
జను లదరఁ గురులు వదలఁగఁ
గనుదమ్ములు మోడ్చి వ్రాలెఁ గామిని మూర్ఛన్. 74

క. అత్తరి బిత్తరు లెల్లను
జిత్తమ్ములు తల్లడిల్ల జిత్తజుచివురుం
గత్తులపై వ్రాలిన య
మ్మత్తచకోరాక్షిఁ జూచి మమత దలిర్పన్. 75

సీ. కలకంఠినిట్టూర్పు గాడ్పులు నిగిడిన
వల్లీమతల్లిక లెల్ల సొరిగె
మదవతిపై సోఁకు మారుత మొలసిన
శుకపికనికరము ల్సోలి వ్రాలె
నలివేణి యొరగిన తలిరుటాకులసెజ్జ
నీరసంబై బూదిదారిఁ గాంచెఁ
దరుణిగుబ్బల నున్నతారహారంబులు
సొబ గెల్ల చిట్లి సున్న మయ్యె
తే. దమ్ము లిడఁబోవఁ గలువమొత్తము లయ్యె
విసము లయ్యెను జేర్చినబిసము లన్ని
మల్లె లయ్యెను విరిబొండుమల్లె లుంచ
నెందునను వీకఁజెడు దీనిఁజెందుకాఁక. 76

క. ఏ మంద మేమి సేయుద
మేమందునఁ దీరు కాఁక లీదిన మకటా
యేమందయాన నడుగుద
మీమందరకుచతెఱంగు లెల్ల నటంచున్. 77

సీ. తావికప్రపుఁదిన్నె దనరించె నొకరంభ
యొప్పుపుప్పొడి గప్పె నొక్కశ్యామ
విరిజజు లలరించె వేఱొక్కలతకూన
యొమ్ముతమ్ముల నుంచె నొక్కసరసి
బిసకాండములఁ జేర్చె వెస నొక్కపద్మిని
యొగిఁ బల్లవము లుంచె నొక్కకొమ్మ
హిమజలంబులఁ జల్లె నిల నొక్కశశిరేఖ
కెందొగ లిడె నొక్కకృష్ణవేణి
తే. తక్కునెచ్చెలు లట్లనే తలిరువిల్తు
ధాటి కోర్వని రాధావధూటి కపుడు
తమతమకు నొద్దికైన సాధనము లొసఁగి
సారెఁజేసిరి శైత్యోపచారవిధులు. 78

ఉ. కోమలిసిబ్బెపున్వలుదగుబ్బల జొబ్బిలు నొప్పుకప్ర మా
కామునికాఁక సోఁకి యది గప్పున మండఁదొడంగె మన్మథ
స్వామికి నేఁ డిదే చమురు వత్తియు లేనినివాళిజోతు లో
సామజయానలార యని చానలు చేతులు పట్టి పల్కఁగన్. 79

తే. సకియ లిటు సల్పు శైత్యోపచారవిధులు
చెలియ కవి నిమ్మ కెరువు వేసినవితానఁ
గాఁక మితి మించఁగా నది గాంచి మధుర
వాణి యనుచాన మన్మథస్వామి నెంచి. 80

సీ. రతిమనఃకాంతాయ రాజీవకుంతాయ
మలయానిలరథాయ మన్మథాయ

సత్కీరవాహాయ జగదేకమోహాయ
మత్తశూర్పవధాయ మన్మథాయ
పద్మాకుమారాయ బాలికాధారాయ
మహనీయవిబుధాయ మన్మథాయ
మాధవప్రభవాయ మాధవసచివాయ
మానితాత్మకథాయ మన్మథాయ
తే. మంజుహర్షణబోధాయ మన్మథాయ
మధుపగుణచాపనాథాయ మన్మథాయ
మహితశృంగారసదనాయ మన్మథాయ
మనసిజాయ తుభ్యం నమో మన్మథాయ. 81

క. నగధరుఁ డెప్పటివలెఁ జెలి
తగు లొందిన నిన్నె యిష్టదైవమ వంచున్
దగఁ గొలుచుఁ బాపు మాపద
ఖగవాహన గోపతనయ కమలాదరణా. 82

తే. అనుచుఁ బ్రార్థించి వందనం బాచరించి
మృగమదముచేత గేదంగిరేకుపైఁ ద
దీయయంత్రంబు వ్రాసి రాధికను డాసి
యాక్షణమె దిట్టముగఁ గేల రక్ష గట్టి. 83

క. ప్రియునామమ్ములపలుకులు
ప్రియ మందఁగ నాలకించి పెంపు దలిర్పన్
నయనములు దెఱచి సరసిజు
నయనుని నటఁ గాన కడలి నాటినప్రేమన్. 84

శా. ఆకాంతామణి యంగజానలము లోకాతీతమై పర్వ నా
లోకాభీలదృగశ్రువర్షము లురూరోజాద్రులం గుప్పఁగా
శోకోద్రేకముచేఁ జెఱంగు మొగము న్సోకించి తా నేడ్చె న
స్తోకోన్మత్తమయూరరాజవిలసత్సువ్యక్తరావంబునన్. 85

క. వనజాతవదన లది గని
వనితామణి చుట్టుముట్టి వగవకు మమ్మా
వనమాలిఁ గూడె దిదిగో
వినుమా దక్షిణపుగౌళి విశదం బయ్యెన్. 86

సీ. అలజక్కువలపెక్కువలఁ ద్రొక్కు బలునిక్కు
గలగుబ్బపాలిండ్లు గలఁగెనమ్మ
బిగిఁజెందు తొగవిందు తగులొందు వగలందు
వదనారవిందంబు వాడెనమ్మ
నునుగల్వలను గెల్వఁగను నిల్వుఁ డను చెల్వ
మరుకన్నులను దెల్వి దొరఁగెనమ్మ
పరువంపుమగువంవు మురువంపుగరిమంపు
చిన్నారినెమ్మేను చిక్కెనమ్మ
తే. చొక్క మగు చెక్కుటద్దము ల్స్రుక్కెనమ్మ
తావిచెంగావిమోవిడా ల్తారెనమ్మ
యేల యిఁకజాలి వనమాలి నేలి మేలు
కొనెదు వినవమ్మ శుభము చేకొనెదవమ్మ. 87

