Jump to content

రాణీ సంయుక్త/ఇరువదియారవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఇరువదియారవ ప్రకరణము

సుల్తా౯ షహబుద్దీన్ మహద్‌గోరీగా రటుల నార్యచక్రవర్తి సేనచే నోడింపబడి లాహోరు దుర్గముసైతము వోయినందున విచారమగ్నుడై యార్యావర్తము జయించునాస యడుగంట నాకస్మికముగ నెవరైన నెత్తివచ్చిన నెదురింపదగిన సేనయు లేమి నిక నిటనున్న ప్రాణాపాయకరమని తక్షణమ నాఫ్‌గ౯ స్థానమునకేగ బయలు వెడలి సింధునదిం జేరి కుతుబుద్దీన్ సలహా ప్రకారము ఘాజీఘాటుయొద్ద విడిసెను. ఈ వార్తలన్నియు గన్యాకుబ్జనగరమున దెలిసినవెంటనే జయచంద్రునకు గలిగిన కడుపుమంట యింతింతని వచింప నలవికాదు. ఇతనికి మఱింత రోష మెక్కించుటకుగా నీశ్వరభట్టు పూనుకొని యుండెను. ఆ మఱువాడు సుల్తానుగారికి సహాయ మొనరించుటఁ గూర్చి యొక పెద్దసభ గావించిరి. దానియందు బ్రధానులు, మంత్రులు, దండనాయకులు మొదలగు వారందఱు బరివేష్టించి యుండిరి. ఈశ్వరభట్టుచే ప్రేరేపింపఁబడినవారలై నేనాపతులందరు సుల్తా౯గారికి దోడుపడవలయుననియే వచించుచుండిరి. వినయశీలుఁ డొక్కడు మాత్రము వలదని వారించుచుండెను. అత్తరి రాజుగారు మ్లేచ్చులకు సహాయమొనరించియే తీరవలయునని వచింప వినయశీలు డిట్లనియె. "జయచంద్రా! పూజనీయంబగు నార్యావర్తమును గోహంతకులగు గ్రూరులపాల నేలఁ బడవైచెదవు. ఇదివరకు మన ప్రజలనుభవించిన బాధలవినియు మరల నిట్లేల కావించెదవు? చక్రవర్తిపైగల నసూయవిడ నాడుము. నీ కతడు చేసిన యపకార మేమికలదు. నీవే విచార విహీనుండవై మున్ముం దతనికి నిష్టూరముగ లేఖ నంపినపిదప నీపై దండెత్తి వచ్చెనఁట గాని నీ వతని నవమానపఱచిన సంగతి వినియు నూరకుండెనని వివియుంటిని. స్వార్ధపరులును దురాలోచనా సంగతులునగు నీశ్వరభట్టు మొదలగు వారి పల్కు. లాలించి నిష్కారణముగ నేలచెడిపోయెదవు. ఇతడు నిన్ను నాశనము గావించి తానును నాశనమగునట్టి కుయుక్తులే వచించుచుండుగాని నీ మేలుఁగోరి చెప్పుటలేదు . పరదేశములు రాజులు మనదేశముపై దండెత్తి వచ్చినపుడు మనకదివరకున్న మనస్పర్దల సహితము వదలుకొని యందఱ మొకటిగాఁగూడి దేశమును రక్షించుకొను నుపాయము జూడవలయుఁగాని పరులకు సహాయ మొనరించు టెక్కడనైనఁ గలదా? నీవును జక్రవర్తియుఁ గలిసి మ్లేచ్చులఁ బారదోలుటకు మారు నీవూర కుండనైన నూరకుండక మనదేశమందు నిలువనీడలేక పారిపోవుచున్న సుల్తానును మరలఁ బిలిపించి యతనికిఁ దోడ్పడుటెంత వెఱ్రిదనము. ఇదివరకు లాహోరు వాస్తవ్యులగు నార్యు లెందఱు తమదేశమును