Jump to content

రాణీ సంయుక్త/పదునారవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదునారవ ప్రకరణము

అఁట గన్యాకుబ్జ నగరమందు జయచంద్రుఁడు తన కూతురు చేసినపనికి మండిపడుచు నంతఃపురముఁజేరి రోషసంభ్రమములు ముప్పిరిగొన హా! తానొకటితలఁచిన దైవమొకటి తలఁచుననుట తథ్యమయ్యెను. ఆ నిర్భాగ్యునెడల నే సలిపినదానికి నాకూతురిట్లు వ్యతిరేకముగా మన్నించునని కలయందైనఁ దలచితినా? దీనికిట్టిదుర్బుద్ది పొడమనేల! సాటిరాజులతో నాకు తలవంపులు తెచ్చినదిగదా ఈరాకాసి. దీనినేమి కావించినను బాపమగునా? దీని నింతింతకండలుగ గోసి కాకులకు సైచినను బాపముకలుగదు. దీనికి నేనేమివిషముబోసితిని. ఇది పుట్టకుండిన నాకేచింతయు లేకపోవుగదా! ఇదివరకు పోయిన దట్లేపోక మరల నేటికి దాపరించినది? ఆహా! నా హృదయమంతయు రవులుకొని పోవుచున్న దేమిసేయుదు? అని తలపోసుకొనుచు తనభార్యం బిలచి కూతురు సమాచార మెటులున్నదో కనుగొని రమ్మవి పంపెను. ఆమెయు నటులేయనిపోయి కొంతసేపునకు మఱలివచ్చి, "ఆర్యా! అది మూర్ఖపుఁబట్టుఁ బట్టియున్నది. ఎంతచెప్పినను బృధివీరాజును దక్క నన్యువరింప ననుచున్నది. పోనిండు. దాని యిష్టప్రకార మేలఁ జేయరాదు? ఆ చక్రవర్తి యెడల మీకుమాత్ర మింతవైరమేల? అని యింకను నేమో చెప్పబోవుచుండ నడుమ నడ్డమునచ్చి ఓసీ ! నిన్నీ వెధవ శిపారసులు చేయమని యెవరు మొఱవెట్టిరి. పాపము కూతురి వెనుకవేసుకొని వచ్చుచుంటివా ! మీ రిద్దఱు గలసి యే గంగలోనైన దిగుడు. అంత నా ప్రాణము నెమ్మదిగ నుండును." అని తన ప్రియురాలిఁగూడ గసరి కొట్టి బిరబిర సంయుక్తయున్న స్థలమునకు బోవజొచ్చెను. ఆహా! అసూయా పరుండగువాఁ డెట్టి దుష్కృత్యము లొనరింప సమకట్టునో యోచి౦పుడు. పృధ్విరాజుపైగల యీర్ష్యయేగదా జయచంద్రు నింత దురాత్మునిగ జేసినది. అసూయ స్వార్ధపరత్వమునకు జన్మకారణమని చెప్పవచ్చును. కన్న బిడ్డలయందును, ప్రియురాండ్ర యెడలను గల మోహమునుగూడ బారదోలుగదా ! ఈ పాడుగుణము, ఈ దౌర్భాగ్యపుగుణ మున్నంతవరకు మనదేశము మంచి స్థితికి రాదనుట నిర్ధారణము. జయచంద్రు డట్లు పోపుచుండ రాణియు హా ! కూతురాయని యాక్రందనము సేయుచు నతని వెంటనే యరిగెను. మందిరములోకేగి పరద్యానముతో నొకసోఫాపై గూరుచున్న కూతురి నొక్క చరుపు జరుప నులికిపడిలేచి సంయుక్త తలిదండ్రులకు వందన మొనరింపబోవ మరల నొక తన్నుదన్ని " ఓసి ! దౌర్బాగ్యురాలా! నీ కేమి పోవుకాలము వచ్చినది? నా వంశము జెరుప దాపరించితివటే ? ఇన్నినాళ్లు పోషించినందులకు తుదకు నీ తల్లి దండ్రులతోడనే వైరమూన సాహసించితివా? ఓసి పాపిష్టిదానా! నీ చదుపు జట్టుబండ లేమన్ను గలసి పోయినవి ? ఇంతవరకును