వ. అనిన విని రాధికామణి యిట్లనియె. 88

సీ. తనివార హరిమోము గనలేనికన్నులు
కలఁగిన నే మాయెఁ గాంతలార
చెలువునికౌఁగింట మెలఁగని దేహంబు
చిక్కిన నే మాయెఁ జెలియలార
గోపాలకస్వామి గ్రోలనికెమ్మోవి
స్రుక్కిన నే మాయె సుదతులార
యెమ్మెకానియురమ్ముఁ గ్రుమ్మనిపాలిండ్లు
కమలిన నే మాయె రమణులార
తే. యెఱిఁగి యెఱుఁగక పలికెద రింతె కాని
యెడ విడనిబాళి రతికేళి నెలమి నేలి

నట్టినాదేవు నెడఁబాసి నట్టివెనుక
జీవనం బేల తను వేల జీవ మేల. 89

ఉ. మానినులార మీర లనుమానము మానుఁడు నమ్మవద్దు నన్
గానిపనుల్ మదిం దలఁచి గాసిల నేటికి నేఁటి కీయొడల్
సూనశరాగ్ని కాహు తిడి సొంపు వహించెదఁ బక్ష ముంచుఁడీ
ప్రాణము ప్రాణనాయకుని బాసి తరించునె యెంత నిల్పినన్. 90

ఉ. ఈయెడఁ గాయము న్విడిచి యేగెద నంచు విచార మొంద లే
దాయదుసార్వభౌమునికి నామురవైరికిఁ గానికానిమై
పోయినఁ బోవకున్న నిలఁ బుణ్యమొ పాపమొ గ్రుడ్డికన్ను దా
మూయక విచ్చిన న్మఱచి మూసిన నేమి తలంచి చూడఁగన్. 91

క. ఐతే యింకొకనెంజలి
యాతరుణీస్మరునిమోము నవలోకింపం
బాతకురా లైతిఁ గదా
యీతరి ననుఁ గూర్చి వగవ నేటికి మీకున్. 92

క. అని పలుకు వనితఁ గనుగొని
కనకాంగులు కనుల నశ్రుకణములు దొరఁగన్
వనరఁగ నేటికి నేఁటికి
వనజాక్షుఁడు వచ్చువేళ వచ్చె నటంచున్. 93

సీ. హరి యదె వేంచేసె వరరథాంగస్ఫూర్తి
యను వంద వీక్షించు మనియెనొక తె
కమలాప్తుఁ డదె యీమొగం బయ్యెఁ బద్మినీ
హాసముల్ చెలరేగె ననియె నొకతె
గోవర్ధనుఁడు తమఃక్రూరప్రభల్ జాఱ
నల్లదె పొడ సూపె ననియె నొకతె
యదె లోకబాంధవుం డరుదెంచెఁ గుముదాళు
లణఁగి తల ల్వంప ననియె నొకతె

తే. కరుణ వెన్నుఁడు నీమీఁదఁ గన్ను దెఱచె
నదిగొ దిశలెల్లఁ దెలివొందెననియె నొకతె
వచ్చె నాచాయవగకాఁడు వగవఁబోకు
మతనుభయ మేమిచేయునం చనియె నొకతె. 94

క. ఈరీతి వారిపలుకులు
సారెకు వీనులను సోఁక సతి మరుకాఁకల్
దీరగ వెలఁదులకడ నా
శౌరిం గోరుచు న టుండె సమ్మతమతి యై. 95

తే. అంత నచ్చట నర్జునాహ్వయునిసఖుని
జేరి రాధిక పంచినచిలుక యలుకఁ
జెప్పకయె పోయె నని చెప్పఁ జిత్తగించి
వనజనాభుఁడు మనము దిగ్గనఁగ లేచి.96

సీ. రాజాస్య గీలించు రవలపావలు మాని
ధవళాక్షి యిచ్చుకైదండ మాని
పడతులు దెచ్చిన బారిపల్లకిమాని
సుమగంధు లిడుచామరములు మాని
కాంచనాంగులు పట్టు కరదీపికలు మాని
శుకవాణు లను హెచ్చరికలు మాని
భామామణు లొసంగు బాగమ్ములును మాని
వనితలు విసరుపావడలు మాని
తే. జాఱుశిఖవీడ నరవిరిసరులు వాడ
బెట్టువగతోడ హృదయంబు కొట్టు కాడ
విరహ మొనఁగూడ ముత్యాలపేరు లూడఁ
జనియె నాప్రోడ శృంగారవనముజాడ. 97

వ. ఇట్లు చని. 98

క. చైత్రరథనందనాదిక
చిత్రమనోహృద్యమైన శృంగారవనిన్
మిత్రులతో రాధాశుభ
గాత్రి న్మదిఁ దలఁచి గరుడగమనుఁడు వల్కెన్. 99

సీ. ఎలనాగ నాచెంత కెంతెంత వచియించి
తనముద్దుచిలుకను బనిచెనొక్కొ
వచ్చి యిచ్చట నాదు వర్తమానము చూచి
పోయినశుక మేమి బొల్లెనొక్కొ
యేణాక్షి యది విని యీనినపులిఁబోలెఁ
బదరి భగ్గున మండిపడియెనొక్కొ
యది యొక్కనెపముగా నతివలు పగ చాటి
మించఁగా నేమి బోధించిరొక్కొ
తే. తోయజాననమది కేమి దోఁచెనొక్కొ
దైవమేగతిఁ జేయంగఁ దలఁచెనొక్కొ
కాల శని యుండెనో జవరాలిఁ బాసి
యేల వచ్చితి నాబుద్ధి కూలిపోను. 100

ఉ. కామిని చిల్క పోయి పలుక న్విని గుండె గభీలు మం చనన్
మో మొకయింత చేసికొని మోవి వడంకఁగ మేను వాడఁగా
గామునికాఁకలం గుమిలి కంటికిఁ బుట్టెఁడు నీరు నించి తా
నే మని యెంచెనో మదిని నెంత తపించెనొ యేమి చేసెనో. 101

