Jump to content

రాజశేఖర చరిత్రము (ఎమెస్కో)/పదునొకండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదునొకండవ ప్రకరణము

సుబ్రహ్మణ్యము పిఠాపురము బ్రవేశించుట__ఒక మిత్రుఁడు కనc బడి యింటికిఁ గొనిపోయి యాదరించుట__నీలాద్రి రాజు చర్య__రాజు గారి ధనము పోవుట__అంజనము వేయుట__పోయినధనము నీలాద్రిరాజు దొడ్డిలో మఱికొంత సొమ్ముతోఁగూడ దొరకుట.

తల్లిదండ్రులను వీడ్కొకొని బయలుదేఱిననాఁడు సుబ్రహ్మణ్యము త్రోవతప్పి యెచ్చటికోపోయి తుద కసలసcజవేళ పిఠాపురము చేరెను. అప్పుడు కొందఱు దుష్టాత్ము లొకచోటఁ గూరుచుండి యాతని వాలకమునుజూచి తమలో దామాలోచించుకొని "యీతఁడు పల్లెటూరివాఁడుగాఁ గనఁబడుచున్నాడు. ఈతని బెదిరించి మనమే మయిన పుచ్చుకొందము" అని నిశ్చయము చేసికొనిరి. వెంటనే యా గుంపులోనుండి రాజభటుఁ డొకఁడు పైకివచ్చి ముందుకు నడిచి సుబ్రహ్మణ్యమువచ్చు మార్గమున కడ్డముగా నిలిచి గంభీర ధ్వనితో "ఆ వచ్చెడు వారెవరు?" అని అడిగెను.

సుబ్ర__నేను బ్రాహ్మణుఁడను, భీమవరమునుండి వచ్చు చున్నాను.

భటు__యింత చీఁకటి పడిన తరువాత వచ్చుటకు కారణ మేమి?

సుబ్ర__తిన్నఁగా బయలుదేఱినది మొదలుకొని నడచి వచ్చినయెడల ప్రొద్దుండగానే యూరు చేరియుందును గాని దారితప్పి పెడదారిని పడి వచ్చినందుకు వింత యాలస్యమయినది.

భటు__ఈ గ్రామములో నీకు బంధువు లెవరున్నారు?

సుబ్ర__ఎవ్వరును బంధువులు లేరు. రాజుగారి నాశ్రయించి పని సంపాదించుకోవలెనని వచ్చినాను.  భటు__నీ భుజముమీఁది మూట యెవరిది?

సుబ్ర__నాదే. మఱియొకరి మూట నా యొద్ద కెందుకు వచ్చును?

భటు__నీది కాదు. నీ వనుమానపు మనుష్యుఁడవుగాఁ గనఁ బడుచున్నావు. నిన్ను నే నిప్పుడు వదలిపెట్టను. తిన్నగా ఠాణాకు నడువు.

సుబ్ర__నేను దొంగను కాను, చిన్నప్పటినుండియు నింత ప్రతిష్టతో బ్రతికినవాఁడను. నన్ను విడిచిపెట్టు

భటు__చీకటిపడ్డ తరువాత గ్రామమునకు వచ్చిన వారిని విడిచిపెట్టఁగూడదని మా రాజుగారి యాజ్ఞ. విడిచిపెట్టెడు పక్షమున నా కేమిచ్చెదవు?

సుబ్ర__నాలుగణా లిచ్చెదను, నన్ను విడిచిపెట్టు.

భటు__నాలుగు రూపాయలకు తక్కువ వల్లవడదు. నీవు చూడఁబోయిన దొంగవుగాఁ గనఁబడుచున్నావు. మూటనక్కడ పెట్టు. పెట్టకపోయిన నిన్నేమి చేసెదనో చూడు.

ఆవరకు బాహ్యభూమికి వెళ్ళి తిరిగివచ్చుచున్న యొక పురుషుడింతలో నామార్గముననే యింటికి బోవుచుఆ సందడి విని యచట నిలుచుండి "ఏమా మనుష్యుని నట్లు తొందరపెట్టు చున్నారు?" అని యడిగెను.

సుబ్ర__చూచినారా, యీ మనుష్యుఁడు నాలుగు రూపాయ లిచ్చినఁ గాని నన్ను పోనియ్యనని నిర్బంధ పెట్టుచున్నాడు.

పురు__సుబ్రహ్మణ్యమా? నీవా కంఠస్వరమునుబట్టి యాన వాలు పట్టినాను. ఇక్కడి కొక్కఁడవును రాత్రివేళ నెందుకు వచ్చి నావు? ఇంటికడనుండి చెప్పకుండ పాఱిపోయి రాలేదు గదా? ఇంటికి రా పోదము!

