రాజశేఖర చరిత్రము (ఎమెస్కో)/పదవ ప్రకరణము
పదవ ప్రకరణము
శోభనాద్రి రాజుతో మైత్రి__సీత వివాహ ప్రయత్నము__ రామమూర్తి గారి మరణవార్త__రామరాజుతో విరోధము__రాజశేఖరుడుగారిని చెఱసాలలోఁ బెట్టుట__సీత నెత్తుకొని పోవుట.
ఒక యాదివారమునాఁడు నాలుగు గడియల ప్రొద్దెక్కిన తరు వాత రాజశేఖరుఁడుగారు పెద్దాపురమునకుఁ బోవుచుండగా, శోభనాద్రి రాజు వీధియరుగుమీఁదనున్న యున్నతాసనముపైని గూరుచుండి చూచి లంపతావాని నొక్కని బిలిచి "ఆ మార్గమునఁ బోవుచున్న బ్రాహ్మణుని దీసికొనిర"మ్మని చెప్పెను. వాఁడును మహా వేగముగా బోయి "రాజుగారి సెలవయినది ర"మ్మని పిలిచెను. రాజశేఖరుఁడుగా రెట్లయిన నాతని యనుగ్రహము సంపాదించుకోవలె ననియే కోరు చున్నవారు గనుక పిలిచినదే చాలునని వెళ్ళి అతఁడు చూపిన బల్ల మీఁద కూరుచుండిరి.
శోభ__ఈ నడుమ భీమవరము వచ్చి సోమభట్లుగారి లోపల కాపురమున్నవారు మీరే కాదా?
రాజ__అవును. వెనుక నేనొక పర్యాయము దమ దర్శనము చేసినాను.
శోభ__జ్ఞాపకమున్నది.మేమప్పుడు మిక్కిలి తొందర పనిలో నుండి మీమీఁద కోపపడినాము. అంతేకాకుండ ఆ వచ్చినవారు మీరని మాకప్పుడు తెలియలేదు. మీ పోష్యవర్గములో చేరిన వారెంతమంది యున్నారు? పెండ్లి కెదిగిన కొమార్తె కూడ ఉన్నదఁట కాదా?
రాజ__ఇప్పుడున్నది వివాహము కావలసిన యాకూఁతు రొక్కతయే. నా పెద్ద కుమార్తె మొన్న త్రోవలో దొంగలు కొట్టి నప్పుడు చనిపోయినది. ఏదయిన నొక యుద్యోగమును సంపాదించుట కయి నా కుమారుని ఇక్కడకు వచ్చిన తరువాతనే పిఠాపురము పంపినాను.
ఈ ప్రకారము సంభాషణము జరుగుచుండఁగా కొంతమంది పెద్దమనుష్యులు వచ్చి అరుగుమీఁదనున్న బల్లమీఁద గూరుచుండిరి. అప్పుడు రాజుగారు వారితో తాము చేసిన యద్భుతచర్యలను గురించి బహువిధముల ప్రశంస చేసిరి. చెప్పినమాటలలో నేమియు చమత్కారము లేకపోయినను, అక్కడ నున్నవా రాలోపమును లోనవ్వు మాత్రము పూర్తి చేసిరి; వారందఱు నవ్వినపుడు తామొక్కరు నూర కున్న బాగుండదని నిజముగా నవ్వు రాకపోయినను తెచ్చుకొని వారు నవ్వినప్పుడెల్లను రాజశేఖరుఁడుగారును నవ్వుచువచ్చిరి. ఆ రాజు తన్ను రాజశేఖరుఁడుగారు తెలిసినవాఁ డనుకొనుటకయి ప్రతి విష యములోను గొంచెము కొంచెముగా మాటాడి యన్నియుఁ దెలిసిన వానివలె నటింపసాగెను; తన కేమియుఁ జెప్పుటకు తోఁచనప్పుడు అక్కడనున్న వారి మొగములవంకఁ జూచి నవ్వుచువచ్చెను. అప్పుడాయన పాండిత్యమును సభవారందఱు నూరక పొగడుచుండిరి. ఇంతలో గొందఱు గాయకులు వచ్చి సంగీతముపాడుట కారంభింపని యెడల, వారి పొగడ్తలు సభచాలించువరకు నుండుననుటకు సందే హములేదు. వారు పాటనారంభింపఁగానే యెల్లవారికిని ఇండ్లమీఁద ధ్యానము పాఱనారంభించినది. అయినను రాజుగా రేమను కొందురో యని యందఱును కొంతసేపు శ్రమచేసి మాటలు చెప్పుకొనుచు నచ టనే కూరుచుండిరి. ఆ పాట వినివిని తాళలేక కడపట నొక పెద్దమను ష్యుడు చొరవచేసి, "వారు మంచివారని యదేపనిగా శ్రమ యిచ్చుట న్యాయముకాదు. కాబట్టి యీ పాటి పాటచాలింప ననుజ్ఞ యియ్య వచ్చు" నని చెప్పెను. సభవారందరును అది యుక్తమని యేక వాక్యముగాఁ బలికిరి, అంతట సభచాలించి యందఱును సెలవుపుచ్చు కొని వెళ్ళఁబోవునపుడు రాజుగారు రాజశేఖరుఁడుగారిని'అప్పడప్పుడు వచ్చి దర్శన మిచ్చుచుండెదఱుకాదా?" యని యడిగిరి,"ముఖ్యముగా వచ్చి దర్శనము చేసికొనుచుండెద"నని చెప్పి, ఆయన నాఁటికి పెద్దాపురము ప్రయాణము మానుకొని పది గడియల ప్రొద్దెక్కువఱకిల్లు చేరిరి.