సీ. నినుఁ బాసి నిమిషంబు నిలువఁజాల నటంచుఁ
గౌఁగింటఁ జేర్చుక గడియసేపు
నీవెంట నే వత్తు నేఁ దాళలే నంచుఁ
గరములు పట్టుక గడియసేపు
ననుఁ బిల్వ బంపుము నాయాన నీ కంచుఁ
గన్నీరు నించుచు గడియసేపు

దానిమాయలఁ జిక్కి దయ వీడకు మటంచుఁ
గదిసి ఱొమ్మున వ్రాలి గడియసేపు
తే. గాఁగ వగచుచు గద్గదకంఠి యగుచుఁ
బ్రేమ మీఱంగ దీవెన వీడె మిచ్చి
పనుపఁజూలక పైసంబు పనిచినట్టి
యువిద నెడబాసి యిం దుండు టుచితమగునె. 102

సీ. చూతునా యొకసారి శుకవాణినెమ్మోము
కలువరాయనిఁ గాంచు కలఁక దీర
విందునా యొకసారి విరిబోణిపలుకుల
నలపికధ్వని విన్న యళుకు దీరఁ
జేర్తునా యొకసారి చెలిమేనితో మేను
పూపాన్పుపై నున్నతాప మాఱ
దొరకునా యొకసారి తెఱవచన్గవ యంట
దమ్మిమొగ్గల నంటు తలఁకు దీరఁ
తే. గలుగునా యొక్కసారి చక్కనిమిటారి
ముద్దుచెక్కిలి ప్రేమతో మూర్కొనంగ
గొనబుకప్రపుఁబలుకు మూర్కొన్నయట్టి
కాఁక దీరంగ నంతరంగము చెలంగ. 103

చ. లలన నిజాంఘ్రిపద్మములలత్తుక నామునికాళ్ల సోఁకఁగా
నిలిచి తమిం దొడ ల్తొడలు నీవియు నీవియు నాభి నాభియున్
వల నగుఱొమ్ము ఱొమ్ము జిగివాతెర వాతెర మోము మోమునుం
గలియఁగ నిండుకౌఁగిటను గ్రమ్ముక నెమ్మిఁ చెలంగు టెన్నఁడో. 104

సీ. శృంగారయౌవనక్షీరాబ్ధినడుమను
దనరారుబంగారుతమ్మి యనఁగఁ
దళుకుమిం చన మించు తనుచంద్రరేఖలోఁ
బలిఢవిల్లుకురంగపద మనంగఁ

గలదు లే దనునట్టి కౌనుదీవియయందుఁ
బూచినదింటెనంపూ వనంగ
నలు వొందునాభిపున్నాగంబునను బుట్టి
ప్రవహించువిరితేనెవాఁక యనఁగఁ
తే. జొక్కి మరు లెక్కి మెత్తలఁ జుట్టి చూడ
నజుఁ డొనర్చిన మోహనయంత్ర మనఁగ
మరులు గొలిపెడిదొరసానిమరునియిల్లు
కళలు గరఁగంగ ముద్దాడి కలియు టెపుడొ. 105

చ. పయనము పోయి వచ్చెడిరువారపు ముచ్చట లావలన్ మఱెం
తయు నినుఁ గూడుప్రోడలకుఁ దప్పక చెప్పుము నాదుమ్రోల నా
పయినము గానిసుద్ది యని పల్కు మటంచును మేన వ్రాలి హా!
దయ పగవారికైన నమితంబుగఁ గా దనుచాన నెన్నుదున్. 106

చ. మొగ మొకయింత చేసికొని మోవి చలింపఁగ మేను సోలఁగా
జిగికనులందు నీ రొలుకఁ జిత్తజుగేహము చెమ్మగిల్ల నో
రఁగఁ దలవాకిట న్నిలిచి మ్రాన్పడి నే నిటు వచ్చువేళలన్
సొగసుగఁ జూచునాసుదతిచూపు దలంచిన నోర్వ శక్యమే. 107

సీ. శయనింప నొల్లదు శయ్యపై నైనను
వనజాక్షి నాయురంబుననె కాని
వసియింప నొల్లదు పసిడిగద్దియ నైన
ఘనవేణి నాయంకముననె కాని
భుజియింప నొల్లదు పులిజున్ను నైనను
దెఱవ నాకెమ్మోవితేనె గాని
వినఁగ నొల్లదు రుద్రవీణారవం బైనఁ
గలికి నాగళరవంబులనె కాని
తే. పిలువ నొల్లదు తనతోడిచెలుల నైనఁ
గన్నియలమిన్న ప్రేమతో నన్నె కాని

యట్టిగుణరాశి నెడఁబాసి వట్టిగాసి
పొందఁ జేసె విధాత దుర్బుద్ధిచేత. 108

సీ. మడుపులమార్పుల మక్కువ లొనరించి
తమలపుమార్పుల దయ ఘటించి
నెమ్మోముమార్పుల నెమ్మది సవరించి
వాతెరమార్పుల వలపు పెంచి
జిగితొడమార్పుల సొగ సెంతొ తనరించి
కౌఁగిలిమార్పుల గనున ముంచి
తగుతలమార్పులఁ దమకంబు పుట్టించి
ప్రక్కమార్పులచేత భ్రమ ఘటించి
తే. పొలయలుక నించి వెంటనే బుజ్జగించి
కళలు గరగించి మనసార గారవించి
రతుల సొక్కించి నన్నేలు రమణి నెంచి
జాలిగొని చాల యీవేళ తాళఁజాల. 109

చ. కులుకుచుఁ గల్లమై నిలిచి గుబ్బ లశాడఁగఁ గొప్పు వీడఁగాఁ
దిలకము జాఱ రెప్ప లరతేలఁగ నూర్పులు మీఱ మారునిల్
జిలజిల మంచుఁ జెమ్మగిలఁ జెక్కులఁ జెమ్మట లూర హాయిగాఁ
దలపడి చేయుపుంరతిని ధ్యానము చేసెద నెప్పుడు న్మదిన్. 110

చ. వడఁకెడునున్ దొడల్ వదలుపావడ వాతెరకాటు చెమ్మటల
సడలినపెన్నెరుల్ కరఁగి జాఱినచాదిక చిట్లుగంధముల్
బెడిదపుటూర్పులున్ కులుకు పెన్చనుగుబ్బలపచ్చిగోరులుం
దడబడుయానమున్ వలపు తందరయుం దగ మారుసాదనన్
బడలి సుఖద్రవం బొలుకఁ బ్రక్కను నిల్చు చెలిం దలంచెదన్. 111