సుబ్ర__ఉమాపతిగారా? మీ రిక్కడ నున్నారేమి? మీరిం కొక నిమిషము రాకపోయిన యెడల, వాఁడు బెదరించి నాయొద్ద నేమైన గాఁజేయునుజుండీ. ఉమా__ఏఁడీ, నిన్ను తొందరపఱిచిన వాఁడెవ్వఁడు?

సుబ్ర__మనము మాటలాడుచుండుట చూచి మెల్లమెల్లఁగా జాఱి దూరమునుండి పారిపోవుచున్నాఁడు.

ఉమా__పోనీ, వాని సంగతి రేపు విచారించి కనుగొందము

అని మాటలాడుకొనుచు వా రిద్దఱును గలిసి యింటివంక నడచిరి. ఇల్లు చేరులోపల సుబ్రహ్మణ్యము తనతండ్రికిని కుటుంబమునకును నాఁటివఱకు సంభవించిన విపత్తులును ప్రస్తుతపు స్థితియు తానక్కడకు వచ్చిన కారణము చెప్పెను. అది విని యుమాపతిగారు మిక్కిలి వ్యసనపడి తాను చిన్నతనములో రాజ శేఖరుఁడు గారివద్దఁ జదువుకొన్నప్పుడున్న యైశ్వర్యమంతయు బోయి యింతలో నింత బీదతనము సంభవించి నందున కాశ్చర్యపడి తనకు విద్యాదానము చేసిన గురువు విషయమై శక్తివంచన లేక ప్రయత్నము చేసి చేతనయిన యుపకారమును జేయవలెనని మనసులో నిశ్చయించుకొనెను. కాబట్టి సుబ్రహ్మణ్యమును పలు విధముల నాదరించి, తాను పిఠాపురపురాజుగారియొద్ద నిరవదిరూపాయల యుద్యోగములో నున్న సంగతిని జెప్పి, అతనికింత యనుకూలమైనపని చేయించుటకై రాజుగారియొద్దఁ బ్రయత్నము చేసెద ననియు పనియైనదాక తనయింటనే యుండవలసిన దనియుఁ జెప్పెను. ఆ ప్రకారముగా ప్రతిదినమును సుబ్రహ్మణ్యము భోజనము చేసి యుమాపతిగారితోడఁ గూడ రాజసభకుఁ బోవుచుండెను. పీఠికా పరాధీశ్వరుఁ డయిన విజయ రామరాజుగా రొకనాఁడాతనిజూచి, యీయన యెవ్వరని యుమాపతిగారి నడుగగా, ఆయన వారి స్థితి గతులను మొదటనుండియుఁజెప్పి "తమ యాస్థానములో నేది యయిన నొకయుద్యోగ మీతని కిప్పింపవలయు" నని మనవి చేసెను.

ఉమాపతిగారి యింటనుండి రాజుగారికోటకుఁ బోవుమార్గములో నొక గొప్ప మేడయుండెను. ఆ మేడ నద్దెకుఁ బుచ్చుకొని నెలదినములనుండి యందులో నొక రాజుగారు తన సేవకులతోఁ గూడ కాపురముండి రెండుమూడు దినముల క్రిందట బ్రాహ్మణ సంత్పరణ మొకటి చేసెను. సొమ్ము లేకుండ వచ్చినప్పుడు పుష్కలముగా భుజించుట యెల్లవారికిని సహజగుణమే కాబట్టి, ఆయూరి బ్రాహ్మణోత్తములను నిత్యము నింటికడ ఘృతము నభిఘరించు కొనువారే యయ్యును నాఁడు మాత్రము చేరల కొలఁది నేయి త్రాగిరి. ఆ సంతర్పణమువలన రాజుగారి కీర్తి గ్రామమంతటను వ్యాపించెను; కాబట్టి ప్రతిదినమును పలువురు వచ్చి యాయనను నాశ్రయించి పోవుచుండిరి. ఆయన పేరు నీలాద్రిరాజుగారు, ఒక నాఁడు నీలాద్రిరాజుగారు భోజనము చేసి వీధి యరుగుమీఁద పచారు చేయుచు నిలువఁబడి, ఆ త్రోవను రాజసభకుఁ బోవుచున్న సుబ్రహ్మణ్యమును దూరమునుండి చూచి "మాట' యని చే సైఁగజేపి పిలిచెను.

నీలా__పూర్వము మిమ్మెక్కడనో చూచునట్టున్నది. మీ కాపురపు గ్రామ మేది?

