రాణీ సంయుక్త/పదునాల్గవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదునాల్గవ ప్రకరణము

యచంద్రుని వృత్తాంతమటులుంచి యిఁక సంయుక్తంగూర్చి కొంతవిచారింతము. ప్రాణోపద్రవమునుండి తన్ను గాపాడిన మహాత్ముడు పృధివీరాజని నిపుణికవలన విన్న నాటంగోలె బంచప్రాణము లతనిపై నిడుకొని స్వయంవరమున కతఁడు వచ్చునో రాడో యనుతలఁపున వగలఁ బొగులుచు నిద్రాహారముల యెడసహితము మనాదరణఁ జూపుచుఁ దనయుపాద్యాయుని సంగతికూడ తెలియనందున నుత్కంఠయై దినములు గడుపుచుండెను. బయటి కేగివచ్చు ప్రతిపరిచారికను జక్రవర్తి యేతెంచెనాయని యడుగుచుండెను. ఇట్లు ప్రాణపదముగ నెంచుకొనుచున్న నారాజు నెడలఁ దనతండ్రి కావించిన యకార్యముఁ గూర్చి తెలిసినటులైన నామెహృదయ మెట్టి దశయందుండునో వచింప నలవిగాదుగదా? ఇటులుండ మంజరి చనుదెంచి జరుగుచున్నసంగతు లన్నియు వచింప నిశ్చేష్టితమై కొంతసేపటి వరకు మాటలేక నిలువబడి తుదకు " కట్టా ! నా జనకుండిట్టి కట్టడి యయ్యేగా ! నేనిఁక నెవరితో మొరనిడుకొందు? ఎవరు నావేదనఁ దీర్చువారలు? ఎవరు నా ప్రాణకాంతుని నన్నుఁ గూర్చువారలు? నన్ను ఘోరమగు విపత్తునుండి తప్పించి రక్షించిన యా జగన్మోహనాకారునకుందక్క పరుల కీశరీరము యెటు లర్పింపగలుగుదు. హా! జనకా! నా యిష్టములేవి యెవనికో యొకనికి నన్నంటగట్టి యందులకే ననారతము విలపించుచుండ నీవుచూచి భరింపగలవా? ఇట్టి యుద్దేశము నీవుకలిగియున్నప్పు డీ స్వయంవర సంరంభమంతయు నేటికి ? స్వయంవరమనఁ గన్నియ దన కిష్టమగు వరువి జేపట్టవలయుఁ గదా! ఆర్యావర్తమునంగల రాజులనెల్ల రప్పింప కిట్లేల పక్షపాతము గావించితి " వని పలుగతులఁ జింతించి తండ్రిని దూరుచు నేట్టకేల కొక సాహసకృత్యమును గావింప నిశ్చయించుకొని మంజరికి కొన్ని రహస్యములు బోధించి తానా నాఁడు రాత్రిఁ దిన్నగ నాహారమునైనఁ గుడువక చాలా ప్రొద్దు పోయినపిదప నెట్లో శయనించెను. అంత బాలభానుండు దన బాలారుణదీప్తులచే నలంకృతములగు రాజవీధులకు నూత్న శోభగల్పించుచు నుదయపర్వతముపైఁ దోచెను. ఆ నాడు పని పాటలవా రందరు దమతమ వ్యాపారములకుఁ బోవుటమాని గృహములందే వసించియుండిరి. నగరమునం దెల్లెడల ప్రభాత కాలవాద్యములు మ్రోఁగుచుండెను. సంయుక్తయు మేల్కాంచి తానా దినమున జేయఁబూనుకొన్న కార్య మతిదుర్ఘటంబు గావున దండ్రి నెట్లుదిరస్కరింతునా యని కొంతతడవును, దిరస్కరింపనిచోఁ దనకోరిక నెరవేరుటకు వేరొండు మార్గము గలుగదని కొంతసేపును విచారించి తుదకెటులైన దన యిష్టమే నెరవేర్చుకొన దలచియుండెను. అంత గొంతసేపటికి రాణి యానతిఁ జెలికత్తెలు మున్నగువార లేతెంచి నామె కభ్యంగన స్నానాదికములఁ జేయించి యలంకరించి తల్లిదగ్గరకుఁ గొంపోయి విడచిరి. ఆనాఁ డెనిమిది గంటలకు స్వయంవర ముహూర్త మేర్పఱుపఁబడి