రాణీ సంయుక్త/పదమూడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదమూడవ ప్రకరణము

"అబ్బబ్బ! ఈదినముదయముననే లేచి యెవరిముఖము గాంచితినో కాని నాకన్నియు బక్కులే సంప్రాప్తములైనవి. మాకక్కడఁ బల్లెలందు మ్లేచ్ఛు లొనరించుచున్న యార్భాటము లెటులున్నవో యిక్కడ నీ స్వయంవరమునకు వచ్చిన రాజులాయార్భాటము లటులున్నవి. సుమారు రెండుజాములవేళఁ దూర్పు వీధి వదలితి. మూఁడుజాములు తిరిగిపోయినవి. ఇంతవరకు రాజద్వారము చేరుటకు వీలుపడలేదుగదా ! కొండలవలె తండ తండములై పరువెత్తుకొనివచ్చు నీపాడుబగ్గీలు నేఁడు నాదుంప ద్రెంపినవి. రోడ్లమీద నీళ్ళుచల్లుబండ్ల తొత్తుకొడుకు లెప్పుడు చల్లిరోగాని యీగుఱ్ఱముల రాపిడివలన నేలంతయు నెండిపోయి దుమ్ము వెదజల్లుచున్నది. శకటముల సంరంభముచే నెగురు ధూళి యంతయు వీధులగుండ గ్రమ్ముకొని దారిగాన్పింపకుండఁ జేయుటయేగాక ముక్కులలోఁ గన్నులలో జొరఁబడి దృష్టిని గూడ నాశనముఁ జేసివైచినది. రాత్రియంతయు నిద్రఁగాచిన వానికింబలె గన్నులు భగ్గున మండుకొని పోవుచున్నవి. ఈ యెడతెగని గుఱ్ఱముల గెట్టెలవలన గలుగు పటపటధ్వనులచే జెవులు గడియలు పడిపోయినవి. ఒక్కొక్క వరుసవచ్చికడచి పోవువరకు నీ మిడియెండలో నిలువవలసి వచ్చుటచే నా తాతలు దిగివచ్చుచున్నారు. పైననెత్తి క్రిందకాళ్లు మలమల మాడుచుండ వచ్చిన సవారీలవరుస పోవువరకుఁ బ్రాణముల బిగబట్టుకొని నిలవవలసినదేగాని కొంచెమిటుఁనటు గదిలిననే గుఱ్ఱముల కాళ్ల క్రిందబడి యీల్గుదునో యనుభయమే. పోనీ యేపంచనైన జేరుదుమా యన్న నన్నింటియందు ద్వారపాలకులే. దూరమున నుండగనే యెవరువారని కేకలువైచుచు వెడలగొట్టుదురుగాని పాపమెవడో ముసలి బ్రాహ్మణుఁడని దయదలఁచి పిలుచు ముండవాఁడొకఁడు గానరాఁడు. అయ్యో! రాకరాక వివాహ సమయములో మేమేలవచ్చితిమి? ఇప్పుడీ జయచంద్రుడు మావాక్యములాలించి మమ్ము బీడించుచున్న మేచ్ఛులఁ బారదోలునని తోచదు. దేశమందలి ప్రజలు క్రూరులగు మ్లేచ్చుల బారింబడి బ్రాణమానముల గోల్పోవుచుండ నీ రాజేమియుఁ బట్టించుకొనకుండ నిట్లుత్సవములలో మునిఁగియుండుట మాబోటి పౌరుల దురదృష్టమేకాని వేరొండుకాడు. అయ్యో! ఈరోజున నా గ్రహచారము బాగుగ నుండలేదు. నేనిటు మొత్తుకొను చుండగనే మఱియొక సైన్యము సంప్రాప్తమైనదే. నాయనో ! ఇవి యెక్కడి గుఱ్ఱాలు. రాజమార్గము పట్టకుండ జనుదెంచుచున్నవి. ఇంతకుముందు చనుదెంచిన కోసలపతి సేనాసంరంభములో నావెంటవచ్చిన యితరగ్రామస్థులు వేరైపోయినారు. ఈ సంరంభములో నాకు నా జీవమునకు నెడబాటు కలుగు నటులున్నది. ఓయిదేవుడా! ఈ సంకులమునుండి దప్పించి నావారిఁగనుబఱచి కొంపజేర్చితివా ఈవివాహమై నగరమంతయు నెమ్మదిపడువరకు బయటనొక్క యడుగైనఁ బెట్టను. ఓహో ! అప్పుడే చేరువకు వచ్చినవే గుఱ్ఱములు" అని యొకముసలి బ్రాహ్మణుడు తనచేరువనున్న వారివలన మార్గమునజను రాజవరుల వృత్తాంత మడిగి తెలుసుకొనుచు నాయాసమును దీనత్వమును దోప గన్యాకుబ్జనగర రాజవీధి ద్రిమ్మరుచుండెను, తిరుగుచున్నప్పుడు వచ్చుచున్న రాజుగారెవరని యడుగ జెంతనున్న యొకఁడు కాశ్మీరపురాజని బదులుచెప్పెను. అంతనా నృపుని వీక్షించు నభిలాసతో, దాను బ్రక్కకొదిగి నిలిచి యుండెను. తరువాత నొకబలిష్టమగు నశ్వముపై రౌతుకూరుచుండి వీధివెడల్పున నాడించు కొనుచువచ్చెను. వానిపిమ్మట నొకయుత్తమ పారసీకంబుపై నేనాపతి వచ్చుచుండెను. వాని యనంతరము బారులుగట్టి యాశ్వికులు కొందఱురుదెంచు చుండిరి. వారి వెన్నంటి మఱియొకసేనాని కాంభోజమునెక్కి చనుదెంచు చుండెను. తదనంతరము శ్వేతాశ్వముల నారోహించి భటు లనేకులు ఖడ్గపాణులై యేతెంచుచుండిరి. వీరివెనుక శ్రేష్టములగు వనాయుజములపై నక్షోహిణీపతులు ముందునడువ గొంత సైన్యము ఠీవిమై చనుదెంచుచుండెను. ఈ సేనానంతర మాజానేయము లెనిమిదింటిచే బంధింపబడిన రాజుగారిబగ్గివచ్చు చుండెను. ప్రతియశ్వముపై నొక్కొక్కభటుఁడు గూరుచుండి తోలుచుండెను. అందు దనప్రధానమంత్రితో గన్యాకుబ్జనగర వైభవమును గూర్చి ముచ్చటించుకొనుచు కాశ్మీర మహారాజుగా రాసీనులై యుండిరి. వీరి యనంతరము పదిమంత్రులు, రాజ్యమందలి ముఖ్యాధికారులు మొదలగువారు కూరుచున్న బగ్గీలు వరుసలుతీరి వచ్చుచుండెను. వీటికన్నిఁటికిఁ జివర మఱియొక సేనానియు మరికొంతసేనయు బాహ్లీకములపై వచ్చుచుండెను. ఈ సందడతగ్గువరకు పైనబేర్కొన్న బ్రాహ్మణుఁడు తానున్న చోటనేయుండి యదితగ్గిపోయిన తోడనే మరల బయలుదేరి నడచుచుఁ గొంతదూర మేగిన పిదప దనకొఱకై నలుదిక్కులఁ బరికించుచు నిలువంబడియున్న తనవారలఁ గలుసుకొని "నాయనలారా నా యదృష్టమున నేడు మిమ్ము గాంచగల్గితిని. ఇక్కడ నీ బగ్గీలక్రిందఁబడి చచ్చుటకంటె మన గ్రామములందు మ్లేచ్చులుపోయు వేడినూనియలచేత జచ్చుటే మేలని తోచుచున్నది. మనకిక నెట్లును బ్రతుకుతెరువులేదు. అతనికేమి? ఏ చింతలులేక పౌరుల మొరలాలకింపక జయచంద్రుడు హాయిగ బెండ్లి గావించుకొనుచున్నాడు. ఇట్టిరాజు బ్రతికిననేమి? చచ్చిన నేమి? మనమీ రాజ్యము వదలిపోయిన బ్రతుకుదుమేమో కాని యిక్కడేయున్నటులైన వట్టిదే. మీకేమైన రాజుగారి దర్శనము లభించినదా? పౌరు : కాలేదు. ఈ తొందరలన్నియు నడఁగిన తర్వాత నేమైన యీ రాజు మనదిక్కు చూచునేమొ.

