Jump to content

రాధికాసాంత్వనము (ముద్దుపళని)/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి

(ఇళాదేవీయ మనునామాంతరముగల)

రాధికాసాంత్వనము

చతుర్థాశ్వాసము

శ్రీగీతాలసమానా
భోగీంద్రశయాన విహగపుంగవయానా
వాగీశనుతాఖ్యానా
యోగీశ్వర చిన్నికృష్ణ యోగనిధానా. 1

తే. అవధరింపుము దేవ దివ్యానుభావ
వ్యాసమునిసూతి జనకభూవరునిఁ జూచి
చొక్కటపుజీనిచక్కెరయుక్కెరలకు
లెక్క యై మించునుడిచవులెక్కఁ బలికె. 2

వ. అంత ననంతుండు దురంతకంతుసంతాపచింతాభరం బంతరంగంబున మఱుంగుపఱచుకొని కాల్యకరణీయంబు లాచరించి షడ్రససంపన్నంబయినయన్నం బొకయన్నుదలమిన్న వడ్డింప నారగించి గంధోదకంబుచే గండూషించి ప్రక్షాళితపాణిపాదుండై యాచమించి దివ్యాంబరాభరణగంధమాల్యాదుల ధరించి యత్తమామలకడ కేతెంచి నమస్కరించి వారిచే మన్ననలు గాంచి నే వచ్చి బహుదినంబులాయెం బోయిరావలయు నని మందలించి కదళించిన కౌతుకంబున నిళాదేవిం దోడ్కొనిరమ్మని తగువారల నియమించి బయలు మెరసి తన్ను వెంబడించి వచ్చుబంధుజనంబుల బహూకరించి పంచి కనకరథం బారోహించి మించినవేగంబునం జని చని మునిజనబృందావనం బగుబృందావనంబుఁ జేర నరుగుదెంచి రథంబు డిగ్గి నిజమందిరంబుఁ బ్రవేశించి యందు నందయశోదలగురించి నమస్కరించిన వారును గాఢాలింగనంబు లాచరించి దీవించిన ముదంబు వహించి యొక్క సంకేతస్థలంబుస కేతెంచి శ్రీదామనామధేయునిచే గురంగనయన తెఱంగుమఱుంగు లేక యాలించి దిటంబు చాలించి యిందు కేమిసేయువాడ నని యూహించి నేఁ బోయినం గాని రా నోప దని నిశ్చయించి యప్పగ లెల్ల నొక్కలాగున వేగించి యర్ధరాత్రంబునం బయలుదేరి తేటయై జగం బెల్ల నల్లిబిల్లిగా నల్లుకొని జాబిల్లి మొల్లమిగా వెల్లివిరిసినబొండుమల్లియలనుల్లసిల్లునిండుపండువెన్నెలలు గాయ రాధికాసుందరాంగీమందిరాభిముఖుండై చనుసమయంబున. 3

సీ. ఏడఁబోయెద విందు నాడి పొమ్మని పల్కు
నింతులపైఁ గన్ను లెఱ్ఱఁ బెట్టుఁ
బోనీము మముఁ గూడి పొ మ్మని యరికట్టు
చిన్నికన్నెలఁ బెడచేతఁ గొట్టు
నేఁ గూడ వచ్చెద నిలు నిలు మని చేరు
చంచలాక్షుల నదలించి నెట్టు
నామీఁదియాన యిందాఁక రమ్మని పిల్చు
భామినీమణుల నేమేమొ తిట్టు
తే. విఱిగె నిఁక నేల పోవద్దు వీడె మరులు
మాను మని లోకు లిటువంటిమాట లాడఁ
దడ వుపశ్రుతు లని చాల తత్తరించు
రాధపై బాళి గొని యదురాజమౌళి. 4

తే. ఇటులఁ జనుదెంచుహరిరాక యెఱిఁగి చిలుక
చెప్ప విని రాధ తనయొద్దిచెలులఁ బిలిచి

శారి యిట వచ్చె నని వింటి మీర లతని
విడక నిల్పుఁడు మోమోటమిడకయందె. 5

చ. అనిన మహాప్రసాద మని యాచెలు లందఱు నేవితాన నై
నను శకటారిసంగతి గనం గలిగెం గద నేఁటి కంచు నె
మ్మనముల విఱ్ఱవీఁగుచును మారునిగంధగజంబులట్ల వీఁ
కను జనుదెంచి వాకి లరికట్టుక నిల్చిరి ధీరచిత్తలై. 6

తే. రమణిపై శౌరి యంతవిరాళి గొనుచు
నేమిటిని నైనఁ జూడక యేది వినక
నెవ్వి యూహింపకయ వచ్చి యెప్పటట్ల
రాధయిల్ చేరఁ జననొక్క రామ వలికె. 7

సీ. ఘనత నడ్డము లేక చనియె దెవ్వఁడ వీవు
స్వంత మౌపసిగాపుసామిఁ గానె
స్వాము లైతిరి చాలుఁ జా లవ్వలికిఁ బొండు
నీవు పొ మ్మనుదువా నీతిఁ దప్పి
నేను గా కెవ్వరు నీ కిటఁ బని యేమి
పని లేక యే నేల వత్తు నిటకు
నాపను లిక నేల నానాఁడె పోయెఁ బో
యత్త కల్లునకు నెం దైనఁ బోనె
తే. రాత్రిబేరాన నున్నావురా మురారి
పగలు బేరము లాయెనో పద్మగంధి
యిట్టియత్యుక్తు లేదిట్ట గట్టిచేసె
చెలి మనల నేలుదొరసానిశిక్ష గాదె. 8

సీ. చెల్లనిమాటాడి చెల్లించుకొంటివి
నేర్చి నేరక యంటి నోర్చికొనుము
విడు మింక నీతీయబెల్లిమాటల నెల్లఁ
దీ పైన నిటు లాన తీయ నేల

పద్మాక్షి విన్న దెప్పర మౌను గడ కేగు
మేలిక యల్గిన నెవరు దిక్కు
చని యేలికగునిళాసతిఁ జేర్చుకొని యేలు
మిళ యెవ్వ రే నెవ్వ రెంచి చూడ
తే. మొదట నెన్నాళ్ళనుండి యీములుచఁదనము
బోటిపదసేవ చేసిననాఁటనుండి
కొంటెవగ లేలఁ జెందనో గోపబాల
కొంటె నీకింత యీయనా కోమలాంగి. 9

తే. అంటుపడి వచ్చినావు మ మ్మంట కేగి
శౌరి మాసంబళములు తత్సఖుల కొసఁగు
మంటుపడలే దటంచు మిమ్మంటి యిపుడు
బాస లెల్లను జేసెద భాసురాంగి. 10

సీ. కనుదోయి మం పేమి గనుము నిద్దుర లేదు
రాధపై బాళిచే రాత్రి యెల్ల
గోటిచీరు లి దేమి కోరి విభ్రాంతిచే
నారి నారయఁ బొద ల్దూరఁ జీరెఁ
బలుగాటు లివి యేమి చెలి నెడఁబాపిన
కమలజుపై నౌడు గరువఁ దవిలె
జడవేటు లివి యేమి సరసిజాక్షిని జేరు
మనిజోటిగొని మీటె మనసిజుండు
తే. కుటిలకచ నేల కీగంధ మెటులఁ జిటిలె
మేటివిరహాగ్ని పైకొన బీట లెత్తె
బసిఁడిదుప్పటిఁ బస పేమి పద్మనాభ
వినవె పచ్చనివలువవాఁ డనుట నన్ను. 11

