రాణీ సంయుక్త/పదునొకండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదునొకండవ ప్రకరణము

వారిరువురట్లు మాట్లాడు కొనుచుండ బాగుగ దెల్లవారి ప్రొద్దెక్కి వచ్చుచుండెను. అత్తరి దాసీనికరంబులు సంయుక్త కూరుచున్న గదిలోనికివచ్చి "అమ్మా : ఏమి సెల" వని ప్రతివారు నడుగసాగిరి. అప్పుడీ క్రింది సంభాషణ జరిగెను.

సంయుక్త : మీరెవ్వరు?

దాసీ : మీ కుపచారము లొనర్ప నియమింపబడిన దాసీలము.

సంయుక్త : ఎవరియుత్తరువు ప్రకార మిట్లేతెంచితిరి? .

దాసీ : మా రాజుగారి యానతివడువున.

సం: మీ రాజుగారెవరు?

దాసీ : రాత్రి మిమ్ముఁ దోడ్కొని వచ్చినవారు.

సం : ఆయన యే దేశపురాజు? ఇప్పుడెచ్చట నున్నారు.

దాసీ : ఆ సంగతులన్నియు వచించుటకు మా కధికారములేదు : కానిండు మీ కేమిచేయవలయునో తెలుపుడని సంయుక్త యాజ్ఞాపించినట్ల సమస్త కృత్యముల నెరవేర్చు చుండిరి. సంయుక్త యుత్కంఠంతో నా రాత్రి సహాయపడిన మహాత్ముని పేరు తెలియకపోయెనని విచారమున రెండురాత్రులు గడపెను. అంత మూడవనాడు కంచుకి యొకండరుదెంచి "అమ్మా ! మీరు రేపు మీ నగరమున కేగవలయుఁ గాన ప్రయాణమున కాయత్తమై యుండు" డన "మీరాజువా రెక్కడ ? ఆయనను సందర్శింపక మే మెట్లు పోవఁగల" మని మంజరీ సంయుక్తలు పల్కిరి. అందులకు గంచుకి "అమ్మా! మా రాజుగారు వేరొండవసరమగు బనిమీద బోవలసి మమ్మందఱ నిక్కడ నియోగించి రెండుమూడు దినములు గడచిన వెనుక మిమ్ము కన్యాకుబ్జమునఁ జేర్ప నాజ్ఞాపించి వారప్పుడే వెడలినారు." ఇక మాకు వారి దర్శనమగుట దుర్లభము. కావున బ్రయాణమగుడని తెలుప నిరుత్సాహులై మమ్ము విపత్తునుండి రక్షించిన మహానుభావుని గాంచు భాగ్యము లేకపోయెనే యని చింతించుచు బ్రయాణమున కటులేయని సమ్మతించిరి. అంత మరునాడు ప్రయాణము నిశ్చయించినందున కొన్ని దినములవరకు సరిపోపు నాహార సామగ్రుల బండ్లపై నెక్కించి రాణివాసపు దాసీలకు గాను మఱికొన్ని బండ్లు సన్నాహపఱచి నౌకరులు సమస్తము సిద్ధముచేసి యుంచిరి. ఆ మరునాఁ డందఱు భోజనముచేసి సాయంతనము మూడు గంటలకు బయలుదేరుద మనుకొనిరి. ఈ లోపల మంజరీ సంయుక్త లుచితవేషములూని ప్రయాణము నకు సంసిద్ధులై యుండిరి. మూడుగంట లగుటతోడనే సవారి వచ్చి తమ యావాసమున కెదుట నిలువ వారిరువురందు నాసీనులైరి. బోయిలా సవారినెత్తుకొని ప్రయాణమైరి. ఈ సవారికి నాల్గువైపుల దాసీలు