Jump to content

రాణీ సంయుక్త/పదునేనవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదునేనవ ప్రకరణము

న్యాకుబ్జనగరమందలి వృత్తాంతము లటులుంచి యించుక డిల్లీని గూర్చి విచారింతము. చౌహానవంశస్థుఁడగు పృధ్వీరాజాపురమును బాలించుచుండెనని యిదివరకే తెలిపియుంటిమిగదా! ఇత డార్యమతావలంబకుఁడును, న్యాయపరిపాలకుడును, బుద్దిశాలియు, నతిభోగశాలియునై రాజ్యమేలుచుండెను. ఇతఁడార్యమతమువాఁ డగుటచే సమస్తకులములవారిని వారివారి యోగ్యతానుసారము మన్నించుచువచ్చెను. అందులకు నిదర్శనముగ మనకధా సందర్భమున వచ్చువా రినిరువుర వక్కాణించెదను. ఈశ్వరభట్టను నతఁడు జైనమతస్థుడు. ఇతడు త్రివిష్టపము నుండి చనుదెంచి రాజు నాశ్రయించి మొదట నొకచిన్న యధికారిగనుండి క్రమముగ యుక్తిచాతుర్యములవలన నొకముఖ్యాధికారి యయ్యెను. గొప్పయధికారము చేకూరి నదిమొదలు రాజ్యమునందు కొన్ని దుష్కార్యము లొనరింప మొదలిడి తుదకొకస్త్రీని గామించి యామెకుఁ దనవాంఛ నెఱుంగింప నందులకామె సమ్మతింపదయ్యె. ఇటులుండ నామెభర్తకార్యాం తరమున మఱియొక గ్రామమునకేగి మఱలి స్వగృహమునకు వచ్చుచుండ దారిలో గొందఱు తలారులనుంచి వానిజంపించి యాశవము నీమె యింటిముంగిట వేయించి తెల్లవారినవెంటనే కొందఱు భటులనంపి పతిని జంపినదని యామెందెప్పించి యాసంగతి దానే విచారణసేసి యామెకు మరణదండన విధింప వలసినదిగ జక్రవర్తికిఁ దెలియబఱచెను. చక్రవర్తి స్వయముగ మఱల విచారణచేసి తనకుఁ దృప్తికరముగ ఋజువుకానందున దానిని గొట్టివేసెను. అందులకా బట్టు గారీర్ష్యవహించి నృపాలు నెటులైన రాజ్యపదభ్రష్టునిజేయ మాయోపాయముల వెదకుచుండెను. ఇతని కుట్రల కన్నిటికి నా నగరమందె మఱియొక ముఖ్యాధికార పదవియండున్న కరీమను మ్లేచ్ఛుడు తోడుపడుచుండెను. ఈ కరీమ్ ఆఫ్‌గన్ దేశస్ధుఁడు. ఈ తరుణమున సుల్తాన్ మహ్మద్‌గోరి యనునతడు లాహోరున రాజ్యము చేయుచుండెను. పదునొకండవ శతాబ్దారంభమున మహ్మద్ గజినీ యార్యావర్తముపై దండెత్తి లాహోరురాజగు జయపాలుని నోడించిపోయెను. జయపాలుడు తనకుఁ గలిగిన యపమానము భరింపజాలక తన పుత్రుఁడగు నానందపాలుని సింహాసనముననుంచి తా నడవికి బోయెను. ఎనిమిది సంవత్సరములు కడచిన పిదప మఱల గజినీవచ్చి యానందపాలుని నోడించెను. అనంతర మానందపాలుఁడును దన తండ్రిచేసిన ప్రకారము తనకుమారునకు బట్టముగట్టి పోయెను. తరువాత క్రీస్తు శకము పదివందల నిరువదియొకటవ సంవత్సరమున మఱల గజినీ దండెత్తివచ్చి యానందపాలు