రాణీ సంయుక్త/ఇరువదితొమ్మిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఇరువదితొమ్మిదవ ప్రకరణము

యచంద్రుఁ డట్లు చక్రవర్తిపురముల మూఁడింటి ముట్టడింప సేనలనంపి వారుపోయిన మూడవనాటి ప్రాతఃకాలమున దానున్న శిబిరమువిడచి యొంటరిగఁ గాళీనదిలోనికేగి యందొకవైపునఁ జల్లగనున్న స్వచ్ఛసికతా తలమున నాసీనుఁడై నెమ్మదిగఁ బారుచున్న నదిని నవలోకించుచు, తాను గావింపుచున్న కార్యములన్నియుఁ దలఁపునకు రా నేమేమో యాలోచించు కొనుచుండెను. అట్టితరుణమున నాకస్మికముగ సంయుక్తయే తెంచి నమస్కరింప నతఁడు విభ్రాంతుఁడై చూచుచు నేమియుఁ బల్కరింప కూరకుండెను. అప్పుడు సంయుక్త మెల్లన "తండ్రీ! నీ పరిపారమును విడచివచ్చి యొంటరిగ నీ విట నేమి యాలోచించుచున్నావు. నీ మాతృభూమి యగు నార్యావర్తముపై గల నభిమానము నంతయుఁ ద్యజించితివా? కడుగారాబమునఁ బెంచిన నా పైఁగల మక్కువను సహితము వదలితివ ? కట్టా ! కన్న కూతుల నిట్లుగారియలంబెట్టు తండ్రులెందైనఁ గలరా ? ఇదివరకు మహ్మద్ గజినీ దాడివెడలివచ్చి మనదేశమున నెట్లునాశనఁ జేసిపోయినది నీ వెఱుఁగవా? అయ్యో ! బిడ్డలవంటి నీ ప్రజలనందర మ్లేచ్చుల కేలసమర్పించెదవు. గోహంతకులగు నీ క్రూరులఁ జేరఁదీసి నా ప్రాణకాంతునిపై నేల కత్తిగట్ట నెంచెదవు . వీరి నమ్ముకొనిన నీ కావంతయు లాభములేదు. నాప్రార్దన మాలకించి యిప్పుడైన నీ సేనల మరలించుకొని వెడలిపొమ్ము. నన్ను గటాక్షింపుమ"ని కడుదీనముగా వేడుకొనుచున్న పుత్రికను గన్నులెఱ్ఱచేసి చూచుచు "ఓసీ ! దుర్మార్గురాలా ! హీనాభి సారిక భంగి నా యిష్టము లేనియెవనినో చేపట్టి సిగ్గులేక తగునని నాకు బుద్ధులుగఱప నేతెంచితివా? చాలు. నా యెదుటనుండి వెడలి " పొమ్మని కసరుకొన మరల నామె వినయపూర్వకముగ " నాయనా! నాపై నింతకోపమేటికి ? హీనాభిసారికవలె నే నేనీచునైన వరించితినా ? ఆర్యావర్తమున కంతయు సార్వభౌముఁడై దీనదయా పరుఁడై, ధీశాలియై మన్ననలకెక్కిన మూర్ధన్యశిరోరత్నమగు బృథివీరాజుంగదా నే వరించి పరిణయమైనది. అయ్యో : చక్రవర్తి యతటివాఁ డల్లుఁడయ్యెనని సంతసించుటకు మారుగ నతనికిఁ గీడుగావింపఁదలఁచు టెంత వెఱ్ఱిదనము. చక్రవర్తి జామాతయయ్యెననిన నీకుఁ గలుగు ప్రఖ్యాతికి మేర కలదా ? తండ్రీ ! మనమందరము గలసి ప్రసన్న హృదయులమై యొకచోట నివాసముఁజేయుట మాని యిట్లు పోరాడుకొనుచుండు టెందైనఁగలదా? ఈర్ష్యావేశుఁడవై యేల యీలీలనకార్యములఁ గావింప నొడిగట్టెదవు ? ఋషిజన సేవ్యమానమై యలరారు మనపుణ్యదేశమును గిరాతుల పాల నేల పడవైచెదవు. పతివ్రతాతిలకములని ప్రసిద్ధివడయుచు నుత్తమ విద్యావంతురాండ్రై స్వచ్చంధ సంచారంబుల జీవనములఁ గడుపు నీ సోదరీమతల్లుల కందఱకు మానభంగమగురీతి నేలసల్పెదవు? సొందర్యవంతుల కెల్ల బందీగృహవాసము ప్రాప్తమగుభంగి నేల కలుగజేసెదవు. తండ్రీ! నీవుపూనియున్న యసూయను ద్యజించినచో నింతదారుణములు గలుగ నేరవుగదా? పక్షపాతర హితుఁడవై మంచిచెడ్డల నాలోచించి చూచుకొనుము. ప్రస్తుతము నీ సహాయ మవసరమగుటచే వీరందఱు గ్రుక్కిన పేలవలె యూరుకుండియున్నారు. కాని