సుబ్ర__నా జన్మభూమి ధవళేశ్వరము, మా యింటి పేరు గోటేటివారు; నాపేరు సుబ్రహ్మణ్యము.

నీలా__అవును. జ్ఞప్తికి వచ్చినది. మీరు రాజశేఖరుడుగారి కొమాళ్ళు కారా? ఇప్పుడాయన యెక్కడ నున్నారు?

సుబ్ర__ఇక్కడనే భీమవరములో నున్నారు. మీ రాయన నెక్కడ నెఱుఁగుదురు?

నీలా__ధవళేశ్వరములోనే చూచినాము, మేము సంవత్స రము క్రిందట యాత్రార్థమై బయలుదేఱి పది దినములు ధవళేశ్వర ములో నుండి గౌతమీ స్నానమును చేసికొని, కోటిఫలి మొదలగు పుణ్యక్షేత్రములను సేవించుకొని, మాసము క్రిందట పాదగయను దర్శించుటకయి వచ్చి యప్పటినుండియు నిక్కడనే యున్నాము. మీ తండ్రిగారికి మా యెడల గురుభావము. మేమక్కడనున్న దినములలో మీ తండ్రిగా రెప్పడును మా యొద్దనే యుండెడివారు.

సుబ్ర__సంవత్సరము క్రిందట మిమ్ముఁ జూచినట్లు నాకు జ్ఞాపకములేదు. మీరెక్కడ బసచేసినారు?

నీలా__మీకు జ్ఞాపకము లేదుగాని మాకు చక్కగా జ్ఞాపక మున్నది. మీ కిద్దఱు చెల్లెం డ్రుండవలెను. వారు బాగున్నారా? సుబ్ర__పెద్ద చెల్లెలు రుక్మిణి చనిపోయినది. చిన్న చెల్లెలు బాగున్నది.

నీలా__మీరు నా సంగతి బాగుగ నెఱుఁగరు. విజయనగరపు రాజుగారు మా మేనమామ కుమాళ్ళు, మొగలితుఱ్ఱు రాజుగారికిచ్చి నది మా సవతి మేనకోడలు.

సుబ్ర__నేనిప్పుడు సభకు బోవుచున్నాను, మఱియొకప్పుడు సావకాశముగా దర్శనముచేసికొని మాటాడెదను. ఇప్పటికి సెల విచ్చెదరా?

అని సెలవు పుచ్చుకొని సుబ్రహ్మణ్యము రాజుగారి కొలువు కూటమునకుఁ బోయెను. అతఁడు ప్రతి దినమును తప్పక సభకు బోవుచు, ఉద్యోగస్థులతో నెల్ల స్నేహముచేసి, అన్నివిధముల పనులను నేర్చుకొనెను. అక్కడి కొలువుడుకాండ్రందఱును ఏ కాగితము వ్రాయవలసి వచ్చినను సుబ్రహ్మణ్యమునే పిలిచి వ్రాయించుచుందురు. ఏ లెక్క కట్టవలసి వచ్చినను సుబ్రహ్మణ్యముచేతనే కట్టించుచుందురు. అందుచేత నతనికి జీతమేమియు లేకపోయినను జీతగాండ్రకంటె పనిమాత్ర మెక్కువ గలిగి యుండెను. ఈ ప్రకారముగా నందఱికిని దయవచ్చునట్లుగా నెవ్వరేపని చెప్పినను జేయుచు వచ్చినందున వారందఱును గలసి "యీ చిన్నవాఁడు బహుకాలమునుండి యాశ్ర యించి సంస్థానము కనిపెట్టియున్నాడ”ని రాజుగారితో మనవి చేసిరి. దానిమీద రాజుగారు సమయము వచ్చినప్పు డుద్యోగమును జెప్పించెద మనియు, అందాక దివాణమును కనిపెట్టుకొని యుండవలసిన దనియు సెలవిచ్చిరి. ఈ లోపల సుబ్రహ్మణ్య మొకనాఁడు వెళ్ళి మరల నీలాద్రిరాజుగారి దర్శనము చేసెను.

నీలా__ఏమయ్యా, సుబ్రహ్మణ్యముగారూ! గ్రామములో విశేషము లేమి?

సుబ్ర__వింతలేమియు లేవు. ఉద్యోగమునకయి రాజుగారి ననుసరించు చున్నాను. ఇంకను పని కలిసి రాలేదు.

నీలా__మీ కింత యనుసరించుట యెందుకు? దూరదేశము నకు వెళ్ళగలరా? నిమిషములో విజయనగరపు మహారాజుగారి వద్ద గొప్పపని చెప్పించెదము. ఆయన మాకు బినతల్లి కొమారుఁడు.

