రాణీ సంయుక్త/ఇరువదిరెండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఇరువదిరెండవ ప్రకరణము

ప్రచండుని నోడించిన మరుసటి దినమునఁ దెల్లవారినతోడనే చక్రవర్తి నానతి నాతతాయి తమసైన్యమును గన్యాకుబ్జము ముట్టడింప నడిపించెను. ప్రచండుని పరాజయంబువిని జయచంద్రుఁ డత్యంత రోషమూని చక్రవర్తిం జంపిగాని రణము మానఁగూడదని తన సేనాపతులఁ బురిగొల్పు చుండెను. వినయశీలుండు చక్రవర్తితో సంధి గావింప ననేక ప్రయత్నములు సలిపెఁగాని యవన్నియు నిష్ఫలములై నందునఁ దాను గయ్యమున సంబంధము గలుగజేసుకొనక దూరముగనుండి సమయము వచ్చిన రాజునకుఁదోడ్పడ దలఁపూని యుండెను. చక్రవర్తి నగరమున కెనిమిది మైళ్ల దూరమున డేరాలు వేయించి సేనను విడియింపఁజేసి దాని మూఁడు భాగములుగ విభజించి యందొక భాగమునకు గంకటుఁబతిని జేసి తూర్పు దిశయందలి ద్వారమును భేదింప నంపెను. కుంభీలకు నాయకత్వమున మఱియొక భాగము నుత్తరము ముట్టడింప బంపెను. తక్కిన భాగమును మిహిరుడను వాని యాధిపత్యమున దక్షిణముదాక నంపి వీరందఱకుఁ దోడు పడ నాతతాయిం బనిచెను. చక్రవర్తి యాజ్ఞానుసారము సైనికి లెల్లఱు బందూకులు గాల్చుచు వెడలి కోటను ముట్టడివేసిరి. లోపలనున్న జయచంద్రు సైనికులు చెలరేగి యెడతెరిపి లేకుండ ఫిరంగులను, బాణములను శత్రువులపై బ్రయోగింపసాగిరి. బహిర్ద్వారంబు భేదింప వెడలిన కంకటుఁ డత్యుత్సాహమున దనసేనను ముందుకు నడిపించుచుండెను.

విధి విరామము లేకుండ వచ్చుచున్న బందూకుల గుండ్లవలనఁ బెక్కుమంది చచ్చు టవలోకించి కంకటుఁడు సందులేకుండ దనసేన కడ్డముగ కుంజరయూధముల నిలువం బెట్టించి వాహిని నత్యంత పరాక్రమమున ముందుకు నడిపించి ఫిరంగులబెట్టించి ద్వారములఁ బగులగొట్టించు చుండెను. ఒక్కొక్క ఫిరంగీతాకుడునకు పిడుగువడినభంగి గొంత తడపు వరకును హోరుమను మ్రోత మోగుచుండెగాని తలుపులు మాత్రము స్వాధీనము కాకుండెను. దక్షిణాశయందున్న సేన గోడలపైకెక్క సాహసముసేసి యగాధముగనున్న కందకమును మనుజాశ్వకుంజర కళేబరవారంబులఁ బూడ్చి కోటగోడల కెగబ్రాకసాగెను. లోపలిపొరలు శత్రువులు దరికిరాకుండ నిప్పుల వర్షము గురిపింపఁ జొచ్చిరి. ప్రాణముల కాశింపక సార్వభౌమ నైనికులు తమవారలు కుప్పలుగ గూలుచున్నను ధైర్యము వీడక గోడల కెగబ్రాకుచుండిరి. వీరలిక్కడ నిట్లుపోరాడుచుండ మిహిరుఁడు తనవారిచే నుత్తరపుగవను నాశనము జేయించు చుండెను. ఫిరంగులగోడల చివరలకు గురిపెట్టించి కొట్టించు చుండెను. అందువలన నాభాగమంతయు ధ్వంసము కాఁజొచ్చెను. వందలకొలది ప్రాణము లొక్క నిముసమునఁ బోవుచున్నను వెనుదీయక చక్రవర్తి సేన నాలుగువారముల పర్యంతము హోరాహోరీగ బోరాడుచుండెను. అప్పటికిని గోట స్వాధీనము కాకుండెను. అంత చక్రవర్తి దుర్గమును గైకొని కాని యావల నడుగిడనని శపధము వట్టి ఢిల్లీనుండి మఱికొంత సేనను గొనిరమ్మని వేగులవారి