లేకున్న బట్టబగ్గము లుండెడివా? ఈదుష్టులొనరించు బీభత్సముల వినియు, గనియు నిట్లేల యజ్ఞానంబున మునిఁగెదవు ? మఱియు నిత్తరి మనదేశంబున జరుగుచున్న సంఘసంస్కారములన్నియు నీ క్రూరుల మూలమునేకదా? నాయనా! నీ సోదరీ జనంబులకుఁగల స్వాతంత్ర్యము లన్నియు నడఁగి దాసీలకన్న నీచమగుబ్రతుకు చేకూరుపనులఁ జేయబూనుట నికనైన మానుము. ఇంతకు మునిపేమియోకాని యిప్పుడు నిన్ను నిందింపనివాఁడు మందునకైనఁ గానరాఁడు. జయచంద్రా! నీ మూలమునఁగదా నేఁటికి మా కిట్టియిక్కట్టులు సంప్రాప్తము లైనవని రోదనము లొనర్చుచు నెందరో పుణ్యాంగనలు తమ ప్రాణముల గోల్పోవుచున్నారట. వెండియు మనదేశమున నిదివరకే ప్రబలియున్న వామమార్గులవలన సాధువులగు పశుపు లనేకములు నాశనమై పోవుచున్నవి. ఇఁక వీరును వారికి దోడ్పడినచో నా పశువులకు బ్రతుకుదెరు వెక్కడిదిది! అయ్యో !నీకుగల భూతదయ యంతయు నే గంగలో గలసిపోయినది? తండ్రీ ! ఏ కరణివిచారించినను నార్యావర్తము నంతయు ధ్వంసముకావించినవాఁడ వగుదువుగాని వేరొండుకాదు. ఇప్పటి వారిమాట యటులుండ ముందు జన్మించువారెల్లరు నిన్నాడి పోసుకొనక మానరు. ఇఁకనైన సుల్తాన్ తోఁగల మైత్రి వదలుకొనుము. నీవు నా నాధునకు సహాయమొనరింపకున్న మానె. మ్లేచ్చులకు సహాయము సేయకున్నఁ జాలు. నానమస్కృతులం గైకొని కరుణింపు" మని యభివాదన మొనర్చ నొక్క తన్నుదన్ని " ఓసీ ! కన్నకూతురువని యేమియు సేయక చూచుచు నూరకున్నకొలది నోటికివచ్చినట్లెల్ల వదరసాగితివా ? నీకీ కంఠశోషణ మెందులకు ? నా యిష్టమువచ్చినట్లు కావించెద. నన్నాజ్ఞాపించుటకు నీ వెవతెవు ? నా దృష్టి పథమునుండి తొలగిపొ"మ్మన మరల నామె కడసారి చెప్పిచూచెదంగాకని " నాయనా ! ఏటికిట్టి బెట్టిదంపువాక్యము లా డెదవు ? నే మిమ్ము వేడుకొనుచుంటిగాని యాజ్ఞాపించుచుంటినా? తండ్రీ ! కృతఘ్నులగు నీ మ్లేచ్చులు దమయవసరము తీరినవెనుక నిన్నును నాశనము జేయుదురుగాని మన్నింపఁజూతురా? అయ్యో ! నీవు వీరలకు దోడ్పడుట కాలాహికి బాలుపోసి పెంచుటే. ఈ క్రూరుల దరిజేర్చుట శార్దూలముల దగ్గరజేర్చుటే. వీరలకే నిక్కముగ జయముకలిగెనా నీ వేకోండలకైనఁ బారిపోవలసినదే గాని యిక్కడనుందువనుట కల్ల. నీవు నాయెడల నింతకాఠిన్యము వహించియున్నను నిన్నుగాంచిన నా కపరిమితమగు జాలికలుగు చున్నది. కట్టా ! ఈనీచులు నిన్నెట్టి బాధల బెట్టుదురోగదా? నీకీ యజ్ఞాన మెక్కడ కలిగినది? చిన్నదాననైనను తండ్రి వగుటచే నీ మేలుగోరి యింతగ వచించుచున్నదానను. మరియు మన తాతలనాటినుండి వచ్చుచున్న నుత్తములగు వినయశీల దేవశర్మల వెడలగొట్టించితివని వినుటకు నా కెంతయో సంతాపకరముగ నున్నది. ఇంతవరకైనది కానిమ్ము. ఇప్పుడైన దెలివి కలిగి జాగ్రత్తపడుటకు దగినంత సనుయమున్నది." అని వినయ వినమితోత్తమాంగయై పలుకుచున్న కూతుం గాంచి పట్టరాని కోసమున . " ఓసీ దౌర్భాగ్యురాలా ! నీకీ యధిక ప్రసంగ మేటికి ? నీవీ తత్క్షణమున నా యెదుటనుండి లేనిపోయెదవా లేదా" యని యతడు హుంకరించి పల్కిన నింతగ వేడుకొన్నను గార్యము లేకపోయెనని