రాజస్థాన కథావళి/రాణా సంగుడు

వికీసోర్స్ నుండి

రాణా సంగుఁడు.


పదునారవ శతాబ్ద ప్రారంభమునందు మేవారు సంస్థానము నందొక మారుమూల నొక గ్రామమున బీద కాఁపు కుటుంబ మొకటి యుండెను. ఒక చిన్న మేఁక లమంద నాలుగు కాళ్ళ పశువులు కట్టుకొను ముతక గుడ్డలు మొదలగునవి తక్క వారి కితర సొత్తేమియు లేదు. ప్రపంచమునం దెంతటి దరిద్రులున్నను వారికన్నదరిద్రులు కొందఱు కనఁబడుచునేయుందురు. ఆకుటుంబయజమాని యొకనాడు పోలము నుండి వచ్చుచుండ దారిలో చినుగు గుడ్డలు కట్టుకొని యన్నము లేక మలమలామాడుచున్న యొక కొత్త మనుష్యుడు వాని కగుపడెను. పశువులఁ గాచుట 'కెవని నైన నొక సేవకునిఁ 'బెట్టుకొనుట కది వరకే యోచించు చుండుటచే నతఁడీ క్రోత్త వాని నా పనియందు నియోగించెను. ఆకాఁపువాని భార్య యీ సేవకుని దెచ్చుట కిష్టపడక కొంచెము సణుగుకొని యిట్లనియె. . బ్రాహ్మణులకు బిచ్చగాండకునన్నము పెట్టుట పున్నెముగానీ తక్కినవాండ్రకు దానము చేసిన నేమిలాభము. దేశములో దుర్మార్గుల నేకులు పనిపాటలుమాని తిరుగుచుందురు. ఈమహానుభావుఁ డెంతటివాఁడో మన 'మే మెఱుగుదుము? అదిగాక పశువులను మేపుటమాత్ర మంత పైపై నున్నదా? ఆపని యందఱు జేయఁగలరా? చిన్నప్పటినుండియు యలవాటు పడిన కుఱ్ఱవాండ్రకె లొంగునుగాని పశువులు క్రోత్త వానిని దరికిఁ జేరనిచ్చునా? ఈమను ష్యుని వలన మన పని యగునని తోఁచదు." భార్య పలుకులు పెనిమిటి 'మొదట సరకు చేయలేదు. కాని పిమ్మటఁ గొన్ని నాళ్ళకవియే నిశ్చయము లయ్యెను. ఏలయన సరిగా న డువనైన లేని కుఱ్ఱవాండ్రు కఱ్ఱపుచ్చుకొని యదలించినంత మాత్రమున గడగడ వడఁకి దారినిఁ బోయి దారిని వచ్చుమోట పశువు లాక్రో త్త కాపరిని లక్ష్యము చేయక విజృంభించి తిరుగఁ జొచ్చెను, యజమానుఁ డా సేవకుని తెలివి తేటలు గని పెట్టి యతఁ డందుకు పనికి రాడనియాపని లోనుండి తప్పించి యింటి పనులు సేయుమని వానిని నియోగించెను. అతని దురదృష్ట మేమోకాని యాతఁ డింటిపనులకుం బనికి రాఁడయ్యె ఒకనాఁడు యజమాని ని భార్య రోట్టెలు కాల్చుచు తానేదో మఱియొక పనిమీదలోనికిం బోయి యవి మాడిపోకుండా జూచుచుండుమని సేవకున కానతిచ్చెను. సేవకుఁడు సరేయనియామాట మరచిపోయి పరధ్యానముగా నుండునప్పటి కంతలో రొట్టలుమాడి బొగ్గులయ్యెను ఆపూట భోజనము బుద్ధి లేని సోమరిపోతు మూలమనిష్కారణముగిఁ జెడిపోయె గదాయని యజమానుని భార్య యేగాకయిం టిలో నున్న వారందఱు వానిపై మండిపడి "రొట్టెలు కమ్మగా వేగినప్పుడు పొట్టబద్దలగు నట్లు తినుటకు నీవు నోరు తెరవఁగలవు గాని యవి మాడిపోవుచున్నవేమో చూచుటకుఁ గన్నులు తెరవలేవు. నీవు మా కక్కర లేదు. నీ యిష్టమువచ్చిన చోటికి బొ" మ్మని చెప్పిరి.

ఆమంద భాగ్యఁ డామాటలు పడి బదులు చెప్పక యాయిల్లు విడిచి మెల్లఁగ నవతలకు నడ చెను. పశువుల కాపరిగను వంటలవాడు గను పనికి రాకున్న నతఁడు తెలివి తేటలు లేనివాఁడు కాడు. అతని శరీరము సుందర మయ్యు దృఢమయి చాకచక్యము కలదియు కష్టమున కోర్చునదియునై యుండెను, రాజపుత్ర దేశ మందుఁ బుట్టిన వాఁ డెవ్వఁడు చేత నాయుధము లేక సంచరింపఁడు. ఈ పురుషుఁడు నిరాయుధుం డగుటయేగాక నిర్భాగ్యుఁడై దారిద్య్యమును వెళ్ళఁబోయు చుండెను,

ధగ ధగ లాడు నతనిశరీరచ్ఛాయనుబట్టి యతఁడు కాపువాడను కొనుటకు వీలు లేదు.

