రాణీ సంయుక్త/ఐదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఐదవ ప్రకరణము

ట్లా బాటసారి గుహఁ బ్రవేశించి యెంతదూరము నడచినదియు నెఱుగజాలముగాని గడియ యగునప్పటి కవతలమెట్లు కాలుఁ దగిలెను. వాటిమీదుగ నెక్కివచ్చి యొక యుద్యానవన మధ్యమున దేలెను. అట నేమిజేయుటకును దోచక నలుదిక్కులు పారజూచుచు నిలువబడియుండ జెట్లసందులనుండి దివ్యభవనమొండు దృగోచరమయ్యెను. కనుపడిన యా సౌధము దగ్గరకు బోవదలచి చెట్లమాటున డాగుకొనుచు నిశ్శబ్దముగ గొంతదూర మేగ వాక్యములు వినవచ్చెను. మాటల సవ్వడిఁబట్టి మఱింత దగ్గరకేగ నట నొక మందిర ప్రాంగణమున దీర్ఘకాయుడును, నెఱ్ఱమామిడిపండు బోలిన మొగముంగలవాడును నగు మనుజు డొకండు సందేశముం గొనివచ్చిన నలుగురు భటులతో సంభాషించుచుండెను. ఆ మనుజుడు సోఫాపై గూరుచుండియుండెను. భటులు ప్రక్కలనొదిగి నిలిచియుండిరి. సోఫామీఁద యతఁడు కొంచెమించుమించుగ నేబదివర్షములు సూచియుండును. జిల్తారు మయమైన పాగను ధరించి బంగారుచెమ్కీ పనిచేసిన షేర్ వాణీని దాల్చి రేష్మీపాలుజామా దొడిగి పాదములకు మేజోళ్లబూని యుండెను. మఱియు దూరముగనున్న హుక్కాగొట్టముద్వారా మాటిమాటికి బొగబీల్చి ముక్కులవెంట నోటివెంట వదలుచు దన కట్టెదుటనున్న నలువురు మనుష్యులపై గోపదృష్టిపఱపి గద్దించి పలుకుచుండెను. భటులు నల్గురు నల్లనిలాగులఁ దొడుగుకొని యెఱ్ఱబనారస్ చొక్కాలఁ దాల్చి పసుపురంగు పాగల నెత్తి ధరించి నడుమున కాకుపచ్చరంగుగల కాశలఁ జుట్టుకొని నయ భక్తుల నా పెద్దమనుష్యునితో దమ సమాచారముల విన్నవింపుచుండిరి. సోఫాపై గూరుచున్న మనుజుడు వీరల దిక్కరించి మాటలాడుచుండుటఁబట్టి యతండే ప్రభువని యా బాటసారి గ్రహించి పొంచియుండి వారిమాటల నాలింపసాగెను. అప్పుడా దొర భటులపై గోపదృష్టిబఱపుచు “ ఛీ ! దుర్మార్గులారా ! మిమ్ము నింతింత కండలుగగోసి కాకులకు వైచినను బాపము లేదు : మీకింత స్వతంత్రమా ? బుద్దిహీనులారా ! మీకున్న యాలోచన సుల్తానుగారికి లేకుండెను గాబోలు. పరుఁడగుపడిన తక్షణమే చంపక యెంతశ్రద్ధతో గాపాడుచున్నను నెట్లోగికురించి తప్పించుకొనిపోయి మన రహస్యముల వెల్లడిసేయునవికదా గోరీగా రగుపడిన వాని నగుపడినప్పుడే చంపవలసినదిగ నాజ్ఞాపించినారు. " అని పల్కెను. అందులకానల్గురు చేతులజోడించు  కొని మొగములపై దీనత్వముదోప " మహాప్రభో ! రక్షింపుడు, చేతఁజిక్కినవా డెందుఁబోవునను ధైర్యమునను వానివలన మనకేమైన సహాయము దొరకగలదనియు నుపేక్షచేసినారము " అని విన్నవింప నుగ్రుండై యా దొర "ఛీ ! మూడులారా ! నే గావించుచున్న పన్నుగడలన్నిటికి విఘ్నములు సేసితిరి. వాడు చావక బ్రదికియే యుండెనా మనకీ యార్యావర్తమున నిలుచుట కావంతయు నవకాశముండదు. నే నెన్ని టక్కులబన్ని పృథ్వీ రాజునొద్ద నేమిసేయు చున్నదియు మీ కే మెఱుక. ఆహా ! ఎంత పని గావించితిరిరా దుర్మార్గులారా ! అని దీర్ఘవిశ్వాసము వదలి మిక్కుటముగ గలిగిన రోషమువలన నొడలెఱుంగక చేతనున్న హుక్కాగొట్టము నావల బారవైచి సోఫాకు జేరగిలబడి కూరుచుండి యుండెను. అత్తరి లోపలినుండి పరిచారకు డొకడేతెంచి "సర్కార్ ! ఇదే మీ యాజ్ఞప్రకారము భట్టుగారిఁ గొనివచ్చి నాడ" నని పొడుగుపాటి బక్కపలచని నల్లని మనుజుని దెచ్చి చూపించెను. వెంటనే యజమాని లేచి యావచ్చిన మనుజునకు సలామొనరించి "రండిభట్టుగారు ! వచ్చికూరుచుండుఁడ"ని యాసనము జూపింప నతడు దానిపై నాసీనుడయ్యేను. అప్పుడు వారిరువు రీ విధమున మాటలాడసాగిరి.

