Jump to content

రాజవాహనవిజయము/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీ

రాజవాహనవిజయము

(చతుర్థాశ్వాసము)

శ్రీవేంకటగిరి వల్లభ
శ్రీవామాక్షీవతంసహృల్లభ హుంకా
రావల్గుకంసమల్లభ
భావజభల్లభయదాయ్యపాంగతరంగా.


వ.

అవధరింపుము.

1

1. శ్రీవామాక్షీవతంస = లక్ష్మియను స్త్రీశ్రేష్ఠురాలియొక్క, హృల్లభ = మనస్సును బొందినవాఁడా. ఆవల్గు = కఠినమైన, కంస = కంసునియొక్క, మత్ = మథనమును, అభ = పొందినవాఁడా.

క.

అలయాధరఘృణితృణితకి
సలయామణిరమణి యరుఁగు సమయమున మహీ
వలయాఢ్యుఁడు విలయానల
మలయానిలఖిన్నహృన్నమన్నయభరుఁడై.

2

2. ఆలయా. . .మణి = స్త్రీశ్రేష్ఠురాలు.

ఉ.

తాలిమిఁ దూలి తూలి చెలి దర్పకుఁ డప్పుడె పంపు తమ్మిపూ

వాలికె తూపొ క్రొంజెమటవాసకుఁ గారణమైన నిద్దపుం
గోలమెఱుంగొ యాననచకోరహితాగతరశ్మియో దయా
లోలమృగాక్షి నాపయిఁ దళుక్కున జూచిన చూపు బాపురే.

3


క.

ఒప్పులకుప్ప యొకప్పుడు
రెప్పార్పని చూపు బాపురే ఱెక్కలచా
ల్విప్పి కదల్పని తేఁటియ
యొప్పునె సామ్యంబు వికసితోత్పలరుచికిన్.

4


క.

నిగుడించి వెనుకకా చెలి
సొగసుగఁ గడకంట నాటఁ జూచిన చూపుం
దెగనిండఁ దిగిచి మరుఁ డె
చ్చుగ విడచిన కలువతూపు సుమ్మన నేలా.

5


క.

ఉడురాజముఖీరత్నము
కుడియెడమల బెళఁకిచూచు కులుకుంజూపుల్
వెడవిల్తుఁ డుభయకరములఁ
దొడఁగి వరుని నేయు కలువతూపులు గావే.

6


ఉ.

ఆ కడకంటిచూపు టొర
పా యపరంజి మెఱుంగుచెక్కులా
చైకురచంచరీకరుచి
సంచితమేచక చాకచక్యమా.

7

రాకసుధాంశు రా కదె పరాకని రేక నిరాకరించుమో
మా కుచకుంభజృంభణ మయారె యొయారికి దానికే తగున్.

7

7. చైకుర = కేశసమూహ మనెడు, చంచరీక = తుమ్మెదలయొక్క, రాకసుధాంశున్ = (రాక = నిండుచంద్రుఁడుగల పున్నమయొక్క, సుధాంశున్ = చంద్రుని.) రాకు = రావద్దు. అదం పరాకు = అదుగో అజాగ్రత్తగా నున్నావు. రేకన్ = భాగము చేర.

క.

ఆ గుణవతి ముఖ కుచ కచ
భా గరిమ సుధాంశు లికుచ బలభిన్మణికా
ధాగధగీ ధైగధగీ
నైగనగీ వైభవముల నగనగుమిగులన్.

8

8. భా= కాంతీయొక్క. లికుచ = గజనిమ్మపండ్లుయొక్కయు, బలభిన్మణికా = ఇంద్రనీలములయొక్కయు.

క.

ఆమరీ నిభ నఖ జిత శు
భ్ర మరీచి ప్రమద సరియె రమణులు కచ వి
భ్రమ రీతుల భ్రమరీతులఁ
జమరీ కుల సమతఁ జెలగు జలజేక్షణకున్.

9

9. అమరీభ = దేవతాస్త్రీలతో సమానురాలగు నవంతి. నఖ ...ప్రమద, నఖజిత = గోళ్లచే జయింపఁబడిన, శుభ్రమరీచి = చంద్రునియొక్క, ప్రమద = స్త్రీలైననక్షత్రములుగలది. శశములచేత = నాడుతుమ్మెదసామ్యముచేతను, చమరీమృగసామ్యము చేతను నొప్పు నవంతికి, రమణులు సరియే = సామాన్యస్త్రీలు సమాన మౌదురా.

ఉ.

తమ్మిగదామొగంబు నెగతావుల ఠీవుల నీను జాళువా

కమ్మిగదా మెరుంగుమెయి కల్వ కటారి మిటారి కమ్మదో
దుమ్మిగదా మదాళి తతిఁ దోలెడు కీల్ జడముద్దుగుమ్మ చె
ల్వమ్మున కెంతయైన విలువా చెలువా మఱియుం జగంబులన్.

10

10. దోదుమ్మి = ఆయుధవిశేషము.

ఉ.

చక్కెర నీరుగాఁ గఱచుఁ జక్కని క్రొవ్విన తేనె పల్చనౌ
నక్కిసలంబు లేఁత మణు లన్నను ద్రాసముఁ జెందు దొండపం
డెక్కుడు కోఁత నొందుఁ బని కెంతయు రాకరుఁగుం బ్రవాళ మ
మ్మక్క వసుంధరాధర కుచాధర మీధర నెంచుచోటులన్.

11

11. వసుంధరాధర = పర్వతములవంటి, కుచా = స్తనములుగల యవంతియొక్క, అధరము = పెదవి. నీరు = చూర్ణము. త్రాసము = భయమనియును, మణిదోష మనియును. ఇచట చక్కెర మొదలగువానికి వాయాగుణములు స్వతస్సిద్ధములు.

చ.

అతిమధురంబుగా పెదవి యభ్రముగా నెఱికొప్పు జ్యోత్స్నగా
సతతము లేఁతనవ్వు ఘనసారముగా నునుదేఁటమాట యం

చిత దరదంబుగా గళము చిత్రముగా నిలు వబ్జనేత్ర స
మ్మతిఁగనుఁగొన్ రసజ్ఞునకు మందునకుం దగ నంద మందదే.

12

12. రసజ్ఞునకున్ = సరసునకు. అతిమధురంబు = మిక్కిలి తియ్యనిది. ఆభ్రము = మేఘము. జ్యోత్స్న = వెన్నెల. ఘనసారము = కర్పూరము, దరదము = శంఖమును ఖండించునది. నిలువు = ఆకారము. చిత్రము = చిత్తరువు, ఈ చిన్నదానిఁ జూచిన రసజ్ఞులకే యిట్లుండఁగా. మందునకున్ = మూఢునికి. అందముగా నుండదా, (లోకమందు రసికునకు నెంత సౌందర్యవతియైనను నచ్చదు. మూఢునికి గురూపి యయినను సౌందర్యవతివలెఁ దోచును.) ఇందు వైద్యపరముగా మఱియొక యర్థముగలదు. అతిమథురమను గ్రంధ్యాణము, అభ్రము = అభ్రకము. జోత్స్న = పొట్లతీగె. ఘనసారము = పచ్చకర్పూరము. దరదము = పాదరసము. చిత్రము = చిత్రమూలము, రసజ్ఞునకున్ = రసప్రయోగము నెఱిఁగిన వైద్యునికి. మందునకున్ = ఔషధమునకు.

క.

చెలి డాసి తమిఁ గరంబుల
గిలిగింత లొకింత వింత గీల్కొన నేఁ డు
త్పలపత్త్రము నిలిపె నగాం
చలమున రాజనఁగ దగుట చక్రం బెఱుఁగున్.

13

13. తా నాచిన్నదానికిఁ దగుదునని చంద్రుని మిష చేసి రెండర్ధములుగా రాజు చెప్పుచున్నాడు. రాజు = చంద్రుఁడు, ఱేఁడును. చెలిన్ = కల్వపొదను, అవంతిని. తమిన్ = రాత్రియందును, కామముచేతను. కరంబులన్ = కిరణములచేతను, హస్తములచేతను, గిలిగింతలు = వికసింపఁజేయుటలు, కితకితలు. ఉత్పలపత్త్రము = కలువరేకు, నఖక్షతవిశేషమును. నగాంచలమునన్ = పర్వతశిఖరమందును. (ఉపమేయ నిగరణముచేత) స్తనాగ్రమందును. చక్రంబు = చక్రవాకము. దేశమును. నేనొచిన్నదానికిఁ దగుదు ననుట లోకమెల్ల నెరుఁగునని తాత్పర్యము.

సీ.

ఇది కాంత కాంతారహేల వాటింపుచో
                 గాలుజారిన పరాగంపుదిన్నె
యిది కొమ్మ కొమ్మకై యెగయుచో నందంద
                 చిందు మాకందమరందధార
యిది కన్నె కన్నెనారదముల కొకతెతో
                 గోపించి వెదజల్లు కుందబృంద
మిది చెల్వంబు గదసిపైఁ బద మూది
                 మేను జేర్చిన కమ్మ మెట్టదమ్మి


గీ.

ఇచటఁ గూర్చుండి చెలువ బల్ హేల లనియె
నిచ్చట మదీయలావణ్య మిచ్చ మెచ్చి
తొగరు చిగురాకు పొగరున సగము గొఱికి
మగువ కిడు కోయిలనుగాంచి పొగిలె నబల.

14

14. కాంతార = వనవిలాసము. మాకంద = మామిడిపువ్వులయొక్క కన్నెనారదములకున్ = లేఁతనారింజచెట్లకు.

