రాజశేఖర చరిత్రము (ఎమెస్కో)/పదమూడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పదమూడవ ప్రకరణము


శంకరయ్య కాసుల పేరుతో వచ్చుట__ఆతఁడు తన తండ్రి వృత్తాం తమును వినిపించుట__వైష్ణవ గురువుల యూరేగింపు__నృసింహ స్వామియొక్క రాక__ఆతఁడు తన కథను జెప్పుట.

పైని చెప్పిన రీతిగా రుక్మిణియు తల్లిదండ్రులను మాటాడు కొనుచుండగానే పదునాఱు సంవత్సరముల యీడుగల యొక చిన్న వాఁడు వచ్చి బుజముమీఁది మూటను క్రిందఁ బడవైచి రాజశేఖరుఁడు గారి కాళ్ళమీఁదఁబడి 'అయ్యో మామయ్యా' యని యేడువ నారంభించెను.

రాజ__ఏమి శంకరయ్యా ఆఁడుదానివలె నాలాగున నేడ్చు చున్నావు? ఊరుకో.

శంక__మా నాయన పదియేను దినముల క్రిందట కాలము చేసినాఁడు. నేనప్పుడు గ్రామములో కూడ లేకపోయినాను.

రాజ__ఏమి రోగముచేత పోయినాఁడు? నీ వప్పుడు గ్రామములో లేక యెక్కడకు వెళ్ళినావు?

శంక__ఆతఁ డాత్మరోగముచేత పోలేదు; ఇల్లుకాలి పోయి నాఁడు. నేనా వఱకు పది దినముల క్రిందటనే నా సవతి తల్లిని తీసికొని యేలూరు వెళ్ళియుంటిని. నేనక్కడ నుండఁగా నాకీ వర్తమానము తెలిపినది.

రాజ__ఇల్లెందుచేత కాలిపోయెనో యాతడేల బయటకు రాకుండెనో నా కాసంగతి వివరముగాఁ జెప్పు.

శంక__మీరు గ్రామములో నుండఁగానే మా నాయన భూత వైద్యమునందు ప్రబలుఁడుగా నున్నాఁడు గదా? అటు తరువాత చుట్టప్రక్కల గ్రామములయందుఁగూడ అతని ప్రసిద్ధి వ్యాపించినది. ఎవ్వరి యింట నెవ్వరికి కొంచెము జ్వరము వచ్చినను మా నాయనను పిలిచి తీర్థమిప్పించుచుండిరి; ఎవ్వరికి కాలు కాసంత నొచ్చినను మా నాయనచేతనే రక్షరేకు కట్టించుకొనుచుండిరి; ఎవ్వరికి కొంచెము గాలిసోఁకిన దన్నను మా నాయననే పిలుచుకొని పోవుచుండిరి. ఎవ్వరు కొంచెము జడిసికొన్నను, మా నాయనచేతనే విభూతి పెట్టించు చుండిరి. వేయేల? చుట్టుపట్ల నేగ్రామములో నెవరికే జబ్బు వచ్చినను మా నాయనను పిలువని స్థలము లేదు. ఈ ప్రకారముగా జరుగుచుండుటచేత నెల్లవారును సమస్త వస్తువులను మా యింటికిఁ దెచ్చి భక్తి పూర్వకముగా సమర్పించుచుండిరి; ఎవ్వరి యింట శుభకార్యము జరిగినను ముందు కట్నము మా నాయనదిగానే యుండెను.

ఈ విధముగాఁ గొంతకాలము జరిగిన పిమ్మట నొకనాఁడు ప్రాతఃకాలమున మా నాయన వీధిలో నడచుచు, ఒక యీడిగవాని వాకిట కాయల గెలలతో నిండియున్న యొక కొబ్బరి చెట్టును జూచి ఆ యింటి వానిని పిలిచి తనకు నాలుగు లేఁత బొండములు పంపుమని యడిగెను. వాఁడు కొంచెము పొగరుఁబోతు గనుక సొమ్ము తెచ్చికొన్నచో కాయలనిచ్చెద నని మాఱుపలికెను. అందుమీఁద మా నాయన కోప దృష్టితో వానివంక నెఱ్ఱపాఱచూచి కాయల నియ్యవా యని గద్దించెను. నే నియ్యను, నన్నెఱ్ఱపాఱిచూచి యేమిచేసెదవో చూతమని వాఁడును వెనుకతీయక గట్టిగాఁ జెప్పెను. ఱేపీపాటికి నీ చెట్టేమగునో చూచుకొమ్మని తల యూఁచుచు మా తండ్రి యింటికిఁ బోయెను. దయ్యాలు పెట్టి చంపినప్పటిమాట చూచు కొంద మని వాఁడును లోపలికి నడచెను.

