రాణీ సంయుక్త/ఇరువదియవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఇరువదియవ ప్రకరణము

క్రవర్తికి లేఖనంపిన దినము మొదలు కనూజియందు జయచంద్రుడు దుర్గము బాగుచేయించుట మొదలగు రణ సన్నాహములగు కార్యములలో మగ్ను డై యుండెను. ఈ నగరమందలి కోట చదరమై పండ్రెండుమైళ్ల చుట్టుకొలత గలిగి యున్నది. ఇది పెద్దపెద్ద నల్లరాళ్లచే నిర్మింపబడి నేలమట్టమున నాలుగు గజముల వెడల్పును నగ్రమున గజమున్నర వెడల్పును గలిగి పరీఘాసమావృతంబగు పదునొకండు గజముల యెత్తుగల ప్రాకారపు గోడచే గూడుకొని యుండెను. గోడలచుట్టు పది గజముల యెత్తున తుపాకులు ఫిరంగులు మొదలగునవి ప్రయోగించుట కనువగు గవాక్షము లడుగడుగునకు బెట్టబడి యుండెను. ఈ గోడలతో గలిసియే లోపలి భాగమున మూడు గజముల మందమును దొమ్మిది గజముల యెత్తును గల మఱియొక రాతి గోడ కలదు. యుద్ధ సమయమందు భటులీ చిన్న గోడ పైభాగమున బారులుదీరి నిలచి పెద్దగోడ గవాక్షములగుండ శత్రు సేనలపై నగ్నివర్షము గురిపించు చుందురు. మఱియు నర్ద పర్లాంగున కొక పెద్ద బురుజు గలదు. బురుజులన్నియు బలిష్టములై యెల్లవేళల ఫిరంగులతో గూడియుండును. ఈకోట లోపల నుచితస్థలంబుల నెనిమిది చిన్నకోటలు గలవు. జయచంద్రుని సైన్యమంతయు చిన్నకోటలం దనారతము నివసించు చుండును. కోట బహిర్దారము బలవత్తరమై నాల్గు బురుజుల మధ్యనుండెను. ఈద్వార మారుగజముల వెడల్పును బండ్రెండు గజముల యెత్తును గలిగి యుండెను. దీని తలుపులు స్వచ్ఛమగు నినుముతో నిర్మింపబడి మూరెడున్నర మందము గలిగి ముందరి భాగమున దీక్ష్ణములగు గుబ్బలచే దాపటములై యుండెను. ఈ ద్వారముపై విశాలమగు నొక రాతికట్టడము గలదు. అందుఁ బ్రవీణులగు ఫిరంగులఁ గాల్చువారు జాగరూకులై యెల్లపుడు గాచుకొని యుందురు. దీని తరువాత నిట్టివే మఱిరెండు ద్వారములు కలవు. ఇట్టి శాత్రవుల కభేద్యమగు నా దుర్గమునం దంతట నైన్యముల నిలిపి కోటగోడల యగ్రములందుగూడ నక్కడక్కడ ఫిరంగులఁ బెట్టించి జయచంద్రుడు జాగ్రత్తమై యుండెను. ఇతనివద్ద నెల్లవేళలందు నొక లక్ష యిరువదివేల కుంజరములును, నూటయేబదివేల తురంగములును, రెండులక్షల భటులును గలిగినసేన స్థిరముగ నుండును. ఈ మూడువిధముల సేన నుగ్రవర్మ యనువాడు సకలాక్షౌహిణీ పతి యను పేర బాలించు చుండును. వీనికి దోడుగ గహర కంఠీరవ ప్రచండు లనువారు పనిసేయు చుందురు. వీరిక్రింద నొక్కొక్క విధమగు సైన్యమునకు నాధిపత్యము వహించిన వారు మువ్వురు గలరు అందు సుబాహువు డనువాఁడు కుంజర యూధమునకును, ప్రమాథు డనువాఁ డశ్వసైన్యమునకును, నిర్గాంతుం డనువాడు పదాతి సేనకు నధిపతులై యుండిరి. వీరి క్రిందను నిట్లే యధికార క్రమమున ననేక నాయకులు కలరు. కడగొట్టువాని యధికారమున నూర్గురు భటులుందురు. జయచంద్రు డింతసేనతో దుర్గమును రక్షించుకొనుచు నొకవేళ జక్రవర్తిసైన్య మేతెంచుచున్న యెడదారిలోనే యడ్డగించుటకు గాను బ్రచండుని యాధీనమున నారువేల కుంజరములు. పదివేల తురంగములు, నిరువదివేల భటులుగల వాహినిం బంపెను. సేనంతయు నగరము వదలి