రాణీ సంయుక్త/ఇరువదియొకటవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఇరువదియొకటవ ప్రకరణము

టులార్యా వర్తమున కంతయు సాధార భూతములైన ఢిల్లీ కన్యాకుబ్జ రాజ్యములు రెండును బరస్పర వైరంబులు పెచ్చు పెరుగఁ బోరాడు కొనుచున్న తరుణమందే కుతుబుద్దీనుచేఁ బ్రేరితులగు మ్లేచ్చులు దేశమందు జేయఁగడగిన క్రౌర్యములుఁ గణింప నలవికాకుండెను. ఆనా డట్లు చక్రవర్తిచే నోటువడి కుతుబుద్దీన్ పరువెత్తిపోయి యమునా తీరమున నొక దట్టమగు పొదరింటిలోపల బగలంతయుఁ బరుల కంటబడకుండా దాగుకొని చీఁకటిపడినపిదప బయటికేతెంచి నది నీది యావలిగట్టుఁ జేరి తనకు సంభవించిన దురవస్థంగూర్చి తలచుకొనుచు రోషావేశుడై యార్యావర్తము ధ్వంసముజేయఁ బట్టుపట్టి మఱియొక ప్రదేశమందిటులేని గూఢముగనున్న మహ్మదీయుల దండును జేరెను. అచటనున్న వారంద ఱిత డిట్లొంటరిగ జనుదెంచుట కేమిహేతువో యని సంభ్రమమందసాగిరి. కొందఱు మనము జాగరూకతతో బ్రవర్తించుచున్నామో లేదో యని బరీక్షింప నిట్లాకస్మికముగ వచ్చి యుండునని యూహించిరి. అనంతరము కొన్ని దినంబు లేగినపిదప యమునాతీరమున జరిగిన సంగతులన్ని యు గుతుబుద్దీన్ వారి కెఱింగించెను. తోడనే వారందఱు నుగ్రులై హుంకారము లొనర్చుచు లేచి యిప్పుడే ఢిల్లీ పై దండెత్తుదమని వక్కాణించిరి. అయిన వారిశాంతపఱచి కుతుబుద్దీన్ మెల్లన " సోదరులారా : ఆర్యావర్తరాజులపై నొంటిగ దండెత్తఁదగుతరుణ మింకను రాలేదు. మీకేకాదు. మన సేన నోడించిన చక్రవర్తియని తెలిసిననాటినుండి ఢిల్లీ నెపుడు మ్రింగుదునా యనునభిలాష నాకును మిక్కుటమై యున్నది. వీరింకను వారిలోవారు పోరాడుకొని నాశనము కావలయును . పదునొకండవ శతాబ్దారంభమున మన సుల్తాన్ మహ్మద్ గజనీ యీ దేశముపై దండెత్తివచ్చి జయించి లెక్కలేని ధనమును గొంపోయి లాహోరున స్వతంత్ర రాజ్యమేర్పఱచిన నాటినుండియు నీ రాజులెల్లరదివర కున్నటులేయుండక శాస్త్రాను కూలమగు రణశిక్ష సైనికులకు నేర్పించి సైన్యములను బాగుపరచుకొని యున్నారు. ఇప్పుడీ రాజులసేనలకు రెండింతలు మన పక్షమున నున్నను మనము వారిఁజయింప జాలము. ఏడెనిమిదేండ్ల క్రిందట జయచంద్రు జీవనసింహులు లాహోరు నుండి మనసుల్తానుగారి వెడలంగొట్టుటకు బ్రయత్నములుసేసి మరల నేకారణముననో మానివేసిరి. ఇప్పుడా రెండు రాజ్యములుపరస్పర వైరము గలిగియున్నవి. మఱియు మనకరీమునకు బదులుగ భట్టుగారే మనకొఱకనేక ప్రయత్నములు జేయుచు నాకు వార్త లంపుచున్నారు. అందువలననే మనకిక్కడ నింతమాత్రము నిలుచుట కవకాశము దొరికినది. మొన్న చారులు కొందఱరుదెంచి కనూజియందు జయచంద్రుని పుత్రికకు వివాహము జరుగుచున్నదనియు జక్రవర్తి కవమానము