Jump to content

రాజశేఖరవిలాసము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

ధనపతివరమిత్రా దానసంస్తోత్రపాత్రా
ఘనతరనిజశౌర్యా కాంచనాహార్యధైర్యా.

గద్య. ఇది శ్రీమత్కుక్కుటేశ్వరవరప్రసాదలబ్ధకవితాసామ్రాజ్యధురం
ధర కౌండిన్యసగోత్రపవిత్ర కూచిమంచి గంగనామాత్య పుత్ర బుధ
జనవిధేయ తిమ్మయ నామధేయ ప్రణీతంబైన రాజశేఖర
విలాసంబను కావ్యంబునందు ద్వితీయాశ్వాసము.

రాజశేఖరవిలాసము

తృతీయాశ్వాసము

శ్రీమత్కామితజన సుర | భూమీరుహభుజగవరవిభూషణ సుగుణ
స్తోమహిమాచలకన్యా | కోమలముఖపద్మభృంగ కుక్కుటలింగా.


వ.

అవధరింపుము నైమిశారణ్యమహర్షులకు నిఖిలపురాణవ్యాఖ్యానవిఖ్యాతుండ
గు సూతుం డిట్లనియె నట్లు జగన్మోహనాకారుండగు నవ్విటజంగమేశ్వరుండు
తనమందిరద్వారంబునకు వచ్చు టెఱింగి భల్లాణుండు.


చ.

ఎదురుగ నేగి యాగురుజనేశ్వరుఁ గాంచి నమస్కరించి స
మ్మదమునఁ దోడి తెచ్చి సుషమంబగుపీఠిక నుంచి శోభన
ప్రదముగ నర్ఘ్యపాద్యములు భాసురలీల నొసంగి వేగఁ ద
త్పదసలిలంబు మూర్ధ్నమున భక్తినిఁ జల్లుక నిల్చియుండినన్.


క.

నెఱిఁగక్షపాలయంద | త్యురుగాంతులఁ దనరుభూతి యొక్కింత కరాం
బురుహమునఁ బట్టి యోగీ | శ్వరుఁ డానృపునుదుట నిడిన సరవి నతండున్.

ఉ.

పావనమయ్యె మద్గృహము పక్వములయ్యెఁ దపోవిశేషము
ల్వావిరివృద్ధిపొందెఁ జెలువంబగు కీర్తియుఁ బూని యర్ధిపై
నీవు మహానుభావుఁడవు నేఁ డరుదెంచుటఁ జేసి వేడ్కనో
భావజరూప! పూర్వకృతభాగ్యవశంబున మాకు నియ్యెడన్.


క.

గురులింగ మిమ్ముఁ గన్గొని | పరితోషము నొంది మది శుభస్థితిఁ దనరెం
బరమేశ్వరుఁ డిప్పుడు స | త్కరుణం బ్రత్యక్షమైనకైవడిమీరన్.


సీ.

ఎందుండి యిచటకు నేగుదెంచితి రిట్లు మునిచంద్ర! సౌందర్యమూర్తి దనర
నీమోవిపలుగంటు లీచెక్కుగవచీరు లీచిన్నివెన్నెల నెన్నునగవు
లీముద్దునునుబల్కు లీబిత్తరపుఁజూపు లీవలిపపుఁజెక్కు లీయొయార
మరయంగ మీకె భాసురలీలఁ దగునయ్య మఱియెందునైన నీమహిమ గలదె?
నాఁగ నాశంభుఁ డప్పు డానంద మొదవ | చేతు లొరజేసి నవ్వియుఁ జెలువు మెఱయ
నట్టివిటచిహ్న లేర్పడ నఖిలజనులు | వినఁగ నెఱజాణ యగుచు నిట్లనియెఁ బ్రీతి.


సీ.

జననిగర్భంబున జనియించినట్టి తత్ఫలమెల్లఁ దెల్పెద నలర వినుఁడు
జారుఁడై సతతంబు వారకాంతలతోడఁ గామకేళులయందుఁ బ్రేమఁ గూడి
కొమరొప్ప నింతులగుబ్బచన్నులమీఁద గరిమఁ జేయిడుకొని విరులశయ్యఁ
బవళించి సుఖలీలఁ దవిలియుండినఁ గాక కోరికలెల్లను గుదియఁబట్టి
కలలఁ దరుణులఁ గామించి కలితుఁ డగుచుఁ | బెరిగి పంచేంద్రియంబులు బిగ్గఁబట్టి
తియ్యవిల్కానిబారికి నొయ్యనొరిగి | తిరుగుచుండిన ఫల మేమి సిరుల కరయ?


క.

మానినులఁ దవిలియున్నను | మానుగ నిహపరము లొదవు మనుజుల కెల్లన్
కానలభూములఁ దిరుగుచుఁ | దానములు జపంబు లేల తగ నొనరింపన్?


సీ.

సరవి ముత్త్రోవద్రిమ్మరిఁ దలనిడుకొన్న కరిదైత్యమధనుండు కామి గాఁడె?
కొమరొప్ప మోహించి కూఁతు నిల్లాలిఁగఁ గైకొన్నపరమేష్టి కామి గాఁడె?
కూర్మిఁ బదార్వేలగొల్లపూఁబోణులఁ గలసిన వెన్నుండు కామి గాఁడె?
గౌతమమునిపత్నిఁ గడఁగి వరించిన గట్టులపగవాఁడు కామి గాఁడె?
కోరి యాచార్యుభామినిఁ గూడినట్టి | కైరవాప్తుండు మిక్కిలి కామి గాఁడె?
కామి గాకున్నట్టి యస్ఖలితుఁ డెవఁడు | కామి గాఁడేని నిర్వాణకామి యగునె?


గీ.

అదియునుంగాక కామశాస్త్రాళియందుఁ గామి గావచ్చునని పల్కుకతన నిట్లు
తనర విటజంగమాకృతిఁ దాల్చి యేను | నలర వెలయాండ్ర భక్తుల నడిగికొనుచు.

క.

భోగింతు నెల్లవేళల | బాగొప్పెడు కామశాస్త్రపద్ధతి వెలయన్
శ్రీ గల్గుట కరయఁగ ఫల | మీగతి సుఖియింపవలదె యింపలరారన్.


చ.

రమణికుచద్వయం బొగి నురమ్మున నానుక మోము మోముపైఁ
బ్రమదము మీరఁ జేర్చుకొని పల్మరు కోర్కెలఁ బుష్పశయ్యపై
నమరఁగఁ బవ్వళించి యనయంబును మన్మథసౌఖ్యలీలలన్
గ్రమమున నోలలాడుటయె గాదె సుజన్మఫలంబు ధారుణిన్.


క.

అని సెలవులఁ బాఱఁగఁ జ | య్యన నవ్వుచుఁ బల్కు జంగమాధిపు నొరయం
జనదనుచు నృపుఁడు లింగా | ర్చన సేయఁగఁ బిలువ నతఁడు క్రమ్మఱఁ బలికెన్.


సీ.

జననాథ! మారాక చందమంతయు నీకు విను మెఱిఁగింతు సవిస్తరముగ
నన్నంబుపై నించుకైనఁ గోరిక లేదు వలనైన వెలఁది గావలయుఁ జుమ్ము
వేశ్య లేనిదినాలు వేయైనఁ గాని భోజన మొనరింపను సైపకుండుఁ
గావున వేవేగఁ గన్నులపండువ యగుదాని నొక్కతెఁ దగినభక్తి
తోడఁ దెప్పింపు వేడుకతోడ నిపుడు | గౌరవంబుగ నీ విచ్చుకట్న మిదియె
యనుఁడు నృపశేఖరుఁడు నేర్పు దనర నతనిఁ | గాంచి యిట్లను సద్వచోగరిమ మీర.


విను గురునాథ! నిక్కమగువిన్నప మొక్కటి చిత్తగించి యి
ట్లనుచితము ల్వచింపఁగ మహాత్ములకున్ దగదయ్య మిమ్ము ని
ప్పని విని యెవ్వరైన నగుబా టొనరించెదరయ్య మీ రెఱుం
గని దిపు డెద్ది యిమ్మహిని కార్యము లేదు గదయ్య తెల్పఁగన్.


చ.

అడుగు మఱెద్దియేనియు రయంబ యొసంగెదఁ గాక మీకు ని
ప్పుడు నొకకన్నియం దెలిసి పొందుగఁ బెండ్లి యొనర్చి రత్నపుం
దొడవులు జీరలుం బసులతో ధనధాన్యములున్ గృహంబులున్
గడువడి భృత్యవర్గమును గైకొను మిచ్చెదఁ గోర్కె మీరఁగన్.


క.

ఊరూరుఁ దప్పకుండఁగ మేరలు | సేయింతు నిపుడు మీశిష్యులకు
న్వారంబు లొసఁగు నట్ల ను | దారత వర్షాశనములు తగ నొనరింతున్.


గీ.

పెండ్లికట్నంబులును గడుఁబేర్మితోడ | రాగికప్పెరలును మీకుఁ బ్రాకటముగ
నియ్యఁజేసెదఁ బ్రజలచే నెల్లతఱిని | సూనశరరూప! యట్లు గాదేని వినుము.


శా.

గ్రామంబు ల్కరు లందలంబులు శతాంగంబు ల్తురంగంబులు
న్భూమిం బేరగువస్తుసంఘములు సంపూర్ణంబుగా నిప్పుడే

ప్రేమ ల్మీరఁగ నిత్తుఁ జేకొను మిటు ల్పెక్కేల నీరాజ్యమం
దోమార్తాండనిభప్రకాశ కొనుమీ యుర్వ్యర్ధభాగం బొగిన్!


క.

ఈరీతి సౌఖ్యలీలల | చేరూఢిగ నుండు టొప్పు చిరతరమహిమం
గోరిక మీరఁగఁ గైకొను | మారాధ్యజనావతంస యని బల్కుటయున్.


క.

ఆపలుకులు విని గురుఁ డతి | కోపోద్రేకమున నృపతికుంజరుఁ గని యో
భూపాలక! నీతేగం | బీపట్టునఁ దెలిసెఁ దరుచు లిం కేమిటికిన్.


గీ.

ధరణి భల్లాణుఁ డెంతయు దాత యనుచుఁ | జెప్పఁగా విని యేతెంచు నప్పు డొక్క
కా సొసంగిన వెలయాలు గలుగు నిటుల | లోభ మేటికిఁ గుసుమశరాభ నీకు!


సీ.

భేకంబుఁ గని చాలభీతిఁ బర్వెడుబంటు దురమున రిపులఁ బోఁదరుమఁగలఁడె?
మడిగట్టువడి దాటఁ దడఁబడు తెట్టువ మించి వారాశి లంఘించగలఁడె?
యిసుమంతపసపుకొ మ్మొసఁగఁజాలని వైద్యుఁ డెనసి యంగడిఁ జూర లిడఁగఁగలఁడె?
యిలు బాసి వెడలంగ నలయుసోమరి వేగమున వారణాసికిఁ జనఁగఁగలఁడె?
సరవి మావంతుఁ డెక్కినం దరలలేని వారణంబు భారంబు మోవంగఁగలదె?
కావున నొకింతసూక్ష్మమో కామితంబె | యీయఁగా నోప విఁక నిచ్చు టేది చెపుమ.