క.

అని చింతింపుచు వని జ
వ్వని వనితలఁ గూడి మెలఁగు నలి చప్పరముల్
నన చిదిమి పొదలు పొదలం
బనివడి వడి వెదకి వెదకి మదనాలసుఁడై.

15

15. పొదలు పొదలన్ = - వృద్ధిఁ బొందుచున్న పొదరిండ్లయందు. హేల లనియెన్ = విలాసవాక్యములు బలికెను.

సీ.

చెలియ నెమ్మేను జూచితినేని సంపంగి
                 దండ నీ కర్పించె దన్మనోజ

కొమ్మ నెమ్మొగముఁ గన్గొంటినేని సరోజ
                 తతిఁ బూజ నినుఁ జేసె ద న్మిళింద
యింతి వాతెరఁ గంటినేని నీకు విపక్వ
                 బింపఫలంబు లర్పింతుఁ జిలుక
చెలువ పాదములు జూచితినేని నీకు లే
                 జిగురాకుఁ గాను కిచ్చెదఁ బికంబ


గీ.

మనుపుఁ డాపద మ్రొక్కు సంపద మరపురుఁ
జేయఁ జిత్తంబు రాసేవఁ జేయ నేర్తు
ననుచు ననుచు వచోరీకు ఈ లరసి సరసి
రుహ శిలీ ముఖ ముఖులఁ బేర్కొనియె నృపతి.

16

16. ఇచట రాజు తా నేయవయవముఁ జూతునో దానివంటివస్తువు నిచ్చెదనని మ్రొక్కుకొన్నాఁడు అని చమత్కారము. ననుచు వచోరీతులన్= వికసించు వాక్యపద్ధతులచేత, సరసిరుహశిలీముఖముఖులన్ = మన్మధుఁడు మొదలగువారిని.

వ.

ఈ కరణి ధరణీపతి తరుణీ మణి వియోగ భోగసమా
గత మదన వేదనాక్రాంత నిజస్వాంతుండై లతాంత
రసాలవాల రసాలజాల స్మరలీలా ఖురళిం గెఱలి,
మరలి మరలి పొరిలినం దెరలి సరలీకృత చంద్రోపల
వేదికా తలంబున శీతల కృత్యబు లయ్యధిపత్యమా
త్య పుంగవు లొనర్చి తేర్చిరి. కొంత కొంత నంత
నవంతికాపురంబున నవంతీకాంత యంతిపురంబుఁ
జొచ్చి విధుకాంత పృథుకాంత శుద్దాంత సౌధాంత
రాళ కేళికా బాలికా హంసతూలికా తల్పంబున
మేను గదియించి యపార చింతా పారావారడోలా

య మాసమానస నౌకయై ఫాలజిత బాలచంద్రిక
బాలచంద్రిక నిట్లనియె.

17

17. భోగ = అనుభనించుట, లతాంతరస = పుష్పమకరందము. ఆలనాల = పాదులయందుఁ గల, రసాలజాల = మామిడిచెట్ల సమూహమనెడు. స్మరలీలాఖురళిన్ = మన్మథుని విలాసార్ధమగు గరిడీయందు. విథుకాంత = చంద్రకాంతమణులచేత, పృధు = గొప్పలగు, కాంతి = సుందరములగు, కేళికా బాలికా = ఆడుకొనుపిల్లలతోఁగూడిన. మానసనౌక = మనస్సనెడి యోడగలది. ఫాల = నుదిటిచేత. జిత = జయింపబడిన. బాలచంద్రిక = లేతచంద్రుఁడు గలది.

సీ.

మనకుఁ జేరువ చందమామైన రామోముఁ
                 గననీక హృదయంబుఁ గందఁ జేసె
నమృతంపునడబావి లో యగు భూవిభుని మోవి
                 యందనీక కళంక మందఁ జేసెఁ
దంగేటిజున్నైన ధరణీశు పల్కుఁ గో
                 రిక విననీక మేల్ రేచి విడచెఁ
గొంగు బంగారైన ఆ కువలయాధిపునకా
                 మొరయంగ నీక కా కొందఁ జేసె


గీ.

దృఢ పరీరంభ సుఖవిఘ్న దేవతామ
తల్లి గా కిది తనుఁగన్న తల్లి యేనె
తల్లికుచ కుచ యిప్పుడే తల్లి కొనియె
దల్లిపై వగపుల నాపఁ దల్లి తరమె.

18

18. ఆమొరయంగనీక = పైకొననీక. కాకు =కష్టము, పరీరంభ = ఆలింగనముచేత నైన. విఘ్న = విఘ్నములకు, దేవతామతల్లి = దేవతాశ్రేష్ఠురాలు. లికుచ కుచ = గజనిమ్మపండ్లవంటి స్తనములు గల యోబౌలచంద్రికా, వెతల్ = ఆయాసములు, ఏతు = అతిశయముగా. అల్లికొనియెన్ = ఆక్రమించెను. తల్లి = అమ్మా! ఓ బాలచంద్రికా! పైవగపులన్ = ముందువచ్చు దుఃఖములను, ఆపన్ = మాన్పుటకు.

ఉ.

తల్లులు లేరొ కల్గరొ సుతల్ తనుజాతల కాడుపోడుముల్
మొల్లమి నుల్లసిల్లకయ మున్న సమున్నత విభ్రమాంబురు
డ్భల్లుఁ డనుంగుటల్లుఁడు శుభావహుఁ డెవ్వఁడొ యండ్రుగాక కా
కల్లతవంటి పట్టి కిడుగామిడిఁ గంటివె కామినీమణీ.

19

19. తనుజాతలకున్ = కొమార్తెలకు, ఆడుపోడుముల్ = స్తనములు మొదలగునవి. సమున్న...ల్లుఁడు = (సమున్నతవిభ్రమ = గొప్పవిలాసములచేత, అంబురుట్ = పద్మమే, భల్లుఁడు = బల్లెము గల మన్మథుడైన) కాకల్ = బాధలు, గామిడిన్ = గొప్పగ్రహమును.

ఉ.

అన్నరపాలు వాలుగుల కగ్గలమౌ తేలిసోగకన్ను లా
కొన్నెల నెన్నొసల్ వెడదరొమ్ము చొకారపుతేఁటచెక్కు ల
భ్యున్నతబాహుపీఠి యొరపు న్మెఱపు న్మరపించు నంగముం
గన్నులఁగట్టినట్టయిన గంటికి నిద్దుర రాదె నెచ్చెలీ.

20


శా.

ఈ యంభోధిపరీతభూభుజులయం దెందైనఁ గల్గొంటివా

యా యాకర్ణవిశాలలోచనయుగం బాపూర్ణబాహాంతరం
బా యాజానుభుజాభిరమ్యవిభవం బాయంగసౌభాగ్యకం
బా యింద్రోపలనీలకుంతలకులం బంభోజపత్త్రేక్షణా.

21


క.

కనుమూసినఁ గనువిచ్చిన
గనుపుల విలుకాని వ్రాయఁ గణఁగిన నేవే
ల్పును దలఁచిన రాపట్టియు
కనుపట్టెడు నెట్టులోర్వఁగలఁ గలకంఠీ.

22

22. కనుపులవిలుకానిన్ = మన్మథుని, రాపట్టియ = రాజకుమారుఁడైన రాజవాహనుఁడే.

ఉ.

కన్నియ యెన్నియేళ్ళు విరిగన్నెరులన్ హరుఁబూజ సేసిరో
వెన్నెల బైట సౌధ గృహవీథుల నాథుల పేరురంబులం
జన్నులు దార్చి మోపి నడుచక్కిఁ జురుక్కునఁ బంటనొక్కుచుం
కొన్నిరహస్యముల్ దడవికొంచు రమించు నితంబినీమణుల్.

23


సీ.

కొంద ఱిందీవరాక్షులు గొల్వ నున్నచో
                 వెలచెల్వ యేతెంచి బలువిపంచి
మంచి మార్గము వినిపించి మించినదాని,
                 యరిది గుబ్బలమించు లల్లజలధి

కాంచీధవాగ్రణి గాంచిన యాదృష్టి
                 యేనెఱింగిన గాయ లెంత గొప్ప
లంచు మాటిడి మేను పెంచు ఘర్మాంబువుల్
                 గనఁ జెలివెట్ట బాగా లొసంగె


గీ.

నంచుఁ గికురించ గాత్రరోమాంచసమితిఁ
దెలసియేఁ గన్నెఱం జేయ దీప్త రత్న
కుడ్యబింబితమామకాంఘ్రులకు శిరముఁ
జేర్చి పతిసంజ్ఞఁ గినుకఁ జల్లార్చు టెపుడొ.

24

24. వెలచెల్వ = వేశ్య. జలధికాంచీధవాగ్రణి = రాజశ్రేష్ఠుఁడు. కాయలు = వీణకుగట్టిన యానబకాయలు. వెట్టబాగాలు = వేఁడితాంబూలములు. కికురించన్ = మాటుఁబెట్టఁగా, రాఁగల దాని నూహించి వేఁడుకపడుచున్నది.

మ.

అని లేచుం దలయూచుఁ బానుపున మే నందిచ్చు నిందించు జ
వ్వన మెంత వ్వలవంతఁ జేసె ననుచు న్వాక్రుచ్చు రాపచ్చవి
ల్తుని మెచ్చుం గనువిచ్చు మూయుఁ బొరలున్ లో వెచ్చ నూర్చున్ లతాం
తనటత్కుంతదురంతకృంతనకళాతంతన్యమానాంగియై.