సీ. పామును బట్టెదఁ బా మేమి చేయుఁ బొ
మ్మహిగర్వదమనుండ వైననిన్ను

జిచ్చులోపలఁ బొత్తుఁ జి చ్చేమి చేయుఁ బొ
మ్మతిదవాసలభోక్త వైననిన్ను
సురల దాఁటెద సురల్ నెరపుదు రేమి పొ
మ్మా త్రివిక్రమమూర్తి •వైననిన్ను
నేనానఁ బెట్టెద నా నేమి సేయుఁ బొ
మ్మాదిసర్వజ్ఞుండ వైననిన్ను
తే. సత్యములు పొత్తుగుడుచునా సన్నుతాంగి
భళిర సత్యము లాసలై వచ్చు నీకు
నైన రాధపదాబ్జంబు లంటి వత్తు
నంటుకొను మిళపాదంబు లచటి కేగి. 12

తే. అనుసఖీమణి వాక్యమ్ము లాలకించి
బలిమికలుములజులుములు బలియఁ జొరవ
చేసి చూచెద ననుచు నా శ్రీధరుండు
ఠీవి చెలగంగలోఁ జొచ్చి పోవఁ గాంచి. 13

సీ. ఓనీరదాలక యోచంద్రబింబాస్య
యోమీనలోచన యోసునాస
యోచంద్రికాహాస యోమధురాధర
యోమంజులాతాప యోసుదంత
యోకంబుకంధర యోపీనవక్షోజ
యోవారిరుహహిణి యోసుమధ్య
యోయూరుజితరంభ యోతూణనిభజంఘ
యోపల్లవసమాంఘ్రి యోసుయాన
తే. గచ్చు లిడి వెన్న ము చ్చదె చొచ్చి వచ్చె
లెండు లెండని శౌరిపై లేము లెల్ల
మొనసి పైఁటలు బిగఁగట్టి ముందు కెక్కి
మరునిమూలబలంబనా నురువడించి. 14

సీ. విడు విడు మని డాసి కడ కన్ను లెఱఁజేసి
వెలికమ్మతమ్ముల విసరె నొకతె
తను వొకించుక పొంచి తమి యుప్పతిల వంచి
సంపంగిననలచే జవిరె నొకతె
ఝ మ్మటంచు నదల్చి జాడ కడ్డము నిల్చి
విరజాజివిరు లెత్తి విసరె నొకతె
గగ్గోలుగా నార్చి కడు దురంబు దనర్చి
జిగినల్లగలువలఁ జిదిమె నొకతె
తే. చలువపన్నీరు మైనిండఁ జల్లె నొకతె
యొప్పుపుప్పొడి తెప్పున గుప్పె నొకతె
యురగశాయిని రానీక యొడ్డు చూపి
యానుఁ డని రాధపై దళం బనుపఁ జెలఁగి. 15

చ. చెలిచెలు లిట్లు చేరి తనుఁజెందినయుల్లము లుల్లసిల్లఁగా
బలుచనుగుబ్బపోటులను వాల్ జడవేటుల గోటిమీటులన్
గలిబిలి చేసి రవ్వ లిడఁగాఁ గని శ్రీహరి యీటెపోటులం
గలగనిగంధసింధుర మనంగఁ దొలంగక నిల్చి యిట్లనున్. 16

తే. సుదతి యిసుమంత కడగంటఁ జూచినంత
యింతరంతులు చేతురా యింతులార
అలుక దీరఁగ దొరసాని కమరఁ బలికి
చెలిమి యొనరించి సుకృతంబుఁ జెందుఁ డనిన. 17

సీ. చెలిమి యొనర్పఁగా వలదెయీని న్నంచు
వెస నుల్కి కెమ్మోవి విఱిచె నొకతె
యీబుద్ధి యానాఁడె యెందుఁబోయె నటంచు
విడనాడి చేతులు విచ్చె నొకతె
యెవ్వారి నెంచక యిఁక మెలంగుదు వంచుఁ
గలికిలేనడు ముల్క గులికె నొకతె

మముఁ జూచి నేఁడైన మాటలాడితి వంచు
వాలుఁగన్నులు దేలవైచె నొకతె
తే. సెట్టి కొకకాల మొదవిన సేవకునకుఁ
గలుగు నొకకాల మంచును గళలు మూల
రాలఁగమ్మలు చెక్కులఁ దూలియాడ
నూచకాచక మఱి తల యూఁచె నొకతె. 18

క. వనిత లిటు లగడు సలుపఁగఁ
గని యిప్పుడు వీరివలనఁ గార్యము గనఁ బో
మని తెలిసి రాధ వినఁగాఁ
దనరఁగ హరి వలికెఁ దలఁపు వల పైఁ బర్వన్. 19

క. రమ్మా మరువపురెమ్మా
గుమ్మా వెలలేనిసొమ్మ గొజ్జఁగితెమ్మా
కమ్మానుకొన్న సంపఁగి
కొమ్మా దయచేసి మనవి కొమ్మా కొమ్మా. 20

చ. నిలువర మంతగాఁ గలిగెనేని ననుం బిలుపించి నీదుహో
న్గులుకుమిటారిగుబ్బచనుగుట్టలఁ గ్రుమ్మి యదల్చి పల్కి చే
నలవడఁ జెక్కుగొట్టి యకటా జడ కొద్దిని మీట కిప్పు డీ
చెలియల కొప్పగించి యిటు సేయఁగఁ జెల్లునె రాధికామణీ. 21

మ. అదుగో మారుఁడు పొంచెనే చెఱకువి [1]ల్లాలాయ మై వంచెనే
యెదపైఁ దూపులు నించెనే యళిబలం బెంతో విజృంభించెనే
మదకీరార్భటి మించెనే పవనుసామర్థ్యంబు రెట్టించెనే
సుదతీ ని న్నిటు వంచనే సలుపు మంచుం ధాత నిర్మించెనే. 22

చ. చెలి నినుఁ బాసి నెవ్వగలఁ జెందుచు నిద్దుర మాని ధైర్యముం
దెలిపెడివారు లేక పరదేశివలెం బవళించి యొంటిగా
నలుగురియాడికల్ వినుచు నావిధి నిట్లు తపింప నీదు పె
ద్దలసుకృతానికైన వనితా దయ సేయఁగ రాదా నాపయిన్. 23

చ. హరిహరి రామరామ యిటు లారడి సేతురె దోసకారి హా
కరఁగినదోసపం డినుపకట్లకుఁ దాళునె చాలు చాలు నా
సరినెరజాణ లాగడము సల్పఁగ మారునిపోరఁ దారి నీ
చిరదయ నేలవే యనుచుఁ జేరితి నే నిపు డంగనామణీ. 24

చ. ననుఁ గరుణించవే పిలువ నంపవె కౌఁగిట గారవించవే
ఘనత ఘటించవే చెలిమి గాంచెవె నాపలు కాదరించవే
నెనరు గణించవే ముదము నించవె యెంచవె యేల నాపయిం
గినుక [2]నడంపవే తెలియ కే నిను వేడెద రాధికామణీ. 25

ఉ. చక్కనిదాన వంచు రతిసార మెఱింగినదాన వంచు నా
యక్కఱ దీర్తు వంచు నను హాయిగఁ గౌఁగిటఁ జేర్తు వంచు నే
నిక్కము నమ్మి వచ్చునెడ నీ విపు డీమటుమాయలాండ్రచే
నక్కట యెప్పగించి యిటు లారడి సేతురె రాధికామణీ. 26

క. అని యావాహనము విస
ర్జనమును లే కున్నఁ జూచి శౌరి శుకంబే
పెనవెట్టిన దీపని యని
యనియెం జెలిచిలుక నెంచి యమృతము లొలుకన్. 27

క. చిలుకా నీకును నాపై
నలుకా పలు కాదరించి యమృతము లొలుకం
బలుకుచు ముద్దులు చిలుకుచుఁ
గులుకుచు నిటు రమ్ము ప్రేమ గొనకొని నాపై. 28

