రాణీ సంయుక్త/ఇరువదియెనిమిదవ ప్రకరణము
ఇరువదియెనిమిదవ ప్రకరణము
అఁట జయచంద్రు డంపిన లేఖలఁ జూచుకొని యార్యా వర్తమునం గల కొద్దిమంది సామంతులు దప్ప దక్కినవారందఱు స్వార్ధపరత్వమూని స్వతంత్ర రాజ్యములు లభించునను కోరిక దమతమ నేనల వెంటగొని కన్యాకుబ్జము జేరవచ్చిరి. అందు జయచంద్రుని ప్రాణ స్నేహితుడును మందూరు పాలకుడును నగు పురిహరరాజకులుండు నలుబదివేల సైన్యము తోడను, నేపాల కోసల వంగదేశాధిపతులు తొంబది వేల నేనలతోడను, కాశ్మీరపతి ముప్పదివేల బలములతోడను, మగద నాథుఁడు నలుబదివేల సైన్యములతోడను జనుదెంచెరి, వీరందఱి రాకకు జయచంద్రుఁడు సంతసమందుచు నందఱననేకగతుల మర్యాదలొనర్చి మన్నించుచుండెను. ఇంక నీశ్వరభట్టుగారి సంతోషమునకు పరిమితియేలేదు. రాజ్యకార్యదురంధరుండగు వినయశీలుఁడు దనపనికి రాజీనామా యొసంగి చనినపిదప నతని స్థానమున భట్టుగారే యుంచబడిరి గావున రాజుగారికి మంత్రాలోచనములన్నియు నితఁడే బోధించుచుండెను. జయచంద్రునకుఁ దోడ్పడఁ జనుదెంచినరాజులకుఁ జక్రవర్తిపై లేనిపోని దోసములఁ గల్పించిచెప్పి యసూయ బుట్టించుచుండెను. సమస్త సామంతులు వచ్చినపిదప గుతుబుద్దీన్ వద్దనుండి సమాచార మెప్పుడేతెంచునా యని భట్టుగా రెదురుచూచుచుండిరి. అంతలో గొందఱు మ్లేచ్చభటు లేతెంచి గుతుబుద్దీ నొసంగినలేఖల భట్టుగారి కియ్య నవిచూచుకొని పరమానందమునొంది వాటినన్నింటి జయచంద్రునకుఁ జూపింప సతఁడును మోదమగ్నుడై యలీఘరువద్దకు తమ్ముగలుసుకొన వలసినదిగా మ్లేచ్చులకు వర్తమానమంపెను. ఆ మరుసటిదినమునవచ్చిన రాజమండలిగూడు కొని యలీఘరునకుఁబోవు ప్రయాణమును గూర్చి ముచ్చటించు కొనుచుండ దేవశర్మయేతెంచి నృపునిచే మన్ననలంది యొక పీఠమున నాసీనుడై మెల్లన నిట్లనియె. జయచంద్రా ! ఈ సంరంభ మంతయు నేటికి?
జయ! అయ్యా! మీకన్నియు దెలిసియే యుండును. తెలిసి యుండియు నిట్లేల యడిగెదరు. చక్రవర్తిపై దండెత్తం బోవుచున్నాము.
అని నృపుఁడు పలుక దేవశర్మ యెక్కడ వచ్చెనాయని విసువుకొనుచు మొగముమాడ్చుకొని కూరుచుండియున్న భట్టు గారా ఖండితంపు వాక్యములకు సంతుష్టులైరి. దేవశర్మ రాజు దిక్కు మొగంబై " జయచంద్రా ! నీ వింతటి యవివేకుండ వేటికైతివో తెలియఁజాలకున్నాను. ఇంచుకైన యుక్తాయుక్త విచార మొనరింపవా? అయ్యో " యని యింకను నేమియో వచింపబోవుచుండ నతడు విసువుకొనుచు “అయ్యా ! ఈ నీతి వాక్యముల వినివిని నా చెవులు తడకలు కట్టిపోయినవి. మరల మీకీ శ్రమయెందుకు ? క్షమింపుడు. ఇత్తరుణమున మాత్రము తమ వాక్యముల మన్నింపనోప " నని మొగమోట మించుకైన లేక నిష్ఠురముగఁ బలుక దేవశర్మ మనస్సు కలుక్కుమన వేరొండు వచింపనోడి "యటులనా " యని కొలువు వెడలి పోయేను. నిజపురోహితుఁ డట్లుకోపమున బోవుచుండ జూచుచు నూరకుండెనేకానీ జయచంద్రుఁ దావంతయు లెక్కఁగొనఁ డయ్యెను. ఈర్ష్యాగ్రస్తులకు మర్యాదామర్యాద వివేచన జ్ఞానము సహితము నుండదు కాబోలు. ముఱునా డతడు సకల సేనా సమన్వితుడై సామంతులం గూడుకొని యలీఘరు ప్రాంతమున కేగి కాళీనది యొడ్డున ధండును విడియించి డేరాలవేయించి సుల్తాన్‌గారి రాకకై యెదురు చూచుచుండెను. అట