ఈ కడపటి వాక్యము పూర్వము మేనమామ కొమారుఁడని చెప్పినదానికి విరుద్ధముగా నున్నందున, ఆతఁ డబద్దమాడుచున్నా డని మనసులో ననుకొనియు చెప్పినమాట మంచిది గనుక కొంచెము సంతోషించి సుబ్రహ్మణ్యము మారుపలుక కూరకుండెను.

నీలా__అనుమానించుచున్నారేమి! మీతోడు. మీకు తప్పక గొప్ప యుద్యోగము నిప్పించెదము. కాళహస్తి రాజుగారయిన రామవర్మగారికిని మాకును నత్యంత మైత్రి; చిన్నప్పుడు వారును మేమును నొక్క బండిలో నెక్కినాము. ఈ సంగతి పరమ రహ స్యము, ఎవ్వరితోను జెప్పవద్దు.

సుబ్ర__చిత్తము, ఇక్కడ పని కలిసిరాని యెడల నవశ్యముగా వెళ్ళెదను.

నీలా__మీకింకొక రహస్యము చెప్పెదను. బాల్యములో మేమును గాళహస్తిరాజుగారును కలిసి జూదమాడెడివారము. ఆయన సంగతి మనకెందుకుఁగాని, అప్పుడాయన బోగముదాని నుంచు కొన్నాఁడు సుమ్మా.

సుబ్ర__తమరు ప్రొద్దుననే యక్షతలు ధరించినారు; పార్థి వము చేయుచున్నారా?

నీలా__పూర్వము పార్థివము చేయుచుంటిమి కాని యిప్పుడు శివపూజ మాత్రము చేయుచున్నాము. మీ రాజుగారుకూడ శివపూజా దురంధరులఁట కాదా? అందుచేతనే వారికి విశేషైశ్వర్యము కలిగి యున్నదని విన్నాము.

సుబ్ర__అవును. వారు శ్రీమంతులనియే నేను విన్నాను.

నీలా__మీ రాజుగారివద్ద రొక్క మేమాత్ర మున్నదని చెప్పు కొనుచున్నారు?

సుబ్ర_పదిలక్షలకు తక్కువ లేదని వాడుక.

నీలా_అది యంతయుఁ గోటలోనే గదా యుండును? సుబ్ర__కోటలోనే యుండును. అక్కడ జిరకాలమునుండి నమ్మకముగాఁ బనిచేయుచున్న ముసలి బంట్లు కావలి యందురు.

నీలా__విజయనగరపు మహారాజుగారు క్రొత్తగా నొకకోటను గట్టఁదలఁచి, మేము చూచిన పట్టణములోనున్న కోటల పటములను వ్రాయించి తీసికొని రండని మఱిమఱి చెప్పినారు, మొన్ననే పెద్దా పురపు కోట పటమును దెప్పించినాము. మీరీ కోట పటమును కూడ వ్రాసి యియ్యఁగలరా?

సుబ్ర__చిత్తము. కాగితమును కలమును దెప్పింపుడు; ఇప్పడే వ్రాసి యిచ్చెదను.

అని, కాగితమును కలమును సిరాబుడ్డియు తెప్పించిన మీఁదట తాను జూచినదంతయు జ్ఞాపకమును బట్టి పటమును నీలాద్రిరాజుగారిచేతి కిచ్చెను. ఆయన దానిని జూచుకొని యాయా స్థలముల యుపయోగములను గుఱించియు పనియెుక్క- గట్టితన మును గూర్చియు ప్రశ్నలు వేయఁజొచ్చెను. సుబ్రహ్మణ్యమును దనకుఁ దెలిసినంత వఱకు సదుత్తరములను జెప్పుచు వచ్చెను.

నీలా__ఉత్తరపు వైపున వీధి ప్రక్క నున్నదేకాదా ధనాగారము?

సుబ్ర__అవును.

నీలా__ఆంతయు బాగుగ నున్నది,కాని కోటగోడ యెత్తెంత పెట్టినారు?

సుబ్ర__సుమారు పండ్రెండడుగు లుండవచ్చును.

నీలా__మన మీ కోటపటము వ్రాసికొన్న సంగతి యెవ్వరికిని దెలియనీయక రహస్యముగా నుంచవలెను, రాజులకు తమ కోట వంటిది మఱియొకటి యుండుట కిష్టముండదు.