యిరువదిమైళ్లు వచ్చిన పిదప దమ కెదురుగ దూర్పుదిక్కున మన్ను మిన్నేకమగునట్లు లేచి వెనుక నేమియు గానరాకుండ జేయుచు హోరుమనురావములతో బ్రచండ తరముగ దమవైపున కేతెంచుచున్న గాలిదుమారమును బ్రచండు డవలోకించి గొప్ప గాలివాన వచ్చుచున్నదను భ్రమను సేననక్కడనే యా పెను. అత్తరి ముందుబోయియున్న వేగులవా రరుదెంచి యావచ్చునది చక్రవర్తి సైన్యమని ప్రచండు కెఱుక పఱచిరి. తత్క్షణ మతఁడా స్థలము విశాలమగు బహిరంగప్రదేశ మగుటవలన శాత్రవులు చుట్టిముట్టిన నపాయకర మగునని తలపోసి సేనను వలయాకారముగదీర్చి పద్మ వ్యూహముబన్ని జాగరూకుడై తాను నడిమిభాగమున నుండెను. ఇక్కడివార్త నంతయు నిగూఢముగ కొందఱు చక్రవర్తి వేగులవారువచ్చి తెలిసికొనిపోయి తమ వారల కెఱుక పఱచిరి. చక్రవర్తి సైన్యము నూరువేల గజములను, నూట యిరువది వేల గుఱ్ఱములను నూటడెబ్బదివేల భటులను గూడియుండెను. యమునా ద్వీపకల్పరణమున గుతుబుద్దీను నోడించి ఢిల్లీయం దనేక బిరుదులఁగాంచి ప్రఖ్యాతి వహించిన యాతతాయియను యుప సకలక్షౌహిణీనాయకుఁ డిసార్వభౌమ సేననంతయు నతి ప్రావీణ్య మొప్ప నడిపించుకొని వచ్చుచుండెను. జయచంద్రు సేనయందువలెనే చక్రవర్తి సైన్యమునందును నూర్గురు భటుల కధికారులగు నాయకులుగలరు. వీరియనంతరమును నుద్యోగులు గలరు. అందు గడపటి యుద్యోగి వశమున నిరువదిమంది భటులుమాత్రమే యుందురు. వీరందఱు గ్రమమగు రణశిక్ష నలవర్చుకొని యుండిరి. ఆతతాయి ప్రచండునివార్త విన్నవెంటనే తన సైన్యమునఁ గొంతభాగము ప్రకంపనుడను సేనాని కిచ్చి శత్రువుల కెఱుక రాకుండ దూరమునుండి చని వరాహ వ్యూహమున బడమటిదిశను దాకఁబంపెను. సూకరముల వలె జిందర వందరగ బరువెత్తుచు శత్రువుల సమీపించిన వెంటనే యొక్క పర్యాయముగ నందఱు గుమికూడుటే వరాహ వ్యూహము. తరువాత గంకటు డను వానివశమున మఱికొంత సేనను సూచీవ్యూహమున నుత్తరము ముట్టడింప నంపెను. ఆది యందు సన్నముగనుండి వెనుకకు బోనుపోను విశాలమగు నదియే సూచీవ్యూహము. తాము చనుచున్న మార్గమున కెదురుగ పిరంగులు మొదలగునవి పెట్టించియుండుట తెలిసికొని మహా మాయుడనువానికిఁ గొంతసేననిచ్చి సర్పవ్యూహమున వాని నాసనము గావింపఁ బంపెను. వైరుల కెరుకలేకుండ నేలపై బరుండి ప్రాకిపోయి పట్టుకొనుటే సర్పప్యూహమున ముట్టడించు టందురు. ఇట్లు మూఁడు ప్రక్కలకు మువ్వుర నంపి మిగిలిన సేనను వజ్రవ్యూహము క్రిందమార్చి నడిపించుకొనుచు నాతతాయి దక్షిణముదాకఁ జను దెంచు చుండెను. వీరందఱకు వెనుక నిపుణులగు సేనానులు కొందఱు సేనతోఁ జుట్టుగొలువ జక్రవర్తి పోవుచుండెను. అత్తరి బ్రభాత కాలమున నారుగంటలైనను సేనల పాదఘట్టనముల వలన లేచిన ధూళి యంతయు నుదయింపబోవు సూర్యునిగప్పి ప్రొద్దుదెలియకుండ జేయుచుండెను. అట్టి తరుణమున నా తతాయి వలన నేర్పఱుపబడిన నాలుగుసేనలు నొక్క పర్యాయముగఁ బ్రచండుని దాకి బందూకుల మ్రోయించిరి. శత్రువులు కంటబడిన వెంటనే ప్రచండుని సేనాభటులును సాహస ధైర్యములతోఁ బోరాడ దొడగిరి. ఒండొరుల బందూకుల ప్రయోగము లవలన ననేకులు భటులు గూలుచుండిరి. ప్రచుండుని