25

25. లతాంత ... నాంగి = లతాంత = పుష్పములనెడు. నటత్ = కదులుచున్న. కుంత = బల్లెముయొక్క. దురంత = అంతము లేని. కృంతన = ఖండించుట యనెడు విద్యచేత. తంతన్యమాన = మిక్కిలి బాధపడుచున్న. ఇది లాక్షణికార్థము. అంగి = శరీరము గలది.

వ.

ఇత్తెరంగున బిత్తరి కురంగనయన వదనాంబుజమో
దాస్వాదవినోదంబున కేతెంచి, నాసికాపుటిని
గాంచి కాంచనకుసుమభ్రాంతి బెగడి, సుడివడి లే
చిన గండుతేఁటిక్రియ ముక్కర కట్టాణి దెక్క
పయిం జనుదెంచు వేఁడినిట్టూర్పు గాడ్పుచేఁరే
గఁ జనుంగవఁ దెలిపట్టురవిక చెరంగు రేవెలుఁగుఁ
దొలంగు బంగరుగుబ్బలి వలి మంచుఁ దలప
నఖండవిరహచండిమవాండుతరగండంబుల
మరి నిండుకొనిన కన్నీటిచినుకులు మినుకు మినుకు
నుబెళుకు బేడిసలు సుధాకరకాంతకాంతఫలకంబుఁ
గ్రక్కిన చొక్కంపు ముక్తాఫలంబులపై జలంబు
సూపఁ మధ్యాంబరమధ్యంబునం గాపురమగు యప
రంజి వీణె మెఱుపుల రంజిల్లు నల్లపట్టు పుట్ట
మెఱుఁగు మొఁగులని బాహులేయ హరి వచి
విచ్చి పురివిచ్చినవిధంబునఁ బయోదరధరాధరంబు
కాక చల్లార్పంజేరి శక్యంబుగామిఁ దొట్రుపడు తొలి
పటలి యనఁ జటులమోహాంధకారంబు మ
జోక శోకాంబుధి వెల్లివిరిసిన తెల్లమిఁ బెల్లుగా
కెక్కిన వలపు మున్నీటం దేలు శైవలపు గవి
ల్లమిఁ బల్లవభల్లుండు తలమునుకలుగాఁ బరపి
గలువ తూఁపు గమి పెల్లడిఁ హల్లకబంధుని య
బల్లెంబులఁ జిమ్మ, జల్లివిడిఁ బడిన పగిదిఁ జిగు
కాఁడు తెగనిండఁ దిగిచి గురుకుచంబు లేయ, న

పడిన వడువునఁ గ్రొమ్ముడి విడి కుడియెడమలకుం
బొరల నెరుల గుంపు చిందరవందరయై చెదర భిదుర
దసదృశదశావివశాంగియై శుకీతురంగీకు కెంగేలి
సంపంగి పిరంగిచేఁ దాల్మి దొరంగి తరంగితచింతం గరంగి
చొరం గిఱుదైనం గని కురంగీదృశలు శిశిరకృత్యంబు
లు సేయ నూహించి గృహరామావనికి రామామణిం
దోడ్కొని చని చలువచప్పురంబున నప్పురంధ్రు
లుప్పరంబైన కప్పుకంపుఁదిప్ప నప్పుడొప్పుల కుప్ప
నుంచి.

26

26. ముక్కెరకట్టాణి = అడ్డబాసముత్యము. సుధా...ఫలకంబులన్ = చంద్రకాంతమణులయొక్క రమ్యంబు లయిన పలకలయందు కాపుర మగు = ఉన్నట్టి. ఇది పుట్టమునకు విశేషణము. బాహులేయహరి = కుమారస్వామియొక్క గుఱ్ఱమైన నెమిలు. విరివిచ్చి = విస్తరించి, జోకన్; తెల్లమిన్, మొల్లమిన్, పెల్లడిన్, పగిదిన్, వడువునన్ ఇవి ఉత్ప్రేక్షావాచక శబ్దములు, పల్లవభల్లుండు = మన్మథుఁడు, హల్లకబంధుని = చంద్రునియొక్క, అల్లుండు = మేనల్లుడైన మన్మథుఁడు, జల్లివిడిన్ = జల్లున, తెగనిఁడన్ = నారియంతయు, అనఁగా ఆకర్ణాంతముగా, తిగిచి = లాగి, అల్ల = నారియైన తుమ్మెదబారు, భిదురత్ = వజ్రాయుధమై యాచరించుచున్న, దశా = అవస్థచేత, శుకీతురంగీకు = మన్మధునియొక్క, కిఱుదు = హీనము. మహిజాని సుధాంశు = రాజచంద్రునియొక్క.

ఉ.

బంగరుకమ్మి వంటి మనబాల తనూలత వెండితీగెతో
సంగతి సల్పెనమ్మ కరశాఖలకుం దఱులిచ్చు గాజులున్

ముంగలి కేగెనమ్మ చనుముత్తెము లశ్రునిపాతచూత్క్రియా
సంగములయ్యెనమ్మ మహిజాని సుధాంశు కథావృథావ్యధన్.

27


ఉ.

కోయిల ముద్దరాలి కనుకూలపతిక్రియ లేని పెట్టుమం
దాయెఁగదమ్మ తమ్మి విరియమ్ముల గాయము గంటులేనిపో
టాయెఁగదమ్మ, మావియును హా ప్రతి లేని మహానలాంబకం
బాయెఁగదమ్మ, యమ్మగధుఁ డారడిఁ దెచ్చెఁగదమ్మ, కొమ్మకున్.

28

28. పతిక్రియ = పెనిమిటియొక్క సంయోగము.

గీ.

మొగులు చిఱుదాయ యీతోఁట మొగలుదాట
దిగులు పడి చింత గుండియల్ వగులు కాంతఁ
బొగులు నారాజుతోఁ గూర్చి నెగులు దీర్చి
తగులు సేయమిఁ బరుఁడు వెన్ దగులు మరుఁడు.

29

29. మొగులు = మేఘముయొక్క. చిఱుదాయ = చిన్నశత్రువు. మొగలు = మొదళ్ళు . (పరుఁడు = విరోధి.)

క.

కొమ్మా క్రొమ్మావి చిగురుఁ
గొమ్మా రమ్మా యరంటి క్రొన్నన తేనెల్
దెమ్మా హైమాంబువు లం
దిమ్మా యని సఖులు శైత్యకృత్యాదరలై.

30

30. 1 కొమ్మా = ఓచిన్నదానా 2 కొమ్మా = పుచ్చుకొమ్ము. హైమాంబువులు = పన్నీరులు.

ఉ.

గంద మలందరే చనుసెగం దలమంచు నమందకుంద మా
కందమరందబృంద మెసగం దనువల్లికయందుఁ జిందరే
చందనగంధులార ములుచందన మందక నిందు నిందిరా
నందను వందనంబుఁ గనినం దనరుం దనయంత గాంతయున్.

31

31. దలము = దళసరిగా, మాకంద = మామిడిచెట్టుయొక్క. ములుచందనము = మూఢత్వము.

మ.

కొమలారా కమలాస్త్రు వ్రాయుటరుదే కోదండ మీయింతి మే
ల్బొమ మేల్బంతిగ వ్రాయుఁ డంబకము లీపూఁబోడి కన్ తీరుగా
నమరంజేయుఁడు రూపవైభవము నే డమ్మాగధుం జూడ రా
సమ మయ్యిద్దఱికంచు వ్రాసి మరుఁబూజల్ సేసి కేల్మోడ్చుచున్.

32

32. బొమమేల్పంతి = కనుబొమల తుల్యము. అంబకములు = కన్నులు.

ఉ.

దండము నీకు భీమధృతిదండనమండనపండితేక్షుకో

దండ జోహారు నీకు యమదండకఠోరనిశాతకాండకో
దండ సలాము నీకు సమదండజరాజవిరాజమాన వే
దండ వధూటి కీవె కద దండయు దాపును శంబరాంతకా.

33

33, భీమ .. కోదండ = (భీమ = శివునియొక్క, ధృతి = ధైర్యముయొక్క, దండన = శిక్షించుటయనెడు, మండన = అలంకారమందు, పండిత = నేర్పుగల, ఇక్షుకోదండ = చెఱుకువిల్లు గలవాఁడా) నిశాత = తీక్ష్ణములైన, కాండ = బాణములుగల. సముదం.... వేదండ, సముత్ = అతిశయించుచున్న, అండజరాజ = చిల్క యనెడు, విరాజమాన = ప్రకాశించుచున్న, వేదండ = ఏనుఁగుగలవాఁడా.

ఉ.

చక్కనివారిలో మొదటిచక్కనివాఁడవు చొక్కి చక్కెరల్
మెక్కెడు తమ్మిపక్కెరల మిక్కిలి నిక్కిన ఱెక్కజిక్కిపై
నెక్కెడు నెక్కటీఁడవు మహేశ్వరు తొల్ జగజెట్టి వక్కటా
యెక్కడిమాట నీకు నెదురే మదిరేక్షణ లిక్షుకార్ముకా.

34

34. తమ్మిపక్కెరల = పద్మకవచములుగల, ఱెక్కజిక్కి = ఱెక్కలుగల గుఱ్ఱము, చిలుకయనుట. ఎక్కటీఁడు = అసహాయశూరుఁడు.

ఉ.

అక్కట చొక్కటంపుటిగురమ్ముల రొమ్ములు నజ్జునజ్జుగాఁ

జెక్కెద వంచుఁ గా చకితచిత్తత ముగ్గురు వేల్ప లక్కునం
బుక్కిట నొక్కప్రక్క నొకపూట వధూటుల డించఁబోరు హా
యెక్కడ నీపరాక్రమము లేమనవచ్చు ముకుందనందనా.

35

35. చొక్కటంపు = నిర్మలములైన. నజ్జునజ్జుగాన్ = చిన్నచిన్నముక్కలుగా.

వ.

అని యనేక వాచాడంబరంబుల శంబరధ్వంసిని హుసీ
గమనావతంసంబులు ప్రశంసింప శంపాలతాపఘనాప
రితాపఘనాటోపం బిక్షుచాపప్రతాపజాతరూప
కలాపంబై యిమ్మడించిన.

36

36. శంపా...టోపంబు = (శంపాలతా = మెఱుపుతీగవెటి, అపఘనా = అవయవములుగల స్త్రీయొక్క, పరితాప = బాధయొక్క, ఘన = గొప్పదియైన, ఆటోపంబు = హడావిడి) ఇక్షు.. లాపంబు = (ఇక్షుచాపప్రతాప = మన్మథప్రతాపమువల్ల, జాత = పుట్టిన, రూప = స్వరూపము, కలాపంబై = అలంకారముగలదై. అనఁగా శరీరతాపమునకు మన్మథప్రతాపము తోడైనదనుట. ఇమ్మడించినన్ = రెట్టింపు కాగా.

ఉ.

కన్నులఁ గల్వ లింపుడిగెఁ గమ్మని మోము సరోజ మంతకున్
భిన్నతఁగాంచెఁ బాదముల గెంజిగురున్ వరుగయ్యె బాహుపై
నున్న బిసంబు గందె సతి యొప్పు దృగాదుల పాటిగాక కుం

దెన్నెరి నుత్పలాదులనఁ దేరిన తన్వి ప్రతాప మెట్టిదో.

37

37. ప్రతాపము = శౌర్యమనియు, అతిశయతాపమనియు. చలవకై యుంచిన కల్వలు మొదలైనవి శరీరపు వేఁడిచేత వాడిపోయినవి.

సీ.

కొమ్మ యూ ర్పలమిన తమ్మి కంతుని కమ్ము
                 గాఁ గాను కొసఁగఁ గైకమలు టెంత
వనిత నంటిన చేఁత నన తేనెఁ దేఁటికిఁ
                 జోసిన నోరెల్లఁ బొక్కు టెంత
చెలి పాన్సుకడ నున్న చిగురుఁ గోయిల నోటి
                 కిడిన నాలుక బొబ్బ లెగయు టెంత
చెలువ గుబ్బ నలందం జిందిన గందంబుఁ
                 గ్రోల నిచ్చిన గాలి గూలు టెంత


గీ.

యరుణకరతేజమును సమ్ముఖార్భటియు మ
హారసజ్ఞత గంధమహత్వ మతను
ముఖ్యులకుఁ గూడదని కొంతముగ్ధకాంత
లంది రంతఃపురమున నేకాంతచింత.

38

38. కై = చెయ్యి, కమలుట = కాలుట, బొబ్బ = పొక్కులు. ఈ పద్యమందు సీస చరణములు నాలుగింటితోటి అరుణకరతేజము ఇత్యాది నాలుగిటికిఁ గ్రమసంబంధము. అరుణకరతేజము = సూర్యుని వంటి తేజస్సనియు, ఎఱ్ఱని హస్తముయొక్క తేజస్సనియు. సమ్ముఖార్భటిన్ = దగ్గర హడావడి యనియు, గొప్ప నోటి హడావడియనియు. మహారసజ్ఞత = గొప్పరసముల నెఱుఁగుటయనియు, గొప్పనాలుక గలుగుటనియు. గంధవహత్వము = గర్వమును బూనుటయనియు, పరిమళముఁ బూనుట యనియును. కూడదు = (మన మీప్రకారముఁ చేసినట్టయితే) నిలవదు అనఁగా పోవుననుట.

క.

అంత నశాంతంబగు నీ
కాంత ప్రతాపంబు మీఁద గాఁగల గతిచేఁ
గ్రాంత మగు తన ప్రతాపం
బెంతయు జారెనొ యనం దినేశుఁడు గ్రుంకెన్.

39


చ.

వలపులరాజు దండునకు వైచిన తోఁపు గుడారునాఁగ వె
న్నెల జలకంబుఁగాంచు రజనీగజయానకు మోడ్పుదమ్మి గు
బ్బల సమయాళి ముందె నెరిఁబట్టిన చందురుకావి నా సము
జ్జ్వలతరసాంధ్యరాగరుచి సంధిలె సౌమనసాధ్వవీథికన్.

40

40. సమయాళి = కాలమను చెలికత్తె. చందురుకావి = సిందూరపురంగుబట్ట. సౌమనస = దేవతలసంబంధమైన, అధ్వవీథికన్ = మార్గవీథియందు, అనగా నాకాశమందు.

చ.

కొడవలి వ్రేలినట్టు దొరకూతురికిన్ వెసనిడ్డ నాభి చం
దడరఁగఁ గాంచి పంచవిశితాఖ్య తురుష్కబలంబువాఁడి కె
క్కుడు సమయంబటం చదరుగ్రోవులు గాల్పఁగ బిట్టుమందు చిం
దేడి పొగ నా నజాండమున నిండె నఖండతమఃప్రకాండముల్.

41

41. దొరకూఁతురికిన్ = అవంతికి. ఇడ్డ = చెలికత్తెలుంచిన. నాభిచంచు = బొట్టనెడు చంద్రుఁడు. పంచవిశిఖాఖ్య = మన్మథుఁడనుపేరుగల. తురుష్కబలంబు = తురకవానిసేన, వాడికినా = శౌర్యమునకు. అదరుగ్రోవులు = తుపాకులు. ప్రకాండముల్ = సమూహములు. దృష్టిదోషాదిబాధలు పోవుటకు నర్ధచంద్రాకారముగా బొట్టుంతురు. తురకలు బాలచంద్రునిఁ జూచి యుత్సవముఁ జేతురు. అందుచేత వారి కార్యము హెచ్చునవి వారిమతము,

గీ.

సమయ నాడింధమాగ్రణి సాంధ్యరాగ
విమల శిఖి మింటి ఱాకమటమునఁ గాఁచి
నిశి యలంకారమున కెత్తి నెల పసిండి
పూదెఁ దొలుగట్టు పట్టెడ మీఁద నిడియె.

42

42. మింటి = ఆకాశమనెడు, ఱాకమటమునన్ = ఱాతికుంపటియందు, పట్టెడ = బంగారము సాగఁగొట్టు నినుపదిమ్మ, నాడింధముడు = అగసాలివాడు.

క.

సురలకిడి ధరణిసురలకు
వెరవున నిడకున్నఁ బ్రజలు ద్విజరాజి కొగిం
బరుఁడనఁ గని, ద్విజులకు సుధ
విరివి న్నెలగురిసె ననఁగ వెన్నెల బర్వెన్.

43

43. చంద్రకళలను దేవతలు పానముఁ జేతురని శాస్త్రము. ప్రజలు =మనుష్యులు, పరుఁడనన్ = శత్రుఁడని యనుట. అనఁగా విరోధి యందురని. కని = ఆలోచించి, నెల = చంద్రుఁడు.

క.

కనికరము లేక తన చ.
క్కని కరముల గాసిఁ బెట్టెఁ గలువలదొర జో
క నికరముగ సాగ్రహుఁడై
కనికరముగ నంత వంతఁ గాంతాజనముల్.

44

44. జోక = ఉత్సాహము, నికరముగన్ = తేటఁ దేరునట్టుగా. సాగ్రహుఁడై = దర్పముతోఁ గూడీనవాడై. కని = చూచి, కరముగన్ = మిక్కిలిగా, గాసిఁబెట్టెన్ అని యన్వయము.

క.

చక్రకుచతిమిరమేచక
విక్రకచాన్వితసరోజవదన సదయుఁ డై
చక్రధరు మఱఁది తన కిర
ణక్రియలం బ్రోవనేర్చు నాచెలులారా.

45

15. చక్రవాకము, తిమిరము. సరోజము, ఆచిన్నదానియవయవముల కుపమానములు గనుక నీచిన్నదానిఁ బ్రోవఁడని తాత్పర్యము.

క.

దుమ్ములు రేచు న్మరు దో
దుమ్ములు నెత్తమ్ములాను తుమ్మెదరామొ
త్తమ్ములు కమ్మని తెమ్మెర
లిమ్మెఱుఁగుంబోఁడి వేఁడి కెట్లు సహించున్.

46

46. దోదుమ్ములు = ఆయుధవిశేషములు, దుమ్ములు రేచున్ = ధూళి రేగఁ గొట్టును.

పంచచామరము.

మిటారికాని యంచుఁ బొంచు మించు నించు విల్తుఁడుం
గటారకాని మానితంపుకమ్మతమ్మిరేకు ది
క్కటారిగాని గాతచేత గండు గల్గు చిల్కరా
తుటారికాని నాదరూఢిఁ దూగు తేఁటి కోర్చునే.

47

47. మిటారి = ఓ చిన్నదానా, కానియంచున్ = కానిమ్మని. అనఁగా నీపనిబట్టెదనని, కటారికిన్ = కత్తికి, అని = గురిఁజేసి పొంచున్ అనిసంబంధము. చిక్కటారి = చిన్నకత్తియొక్క. కానిగాతచేతన్ = చెప్పశక్యము గాని దెబ్బచేత, చిల్క రాతుటారికిన్ = రాచిలుకయనెడు దిట్టరికిని, ఆ నాదరూఢిఁదూగు తేఁటికిన్ = ఆధ్వనిచేయు తుమ్మెదకును.

