Jump to content

రాణీ సంయుక్త/ఇరువదిమూడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఇరువదిమూడవ ప్రకరణము


న్యాకుబ్జ నగరమున రణము జరుగుచున్నంతకాల మీశ్వరభట్టుగా రా పురమునకుఁ బదిమైళ్ళ దూరమున నొక చిన్న యడవిలోనుండి సేవకులవలన నేనాఁటివార్త లానాఁడు తెలుసుకొనుచు దుదకు జక్రవర్తి జయమంది దుర్గము నాశనము గావించిపోయినాఁ డన్నవార్తవిని యటనుండి బయలువెడలి పట్టణములోని కేతెంచి చూడ గోట యెక్కడిదక్కడ శిథిలమై యుండెను. హతశేషులగు సైనికు లతనిగాంచి యావురుమని యేడువసాగిరి. వారినందఱ నోదార్చి జయచంద్రుఁ డెక్కడనని యడుగుడు బ్రతివాడును దనకుఁ దెలియదని వచించెను. అంత వారినందఱిఁ గొలువుకూటంబున నుండ నాజ్ఞాపించి తా నొంటరిగ నవరోథ సౌధములకేగి యందు రహస్యమందిరముఁ బ్రవేశించి వినయశీలునితో సంభాషించుచున్న జయచంద్రుని గాంచి యగ్గలమగు నోర్వలేమి నతఁడు వినయశీలుని వలలోఁజిక్కి తన్ను పాటింపఁడను భయంబున మెల్లమెల్లనఁ జేరబోయి నమస్కరింప నతడు గూరుచుండుమని మఱేమియు మాటలాడక తలవంచుకొని యూరకుండెను. అత్తరి భట్టు రాజమనసు నిశ్చయముగ దిరిగిపోయినదని తలఁచి యెటులైన మరల దన మార్గమునకు ద్రిప్పుకొననెంచి యిట్లు వచింపసాగెను.

“రాజా! ఇట్టి సమయమున మీరిట్లు విచారపడుచుఁ గూరుచున్న గార్యమేమైన గలదా! ఎటువంటివారికైన గానిమ్ము; ఒకానొకవేళ గష్టములు రాకమానవు. కష్టములు కలిగినతరి దుఃఖింపుచు సౌఖ్యములు కలిగినతరి నిఁకఁదమయంతవారు లేరని పొంగిపడుట సజ్జనుల లక్షణముగాదు. నీ కిత్తరి నపజయము కలిగినదని నిరుత్సాహుడవు కాకుము. రణమందు జయాపజయంబు లొకరి స్వాధీనములు కావు. ఇప్పు డోడిన వాడు రేపు గెలుచును. రేపు గెలిచినవాడు మరల మరునాఁ డోడును. క్షత్రియులగు వారికి జయాపజయంబులు కాక వేరే మున్నవి? కాని యుత్తమ క్షత్రియుం డగువాఁ డపజయము కలిగినప్పుడే యెక్కువ ధైర్యము నవలంబించి యుండ వలయును. ఈ యింతమాత్రమునకే జడుపునొంది నీ విట్లూరక కూరుచుండి యుండుట యుక్తముకాదు. ఇత్తరి మనకుగలిగిన పరాభవమునకు వెఱచి చక్రవర్తి నింతటితో వదలెదనని తలఁచెదవేమో ! కలయందైన నట్లు తలంపకుము. చక్రవర్తి నాశనము జూచిగాని నే ప్రాణముల వదలనని నిక్కముగ నమ్మి యుండుము. మనసేన మూలముగనే యతడు చచ్చునని తలచి తక్కిన విషయములు నీతో వచింపలేదు. కాని యిప్పుడు నా పన్నుగడ లన్నియు దెల్పెదవినుము. ఢిల్లీయందు గరీమునకును నాకును గలిగిన మైత్రివలన గుతుబుద్దీనను మహమ్మదీయ సేనానాయకునకును నాకు న్నేహము కలిగినది. నేను ఢిల్లీనివదలి యిక్కడకు వచ్చినతరువాత నక్కడి సంగతులేమో కనుగొని రమ్మని నా సేవకుల గొందఱిఁ బంపితిని. వారువచ్చి కరీమును జెరవైచిరని దెలిపిరి. అనంతరము గొన్నిదినములకు గుతుబుద్దీన్ వద్దనుండి మా కొఱ కిరువురుభటు లేతెంచి యట గరీమువార్త విన్నపిదప నా కొఱకై వెదకికొనుచు వచ్చి యిక్కడ గలుసుకొని కుతుబుద్దీను కపజయము కలిగినందున నతడు వేరొక స్థలమున నున్నాడనియు మఱియు గొన్ని నూతన వృత్తాంతము లెఱగించిరి. ఢిల్లీపతిని రాజ్యభ్రష్టునిజేయ వారు నన్నాలోచన యడుగ నన్యమతస్థుల నేలప్రోత్సాహ పఱుపవలె ననియు మనమే