చ. అన విని చిల్క యుల్కిపడి యాహరి చీరఁగ నూరకుండుటల్
దనకును మేర గా దనుచుఁ దద్దయు రాధకుఁ దెల్పి ఘల్లుఘ
ల్లని నునుమువ్వలందియలు నంఘ్రుల మ్రోయఁగ రెక్క లార్పుచుం
గొనబుజవాదివాసనలు గుప్పున వీవఁగ వచ్చి యచ్చటన్. 29

సీ. నెరివెండ్రుకలవాని నిగలొందుతొగవిందు
వగఁ జెందుముద్దునెమ్మొగమువాని

సొగసుచూపులపాని మగరాలజిగి రాలఁ
దగునాల మొసఁగుదంతములవాని
నిడుదచేతులవాని నొడికంబునిడికంబు
నుడికంబు గొనుకంఠ మొనరువానికి
గలికిపేరెదవాని వలమబ్బు బలుపుబ్బు
వెలిద్రొబ్బువలపుమై సొలపువాని
తే. శ్రీకరాంగదకౌస్తుభశిఖిశిఖండ
మంజుమంజీరకర్ణికామణికిరీట
కనకపటహారచాకచక్యములవానిఁ
గృష్ణదేవునిఁ గని నవ్వి కీర మనియె. 30

క. గోపాలసామిగారా
కాపుర మేపురము చాలకాలమున కహో
మీపాదయుగము గంటిమి
చాపల్యము పేరె నున్న శాంతము దీరెన్. 31

క. అని పలుకుచిలుక నటు పో
గని కరమునఁ జేరఁ దీసి కనికర మొప్పం
గని కరము దువ్వి ముద్దిడి
చనపున హరి వలికెఁ గండచక్కెర లొలుకన్. 32

క. శుకవాగమృతాబ్ధీందుని
శుకవాహనజనకు నన్నుఁ జులకన సేయన్
శుకమా తగ దూరక మా
శుకవాణికిఁ దెలుపు కరుణఁ జూడు మటంచున్. 33

వ. అనిన విని శుకం బి ట్లనియె. 34

సీ. ననుఁ గాదు పొమ్మని నాతిఁ జేరినవాని
నే నెటు పిలుతు నో నెలతలార
నాపేరు నావగ నాతి కిచ్చినవాని
మో మెట్లు చూతు నో ముదితలార

బాస లెన్నో చేసి పద్దు దప్పినవాని
పలు కెట్లు విందు నో పణఁతులార
సరివారిలో నన్నుఁ జౌక చేసినవాని
చెలి మెట్లు చేతు నో చెలియలార
తే. యనుచు నిన్నెంచుఁ జెలులపై నట్టెనెయ్యి
వోయమండెడునగ్నియొకో యనంగఁ
బ్రజ్వరిలి వేటుపడుపాముపగిదిఁ జీరు
తరుణి నేదారి నినుఁగూర్తు దానవారి. 35

తే. తెలియఁగాఁ జెప్పు మనియెదు తెలిసి తెలిసి
యందు కేమాయె నే నందు కనఁగలేదు
దెలిపి మునువలె నిఁకఁ గూర్ప నలవి యగునె
తారి తేఱని నారి నేదారి నైన. 36

చ. అనుచు నిరాశగాఁ బలుకు నాచిలుకం గని దువ్వి యిచ్చ మే
లొనరఁగ ముద్దు వెట్టి విను మోశుకవంశపయోధిచంద్రమా
కనుఁగొన నేరిచే ఘటన గా దిది నీ కగు నెట్టు లైన నీ
పని యొనఁగూడఁగాఁ దెలియఁ బల్కుము నాగతు లన్ని కల్కితోన్. 37

సీ. పడఁతి! యల్లునిఁ గొంచెపఱచుట యత్తకు
న్యాయంబు దప్పిననడత యనుము
వనిత! న న్నింతటివానిఁగాఁ బెంచిన
నీ వెఱుంగవె నాదుభావ మనుము
నెలఁత! నానేరంబు నీవె యోర్చక యున్న
నిఁక నోర్చి యేలువా రెవ్వ రనుము
చెలి! నీకు నామీఁద నలుక దోఁచిన దెల్ల
పరఁగ నేఁ జేసిన పాప మనుము
తే. తరుణి మున్ను నీయధరామృతంబు నాను
బలిమి నిన్నాళ్లు ప్రాణముల్ నిలిచె ననుము

ఉపద ననువంటిమగవాని నవల నీవు
నెనరున గడించుకొన నేర వనుము చిలుక. 38

చ. ఎలమిని మత్తనూజుని వహించుక ముందుకుఁ దేవె యాత్మయే
కలుగును బుత్త్రుఁ డై యటులఁ గావున నాతఁడె నేను నీకు నె
ట్టు లయినను న్నను న్మనుపుటొప్పును నామన మెట్లు దెల్పెదో
నెలఁతకుఁ బాపపుణ్యములు నీ చెయి నున్నవి రాజకీరమా. 39

క. బలుపక్షపాత ముడుగుము
ఫలభంగము లిడఁగఁ బోకు ప్రాణము గావన్
గలవేళఁ దెల్పినా నో
చిలుకా దయచేసి చూపు చిలుకలకొలికిన్. 40

చ. అన విని చిల్క నావలన నారడిమాటలు పుట్టఁ బోవు నే
వనితకుఁ దేటగాఁ దెలియఁ బల్కెద దైవము తోడు గావలెన్
వనజదళాక్ష నన్నెఱుఁగవా యని లోపలి కేగి కల్కితోఁ
దన కగుకొన్నికార్యములు తా నయి యేకతఁ జెప్పి యందఱున్
విన వినతాంగిఁ జూచి యనె వేమరు నామరుఘోటి నవ్వుచున్. 41

ఉ. వాసవనీలనీలకచభారము మున్ గదియించి యేను నీ
దాసుఁడ నంచుఁ జేరుమురదానవవైరినిఁ బిల్వఁగావలెన్
బోనరి పొమ్ము పొ మ్మనినఁ బో ననుచున్ మెడఁ బట్టి నూకఁగా
నాసను జూరు పట్టుకొనినట్టులఁ బోక పెనంగి యాడెడిన్. 42

క. అన విని వనిత గిరుక్కున
ఘనమణితాటంకరుచులు గన నటు మోమై
[3]విన న ట్లుండిన మరలం
జని శౌరిని జేరి మిగుల సంభ్రమ మొదవన్. 43

చ. ఇదె సమయంబు రమ్మనిన నింతుల నెంతొ తొలంగఁ ద్రోయుచుం
బదిల మెసంగ లోనఁ జని పావలసద్దులు గండపెండెపున్

రొదల నడంచుకొంచు మదిలో భంగుసంభ్రమముల్ చెలంగఁగా
మదనునిఁ గన్నమన్నెదొర మౌనముతోడుతఁ బోవ ముందటన్. 44

సీ. నునుపచ్చరాకట్టుపనిగీముల గడంగి
రవ మేది యుండు పారావతముల
మగరాలఁదగుగూళ్ల మరగి తలల్ వంచి
పలుకు లాడక కూర్కు చిలుకగముల
జిలుఁగుకెంపులయంత్రములమేఁత లంటక
చాల సోలుచుఁ దూలుశారికలను
బటికంపుజగతుల నటనముల్ చాలించి
సారె వేసారు మయూరములను
తే. బాలశశిరేఖకు ముడుంగుపద్మినులను
వల్లకీవేణుమురజాదివాదనముల
జోలిమాలినచెలియలఁ జూచి చూచి
తెఱవకోపము వానిచేఁ దెలిసికొనుచు. 45

ఉ. ఏ మని పల్కునో చెలియ యేవహి నుండునొ యెట్టు లెంచునో
యే మని పల్కఁగా వలెనొ యే నపు డే మన నేమి వచ్చునో
కాముఁడు తోడు గావలయుఁ గల్కికి మాకును జర్చ లేక మున్
బ్రేమలఁ గూడఁ గల్గునొ యరే యని నెమ్మదిఁ జింత సేయుచున్. 46