యామె యత్యుగ్రమునంది " కుత్సితుఁడా : నీవు నా తండ్రివైన నగుదువుకాక. నీవు నా జనకుడు ననుటకెంతయు సిగ్గగుచున్నది. ఏ పాపముననో నీకు బుత్రికనై జన్మించితిగాని వేరొండుకాదు. స్వోదర పరాయణులును, గుమార్గగాములునగు భట్టుమొదలగువారి వాక్యములే యమృతప్రాయములై నీ తలకెక్కెనా ? పవిత్రవంతమగు తోరూవంశపారావారంబున హాలాహలముఁబోలి' జన్మించితివి కదా? తరతరంబులనుండి ప్రఖ్యాతికెక్కి వచ్చుచున్న నీకన్యా కుబ్జరాజ్యమును ధ్వంసముజేయ నీ వెక్కడినుండి దాపరించితివి? దుర్మార్గుడా ! నీవు నా తండ్రి వేటికైతివి ? లేకున్న నీవంటి నీచుని నీనా ఖడ్గమున నొక్క వ్రేటున నేల కర్పించియుందునే. నీ వొక్కరుఁడవే యిట్టి యకార్యముల సలుపుటగాక తక్కుంగల సామంతులఁ గూడ పురికొల్పి దెచ్చితివా? ఆహా! ఆర్యావర్తమునంగల యైకమత్యము నంతయు ధ్వంసముగావించి విడచితిగదా? చీ ! ఇఁక నీ ముఖము 'వీక్షించిన బాతకమగు" నని యగ్గలంపురోషమున నా చోటువదలి పోయెను. జయచంద్రుడును నిరాఘాటముగ నెదురించిపల్కు పుత్రిక యెదుట నోరుమెదల్పనోడి వెడలిపోయిన వెంటనే తన శిబిరమున కేతెంచి సుల్తాన్‌వలన జక్రవర్తి వచ్చినాడన్న వార్తవిని తన సేనా నాయకులకు రణముగావింప నుత్తరువొసంగెను. మరియు నత్తరిఁ గొందరు చారులరుదెంచి కోసలపతియోడి పారిపోయినాఁ డనియు, మందూరు వంగపతులు మఱికొంతసేన సంపవలసిన దని కోరినారని వచింప నట్లే వారికడకు మరికొంతసేననంపెను. అలీఘరువద్ద నిరువాగులవారును హోరాహోరిగఁ బోరాడఁ గడఁగిరి. ప్రాణముల కాశింపక తమతమ నాయకులచే హెచ్చరింపబడు దినముల కొలది సంగర మొనరించుచుండిరి. ఇటు లిక్కడ ఘోరమగు రణము జరుగుచుండ మఱికొంతసేన నంపవలసినదవి యచలునికడనుండి చక్రవర్తికి లేఖవచ్చెను. సేనానాయకులందఱు రణమున మునిగియుండ నెవనిబంపుదునా యని చక్రవర్తి యోచించుచుండ వేరొకవైపున సైనికులఁ బ్రోత్సాహ పఱచుచున్న సంయుక్తకా వార్త తెలిసి వెంటనే భర్తకడకేతెంచి " నాథా! మీరేటికిట్లు యోచించెదరు. అచలునికి దోడ్పడఁబోవుట కేనుసిద్ధముగ నున్నదానను. నన్నుఁబంపుటకు మీ రెంతమాత్రము సందేహింపఁబనిలేదు. వేవేగ సెలవొసఁగు డని " వెనుదీయక పలుకుచున్న తన ప్రాణప్రియను వదల నిష్టము లేనివాఁడయ్యు నేమియు సేయఁజాలక యటుపొమ్మని సమ్మతించెను. అంత నామె కొంత సైన్యమును బ్రయాణమునకు సిద్ధపఱచి బయలు వెడలిపోవుటకుముందు చక్రవర్తికడ కేతెంచి యతని గాఢాలింగన మొనర్చుకొని " ప్రాణనాథా ! యుద్ధమున జయాపజయంబులు దైవాధీనములుగదా? నాకచట నొకవేళ నేదైన నపాయము సంభవించినచో మీరు ధైర్యము వదలక మీ కార్యముల ప్రమత్తులరై యొసరించుకొన బ్రార్థించుచున్నదాన " నన నతఁ డత్యంతవిచారమున "సతీ ! నిన్నొంటరిగఁబంప మనసొప్పకున్నను విధిలేక పంపుచున్నాను. జాగ్రత్తతోడ రణభూమిని సంచరింపుము. మరల మనమిరువురము గలిసికొను భాగ్యమున్న నెట్లును గలసికొనఁగలము. పోయిరమ్మని " బిగియార గౌగిలించుకొని దీవించిపంప నామెయు నతనికి బ్రణమిల్లి లేచి బయలు దేరి నేనంతయు నతినిపుణముగ సడిపించుకొని గైజియాపురమున కేగుచుండెను.