అని చెప్పి, లోపలనుండి తమలపాకులును పోకచెక్కలును పళ్ళెముతోఁ దెప్పించి తాంబూల మిచ్చి, "కోట కట్టించునప్పుడీపటము వ్రాసియిచ్చినది మీరే యని రాజుగారితోఁ జెప్పెదము సుండీ" యని పంపివేసెను. సుబ్రహ్మణ్యమా మాటలకు సంతోషించి సెలవు పుచ్చుకొని, తన కొకవేళ గొప్ప యుద్యోగ మగునేమోయను నాశతో పరిపరివిధముల నాలోచించుకొనుచు మెల్లగా నింటికివచ్చెను.

తరువాత నాలుగుదినముల కొకనాఁడు ప్రభాత సమయముననే రాజుగారియింట దొంగలుపడి ధనాలయములోని నగలును రొక్క మును దోచుకొని పోయినారని యూరనొక కింవదంతికలిగెను.పిమ్మట గొంతసేపటికి రాజభటులు సందడిచేయుచు నూర నలుప్రక్కలను దిరిగి, తమకు విరోధులుగా నున్నవారి నందఱిని పట్టుకొని ఠాణా కీడ్చుకొని పోవ మొదలు పెట్టిరి; ఆక్కడ నున్నవారు వాండ్రను కొట్లలోఁ బెట్టి నేరము నొప్పుకొండని పలువిధములగొట్టి బాధింపఁ జొచ్చిరి; కాని వారు నిరపరాధుల నెందఱిని పట్టుకుని బాధపెట్టినను, నిజమయిన దొంగలను మాత్రము కనిపెట్టలేకపోయిరి. ఉత్తరపు దిక్కున కోటగోడకు నిచ్చెనవేసికొని దొంగలు లోపల ప్రవేశించినట్లు అడుగుల జాడ కనబడుచుండెను; గచ్చుతో కట్టిన ధనమున్న గదియొక్క రాతిగోడకు చిన్నతలు పెత్తుటకు తగినంత పాణిద్వార మొకటి కొట్టబడియుండెను. ఆ ద్వారమును త్రవ్వుటకు బలమయిన పనివాండ్రు ముగ్గురు పూనుకొన్నచో నధమపక్షము రెండు జాముల సేపయినను పట్టును. రాత్రి యంతసేపు మేలుకొని పనిచేయుటకు దొంగలనిద్ర యేమయిపోయినదా యని విచారింపవలసిన యక్కఱ లేదు. వారినిద్రయంతయు ద్విగుణముగా వచ్చి కావలివాండ్ర నాశ్ర యించినది. కొట్టులోపల రూపాయలసంచులు చప్పుడైనప్పుడు ధన లక్ష్మి మూలగుచున్నదని జడిసికొని కావలియున్నవారు భద్రమై గదిలో దూకి తలుపు వేసికొని ప్రాణములను కాపాడుకొనిరనియు, గ్రామములో నొకప్రవాదము పుట్టినది. ఇదెంతనిజమో యీశ్వరునకుఁ దెలియును. ఏది యెట్లయినను ధనలక్ష్మీమాత్ర మారాత్రి నరవాహనా రూఢురాలయి నూతనద్వారమున కోటవిడిచి వెళ్ళిపోయిన మాట మాత్రము వాస్తవము. ఎన్నివిధముల ప్రయత్నము చేసినను రాజ కీయభటులకు దొంగలజాడ యెక్కడను గానరానందున, విసిగి తుదకు వారు తమ నాయకుని కడకు వచ్చి తాముపడ్డ ప్రయాసము నంతను జెప్పుకొనిరి. అందుమీఁద నాతఁడుచేయవలసినపని యేమియు తోచక కాంతసే పాలోచించి, దొంగలను పట్టుకొని పోయినసొమ్ము తెప్పింపలేక పోయినయెడల రాజుగారి వలన మాటవచ్చును కాబట్టి రాజకీయ నియోగులలో నొకరిమీఁద పెట్టనిశ్చయించి, వారినందఱిని వేఱువేఱ పేర్కొని యెవరిమీఁదబెట్టిన నెవరికి కోపము వచ్చునోయని జడిసి, వారిలో లోకువ యైనవారిమీదికి త్రోయనెంచి, యావని తాను చేయుట యుచితముకా దని యింటికిపోయి మాటాడి యంజనము వేయువాని నొకనిని పిలుచుకొని జాములోపల మరల వచ్చెను.

నాయ__ఏమోయి భీమన్నా! రాత్రి రాజుగారియంట ధనము పోయినది. నీ వా ధనమపహరించినవానిని చెప్పఁగలిగిన యెడల, నీకు గొప్ప బహుమతి దొరకఁగలదు.