ఉ. గోపవతంసుఁ డీపగిదిఁ గొంకి తొలంగుచుఁ బోయి రాధికా
గోపిగృహంబుఁ జేరునెడ గుండియ భ గ్గన మెల్ల మెల్లఁగా
లోపలి కేగి యచ్చట సరోజరిపూపలవేదిశయ్యపై
గోపము గొన్న యాకుసుమకోమలినిం గని మేను ఝల్లనన్. 47

చ. పదములదండ నుండి భయభక్తు లెసంగఁగఁ జుట్టి కెందొగల్
పొదలెడువీవనన్ జలువ పుట్టఁగ వీవఁగ దానఁ జానకున్
మదిని దురాపకోపశిఖి మట్టుక మీఱ మురారి ధీరుఁడై
మృదుమధురోక్తులన్ బలికె మీనవిలోచన నెన్ని తిన్నఁగన్. 48

చ. జలకము లాడ వేమి నునుచల్వలు గట్ట వ దేమి మోమునం
దిలకము దిద్ద వేమి జిగి దేరెడిసొమ్ములు పెట్ట వేమి మై
గలప మలంద వేమి వగగా విరిజాజులు పూన వేమి నా
వలనను దప్పు లేమి మగువా వివరింపు మెఱుంగ వేఁడెదన్. 49

సీ. అలసూర్యబింబ మై యలరునీనెమ్మొగం
బలసూర్యబింబ మై యలర నేల
మారుశరంబు లై మీఱునీచూపులు
మారుశరంబు లై మీఱ నేల
ప్రబలదుర్గంబు లై ప్రబలునీగుబ్బలు
ప్రబలదుర్గంబు లై ప్రబల నేల
యరిదిబంగార మై యమరునీమైజిగి
యరిదిబంగార మై యమర నేల
తే. చూడఁ గూడని నీరూపు చూడ కెసఁగె
నేటి కేటికి నెరయంగ నెరుక పడఁగ
నింతయలుకకుఁ గారణం బిది యటంచు
మందలింపుము నాయాన మందయాన. 50

సీ. మన కెన్నడును రాని మౌన మిప్పుడు పూని
మాటాడ వేటికే మధురవాణి
నీకు నాకును గాని నేరంబు మది నాని
మనసియ్య వేటికే మధుపవేణి
యరమరికెలు పూని యానేస్తములు మాని
మొగ మేల చూపవే చిగురుబోణి
నిన్ను నమ్మినవాని న న్నెక్కడను లేని
యగ డేల చేసెదే యబ్జపాణి
తే. మారుఁ డదె కానితన మూని పోరెఁ బోని
నీదు పుణ్యానికేని నే నేరనేని

గాని మఱి దాని కేమి నీవై నఁ గాని
కరుణఁజూడఁగ గాదె యోమరునితూణి. 51

క. పెంచినదానవు దానిఁ గ
దించినదానవును నీవె తెగి మమ్మటకుం
బంచినదానవు నీవే
మంచిది మఱి నీవె యలుగ మర్యా దటవే. 53

ఉ. నేరము లున్న నోర్చి నను నిబ్బరపుంజనుదోయిఁ జేర్చి బల్
కూరిమి మోవి నొక్కుచును గుల్కుచుఁ బైకొని వేడ్కఁ బావురా
దారిగఁ బల్కుచుం జిఱుతతాఁకుల నూకులఁ బైసరంబులన్
సారెకుఁ గూడి నామనసు చల్లఁగఁ జేయవె మున్ను కోమలీ. 54

సీ. సకియ నీకీల్జడ సరి వచ్చె నని కదా
మించి కాళియుని మర్దించు టెల్ల
నింతి నీబొమ్మల కెన వచ్చె నని కదా
విడక కంసునివిల్లు విఱుచు టెల్లఁ
దెఱవ నీచనులకు సరి వచ్చె నని కదా
గిరివరంబును బెల్లగించు టెల్ల
సతి నీనితంబంబుఁ జత వచ్చె నని కదా
మున్ను బండిని గూలఁ దన్ను టెల్ల
తే. వనిత నీయానమున కెన యనుచుఁ గాదె
కువలయాపీడమును బట్టి కొట్టు టెల్ల
నట్టినను న్యాయమా యిట్టిరట్టు సేయ
నరయు మదిలోన నీవైన హంసయాన. 54

చ. చెలిమిని జిన్ననాఁడె నను జేరఁగఁ దీసి విరాళి గొల్పి నీ
పలచనిమోవిచక్కెరలుపానక మానఁగ నిచ్చి నిండుకౌఁ
గిలి నిడి చొక్కఁ జేసి మరుకేళుల రా పొనరించి యిట్టు లీ
వల వలదన్నఁ బోవుదునె వాదుకుఁ దీయక రాధికామణీ. 55

సీ. మన కిద్ధఱికి మున్ను మఱుఁగుగా నడిచిన
మరునిముచ్చట లన్ని మఱచినావె
వదలితి చీర నాయెదుటనే బిత్తల
ననఁ జూడఁ బో కని నగితి వీవె
చెంబు పట్టుకొని చేసినపను ల్మఱచితి
చిన్నవాఁ డంటివి చింత యేమి
పంగుగా నీతొడపయి నన్ను నెక్కించి
నాకు నుబ్బస మెత్త నవ్వి తీవె
భ్రాంతి నాకను లెఱ్ఱఁబాఱుట గని నీవు
నిట్టూర్పు లిచ్చితి వట్టె యపుడు
తే. తిరిగి నీవేల బొల్లెమే స్థిరము పఱచి
చెప్పరానివి మఱి కొన్ని చేసి తీవె
మనకు జరిగిన చేష్టలు మఱచినావె
అమ్మతోఁ జెప్పఁబోకు మటంటి వీవె
మరులు కొల్పినదానవే మగువ నన్ను
నహహ! యిప్పుడు విడుచుట న్యాయమటవె. 56

చ. ఒకపరి నీకడ న్నిలిచి యుండినఁ జాలదె యొక్కసారి నీ
సొగసుమిటారపుంబయటఁ సోఁకినఁ జాలదె యొక్కతేప నీ
పగడపుమోవిపానకము పానము చేసినఁ జాలదే తపం
బొగి ఫలియించె నంచు మది నుందుఁ గదే జగదేకసుందరీ. 57

మ. అదిరా వింతవిధం బ దౌర తమకం బాయంద మింకొక్కమా
ఱది బా గాయె నటంచుఁ గన్ మొగిచి నీ వర్ధోక్తులన్ మెచ్చఁగా
మది నుప్పొంగుచుఁ బ్రక్కమార్పులను బ్రేమన్ మోహము న్మించ ని
న్మదనానందరసాబ్ధిఁ దేల్చెదను గొమ్మా సమ్మతింపం గదే. 58

సీ. అందె నైతే కదా యరవిందముఖ నేను
జేరి నీపదసేవఁ జేయుచుందుఁ

జీర నైతే కదా చెలియరో నీఘన
జఘనోరుసౌందర్యసరణిఁ గందు
రైక నైతే కదా రమణి నీసిబ్బెంపు
మెఱుఁగుచన్గుబ్బలమేల్మిఁ గందు
ముంగ రైతే కదా మోహనాంగిరొ నీదు
సొలపుటూర్పులగాలి సోఁకి యుందు
తే. నహహ విత గాఁగ మీనకూర్మాదిరూప
ములను దాల్చితి వెఱ్ఱి నై ముద్దుగుమ్మ
తొల్లి యీచింత యొక్కింత తోఁచదాయె
గతము లగు కార్యములకిప్డు కలఁగ నేల. 59