చక్రవర్తిని నోడించిన నా రాజ్యము మనకే దక్క,గలదనియు నూహించి యెటువోయి యెటువచ్చునో యని వారితో వైరము మాత్రము పెట్టుకొనక మంచిమాటలతో నింతవరకు నాపియుంటిని. ఆదియుంగాక యతని మనస్సును సంతోషవరుప దేశమున గొన్ని యల్లరులు గలుగఁజేయుమని చెప్పిపుచ్చితిని. అతఁడు మరలఁ గొందఱు చారులఁ బంపి యున్నాడు. చక్రవర్తి నెదురింపదగిన ప్రబలసైన్యము నుంచుకొని దేశమును బాడుచేయుమని యిప్పుడు మరల జెప్పిపుచ్చె దను. గ్రామములం దల్లరులు సాగించినచో నట్టివారి దండించుటకై వచ్చి వారిచేతులలో జిక్కును, చక్రవర్తి దుర్గముననుండ జయించుట మనతరముకాదు. కావున నీవు దుఃఖముమాని బయటి కేతెమ్ము " అని కుతుబుద్దీనుకు దనకు జరిగిన విషయములు దెలిపి కొన్ని లేఖల గనుపఱుప జయచంద్రుఁ డించుక కలకఁదేరి మాటలాడ నారంభించెను. అసూయాపరుడగు మూఢుడు తనకెంత నష్టము గలుగుచున్నను దనవైరి నాశనసూచకములగు బలుకులు పల్కినంతనే మరల దుర్మార్గములు సేయుటకే కడఁగుఁగాని బుద్ధిగలిగి యూరకుండుననుట కల్ల. చక్రవర్తి జయమువలన బట్టరాని యీర్ష్యాశోకములకు దావలుడై రహస్య మందిరము శరణుజొచ్చిన జయచంద్రున కీశ్వరభట్టుగారి కుత్సితంపు వాక్యంబు లమృతోపమానము లయ్యెను. పురమంతయు నల్లకల్లోలమగునట్లు రణము జరుగుచున్నంతకాలము నిటు మొగమైన జూపక పారిపోయి యెక్కడనో తలదాచుకొని వచ్చిన పిరికిపందలలో నగ్రగణ్యుడగు నీ భట్టుగారి నీతివాక్యములచే రాజన్యాయముగ మోసపోవుచు వచ్చెను. భట్టుగా రెంతకైన మాటకారియే కాని క్రియాశూన్యుడు. సమయము వచ్చిన దన్న నంతఃపురదాసీల కాళ్ళనైన బట్టుకొనును. కాని జయచంద్రునిదగ్గర మాత్రము ధీరత్వముతోప గోటలు దాటునట్లు వచించుచుండును. భట్టుగారు వచించినమీద నా రాజు మరల "అయితే మీరిప్పుడేమిచేయ నెంచియున్నా" రని యడిగెను. అందుమీద నతడు తీరుగ దారిలోనికి వచ్చుచున్నాడని తలంచి “చక్రవర్తి నెదురింపదగిన నేనను సుల్తాన్ వద్దనుండి తెప్పించుకొని యా చుట్టుప్రక్కల నాశనముకాగా మిగిలిన గ్రామముల వెండియుఁ గొల్లగొట్టించుమని చెప్పిపంపెద" నని మరియు నిట్లు వక్కాణింపసాగేను. “రాజా! నీ వెంతమాత్ర మధైర్యపడకుము. బయటికేతెంచి యధాప్రకారముగ నీ రాచకార్యముల జక్కబెట్టుకొనుము. హతశేషులగు సైనికులు నీ కొఱకై యంతటను వెదకుచున్నారు. వారినందఱు నూరడిల్లఁ బలికి నీ బుత్రుడగు పరిహరరాజకులునకు వర్తమాన మంపుము . అతఁడు తత్క్షణ మతనిసేన నంతయు దీసుకొని నీకు సహాయపడఁ జనుదెంచును, ఇంకను నీకు మిత్రులై యున్న యితర రాజులఁ బిల్వనంపుము. వారును సేనాసహితులై నీకుఁదోడ్పడ జనుదెంతురు. నేనింతలో సుల్తానుగారినికూడ బిలుపించుకొని చక్రవర్తి నేదురింపుమని కుతుబుద్దీనుకు వ్రాసిపంపెదను. ఒకవేళ సుల్తాను కపజయము గలిగినచో మనము ప్రోగుజేసిన రాజుల నందరి వెంటఁగొని వారికి సహాయులమై పోవుదము. అప్పటికి మనకే పరాజయము గలిగిన తర్వాత జూచుకొందము. అవివేకులగు నీ ముదుసలివారల మాటల లెక్కగొనకు " మని భట్టు పల్కినంతనే యింతవరకును బైకి పొంగివచ్చుచున్న కోపము నంతయు నణచుకొని యూరక కూరుచుండియున్న వినయశీలుడు రోషపూరితుడై చివాలునలేచి " మూడుడా! జయచంద్రు