గలుగఁ జేసినందున నతఁడా పురముపై నెత్తి రానున్నాడనియు వచించిపోయిరి. మరల నే సమాచారము దెలియలేదు. ఇత్తరి మీరలిదివరకు వలెగాక పెద్దపెద్ద గుంపులుగఁ గూడి బయలుదేరిపోయి గ్రామముల ధ్వంసము గావింపవలయును. మఱియు నీ యార్యావర్తము సమస్తశాస్త్రములకు బసిద్ధికెక్కినదని విందుము. పూర్వకాలమున నన్య ఖండములవారు సహిత మిచటికేతెంచి విద్యలనేర్చుకొని పోవుచుండువారఁట. ఈ కాలమున నీ దేశపు జనులు వాని విలువను దెలిసికొన నేరక రెండువందల సంవత్సరము లాదిగ జదువుట మానివేసిరి. గ్రంథములుమాత్రము మిగిలియున్నవి. ఒకవేళ ముందు వానినెవరైన జదివినచో మరల మననె త్తి కెక్కుదురు. కావున మీకంటబడిన ప్రతి పుస్తకభాండాగారమును దగులబెట్టి యార్యావర్తమును శాస్త్రవిహీనముగ గావింపుడు. రెండు శతాబ్దములనుండి వాని మొగముజూడకుండ నున్నారుగాన నీతరుణముననే ధ్వంసముఁజేయుట మంచిది. ఇఁక మీకు జెప్పవలసిన దేమున్నది. మీ యిష్టమువచ్చినట్లు రాత్రియనక పగలనక కృషిచేసి జనులనందఱ జిత్రహింసఁ బెట్టుడు. ముఖ్యముగ శాస్త్రములను వాటి భాండాగారములను బేరులేకుండ జేయుడు అప్పుడు మనశాస్త్రములే వన్నె కెక్కును. వీరందఱు మనకే దాసులై వస్త్రంతు" రని నుడువ నెల్లరు పరమానంద భరితులై చప్పట్లు చరుచుచు లేచిరి. తమయేలికయొక్క యాజ్ఞానుసారముగ గుంపులుగఁ గూడి గ్రామములపైబడి నాశనము గావింప జొచ్చిరి. కొందఱు మ్లేచ్ఛులు వృద్ధులనక, బాలురనక, స్త్రీలనక, పురుషులనక కంటబడిన ప్రతిప్రాణిని గత్తికెరఁ జేయు చుండిరి. కొందఱు దుష్టులు యౌవనవతులగు కాంతల గొంపోయి తమ యిష్టానుసారము బాధింపగడగిరి. కొందఱు తులువలు పురుషులనందఱఁ బెడరెక్కలు విరిచికట్టి యొకచో నిలువఁబెట్టి వారి కనులయెదుర వారివారి తల్లుల నక్క,సెల్లెండ్ర భార్యలం జీరల విడిపించి భీభత్సము సేయుచుండ నా ఘోరముల జూడనోడి కన్నులు మూసుకొను వారిగ్రుడ్లను నారసములతో బెరికి పారవైచుచు, దలలు వంచుకొనువారి ఖడ్గ ప్రహరముల గడదేర్చుచుండిరి. మఱికొందఱు దుర్మార్గులు వృద్దులు పడుచువారలు నగుస్త్రీపురుషుల దిగంబరులు గావించి దండతాడనంబులతో బరుగెత్తించుచుండిరి. కొందఱు దుర్మతులు పెండ్లికాని పడుచుల దమచిత్తమువచ్చినచోట కెక్కడికో కొనిపోవ సాగిరి. మఱికొందఱు మాంసఖాదనులు సృష్టాదిగ వచ్చుచున్న సత్యగ్రంథముల ధ్వంసము కావింపసాగిరి. ప్రఖ్యాతి కెక్కిన భాండాగారములందలి గ్రంథ సంచయంబుల విశాలమగు నగ్నిగుండములదీసి వాటియందువైచి తగులబెట్టుచుండిరి. ఒకొక్కపుస్తకా గారము దినముల కొలది దగుల బడుచుండెను. సత్యములగు నార్యుల శాస్త్ర సమూహంబులన్నియు నాశనమై పోయెను. శిల్పశాస్త్రములన్నియు