పుత్రునోడించి రాజ్యముదనస్వాధీనము చేసుకొనెను. నాటినుండియు లాహోరున మహమ్మదీయరాజ్యము స్థాపింపబడెను. గజినీ మరణానంతరము కూడ నారాజ్యము మహ్మదీయవశమందే యుండెను. పండ్రెండవ శతాబ్దమున సుల్తాన్ మహ్మద్‌గోరీ యనునతఁడు దానిదన వశము గావించుకొని పరిపాలించుచు నార్యావర్తము నంతయు జయింపదలఁ పూనియుండెను. అట్టి తలంపున నీ దేశమందలి వారల కెఱుకలేకుండ గొన్ని చిన్నచిన్న సేనల నక్కడక్కడ నుంచి రాజుల సమాచారము దెలియఁజేయుటకై నిపుణులగు వారి ననేకస్థలముల కంపెను. పైకరీమును నిట్లు పంపబడిన వారిలో నొకడు, ఇతఁ డతికుయుక్తుఁడు. తన పై యధికారుల యెడల నెట్లు వినయముతో నడచుకొన వలసినదియు, వారి కనుల నెట్లు దుమ్ముకొట్టవలసినదియు నితనికి బాగుగఁ దెలియును. చక్రవర్తి మతవివేచన బాటింప కెల్లర గౌరవించునని తెలుసుకొని పురమునందె యొక యధికారిగనున్న నెక్కువ రహస్యములు కనుగొనుటకు వీలగునని యూహించి చక్రవర్తి నాశ్రయించి కొద్దికాలమునకే యొక ముఖ్యాధికారిపదవి నందెను. ఇతడు భట్టుగారు జేయుచున్న కుతంత్రముల దెలుసుకొని యతనికడకేగి తనకు సాహాయ్యపడవలయు ననియుఁ దన కోరికలు నెరవేరినతోడనే డిల్లీయం దర్ధరాజ్య మిప్పింతుననియు వాగ్దానము సేసెను. నాటినుండి వారిరువురి పోకలకు మేరయే లేదు. చక్రవర్తినాశనమై తనకర్దరాజ్యము రానున్నదని భట్టుగా రువ్విళులూరుచు మహమ్మదీయునకుఁ జేదోడు వాదోడుగ మెలగుచుండెను. చదువరులారా! ఈ భట్టుగారివంటి స్వార్ధపరుల మూలముననే గదా యనేక స్వతంత్ర రాజ్యములు మన్నుఁ గలసిపోయినవి. స్వార్ధపరత్వమను గుణ మెంత చెడ్డదియో బాగుగ నాలోచింపుడు. ఈ యవగుణ రాజమును బూనియున్నవాడు. దనకు దాన లక్షలకొలంది. ద్రవ్యమును సంపాదించి బాగుపడవలెనను పట్టుదలగలిగి పరుల కనేకగతుల నపకారమొనర్చుచుఁ దుదకు తాను నష్టపడి దేశమునంతయు నాశనము కావింపఁ బాల్పడుచున్నాడు. ఒకవేళ నట్టికుబుద్ధులకు దాత్కాలికముగఁ గొన్ని సౌఖ్యములు గలిగినను రాఁబోవు నిజ సంతతులకుఁ జెప్పరాని నష్టము గలుగఁజేయుటయే గాని లాభము గలుగఁజేయు టెన్నటికిఁ గాదు. ఎనిమిదివందలయేండ్ల క్రిందటి యీ భట్టుగారివంటి దుర్మార్గుల మూలముననే కదా స్వరాజ్య మన్యరాజ్యమైనది. ఈ భట్టుగారు మొదలగువారి కా దినములలో సౌఖ్యమే కలిగినదని యనుకొందము. కాని దానిఫలిత మాలోచింపుడు. తరువాత వారి సంతతివా రందరు మ్లేచ్ఛులచేత నెన్ని కష్టములందిరో యెవరికెఱుక? ఇప్పటికిని మనదేశమం దీ గుణము పూర్తిగనే పాతుకొని