గీ.

ఎండకన్నును నీడక న్నెఱుఁగకుండి | తనర నరచేతియర్ధంబుఁ గనఁగ లేని
యలఘుతరరాజ్యగర్వాంధు లైనయట్టి | నరవరుల కేల వ్రతములు ధరణియందు.


చ.

గడియకుఁ బెక్కుమార్గములు కల్లలు పల్కుదు సాధుకోటి త
న్నొడయుఁ డటంచు మ్రొక్కునపు డూరక యుండుచు వింతచేష్టలన్
గడువడిఁ దా నొకొక్కయెడఁ గళ్ళెఱఁజేయుచు రాజ్యసౌఖ్యముల్
గడుకొను లాహిరీ మసకఁ గ్రమ్మిన మత్తులు గారె భూపతుల్?


ఉ.

బొంకులకెల్లఁ దానకము పుట్టినయిల్లగుఁ గల్మషాళికిం
గొంకొక సర్వదుర్గతులకుం దగుమూలము రాజసంబు నీ
వింక నతిప్రయాసమున నిట్లగురాజసవృత్తినుండియు
న్బింకముతో వ్రతంబుర కపేక్ష యొనర్తుఁరె పార్థివోత్తమా?


గీ.

నీకు నీవేళ నొకకాసు లేకయున్న | నిదుగొ మాచేతికాసైన నిచ్చి వేగ
వెలపొలంతినిఁ దెప్పింపు మలర నిదియు | వినఁగఁగాదేని శపథంబు విడువు మిపుడు.


ఉ.

వాహనము ల్రథంబులును వారణము ల్మొదవు ల్ధనంబులున్
గేహములు న్బురంబులును గేవలరత్నవిభూషణంబులు

న్సాహసవృత్తితో నొసఁగి చాలఁబ్రియంబునఁ గూర్చి యిప్పు డు
ద్వాహము సేయుకంటె నొకవారవధూటి నొసంగరాదొకో?


చ.

అనుడు దినేశవంశకలశాంబుధిచంద్రుఁడు యోగిచంద్రునిం
గనుఁగొని యోమహాత్మ! తగుకార్య మెఱింగినరీతి విన్నవిం
చినపని గాని లోభమునుఁ జెంది వచించుట గాదు మీర లిం
దున కలుగంగఁ బాడియె? బుధుల్ క్షమ సేయరె తప్పుగల్గినన్?


క.

కావున మీమది కింపుగ | వేవేగ వలంతియైన వేడుకకత్తెన్
రావించెదఁ గైకొనుమో | భావజనిభ! యనిన నతఁడు ప్రమదముతోడన్.


క.

అటులేని దెలియవిను మొ | క్కటి భూతలనాథ! వారకాంతవిధము ప్ర
స్ఫుటగతిఁ జెప్పెద జంగము | విటుఁడని యెన్నక కడు న్వివేకము మెఱయన్.


సీ.

సంపూర్ణపూర్ణిమాచంద్రబింబద్యుతిఁ బెద్దయు నిరసించు ముద్దుమోము
విరిదమ్మిరేకుల నెరిఁ బరిహాసంబుఁ గావించు నిడువాలుఁగన్నుదోయి
బింబికాఫలకాంతిఁ బేర్మి మీఱ జయింపఁ దివిరెడు సొబగైనతియ్యమోవి
మేలిబంగరుబొంగరాలలీలల నేలఁజాలిన కఠినంపుఁజన్నుఁగవయుఁ
గొదమతుమ్మెదకదుపుల గదుము కురులు, కరికరంబుల కెనయనఁ బరగుతొడలు
గొప్పపిఱుఁదులు నల్పమై యొప్పు కౌను! పృథ్వినాథ! గభీరనాభియును గల్గి.


తరల.

మొలకనవ్వులు వాలుఁజూవులు ముద్దుగుల్కెడుపల్కులుం
దళుకుఁజెక్కులు హంసయానము తమ్మితూండ్ల జయింపఁగాఁ
గలభుజంబులు కంబుసన్నిభకంధరంబును గల్గి తా
వలచియు న్వలపింపనేర్చిన వామలోచన గావలెన్.


క.

పురుషుం డలసినమీఁదట పురుషాయితబంధగతులఁ బొదువుచు వరుస
న్సురతంబు సేయనేర్చిన | గురుకుచ గావలయు నలరఁ గువలయనాథా!


క.

నఖదంతక్షతచుంబన | ముఖనిఖిలరతిప్రకారములఁ దానె కడు
న్సుఖలీలఁ గలయు నీరజ | ముఖియే కావలయుఁజుమ్ము భూపతితిలకా!


చ.

కలకల నవ్వుకొంచుఁ దమకంబునఁ గంచెల పిక్కటిల్లఁగాఁ
గులుకుమిటారి గబ్బిచనుగుబ్బలు పైఁబయి నుబ్బఁ దేనియ
ల్చిలికెడు ముద్దుపల్కులను చెన్నుగ మోహము మీరఁ గేరున
చ్చిలుకలకొల్కి గావలయుఁ జిత్తజకేళికి భూభుజోత్తమా!

సీ

నిక్కు జక్కవదోయి నెక్కసక్కెములాడు చనుగుబ్బ లురమున నొనరనాని
భుజయుగం బలర మూపున లీలఁ గీలించి చెలువొప్పఁ జెక్కునఁ జెక్కుఁ జేర్చి
పలుమాఱు గళరవంబులు మీఱి జెలగంగ నిమ్ముగా మరునిల్లు చెమ్మగిలఁగఁ
గొనగోటిపోటు లొయ్యన మర్మము ల్నాట వగలచే బెదరుమై వడకు దోఁపఁ
జొక్కి బిగికౌఁగిలింతలఁ బెక్కుక్రియలఁ | బ్రేమ దళుకొత్త వసియించి పిదప నుపరి
సురతమును బ్రోడయై సేయుసుందరాంగి | కావలయుఁ జుమ్ము ధారుణీకాంత యిపుడు.


వ.

మఱియును.


సీ.

ధనగర్వమునఁ బల్లవునిం దృణీకృతలీల గణన సేయని పెల్లుకత్తె గాక
కలహించి వేఁడుకకాని నెంతయు నెగ్గులాడుచునుండు గయ్యాళి గాక
నెమ్మది యొరునిపై నిలిపి మారునికేళి నలరఁ దేలింపని తులువ గాక
ప్రేమచేఁ బిలిచిన బేలయట్టులఁ బల్కనొల్లని మాయలబెల్లి గాక
యొకనిచే విత్త మంది వేఱకనితోడఁ | గలిసి వర్తించు బల్దోనకారి గాక
పూని యేప్రొద్దు నిద్దురపోతు గాక |మదటయును గాక పరికింప మలిన గాక.


గీ.

విటునితోఁ గూడియున్నట్టి వెలఁది గాక | బానిసెయు రోగియును గాక పాపి గాక
బేలయును గాక తగమగనాలు గాక | యున్నవాల్లంటిఁ దెప్పింపు ముర్వినాథ!


విను చిత్తిని శంఖిని హ | స్తిని పద్మిని యనెడు నాల్గుతెఱఁగులసతు లం
దునఁ బేరెన్నికయగు | ద్మిని గావలెఁ జుమ్ము మాకు మిహిరకులేశా!


శివపాదభక్తినిరతయు | నవిరళసౌందర్యవతియు నతిపుణ్యగుణ
ప్రవిమలతరహృత్కమలయు | నవనీశ్వర మాకు నిచ్చునది యిపు డెలమిన్!


సీ.

ఘనసారమృగమదగంధసారాసేకసంతతనవ్యవాసనలచేత
మౌక్తికాంబుజరాగమరకతనీలాదిదివ్యమాణిక్యదీధితులచేతఁ
దరుణేందుబింబసుందరదర్పణావళితరళితఘనధగద్థగలచేత
సౌపర్ణపర్యంకసంవ్యాప్తమల్లికాద్యతులితకుసుమసంహతులచేత
సరవిం దెఱయిడ్డచందువాసిరులచేతఁ | బ్రకటితములగు జాలవల్లికలచేత
సొరదిఁ బేరైన నిఖిలవస్తువులచేత | నలరు కేళీగృహంబు గావలయుఁజుమ్ము.


వ.

అనిన నృపాలుం డిట్లనియె.


గీ.

అట్టె కానిమ్ము దేవ మీ రానతిచ్చు | క్రమము మీఱంగ నిప్పుడే గడనసతిని
నలరఁ దెప్పింతునని పల్కి యాక్షణంబ | కౌతుకం బాత్మ నెంతయుఁ గడలుకొనఁగ.

క.

తలవరులఁ బిలిచి ధరణీ | తలవరుఁ డవ్విధముఁ జెప్పి తగినధనంబు
ల్వల నొప్ప ముదం | బలరఁగ వెలపొలఁతిఁ దెండటంచుం బలికెన్.


వ.

అంత.


పద్మము లెంతయు న్సొబగుఁ బాసి వెస న్ముకుళింప విస్ఫుర
త్సద్మములందు భూసురులు తత్సమయక్రియ లాచరింపఁగా
పద్మము మీరువారలగు సామజయానల కెల్లఁ జాలహృ
త్పద్మము లుల్లసిల్ల రవి పశ్చిమవారిధిఁ గ్రుంకె నత్తఱిన్.


సీ.

కరమొప్ప సాంధ్యరాగము మీఱిఁ జెల్వారు నంధకారము పర్వె నఖిలదిశలఁ
జుక్క లాకసమునఁ జక్క నొక్కటనుండె ముదముతోఁ దొగలఱేఁ డుదయమయ్యె
జనుల కెల్లను బ్రీతి యెనర వెన్నెల యొప్పె లలిఁ జకోరములు కోర్కెలఁ జెలంగె
నలిని తాఁ దలవంచె నగియెనుగు ముదిని కోకంబు లెడబాసి కుందె మదిని
మరుఁడు వెడవింటవిరితూఁపు లరయఁబూని | యేపు దనరార విరహుల నేయఁదొడఁగె
సతులకుఁ బురుషులకుఁ బరస్పర | విలాసరసము చిలికెడు పలుకు లిం పెసఁగ నపుడు.


సీ.

ముత్యాలతాటంకములు గొమ్ము పూబోఁడి బన్నసరం బిదే సన్నుతాంగి
భుజకీర్తు లివె చూడు గజరాజగామిని యొడ్డాణ మిదుగొ మహోత్పలాక్షి
కరకంకణంబులు గైకొమ్ము హరిమధ్య చేర్చుక్కబొ ట్టిదె చిన్నెలాఁడి
మొగపులతీఁగ చెల్వుగఁ బూను శుకవాణి నేవళం బిదె రమ్ము నీలవేణి
రత్నహారంబు లివె యుడురాజవదన | వన్నెచీరలు కొనుము సౌపర్ణవర్ణ
గంధసారంబుఁ బూయు మోకంబుకంఠి | యనుచుఁ దుదలేనికోరిక నాత్మ నలర.


