రాజశేఖర చరిత్రము (ఎమెస్కో)/పండ్రెండవ ప్రకరణము
పండ్రెండవ ప్రకరణము
రామరాజు సాయమున సుబ్బరాయఁడు సీతను వెంటఁబెట్టుకొని వచ్చుట__రామరాజు చెఱసాలలో రాజశేఖరుడుగారిని చూచుట__రాజశేఖరుఁడు గారి కారాబంధవిమోచనము__ శోభనాద్రి రాజును శిక్షించుట__సుబ్బరాయఁడు రుక్మిణియయి తన వృత్తాంతమును చెప్పుట.
పెద్దాపురమునకు అయిదారుక్రోసుల దూరములో జగ్గమపేట యను గ్రామమొకటి కలదు. సీత నెత్తుకొని పోయిననాఁడు మధ్యాహ్నము రెండు జాములవేళ గ్రామకరణముయొక్క యింటివద్ద కెవ్వరో వచ్చి తలుపు తీయమని కేకలు వేసిరి. అప్పుడు పదునాలుగు సంవత్సరముల ప్రాయముగలిగి మిక్కిలి యందగాఁడై యేహేతువు చేతనో తలపెంచుకునియున్న చిన్నవాఁ డొకఁడు లోపలనుండి వచ్చి తలుపుతీసి యెందుకు వచ్చినారని యడిగెను. ఆక్కడ నిలుచుండి యున్న యిద్దరు మనుష్యులలో నొకఁడు "బ్రాహ్మణ కన్యకకు డబ్బు పుచ్చుకొని యన్నము పెట్టెదరా" యని యడిగెను. ఆ చిన్నవాఁడు వెలుపలికి వచ్చి చూచునప్పటికి, ఎనిమిదేండ్ల యీడుగల యొక చిన్నది యరుగుమీఁదఁ గూరుచుండి క్రిందు చూచుచు వెక్కివెక్కి యేడ్చుచుండెను. ఆ మనుష్యులలో నొకఁడు చేరువ నిలుచుండి యూరకుండుమని యదలించుచుండెను. ఆ చిన్నవాఁ డట్లు వెలుపలికి వచ్చి తమ మొగమువంకఁ దేఱిపాఱఁ చూచుచుండుటఁగని ఆ మనుష్యు లిద్దఱును మీ పేరేమని యడిగిరి. ఆతఁడు సుబ్బరాయఁడని చెప్పి, యా చిన్నదాని మొగమును నిదానించి కొంచెముసేపు చూచి యిట్లనియెను; సుబ్బ__ఈ చిన్నది యెవరు? మీ రెక్కడనుండి తీసికొని వచ్చినారు? ఎక్కడకు తీసికొని పోయెదరు?
మను__మాది కాకినాడ, ఈ చిన్నది మా గ్రామకరణము కూతురు. పేరు సీతమ్మ. అప్పగారి యింటిలో పెద్దాపురమున నుండఁగా, తండ్రియింటికిఁ దీసికొనిపోవుచున్నాము. అక్కడకు వచ్చుట కిష్టములేక రాగములు పెట్టుచున్నది.
సీత__కాదు కాదు నన్ను వీం డ్రెత్తుకొని పోవుచున్నారు.
సుబ్బ__పెద్దాపురమునుండి కాకినాఁడ కీయూరు త్రోవకాదే. ఆ చిన్నది చెప్పినమాటే నిజమని తోఁచుచున్నది.
ఈ ప్రకారముగా ప్రశ్నోత్తరములు జరుగుచుండగా, వెనుక నుండి యెవ్వరో యేమఱుపాటున వచ్చి సీతయొద్ద నిలుచున్నవానిని జుట్టుపట్టుకొని వంగఁదీసి వీపుమీఁద వీసెగుద్దులను మణుగు గుద్దులను దబదబ వర్షములాగున కురిపించెను. అదిచూచి రెండవవాఁడు సీతను తన మిత్రునిని విడిచిపెట్టి పరుగెత్తుటలోఁ దనకుఁగల సామర్థ్యము నంతను జూపెను. ఆ క్రొత్తగా వచ్చినాతఁడును "పోనీకు పోనీకు" మని చేతిలోనివానిని వదలివేసి పరుగెత్తుచున్న వానివెంటఁబడెను. అదే సమయమని రెండవవాఁడు గూడ రెండవవైపునకుఁ పరుగెత్తి పరుగులో మొదటివానికంటె దిట్టమయినవాఁడని పేరు పొందెను. ఆ మనుష్యుని కొంతదూరము వఱకుఁ దఱిమి, క్రొత్త మనుష్యుడు మరల సీతయున్న చోటికి వచ్చెను.
సీత__రామరాజుగారూ! నన్నా దొంగలనుండి విడిపించినారు గదా! ఇక మా అమ్మయొద్దకు తీసికొనిపోయి యొప్పగించరా?
రామ__అమ్మాయీ! ఏడ్వబోకు నేను సాయంకాలములోగా నిన్నుఁ దీసికొనిపోయి మీ యింటికడ నొప్పగించెదను.
సుబ్బ__రాజుగారూ! ఈ చిన్నదాని తల్లిదండ్రు లెక్కడ నున్నారు? వారు చిరకాలము నన్ను కన్నబిడ్డవలెఁ జూచినారు.
రామ__అట్లయిన మీరీ చిన్నదాని నెఱుఁగుదురా?