నాఁడు మొదలుకొని ప్రతిదినమును రాజశేఖరుఁడుగారు ప్రాతః కాలమునను సాయంకాలమునను గూడఁ బోయి శోభనాద్రిరాజుగారి దర్శనము చేయుచుండిరి. ఆ రాజుగారును మిక్కిలి దయతో నాతని నాదరించి మంచిమాటలతో సంతోషపెట్టుచుండిరి. ఆయన రాజకార్య విషయమైన పనినిజూచు చుండునపుడు సహితము రాజశేఖరుఁడు గారు వద్దనే యుండి సంగతి కనుగొనుచుందురు; గ్రామాదులలోని ప్రజలు వ్రాసికొన్న విజ్ఞాపన పత్రికలను కొలువుకాండ్రు చదువునపుడు వ్రాసికొన్న మనవి కడపట రెండు మూడు పంక్తులలో మాత్రమే యున్నను బిరుదావళి మాత్రము మొదటి రెండు పత్రములలోను పూర్ణముగా నిండియుండుట తెలిసికొని రాజుగారికి గ్రామములోని కాపులకన్న బిరుదు పేళ్ళే విశేషముగా నుండుట కానందించుచు వచ్చిరి. రాజకార్యపుఁబనియైనతోడనే రాజుగారు సభవారితో ముచ్చట కారంభింతురు. అతఁ డెంతసేపు చెప్పినను తన ప్రతాపమునే చెప్పు చుండును; ఆ కథ లన్నియు నావఱకు పదిసారులు విన్నవే అయినను మొదటిసారి నవ్వినట్టే ప్రతిపర్యాయమును సభలోని వారందఱును నవ్వుచుందురు; అందులోఁ గొందఱు స్తోత్రపాఠములను చదివి రాజు గారి మనస్సును సంతోషపెట్టుచుందురు; అందఱును ముఖస్తుతులు చేయుచుండగా తామొక్కరును మాత్ర మూరకుండుట న్యాయము కాదని యెంచి, రాజశేఖరుఁడుగారు స్తుతివిద్యయందు పాండిత్యము చాలనివారు గావున నసత్యమునకు భయపడి యాతఁడు మఱి యే విషయమునందును స్తోత్రా ర్హుడుకా నందున మంచిబట్టలను కట్టుకొను టకు కొంత శ్లాఘించిరి. ఇట్లు తఱచుగా రాజశేఖరుఁడుగారు రాజ స్థానమునందు మెలగుఁచు వచ్చుటచేత వేఱులాభమును పొందక పోయినను సభలో పదిమందిని నవ్వించు మార్గమును మాత్రము నేర్చుకొనిరి; కాబట్టి యప్పటినుండియుఁ దామొకమాటను చెప్పుచు ముందుగాఁ దామే నవ్వుచువచ్చిరి. అది చూచి యందఱును నవ్వు చుండిరి. రాజుగారప్పుడప్పుడు ధర్మోపన్యానములను సహితము చేయుచుందురు. లోకములో నెవ్వరెన్ని పాట్లుపడినను భోజనము నిమి త్తమే కాఁబట్టి, ఆ విషయమున నేమిచేసినను దోషములేదని వాదించుచుండిరి. ఈ సిద్ధాంతము మనస్సున నాటియుండుట చేతనే కాఁబోలును రాజుగారు ప్రతిదినమును లేచినది మొదలుకొని పది గడియల వఱకు పాత్రర్భోజనమునకు వలయు సంభారముల నిమి త్తమే ప్రయత్నము చేయుచుందురు; భోజనమయినది మొదలు కొని మధ్యాహ్నము ఫలాహార మేమిదొరకునా యని చింతించు చుందురు;ఫలాహారమయినప్పటినుండియు రాత్రిభోజనమునకు వ్యంజ నము లేవి కలవని యాలోచించుచుందురు.
ఈ రాకపోకలచేత రాజశేఖరుడుగారికి రాజుగారివద్ద మిక్కిలి చనువు గలిగెను. ఆ సంగతి నెఱిగి బ్రాహ్మణులు రాజశేఖరుఁడుగారి యింటికిఁ బోయి పలువిషయములు ముచ్చటించుచు, వారిలోఁ గొందఱు సీత నెవ్వరికిచ్చి వివాహము చేయఁదలఁచినా రని మాట వెంబడి నడుగుచుందురు. ఇప్పుడు చేతిలో డబ్బులేనందున, ఎవరికిచ్చి వివాహముచేయుటకు తలపెట్టుకోలేదని యాయన బదులు చెప్పుచుండును. ఒకనాడు రాజశేఖరుడుగారు భోజనముచేసి కూరుచుండి యుండగా బొమ్మగంటి సుబ్బారాయఁడను సిద్ధాంతి వచ్చి జ్యోతి శ్శాస్త్రమునందలి తన యఖండ పాండిత్యమును దానివలనఁ దనకుఁ గలిగిన గౌరవమును పొగడుకొని ఆంధ్రదేశమునందలి గొప్పవారంద ఱును జాతకములను తనకుఁ బంపి ఫలములను తెలిసికొనుచుందురని చెప్పి దానికి నిదర్శనముగా బెక్కు- జాతకచక్రములను విజయనగ రాది దూరప్రదేశములనుండి ప్రభువులు వ్రాసినట్టున్న జాబులను జూపి, ఫలము చెప్పుటకయి ఆయన యొక్క జన్మనక్షత్రమును కూడ తెమ్మని యడిగెను.
