Jump to content

రాణీ సంయుక్త/పదియవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదియవ ప్రకరణము

టులా రాజపురుషుండు డేరాయందు దిగవిడిచి చనుటతోడనే సంయుక్త యట నమర్పఁబడియున్న నొకపాన్పుమీద గూరుచుండి తనకిక్కట్టులు సంభవించుటయు వానినన్నిటిఁ గడచి బయటపడుటయు మొదలుగాఁగల తలంపులు మనస్సునకురాఁ గొంతసేపటి వరకు నేమేమొ యాలోచించు కొనుచు నలసి యున్నది గావునఁ బ్రత్యూషవాయువులు మేనుసోకుచుండ సుమా రైదున్నర గంటవేళ నించుక నిద్రఁగూర్కెను. వెంటనే మంజరి చనుదెంచి తన పార్శ్వమున గూరుచుండినట్లొక కలగని “హా! మంజరీ ఎన్నిదినములకు నిన్నుఁ జూడఁగంటినే" యని పలవరించుచు మంచముపై లేచి కూరుచుండెను. అట్లు లేచి కనులుదెఱచి వీక్షించిన తోడనే యా కన్యకుఁ గలిగిన సంతోషమేమని చెప్పుదును? నిజముగ మంజరివచ్చి తన కట్టెదుట నొకకుర్చీపై గూరుచుండియే యుండెను. తోడనే సంభ్రమాన్వితమై మంజరి, గౌగలించుకొని యబల కావున నించుక దుఃఖింపసాగెను. మంజరియుఁ గొన్ని యనునయంపు వాక్యంబుల నోదార్పఁ గలఁకదేరి "చెలీ ! నీవు నిక్కముగ మంజరివగుదువా? నా కేమియు భ్రాంతిచేకూర లేదుకదా? నీ విక్కడి కెటులేతెంచితి వన సంయుక్తా! నీ కింత భ్రమ యేటికి? నేను నిక్కముగ మంజరినే. నేనిక్కడి కెట్లువచ్చినదియు వచించెద వినుము. ఆ నాడు నీ వట్లు సోఫాపై నిదురింప గొంతసేపైన వెనుక మేల్కొలిపెదఁగాకని తలచుకొనుచు నేనును నట్లే నిదురించితి. అనంతరము సింహగర్జనమువలన మేల్కని చూడ నీవచ్చోటఁ గాన్పింపవైతివి ! వెంటనే వెతక వలసినచోట్ల నెల్లను వెదకి యెక్కడనుఁగానక జీవములపై నాసవదలుకొని దేశములమీద వేడలి నిన్నెట్లయిన గనుఁగొన విశ్చయించి యాడువేషమునఁ గ్రుమ్మరుట సురక్షితముగాదని పురుషవేషముదాల్చి, సమయముపడినప్పుడు పనికివచ్చునను తలపున రెండు చేతికత్తులఁ బదిలపఱుచుకొని యప్పుడే బయలు దేరితిని. అట్లు వెడలి ప్రతి గ్రామమునందు, నడుమఁ దటస్థపడు నరణ్యములందును నెమకుచు నచ్చటచ్చటఁ గొందఱివలనఁ కొన్ని సమాచారంబులఁ దెలియుచు సంచరించుచుంటిని. ఆట్లురెండుమూడు దినములు గడచిన వెనుక నొక యూరిలో మధురా నగరమునకు జేరువనున్న తిప్పపైని కాళికాశ క్తికి సకల కళాపరిపూర్ణయు సుందరాంగియునగు రాచకన్నియ నొక తెను బలి యిత్తురను సమాచారము విని యట్టి యదృష్ట విహీనయగుకన్య యవతెయై యుండునా యని యనుకొనుచు శక్త్యానుసారము నామెను రక్షించు తలఁపున బయలుదేరి యొక్కరీతి నడచుచు నీ సాయంతనముననే యొక పల్లియఁజేరి యక్కడివారల మధురాపురవృత్తాంతము లడుగ నక్కడి కేడుమైళ్ళదూరమున్న దని వక్కాణించిరి. ఆ మాటవిన్న వెంటనే మిక్కుటమగు నాకలియగుచున్నను, నంతవఱకు