సుబ్బ__ఎఱుఁగుదును. ఈ చిన్నది రాజశేఖరుఁడుగారి రెండవ కొమార్తె. ఈ చిన్నదియు నేనును నీమె యన్నగారును నన్యోన్యమును సోదర భావమును నుండెడివారము: అందులో ముఖ్య ముగా నీ చిన్నదాని యప్పగారును నేనును తానే నే నన్నట్లు భేదము లేక యుండెడివారము. ఈ చిన్నది నన్ను మఱచిపోయినట్లున్నది.
రామ__ఈ చిన్నదాని తలిదండ్రు లిప్పుడు భీమవరములో నున్నారు. వారివలన మీరంత యుపకారమును పొందియున్నయెడల, ఈ చిన్నదానిని గొనిపోయి జననీ జనకులకడఁ జేర్చి వత్తము, దారి తోడుగా వచ్చెదరా?
సుబ్ర__ఆవశ్యముగా వచ్చెదను. నేను లోపలికిఁబోయి యీ సంగతిని మా వాండ్రతోఁ జెప్పి వచ్చువఱకును నిమిష మిక్కడ నిలువుండి.
ఆని సుబ్బరాయఁడు లోపలికిఁబోయి యింటివారితో సంగతి యంతయుఁ జెప్పి మా చిన్నదానిని భీమవరములో దిగబెట్టి సాధ్యమయినంత శీఘ్రముగానే తిరిగి వచ్చెదనని చెప్పెను. వారు వలదని యనేక విధములఁ జెప్పినను విననందున వారందఱును వీధి గుమ్మము వరకును వచ్చి 'నాయనా! వేగిరము రావలెను జుమీ!' యని మఱిమఱి చెప్పిరి. రామరాజాచిన్న వాని సౌందర్యమున కాశ్చ ర్యపడుచు, ఇంతటి చక్కదనము స్త్రీలయందుండిన నెంత రాణించునని తనలోదాను తలపోయుచుండెను. అతఁడు వచ్చిన తోడనే రామరా జాచిన్నదానిని బుజముమీఁద నెత్తుకొని సుబ్బరాయ నితో మాటాడుచు భీమవరము మార్గముపట్టి నడవనారంభించెను.
రామ__మీరు బ్రాహ్మణు లయ్యును, ఆ ప్రకారముగా తల పెంచుకొన్నారేమి?
సుబ్బ__వెంకటేశ్వరులకు మొక్కున్నది. ఆ మొక్కును బట్టియే తొడుగుకొన్న యంగీ మొదలగు వస్త్రములను భోజనము చేయునప్పుడు సహితము తీయకుందును; బట్టలు మాసినప్పుడు సహితము రెండవవా రెఱుఁగకుండ మహారహస్యముగా నొక గదిలో నుతికిన బట్టలను కట్టుకొనుచుందును. ఈ వ్రతము నేఁటివఱకు దైవానుగ్రహమువలన సాగివచ్చుచున్నది. రామ__ఈ వ్రతము మిక్కిలి చిత్రముగా నున్నది. ఇటువంటి వ్రతము నే నీవఱకు వినియు కనియు నెఱుఁగను.
ఈ విధముగా మాటలు చెప్పుకొనుచు వారు దీపములు పెట్టిన నాలుగు గడియలకు భీమవరమునకు సమీపమున నున్న యొక చిన్న పల్లె ను జేరిరి; ఆక్కడనుండి త్రోవ మంచిది కాక పోవుటచేతను, రెండు దినముల క్రిందట నా యూరి బయటనే పెద్ద పులి యొక మనుష్యుని నెత్తుకొని పోయినదని వినుటచేతను, చీకటిలో వారిని నడిపించుకొని పోవుట యుక్తము కాదని రామరాజు వారి నా గ్రామములో నొక కాపువాని యింటఁ బరుండఁ బెట్టెను. ఆ పల్లెలో బ్రాహ్మణులు లేరు గనుక వారా రాత్రి భోజనము చేయకపోయినను, రామరాజు కోమటి యింటికి వెళ్ళి యటుకులను దెచ్చి వరున్న యింటి వాండ్రకు పాడియౌటచేత చెంబెడు చిక్కని మజ్జిగ యడిగి పుచ్చుకొని వారి కిద్దఱికిని బెట్టెను. వానితో క్షుత్తు నివారణమైనందున వారును బస వాండ్రిచ్చిన తుంగ చాపమీఁద పడుకొని హాయిగా నిద్రపోయిరి. రామరాజు జాము రాత్రియుండగానే వారిని లేపి తనతోగూడ దీసి కొని బయలుదేఱి రెండు గడియలలో భీమవరము చేర్చి, యూరి బయటకు రాఁగానే తానావరకు మఱచిపోయిన గొప్ప సంగతి యేదో తనకప్పు డకస్మాత్తుగా జ్ఞప్తికి వచ్చినట్టు నటించి తొందరపడి తనకు వెంటనే వెళ్ళక తీరనిపనియున్నదని చెప్పి వారికి త్రోవచూపి తాను ప్రక్కదారిని పోయెను. వారిద్దఱును దారి యడిగి తెలుసుకొనుచు కొంత దూరము కలిసి వచ్చిరి. సీత తా నెఱిగియున్న వీధికి రాఁగానే సుబ్బరాయని వెనుక దిగవిడిచి పరుగెత్తుకొనిపోయి యొక సందులో నుండి మరలి తిన్నఁగా నింటికిఁబోయి చేరెను. సుబ్బ రాయఁడు చీకటిలో సీతపోయిన సందును కనిపెట్టలేక తిన్నగా వీధి చివరదాఁక నడచి యిల్లు