Jump to content

రాజశేఖర చరిత్రము (ఎమెస్కో)/పదునాల్గవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదునాల్గవ ప్రకరణము


సుబ్రహ్మణ్యము పిఠాపురమునుండి వచ్చి తండ్రిని దర్శించుట__ శ్రీ శంకరాచార్యులవారి యాగమనము__నీలాద్రిరాజు సభలో తన వృత్తాంతమును జెప్పుట__కృష్ణ జగపతి మహారాజులు గారు రాజశేఖ రుఁడు గారి మాన్యములను విడిపించి యిచ్చుట.

సుబ్రహ్మణ్యము పిఠాపురమునుండి బయలుదేఱి, సొమ్ముతో నీలాద్రిరాజువెంట వచ్చుచున్న రాజభటులతోఁ గలిసి భీమవరమునకు వచ్చి, అక్కడనుండి వారిని పెద్దాపురము పొమ్మని తా నొక్కఁడును తిన్నగా నింటికిఁ బోయెను. అప్పుడు రాజశేఖరుడుగారు భోజనమునకు లేవఁబోవుచుండిరి, కొమారుడు వీధి గుమ్మములో నుండి లోపల నడుగు పెట్టగానే చూచి, అబ్బాయి వచ్చినాడని రాజశేఖరుడు గారు కేకవేపిరి. ఆ కేకతోనే "యేడీ యేడీ" యని లోపలి వారందఱును నొక్కసారిగా పరుగెత్తుకొని వచ్చిరి. ఆందఱి కంటెను ముందుగా సీత పరుగెత్తుకొని వచ్చి అన్నగారిని కౌగిలించుకొనెను. ఇంతలో మాణిక్యాంబ రాగా సుబ్రహ్మణ్యమామెను కౌగలించుకొని, తరువాత తల్లిదండ్రుల కిద్దఱికిని నమస్కారము చేసి వారిచేత నాశీ ర్వాదములను బొందెను. ఈ నడుమ నృసింహస్వామి వచ్చి సుబ్రహ్మణ్యము యొక్క చేయిపట్టుకొని "బావా!" యని పిలువగానే యతడాతని మొగమువంక దిరిగిచూచి మాటరాక యద్భుతపడి చూడ సాగెను. అట్లొక నిమిషము చూచి మఱఁది నాలింగనము చేసి 'యెప్పుడు వచ్చినా' వని యడిగి, మగడు జీవించి యున్నాడన్న వార్త విని సంతోషించుటకు రుక్మిణికి ఋణము లేకపోయెను గదా యని కన్నుల నీరు పెట్టుకొనెను. ఆంతట రుక్మిణి బ్రతికి యుండుటయు దొంగలు కొట్టిన రాత్రి నుండియు నామెకు సంభవించిన యాప దలును తుదకు సుఖముగా నిల్లుచేరుటయుఁ జెప్పి, రాజశేఖరుఁడు గారు కొమారుని నూరార్పఁజొచ్చిరి. ఆ మాటలు ముగియకమునుపే సంతోషము పట్టలేక సుబ్రహ్మణ్యము లోపలికిఁబోయి రుక్మిణి నాలింగ నము చేసికాని యామె తన్నుఁజూచి కంటఁ దడి పెట్టుకోగా నూఱడించెను. ఈవలకు వచ్చిన తరువాత నృసింహస్వామి తన కథను సాంతముగా వినిపించెను. పిమ్మట నందఱును స్నానములుచేసి యుతికిన మడుగుదోవతులు కట్టుకొని భోజనములకడఁ గూరుచుండిరి. భోజన సమయమున సుబ్రహ్మణ్యము పిఠాపురములో రాజుగారి లోపల దొంగల పడుటయు దొంగలను తాను పట్టుకొన్న రీతియు దొరికిన సొత్తులో బైరాగి యెత్తుకొనిపోయిన తమ సొమ్ముకూడఁ గనఁబడుటయు విమర్శన నిమి త్తమయి కృష్ణజగపతి మహారాజుగారి యొద్దకుఁ బంపఁబడిన దొంగలతోఁగూడఁ దన్నిచ్చటకుఁ బంపుటయు జెప్పి, యిక్కడనుండి వెళ్ళినతోడనే తనకొక మంచి యుద్యోగము నిచ్చెదమని పిఠాపురపురాజుగారు వాగ్దానము చేసియున్నారని చెప్పెను. అప్పుడు రాజశేఖరుఁడుగారు "మన యింటికి రాకపోకలు చేయుచు వచ్చిన రామరాజే కృష్ణ జగపతి మహారాజుగా" రని చెప్పి, ఆయన యద్భుత చర్యలను తమకుఁ జేసిన యుపకారమును నామూలాగ్రముగా వినిపించి యాయనను పొగడిరి. ఇంతలో భోజనము లైనందున లేచి చేతులు గడుగుకొని తాంబూలములు వేసికొని తెల్లబట్టలు కట్టుకొని రాజశేఖరుడుగారును సుబ్రహ్మణ్యమును బయలుదేఱి నృసింహస్వామిని వెంటఁ బెట్టుకొని పెద్దాపురమునకు బ్రయాణమయి మయి పోయిరి.