నంపెను. ప్రాగ్దక్షిణోత్తర పార్శ్వములే శాత్రవులు ముట్టడించి యున్నందున లోపలివారలు పడమటిదిక్కున నించుక నజాగ్రత్తతో నుండిరి. చక్రవర్తి యాసంగతి నెఱిఁగి పడమటిభాగమున రెండు ఫర్లాంగుల దూరమునుండి కందకము మట్టమున కేటవాలుగ నుండునట్లు గోతినిద్రవ్వి కోటగోడల యడుగున సొరంగములుదీసి మందుగూరి కాల్చ నాజ్ఞాపించెను. గాతములుదీసి మందుగూరు సమయమున నీసంగతి లోపలివారలు కనుఁగొని యాప్రక్క కేగి శత్రువులపై నిప్పుల గురిపింప మొదలిడిరి. ఆ తరుణమునఁ దూర్పు దిశయందలి సార్వభౌమసేన విజృంభించి మొదటి ద్వారపుదలుపులను శకలములు కావించెను. వెంటనే రెండవదాని భేదింప గడగిరి. పడమటి దిశ యందలి వారలెట్లో తమాపని బూర్తిజేసుకొని మందునకు నిప్పంటించగా సంవర్తకాలమందలి పిడుగులం బలె భయంకర ధ్వానంబులు మిన్నుముట్టలేచి గోడల రాళ్లు కొన్ని గూలెనేకాని పూర్తిగఁ బడవయ్యె. అంత మరల గాతములదీసి మందుగూర నారంభించిరి. కోటగోడ లీరెండవ పర్యాయము కూలునను భయంబున లోపలివారెల్లరు నీవైపునకేచేరి శత్రువుల దగ్గరరాకుండ జేయుచుండిరి. వేలకొలది గూలు చున్నను వీడక కోటను నాశనము చేయవలయునని పట్టుఁబట్టి చక్రవర్తిసైనికులు గుండ్లలకు వెఱవక బందూకుల దెబ్బలఁ దప్పించుకొనుచు సురంగములద్రవ్వి మరల మందుగూర సాగిరి. ద్వారమును భేదింప నున్న వారు తమకించుక పైదాటి తగ్గినందున బూర్వముకన్న నెక్కువగఁ బనిచేయుచుండిరి. ఎడతెరిపి లేకుండఁ బ్రయోగింపసాగిన ఫిరంగిదెబ్బలచే నారెండవ ద్వారపు దలుపులును వకావకలయ్యెను. అనంతరము మూడవకవాటము నాశనమొనరింపఁ గడగిరి. పశ్చిమ దిశయందలి వారతిప్రయత్నముమీద గాతముల మందుతోనింపి మరల నగ్నినిడ బ్రధమమున వలెనే భీకరధ్వనులుప్పతిలి నేలయంతయు గదలి గోడల కతికిన రాళ్లన్నియు నెక్కడవక్కడ జారిగోడలు శిథిలము లయ్యెను. వెంటనే నాప్రక్క. నున్న వారెల్లరు చొరవఁ జేసుకొని లోపల బ్రవేశింపసాగిరి. ఈ తరుణమందే తూర్పు దిశయం దొక్క పర్యాయముగ దాకిన నిరువది ఫిరంగుల దాకున దలుపులు భిన్నంబులయ్యె. ఈ ప్రక్కనుండియు జక్రవర్తిసేన లోపల బ్రవేశింపసాగెను. అంత నాతతాయి దక్షిణోత్తరముల వారికూడ లోపలఁ బ్రవేశబెట్టెను. చక్రవర్తి సైన్యమంతయు లోపలజేరి శత్రువులు నిప్పులు కురిపించుచున్నను దాళుకొనుచు గోడల మీదకెక్కి యచటివారి గొందఱి గ్రిందికిఁదోయ నందఱనుదిగిరి ఆత్తరి పోరుమహా ఘోరమయ్యెను. బందూకనక, కత్తియనక బాణములనక, లాఠీలనక యిష్టమువచ్చిన యాయుధములతో నందఱు బోరాడగడఁగిరి. చక్రవర్తిసేన లోపలికేగి యుద్దమారంభింప జయచంద్రుని వాహిని నాశనముకాసాగి తుదకు మూఁడు వంతులు పూర్తిగా నాశనమయ్యెను. మిగిలినవార లించుక ధైర్యముచెడి పనిచేయుచుండుటఁజూచి జయచంద్రుని యువసకలాక్షౌహిణీ పతియగు కహరకంఠీరవుఁ డనువాడు తన సైన్యమును మరల బురిగొల్పుచు దాను యుద్ధమునకు దిగెను. కోట ముట్టడివలనను లోపలి యుద్ధము