ఆ రాత్రి రెండు జాములవేళ మా తండ్రి గాఢ నిద్రలోనున్న నన్ను లేపి నాయుత్తరీయపు చెంగున గిద్దెడు బియ్యము మూటగట్టి కడుగుచెంబు చేతికిచ్చి తనతోఁగూడ రమ్మని చీకటిలో నన్ను దీసికొనిపోయెను. నేనును కన్ను కనబడని గాఢాంధకారములో నిశాసమయమున దారి తడవుకొనుచు మా తండ్రితో నీడిగ వాని యింటికడకుఁ జేరి నిలిచితిని. అప్పుడు న న్నక్కడ నిలువఁ బెట్టి మా నాయన కాలికి బందము వేసికొని కొబ్బెర చెట్టున కెగఁ బ్రాకి యొక కఱ్ఱతో దాని మొవ్వును చితుకఁబొడిచి యందు నేను దెచ్చిన బియ్యమును కడుగును బోసి చెట్టు దిగివచ్చి యా యర్ధరాత్ర మప్పుడు మరల నన్నుఁ దీసికొని యింటికి వచ్చి యారాత్రి సుఖ నిద్రచేసెను. మఱునాఁ డతఁడు తన్నుఁ జూడవచ్చిన వారితోనెల్ల “యిూడిగవాఁడు కొబ్బెరకాయ లియ్యకపోయినందున వానిచెట్టునకుఁ బ్రయోగము చేసితి" నని చాట మొదలుపెట్టెను. అందుకు దృష్టాంతముగా నాఁడు మొదలుకొని మొవ్వవాడి క్రమక్రముగా ఆకు లెండి పోయి నాలుగైదు దినములలో చెట్టు చచ్చెను. "తనకు కొబ్బెర కాయ లియ్యనన్న కోపముచేత బాపనవాఁడు నిష్కారణముగా నా కొబ్బెరచెట్టును దయ్యాలు పెట్టి చంపినాఁ" డని యూర నెల్లవారి తోను జెప్పుకొని యీడిగవాఁ డేడువ నారంభించెను. ఆ వార్త శీఘ్ర కాలములోనే చేరువ గ్రామములకును ప్రాకెను. అందుమీద నెల్ల వారికిని మా నాయన మీఁద నొక విధమయిన యసూయ కలిగెను.