రాయమల్లుఁ జ్యేష్ఠకుమారు: డగుసంగుఁడు వాఁ డట్లో, మఠమువద్ద నొక రాజపుత్ర వీరుని సహాయమున నెట్టెటో ప్రాణములు దక్కించుకొని యావలకు దాఁటి మహారాజ కుమారునికోఱ కెవ్వఱును పశువుల కాపరుల యిండ్లు వెదకరని నమ్మి గొల్ల వాండ్రతో గలిసి మెలసి కాలక్షేపముఁ జేయు చుండెను. తాను నమ్మిన గొల్లలే తన్ను లేవఁ గొట్టినప్పుడు పట్టుట కాయుథము తినుట కన్నము తలఁ దాచుకొనుటకు పంచ కష్టసుఖములు జెప్పుకొనుటకు మిత్రుఁడు లేని విదేశములో నిఁక నెట్లు బ్రదుకునాయని సంగుఁడు విచారింపఁ జొచ్చెను. అట్లు విచారించుచు నతఁ డేమియుఁ దోఁచక నడవులం దిరుగుచుండ నొకనాడు కొందఱు గుఱ్ఱపు రౌతులు వాని కగపడి వెంటనే గుఱ్ఱములనుండి దిగి వినయమున వానిపాదముల పైఁ బడి నమస్కరించిరి, శరీరమునకు గాయపుమచ్చలు కొంత మార్పు దెచ్చి నను ఆవిశాలలోచనములు ఆచక్కఁదనము నొకమాఱు చూచినవా రెవ్వ రతనిని మరచిపోరు. అందుచేతనే కనఁబడిన రాజపుత్ర పరు లాతఁడు తమకు ముందు రాజగు నని గ్రహించి సంగుని గౌరవించి “అయ్యా ! మీరు బ్రతికియున్న వాత౯ వృథీవి రాజు విన్న పక్షమున మీకపాయము గలుగును గనుక మేము మీరహస్యమును వెలిపుచ్చము; కాని మేము మిమ్ము విడువక సేవించు చుందుము. ఈ ప్రాంతములకు సింహస్వప్నముగా నున్న శ్రీనగర రాజు యొక్క, కొలువులో మే మున్నాము. మీరుకూడ నారాజును కొలుతు లేని మీకుఁ గావలసిన యాయుధములు గుఱ్ఱము నిప్పించెదము.” అని వారు పలుకుటయు. దాను బాగుపడుట కింతకన్న మంచిసనుయము దొరక దని నిశ్చయించి సంగుఁడు శ్రీనగరరాజు కొలువు నంగీకరించి ఆసమయం రాజపుత్ర వీరులు విశ్వాసము గలిగి తన్ను సేవింప దినము లొకతర బడిగాఁ బుచ్చుచుండెను.

ఒక నాఁడు శ్రీనగరరాజు పరివారస మేతుఁడై ప్రయాణమున నలసి సొలసి మట్టమధ్యాహ్నమున నెండ కోర్వలేక యొకపెద్ద మఱ్ఱి చెట్ట క్రింద పండుకోనెను. సంగునకు వంట యందు నేర్పు కుదుర నందున దక్కినవా రందఱు వండుకోను చుండ నతఁడు వంట మాని యా చెట్టు క్రింద చల్లగఁ బండుకొనెను. అన్నమువండి వాని మిత్రులు దెచ్చునప్పటికీ సంగుఁడు కత్తి తలక్రిందఁ బెట్టుకొని గాఢముగ నిదు రించెను. ఆ మట్టి చెట్టు తోఱ్ఱలోనుండి, యొక మహాసర్పము వచ్చి సంగునితల వద్ద నిలిచి పడగవిప్పి వానితల కెండ సోఁకకుండ గొడుగు పట్టిన ట్లాడుచుండెను. ఆపాము పడగమీఁద చిత్రవణ౯ములు గల యొక పక్షి యవ్యక్తమధురముగాఁ గూయుచుండెను. ఆసమయమున నొక వెఱ్ఱి గొల్లఁ డా దారినిఁబోవుచు నిది యేమివింత చెప్పుమా యని నోరు తెఱచి రెప్ప వేయక చూచుచుండెను. తక్కిన రాజ పుత్రులు వానిదగ్గఱకు రాఁగానే సంగుఁడు మేల్కని కన్నులు దెరచెను. ఆగొల్ల బోయఁడు నేల పైఁబడి సంగునకు సాష్టాంగ నమస్కార మొనర్చి భయసంబ్రమములతో “భళి భళీ! ఈ బాబు గొప్ప రాజు కాఁగలఁడు. ఇంత ప్రభువు లోకములో లేడు.

ఆమాటలు విని సంగుఁడు తన రహస్యము వెల్లడి చేయుట కిష్టము లేక తాను వట్టి నిరుపేద ననియుఁ దన కట్టి యోగము పట్టదనియు వాదించెను. గొల్ల బోయఁడు వాని పలుకులు చెవిఁ బెట్టక తనకు పాములయొక్కయు పక్షులయొక్కయు భాషలు తెలియు ననియు నవి రెండు నిద్రఁబోవు వానికి మహా రాజ భోగముపట్టనున్నదని చెప్పుకొన్న వనియు దృఢముగాఁ బలికెను. సంగుఁ డప్పటికిని గొల్ల వానిమాటలు కల్ల యని నిరసించెను , కాని శ్రీనగరరాజు తనకు బంటై పనిచేయు చున్న రాజకుమారుఁడు నిజముగా బంటులా గుండక పోవుటచే నతఁ డెవ్వరో ప్రచ్ఛన్న వేషుఁడని నమ్మి వాని జన్మవృత్తాంతాదికము నెఱిఁగింపు మని బలవంతపెట్టి యెఱిఁగించిన చోఁ దనకూఁతు నిచ్చి వివాహము చేసి రాజ్యము రావలసియున్న సాయము చేసి యిప్పించెద నని వాగ్దానముఁ జేసెను.