త్యజించి మనకడ కేగుదెంచి మ్లేచ్చులు పెట్టిన బాధలఁ జెప్పుకొని యేడువలేదు. నీవు సహాయమొనరింపకున్నను జక్రవర్తి యతని బారదోలినాడని వినుటకు నా కెంతయుఁ సంతసముగ నున్నది. నా మాటఁ బాటించి నీ వింతటితో నూరకుండుము. కుత్సితుడగు నీ భట్టువాక్యములు వింటివా నిక్కముగఁ జెడిపోదువు. " అన భట్టుగా రుగ్రుఁడై లేచి “రాజేంద్రా ! మానాభిమానములుకలవా రెవ్వరు నిట్లువచింపరు, నీవు సుల్తానుకు సాహాయ్యపడఁబోవుచున్నా వసుటేల ? అతనినే నీవు సాయముగఁ దోడ్కొని చక్రవర్తిపై దండెత్త నున్నావని యేల తలఁపరాదు, నేను నీ నాశనము గోరి యొక్కనాటికి వచింపను. క్షత్రియుండగువాడు తన వైరము దీర్చుకొనంజాలక యాడుదానివలె నింట గూరుచుండి యున్నచో దన ప్రజలకే తనపైగల యభిమానము దప్పిపోవును. అట్టియెడ నిన్ను ప్రోత్సాహము చేయుచుంటిమే కాని మే మేమియు నాశనము చేయుటలేదు. మీదు మిక్కిలి యీ ప్రధానివంటివారలే నిన్ను నిరుత్సాహ పఱచుచు నడ్డంకులఁ గల్పించి చెప్పుచున్నా " రనెను. దండనాయకులు మొదలగువార లంతకు మునుపే భట్టుగారిచే బోధితులై యుంటవలన వారును సుల్తానునకు సహాయ మొనరింప వలయుననియే పలుకుచుండిరి. జయ చంద్రుఁడు నట్టియుద్దేశమునే కలిగియుండెను. ఇంతమంది మూఢుల లోపల నొక్క వినయశీలుఁ డేమిచేయ గలుగును ! అయినను వినయశీలుం డూరకొనక మరల " రాజచంద్రా ! అసూయాపరుండవై కుమార్గగాము లగువారి వాక్యము లాలించి యేల నిష్కారణముగఁ జెడిపోయేదవు. పక్షపాతవిహీన మతివై బాగునోగుల విచారించి చూచుకొనుము. ముందు నీవంశమున జన్మింపబోవువారల కీదేశంబునఁ గాలునిలుపరాకుండఁ జేయకుము. అనేకవేల సంవత్సరముల నుండియుఁ బరదేశములవారిచే మన్ననలందుచు వచ్చుచున్న మనదేశమును ధ్వంసము సేయకుము. ఆదియుంగాక యీభట్టుగారు నీయెడ నేవిధమైన ద్రోహము దల పెట్టి యుండలేదని వచించు చున్నాఁడు కదా? ఒకనాడీ మూడుఁడు వీనియనుచరు లిరువురును నీకొమార్తెను గడతేర్ప నిశ్చయించినారు. దేవశర్మమూలమున వీనిమిత్రుల కిరువుర కానాఁడేమృతికలిగి సంయుక్త కాగండము కడచిపోయినది. ఇతండు నీయొద్దదప్పించుకొనుటకై వారిని సుల్తాన్‌కడకు బంపి యుంటినని వచించినాఁడు. వీనిరహస్యము లన్నియు నితనివద్ద నున్న కంచుకికి బాగుగఁ దెలియును. కావలయునన్న నతని దెప్పించి యడిగిచూడుఁ" డన గంచుకిని బిలుపించియడుగ నతండు వినయశీలుండు వచించిన ప్రకారమే చెప్పెను, అత్తరి భట్టుగారు వినయమంతయు దన మొగముననే తాండవమాడలేచి " మహాప్రభో ! వీరలు వచించునదియేమో నాకుం దెలియకున్నది. ఈవినయశీలుండు