చ. చెలిమి యొనర్పవే మనవి చేకొనవే మొగ మెత్తి చూడవే
పలుకవె చేర రావె ననుఁ బ్రక్కను జేర్పవె యాదరింపవే
వలపు గణింపవే మరుదివాణము నంటెద సమ్మతింపవే
నిలువ తరంబు గాదు కరుణింపవె న న్నిఁక భామినీమణీ. 60

చ. పొలఁతిరొ నీవు పంప నటు పోవుటమాత్రమె కాని దానిపైఁ
జెలిమి యొనర్ప లే దనుచుఁ జెల్వగుకీల్జడచిల్వఁ బట్టి మే
లలర నితంబభూమితల మంటి ముఖద్విజరాజు ముట్టి నా
నిలకడ లెల్లఁ దెల్లమిగ నీయధరామృత మాని తెల్పెదన్. 61

క. ఇంతీ పూబోణులమేల్
బంతీ సేమంతివిరిరువారపుబంతీ
కంతునిపట్టపుదంతీ
పంతమె నాతోడ నీకు వలపుల దొంతీ. 62

క. అని యెంత వేఁడుకొన్నను
జన వియ్యని చెలిని జూచి సారసనాభుం
డనియె మది దిటము దెచ్చుక
వినయము నునుకినుక వలపు పెనఁగొని తొలుకన్. 63

ఉ. మారుఁడు చూడ నావరకుమారుఁడు బావమఱంది రాజు నా
పేరిటి వాడు మాధవుడు పేర్మిని బ్రాణపదంబు గాలి నన్
వీ రిఁక నేమి సేయుదురొ వేమఱుఁ జూచెద నీదుకోస మ
వ్వారిగ వారె బాము లిడి ప్రాణము దీసిన నిచ్చెదం జెలీ. 64

చ. నెలఁతరొ నిన్ను నమ్ముదునె నీదుకురుల్ కుటిలమ్ము లాయెఁ జూ
వులు చపలమ్ము లాయెఁ గనుబొమ్మలు వక్రము లాయెఁ గబ్బిగు
బ్బలు కఠినమ్ము లాయె మఱి భావము కర్కశ మాయె నాపయిం
గలుగుట యెట్లు నీకు దయ కన్గొనవే మది నంగనామణీ. 65

క. చిగురువిలుకానిశరములు
తగ వెన్నునఁ దూరి నేను దల్లడపడఁగా
సొగసారి యింత యోర్తురె
నగినం దగుపాటి గాక నాళీకముఖీ. 66

సీ. వలచి పాయుట పగవారికైనను గాదు
[4]మునుపుగా నన్నది మనమె కాదొ
కవఁ బాసి బ్రతికిన కాంతలఁ గాంతుల
నటు మెచ్చనిది మన మౌనొ కాదొ
మనకూటమికి నాడుకొనెడువారలకన్ను
బొడిచినరీతిని నడువలేదొ
యుదయాస్తమయముల మదిలోనఁ దలఁపక
గడియకు పలుమాఱు కలియలేదొ
తే. యిప్పటిఋణానుబంధంబు లిట్టు లుండె
నైన నేమాయె నేమైన నైనఁ గాని
సుఖముగా నున్న నెపుడైనఁ జూడవచ్చుఁ
బోయి వచ్చెద సెలవిమ్ము పువ్వుఁబోఁడి. 67

చ. అనఁ గుబుసంబు నూడ్చినమహాభుజగాంగన నా ముసుంగు తె
ప్పునఁ బెనవేసి లేచి ముడిబొమ్మ లెసంగఁ గటంబు లుబ్బఁగాఁ

గనుదొగ లెఱ్ఱవార ముఖకంజము జేవురు దోఁపఁ జెమ్మటల్
కనఁబడఁ గావిమో వదరఁ గామిని పల్కె దురాపకోప యై. 68

ఉ. ఎవ్వరు పిల్చి రిచ్చటికి నెందుకు వచ్చితి వేమి కార్య మే
నెవ్వతె నీ వెవండ విఁక నెవ్వరి కెవ్వరు దేని కేది మీ
జవ్వని విన్న రవ్వ లిడుఁ జాల్తడ వాయెను వచ్చి లేచి పో
నవ్వెద రెల్లవారలును నన్నును నిన్నును గోపశేఖరా. 69

చ. నిలుకడ సున్న తాల్మి నహి నేస్తము దబ్బర మాట పద్దులే
వలపు హుళక్కి యాన లుసి వావులు పైపయిమేల్మి నీదునీ
తులు మెలమెచ్చు లాదరణ దూఱు దయ ల్సట నమ్మవచ్చునే
యిల మగవారిఁ దన్మహిమ లెన్నఁగ శక్యమె యందులన్ హరీ. 70

చ. కపటులు క్రూరచిత్తులు స్వకార్యపరుల్ కరుణావివర్జితుల్
చపలు లసత్యభాషణు లిల న్మగవారలు వారిలోనఁ గొం
చపునెరతుంటవింటివగసామివి దేవర నీకు నాపయిం
గృప మఱి యేటికి న్గలుగుఁ గృష్ణ హరీ నవనీతచోరకా. 71

చ. మలఁకలమాట లిందు బహుమానము లచ్చట గచ్చు లిచ్చటన్
దలఁపులు దాని పైని బలుతప్పులు నాపయి నేస్త మాడఁ బే
రలుక మ ఱీడఁ గూర్మివగ లక్కడ నిక్కడఁ దక్కు లద్దిరా
తెలియఁగ వచ్చె నీనడత తెల్లముగా విటలోకనాయకా. 72

చ. వలపులతిట్లు కొట్లు రతిపద్దులు నబ్బినచోట ముద్దులుం
గలుగఁగఁ బోదు నాయెడనె కాని మఱెక్కడ నంచు నుంటి చాల్
నలుగురిపట్ల నీ కిదియె నైజ మటంచు నెఱుంగనైతి హా
నలువశిరంబు ముట్టినను నల్లనివానిని నమ్మవచ్చునే. 73

ఉ. ఏమని చేరెనో చెలిమి యింతి రవంతయుఁ జింత సేయకే
వేమఱు నీదుపాలఁ బడి వేఁడి పెనంగిననాఁటనుండియున్
బాములె కాని సౌఖ్య మొకపాటిగ నైన నెఱుంగనైతి రా
రామునిఁ బొందురామక్రియ రామునిసోదరుఁ డౌదు వన్నిటన్. 74

ఉ. అప్పటిరాధ వేఱె మఱి యప్పటికృష్ణుఁడు వేఱె చూడ నేఁ
డిప్పటిరాధ వేఱె కన నిప్పటికృష్ణుడు వేఱె యింక నే
లప్పటిమాట లానడత లాతగు లాకొఱ లేనికూటముల్
ముప్పునజవ్వనంపుసుఖముల్ దలపోసిన నేమి శ్రీహరీ. 75

ఉ. అప్పుడు మళ్లి నామనసుకై నటు లాడుచుఁ జేరి కన్నులం
గప్పుక బాస లిచ్చి దయ కన్పడ నీవె విరాళి గొల్పఁగాఁ
దప్పక నీవె నే ననుచుఁ దద్దయు నమ్మితి నాఁడునాఁడె నిన్
గప్పయెలుంగుచిల్వవని కాంతుఁడ నే నెఱుంగనైతిరా. 76

చ. తొలుతను జీమ కుట్టునొకొ దోమలు గుట్టునొ యంచుఁ జూచి నే
నెలమిగ నెత్తి పెంచి నిను నింతటివానిగఁ జేయు టెల్ల నీ
చెలియల కొప్పగించి వెతఁ జెందనొ కూడి సుఖంబు లందనో
వలనుగఁ దెల్పు మీ వయిన వైనము గాఁగ మురాసురాంతకా. 77

క. విషకంధరునెచ్చెలి వై
విషకుచచనుబాలు గ్రోలి విషనిధిలోనన్
విషధరుపైఁ దగునీదగు
విషమగుణం బేల పోవు విషరుహనయనా. 78

