రాణీ సంయుక్త/ఇరువదియైదవ ప్రకరణము
ఇరువదియైదవ ప్రకరణము
యోగి తాను వచించిన ప్రకారము మఱునాడు మహావైభవముతోఁ జక్రవర్తికిని సంయుక్తకును వివాహము గావించి నూతన దంపతుల దీవించి మరల వచ్చెదనని సెలవుపుచ్చుకొని వెడలిపోయెను. చక్రవర్తియు గమలాకరుండు సంయుక్తయే యని తెలిసిన పిమ్మటఁ బట్టరాని యానందమునొంది తనకట్టి యుత్తమసతి యర్ధాంగి యగుటచే గర్వమునందియుండెను, కొలువుకూటమునకేగుట మాని సదా యంతఃపురమందేయుండుచు వచ్చెను. ఇటులున్నను విజ్ఞానశీలుండుమాత్ర మేమరక జాగరూకుఁడై రాచకార్యములఁ జక్కబఱచుచుండెను. మ్లేచ్చుల దాడి కోర్వఁజాలకున్నామని పరగ్రామములనుండి యనుదినము లేఖలువచ్చుచుండెను. ప్రధానియు జక్రవర్తికి లభించిన నూత్న సౌఖ్యమునకుఁ బ్రతిబంధకము గలిగింప నిష్టములేనివాడై తానే యన్నింటిసవరించుకొని పోవుచుండెఁగాని దినములు గడచిన కొలఁది బత్రికలెక్కువై తమరాజ్యమంతయు నల్లకల్లోల మగుచున్నట్లు తెలియవచ్చు చుండెను. అత్తరి మెల్లనఁ జక్రవర్తి బిలుపించి సంగతులన్నియు విశదపఱుపగా దనరాజ్యమునఁ దట్టి హంతకులుండరాదని మ్లేచ్ఛులకుఁ దెలియ పఱచవలసినదిగా నాజ్ఞాపించి యతఁ డూరకుండెను. ఎన్నియుత్తరువులు పోయినను మహ్మదీయులా రాష్ట్రము వదలకుండిరి, తుదకుఁ బ్రజలందఱు ఢిల్లీరాజ్యమును విడచి పోవుచున్నామని చక్రవర్తి కడకు లేఖల సంపిరి: పృధివీరాజా లేఖఁగాంచి తా నంతవరకు నుపేక్షఁజేసి నందులకు నొచ్చుకొనుచు నాక్షణమున శాత్రవులసమాచారము తెలుసుకొనిరా గొందఱు వేగులవారినంపెను. వారును వెడలిపోయి మరల జనుదెంచి మహ్మదీయులు లెక్కకు మీరిన సేనలతో హస్సన్‌పురమువద్ద నున్నారనియు వారినుండి కొందరు గుంపులై బయలుదేరిగ్రామములఁ గొల్లబెట్టుచున్నారనియు వచించిరి. అందుపైఁ జక్రవర్తికిన్క వహించి కుంభీలకొండను వాని సకలాక్షౌహిణీపతిగ నేర్చఱచి దుర్గర భీములనువారి వానికిఁ దోడిచ్చి యొకలక్ష సైన్యము హిస్సర్ పురమువైపున కంపెను. చక్రవర్తి యాజ్ఞందలఁదాలిచి కుంభీలకుండు నడుమదటస్థలగు నట్టి మ్లేచ్చులయొక్క బందిపోటు మూకల నాశనముగావించుచు హిస్సర్ పురమున కఱుగుచుండెను. సార్వభౌమసైన్యము వచ్చు చున్నదనివిన మ్లేచ్ఛసేనానాయకుఁడగు కుతుబుద్దీన్ సుల్తాన్ గారిని తక్షణము కొనిరమ్మని చారులనంపి తాను జాగరూకతతో గాచుకొనియుండెను. మఱియు గ్రామముల పైఁజడి దోచుకొనం బోయినగుంపులును వచ్చి యతని గలిసికొనెను. కాని కుతుబుద్దీన్ లక్షసైన్యము వచ్చుచున్నదనివిని తనవద్ద నేబది వేలసైన్యమే యుండుటవలన యమునాతీరమునందువలెనే మరల నపజయము కలుగునేమో యని భయమందుచుండెను సుల్తాన్ గారికొఱకు ప్రతినిమేష మెదురు చూచుచుండెను. ఇంతలో నార్యసేన దృష్టిగోచరమై ప్రబలాట్టహాసంబున జనుదెంచు చుండెను. మ్లేచ్చులును దమతమ యాయుధములదాల్చి రణమునకు దిగిరి. సుమారు పగలు రెండు గంటల వేళ యుద్ధము ప్రారంభమయ్యెను. తమ కదివరకు గలిగిన పరాభవము దీర్చు కొననెంచి మహమ్మదీయు లత్యంత పరాక్రమముతో బోరాడఁ గడఁగిరి. కాని తగినట్టి రణశిక్ష లేనివారగుటచే వందలకొలది