రాణీ సంయుక్త/ఇరువదియేడవ ప్రకరణము
ఇరువదియేడవ ప్రకరణము
దానేశ్వరమువద్ద సుల్తానోడి పోయిన పిదప దన రాష్ట్రములలోని ప్రజలెల్లరు వేనోళ్ల బొగడుచుండ జక్రవర్తి రాజ్యమేలుచు సుఖముగ గొన్ని దినములు గడపెను. అనంతరము పరదేశముల మెలగుచున్న వేగులవా రరుదెంచి జయచంద్రుడు జేయుచున్న కుట్రల దెలియబఱచిరి. చక్రవర్తి యందుల కింతసేపు విచారించి యూరకున్న గార్యము లేదని మఱునాడొక గొప్పసభ జరిగించెను. అందు ప్రధానులు అక్షౌహిణీ పతులు మున్నగు రాజ్యమునకు సంబంధించిన గొప్పయధి కారులందఱలు వచ్చి పరివేష్టించి యుండిరి. ఆత్తరి బృధివీరాజు తానున్న పీఠమునలేచి నిలువబడి “సభికులారా ! నిన్న మనచారులు కొనివచ్చిన వృత్తాంతముల వినియే యుందురు. మరల నిప్పుడు చెప్పుచున్నాను జయచంద్రుడు మనతో బూనుకొన్న వైరమును మానక మనదేశమున గాలుపెట్టుటకైన వీలులేక పారిబోవుచున్న సుల్తానులకు దోడ్పడి నాపై దండెత్తింప బ్రయత్నముల జేయుచున్నాడట. మఱియు మనదేశంబున గల యితర సామంతులను గూడ దోడ్కొ ని వచ్చెదనని మ్లేచ్ఛునకు వర్తమాన మంపినాఁ డట. ఈ జయచంద్రు నెంత బుద్దిహీను డనవచ్చును. వీని మూలమున మనదేశ మన్యుల పాలగు కాలము వచ్చినటులున్నది. ఈ విధముగ రణములపై రణములు చేయుచున్న నెన్నాళ్లని నిలువగలము. ఇదివరకైన యుద్దముల వలననే యమితమగు ధననష్టమును సేనా నష్టమును సంభవించి యున్నది కదా ! ఈ నీచునితో గలహ మాడ మొదలిడిన నాటి నుండియే మనప్రజల కెక్కడలేని యిక్కటులు కలుగు చున్నవి. అయ్యో ! ఈ జయచంద్రున కింతమాత్రము యుక్తాయుక్త వివేచన జ్ఞాన మెందులకు లేదా యని నాకు జింత కలుగుచున్నది. ఇంతవరకు మనయార్యా వర్తనము నందలి రాజు లేకీభవించి యుండుటచేతనే కదా పరదేశములవారు దీని మ్రింగివేయ గాచుకొని యుండియు నేమియు జేయజాలక యూరకున్నారు. ప్రస్తుతపు స్థితిని బట్టి విచారింప మనదేశ మన్యులపాలగుట రూఢీయని తోచుచున్నది. తనకంత నా పై గోపమున్న స్వయముగ దానొక్కడే నాపై దండెత్తివచ్చి జయముగొనరాదా ! అటులొనరింప జేతకాక మనకు బ్రత్యక్ష వైరులగు మహమ్మదీయులకా తాను తోడ్పడుట. వీడు కావించుచున్న కృత్యముల దలచినకొలది నా యొడలు మండుకొని పోవుచున్నవి. " అని బయటికి వచ్చుచున్న కోపము నాపుకొని మరల నక్షౌహిణీపతులతో "సేనానులారా! మీ సేనా సమూహంబుల నన్నింటి జక్క పఱచుకొని రణమున కేగ సిద్ధముగ నుండుడు. మీ దేశమును రక్షించుకొన వలసిన సమయము వచ్చుచున్నది. జీవముల కాశింపక పోరాడి ప్రఖ్యాతి గాంచవలయు. పిరికితనము వహించి రణరంగమున వెన్నిచ్చి పారువార లిక్కడనే యాగిపొండు . అట్టివారల నేనెంత మాత్రము బలవంత పఱచను. ఇక్కడ ప్రగల్భములు పలికి రణమున బరువెత్తువారల కెట్టి కఠిన శిక్షనైన విధించెద. భారత యుద్ధమైన తర్వాత నింతగొప్ప సంగ్రామము జరిగినటు లెన్నడు వినియుండ లేదు. కాపున లేశమాత్రమైన బ్రాణములపై నాస బెట్టుకొనక తుదవరకు యుద్దమొనరించి పాండవ సేనా నాయకులంబలె శాశ్వత కీర్తుల నందుడని పలుక సేనాధి పతులంద ఱొక్క పర్యాయమున లేచి " రాజేంద్రా ! దేవరవారింతగ సెలవియ్యవలయునా? మారణ కౌశలము గాంచి మీరే యెప్పుడు మెచ్చుగొందురుగాక, ఇప్పుడూరక వచించిన బ్రయోజనమేమి? శక్తి హీనమగు పర్యంతము పోరాడుచుందు మని నిక్కముగ నమ్మియుండుడు. " అని యేక వాక్యముగ బలుక జక్రవర్తి సంతసించి వెండియు “మీ నేర్పునే నెఱుంగనా ! అయినను జెప్పవలసిన మాటలు చెప్పితి " ననెను. అత్తరి విజ్ఞానశీలుఁడు లేచి “మహాప్రభో ! నాదొక చిన్న మనవీకలదు. ఇప్పుడా జయచంద్రుడు చేయుచున్న కార్యములబట్టి యాలోచింప మనకెట్లును పోరుతప్పదు. అది నిశ్చయమే అయినను నే కార్యములు కాని సాధ్యమగునంత వరకు సామ్యముననే చక్క పఱచుకొను టుచితము కాన మరల మిత్రబంధు భావములతో నా జయచంద్రున కొకలేఖవ్రాసి పంపుము. పిదప సంగతులన్నియు విశదములగును. అనఁ జక్రవర్తి " విజ్ఞానశీలా ! నీవు చెప్పునవి యన్నియు బక్షపాత రహితుడును నసూయా విహీనుండును నగువానియెడ ఫలించుగాని యీ దుర్మార్గునియెడ సఫలములగునా ? మఱియు మన మెంత సామ్యమున వేడుచున్న యంత మనతలకెక్కుఁగాని యతడు మంచి మార్గమునకు వచ్చుననుట కల్ల. అయినను నీ.మాటఁ గాదనను. నీ యాలోచన ప్రకార మటులే పత్రిక వాసిపంపెద" నని యొక లేఖ నీ క్రింది విధముగా వ్రాయఁ దొడగెను
స్వస్తిశ్రీ కన్యాకుబ్జ పురాధీశుడగు జయచంద్రుని సన్ని ధికి. “ నీ వార్య సంతతివాడవై నందున మనమందఱము బంధువులమై యున్నాము. అదియుంగాక మనకిద్దఱ కిప్పుడు మఱింత దగ్గర బాంధవ్యము చేకూరినది. భాంధవ్యముమాట యటులుండ నిమ్ము. పరస్పర కలహములులేక మనమందఱము గలిసియుండి మాతృభూమిని రక్షించుట మనకు విధియైయున్నది. పరదేశముల వారలీ దేశముపై దండెత్తి వచ్చినప్పు డొక్క భావముతో నందర మేకమై వారిఁ దరిమివేయకున్న మనకీ రాజ్యములు నిలుచుట దుర్లభము. ఇదివరకే మనలో మనము వైరముబెట్టుకొని మనప్రజల ' కనేక గతులబాధలు కలగఁజేసి యున్నాము. అట్టి విషయములో నాచే నోటువడి యావల లాహోరు దుర్గమును బోగొట్టుకొని యార్యావర్తమునందు నిలువ నీడలేక స్వదేశమునకు బరువెత్తిపోవుచున్న సుల్తానునకు నీవు తోడుపడుచున్నావని వినుటకు నా కెంతయు జింతగ నున్నది. నీ వింతటి యజ్ఞాని వేటికైతివో యూహింపజాలకున్నాను. మనమందఱముగలసి పరులఁ బారదోలుట లేకపోవఁ బురులకే