క.

అని యనివారితమగు నీ
సున నిట్లని పల్కి రవికిశోరకవేణుల్
గని శుకపాద్యరిమదభే
ద్యనిలాద్యసముద్యదాగ్రహగ్రాహణులై.

48

48. శుక.. హిణులై = శుకపాది = చిలుకనెక్కు మన్మథునియందును. అరిమదభేది = చక్రవాకములయొక్క, మదమును గొట్టివేయు చంద్రునియందును. అనిలాద్య = వాయువు మొదలగువానియందును, సముద్యత్ = పుట్టుచున్న, ఆగ్రహ = అహంకారమును, గ్రాహిణులై = స్వీకరించినవారై.

సీ.

 గురుకరంబుల భవత్కువలయంబును రేకు
                 మణఁగించు ప్రభు పగ ల్మాన్పికొనుటొ
లలి నీపురము నికలముగఁ జేసిన మహా
                 గ్రహవీరుఁ జేపట్టి గడపికొనుటొ
నిను నంతఁబొరల బంధన మొనర్చిన యుగ్రు
                 సటలు సమస్తముల్ జవిరికొనుటొ
సల్లీలఁ దమిని రాజిల్లఁగూర్పని సదా
                 పరపక్షదుఃఖాబ్ధిఁ బాపికొనుటొ


గీ.

మీకుఁ దగువారిపైఁ గోపమే ఘనంబు
గాక యబలలపై వట్టి కాక పుట్టి

రాజవై యీవు విరహాగ్ని రాజవైచు
నోజవైతె గణింపఁ బయోజవైరి.

49

49. పయోజవైరి = చంద్రుఁడా. రాజువై = ఱేఁడవై యనియును. చంద్రుఁడవై యనియును, గురుకరంబులన్ = విస్తారపుపన్నులచేత, భవత్కువలయంబున్ = నీ భూమండలమును. రేకుమణఁగించు = అణఁగఁ గొట్టుచున్న, ప్రభుపగల్ = రాజు యొక్క విరోధములు అని రాజపరమైన యర్థము. గురుకరంబులన్ = విస్తారపుకిరణములచేత, భవత్కువలయంబున్ = నీకలువను. రేకుమణఁగించు = రేకు మళ్ళీ పోవునట్టుగాఁ జేయు, ప్రభుపగల్ = సూర్యునిపగటికాలమునని చంద్రపరమైన యర్థము. నీ పురము వికలముగఁ జేసిన = నీపట్నము పాడుఁజేసిన, మహత్ = గొప్పవాఁడగు, గ్రహవీరున్ = పరాక్రమవంతుని అని రాజ. నీ పురము వికలముగఁజేసిన = నీశరీరము గళాహీనముగా జేసిన. మహత్ = గొప్పవాఁడగు, గ్రహవీరున్ = గ్రహశ్రేష్ఠుఁడగు రాహువునని చంద్ర. ఉగ్రుసటలు = భయంకరుఁడైనవాని మోసములు అని రాజ. శివుని జటలు అని చందిర. సల్లీలన్ = యోగ్యమగు విలాసముచేత. తమిని = కామముచేత, పరపక్ష = శత్రుబలముయొక్క అని రాజ. సల్లీలన్ - నక్షత్రముల విలాసముచేత, తమిని = రాత్రియందు, అపరపక్ష = కృష్ణపక్షముయొక్క అని చంద్ర. అబలలపైన్ = బలము లేని స్త్రీలమీఁద. ఓజవు = ఒజ్జవు అనఁగా గొప్పవాఁడవు,

సీ.

ఉపరాగవేళ నీ కృపలేని కల్వచెం
                 గట నిల్వఁ గన్నులఁ గప్పికొనదొ
విహిత కుహెూయోగవివశత శరణొంద
                 సమ్ముఖంబున నిన్నుఁ గ్రమ్ముకొనదొ
జలధరచ్ఛన్నత జడిసి నీసతు లడు
                 గుల వ్రాల సఖర రీతులమనుపదొ

దినగండమునఁ గౌముదియుఁ గావుమని వేడు
                 చోటఁ జల్లని చూపుఁ జూడలేదొ


గీ.

వనిత యింకిట్టి సమయ మెవ్వరికి లేదు
నేటి యామని బుగబుగ ల్నీకు సతమె
కాల మిటువలెనుండునే కాలకంఠ
కంఠ గరళ కళంక రాకాశశాంక.

50

50. ఉపరాగవేళన్ = గ్రహణకాలమందు, కన్నులఁ గప్పికొనదొ = కన్నులలోఁ బెట్టుకొని రక్షింపలేదా కన్నులకు కలువలకును సామ్యముగనుక కన్నులతో సమానముగాఁ జేసికొన్నదిని భావము. పై మూడుపాదములయందు నిట్లుగానే యూహింపవలెను. కుహుయోగ = నశించిన చంద్రకళగల అమవాస్యయొక్క సంబంధముచేతనైన. నీసతులు = నీభార్యలయిన చుక్కలు. ఆమని బుగబుగల్ = వసంతఋతుసంబంధమైన పరిమళములు, సతమె యెల్లపుడు నుండునా, కాల...కళంక. కాలకంఠ = శివునియొక్క, కంఠ = కంఠమందయిన, గరళ = విషమువంటి, కళంక = కళంకముగలవాఁడా.

మ.

వరుస న్సారసవైరివైన నిను సర్వజ్ఞావతంసం బనం
దరమౌనే కుముదాప్తుఁ డైన నీను సన్మార్గస్థుఁ డీతం డనన్
సరసంబే విషజుండ వీ వమృతదానఖ్యాతుఁ డన్నన్ విన
న్సరళం బౌనె తమోవిహారి యనినన్ ధర్మంబు దోషాకరా.

51

51. దోషకరా = పాపములకు స్థానమైనవాడా అనియు, రాత్రినిఁ జేయు చంద్రుఁడా అనియు, సారసవైరివి = సరసులసమూహమునకు విరోధివనియు, పద్మవిరోధివనియును. సర్వ జ్ఞావతంసంబు = సర్వము నెఱిఁగినవారిలో శ్రేష్ఠుఁడనియు, శివుని శిరోభూషణ మనియు. కుముదాప్తుఁడు = (కుముత్ = కుత్సితసంతోషము గలవారికి, ఆప్తుఁడు - ఇష్టుఁడు అని కలవల కిష్టుఁడనియు.) సన్మార్గస్థుడు = యోగ్యమార్గమం దున్నవాఁడని, నక్షత్రమార్గమం దున్నవాఁడనియును. విషజుండవు = గరళమందు బుట్టినవాఁడనియును, నీటియందుఁ బుట్టినవాఁడవనియును. తమోవిహారి = అజ్ఞానముచేత సంచరించువాఁ డనియు, చీకటియందుఁ దిరుఁగువాఁ డనియును.

శా.

చంద్రా! చంద్రకహాస నేచెదవయో చంద్రాఖ్య నీ కేల నీ
చంద్రత్వంబునఁ బాంథకోటి తనువుల్ శైత్యంబునుం జెందెనో
సాంద్రామోదము నొందెనో తుదిఁ దలంచం బాండువర్ణంబు భో
గీంద్రాక్రాంతత శారదాభ్యుదయు మిందే వింతశౌర్యాప్తికిన్.

52

52. చంద్రకహాసన్ = కర్పూరమువంటి నవ్వుగల యవంతిని. చంద్రాఖ్య = కర్పూరమను సంజ్ఞ. పాంథ...జెందేనో = మార్గస్థురౌలౌటచేత విరహులైనవారి శరీరములు బాధపడుచున్న వనుట. కర్పూరమువల్లనైతే శరీరములు చల్లబడును. సాంద్రా... నొంచెనో = ఆనందమును నొందలేదనుట, కర్పూరమువల్లనైతే పరిమళము నొందును. పాండువర్ణంబు = తెలుపు, బొల్లియు. భోగీంద్రాక్రాంతత = పాముచేత ననఁగా రాహువుచేత నాక్రమించఁబడుట, భోగముగలవారిచేత స్వీకరించబడుట అని కర్పూరపక్షమందు. శారదాభ్యుదయము = శరత్కాలసంబంధమైన యభివృద్ధి. ఏడాకుల అనటిచెట్టువలనఁ బుట్టుట. తెలుపు మొదలగు మూఁడుగుణములు నీకును గర్పూరమునకును తుల్యములనుట. ఇందే = ఈ గుణములయందే. శౌర్యాప్తికి వింత. అనఁగా నీగుణములలో శౌర్యముండుట చిత్రమని తాత్పర్యము.

గీ.

పాంథకోటి విపాటనపాటవమున
నీకు వలరాజునకు భేదనియతి గలదె
యోకువలరాజ పేర్కొన నొక్కతీరె
యాదివర్ణంబు నీ కింత యధికమగుట.

53

53. కువలరాజ = కలవరాజగు చంద్రుఁడా. వలరాజుకంటే గువలరాజుకు బేరుమొదట నొక కు అను అక్షర మెక్కువ గాని తక్కినదంతయు సమానమేయని తాత్పర్యము.

క.

తెఱవ నపరాధరహితం
గఱకఱిఁ బెట్టెదవు మ్రింగఁ గావచ్చు నరిం
దఱిఁ జంపఁ గొనవు నిన్నిం
దఱు చేతుల చెడ్డవాఁడ నరె పాండుకరా.