కూరుచున్న బల్లకీలు వచ్చుచుండెను. వీటియన్నింటికి ముందు శూరులగు భటు లుత్తమాశ్వములపై నడచుచుండిరి. వెనుకవైపున మఱికొందఱు దాసీలు కూర్చున్న బండ్లును వాటి యనంతరము సామాను బండ్లును నన్నింటి వెనుక నాశ్వికులును వచ్చుచుండిరి. ముందు వెన్కలఁగాక గుడియెడమ లందును బ్రసిద్ధులగు నాశ్వికులు కత్తులును, దుపాకులను ధరించి చనుదెంచుచుండిరి. ఇట్టి మహావైభవముతో నడువ నక్కడక్క డాగుచు నాలుగవనాడు చీకటిపడి యెనిమిదిగంట లగునప్పటికి కన్యాకుబ్బనగరప్రాంతముఁ జేరిరి. అంతట మరల కంచుకి సంయుక్త సవారివద్ద కేతెంచి " అమ్మా ! మనమిప్పుడు మీ నగరమున కరుదెంచినాము. పట్టణ మింకొక మైలు దూరముగలదు. పల్లకి బోయిలును, మఱికొందఱు దాసీలుదప్ప నితరులెవ్వరు పురముఁ జొరవలదని మా నృపుఁ డాజ్ఞాపించి యున్నాడు. మేమందఱ మిక్కడి కైదుమైళ్ళ దూరమున నిలిచియుండెదము. మీరు సురక్షితముగ నంతఃపురము జేరినవార్త మీ వెంటవచ్చిన దాసీలవలన మా కెఱుక బఱచుడు " అన “నా కింతటి సాయమొనరించి మా మన్నన లందకపోవుట న్యాయమగునా? మీ నృపుఁడిట్టి కట్టడియాజ్ఞల నే యుద్దేశ్యమున గావించెనోగదా?” యని సంయుక్త పలికిన "నమ్మా ! ఎప్పటికైన మాపై గరుణయుంచుఁ డంతియేజాలు" నని యతికష్టముమీద నామె నొడంబఱచి యా సవారీని మఱి నాలుగు పల్లకీలను బురము జేరంబంచి కంచుకి మరల తనవారిఁ గలయ వాఱందఱు వెన్కకేగి నగరమున కైదుమైళ్ళదూరమున నదీతీరమున విడిసియుండిరి. ఇట సంయుక్తయు పురమెల్ల దనకొరకై పరితపించుచున్న ప్రజలతో గూడి దీనదశయందుండ సాక్షాత్ లక్ష్మీవలె నందుఁ బ్రవేశించి పోవుచుండెను. పౌరులంద రీపల్లకీలగాంచి వింతిపడసాగిరి. రాజవీధియందుఁ గొంతదూర మేగినపిదపఁ గోటబహిర్ద్వారము సమీపించగాఁ బల్లకీల నటనిలిపి యందఱం దిగుడని సంయుక్త చెప్పెను. వీరందఱు కోటముందు దిగుట వీక్షించి కావలివారలు వచ్చి సంగతినడుగ సంయుక్త వచ్చినదని పరిచారకులు తెలిపిరి. వెంటనే యామెను జూడనైన జూడక పరమానందమున ద్వారపాలకులు లోనికిఁ బరువెత్తి యా సంగతి రాణివాసమున నెఱుకబఱచిరి. ఈ మాటవిన్న వెంటనే తమ కూతురెక్కడనో మృతినొందెనని తలచి తమ ప్రాణములపై సహిత మాశవదలుకొని పడియున్న రాజదంపతులు చివాలునలేచి " యెక్క డెక్కడ ? నిజముగ వచ్చినదా " యని ప్రశ్నింపఁ బల్లకీవచ్చి ద్వారమెదుట నున్నదని చెప్పుటతోడనే సంతోషవార్త దెచ్చిన యా ద్వారపాలకులపై