వారు పెద్దాపురము చేరి రాజవీధిని ప్రవేశింపఁగానే యావీధినే దూరమున నొక పల్లకియును దానిముందొక యెనుగును రెండు గుఱ్ఱములను బండిమీఁద నొక భేరియును మఱికొన్ని వాద్యములను వెనుకను స్వస్తివాచక బృందమును దృగ్గోచరమయ్యెను. ఆ యాడంబరము చూచి రాజశేఖరుఁడుగా రాదిన మేదో దేవతోత్సవము కాబోలు ననుకొని, కుమారునివంకఁ జూచి యా యుత్సవము శివుని దయియుండునా విష్ణునిదయియుండునా యని యడిగిరి. సుబ్ర__ఆది దేవుని యుత్సవము కాదు. శ్రీశంకర భగవత్పాదులవా రీపట్టణమునకు వేంచేసి యుందురు. వారు నెలదినములనుండి పిఠాపురములో నివాసము చేసియున్నారు. నేను బయలు దేఱినప్పుడే వారును ప్రయాణమయి యీ పట్టణమునకు రావలెనని బండ్లు మొదలగు వానిని వాకిట నిలువఁబెట్టి యుండగా జూచితిని.

రాజ__అక్కడ భిక్షలు విశేషముగా జరిగినవా?

సుబ్ర__మిక్కిలి చక్కగా జరిగినవి. వారింటింటికిని శ్రీముఖములను వ్రాసి తలకొక రూపాయవంతున పోగుచేసినారు. అదిగాక యనేక వితంతువులును ధనవంతులను పళ్ళెరములలో పండ్లను రూపాయలను వేసికొనివెళ్ళి పాదపూజకని సమర్పించుకొనుచు వచ్చిరి. వారు సాష్టాంగ నమస్కారము చేసినప్పు డెల్లను స్వాములవారు 'నారాయణ' యనుచు రాగా, చేరువ నుండు శిష్యులు పళ్ళెములోని వానిని జాగ్రత్తచేసి వట్టి పళ్ళెములను వారివి వారికి మరల నిచ్చుచుండిరి. గ్రామమునందలి వైదికు లందఱును జేరి రెండు భిక్షలు చేసినారు; లౌక్యుల యిండ్లలో నాలుగు భిక్షలు జరిగినవి; తక్కిన దినములలో కోమట్లు బ్రాహ్మణ గృహమున భిక్షలు చేయించుచు వచ్చిరి.

రాజ__నీ వెప్పుడయిన వెళ్ళి పీఠదర్శనము చేసినావా?

సుబ్ర__రెండుమూడు పర్యాయములు చేసినాను. పీఠము నిలువెడెత్తున నున్నది; దానినిండను బహువిధములైన విగ్రహములును సాలగ్రామములును నున్నవి. వెండి పువ్వుల పీటమీఁదఁ గూరుచుండి పట్టుశాటి కట్టుకొని స్వాములవా రెప్పడును కుంకుమముతో పీఠపూజ చేయుచుందురు. ఆ పీఠములో స్త్రీ యంత్రముకూడ నున్న దనియు, వారు పూర్వాశ్రమమునందు సహితము స్త్రీ విద్యో పాసకులే యనియు విన్నాఁడను. అది సత్యమౌనో కాదో కాని వారిప్పుడు మాత్రము రాత్రులు చీకటిలో ముసుఁగువేసికొని యొక మనుష్యుని వెంటఁబెట్టుకొని ప్రత్యక్షమయిన స్త్రీయుపాసనము చేయుటకె బయలుదేఱుచుందు రని చూచిన వారే యొకరు నాతో రహస్య ముగాఁ జెప్పినారు. మొన్న నీనడుమ నొక శిష్యుఁ డెత్తుకొని పాఱి పోయినది గాక, యింకను పీఠమునకు రెండువేల రూపాయల వెండి సామాగ్రి యున్నవి.

రాజ__వారు గ్రామములో నున్నకాలములో మత సాంకర్య నివారణముగాని మత వ్యాపనముగాని చేయుటకేమయినఁ బ్రయత్నము చేసినారా?

సుబ్ర__అట్టి పను లేమియు చేయలేదు గాని యొక్క ఘన కార్యమును మాత్రము చేసినారు. ఆ గ్రామములో ధనవంతురాలయిన యొక బాల విధవ యున్నది. ఆమె యేమో భ్రూణహత్య చేసినదని గ్రామములోని సభాపతులు కొంద ఱామెను జాతినుండి బహిష్కారము చేసిరి. తరువాత నామె జగన్నాధసంతర్పణము చేసినప్పుడు ధనమున కాశపడి కొందఱు బ్రాహ్మణులు భోజనములు చేసిరి అందుచేత నక్కడకు భోజనములకు వెళ్ళినవారందఱు నొక కక్షగాను, వెళ్ళని వారందఱు నొక కక్షగాను నేర్పడిరి. లోకమున కెల్లను ధనమె మూలమగుటచేతను, ఆమె లక్షవత్తుల నోము మొదలయిన వ్రతములు చేసి యప్పుడప్పుడు బ్రాహ్మణ సమారాధనములు చేయుచు వచ్చుచుండుట చేతను, క్రమక్రమముగా సంఖ్యయం దామె పక్షము వారే బలపడి మొదట వెలివేసిన వారికే యిప్పుడు వెలిగా నుండెను. తరువాత స్వాములవారు విజయంచేసి యా రెండు పక్షముల వారిని సమాధానపరచి, ఆమెయెుద్ద తాము రెండువందల రూపాయలను స్వీకరించి యామెకు పుట్టువెండ్రుకలు తీసివేయించి, ఆ కేశఖండన మహోత్సవ మయిన మరునాడే యామె యింట భిక్షచేసి ముందుగా తాము హస్తోదకము పుచ్చుకొని తరువాత బ్రాహ్మణుల కందఱకును నిప్పించి నాటితో నామె వెలి తీర్చివేసిరి.