అప్పటికి సంగుని తమ్ముఁడు జయమల్లుఁడు నీచ మగుమరణమును బొందెను; కాని పృథివిరాజు మాత్రము మహోన్నతదశలో నుండెను. సంగుఁడు మొదటినుండియు దురదృష్టవంతుఁడే యగుటచే శ్రీనగరరాజు వానినిఁ జేరదీయుట కూఁతునిచ్చి పెండ్లి చేయుట సాయము చేయఁ దలంచుట 'మొదలగు వాత౯లు కర్ణాకర్ణికగ పృథివిరాజు నకుఁ దెలిసినందున నతఁడు తన యన్న గారిని బెద్దపులినిఁ దరిమినట్లు దరిమి చంపఁ దలఁచె. అంతలో దైవయోగమున సంగుని పున్నెము బాగుండ బట్టి పృథివి రాజు తన చెల్లెలి యాపదఁ గడువ బెట్టుటకుఁ బోయి తనకు మిక్కిలి ప్రియమయిన కమలమియరుకోటకు దిరిగి రాకయె దారుణమరణము నొందేనని వెనుకటి రాజు చరిత్రలోఁ జెప్పఁ బడి యున్నది. పృధివిరాజు గతించిన కొన్ని దినములకే తండ్రి యగు రాయమల్లుఁడు మహాదుఃఖభారము చేత గ్రుంగిపోయిన యామేను విడిచి పరమపదమును బొందెను. రాయమల్లుఁడు మివారు దేశమున కంత యెక్కువ యభివృద్ధిని దేలేక పోయినను మునుపున్న దానిఁ జెడ గొట్టకుండఁ గాపాడెను. రాయమల్లుఁడు కృపాళువై గౌరవనీయుఁడై రాజపుత్రులయం దుండఁగూడని శాంతరసమునకు స్థానమైయుండెను; కాని కొడుకులను వంచుకొన లేకపోయెను.

పితు రనంతరమున సంగుఁడు వచ్చి సింహాసనమెక్కి చారుణీదేవి యర్చకురాలి మాటయు గొల్లబోయని మాటయు నిశ్చయములుగా జేసి రణసింహుఁ డను పేరు వహించెను; రాజస్థానమునందే గాక యితర దేశ ములందును గట్టిరాజు గద్దె యెక్కెనని వెల్లడి యయ్యెను. మార్వారు, అంబరు, అజమిరు, బూందీ, గ్వాలియరు, కాల్సీ మోద లగు రాజపుత్ర సంస్థానములు సంగుని యాజ్ఞను శిరసావహించుచు వచ్చెను. మాళవ దేశము మొదలు ఆబూయను పర్వత శిఖరమువఱకు నతఁడేక ఛత్రాధిపత్యము వహించెను. రాజ్యమారంభించిన వెనుక నాతఁడు పదునెనిమిది చిన్నచిన్న యుద్ధములు ఢిల్లీ చక్రవతి౯ తోను మాళవరాజుతోను జేసి గెలుపు చేకొనుచు వచ్చెను. ఢిల్లీ చక్రవతి౯ ని యొకమారు గాక యనేకమారులు గెలిచెను, మీవారు. రాజ్యము యొక్క సరిహద్దు లన్నిపక్కలను పెరిగెను. ఉత్తరపుటెల్ల బయానా యను కోటవద్దనున్న పసుపుటేరు వఱకు వ్యాపించెను. సంగుఁడు మీవారు రాణాలో నెల్ల నగ్రగణ్యుఁ దగుట కొక కథ కలదు.

ఒకమారు దేవతలలో నొకఁడు మనుష్యావతార మెత్తి తన పూర్వశత్రువగు నౌక మనుష్యునిమీఁద పగదీర్చుకొనుటకు భూమి మీఁదకు వచ్చి తిరుగుచు చిత్తూరునకు వచ్చెనఁట. సంగుఁడు వానిని చూడఁగనే యతఁడు మహాపురుషుఁడని గ్రహించి యాచరించి గౌరవించెనఁట, ఆదివ్యుఁడు 'సెలవుపుచ్చుకొని పోవునప్పుడు పటుత్వముగల యొక రక్షరేఖ నొక సంచిలోఁ బెట్టి సంగున కిచ్చి దానిని 'మెడలో గట్టుకొమ్మనియు నది మెడలో సున్నంత కాలము వానికి జయము గలుగుననియు నదిపొరబాటునగాని దైవవశమునఁగాని వీపు మీఁదకుఁ దిరిగిన పక్షమున వానికి చెడ్డదినములు వచ్చినవని నమ్మవలసినదనియు దృఢముగాఁ జెప్పినఁట, తనమాట నిశ్చయమని ఋజువు చేసికోను టకు దివ్యపురుషుఁడు సంగునకు నెమిలియీఁక నిచ్చి "దీనిని దీసికొని పోయి మీనగరమునందుఁ మృతినొందిన వారి నందఱి దీనితో స్పృశి యింపుము. వా రందఱు మరల బ్రతుకుదు" రని పలికెను. ఆమాట చొప్పున రాణా చిత్తూరునకువచ్చి కనఁబడిన ప్రతిశవమున కానెమలి యీఁకను దగిలింప నామృతకళేబరము ప్రాణవంతమై లేచి నిలుచుచు వచ్చి. అంతట దేవునిమాటలు నిజమనినమ్మి సంగుఁ డాదివ్య పురు షుని పేర తనయూర నొక యాలయము గట్టించేను. ఆయాలయము సంగుడు పోయిన వెనుక చాలకాలమువఱ కుండెను.

దివ్యపురుషు: డిచ్చిన రక్ష రేఖ రాజపుత్రులమీఁదను మహమ్మదీయులమీఁదను పలుమారు ప్రయోగింపఁబడి యజమానునకు జయముక లిగించుచు వచ్చెను: 'కాని స్వల్పకాలములోనే మహావీరాధి వీరుఁడై మేజిమగల గండడగించి శూర మండలమును గడగడ వడకించిన రాజసింహమునకుఁ దనకు వెరపు గలిగింపఁగల సాహసుఁ డొకఁడు బయలు దేరుచున్నాఁ డన సంగు డించుకయు నెఱఁగఁడయ్యె. అప్పుడు సుల్తాను యిబ్రాహీ మనునతఁడు ఢిల్లీ చక్రవతి౯గా నుండెను. వాని క్రూరత్వము దౌర్జన్యము గర్వము మితిమీరియుడుటచే మంత్రి సొమంతాదులు వానితో వేగలేక వానిని విడిచిపోయిరి. దేశమందంతట పితూరీలు బయలుదేరెను. చక్రవతి౯ యొక దానిని క్రౌర్యముతో నడప మఱియొకటి తలయెత్తుచుండెను. ఇట్లుండ చక్రవతి౯ పినతండ్రి ఢిల్లీ మీఁదదండెత్తుమని బేబరును ప్రేరేపించుటకు కాబూలు నగరమునకుఁ బోయెను.