ఆ పిమ్మట గ్రామములో నొకరికి రోగము వచ్చినప్పడు మా నాయన ప్రయోగము చేసినాఁడేమో యని కొందఱి కనుమానము కలిగెను. అందుచేత గ్రామములోనివారు తమ యింట రోగాదికము వచ్చినప్పుడు మునుపటంత తఱచుగా మా నాయనను పిలుచుకొని పోవ మానివేసినారు కాని యాతనిని పిలువకపోయిన నేమిచేసిపోవునో యని మనస్సులలో భయపడుచుండిరి. ఈరీతి నుండఁగా నొక కోమటివాని పిల్లవానికి రోగము వచ్చినప్పుడు, వాని తల్లియు ముత్తవయు వెళ్ళి సోదె యడుగంగా పేరంటాలు గుడియొద్దనున్న మాలది యా చిన్నవానికి గ్రామములోనివారే యొకరు ప్రయోగము చేసినారని చెప్పెను. అందుమీద వారిద్దఱు నేడ్చుచు నింటికివచ్చి యావత్సమాచారమును మగవాండ్రకు వినిపింపఁగా వాండ్రా ప్రయోగము చేసినవాఁడు మా తండ్రియే యని నిశ్చయించి భూతవైద్యులను పిలిపించి పలువిధముల పాట్లుపడిరికాని వచ్చిన రోగమునకు చికిత్స చేయించక పోయినందునను జ్వరబాధితుఁ డయి యుండఁగా భూత వైద్యులాతనిని పలుమాఱు స్నానములు చేయించుచు వచ్చినందునను వాయువుచేసి యాపిల్లవాఁడు కాలధర్మము నొందెను. అదిమొదలు కొని మా తండ్రి ప్రయోగములుచేసి యందఱను జంపుచున్నాడన్న నమ్మక మొకటి యూరనందఱికిని గలిగెను. ఆ నమ్మకమునకుఁ దోఁడు మునుపెప్పుడో గ్రామమున చచ్చినవారు తాము ప్రయోగము చేతనే చచ్చినామనియు, మీరు నిజమును కనుఁగొనలేక రోగమని భ్రమపడి తమ్ముఁ బోఁగొట్టుకొన్నా రనియు చెప్పుకొని యేడ్చు చున్నట్టు గ్రామములోని ముసలి మండలిద్దరు ముగ్గురు రోదనముల కారంభించిరి. ఆ కాలములో కామేశ్వరి మొదలైన యిల వేల్పులు గృహములోని విధవల కావేశమై యెవరికైన రోగము వచ్చినప్పడు ప్రయోగ మని యొకటి రెండుచోట్ల పలుకుచు వచ్చెను. ఈ యన్నికారణములచేతను గ్రామములో నెవ్వరి కేవిధ మయిన జబ్బు కలిగినను, అది యంతయు మా నాయన చేసిన ప్రయోగముచేతనే కలిగినదని జనులు భ్రమపడుచుండిరి. తానే దోషము నెఱుఁగనని మా నాయన యెన్ని విధముల ప్రమాణములు చేసి చెప్పినను. ఎవ్వరు నాతని మాటలను విశ్వసించినవారు కారు. జనుల పిచ్చి యేమందును? గ్రామములో మరణము నొందిన వారందఱును మా నాయనచేసిన ప్రయోగముచేతనే పోయి రని దృఢముగా నమ్మిరి; వ్యాధిగ్రస్తులైన వారందఱును మా నాయనయొక్క మంత్రశక్తిచేతనే బాధపడుచున్నారని తలఁచిరి. కాబట్టి యెల్లవారును కొంత కాలమునకు మా నాయనను గ్రామమున కొక మృత్యుదేవతనుగాఁ జూచుకొనుచుండిరి. మా నాయన పొడ గనఁబడినపుడెల్లను గ్రామములోని యాఁడువారు నెటి కలు విఱిచి తిట్టఁజొచ్చిరి; మగవాండ్రు కొఱకొఱలాడుచు మునుపటివలె మాటాడక యాతఁడు కనఁబడినపు డెల్లను తప్పించుకొని పెడదారిని తొలగి పోవుచుండిరి. ఇరుగు పొరుగుల నున్నవారు నిప్పు సహితము పెట్టమానివేసిరి; ఏ వస్తువు బదులు నిమిత్తము వెళ్ళినను లేదనుచుండిరి. పొరుగువారు తమ నూతిలో నీళ్ళు తోడుకొన వలను పడదనిరి. అందుచేత నీ ప్రకారముగా శత్రుమధ్యమున కాపురము చేయుట మా నాయన కెంతో భారముగా నుండి, ఇది యంతయుఁ దాను భూతవైద్యుఁడనని వేషము వేసికొనుట వలన గలిగిన పాప ఫలము గదా యని పశ్చాత్తాప పడిన కార్యములేక స్వయంకృతాపరాధమునకు నోరెత్తక యనుభవించు చుండెను. ఇట్లున్న సమయములో నొకసారి సవతితల్లికి దేహములో రుగ్ధత వచ్చినది; అప్ప డెందఱిని గాళ్ళుకడుపులు పట్టుకొన్నను ఒక్కరైనను పథ్యపానములు చేసి పెట్టుటకుఁ గాని నిద్రరాకుండ దగ్గఱ నుండి మాటలు చెప్పటకుఁ గాని వచ్చినవారు కారు; గ్రామములోనివా రెవ్వరును పథ్యపానమునకయి తమ నూతిలోనుండి నీళ్ళు సహితము తెచ్చుకోనిచ్చినవారు కారు; మీరు గ్రామమునుండి లేచివచ్చిన నాలవ నాఁడే మన గ్రామములో వైద్యుడుగా నుండిన నంబి వరదాచార్యులు పోయినాఁడు. నేతి రామయ్య మన యింట వంట బ్రాహ్మణుఁడుగా నుండి కంచు చెంబుల జో డెత్తుకొనిపోయి ముండ కిచ్చినందుకయి మీరు పని తీసివేసిన తరువాత వాడు మఱియెందునకును పనికిరానివాఁ డౌటచేత చదువులబడి పెట్టుకొని జీవనము చేయుచుండెను గదా!. వరదా చార్యులు పోఁగానే వైద్యము కూడ నారంభించి వాఁడిప్పడు గ్రామ మలో ఘనవైద్యుఁడయి యున్నాడు. మొదట వైద్య మారంభించి నప్పుడు క్రొత్త గనుక రోగముల నామములను ఔషధ నామములను మా నాయన చేతనే వ్రాయించుకొని యొఱ్ఱవియు నల్లనివియు నయిన కుప్పెలుచేసి తీసికొనివచ్చి యేమం దేరంగు గలదిగా నుండునో మా నాయన వలననే తెలిసికొని వానిమీద "పూర్ణచంద్రోదయము" "వాత రాక్షసము" మొదలయిన పేర్లను వ్రాసి యంటించినాఁడు. జీలకఱ్ఱ, మిరియములు మొదలయిన వస్తువులలో సిందూరము వేసి నిమ్మ కాయల రసముతో నూరి మా యింటనే మాత్రలు చేసి తీసికొని వెళ్ళు చుండెను అతఁడే యౌషధము నడిగినను తనయొద్ద లేదనక తులమునకు రూపాయ మొదలుకొని యిరువది రూపాయల వఱకును వెలగట్టి యిచ్చుచుండెను. ఆరంభ దశయందు వచ్చిన సొమ్ములో మా నాయనకుఁ గూడ భాగమిచ్చెడివాఁడు గాని తాను పెద్ద వైద్యుఁడని పేరు పొందిన తరువాతను మా నాయనకు గ్రామములోని వారితో విరోధము వచ్చిన తరువాతను భాగమిచ్చుట మానివేసినాడు. అట్టివాఁడు మా నాయన స్వయముగా వెళ్ళి తన భార్యకు జబ్బుగా నున్నదని బ్రతిమాలి పిలిచినను ప్రజలకు వెఱచి యొక్కసారి చేయి యయినను చూచి పోయిన వాఁడుకాఁడు. వేయేల? ఊరివారు పెట్టవలసిన నిర్బంధముల నన్నిటిని బెట్టిరి: చీఁకటి పడిన మీఁదట ఇంటిమీఁద బెడ్డలు వేయ నారంభించిరి. నన్ను భార్యకుఁ గావలిపెట్టి మా నాయనయే చెఱువుకు బోయి స్నానముచేసి నీళ్ళు తెచ్చుకొని వంటచేసి పగలు రెండు జాములకు పథ్యము పెట్టుచు, మీరయిన గ్రామములోనున్నఁ దన కింత యిబ్బంది రాదు గదా యని మీరు చేసిన యుపకారములను దలఁచు కొనుచు బహువిధముల విచారించెను. బహు ప్రయాసముమీఁద కొన్ని దినములకు మా తల్లికి వ్యాధి నిమ్మళించినదిగాని దేహములో బలము మాత్రము చేరినది కాదు. గ్రామములో విరోధ మంతకంతకు ప్రబలి నది. తెల్లవార లేచి చూచువఱకు, మా వీధి గుమ్మము నిండ నశుద్ధ పదార్ధములను మనుష్యుల పుఱ్ఱెలను పడియుండుచు వచ్చెను. మా తండ్రి వాని నన్నిటిని దీసివేసి నిత్యమును రెండుమూడు స్నానములు చేయుచు భార్య కుపచారముగ తిన్నగా జరగ నందున నన్నామెవెంట నిచ్చి సవారిమీఁద పుట్టినింటికి హేలాపురము పంపి, తానొక్కఁడు నిల్లు కనిపెట్టుకొని యుండెను.

