Jump to content

రాణీ సంయుక్త/ఆరవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఆరవ ప్రకరణము

కలకళా పరిపూర్ణుండై హిమాంశుండు తన శ్వేతకాంతులచే గన్యాకుబ్జనగర సౌధములకు వెండినీరు బోయుచు బ్రకాశింపు చుండెను. పరస్పర సంఘట్టనంబులలేచు యమునాతరంగతుషార సముదయములందడిసి, నెత్తమ్ముల పుప్పొళ్లంజిందులాడి, నవమల్లికా ప్రసవ సౌరణముల గొల్లగొని, కేతకీగర్భ పరిమళముల హరించి, పొగడతావులంగలసి మందహాసంబున శీతలమలయ మారుతుఁడు పాంథజనముల పరితాపం బపనయించుటకోయన బురంబునెల్లెడల సంచరించుచుండెను. రాత్రి పదునొకండు గంటలగుటచే మనుష్యసంచార మెచ్చటను లేకపోవుటయేకాక పక్షుల కలకలంబులును గడఁగి యూరంతయు మాటుమణగి యుండెను. కొన్ని గొప్పగొప్పవృక్షములపై నిదురించియున్న పక్షులుమాత్రము మేల్కనినపుడంతయు జంద్రాతపమునుంగాంచి తెల్లవారినదను భ్రమను రెక్కలవిదుర్చుకొనుచు గూండ్లవదలి బయటికేతెంచి యిటునటు గొంతదూరమేగి మరలివచ్చి తమ తమ నెలవుల జేరుచుండెను. అట్లు సకలలోకాహ్లాదకరమై పిండియారబోసినట్లు కాయుచున్న పండువెన్నెలలో గన్యాకుబ్జ రాజ్యమునం దనుపమానమని ప్రఖ్యాతికెక్కిన నొకశశికాంత శీలావినిర్మిత సౌధోపరితలంబున బాలికయొకర్తు తనప్రియవయస్యలంగూడి వెన్నెలవిహార మొనరింపుచుండెను. ఆ కన్నియ నూతనముగ బ్రాప్తించిన నిండుజవ్వనముచే రూపొందిన సౌందర్యరాశియో యన రాజిల్లుచుండెను. స్నిగ్ధమై బంగారు చాయలంగేరుకాంతిగల పచ్చనిశరీరమును, గుండ్రనిమొగమును వాలికలగు గనుదమ్ములుంగలిగి నాటిదినమున నా కన్యక చెవులఁ దాల్చిన రవలకమ్మల వెలుగులు పలుచని చెక్కుటద్దముల బ్రతిఫలింప గ్రొమ్ముడి సడలి యవటుతలంబునబడి నర్తన మొనరింపుచుండ, హసన్ముఖియైన నవమోహినీ దేవతయోయన సంచరించుచుండెను. అర్దరాత్రము కా వచ్చువరకు నట్లే విహరింపుచుండి పిదప గొంతవడికి మంజరి యను ప్రాణసఖిందక్క. దక్కినవారల వారివారి నెలవులకనిచి నెయ్యంపుసఖిం జేరబిలిచి యిట్లనియె.

కన్యక : సఖీ ! ఇపుడెంతకాలమైయుండును.

మంజ : కొంచె మించుమించుగ నర్ధరాత్రము కా వచ్చినది. ఇంకను బండ్రెండు గంటల ఫిరంగి వినబడలేదుగదా ! కన్య : అవును. చెలీ ! ఈపండువెన్నెలలో నా కెంతసంచరించినను విసువు జనింపకున్నది. ఆహా ! ఎల్లఁగడల నిశ్శబ్దముగనుండ నాకసమునందెచ్చటను మబ్బులేక నక్షత్రము లలరారుచుండ సంపూర్ణకాంతుల రాజిల్లు నీ చంద్రమండలము చూపరుల కెంత యాహ్లాదములు గొల్పుచున్న దే.

మంజ : అవును. దేశమందేకల్లోలములు లేక ప్రజలందఱు హాయిగసుఖింప ధీరపరాక్రమవంతుడై తేజశ్శాలియై కువలయ పాలనమొనరించు రాజుగాంచిన నెవరికానందము గలుగకుండును ?

కన్య : ఈ కాలమున నట్టివారిలేరైన గలరా?

మంజ :లేకేమి?

కన్య : చెలీ : అట్టి మహాత్ముని నామాక్షరముచే నా శ్రవః పుటముల నలంకరించెదవా?

మంజ : ఆహా ! ఎంత తెలియనిదానివలె నటించదవే, నా నోటజెప్పింపవలెననియా?