ఈబేబరు 'మొగలాయివంశస్థుఁడగు మహమ్మదీయుఁడు. ఈతని పూర్వులు చంగిసుఖాను టామరులేను మొదలగువా రింతకుమున్ను హిందూస్థానముపై దండెత్తి తురకల కందఱకు దారి చూపిరి. బేబరు చిరకాలము నుండి హిందూదేశముపై నెపుడు దండెత్తుదునాయని యూటలూరుచు మంచి యదనునకై వెదకుచుండెను. ఆదివఱ కతఁ డొకసారి పాంచాల దేశఘు పై దండెత్తెను. ఆదండయాత్రలో నతనికి రాజ్యలాభ మంతగా లేక పోయినను వాని సైనికులు పర్వతనమయమగు తమ గొడ్డు దేశముల నెన్న డెఱుఁగని మహాభోగముల రత్నగర్భ మగు హిందూదేశమున ననుభవించుటఁ జేసి యీ దేశమును వదలి పోఁజాలక దండెత్తుమని తమ యజమానుని బురికొల్పిలి. యజమానుని యొక్కయు సైనికుల యొక్కయు కోరికలకనుగుణముగా ఢిల్లీ చక్రవతి౯ బందుగుఁడు గూడనచ్చి పిలుచుట సంభవించెను. అందుచేత బేబరు దిట్టమయిన సేనం గూర్చుకొని పర్వతములలో నుండి బయటఁబడి పంజాబు దేశమును గడచి తన్నెదిరింపవచ్చిన సేనల నొకదాని వెనుక నొకటి జయించి క్రమక్రమమున ఢిల్లీ మీఁదికి వచ్చెను. అట్లు వచ్చివచ్చి పానిపట్టు గ్రామమున లక్ష సైన్యముతో యుద్ధమునకు సిద్ధముగానున్న ఢిల్లీ యిబ్రహీంలోడీని గాంచెను. ఇబ్రహీం రణరంగమున మృతినొంది చక్రవతి౯ యని యానవాలు పట్టుటకు వీలులేని స్థితిలో పడియుండెను. బేబరు చక్రవతి౯ యగుటచే మసీదులో ప్రాథ౯నలతని పేరనే జరిగెను.

మహా సేనాసమేతుఁడగు ఢిల్లీ చక్రవతి౯ కాబూలు ప్రభువగు చిన్నదొర చేత నోడింపఁబడుట హిందువులకు సంతోషకరముగాదయ్యె. ఏలయన నిద్దఱు గొడ్డు మాంసముఁదిను పచ్చి తురకలె. ఇద్దఱు హిందువుల దేవాలయముల నాశనముచేయు ఘాతుకులే. వారిరువురిలో నెవరు గెల్చిన వానిని దరిమికొట్టు భారము రణసింహుఁ డగు మీవారు రాణా దని జనులు చెప్పుకొనిరి.

అందుచేత రణమల్లుడును తేజోరాశియు నగు సంగమహారాజు బేబరు పైఁ గత్తికట్టి కయ్యమునకు వెడలెను. ఆ రాజసింహునకు సాయమై యెనుబది వేలగుఱ్ఱపుదళము, నుత్తమవంశజులగు నేడుగురు మహారాజులు, రావు బిరుదముగల తొమ్మండుగురు సామంతులు, రావలులు రాహూత్తులను బిరుదులుగల నాయకులు నూటబదునలుగురు నడుచుచున్న కొండలవంటి యేనుఁగు లైదువందలును వచ్చి సంగర రంగమున నిలిచె, ఈ సేనం గూర్చుకొని సంగుఁడు మొట్టమొదట బయానా యనునూరికి బోయి యచ్చటి కోటను ముట్టడించెను. ఆ ముట్టడి జరుగుచున్న కాలమున నే సంగుఁ డొక నాఁ డచ్చటి పసుపునీటి యేటిలో స్నానము సేయుచుండ గంఠమునందలి రక్ష రేఖ వెనుక పక్కకుం దిరిగి వీపుపై వ్రేలఁ బడియె. అప్పుడు దన మరణ మాసన్నమైనదని యతఁడు దెలిసికొని తగుప్రయత్నముఁ జేయునప్పటి కంత లో బేబరు బయానాకోటను విడిపింపుమని పదునై దువందల సైనికుల నంపెను. కాని యా సైనికులలోఁ గొందఱుమాత్రమే బతికివచ్చి రాజపుత్ర వీరుఁడు సామాన్యుఁడు కాఁ డనియు జీతములకోఱకే యుద్ధములు నేయు ఢిల్లీ సైనికులకును రాజపుత్ర సైనికులకును జాలభేదము కదలదనియుఁ జెప్పిరి. మీవారు రాజ్యమున కుత్తరఫుసరిహద్దు గానుండ వలయునని సంగుఁడు కాణ్వాహ యను గ్రామమున గొప్ప మేడ గట్టించెను.