కనుగొనలేక గ్రామములో తిరుగుచుండెను. సీత వెళ్ళి వీధి గుమ్మము వద్ద పిలువఁగనే మంచముమీఁద పరుండి నిద్రపట్టక విచారించుచున్న మాణిక్యాంబ త్రుళ్ళిపడిలేచి పరుగెత్తుకొని వచ్చి తలుపు తీసెను. తలుపు తీసినతోడనే సీత తల్లిని కౌఁగిలించు కొని పెద్ద పెట్టున నేడ్చెను. మాణిక్యాంబయు దుఃఖము పట్టఁజాలక కొంతసేపు తానుకూడ నేడిచి తన పైఁట చెఱఁగుతో కొమార్తె కన్నులనీళ్ళ తుడిచి నిన్నఁటి నుండియు నెక్కడకుఁ బోయితి వనియు నింత చీకటిలో నొక్కతెవు నెట్లురాఁ గలిగితి వనియు సీత నడిగెను. ఆ క్రిందటి దినము ప్రొద్దుననే తన్నిద్దఱు దొంగలెత్తుకొని పోవుటయు, రామరాజును మఱియొక చిన్నవాఁడును తన్ను విడిపించి తీసికొని వచ్చుటయు, రామరా జేదోపనియున్నదని యూరి వెలుపలిదాఁక వచ్చి వెళ్ళిపోవుటయు,సీత చెప్పెను. అప్పు డారెండవ చిన్నవాఁ డేమయినాఁడని తల్లి యత్యాదరముతో నడిగెను. తనతో గూడ పయి వీధివఱకును వచ్చినాఁడనియు, అతఁడు పూర్వము తమ్మందఱి నెఱిగినవాఁడే యనియు, కొంచెము సేపటికెల్ల నిచ్చటికి వచ్చుననియు కూఁతురు బదులు చెప్పెను. ఈ ప్రకారముగా మాణిక్యాంబ సీతను తొడమీఁద గూరుచుండఁ బెట్టుకొని మాటాడు చుండఁగానే సూర్యోదయమాయెను. అప్పడు వీధి గుమ్మములో నెవ్వరో “రాజశేఖరుఁడుగారి బస యొక్కడ?" అని యడిగిరి. ఆ మాట విని యది రుక్మిణి కంఠమువలె నున్నదని యొడిలోనుండి సీతను దింపి మాణిక్యాంబ వీధి గుమ్మములోని కొక్కయంజవేసి యెవరువా రని కేకవేసెను. అప్పుడు సుబ్బరాయఁడు మాణిక్యాంబను జూచి, "అమ్మా' యని కౌగిలించుకొని బోరున నేడువ మొదలుపెట్టెను. అంతట వారందఱును గలిసి లోపలికిఁ బోయిరి.
చెఱసాలలో పెట్టఁబడిన దినముననే రాజశేఖరుఁడుగారు వ్యసనపడుచు నొకచోటఁ గూరుచుండి యుండఁగా ఏబది సంవత్సరములు దాఁటిన కారాబద్ధుఁ డొకఁ డామార్గమున కాళ్ళ సంకెళ్ళతోఁ బోవుచు రాజశేఖరుడుగారి మొగము వంక గొంత తడవు చూచి యాయన సమీపమునకు వచ్చి కూరుచుండెను.
రాజ__నీపే రెవరు?
కారా__నా పేరు పాపయ్య; మా యింటిపేరు మంచిరాజు వారు. నన్నెక్కడనై న జూచినట్టు జ్ఞప్తియున్నదా? రాజ__మీ మొగ మెక్కడనో చూచినట్టే యున్నది కాని యెప్పుడు చూచినానో మాత్రము స్మరణకు రాలేదు. మంచిరాజు పద్మరాజు మీకేమగును?
పాప__నన్ను మీరు నల్లచెఱువు వద్ద జువ్విచెట్టు క్రిందఁ జూచినారు. నే నప్పడు బైరాగి వేషముతో నున్నందున, నన్నానవాలుపట్టలేక పోయినారు. పద్మరాజు నా కొమారుఁడు.
రాజ__మునుపటియవస్థ పోయి మీ కింతలో నిప్పటికీ దశ యెట్లు వచ్చినది?
పాప__నేనీ శోభనాద్రిరాజుతో స్నేహముచేసిన దోషము చేత, నా కీతనిమాట వినవలసి వచ్చినది. ఈ రాజు దారులుకొట్టుటకై నలుగురిని తోఁడిచ్చి నన్ను వారికి నాధునిగాఁ జేసి నల్ల చెఱువునకు పంపెను. వెనుక కోయ రామిరెడ్డియు వాని మనుష్యులును పట్టుకోబడి రాజుగారిచే చెట్ల కొమ్మలకు ఉరితీయబడిన తరువాత మేమే ప్రబలులముగానుండి రెండు మాసములు త్రోవలు కొట్టటలోఁ బ్రసిద్ధిగాంచితిమి. దోచుకొని తెచ్చిన సొమ్ములో సగము శోభనాద్రిరాజు పుచ్చుకొనుచుండెను. మిగిలిన సగములోను సగము నా వంతునకు వచ్చుచుండెను. మెట్టు సొమ్ములో నాలవ పాలును తక్కినవారు నలువురును సమభాగములుగా బంచుకొను చుండిరి. నేను యోగివలె నటింపు చుందును; నాతోడ నున్నవారు దూరముగా నడవిలోఁ బగలెల్ల నుండి రాత్రులు వచ్చి మాటాడి పోవు చుందురు, పగలు వారికేమయిన వర్తమానము చేయవలసివచ్చి నప్పుడు, గుడిసెలో గాపురమున్న కోయవానిని బంపుచుందును; వానికి బ్రత్యేకముగా నేనే జీతమిచ్చెడివాఁడను.