భీమ_-అదెంతసేపు? సొమ్ము తెప్పించుకోగలిగిన యెడల, అంజనము వేసి నిమిషములో పేరు చెప్పించెదను.

నాయ__అంజనమిప్పుడు నీ యొద్ద సిద్దముగా నున్నదా?

భీమ__ఉన్నది. అది పిల్లి కన్నులవానికేగాని పాఱదు, అటు వంటి వాని నెవ్వని నైనను పిలిపించవలెను.

నాయకుఁ డామాటలు విని యొకభటుని బిలిచి, 'నీవుపోయి చాకలి సామిగానిని తీసుకొనిరా, వానివి పిల్లికన్నులు" అని నియ మించెను. వాఁడు వెంటనేపోయి రెండు గడియలసేపునకు సామి గానిని వెంటఁబెట్టుకొని వచ్చెను. ఈలోపల నంజనము వేయువాఁడు దాసిదానిచేత గది నొకదాని నలికించి, అందొక మూలను నూనెతో గొప్ప దీపమును వెలిఁగించి తాను స్నానముచేసి వచ్చి దీపము ముందట పిండి మ్రుగ్గుతో నొకపట్టుపెట్టి అందాంజనేయవిగ్రహమును కాటుక కరాటమును ఉంచి పూజ చేయుచుండెను. చాకలివాఁడు వచ్చినతోడనే యాతఁడు తనపూజను చాలించి, పట్టులో వానిని గూరుచుండఁబెట్టి బరిణలోని కాటుకను వాని కుడిచేతిలో రాచి దానిని నిదానించిచూచి దానిలో నేమికనఁబడునో దానినెల్ల తనకుఁ జెప్పు చుండుమని యుత్తరువుచేసెను.  భీమ__చేయు దీపము దగ్గఱగాఁ బెట్టి దానికేపి రెప్పవాల్చక చూడు; నీకిప్పు డేమయినఁ గనఁబడుచున్నదా?

సామి__లేదు. కాటుక మాత్రము కనబడుచున్నది.

భీమ__చూపు చెదరనీయకు. ఇప్ప డేమయినఁ గనఁబడు చున్నదా?

సామి__కనఁబడుచున్నది. పెద్ద బంగారపురేకువలె నున్నది.

భీమ__ఆ రేకులనడుమ నేమయిన నున్నదా?

సామి__అవిసి చెట్టున్నది.

భీమ__అవిసిచెట్టుకా దశోకవృక్షము. ఆ చెట్టుకొమ్మలలో నెవ రున్నారో చూడు.

సామి__పెద్ద కోఁతియున్నది.

భీమ__కోఁతి యనఁబోకు, ఆంజనేయులవారను. నీ మనసులో నమస్కారముచేసి యేమిచెప్పునో తెలిసికో,

సామి__ఏమో పెదవులు కదల్చుచున్నాఁడు. ఆ మాటలు నాకుఁ దెలియవు.

భీమ__రాజుగారిసొమ్మెవ్వ రెత్తుకొని పోయినారో యడుగు.

సామి__రాజుగారివద్ద కొలువున్నవారిలోనే యొకరు తీసినారనుచున్నాఁడు.

భీమ__వారియింటిపే రడుగు.

సామి__గోటివారు.

భీమ__పేరుకూడ చెప్పమను.

సామి__సుబ్బమ్మ.

భీమ__సుబ్రహ్మణ్యమా? గోటేటి సుబ్రహ్మణ్యము.

సామి__ఇందాక వీ నాలాగునఁ జెప్పలేదు.  భీమ__నీ వాంజనేయులవారితోనా మాటాడుచున్నావు. ఆంజ నేయు లిందాక నాలాగునఁ జెప్పలేదనుచున్నావా? ఆయన యాలాగు ననే చెప్పినాఁడు. నీవే పేరు నోటఁ బట్టలేక తప్పుపలికినావు. చాలు యీపాటికిలే, ఇంక మాటాడకు.

అని యాతడు సామిగానిని తనవెనుకకుఁ దీసికొని, సొమ్ము దీసినవాని పేరు బయలఁబడ్డదని కేకలు వేసి చెప్పనారంభించెను. భటుల నాయకుఁడును 'ఈ దొంగతనము మఱియొకరివలన జరిగినది కాదని యీ ప్రక్కచుండి యా ప్రక్కకుఁ దిరుగసాగెను. సభలోని యుద్యోగస్థు లందఱును వీం డ్రిద్దఱును గలిసి యా మాట చాకలి వానికి నేర్పి పెట్టిరికాని యిందు సత్యమేమియు లేదని తలచిరి. సాధారణ జను లందఱును నిజముగా దొంగతన మాతఁడు చేయక పోయినయెడల చాకలివాని కాపేరెట్లు తెలిసినదనియు, గట్టిగా సుబ్రహ్మణ్యము యాపని చేసెననియుఁ జెప్పుకొనుచుండిరి. ఊరనెక్కడఁజూచినను సుబ్రహ్మణ్యము సొమ్మును తస్కరించినట్టు అంజనము వేయఁగా బయలఁబడ్డ దని మూఁకలు గట్టి మాటాడుకొనఁజొచ్చిరి; రాజుగా రామాటల నెంతమాత్రము విశ్వసించలేదు.