రాజ__నాకిప్పడు జ్యౌతిషశాస్త్రమునందలినమ్మకము పోయి నది; నావద్ద కొల్లగా ధనము పుచ్చుకొని వ్రాసిన మావాండ్ర జన్మ పత్రికలలో ఫలము లేవియు నిజమయినవి కావు; మేము కాశీయాత్రకు బయలుదేరునపుడు మంచి ముహూర్తము పెట్టుకొని యిల్లు బయలు దేరినను త్రోవలో గొప్పయాపదలు వచ్చినవి;అందుచేత జ్యొతిషము మీఁది నమ్మకము చెడినది. కాబట్టియే మొన్న పెద్దాపురమునుండి యిక్కడకు వచ్చునపుడు ముహూర్తము చూచుకొనకయే బయలు దేఱినాను.
సుబ్బ__నాది అందఱి జ్యోతిషములవంటిది కాదు;నేను చెప్పిన బ్రశ్నకాని పెట్టిన ముహూర్తముకాని యీ వరకెన్నడును తప్పిపోలేదు; నేను జాతకములో నెన్నియక్షరములు వ్రాయుదునో యన్ని యక్షరములును జరిగి తీరవలెను.
రాజ__మీరు చెప్పెడు ఫలము నిజమైనను నాకక్కరలేదు. నాకు ముందు మేలుకలుగుననెడి పక్షమున, వచ్చెడు ననుకొన్నది రాక పోయెనేని మిక్కిలి వ్యసనముగా నుండును; నిజముగా వచ్చెనేని ఆవఱకే దాని నెదురు చూచియుండుటఁజేసి వచ్చినప్పు డధిక సంతో షము కలుగదు. కీడు కలుగునని చెప్పెడు పక్షమున నిజముగా వచ్చి నప్పుడు దుఃఖపడుట యటుండఁగా ఇప్పటినుండియు విచారపడవలసి వచ్చును; ఒకవేళ రాకపోయెడు పక్షమున వ్యర్ధముగా లేనిపోని చింత పడవలసి వచ్చును; ఆ వట్టి విచారముచేతనే కీడు కలిగినను గలుగ వచ్చునుగాని, సంతోషపడుటచేత మేలు మాత్రము కలుగనేరదు.
సుబ్బ__పండితులై యుండియు మీరాలాగున సెలవిచ్చుట భావ్యము కాదు. పెద్దలు చెప్పిన శాస్త్రములయందు మనమెప్పడు గుఱి యుంచవలెను. ఆ మాట పోనిండి. మీ కుమార్తెకు పెండ్లి యీడు వచ్చినట్టున్నది; ఇంకను వివాహ ప్రయత్నము చేయక యశ్రద్ధగా నున్నారేమి?
రాజ__ఆ విషయమైయే నేనును విచారించుచున్నాను. అను కూలమయిన సంబంధము కనఁబడలేదు; చేతిలో సొమ్ము సహితము కనఁబడదు. మీ ఎఱుక నెక్కడనై నను మంచి సంబంధము లేదు గదా?
సుబ్బ__సం-బం-ధ-మా? ఉన్నదికాని, వారు గొప్పవారు; సంబంధము చేసికొందురో లేదో, ఆది మీకు సమకూడిన యెడల మీకు సర్వవిధముల ననుకూలముగా నుండును.
రాజ__వారిదేయూరు? మనమేమి ప్రయత్నముచేసిన ఆ సంబంధము లభ్యమగును ?
సుబ్బ__వారిది పెద్దాపురము. వారియింటిపేరు మంచిరాజు వారు; వారికి సంవత్సరమునకు రెండువేల రూపాయలు వచ్చు మాన్యము లున్నవి: ఇవిగాక వారియొద్ద రొక్కముగూడ విస్తార ముగా నున్నదని వాడుక చిన్నవాఁడు ప్రథమ వరుఁడు; స్ఫురద్రూపి: అతనికొక్క యన్నగా రున్నారుగాని, ఆయనకు సంతానము లేదు, ముందు సమస్తమునకును ఈ చిన్నవాఁడే కర్తయగును. పెండ్లి కొమారునిపేరు పద్మరాజుగారు. ఆ సంబంధము మన శోభనాద్రిరాజు గారు ప్రయత్నముచేసిన పక్షమున మీ యదృష్టబలమువలన రావలెను గాని మఱియొకవిధముగా మీకు లభింపదు.
రాజ__ఆలాగయిన పక్షమున, ఈ సంగతిని ముందుగా మీరొకసారి రాజుగారితో ప్రసంగించి వారి యభిప్రాయము తెలిసికొనెదరా?
సుబ్బ__నేను ముందు వెళ్ళి కూర్చుండెదను. తరువాత మీరు కూడా రండి. మీరుండగానే మాట ప్రస్తావనమున మీ కొమార్తె వివాహపు సంగతిని తెచ్చిచూచెదను. దాని మీద మీరందుకొని రాజు గారితో నొక్కి మనవి చేయవలెను.
అనిచెప్పి సుబ్బరాయఁడుసిద్ధాంతి బయలుదేఱి తిన్నగా శోభ నాద్రిరాజుగారియింటికి బోయి కూరుచుండెను, తరువాత మఱినాలుగు నిమిషములకు రాజశేఖరుడుగారును వెళ్ళి చేరిరి. అప్పుడు కొంత సేపు పలువిధముల ప్రసంగములు జరిగినమీఁదట రాజశేఖరుడుగారి కొమార్తె సంగతి సంగతి మెల్లఁగా దెచ్చెను.