గుణవంతురాలవని తలచియుంటిగాని యింత గయ్యాళివని యెఱుగనైతి. నే వలదన్న వాని వరించి నా మీదనే కత్తిగట్ట సాహసించితివా? నా హృదయమునకు జిచ్చిడితివిగదే. నిన్నే మొనరించినను నా కసిదీర " దని యదివరకెంతో మృదు మధురముగ మాటలాడుస్వభావము కలవాఁడయ్యు, నదంతయుబోయి రోషమువలన నోట వచింపరాని యశ్లీల వాక్యంబుల బుత్రికం దూషించి తుదకు " ఓసీ ఇంత వరకైనది కానిమ్ము. క్షమించెద. ఇకనైన నాదౌర్భాగ్యుని వదలి నాయాజ్ఞానుసారము వర్తించెదవా? లేదా?" అన నాకన్నియ తలవంచుకొని తిన్నని యెలుంగున " తండ్రీ ! నీ కింతకోపమేటికీ? మనోవాక్కాయ కర్మలందు మనస్సుచే వరించినవానినే చేపట్టుట యుత్తమ పతివ్రతా లక్షణముగదా ! అందులకు వ్యతిరేకముగ నడుచుకొనుమని తండ్రివగు నీవే భోదించుచున్న నిఁక నేనేమనుదానను? అదియుంగాక నన్ను ఘోర కష్టముల నుండి గట్టెక్కించి ప్రాణముల నిలిపినవాడు చక్రవర్తి. అట్టి ప్రాణదాత యగు వానివలదని వేరొకని నెట్లు వరింపగలను? పోనిమ్ము? నీకా మహానుభావుని యెడగల వైరము నావల నిడి యాతనియం దే దుర్గుణములు కలవో నిదర్శనపూర్వకముగఁ జూపింపుము. అప్పుడు నీ యిష్టానుసార మనశ్యము వర్తిల్లెద.” అని పలికిన " ఓసీ ! గ్రుడ్డువచ్చి పిల్లను వెక్కిరించినట్లు నీవు నాకు బుద్దుల గఱపుచుంటివా? నీ కాతని దుర్గుణములఁ గను బఱువలయునే? అట్లే చూపెదనుండు " మని పటపటపండ్లు కొఱుకుచు నచ్చోటువదలి రహస్యాలోచనా నిలయమున కేగి దగువారల రావించి వారితో జరగుచున్న సంగతులెల్లఁ జెప్పి యెటులైనఁ చక్రవర్తిపై దండెత్తి యతని గడదేర్చవలయునని పలికెను. అందుల కందఱు సమ్మతించి యేదైన నొక చిన్ననెపము పెట్టుకొని యుద్ధమునకుబోవుట మంచిదనిరి. కారణము దొరుకునా యని విచారించుచున్న సమయమున దౌవారికుఁ డరుదెంచి యెవడో డిల్లీనుండివచ్చి తమదర్శనార్థము ద్వారముకడ వేచియున్నాడన వాని వెంటగొనిరమ్మని రాజుగారు సెప్పిరి. వాఁడు నట్లేపోయి వచ్చిన మనుజుని వెంటగొనితెచ్చి వీరివద్ద విడచిపోయెను. ఆ వచ్చిన పురుషుఁ డక్కడున్న వారల కందఱకు నమస్కారములుచేసి యిట్లు వచింపసాగెను. “మహారాజా ! నేను ఢిల్లీ నగరమునం దొక ముఖ్యాధికారిని. నేనా చక్రవర్తియెడ విశ్వాసము గలిగి నా కార్యము లన్నియు న్యాయాను కూలముగ నెరవేర్చుకొనుచుండ నా శత్రువులగు తక్కిన కొందఱధికారుల వాక్యము లాలించి యతడు నాయెడ నిరాదరణయే సూపుచు వచ్చెను. అటులయ్యు స్వామిద్రోహము సలుపరాదని యతనికెన్ని విధముల నుపకారములు గావించుచు వచ్చినను మహాప్రభో ! తుదకతనిమనోవాంఛ నన్ను జంపి నాకాంతం జెరబట్టవలెనని తలఁచునంతటి స్థితికి వచ్చినది. జనులనందఱు న్యాయమార్గానుగాములుగ నొనర్చి పాలింపఁదగిన