అమేడ యెదుటనే బేబరు శిబిరము వేయించెను. ఫిరంగుల బండ్లను సరకులబండ్లతో గలిపి గోనెసంచులతో గట్టి సేనలో మొదటివరుస నమర్చి వాని వెనుక సేనను నిలిపెను. ఆ బండ్లు చాలనిచోట్ల కాఁపుదల నిమిత్తము గోతులు త్రవ్వించెను. వాని ఫిరంగులలో జయఫిరంగి యను పేరనొక ఫిరంగి యుండెను. దానిని ఉస్తాదా యను సేనానాయకుఁ డొకఁడే మిక్కిలి నేర్పుతో నుపయోగించు చుండునఁట. అతనిశక్తి యేమోకాని యొక్కమా రాతఁ డాఫిరంగిని దినమునకు బదియాఱు సారులైనను బ్రయోగింపఁ గలిగి యుండెనఁట. ఆ యుద్ధ ముభయ కక్షులవారికిఁ గడు బాధకరముగ నుండెను; కాని పై నుండి చూచిన వారికి మిక్కిలి వినోదముగ నుండెను. ఉభయులు నోకరి కొకరు తీసిపోవువారు కారు. జన్మమంతయు యుద్ధములయందె గడపి దేశ సంరక్షణము నిమిత్తము రక్తము ధారపోసి యుద్ధములలో నొకకన్ను నొకచేయ యొకకాలు పోగొట్టుకొని యెనుబది గాయముల చేత తూట్లుపడియున్న శరీరము గలిగి శూరశిఖామణి యను పేరు గాంచిన సంగుఁ డొకప్రక్క నుండెను. పెద్దపులిమీసములు మెలి పెట్టుటకైన సింగపుజూలు నూడబెరుకుటకైన వెనుకదీయని వారును గయ్యముల యందు మడమ దిరుగనివారును బ్రతికియుండిన మహాకీతి౯ని మృతి నొందిన వీరస్వర్గమును జూరగొనుటకు సిద్ధముగ నున్నవారు నగు రాజపుత్ర వీరులనేకు లామహా రాజు వెనుక బాసటయై నిలిచిరి. వా రందఱుఁ దరతరములనుండి పూర్వులు చేసినశూరకర్మములఁ దలంచి గర్వోద్దీపితులై యుండిరి, ఆ రాజకుమార రత్నములు క్రోత్త పెండ్లి కూఁతులను వరించునట్లు మృత్యు దేవతలను గూడ వరించు విద్యను నేర్చికొని వీరపురుషునకు నంతఃపురమున హంసతూలికాతల్పము శాశ్వతమయిన పాన్పు కాదనియుఁ దమయా యుధములచేఁ దెగిన పగతుర కళేబరములతో నిండిన యుద్ధ భూమియే శాశ్వతమయిన పాంపనియు నమ్మిన మహాశూరులు.

ఇక రెండవపక్క నున్నవాఁడో పదునొకండేండ్ల ప్రాయముననే రాజ్యమున కభిషిక్తుఁడైనవాఁడు, పర రాజుల పీడవలన పితృ పితామహార్జితమయిన 'రాజ్యమును గోల్పడి దేశద్రిమ్మరియై చిరకాలము గడపినవాఁడు. అదివఱకు సమర్కందునగరమున నతఁడు రెండు సారులు సింహాసన మెక్కి రెండుసారులు దానిని వదలుకోవలసినవాఁడయ్యు నెప్పటికైనా దాని మఱల సంపాదించి మఱి చావవలయునని తలంచుచుండువాఁడు. సంగునివలెనే యిల్లువాకిలి లేక గొడ్లఁగాసి కొనియు కొండల వెంబడి తిరిగియుఁ గొంతకాలము పుచ్చి యెట్టకేలకు కాబూలు' నగరమును బట్టుకొని దానికి బ్రభువై యంతకన్న మంచి దేశమును స్వాధీనము చేసికొనుటకై యదను వెదకుచున్న వాఁడు. ఈ యుద్ధమునాఁటికైన నతఁడు సడివయస్సును దాఁటినవాఁడు గాక మంచి శరీర దాఢ్యముఁ గలిగి శత్రు దుర్నీక్షుఁడై వెలయుచుండెను. బలముగల మనుష్యులనిద్దఱను చెరియొక చంకఁ బెట్టుకొని కోట గోడలపైఁ బరు గెత్తుటకును వానికి సామధ్యముఁ గలదు, అతఁడెప్పుడు గుఱ్ఱపుజీనుమీఁదనే కాఁపురము చేసిన వాఁడని చెప్పవచ్చును. మాగ౯మధ్యమున నడ్డమువచ్చిన ప్రతినదిని నతఁడు నిండువరదలో నైన ననాయాసముగా నీదుకొనిపోవునేగాని దోనెలనై న నెక్కువాఁడు కాఁడు అంతటి శూరాగ్రేసరుఁడయ్యు 'బేబరు పారశీక భాషలో మృదువయిన కవిత్వము చెప్పఁగల రసికుఁడు. అతనికి స్వమతాభి మాన మెక్కుడుగ నున్నదికానీ యాయభిమానావేశముచేత శత్రు రాజులయందు మంచిగుణము లేవైన నున్న వానిని మఱచిపోవక వానిని 'మెచ్చుకొనుచు నతఁడు వ్రాసిన గ్రంథములలో నెక్కు డౌదార్యమును జూపుచు వచ్చెను.