నాశనమగుచుండిరి. ఆర్యులత్యంత నిపుణముతో నొక్కొక్క వ్రేటున కనేకమందిని నేలకు బలియిచ్చుచుండిరి. రణము మహా ఘోరముగ నుండెను. నిమిషనిమిషమునకు సుల్తాను వచ్చుచున్నాడో లేదో యని కనుగొనుటకుఁ జారులనంపుచు కుతుబుద్దీన్ సేన నుత్సాహపరచుచుండెను. మరుసటిదినము పగలు పదునొకండు గంటల వరకు మహ్మదీయు లత్యుత్సాహముతోఁ బోరాడుచుండిరి. అప్పటికిని సుల్తాన్‌గారి జాడలేమియు లేవయ్యే. అంత గుతుబుద్దీన్ తాఁదలచినంత యైనదని చింతించుచు వైరిసేన ప్రబలముగ నుండుటవలన దన కపజయము గలుగుట రూఢియని తలఁచి కొంచె మించుమించుగ నొంటి గంటవేళ సేననంతయు వెనక్కు మఱలవలసినదని యుత్తరువు జేనెను. కుతుబుద్దీ నాజ్ఞాపించిన మ్లేచ్ఛవాహిని వెన్నిచ్చి పాఱుచుండు టవలోకించి కుంభీలకుఁడు వారి వెంటఁదగిలి తరుమ దనవారీ కాజ్ఞాపింప నార్యులు విజృంభించి మహమ్మదీయులఁ దరుముకొని పోవసాగిరి. ఇటులు సార్వభౌమ సేనచే వెంబడింపబడినవారలై మ్లేచ్ఛులు ధానేశ్వరమువద్ద కేగునప్పటికి సుల్తాన్ ప్రబలసేనా పరీవృతుఁడై యెదురుగఁ జనుదెంచుచుండెను. సుల్తాన్ పరుగెత్తుకొని వచ్చుచున్న తన సేననాపి మరల యుద్ధమునకుఁ బురికొల్పెను. ఈ సుల్తాన్ మహమ్మద్ గోరీ వెంటవచ్చిన సైన్యమునందు బదివేల యాఫ్‌గనులును, నేనిమిదివేల యరబ్బులు, నిరువదివేల తురుష్కులు, మొగలాయిలు నుండిరి. కుంబీలకుఁడు వైరిసేన మిక్కుటముగ నుండుటగాంచి తనసేన సర్ధచంద్రాకార వ్యూహమునదీర్చి శాత్రవులఁ దాకఁ బంచెను. అంత మరల పోరు మహాఘోరమయ్యెను. వివిధ శస్త్రాస్త్రముల తాకుడుల వేలకొలది సైనికులు మడియుచుండిరి . ఇట్లిక్కడ ఘోరసంగ్రామము జరుగుచుండ నీ వార్త లన్నియు కుంభీలకుడు చక్రవర్తికిఁ దెలియబఱచెను. కుంభీలకుని లేఖల వలన సుల్తాన్ తన యావత్తుసేనను గైకొని లాహోరు దుర్గమును విడచి వచ్చినాడని తెలిసికొని చక్రవర్తి. తన ప్రాణస్నేహితుడును, బావమరిదియు మీర్వార్ పరిపాలకుడునగు సామర్శికి లాహోరును ముట్టడింప వర్తమాన మంపెను. సామర్శియుఁ జక్రవర్తి యాజ్ఞాపించినట్లు తనవద్దనున్న యేబది వేల సైన్యమును వెంటగొని లాహోరును ముట్టడించెను. ఆ దుర్గమును సుల్తాన్ లేనికాలమున నష్రాఫ్ అనువాడు నలువదివేల సైన్యముతో గాపాడుచుండెను. సామర్శి దండెత్తి వచ్చుటవిని యష్రాఫ్ తన సేనను దగుస్థలములందు నమర్చి రణమొనర్చి శాత్రవులఁ బారఁదోలవలయునని యాజ్ఞాపించెను. వారు నట్లే యుద్ధమొనరింప సాగిరి. సామర్శి సైనికులు ఫిరంగులఁ గోటగోడల చివరలకు గురిపెట్టికాల్పుచు గోడలపైకి మహమ్మదీయులు రాకుండ జేయుచుండిరి. మ్లేచ్చులును సుల్తాన్ లేనితరి నెటులైన మాట దక్కించుకొన నెంచి పరాక్రమముమీర వైరులకుదారి దొరకకుండ బోరాడు చుండిరి. సామర్శి యెటులైన లాహోరును మరల నార్యులవశము చేయ నదను కలిగెనని తనవారల కత్యంత ప్రోత్సాహమొసంగుచు రణము సేయించుచుండెను. ప్రాణముల కాశింపక సాహసధైర్యములతో నార్యసైనికులు పోరాడుచు వారముదినములకుం గోట బహిర్ద్వారముల భేదించుకొని లోపలం బ్రవేశించి రిపుల నురుమాడఁగడఁగిరి. ఇక్కడ ధానేశ్వరమువద్దనున్న