ఉ.

పల్లవు లెల్ల మొల్లముగ బల్లిదులై కడుమంచివస్తువు
ల్కొల్లలు మీఱఁ బట్టుకొని కూరిమితో బఱతెంచి వారసం
ఫుల్లసరోజనేత్రలకుఁ బొం దలరార నొసంగి వేడ్క రం
జిల్లఁగఁ బెక్కుమక్కువలఁ జెంది సుఖింతు రనేకలీలలన్.


క.

తలవరు లయ్యెడ నర్థము | లలఘుగతిం గొనుచు సరగ నంచితకౌతూ
హలమానసు లగుచు న్వే | శ్యలగృహముల కరిగి పిలువసాగిరి వరుసన్.


సీ.

రమ్ము పద్మావతీ రావె చింతామణీ రా జగన్మోహినీరాజరేఖ
రమ్ము చకోరాక్షి రా పుష్పమంజరీ రావె లీలావతీరత్నపుత్రి
రా సుందరాకార రమ్ము కైరవగంధి రావె బించాధరిరమ్యభూష

రావె కోకిలవాణి రా సరోరుహపాణి రా మధువ్రతవేణి రమ్ము తరుణి
రావె నారీశిరోమణి రమ్మురమణి | రమ్ము నవచంద్రికాహాస రాజహంస
యనుచు వేవేఁగ నింటింటి కరిగి యిటులఁ | దలవరులు వారకాంతల నలరఁ బిలిచి.


క.

ధనములు మణిభూషణములు | ఘనతరచిత్రాంబరములుఁ గలసంబులునుం
గొనుఁ డివె విటజంగమునకుఁ | బనివడి నిద్దురకు నిపుడు ప్రమదము మీఱన్.


గీ.

వనజముఖులార! ధారుణీవరునియాజ్ఞ | యిట్లు కావున మసలక యీక్షణంబ
వలసినంతధనంబును వరుసఁ గొనుచు | వేఁగముగ రండు జంగమవిటునికడకు.


వ.

అని పల్కుటయును.


సీ.

నెఱజాణఁడొకఁ డింట నిద్దురకున్నాఁడు రాఁగూడదనె నొక్కరాజివదన
కోడెకాఁడొకఁడు దాఁగోరిన ధన మిచ్చి వదలనీఁడనె నొక్కవాలుగంటి
మిగులఁగూరిమి చేయు వగకాని నెడఁబాయఁదగదు రాననె నొక్కచిగురుఁబోఁడి
పల్లవుఁడొకఁడు దర్పకకేళి కీవేళఁ గాఁచినాఁడనె నొక్కకంబుకంఠి
ననువుకాఁడొకఁ డాసించి వినయలీలఁ | దవిలియున్నాఁడనియె నొక్కధవళనేత్ర
విటశిరోమణియొకఁ డిలు వెడలనీక। దంటయైయున్నవాఁడనె దంటయొకతె.


ఉ.

మిండనిఁ బాసి రాఁదగదు మిన్నక పొండనె నొక్కలేమ చె
ల్వుం డిదె చూడుఁ డల్ల గదిలోనియతండనె నొక్కరామ భూ
మండలిఁ బేరుగల్గు సుషమంబగుమేలిపసిండిసొమ్ములీ
తం డొసఁగం గడించి చనధర్మము గాదనె నొక్కభామయున్.


గీ.

ఇట్లు చెలులెల్లఁ దమవిధం బెఱుఁగఁజెప్పి | రందు గొందఱు ప్రోడలౌ నిందుముఖులు
మందమధురోక్తు లలరార మానవేశ | కింకరుల కిట్లు పలికిరి శంకలేక.


క.

వినుఁ డెఱిఁగించెద మెంతయుఁ | బనివడి గణికాజనంబు పద్ధతులెల్ల
న్వినయం బలరారఁగ నో | ఘనులార సవిస్తరంబుగా నిఁక మీకున్.


సీ.

విటుఁడు లేని రేయి వేదనఁ జెందుచు | నిదుర కంటి కెఱుఁగ నేరకుండి
కా సొసంగునట్టికడజాతివాఁడైనఁ | గల్గఁగోరు వారకాంత మదిని.


సీ

కడుఁగురూపినినైనఁ గందర్పనిభుఁ డంచు నభినుతి యొనరింతు రలఘులీల
నంత్యజన్మునినైన నమలవంశజుఁ డంచుఁ బల్కుదు రెంతయుఁ బ్రౌఢి దనర
నతిమూఢమానసుండగు మానవునినైన సరసుఁ డటందురు సరభసమున
బ్రహ్మహంతకునైనఁ బరమధార్మికుఁ డంచు గణుతింతు రెపుడును గ్రమముతోడ

నెన్నఁగల్గిననీతివిహీనునైనఁ | దవిలి సద్వర్తనుం డండ్రు తమకు నొక్క
వీసమైనను గాసైన వీడెమైనఁ | జేతి కొనఁగినచో వెలచిగురుఁబోండ్లు.


ఉ.

చిన్నెలవన్నెల న్వగలఁ జిత్రవిధంబుల ముద్దుమాటలన్
వెన్నెల నెన్ను నవ్వులను వేమఱ బిత్తరివాలుఁజూపులన్
సన్నల సైగల న్మిగులజాణతనంబున వారకామినుల్
చెన్నుగఁ బల్లవప్రతతి చేతధనంబులు దోతు రెప్పుడున్.


సీ.

ఒకమాఱు పయ్యెద నోరగాఁ దొలఁగించి సవరించు జిగిగుబ్బచన్ను లలక
నొకమాఱు సోగవెండ్రుకలబల్నునుకొప్పు సడల జల్లున విప్పి ముడుచు మఱల
నొకమాఱు మణిమయప్రకటభూషణములు వదలించి తిరుగంగఁ గుదురుపఱచు
నొకమాఱు నవ్యమౌక్తికమణిహారము ల్కొనగోటఁ జిక్కుల గుచ్చి తివియుఁ
జెలఁగి మఱియును శృంగారచేష్ట లలరఁ | గేరుచుండును బెక్కువిహారములను
సొబగు మీఱెడు వగకానిఁ జూచినపుడు | మరులుకొల్పును వెలయింతి మహితగతిని.


చ.

పొలుపుగ నిన్నుఁ బాసి యొకపూట మహాయుగ మంచు నెంచుచో
వలనగ నీవు న న్నిటుల వంచన సేయఁగఁ బాడియే? యిటుల్
దలఁపఁగ నీతియే? యనుచుఁ దక్కుచుఁ జొక్కుచు నిక్కువంబుగా
వలచినయట్లు మాయలను వారవధూటి భ్రమించుఁ బల్లవున్.


చ.

ధనముల వేలబో యిపుడు దాసియునైన గడించు నీక్రియం
ఘనముగ మాకు నీచెలిమి గల్గుటయే పదివే లటంచుఁ బె
న్వినయఁపుమాట లాడుచును వేఁడుకకానిఁ గఱంగఁజేసి య
య్యన విభవంబుఁ గొండ్రు గణికాంగన లెంతయు నేర్పు మీఱఁగన్.


క.

వలచినవానికిఁ బడఁతియు |వలచినచందమునఁ దోఁచి వదలరు గా కెం
దులనైన వెలపొలంతికి | వలపును గనకంబునకును వలపును గలదే?


వ.

అదియునుంగాక.


సీ.

పల్లవవ్రాతంబుపాలి బల్రాకాసి ప్రకటితోద్యన్మద్యపాననిరత
గురుతరానేకదుర్గుణగణాలంకారసకలమాయావాదజననసీమ
భూరికోపవికారపూరితనిజచిత్తకఠినవాక్యక్రియాగ్రధితరసన
ధరన నీతులకెల్ల గురుతు మీరినతావు దానధర్మదయావిధానహీన
శాకినీభూతభేతాళసమదదైత్య | భీకరాకారవిజయగంభీరనినద

సుమశరారామమార్గభాసురసమగ్ర | లగ్నకలకంఠయుతవల్లి లంజతల్లి.


సీ.

కుఱుచలై తఱుచుగా నెఱిసినవెండ్రుక లొప్పుమీఱఁగ దువ్వి కొప్పు ముడిచి
యిలఁబ్రాంతచెప్పుటట్టలఁ బోలి వ్రేలాడుకుచముల ఱవికచేఁ గుదియఁబట్టి
తొడిగినకుబుసంబువడువున మడత లేర్పడియెడునొడలిపైఁ బసపు రాచి
యెలుఁగుతోలును మీఱి యెంతయు మాసిన పెద్దపుట్టము చాలఁబ్రీతిఁ గట్టి
బొరుసునొసటను జంద్రఁపుబొట్టుఁ బెట్టి | యడుసుకన్నులఁ గజ్జలం బడర దిష్ఠి
బోసినోట మదమలంబుఁ బూని యిటుల | విటులఁ బలుమాఱు నగఁజేయు వృద్ధవేశ్య.


గీ.

పద్మమయినను దగుమహాపద్మమయిన | శంఖమయిన నొసంగినఁ జాలకుండు
ధనదు మెచ్చ దొకింతైనఁ దనకుఁ గల్గు | విత్త మంతయు నీకున్న వేశ్యజనని.


క.

వసఁ ద్రాగినపులుగుక్రియ | న్విసువకతగఁ బ్రేలుకొంచు వేశ్యాంబ కడుం
బిసరేఁగి బూతులాడు | న్బసఁ గల్గనియీగి యడఁగఁ బల్లవతతులన్.


ఉ.

ఆకులు పోఁకలు న్మణులు హారములు న్బహుగంధసారము
ల్కోకలు రూకలు న్మదిని గోరినయట్టి సమస్తవస్తువు
ల్ప్రాకట మొప్ప మాయ లొగిఁబన్ని భ్రమించుచు నేర్పు మీఱఁగాఁ
జేకొనుఁబో విటావళులచే గణికాంబ విచిత్రవైఖరిన్.


గీ.

మిండఁ డొకనాటిరేయి రాకుండెనేనిఁ | గాసువీసంబు చేతికిఁ గల్గనందు
కించుకేనియు నిదురఁబోనీదు కూఁతు | గడనపూఁబోఁడియవ్వ పెన్కంచుమువ్వ.


వ.

ఇట్లగుటం జేసి పల్లవవిరహితమైన వేశ్య మీ రిచ్చుధనంబుఁ గొని జంగమవిటునికతకు
రాకుండునే యని యథార్థంబుగఁ బల్కిన విని.


క.

నమ్మక నృపభటు లతిశీ | ఘ్రమ్మునఁ గ్రమ్ముకొని సకలగణికాజనగే
హమ్ములు నిమ్మగ దూరి ము | దమ్మునఁ బరికించుకొనుచుఁ దగ నచ్చోట్లన్.


క.

ద్యూతమధుపానమృదుసం | గీతసుసాహిత్యనృత్యకేళులచేతం
బ్రీతిఁ జెలంగు భుజంగ | వ్రాతంబులఁ గనిరి చిత్రవైఖరి మెఱయన్.


ఉ.

ఈగతి నుండఁ జూచి ధరణీశ్వరుపాలికిఁ జారు లెంతయు
న్వేఁగమ చేరి తద్విధము చిన్మయలీల నెఱుంగఁ జెప్పిన
న్బోగముచానఁ దే కిటుల బొంకులు పల్కుట మీ కొకింతయు
న్బాగగునే యటంచు నరపాలుఁడు కోపము మీఱఁ జూచుచున్.


క.

ఉన్నంత పొరుగుపల్లెల | కు న్నేగినదూతలెల్ల గొబ్బున నపుడే

భిన్నత మీఱఁగ నటువలె | విన్నప మొనరింప ధరణివిభుఁ డవ్వేళన్..


ఉ.

ఎక్కడఁ జూచినం బురి నొకించుకయు న్నెడలేక యెప్పుడు
న్లెక్కకు నెక్కువై గడనలేమలు గాచుకయుందు రిప్పు డే
దిక్కున నొక్కవారసుదతీమణి గల్గకయుండు టెంతయు
న్మిక్కిలిచోద్య మంచు మది నిల్వక దిగ్గున లేచి యత్తఱిన్.


క.

నల్లనిశాలుముసుం గిడి | యెల్లజనంబులను డించి యింపొంద మహీ
వల్లభుఁడు తానె చనియె మ | హోల్లాసఁపువేశ్యవాటి కున్నతలీలన్.


ఉ.

ధీరుఁడు భూవరుం డిటులఁ దీవ్రగతిం జని తద్గృహంబుల
న్సోరణగండ్లపద్ధతులఁ జూడఁదొడంగె విచిత్రలీలల
న్గేరుచుఁ గోరికన్ మదనకేళులఁ దేలుచునుండువారలం
భూరిసుగంధపుష్పమణిభూషణధారుల నిర్విచారులన్.


 * * *


వ.

ఇట్లు చతురశీతిబంధనఖదంతక్షతపరిరంభణాద్యనేకకామశాస్త్రప్రకారంబు
లం దవిలి క్రీడించుచున్నం గనుంగొని శివశివేతి మంత్రంబును బఠించుచు విఫలప్రయ
త్నుండై ధాత్రీవల్లభుండు తనమనంబున వితర్కించె.


క.

చారులు చెప్పినవిధ మిపు | డారయఁ దథ్యంబయ్యె నవ్విటునకు నిం
కేరీతి కొనఁగఁగల్గుదు | వారవధూమణీని వ్రతము వడి నిల్పుటకున్.


క.

వెలపొలఁతి గల్గనందున | నిల యేలెడురాజు నంచు నెవ్వతెనైనం
బలిమిం దెప్పించిన నిది | కలుషంబుల కెల్ల మొదలుగాదె తలంపన్?


చ.

కడునడురేయి యయ్యెనని కల్లరిజంగము క్రోధచిత్తుఁడై
వడి నదలించి పల్కునొకొ? వంచన మీఱ వ్రతంబుమీఁదట
న్విడువఁగఁబోలునో? భువిని విశ్రుతమౌ నపకీర్తి నొందఁగాఁ
బడునొకొ? నీలకంధరుని భాస్వదనుగ్రహ మెట్టు లున్నదో?


గీ.

వేశ్య నొసఁగెదనని మున్ను విశ్వసింపఁ | బలికి యిపు డెట్లు బొంకుదుఁ బాటిఁ దప్పి
మహి నసత్యముకన్నఁగ ల్మషముగ లదె | సేటు సేయంగ మానవకోటులకును?


గీ.

మును హరిశ్చంద్రముఖ్యులౌ మనుజపతులు | నిత్యసత్యవ్రతాచారనిపుణు లగుటఁ
గాదె చీరకీర్తి సకలజగంబులందుఁ | జెంది నిర్వాణరాజ్యాభిషిక్తులైరి.


క.

కరిహయభటరథశిబికాం| బరధనమణిభూషణాదిబహువస్తువు లి

ద్ధర నెన్నఁగ సతతంబులె | తిరముగ సత్కీర్తిదక్క ధీరాత్ములకున్?


క.

మునుదీక్ష యొసఁగువేళల | ఘనుఁడగు గురునాథుఁ డెంత గాదని యనినన్
విననొల్లక వ్రతభంగం | బొనరింపఁదలంచు టిప్పు డుచితం బగునే?


క.

అది గావున నవ్విటునకు | నొదుఁగక పట్టంపుదేవి నొసఁగి ధరిత్రిన్
విదితంబగు శపథము కో | విదు లెన్నఁగ నిల్పుకొనుట విహితం బనుచున్.


చ.

అవనితలేంద్రుఁ డెంతయరయంబ గృహంబున కేగి సంతత
ప్రవిమలశీలయైన తనభామిని నొయ్యనఁ జేరఁబిల్చి యో
ధవళసరోజనేత్ర! విను ధర్మయుతంబగు నొక్కవాక్యమున్
దవిలినభక్తితోడ విదితంబుగ నీ కెఱుఁగంగఁ జెప్పెదన్.


చ.

సరసము మీఱ నొక్కవిటజంగము ధూర్జటిఁ బోలి నేఁడు దా
నురుతరలీల నెయ్యెడలనుండియొ వేగమె చేరిన న్సభాం
తరమునఁ జూచి యెంతయు ముదంబున దీవెన లిచ్చి కేరుచున్
గురుతుగ నొక్కవారసతిఁ గోర్కె నొసంగు మటంచుఁ బల్కినన్.


క.

ఇయ్యకొని భటులచేతికి | నెయ్యంబున ధన మొసంగి నెఱి నొకపడుపుం
దొయ్యలిఁ దెమ్మని పనిచియు | నయ్యెడ వారలను నమ్మ కతిశీఘ్రమునన్.


సీ.

చని వేశ్యవాటియెల్లను క్రమక్రమమున వెదుకంగ నందు నవ్వెలఁదులెల్లఁ
బల్లవసహితలై పరిపరివిధముల గుఱుతుగా మరుకేళిఁ గూడుచున్నం
గనుఁగొని వ్రతభంగమునకు నెమ్మదిఁ జాల వెఱచి యెంతయును వివేకినివని
నీకు నివ్విధ మెల్లఁ బ్రాకటం బలరారఁ దెలుపవచ్చితి నతితీవ్రఫణితి
నిందుముఖి యెన్నఁడు నెఱుంగ నిట్టిచోద్య | మభవు బలుమాయ గాఁబోలు! నైన నీదు
బుద్ధితోడుత నూహించి పొసఁగ నొక్కవాక్య | మిట్లని పల్కుమా వలను మీఱ.


క.

అనుమనుజాధీశ్వరునిం | గని మృదుమధురోక్తు లలరఁ గాంతామణి యి
ట్లను హృదయాధీశ్వర మును | వినవే శితిగళునికథలు విబుధులవలనన్.


చ.

చిరతరలీల భక్తతతిచిత్తము లారయఁగోరి యీశ్వరుం
డరుదుగఁ బెక్కురూపుల నహర్నిశము న్జరియించుఁ దొల్లియుం
దురితవిదూరుఁడైన చిరితొండని నిశ్చలభక్తిఁ జూడఁ ద
ద్వరసుతుఁ గూరఁగా నడిగి వానికి నీఁడె మనోరథార్ధముల్!


గీ.

అవ్విభుఁడె మున్ను పొదిలె నిమ్మవ్వసుతునిఁ | బూని చంపించుకొఱకునై పోయి దాని

నధికతరహర్ష మొప్పార నన్నమొనర | వేఁడుకొన్నట్టి బల్మాయలాఁడు గాఁడె!


క.

అట్టిశివదేవునకు నీ | పట్టున నిన్నడుగు టెంతపని సుగుణుఁడవై
యెట్టైన నొసఁగి శపథము | గట్టిగ నిల్పుకొనవలయు ఘనతరలీలన్.


మ.

నను నెంతేనియుఁ బెద్దఁ జేసి నలినీనాథాన్వయోత్తంస! యి
ట్లనఁగా ధర్మమె? నీవు నాపతివి తథ్యం బేను నీదాసినిం
దనుమానింపక మీమదిం గలుగున ట్లత్యంతమోదంబుతో
నొనరింపందగుఁగాక పల్మఱును మీ రూహింప నింకేటికిన్.


పురుషుఁడు దైవం బతఁ డే | కరణి నియోగించు నదియె కావించుటగా
కరయఁగ మఱియెందైనం | దరుణుల కొక్కింతయును స్వతంత్రము గలదే!


క.

సలలితముగ నిహపరసుఖ | ములు రూఢి నొసంగి సకలపుణ్యఫలంబు
ల్గలిగిఁచువిభునికంటెను | దలిరుంబోఁడులకు వేఱదైవము గలదే!


సీ.

కాంతామణులకుఁ జొక్కఁపుఁబెన్నిఛానంబు ప్రాకటం బలరారఁ బ్రాణవిభుఁడు
కుసుమగంధులకును గొంగుబంగారంబు ప్రాకటం బలరారఁ బ్రాణవిభుఁడు
కమలాక్షులకు నభీష్టము లిచ్చుదైవంబు ప్రాకటం బలరారఁ బ్రాణవిభుఁడు
చిగురుబోఁడులకుఁ జెల్వగు కల్పభూజంబు ప్రాకటం బలరారఁ బ్రాణవిభుఁడు
చంద్రముఖులకు బహుజన్మజనితదురిత | పటలతిమిరార్కబింబంబు ప్రాణవిభుఁడు
పొలఁతులకుఁ జాలవెలలేనిభూషణంబు | రాజశేఖర! పరికింపఁ బ్రాణవిభుఁడు.


క.

వ్రతములును దానధర్మము | లతులితగురుదేవతార్చ నాదులు విను మో
క్షితినాథ! యించు కేనియుఁ | బతిభక్తికి సాటియగునె భామామణికిన్!


ఉ.

కావున నెల్లరీతులను గర్తవు నీ వెటు లానతిచ్చినం
బావనలీలఁ జేకొనక పల్కుట యె ట్లది గా దటంచు ధా
త్రీవరముఖ్య నిక్కముగఁ దెల్పుము చింతల వేటి కీక్రియన్?
భావభవారిభక్తతతిపాలిట నెప్పుడుఁ గల్గియుండఁగన్.


క.

అన విని జననాథుఁడు వే | దన నొందుచు నవ్విశాలధవశేక్షణ న
క్కునఁ జేర్చి వదలి క్రమ్మఱ | ననియె న్మది దొట్రుపడఁగ నభినవలీలన్.