కన్య : అటుకాదు. నీ యుద్దేశమేమో చెప్పుము.

మంజ : మనయిద్దఱి యుద్దేశముల కెప్పుడు భేదముకలుగ లేదుకదా?

కన్య : లేదుగాని యిపుడు నీవువచింపరాదా !

మంజ : కానిమ్ము. నీ వాంఛిత మేల నష్టపరుపవలయును ? చెప్పుటకు నాకును వినుటకు నీకును విసుగు కలుగదులే. ఏ రాజు సద్గుణపుంజముల కాటపట్టని సమస్త ప్రజలచే నుతులందు చుండునో, యెవని పరాక్రమ శౌర్యములు వైరిరాజులకు గుండెదిగులు జుట్టించు చుండునో, యెవని రూపురేఖా విలాసములు సౌందర్యవతులని ప్రఖ్యాతి వహించిన కస్యకామణుల స్తోత్రము లందుచుండునో, యెవనినామ మెన్ని పర్యాయములు విన్నను నీకు దృప్తియుండదో .......

కన్య : అబ్బ ! పేరుచెప్పుచున్న నీ ప్రసంగమంతయు నేటికి?

మంజ : ఇంతచెప్పి పేరుచెప్పక మానుదునా? ఏమి, ఇంతలో నడ్డము తగిలితివి ; కానిమ్ము. సూర్యగ్రహమునకు తొమ్మిటి కోట్ల, పదునాల్గులక్షల, ముప్పదివేలమైళ్ళ దూరముననుండు గ్రహమేది?

కన్య : భూమి.

మంజ : దానికొక చక్రవర్తివలన గలిగిన పేరేమి ?

కన్య : పృథివి.

మంజ : మనదేశమందలి కవులు నృపాలునకుఁ జంద్రునకుఁగలిసి వచ్చునట్లు శ్లేషాలంకారమున వాడు పదమేది ? కన్య : కువలయపతి. మంజ : ఏకపదము జెప్పుము. కన్య : రాజు, మంజ : ఆ రెండిటిఁ గలిపిచెప్పుము. ఆతడే.

అన బట్టరాని సంతసమున మోము కలకలలాడుచుండ నేమియుఁ బలుకక వాల్జూపుల మంజరిఁ జూచుచు నా కన్నియ యూరకుండెను. అప్పుడు మంజరి యిట్లు పలుకరించెను.


43

మంజ : నెచ్చెలీ ! ఈ నిమేషమునఁ జంద్రబింబము గాంచుటకంటె నీ వదనము జూచిన నెక్కువ సంతోషము కలుగుచున్నది కదా?

కన్య : ఎందువలన?

మంజ : మనోహర నామ ప్రశంశచే సంతోషము పొంగి మొగముపై వెలిబారుచుండుటవలన.

కన్య : చాలులెమ్ము నీ మాటలు. అయిన నా రాజుగుఱించి యింకేమైన నూత్న వృత్తాంతములున్నవా?

మంజ : వలచియున్న దానవు నీకుమాత్రము తెలియదా?

కన్య : ఆయన సుగుణగణములవిని వలచితినిగాని ప్రస్తుతమతఁ డొనరించుచున్న కార్యములఁ గూర్చి నా కేమియు బాగుగ దెలియదు.

మంజ : అటులైన నెలరోజుల క్రిందట మా పినతల్లిగారి గ్రామమున కేగినప్పుడటఁ "జక్రవర్తి" యను పేరుగల మాసపత్రిక నొక దానిఁగాంచితి. అందుగల విషయముల సారాంశము దెలిపెదను వినుము. ఋషిజనసేవ్యమానమై, పవిత్రవంతమై ప్రఖ్యాతికెక్కిన మన యార్యావర్తమునకు మాంసఖాదనులగు కొన్ని జాతులవారి మూలమున లేనిపోని బెడదలు సంభవించినవి. మొట్టమొదట బాంచాలమున బశ్చిమప్రాంతముల నుండు ప్రజలు కొంద ఱాఫ్‌గన్ దేశస్తులగు మ్లేచ్చులఁ గలసి సలలముదిన నలవాటుపడినారు. వారివలన స్వార్థపరు లగు మఱికొందఱు మఠాధిపతు లలవాటుపడి వామమార్గులను పేరున దేశమునందెల్లెడల బోధించుచు ననేక ప్రజలఁదమలో గలుపుకొని దురాచారముల గడఁగ నారంభించిరి. అప్పటికే నూరు వర్షములనుండి దేశమున నుత్తములగు రాజ్యపాలకులు లేనందున బాఠశాలలన్ని యు ధనలోభులగు నధికారులమూలమున నాశనమై యుండుటచే జనులును విద్యావిహీనులై యుండిరిగాన మూర్ణులై తమ పురోహితుల మాటలేవిని మోసపోవుచు వచ్చిరి. ఇటులుండ జక్రవర్తి సింహాసనమునకు వచ్చిన పిదప నత డుత్తమ విద్యావంతుడగుటచే దన రాజ్యమున జరుగుచున్న హత్యల కసహ్యముజెంది తనదేశమునందట్టి దుష్కార్యము లొనరింపగూడదని గట్టి యుత్తరువు గావించి సత్యవిద్యావిదూరు లగుటచే బ్రజలిట్టి యకార్యముల నొనర్ప గడఁగినారుగదా యని యోచించి ప్రతినగరమునందు బాఠశాల లేర్పఱచి మాసిపోయిన చదువుల మరల బైకిఁదెచ్చినాడు. అందువలన నుత్తమ విద్యావంతులై జనులు కొందఱట్టి దుర్మార్గములుచేయుట మానివేసిరి. మఱియు పదునొకండవ శతాబ్దమున గలిగిన మ్లేచ్చుల యార్భాటములచే జనులందఱు నొక క్రొత్తమార్గము ద్రొక్కుచున్నారు. తమతమ కాంతలు మ్లేచ్చుల వాతబడకుండ సంఘమందనేక మార్పులఁ గలిగించు కొనుచున్నారు. అవి నేటి వరకును జరుగుచునే యున్నవికదా ! -

కన్య : అవును. పాపము. మన బోడికాంతల మ్లేచ్చులు పెట్టిన బాధలు గణింప నలవికాకుండెనట. మంజ : 'ఉండెనట' యని యనుచున్నావా? ఇప్పుడు మరల వచింప నలవికాని యల్లరులు జరుగుచున్నవట. గడచిన శతాబ్దమందే మ్లేచ్చుల పోరు దప్పించుకొనుటకు గొందఱు సంఘసంస్కార కర్తలు గ్రామములమీద బయలుదేరి ప్రతియూర నాడుబిడ్డల కెనిమిదవయేడు రాకమునుపే వివాహము జేయవలయుననియు, బురుషుడు గతించిన స్త్రీని మగని శరీరముతోడనే దహనము సేయవలయుననియు, వారలకు విద్యసెప్పించి, బహిరంగముగ దిరుగనీయ గూడదనియు బోధించుచుండిరని నీవెఱిఁగియే యున్నావుకదా!

కన్య : అయ్యో ! మఱచియున్న యా దుర్దినములందలి సంగతులన్నియు జ్ఞాపకమునకు దెచ్చితివా? ఆ విషయముల గుఱించి వ్రాసియున్న గ్రంధములఁ జదువునపుడంతయు నాకు భరింపనలవికాని వేదన గలుగుచుండును. ఆ పాడు దినములు పోయినవనియే తలంచితి. అయిన మరల నిపుడెవరైన సంస్కారకర్తలు బయలు దేరినారా ?

మంజ : బయలుదేరకున్న నెట్లు? మనవారందఱు మాపెద్దలేర్పఱచిన పూర్వాచారముల మానంజాలమని తమబిడ్డలకు పదహారవయేఁటివరకు వివాహమొనరింపక యుంచినచో నీ లోపలనే యే మ్లేచ్చుడో తన వాత వేసుకొని పోపుచుండును ; పురుషవిహీనయగు కాంత బ్రతికియున్న నెప్పుడో యొకనాడు రాక్షసునిపాలు కావలసినదే. విద్యా వతియై బహిరంగముగ సంచరించుచుండు కామిని యే మహ్మదీయునకో యాహారమగుననుట తధ్యమే.

కన్య : కట్టా ! మనజాతి కాంతల కెట్టి యిక్కటులు సంభవించినదే? అవును. ఇట్టియెడ బూర్వాచారమని పట్టుపట్టిన నెట్లు?

మంజ : మా పూర్వాచారము వదలజాలమని కూరుచున్న వారు తమవారల మ్లేచ్ఛులకే యొప్పగించుచున్నారు.

కన్య : అయిన సంస్కార కర్తలిపుడేమి చేయుచున్నారు ?