54

54. కఱకఱి = బాధ. పాండుకరా = తెల్లని కిరణములు గలవాఁడా యనియు, బొల్లిచేతులవాఁడా యనియును, కనుకనే చేతులు చెడ్డవాఁడవరా.

ఉ.

చక్కెరబొమ్మపైఁ గరము సాచుట కొండలపిండి నీకు నీ
వక్కట యుక్కటం గలుషమన్నఁ గలంగవు తారఁ గొండ్రెకాల్
ద్రొక్కిన లీల శూలి తలఁ దొక్కఁ దలంతురె యొళ్లు చెడ్డవాఁ
డెక్కటి దేవి మిండఁడనుటెల్ల యథార్థము పాండురాంగకా.

55

55. కొండలపిండి = పంచదారబొమ్మగదా అని చెయ్యిదాపుట, కొండలు పిండి చేయఁ దలంచినట్టు కఠినమైనపని, ఉక్కటన్ = గర్వముచేత, పాండురాంగకా = తెల్లని శరీరముగలవాఁడా, బొల్లివాఁ అనియు కనుకనే యొళ్ళు చెడ్డవాఁడు. ఎక్కటి = ఒంటిగానుండునట్టి. దేవి = పూజ్యస్త్రీకి, మిండఁడు = విటకాఁడు.

ఉ.

మాత దరిద్రతాదమని మామయుఁ జల్లనిరాచమిన్న
తాత గభీరతాతనుఁడు తండ్రియునుం బుకుసోరుషోత్తముండు
భ్రాత జగద్విధాత మధుబాంధవ యీతెగవారి నేరి నీ
రీతినిఁ బోలవైతి వొకరి న్మకరీసుకరీకృతధ్వజా.

56

56. మకరీసుకరీకృతధ్వజా = మొసలిచేత సులభమై చేయఁబడిన జెండా గలవాఁడా.

క.

ఏరీతి నుదయ మందితొ
సారసనాభోదరమున సర్వజ్ఞులకున్
మారుఁడ కుతికకు దిగ వం
భోరాశికి హాలహలము బుట్టిన మాడ్కిన్.

57

57. సక్వజ్ఞులకున్ = గొప్పవిద్వాంసులకైనను, కుతికకు దిగవు = గొంతుకఁబడెదవు, అనఁగా బాధించెదవు. హాలహలము = విషము. అదియును, సర్వజ్ఞులకు = పూజ్యులైన సాంబమూర్తివారికి కంఠము దిగదు.

ఆ.

కమల మథన వదన కళ సంచు నెంచవు
కమల మదనవ దనఘ ప్రమధన
కమల వదనవద్య ఖర దృష్టి నాఁడేల
కమల వదన మదన కఠిన కదన.

58

58. కమలమథన = చంద్రునివంటి, వదన = ముఖముగల అవంతియొక్క, కళసంచున్ = శోభయొక్కరీతిని. ఎంచవు = ఆలోచించవు. కమల = లక్ష్మీ అనఁగా నీ చిన్నది మీతల్లివంటిది. మదన = మన్మథుఁడా. కఠినకదనా = కఠినయుద్ధముగలవాఁడా. మదనవత్ = సంతోషముగల. అనఘ = దోషము లేనివారిని, ప్రమధన = కలపివేయువాఁడా, కమలవత్ = వేడిగల సాంబమూర్తియొక్క, అనవద్య = దోషము లేని. ఖర = తీక్ష్ణమగు, దృష్టిన్ = చూపుచేత. నాడు = అప్పుడు, అదనన్ = సమయమందు. ఏల కమలవు =ఎందుకుఁ గాలిపోవైతివి.

క.

మదనా నీదాడికి మే
మదనా మదనాగయాన నలయింతురె మ
ర్మద నాళీకాంబకముల
మదనారతభక్తిశక్తి మదనా రదనా.

59

59. అదనా = తగుదుమా, మర్మద = మర్మస్థానములను గొట్టునట్టి. మదనారతభక్తిశక్తిన్ = మత్ = నాయొక్క, ఆనారత = యెడతెగని. భక్తిశక్తిన్ = ఈశ్వరభక్తి సామర్ధ్యముచేత. మదను = నీ మత్తు. ఆరదనా = నశించదటోయి.

క.

గంధవహా యీచంపక
గంధవహామణి గరంపఁగాఁ దగునె మృగీ
సైంధవ హా! హుతవాహన
బాంధవహారంబుఁ జూడఁ బాడియె యిచటన్.

60

60. చంప... మణిన్ = (చంపక = సంపెంగపువ్వువంటి, గంధకహా = మక్కు వగల స్త్రీలలో, మణిన్ = శ్రేష్ఠురాలగు నీచిన్నదానిని) మృగీసైంధవ = ఆడగుఱ్ఱము గలవాఁడా, హా = అయ్యో. హుతవాహనబాంధవ = అగ్నికి బంధువైనవాఁడా. హారంబున్ = హరించుటను.

క.

పవమాన యిందు నీ తల
పవమానప్రథమ యన దలంచును దయఁ జూ

పవ మానవ చరితా రై
పవ మానప్రహృతి గాదు పవ మానవవనా.

61. నీతలపు = నీయూహ. అవమానప్రదమ = అవమాన మిచ్చునదే. అనద లంచున్ = శక్తి లేనివారని, దయఁజూపవు, ఆమానవచరితా = రాక్షసకృత్యముగలవాఁడా, రై పవ =శత్రుసంబంధమైన. మాసప్రహృతి గాదు = గర్వమును హరించుట గాదు. పవ = విరోధము. మానవనా = మానుకోవయ్యా.

శా.

ప్రాణిశ్రేణి హరింకుఁజూచిన జగత్ప్రాణంబ వౌదే జగ
త్ప్రాణక్రీడఁ జలించు నే భువనముల్ బల్మారు శ్రీకంధరా
క్షీణ క్షోప ఘటిల్లు నే ప్రసవముల్ గేడించు నే సూనవ
త్తూణస్యందన యాత్మహత్యయు గురుద్రోహంబు నీ కేటికిన్.

62

62. నీవు ప్రాణులఁ జంపఁ జూచితివా. నీవు జగత్ప్రాణమవుగదా అందువల్ల ఆత్మహత్య వచ్చును. జగత్ప్రాణక్రీడన్ = లోకముల ప్రాణములతో నాడుకొనటటచేత. అనఁగా సంహరించుటచేత, లోకములు చలించునుగదా = లోకస్వరూపుఁడైన శివునికి క్షోభగల్గును గదా. మఱియు, మానవత్ = పువ్వులగల, తూణ = అంబులపొదిగల మన్మథునికి, స్యందన = రథమైనవాఁడా, ప్రసవముల్ గేడించునే = పువ్వులు రాలునేగదా. శివునికిని మన్మథునికిని బాధ కలిగించుటచేత గురుద్రోహము.

క.

ఇందిందిర ననమందిర
యిం దిందిరనందనుండ యేలిన యెడ నీ

మందిం దిరమై తేనియ
మం దిందు రహింతు ననుచు మద మేమిటికిన్.

63

63. వనమందిర = అడవి యిల్లుగాఁ గల, ఇందిందర = తుమ్మెదా. ఇందున్ = ఇక్కడ. ఇందిరనందనుండ = మన్మథుఁడే. ఏలినయెడన్ = రక్షించినట్లయితే. ఈమందిన్ = ఈ జనులను. తిరమై= స్థిరపడి. తేనియమందు = తేనెయనెడు మత్తుమందు, ఇందున్ = ఈజనులయందు, రహింతు ననుచున్ = వృద్ధి జేసెదనని. మద మేమిటికిన్ = గర్వమెందుకు. మన్మథుఁడు రక్షించెనా నీ వేమి చేయఁగలవని తాత్పర్యము.

క.

పదమా మొరయిక చెలియా
పద మాటికి నీకు బ్రహ్మపదమా నలినీ
పద మానిని యే డ్పా హరి
పదమా నే డింతయేల పద షడ్పదమా.

64

64. మొరయిక = అరచుట. పదమా = పాటా, లేక యిదే ఉద్యోగమా. చెలియొక్క ఆపద నీకు బ్రహ్మపదమా. అనఁగా బ్రహ్మస్థానము దొరకడము వంటిదా. నలినీపద = తామరపొద నివాసముగలదానా, మానినియొక్క యేడ్పు. ఆ హరిపదమా = వైకుంఠమా. నేడు. ఇంతియేల = ఇంత గొడవ యెందుకు. పద = అవతలకి నడువు.

క.

శుకమా చంచూజిత కిం
శుకమా మోహీకృతైకశుక హేమాభాం
శుకమా పరిపూర్ణసుధాం
శుకమానితవదనయార్తి సొంపే నీకున్.

65

65. చంచూజితకింశుకమా = ముట్టెచేత జయింపఁబడిన మోదుగమొగ్గగలదానా. మోహీకృత = మోహముగలవాఁడై చేయఁబడిన, ఏక = ముఖ్యుఁడగు. శుక = శ్రీశుకులుగలదానా, హేమ = బంగారమువంటి. ఆభ = శోభగల. అంశుక = కిరణములుగలదానా. పరిపూర్ణసుధాంశుక = పూర్ణచంద్రునివలె, మానిత = గౌరవించబడిన. వదన = ముఖముగల మా అవంతియొక్క, ఆర్తి = పీడ. సొంపే = మంచిదా.

ఉ.