రాజ__ఆప్పుడు విల్లును అమ్ములను బుచ్చుకొని మాతో వచ్చినవాఁడు వాడేకాఁడా?
పాప__ఆవు నాబానపొట్టవాఁడే, మీ నిమిత్తమై పంపిన నాఁటి రాత్రియే యా నలుగురిలో నొకఁడు చంపఁబడినాఁడు. రాజు గారి కేలాగునఁ దెలిసెనోకాని మఱునాఁడు తెల్లవారక మునుపే రాజ భటులు కోయవానిని కొట్టినందున వాడు తక్కిన వారుండు స్థలమును జూపఁగా వారిని సహితము పట్టుకొని మమ్మందఱను రాజుగారియొద్దకు తీసికొని వచ్చిరి. ఆయన మమ్మందఱను చెఱసాలయందుఁ బెట్టించెను; మా కందఱకు శిక్ష కలిగినను మేమీ రాజు పేరు చెప్పినవారము కాము కాబట్టి మమ్మీతఁడు చెఱసాలలో స్వేచ్చగా తిరుగుట కంగీ కరించి మిక్కిలి ప్రేమతో జూచుచున్నాడు.
రాజ__అట్లయిన శోభనాద్రిరాజు మీ కెంతో యుపకారమే చేయుచున్నాఁడు.
పాప__ఏమి యుపకారము? ఈ దుర్మార్గుని మూలమున చెఱసాలలో బడి బాధపడుచున్నాను. రాజుగా రెప్పుడో యాతని దురార్గతను దెలిసికొని యాతనిని కూడ మాకు సహాయునిగా నిందే యుంతురు. అటుపిమ్మట మఱియొక కారాగృహాధికారి వచ్చినప్పుడు మాపాట్లు దైవమునకుఁ దెలియగలవు.
రాజ__మీ కొమారునకు పిల్లనియ్యనందునకే సుమీ నన్నితఁ డిందు బెట్టించినాఁడు.
పాప__అవును. నేనెఱుఁగుదును.మీరు రాజు దగ్గఱ నుండగా పద్మరాజును పిలిపించినప్పడు వాఁడు నా వద్దనే యున్నాడు. అది యంతయు నేనును మావాఁడును రాజును సిద్ధాంతియుఁ గలిసి చేసిన యాలోచనయే అయినను మీ దినములుబాగుండి మా యాలోచన కొన సాగినదికాదు. శోభనాద్రిరా జెక్కడికోగాని నాతోఁగూడ నల్లచెఱువు వద్ద నుండిన వాండ్ర నిద్దఱిని సంకిళ్ళూడదీయించి పంపదలఁచు కొన్నాఁడు.
రాజ__ఎక్కడకో మీకుఁ దెలియలేదా?
పాప__తెలియలేదు. ప్రొద్దున నాతో నేమో యాలోచించుటకు వచ్చినప్పుడు రాజుగారి తమ్ముఁ డిక్కడకు వచ్చినందున రాత్రి చెప్పెదనవి వెళ్ళిపోయినాఁడు. నేను మీకు పూర్వము గొప్ప యపకారము చేసితిని; దానికి మాఱుగా నిప్పు డుపకారము నొకదానిని జేసెదను. పెద్దాపురపు రాజుగారు బహు యోగ్యులు: శోభనాద్రిరాజు మిమ్మిట్లు నిర్బంధ పెట్టుచున్న సంగతి మనవి వ్రాసికొన్న యెడల మిమ్ము తక్షణమే విడుదల చేయుదురు. కాగితము మొదలయినవి నేను తెప్పించి యిచ్చెదను.
అని పాపయ్య కాగితమును కలమును తెప్పించి యిచ్చెను. తోడనే రాజశేఖరుఁడుగారు విజ్ఞాపనపత్రిక నొకదానిని వ్రాసి మడఁచి జిగు రంటించి పయిని చిరునామా వ్రాసియియ్యఁగా పాపయ్య యొక మనుష్యునిచేత దానిని రాజుగారి కంపెను. కాని యాయనయొద్దనుండి యొక యుత్తరువుగాని విమర్శ చేసి న్యాయము దయచేయు సూచనలు గాని రెండు మూడు దినములు కడచినను రాలేదు. రాజబంధువు మీఁదజేసిన విన్నపము గనుక బదులు రాదని రాజశేఖరుఁడుగా రూరకుండిరి.
సీత నెత్తుకొనిపోయిన మఱునాఁడు ప్రొద్దుననే రాజుగారు చెఱసాలను జూచుటకు వత్తురని యచట నొక వదంతి కలిగెను. తరువాత గొంచెము సేపటికి రామరాజు రాజశేఖరుఁడుగా రున్న తావునకు వచ్చెను.