రాజ__ఆ స్వాములవారు పూర్వాశ్రమములో నే గ్రామ నివాసులు?

సుబ్ర__వారి నివాసస్థలము ముంగొండయగ్రహారము. ఆయనకు నలుగురు కొమాళ్ళున్నారు. ఆశ్రమమును స్వీకరించిన తరువాతనే స్వాములవారు మునుపు మాన్యముల మీఁద నున్న ఋణములను దీర్చివేసి నలుగురు కొమాళ్ళకును వివాహములు చేసి కోడండ్ర కొక్కొకరికి రెండేసి వందల రూపాయల యాభరణము లుంచినారు. ఇప్పు డీ స్వాములవారి పేరు శ్రీ చిదానంద శంకర భారతీస్వామి యఁట.

అని మాటాడుకొనుచు వారు రాజసభకుఁ బోవునప్పటికి రాజు గారు కొలువు కూటమునకు విజయంచేసి సింహాసనాధిష్టితులై కూరు చుండి యుండి మంత్రి తెచ్చియిచ్చిన విజ్ఞాపన పత్రికలను జదివి చూచుకొని పిఠాపురమునుండి వచ్చిన దొంగలను తమ యెదుటఁ బెట్టుట కుత్తరువు చేసిరి. ఈ లోపల రాజశేఖరఁడుగారును సుబ్ర హ్మణ్యమును నృసింహస్వామియు సభ ప్రవేశించి తగిన చోటులఁ గూరుచుండిరి; రాజభటులను దొంగలను గొనివచ్చి ప్రభువు నెదుర నిలువఁబెట్టి తాము ప్రక్కలను కత్తులు దూసికొని నిలుచుండిరి. అప్పుడు రాజుగారు సభ కలయఁజూచి "యీ దొంగలను పట్టుకొన్న వారెవరని ప్రశ్న పేసిరి. సుబ్రహ్మణ్యము లేచి నిలువఁబడి 'నేను' అని మనవి చేసెను, తోడనే ప్రభువువారు రాజశేఖరుడుగారి వంక దృష్టి బరపి"యీతడు మీ కొమారుఁడు కాఁడా" అని యడిగి"చిత్త" మని యాయన బదులు చెప్పఁగా విని యెడమప్రక్కను గూరుచున్న వారెవరని మరల నడిగిరి. రాజశేఖరుఁడుగారు చేతులు కట్టుకొని నిలుచుండి యిూతఁడు తమ యల్లుఁడగుటయు గిట్టనివాఁ డొకఁడు ఆతఁడు వారణాసిపురముననున్న కాలములో వచ్చి మృతుఁ డయ్యెనని వట్టి ప్రవాదము వేయుటయు రుక్మిణి దొంగలచేత దెబ్బతిని మూర్ఛపోయె యుండఁగా తన్నందఱును దిగవిడచిపోయిన తరువాత మూర్చ తేఱి పురుష వేషము వేసికొని సీత నెత్తుకొని పోయిన గ్రామమునుండి చెల్లెలితోఁ గూడ వచ్చుటయు సమగ్రమముగా విన్నవించిరి. రాజు గారు హర్షమును దెలుపుచు శిరఃకంపము చేసి, కొంతసే పూరకుండి యావంక దిరిగి 'మీరేమి చెప్పుకొనెద'రని యడిగిరి.

నీలా__సర్వమును దెలిపిన దేవరవారికడ మేము వేఱుగ చెప్పుకోవలసిన దేముండును? మేము నిరపరాధులమని చెప్పఁబోము. దేవరవారు దయాపూర్ణ హృదయులు గనుక ఆ దయారసమును మామీఁదఁ బ్రసరింపజేయ దీనత్వముతో వేడుకొనుచున్నాము.

కృష్ణ__నీది యే దేశము? చిన్నప్పటినుండియు నీ వెక్కడ నున్నావు? నీ చరిత్ర మేమి?

నీలా__నా చరిత్రము మిక్కిలి యద్భుతమయినది. నేను దానిని చెప్పుకొనుటకు సిగ్గుపడవలసి యున్నను దేవరయంతటివా రడుగుచున్నారు గాన దాఁచక విన్నవించెదను. ఈవఱకు నేను జేసిన దుష్కృత్యము లన్నిటిని తీఱిక కలిగియున్నప్పడెల్ల నాకు స్మరణకుఁ దెచ్చి నా మనస్సు పలువిధముల నన్ను బాధించుచున్నది; రాత్రులు నన్ను నిద్రపోనీయదు; కలలో సహితము నేను జేసిన ఘోర కృత్యములకు రాజభటులు నన్నుఁ గొనిపోయి శిక్షించుచున్నట్టు కనఁబడి యులికి పడుచుందును. అంతేకాక నాకిప్పుడు వార్ధకము వచ్చియున్నది, కాబట్టి చిరకాలము బ్రతుకఁబోను. ఆ సంగతిని తలఁచుకొను నప్పు డెల్ల నాకు యమభటులవలని భయముచేత దేహము కంపమెత్తు చున్నది. రాజ దండనను పొందినవారికి యమదండన లేదని పెద్దలు చెప్పుదురు. కాబట్టి నేను చేసిన పాపమునకు మీవలన శిక్షను బొంది సుఖింపఁ గోరుచున్నాను.