నడచియున్నందునఁబాదములు సత్తువదప్పి యున్నను లక్ష్యముచేయక సాహసమూని రాజమార్గమునంబడి నడచుచువచ్చి యా నగరము తొమ్మిది గంటలకు జేరితిని. అక్కడివార లింతకు మునుపే వామ మార్గులందఱు గొండకేగిరని వచింప దుఃఖార్తనై నా కష్టము ఫలింపదను తలంపున వించుక యోచించి వెంటనే యొక మనుజుడు దారిగనుపరుప గుట్టఁజేరవచ్చితిని. నే దగ్గరకేతెంచి చూచుటతోడనే తిప్పయంతయు దీపాలంకృతమై కడుమనోహరముగ నుండెను. కొందఱు గుంపుగఁజేరి యక్కడడుగు భాగమునఁ దప్పద్రాగి గేలింతల గొట్టుచుండిరి. వారేమి చేయుదురో యని దూరమందు నిలచి చూచుచుండ వారి త్రాగుడేమో వారేమో కాని దేవికాని పూజకాని యేమియు గనిపింపవయ్యెను. అంతట పైనొకగుడి దీపాక్రాంతమై యుంటఁ గని యక్కడ నేమిజరుగుచున్నదోయని క్రిందనున్న వారికి కొంచెము దూరముగ గొండనెక్కి గుడిని సమీపించుచుండ శంఖారావమును, జాగంటల చప్పుడులును నొక్కుమ్మడి వినవచ్చుచుండెను, గుడిజేరి తలుపులుదగ్గరకు వేసియుండుట గాంచి యించుక దెఱచుకొని వీక్షింతుగదా! ఏమనివచింతు “నా పంచప్రాణములు పైవి పైకెగిరిపోయెను. ప్రకాశమైన యగండము వెలుగున నీవు ధరించియున్న వస్త్రమును గుర్తించితిని. గుర్తించినవెంటనే గుబాలున దలుపులనెట్టుకొని వేరొండాలోచింపక నిన్ను జంప గత్తినెత్తియున్న వానిచేతి సట్లే నఱికితిని. తరువాత జరిగిన సంగతులు నీకును విశదమేగదా” యని వచించిన వెంటనే పులకీకృతాంగయై సంయుక్త తన చెలిల గౌగిలించుకొని " హా ! నా ప్రాణపదమా ! మృత్యువునోట బడనున్న నన్ను రక్షించిన మహానుభావుండవు నీవేనా ? నీయా ఋణము నే నెట్లు దీర్చుకొన గలుగుదు? నీ సాహస ధైర్యములకే నేమినివచించుదానను. ఒక్కనిమిష మాలస్యమైన మనకిట్లు మరలగలిసికానుభాగ్య ముండకపోవుగదా? నీ వంటి బుద్ధిశాలినియగు సఖిం బడసినగదా లోకంబున మనతోడి కాంతలెట్టి యిక్కట్టులనైన దప్పించుకొనగలుగుట " అని యానందపారవశ్యమున మాటలు తడబడ బల్కిన విని “నీ వింతగావచింపనేల ? మన మొకరి నొకరు గాపాడుకొనకున్న నేటికి?" అది యటుండనిమ్ము, నీ వెట్టు లీ దుష్టులబారి బడితివో వచింపుమన నా కన్నియ యిట్లనియె. “ఆనాడట్లు నీ కనులయెదుటనే నిద్రించితిగదా. ప్రొద్దుపోయినందునను నాయాసము నొంది యున్నందువలనను వెంటనే గాఢముగ నిద్రపట్టెను. అంత నేమిజరిగినదో నాకు దెలియదుకాని మేల్కని చూచునప్పటికి నొక గొప్ప యరణ్య మధ్యమున పాడుడేరాయందు నల్గురు స్త్రీలనడుమ నుంటిని. విభ్రాంతిగదుర “ నేనిక్కడి కెట్లువచ్చితి. మీ రెవ" రని వారి నడుగ నొక్కరును నా మాటకు బ్రత్యుత్తరమీయరైరి, ఎంత పలుకరించినను మాటలాడకున్నతరి బయటికేగుదమని బయలుచేర, నన్ను రానీయక పట్టుకొనిరి.