సీ. ధర బెస్తనేస్తంబు తొరసాలెపద్దులు
వెలయాలికూరిమి విటులనీయమ
మగసాలెనిజమును జగలోభియీవియుఁ
గలుబొమ్మగిలిగింత కాకితెలుపు
గోమటిసత్యంబు గొల్లనిరసికత
కాముకజనులజ్జ ఖలునికరుణ
చోరస్వదేశంబు జూదరిధర్మంబు
తగవరిమోమోట మలసునిరతి
తే. గగనకుసుమంబు గొడ్రాలుకన్నబిడ్డ
శశివిషాణంబు దుర్బీజజాతుఘనత

పంచమశుచిత్వ మల్లునిమంచితనము
గలదె ని న్ననఁ బని యేమి కలికికృష్ణ. 79

తే. వాతె రానుచుఁ జెలిఁగూడువారు లేరొ
ప్రక్క బాయక సతి నేలువారు లేరొ
వనిత నైక్యము గొని పొర్లువారు లేరొ
వారు నీదారి మెడఁగట్టుకోరు గాని. 80

సీ. గోముఖవ్యాఘ్రమై గుదిగొనుమాయత్త
వదినగారికి మాఱు పలుకరాదు
మగఁ డైతె యేవేళ మండుచునుండును
మామగా రంతకు మంట్లమారి
పెదబావగా రైతె బెబ్బులివలె దూఱుఁ
బినబావ చేకత్తి పెట్టఁ డవల
నిరుగుపొరుగువారలే యమదూతలు
తోడికోడలి కెదురాడఁ గూడ
తే. దన్నదమ్ములు గన మేఁకవన్నెపులులు
సొరిది నిందఱికనుగట్టి సున్నఁబెట్టి
నేను నినుఁ జేర నీవందు దానిఁ గోర
బ్రతుకు బాగాయె ధూర్త గోపాలరాయ. 81

క. అల్లందు కందుకొని నీ
బెల్లింపులఁ బడినమొదలు పెనుబాములకే
యి ల్లయితి నరసి చూడఁగ
గొల్లనితోఁ బొందు చెలికిఁ గొదవే కొదవల్. 82

కం. మును నిన్నుఁ గోరి చేరిన
దనుజాంగనముక్కు పోయె ధర నని తెలియన్
విని కని వలచితి ననుచో
నిను దూఱఁగ నేల నన్ను నే ననక హరీ. 83

సీ. మును మున్ను కొన్నాళ్ళు మన మున్నయద్భుతం
బదివిప్పి చెప్పఁగా నలవిగాదు
తవిలి కొన్నిదినంబు లవల నభేదమై
మెలఁగితి మెడలేనిమేల్మి యెసఁగ
నంతట నీవు నే నని కొన్నివారమ్ము
లమరితి మిద్దఱ మగుచు వెలసి
యిప్పుడు ముగురమై యీనలుగురిలోన
విను కాఁపురము మూడువిధము లాయె
తే. నేమిటిసుఖంబు లిఁకమీఁద నేటిబ్రతుకు
లేటివఱదలఁ బోయె నీమాట లెల్ల
నూర కిటు రవ్వ లిడి సరివారు నవ్వ
వసుధపైఁ దారి నే నుండవలెనె శౌరి. 84

సీ. ఎనలేనిప్రేమ నీ వెపుడు వత్తువొ యంచుఁ
దలవాకి లిల్లుగా నిలిచియుంటి
రమణ నవ్వుచు నీవు రాఁ జూతునే యంచుఁ
బడఁతుల శకునంబు లడుగుచుంటి
ములు సోఁక కీవు రావలెఁ జేర న న్నంచుఁ
గులదేవతల నెల్లఁ గోరుకొంటి
నేరీతినైన నీ విటు రాకపోవంచు
నిలువని ప్రాణముల్ నిలుపుకొంటి
తే. మరునివెడవింటిపాల్పడి యెరుక గంటి
నిపుడు నిను గంటి నీమాట లెల్ల వింటి
విడుము మిఁకఁ దొంటిపోకలు నడువవంటి
దంటయిళయింటికే పొమ్ము తమ్మికంటి. 85

సీ. నీదుముద్దులగుమ్మ నీమోవి నొక్కితే
కటకటా నామది కందనేల

నీప్రాణనాయిక నీచెక్కు గీటితే
కనలి నామది చుఱుక్కనఁగనేల
నీదుచక్కెరబొమ్మ ని న్నెంచ కాడితే
పొగిలి నామది చిన్నవోవనేల
నీదుపట్టపుదేవి నిను చాల నెనసితే
యుడుగక నామేను బడలనేల
తే. నీదుదొరసానిచనులచే నీయుగంబు
నొగులఁ గ్రుమ్మిన నామది నొవ్వనేల
దానిసొమ్ముల కెవ్వతెఁ దలఁచిచూడ
వలపు పగవారికైనను వలదు కృష్ణ. 86

తే. మున్ను జతగూడి వెంటనే నిన్ను వీడి
ప్రాణములు చేర నిన్నాళ్లు పట్టె నౌర
మరల నినుఁ బొంది పోయిన మరులు చెంది
జాలిఁ బడజాల నందగోపాలబాల. 87

క. ఈనాటివఱకుఁ గానని
యీనాయత మెల్లఁ గంటి నీనానినుఁ దా
నీనం గాచియు నిళకే
యీ నాయెను నింక నాస లేల మురారీ. 88

సీ. కావేటికాల్వలై కనుఁ బాఱుకన్నీరు
వారక తుడిచెడువారు లేక
విరహాగ్నిశిఖలచే వేగుచుఁ బొరలాడ
నూసూరడిల్లుమ యనువారు లేక
దిగులుచే నిలలేక తెగువ నేఁ జేయుచో
వలదని పలికెడువారు లేక
మరుకోల లెద నాటి నెలకొట్టు కాడఁగా
భయపడవద్దనువారు లేక

తే. కలఁగి మోహాబ్ధిలో మున్గి గాలిసోఁక
గట్టు గానక యుంటినే గాసిపడెడి
నాఁటికే లేనిమఱి నీవు నేఁటి కేల
చాలతడవాయె లెమ్ము గోపాలరాయ. 89

క. మానమె ధనముం గేహము
మానమె సర్వంబు చూడ మానవతులకున్
మానము పోయినవెనుకం
బ్రాణముతో నుండవలెనె పద్మదళాక్షా. 90

తే. అన్ని యిటు లాడఁ గాంచి మురాసురారి
రమణి దాసరితప్పు దండమునఁ దీరుఁ
దీరుమాన మటంచని తెఱవపాద
పద్మముల వ్రాలె నళి తమ్మి వ్రాలినటుల. 91

క. కని మంజీరము ఘల్లన
వనజజరుద్రాదివిబుధవరసేవ్యంబై
తనరినహరిశిర మచ్చో
సనజేక్షణ ద్రోచె వామపాదముచేతన్. 92

క. లేచి యదూత్తముఁ డనుఁ జేఁ
జాచియ నాజన్మ మిపుడు సఫలంబాయెన్
నీచిన్నిపదము నొచ్చెనొ
నాచికురభరంబు దాఁకి నాళీకముఖీ. 93

జ. నెలఁతరొ యాలకించు తొడనిగ్గు తళుక్కనఁ జీర జాఱఁగాఁ
గులుకుమెఱుంగుగబ్బిచనుగుబ్బలు పొంగఁ బసిండియందియల్
ఘలుఘలుఘల్లనం జరణకంజములన్ గొని తన్నినంత మై
ఝులుఝులుఝల్లనం బులకజాలము లెత్తె నదేమి తెల్పుదున్. 94