రాజ__రామరాజుగారూ! నా తప్పును క్షమింపవలెను. మీ రా రాత్రి జాబును తెచ్చియిచ్చుటయే నాకు మహోపకారమయినది. నేను సంగతిని తెలిసికోలేక మిమ్ము నిష్కారణముగా కానిమాట లాడి నాఁడను.
రామ__మీకు నేను జేసియున్న యుపకారమునకు నన్నటు వంటి మాట లనవలసినదే. ఇక నెప్పుడును మేలుచేయకుండ మంచి బుద్ధి చెప్పినారు.
రాజ__నాయందు కరుణించి మీ రాసంగతిని మఱచిపొవలెను. మంచి సంబంధము చెడిపోయెఁగదా యని యాసమయములో నొడలు తెలియక యేమో యన్నాను. నన్ను మన్నింపుడు.
రామ__రాజుగారు చెఱసాలను జూడ బయలుదేఱినారట. నేను వేగిరము పోవలెను.
అని రామరాజు వెళ్ళిపోయెను. తరువాత రెండు గడియలకు వెండిబిళ్ళ బంటొకఁడువచ్చి రాజుగారు కొలువుతీర్చి కూరుచుండి, రాజశేఖరుఁడుగా రేమో విన్నపము వ్రాసినందునకయి పిలుచుకొని రమ్మన్నారని చెప్పి, ఆయనను వెంటఁబెట్టుకొని పోయెను. ఆయన వెళ్లునప్పటికి సమస్తాభరణ భూషితు లయి రాజుగారు రత్నసింహాసనము మీఁద గూరుచుండియుండగా, నేత్రహస్తులు పసిఁడిబెత్తములను చేతఁబూని ముందు నిలుచుండిరి. చామరధరు లిద్దఱు ప్రక్కల నిలుచుండి వింజామరలు వీచుచుండిరి; భటు లాయుధపాణులై పార్శ్వములను నిలుచుండిరి; ఒక ప్రక్కను శోభనాద్రిరాజు చేతులు జోడించుకొని నిలుచుండెను; రెండవప్రక్కను మఱి యిద్దఱు మనుష్యులు చేతులుకట్టుకొని నిలువఁబడి యుండిరి; రాజశేఖరుఁడుగారు వచ్చి యెదుట నిలువఁబడగానే కృష్ణజగపతిమహారాజులుగారు "మీ రీ శోభనాద్రిరాజుగారి మీఁద నేమైన మా పేర మనవిచేసుకొన్నారా?"అని యడిగిరి. రాజశేఖరుఁడుగారు తన మీఁది కేమివచ్చునో యని భయ పడుచు, శరీర మంతయు కంపమునొంద నోరు మెదల్చక యూర కుండిరి.
కృష్ణ__శోభనాద్రిరాజా! నీవీ రాజశేఖరుఁడుగారి విషయ మయి చేసిన యక్రమపు పను లన్నియు మాకుఁ దెలియవచ్చినవి. నీకు చనవరిగానున్న తుచ్ఛునకు తన కొమార్తె నియ్యనన్న మాత్ర మున, నీ వాయనను పట్టి చెఱసాలయందుఁ బెట్టుటయేకాక చెఱసాలలో నున్న వాండ్ర నిద్దఱను విడిచిపుచ్చి యాచిన్నదాని నెత్తుకొనిపోవునట్లు ప్రేరేపించితివి.
శోభ__ఆ చిన్నదాని నెవ్వరెత్తుకొని పోయినారో నాకేమియు దెలియదు.
కృష్ణ__నీకుఁ దెలియకపోయిన యెడలఁ జెఱసాలలో నున్న వీండ్రిద్దఱును నెట్లువెలుపలికిఁ వెళ్ళఁగలిగిరి?
శోభ__వీండ్రిద్దఱును నిన్నటియుదయకాలమున గోడదాటి పాఱిపోయినారు. నేనప్పటినుండియు వీండ్రను బట్టుకొనుటకు భటులను బంపి వెదకించుచున్నాను.
కృష్ణ__ఏమిరా, గురవా! మిమ్మాయన యెక్కడికయిన పంపినాఁడా? లేక మీరే గోడదూకి పాఱికిపోయినారా? గుర__మహాప్రభూ! నిన్న ప్రొద్దున మమ్మిద్దఱును పిలిచి యీరాజుగారు చిన్నదానిని రవణక్కపేట కెత్తుకొనిపోయి, యక్కడ పద్మరాజున కొప్పగించవలసిన దని యాజ్ఞాపించినారు.చిన్నది రాగానే దొంగతనముగా పెండ్లియాడుటకై పద్మరాజు ముందుగానే పోయి యక్కడ నున్నాఁడు.
శోభ__కాదు కాదు, ఈ దొంగలంజకొడుకులు పాఱిపోయి, తప్పించుకొనుటకయి యీలాగున బొంకుచున్నారు.
గుర__ఈ రాజు దొంగల గురువు. మునుపు మా చేత దారులు కొట్టించి తిన్నగా మాసొమ్ము మా కియ్యక సకలమయిన చిక్కులు పెట్టినాఁడు. ఈ బ్రాహ్మణుని దోచుకొనుటకు వచ్చి మే మారాత్రి యాయనమూలముగా పడ్డపాట్లు తలఁచుకొన్న నిప్పటికిని మాకు దుఃఖము వచ్చుచున్నది.
కృష్ణ__వెనుక నీప్రకారముగా దారులు దోపించినావా?