నింతటితోనైన బాగుపడనీయ దలచుకొనలేదా? మీ మూలముననే గదా యితని కీగతిపట్టినది. దుర్మార్గుడా, మీదు మిక్కిలి నన్నే యెత్తిపొడిచెదవా? చక్రవర్తిపై లేనిపోనివి కల్పించిజెప్పి యుద్ధమునకు బురికొల్పి సేననంతయు ధ్వంసము కావించితివి. ఆ రణమున నీ వెక్కడ జచ్చితి " వన భట్టుగా రుగ్రుడై “అయ్యా ! ఈ లేనిపోని కంఠశోష తమకేటికి, మే మిరువురము దగవులాడుకొని మా వాదము దీర్పుడని మిము వేడుకొంటిమా ? జరుగవలసిన రాచకార్యముల గుఱించి మేమేమో మాటలాడుకొనుచుండ నడుమ మీ రేటికి సంబంధము గలుగజేసికొనెదరు. చాలు నీ పాటికి దమరూరకుండుడు." అన మితిమీరి వచ్చుచున్న యాగ్రహము నాపుకొని " జయచంద్రా! బాగుపడ దలచుకొంటివేని నే నింతకు ముందు చెప్పినట్లఁ జేయుము. లేకున్న నీ యిష్ట ” మని వినయశీలుఁడు వెడలి పోయెను. అతడు వెడలిపోవుట తడవుగ భట్టు మఱికొన్ని యిచ్చకములు వల్కి రాజును బయటకు గొనివచ్చెను. జయచంద్రుడు సభకేతెంచి హతశేషుల మన్నుపడిపోయిన చోట్ల దుర్గమును బాగుపఱుప నాజ్ఞాపించి మఱియు నితర సమాచారములఁ గూర్చి ముచ్చటించుకొనుచుండ పరిచారిక లేతెంచి సంయుక్త యెక్కడను గానరాలేదని వచించిరి. అగ్గలమగు నీర్ష్యాగ్రస్తుడై యహరహమును జక్రవర్తి నాశనముగావింపఁ దత్పరుఁడై యున్న యాతని మనస్సుకుఁ బ్రియకుమారిక పోయినదని వచించినను నావంతయుఁ జింతగలుగదయ్యె. కానరాలేదని వచించినతోడనే యుగ్రుడై "పోనిండు. గతించిన దని యూరకుండెను. దాని చింతయేల? మీరుపొం" డని కూతురుపైగల రోషంబునఁ బరిచారికుల సహితము కసరికొట్టి పంపెను. అనంతరము భట్టుగారి సలహాప్రకారము బురిహర రాజతులునకు లేఖ వ్రాసిపంపి యానాటికిఁ గొలువుఁజాలించి వెడలిపోయెను.

ఇక్కడ నిట్లుండ రాజధానియందు జక్రవర్తి ప్రవేశించిన దినము ననేకములగు వేడుకలు జరిగెను. పురమెల్లడల నలంకరించి నల్లడల జక్రవర్తి జయము జాటించిరి. చక్రవర్తి నెదురింపవచ్చు వారలిట్లే చెల్లాచెదరుగ నెగరగొట్ట బడుదురని సూచించుభంగి కోటబురుజులపై నాటిన జయస్తంభములకు గట్టిన శ్వేతవచనంబు మిక్కుటముగ గొట్టుకొనుచుండెను. మఱునాఁ డొక గొప్పసభ జరిగెను. అందు సకలాక్షౌహిణీపతులు, సేనాపతులు, మంత్రులు మొదలగువార లాసీనులై యుండిరి. అత్తరి జక్రవర్తి సంగరమున దన్నురక్షించిన రాకుమారుని రప్పించి యుత్తమాసనం బొసంగి మన్నించెను. సభయందలి వారెల్ల నతని వేయిగతులఁ బ్రస్తుతింపసాగిరి. స్నిగ్ధమై కళకళలాడు నా కుమారుని మోము జక్రవర్తి కడుతడవు వీక్షించి యనురాగ మధికము కాగా నతని పేరడిగి కమలాకరుం డని తెలుసుకొని వివిధములగుఁ బతకముల బహుమానముగ నిచ్చెను. అత్తరి నా రాజపుత్రుఁడు లేచి వినయమొప్ప “ రాజచంద్రా ! ' నన్నింత ఘనముగ గొనియాడనేల? మీ దయకుఁ బాత్రుండ నగుదునేని యియ్యఁదగిన మీ వ్రేలియుంగరము నొసంగవేడెద" నన " కమలాకరా ! మృత్యువు నోటఁబడ నున్న నన్ను రక్షించి పుణ్యంబు గట్టుకొంటివి. అట్టియెడ నా శరీరమే నీ స్వత్వమైయుండ దానిపైనున్న భూషణములయెడ నీకు స్వతంత్రములేదా ? నీకు వలసినది పుచ్చుకొను " మని తన వ్రేలియుంగరము నిచ్చి చక్రవర్తి యతని విడచియుండ జాలక నాటినుండియు దన దగ్గరనే యుంచుకొనెను.