రాణీ సంయుక్త/తొమ్మిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

తొమ్మిదవ ప్రకరణము

మూడవ ప్రకరణమున బేర్కొనిన మధురాపట్టణపుఁ దిప్పమీఁది కాళికా నిలయమునకు మఱియొక పర్యాయము మంచి దినములు గలుగుట సంభవించెను. అచ్చటివార లంద ఱమావాస్య పదిదినములున్న దనగనే గుడిని బాగుపఱచ నారంభించిరి. ప్రాకారపు గోడలకు, గర్భగుడి శిఖరమునకు సున్నము వైచి వాటిపై మూతులు ముక్కులు పోయియున్న బొమ్మలఁ జక్కపఱచి లోపలనున్న స్తంభముల కన్నింటికి రంగులు వైచి యుంచిరి. గోడలమీద జూచువారలు గుండెపగిలి చచ్చునంతటి భయంకరములగు బొమ్మల లిఖించుటయేగాక యట్టివే పటముల నందందు వ్రేలాడగట్టిరి. ఆవరణమందు దుబ్బువలెఁ బెరిగియున్న గడ్డినంతయు దోకి శుభ్రము చేసిరి. గజనీమహ్మదుచే నవయవ విహీనగఁ జేయఁబడిన కారణమునఁ గాబోలు స్వశరీర మైనను శుభ్రపఱచుకొను శక్తిలేకయున్న దేవీ విగ్రహమునకు భక్తులందఱు మీఁదబడియున్న నెలుకపెంటలను దుమ్మును బోఁదుడిచి సీకాయరసముతో మడ్డినంతయుఁ గడిగి వెండికన్నులు మొదలగువాని నాయా చోటుల నలంకరించి తమ కోరికల ఫలింపఁ జేయునని తలచుచుండిరి. గాని యింత శక్తి విహీనమగు రాతివిగ్రహము మన వాంఛితముల నెట్లు నెరవేర్చునని యొక్కఁడును తలపఁడయ్యెను. అంతకు మునుపు మడ్డి పట్టియుండుట వలన నెటులున్నను కండ్లు మొదలగునవి చక్కగాఁదోమి యలంకరించిన పిమ్మట మాత్రము చూచిన వెంటనే వాంతులుపుట్టి చచ్చునంతటి భయము గొల్పుచుండెను. ఆముదముచే నంగుళమెత్తు మడ్డిపట్టియున్న దీపపు నెమ్మెలను ప్రమిదెలను బ్రయాసపడి తోమి గుడిలోపల వెలుపలనున్న గూండ్లయందును గుడినుండి క్రిందివరకున్న మెట్లకిరుపార్శ్వము లందలి పిట్టగోడలమీదను బెట్టియుంచిరి. మఱికొన్ని యగండముల నాలయములోపల శక్తియెదుట వ్రేలాడఁ దీసియుంచిరి. ఖడ్గముల సానబెట్టించి లోపల నొకగదియందు వ్రేలాడఁగట్టిరి. ఇంతలో నమవసయువచ్చెను. ఆనా డాబాలగోపాల మభ్యంగన స్నానము లాచరించి నూత్న వస్త్రధారణులై యుపవాసము నుండి సూర్యుఁడెప్పుడు క్రుంగునాయని వేచియుండిరి. ఆ నాడు మిట్టమధ్యాహ్నమం దొక పెద్ద సభగావించిరి, ఆసభయందు జారుఁడును, చోరుఁడును, విద్యావిహీనుండును, మూర్థాగ్రేసరుఁడును నగు వారి పురోహితుఁడు దేవి నిక్కముగఁ బ్రత్యక్ష యగునని తలఁచి తత్ప్రసాదంబు దానొక్కఁడే పాలుగొను వాంఛను లేచి యిట్లని వచింపసాగెను.