శోభ__లేదు లేదు, ఈ విధవ కొడుకు లబద్దమాడుచున్నారు.
గురు__మా మాట లబద్దమేమో పాపయ్యగారిని పిలిపించి విచారింపవచ్చును. ఇప్పడాయన యీ చెఱసాలలోనే యున్నాడు.
కృష్ణ__ఓరీ పాపయ్యను పిలుచుకొనిరా.
కొంతసేపటికి పాపయ్య వచ్చి రాజుగారు నిజము చెప్పిన యెడల శిక్ష తగ్గించెదమని వాగ్దానముచేసినందున మొదటి నుండియు నాతని చర్యయంతయు నేకరువుపెట్టెను. అందుమీద శోభనాద్రిరాజు మాఱు పలుక నోరురాక క్రింద చూచుచు మిన్నకుండెను. రాజుగారి మొగము పోలికయు కంఠస్వరమును రామరాజువానివలె నున్నందున, రాజశేఖరుఁడుగారు దేహమంతయుఁ జెమర్ప దిగ్భ్రమము నొంది యూరక తెల్లబోయి చూచుచుండెను. అప్పుడు రాజుగా రాయన వెలవెల పాటును తత్తరమును గనిపెట్టి సింహాసనమునుండి దిగి వచ్చి చేయి పట్టుకొని, వెనుక రామరాజను పేరునఁ బలుమాఱువచ్చి యోగక్షేమం బుల నారయుచు వచ్చినది తామే యనియు, వెంటనే సహాయముచేయు టకు శక్తిగలిగి యుండియు బ్రవర్తనమును బరీక్షించుటకయి యింత కాలము పేక్ష చేసితిమనియు చెప్పి, వెంటనే కారాబంధ విమోచనము చేయించిరి. రాజశేఖరుడుగారు కొంతసేపేమి పలుకుటకును తోచక కొంత భయము తీఱినవెనుక మెల్లగా యెలుగు తెచ్చుకొని, గద్దద స్వరముతోఁ "దేవరవారిస్థితి తెలియక సామాన్య మానవునిగా నెంచి యగౌరవముతోఁ జూచి నందునకును సీత వివాహ కార్యమునకు భంగము కలిగెనన్న కోపమున దూషణ వాక్యములు పలికినందున కును క్షమించి రక్షింపవలయు" నని బహుదీనత్వముతో వేడు కొనిరి. ఆ విషయమునఁ దమకెప్పడును మనసులో మఱియొకలాగున లేదని చెప్పి, రేపు పెద్దాపురమునకు వచ్చి తమ్ముఁ జూడవలసినదని సెలవిచ్చి రాజుగా రాయన నింటికిఁ బంపిరి.
ఆయన వెళ్ళిన తరువాత రాజుగారు శోభనాద్రిరాజును బిలిచి యాతఁడు చేసిన నేరమున కెంత గొప్పదండనమునో విధింపవలసి యున్నను దయారసము పెంపున నెలదినములు మాత్రము చెఱసాలలోనుండ శిక్ష విధించి భటుల వశమున నొప్పగించిరి.అంతేకాక సీత నెత్తుకొని పోయినవారిని తాను పట్టి తెప్పించినప్పుడు నిజము చెప్పిన యెడల శిక్షలో గొంతభాగము తగ్గింపఁబడునని వాగ్దానముచేసి యుండుటంబట్టి వాండ్ర శిక్షలో సగము తగ్గించుటయేకాక మంచిరాజు పాపయ్యకు సహితము సగము శిక్ష తక్కువ చేసిరి. ఈ కార్యము లన్నిటిని జక్క బెట్టుకొని శ్రీకృష్ణజగపతి మహారాజాలవారు భద్ర గజారూఢులయి, వందిమాగధులు బిరుదు పద్యములు చదివి కొని యాడ, భేరీ మృదంగాది వాద్యములు బోరుకొలుప, చతురంగబల సమేతులయి తమ రాజధానికి విజయంచేసిరి.
రాజశేఖరుఁడుగారింటికి వెళ్ళునప్పటికి మాణిక్యాంబ పడమ టింటి గోడకుఁ జేరఁగిలఁబడి గూరుచుండి తల వంచుకొని సుబ్బ రాయునితో నేమో చెప్పచుండెను. రాజశేఖరుఁడుగారు గుమ్మము వద్దకు వెళ్ళి, ఆ చిన్నవాని ముఖ లక్షణములను పలుకుబడియు రుక్మిణిని పోలి యున్నందున నాశ్చచర్యపడి చూచి పురుషుఁడయి యున్నందున నేమని నిశ్చయించుటకు తోచక విభ్రాంతితో నాతని మొగమువంకనే ఱెప్పవేయక చూచుచు లోపలికి రాక యచ్చటనే నిలుచుండిరి. ఇంతలో సీత గుమ్మములోనుండి తొంగిచూచి, "అమ్మా! నాన్నగారు వచ్చినా" రని కేకవేసి వెళ్ళి తండ్రిని కౌఁగలించుకొనెను.