సీ. చేతుల మెఱుపుల చెన్ను లెంతైనను
దొడలఁ జెందిన నిగ్గు నడుము మేలు

గబ్బిగుబ్బలపెంపు కలుము లెం తైనను
బిఱుఁదులనెరిమిన పెంపు మేలు
కనుబొమపైఁదగుఘనఫాల మెం తైన
నునుబొత్తికడుపుకందువలు మేలు
పలికెడుపెదవులఁ గలయెఱు పెం తైనఁ
బలుకని యలచోటిపొలుపు మేలు
తే. పైకి నెగిరినచీరయె యాకసంబు
మిగుల నాలోనిద్రవమె పో గగనగంగ
యౌర నూఁగారురేకయే కారుమొగులు
వనిత యాలింగనసుఖంబె వర్షఫలము. 95

చ. చులకనఁ జేసి నన్ వలపు చూఱలు వుచ్చిన వీడ నాడినం
బలికినఁ బల్కకుండినను బాలను ముంచిన నీట ముంచినం
జెలి మిఁకఁ జాలు పొమ్మనినఁ జేరఁగఁ బిల్చినఁ బిల్వకుండినన్
భళిభళి యౌను గా దనినఁ బాయుదునా నిను రాధికామణీ. 96

వ. అనిన విని. 97

కం వనజాక్ష యింత చేయఁగ
మన సొగ్గెనె యంతె చాలు మానము కన్నన్
విను ప్రాణ మేమి ఘన మగు
నని యీసును వలపు కోప మదనము గాఁగన్. 98

ఉ. అందపుపైఁటకొంగు వదనాబ్జముపై నిడి శౌరి చూడ నా
యిందునిభాస్య యేడ్చె నెలుఁగెత్తి కలస్వన మొప్ప వెక్కుచున్
సందగుగబ్బిగుబ్బలను జాఱెడుతన్నయనాంబుపూరముల్
మందరమేరుశైలముల మాటికిఁ బాఱుఝరంబులో యనన్. 99

చ. చెలి యటు లేడ్వఁ జూచి హరి చేరి పదంబులు పట్టి కూర్మిచే
మెలఁతరొ యేడ్వనేల నిను మించినవాఁడనె గోప మంతఁగాఁ
గలిగిన నన్నుఁ జేయఁ గలకార్యము లన్నియుఁ జేసికొమ్ము నే
తలఁపఁగ నీదుసొ మ్మనుచుఁ దా బలిమిం గొని కౌఁగిలించినన్. 100

ఉ. అంతఁ బడంతి మై మఱచె నంబుజనాభుఁడు మోవి యానె సీ
మంతీసి చక్కు నొక్కె హరి మర్మము లంటె మిటారి ముద్దిడెన్
కాంతుఁడు గోట మీటెఁ జెలి కన్గొనె వెన్నుఁడు నీవి విప్పె నా
కంతునిదంతి తారసిలెఁ గమ్మవజీరునిపోరుకున్ వడిన్. 101

వ. ఇ ట్లనంగసంగరోత్సాహతరంగితాంతరంగు లై రాధామాధవు లొక్కరొక్కరి చక్కనినెమ్మేనికమ్మనెత్తావుల సొమ్మసిల్లుచు ముమ్మరం బగుమోహంబుల నెమ్మదిం జెంది రందు నందు సోదరీరత్నం బవాంతరలజ్జాభరంబునుంగొన మందరధరుం డమందానందంబున నందం బగుచెందొగలవిందుచందంబును డిందుపఱచు సుందరమందస్మితవదనారవిందంబునం గ్రందుకొని ముద్దువెట్టినం బెట్ట నీయక నిద్దంపుటద్దంబున కుద్ది యై తద్దయు నొప్పు ముద్దుచెక్కుల నొక్కిన నొక్కనీయక కప్పుగాఁ గప్పుకప్పులం గుప్పుగొప్పనెరికొప్పు నిమిరిన నిమరనీయక చొక్కంపుకెంపుసొంపుసంపాదించు తావిచెంగావిమోవి యానిన నాననీయక కట్టాణిముత్తియంబులతీఁగెమోడికుట్టుపనులఁ గనుపట్టు కెంబట్టురైకకుం బట్టుచాలక మట్టుమీఱి గుట్టు బయటఁబెట్టుగబ్బిసిబ్బెపుటుబ్బుగుబ్బచనుగుబ్బలం బట్టినం బట్టనీయక రంగుబంగరుదింటెనవిరివెంటనంటుతుంటవింటిదంటయింటి నంటిన నంటనీక మించుమించన మించుక్రొమ్మించు మెయిదీఁగె కౌఁగిటఁ గదియించినం గదియించనీయక దాపురంబులు వెట్టుచు నలయించిన నలయించువిలుగొన్నమన్నెదొరం గన్న న్నయాయన్నులతలమిన్న నొంటికళ లంటి సొక్కించి వితాళించి చివచివ లొడవఁ జివుకు చివుక్కునం బైకెక్కి నిక్కి చక్కెరమోవి నక్కజంబుగఁ జుక్క లేరుపడఁ జుఱుక్కున నొక్కి మక్కువ నెక్కొనం జెక్కిలి గొట్టి మదదంతిపై మంతుకెక్కుమావంతుటెక్కున సొక్కు దక్కి గిలుకలచప్పరకోళ్ళమంచపుహళహళలును వెలిపక్కిరెక్కదూది త్తలో నత్తమిల్లుకీచుబుఱ్ఱలకూతలును సురతశ్రమంబుల నెదల గమగమవలచుగోరజవాదిప్రోదినెత్తావులు ఘుమ్ముఘు మ్మనం గ్రమ్మ బిసబిసవిసరెడిహొసపరిసురటిపిట్టల రెట్టచప్పుడులును బకదారులమ్రోఁతలును సారసకోకిలములకివకివలును గుక్క తిప్పక కొక్కోకశాస్త్రమ్ముం బ్రసంగించుకలికిచిలుకలకలకలంబు లం గప్పినపరవశమ్ములం దప్పి చమురుసామువరుస లెత్తి యిచ్చుగోరవంకల యెలుఁగులును నిచ్చలపుముచ్చటలం బెచ్చుపెరుఁగ మెచ్చు లిచ్చురాయంచలవళావళులును గళరవమ్ములును మంజుమంజీరఝళంఝళధ్వనులును విడకు విడువకు తడఁబడకు మెడమిడక విడివడి తొడఁబడ నదుమదుము మనునుడువులును ఘనజఘనసంఘట్టనాచటచటాత్కారంబులు తోరంబు లై మీసరంబు లగుపైసరంబు లెత్త నాబిత్తరి తత్తరిలక హత్తుకొని తళుకుతళుక్కు మనుచిలుకతేజీవజీరుహజారంబునం దమి చిలుక నెదురొత్తు లిచ్చుచు సాటిలేనిమేటిగోటిపోటులం జొత్తిల్లు కొతనెత్తురుల మతిల్లుబిత్తరపుగుత్తంపుచనుగుత్తు లెద నొత్తి యిరుఁగేలు సాచి కంబుధరుగళంబును గౌఁగిలించి మోము మోమునన్ జేర్చి తన్మధురాధరసుధారసధారలం గ్రోలి తియ్యనిరుచులం దేలె నిట్లిరువురు నొడలడరఁ దొడరిదుడుకు లదరింపులు భ్రూభంగంబులను చిఱుసన్న లుద్దవిడిపద్దు లగ్గలికెతాకునూకులు వీఁకమీఱ బాహాబాహిం గచాకచిం బెనంగుచుఁ జెంగట నెసంగు భర్మనిర్మితచిత్రరత్నరత్నమాలికాయంత్రపాంచాలికాహస్తవిన్యస్తమల్లరంగసముల్లసితమల్లవల్లభుల దండి వెనుదండివిడక న్యస్తసువర్ణవర్ణనీయసుగంధబంధురసుమతాళవృంతోద్ధూతహతప్రవర్ధితాగురుధూపధూమస్తోమంబు లెగిరి నిగనిగ మనుజిగిమొగులనఁ గప్పుకొని యన్యోన్యానలాలోకనోత్సాహమోహంబుల నించుక యపనయింపఁ బునఃపరస్పరదర్శనోద్యోగవేగంబులంబుట్టి బెట్టునిట్టూర్పుగాడ్పులం గొట్టువడి యెట్టకేలకుం దెట్టగిలి నెట్టన మొగంబులు చూచుకొని తడవెడసి యొడఁ బడినజక్కవపక్కులమక్కువ లంది యిం పొందం. బొందు చౌశీతిబంధప్రతిబింబంబుల ముకురంబులం గని సంకుచితమందహాసంబుల నిరపొందుచుఁ బెనంగు సమయంబున. 102