బయలుదేఱిన మఱునాఁడు రాత్రి నాలుగు గడియల ప్రొద్దు పోయిన తరువాత మేము సుఖముగా పోయి యేలూరు చేరితిమి. అక్కడఁ గొన్నాళ్లన్నమీదట పథ్యము వంటఁ బట్టుటచేతను తల్లి దండ్రుల యాదరణ చేతను నా సవతి తల్లి దేహము స్వస్థపడినది. ఒక నాఁడు నేనును నా సవతి మేనమామయు నుదయ కాలమున దంతధావ నము చేసికొని వీధిలో రావిచెట్టు చుట్టును గుండ్రముగా రెండడుగుల యెత్తుగా వేయఁబడియున్న యరుగుమీఁదఁ గూరుచుండి యుంటిమి. నా సవతితల్లి తండ్రి రావిచెట్టునకు వేపచెట్టునకు పెండ్లి చేయించి వాని చుట్టును విశాలమయిన యా యరుగు వేయించినాఁడు, ఆ యరుగుమీఁద చెట్టు నీడను గూరుచుండి గ్రామ కరణ మెప్పుడును పని చూచుకొనుచుండును. అప్పుడు ముప్పది సంవత్సరముల యీడు గల యొక నల్లని శూద్రుఁడు తెల్ల బట్టలు కట్టుకొని చంక మూటను దగిలించుకొని వచ్చి మీరేమయిన కాసులు పేరు గొనియెదరా?"యని యడిగెను. మా సవతి మేనమామ "ఏదీ చూపు" మని యడిగెను. ఆ శూద్రుఁ డరుగుమీఁదఁ గూరుచుండి మూటను విప్పి కాసుల పేరు తీసి యాతని చేతి కిచ్చెను. ఆతఁడు చూచి వెల యడిగి నా చేతి కిచ్చి బాగున్నదేమో చూడమని చెప్పెను. నేను దానిని చేతఁ బట్టుకొని నిదా నించి చూచి, కొలికిపూసనుబట్టి యానవాలుపట్టి రుక్మిణిదని తెలుసు కొని “నీ కీ కాసుల పేరు ఎక్కడనుండి వచ్చే' నని వానిని బ్రశ్న వేసి తిని. వాడు నేను వర్తకుడను కాబట్టి మా యూరిలో నొకని చేత పట్టుతో కట్టించినా నని చెప్పెను. అందుమీఁద నే నాపేరు మా బంధువులదని చెప్పి, "యీ దొంగసొత్తు నీయొద్దఁ గనఁబడినది కాబట్టి నిన్ను రాజభటుల కొప్పగించెద"నని బెదరించితిని. వాఁడును జడియక కాసులపేరు మా యొద్దనే దిగవిడిచి, "ఠాణాకుఁబోయి మీరు చేసిన యక్రమమును జెప్పి, మిమ్ములను బట్టుకొని శిక్షించుటకు బంట్రోతు లను దీసికొని వచ్చెద"నని కేకలు వేయుచుఁ బోయి, నే నచ్చట రెండు దినము లున్నను మరల రానేలేదు.