రాణా సంగున కంతకంటే సుగుణవంతుఁడు నింతకంటె పౌరుషశాలియు నగుశత్రువుం డెన్నఁడు దొరికి యుండలేదు. 'రెండు తెగల వారి కది మంచి యుద్ధమే. రాజపుత్రులందఱు తమ దేవాలయముల నెల్ల నేలమట్టముగఁ జేసి "దేవతావిగ్రహములఁ బగులఁగొట్టి పాడు చేసిన మ్లేచ్ఛులను తమకులదేవత యగుభవానిమాత తప్పక యడచి తమకు జయమును గలిగించు నని నమ్మి ధైర్యముగ నుండిరి మొగలా యీలు విగ్రహారాధనము చేయు పాపాత్ము లగుహిందువుల సంహరించుటకుఁ దోడ్పడుమని అల్లాను ప్రార్థించిరి. ఈ రాజపుత్ర మొగ లాయి ప్రభువులు తక్కినగుణములలో సమానులైనట్లే కైపునకు నల్లమందు మద్దతుబీల్చుటలోగూడ సమానులే. పదునైదుదినములవఱకు రెండు సైన్యములు యుద్ధ మారంభింపక నొక దాని నొకటి చూచుకొనుచు నేది ముందుగాఁ గయ్యమునకు దిగిన నేమి ప్రమాద మగునో యని శంకించుచు నూరకొనిరి. బేబరు సైనికులు కొంతవఱకు నిరుత్సాహులయి యుండిరి. ఏలయన వారు తమయాలు బిడ్డలను గృహములను బాసి చిరకాల మగుటచే నిండ్ల పై దృష్టులు బార మిడిమిడి యెండలుగాయు హిందూ దేశపుబయళ్ళను విడిచి తమ కొండ గేహముల 'కెప్పుడు పోవుదుమా యని బెంగఁగొని స్వదేశమునకుఁ దోడ్కొని పొమ్మని బేబరును బలవంత పెట్టిరి. వెనుక బేబరు పంపిన పదునై దువందల సైనికులలో హత శేషులు వచ్చి సంగుని సైనికుల పేరు విన్న గడగడ వడఁకునట్లు తక్కిన వారిని భయ పెట్టిరి. తురక శిబిరము నంటివచ్చిన జ్యోతిష్కు లెప్పుడు చెప్పినను నీచదశ నేగాని యుచ్ఛదశను జెప్పరై రి. అంగారకుఁ డప్పుడు పడమట నున్నందున వాని కెదుట దిక్కున నుండి యుద్ధము చేయు వారికి తప్పక యవజయము కలుగు నని వారు నొక్కి పలికిరి.

ఆ రెండువారములలోను రాణాకును ఢిల్లీ చక్రవతి౯కిని సంధి మాటలు జరిగినవని రాజపుత్ర చరిత్రకారులు కొందఱు వ్రాసిరి. బేబరు తాను విదేశములలో పంచాగ్ని మధ్యమువంటి శత్రు మండల మధ్యమున నొంటిగ నుండుట యెఱుంగును. ఈ యుద్ధములో తన కపజయము సంభవించెనా పగతురు నలుపురు నాలుగుమూలలనుండి వచ్చి తన్ను చుట్టుకొందురనియు నప్పుడు తాను కష్టపడి సంపాదించిన ఢిల్లీ రాజ్యము చేయి దాఁటిపోవుటయేగాక స్వస్థానమైన కాబూలునైన చేరుట సంభవింప దనియుఁ గూడ నతఁ డెఱుఁగును. రాణాసంగుఁడు చాకచక్యము గలవాఁడు వివేకియునై మివారు రాజ్యమునిమిత్తము స్వసౌఖ్యమును గణియింపక పాటుపడుచున్న వాఁడని యతఁడు విని యుండెను. అందుచే రాజపుత్ర చరిత్ర కారులు చెప్పినట్లుభయులు సంధి ప్రయత్నములు చేసి యుందురనియే మనము నమ్మవచ్చును. ఆయొడంబడికలో బేబరు కోరిన పద్ధతు లన్నియు రాణా కవమానకరములు గానివియు నతఁడు తప్పక యంగీకరింపదగినవియునై యుండెను.

పద్ధతులివి 1. పసుపునీటి యేరు మీవారు రాజ్యమున కుత్తరపు టెల్లగా నుండవలయును. 2. 'బేబరు ఢిల్లీ రాజ్యము నాక్రమించినందుకు రాణా వారి కేఁటేఁట కొంతకప్పము నిచ్చుచుండ వలయును. కాని, యిట్లు సంధినిగురించి మాటలు జరుగుచుండ సంగుఁడు బేబరు వద్దకుఁ బంపిన రాయబారి తురకలవద్ద లంచము గ్రహించి నీచుఁడై తనయజమానుని గుట్టు బయలు పెట్టెనని రాజపుత్రులలో నొక వాడుక కలదు. ఆరాజద్రోహి తారావంశస్థుఁ డగు శిలా దేవుఁ డనువాఁడు. బేబరు పలుమారు తాను జేసిన తప్పులను గూర్చి నిజమయిన పశ్చాత్తాపమును బడుచు వచ్చెను. దాని కుదాహరణముగ నొక చిన్నకథ గలదు. అతఁ డదివఱకు మద్యపానము విశేషముగాఁ జేసెడు వాడుక కలదు. అది పాపమనియు నాకారణంబున భగవంతునకుఁ దనపై నాగ్రహంబు వొడముననియుఁ దెలిసికొని యతఁ డాదినము మొదలు సారాయములను దాగనని గొప్పయొట్టు పెట్టుకొని యంత కాలమును సారాత్రాఁగెడు వెండి బంగారుగిన్నెలు పళ్ళెములు ముక్కముక్కలుగా బగులఁ గొట్టి యాముక్కలను పకీరులకు బీదలకు పంచి పెట్టెను. అంతలో తనివిసనక యతడు గూనలతో నున్న సారా నంతయు నేలం బారఁబోయించి యాదినమున దనకు జయము లభించిన పక్షమున మహమ్మదీయులవద్దనుండి తాను' గృహించుచున్న దస్తావేజుపన్ను కొట్టి వేయుదునని ప్రమాణము చేసెను. మాటలతో బోవక కార్యముఁ జేసి చూపిన తను చక్రవతి౯ యొక్క మాగ౯ము ననుసరించి సేనాపతులు సామంతులు ఉమ్మరావులు అమీరులు మొదలగువారు మున్నూరుమంది యొక్క దినము లోపుగ త్రాఁగమని శపథము చేసి త్రాగుబోతుతనమును మాని పవిత్రులయిరి. ఇట్లు జరిగిన పిదప బేబరు విచారగ్రస్థుడయిన సైనికులను సేనాపతులను బిలిచి వారికి మతావేశము గలిగించి కయ్యమునకుఁ బురికొల్పవలయునని తలంచి యిట్లని విజ్ఞాపనము చేసెను.