సుబ్బ__రాజశేఖరుడుగారికి పెండ్లి కావలసిన కొమార్తె యున్న సంగతి దేవరవా రెఱుగుదురా?
శోభ__ఎఱుఁగుదుము: ఈ మధ్య విన్నాము, ఆ చిన్న దానికిఁ బెండ్లి యీడు వచ్చినదా? సుబ్బ__ఈ మధ్యాహ్నమే నేను చూచినాను. ఇక చిన్న దానిని నిలిపి యుంచరాదు; మొన్న మా బంధువుల గ్రామములో నింతకంటె చిన్నపిల్ల సమర్తాడినది.
శోభ__ఎక్కడనై న సంబంధము విచారించినారా?
సుబ్బ__పెద్దాపురములో మంచిరాజు పద్మరాజుగా రున్నారు. తమరు ప్రయత్నము చేసెడిపక్షమున, ఆ సంబంధ మనుకూల పడ వచ్చును.
శోభ__అవును. అది దివ్యమయిన సంబంధమే కాని, వారీ చిన్నదానిని చేసికొనుట కంగీకరింతురా?
రాజ__తమ రేలాగుననైనను ప్రయత్నముచేసి మా కీమేలు చేయక తప్పదు. తమరు సెలవిచ్చినతరువాత వారు మఱియొక విధముగాఁ దలఁచుకోరు.
శోభ__ఈ పూట పద్మరాజుగా రిక్కడకే వచ్చినారు. మీ యెదుటనే వారితో చెప్పెదము. ఓరీ, స్వామిగా! మన బావగారితో మంచిరాజు పద్మరాజుగారు వచ్చి మాటాడుచున్నట్టున్నారు. వెళ్ళఁ బోవునప్పుఁడొక్కసారి యవశ్యముగా దర్శనమిచ్చి మఱి వెళ్ళు మన్నానని మనవిచేసి రా,
లంపతావాఁడు వెళ్ళిన కొంతసేపటికి ముప్పదియేండ్ల యీడు గల నల్లని యొక పెద్దమనుష్యుడు చలువచేసిన తెల్లబట్టలు కట్టు కొని పదివ్రేళ్ళను ఉంగరములును చేతులను మురుగులును మొలను బంగారపు మొలత్రాడును పెట్టుకొని వచ్చెను. శోభనాద్రిరాజుగారు దయచేయుఁడని మర్యాదచేసి యాయనను తమదాపనఁ గూర్చుండఁ బెట్టుకొనిరి.
పద్మ__తమ సెల వయినదని సామిగాఁడు వర్తమానము చెప్పినందున వెళ్ళుచున్నవాఁడను మరలి వచ్చినాను. నాతో నేమ యిన సెలవియ్యవలసినది యున్నదా?
శోభ__వీరు కొంతకాలమునుండి మన గ్రామములో నివసించి యున్నారు. మిక్కిలి దొడ్డవారు. వీరి పేరు రాజశేఖరుఁడుగారు. మీరు సంబంధముకొరకు విచారించుచున్నారని దెలిసినది. వీరి కొమార్తెయున్నది చేసికోరాదా? పిల్ల మిక్కిలి లక్షణవతి. వీరిది మొదటినుండియు మంచి సంప్రదాయసిద్దమైన వంశము.
పద్మ__పలువురు పిల్లనిచ్చెదమని తిరుగుచున్నారు. నాకీవఱ కును వివాహము చేసికోవలెనని యిచ్చ లేకపోయినది, ఆలాగే కాని యెడల, నాకు చిన్నతనములోనే వివాహమయి యిూపాటికి సంతాన యోగము కూడా కలుగదా? మీవంటివారందరును మెడలు విరుచుట చేత విధిలేక యొప్పుకోవలసి వచ్చినది. అయినను తమరీలాగున సెలవిచ్చినారని మా నాన్నగారితో మనవిచేసి యేమాటయు రేపు విశద పఱిచెదను.
శోభ__ఈసారి నా మాట వినకపోయినయెడల, మీ స్నేహమునకును మా స్నేహమునకును ఇదే యవసానమని మీ యన్నగారితో నేను మనవిచేయుమన్నానని ముఖ్యముగా చెప్పవలెను.
పద్మ__చి త్తము. ఆయన మీ యాజ్ఞను మీఱి నడవరు. సెలవు పుచ్చుకొనెదను.
పద్మరాజు వెళ్ళిపోయినతరువాత సంబంధమును గురించి గట్టి ప్రయత్నము చేయవలయునని రాజశేఖరుఁడుగారు శోభనాద్రి రాజుగారిని బహువిధముల బ్రార్ధించిరి. అతఁడును తన యావచ్ఛక్తిని వినియోగించి యా సంబంధమును సమకూర్చెదనని వాగ్దానము చేయుటయే గాక, ఆ సంబంధము దొరికినయెడల రాజశేఖరుఁడు గారికి మునుపటి కంటెను విశేష గౌరమును బ్రసిద్దియుఁ గలుగఁ గల దని దృఢముగా జెప్పెను. అంతట ప్రొద్దుక్రుంకినందున రాజుగారు భోజనమునిమిత్తమయి లేచిరి. తక్కినవారందరును సెలవు పుచ్చు కొని యెవరియిండ్లకు వారు పోయిరి.