దమ కంఠములందలి హారముల విసరివైచి త్వరిత గమనంబున బయటి ద్వారముకడకుఁ జనుదెంచు చుండిరి. తక్కిన చెలికత్తెలు నీ వార్తవిని యొడలెరుఁగని సంతోషమునఁ బరుగెత్తుకొని వచ్చుచుండిరి. ఈ లోపల నిట సంయుక్త సవారిదిగి మొదటిద్వారము గడచి రెండవద్వారము సమీపించుచుండెను. అప్పుడందఱు నొక్క పర్యాయముగ జనుదెంచి సంయుక్తం కౌగిలించుకొని గొల్లుమనసాగిరి. కొంతసేపటి కా సంరంభమణగి పట్టరాని సంతోషమున నానంద బాష్పములు రాలుచుండ నందరు నంతఃపురము జేరిరి. రాజ దంపతులు మహోల్లాసంబునఁ బరవశత్వమందుచు గొంతసేపటి వరకు గూతును గౌగిలించుకొనియే యుండి ముంగురులు దిద్దుచు " అమ్మా | తిరిగివచ్చి మా కండ్లయెదుటబడి మమ్మందఱ బ్రతికించితివా? తల్లీ ఇన్ని దినంబులు మమ్మెడబాసి యొంటరిగ నెటులుంటివి"వని యడుగ "దల్లిదండ్రులారా ! ముందు మంజరి మన్నింపుడు. మంజరి మూలమునే మిమ్మెల్లర మరలఁ గాంచు భాగ్యము గల్గినదని తమవృత్తాంత మంతయు నెఱుంగింప మితిలేని ప్రేమంబున నామెం దగ్గరకుతీసుకొని మంజరీ! నీ సాహసకార్యములకు మేమేమని పొగడువారము. ఆపత్కాలంబునకు మిత్రుడనుమాట నీవె సార్థక పరచితివి . నా ముద్దుకూనను రక్షించి మమ్మెల్లర బ్రతికించితివి ! మీ నెయ్యమును సార్థకము గావించుకొంటివి. భూమిపై బతికినంతకాలము మీ కట్టి స్నేహమే వర్ధిల్లుగాకని పలువిధంబుల నుతించి వెంటవచ్చిన దక్కినవారల కుపచారములొనర్ప తమ పరిచారికా జనంబుల నియోగించిరి. ఇట్లు కొంతవడి నిష్టగోష్ఠీ వినోదముల గడపి యనంతరము మృష్టాహారముల భుజించి యందఱు నొక్క స్థలమందే శయనించిరి. అదివరకు గంటినిండ విద్రలేనందున నందఱు హాయిగ నిదురింపసాగిరి. కాని సంయుక్త వెంటవచ్చిన నిపుణిక యనునది మేలుకొనియుండి రాజకొమారికం గనిపెట్టియుండెను. సంయుక్తయుఁ బరున్నను నిద్ర రానందున దన మంచముపై లేచికూర్చుండి తమ కట సహాయపడిన మహత్ముని దిరిగి సందర్శించు భాగ్యము గలుగకపోయెనే యని చింతించుచు, బ్రక్క పైనుండిలేచి ఇటునటు సంచరించుచు మరల బాన్పుజేరి పవళించి వెండియు లేచి తిరుగుచు నాందోళమున నుండెను. ఈ విధమంతయు గాంచుచున్న నిపుణిక లేచి రాజపుత్రికను సమీపించి " అమ్మా! నీ వింకను మేలుకొనియే యున్నావా?" అందులకు సంయుక్త “అవును నా కింకను నిదుర రాలేదు." ఇటు రమ్మని తనదగ్గరకు బిలచెను, అప్పుడు వారిట్లు సంభాషింప మొదలిడిరి.