చక్కెరవిల్తు పక్కెరల జక్కినటంచును విక్కి విక్కి, నే
డెక్కుడు మాటలం బదరె దింతియె కాని యవారి యానవా
ల్చక్కెరఁ బెట్టి రాము కతఁ జక్కగ నేర్పుచుఁ బెంచినట్టి యా
యక్కను జూడవైతివిగ దా ప్రమదాళి నిగూఢకీరమా.

66

66. పక్కెరలజక్కి =కవచముగల గుఱ్ఱము, అవారి = ఆనందముగా. అనవాల్ = చిక్కగాఁ గాచిన పాలు. అక్కను = అవంతిని, ప్రమదాళి = మదపంఙ్తిచేత. నిగూఢ = కప్పఁబడినదానా.

మ.

వనవాసంబు ఫలింపలేదొ ద్విజభావం బూనలేదో రతీం
ద్రుని వయ్యాళినిఁ బెంపలేదొ మదియందున్ రామనామామృతా
ప్తనవానందము నందలేదొకో శుకత్వం బెందుఁబోయెన్ వహిం
పని పల్కేటికి నీకు మౌనము వహింపన్ భారమా రమా.

67

67. ఈ పద్యమందు చిలుకపక్ష మొక యర్థమును, శ్రీశుకులవారిపక్ష మొక యర్ధమును గలవు. వనవాసంబు రెండర్థములయందు సమము. ద్విజభావంబు = పక్షిత్వము, బాహ్మణత్వమును. రతీంద్రుని వయ్యాళిని = మన్మథవిహారమును. పెంపలేదో = వృద్ధి చేయలేదా అనియును, పోఁగొట్టలేదా అనియును. రామనామ = రామ అనుపేరు, రామమంత్రమనియును. శుకత్వంబు = చిలుక యౌట, శ్రీశుకులౌట. మౌనము వహింపన్ = మాటాడకుండుట, మునిత్వమునొందుట యనియును.

వ.

అని పలికి చిలుకలకొలుకు లపరిమితపరితాపంబునం
గుందుకుంద యపదశ దశావశంవదయైన విశం
కట పటీర పన్నీర నీహార పూర కర్పూర కల్హార
దళంబులం జెంగావి చలువం జలువఁ గావింప నచ్చె
లువ కొంతకొంత దెలసె నంతఁ బ్రభాతసమయ బగు
టయు నవంతీసీమంతినిం గూర్చి బాలచంద్రిక
యిట్లనియె.

68

68. ఉపదశ = తొమ్మిదవదైన. దశా = మన్మథావస్థకు అనఁగా మూర్ఛకు. వశంవద = స్వాధీనురాలు చెంగావి చలువన్ = ఎఱ్ఱబట్టచేత.

ఉ.

జాగరమాయెనమ్మ మనసన్నుతగాత్రికి నిన్నరాత్రియో
హెూగరమాయెనమ్మ చెలి కోగిర మింతి లలాటపట్టికన్
నాగరమాయెనమ్మ మృగనాభిక పట్టి లతాంగియశ్రువుల్
సాగరమాయెనమ్మ యని జాలిఁ గలంగెదరమ్మ నీ సఖుల్.

69

69. ఓగిరము = అన్నము. గరము = విషము, నాభిక = కస్తురి, పట్టి = పట్టు, నాగరము = సొంటి, సొంటి పట్టువలె మండుననుట, సాగరము - సముద్రము.

ఉ.

తూర్పదె తెల్లనై యెఱుపుతోఁ బొలిచెన్ రవిదోఁచెఁ గ్రొవ్వెదల్
చేర్పరదేమి ధౌతముఖసీమలఁ గ్రొన్నెలవంక నామముల్
దీర్పరదేమి చన్నుగవదిన్నెలఁ జెన్నలరార వీణియల్
దార్పరదేమి యంచుఁ బలుతప్పుఁ దలంచుఁగదే తలోదరీ.

70

70. క్రొవ్వెదల్ = కొప్పులు. నామముల్ = బొట్లు, సూర్యుడు. తలంచును.

క.

అమ్మా శీతలజలములు
గొమ్మా ముఖమార్జమునకున్ లేలెమ్మా
రమ్మూ యనుచుం బిలచెద
రిమ్మానిను లింత చింత యేల కృశాంగీ.

71


చ.

వలచినవారు లేరొ మగువల్ మగవారికి వార లింతికి
న్వలచెడిచోటు లేదొ మఱి వారలు గూడఁగఁజూడలేదొ సొం
పొలయ వియోగతాపమును యోగవికాస మమాసపున్నమల్
చిలుకలకొల్కి యుల్కి మదిఁ జింతిల నేటికి మాటిమాటికిన్.

72


క.

తెం పరసి పరశితాస్త్రప
రంపర వరసాంపరాయరతుఁడై నిన్నుం

బెంపరలాడ మనోజున
కింపరఁగా నొంపుటెంత పృథ్వీకాంతున్.

73

73. తెంపు = తెగువ. సాంపరాయరతుఁడు = యుద్ధమందాసక్తుఁడు. పెంపరలాడన్ = కలిపివేయఁగా. ఇంపరఁగాన్ = సంతోషము పోవునట్టుగా, నొంపుట = బాధించుట.

క.

కావున భూమాధవునకు
నీవిధ మెఱిగించి యెల్లి నేఁటనె తేనా
యీవేల వగలఁ బొగిలెదు
నావంటి ప్రియాళి గలుఁగ నాళీకముఖీ.

74

74. ప్రియాళి = ఇష్టురాలగు చెలికత్తె. నాళీముఖీ = పద్మవదనా. నేటనె తేనా = నేడె తోసికొనిరాలేనా.

క.

అని యూరడిలఁ బలికి కలి
కినిఁ జెలులకు నప్పు డప్పగించి తుహినజీ
వనజనికామనధునికా
ఘనవనికావనికిఁ జని పికధ్వని వినుచున్.

75

75. తుహినజీవన = మంచునీటివల్ల, జని = పుట్టువుగల, కామన = కామమును గలిగించునట్టి, భుసికా = నదులచేత, ఘన = గొప్పదియగు, వనికా = వనముయొక్క, అవనికిన్ = భూమికి.

ఉ.

వాచవు లీఁ గడంగి నలువంపులఁ దుంపురు లీను తేనెఁ జె
ల్వౌ చలివాఁకచే వనపుటాకునఁ గాంతులఁ బొల్చి పూచి పె
ల్లెచిన గుజ్జుమావికడ నెల్లెడ నీడలు గానవచ్చు లే

రాచ మెఱుంగు ఱాజగతిఁ
గ్రమ్మిన కమ్మని తమ్మిపాన్పునన్.

76

76. చలివాఁకచేన్ = చల్లనికాలువచేత. వనపుటాకునన్ = వనముయొక్క ఆకులచేత. లేరాచమెఱుంగు ఱాజగతిన్ = లేతవైన అనఁగా పెంకిచాయ లేని తళతళగల చంద్రకాంతశిలల అరుగునందు. కమ్మని = పరిమళించుచున్న.

చ.

జిలుగు మృణాళతంతుకృతచేలముతోఁ జిగురాకుటోపితో
నొలయ మెఱుంగు కప్పురపుటుండల యొంటులజంటతో విని
స్తుల బిసఖండహారములతో జిగిచందువతాళితో పసల్
దొలుకు సరోజపాదుకలతో గలితోన్నతిఁ బొల్చు భూపతిన్.

77

77. జిలుగు = సన్నమైన. ఒంటులజంట = చౌకట్లజోడు. వినిస్తుల = సౌమ్యము లేని, చందువ = వెన్నెలవంటి, తాళి = పతకము. తొలుకు = వ్యాపించుచున్న.

సీ.

పుప్పొడు ల్గప్పు కపోల మెండకు నిండి
                 భానుబింబాచ్ఛదర్పణ మొనర్ప
విరితేనె దోఁగిన చరణంబు గండుక్రొం
                 జెమ టందు మరునిచేఁ జిగురుఁ జిమ్మఁ
బన్నీరపూర మిళన్నేత్రయుగళంబు
                 పదనిచ్చు మదను నంబకముఁ బగట

ఘనసారతనువు నుప్పునఁ గ్రాచి వైచిన
                 శ్రీకనత్కనకశలాకఁ జెనకఁ


గీ.

జందనకరంబులు విభాసికుందహిమస
మన్వితపుఁ దమ్మి నగనున్న మగధనృపతిఁ
జక్కఁగాఁ గాంచి నాచేతఁ జిక్కె ననుచు
నక్కిసలయోష్ఠి చక్రేశుచక్కి కరిగి.

78

78. ఎండకునిండి = ఎండచేతనిండి. చేఁజిగురున్ = చేతిలో నాయుధముగానున్న చిగురును. పదవిచ్చు = పదు నెక్కిన. అంబకమున్ =బాణమును. పగటన్ = ప్రకటింపఁగా. ఘనసారతనువు = కర్పూరముఁ బూసిన శరీరము. శ్రీకనత్ = శోభచేతఁ బ్రకాశించుచున్న. కనకశలాకన్ = బంగారుకణికను. చందనకరంబులు = గంధముఁబూసినచేతులు.

శా.

పంచేషూగ్రజయాంకకంకణరణత్పాదాందుకాగ్రచ్ఛిదా
చంచచ్ఛాతనచుంచుచంచుహృతమోచం బంచవర్ణచ్ఛదో
దంచద్రత్నమయీభవద్భవన రామాఖ్యాసమాఖ్యాతి వై
రించాంభోజముఖీశుకీజనాళకీరిం గేలఁ గీలింపుచున్.