సీ. జంకించుచు నదల్చి సామి రమ్మని పిల్చి
యెదు రానుకొని నిల్చు నుదుటుదనము

జిగిగుబ్బలను గ్రుమ్మి బిగికౌఁగిటను గ్రమ్మి
మనసారఁ దను పమ్ము మంచితనము
ఒడికట్టు సడలించి తొడ తొడఁ గదియించి
బెట్టుగాఁ దమి నించు దిట్టతనము
జిలుఁగుతిట్టులు దిట్టి యలిగి చెక్కిలి గొట్టి
వలపుముద్దులు పెట్టు సొలపుఁదనము
తే. మ్రొక్కి మ్రొక్కించుకొనునట్టి చక్కఁదనము
పొగడి పొగడించుకొనునట్టి ప్రోడతనము
దక్కి దక్కించుకొనునట్టి దంటతనము
దానికే కాక కలదె యేచాన కైన. 112

ఉ. ఎందఱిఁజూడ నీవఱకు నెందఱితోడుత ముచ్చటాడ నే
నెందఱి కేళిఁ గూడి సుఖ మెంతయుఁ జెందను? దానియల్లచో
టందము పొందుచందమును నందునఁ జిందుసుఖద్రవంబు నే
చందనగంధియందుఁ గన సారెఁ దలంచిన దానికే తగున్. 113

చ. పొలయలు కాఱి నేఁ గలియ మోడ్చినకన్నులు విచ్చి చూచి బొ
మ్మలు ముడి వెట్టి జంకెనయు మందపుకోపము మోముదమ్మి నిం
పలర నదల్చి యోరి యదయా దయ మాలి విధాత మున్ను నా
తల నిటు వాసె సద్దు మని తద్దయు మ్రాన్పడుకన్నె నెన్నెదన్. 114

చ. పలుమరుఁ గూడి నేదురుసుపైసరము ల్గనుపించువేళఁ గ
న్గలువలు విచ్చి చూచి యరగ న్నిడి ముద్దులు గుల్క నవ్వి మేల్
భళి యవునయ్య యేలి తిది బా గదె హా విడ కంచు మెచ్చి నన్
బొలుపుగ దృష్టి దీసికొను ముద్దియముద్దు దలంప శక్యమే. 115

చ. కులుకుమెఱుంగుగబ్బిచనుగుబ్బలు వెన్నున నాని యాత్మభూ
నిలయము తుంటి నంటఁ దొడనిగ్గులు దిక్కులఁ బర్వ సీత్కృతుల్
గొలిపి చిటుక్కుమంచు జిగిగోటికొనం దల గ్రుక్కి సొక్కఁ జే
సలరులతాంగి నెన్న మరు లగ్గల మయ్యె నదేమి చెప్పుదున్. 116

సీ. అలమి కౌఁగిటఁ గ్రుచ్చి యల్లందులకుఁ జొచ్చి
కాసెలోఁ జెయివేయు కౌశలంబు
నుబికి పెందొడ లెత్తి యొడలు ఝుమ్మన హత్తి
హితవొప్ప నెదురొత్తు లిచ్చువైపు
[8]తళుకు లేఁ గనఁ దగ్గి తమి యుప్పతిల నొగ్గి
ధేనుకబంధంబు నానుజాతి
చివచివఁ బై నెక్కి రవళి హెచ్చఁగ నిక్కి
పుంభావ మొనరింపఁ బూనుసొగసు
తే. తరువుఁ జుట్టినలతకూన హరువు మీఱి
తనువు తనువునఁ బెనఁగొన ననువు దేరి
వలపుతో నాగబంధంబు సలుపుదారి
దానికే కాని మఱి దేనికైనఁ గలదె. 117

చ. పొలతులఁ గూడనో రతులపోహణఁ జూడనొ మేల్మి సేయనో
యలి గెడఁ బాయనో విరహ మందనొ కుందనొ తెల్విఁ జెందనో
యిల తొలి నీవిరాళియుసు నీవెత లీమితి లేనిబాళి నేఁ
గలను నెఱుంగ నేఁ డిదిగొ కంటి నయో! తొగకంటికోసమై. 118

తే. మునుపు నిద్దుర లేదయ్యె ముదిత నెనసి
వెనుక నిద్దుర లే దయ్యె వెలఁదిఁ బాసి
యేమి చెప్పుదు మన్మథస్వామిమాయ
ముంచకయె ముంచె నొంచక యొంచె నౌర. 119

సీ. సొగసులపుట్టిల్లు సొక్కుమందులదీవి
రాజసమ్ములటెంకి రామచిలుక
నెరవన్నెబంగారు విరవాదివిరితీఁగె
కుసుమాస్త్రుచేఢక్క కుల్కులగని
మరునిశాస్త్రపుటీక గురువుపీఠము పులి
గడిగినముత్తెంబు కమలపాణి

మదనసమ్మోహనమార్గణ ముక్కల్కి
మరులుకొల్పుట కిమ్ము మంచిసొమ్ము
తే. తతసుగుణపేటి దివ్యసౌందర్యవాటి
వనితలకు మేటి మాధుర్యవచనధాటి
భావజునిఘోటి ముద్దురాధావధూటి
గాన మిల నేటివఱలోన దానిసాటి. 120

ఉ. మారునికేళిలోఁ జెఱఁగు మాసె నటంచును మాటు కేగ నే
సారెకుఁ బోకు నిల్వు మని జాఱుపయంటచెఱంగు పట్టినన్
మీఱినసిగ్గు నారజము మించినచూపులు చిన్నినవ్వు ల
వ్వారిగఁ గుల్కి కల్కి తల వంచిన దొక్కటి కోటి సేయదే. 121

ఉ. కన్నులఁ జెక్కుల న్మెడను గర్ణయుగమ్మునఁ గాముగీమునం
జన్నుల వీడె మెవ్వరిది చక్కెరబొమ్మ విచిత్ర మం చనన్
జిన్నిశిరంబు వంచి నునుసిగ్గు ముదం బరనవ్వు మీఱఁ దాఁ
దిన్నఁగ మోముఁ జూచి నగి త్రిప్పి మఱెవ్వరి దన్న దెన్నెదన్. 122