భట్టు : ఈ దినమున వీరలేమైన గ్రొత్తవార్తలు దెచ్చినారా?

యజ : త్వరలో మా కందరకు నిక్కడినుండి యుద్వాసనగునట్టి యుపాయము గనిపెట్టుకొని వచ్చినారు.

భట్టు : ఏమి ! అట్లనెదరేల ? . యజ : అయినది కానిండు. తరువాత వచించెదను. ఇప్పుడీ జాబునఁగల వృత్తాంతములేమో చూచి చెప్పుడు. అని లేఖ నొకదాని నందియ్యఁ గైకొని భట్టుగారిట్లు చదువఁ దొడఁగిరి.

"మనోహరా ! తరణి సందర్శనంబులేనిచోఁ బద్మిని ప్రాణముల భరింపనోపదు. దీనికై ననేకములగు నితరమదకలములు కాచుకొని యున్నవి. లోకబాంధవ సమానుండవగు నీవీ పద్మినిం గరుణించి పరనాగముల వాతఁబడకుండ దక్కించు కొనవలయునని వేడుకొనుచున్న దానను.

"సంయుక్త"

జాబునందలి సంగతులువిని పొంచియున్న బాటసారి విస్మితుడై తాను పోయినదనుకొనిన వస్తువుతన కెంతమాత్రము సంబంధము లేని పరులవద్ద నగుపడినచో మానవుండెట్టి స్థితియందుండునో యట్టి యవస్థఁ బూనియుండెను. అంత మరల భట్టు గారు యజమానుడు నిట్లుమాటలాడసాగిరి. -

యజ : భట్టుగారూ ! దావియందుగల సంగతులేమి ?

భట్టు : మఱేమియులేదు. కన్యాకుబ్జనగర మేలుచున్న జయచంద్రునకు సంయుక్త యనునొక కూతురు గలదు. ఆమె మన చక్రవర్తిని వలచియున్నది, ఈ యుత్తర మామె లిఖించినదే !

యజ : ఏమని ? ఎవరి పేరు? భట్టు : చక్రవర్తికే. తన్నెటులైనఁ బెండ్లి యాడుమనియు లేకున్నఁ బ్రాణములఁ ద్యజించెద ననియు వ్రాసి యున్నది.

యజ : ప్రాణముల వదలునంతటి మోహము గలిగియున్నదా ఆ కన్నియకు?

భట్టు : నందేహమేమి ?

యజ : మరి చక్రవర్తి కామెపై నింత ప్రేమమున్నదా ?

భట్టు : ఆహా ! ఇంతకన్న నెక్కువే :

యజ : నిక్కము వచింపుము.

భట్టు : నిశ్చయమే చెప్పుచున్నాను. చక్రవర్తికామెపై నింతకన్న నెక్కువ మక్కువగలదు.

యజ : అటుపైన జక్రవర్తి యింతకాల ముపేక్ష చేసియుండుట కేమికారణము?

భట్టు : జయచంద్రునకుఁ దనకుఁగల వైరమువలన చక్రవర్తి కొంచెము వెనుదీయుచున్నాడు. కాని యెప్పుడో యొకసారి పెండ్లియాడక మానడు.

యజ : ,అయిన మనమిప్పుడు చక్రవర్తిని సులభముగనే తుదముట్టింప వచ్చునే ?'

భట్టు : ఎట్లు?

యజ : ఏకరణినైన మనమా సంయుక్తను జంపించవలయును. అందువలనఁ జక్రవర్తి నశించును. పిదప మనము రాజ్య మాక్రమించుకొన వచ్చును. సంయుక్తను జంపితిమన్న వార్త యొకవేళ జయచంద్రునకు దెలిసినను నతడు మనపై నెత్తిరాడు. వచ్చినను నతని నొక్కనిఁ బారదోలు సామర్ధ్యము మావద్ద గలదు. ఇన్నినాళ్ళ నుండియు బ్రసిద్దివడసిన ఢిల్లీ కనూజ్ రాజ్యములు రెండు మైత్రితో నున్నందున మాకిచటఁ గాలుపెట్టుటకు వీలుకలుగక పోయినదిగాని లేకున్న నీ దేశము నీపాటికే మావశము గావించుకొనియుండక పోదుమా. కానిండు ప్రస్తుతవిషయము గుఱించి యేమాలోచించెదరు ?