వలనను. చక్రవర్తి సేన యందును మూడు వంతులకన్న నెక్కువయే నాశన మయ్యెను. ఎంతనాశనమైనను నాతతాయి మొదలగువారు పలుకు ప్రోత్సాహంపు వచనంబుల శత్రువులకు లొంగక రణమొనరించు చుండిరి. కహరకంఠీరవుఁ డొక్కుమ్మడి సె రేగి చక్రవర్తి సేనయందు నడ్డమువచ్చిన వారినెల్ల నరకుచు నాతతాయిని సమీ పించెను. ఆత్తరి వారిరువురకు ఘోరమగు ద్వంద్వ యుద్ధముజరిగెను కొంతవడికి బందూకు గుండొకటివచ్చి యాతతాయి యెక్కి యున్న గుర్రపుఁగాలికి దగుల నదియా క్షణమందే నేలకొరగెను. ఆ తతాయి వెంటనే నేలకురికి శత్రుప్రహారముల దప్పించు కొనుచు మరల నొకగుర్రము నారోహింప బోవుసమయమున కహరకంఠీరవు డతనిశిరమును నేలగూల్చెను. అతి ప్రతాపవంతు డగు సేనాధిపతి కిట్టిపాటుకల్గు టవలోకించి సైనికులు ధైర్యము వీడసాగిరి. కాని యింతలో నీవార్తదెలిసి పృధ్వీరాజు పరువెత్తు కొనివచ్చి మరలఁ బురికొల్పఁ గడగెను. చక్రవర్తి వచ్చినాడని విని కహరకంఠీరవుఁ డతనిపై కురి'కెను. అత్తరి సైనికులందరు దమరాజును గాపాడు కొనుటకై తెగించి కహరకంఠీరవునిమీద బడిరి. కాని యాకలింగొన్న శార్దూలముభంగి వారి నందఱ నురుమాడుచు గహరకంటీరపుఁడు చక్రవర్తిని సమీపించి యతనితల దెగవేయ గత్తినెత్తెను. ఆసమయమున యౌవన వంతుడగు రాకుమారుఁ డొక డుత్తమాశ్వముపై వచ్చి చక్రవర్తిం జంపనెత్తియున్న హస్తముం దెగటార్చి తోడనే వానీ శిరముంగూల్చి భీతినందియున్న పృధివీరాజు సేనను మరల బురికొల్పెను. కహరకంఠీరవుని మరణమువలన జయచంద్రునిసేన పరుగిడజొచ్చెను. క్రొత్తగ నేతెంచిన రాజపుత్రుని యొక్కయు జక్రవర్తియొక్కయు నుత్సాహంపువచనములచే సార్వభౌమ సేన మరలనుప్పొంగి యుద్ధము సేయఁగడగెను. ఈతరుణ మందే చక్రవర్తికొనిరానంపిన క్రొత్తసేన ఢిల్లీనుండివచ్చి వీరలకు దోడ్పడి రణమొనరింప సాగెను. అనంతరము రెండుదినములకు జయచంద్రునివాహిని పూర్తిగ నాశనమయ్యెను. లెక్కలేని బందూకులు, బాణములు మఱియు రణమునకు వలసిన యితర శాస్త్రాస్త్రములన్నియు జక్రవర్తి పాలయ్యెను. జయచంద్రుని కొఱకు వెతకగా నతడెచ్చోటను గాన్పింపడయ్యెను. ఇట్లు సంపూర్ణజయము గాంచి చక్రవర్తి సంయుక్తను దోడితెమ్మని కొందఱు భటులనంప వారు పోయివచ్చి యంతఃపురము పాడుపడియున్న దనియు, సంయుక్త యెక్కడఁ గానరాలేదనియు వచించిరి. తన ప్రియకాంత గానరాలేదని వచింప నత్యంత విచారమగ్నుఁడై పృధివీరా జేమిచేయుటకుఁ దోచక యుండ బైరాగివచ్చెను. చక్రవర్తి యతనిఁ గాంచిన వెంటనే సంతోషమును బొంది యుచితసత్కారంబు లొనర్చి సంయుక్తను గురించి యడుగ "రాజా ! ఆమె యిప్పుడీ నగరంబున లేదు. నీవు విచారించకుము. ఆమె కేవిధమైన భయమునులేదు. ఇత్తరి నీవు నీ రాజధానికేగుము. ఆమె నచటనే పెండ్లియాడగల" వని నోదార్చి బైరాగి వెడలిపోయెను. అనంతరము చక్రవర్తి సేనా సమేతుఁడై తన్నుఁగాపొడిన రాకొమారుని వెంటఁగొని నిజరాజధానికిఁ బయనమైపోయెను.