కృష్ణ__నీ చరిత్ర మంత యద్భుతమయిన దయ్యెనేని, ససాకల్యముగా వినిపింపుము. ఇచ్చట నున్న వారందఱును విని యానందించెదరు.

నీలా__నా జన్మస్థానము కాళహస్తి. నా తల్లిదండ్రు లంతగా ధనవంతులు కాకపోయినను శూద్రకులములలో మిక్కిలి గౌరవమును కాంచిన వంశమునందుఁ బుట్టినవారు. నా తల్లిదండ్రులకు నేనొక్కఁ డనే పుత్రుఁడను గనుక నన్ను వారు మిక్కిలి గారాబముతోఁ బెంచు చుండిరి. నేనేది కావలెనన్నను తక్షణము తెచ్చిపెట్టుచుండిరి. అయి దేండ్లు వచ్చిన తరువాత నన్నొకనాఁడు చదువవేసి, పంతులకు దోవతుల చాపును గట్టఁబట్టిరి. ఆ పంతు లేవిధమునను దనకు జీవనము జరగనందున పీనుగుల మోచు వ్యాపారమునఁ బ్రవేశించి ముసలివాఁ డయి తాను చిన్నప్పుడైనను చదువు కొన్నవాఁడు కాకపోయినను తుదకు చదువుల బడిని జీవనోపాధిగా నేర్పరచుకొని మా గ్రామమును జేరెను. ఆతఁడు చెప్పెడు చదువొక్క ముక్కయైనను లేకపోయినను గొట్టెడి దెబ్బలు మాత్ర మక్షరలక్షగా నుండెను. ఆయన నాతఁడు ధనమిచ్చినవారియెడ మిక్కిలి ప్రేమగలవాఁడు గనుక నాతల్లిదండ్రులు చిఱుతిండి నిమిత్తమయి నాకిచ్చెడి సొమ్ములో సగము పంతులకిచ్చి దెబ్బలు తప్పించుకొంటిని. అందుచేత పంతులు నామీఁద నత్యంత ప్రేమగలవాఁడై నాకు బడిపెత్తనమిచ్చి, నా తల్లిదండ్రులతో మీ కొమారునంతటి బుద్ధిమంతుఁడు లేఁడని చెప్పుచుండును. చిన్నప్పటి నుండియు నేను నిజముగా సూక్ష్మబుద్ధి గలవాఁడను నేర్పుకలవాఁ డను అవుదును. నా నేరుపరితనమువలన మావారి కెప్పుడును నష్టమేకాని చిల్లిగవ్వయైనను లాభము కలుగకపోయినను నా జననీ జనకులు నన్ను నేరుపరినిగానే యెంచి సంతోషించుచుండిరి. ఏల యనిన నేను నా నేరుపంతయు నితరులను మోసము చేయుటయందే యుపయోగించుచు వచ్చితిని. నేను మోసములను నేర్చుకొనుటలో నిచ్చిన శ్రద్ధలో సగమైనను ఏదో యొకవృత్తిని నేర్చుకొనుటలో నిచ్చియుంటినేని, నేనీపాటికి యెంతో భాగ్యవంతుఁడనై యుందును. ఆ సంగతి నట్లుండనిండు. నాకు బడిపెత్తనము వచ్చుటచేత పంతులతో చాడీలు చెప్పి కొట్టించెదనని పిల్లలను బెదరించి తినుబడి పదార్ధములను లంచము పుచ్చుకొనుచుందును. ఇట్లుండగా నా దురదృష్ట వశమున ఆ పంతులు కాలము చేసెను. ఆ కాలములో పంతు లెంత విస్తారముగా దెబ్బలు కొట్టుచున్న నంత గట్టివాఁడనిపించుకొను చుండును గనుక చదువుకొన్న పంతు లదివఱకే మాయూర బడిపెట్టు కొనియున్నను, అతఁడు పిల్లల యందు ప్రేమగలవాఁడై నిష్కారణముగా కొట్టుటకు పాలుపడనందున, పిల్లల నెవ్వరు నాతని బడికిఁ బంపకుండిరి. ఇప్పుడు గ్రామములో రెండవ పంతులు లేనందున, మా బడిలోని పిల్లల నందఱును విధిలేక యక్కడకే పంపవలసి వచ్చెను. ఈ క్రొత్త పంతులవద్ద మునుపటివలె నా యాటలేమియు సాగినవికావు. ఇంతలో మా తండ్రియు నాకస్మికముగా గుండెలలో నొప్పి వచ్చి లోకాంతరగతుఁడయెను. ఆతఁడు తన ధనము నెక్కడనో పాతిపెట్టి మరణకాలమునందెవ్వరితోను చెప్పకయే కాలము చేసినందున పెద్దమ్మవారు మమ్ము మఱింత శీఘ్రముగా వచ్చి యాశ్రయించెను. ధనికుఁడైన మా పొరుగువారి పిల్లవాఁ డొకఁడు మా బడి లోనే చదువుకొనుచుండెను:ఆతఁడు చదువునందు మిక్కిలి యాసక్తి కలవాఁడు. ఆతనితో నేను మైత్రి చేసికొని మిక్కిలి నమ్మకమిచ్చి మెలఁగుచుంటిని. కొందఱు నమ్మకమిచ్చినప్పుడు మనసుకూడ నిచ్చి యూరకుందురు; నేను తెలివిగలవాఁడను గనుక అలాగున జేయక వేయి నమ్మకము లిచ్చినను మనసు మాత్ర మియ్యక దాఁచుకొంటిని ఈ ప్రకారముగా నుండి యతనిని పలువిధముల మోసముచేసి ధన మార్జించుచుంటిని. అది యేమి మాయయోకాని నేనెన్నివిధముల మోసముచేసి ధనము సంపాదించుకొనుచున్నను బీదవాఁడుగాను, అతఁడు ధనవంతుడుగాను ఉంటిమి. ఆతఁడు విద్యయందు వృద్ధి పొందిన కొలఁది, నేను ద్యూతవిద్యయందు పాండిత్యమును పొంద నారంభించితిని. చెడుపిల్లవాండ్రతోడి సాంగత్యమువలనఁ జదువు మానివేసి డబ్బుపెట్టి జూదమాడ మొదలుపెట్టి యా వ్యసనములోఁ బడి యింటఁగల వస్తువులను దొంగతనముగాను బలవంతముగాను దీసికొనిపోయి జూదగాండ్రకు సమర్పించుచుందును. ఇట్లుండియు మా పొరుగు చిన్నవానితోడి చెలిమిని మాత్రము మానలేదు. అతని పేరు భాస్కరుఁడు, నా పేరు పద్మనాభుఁడు. ఇట్లు జరుగుచుండఁగా నాకు పదియాఱు సంవత్సరములు దాఁటినవి; నా మిత్రుండు పెద్ద వాఁడై గృహయాజమాన్యమును వహించి విద్యాభిరుచిగలవాఁడై సదా పండితుల గోష్టిని ప్రొద్దుపుచ్చుచుండెను. నేనొకనాఁ డతని యొద్దకుఁ బోయి నా స్థితిగతులను జెప్పుకొని నా తండ్రియు వర్తకుఁడే గనుక నాకు వ్యాపారము చేయ నిష్టముకలదనియు మూలధనము క్రింద నేమైనఁబెట్టుబడిబెట్టి సాయముచేయవలసినదనియు కోరితిని. ఆతఁడు తానుగూడ పాలికుండెదనని చెప్పి రెండువందల రూపాయ లను నా చేతికిచ్చి నేను పనిచేయుటకును తాను వడ్డి పుచ్చుకొన కుండుటకును, వచ్చిన లాభములో చెఱిసగము చూచుకొనుటకును నన్నొడబఱిచి పంపెను. మాకు వచ్చిన లాభము స్వల్పమే యైనను పనిచేయువాఁడను గనుక నా కెక్కువ లాభము కావలెనని నేను నా మిత్రునితో కలహము పెట్టుకొన జొచ్చితిని. రాజు లనుభవించుటకు రాజ్యములున్నను, ఒకరితో నొకరు పోట్లాడి చత్తురు; సన్యాసులకు కౌపీనము కంటె నధిక మేమియు లేకపోయినను పోరులేక సంతుష్టి పొంది యందురు. దైవము దయచేసినదానితోఁ దృప్తి పొందియున్న నేకలహములను గలుగవు.తృప్తిలేక యాశాపిశాచముచే నావ హింపబడినచో నెల్ల కలహములను గలుగును. ఆయినను నా స్నేహితుఁడు మిక్కిలి మంచివాఁడును ఉదార సాహసము కల వాఁడును గనుక, ఒకనాఁడు నన్ను తన దగ్గఱకుఁ బిలిచి యిట్లనియెను:

"నీవు మొదటినుండియు వర్తకుఁడవుగా నున్నావు గనుక నీకు సొమ్మునందే యిష్టము; నాకు విద్యాధనమునందు మాత్ర మిష్టము. త్యాగభోగముల కక్కఱకు రాకపోయినను ధనమునుజూచు కొనుచున్నను నీకు సంతోషము కలుగును. నాకు గౌరవముతో జరుగుట కున్నంజాలును. కాబట్టి యీ రెండువందల రూపాయలను నీవు పుచ్చుకొమ్ము."

అని యాతఁడు పెట్టుబడి పెట్టిన సొమ్మును నాకు విడిచి పెట్టెను. ఆ సొమ్ము చేతికందిన సంతోషముచేత, మఱింత యుల్లాసముతో దుకాణము కట్టిపెట్టి రాత్రియు పగలునుగూడ జూదమాడ సాగించి కొన్ని మాసములలో సొమ్మంతయుఁ బోగొట్టుకుని జోగి నైతిని. తరువాత పశ్చాత్తాపపడి, తిండికి సహితము జరగక యిబ్బందిపడుచు నొకనాడు మాసికలు వేసిన బట్టలతో స్నేహితుని యొద్దకుఁ బోయి యాతఁడు చేపిన యుపకారమును బహువిధముల గొనియాడి నాకు సంభవించిన దురవస్థ యంతయుఁ జెప్పుకొంటిని. ఆతఁడు నా స్థితిని విని మిక్కిలి విచారపడి, సొమ్ము చేతనుంచిన యెడల పాడుచేయుదునని యెఱిగి యొక స్నేహితునకు జాబువ్రాసి నన్నచ్చటికిఁ బంపెను. నేనా యుత్తరమును దీసికొనిపోయి చూచిన తోడనే యాతఁడు నన్ను మధ్యాహ్నమున రమ్మనిచెప్పి నాకు నెలకు పది రూపాయల జీతముగల పని నొకదాని నిచ్చెను. నేనా పనిలో రెండు మాసములుండువరకు నాకది యెంతో భారముగా కనబడెను. ఒంటిగా నున్నప్పుడు నా కంటఁబడిన వస్తువుల నెల్లను హస్తలాఘవమును జూపి నేను మాయముచేయుచు వచ్చినందున, నా యజమానుఁడు వారిమీఁదను పెట్టి వీరిమీదను పెట్టి నన్ను దిట్టుచుండెను. అంతియకాక యొకరికిఁ లోఁబడియుండి వారు చెప్పినట్లెల్ల పని పాటలు చేయుట నా స్వభావమునకు సరిపడినదికాదు. నాకు స్వభావముగా మహారాజు వలె నుండవలెనని యాశ గనుక, ఆ పనిని విడిచి పెట్టివచ్చి యింటివద్ద కాలిమీఁద కాలువేసుకొని కూరుచుండి నన్ను నమ్మినవారికడ నెల్లను ఋణములు చేయుచు, అప్పుపుట్టి నంతకాలము సులభముగా జీవనము చేయుచుంటిని. ఈ ప్రకారముగా నిరుద్యోగముగా జీవనము చేయుచున్న కాలములో నేనితరులుచేయు హిత బోధ నెప్పుడును వినకపోయినను, అడుగుట యందు మాత్రము విశేష శ్రద్దపుచ్చుకొని విశేష నీతి వాక్యములను నేర్చుకొంటిని. అటు తరువాత నా నీతి వాక్యములు నాకేమియుఁ బనికి రాకపోయి నను, ఇతరులకైనఁ బనికి వచ్చునని యెంచి మూఢులకు హితోపదేశములుచేసి గొప్పవాఁడ నని పేరుపడి ధనమార్జింప నారంభించితిని. అప్పుడు సహితము నా నడత తిన్నగా నుండనందున నొక నాఁడొక భక్తుఁడువచ్చి 'మీరిన్ని నీతులను జెప్పుచున్నారు గాని మీ ప్రవర్తనము తిన్నగా నున్నదా?' యని నన్ను బ్రశ్నచేసెను. 