ఓవీరులారా ! ఈ ప్రపంచమునఁ బుట్టిన వాఁడు గిట్టక మానఁడు. ఎప్పుడో యొకప్పు డీలోకమును విడువక తప్పదు. బ్రతికియుండి పరాభవములు పొందుటకంటె చచ్చి గౌరవమందుట మేలు నేను చచ్చినను సరే మంచి పేరుతో చనిపోయితినా చాలును. భగవంతుఁడు దయామయుఁడు. మన మిందు గడతేరితిమా మతముకోఱకు మృతినొందిన శూరులమగుదుము. గెలిచితిమా దేవుని మెప్పించినవార మగుదుము. కాబట్టి మనముమరణమునకు జంకమనియు యుద్ధ భూమినుండి 'వెనుకంజ యిడమనియు నొకమారు ప్రమాణములు చేయుదము.” ఆపలుకులు విన్న వారికందఱకు పౌరుష ముక్కెక్కించెను. సైనికులకంఱుఁ దమ వేదమగు ఖురాను జేతఁ బట్టుకొని యుద్ధమున గెలువవలయు లేక చావవలయు నని ప్రమాణములు చేసిరి. ఒడలిలో నూపిరి లేనివాడు సయితము మతావేశము చేత పరవశత్వమునొంది ప్రాణములపై నభిమాసము వదలుకొని ముక్కాకలను దేరిన పగతురం బొడుచుటకు సిద్ధముగ నుండెను. అంతట శత్రువులపయిం బడుటకు వారేర్పాటు జేసికొన్నందున మొనలుతీరిన వెనుక బేబరు గుఱ్ఱము నెక్కి సైనికుల కుత్సాహము గలిగించుచు సేనాపతులకు నడచుకొనవలసిన పద్ధతులను, గఱపుచుఁ గొంతసేపు దిరిగెను.

1527 వ సంవత్సరము మార్చి 27 వ తేది శనివారమునాడు రాజస్థానము యొక్క భాగ్య మేట్లున్నదో నిణ౯యించెడు యుద్ధము జరిగెను. రక్ష రేఖ మఱియొక లాగైపోయినను మొట్టమొదట జయ మెప్పటియట్లు రాణాసంగునికే యగునని యెల్లరు భావించిరి. బేబరు చక్రవర్తి యొక్క సైన్య మదివఱ కెన్నఁడు రాజపుత్రవీరుల పోటు చవిచూచి యెఱుఁగదు. నల్లమందుమత్తుతో కన్ను లేఱ్ఱఁబడ రాజపుత్రయోధులు శత్రువులపయింబడి కత్తులను బల్లెములను రక్తములో ముంచి యెత్తుచు వీరవిహారము చేయనారంభింప, దిట్టతనమునకు ప్రసిద్ధికెక్కిన కఱకుతుఱక లేమియుం జేయలేక యూరకొనవలసి వచ్చెను. పూర్వ మెన్నెన్ని యుద్ధములలో వైరుల యదరిపాటుల నడఁచిన బేబరు యొక్క- జయఫిరంగియైన రాజపుత్రులు నించుక యదుపులో నుంచజాలదయ్యె. ఆసమయము నెఱిఁగి 'బేబరు మంచి యుపాయము నాలోచించి తన సేనలోఁ గొంత భాగమును గుండ్రముగా దిరిగివచ్చి రాజపుత్రుల జుట్టుకొమ్మని యానతిచ్చి ఫిరంగులను ముందునకు జరిపించి మూలబలమునకు తుపాకులిచ్చి ముందునడిపించి బాణవష౯మును గురిపింప నారంభించెను. అప్పుడు రాజపుత్ర సైన్యములో నొక భాగమున కధిపతియైన శిలాదేవుఁ డనునతఁడు రాజద్రోహ ము సేయఁదలంచి గుండె రాయిఁ జేసికొని తన సేనతో బయలు దేరి వచ్చి శత్రుపక్షమునఁ జేరెను.

పగతుర, సేన వచ్చి యాకస్మికముగ వెనుక దాఁకుట చేతను స్వజనము 'మోసపుచ్చుట చేతను, తురకలు పట్టిన పట్టు విడువకపోవుట చేతను రాజపుత్ర సేన యెట్టకేలకు కట్టుచెడి తిరిగి పారిపోవలసివచ్చెను. మహమ్మదీయులు రాజపుత్ర సేన నోక మూలకుం దరిమి ఫిరంగులు బారుచేసి కొట్టఁజొచ్చిరి. అందుచే దాదాఁపుగా నందఱు హతులయిరి. కొంద ఱెట్టెటో దెబ్బలు తప్పించుకొని పాఱి పోఁగలిగిరి. వారిలో రాణా యొకఁడు ఆ రణమునఁ దగిలినగాయముల చేత రాణా కుంటి యగుటచే రణరంగమున నుండి పారిపోవుట కతని కిష్టము లేకున్నను సేవకులే యతనిని మోసికోనిపోయి యపాయముననుండి దాఁటించిరి. కాని యనేకులు యుద్ధభూమి నుండి విడువక ప్రాణములు విడిచిరి. అట్టి వారిలో చందారతువంశస్థుఁ డగురాజపుత్ర వీరు డోఁకడు మహశూరు లగు మూడు వందల మంది చుట్టములతో మృతినొంది రాణా వారికి తొల్లి రాజ్యము సేయునప్పు డాలోచనలు చెప్పుటలో నెట్లు ప్రథమగణ్యుఁ డయ్యెనో వారినిమిత్తము ప్రాణములు విడుచుటలో నట్లే ప్రథమగణ్యుఁ డయ్యెను. అతనికి సాయమై మార్వారు రాజకుమారుఁడు మఱి యిరువది మంది రాజకుమారులతో గూడి నేలం బడియుండె. ఈ యుద్ధము జరిగిన దాపునకు సమీపమునందే బేబరు రణనిహతు లయిన రాజపుత్ర శూరులపుట్టెలతో నొక జయస్థంభమును గట్టించెను.