ఉ.

ఓసరసీరుహాక్షి విను మోకులపావని యోవధూమణీ!
నీసరి యేరి మానినులు సే టొనరింపఁగ ముజ్జగంబుల
న్వాసిగ నేఁడు నాపలుకువాక్యము మీఱఁగ వేశ్యకాంతవై

భాసిలి జంగమేశ్వరుని భావజకేళిఁ గఱంగఁజేయుమా.


ఉ.

వారక యీపురి న్నెచట జారవధూమణి గల్గనందునన్
వారిజనేత్ర! ని న్నిటుల వంచన సేయక వేఁడ్కకత్తెగా
గోరినవారజంగమున కుందగ నీవలసెం గదా మది
న్నేరము లెన్న కియ్యెడల నిల్పుము మద్వచనప్రకారముల్.


ఉ.

నీవుపతివ్రతామణివి నీవలనం దగమెచ్చి మేచక
గ్రీవుఁ డభీప్సితార్థములు బ్రేమ నొసంగెడు సంశయం బిఁకన్
భావమునందు నిల్పక కృపామతిఁ జూడుము నన్ను నియ్యెడ
న్నావుఁడుఁ బువ్వుఁబోఁడి తననాథున కిమ్ముగ మ్రొక్కి యిట్లనున్.


క.

వలనొప్ప నింతపనికై | పలుమఱుఁ బ్రార్థింపనేల పావనమతితో
నలబొజుఁగుజంగమునకుం | జెలువుగ న న్నొసఁగవలయు శీఘ్రమున నృపా!


క.

ధరయెల్ల గుత్తఁగొని యొక | దరి నించుకతావు దీనత న్వేడుక్రియ
న్బరికింపఁగ నిటుల హృదీ | శ్వర కొంచెపుఁబల్కు పల్కవచ్చునె నీకున్?


ఉ.

భూనుతలీల మున్వ్రతముఁ బూనితి రెద్దియు నిత్తు మంచు జం
గానకు వారకాంత నిడఁగా నొనగూడని యంతమాత్రనే
దీనతఁ బల్కఁ బాడియె సుధీజనులెల్ల హసింప? నెందు నే
నేనుఁగ నెక్కి చక్క నవనీశ్వర శక్యమె దిడ్డి దూరఁగన్?


చ.

అనువినుతాంగిపల్కులు దినాధిపవంశపయోధిపూర్ణినూ
వనజవిరోధి యెంతయు నవారితమోహనిబద్ధచిత్తుఁడై
విని యొకయింత సొమ్మసిలి వేఁగమె తెప్పిరి యో నెలంత యి
ట్లనఁగలిగంటిఁగాక తగదా మది నీక్రియ నూహ సేయుటల్?


క.

ఆడినమాట తగ న్విడ | నాడక గైకొన్నమాత్ర నకటా మదిలో
నోడక విటవరునకు నీఁ | బాడియె సువివేక ముడిగి పంకజగంధీ!


గీ.

పద్మదళనేత్ర ని న్నెడబాసి యొక్క | నిమిషమేనియు నోర్వఁగ నేర్చు టెట్లు?
పరమసాధ్వివి నిన్నిట్లు పల్కినట్టి | తప్పు క్షమ సేయు మామది దయ దలిర్ప.


క.

ఈయెడ నింతయు నానతిఁ | ద్రోయక గైకొంటి వెమ్మెతో మఱి యెందున్
నీయట్టిసతులు గలరే | వేయాఱులలోననైన విమలేందుముఖీ!


చంచలనేత్ర! నామదికి సమ్మతిగా నిపు డొక్కమాట యూ

హించి దయ న్వచింపుము మహిం జిరకీర్తు లనేకభంగులన్
నించుమటంచుఁ బల్కుటయు నీలమధువ్రతవేణి నేరుపు
ల్మించఁగ నన్నరేశుని లలింగని యిట్లనెఁ బ్రోడజాడలన్.


గీ.

క్షితిప! యిటుల విచారంబు సేయుచుండి | చిన్నమాటలు పలుకంగఁ జెల్ల దిదియుఁ
గాక మత్స్వాంతవృత్తియుఁ గనుఁగొనంగఁ | దలఁచితేనియు వినుము డెందమున నలర.


సీ.

జననాథ విను హరిశ్చంద్రావనీంద్రుండు గాధేయుకొఱకు లోకంబు లెఱుఁగ
ధారుణీభారమంతయు వేఁగఁబోనాడి తనపొలంతిని బుత్రు నొనర నమ్మి
మునుకొని యంత్యజన్మునివెంట మధుమాంసములు మోచుచును వాని గొలుచుచున్న
నంత నవ్విభునిసత్యవ్రతంబున కాత్మఁ గరుణించి నిజభక్తవరదుఁడైన
కాశికావల్లభుఁడు జగత్కారణుండు | విశ్వనాథుండు చండికాధీశ్వరుండు
ప్రేమ సాక్షాత్కరించి యభీష్ట మొసఁగి | కావఁడే వారి నత్యంతకౌతుకమున!


క.

నీవాడినవాక్యం బిపు | డేవిధముననైన నిర్వహించినదానన్
భావజహరణుఁడు గరుణం | బ్రోవఁగలం డాత్మ నలరి భూవరతిలకా!


సీ.

భక్తి విడకయుండు భల్లాణ యివ్వేళ | మది దృఢంబు మీఱ మట్టుపఱచి
సేయుకార్య మిఁకను జింతింపవలవదు | నాకునైనఁ గడువినమ్రగతిని.


సీ.

అన ఘనజఘనఁ గన్గొని యను జనపతి విను వినుతాంగి శోభనత దనర
నీచిత్త మరయంగ నీచందమున నొత్తి చూచితి నిజమది చోద్య మలర
నిరువురహృదయంబు లేకమైయుండినఁ కోర్కె లన్నియు నొనఁగూడఁగలవు
మొనసి ని న్నీవేషమున నొసంగినయప్పు డవ్విటవరుఁడు క్రోధాత్ముఁ డగుచు
వారకామిని దే కిటు లూరిలోన | వరుని నెడబాసి యొంటిమై సరవినున్న
యట్టిమగనాలిఁ దెచ్చి తీ వనుచు నొల్ల | కాజ్ఞ యొనరింపఁగలఁ డమితాగ్రహమున.


క.

కావున ని న్నీరూపము | తో విటశేఖరునికడకుఁ దోడ్కొని చనఁగా
దీవేళ వేశ్యకామిని | వై వేఁగ రమ్మటంచు ననిచిన యంతన్.


క.

అంతిపురి కరిగి యయ్యలి | కుంతలి వెలయింతి యగుటకుం జనుచున్న
న్నంతంగని యెంతేనియు | సంతసమున మల్లికాంబ సవతికి ననియెన్.


మ.

కల్ల ల్గావు నిరాళిఁ గొన్న విటజంగం బంగనం గోరుచో
నుల్లంబెల్లను బల్లవింప నను నీ వొప్పింపకో చల్లమా
భల్లాణక్షితిపాలశేఖరునకుం బట్టంపుఁబూఁబోఁడివై

చెల్లంబో యిటువంటి చుల్కనిపను ల్సేయంగ నీ కర్హమే?


క.

ఓయప్ప వారకామినిగా |యిప్పు డలంకరించి కర మొప్ప మనో
నాయకునికడకుఁ దోడ్కొని | వేయరుగఁ గదమ్మ నన్ను వికచాబ్జముఖీ.


గీ.

అనెడు కూరిమిసవతి నెంతైనఁగరుణ | మీర నవ్వారిజాక్షి తా గారవించి
పలుకు నిట్లని యోముద్దుకలికి మేలు | చెలఁగి నీబుద్ధిచే వేలు సేయఁజాలు!


ఉ.

నీరజగంధి నీ వనుచు నే ననుచు న్మదిఖేద మెద్ది? యె
వ్వారికతంబున న్వ్రతము వంచన నొందక యుండి భక్తి యొ
ప్పారినఁ జాలు నీవ చను మాత్మ గ్రహించి పుడట్టులుండఁగా
నేరవు కామశాస్త్రగతి నిక్క మెఱుంగవు గోల నారయన్.


క.

ఇభరాజయాన మును నీ | విభుకౌఁగిట మెలఁగుచుండువిధ మంతయుఁ గా
దభినవవిలాససుమశర | నిభుఁ డయ్యతి రతిరహస్యనిపుణుఁడు సుమ్మీ.


ఉ.

చొక్కులఁదక్కుల న్మిగులసొంపగు తేటమిటారిచూపులన్
జక్కనిమందహానములఁ జారులిలాసముల న్సలీలఁ బెం
పెక్కెడు దివ్యవాసనల నింపగుతియ్యనిముద్దుపల్కుల
న్నిక్కపువారకాంతకరణిన్ వలపింపవలె న్భుజంగునిన్.


గీ.

మఱియు నసమాస్త్రశాస్త్రప్రమాణసరణిఁ | దవిలి బురుషాయితాదిబంధములయందుఁ
బ్రోడయై కూడవలయు నేర్పునఁ జెలంగి | పల్లవునియుల్ల మల్లనఁ బల్లవింప.


క.

అటుగాక హృదీశ్వరుచెం | గటనే నియ్యకొనివచ్చి క్రమ్మఱ నిపు డో
కుటిలాలక ని న్నంపినఁ | బటువైఖరి నలుగఁడే నృపాలుఁడు చెపుమా?


గీ.

అను సవతి నూరడిలఁ బల్కి యాక్షణంబ | చల్లమాదేవి తుదిలేనిసంతసంబు
దనరఁ బతిహితమునకునై తానె వేఁగ | మున నలంకృతి యొనరించుకొనఁదొడంగె.


గీ.

సుందరులు గొంద ఱప్పు డయ్యిందుముఖికిఁ | గుందనపుబిందియలయందుఁ బొందు మిగుల
నెంచఁగలిగినపన్నీరు నించి చాల | నంద మొప్పార జలకంబు లార్చి రొగిని.


ఉడురాజవదన యొక్కతె| తడియొత్తె న్రాజసతికి ధౌతాంబరముల్
వడిఁ దాల్ప నొసఁగె సొగసుగ | గడువేఁడుకతో నొకర్తె కాంతామణికిన్.


సొంపుగ నింద్రనీలమణిశోభల నేలఁగఁ జాలి సోగలై
పెంపెసలాడు ముంగురులఁ బెద్దయుఁ క్రొమ్ముడి దిద్ది దిక్కులం
ముంపుచుఁ బెంపుమీఱెడు సమున్నతదివ్యసుగంధయుక్త మౌ

సంపెఁగదండఁ జుట్టె నొకసారసనేత్ర నృపాలపత్నికిన్.


ముద్దులగుమ్మ యోర్తుచెలి ముందర గొప్పమెఱుంగుటద్దముం
దద్దయు నిల్పెనొక్కవనితామణి కస్తురిబొట్టు మోమునం
దిద్దెఁ బడంతియోర్తు సౌరిదిన్మకరీమయరేఖ లెంతయు
న్ముద్దియతళ్కుఁజెక్కులను మోహనలీల లిఖించె నేర్పునన్.