ఢిల్లీనగరమున వేగులవారివలన బయట జరుగుచున్న సంగతులను విని చక్రవర్తి పట్టరాని యాగ్రహమూని యొక సభజేసి యందు దండనాయకులు మొదలగు వారలకు యుద్ధసంబంధములగు విషయములఁ కొన్ని వక్కాణించు చుండెను. అత్తరి రాజపుత్ర స్థానమందలి కొందఱు సామంతులును, ఘూర్జరదేశాధీశుడును జక్రవర్తికడ కేతెంచి యిట్లు విన్నవించుకొనిరి. “రాజేంద్రా ! మనదేశముపై మహమ్మదీయులు దండెత్తి వచ్చుటయు, జయచంద్రుఁడు మొదలగు వారు వారికిఁ దోడ్పడుటయు నాదిగాఁగల సకల వృత్తాంతముల నెఱిగియేయున్నాము. తనకు సహాయముగ రమ్మని జయచంద్రుడు మాకును లేఖలనంపినాడు. మే మతనికి సహాయముగ బోవుట కిచ్చగింపక యేలినవారి సామంతుల మగుటచే రణసమయమున మీకు మే మొనరింపఁదగు దాని సలుపుటకై సర్వసిద్ధులమై వచ్చితిమి. మీ యాజ్ఞానుసార మెట్లు నడచుకొమ్మనిన నట్లు వర్తించెదము. యుద్ధమున మీ కొరకై మా ప్రాణముల సహిత మర్పింప సన్నద్ధులమై యున్నా" మని పలుక జక్రవర్తి మితిమీరిన సంతసమున "ఆహా! నేటికి నేను నిక్కముగ ధన్యుడనైతి. మన యార్యావర్తమునంగల నృపులెల్లరు మాతృద్రోహులును, స్వామి ద్రోహులును, స్వార్ధ పరాయణులు నని తలచియుంటిగాని నేడా తలంపు మారిపోయినది. మనకు జయముకాకున్న బోనిండు. మన యార్యావర్తము నందు మిమ్ముఁబోలు పరోపకార పారీణులు గొందరున్నారుకదా యని సంతోషము కలుగుచున్నది,” అని వారందఱకుఁ బస దనంబు లొసంగి వారు వెంటఁగొని వచ్చిన సేనల దన యక్షౌహిణీ సేనలఁ జేర్పించెను. ఆ సమయమందే లోకులందరు సౌందర్యమునకు మెచ్చి పెట్టిన యలంకారుఁడను పేరుగల బాలుడొకడు రోషావేశమున నెఱ్ఱాబారిన ముఖముతో సభామధ్యమున కేతెంచి చక్రవర్తితో "మహారాజా ! ముందు శత్రువు లతో బోరాడ నన్ననుగ్రహింపు" డని వేడుకొనెను. పృధివీరాజాశ్చర్యకలితుడై నీ విట్లగుటకు గతమేమన నా బుడుతఁ డిట్లనియె. "రాజా ! నా తండ్రిగారు తమకొఱకై పోరాడుచు మహోబాసంగరమున మృతినొందినారు. కాని తరువాత శరీరముకొఱకు వెదక నది యెద్చోటను గన్పించలేదు. ఇప్పుడు నాతో గలిసియున్న నా స్నేహితులు గొందఱు మా తండ్రి రణమున కేగలేదనియు, నతఁడందు లేనేలేడనియు వచించుచున్నారు. అందుచే మా వంశీకులు యుద్ధములందు నిలువ సమర్థులని స్వయముగ దెలియబఱచుటకై యిట్టులడిగితిని." అన చక్రవర్తి యతని యెడల దృడానురాగము గలవాడై తన దగ్గరకు లాగుకొని యతని దక్షిణకరమును బట్టి పైకెత్తిన వెంటనే సభాసదులెల్లరు నిశ్శబ్దముగ గూరుచుండి యుండిరి, అత్తరి జక్రవర్తి కోపమును, దుఃఖమును పొడమ నిట్లనియె. "బుద్ధిహీనులగు నా పడుచువారలంద ఱైక్కడ ? నా ప్రక్క తోడై నిలిచి ప్రాణముల కాశింపక పోరాడిన సత్వవంతుని చరిత మాలకింప వారి నందఱి నిటకుఁ గొనిరండు. మహోబా యందు జరిగిన ఘోర సంగ్రామమున నితని తండ్రియు, నేనును గాఢమగు గాయములు దగిలి పడిపోయితిమి. మొదట నాకు స్మృతియే లేదు. మరల నా కించుక తెలివి కలుగు నప్పటికి రణము పరిపూర్తి యయినది. జయము మాకే కలిగినది. ఆ సమయమున శక్తిహీనుఁడనై నెత్తురు వరదలు కారుచుండ బడియుండ నేను చచ్చితినను తలపున డేగలు మొదలగు పీనుగుల దినుపక్షులు బలహీనములై వ్రేలాడుచున్న నా నరముల