రాజే యిట్టిక్రౌర్యములుచేయ నొడిగట్టిన నిఁక నానగరమున వసించుట ప్రాణాపాయకరమని యెంచి యొకనాటిరాత్రి నిల్లు వెడలి తమవంటిమహాత్ములదయ యున్నయెడల నెక్కడనైన నింత పొట్టబోసుకొనవచ్చునని యిట్లు వచ్చినాడను. ఇఁక దేవరవారి చిత్తానుసారము దాసుడనై మెలగ సిద్దముగానున్నా " నని వచింప జయచంద్రుఁ డతని దనదగ్గర నుంచుకొసుటకు శత్రువువద్దనుండి చనుదెంచినాడే యని సంకోచించుచున్న సమయమున నరనివలెనే డిల్లీనంతయుఁ బాడుచేసి కనూజిఁ జేరి యా రాజుగారి దయకుఁ బాత్రులై యున్న మఱియిద్ద రా వచ్చిన మనుజుని వృత్తాంతము సరియని చెప్పిరి. దాన సంశయ నివృత్తియగుడు జయచంద్రుఁ డతని గూడ నా యిరువురితో సమానముగ నుంచుకొంటకు సమ్మతించెను. పై ప్రకరణమున నీశ్వరభట్టు కన్పించలేదని కరీముతో సేవకులు వచించినట్లు జెప్పియుంటిగదా ! ఆ భట్టుగారే యీవచ్చిన కొత్త మనుజుఁడు. ఇతనికిని నా సాక్ష్యమొసంగిన నిరువురు మనుజులకును డిల్లీయందున్నపుడే పరిచయముండెను. వారు డిల్లీని వదలునపుడే భట్టుగారును విడచియుందురుగాని వారికివలె గాక రాజ్యము సంపాదించవలెనను వాంఛ యితని మనసున దృఢముగ నాటుకొనియుండెను. ఆ కారణము చేతనే డిల్లీ నింతవరకు వదలక పైకి జక్రవర్తితో నిష్టముగ నున్నట్లు నటించుచు లోలోపలఁ గుట్రలు పన్నుచుండెను. చక్రవర్తి మ్లేచ్చుల జయించి వచ్చిన దినమున తమ గుట్టంతయు నతని కెఱుక పడెనని విని కరీముగారితో నైన వచింపక మధ్యరాత్రి బయలు దేరివచ్చి యిటఁజేరెను. ఇటు లీ నగరముజేరి చక్రవర్తిపై నెపము వెదకుచున్న జయచంద్రునకు మహోపకారము గావించినవాఁడయ్యెను. మఱునాడు కొలువుదీరియున్న సమయమున జక్రవర్తి వ్రాసినది కాకపోయినను అతని హస్తలిఖిత మని జాబునొకటి జయచంద్రునకు జూపింప దానియం దిట్టులుండెను.

" స్వస్తి శ్రీ జయచంద్రునకు,

నీ గారాబు కుమార్తె సంయుక్త నన్ను వలచియున్నదని యనేకులవలన వినియుంటి. నాకును నామెపై మిక్కుటమగు మోహముకలదు. నాతో మైత్రిఁ బాటింపఁ దలఁచితివా శీఘ్రముగ నామెను నాకొసంగి వివాహముఁజేయుము. లేకున్న రాక్షస వివాహముననైన జేకొననిశ్చయించి యున్నాను." అనిచదువుకున్న వెంటనే దెబ్బదిన్న త్రాచుబామువలె దీర్ఘ నిశ్వాసాన్వితుఁడై కన్నులెఱ్ఱజేసి లేచి " ఔరా ! వీనిదుర్మదము. వీనికి నాగారాబు గూతునర్పింపవలయుగా, లేకున్న రాక్షసవిధి గైకొను పాటివాఁడా ? చక్రవర్తిపదవి లభించెనని కన్నులు నెత్తికెక్కినవిగాబోలు ఇంతవరకు దగుకారణ లేనందున నూరకుంటిని." అని యవలోకన మాత్రమున రణమునకు వెడలివచ్చు నంతటి కఠినముగ బృధ్వీరాజునకు లేఖవ్రాసి పంపించి యుద్దమునకు సంసిద్ధులై యుండవలసినదని దండనాయకుల కాజ్ఞాపించి వెడలి పోయెను.