చ.

కలువలఁ గేరు చంద్రముఖికన్గవ నొక్కవధూలలామ చె
ల్వలరఁగఁ గజ్జలం బిడియె నబ్జనిభాననయోర్తు వేడ్క రం
జిలఁగను నీలవేణిజిగిసిబ్బెపుగుబ్బలపైని జొబ్బిలం
గలవ మలందె నంచితసుగంధయుతంబుగఁ జిత్రవైఖరిన్.


సీ.

చారుముక్తాహారవారము ల్గళమున నించె వేడుక నొక్కమించుబోఁడి
సౌవర్ణకర్ణభూషణము లందము మీఱఁ దగిలించె నొకశీతధామవదన
ఘనమైనపచ్చలకడియంబు లిరవుగాఁ బెట్టెఁ జేతుల నొక్కబిసరుహాక్షి
కమనీయరత్నసంఘటితమై వెలుగొందు మొలనూ లిడియె నొక్కమోహనాంగి
పాదముల నందియలు బెట్టె రామయొకతె | నుదుటఁ జేర్చుక్క నిడె నొక్కసుదతి మఱియుఁ
బేరుగల భూషణములెల్లఁ బ్రేమ నిడిరి | రమణు లింపార నప్పు డారాజసతికి.


వ.

ఇ ట్లగణ్యశృంగారధారిణియై యనంతరంబ.


సీ.

ఘనసారచందనకస్తూరికాముఖ్యదివ్యగంధంబులు దిశలఁ బర్వఁ
గింకిణీనూపురక్రేంకారనాదము ల్కడునింపు మీఱ నొక్కటఁ జెలంగ
రత్నసంఘటితమై తనరారు నవ్యకాంచనభూషణములు మెఱయ
భూరికుంతలబంధభారంబుచే మించి మందమై నడకలు సందడింపఁ
బీనకుచకుంభయుగళంబు పేర్మిఁ బొదల | లలితశృంగారలీలావిలాసములను
వాసి మీఱంగ నమ్మహీవరునికడకు | నింతి యరుదెంచె మదనునిదంతి యనఁగ.


క.

ఈరీతి నతులతరశృం | గారము దనరార వారకాంతయఁబోలెం
జేరి తనయెదుట నిలిచిన | నారీమణిఁ జూచిధరణినాథుఁడు వేఁడ్కన్.


క.

ఈలలనారత్నం బీ | నీలాలక యీవినిద్రనీరజముఖి యీ
లీలావతి తగునౌఁ దన | పాలిఁటిజంగమున కంచుఁ బ్రణుతించి వెసన్.


గీ.

భూమివిభుఁ డంతఁ దనయంతిపురము వెడలి | నెలతఁ దోడ్కొని యరుగుచో నింగినుండి
చూచి సురకాంత లెంతయుచోద్య మంది | యెల్లవారును దమలోన నిట్టు లనిరి.

సీ.

ధారుణీశ్వరుబుద్ధి పూరి మెసంగెంబో సరగ నెందుండియో జంగ మొకఁడు
చేరి వారాంగనఁ గోరినతఱి నియ్యఁగొనకొని యెచ్చటఁ గొదువయైనఁ
దనభక్తి చెడకుండఁ బనివడి వేశ్యగా నిల్లాలిని నొసంగె నిట్టిచిత్ర
మొప్పెడుననువార లొకకొందఱును భళా చాన యొక్కతెయైన మానవేంద్రుఁ
డేటికి నొసంగు ముద్దియ లిద్ద ఱగుటఁ | జేసి వారలు తమలోనఁ జెలఁగి పోరు
చున్నఁ గన్గొని య్పి డిచ్చుచున్నవాఁడు | గాని నిక్కంపుభక్తి గాఁగలదె యిటుల?


క.

ఇచ్చిన నిరువురనొక్కట | నచ్చంబగు భక్తితోడ నర్పింపక యీ
కుచ్చితములు దగవనుచున్ | మెచ్చక యొకకొంద ఱేమిమే లనువారున్.


చ.

పురములు వాహనంబులును భూషణము ల్ధనధాన్యము ల్నవాం
బరములుఁ బాఁడిధేనువులుఁ బ్రార్ధన సేయక జంగమయ్య యే
తెఱఁగున వేశ్యఁ గోరె! నతిధీరత న ట్లతఁ డింతిఁ గోరిన
న్ధరణిపుఁ డెట్టు లియ్యకొనెఁ ! దా నని పల్కెడువారు కొందఱున్.


క.

ఇయ్యకొని వారసుందరి | యెయ్యెడలం గల్గకున్న నిల్లాలి నిటు
ల్సయ్యన నొసఁగుట ఘనతయె | యియ్యిలపతి కనుచుఁ గొంద ఱెన్నెడువారున్.


సీ.

ఆసరోరుహనేత్రయైనఁ గాదనకిట్లు పతివెంట వేశ్యయై భవ్యగతిని
జనినంత భక్తియే యనువారు కొందఱు గట్టిగా భక్తిమార్గంబు పూని
నప్పుడే భక్తుండు చెప్పినవిధమెల్లఁ జేసిన నిల్లాలు సేయకున్న
నదియపో చిత్తినియనువారు కొందఱు సతికి భర్తకు నొక్కమతియయైనఁ
గల్గునభిమత మిది కల్ల గాదు నృపుఁడు | లీల నీజంగమునము నిల్లాలి నొసఁగి
హరుని మెప్పించి బొందితో నరుగఁగలఁడు | సరగఁ కైలాసమున కెల్లజనులు నెఱుఁగ.


క.

అనువా రొకకొందఱునై | కనుఁకొన నవ్వేళ నృపతి కాంతామణిఁ దో
డ్కొని చని యల జంగమరాయనిసన్నిధి నునిచి యిట్టు లనియెం బ్రీతిన్.


క.

తగుచిగురుఁబోఁడిఁ దెచ్చితి | నొగి మీకుఁ బరిగ్రహింపుఁ డోసామి! యనన్
నగుమొగ మలరఁగ నపు డ | జ్జగతీపతితోడ విరాగిచంద్రుఁడు పల్కెన్.


గీ.

రమ్ము భల్లాణ నిక్కంపురాజ వనుచు | నెమ్మదిని జాల నీమాట నమ్మియుంటి
మెంత దడవయ్యెఁ బడఁతిఁ దేనేని యిపుడు | పూని నీయోజ మెంతైన మానగలవె?


క.

రంగుగ జంగమవిటుఁ డను | చుం గడునిబ్భంగి జూలకఁజూచి తొడబడవన్
వెంగళివి భూప నీకే | సంగతి నలరారుమానసము నామీఁదన్.

సీ.

కామాంధకారినై కడఁకతో నీరాకఁ గాచుచుండఁగ మూఁడుకన్నులయ్యెఁ
దలయేఱు బరువయ్యెఁ దగ మేను నగమయ్యె గళమూలమునఁ జందు నిలుకడయ్యె
వలనొప్ప మునుపటివగ దప్పె వలపు విరిగెను నడిరేయి సరవినయ్యె
నాకేటి కీవేశ్య నీకేటి నిజభక్తి బూటకంబులచేతఁ బ్రొద్దుఁ గడపి
నాడ వింతియె కాక భూనాథు లెచట! వ్రతము లెచ్చట! ఘనశైవమతము లెచట!
నెందుఁ గొఱగానిపొలఁతుక నిటులఁ దెచ్చి | యందుకొమ్మనువా రెందునైనఁ గలరె!


వ.

అని వెండియు నిట్లనియె.


గీ.

అనవలసి నిన్ను నిటువలె నంటిఁగాక | తగునె వేశ్యలతోఁ బొందు తాపసులకు!
నలసితివి భూప! మాకునై యధికముగను | దీనిఁ గైకొమ్మునీవైనఁ బూని యిఁకను.


సీ.

అనువిటవరుని గన్గొని వినయోక్తి నిట్లను మనుజాధీశుఁ డనువు మీఱ
నయ్యలు మీ రెట్టు లాడినఁ దగుగాని క్షితి నయ్యలకుఁ దెచ్చు చిగురుఁబోండ్లు
నవ్వలుగాఁ జూడ నర్హంబు మాకును దవిలి మీ కిట్లాడఁదగునె మమ్ము?
నాఁకలి గొన్నచో నన్న మెవ్వరికైనఁ గలిగిన విడనాడఁ గాదు సుమ్ము
మీమదికి సంతసంబైన మీననేత్ర | నరయుచుండంగఁ దడవయ్యె నయ్య యింకఁ
దప్పు లెన్నక కైకొమ్ము తరుణి నిపుడు | కరుణ నని భక్తి నడుగుల కొరుగుటయును.


క.

నృపతిఁ గృపఁ జూచి యపు డా | కపటపుదిటజంగమయ్య కడునవ్వుచు నో
తపనకులవర్య ఱోయఁగ | నిపు డాడితిఁ గాక సాటి యేరీ నీకున్.


ఉ.

కావలెనన్నమాత్రమునఁ గౌతుకమున్ జెలువార వారరా
జీవదళాక్షిఁ దెచ్చితివి చె న్నలర న్బదివేలు సేయునీ
నీభావజుచేతిమేలినునుబంగరుబొమ్మను ముద్దుగుమ్మ న
జ్జీవునకు న్విధాతకును శేషునకుం దరమే నుతింపఁగన్?


క.

ముద మొదవఁగ వరచందురుఁ | గదుమఁ దివురు నువిదనుదురు కడుఁబొదలెడుతు
మ్మెదకొదరకడుపుఁ జెదరఁగ | నదలించు న్సుదతిమృదువులౌ పెన్నెరులున్.


క.

వాసిగ నీసుదతీమణి | నాసముగా సమమె యంచు నవగంధఫలి
న్భాసురగతిఁ గన్గొని పరి | హాసం బొనరించు సంతతాంచితలీలన్.


గీ.

చెలఁగి జగములు గెలువంగఁ దలఁచి యిడిన | మరునిబలుసింగిణీవిండ్లు తరుణిబొమలు
కడఁక నవ్విండ్లఁ బూన్చిన కలువతూఁపు | లీపయోజానన మిటారిచూపు లరయ.


క.

చిగురాకుకెంపుబింబము | పగడంబును జెందిరమును బంధూకము ని

మ్మగువయధరమ్ముతోడుతఁ | దగునే తుల యనఁగ నెట్టితావులనైనన్?


క.

పలువరుస మొల్ల మొగ్గల | పలువరుసలఁ గెల్వఁజాలు భామినినునుజె
క్కులు తళుకుటద్దములతోఁ | గలహించుం దొమ్మిదులను గర్ణము లెంచున్.


గీ.