మూడవనాఁడు ప్రాతఃకాలముననే యొక కూలివాఁడు ధవళేశ్వరము నుండి వచ్చి నారాయణమూర్తిగారు వ్రాసిన జాబు నొక దానిని నా చేతి కిచ్చెను. నేను దానిని పుచ్చుకొని విప్పి చూచుకొను నప్పటికి "మీ నాయన నేఁడే గృహము తగులబడి కాలముచేసినాఁడు. కాబట్టి తక్షణము బయలుదేఱి రావలసినది" అని యందు వ్రాసి యుండెను. పిడుగువంటి యా వార్త చూడఁగానే గుండెలు బద్ద లయి లోపలికిఁ బోయి యేడ్చుచు నా సవతి తల్లి కాదుర్వార్తను విని పించితిని; ఆ మాట విన్నతోడనే యామె నేలఁబడి కొప్పు విడిపోవ దొర్లుచు ఱొమ్ము చఱచుకొనుచు నిల్లెగిరిపోవునట్లు రోదనము చేయ నారంభించెను. ఆ యేడుపులును పెడబొబ్బలును కొంచెము చల్లా ఱిన తరువాత నామెకు ధైర్యము చెప్పి, ఆ కూలివానివెంట నాపూటనే బయలుదేఱి కాళ్ళు పొక్కు-లెక్కునట్లుగా తెల్లవాఱినఁదాఁక నడచి మఱునాఁడు పగలు రెండు జాముల వేళకు మా యిల్లు చేరితిని. అప్పుడా యింటికి గోడలు తప్ప మఱి యేమియు లేవు. చుట్టుపట్ల నొక యిల్లయిన కాలక వింతగా మాయెుక్క యిల్లు మాత్రము పరశు రామ ప్రీతి యయినది. నేనక్కడ విలపించుచుండఁగా నిరుగుపొరు గులవారు వచ్చి నన్నోదార్చి, నాలుగు దినముల క్రింద రాత్రి యాక స్మికముగా గృహమునకు నిప్పంటుకుని సాయము వచ్చులోపలనే కాలిపోయినదని చెప్పిరి. నేనంతట నారాయణమూర్తిగారి యింటికిఁ బోయితిని. ఆతఁ డావఱకే మా తండ్రికి దహన సంస్కారములు చేయించెను. మీ రా గ్రామమునుండి వచ్చినప్పటినుండియు మా నాయనయు నారాయణమూర్తిగారును ప్రాణ స్నేహము కలవారుగా నుండిరి. మీరు ధవళేశ్వరము విడిచిపెట్టిన నెల దినములకు నారాయణ మూర్తిగారి లోపల దొంగలు పడి యొక రాత్రి సర్వస్వము దోచు కొని పోయిరి. అందుచే నతఁడు మరల బీదవాడై మాతండ్రి ననుస రింపఁగా, భూత వైద్యములో తనకు సహాయునిగా నాతనిని త్రిప్పుచు భోజనము కేమయిన నిచ్చుచుండెను. మా నాయనకు గ్రామములో నందఱును శత్రువులుగా నేర్పడినప్పడు, నారాయణమూర్తిగారొక్కరే పరమ మిత్రుఁడుగా నున్నాడు. మీ బావమఱఁదికి గ్రామము లోనివారు తన సొత్తును దోచుకొని పోవుదురని భయము తోచినప్పడు ఒకనాఁటి రాత్రి రహస్యముగా నన్ను తోడు పట్టమని నగలను రొక్క మునున్న పెట్టెను నారాయణమూర్తిగారి యింటికిఁ గొనిపోయి అతని పడకగదిలోఁ బెట్టి లక్కతో ముద్ర వేసి పైన కప్పతాళము వేసి తాళపు చెవిని తన దగ్గఱనే యుంచుకొనెను. నారాయణమూర్తి నన్నుఁ జూచి మా నాయనను తలచుకొని యేడ్చునప్పడు, మా యొద్ద దాచు కొన్న నగల పెట్టెను గూడ మరణకాలమునకుఁ దీసికొనిపోతివా"యని యేడ్చెను. నేను పడక గదిలోకి వెళ్ళినప్పుడు పెట్టె యచ్చట లేదు; ఆ యింట మఱియొకచోటను గనఁబడలేదు. తరువాత మా తండ్రి చావును గురించి యడుగగా, నేను హేలాపురమునకు వెళ్ళినది మొదలుకొని వీధిలోనికి వచ్చిన నెవ్వరేమి చేసెదరో యను భీతిచేత మీ బావమఱఁది లోపల తలుపువేసికొని కూరుచుండుచు వచ్చెననియు, అట్లు రెండు మూడు దినములు జరిగిన పిమ్మట దామోదరయ్య లోపల తలుపువేసికొని కూరుచుండి యేమో పాతాళ హోమము చేయుచున్నాఁ డని గ్రామములో నొక వదంతి కలిగిన దనియు, ఆవల గ్రామములోని వారందఱును నాలోచించి యందఱకును కీడుగలుగుటకై యేదో మహా మంత్రమును పునశ్చరణ చేయుచున్నాఁడుకాని వేఱు కాదని నిశ్చయించి దానికి విఘ్నము కలిగించినఁగాని తమకు బ్రతుకు లేదని గోదావరి యొడ్డున సభ చేసినా రనియు, ఆ రాత్రియే యిల్లు కాలుట మొదలుగా గల పని యంతయు జరిగిన దనియు, ఆతఁడు చెప్పెను. నేనును పది దినముల కర్మయు జరిగినదాఁక వారి యింటనే యుండి, పదమూడవ నాడు బయలుదేఱరాదు గనుక పదునాలుగవనాడు కాసుల పేరుతో మీరున్న గ్రామమునకు రావలెనని వచ్చుచుండగా, త్రోవలో సిద్ధాంతి యగపడి రహస్యమని నన్ను దూరముగాఁ దీసికొనిపోయి మా నగల పెట్టెను నారాయణమూర్తి తమ యింట దాఁచుట చెప్పి తనకు నూఱు రూపాయలిచ్చెడు పక్షమున పెట్టె నాతని కియ్యక నిలిపియుంచెద ననియు, మీ మామగారిని చూచి వచ్చినతోడనే తగవుపెట్టవలసిన దనియుఁ జెప్పెను. నేనును మంచిదనీ చెప్పి మీకొఱకు వెదకు కొనుచు వచ్చితిని."