“సభికులారా! మీరందఱు శ్రద్ధతోనేవచించు వాక్యముల వినుడు. మనతర మందిదివర కెన్నడు నొసగఁనట్టి నరబలి యీ దినమున నియ్యఁబోవు చున్నాము. అందు సాధారణపు మానవుఁడు గాడు. సమస్త విద్యా సంపన్నురాలును సౌందర్యవతియునగు రాజుకూతురై యున్నది, అట్టియెడ మనమందఱము గుమిగూడిన నాలయమున మిక్కుటముగు నల్లరియగును. అదియునుంగాక రాత్రి నా కలయందు దేవి ప్రసన్నయై “నాకు బలి యిచ్చునపుడు నల్గురు మనుజులు దప్ప నెక్కువ యుండ గూడదు. అట్లున్న యెడల నాకన్యకను వదిలి మిమ్ములనే మ్రింగెద" నని వచించినది. కాన మీరందఱు గొండ యడుగు భాగమందే యుండుఁడు, దేవి ప్రత్యక్ష యైన వెంటనే యామె యనుజ్ఞఁ గొని మిమ్మందఱ బిలుపించెదను." అని నమ్మిక కలుగునట్లు వచింప “ నెద్దు యీనినదన్న దూడను గట్టివేయు" మను నంతటి బుద్ధిశాలులగు నా మూడు లందఱు వల్లెయని యతని వాక్యములకు సమ్మతించిరి. అంత గొంతవడికి సభ ముగింపుచేసి యెవరిండ్లకు వారు పోయిరి. సభ ముగియునప్పటికి నాలుగు గంటలయ్యెను. తరువాత గొందఱు పెద్దమనుష్యులు లెక్కలేక మధ్యభాండముల మోయించుకొని కొండమీది కేగి కొన్నింటి దేవి గుడియందుఁ బెట్టించి కొన్నింటి రాత్రికి దాము నిలువఁదలచుఁ కొన్న స్థలమునఁ బదిలము సేయించి పరిచారకుల కొందఱ నటగావలి యుంచి గృహములకు మరలి వచ్చిరి. అనంతర మీ దారుణ కృత్యములఁ జూడ నోపక కనుదొరంగి పోయెనో యన రవి పడమటి సముద్రమునఁ గ్రుంకెను. బాగుగఁ జీకటి పడిన వెంటనే నౌకరులేగి దీపముల వెలిగించి వచ్చిరి. రాత్రిఁ దొమ్మిద గంట లగుడు మతస్థులెల్లరు పురోహితుని యింటిదగ్గరఁ జేరిరి. నలుగురు మనుష్యులు లోని కేగి యొకగది తలుపుదీయ దానిలో నొండు దివ్యమంగళ విగ్రహము రూపముదాల్చిన వగపునుంబోలె నేలకంటుకొని పడి యుండెను. వా రామెను బైటికి రమ్మని యాజ్ఞాపింప నాహారము లేకపోవుట వలనఁ గాకపోయినను మితిలేని శోకభారమున లేవనోప కట్లే పడియుండ నామెం గొనివచ్చుటకు వ్యాఘ్రముల వంటి నల్గురు స్త్రీలను బంపిరి. వారుపోయి యా కన్యనులేపి చేతులతో నెత్తుకొనివచ్చి బయట సిద్ధముగనున్న నొక పల్లకి యందు కూరుచుండ బెట్టిరి. చెవులు బ్రద్దలగునట్లు రుంజా మొదలగు భయంకర వాద్యములు తమభీకర ధ్వానములచే దిశల గలఁగుండు పడఁజేయుచుండ మేళ తాళములతోఁ బల్లకినెత్తుకొని యందఱును గుట్టవైపునకు బయలుదేరిరి. పాపమా సవారియందున్న కన్యక కెట్టిగతి పట్టెనో యోచింపుఁడు. తల్లి దండ్రులు బంధువులు దోడుకత్తెలు మొదలగువారు బలసిరా వివాహోచిత వేషమున శుభ వాద్యములతో నూరేగదగు నాకన్యక దుర్మార్గులగుఁ బాషండులు వెంటరా మరణసూచక వేషముతో భయంకర వాద్యములు మున్ను ముట్ట నూరేగవలసి వచ్చెఁగదా దీని కంతయు సత్య విద్యావిహీనతయే కారణము. విద్య నెఱుఁగని కతమున నీ మతస్థులందఱు దమపురోహితు లెట్లుచెప్పిన నట్లు నడచుకొందురు. అట్లు కొండయడుగు భాగముఁ జేరిన పిదపఁ బై కేగ నేర్పఁబడిన నలువురు పల్లకీబోయలు దప్పఁ దక్కినవార లక్కడే నిలచిపోయిరి. పురోహితుఁ డాదిగాఁగల నలువురు పల్లకిని గుడిలోనికిఁ బట్టించుకొనిపోయి శక్తియెదుట బెట్టించి బోయల వెళ్లుఁడన వారలును నట్లే వెడలి పోయిరి. అంత నా కన్నియపైనున్న ముసుగుఁ దీసివైచుట తోడనే యెదుటనున్న భయంకరమగు శక్తిని జూచి భీతచిత్తయై మూర్చిల్లి లేచి తన దురవస్థం దలఁచుకొని యణంచుకొన్నను దాగక తెర తెరయై వచ్చుచున్న శోకమున నిట్లు విలపింప సాగెను. " దైవమా ! నేను నీ యెడఁ గావించిన యపరాధ మేమీ ! నిర్హేతుకంబుగ నా కిట్టివ్యధ నేలఁ దెచ్చి పెట్టితివి? కలనైన నిట్టి దుర్మరణంబు నొందుదునని తలంచితినా? హా! తల్లిదండ్రులారా ! నావంటి నిర్భాగ్యురాలి మీ రేలఁ గాంచితిరి. మిమ్ము దరిలేని శోక సాగరంబున ముంచివైచితిఁ గదా ! మీరెంత పరితపించు చున్నారో ! హా ! మంజరీ !నీవంటి ప్రాణ సమానురాలగు సఖి మఱియొకతె దొరకుట దుర్లభము. నీ మాట వినకయే నిట్టి బెట్టిదములకు లోనైతిని. నీవు వచించిన ప్రకారము మందిరంబునఁ బరుండియే యున్న నాకీ ప్రాప్తి గలుగకుండును గదా : నే నెంత విలపించి యేమి ప్రయోజనము. తెగించి పోరాడుదమన్నఁ జేత నొక కత్తియైనను లేదు. మనోహరా ! నీ యుత్సంగంబుస వసించు భాగ్యము దౌర్భాగ్యురాలనగుట నాకులేకపోయినది. పరమేశ్వర ! ఎన్ని జన్మములకైనను నీ హృదయనాథుడగు పృధ్వీరాజునే ప్రాణ కాంతునిగా నొనర్పు " మని తనవారి నందఱిఁ దలంచుకొని యొక్క పర్యాయమేడ్చి చేయునదిలేక నిరాధారయై వ్వాఘ్రముల మధ్యఁ జిక్కిన లేడివడువునఁ బడియుండెను, పురోహితుఁ డాదిగాఁగల తక్కిన నలుపురు తమతమ పూజాకార్యముల నెరవేర్పఁదొడగిరి. పురోహితుఁ డెఱ్ఱని పుష్పములతోడను, నక్షత్రములతోడను, మంత్రముల జపించుచు విగ్రహమునకుఁ బూజసేయుచుండెను. వేరొకండు రెండుమూడు బిందెల యన్నమును గుమ్మరించిదానిలో నెఱ్ఱని రంగుఁబోసి కలుపుచుండెను. ఇంకొకఁడు శక్తియెదుట నుండు గుండములో హీనవస్తువుల తుచ్ఛములగు మంత్రములఁ బఠింపుచు వ్రేల్చుచుండెను, ఆంత నర్థరాత్రము గావచ్చినందునఁ జేయవలసిన కార్యము లన్నియు జేసి యిరువురా కన్నియను లేపియెదుటకుఁ గొనివచ్చి నిలువఁబెట్టి యొరగిపడకుండఁ బట్టుకొనియుండిరి. నిర్జీవ ప్రతిమవలె నా కన్నియ నిలచియుండెను. ఒకడు శంఖముబూరించుచు గంట వాయించుచుండెను. పురోహితుండతి తీక్షణమగు గత్తినొకదానిం గైకొని మంత్రోచ్చారణము సలుపుచు నామె శిరంబుఁ దెగవ్రేయ సిద్ధమై యుండెను. అట్టి మహోపద్రవమగు సమయంబున తేజశ్ళాలియగు యౌవనవంతుఁ డొకఁ డతిత్వరిత గమనంబున గుడితలుపులు గుభాలున నెట్టుకొనివచ్చి తలదెగ వ్రేయుటకు సిద్ధముగనున్న పురోహితుని హస్తము నున్నదాని నున్నట్లే తునుమాడెను. తోడనే విభ్రాంతుఁడై పురోహితుఁడు నేలగూల సంయుక్తం బట్టుకొని యున్న ఇరువురు వేరొక గదికేగి యాయుధములంగొని యౌవన వంతునిపై దుముక వచ్చుచుండిరి.