మఱునాఁడు నాలుగు గడియల ప్రొద్దెక్కినతరువాత రాజశేఖ రుఁడుగారు వెళ్ళినతోడనే, శోభనాద్రిరాజుగారు చిఱునవ్వు నవ్వుచు లోపలినుండి వచ్చి "నిన్న మనము పంపించిన వర్తమానమునకు రాత్రియే ప్రత్యుత్తరము వచ్చినది సుండీ" యని చెప్పెను. "ఏమని వచ్చినది? ఏమని వచ్చినది?" అని రాజశేఖరుఁడుగా రత్యాతురతతో నడిగిరి. "నేనంత ఖండితముగా వర్తమానము పంపిన తరువాత వారు మఱియొకలాగునఁ జెప్పెదరా? చేసికొనియెద మని జాబు వ్రాసి పంపినారు" అని యొక తాటాకుచుట్టను చేతి కిచ్చెను. దానిని చదువుకొని రాజశేఖరుఁడుగారు పరమానంద భరితు లయిరి. అప్పడే రాజుగారు సుబ్బారాయఁడు సిద్ధాంతిని పిలిపించి వివాహమునకు ముహూ_ర్తము పెట్టుఁ డని నియమించిరి. అతఁడు పంచాంగమును జూచి యాలోచించి వైశాఖ బహుళ సప్తమి గురువారము రాత్రి 24 ఘటికల 18 విఘటికలమీఁదట పునర్వసు నక్షత్ర మేషలగ్నమందు ముహూర్తము నుంచెను. వెంటనే పెండ్లి పనులు చేయుట కారంభింప వలసిన దని చెప్పి "మీకు ఖర్చున కిబ్బందిగా నున్నయెడల ప్రస్తుత మీనూరు రూపాయలను పుచ్చుకొని మీచేతిలో నున్నప్పడు నెమ్మ దిగా తీర్చవచ్చు"నని శోభనాద్రిరాజుగారు పెట్టెతీసి రూపాయలను రాజ శేఖరుడుగారి చేతిలోఁబెట్టి "సామిగా" అని సేవకు నొక్కని బిలిచి "నీవీ వారముదినములను పంతులుగారితో కూడ నుండి వారేపని చెప్పినను చేయుచుండుము" అని చెప్పి యొప్పగించెను. రాజశేఖరుఁడు వానిని తీసికొని యింటికిఁ బోయిరి.
ఆ దినము మొదలుకొని ప్రతిదినమును రాజశేఖరుఁడుగారు పెద్దాపురమునకు వెళ్ళుచు కందులు మొదలుగాఁ గలవానినెల్ల కొనితెచ్చి ఆదివారపుసంతలో కూరగాయలను దెప్పించిరి. ఈ విధముగా పెండ్లి పనులను సాగించుచు పంచమినాఁడు సీతను పెండ్లికూఁతునుగా జేసిరి. ఇక రేపురాత్రి పెండ్లియనఁగా షష్టినాఁడురాత్రి చేతిలో కఱ్ఱ పట్టుకొని గొంగళి ముసుగుపెట్టుకొని యొక కూలివాడు చీకటిలో వచ్చి రాజమహేంద్రవరమునుండి యుత్తరము తెచ్చినానని యొక తాటాకుచుట్టను సీతచేతి కిచ్చెను. ఇంతలో మాణిక్యాంబ లోపలి నుండి వచ్చి సీత చేతిలోని యుత్తరమును పుచ్చుకొని రాజశేఖరుఁడు గారు పెద్దాపురము వెళ్ళి రాలేదనియు వచ్చెడిసమయమైనది గనుక వచ్చినదాఁక వీధిలో నిలుచుండవలసిన దనియుఁ జెప్పి లోపలికిఁ బోయెను. రాజశేఖరుడుగారు వేగిరము రాకపోఁగా కూలివాఁడు తొందరపడుచుండుటను జూచి మాణిక్యాంబ వానికి తవ్వెడు బియ్య మును డబ్బును ఇచ్చి పంపివేసెను. ఆ వెనుక సీత 'నాన్నగారు వచ్చుచున్నారేమో చూచి వచ్చెద' నని వీధిగుమ్మములోనికి వెళ్ళి 'ఇప్పడువచ్చిన కూలివాఁడు కఱ్ఱ దిగఁ బెట్టి పోయినాఁ'డని యొక చేతి కఱ్ఱను దెచ్చి వాఁడు మరల వచ్చి యడిగినప్పడియ్యవచ్చునని పడక గదిలో మూలను బెట్టెను.
కొంతసేపటికి రాజశేఖరుఁడుగారు వచ్చి భార్య రాజమహేంద్ర వరమునుండి యుత్తరము వచ్చిన దని చెప్పి చేతికియ్యఁగానే దీపము వెలుతురునకుఁబోయి సగము చదివి చేతులు వడఁకఁగా జాబును క్రిందపడవయిచి కన్నుల నీరు పెట్టుకొన నారంభించిరి. జాబులో నేమి విషయము లున్నవో వినవలె నని చేరువను నిలువఁబడియున్న మాణిక్యాంబ మగనిచేష్టలు చూచి తొందరపడి యేమియు తోచక ఖేదపడియెద రేమని యడిగెను. అతఁడు గద్గదస్వరముతో మన రామ మూర్తి విశూచి జాడ్యముచేత నిన్న మధ్యాహ్నము కాలముచేసినాఁ డని చెప్పెను. అంత వారిద్దరును గొంతసేపు విచారమును పొందిరి.