అప్పుడు సభామందిరమునుండి యింటికిఁ బోవునపుడు త్రోవ పొడుగునను ప్రజలెల్ల "ఈతఁడే కన్నము వేయించినవాఁడు" అని సుబ్రహ్మణ్యమును వ్రేలుపెట్టి చూపనారంభించిరి. అందుచేతనాతఁడు వట్టి నిరాపనింద వచ్చెగదాయని సిగ్గుపడి రాత్రిభోజన మయినతరువాత నొక్కఁడును బరుండి తనలో దానిట్లు చింతింప మొదలుపెట్టెను; 'ఆ గోడకు కన్నము చేసినవాఁడెవ్వఁడయి యుండును? ఒకఁడంత సాహసపుబనిని చేయజాలడు. అటువంటి బలమయిన రాతిగోడకు కన్నము వేసినవారిద్దఱు ముగ్గురుండక తప్పదు. ఆ ముగ్గుఱు నెవ్వరై యుందురు? కోట సంగతి గుర్తెఱిగినవారే కాని మఱియొకరుకారు. నాలుగుదినముల క్రిందట నీలాద్రిరాజు నాచేతకోటపటమును వ్రాయించు కొన్న ప్పుడు ధనాగారమును గూర్చి రెండుమూడు సారులడిగెను. అతఁడట్లడుగుటకు కారణమేమి? ఈ దొంగతనములో నతనికేదో సంబంధము గలిగియుండవలెను. అతఁడు గోడయెత్తు కూడ నడిగెను. దొంగతనములో సంబంధమే లేనియెడల గోడయెత్తుతో నితని కెమి ప్రయోజనము? అంతియకాక యీ సంగతి గ్రామములో పొక్కక మునుపే వేకువజామున బహిర్భూమికి వెళ్ళచుండఁగా నన్నుఁబిలిచి యతఁడు రాజుగారిలోపల దొంగలు పడ్డారcట యని యడిగినాఁడు; ఆతఁడు దొంగలలోఁ జేరియుండని పక్షమున, అంత పెందలకడ నాతని కాసంగతి యెట్లు తెలియును? నేను సాయంకాల మింటికి వచ్చునప్పుడు వీధిలో నిలుచుండఁగా నాతనిని జూచినాను: అప్పు డాతని చర్య వింతగా నున్నది. ఈ యన్ని హేతువులచేతను విచారించిచూడగా ఈతడు దొంగల గురువనుటకు సందేహము లేదు. రేపు రాజుగారి నడిగి కొందఱు రాజభటులను బుచ్చుకొని యెవ్వరికిని తెలియకుండ నాతని యింటిమీద పడి పెట్టెలు మొదలగునవి పరీక్షించెదను. అప్పుడు కొంత సొమ్మయిన దొరకఁ గలదు. అందు మీఁద నామీఁది నిందయైనను పోపును" అని యాలోచించి యారాత్రి యెట్లో వేగించి తెల్లవారినతోడనే రాజుగారి దర్శనముచేసి తన యందు దోషము లేశమయినను లేదని చెప్పుకొని తన వశమునఁ గొందఱు భటులనిచ్చి తనయాజ్ఞాప్రకారముచేయ ను త్తరువిచ్చినచో దొంగలను సొత్తుతో గూడఁ బట్టుకొనెదనని దృడముగాఁ జెప్పెను. రాజుగారాతని మాటయందు గౌరవముంచి, తక్షణమే పదుగురు భటులను రప్పించి "మీరందఱు నీయన చెప్పినట్లెల్లచేసి పర్యవ సానము మాతో మనవి చేయవలసినదని గట్టి యుత్తరువు చేసిరి. సుబ్రహ్మణ్యము వారిని దీసికొని తిన్నగా నీలాద్రిరాజున్న యింటికిఁ బోయి వీధి తలుపు వేసియుండగా వారినందఱిని, ఇంటిచుట్టును కావలిపెట్టి యిద్దఱిని వెంటఁదీసికొని పాణిద్వారమున దొడ్డిలో ప్రవేశించెను. ఆప్పుడు నీలాద్రిరాజు పెరటిలో నిలుచుండి క్రొత్త మనుష్యులు వచ్చుట చూచి తత్తరపడసాగెను.  నీలా__సుబ్రహ్మణ్యముగారా? ప్రొద్దుననే మీ రిక్కడకు వచ్చినారేమి?