క. హత్తుకొని యిన్నివిధములఁ
దత్తరపడ ననఁగి పెనఁగి తనివారక యా
బిత్తరి పైకొనె హరిపై
మత్తేభముమీఁద నెక్కు మావంతుఁ డనన్. 108

సీ. మరుగుడారముఁ బోలె గిఱికొన్న నెరికురు
ల్గ్రమ్మిమున్దోచుచీఁకటులు గాఁగ
జలజల మని రాలు సన్నజాజులచాలు
చీలి వ్రాలెడురిక్కచాలు గాఁగఁ
జిఱుకమ్మచెమ్మట ల్నెరిఁ దోఁచుఫాలంబు
రేఱేనిచిన్నారిరేక గాఁగఁ
గరఁగి జాఱినసిస్తు కస్తూరితిలకంబు
క్రందుగాఁ జెలు వందుకందు గాఁగఁ
తే. వలపు చిఱునవ్వు లలతివెన్నెలలు గాఁగ
నాశలను బెంచి కాననియంద మూని
కృష్ణపక్షరీతి నాకృష్ణవేణి
కృష్ణదేవునిపై నుండి కేళి సలిపె. 104

సీ. చెండు గోరించిన దండిగాఁ బైనుండి
కుఱుచసన్నలఁ బడుఁ గొంతసేపు
గాలి చక్రముఁ జుట్టుకరణిని దిరుగుళ్ల
వింతగాఁ దిరుగును గొంతసేపు
పసిడిజంత్రపుబొమ్మపగిది విన్నాణముల్
కులుకుచు నటియించుఁ గొంతసేపు
తుద నాడుబొంగరం బిది నాఁగఁ గసి దీఱఁ
గంతుశివం బాడుఁ గొంతసేపు
తే. అభినయము పట్టు మని చెక్కు నమరిఁ గొట్టు
ముద మొదవఁ దిట్టు ముద్దుపై ముద్దు పెట్టు
మర్మములఁ గొట్టు మెలమెల మబ్బు దట్టు
బాల హరిపైని బుంభావకేళి వేళ. 105

చ. సరసిజగంధి యీపగిది శౌరిని గూడుక కౌఁగిలింపఁగా
గిఱికొని ముత్యపున్ సరులు కెంపులదండలు ఝల్లు ఝ ల్లనన్

బెరుగుచు రాలె ము న్మరుఁడు పేర్చినమల్లియతూపుగుంపు త
ద్గురుశిఖవిస్ఫులింగములఁ గూడుక రాలినలీల దోఁపఁగఁన్. 106

వ. అట్టియదనున మదనజనకుం డామదవతిం జూచి యిట్టు లనియె. 107

సీ. వలుదగుబ్బలగోరువంక లేడవి రాధ
యవి నీ వెఱుంగుదు వంబుజాక్ష
చక్కెరకెమ్మోవి నొక్కు లేడవి రాధ
యవి నీ వెఱుంగుదు వమరవంద్య
మిసిమిఱెప్పలఁ దమ్మరసము లేడవి రాధ
యవి నీ వెఱుంగుదు వాదిదేవ
తగువెన్నుసరిపెనదండ లేడవి రాధ
యువి నీ వెఱుంగుదు వతనుజనక
తే. యనుచు నిరువురు గడిదేరి హవుసుమీఱి
యాని సరిపోరికెమ్మోవు లానఁజేరి
తమి చెలఁగం జీరి యలకేరజములఁదారి
[5]కోరి మరుబారి నలసిరి కొమరు మీఱి. 108

సీ. రమ్యబృందావనారామసీమలయందు
[6]నతులితగోవర్ధనాద్రియందు
సత్ఫథోజ్జ్వలరత్నసౌధాగ్రములయందుఁ
దరణిజాసైకతస్థలములందుఁ
బారిజాతలతాంతపర్యంకములయందు
బహుచిత్రకేళికాగృహములందు

మారుతకలితవానీరకుంజములందు
భీమనదీతీరభూములందు
తే. సరసభాండీరవటతరుచ్ఛాయలందుఁ
జారుకరచంద్రచంద్రికాపూరముందు
దేవదేవుండు రాధికాదేవితోడ
గూడి విహరించె మదిలోని కోర్కు లలర. 109

తే. సంపదలు గల్గురాధికాసాంత్వనంబు
చదివినను విన్నఁ గైకొన్నఁ జదువుచున్న
వారి కవ్వారిగా నలవార వారి
జాక్షుఁ డొసఁగును గోరిక లధికదయను. 110

శా. శ్రీలక్ష్మీముఖపద్మషట్పద తనుశ్రీక్షిప్తనీలాంబుదా
లీలామానుషవిగ్రహా ప్రమదలేలీహానశయ్యస్పదా
కాళిందీతట కేళికోవిద మహాకంసాదిదుష్టాత్మదా
కాళీయోరగరత్నరంజితపదా కౌంతేయధైర్యప్రదా. 111

క. సారగదాధార సదా
చార సదాతనువినూత్నచారుతరోద్య
న్మారజితాకారయుతా
ధీరనుతాపారచరితధిక్కృతదురితా. 112

మత్త. నాగపాలక నాగదాలక నాగఫాలకవాహనా
వాగధీశ్వర వాగహీశ్వర వాగనశ్వరగాహనా
యోగచారణ యోగధారణ యోగకారణ సాహనా
భోగశోషణ భోగినీషణ భోగిభూషణమోహనా. 113

గద్యము,
ఇది శ్రీచిన్నికృష్ణకరుణాకటాక్షవీక్షణక్షణప్రవర్ధమానానూనశృంగారరసప్ర
ధానసంగీతసాహిత్యభరతశాస్త్రాదివిద్యాపారంగత శ్రీమత్తిరుమల
తాతయాచార్యపాదారవిందమిళిందాయమానమానసచోళ
సింహాసనాధ్యక్ష ప్రతాపసింహమహారాజ బహూ
కృతానేకచామీకరాంబరాభరణ ముత్యా
లుగర్భశుక్తిముక్తాయమానముద్దు
పళనిప్రణీతం బైనరాధికా
సాంత్వనం బనుశృంగార
ప్రబంధంబునందు
సర్వంబును జతు
ర్థాశ్వాసము.



తే. కృష్ణదేవునియాజ్ఞ నీకృతిని ముద్దు

పళని యను వేశ్య రచియించె లలితపణితి
అధిక శృంగారకావ్య మై యలరియుంట

దీని ము న్ముందుఁ బ్రకటింపఁ బూనినాఁడ.

ఇట్లు,

కోసూరు గురునాథమూర్తి,

స్థాపకుఁడు,

శృంగార కావ్య గ్రంథమండలి.
  1. ల్లాయత్తము న్జేసెనే [మూ.]
  2. జనింపఁగాఁ దెలియ. [మూ.]
  3. నను చూచి చిలుక వేగమె [మూ.]
  4. మహిలోన నన్నది. [మూ.]
  5. కూడి మరుకేళిసలిపిరి కోప మారి. [మూ.]
  6. స్వచ్ఛోదకాపూర్ణసరసులందు. [మూ.]