భట్టు : మహాప్రభో ! ఏలినవారిదయ చల్లగనుండవలెగాక దానికిదివరకే యేర్పాట్లఁ గావించియున్నాను.

యజ : ఏమికావించి యున్నారు ?

భట్టు : సంయుక్తను జంపునేర్పాటులే.

యజ : ఎట్లు?,

భట్టు : ఇక్కడికి కొన్ని మైళ్ళదూరముననున్న మధురానగరముచేరువ నొక గుట్టపైఁ బ్రసిద్ధికెక్కిన కాళికాలయము గలదు. ఆ ప్రాంతముల నుండు వామమార్గులనువారు తఱచుగ నా దేవికీ నరబలులర్పించు చుందురు. ఆ మతస్థుల నెటులైన బ్రోత్సాహపఱచి సంయుక్తం జంపు సుపాయముఁ జేసిరమ్మని నా నమ్మిన నేవకుని నొకని నిదివరకే పంపియున్నాను. వాడన్ని కార్యములు చక్కబఱచియే యుండును, ఈ పైమాటలు చెవులఁబడిన వెంటనే పొంచివినుచున్న పాంథున కారాటమును, రోషభయ సంభ్రమంబులుసు నొక్క పర్యాయమే కలుగ వారి చెంతకేగ రెండడుగులు ముందుకువైచి సమయము కాదనుకొని యాగి తానువచ్చిన దారినే బయలు వెడలిపోవ నుంకించి మరల నేమనుకొందురో యను నాసఁబోవుటమాని యాందోళనమున నేమియుఁదోచక నిలువఁబడి యుండెను. అత్తరి భట్టుగారువచించిన వాక్యములకు ఢిల్లీ రాజ్యము తనకు జేకూరినంత సంతోషమునొంది యజమానుడు " వహవా ? ఎంతటి బుద్ధిశాలులండి మీరు? మీ కెట్టియుపకారము జేసియు మీ ఋణమును మాత్రము దీర్చుకొసజాలము" అని స్తోత్రముసేయ దొడగెను. అంత భట్టుగారు పట్టరాని సంతోషమున " మీరు నన్నింత పొగడవలయునా? నాపై సంపూర్ణ కటాక్షముంచుడు. ఇక నేను సెలవుఁబుచ్చుకొనెదన"ని యతనికి సలాములుగొట్టి వెడలిపోయెను. అంత నా యజమాని భటులఁ “ఈ దినమున నీ సంతోషపార్త వినుటఁజేసి మిమ్మందఱఁ క్షమించితిని. ఇక ముందిట్టి యకార్యముల సల్పితిరా మీ ప్రాణములఁ దీయించెదన"ని కఠినముగ బలికి వారిలో నిరువురికిఁ దనవద్దనుండ నాజ్ఞాపించి తక్కినవారితో " మీరీక్షణమున మన దండువిడిసియున్న స్థలమునకేగి యిపుడున్న తావుపదలి వేరొక చోటికేగవలసినదిగా నేనాపతితో వచింపుడు. వేవేగఁబొండ"ని సెలవొసంగ వారలును బయటరా నుద్యుక్తులై యుండిరి. అత్తరినిట దాగియున్న పాంథుడు' తానున్న చోటువదలి త్వరితగమనంబున సొరంగమార్గముగుండ బయటికేతెంచి జాగరూకుఁడై లోపలినుండి వచ్చువారల కగుపడకుండునట్లు గుహా ముఖమున దాగియుండెను. లోపలి యిరువురు దమయజమానికి సలాములొనరించి గుహామార్గమున బయటికేతేర నొకని తరువాత నొకరు వచ్చుచుండిరి. మొదటివానితల బయటి కగుపడిన నిముసమున దాగియున్న పాంథుడు తన ఖడ్గముతో దాని నెగుర గొట్టెను. రెండవవాడు దిగ్భ్రమజెంది వరలోనున్న తనకత్తిని బైకి దీనుకొన బోవునంతతో వానిపై కురికి పట్టుకొని క్రింద బడదన్ని రొమ్ము పై కాలువైచి " దుష్టులారా ! మీ కక్కడ మరణము తప్పినను నిక్కడ దప్పుననుకొంటిరా? అధర్మాలోచన వరులగు వారి దైవమెక్కడనైన శిక్షింపకమానడు." అనుచు వానిఁగూడ మొదటివానికి దోడుగబంపి యా రెండు కళేబరము లచటనే పడియున్న నా దారివచ్చి పోవువారికి సంశయము కలుగునని చేరువనున్న యమునం బారవైచి తన శరీరము శుభ్రపఱచుకొని తాను గావించిన సాహసకృత్యమునకుఁ బరవశుండగుచు నాలుగు గంటలు మీరినందున బురము దారిఁబట్టి పోయెను,