మంజ : ప్రతిగ్రామమునకేగి యందు మీ మీ స్త్రీలరక్షించుకొనదలఁచితిరా బాల్యమందే వివాహములు సేయుడనియు, లేకున్న మ్లేచ్ఛులబారిఁ ద్రోయవలసివచ్చుననియు, నుపన్యాసము లిచ్చుచున్నారు. అందులకు గొందఱు, సమ్మతించుచున్నారట. కొందఱు "మా పిల్ల లెటులైన గానిండు. మా పెద్దలేర్పఱచిన యాచారముల వదలమని వచించుచున్నారట. మఱికొందఱు సంస్కార పక్షమవలంబించియు, లో లోపల దమ పూర్వాచారముల విడువకున్నారట. ఇంక గొందఱు మనఃపూర్వకముగ సంస్కారపక్షముగైకొన నభిలాష గలిగియుండియు దమ పెద్దలకు జడసి యూరుకొనుచున్నారట. ఇప్పు డందువలన దేశమంతయు నాలుగువిధములై యున్నది. మఱియు గొన్నిగ్రామములందలి ప్రజలు తమమాట వినక ధర్మశాస్త్రముల నేవైన ప్రమాణములఁ జూపుడనికోర సంస్కరణ సమాజమువారు. గొన్నిశ్లోకములఁ గల్పించి చెప్పుచున్నారట.

కన్య : ఆశ్లోకము లేవో నీకు దెలియునా ?

మంజ : నాకన్నియు దెలియవుగానీ రెండుమూడు మాత్రము నా నోటికివచ్చును. వచించెద వినుము.

స్త్రీలకు వేదాది విద్యల నేర్పకుండుటకు,

"స్త్రీ శూద్రౌనాధీ యామితిశృతేః " అనియు

వారలకు బాల్యమందే వివాహము లొనరించుటకుగాను,

"అష్టవర్షాభవే ద్గౌరీనవ వర్షాచరోహిణీ,
 దశవర్షా భవేత్కన్యా తతఊర్థ్వంరజస్వలా."

"మాతాచైవ పితాతస్య జ్యేష్ఠోభ్రాతాతథైవచ,
 త్రయస్తే నరకంయాంతి దృష్ట్వాకన్యాం రజస్వలాం."

అను నవి పారాశర్యము మొదలగు స్మృతులలోనివని చెప్పి యొప్పించు చున్నారట. ,

కన్య : అయ్యో ! ఈ పాడు శ్లోకములే ముందుకు బ్రామాణికములై యప్పటివారి కంఠములఁ బట్టుకొనునేమోకదా !

మంజ : మఱి కాలము ననుసరించి సంఘమందు మార్పులఁగావించుకొనకున్న నెట్లు? ఈ మ్లేచ్చుల శ్రౌర్యము లన్నియు నడిఁగి యుత్తములగు రాజులు ప్రాప్తించి దేశమంతయు నెమ్మదిగనున్న తరి మరల యథా ప్రకారము కావచ్చును. కన్య : అప్పటివారల కివి కల్పిత శ్లోకములను జ్ఞానము గలుగక నడుమ ప్రబలమగు దురాచారముల మగ్నులై మాయాచారముల మానజాలమని కూరుచున్న చో నా కల్పాంతము మనతోడికాంత లెల్లరు మూర్ఖురాండ్రై యుండవలసినదే కదా !

మంజ : అటులెందుకగును ? ఆచారములన దేశకాలస్థితుల ననుసరించి పరమేశ్వర గుణకర్మాను కూలముగ బ్రజలందఱు నడుచుకొన వలసిన విధులేకదా ! ఒకవేళ మనదేశము నీవు వచించినట్టి స్థితికి వచ్చిన బుద్ధిమంతులగు కుచారసంస్కర్త లప్పటికెవరైన బయలుదేరకుందురా?

కన్య : అవునులెమ్ము. మనదేశమున కెట్టియిక్కటులు మూడవలసియున్నవో యెఱుగము. నా జనకుఁడు చక్రవర్తితో నింతవైరము బెట్టుకొనకున్న దేశమిట్టి గతికి వచ్చియుండదుగదా!

మంజ : అవును. మూర్ఖమతుల మనసు ద్రిప్పనెవరితరము?

కన్య : చెలీ ! ఇప్పుడీ సంగతులన్నియు ముచ్చటించుకొనుటవలన నా మనసు కలత నొందినది. మనగృహారామములోనికి బోయివత్తము. .

మంజ : ఒంటిగంట కావచ్చినది. ఇప్పుడేమి?

కన్య : అటుకాదు. త్వరలో మరలి చనుదెంతము రమ్ము. అన మంజరి తన చెలిమాట ద్రోయజాలమి నటులేయని సమ్మతించెను. అంతనా కన్నియ లిరువురు మందిరారామము లోనికేగ వెడలిరి.