నిపు : అమ్మా ! ఇంతవరకు నే మాలోచించుచుంటివి?

సంయు ; ఏమియులేదు. నిద్రవచ్చునేమోయని యిటునటులదిరుగుచున్నాను. అంతియేగాక మమ్ము ఘోర విపత్సముద్రమునుండి దరిజేర్చిన యా పరోపకారపారణుని గన్నులార గాంచుటకైనను వీలుకలుగక పోయెగదా యను చింత నా మనంబున దృఢముగ నాటుకొని యున్నది. తుదకా యుత్తముని పేరైన విననోచుకోనైతి గదా! అని హీనస్వరంబున బలుక నంతవర కా తన్విపడుచున్న సంతాపము జూచుచున్నదిగాన జాలినొంది మెల్లగ నిపుణిక యిట్లనియె.

"అమ్మా ! ఇత్తరి నీ యవస్తఁజూడ నాకు విచారము గలుగుచున్నది. తమసంగతి మీతో వచింపవలదని మా రాజు గారు గట్టి యుత్తరువు సేసియున్నారు. అయినను నీతో నిపుడు వచించెద: ఈ రహస్య మెచటను బయలు పెట్టకుము. ఆరాత్రి మిముఁదోడ్కొనివచ్చిన యాతడు ప్రస్తుతము డిల్లీని బాలించుచున్న పృధివీరాజు. ఉన్నట్లుండి యొకనాడు కొంతసేన నెచటికో పంపి యాక్షణమందే మమ్మందఱ వెంటగొని మిమ్ము దిగవిడిచిన చోటికారాత్రియే వచ్చి పనివారెల్లరు డేరాలు మొదలగునవి నిర్మించు తొందరలలోనుండ మాలోనెవరికి వచింప కెక్కడికో పోయి సుమారు నాలుగు గంటల వేళకు మిమ్ము గొనివచ్చి యటడించి మీకు సకలోపచారములు సేయ మా కాజ్ఞాపించి రెండుమూఁడు దినములు గడిచిన పిమ్మట గన్యాకుబ్జముఁ జేర్పవలసినదిగా గంచుకి మొదలగువారికిఁ దెలిపి తానప్పుడే కొంత సైన్యమును వెంటఁగొని ఎచటికో పోయినాడు. ఎక్కడి కేగినది నిజము మాకుఁదెలియదు కాని మనవెంటవచ్చిన సేనాపతులకు మాత్రము తెలియును. అని పృధివీరాజు వృత్తాంత మెఱుకబఱపగా సంయుక్త విచారమునఁ దనలో “హా ! నేనెంత మందభాగ్యురాల నైతి. చేతికందిన విధానమును బోగొట్టు కొన్నటు అయ్యెగదా నా బ్రతుకు. ఇన్ని దినములపర్యంత మేమహానుభావుని దర్శింప సభిలషించియుంటినో యట్టి నామనోకాంతుఁడు చేరువ కేతేరఁ దిన్నగఁ జూచుకొను భాగ్యము కూడ లభింపక పోయెను. చీ ! నా జడబుద్ది కానిమ్ము, గడచిన దానికింతగా వగవనేల? అని లోపలిగుట్టును నిపుణిక తెలుసుకొనిపోవునను తలంపున నప్పటికేమియు మాటలాడక నిద్రవచ్చు చున్నదని నిపుణికను బంపి తానును గొంతతడవునకు నిదురించెను. తరువాత జయచంద్రుఁడు కూతురు వచ్చినదను సంతసమున నామఱునాఁడు మొద లనుదినము బండుగ లొనరించుచు ద్వరలో నామెకు వివాహముగావింప నిశ్చయించుకొని సమస్త దేశాధిపతులకు వార్తాలేఖల నంపఁదొడగెను . సంయుక్త వెంటవచ్చిన పరిచారిక లిఁకమేము మానగరమున కేగెదము సెలవొసంగుఁడని రాణి మొదలగు వారినడుగ స్వయంవర మగువరకు నుండుఁడని నిర్బంధించిరిగాని కొన్ని యాటంకములు చెప్పి సమ్మతింపక సముచిత సత్కారములంది సంయుక్త మొదలగువా రూరిబయటివరకు వచ్చి సాగనంపఁ బయలుదేరిపోయి దారిలో దముకొఱకై కాచుకొనియున్న వారఁ గలసి జరిగిన సమాచారము లన్నియు సేనాపతులకు దేలియ బఱచిరి. అంత నక్కడి సేనాని కొందరి భటులఁ తోడితెచ్చి యా పరిచారికా జనంబుల స్వపురంబునకుబంచి మిగతసేననుం గూడుకొని తన రాజునకు దోడ్పడఁబోయెను.