బ్రాహ్మ : ఈ కల్లోలము లణఁగవలసిన యవసరమేమి ? ఈ లోపలనే బూడిదె రాసులతో గూడుకొని మన పల్లెలన్నియు నెమ్మదిగ నుండగలవు.

పౌరు : అయిన మనమిప్పు డేమిచేయుదము.

బ్రాహ్మ : అందరము గట్టగట్టుకొని యొక్క పర్యాయముగ యమునలో దూకుదము.

పౌరు : కానిండు. మన ఘోషలు ప్రధానితో విన్నవించు కొందము పదండి. అతడేమైన సాహాయ్య మొనరించిన సరి. లేకున్న నీవు చెప్పినట్లే సదిలో దూకుదము,

అని మాటలాడుకొని వారందఱు ప్రధానింజూడ వెడలి పోయిరి. కూతురు వచ్చినదను సంతోషమున ద్వరలో నామెకు వివాహమొనర్ప జయచంద్రుడు సకలదేశముల నృపులకు లేఖల నంపుచుండెనని యిదివరకే లిఖించి యుంటిమిగదా. తన్మహోత్సవమునకై గన్యాకుబ్జము బహుబాగుగ నలంకరింపబడెను. అత్యున్నతములై వరుసలుతీరియున్న సౌధపంక్తులు క్రొత్తగ వేయబడిన సున్నముచే స్వచ్చమగు వెండికొండల బారును దలఁపుకు దెచ్చుచుండెను. ప్రతి మందిరమునకు వేర్వేరుగ గాక రెండుప్రక్కల సౌధంపువరుసల యొకకొననుండి మరియొక కొనవరకు బచ్చని యాకుతోరణముల వ్రేలాడగట్టిరి, రాజవీధి యందు బండ్లు మొదలగునవి నడచునట్టి మధ్యమార్గమునందు గాక ప్రత్యేకముగ మనుష్యులు మాత్రమే నడచుటకుగాను సౌధపంక్తుల కంటుకొని యుండునట్లు నిర్మింపబడిన ప్రక్క దారులపొడుగున దాళ్వారము (అనగా గ్యాలరీ)ల బెట్టించి వాటిపై క్రిందనుండి మీదివరకుఁ జెక్కలగుపడని యంత దట్టముగ బలురకములగు బూలచెట్ల తొట్లుంచబడి యుండుటచే వీధియం దొకవైపున నిల్చి చూచువారలకు బచ్చని పొదలతో గూడుకొనియుండు కొండలోయ తలఁపునకు వచ్చుచుండెను. ప్రక్కదారులు పూలమొక్కలచే నిండియుండుటవలన మధ్యమార్గమం దిటునటు నొకగజము మేర జనుల రాకపోకలకు వదలి వీధిపొడుగునను దగ్గరదగ్గరగ నెత్తైన స్తంభములబాతి వాటి యగ్రములకు సమాంతరముగ నుండునట్లు తీగెలబిగించిరి. వెండియు నొకవరుసయందలి మొదటికంబపు చివరకును దాని యెదుటి వరుసయందలి రెండవ స్తంభాగ్రమునకును మరల మొదటి వరుసయందలి మూడవదాని కొనకును నిట్లే క్రమముగ నన్ని స్తంభముల యగ్రములకు గొంచెము మందములగు తీగెల నంటగట్టిరి. అట్లు కట్టిన తీగెల ప్రతియడుగునందు మైనపు వత్తులతో గూడుకొన్న గుండ్రములగు నాకుపచ్చ రంగుగల చిన్నచిన్న యద్దపు కలశముల వ్రేలాడదీయుటయేగాక చివరల బిగించిన తీగె లొండొంటితో గలియు భాగమున గాలిదీపము లుంచుటకు వీలైన పెద్ద పెద్ద గులోబులు వ్రేలాడ గట్టియుంచిరి. కలశములు గులోబులు నాకుపచ్చ రంగుగలవగుటచే రాత్రు లందు దీపములు వెలిగించుటతోడనే వాని కాంతులును పూలమొక్కల కాంతులును నేకమై వీధియంతయు శోభాయమానమై లక్ష్మీవిలాసస్థానమో యన రాజిల్లుచుండును. రాజుగారి దివాణము నందేగాక నగరమం దెక్కడ జూచినను చెవులు గింగురుమన శుభవాద్యములు మ్రోగుచుండెను. తక్కిన వీధులును గొంచె మించుమించుగ నిటులే యలంకృతములై యుండెను. జయచంద్రుడు సమస్త దేశాధిపతులకు శుభలేఖల సంపెగాని తన పూర్వ వైరము తలచి డిల్లీపతికి మాత్రము వర్తమాన మంపక తిరస్కారభావమున నుండెను. ఆటులుండుటయేకాక చక్రవర్తిని మఱింతయవమాన పఱచుటకై రాతివిగ్రహము నొకదానిఁ జేయించి దానికి ఢిల్లీపతినామమిడి కోట బహిర్ద్వారమునఁ బెట్టించి లోపలికి వచ్చు వారందఱా విగ్రహముపై నుమిసి రావలయునని యాజ్ఞాపించెను. ఈ వార్తవిని నగరమంతయు నల్లకల్లోలము కాసాగెను. కొందఱు జయచంద్రున కిదియేమి వెఱ్ఱి? ఇట్లుచేయుట తగునా యనువారును, కొందఱు వీనికిఁ బోవుకాలము సమీపించినది కావుననే యిట్టిబుద్ధి పుట్టినదను వారును, కొందఱు మనకిక రణము దప్పదనువారునునై జనులెల్లరు వీధులందు గుంపులు గుంపులుగ గూడి మాటలాడుకొన జొచ్చిరి. దుర్మార్గులగువారు మాత్ర మతని మఱింత ప్రోత్సాహము చేయుచుండిరి. నృపుఁడును దక్కుంగల కార్యముల సన్నాహము జేయించుచుండెను.