సీ. కాంచనకాంచికాఘనజఘనప్రభల్
హెచ్చఁగా నెదురొత్తు లిచ్చి యిచ్చి
రతనాలకుతికంటు రంగు లీనఁగ మీఱి
పారావతధ్వను ల్పలికి పలికి
ముంగరముత్యంబు ముద్దుగుల్కఁగఁజేరి
యొసపరికెమ్మోవి యొసఁగి యొసఁగి
తారహారమ్ములు తీ రొందఁగఁ జెలంగి
గుబ్బలచే ఱొమ్ము గ్రుమ్మి క్రుమ్మి
తే. సగము మొగిచినకనుఁగవ సగమునగవు
సగముసగ మగుపలుకులు సగము మఱుపు
కెలివి సగమును దగ రతిఁ గలిసి యలసి
లోలలోచన నాయెద వ్రాలుటెపుడొ. 123

చ. నిదు రిఁకఁ జాలు లెమ్మనిన నే శయనింపఁగఁ గల్కి యల్కచేఁ
బదరుచు లేచి యవ్వలను బైఁటచెఱం గిడి పవ్వళింప నేఁ
బదములు వ్రాలఁ దన్నెనట బల్మిని నేఁ గలియంగ శయ్యపై
పదలినకీలుబొమ్మవలె వ్రాలిన దప్పటి దిప్పుడై తగన్. 124

సీ. ముద్దువెట్టఁగ వద్దు ముదిత! యెంగి లటన్న
మొనసి చెక్కిలి గొట్టి మోవినొక్కు-
సుద్దిగా నున్నాను సుదతి! ముట్టకు మన్న
గబ్బిగుబ్బలఁ గ్రుమ్మి కౌఁగిలించు
నబల! పైఁ బడకు మర్యాద గా దన్నచోఁ
గదిసి పెన్నెరి పట్టి కదిమి తిట్టు
వ్రతము నేఁటికిఁ బ్రక్క నతివ! పండకు మన్నఁ
బైకొని కేళి కుపక్రమించు
తే. మేలు గనిమెచ్చు వాతెర గ్రోలనిచ్చు
ముద్దు గొనవచ్చు సుద్దులఁ బ్రొద్దుపుచ్చు
[9]రమ్య మగుగచ్చు లిడి పునారతుల హెచ్చు
నట్టి చెలిపొందు గాంచ కే నెట్టు లుందు. 125

సీ. ఆంగజజ్వరతాప మాఱదు సఖిముఖ
పూర్ణచంద్రోదయంబుననె కాని
మదనవిదాహంబు మానదు ననబోణి
మోవిపంచామృతంబుననె కాని
స్మరదోష మాఱదు సతిసుగంధవసంత
కుసుమాకరంబు గైకొనినఁ గాని
మన్మథకార్యంబు మానదు జవరాలి
నిటలరాజమృగాంకనియతిఁ గాని
తే. తలఁప వలరాచభూతంబు దలఁగి పోదు
ఘనఘనకచాకచాంజనంబుననె కాని

యెట్లు వేగింతు నేరీతి నే సహింతు
నెవ్వరిని బంతుఁ గాంతపొం దెపుడు గాంతు. 126

చ. మదనునికేళిచే నెనసి మంచము డిగ్గి విలోలగాత్రియై
పదరఁగఁ జూచి నేఁ గరము పట్టి పునారతి కెచ్చరించినన్
వదలిననీవితో శిరము వంచి నిరాదరహాస మొప్పఁగా
మదనునియిల్ తళుక్కు మన మక్కువఁ బైకొనుకన్నె నెన్నెదన్. 127

సీ. అయ్య వచ్చె నటంచుఁ దొయ్యలు లెఱిఁగింపఁ
బదరి దిగ్గున లేచి యెదురుకొనును
చెలిమి న న్నిసుమంతసేపు చూడక యున్న
నావఁ ద్రావినజోక నటవటిల్లు
నెడ నేది విన్న నా నుడి యెలుంగో యంచు
నెరిబొమ్మ నిక్క మై మఱచి వినును
పౌరుషరతి నేలి బడలితివో యని
వలిపెచెంగావిపావడను విసరు
తే. నేను సంతోషమున నున్న నెంతొ చెలఁగు
నింత నే విన్ననై యున్న వంతఁ జెందు
నట్టి ప్రియురాలి నెడఁబాసినట్టితనకుఁ
జిన్నె లివి గావు ముందరనున్న వింక. 128

సీ. చుక్కలగమికాఁడు సూర్యుఁడై యుండునా
చెలిమోముతో మోముఁ జేర్చియున్న
విరులసరమ్ములు శరములై యుండునా
మెలఁతకన్ సన్నల మెలఁగుచున్న
జిలుకలపలుకులు ములుకులై యుండునా
విరిబోణిమాటలు వినుచు నున్నఁ
జిగురాకుతల్పముల్ చిచ్చులై యుండునా
చేడియపదసేవ సేయుచున్న

తే. మలయమారుత మెం దైనమంట లౌనె
బిసరుహాక్షికి సురటిచే విసరుచున్న
మదిమదిని నేనె కొనినట్టికొదవ లనక
సారె కీవేళఁ బరులను దూఱనేల. 129

సీ. కుచకుంభములమీఁద గోరంకుశం బాని
కఱకుకఱుక్కున నఱకి పట్టి
కమ్మపుప్పొడిలోన దుమ్మరం బాడించి
చలువగొజ్జఁగినీటఁ జల్లు కొలిపి
మచ్చికమాటల మెచ్చుచు లాలించి
ననసెజ్జ సజ్జారమునను జేర్చి
మరులుకొల్పెడిసంకుమదతైల మెనయించి
తాంబూల మనుకబళంబు మేపి
తే. చివచివగ నెక్కి మర్మముల్ దవుల నొక్కి
దురుసుపైసరముల నెంతొ దరముఁ జూపి
నెయ్య మలగార మబ్బుదట్టియ్యకున్న
మనసున హుషారు చెంద దా మరునిదంతి. 130