అంతట మాణిక్యాంబ పరమానందభరితురాలయి వెంటనే లేచివెళ్ళి కాళ్ళు కడుగుకొన నీళ్ళు తెచ్చియిచ్చి పాదముల తడి తన పయిఁటచెఱఁగుతో నొత్తి కూరుచుండుటకయు గోడదఱిని పీట వేసెను. రాజశేఖరుఁడుగారు పీటఁమీద గూరుచుండి సీతను ముద్దాడి తొడమీద కూర్చుండబెట్టుకొనెను. అప్పుడు మాణిక్యాంబ సీతమ దొంగ లెత్తుకొనిపోవుటయు, రామరాజు మఱియొకరును వదలించి తెచ్చుటయఁ జెప్పెను. రాజశేఖరుఁడుగారు రామరాజు పెద్దాపురాధి నాధులయిన కృష్ణజగపతిమహారాజు లనియు, ఆయన ప్రజల క్షేమ మును కనుగొనుటకయ యట్టి మాఱువేషములలో సంచరించుచుందు రనియు, రామరాజను పేరున వచ్చి మనకు బహూకారములను జేసి తుదకు కారబంధవిమోచనము జేయించిరనియఁ జెప్పి, తన్ను విడిపించిన క్రమమును వివరించి కొంతసేపు నృపుని సద్గుణవర్ణనమును జేసెను. మాణిక్యాంబ రామరాజు దేశాధీశుఁడని విని యాశ్చర్య పడి, ఆయనయొక్క గర్వరాహిత్యమును పరోపకార శీలతను బహు భంగుల మెచ్చుకొనెను.
ఇట్లు మాటాడుచుండఁగానే సుబ్బరాయఁడు వచ్చి రాజశేఖరుఁడుగారి కాళ్ళమీఁదపడి "నేను రుక్మిణి" నని చెప్పెను. ఆయన సంతోషముచేత కొంతసేపు మాటాడలేక, తుదకు హృదయము పదిలపఱచుకొని లేచి పెద్దకుమార్తెనాలింగనము చేసికొనెను.అప్పుడు చచ్చిపోయినదనుకొనుచున్న కూతురు లేచి వచ్చుటచేత నాదంపతుల కిరువరకును కలిగిన సంతోష మింతింతయని చెప్ప శక్యముకాదు. ఆ సమయమున సీతకుఁ గలిగిన సంతోషమును పట్ట శక్యముకాక పోయెను. ఆ యుద్రేకము కొంత నిమ్మళపడినమీదట, ఆ వధూ వరులు తమ్మెడఁబాసినది మొదలుకొని నేటివఱకును జరిగిన వృత్తాం తమును సవిస్తరముగాఁ జెప్పుమని రుక్మిణి నడిగిరి. రుక్మిణి యీ ప్రకారముగా వినిపింప నారంభించెను:
"మనలను దొంగలు కొట్టిననాఁడు రాత్రి పిండి యారబోసినట్లు తెల్లగా వెన్నెల కాయుచుండఁగా నాకు మెలఁకువ వచ్చి చూతును గదా కటికి నేలను మహారణ్యమధ్యమునఁ బడియుంటిని; నలుదిక్కుల నెంతవరకుఁ జూచిన నెందు నెవ్వరును గనఁ గనఁబడలేదు; ఎక్కడను మనుష్యనంచారము కనబడలేదుగాని మృగములయెుక్కకూఁతలు మాత్రము చెవిలో వినఁబడసాగెను. ఇంతలో నొక వ్యాఘ్రము నా దగ్గరనుండియే పోయినది కాని నన్నుఁ జూడక చేరువ నున్న యొక మనుష్యుని మొండెము నీడ్చుకొని తొలగిపోయెను. దానిని చూచినతోడనే నా దేహము నాకు స్వాధీనము కాలేదు. కొంత తెలివివచ్చిన తరువాత మీరెవ్వరును లేకపోవుట చూచి, బ్రతికియున్న యెడల మీరు నన్నొంటిగా దిగవిడిచిపోరను నమ్మకమున మీరందఱును దొంగలచేత మరణము నొంది యుందురనియు ఘాతుక మృగము లేవియో మీ దేహముల నీడ్చుకొనిపోయి యుండవచ్చు ననియుఁ దలపోసి, చూడఁ జుట్టమును మ్రొక్క దైవమును గానక చావ నిశ్చయించుకొని, మరల నింతలో నాత్మహత్య దోష మనుబుద్ధి యొకటి పట్టుటచే కొంత జంకి మీలో నెవరయినను బ్రతికి యుండ వచ్చుననియు నొకవేళ మిమ్మందరను మరల జూచు భాగ్యము కలిగి నను కలుగవచ్చుననియు నూహ చేసి మరణప్రయత్నమును మాను కొని, లేచి నాలుగడుగులు నడచితిని, ఆక్కడ నెత్తుట దోఁగియున్న శిరస్సొకటియు దాని ప్రక్కను బట్టలమూటయుఁ గనఁబడఁగా, అంతటి యాపదలో సహితము దుర్వారమయిన తద్బాధకు సహింప లేక తినుటకందులో నేమయిన దొరకవచ్చునని యా మూటను విప్పి చూచితిని; అందు పురుషులు ధరించుకోదగిన వస్త్రాదులు మాత్ర మున్నవి. వానిని చూచినతోడనే చక్కని స్త్రీలు నిజవేషములతో వొంటరిగా దిరుగుట క్షేమకరము కాదు కాఁబట్టి పురుషవేషము వేసి కొని యేదో యొకగ్రామము చేరవలెనను నాలోచన తోఁచి యా వస్త్ర ములను గట్టుకొని యంగీని