రాణీ సంయుక్త/నాలుగవ ప్రకరణము
నాలుగవ ప్రకరణము
అనేక సంవత్సరములకు పూర్వ మార్యచక్రవర్తియగు యుధిష్ఠిరుని కాలమున నిర్మింపబడి యింద్రప్రస్థమను ప్రసిద్ధనామంబున బ్రఖ్యాతిగాంచి యేడెనిమిదివందల సంవత్సరముల క్రిందటివరకు నా యార్యచక్రవర్తుల స్వాధీనమందేయుండి తదనంతరము మ్లేచ్చ సుల్తానుల పాలఁబడిన డిల్లీనగరమగూర్చి మీరందఱు వినియేయుందురు. మహోన్నతములగు సౌదప్రాకార సంచయములచేతను, నతివిశాల మనోహరములగు నుద్యానవన వాటికల చేతను, వినుతికెక్కి క్రీస్తుశకము పదునెనిమిదవ శతాబ్దాంతము వరకు జక్రవర్తులకే వాసభూమియగుచు వచ్చిన ఢిల్లీనిగూర్చి వేరుగ వచింపనేల? ఈ నగరముయొక్క దక్షిణదిశనుండి మధురాపురమునకొక గొప్ప రాదారిబాట నిర్మింపబడియున్నది. ఈ దారి పట్టణము వెలుపట మూడు మైళ్లదూరమున ఢిల్లీని జుట్టుకొని వచ్చు. యమునతో గలసి కొంతదూరమువరకు నదీతీరముననే పోవుచుండును. ఈత్రోవ ప్రయాణీకులు పథశ్రమం బార్చుకొనుటకై పెంచఁబడిన వృక్షములచే గాక, పురమువెలుపట యడవిలో వేయబడియుండుట వలన, నానావిధ వృక్షలతా గుల్మములచేఁ బరీవృతమైయుండెను. అట్టి యా చిన్న యడవి మార్గముగుండ నొకనాఁటి మిట్టమధ్యాహ్న కాలమందు మనుజుడొకడు కాషాయపు రంగుగల పొడుగుపాటి యంగరఖాను ధరించి, యట్టివర్ణమేగల పాగ నొకదానిఁ దలకుఁజుట్టుకొని కమండలుపు మొదలగు వస్తువులు గలిగిన యడపమొకటి భుజముపై వ్రేలాడుచుండఁ జేతిలోని దండమును ద్రిప్పుకొనుచు దీర్ఘాలోచనపరుండై వచ్చుచుండెను. ఇతనికి సుమారు నలువది వత్సరములుండును, ముప్పదియేండ్లు వచ్చునప్పటికే ముసలితనము వహించి మూలగూరుచుండ నలవాటుగల దుర్బలులగు కొందఱిఁబలెఁ గాక యా మనుజుడు మంచి పిక్కబలిమి గలిగి యుండెను. అతని మొగముఁజూడ ననేకకష్టముల ననుభవించి వానినుండి తప్పించుకొని వచ్చినట్లును, నొక కార్యభారమును దలధరించి యహోరాత్రములు దత్సాధనము నిమిత్తము పాటు బడుచున్నటులును దోపకమానదు. మిటమిటలాడు మండు వేసవికాలమందు దీర్ఘప్రయాణము సేయుచువచ్చిన యా పాంథుడు చల్లని నీడలచే బ్రాణములేచివచ్చు నటులున్న యా యడవి మార్గమున నొక పెద్దవృక్షపునీడఁ గొంత తడపు విశ్రమింపదలచి చేతియందలి దండమును, భుజముమీది సంచిని గ్రిందనొక చోటబెట్టి యుస్సుమని నిట్టూర్పుల విడచుచుఁ దొడుగుకొనిన చొక్కాయంతయు దడిసి వీపునకంటుకొనిపోవఁ బట్టిన చెమట చీదరవలన దానిఁదీసి యెదుటనున్న చిన్న చెట్ల కొమ్మలకు దగిలించి చెమట నార్చుకొనుచు బచారుసేయు చుండెను. అట్టి సమయమున నక్కడకుఁ బిలుపుమేర దూరములోనున్న యొక చిన్న గుట్ట యడుగుభాగమున మనుష్యులు మాటలాడుచున్నట్లు వినరానంత వరకు నా నిర్జన ప్రదేశమందు దానుతప్ప యితరులెవ్వరు లేరని తలఁచుచుండిన యా బాటసారి మనుష్యుల యలికిడి విన్నతోడనే శీఘ్రముగ దన వేషమును ధరించుకొని మెల్లన నా దిప్పను జుట్టిపోవ మొదలిడెను. నలు దిక్కుల నతిశ్రద్ధమై తిలకింపుచు నడచి యవతలికేగిచూడ నట నొక మానవుడైనను గన్పింపకపోయెను. అందుల కాశ్చర్య మందుచు గుట్టపైకిబోయి నాల్గుమూలల బరికించియు గార్యముఁ గానక మరల నాశబ్దమేతెంచిన స్థలమునకు వచ్చి ప్రతిపొదయందును బరిశీలింపగా దట్టముగ దీగెలచే నల్లుకొనియున్న యొక లతాగృహమునఁ దలుపొకటి క్రింద బరుండఁబెట్టి యుండుటగాంచి దానిఁపరీక్షింప లోనికేగి తలుపుఁబై కెత్త నెక్కి దిగుట కనుకూలముగ నుండునట్లు త్రవ్వఁబడిన మెట్లఁగూడు కొనియున్న గుహకనుపించెను. దానిఁజూచినతోడనే విస్మయం కలిగి మెట్లదిగి కొంచెము దూరముపోవ గుహవిశాలమై కనుపడెను. ఆత్తరిమనస్సున కించుక భయముదోప మరలి గుహాద్వారముకడకు వచ్చి యిట్లాలోచింపగడగెను. ఆహా! ఇదియేమి చిత్రము? మానవులు తఱచుగ సంచరింపని యీ రహస్యంపుఁ జోట నిట్టి సొరంగ ముండుట కేమికారణము. అడవిజంతువుల యా వాసమనుకొందునా ! అటులెన్నటికిఁ గాజాలదు. రహస్యా లోచనము లొనరించుకొన వచ్చిపోవువారి కేవిధమైన యాటంకములుఁ గలుగకుండునట్లు చమత్కారముగ నిర్మింపబడి యున్నది. విచారింపనిది రాజశాసనంబులకు వెఱచి దమ దుష్కార్యముల బహిరంగముగ సలుపుకొనవలను లేక రహస్యముగ గావించుకొనుటకై కట్టుకొన్న తుచ్చులగు వామమార్గుల కృత్యమైనఁ గావలయును. కానియెడల చక్రవర్తిని రాజ్య భ్రష్టునిజేయఁ గుట్రలఁ బన్నుచున్న యే యధికారుని కృత్రిమమైనఁ గావలయును. ఎటులైన దీని నిజము గనుగొనకతప్పదు. చీ ! బయలుదేరినవాడ నట్లేపోవక వెనుకకేల మరలితి. చేత నొకచిన్న కత్తియైన లేవిసమయమున దప్ప గృహమువెడలిన దాది నిట్టి పిరికితన మెప్పుడుఁ బూననైతిఁగదా. కానిమ్ము, మరల బ్రవేశించి దీనినిక్కమరసి వచ్చెదను. అవి దృఢ విశ్చయుడై పరుల కగుపడకుండ లోనఁబెట్టుకొనియున్న ఖడ్గమును జేతధరించి పరమేశ్వరునిపై భారమువైచి దానిగుండ నడచిపోవ నారంభించెను,