మెల్లగ నాకడనున్న కంచుకుని లోఁబఱచుకొని వానిచే నిట్లు బలికించినాఁడు అదియుంగాక నీతండు చెప్పినదినమున నేనిల్లువదలి బయటబోకుండినట్లు మీకు సాక్ష్యమిప్పించెద " నని నల్గురుమనుజులు బిలువనంపి వారిచే నట్లేచెప్పించి వెండియు నిట్లనియె. ఇతఁడు నా మిత్రుల విరువుర దేవశర్మ చంపినట్లు వచించు చున్నాఁడు గదా ! వారల నిద్దఱి గుతుబుద్దీన్ వద్ద కనిచి యుంటినో లేదో యతని దగ్గర నుండియే లేఖ దెప్పించి మీకుఁ గనుబఱచెదను. అని ఖండితముగఁ పలుక జయచంద్రుఁడును దనకూతురు విషయమై యంతగా విచారింపకున్నాడు. కాన భట్టువారి వాక్యములనే విశ్వసించెఁగాని వినయశీలునిమాటలఁ బాటిగొనఁడయ్యెను. అంత దానెన్నిగతుల వక్కాణించినను దన్ను లెక్కగొననందున వినయశీలుండు కోపమూని “దుర్మార్గులారా ! మీబోటివారలున్న రాజ్యమెన్నటికైన గుదుటఁబడునా? మీమూలముననే యిదివరకుఁ జక్రవర్తితో యుద్ధముకలిగి లక్షలకొలదిగనున్న సేనయంతయు నాశనమైనది . అనేక తరములనుండి ప్రఖ్యాతిమీరి వచ్చుచున్న గన్యాకుబ్జరాజ్యము నేటికి మీకారణమున నిర్మూలము కావలసివచ్చినది " అని సభవారింగూర్చి పలికి నృపునివంకకు దిరిగి " జయచంద్రా ! నావాక్యముల నించుక విశ్వసింపుము. చక్రవర్తితో వైరమూనకము. మ్లేచ్చులఁ జేరదీయకుము. అట్లు చేరతీయుట వలన నీ మాతృభూమి కంతయు నపకారము గావించినవాడవగుదువు. నీ మౌర్ఖ్యము విడువుము. " అన జయచంద్రుఁడేమియు బ్రత్యుత్తర మీయకుండెను. అంత మరల వినయశీలుడు " ఏమి ! ఇంతగా వచింపుచున్నను నా మాటలయందు నీకించుకైన విశ్వా సము గలుగలేదుగా. ఆసన్నకాలము సమీపించిన వాడు తన మేలుగోరి చెప్పు మిత్రుల బాటింపడనుట కిప్పుడు నీవు నిదర్శనముగ నగపడుచున్నావు. అంత నామాటలయందు నీకు నమ్మకముగలుగనిచో నా కీకష్టమంతయు నేటి" కని తన ప్రధానికత్వమునకు రాజీనామా యొసంగి వెడలిపోయెను. వెంటనే భట్టుగారు లేచి " రాజా ! ఇకడు తాను బెదరించిపోయిన నీవు భయపడి మరల నతనికాళ్లు పట్టుకుందువని యిట్లు కావించినాడు. ఇప్పుడు నీ కెంత మాత్రము భీతికలుగుట కవకాశములేదు. ఇతడు పోయిన నిన్ను నిరుత్సాహ పరచువారు లేకుండబోయి రంతియేచాలు. నీ వింతకాల మితని ప్రధానిగబెట్టుకొని రాజ్య మెటులొనరించుచుంటివో నా కాశ్చర్యముగ నున్నది. ఇటువంటి పిరికిపందల మంత్రులుగా నుంచుకొనుట నీ దేతప్పిదము. అందుకొఱకే యితని విషయమై నీతో నెన్ని పర్యాయములో వచించి యుంటి. అప్పుడు నా మాట వినకపోతివి. ఇప్పుడెవరు పొమ్మనకుండ దనంత దానేవెడలి