నేన సార్వభౌమ వాహిని కంటె నెన్ని యో రెట్లు చిన్న దయ్యుఁ జక్రవర్తి మొదలగువారు సహితము మెచ్చుకొనునట్లు రణము సేయుచుండెను. ఈ గతి పగలు పదిగంటల పర్యంతము సందీక పెనంగు చుండెగాని యెంతటికిఁ దఱుగక తండ తండములుగనున్న వైరిసేనలం గాంచి దిగులుపడ నారంభించెను. ఎంతైనను బ్రచండుఁడు ధైర్యమువదలక ప్రోత్సాహంపు వచనముల దనవారి బురికొల్సుచునే యుండెను. పదునొకండు గంట లగునప్పటికి యుద్ధము మఱికొంత ఘోరమయ్యెను. తుఫాకులు ఫిరంగులు మొదలగువానివల్ల లేచుపొగయును నేలయందలి ధూళియును లేచి యేకమై గగనతలముగప్పి చీకట్లు గ్రమ్మ జేయుచుండెను. అట్టి యల్లకల్లోలమగు సమయమున మహామాయుం డతిచాతుర్యముతో దనసేనను దూర్పు ప్రక్కనున్న ఫిరంగులవద్దకు జేర్చి వానినన్నిటిఁ బ్రచండుని సేనవైపునకే ద్రిప్పించి కాల్పింప నారంభించెను. ఇటులీప్రక్కన వైరులకు సందుదొరకుటచేఁబ్రచండుఁ డించుక విచార మందసాగెను. అయినను జావునకు వెఱవక తనవారిబురిగొల్పుచునే యుండెను. అత్తరి బడమటి దిశనున్న సేనను నాశముఁజేసి ప్రకంపనుడు వ్యూహములోపల బ్రవేశించి ప్రచండుని మార్కొనెను. వారిరువురు బందూకులమాని ఖడ్గముల బూని ద్వంద్వ యుద్ధమున బోరాడఁగడగిరి. అట్టి స్థితిలో నెక్కడనుండియో తుపాకి గుండొకటి వచ్చి ప్రకంపమ నెడమ భుజమునకుఁ దగిలెను. ఈ వార్త నాతతాయి విన్న వెంటనే యతని రణమునుండి తొలగింప నాజ్ఞాపించెఁగాని యతడెవ్వరి మాటలను బాటింపక నా ప్రాణమున్నంతవరకు నేరణ మొనర్చుట మాననని పెచ్చు పెరిగిన రోషమున మఱియొక దీర్ఘమగు ఖడ్గముంబూని ప్రచండుని శిరోవేష్టనము నేలఁ బడఁగొట్టెను, వేష్టనహీనుఁడైనను బ్రాణముల కాసింపక తెగించి ప్రచండుడు వెన్నీక నిలచి రణ మొనరించుచు వేరొకబారు కత్తింగొని ప్రకంపను బొడువంబో దానిదప్పించుకొని యతని నొక్క పోటుఁబొడచి ప్రకంపనుఁడు విజృంభించెను. ఆ దెబ్బతో జయచంద్రుని సేనాపతి నేలకొరగి పడిపోవ నదివరకే నాశనమై యున్న తక్కినసైనికులును బలాయితులు కాసాగిరి. మఱి కొంద రంత్య సాహసముంజూపి మడియుచుండిరి. రణరంగ మంతయు బీనుంగుపెంటలతో నిండుకొనిపోయి భీభత్సము గొల్పుచుండెను. రక్తము కాలువలు గట్టిపాఱుచుండెను. అంత రణరంగమంతయు జర మాశా ఫలకంబున బ్రతిఫలించుచున్నదో యన శోణమరీచులు రాజిల్ల సూర్యుఁ డస్తమింపఁ బోపుచుండెను. ప్రచండుని సేనయందలి దుపాకులు ఫిరంగులాది గాగల యుద్ధ సామగ్రులన్నియు జక్రవర్తి పాలంబడెను. సంగరము పూర్తియైన పిదపఁ జక్రవర్తియానతి నాతతాయి గాఢమగు గాయముచే వేదనపడుచున్న ప్రకంపను దగువారలచే నచటికి గొంతదూరమున నున్న రాజవైద్యశాల కనిచి తక్కుం గల భటుల నెల్లర మఱియొక వైద్యశాలకు జేర్ప బరిచారకుల కాజ్ఞాపించెను. వారును జావక బ్రతికియున్న ప్రతిక్షత దేహుని వైద్యశాలకు జేర్చుచుండిరి. అక్షతదేహులగు తక్కిన సైనికులెల్లరు రణరంగమునకు దూరముగఁబోయి యటనున్న నొకచిన్న ప్రవాహమునందు దేహముల శుభ్రపఱచుకొని యుచితాహారంబుల భుజించి కన్యాకుబ్జనగరపు ముట్టడినిగూర్చి మాటలాడుకొనుచు బొద్దు గడుపుచుండిరి.