యుండెను. దివాణములోపల స్ఫటికశిలా వినిర్మితమగు నొకవిశాల చతుశ్శాలామంటపము స్వయంవర కార్యమున కుద్దేశింపఁబడెను. ఈ మంటపాంతరమునఁ దూర్పుప్రక్క జయచంద్రుడు నతని సంతతియు, నుత్తరమున రాజ్యమందలి ముఖ్యులును, పశ్చిమ పార్శ్వమున స్వయంవరాగత రాజమండలియు, దక్షిణమున బరరాజుల వెంటవచ్చిన ప్రధానులు మున్నగువారును నాసీనులగుటకుఁ బీఠము లమర్పఁబడి యుండెను. తెల్లవారినది మొద లొక్కరొక్కరువచ్చి యుచితాసనములఁ బరివేష్టింపసాగిరి. వీధులయందు శకటముల రాకపోకలకు విధి విరగడలేకుండెను. అంతఁ బ్రతీహారులేగి సకలమును విన్నవింప జయచంద్రుఁడు పురోహితులు ముందునడువ మంటపమున కేతెంచి సింహాసన మధిరోహించెను. పురోహితు నానతి బరిచారికలు చని పిలువ సంయుక్త యుచితాభరణ భూషితురాలై తల్లితోఁ గూడి దివ్యమంగళ విగ్రహముంబలె మందయానంబున నరుదెంచి సభలో నాసీనయయ్యెను. ఉబ్బెత్తు యద్దపుబిళ్ళను సూర్యుని యెదుట బెట్టినతోడనే నలుదిక్కులఁ బ్రసరించియుండు కిరణములన్నియు దాని తేజఃకేంద్రమునకే చేరులీల స్వయంవరోత్సవముఁ జూడవచ్చిన సమస్త జనుల చూపులు సంయుక్త ముఖముమీదనే వ్రాలెను. ఎనిమిది గంటలగుడు పురోహితుఁడు పుష్పహార మొక దానిని సంయుక్తచేతి కొసఁగి నీ యిష్టమువచ్చిన రాజవరుని కంఠమున వ్రేయుమని చెప్పి రాజుల వేరుపఱచి చెప్పుట కెవరు తగుదురని యాలోచించుచున్నతరి మంజరి నేనని ముందునిలచెను. అందుపై నామెనే నియోగించిరి. అత్తరి సంయుక్త తన సహజారుణములగు హస్తముల హారముధరించి లజ్జానతాననయై రాజలోకంబు నెదుటకు వచ్చుచుండఁ బ్రతివాఁడును ధననే వరించునని గుటకలు మ్రింగుచుండెను. మంజరి యొక్కొక్కని జూపించి తెలియజెప్పు చుండెను. ముఖ సంజ్ఞలచే వ్యతిరేక భావమును సూచించు సంయుక్త ముందుచూపులు చూచుచుండెను. ప్రతి రాజకుమారుడును దన పైవానివదలి తనదగ్గర కేతెంచుతరి నిక దన్నే వరించునను సంతోషమున మొగము కలకలలాడ గూరుచుండి వ్యర్ధమగుటతోడనే విన్నదనంబు నొందుచుండెను. అటనున్నవారి నందఱఁ దెలియఁజెప్పెను గాని సంయుక్త యెవ్వని వరింపదయ్యెను. సభయందలి పారెల్లరు విభ్రాంతి వహించి కూరుచుండి యుండిరి. అంత మంజరి పృధివీ రాజును వర్ణించి బహిర్ద్వారమున శిలావిగ్రహుఁడై యున్నాడన సంయుక్త సభలోని వారల నెవ్వరి లక్ష్యపెట్టక త్వరితగతినా శిలావిగ్రహముకడకేగి దానికంఠమున పుష్పహారము వైచెను. చెంతనున్నవారు కళవళమందసాగిరి. రాజకుమారులు విషణ్ణులై తమ చోటులఁబాసి లేవసాగిరి. ఎక్కడికేగునో యని చూచుచు కూర్చున్న జయచంద్రున కా వార్త తెలిసినతోడనే మధ్యందిన మార్తాండునింబోలె రోషభీషణాకారుఁడై సంయుక్తను లోపలికిఁ గొనిపొండని పరిచారికలకు దెలియబఱచి తాను రాణీసమేతుడై యంతఃపురమున కరిగెను. ఆశాభంగమగుటచేఁ దక్కిన రాజులును దమతమ నివాసముల కేగిరి,