తొడిగికొని పురుష వేషమును ధరించి, నా పూర్వపు బట్టలతోఁ జేర్చి మూటగట్టి నా శరీరమున నున్న నగలను తీసి చెంగున ముడివైచుకొని బయలుదేఱి, యొక కాలిమార్గమున నడచి తెల్లవాఱువఱ కొక గ్రామము జేరితిని. ఆ గ్రామములో ఆ పూటకుండి, నగల నమ్మివేసి రొక్క మును జేర్చు కొని తలమీఁది దెబ్బ చేత బాధపడుచునె చేరువగ్రామమునకుఁ బోయి యక్కడ కొన్ని దినములుండి వైద్యము చేయించుకొని నిమ్మళించిన తరువాత బయలుదేఱి చుట్టుపట్ల గ్రామములలోఁ దిరుగుచు పూటకూటి యిండ్లలో భోజనము చేయుచు పదియేను దినముల క్రిందట జగ్గం పేటఁ జేరితిని. ఆ గ్రామకరణము ముసలివాఁడును పుత్రసంతానము లేనివాఁడును గనుక నన్నుఁజూచి ముచ్చటపడి తనపనికి నేను సాయముగా నుందునని యెంచి నన్నుఁ దనయొద్దనే యుంచుకొని యాదరించుచు నా ప్రవర్తనమునకు మిక్కిలి సంతోషించి తనకున్న యొక్క కుమార్తెను నాకిచ్చి వివాహముచేసి యిల్లఱిక ముంచుకోవలెనను నుద్దేశముతో నా కులగోత్రనామముల నడిగి తెలిసికొనెను. నేనక్కడ సుబ్బరాయఁ డను పేరున మిక్కిలి నమ్మకముగానుండి, మీరు విద్య చెప్పించిన మహిమచేత లెక్కలు మొదలైనవి వ్రాయుటలో దోడుపడుచుండి, నాకు వెంకటేశ్వరుల మొక్కుచేత మావారు తలపెంచుకొనునట్లు చేసినారనియు, ఈ వ్రత సమాప్తి యగువఱకును తలయంటుకోఁగూడ దనియు చెప్పి, యా వ్రతమునకు భంగము కలుగకుండఁ గాపాడెదమని వారిచేత ననిపించుకొని పురుషవేషము బయలఁబడకుండఁ గడుపుకొనుచు వచ్చితిని, అట్లుండఁగా నొక నాఁడు మధ్యాహ్నము సీతనెత్తుకొనివచ్చి యెవ్వరో యిద్దఱు మనుష్యులు భోజనము పెట్టించుటకై నేనున్న యింటికిఁ దీసికొని వచ్చిరి. అప్పుడు మనము దాహముతీర్చి బ్రతికించినరాజు వచ్చి వాండ్రను కొట్టి సాగ నంపెను. అంతట నాయింటివారివద్ద సెలవు పుచ్చుకొని నేనును రాజుగారును సీతను దీసికొని వచ్చితిమి. మీ యంతట మీరందఱును నన్నానవాలుపట్టి కనుగొనువఱకును నేను రుక్మిణినని మీతో నెవ్వరి తోను జెప్పకుండ నుండవలెనని మార్గము పొడుగునను తలఁచుకొని వచ్చితిని గాని, అమ్మను జూచిన తోడనే మనసు పట్టలేక లోపలినుండి దుఃఖము పొంగివచ్చి కౌగలించుకొని నా సంగతి జెప్పివేసితిని."
అని రుక్మిణి చెప్పిన తరువాత రాజశేఖరుడుగారు కొమార్తె యొక్క బుదికిని సాహస కార్యమునకును సంతోషించి యామెను కౌగలించుకొని మిక్కిలి గారవించెను. రుక్మిణియొక్క యీ చరిత్రమును విన్నవా రెవ్వరైనను, ఉన్నయూరిలో సహితము గడప దాఁటి పొరుగు వీధికైన నెప్పుడును పదచలనముచేసి యెఱుఁగనంత సుకుమారిగాఁ బెరిఁగిన పదునాలుగేండ్ల ప్రాయముగల ఒక్క ముగ్ధబాలిక అంతటి ధైర్యమును పూని సమయోచిత బుద్ధితో మంచి యుపాయము నూహించి పరుల కెవ్వరికిని భేద్యముకాని మాఱు వేషమును ధరించి లోకానుభవమువలన నాఱితేఱిన ప్రౌఢాంగనలకు సయితము కష్టసాధ్యమయినరీతిని ప్రచ్ఛన్నముగా నుండఁ గలిగిన దన్నవార్త నమ్మశక్యము కాకున్న దనవచ్చును. ఎవరు నమ్మినను ఎవరు నమ్మక పోయినను వాస్తవమును మఱుగు పఱచక చెప్పుట చరిత్రకారునికి విధాయక కృత్యము గనుక, జరిగిన సంగతినేమో జరిగినట్టు చెప్పుచున్నాను. పురాణ గాధలయందువలె మనుష్యులు లేడి రూపమును ధరించినారని కాని, పురుషులు కేవల స్త్రీలుగానే మాఱినారని కాని అసాధ్యమయిన సంగతి యిందేదియుఁ దెలుపఁ బడలేదు. ఆమె కిట్టి యద్భుత విధమున బ్రవర్తింపనేర్పినది యామె నాశ్రయించియున్న సరస్వతియే కాని స్వశక్తికాదు. విద్యా ప్రభావము నెఱిగినవా రెవ్వ రిట్టిదొక ఘనకార్యమని యాశ్చర్యపడుదురు?