అని శంకరయ్య తన తండ్రి సంగతి యంతయుఁ జెప్పి మూఁటను విప్పి కాసుల పేరును దీసి రాజశేఖరుడుగారి చేతికిచ్చెను. ఆయన దానిని పుచ్చుకొని మేనల్లుని కౌగిలించుకొని యూరార్చాచు, దామోదరయ్య పోయినందుకుఁ గొంత తడవు విచారించెను; అప్పు డింటనున్నవా రందఱును దామోదరయ్య నిమిత్త మొకసారి రోద నముచేసి భోజనములు చేసిరి. ఆ మధ్యాహ్న మంతయు లోకవార్త లతో పొద్దు జరిగినది.

దీపములు పెట్టిన కొంతసేపటికి వాద్యముల చప్పడు వినఁబడి నందున రాజశేఖరుడు మొదలగువారందఱును వీథిలోనికి చూడవచ్చిరి. బలముగా ద్వాదశోర్ద్వపుండ్రములను ధరించి యొక వైష్ణవస్వామి పల్లకిలోఁ గూరుచుండి యిరుప్రక్కల నిద్దఱు వింజా మరలు వీచుచుండ కరదీపిక లనేకములు వెలుఁగ నూరేగుచుండెను. ఆ వెనుక కొందరు తెలగాణ్యులును నొక వైష్ణవుఁడును గంధములు పూసికొని తాళవృంతములతో విసరుకొనుచు నడచుచుండిరి. ఆ వైష్ణవుని రాజశేఖరుఁడుగా రెఱుఁగుదురు గనుక దగ్గఱకు పిలిచి యీ ప్రకారముగా ముచ్చటింప నారంభించిరి:

రాజ__మీరు ధవళేశ్వరములో నున్న గూడూరు వారికి గురువులు కారా?

వైష్ణ__అవును, ఆ పల్లకీలోఁ గూర్చున్నవారికీ గ్రామములో వారికి నవసరాలవారు శిష్యులు.

రాజ__వెనుక నేను చూచినప్పుడు మీరు గురువులుగాను, మీ కాయన శిష్యుఁడుగాను ఉండెడివారు కారా?

వైష్ణ__మాలో మా కటువంటి భేదము లేదు. నాకు శిష్యు లున్న గ్రామములో నతఁడు శిష్యుఁడుగాను, అతనికి శిష్యులున్న గ్రామములో నేను శిష్యుఁడుగాను మాఱుచుందుము. ఆయన తాతయు మా తాతయు సహోదరులు; వారి తండ్రి ప్రతివాది భయంకరము గండభేరుండాచార్యులవారు జకదేక పండితులు. వారు పరమపదమునకు వేంచేసిన తరువాత వారు సంపాదించిన శిష్యులను మా తాతలను తండ్రులను పాళ్ళు వేసికొని పంచుకొన్నారు. ఈ గ్రామములోని వారు మావాని వంతునకు ధవళేశ్వరములోనివారు నా వంతునకును వచ్చినారు. మా కాపురపు గ్రామమైన శ్రీకూర్మము విడిచి యీ ప్రకారముగా సంవత్సరమున కొకసారి శిష్యసంచారము చేయుదుము.