చెలువపలుకులు గండుఁగోయిలల నేలు | నెలఁత చిరునవ్వు లేఁతవెన్నెలల నవ్వుఁ
గలికికంఠంబు క్రముకంబు నలరు భిన్న | ములుగఁ గావించు నెంతయుఁ జలము మీర.


చ.

సరువడి నంచితంబులగు బాహుమృణాళము లొప్ప గొప్పలై
యఱుతను వ్రేలు మౌక్తికపుహారము లంచులఁ జీరులాఁడఁగా
గురుతుగ నవ్వెలందికుచకుంభయుగం బలరు న్మనససరో
వరమున సంభవించి చెలువంబగు తామరమొగ్గలో యనన్.


సీ.

నునునల్లచీమబారును గేరునూగారువళు లబ్ధివీచికావళుల నేలు
నిసుకదిన్నియలతో వెసఁ బోరుఁ బిఱుఁదులు కరితుండముల నెగ్గు లరయుఁ దొడలు
మొఱియు కాహళులతో మొనయును జంఘలు పాదయుగ్మము కచ్ఛపములఁ దోలు
నఖపంక్తి పలుమాఱు నగుఁ దారకంబుల నడలు రాయంచలఁ దొడరి యెంచు
మేలిమిపసిండిచాయలఁ గేలిసేయుఁ | బూని నిక్కంబుగా దీనిమేనికాంతి
యెందు నిటువంటి చెలువైన యిందువదన | కలదె పరికింప మార్తాండకులవరేణ్య!


అని వనిత నెంచి యాగురు | వను నోజననాథ! నీగృహమునకు మముఁ దో
డ్కొని చను వేఁగమ యిఁకఁ ద | క్కినతావులు వలదుసు మ్మొగిన్ మా కనుఁడున్.


నరపతి వల్లె యని య | గ్గురునకుఁ దండయిడుచుఁ గొమరొప్పఁగ నా
యిరువురఁ దోడ్కొని తనమం | దిరమునకుం దెచ్చియునిచి తిరమగుభక్తిన్.


గీ.

అర్ఘ్యపాద్యాదు లొసఁగి ప్రహర్షుఁ జేసి | యిలు వెడలివచ్చి తగఁ దనవెలఁది కనియెఁ
గలికి! యిన్నాళ్ళు నాయక్కు గౌఁగిలించు | వరుస నీజంగమయ్య కీవలయుఁజుమ్ము!


క.

కాదేని దునియలుగ వడి | మోదెద నని చేత ఖడ్గముం బూని మహా
హ్లాదమున నుండె నొకదరి | నాదిత్యకులాంబునిధిశశాంకుఁడు పేర్మిన్.


అయ్యెడఁ జల్లమాంబ విభునానతిఁ గైకొని వాడిచూపు లొ
య్యొయ్యన మీఱ లేనగవు లొప్పుగఁ జెక్కులఁ బార ఠీవిమైఁ
బయ్యెద జార ముద్దునునుఁబల్కులు చె ల్వలరార నవ్విటుం
జయ్యనఁ జేరి మ్రొక్కి నెఱజాణగు టెల్ల నెఱింగి రంగుగన్.


చెఱరకులు గొబ్బరియును శ | ర్కరయుం బాలును ఘృతంబు కలపంబులునున్

నెఱిఫలరసాన్నములు గ్రొ | వ్విరులు న్గడు నొసఁగి యంత వేఁడ్కలు మీఱన్.


గీ.

పండుటాకులు కపురంపుబాగములును | ముత్తియఁపుఁజూర్ణమును గూర్చి ముగ్ధ విడెము
చుట్టి యొసఁగుచు బవశించ శుభగలీల| యున్ననద్దేవు చరణంబు లొత్తుతుండె.


క.

పరిభాషింపఁగఁ జూచిన | మఱి యావటుఁ డించుకైనక మాఱాడక సు
స్థిరముగ నుండిన నమ్మద | కరిగామిని యతనితోడఁ గడువడి ననియెన్.


సీ.

ఏవిచారము లేక యిటులున్నఁ జెంతన జేరిన మే లేమి వారసతికిఁ
బల్కరించిన మాఱుపల్కవు మూగలాగున రతి సేయంగఁ గోర విపుడు
సిగ్గుచేఁ బొరియంగ శిశువ నింతయుఁ గావు కడురూఢి నున్నావు గండు మీఱి
యిత్తఱి నీ కింత మెత్తదనం బేల జాగు మానుము ప్రొద్దు చాలనరిగెఁ
బురుషుఁ డొఁగిఁ జేయిసేయ కేపొలఁతిచేయి | చేయరాదని చూచినఁ జెలఁగియున్న
కొదువ లెన్నఁదలంచియో గుట్టుతోడ | నున్నవాఁడవు నీ కిది యొప్ప దనఘ!


చ.

సరసము మీఱఁ గేరుచును శయ్యకుఁ దారిచి కౌఁగిలించినను
స్థిరముగ మోవి యాని నునుఁజెక్కులు గోకుల నొత్తి లీలఁ బ
ల్మఱు మరుకేళిఁ గబడి చెలిమానసముం గఱఁగింపకున్న నె
న్నరు లింతయు న్మగతనంబని పూని భుజంగపుంగవా!


క.

అగుఁ గాని లెమ్మటంచుం | జిగురాకుంబోడి యతనిఁ జెనకినఁ దా ని
మ్ముగ లేవక స్థాణు వనం | దగయున్నమహాత్ముఁ జూచి తనలో ననియెన్.


చ.

శివశివ! సేవ యెంతయను జేసెనఁ గైకొముఁగానిఁ యీవిట
ప్రవరున కించుకేనియును బాఱదు మోహము నెమ్మనంబునం
దవలిపు డెంత లెమ్మనుచుఁ దా బతిమాలిననుం గఱంగణ డీ
భువిఁ జలికూన పైనిడిన బొం దలరారెడు వెన్న కైవడిన్.


సీ.

నిక్కవంబుగఁ దూర్పుదిక్కు వెల్వెలబాఱెఁ జక్క నొక్కట వేఁగుజుక్క బొడిచెఁ
దామ్రచూడంబులు తవిలి కూయఁదొడంగెఁ జదలువనుడులు తేజంబు తప్పె
జారచోరాదులసంచారములు వాసెఁ గమలాప్తుఁ డుదయించుసమయ మయ్యె
నిపుడైన మరుకేళి నిచ్చసేయఁడు మంకుజంగ మవ్విటచిహ్న చనునె యెందు?
నీశ్వరా యెట్టిచిత్రంబొ యిది! యటంచు | దత్తరింపక విభునిచిత్తంబు గాను
బలిమినైనను గామింతు నలర నతని | ననుచు విరిపాన్పుపై నెక్కి యవ్వధూటి.


సీ.

ఘనతరంబుగ దీపకళికలు నల్గడ నరుఁగఁ గప్రఁపుధూపములు చెలంగఁ

గాంచిసమంచితఘంటానినాదము ల్మొఱయఁ బుప్పొడి భూతికరణిఁ దనరఁ
బరిమళాదులవింతబాగులు చెలువార సొగసుపల్కులు శివస్తోత్రములుగ
నలర సన్మణిగణంబులు హారతులలీల నమరంగ ఫలరసాన్నములు చాల
లింగనైవేద్యములభంగి రంగు మీఱ | నతివ శివరాత్రి చేసెడుగతిని దనర
దేహ మభవున కర్పింపఁ దివిరి యపుడు | కరయుగము చాచి తుదిలేని కౌతుకమున.


క.

ఆలింగని నొనరఁగఁ దా | నాలింగనమునకుఁ దివియ నమ్ముద్దులప్రో
యాలిం గని మెచ్చి హరుం | డాలో నెలనాళ్లబాలుఁడై తగ నిల్చెన్.


గీ.

శంభుఁ డాచల్లమాంబహస్తములలోన | నివ్విధంబున బాలుఁడై నివ్వటిల్లి
యవ్వెలందుకమది గట్టిదనుచు నోలిఁ |జనులఁ జేపూర వాపోయెఁ జన్నుఁ గుడువ.


సీ.

అది విని చాటున నొదిగియున్ననృపాలుఁ డనె సతి కద్భుతస్వాంతుఁ డగుచుఁ
బొలఁతిరో! యిది యేమి పుట్టుగొడ్రాలవై యున్నదానికిఁ జోద్య మొప్పనిట్లు
శిశువు వాపోయెడిఁ జెప్పుమటంచుఁ దా లోపలి కేగక లోతుఁ దెలియ
నడిగిన నిట్లను నవనీశ కంటివా! మెచ్చుగా మిండఁడై వచ్చినట్టి
యొడయఁ డిప్పుడు బాలుఁడై యుండి పొగులు | చున్నవాఁ డనఁ గ్రమ్మర నువిదతోడఁ
దరణివంశాంబునిధిశీతకిరణుఁడైన | ఘనుఁడు భల్లాణధారుణీకాంతుఁ డనియె.


క.

బాలుని కివ్విటపద్ధతు | లేలా వలదనుచుఁ జెక్కు లిరుగడ నొనరం
వ్రేలుమును వేసి ఘృతమును | బాలును బోయుము చెలంగి బాలేందుముఖీ.


గీ.

నావుడు లతాంగి యిట్లను భూవరేణ్య | పాలు ద్రావఁడు కొట్టంగఁ గేలు రాదు
మూఁడుకన్నుల నలరియున్నాఁడు చూడ | నితరులకుఁ జెల్ల దివ్వింత యింతయైన.


గీ.

అనుడు నృపుఁ డింతిఁ దోడితెమ్మని యొడయని | నివ్వలికి మూఁడుకన్నులయీశ్వరుఁడు
వెఱ్ఱిగొఱ్ఱెను జేసినన్ వేశ్య నడిగి | కొనరి మనభక్తి దెలియంగఁ గోరె నిటుల.


క.

అనుటయు బాలునిఁ దోఁడ్కొని వనితారత్నంబు వేఁగ ద్వారము వెడలన్
ఘనుఁ డాశంకరుఁ డంతట | మునుపటితనచిఱుతచందములు మానె వెసన్.


సీ.

జడలలో మిన్నేఱుజాబిల్లి సికపువ్వు పులితోలు నునుశాలు పునుకసరులు
చేత ముమ్మొనవాలు చిలువ నూడిగములు నొసట మిక్కిలికన్ను విసపుఁగుతుక
వెలిమిడిమెయిపూఁత తెలిగిబ్బతత్తడినగ మేనగట్టులసామిపట్టి
మొగమునఁ జిఱునవ్వు మిగులఁ గూరిమిచూపు వన్నెమీఱెడు పాఁవజన్నిదములు
నలర నలువయు వెన్నుండు నఖిలసురులు | మునులు ప్రమథులు గొల్వ సమ్మోదమునను

భవుఁడె సాక్షాత్కరించెఁ గృపాసమగ్రుఁ | డగుచు భల్లాణు నెదుట నత్యద్భుతముగ.


గీ.