ఇట్లు సంపూర్ణ పరాజయము నొంది కూరుచున్న చోటనుండి కదల లేని కుంటియయ్యు రాణు సంగుఁడు శౌర్య గాంభీర్యముల యందు సింహమువలె 'మెలఁగ జొచ్చెను. తలుపు వేసికొని చిత్తూరుకోటలో దాఁగికోనుట కతనికిష్టము లేక కోటతలుపు లెప్పుడు తెఱచి యుండ వలసిన దని యానతిచ్చి తానెప్పటికైన శత్రువులను జయించి జయ

ధ్వనులతోఁ గోటలోఁ బ్రవేశింతు నని చెప్పుచువచ్చె. ఈ పరాజయమువలన గలిగిన పరాభవమును పోగొట్టుకొనువఱకు యుద్ధభూమిలో నొక గుడారము వేసికొని యదియే యిల్లుగా నతఁ డుండెనఁట, అదివఱకు యుద్ధములో మృతినొందిన రాజపుత్రశూరుల యొక్క భార్యలు సేనలం బోగు చేసి ఢిల్లీ చక్రవతి౯ మీదికిఁ జను మని రాణాకు సమర్పించిరిగాని పరాజయమునొందిన యొక్క సంవత్సరములో నే యతఁడు పరలోకగతుఁ డగుటచే నా సేనలం గూర్చుకొని తురకలతో పోరునంతటి భాగ్య మతనికి బట్టదయ్యె.

సంగుఁడు విషము దిని చచ్చెనని కొందఱదురు; కాని యది నిజము కాదు. చిన్న తనమునుండియు నిల్లువిడిచి తిరిగి యతఁడు పడిన కష్టములను మహాయుద్ధములయందు దగిలిన యెనుబదిగాయములను విశేషించి 'కణ్వాహా' దగ్గర జరిగిన యుద్ధమును విషముకంటె నెక్కుడు తీక్షణములై వాని కకాల మరణమును గలిగించెను. మీవారు రాజ్యమును పాలించిన రాణాలలో సంగుఁడు మహాప్రతాపశాలి. అందుచేత నతఁడు యందఱికన్న గొప్పవాడని యప్పుడప్పుడు కోదఱను చుందురు.అతని వెనుక సింహాసనమునకు వచ్చిన వానివంశస్థులు సంగునివలే దృఢచిత్తులై చరించినచో చిత్తూరునకు దీనదశ రాక యుండును.

సంగుని చరిత్రము సమగ్రముగాఁ జెప్పఁబడినది గావున నింక నతని వైరియగు బేబరు చరిత్రము నించుక చెప్పవలసి యున్నది. ఇతఁడు 'మొగలాయివంశస్థుఁడు ఈతని పూర్వుఁడగు చంగిసుఖానుఁడు ఆశియా, యూరోపుఖండముల రెండును దండెత్తి మిడుతలదండువంటి తురక సేనలతో నింపి రక్త ప్రవాహములు ప్రవహిుపఁ జేసి యానాటి మానవజాతి నంతను గడగడ వడఁకించిన చండశాసనుఁడు, అతఁడు పదమూడవశతాబ్దముయొక్క ప్రారంభమున హిందూదేశముపై దండెత్తి సింధునదికిఁ బడమట నున్న భూముల నాశ్రమించి యెందుచేతనో మన దేశమున నిలువక స్వస్థానమునకుఁ బోయె. వానితరువాత వాని వంశస్థుఁడును వానికంటెను గ్రూరుఁడు నగు తామరలేను 1399 వ సంవత్సరమున హిందూ దేశముపై దండెత్తి వచ్చెను. ఈతనికాలొకటి కుంటిగ నుండెను. సహజముగ దుర్బలుఁడయ్యు నితఁడు మెచ్చఁదగిన మనోబలముచే మొగలాయిల కెల్ల ప్రభువై తార్తారు దేశమున నున్న సమర్కందునగరమున సింహాసన మెక్కి యనేక దేశ ముల జయించెను. బేబరు తామరలేనున కాఱవతరము వాడు. ఇతఁడు తనవంశస్థులవలె ప్రతాపవంతుఁడె కాని వారివలె నిష్కారణముగా మానవజాతిని నిర్మూలించునట్టి క్రూరుఁడు కాఁడు. ఇతని తలిదండ్రులు చిన్న తనమునందె మృతినొందుటం జేసి బాల్యమునందే సింహాసనస్థుఁడై పలుమారు రాజ్యభ్రష్టుఁడై యనేక స్థలములయందు క్రొత్త రాజ్యములు స్థాపించి యెట్టకేలకు హిందూస్థానముపై దండువిడిసి ఢిల్లీ చక్రవతి౯ యయ్యెను. ఇతఁడు ప్రతాపవంతుఁ డగుటయేగాక పారశీక భాషలో మంచి కవనము గూడ జెప్పఁగల సమర్థుఁడు. ఇతఁడు హిందూదేశమును జయించినాఁ డన్న మాటయే గాని జయించిన పిదప పట్టుమని పదికాలముల పాటు దేశము నేల లేదు. అతఁడు 1526 సంవత్సరమున చక్రవతి౯ యై 1530 సంవత్సరమున మృతినొందెను. ఆనాలుగు సంవత్సరము లైనను మన స్థిమితము లేక యుద్ధములోనే గడపవలసివచ్చెను. ఇతని మరణమును గూర్చి యొక చిత్రకధగలదు. అతని పెద్దకుమారునకు జబ్బు చేసి ప్రాణముమీఁడికి వచ్చినఁట. కుమారునియందు బేబరుకు మితిమీరిన ప్రేమయుండుటచే దనకొడుకును రోగ విముక్తుని జేసి తన కాజబ్బు తెప్పింపుమని భగవంతుని ప్రాధి౯ంచెనట. అతఁడు ప్రాధి౯చినట్లుగానే శ్రమక్రమముగా హుమాయూ నున కారోగ్యము గలుగుటయు బేబరు జబ్బుపడి మృతినొందుటయు సంభవించెను. ఢిల్లీ పాలించిన మొగలాయిచక్ర వతు౯ల కతడె మూలపురుషుఁడు