మ్లేచ్ఛులు కుంభీలకుఁ డేర్పర్చిన యర్ధచంద్రాకార వ్యూహమున చేదీంప జాలక వేలకొలఁది మడియుచుండిరి. ఒకవారమగు నప్పటికి మహ్మదీయసేన సగమునాశనమయ్యెను. అత్త రి కుంభీలకుండు కపిలుండనువానికి గొంత సేననిచ్చి శత్రువుల వెనుకవైపునం దాకబంచెను. మహ్మదీయు లార్యసేన సకలము దమముందున్న దనియే భావించిరిగాని నిపుణులగు సేనానులు మొదలగు వారలీ ప్రక్క నేయుండిరి. అత్తరినాకస్మికముగఁ గపిలుండు వెనుకఁదాకెను. గోరీసంభ్రమాన్వితుఁడై బాక్షూ, షాప్దర్ జంగులను నిరువురు నిపుణులగు సేనానులఁ గపిలుని నెదురించి పోరాడఁ బనిచెను. నల్దిక్కుల నార్యులు ముట్టడివైచియుండుటవలన మ్లేచ్చవాహిని యల్లకల్లోల మగుచుండెను. అట లాహోరుదుర్గమున నార్యులుక్కు మీరినరోషమునఁ దెగఁబడి మహ్మదీయుల నఱికిపారవైచుచుండ వారిదాటీ కోరువజాలక తుదకు మఱియొకవారమగునప్పటికి సష్రాఫ్ కాలికి బుద్ధిచెప్పి పారిపోయెను. సేనానాయకుఁడు కానరాకుండుటవలన మిగిలియున్న మ్లేచ్చ సైనికులు నిరుత్సాహులై యంత్యసాహసముఁజూపి మడియు చుండిరి. మరికొందఱష్రాఫ్‌మార్గము నవలంభించుచుండిరి. మూఁడువారములు కడచునప్పటికీ మహమ్మదీయులు పూర్తిగా నాశనమై కోట సామర్శి స్వాధీనమయ్యెను. తన విజయవార్త చక్రవర్తికి దెలియబఱచి దుర్గముయొక్క శిథిలములైన గోడలు బాగుచేయించి వాటి పై ఫిరంగుల నెక్కించి మరల దన్నెవరైన వెదురింపవచ్చిన నోడించుటకు సామర్శి సంసిద్ధుడై యుండెను. ఇట ధానేశ్వరమువద్ద నొకమాస మగునప్పటికి మ్లేచ్చసేన విస్తారభాగము నాశనమయ్యెను. అంత సుల్తాన్ దాను లాహోరు నుంచి వచ్చిన నైన్యముం గొనిరమ్మని చారులవల్ల నష్రాఫ్‌కు వర్తమానమంప వారు తిరిగివచ్చి యక్కడి సమాచారము నెఱిఁగించిరి. సుల్తాన్ మహమ్మద్‌గోరీ లాహోరు శత్రువుల పాలైనదని విని భయోపేతుఁడై యిక నటనున్న దనకు మరణము సంభవించుట నిశ్చయమని తలచి చతురులను నూర్గురు సైనికులను, గుతుబుద్దీనును వెంటగొని యొకరాత్రివేళ పారిపోయెను. మఱునాఁడు రణమునందు సుల్తాన్ గానరాకుంటచే నతఁడు రణములోఁ జచ్చియుండఁబోలు నని మహ్మదీయులు శౌర్యహీనులై పరుగిడఁజొచ్చిరి. ఆర్యు లొకనినైన దప్పించుకొనిపోకుండ మట్టు పెట్టుచుండిరి. కొన్నిదినము లగునప్పటికే సుల్తాన్ సైన్యము సంపూర్ణముగ ధ్వంసమయ్యెను. హత శేషులగువారిఁ బట్టించి ఢిల్లీకి ఖైదీలుగ బంపి కుంభీలకుఁడు తన జయవార్తను జక్రవర్తికి దెలియబఱచెను. శాత్రవుల యుద్దోపకరణములన్నియు నార్యుల పాలఁబడెను. కుంబీలకుడట్టి మహాజయముతో ఢిల్లీని ప్రవేశించెను. అతడు రాజధాని జేరినదినమున ననేకములగు నుత్సవములు జరిగెను. చక్రవర్తియు మహోల్లాసము నొంది రణప్రావీణ్యము గనుబఱచిన సేనానుల కనేక బహుమతులొసగి మన్నించెను. సంయుక్తయు దన నాయకునకు గలిగిన జయమువలన బరమానందభరితయై రణమున గతించిన శూరుల కాంతల రప్పించి వారి ననేక గతుల నోదార్చుచు, మన్నించుచు నట్టివారలకుఁ దగిన జీవనోపాయంబుల గల్పించి యొసగెను. మ్లేచ్చుల యార్బాటము లడుగంటి నందున దేశమంతయు నెమ్మదియై పౌరజనంబులెల్ల సౌఖ్యంబురాశి నోలలాడుచుండిరి.