సాహాయ్య మొనర్చి నాపైఁ బంపు టెంత వెఱ్ఱితనము. మన చుట్టుప్రక్కలనున్న దేశములవారిట్టి యజ్ఞానంపుఁ గృత్యముల సలిపిరని యెన్నడైన వినియుంటివా? కావున నికనైన నిట్టి యవివేకపు గార్యముల నొనర్చుటుడిగి సుల్తానుతో మైత్రి వదలుము. నీభావి సౌఖ్యమునకు భంగముకలిగించు కొనకుము. నీకు భయంపడి యిట్టిలేఖల వ్రాసితినని తలఁపకుము. అన్యు లేతెంచిన మనమెల్లఱ మేకీభవించి వారి దరిమివైచి మాతృ భూమిం గొపాడుకొను విధి మనదై యుండుటవలన నిట్లు . లిఖించి నాడగాని వేరొండుగాదు, నాతోగల వైరమే ప్రధానముగ జూచుకొనకుము. అని వ్రాసి ధీయుతుండగు నొక రాయబారిచేతి కొసఁగి పంపి నాటికిఁ గొలువుజాలించి వెడలిపోయను. రాయబారి కతిపయదినంబులకు గన్యాకుబ్జమునకేగి రాజసభా ద్వారముఁ జేరి లోపలికి జెప్పిపంప నిపుడు సందర్శింస వలను కాదని జయచంద్రుడు ప్రత్యుత్తర మంపెను. మరునాడు నట్లే జరిగెను, అనంతరము నాలుగైదు దినములు గడిచిపోవ సప్పుడు సట్లే జరిగెను. వచ్చినప్పుడెల్ల రాయబారిం జూడ వలనుకాదని తిరస్కరించుచు యుద్ధమునకు బ్రయత్నములఁ జేయించుచుండెను. రాయబారి యిదంతయు గ్రహించి తత్క్షణము ఢిల్లీకేతెంచి కనూజియందు జరిగిన సమాచారముఁ జక్రవర్తికిఁ దెలియఁ బఱచెను. అతఁడును రోషపూరితుఁడై యిక నాలస్యముఁ జేసిన కార్యములేదని సేనాపతులనెల్లరఁ బిలుపించి యుద్ధమునకు సర్వసిద్ధులై యుండవలసినదని యాజ్ఞాపించి తాను సంయుక్త మందిరమున కేగెను. అట రాణివాసమున నున్న సంయుక్త యు దనతండ్రి చేయుచున్న చేష్టలకు జింతాకులయై కూరుచుండి యుండ బరిచారక లేతెంచి చక్రవర్తి వచ్చున్నాడని తెలిపిరి. తోడనే యామెలేచి మగని కెదురు వోయి నమస్కరించి కొనివచ్చి తల్పమున నాసీనుం జేసి యతని ముఖమించుక వన్నె దరిగి యుండు టవలోకించి మెల్లగా నిట్లనియె. " నాథా నేడు మీ వదనము క్రొత్తగ నున్నది. అందులకు గారణమే నెఱుఁగుదు. దీనికి మీరు చింతించవలసిన పనిలేదు నా తండ్రియిట్టి కుమార్గగామి యయ్యేనని వినుటకు నా కెంతయో లజ్జగనున్నది. యుక్తా యుక్త వివేచనలేక యతడు చేయగడగిన దుష్కార్య ముల గూర్చి విన్నకొలది నా కమితమగు రోషము గలుగుచున్నది. ఇతడు నా జనకుడైన మానె. ఇట్టి దేశద్రోహులు బ్రతికి యుండుటకన్న మరణించుటయే మేలు. అయ్యో ! అతడే సజ్జనుడై మన యందఱతో గలసియున్న నే నిప్పు డెట్టి యుల్లాసస్థితి యందుందునో కదా. అట్టిభాగ్య మీ నిర్భాగ్యురాలి కీజన్మంబున గలుగనేరదు. అతని విషయమై మీ రావంతయైన జింత బెట్టుకొనకుడు. మీదేశక్షేమమునకై నా పైగల మోహముం ద్యజించి సంగరమున కరుగుడు. తమ సెలవైనచో నాతండ్రి యని శకింపక నేనుసు దమకు సాయముగ జనుదెంచెదను. సంభవించిన మనకిరువురకు రణముననే మరణము సంభవింపనిండు . అందులకు నా కావంతయైన విచారముకాని భీతికాని లేదు" అని ధీరత్వముతోపఁ బల్కిన తన పియాంగన వాక్యము లాలకించి చక్రవర్తి సంతోష పరవశుడై యామె నాలింగన మొనరించుకొని “ సతీ నీ వంటి యుత్తమ సాధ్విం జేపట్టిన నాకే కొఱంతయైన గలుగునా ? నా పురాకృత పుణ్యవశంబున నీవు సాకు లభించితివి కాని వేరొండుకాదు. పురుషుని మదికి జింత కలిగినతరి సమయోచితంబు లగు మృధుమధుర వాక్యములచే నతని దేర్చునదియే యతని బాలిటి భాగ్య దేవత యనం జెల్లు గాని లేకున్న మృత్యు దేవతయే యగుగదా. నీ వియ్యెడ వచించిన బల్కు లెంతయు నాదరణీయములు, చెలీ : నీ రణకౌశలము నే నిదివర కనేక పర్యాయములు గాంచియే యున్నాను . ఘోరసంగ్రామమున నా తలఁ దెగవ్రేయ నున్న కహరకంఠీరవు నొక్కవ్రేటున దునిమి నన్ను గాపాడిన దానికంటె వేరుగ జూడవలయునా ! నీ వీభూచక్రము నంతయు బాలింప దగియున్నా వనుట కెంతమాత్రము సందియము లేదు. అయినను యుద్ధమునకుఁ గొనిపోపు తలపున మన నగరమందలి యౌవన వతులందరకు రణశిక్ష నేర్పించి యుంచినాను, వారంద రిపుడు నాతో రా సిద్ధముగ నున్నారు. మే మందఱము రణస్థలి కేగ నగరమున నుండు కొద్దిసేనకును తక్కిన నీ తోడికాంతలకును నిటరక్షకు లెవ్వరు నుండరు. అట్టి తరుణమున నా భారమంతయు నీ యదియే " అన సంయుక్త మరల " నాధా ! నా సఖియగు మంజరిని మీ రెఱిగియే యున్నారుగదా. ఆ కన్నియ యే విషయము నందును నాతో దీసిపోవునదిగాదు. నాకన్న మిన్న యనియే చెప్పనొప్పును. ఆమెను మనము లేని కాలమున నిక్కడ నుంచవచ్చును. ఆమె యిప్పుడు కన్యా కుబ్జనగరముననే యున్నది. ఆమెకడనుండి జాబు రానిదినము లేదు. మరియు లేఖల దెచ్చిన వారలామె నా కొఱకై పరితపించుచు గృశించి పోవుచున్నదని వచించినారు. నాకు నామెంబాసి యుండుట వలన నెట్లోయున్నది. ఇత్తరి బిలుపింప తగిన సమయము వచ్చినది కావున జాబునంపి రప్పించెద. నాయుత్తరము గాంచిన వెంటనే బరువెత్తుకొని వచ్చును. ఆమే నిటనుంచి పోయిన మనకేమియు భయములేదు. నాకు మీతో యుద్ధమున కేతేర గడు నభిలాషగ నున్నది కాన నింతగా వేడుకొనుచున్న దానను. కాదనక యనుగ్రహింపు " డని పలుకుచున్న తన ప్రాణకాంతను వలదసనోపక చక్రవర్తి యామెధైర్య పరాక్రమముల స్వయముగ జూచి యున్నాడు కాన నటులేయని సమ్మతించెను. అంత నామె మంజరి కొక లేఖ వ్రాసి యొకనికిచ్చి మా తండ్రిగారి పట్టణమున కేగి యీ వుత్తరము జూపి మంజరి వెంటగొని రమ్మని పంపెను. వరిచారకుడు లేఖ గైకొని చనిన పిదప నా దంపతు లిరువురు రణమును గూర్చి మరికొన్ని సంగతులు మాటలాడుకొన వేరొక మందిరములో కరిగిరి.