యున్నది. ఎవనికొఱకు వాడు చూచుకొనుటయే గాని పరోపకారమన్న లేశమైన లేదు. తెల్లవారినదిమొద లొండొరుల దూషించుకొనుచు నొకరిపైనొకరు నిందలు మోపుకొనుచుఁ బోరాడు చుండుటయేగాని దేశోపకారముకొఱకు బాటుపడుద మనువారలు మిక్కిలియరుదు. ఇట్టివారలకుఁదుదకు దుఃఖరూపక నరకమే గాక వేరొండుకలుగునా ? స్వార్ధపరత్వమూని దురాశా బద్దులై యెడతెగని మనోచింతచే గృశింపుచు, నుపకార మనుమాటలేక లోభులై, ధర్మహీనులై తుదకు ముక్తికిని దూరులగు చున్నారు. సోదరులారా ! ఇట్టి యిహపరలోకములకుఁ గొఱగాని స్వార్ధపరత్వము నేలత్యజింపరు? మీకుమీకేగాక స్వదేశమును సంఘమును నట్టి భాగ్యవంతముగ జేయ బ్రయత్నింపుఁడు. స్వార్ధపరత్వమును మీహృదయములనుండి పారదోలుడు. ఐకమత్యము వహించి మీదేశక్షేమమునకై పాటుపడుడు. ఇఁక గధాంశమునకు వచ్చెదము. రాజ్యముందు వీరిరువురుదప్ప దక్కిన ప్రధానులు మంత్రులు నక్షౌహిణిపతులు మొదలగువారు తమ ప్రాణముల సహితము జక్రవర్తి కర్పించునంతటి భక్తితో నుండిరి. కాన నతని కేవిధమైనచిక్కులు గలుగకుండెను. పైన వచించిన దుష్టద్వయమునకుఁ జెరియొక దేవిడీకలదు. అందు మహమ్మదీయుడు తనకొఱకై యేతెంచు మ్లేచ్ఛభటులు నగరమందలి తక్కిన యధికారుల కంటఁబడినచో హానియగునని యూరిబైట నాలుగైదు మైళ్ళదూరమునుండి తన దేవిడీలోని కొక సౌరంగము ద్రవ్వించి దానిగుండ దనవారలు రాకపోకలు చేయ నేర్పరచుకొని చేతనైనన్ని కుట్రలఁ బన్ను చుండెను. "ఇంటిదొంగ నీశ్వరుఁడైన బట్టఁజాల" డనునట్లు తస కొలువునందే యుండి యెదుట ముఖస్తుతులు సేయుచు లోలోపలఁ గుట్రలఁ బన్నుచున్న వీరిద్దరినడవడి నెంతమాత్రము గుర్తింపజాలక చక్రవర్తి రాజ్య మేలుచుండెను. ఇటులుండ వేదవేదాంగ షట్చాస్త్రపారంగతుడగు బైరాగి యొకఁడరుదెంచి చక్రవర్తికి దన విద్యానైపుణ్యముం గనుబఱచి మన్ననలంది యతనినానతి కొన్నిదినము లక్కడనేయుండి నృపునకు వేదానుకూలమగు రాజనీతు లుపదేశించుచు మైత్రిని సంపాదించి యేకాంతముగ గొన్ని నూతన వృత్తాంతము లెఱుకపఱచి నిదర్శనములఁ జూపింప జక్రవర్తియు నాశ్చర్యమగ్నుడై వెంటనే బైరాగి మార్గదర్శిగా గొంత నైన్యమునంపి రాజ్యము బ్రధానుల కొప్పగించి జాగ్రత్త గలిగియుండుడని నియమించి తానును మఱింత సైన్యమును గొందఱు దాసీలను వెంటఁగొని వెడలి పోయెను. దుష్టద్వయము రాజునగరమున లేనితరిఁ గొన్ని యల్లరులు చేయగడఁగిరి. కాని ధీవిశారదులగు మంత్రి ప్రముఖులచే నవన్నియు నడఁచి వేయబడెను. కుతుబుద్దీను నడంచిన దీ బైరాగి మార్గదర్శిగఁ బోయిన సేనయే తరువాత వారికి సహాయపడవచ్చిన రాజపురుషుండు చక్రవర్తియని చెప్ప నక్కరలేదు. అప్పుడట్లు కుతుబుద్దీను నోడించి సంపూర్ణజయముతో మూడువేల మహమ్మదీయ ఖైదీల వెంటగొని చక్రవర్తి రాజధానిఁ జేరవచ్చిన వార్త కరీమునకు దెలిసిన వెంటనే యతనికి గలిగిన యారాట మింతింత యని చెప్పనలవికాదు. మొట్టమొదట సైన్యవృత్తాంత మరసివచ్చుటకై పంపఁబడిన చారులు తిరిగిరానందున నేలకో జాగుసేసిరని కరీం మఱి యిద్దర నంపెను. వారును సమాచారము గొనిరారైరి. అందుల కనుమానగ్రస్తుడై రేయింబవళ్లు చింతించుచు నాకులుఁడై యున్న తరుణమున జక్రవర్తి కుతుబుద్దీను నోడించి ఖైదీల దెచ్చినాడన్న వార్త చెవింబడ దొంగలుపడిన కొంపకు నిప్పంటు కొన్నటు లయ్యెను. పాప మా మ్లేచ్చుఁడు నిలిచినచోట నిలువక తనవారితో గూడ మాటలాడుటమాని యెవరేమడిగినను బరధ్యానముగ నుండి సరియగు బ్రత్యుత్తరమీయక పిచ్చియెత్తిన వానివలె శరీరమునం దంతట వేలకొలది తేళ్లు జెఱ్ఱులు పాకినట్లగుచుండ నేమిసేయుటకును దోచక పరస్థలమున కేగివచ్చు చున్న చక్రవర్తి కెదురుబోయి కొనివచ్చుట యటులుండఁ గొలువున కేతెంచినపుడై న నతని దర్శనార్దము వెళ్లటమాని విచారశోకములకుఁ దావలుడై రెండు మూడు దినములవరకు సెలవుగైకొని యింటనే వసించియుండెను. చక్రవర్తి రాజధాని జేరిన మఱుసటి దినమున నొంటరిగఁ దానొక గదియందు గూరుచుండి భట్టుగారిఁ గొనిరమ్మని సేవకులనంప వారు పోయి వచ్చి భట్టుగారు గడచిన రాతిరినుండి గాన్పించనందున వింటి వాఱంద రేడ్చుచున్నారని తెలుప దిగ్బ్రమనంది చెంతనున్న వారి నందఱ నావలకంపి తన కోరికలన్నియు వ్యర్ధములగు సమయము ప్రాప్తించినదని చింతించుచు గూరుచుండియుండెను. అట్లు మతిపోయి కూరుచుండియున్న సమయమున మఱియొక సేపకుఁ డరుదెంచి రాజభటులు దేవిడీచుట్టు గ్రమ్మి తన్ను వెదకుచున్నారని వచింప నుల్కిపడి లేచి చెంతనున్న బాకు నొకదానిఁ గైకొని సొరంగమార్గమున బారిపోవుటకు దొడ్డి గుమ్మము దగ్గఱకుఁ బోఁబోవవ నప్పటికే యచట భటులు నిలచి యుండిరి. మఱియొక ద్వారముకడకేగి చూడ నక్కడ నట్లే మూగియుండిరి. వేరొండు కవాటమువద్దకేగ నక్కడ నంతకన్న మిక్కుటముగ నుండిరి. ఇట్లు మందిరము నాల్గువైపుల రాజభటు లావరించి యుండుట దెలుసుకొని యొడలెల్ల జెమ్మటలు క్రమ్మగ జగజగవణకుచు నిశ్చేష్టితుడై నోటమాటలేక నేలకొరగెను . తోడనే యక్కడకు వచ్చిన భటు లా పిఱికిపందను విరిచికట్టి తమ యేలికయొక్క యాజ్ఞానుసారము గావింపఁ గొంపోయిరి.