'నాకుఁ బనికి రావనియే కదా యీ నీతులన్నిటిని మీకు వదలివేయు చున్నాను; నాకే పనికివచ్చిన యెడల నొక్క వాక్యమయిన నా కుక్షిలో నుండి పైకి రానిత్తునా?' యని సమయోచితముగా బ్రత్యుత్త రమునిచ్చి, యిఁక నందు నిలుచుట కార్యము కాదనుకొని శ్రీఘముగా మా గ్రామము వదలివేసి దేశాంతరమునకుఁ బోవలెనని బయలు దేఱితిని. అట్లు బయలుదేఱి గ్రామైకరాత్రముగా శయనించుచు భోజనము చేసినయూరఁ బరుండక నిత్యప్రయాణములు చేయుచు, ఒకనాఁ డొక గ్రామముపఱగడ గొప్ప మేఁకల మంద నొక దానిని జూచి ఇన్ని మేకలను వాఁడెట్ల కాపాడఁగలఁడాయని గొల్లవానియందు మిక్కిలి కనికరము తోఁచి కొంతభారము తగ్గించినను తగ్గించుటయే యని రెండు మేకపిల్లలను బుజము మీఁద వేసికొని నడవ నారంభించితిని; అప్పుడు వాని వెంటనే తల్లియు నఱచుచు రాసాగెను; అది చూచి తల్లి బిడ్డ లనెడఁబాపిన పాపము వచ్చునని కొంత భూతదయ గలవాఁడనై యా పిల్లల తల్లి నిగూడఁ దోచుకొని పోవుచుంటిని. ఆ సంగతి నేలాగుననో కనిపెట్టి గొల్లవాఁడు నా వెనుక 'దొంగా! ఆగు' మని కేకలు వేయుచు నడచి వచ్చుచుండెను. అదివరకు పయి గ్రామము నెంత ప్రొద్దెక్కి చేరుదునోయని భయ పడుచుంటిని గాని, వాని కేక లతో నిమిషములో నూరు చేరి సంతోషించి తిరిగి చూచితిని: వాడు నా పరుగు కలిసికోలేక తక్కిన మేకల నెవ్వరెత్తుకొని పోదురో యని యప్పుడే వెనుక మరలి పోయెను. నేనా మేకను పిల్లలను పొరుగూరిలో విక్రయించి యా సొమ్ము దారిబత్తెమున కుంచుకొని, కొన్ని దినములలో కొండవీడు చేరి యచట యోగినై యుండి, నా యొద్ద సీతారామ యంత్రమున్నదనియు దానిని జూచిన వానికి సమస్త సంపదలు గలుగుననియుఁ జెప్పి, యొక బొమ్మరాతిని గదిలోనుంచి రహస్యముగా డబ్బు డబ్బు చొప్పునఁ బుచ్చుకొని చూప నారంభించితిని. ఏ పాడు వస్తువు నయిననుసరే రహస్య ముగా నుంచుటవలన దానియందు గౌరవము హెచ్చును. దివ్య క్షేత్రమల యందలి దేవాలయములలోని విగ్రహములను పామరులు పూజారులకు దక్షిణలిచ్చి స్వామి యెంత బాగుండునో యని చూచు లాగుననే యెల్లవారును నాకును కానుకలను సమర్పించి యాబొమ్మ రాతిని మూఁకలుగా వచ్చి జనులు చూచి పోవుచుండిరి; చూచిన తరువాత చేతకాని పనివానిచేతఁ జెక్కఁబడిన యా కురూపముగల విగ్రహములందువలెనే యారాతియందును వీధిలోఁ గనఁబడెడి బొమ్మరాయియే యని యెల్లవారికిని ననాదరము కలుగనారంభిం చెను. నిజముగా నేను సీతారామ యంత్రమని లోపలఁబెట్టి చూపిన శిలను ఒక దినమున వీధిలోఁ బెట్టి చూపినచో మఱునాఁడెవ్వరును దాని మొగము వంకనైనఁ జూడఁగోరరు. నేనా ప్రకారముగా యోగినిగా నున్నకాలములో ప్రయోగ విద్యయందును భూతవైద్యము నందును మిక్కిలి ప్రసిద్ధి కెక్కిన వాఁడను, కాబట్టి నా మహత్వము నెల్లవారును చెప్పుకొను చుందురు. నేను వదలింపఁబూను కొన్న దయ్యముల కథలనుబోలె నా కథలను సహిత మెల్లవారును నత్యాదరులై వినుచు వచ్చిరి; కాని యివియు వానివలెనే వినువారి భయమును మఱింతవృద్ధి పఱచుటకే వినియోగపడుచు వచ్చినందున, గ్రామములో నందఱును నేనేమి ప్రయోగము చేసిపోదు నేమో యని నాకు జడియు చుండిరి.