సుబ్ర__తమ దర్శనము నిమే_త్తమే.దొడ్డిలో నేమి చేయుంచు చున్నారు?

నీలా__విత్తనములు చల్లించుటకయి దొడ్డి త్రవ్వించినాను. ఏమి గింజలు జల్లింతునాయని యాలోచించుచున్నాను.

అని యా తొందరలో తన విషయమైన బహువచన ప్రయో గమును మఱచిపోయి తన నిజమయిన స్థితి కనుగుణముగా మాటా డెను. సుబ్రహ్మణ్యము మాఱుమాటాడక భటులతో లోపల జొర బడి పెట్టె లన్నియు దీయించి పరీక్షింపఁగా వానిలో మున్ను తమ లోపల బైరాగి యెత్తుకొనిపోయిన వస్తువులును గానఁబడెను గాని రాజుగారి సొత్తేమియుఁ గనపడలేదు. తన సొమ్ము దొరుకుటంబట్టి నీలాద్రిరాజే దొంగయని నిశ్చయముజేసి వస్తువులు భూమిలో పాతి పెట్టి త్రవ్విన యానవాలు తెలియకుండా మఱుగుపఱుచుటకయి దొడ్డి యంతయుఁ ద్రవ్వించి విత్తనములు చల్లుటకని మిషపెట్టి బొంకు చున్నాఁడని యూహచేసి యతఁడు భటులచేత దొడ్డినంతను త్రవ్విం చెను; అందొకచోట రాజుగారిలోపలఁబోయిన సొత్తంతయు గవ్వ యయినఁబోకుండ మొలలోతు భూమిలో గానఁబడెను. వెంటనే కూలి వాండ్రచేత సొమ్మును మోయించుకొని నీలాద్రిరాజును నాతని భృత్యులను బట్టుకొని తీసికొని వచ్చుటకయి భటుల నియోగించి సుబ్రహ్మణ్యము రాజుగారి యింటికి వెళ్ళి నడచిన సర్వవృ త్తాంత మును నివేదించి, కావళ్ళతో సొమ్మును ముందుబెట్టి దొంగల నొప్పగించెను; నీలాద్రిరాజును సేవకులను తమ నేరమున కొప్పుకొని క్షమింప వేడుకొనిరి. అంతట రాజుగారు మిక్కిలి సంతోషించి సుబ్రహ్మణ్యమునకు గొప్ప బహుమానముచేసి, తాను పెద్దాపురము రాజునకుఁ గప్పముగట్టెడి సామంతరాజు గనుక వారిని విమర్శింపఁ దన కధికారము లేదని దొంగలను రాజభటుల వశమున నొప్పగించి వారి కందరకు సుబ్రహ్మణ్యమును నాయకునిగాఁ జేసి విచారణకయి పెద్దాపురము కృష్ణజగపతిమహారాజుగారికడకుఁ బంపెను. సుబ్రహ్మ ణ్యమును ఉమాపతిగారియొద్ద సెలవు పుచ్చుకొని పెద్దాపురమునకు ప్రయాణమయి బయలుదేరి వీధి గుమ్మము వద్దకు వచ్చునప్పటికి పైనుండి మాలబల్లి యొకటి మీఁద పడెను. అప్పుడు ప్రయాణమాపి గౌళిపాటుయొక్క ఫలము కనుగొనుటమ పురోహితునకు వర్త మానము పంపఁగా నతఁడు తాటాకుల పంచాంగమును పట్టుకొని వచ్చి శిరస్సుమీఁద పడలేదు గనుక మరణ భయము లేదనియు స్నానముజేసి దీపము పెట్టుకొని బ్రాహ్మణునకు కొంచెము సువర్ణ దానము చేసిన పక్షమున బల్లి పాటుయొక్క దోషము పోవుననియుఁ జెప్పెను. సుబ్రహ్మణ్యము వెంటనే శిరస్నానము చేసివచ్చి రాగిలో సువర్ణముండునుగనుక నాలుగుడబ్బు లాబ్రాహ్మణుని చేతిలోనే పెట్టి గాయిత్రి చేసికొని తరువాత నెంతో యెండయెక్కినను ఆ పూటనే పెద్దాపురమునకు వెళ్ళ బయలుదేఱెను.