ఆ మఱునాఁడు ప్రాతఃకాలముననే రాజశేఖరుఁడుగారు బయలు దేఱి శోభనాద్రిరాజుగారి యింటికిఁబోయి తన పినతండ్రి కొమారుఁ డయిన రామమూర్తిగారి మరణమువలన సంభవించిన దురవస్థను జెప్పి ముహూర్త మశుచిదినములలో వచ్చుటచేత వివాహకార్యము నకు సంభవించిన యాలస్యమునకును నష్టమునకును కొంత చింత పడి పెండ్లికుమారునివారు తరలి రాకుండ వెంటనే వర్తమానము చేయుఁడని కోరిరి. శోభనాద్రిరాజుగారును ఆయనను గొంచె మూరార్చి తక్షణమే పెద్దాపురమునకు మనుష్యునిఁ బంపిరి. పిమ్మట రాజశేఖరుఁడుగా రింటికిఁ బోయిరి.
తరువాత వచ్చిన యాదివారమునాఁడు రాజశేఖరుఁడుగారు భోజనము చేసి కూరలకావళ్ళను కూలివాండ్రచేత మోపించుకొని వానిని విక్రయించివేయుటకయి పెద్దాపురము సంతకుఁ బోయి యొక యంగడివానికి బేరమిచ్చి నిలువఁబడిరి. ఆ సమయమున నొక గృహస్థు తలగుడ్డ చుట్టుకొని నిలువుటంగీ తొడుగుకొని చేరవచ్చి “అన్నయ్యా! యీ మయిలబొట్టెక్కడిది?" అని యడిగెను. రాజ శేఖరుఁడుగా రాయన మొగము వంకఁ జూచి ఱిచ్చపడి మాటతోఁచక యూరకుండిరి, మరల నా పెద్దమనుష్యుఁడు "గంధపుచుక్కపెట్టి నారు. మనకు మైల యెక్కడనుండి వచ్చినది?" అని యడిగెను.
రాజ__మన రుక్మిణి పోయిన వర్తమానము నీకు తెలియ జేసినానుగదా? మొన్న గురువారమునాఁడు సీతకు వివాహము నిశ్చ యించుకొని పెండ్లిపను లన్నియుఁ దీర్చి సిద్ధముగా నుండఁగా బుధ వారమునాఁడు రాత్రి యెవ్వఁడో దుర్మార్గు డొకఁడు నేను లేని సమ యమున వచ్చి నీవు పోయినట్టు వ్రాసియున్న జాబు నొకదానిని మీ వదినెచేతికిచ్చి పోయినాఁడు.
రామ__ఎవ్వఁడో పెండ్లికార్యమునకు విఘ్నము కలిగింప వలెనని యీ దు స్తంత్రమును చేసియుండును.
రాజ__గిట్టనివాఁడెవఁడో యీ పన్నుగడ పన్నినాఁడు. ఇంటికి వచ్చి నీ వదినెగారిని సీతను చూచివత్తువు గాని రా.
రామ__నా కిప్పుడే రాజుగారితో మాటాడి మరల నిమిషముల మీఁద రాజమహేంద్రవరము వెళ్ళవలసిన రాజకార్యమున్నది. నెల దినములలో మరల వచ్చి మిమ్మందరను జూచి రెండుదినములుండి పోయెదను.
అని చెప్పి రామమూర్తిగారు తన పనిమీఁద రాజసభకు వెళ్ళి పోయిరి. రాజశేఖరుఁడుగారును తిన్నఁగా భీమవరమునకు వచ్చి భార్యతో రామమూర్తిగారి వార్తను జెప్పి వివాహ కార్యమునకు భంగము కలిగించిన దుర్మార్గుని బహువిధముల దూషింపఁజొచ్చిరి. అప్పుడు కూలివాఁడు దిగఁబెట్టిపోయిన కఱ్ఱను తీసికొని వచ్చి సీత తండ్రికిఁ జూపెను. దాని నాతఁ డానవాలుపట్టి; చేతఁ బట్టుకొనిచూచి, నాడు రామరాజు చూపిన కత్తికఱ్ఱ యిదియేనని భార్యతోఁ జెప్పెను వారిరువును ఆలోచించుకొని నిశ్చయముగా నీ యుత్తరమును. తెచ్చినవాఁడు రామరాజే కాని మఱియొకఁడు కాఁడని దృఢపఱుచు కొనిరి.
రాజ__రామరాజు మనవలన నుపకారమును పొందినవాఁడే? యిట్లేల చేసెనో !
మాణి__నాటిరాత్రి మన యందరి ప్రాణములను గాపాడి మనకెంతో ప్రత్యుపకారమును చూపినాఁడు. ఆతఁడీ యపకారము తలఁచుకొనుటకు నా కేమియు కారణము నూహించుటకు తోచ కున్నది.
రాజ__మన శత్రువులవద్ద ధనము పుచ్చుకొని యీ దుర్మార్గ మున కొడికట్టియుండవచ్చును. సొమ్ము ప్రాణమువంటి మిత్రులనయి నను పగవారినిగాఁ జేయునుగదా!
మాణి__నేఁటి కాలమునకు ధనాశ యాతని కీదుర్బుద్ధిని పుట్టించెను గాఁబోలును. అదిగో రామరాజును వచ్చుచున్నాడు. ఆతని నడిగిన సమ స్త్రమును తేటపడును.
రాజ__ఏమయ్యా, రామరాజుగారూ! మా వలన మహోపకార మును పొందియు మా కార్యవిఘాతము చేయుటకు మీకు ధర్మమా?