ఉ. ఎవ్వరికూటము ల్చెఱిచి యెవ్వరి ము న్నెడఁబాపినామొ నేఁ
డివ్వగ రవ్వ లంది యిపు డిద్దఱ మిద్దఱ మై విదేశత
న్నొవ్వక నొచ్చి మోహ మనునూత మునింగి సుఖంబు లేక హా
జవ్వన మెల్లఁబో గడపి దా నట నే నిటఁ దల్లడిల్లఁగన్. 131

సీ. హృదయేశ నినుఁ బాసి యేఁ దాళజాలరా
జాములో వత్తువో జాగు లేక
జీవితేశ్వర పోయి నీ విందు రా మఱి
జాములు రెం డౌనొ సైచ లేను
ప్రాణనాయక బదు ల్పలుక వ దేలరా
జాములు మూఁడౌనొ సాగి రాను

నామనోహర మళ్ళి ననుఁ జేరి యేలఁగా
జాములు నా ల్గౌనొ సహజముగను
తే. అని బహుదినాలపై నాన కాడి గద్గ
దస్వరంబున నెదఁ జేరి తాను బనుప
రాలు కన్నీటియేఱుల లీల దాఁటి
వచ్చినప్పుడిఁ కేటి కీవంత లకట. 132

సీ. పికిలిపిట్టలదారి బిగికౌఁగిళులఁ జేరి
పెదవులు గఱచుక పెనఁగి పెనఁగి
మల్లవల్లభులట్ల మరుసాదనలపట్ల
గల్లమ్ములకు వచ్చి కలిసి కలిసి
బిరు దొందుమాష్టీల కరణి నిర్వురమును
జుఱుకుపైసరములఁ జూపి చూపి
మత్తేభములవీఁక మలయుచు నెడ మీక
తమకముల్ గిరిగొనఁ దాఁకి తాఁకి
తే. చెలఁగి బకదారులను హెచ్చి పలికి పలికి
కొదమచిలువలచెలువునఁ గదిసి కదిసి
సూనశరుపోర వెనుతీక నేను నారి
చేరి గడిదేరి సరిపోరి మీఱు టెపుడొ. 133

ఆ. వాలుమీల నేలు వాలుఁగన్నులడాలు
సొముసోము నోము మోముగోము
మాపు రేపు తూపు రూపు మాపును జూపు
కన్నె నెన్న నన్ను మిన్న సున్న. 134

సీ. కపురంపుదీవిని గళుకుచెంగావిని
దావిచే మోవిచేఁ బోవ నెంచి
యెల దేఁటిబారును దెలిరిక్కసౌరును
నారుచే గోరుచే దూఱు లెంచి

వికచాబ్దపనులను విమలాద్రిమణులను
గనులచేఁ జనులచే ఘన మడంచి
యద్దంపుటెక్కుల హలరాజునిక్కులఁ
జెక్కుచే ముక్కుచేఁ జక్కడంచి
తే. మురు వలరుకొమ్మ వలపులముద్దుగుమ్మ
కమ్మసంపంగికొమ్మ బంగారుబొమ్మ
వలచుగొజ్జంగితెమ్మ మర్వంపురెమ్మ
నెపుడు గన నేర్తు నందాఁక నెట్టులోర్తు. 135

క. నాగముల నేలుఁ గుచములు
నాగంబుల నేలు నడలు నాభిబిలము పు
న్నాగముల నేలు ననుచో
నాగాశ్రయు నేలు టరుదె నాతి దలంపన్. 136

తే. చాన మోమంద మెల్ల లోచనమయంబు
కొమ్మ ఱొమ్మంద మెల్లను గుచమయంబు
కలికి వెన్నంద మెల్లను గటిమయంబు
గాన దానికి సాటి జగానఁ గాన. 137

సీ. జలజాక్షి లావణ్యసరసి గా కున్నచోఁ
జనుదమ్మిమొగ్గలం దొనర నేల
ననబోణి శృంగారవనము గా కున్నచో
లలితోరుకదళిక లలర నేల
పల్లవాధర మోహపల్లి గా కున్నచో
భ్రమరకశ్రీలచేఁ బ్రబల నేల
వెలది మన్మథునిచేవిల్లు గా కున్నచో
జిగిచూపుతూపులు చెలఁగ నేల
తే. కలికి నెలరేక గా కున్నఁ గళలు గులికి
తారకాహృద్యమై చాలఁ దనర నేల

భామినీమణి నాతపఃఫలమె కాక
యున్నఁ దియ్యనిరుచుల మే లొంద నేల. 138

క. అని వనరు వనరుహాక్షుని
గనికరమున నూఁది పలికె ఘనత యొకిం తై
నను లేకను శ్రీదాముఁడు
చను వొప్పఁగ బావమఱఁది సరసము దోఁపన్. 139

క. ననుఁ గనుఁగొను ననుఁ గనుఁగొను
మనుచును గోటానకోటు లంగన లుండన్
మునిగెదు రాధను దలఁచుచు
ఘనమోహరసాబ్ధిలోనఁ గమలదళాక్షా. 140

క. మాయక్కకన్న రాధిక
యే యెక్కువ యైసచాన యెఱిఁగింపు మదే
యీయమ నాయమ నెన్నఁగఁ
బ్రాయంబున రాజుబంటువాసి దలంపన్. 141

ఆ. వావి గాని వావి వయసునఁ గడుఁ బెద్ద
గుట్టు లేదు మిగుల గట్టువాయి
బుద్ధి గాదు మాను పెద్దాపె దండు మం
కెనకుఁ జే టనంగ వినవె కృష్ణ. 142

ఉ. నా విని యల్క దొల్క యదునాయకుఁ డి ట్టనె బోంట్లజాతులన్
భావము మర్మకర్మములుఁ బ్రౌఢతనంబును దారతమ్యముల్
కోవిదకోటికే తెలిసికోఁ దగు నంతియె కాని కానలన్
గోవులమేపుపల్లరపుగొల్లనికిం దెలియంగ శక్యమే. 143

సీ. తాఁ గన్నకూఁతురై తగునుడిపడఁతిని
బెనఁగిననలువ కే ఘనత దఱగెఁ
దనగురుపత్ని యై ఈ తనరారుతారను
గదిసినరాజు కే కొదవ వచ్చె