అవ్విధంబునఁ బ్రత్యక్షమైనయట్టి | యవ్విరూపాక్షుఁ గాంచి సాష్టాంగ మొఱగి
ముదముతోడుతఁ గేల్దోయి మొగిచి యవని | నాయకు౦ డిట్టులని నుతి సేయఁదొడఁగె.


చ.

జయజయ నీలకంఠ! పురశాసన! శంకర! ద్విడ్భయంకరా!
జయజయ శాంభవీరమణ! చంద్రవిభూషణ! భక్తపోషణా!
జయజయ దేవదేవ! మదసామజభంజన! యోగీరంజనా!
జయజయ ఫాలనేత్ర! విలసద్గుణమండన! దైత్యఖండనా!


లయగ్రాహి.

నారదతుషారకరపారదపటీరదరశారదనిశాలతరనీరదనిభాంగా
వారణసురాహితవిదారణ జగద్భరణకారణ మహాభయనివారణ భృతైణా
సూర! గణనాథ! శ్రుతిపారగ! జగన్నుత! ఘనోరగవిభూష! రిపుహార! గరళాంకా
పారనభవార్చిత! సుధీర! సముదంచితకృపారససమగ్ర! ఘనసారనమహాసా!


దండకము.

 జయ గిరీశ సురేశ ముఖ్యామరస్తోమ మాళిస్థితస్నిగ్ధచామీ కరోదగ్ర ర
త్నప్రయుక్తావతంసప్రభాసంచయాంచత్పదాంభోరుహా! భక్తలోకామరోర్వీరుహా!
హారనీహారకర్పూరడిండీరమందారగోక్షీరహారావళీచారుకీర్తిప్రకాశా! మహే
శా! కపర్దాంచితేందుప్రభామండలప్రస్ఫుటద్దివ్యకల్లోలినీకైరవేందీవరా! ధీవరా! గ్రా
వరాట్కన్యకాచారువక్షోరుహద్వంద్వలిప్తాంగరాగప్రదీప్తోరుదోరంతరా! సంతతో
ద్యత్సరోజాతజాతాండభాండోదరా! భూరివేదండచర్మాంబరా! తాండవాడంబరా!
జంభజిద్రత్నశోభావిడంబోజ్వలత్కంఠహాలాహలా! వాలఖిల్యాదియోగీంద్రహృ
త్పంకజేందిందిరా! సుందరాకార! లోకైకవీరా! సువర్ణాద్రిధీరా! భుజంగేంద్రహా
రా! మహోదార! వారాశిగంభీర! నారాయణస్త్రోత్రపాత్రాంచితానందచారిత్ర!
నీదివ్యచారిత్రముల్ శ్రీశ వాగీశ భోగీశ దేవేశులున్ వర్ణనల్ సేయఁగాఁ జాల రే
నెంతవాఁడన్ మహామూఢుఁడన్ నీవు కారుణ్యభావంబుతో నన్ను రక్షింప నూహింప
నీరీతిఁ బ్రత్యక్షమై నిల్చి బ్రహ్మాదులున్ సిద్ధయోగీంద్రులున్ గానలేకుండు నీపాదకం
జాతయుగ్మంబు వీక్షింపగాఁజేయుటంజేసి నే ధన్యతం జెందితిన్ బూని లోకంబులున్
సత్పదార్థంబుఁ గానంగలేకుండుచందాన నత్యంతభయాంధకారంబు చేఁజిక్కినం
గావఁగా లేక దైవంబులంచున్ వడిన్ ఱాలనెల్లన్ సమర్పించి యందేమియున్ మేలు
నొందంగలేకుందు రెంచన్ ఘనుల్ గొంద ఱిమ్మైన సుజ్ఞానదీపంబు దీపింపఁగాఁజేసి త
త్వంబునుం గాంచి వాంఛార్ధముల్ గొండు రానందలీలన్ చిదానందు నిన్ గొల్చి ము

న్ముక్తికాంతామణిం జెంది శశ్వద్విభూతిం బ్రకాశించుచున్నట్టి సద్భక్తసంఘంబులం బో
లె నన్నుం గృపాదృష్టి నీక్షించి రక్షింపు మీశా! వియత్కేశ! పాపౌఘనాశా! నమస్తే
నమస్తే నమః!


క.

ఇచ్చెద నేవర మయినను | హెచ్చుగఁ బ్రార్ధింపు మిప్పు డిమ్ముగ మీతో
నెచ్చటనైనం దుల యన | వచ్చు నిజంబైన భక్తవరు లిలఁ గలరే?


చ.

అడిగిన లే దటంచు విడనాడక నీదగుభక్తి చక్కగాఁ
గడుఁగడ ముట్టఁజేసితివి కౌతుకముం జెలువార మేలు నీ
పడఁతిని వారకాంతఁగను బ్రౌఢి నొసంగితి నన్నసంశయం
బుడుగుము ధారుణీతలవరోత్తమ నిక్కము మానసంబునన్.


గీ

సుతుఁడనై యుంటి నీ కిపు డతులితముగ | జనకుఁడవు నీవు నీసతి జనని మాకుఁ
దిరము మీఱంగ న మ్ముమాదేవితోడ | సాటిసుమ్ము ధరిత్రీశ! సేటు సేయ?


చ.

అని కృపఁ జేసిశంభుఁ డపు డంబిక కి ట్లను నో వెలంది! యి
య్యినకులనాథుచంద మిపు డి మ్మలరం గనుఁగొంటె! నేను వే
శ్యను వెసఁ గోర నియ్యకొని సద్గణికాంగన గల్గకున్నచోఁ
దనకులకాంతనే యొసఁగెఁ దథ్యముగా వెలయింతి బాగుగన్.


క.

ఇతఁ డింతవిరహయోగుం | డితనకి మనలోక మిప్పు డిత్తమె యనినం
బతిపల్కులు తగ విని పా | ర్వతి దా ని ట్లనియె మిగులఁ బ్రమదముతోడన్.


సీ

ఇందుకిరీట! నీ కేభక్తవరుఁడైనఁ బ్రాణం బొసంగును భాగ్య మొసఁగుఁ
దలఁ దెంచి యొసఁగును లలిఁ దనూజునిఁ గూరగా వండి యొసఁగును గాని యిటుల
మానంబు దిగనాడి మానిని నీరాదు మానమిచ్చుటఁ జేసి మానవేశుఁ
డధికనిశ్చలభక్తుఁ డత్యంతసజ్జనుం డితనికి మనలోక మీయవలయు
ననిన శర్వాణి పలుకుల కలరె నభవుఁ | డంత మునులును బ్రహ్మాదుల నుతింపు
దొగలు ముకుళింపఁ బద్మముల్ తగ హసింపఁ | దరణి యుదయాద్రిపై దోఁచెఁ దత్క్షణంబ.


సీ.

దివి నప్సరోజనుల్ దవిలి నృత్యం బాడఁ గర మొప్ప గంధర్వవరులు బాడ
సకలదేవతలును బ్రకటించి పొగడంగ శుభలీల దివ్యదుందుభులు మ్రోయఁ
బుడమి నెల్లెడలను బుష్పవర్షం బొప్ప నరులెల్లఁ దల లెత్తి యరసిచూడ
భళ్ళాణధరణీశు భామల నిరుపమభర్మవిమానంబుపైని వేఁడ్కఁ
దనర నెక్కించుకొని కడుఘనత మీఱఁ | బూని భల్లాణుతో జగంబులు నుతింపఁ

దనర వృషభేంద్రు నెక్కి భూతలమునుండి | భవుఁడు వేంచేసెఁ గైలాసభవనమునకు.


సీ

అనిన నయ్యీశ్వరుం డానందచిత్తుఁడై గౌరియుం దాసును ఘనతతోడ
భళ్ళాణభూపాలుఁ బ్రమథులలోఁ బెద్దఁగాఁ జేసి పట్టంబు గట్టి మిగుల
మంగళగీతంబు లంగనల్ వెసఁ బాడ శంఖాదిరవములు సరవి మ్రోయ
నిరుగడ బ్రహ్మాదిసురలు సేవింపఁగఁ బ్రమథగణంబులు బలిసి కొల్వ
రమణతోఁ దానె తగ పరబ్రహ్మ మగుచు | జగములన్నియు నేలుచు శాశ్వతముగ
రత్నసింహాసనస్థుఁడై రాజసమున 1 నవిరళంబగు సుఖలీలఁ దవిలియుండె.


సీ

అనుచు సూతుఁడు నైమిశారణ్యవాసులై యలరుచుండెడు శౌనకాదులకును
రమణీయబసవపురాణోక్తమైన యీభల్లాణరాయభూపాలచరిత
వినుపించుక్రమమును బని మీఱ నా నేర్చువిధమున రచియించి విమలభక్తి
జనర మీ కొసఁగితిఁ దగ మీర లిందుల తప్పుల క్షమ చేసి దయ దలిర్ప
నిమ్మహాకావ్య మెప్పుడు నిద్ధరిత్రి | నేర్పుతో విస్తరిల్లి బుధేంద్రు లెల్లఁ
బొగడ నాచంద్రతారార్క మగుచునుండు | నటుల నొనరించి మముఁ బ్రోవుమయ్య శర్వ.


నరవరులకుఁ గృతు లిడి యి | ద్ధరణిం గవివరులు సంపదలఁ బొందుదురౌ
నెఱి నిహపరసుఖములకై | యురుబుద్ధిని నీకుఁ గావ్య మొసఁగితి నభవా!


ఈకథఁ జదివిన వ్రాసినఁ | బ్రాకటముగ వినినయట్టి భవ్యుల కెల్లన్
శ్రీకరముగ నభిమతములు | చేకురఁగాఁ జేసి కరుణఁ జేయు మనంతా.


అని యివ్విధంబున విన్నవించి.


క.

కరతలభరితకురంగా! చిరకరకరుణాంతరంగ! సింధునిషంగా!
కరిదనుజమదవిభంగా! గురుజనహృత్పద్మభృంగ! కుక్కుటలింగా!


మణి.

మురహరశరవర! మునిజనశరణా! సురవరవరద! కుసుమశరహరణా!
చిరతరగుణ! విలసితకరహరిణా! పరమపురుష! నిరుపమశశిభరణా!


మాలిని.

సదమలతరరూపా! సర్వలోకప్రదీపా! ముదితబుధకలాపా! ముఖ్యసత్యానులాపా!
విదళితఘనతాపా! విశ్రుతోద్యత్ప్రతాపా! కదనతలనకోపా! కాంచనాహార్యచాపా!


గద్య.

ఇది శ్రీమత్కుక్కుటేశ్వరవరప్రసాదలబ్ధకవితాసామ్రాజ్యధురంధర
ఘనయశోబంధుర కౌండిన్యగోత్రపవిత్ర కూచిమంచి గంగనామాత్యపుత్ర బుధజన
విధేయ తిమ్మయనామధేయప్రణీతంబైన రాజశేఖరవిలాసంబను మహాకావ్యంబునందు
సర్వంబును దృతీయాశ్వాసము.