పీకుకోని తినుటకై తటతట రెక్కలల్లార్చుకొనుచు నాపైవ్రాలవచ్చుచుండెను. అట్టియెడ నే నేమనివచింపుదు, పాప మీచిన్నవాని జనకుఁడు నాకు గొంచెము దూరములోఁ బడియుండి మోకాళ్లవరకు నఱుక బడియుండుటచేఁ బొరలి యాడుచునైన నాదగ్గరకు రాలేకసగము తునిగిన మొండికత్తితో దనశరీరమందలి మాంసపు గండలఁ బెఱికి నాపై వ్రాలవచ్చు పక్షులకు వైచుచు నన్నంటకుండఁ జేసి తనఋణము దీర్చుకున్నాడు. తరువాత నాకు మరల స్మృతితప్పిపోయినది. అంత నేమిజరిగినదియు నాకుఁ దెలియదు. తిరుగనాకుం దెలివివచ్చునప్పటికి నా సేనాధిపతుల నడుమనుంటిని. అతనికొఱుకు వెదకించితిగాని యెచటను గాన్పింపలేదు. బుద్ధిహీనులారా! అట్టియుత్తమసాహసికు నా రణమందు లేడని మీరు వచించుట ? అట్టిపరాక్రమశాలి ధవళకీర్తికా మీరుకళంకము గల్పించుట? ఇఁక ముందెన్నటికి నిట్టిదుడుకు తనపు మాటలాడక గారవమున నతనిస్మరించుచుండుడు. సమ్యమ రాయుఁ డెప్పుడును వెన్నిచ్చి పారువాడుకాడు. రణమున బృధివీరాజునకతఁడు సోదరుఁడై మెలఁగినాడు." అని యాకుఱ్ఱవాని వంకకుఁ దిరిగి బుజ్జగింపువాక్యములతో "నాయనా ! నీవింకను పసిపాపపు. రణమున కేతెంచుట యుక్తముకాదు. సద్విద్యలం దారితేరి నీ జనకునిబలె శాశ్వతకీ ర్తినంద బ్రయత్నింపు" మని అతని బంపి వేసి తాను రాణివాసమున కఱిగెను. అంతఃపురద్వారముల సమీపించిన వెంటనే మంజరీసంయుక్త లేతెంచి ప్రణమిల్లి యతని లోనికిఁ గొనిపోయిరి. చక్రవర్తి లోపలికేగినపిదస మంజరి క్షేమసమాచారమడిగి కొంతతడవునకు "మంజరీ : నీనెచ్చలి నాతోఁ గూడ సంగరమునకు వచ్చెదనని యడుగుచున్నది. మేమిటలేనితరి పురమును రక్షించుభారము నీదే" యన సంయుక్తచే నదివరకే యొప్పింపఁబడియున్నది గావున నట్లేయని యామె సమ్మతించెను. అనంతర మెల్లరు మరల వేగులవారేమి వర్తమానము గొనివత్తురోయని కాచుకొని యుండిరి. కొన్ని దినములు కడచినవెన్క నిట నలీఘరువద్దనున్న జయచంద్రు సుల్తానుగారు సేనాసమేతముగఁ జనుదెంచి కలసికొనిరి. నాటినుండియు మహ్మదీయులు, నార్యులు ననుభేదము లేకుండ నుండవలయునని యొప్పందము చేసికొనిరి. అటుపిమ్మట సుల్తాన్ జయచంద్రు లిరువురుగలసి తమసేనలగొన్ని భాగములుగ విభజించి కోసలాధిపుని యాధిపత్యమున నొకభాగమును చోలాపురి ముట్టడించుటకును, వంగదేశపతి నాయకత్వమున నింకొక భాగమును ఫరుక్నగరమును స్వాధీనము చేసుకొనుటకును, బురిహరరాజు కులుని వశమున మరియొకభాగమును గైజియా పట్టణము నాక్రమించుకొనుటకును బంపిరి. చారు లరుదెంచి బయటజరుగుచున్న వార్తల నిటఁ . జక్రవర్తి కెఱుక బఱుపగా నతఁడు సప్పుడే యక్షౌహిణీపతులు మొదలగువారి రావించి ఘూర్జనపతిని గోసలు నెదురించుటకు, రాజపుత్రస్థానమునుండి వచ్చినవారిలో నచల మహాబుద్ధులను నిరువుర మందూరు వందంపతుల నెదురించుటకును దగినసేనలనిచ్చి పంపి యాఫ్‌గన్ స్థానమునుండి మరల సైన్యములు రాకుండ నాదారుల నన్నింటియందు గాచుకొని యుండవలసినదని లాహోరునున్న సామర్శికి వార్తలనంపి పురరక్షణకు మంజరినిలిపి సంయుక్తా సమేతుఁడై యక్షౌహిణీపతులు సేనాపరీవృతుఁలై ముందునడువ నలీఘరువద్దనున్న సుల్తాన్ జయచంద్రుల నెదురిఁపఁ బయనమై వచ్చుచుండెను.