ఛీ ! పాపినురాలా ! నా తండ్రిగారితోడఁ జెప్పి మిమ్ము శిక్ష నేయించెద, ననినను బెదరక నావచనములకుఁ బత్యుత్తర మీయక నేనొనరింపఁ బోవుకార్యములకు మాత్రఁ మాటంక బఱుచుచువచ్చిరి. అత్తరి వారిబెదరించి బయటఁ బడుదమని నా ఖడ్గమునకై వెదకికొన నదియెచ్చోటని గాన్పింప దయ్యెను. అంత నేమిసేయుటకును దోచకవారిపైఁ గలియఁబడి తప్పించు కొన నెంచియుండ భయంకరాకారులగు నల్గురు మనుష్యులు మఱికొందఱి స్త్రీలవెంటఁ గొనివచ్చి యటనుంచి జాగ్రర్తగ గనిపెట్టి యుండుడని హెచ్చరిక చేసిపోయిరి. నిరాయుధనై ప్రబలమగుఁ నాపదయందుండుటఁ దెలిసికొని నా యుద్యాన వనమున మంజరింగలసి నిదురించితిఁ గదా! నన్నొంటరిగ నెట్లు కొనివచ్చిరి? ఒక వేళ సాసఖిం గడదేర్చి తెచ్చిరో లేక నామెయు నావలెనే నిదురింప మోసపుచ్చి తెచ్చిరోయని పలుగతుల నిన్ను నాపితరుల దలఁచికొని యేడ్చి తప్పించుకొని పోవునుపాయము వెదకుచుండ మఱియొకతె కొన్ని యాహారపదార్ధములఁ గొనిదెచ్చి నా ముందుబెట్టి తినుమనెను. ఆమెయైన నా ప్రశ్నలకు జవాబునిచ్చు నేమోయని యడుగ నన్నిటికిఁ దగిన ప్రత్యుత్తర మిచ్చినది కాని తామెవరైనది, నన్నేటి కెక్కడకుఁ గొంపోయినది మొదలగువానికిఁ బ్రత్యుత్తర మీయదయ్యెను. ఈ విధ మంతయుఁ గాంచి నన్నేదో మోసముచేసి , చంపఁ గొనిపోవుచున్నారని దుఃఖార్తనై యెదుటఁ బెట్టిన వానిఁ దాకనందునఁ గొంత సేపటివఱకుంచి పిదప. దీసివైచిరి. తదనంతరము సాయంతరమందును నట్లే తెచ్చి యియ్యనపుడును వానినొల్ల నైతిని. బాగుగఁ జీఁకటి పడినతరువాత నొక పాడుసవారి యందు నన్నుఁ గూర్చుండఁ బెట్టుకొని రాత్రి యంతయు బ్రయాణము మొనరించి తెల్లవారునప్పటికి మఱియొక గ్రామముఁ జేర్చిరి. అచ్చటి కొకమానవుఁ డరుదెంచి నమ్మకము కల్గునట్లు నాతోడ తాము డిల్లీపురవాసులనియు నొక యధికారి యాజ్ఞను జక్రవర్తికి బహుమానముగ నిన్ను గొంపోవు చున్నారనియు వేరొండపకారము సేయుటకుఁ గాదనియు దిగులుమాని యాహారము భుజించుచుండుమనియు వచించెను. వాఁడు చెప్పిన దానివలన నాకు నమ్మకముఁగలుగక పోయినను నాకలి మిక్కిలి యగుటచే నానాఁడు దెచ్చినయాహార పదార్థముల గొన్ని రుచి చూచితిని. ఇట్లు రాత్రులందుఁ బ్రయాణము సేయుచుఁ దెల్లవారినతోడనే యొకగ్రామమునం దాగుచు నాలుగైదు దినములకు మధురాపురము సేర్చి యందొక విశాలమగు నింటిలోఁ జీఁకటి గదియందె నన్నుంచిరి. ఆగదిలోనున్న దినములందనేక పురుషులేతెంచి తిరునాళ్ల ప్రజలవలె ననుదినమును