ఈ లోపల నావచ్చిన పురుషుండు' "సంయుక్తా " యని కేకవైచి తనవద్దనున్న రెండవఖడ్గము నొసఁగెను. వెంటనే సంయుక్త ఖడ్గము నందుకొని యుత్తరప్రత్యుత్తరములకు సమయము లేనందున నా వచ్చిన మనుజుఁ డెవరైనదియు నెఱుఁగక పోయినను తనకు సాహాయ్యమొనర్పఁ జనుదెంచెనని యూహించి తానును బోరాడ సిద్ధమయ్యెను. వామమార్గు లిరువురిపై వారిరువురు లంఘించి యతినిపుణముగ వారిఁ దుదముట్టించిరి. ఈ కల్లోలమంతయుఁ గాంచి శంఖముఁ బూరించ నతడు బిరబిర గ్రింధికి బరువెత్తి యక్కడివారల కీసంగతిఁ దెలియఁబఱుపఁ దత్క్షణంబ వారును హుంకారము లొనర్చుచు బయలుదేరి గుడిఁ బ్రవేశింప గడఁగిరి. ఈలోపల గుడియందలి సంయుక్తా యౌవన వంతులు ద్వారమున కిరుపార్శ్వముల నిలచి వామమార్గుల నావరణము బ్రవేశింపకుండఁ జేయుచుండిరి. అతి ప్రయత్నము మీద గొంతసేపటికి వామమార్గులు లోపలం బ్రవేశించి యాయుధములతోఁ గొందఱు దండములతోఁ గొందఱు పోరాడసాగిరి, సంయుక్త యౌవనవంతు లిరువు రతిచమత్కారముగ ననేకులఁ జంపుచుండిరి. దేవి ప్రత్యక్షమై తమకు వరమొసఁగి స్వర్ణ సౌఖ్యముల నొనగూర్చునని తలఁచియున్న భక్తులకందఱకు సంయుక్తాదేవి ప్రత్యక్షమై యట్టి సౌఖ్యములే యొనగూర్చు చుండెను. ఇట్లు వీరిద్దఱు హస్తలాఘవ మొప్పఁ జిత్ర విచిత్రములుగ ఖడ్గములఁ ద్రిప్పుచు శత్రువుల వ్రేటులఁ దప్పించుకొనుచు హోరాహోరిగఁ బోరుచున్న తరుణమున నడిజవ్వన మందున్న రాజపురుషుఁ డొకడు ఖడ్గపాణియై శీఘ్రగమనంబున గొండనెక్కి వచ్చుచు " ఓరీ ! బలియొసంగఁ దెచ్చిన కన్యకకు సహాయముగవచ్చిన పురుషునకు గుడిచేతిపై బలమగు గాయము తగులుటచే వామహస్తమున బోరాడుచున్నాడు. ఆ కన్నియయు మిక్కుటముగ నలసియున్నది. కావున మీ రంద ఱుత్సాహమున బోరాడుడు." అను హెచ్చరిక వాక్యములు విని తోడనే రివ్వున బై కేతెంచి యచటనున్న వారినందఱి నొక్కుమ్మడి నఱక నారంభించెను. రాజపురుషునిధాటి కోర్వజాలక ద్వారము బయట నున్న వామమార్గు లొకఁడు వోయిన త్రోవను మఱియొకఁ డేగక చెల్లాచెదరై పారదొడగిరి. అంత నతఁడావరణమందుఁ బ్రవేశించి రెండుచేతుల రెండుకత్తులఁబూని విశృంఖలలీల శత్రుధ్వంసముఁజేయ నారంభించెను, సంయుక్తా యౌవనవంతులును దమకు వేరొక సాహాయ్యము దొరికినదని యుత్సాహమున విజృంభించి రిపుశాసన మొనర్చుచుండఁ జేయునదిలేక లోపలి వారునుఁ బిక్కబలిమిఁ జూపి పరువెత్తసాగిరి. అట్లు పరువెత్తు తరిఁ బ్రాకారపు గోడలెక్కి దుముకఁబోయి చీకటియగుటచే నొకచోటనుకొని వేఱొకచోటఁబడి యనేకులు ప్రాణముల వదలుచుండిరి. అంతఁ గొంతవడికిఁ దమ్మెదురించువా రెవరును లేకపోవుటచే సంయుక్తా యౌవనవంతులిద్ద ఱొకచోఁజేరి నిలచియుండ రాజపురుషుండును జేరి వారిచేఁ బ్రణతులంది యా స్థలమంతయుఁ బీనుగుపెంటలతో భీభత్సముగ నున్నందున వారిని వెంటఁగొని వేరొకచోటికేగి యట యౌవనవంతుని హస్తమునకు చికిత్ససేయ నొక కళేబరముపై బట్టలాగి దానిఁదడిపి బిగించుటకై జలముకొఱకు వెతక నెచ్చోటను గాన్పింపఁదయ్యెను. అత్తరి సంయుక్త మరల గుడిలోపలికేగి యటఁ బురోహితుఁడు దేవికిఁ బ్రోక్షింపఁ బెట్టుకొనియున్న జల కమండలువును గొనితెచ్చెను. ఆ నీటియం దా గుడ్డను దడిపి గాయముపై బిగించికట్టిరి. అనంతర మా రాజపురుషుఁడు వారిద్దఱిం దోడ్కొని కొండదిగి పురమువైపునం గొంత దూర మేగి యట నొక బయలు ప్రదేశమున నిర్మించియున్న డేరాల బ్రవేశించి భటపరీవృతమగు నొక గుడారమున యౌవనవంతు నునిచి నడుమ నిర్మింపబడి యనేకులగు గావలివారలతో గూడుకొనియున్న మఱియొక గుడారమున నా కన్ని యం దిగవిడచి వారిద్దఱివద్ద సెలవుగైకొని వెడలిపోయెను.