పయిమిషచేత ధన మార్జించి యా గ్రామములో సుఖజీవనము జేయుచుండఁగా నన్ను వ్యాధి యాశ్రయించినందున, నే నదివర కెందఱకో మరణమున బ్రహ్మైక్యమే కాబట్టి సంతోషింపవలయునని బోధించుచు వచ్చినను చచ్చిపోదునని భయపడఁ జొచ్చితిని. మీరే యోగిని బిలిచి మీకు మరణమన్న భయమేమైనఁ గలదా యని యడిగి నను తడవుకోకుండ లేదని చెప్పునుగాని యాతనికిఁ గొంచెము రోగమువచ్చి నప్పడు మాత్ర మాతని చర్యవలన మూఢులకుండు దానికంటె నెక్కువ భయము కలిగి యుండుటను గనిపెట్టవచ్చును. నేనట్లు యోగివేషము వేసికొనియున్న కాలమున నితరు లేయోగిని ప్రశంసించినను, నే నాతఁ డెంతవాఁడని తృణీకరింపుచుందును, సాధారణముగా యోగ్యులు తాము కీర్తిని బొందవలెనని కోరుచుం డఁగా అయోగ్యులు వారి కీర్తిని పాడుచేసి తమ కీర్తితో సమాన మైన దానినిగాఁజేయఁ జూచుచుందురు గదా? నే నిట్ల నేక వేషములు వేసి కడపట బైరాగినై వీరినిద్దఱిని శిష్యులనుగాఁ గైకొని చిదానంద యోగి యను పేర ధవళేశ్వరము ప్రవేశించి, యీ రాజశేఖరుఁడు గారినే స్వర్ణముచేసి యిచ్చెదనని మాయచేసి యిప్పుడు తమయొద్దకుఁ దెచ్చిన నగలనే యవహరించుకొని పోతిని. అక్కడనుండి పోయిన పిమ్మట గడ్డమును మీసమును గొఱిగించుకొని నీలాద్రిరాజు నయి పిఠాపురము ప్రవేశించి, వీండ్రసాయముచేతనే రాజుగారి ధనాగారములోని ధనమును తరలించితిని. ఈ రెండు చోట్లను నేను జరిగించిన యద్భుత చర్యలును నా నటనమును రాజశేఖరుఁడుగారును కొమారుఁడును చక్కగాఁ జెప్పఁగలరు కనుకను, ఆత్మప్రశంస యను చిత మగుటచేతను, ఇంతటితోఁ జాలించు చున్నాను_ అని యూర కుండెను.

కృష్ణజగపతి మహారాజులుగా రాతని చరిత్రము విన్న తరువాతను నిమిష మాలోచించి, పద్మనాభుని వంకఁ దిరిగి "నీ విప్పడు బుద్ధి తెచ్చుకొని నిజముగా బశ్చాత్తప్తుఁడ వైనాఁడవు గనుక, నిన్నొక్క- సంవత్సరము కారాగృహమునందుఁ బెట్టింప నిశ్చయించినా' మని చెప్పి, కారాగృహాధికారి కట్టియుత్తరువును వ్రాసి యాతనిని రాజభటుల వెంబడిని చామర్లకోటకుఁ బంపివేసిరి. తరువాత పిఠాపురపు వారి ధనము నచ్చటికి వెంటనే పంపివేయ మంత్రి కాజ్ఞచేసి, దొంగతనమును పట్టుకొన్నందునకు సుబ్రహ్మణ్యమును శ్లాఘించి రాజశేఖరుఁడుగారివంకఁ దిరిగి రాజుగా రిట్లు చెప్పిరి:

"మీ రిదివఱ కెన్నో కష్టముల ననుభవించి యా యాపదల నన్నిటిని గడచి మరల సుఖము ననుభవించు దశకు వచ్చుచున్నారు. కాఁబట్టి మీకు నేను కొన్ని హితవాక్యములమ జెప్పబోవుచున్నాను. మీరు నా మాటలను సావకాశముగా వినవలెను. పడిన తరువాత లేచుట గొప్పతనముగాని యెప్పుడును పడకుండుట గొప్పతనము కాదు. మీ రీనీతిని మనసునం దుంచుకొని వెనుకపడిన కష్టములకై విచారపడ కుండవలయును. ఇతరులు చేయు ముఖస్తుతుల కుబ్బి, ఆదాయ మునకంటె నధికమైన ధనము దానము చేయకుండవలయును. ఒక్కకుటుంబములోని వారు పలువురు పదిమందితో నత్యంతమైత్రి కలిగియే యున్నను గృహము చేరినతోడనే గర్భశత్రువులుగా నుందురు. కాబట్టి మీ కుటుంబమునం దట్టి కొఱఁత కలుగకుండఁ గాపాడుచు రావలయును, విరోధమును సాధించుటకు మంచి యుపాయము శాంతిని వహించుటయే. మనకెవ్వరిమీఁద నైనను పగ తీర్చుకోవలెనని బుద్దిపుట్టి దానిని మరలించుకో లేనియెడల మనము పగతీర్చుకోశ క్తి కలిగి యుండియు క్షమింతుమేని, శత్రువులు సహితము మనలను జూచి బుద్ధి తెచ్చుకొని జ్ఞానవంతులగుదురు. కప్ప కఱవ వలెనని ప్రయత్నము చేసిన నెంత ప్రయోజనకారి యగునో బీదవాఁడు గొప్పవానిని పగసాధింపఁ దలఁపుగొన్న నంత ప్రయోజనకారిగానే యుండును. వట్టి బెదరింపులతోనే ముగిసెడు కోపము నెవరు లక్ష్యము చేయుదురు? అట్టి కోపమువలన మనకార్యమును సాధించుకోలేకపోవుట యటుండఁగా మీఁదు మిక్కిలి నష్టమును కూడఁ బొందుదుము. మీరు శోభనాద్రి రాజు మీఁద తొందర పడి మీ కోపమును చూసినందున నేకదా మీకు కారాగృహబంధనము సంభవించినది: కాబట్టి యిఁక ముందెప్పుడును మీరు మీకంటె నధికులైన వారి మీఁద మీ కోపమును కనబఱుప కుండవలయును. కొందఱు మతిహీనులు పూర్వకాలమే మంచిదని పొగడి మీరుచేయు దోషములను కాలమునందారోపించి మిమ్ము నిరుత్సాహలను జేయుదురు; కాని చక్కగా నాలోచించి చూడఁగా బూర్వకాలమునకంటె నిప్పటికాలమే మంచిదని నాకు తోఁచుచున్నది. పుణ్యపాపములు మనుష్యుల ప్రవర్తనములో నున్నవికాని కాలములో నేమియు లేవు. కాబట్టి మీరు చేసినదోషములకు కాలమును దూషింపక మీ ప్రవర్తనమును తిన్నపఱచుకొనుటకే ప్రయత్నపడవలయును. మీకు గౌరవముతో జీవనము జరుగుటకు చాలినంత సొమ్మున్నచో విశేషముగా లేదని మీరెప్పుడును చింత పడకుండవలయును. ఈరీతిని దెలిపెడి పూర్వకథ నొకదానిని మీకుఁ జెప్పెదను వినుండి పూర్వమొక ధనవంతుఁడు శరీరమునిండ రత్న ఖచితములైన స్వర్ణాభరణములను ధరించుకొని వీధినిబడిపోవుచుండగా, బీదవాఁడొకఁ డాతనినిని వెంబడించి నగలను జూచి మాటిమాటికి నమస్కరింప నారంభించెను. ఆ ధనికుఁడాతనిని జూచి 'నా నగలలో నేనేదియు నీకియ్యలేదే, ఎందుల కట్లు చేయుచున్నా'వని యడిగెను. 'ఆ నగలు నాకక్కఱలేదు; మీరు నన్ను నగలను చూడనిచ్చినారు గనుక నమస్కారములు చేసినాను; మీరును చూచుకొని సంతోషించుటయే కాని నగలవలన వేఱొక ప్రయోజనమును పొందఁజాలరు; మీరు నగలను కాపాడుకొనుటకై యెంతయు శ్రమపడుచున్నారు; నా కాశ్రమ యక్కఱలేకయే సంతో షము లభించు చున్నది: మీకును నాకు గల వ్యత్యాస మిదియే' యని వాఁడు బదులుచెప్పి పోయెను. ఈ హేతువునుబట్టియే నేను మీకు విశేషధనము నియ్యఁగలవాఁడ నయ్యును, ఇయ్యక మీ మాన్యములను మాత్రము విడిపించి యిచ్చుచున్నాను. వానితో మీరు తృప్తి పొంది సుఖజీవనము చేయుచుండుఁడు."

అని చెప్పి కృష్ణజగపతిమహారాజుగారు మీకు మఱి యేదియైనఁ గోరిక కలదాయని రాజశేఖరుఁడుగారి నడిగిరి. ఆయన ప్రభువువారి సుగుణసంపత్తిని వేయువిధముల గొనియాడి, తన కుటుంబమునకుం జేసిన మహోపకారమును స్మరించి తాను చెఱసాలలో నున్నకాలములో విజ్ఞాపనపత్రికను వ్రాసి పంపుట మొదలగు పనులలోఁ దన కత్యంత సహాయుఁడుగా నున్న మంచిరాజు పాపయ్యను చెఱనుండి విడిపింపుఁడని వేడుకొనెను. తన కపకారముచేసిన శత్రువునందు కూడ దయ గలిగియుండుటను శ్లాఘించి, రాజుగా రప్పుడే యాతనిని విడిచిపెట్ట నాజ్ఞాపత్రికను బంపి తాము కొలువు చాలించి యంతఃపుర మునకు విజయంచేసిరి, అంత రాజశేఖరుఁడుగారు మొదలగువారు కొలువుకూటమును విడిచి తమతమ యిండ్లకుఁ బోయిరి.