నన్నుఁజూచి పోపుచువచ్చిరి. మూఁడు దినములు గడచిన పిమ్మట నాల్గవ నాఁడెవరు లేని తరుణమున నొకతన్వి నాకడకేతెంచి విచారముతో "అమ్మా! నీ వెంత దురదృష్టవంతురాలవు. నీ వంటి సౌందర్యవతికిట్టి దుర్మరణంబు గలుగ జేసిన యా పరమేశ్వరు నేమన వలయు కటా ! నీ వెటులీ దుష్టులబారిఁ బడితివి నిన్ను రేపమావాస్య నా డిక్కడి కించుక దూరమున నున్న కాళికా శక్తికి సమర్పింపఁ గొని చనుదెంచియున్నారు. వీరందఱు నిన్న మాటలాడుకొనుచుండ వింటిని. నీ వాహారమొల్లకుండిన దారిలోనే మృతినొందుదువని యొక దుర్మాత్ము డేతెంచి నీతోఁగొన్ని మాయవాక్యము లాడినాడట. అదంతయు వట్టి యబద్దము. " అయ్యో ! నిన్నుగాంచిన నాకు విచారము గలుగుచున్నదని కన్నులనీరు పెట్టుకొనెను, నేను నించుక దుఃఖించి మరల ధైర్యము దెచ్చుకొని యామెతో "అమ్మా ! నీవు నా పుణ్యవశంబున లభించినావు. నేనొకటి వచించెద. అట్లు కావించితివా ధన్యురాల నగుదును. నాకుఁ జిన్నతనమునుండియుఁ గత్తిసాము నందలవాటుగలదు. ఎటులైన నొక ఖడ్గమును సంపాదించి తెచ్చియిచ్చితివా వీరందఱిపెఁ దిరుగబడి తప్పించుకొని యైనఁబోయెద, లేనిచోఁ బోరాటమున బ్రాణముల వీడెద. నా కీదుర్మరణము మాత్రము తప్పిపోవును " అన వల్లెయని యా కాంత వెడలిపోయెను, కాని మరల నింతవఱుకును నాకంటికిఁ గానుపించలేదు. ఆమె వెడలిపోవుటయే తడవుగ మఱికొందఱు నాదగ్గరకు వచ్చిరి. ఆమెకొఱకయి కొంతసేపటి వఱకు నిరీక్షించుచుండి యెంత సేపటికి రానందున మాసంభాషణ మెవ్వరోవిని మరల నావద్దకు రానీకుండ నామెను బంధించిరో లేక యిట్టి కుతంత్రలఁ బన్నినందులకు వధించిరో యని సాహాయ్య మెనరించు వారెవరుసు లేకుండుటవలన దుఃఖసాగరమున మునిగితేలుచు బడియుంటిని. అనంతరము గడచిన రాత్రి నను బల్లకియందుఁ గూర్చుండబెట్టుకొని గుడియందు జేర్చిరి. గుడిలోవారు చేయఁగడిగిన కార్యముల వీక్షింపనోపక స్కృతిదప్పి పడిపోతిని. తరువాత వేరేమికావించినదియు నాకు తెలియదు. కొంతసేపటికీ గంభీరారావమొండు నాచెవులంబడఁ గన్నులు విచ్చితిని. అప్పుడే నీవు నాచేతికి ఖడ్గమొసంగితివి. పిదప జరిగిన దంతయు నీకు దెలిసియే యున్నదికదా. అని చెప్పి పరస్పరా శ్లేషణంబు లొనర్చుకొనుచు, చెప్పిన దానిని మరల చెప్పుకొనుచు దమకట్టి ఇక్కట్టుల గలుగజేసిన విధిని దూరుచు సంభ్రమాన్వితయై మంజరీ సంయుక్తలు తమ్మునిక్కడకు జేర్చిన రాజపురుషుడెవరా యని యతనిగూర్చి ముచ్చటించు కొనుచుండిరి.