నడవిపాలయ్యెను. ప్రకృతి శాస్త్రంబులు మన్ను గలిసె. వైద్య శాస్త్రంబులు రూపుమాసె, భూగోళ ఖగోళ శాస్త్రంబు లేటగలిసిపోయెను. సత్యశాస్త్రములన్నియు నట్లు వినాశములై పోవుటవలననే యిప్పుడు ప్రబలియున్న అసత్య శాస్త్రములు మనకు గతియైనవి. మఱి కొందరు కఠినాత్ములు పసిబిడ్డల గొంతులఁ బిసికి చంపగడఁగిరి. తల్లుల హస్త తలంబులం బరుండి పాలుద్రావు పసికూనల బలవంతముగ లాగుకొని "తండ్రులారా! మాకన్న బిడ్డల రక్షించి మమ్ముజంపు" డని శిరంబు లందించుచున్నను వినక మాతలఁబడదన్ని వారి కన్నుల ముందు నాశిశువుల లేతకంఠముల నరటితూండ్లవలె ద్రుంచి మొగమున విసరిపారవైచిపోవ దల్లులు “హా" యని గుండెలు పగిలి చచ్చుచుండిరి. మఱికొందఱు క్రూరులు కొంచెము మాటలాడనేర్చిన బిడ్డ లమ్మాయవి వెనుదగిలి వచ్చుచుండ వారి తల్లులనఱకి పారవైచుచుండిరి. కొందరు రాక్షసులు చక్కగఁ బండి కోతకు సిద్ధమగుచున్న నిండుపైరుల నెక్కడివక్కడ నాశనము సేయ జొచ్చిరి. గ్రామములందలి ధాన్యపుకొట్లకు నాముదము వోసి నిప్పంటింప గడగిరి. మఱికొందఱు దయాశూన్యులు గృహోపయోగములగు బశువుల ఖండించి వాటి మాంసము యజమానుల యెదుటనే పక్వముచేసుకొని భుజింపసాగిరి. ఆకృత్యములకు రోతపడువారి గ్రిందఁబడదన్ని వారి నోళ్ళ యందు బచ్చిమాంసపు ముద్దలఁదెచ్చి క్రుక్కుచుండిరి. బిడ్డలఁ జంప నేడ్చు పితరుల యొక్కయు, బితరులఁజంప నేడ్చు బిడ్డల యొక్కయు, మగలఁ బరాభవింప మూర్చిల్లు కులాంగనల యొక్కయు, హాహాకారంబులును, రోదనంబులును గలసి భూన భోంతరములు నిండ దేశమంతయు నల్లకల్లోలము గావింపఁ జొచ్చిరి. ఈ దుష్టాత్ముల ధాటికి వెఱచి కొంపల విడనాడి యడవులకుఁ బరువెత్తువారును, మానము గోపాడుకొనఁ బ్రాణహత్య గావించుకొనువారును, తమ భార్యల బెట్టుగాముల దిలకింపనోడి ముందు వారిఁజంపి పిదప దమజీవంబులఁ గోల్పోవు మానధనులునునై మనుష్యులు భీభత్సమగుచుండిరి. చదువరులారా! మనదేశంబున శిశుహత్యలు, బాల్యవివాహములు, సహగమనములు మొదలగు దురాచారములు ప్రబలుట కివియే కారణములు, కట్టా ! ఇన్ని యాక్రందనములతోఁ గూడిన యార్యావర్తపు నిప్పటి యవస్థఁ జూచినను, విన్నను నెట్టివారికైన మనస్సు కలుక్కుమనక మానదుకదా ! అట్లు మ్లేచ్చులు విసుగుజనించునంతదాక దేశమునంతయు ధ్వంసము చేసిపోయి తమ జయమును కుతుబుద్దీను కెఱుకపఱుప సంతోష భరితుఁడై యతడు వారలకనేక బహుమతులొసగి మన్నించెను. ఆ సమయమున మఱికొందఱు చారులరుదెంచి ప్రచండునకుఁ జక్రవర్తికి జరిగిన సంగరమును గూర్చియుఁ గొన్ని నూత్న విషయములఁ గూర్చియుఁ దెలిపిరి. అందుపై గొంతసేన నంపవలసినదిగ సుల్తానుగారికిఁ దెలిపి దానికొఱకుఁ గుతు బుద్దీన్ నిరీక్షించుచుండెను.