రామ__మీకు నేనేమి కార్యవిఘాతము చేసినాను?
రాజ__రామమూర్తి పోయినట్టు జాబు సృష్టించి నేనింట లేనప్పడు మావాండ్ర కిచ్చిపోలేదా?
రామ__నేను మీ యింటి మొగమయనను చూడలేదు. ఇటు వంటి లేనిదోషముల నామీద నారోపించిన, మీకును నాకును తిన్నగా జరగదు సుమండీ!
రాజ__మీరు మా ఇంటి మొగమే యెఱుఁగనియెడల, మీ చేతి కఱ్ఱ యిది యిక్కడకేలాగు వచ్చినది?
రామ__అయిదాఱు దినములనుండి నా చేతికఱ్ఱను గానక దాని నిమిత్తమై సకల ప్రయత్నములను జేయుచున్నాను. సరిసరి తెలిసినది. మీరా కఱ్ఱ యెత్తుకొనివచ్చి దానిని తప్పించుకొనుటకయి ఎదురు నాఁమీదను దోషారోపణము చేయుచున్నారా? మీకేమో యింతవరకును యోగ్యు లనుకొనుచున్నాను. రాజ__నావద్ద నీవేమి యయోగ్యతను కనిపెట్టినావు? ఇక ముందు నీ వెప్పుడును మా యిల్లు త్రొక్కిచూడవద్దు.
రామ__నీవు నీ వనఁబోకు. నీ యింటి జోలి యెవరికిఁ గావలెను?
అని చివాలున లేచి రామరాజు వెళ్ళిపోయెను. అతని వెను కనే బయలుదేరి రాజశేఖరుడుగారు శోభనాద్రిరాజుగారి యింటికి బోయి, జరిగిన యావద్వృత్తాంతము వినిపించి; మరల ముహూర్తము పెట్టుటకయి సిద్ధాంతిని పిలిపించవలెనిని చెప్పిరి.
శోభ__మీలోపల ముహూర్తము పెట్టిననాఁటి రాత్రియే సిద్ధాంతికి జ్వరము తగిలి, వ్యాధి ప్రబలమయి జీవితాశపోయినందున మంగళవారమునాఁడు మధ్యాహ్నమున ఆయనను భూశయనము చేసి నారు. అప్పు డాయన బంధువు లందఱును జేఱి చదువుకొన్న బ్రాహ్మ ణుల కిటువంటి చావు యోగ్యమయినది కాదని యాతురసన్యాస మిప్పించినారు. ఆ రాత్రి నుండియు రోగము తిరిగి యిప్పుడు కొంత వ్యాధి కుదిరియే యున్నాడట. మీరిప్పడే పోయి యీ మాసములో వివాహముహూర్త మెప్పుడున్నదో విచారించి రండి.
రాజ__చి త్తము, సెలవు పుచ్చుకొనెదను.
అనిలేచి తిన్నగా సుబ్బరాయఁడు సిద్ధాంతిగారి యింటికిఁ బోయి చావడిలో పీటమీఁద గోడకుఁ జేరగిలబడి కూరుచుండియున్న యాయ నకు నమస్కరించి, దేహము స్వస్థముగా నున్నదాయని రాజశేఖ రుఁడుగారు కుశలప్రశ్నము చేసిరి.
సుబ్బ__కొంత వఱకు నెమ్మదిగా నున్నది. నా రోగము ప్రబలముగానుండి నేను తెలివితప్పి యున్నయప్పుడు, నా సొత్తు నపహరింప వలెనని నా జ్ఞాతు లందఱును జేరి నాకు సన్యాసమిప్పించి నారు. నా రెండవ పెండ్లి భార్య కాపురమునకు వచ్చి యాఱునెల లయినది. దానితో పట్టుమని యొక సంవత్సరమైన సౌఖ్యమనుభవింప లేదు. నా దేహము బలపడఁగానే యింటసహిత ముండనీయక నన్ను తఱిమి వేయుదురు.
రాజ__జరిగిపోయినదానికి విచారించిన ఫలమేమి? మీరిక సంసారసుఖములను మఱచి, మీరున్న యాశ్రమమునకు ముఖ్యముగా గావలసిన ప్రణవమును జపించుకొనుచు ముక్తిమార్గమును జూచుకొండి.
సుబ్బ__నేనిప్పుడు సర్వసంగములను విడిచియున్నాను. నేను మీకుఁ జేసిన యపకారమును మఱచి నన్ను మన్నింపవలెను.
రాజ__మీరు నాకేమి యపకారము చేసినారు?
సుబ్బ__చేసినపాపము చెప్పినఁబోవునని పెద్దలు చెప్పుదురు. మీరు మొన్న సీతనిచ్చి వివాహముచేసి నతఁడు ధనవంతుఁడుకాఁడు. ఆతఁడు శోభనాద్రి రాజుగారికి ముండలను తార్చువాఁడు. అతఁడు ధరించిన వస్త్రములు మురుగులు మొదలయినవి రాజుగారివే, రాజుగారీ యంత్రమును పన్ని నన్ను మీ దగ్గరకుఁ బంపిన నేనువచ్చి కార్య సంఘటనము చేసినాను. ఇంతకును దైవసంకల్ప మట్లున్నది కాబట్టి కార్యము జరిగిపోయినది. మీరన్నట్లు జరిగిపోయినదానికి విచారించిన ఫలములేదు.