జెలియలివావి యై చెలు వొందువృష నెంతొ
తొడరినయినున కే దోస మొదవె
మనుమరా లైనగంగను గూడి వెలసిన
మున్నీటిరాయఁ డే వన్నె దొరఁగె
తే. నెనసి మఱదండ్ర మరుకేళి నెనసినట్టి
వ్యాసునంతటిముని కేమి వాసి తగ్గె
వావి గా దంటి వౌ రౌర వార లెల్ల
నీవు నేర్చిననీతులు నేర రేమొ. 144

తే. హరికి భూకాంత దా వావి నత్త గాదొ
అలపురారికి గంగ మేనత్త గాదొ
హరిహయున కహల్యాసతి యత్త గాదొ
వా రెఱుంగరొ నీపాటివారు కారొ. 145

తే. రాముకంటెను జానకీరామ పెద్ద
కాంతుకంటెను రేవతీకాంత పెద్ద
రమణుకంటెను గేళినీరమణి పెద్ద
పెద్ద దంటి వీవే పిన్న పెద్ద వౌర. 146

తే. రామ గా దది సుగుణాభిరామ గాని
నారి గా దది మరువింటినారి గాని
కొమ్మ గా దది సంపంగికొమ్మ గాని
గుమ్మ గా దది ముద్దు గుమ్మ గాని. 147

సీ. మగతేఁటిగఱులకు మగువముంగురులకు
నేనాటి స్నేహమో యెఱుఁగరాదు
అలచందమామకుఁ జెలియనెమ్మోమున
కేమి దాంపత్యమో యెఱుఁగరాదు
కపురంపుతావికిఁ గలికికెమ్మోవికి
నేయానుకూల్యమో యెఱుఁగరాదు

బంగారుగిండ్లకుఁ బడతిపాలిండ్లకు
నేయనుబంధమో యెఱుఁగ రాదు
తే. కళుకుమగమీలు చెలివాలుఁగనులడాలు
కాంతిజిగిచూపు మరుచేతికలువతూపు
వనితమైమించు తళతళ యనెడిమించు
నొక్కచోటనె పుట్టని దొకటె కొదవ. 148

ఉ. గంబుర మోవి మారుతురగంబుర తియ్యనిపల్కు నీలనా
గంబుర వేణి చందురుసగంబుర ఫాలతలంబు చారుపూ
గంబుర కంఠ మంబుజయుగంబుర కన్నులు దేవమత్తనా
గంబుర నెన్నడ ల్సురనంగంబుర గుబ్బచనుల్ దలంపఁగన్. 149

క. తారలు చక్కనిగోరులు
తారలు రదపఙ్క్తి పంచదారలు పలుకుల్
తారలు చొక్కపుపిక్కలు
తారలఁ జెలి గెలుచు టరుదె తారుణ్యమునన్. 150

ఆ. మబ్బుమబ్బు నడచు బిబ్బోకవతి వేణి
వింటివింటి నడచు వెలఁది నడుము
కలువ గెలువఁ జూచుఁ గలకంఠి మైతావి
మించు మించ నెంచు మెలఁత మేను. 151

తే. తొడలె చాలును రంభలఁ దొడరి గెలువ
నుదురె చాలును శశిరేఖ నెదురుకొనఁగ
గోరె చాలును దారల దూఱుసేయఁ
జాన మెయి చాలు హేమాతిశయము నెంచ. 152

తే. ఇందుబింబాస్యచిఱునవ్వు నెంచి చూడఁ
జంద్రకిరణవిలాసంబు సహజ మయ్యె
నింతినునుగొప్పుకప్పున కెంచి చూడఁ
గాలమేఘంబు సరిసాటి గా దనంగ. 153

చ. చిగురులు పానకంబు సుధ జీనిరసావళి జుంటితేనియల్
పగడము ద్రాక్షలుం జెఱుకుపాలును బాలును బంచదారయున్
మగువమెఱుంగుమోవిగతి మన్మథదాహభరంబు దీర్చు నే
తగుసకలాంగకంబులకుఁ దద్దయు సౌఖ్యము లీయ నేర్చునే. 154

తే. తాఱుమాఱుగుణంబులు దీరఁ దేఱి
తారుమారుగుణంబుల పోరు మాఱు
మా ఱటంచని మాఱు వేమారునట్టి
నారియారుకయారె వెయ్యాఱు లీడె. 155

ఉ. గిరులును గిండ్లు గిన్నెలును గృష్ణకచాకుచపాళి కోడి రా
మఱియొక పేరు లేక చనె మక్కువ జక్కవపక్కు లుక్కు ద
క్కొరయికఁ జూపి జో డెడసి కుంది యమందరసానుభావతన్
హరువు దలిర్పకే కువలయాప్తునకే హిత వొంద వాయెఁగా. 156

సీ. కుటిలత్వ మానారికురులప్రాపునఁ జేరి
జనవరు లెన్నఁగా ఘనత కెక్కెఁ
గఠినత్వ మేన లేనికలికిగుబ్బల నాని
సారెకుఁ గొండంతపేరుఁ జెందె
మందత్వ మల వొంది మగువ నెన్నడ నంది
యనుపమవిఖ్యాతి నతిశయిల్లెఁ
జంచలత్వ మెసంగి చెలికన్నుల నడంగి
కువలయానందతఁ గొమరు మిగిలె
తే. వెసఁ గృశత్వము చెలికౌనుదెసనుదొట్టి
యిల ననంతయశఃస్ఫూర్తి నెవసె ననినఁ
జెలియు నయ్యుత్తమాంగిని గలిసినట్టి
పురుషుఁ డౌరౌర పురుపోత్తముండు గాఁడె. 157

ఉ. దానిమెఱుంగుముంగురులు దానిముఖాబ్జవికాసవైఖరుల్
దానినిశాలనేత్రములు దానియొయారపుచూపుసంపదల్

దానియురోజగౌరవము దానికడానిహోరంగుమేనిడాల్
దానికళాకలాపములు దానిమృదూక్తులు దానికే తగున్. 158