పోయినాడు. శత్రువుపైకి నేతెంచి తలనరుక నున్నప్పుడు కూడ సూరకుండుమని వచించు నంతటివాడే. కానిమ్ము : ఇకనైన నీవు బాగుపడు నుపాయము చూచుకొనుము. మన మిదివరకు వ్రాసిపంపిన లేఖల జూచుకొని కొందఱు వచ్చిరికదా ! తక్కిన వారికి మరల వ్రాసిపంపుము. ఇంతలో నేను గుతుబుద్దీన్‌కు వర్తమాన మంపెదను. ఒక వేళ జక్రవర్తిచే నోటమికలిగిన మరల లాహోరునకు బోక సింధునదీ తీరమున ఘాజీఘాటు వద్ద నుండవలసిన దని యతని కదివరకే తెలిపియుంటిని. ఇప్పుడు వారికి లాహోరు దుర్గసహితము పోయినందున నక్కడనే విడసి యుందురు. ఆఫ్‌గన్‌స్థానము నుండి నూతన సైన్యమును దెప్పించు కొనవలసినదిగా వారికిప్పుడు తెలియ పఱచెదను" అన జయచంద్రుడు యుక్తాయుక్తముల విచారింపక భట్టుగారు వచించిన దంతయు దనకు లాభకరమేయని తలచి పట్టియున్న యసూయాపిశాచమును వదలించుకొన జాలక రాక తక్కిన తన మిత్రులగు నితరరాజులకు మరల వర్తమానముల నంపెను. అంత నాటికి సభజాలించి యందఱు వెడలిపోయిరి. ఈశ్వరభట్టు వినయశీలుడు పోయినందుల కత్యంత సంతోష భరితుడై తననిలయమున కేగి కుతుబుద్దీనున కీ క్రిందివిధమున లేఖవ్రాసి పంపెను.

"ఆలీసర్కార్ కుతుబుద్దీన్ నవాబ్ గారి దివ్య సముఖమునకు మీ మిత్రుఁ డీశ్వరభట్టు విన్నవించు కొనున దేమన :---

ప్రస్తుతము మీకుగలిగిన పరాజయమువలన నాకపరిమితమగు దుఃఖము గలిగినది. అయినది కానిండు. మీ రెంత మాత్ర మధైర్య పడవలదు. ఇక్కడ జయచంద్రుని బూర్తిగ నా వలలో వేసికొన్నాడను. నా పలుకన్న జవదాటడు. మీకుదోడ్పడి చక్రవర్తి నెదురింప నిశ్చయించు కొన్నాము. మఱియు వినయ శీలుండు నేడు తనపనికి రాజీనామా యొసగి పోయినాడు. ఇక జయచంద్రునకు నాకు విరుద్దముగ జెప్పువారెవరును లేరు. మీరు మీదేశమునుండి తగినంత సేనను దెప్పించుకొని నాకా సమాచారము దెలియ జేసినతోడనే యితని వెంటగొని నే మిమ్ము గలిసికొనెదను. తమరు మీ మాట జెల్లించు కొనుకాలము సమీపించుచున్న " దని వ్రాసి ఘాజీఘాటువద్ద కేగి కుతుబుద్దీనుకియ్యమని చారుల చేతికిచ్చి పంపెను. కతి పయదినంబులకా చారులు మాజీఘాటు జేరి కుతుబుద్దీను కా జాబుల నియ్యనతఁడవి చూచుకొని సంతోష భరితుడై వాటిసమాచారము సుల్తాన్ గారి కెఱుకపఱచెను. గోరీయు మరల నార్యావర్తమున నిలుచుటకు నీడ దొరికెనని సంతసింపుచు గజినీ యందున్న దన తమ్మునకు చేతనైనంత సేనను వెంటగొని ఘాజీఘాటువద్దకు రావలసినదిగ దెలియ బఱచి పెచ్చు పెరిగిన మచ్చరమున నెప్పుడార్యావర్తపు జక్రవర్తిని గడతేరునా యని కాచుకొని యుండెను.