రాజ__వెనుక మీ రాయనకు చదువు రాదని చెప్పినారే, ఆయన శిష్యుల కేమి యుపదేశము చేయును?

వైష్ణ__ఆయనకెంత చదువు వచ్చునో నాకు నంతే వచ్చును. శిష్యుల కుపదేశించుట కేమి చదువు రావలెను? శిష్యుల కష్టాక్షరి చెవిలో నుపదేశించి నిత్యమును నష్ణోత్తర శతము జపము చేసికొమ్మని చెప్పి, గురువే దైవమని నమ్మి కొలిచిన వైకుంఠము కరస్థమని పలికి, బుజములమీఁద తప్తముద్రధారణము చేసి, మా గురుదక్షిణ పుచ్చుకొని మా దారిని మేము పోదుము. మే మెవ్వరితోను ప్రసంగించము గనుక మమ్మందఱును పండితులే యనుకొందురు.

రాజ__మీరీ గ్రామములో పది దినములు లుందురా?

వైష్ణ__ఉండము. రేపే వెళ్ళిపోయెదము. తరువాత సావ కాశముగా దర్శనముచేసి మాటాడెదను.

అని యాతఁడు పల్లకితోఁ గలిసిగొనుటకయి పరుగెత్తెను.

వారు వెళ్ళిన తరువాత వీధితలుపు వేసివచ్చి మగవారు రాత్రి భోజనమునకుఁ గూరుచున్నతోడనే యెవరో వచ్చి వీధి తలుపుకడ “రాజశేఖరుఁడు మామగారూ!"అని పిలవఁజొచ్చిరి. మాణిక్యాంబ నడవలోనికి వెళ్ళి "యెవరువార"ని యడుగంగా "నేను నృసింహ స్వామి’ నని వెలుపలినుండి యొకరు పలికిరి. ఆ మాట యొక్కధ్వనియు పేరును విన్నతోడనే మాణిక్యాంబ భయపడి తటాలున లోపలికిఁ పరుగెత్తుకొని వచ్చి యాసంగతి భర్తతోఁ జెప్పి,"నృపింహ స్వామి బోయి అన్నాళ్ళయినది; ఎప్పడును నాకీవలకు స్వప్నములో నైనను గనఁబడలేదు. ఇప్ప డీవిరుద్ధ మే'మని యాశ్చర్యపడఁ జొచ్చెను. ఇంతలో వీధితలుపువద్ద మరల గేకలు వినబడెను. అప్పుడు రాజశేఖరుఁడుగారు భోజనముచేసి దీపము వెలిగించుకొని పోయి తలుపు తీసిరి. తీయఁగా నిజముగా నృసింహస్వామియే 'మామా' యని పలుకరించి, ఆయన చేయి పట్టుకొనెను. ఆయన యల్లునిఁ బ్రత్యక్షముగాఁజూచినను నమ్మక మరల మరల దేహమును పట్టి చూచి, పాదములు వెనుకవైపునకు తిరిగియుండక తిన్నఁగానే యుండుటవలన మాయ కాదని నిశ్చయించి యాతనిని లోపలికిఁ దీసి కొనివచ్చి భార్యతో మన నృసింహస్వామియే వచ్చినాఁడని చెప్పి, కాళ్ళు కడుగుకో నీళ్ళిమ్మని తొందరపెట్టెను. ఆమెయు దీపము దగ్గ రగాఁ దీసికొనివచ్చి మొగము పాఱఁ జూచి "నాయనా" యని కౌఁగ లించుకొని కన్నీరు నించెను. ఆమెనుజూచి యల్లుఁడును కన్నుల నీరు పెట్టుకొనెను. ఆ యుద్రేకమంతయు నడఁగిన మీఁదట,నృసింహ స్వామి లేచి కాళ్ళు కడుగుకొని భోజనము చేయుచు తాను కాశీయాత్ర వెళ్ళుటయు దారిలో తన మిత్రుఁడు తన్ను విడిచి వచ్చుటయు మొదలుగాఁగల సంగతి నీప్రకారముగాఁ జెప్పనారంభించెను:

"నాకు చిరకాలమునుండి కాశీయాత్ర చేసిరావలెనని మనసులో కోరికయుండెనుగాని తగిన తోడు లేకపోవుటచేత నా కది దుర్లభమని యా తలఁపు విడిచిపెట్టితిని. ఇట్లుండఁగా నొకనాఁడు చామర్తి వారి చిన్నవాడు శేషాచలము నాయొద్దకు వచ్చి యెవ్వరితోను జెప్పనని నాచేతఁ తనచేతిలో చేయి వేయించుకొని రహస్యముగాఁ దనకు హిమవత్పర్వతముదగ్గఱ తపస్సుచేసి స్వర్ణవిద్యను గ్రహింపవలెనని కోరిక గలదనియు, నేనుకూడ వచ్చిన పక్షమున తనతో దీసికొని వెళ్ళి యా విద్య నుపదేశించెదననియు, మనమిద్దఱమును బంగారము చేయు యోగమును గ్రహించినమీఁదట మరల నింటికి వచ్చి కావలసి నంత బంగారమును జేసికొని కోటీశ్వరులము కావచ్చుననియు చెప్పెను. ఆ మాటలమీఁద మనస్సులో నాకును మిక్కిలి యాశపుట్టి, తప్పక బయలుదేరి సాధ్యమయినయెడల కాశీయాత్రకూడఁ జేసుకుని రావలెనని నిశ్చయించితిని. తరువాత మేమిద్దరమును బాఠశాలలో రహస్యముగా బ్రయాణము సంగతిని మాటాడుగొనుచు, బయలుదేఱ వలసిన దినము నిర్ణయము చేసికొని యాలోపుగానే బట్టలు మొదలగు వాని నొకచోట పదిలముగాఁ జేర్చి ప్రొద్దుననే భోజనముచేసి శాస్త్రుల వారియొద్దకుఁబోయి కావ్యములు చెప్పించుకొని వచ్చెదమని చెప్పి తిన్నగా నడచి మఱునాఁడు ప్రాతఃకాలమునకు పెద్దాపురము చేరితిమి. మేము బయలుదేఱిన నాఁటి క్రిందటిదినము నేను పుట్టినదినముగనుక నాఁడు మావాండ్రు పండుగుచేసి నాకు బంగరు కంటెయు మురుగులును బెట్టిరి. ఆ రాత్రి నేను మా తండ్రిగారి పెట్టెను మాఱు తాళపు చెవితో తీసి యందులో నున్న యేఁబదినాలుగు రూపాయలను మూట గట్టుకొని, మఱునాఁ డానగలతోను సొమ్ముతోను మేము గ్రామము విడిచితిమి, శేషాచలము తనతో మూడురూపాయలను మాత్రము పట్టుకొని వచ్చినాడు. త్రోవపొడుగునను మా యిద్దరకుఁ గావలసిన కర్చును నేనే పెట్టుచు వచ్చితిని. మేము జగన్నాధమును దాటి కట కము వెళ్ళునప్పటికి నాయొద్దనున్న రూపాయలన్నియు నైపోయినవి. కాఁబట్టి యక్కడ నా మురుగులను నలువది రూపాయలకు విక్రయించి మునుపటివలె నధిక వ్యయము చేయక యా సొమ్ముతోనే కాశి చేరితిమి. అతఁడు దారిపొడుగునను తాను వాడుకొనుట కేమైనను నిమ్మని యడుగుచు వచ్చెనుగాని నేను రూపాయకంటె నెక్కువగా నెప్పుడును చేతిలోఁబెట్టలేదు. అందుచేత నతఁడు నామీఁద కొఱ కొఱగానుండి తిన్నగా మాటాడక మొగము ముడుచుకొని యొక రీతిగాఁ బ్రవర్తించుచుండెను. మేము కాశి చేరునప్పటికి నావద్ద నాలుగు రూపాయలుండినవి; అవియు బది దినములలోనే వ్యయమయు పోయినవి. తరువాత నూటయేఁబది రూపాయలకు నా కంటెను సహితము కాశిలో నొక వర్తకున కమ్మివేసితిని. మేము మొట్టమొదట ననుకొన్నట్లు బంగారము చేయుటకు మాఱుగా మును పున్న బంగారమును సహితము పోగొట్టుకొనుచుంటిమి. శేషా చలము భోజనమునకుఁ దడవుకోనక్కఱ లేకుండా నా సొమ్ముతో నిర్విచారముగాఁ గాలక్షేపము చేయుచు, అంతతోనైనఁ దృప్తినొంది యుండక యెుకనాఁడు నాయొద్దకు వచ్చి తన కేబది లేదోపనికిఁ గావలసివచ్చినవి కాబట్టి యిమ్మని యడిగెను. నే నియ్యనని నిర్ధాక్షిణ్యముగాఁ దెలియఁజెప్పితిని. దానిపైని నాతో పోట్లాడి "కృతఘ్నుఁడ"వని నన్నుఁ దిట్టి విస్తరిలో వడ్డించిన యన్నమును సహితము తినక పగలు రెండు జాములవేళ లేచిపోయెను. నేను తరువాత నాలుగు మాసములు కాశిలో నివాసముగా నుండి, యింటి మీద బుద్ధి పుట్టినందున బయలుదేఱి వచ్చుచు నిన్నయుదమున మీ రిక్కడనున్న సంగతి తునిలో విన్నాను."

అని నృసింహస్వామి తన వృత్తాంతమును జెప్పినమీఁదట రాజశేఖరుడుగారు శేషాచలము చేసిన దురాగతము నాతనితోఁ జెప్పి భోజనమయిన తరువాత పక్కవేయించి యాతఁడు పరుండి నిద్ర పోయినమీఁదట తామును పరుండిరి.