ఉ. చక్కఁదనాల కేమి రుచి సంపద కేమి మెఱుంగు కేమి పెం
పెక్కదె రాతిబొమ్మయెడ నెంతయు దానఁ బనేమి దానిపై
మక్కువ లెక్కుతక్కులును మాటలపిక్కులు సొక్కుమ్రొక్కు
దిక్కున నైనఁ గాని కలదే కళ దేఱఁగ నెంచి చూడఁగన్. 159

క. అని పలికి కలికితనమున
వెనుదీయక చేరి పోరు వెడవింటిదొరన్
గని కినుక దొణుక ననియెన్
వనజాక్షుఁడు వాని వానిబలముల నెల్లన్. 160

సీ. కలువలచెలికాడ కానీర నీకాఁక
సుందరీమణిమోముఁ జూచుదాఁక
మలయమారుత యేల మలసెదు నీరాక
సుదతియూర్పులు మేన సోఁకుదాఁక
మదకీరమా యేల పదరెదు నీవీఁక
పద్మాక్షి ననుజూచి పలుకుదాఁక
నెమలి యెందుకు వట్టిదుముకులు నీకేక
తొయ్యలినెరికురు ల్దువ్వుదాఁక
తే. పికమ నీకూఁక చెలిమాట వినెడుదాఁక
నంచ నీపోక సఖినడ ల్గాంచుదాఁక
తేఁటి నీజోక సతిచూపు నాటుదాఁక
మార నీఢాక నన్నింతి చేరుదాఁక. 161

తే. ఇంతలోననె నను మీర లింత చేరి
బారుదీరుక బలుకారుబారు సేయు
నాన దాళదె మీమీఁద నాన రేపె
బొమ్మ గట్టద చక్కెరబొమ్మఁ జేరి. 162

క. అని కంతుఁ గంతుబలములఁ
దనచే నైనంత దూఱి తారి విరాళిం
గొనుశౌరి ముందుఁ దోఁచక
వనితామణి నెన్ని సెజ్జ వ్రాలి వితా కై. 163

మాలిని. ఉసు రని తల యూఁచున్ యోజన ల్చేసి చూచున్
గసరుచుఁ జెలి నవ్వున్ గప్పుమీసంబు దువ్వున్
విసువుచు విధి దూఱున్ వెఱ్ఱికో ర్కెల్లఁ గోరున్
గొసరుచు బయ లానున్ గుంది సర్వంబు మానున్. 164

క. విను నెందుఁ జిటుకు మన్నను
గనుఁగొనుఁ గనులెఱ్ఱఁజేయుఁ గలవర మందున్
గినుక గొను శిరము వంచును
వనితా ర మ్మనుచుఁ జీరు వసుధం జేరున్. 165

క. హరి యిటుల విరులపాన్పున
విరహాగ్నిని నిగురుకాఁక వెతఁ గొని పొరలం
బరికించి సఖులు మిగుల
వెఱఁ గందుచుఁ జెంతఁ జేరి వివర మెసంగన్. 166

చ. కనుఁగవఁ దమ్ములున్ సిరపుకప్రము మోవినిఁ గల్వఁ దారలన్
గొసబుచివుళ్లు గేలఁ దెలిగోరుల మొల్లల బంధుజీవపు
న్ననలు పదాబ్దయుగ్మమున నాభిని బొన్నలు మేన మర్వము
న్నినిచి సుగంధము ల్గొలిపి నెమ్మిని బూసురటీల వీచుడున్. 167

తే. సారెకు నొనర్చుశైత్యోపచారవిధుల
శ్రీనివాసుండు మెల్లన సేద దేఱె
ద్యుమణి యంతటఁ బొడసూపె నుదయగిరిని
బూర్వదిక్సతిపాపటబొ ట్టనంగ. 168

శా. శ్రీమద్గోపవధూమనోహరణ పుంజీభూతశృంగారరూ
పామేయాద్భుతసుందరాంగ జితపుష్పాస్త్రాయుతా రుక్మిణీ

భామాద్యష్టమహిష్యుపావృత హరబ్రహ్మామరేంద్రస్తుతా
జీమూతప్రకరోపమానకలితశ్రీనీలవర్ణాన్వితా. 169

క. అనుపమలావణ్యా ప్రజ
వనితాకుచమర్దనాదిపాండిత్యకరా
తనుతేజఃస్పూర్తిజితా
తనుకోటిమహామహశ్శతసహస్రకరా. 170

మాలిని. కంజదళేక్షణ కౌరవశిక్షణ కార్యవిచక్షణ కాంతినిధీ
రంజితభాషణ రాక్షసభీషణ రత్నవిభూషణ రమ్యసుధీ
సంజయకారణ శత్రువిదారణ సాయకధారణ చారునిధీ
ప్రాంజలినారద పాలననీరద భాసురసారదయాజలధీ. 171

గద్యము.
ఇది శ్రీచిన్నికృష్ణశరుణాకటాక్షవీక్షణక్షణప్రవర్ధమానానూనశృంగారరసప్ర
ధానసంగీతసాహిత్యభరతశాస్త్రాదివిద్యాపారంగత శ్రీమత్తిరుమల
తాతయాచార్యపాదారవిందమిళిందాయమానమానసచోళ
సింహాసనాధ్యక్ష ప్రతాపసింహమహారాజ బహూ
కృతానేకచామీకరాంబరాభరణ ముత్యా
లుగర్భశుక్తిముక్తాయమానముద్దు
పళనిప్రణీతం బైనరాధికా
సాంత్వనం బనుశృంగార
ప్రబంధంబునందు
దృతీయాశ్వాసము.

  1. క్రోధాతురచిత్తయై [మూ.]
  2. మే లాయెన్ మ ఱేమాయె [మూ.]
  3. ని న్నెఱుఁగు నెదిరి నెఱుఁగును [మూ.]
  4. తన్నుంచి విడుచు ని న్నని [మూ.]
  5. యన్న [మూ.]
  6. అత్తమీఁదఁ గన్ను లంగడిలోఁ జేతు. [మూ]
  7. యెదను తమి [మూ.]
  8. తళుకు వె న్గనఁ దగ్గి. [మూ.]
  9. రమ్యముగవచ్చు దా పునారతుల రెచ్చు [మూ.]