రాజ__శోభనాద్రిరా జంతటి దుర్మార్గుcడా? ఆతని సంగతి నేను మొదట దర్శనమునకు వెళ్ళినప్పుడే తెలిసినది. ఈ కపటము తెలియక రూపాయలు చేతిలోఁ బెట్టినప్పుడు నామీఁది యనుగ్రహము చేతనే యిచ్చుచున్నాఁ డనుకొన్నాను. రామరాజు ధర్మమా యని వివాహము కాకపోఁబట్టి సరిపోయినది కాని, లేకపోయిన యెడల నిష్కారణముగా పిల్లదానిగొంతుక కోసినవార మగుదుమే.
సుబ్బ__వివాహము కాదని మేలువార్త విన్నాను. నిశ్చయమైనకార్య మెట్లు తప్పిపోయినది?
రాజ__మా జ్ఞాతి యొకఁడు కాలము చేసినట్టు మయిల వర్త మానము వచ్చినందున మీరు పెట్టిన లగ్నమున శుభకార్యము కాలేదు. మరల క్రొత్త ముహూర్తమును పెట్టించుకొని రమ్మనియే యా దుర్మార్గుఁ డిప్పు డు నన్ను మీ వద్దకుఁ బంపినాఁడు.
సుబ్బ__ఆ పాపకర్మని మాఁట యిఁక నాతోఁ జెప్పకుఁడు. ఆ పాపాత్ముని ప్రేరణమువలన మీ యింట ముహూర్తము పెట్టిన నాఁడే నాకు రోగ మారంభమైనది. కాబట్టి మీ యెడలచేసిన మోస మునకు శిక్షగా భగవంతుఁడు నాకీ యాపదను దెచ్చిపెట్టినాఁ డనుకొని వివాహము కాకమునుపు రోగము కుదిరెనా మీతో నిజము చెప్పి వేసి పాప పరిహారము పొందవలెనని కోటి వేల్పులకు మ్రొక్కుకొన్నాను. ఆలాగునను కుదిరినది కాదు, అటు తరువాత "వారిజాక్షు లందు వైవాహికములందు బ్రాణవిత్తమానభంగమందుఁ జకిత గోకు లాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు నఘము పొంద డధిప॥"అను శుక్రనీతిని దలచుకొని వివాహకార్యమునకై కల్లలాడితిని గదాయని కొంత మనస్సమాధానము చేసికొన్నాను. ఈ నీతిని బట్టియే యెవ్వ రును మీతోఁ బద్మరాజు విషయమై ప్రస్తావించినవారు కారు.
రాజ__ఇప్పుడే పోయి యీ సంగతి శోభనాద్రిరాజు నడిగి యనవలసిన నాలుగు మాటలు మొగముమీఁదనేయని వేసివచ్చెదను.
ఆని వెంటనేపోయి శోభనాద్రిరాజు వీధిగుమ్మములో నిలు చుండియుండగా జూచి "మీరేమో గొప్పవా రనుకొని మీ మాటల నమ్మి మోసపోయినాను.మీతో నింతకాలము స్నేహము చేసినందుకు, నా కొమార్తెను నిర్భాగ్యునకిచ్చి వివాహము చేయించు కొఱకా ప్రయత్నము చేసినారు?" అని నిర్భయముగాఁ బలికి రాజశేఖరుఁడు గారు వెనుకకు మరలిరి. శోభనాద్రిరాజు మరలఁ బిలిచి "మావద్దఁ బుచ్చుకొన్న రూపాయలనిచ్చి మఱిపొమ్ము' అని నిలువఁబెట్టెను. "మీరిచ్చిన రూపాయలును నా యొద్ద నున్న రూపాయలును కూడఁ గలిపి వానితో వివాహమునకు వలయు వస్తువులనెల్ల కొన్నాను. ఇప్పుడు నాయొద్ద రొక్కములేదు; చేతిలో నున్నప్పు డిచ్చెదను" అని వెళ్ళిపోవుచుండఁగా, శోభనాద్రిరాజు తన భటులచేత రాజశేఖ రుఁడుగారిని పట్టి తెప్పించి చెఱసాలలోఁ బెట్టించెను. ఆ సంగతి మాణిక్యాంబకు తెలిసినది మొదలుకొని పెనిమిటికి సంభవించిన యాపదను దలంచుకొని నిద్రాహారములు మాని సదా యీశ్వర ధ్యానము చేయుచు లోలోపల దుఃఖించి కృశించుచుండెను.
ఈ సంగతి జరిగిన మూడవనాఁడు సూర్యోదయమయిన తరువాత సీత వీధిగుమ్మములో నిలుచుండఁగా నెవ్వరో యిద్దరు మను ష్యులు వచ్చి, "మీయన్నగారు పిఠాపురమునుండి వచ్చి యావలి వీధిని కరణముగారి యింటిలోఁ గూరుచుండి నిన్నక్కడకు దీసికొని రమ్మ న్నాఁడు"అనిచెప్పి సీతను దీసికొనిపోయి యూరుబయటనుండి యెత్తు కొని పారిపోయిరి. ఈ దుఃఖవార్త మాణిక్యాంబకుఁ దెలిసినతోడనే భూమిమీఁదపడి మూర్చపోయి కొంతసేపటికిదెలిపి పెనిమిటియొక్కవియోగమునకుఁ బుత్రికాశోకము తోడుపడ నెవ్వరెన్నివిధములఁ జెప్పినను మానక కన్నీరు కాలువలుగట్ట విలపించుచుండెను.