79

79. పంచేషూ... మోచన్ = పంచేషు = మన్మథునియొక్క, ఉగ్రజయ= భయంకరమైన జయమునకు, అంక = చిహ్నము లైన, కంకణ = కడియములచేత, రణత్ = ధ్వనించుచున్న, పాదాందుకా = కాలిగొలుసులయొక్క, అగ్ర = చివరలయొక్క. ఛిదా = కొరుకుటచేత, చంచత్ =కదలుచున్న, శాతనచుంచు = వాడితోఁగూడిన, చంచు = ముట్టెచేత, హృత = హరింపబడుచున్న అనఁగా దినఁబడుచున్న, మోచన్ = అరటిపండు గల.) పంచ... భవన = పంచవర్ణ = అయిదురంగులుగల, ఛద = ఱెక్కలచేతను, ఉదంచత్ = ఒప్పుచున్న, రత్నమయీభవత్ = రత్నవికారమైనదౌచున్న, భవన = గృహముగల. రామాఖ్యాసమాఖ్యాత్రిన్ = రామనామమును బలుకుచున్న. వైరించాం. . . శుకీజన్ = వైరించాభోజముఖీ = సరస్వతియొక్క. శుకీజన్ = ఆడుచిలుకవలనఁ బుట్టిన, కీరిన్ = ఆడుచిలుకను.

క.

ఇందుముఖి చింద నొరపు
“ల్వందేవాల్మీకికోకిలమ్మ"ను నవమా
కందమకరందబృందము
గ్రందుకొనం బలుకు చిలుకఁ గానుక యిడుచున్.

80

80. నవ...బృందము = నవ = క్రొత్తదియగు, మాకంద = మామిడిచెట్లయొక్క, మకరంద = పూఁదేనెలయొక్క, బృందము = సమూహము. ఒరపుల్ చిందన్ = శోభలు వ్యాపించగా.

క.

కెంజూ పింతట విడుమం
చుం జిరితో దొరకు శరణుఁ జొచ్చిన ముకుళ
త్కంజాతము బలె రంజిల
నంజలి ఫాలమునఁ జేర్చి యల్లనఁ బల్కెన్.

81

81. కెంజూపు = ఎఱ్ఱనిచూపు కోపదృష్టిననుట. చిరితోన్ = చిలుకతోఁగూడ. ముకుళత్ = ముణిఁగియున్న. అల్లనన్ = మెల్లగా.

క.

విన్నపమేమున్నది చెలి
నిన్నటివావేళ నిచట నిన్నటు తుదఁ గ
న్గొన్నది మొదలొదవిన దయ
కన్నది విన్నదియుఁగాదుగా మగధనృపా.

82

82. నిన్నటివావేళన్ = నిన్నటిప్రొద్దుట. నిన్ను. అటు = ఆప్రకారముగా. తుదన్ = చిగురువరకు, దయ = కరుణరసము అనఁగా విచారము.

ఉ.

హారముఁ ద్రోచి నిష్కుటవిహారము వైచి పరీమళైకనీ
హారము మాని గానపరిహారముఁ బూని ప్రియోక్తి నిడ్డ యా
హారము డించి కూర్మివ్యవహారముఁ దెంచి కృశించె నయ్యవం
తీరమణీలలామ యిట నిన్నుఁ గనుంగొనునాఁటనుండియున్.

83

83. నిష్కుట = ఇంటిపెరటితోటయందలి. విహారమున్ = క్రీడను. పరీమళైక = పరిమళము ముఖ్యముగాఁ గల. నీహారమున్ = మంచును అనఁగా పన్నీటిని.

మ.

అలివేణీ పరిపూర్ణచంద్రవదనా యంభోజపత్రాక్షి చి
ల్కలకొల్కీ కలకంఠకంఠి సుమనోగాత్రీ ప్రవాళాంఘ్రి యో
కలహంసీ మృదుయానయంచుఁ జెలి వల్కం గల్కి యుల్కున్ లతా
లలితాంగీవిరహవ్యథాకథనముల్ వాక్రువ్వ మాబోఁటులే.

84

84. ఇక్కడ సంబోధనములయందలి యుపమానవస్తువులైన తుమ్మెదలు, చంద్రుఁడు, పద్మము, చిలుకలు, కోవెల, పువ్వులు, చిగుళ్ళు, హంసయును మన్మథోద్రేకముగలిగించునవి యౌటచేత వానిని వినుటకు సహించఁజాలదని తాత్పర్యము.

సీ.

పలికించదు విపంచిఁ బంచి వైచిన రీతి
                 సతతప్రవాళసంస్మరణ మొదవ

శ్రుతి షడ్జ పంచమోన్నతిఁ గూడి పాడదు
                 దండియ శిఖి పికధ్వనులఁ బెరుప
నాటకసందర్శనమును జెందదు తదీ
                 యాంకంబు లేయంచహవణుఁ దెలుప
భాగవతపురాణభణితికిఁ జెవి యీదు
                 శుకముఖోద్గతవచస్ఫురణ మెసఁగ


గీ.

బద్మరాగంబు వలయముల్ పాణిఁ దొడదు
హాటకప్రసవాంబరం బన్నఁ జూడ
దేమనఁగవచ్చు నయ్య యయ్యిందువదన
హృదయవేదన సుదతీసముదయమదన.

85

85. పంచివైచినరీతిన్ = ఎవరికో యిచ్చివేసినట్లుగా, వీణ కఱ్ఱను జెప్పు ప్రవాళశబ్దము చిగుళ్లనుగూడఁ జెప్పుటచేతఁ జిగళ్ళు జ్ఞప్తికి వచ్చును గావునఁ గామోద్రేకము గల్గును. షడ్జ పంచమములస్వరములవలన వానినిఁ బల్కునట్టి నెమిళ్ళును గోయిలలును జ్ఞప్తికి వచ్చును. నాటకాంకములు జూడఁగా గజ్జెలచప్పుడువలెఁ బలుకునట్టి హంసలు జ్ఞప్తికివచ్చును. హవణు = ఒప్పిదము, భాగవతమంతయు శ్రీశుకవాక్యము లౌటచేత శుకశబ్దమున కర్థమగు చిలుకలు జ్ఞప్తికి వచ్చును. పద్మరాగమువల్లఁ బద్మములు జ్ఞప్తికి వచ్చును. తొడదు = ధరించదు. హాటకప్రసవ = బంగారుపువ్వులగల. అంబరము = వస్త్రము. ఇందులోఁ బువ్వులు జ్ఞప్తికి వచ్చును.

సీ.

ముకురచారుకపోలచికురమంచుం జుమీ
                 ఘనుల విరోధంబు గాడ్పు గనుట
లసనవతీమణిహస్తవ మంచుం జుమీ
                 చైత్రుండు జాతికి శత్రుఁ డగుట

మదనబాణకటాక్షవదన మంచుం జుమీ
                 తమ్మికి రేరాజు దాయ యగుట
కధరపయోధరయధర మంచుం జుమీ
                 తలిరుఁ గోయిల చించఁదలఁచు టెల్ల


గీ.

గన్నులను గల్కి వలిగుబ్బచన్నులని సు
మీ చిలుక దాడిమ నశించఁజూచు టెందు
ద్విభుజగజరాజగ్రీష్మార్కతేజ సకల
దక్ష రామాంక సంకుమదద్రవాంక.

86

86. ఘనులు = మేఘములు, గొప్పవారును. లసనవతీ = విలాపములుగల స్త్రీలలోపల. జాతికిన్ = కులమునకు, జాజితీగకును. దాడిమన్ =దానిమ్మపండును. కన్నులన్ అనునది చూచుట అనుదానితో సంబంధించును. ద్విభుజగజరాజా = రెండుచేతులుగల గజశ్రేష్ఠమైనవాఁడా, రామాంక = మనోహరమగు చిహ్నము గలవాఁడా.

క.

ఎక్కడి నలకూబర సురు
లెక్కడి రతికాంతుఁ డింక నేడ వసంతుం
డెక్కడి చుక్కలదొర యని
చక్కని యక్కన్నె నిన్ను సన్నుతి సేయన్.

87

87. నలకూబరుఁడు=కుబేరునికొడుకు. సురులు= దేవతలు

ఉ.

మాళవదేశనాథుఁడు రమాధవబోధసనాథుఁ డగ్రనే
పాళ సరత్నకంకణవిభాసురసేవకహస్తదర్పణుం
డోలి నిజాంకపీఠమున నొక్కెడ డించని ధన్య కన్య నీ

మేలుదిగానఁ బూనఁదర
మే పరమేష్ఠి.కి నిన్ను సన్నుతుల్.

88


క.

కంటికిఁ బ్రియమంటక మన
మంటునె యొకపాటి పాట లామోద పయిన్
వింటి నినువంటి దొర కిటు
వంటిది యని పొగడ నేల బాల నృపాలా.

89

89. సామాన్యస్త్రీలయందు చూపున కిష్టముగాక మనస్సు నిలచునా నీవంటి రాజుకు. ఇది లోకములో వినియున్నాను. అయితే ఆచిన్నదానియందు నీమనస్సు నిలచియుండఁగా నాచిన్నది యిటువంటి సౌందర్యము కలదని చెప్ప నెందుకు.

ఉ.

లంచముఁ బట్టునం చల బలంగముచే నడలంగ బంగరుం
గొంచెముగాని మేని తళుకు ల్బెళుకుల్ బచరించుఁ జూపులు
న్మించులఁ గుంచు మోము రజనీవిటు గుప్పునఁ దప్పుఁ బెంపునున్
సంచపురేకు రేకుమడచం గను నంగన నిక్కుచెక్కులున్.

90

90. బలంగముచేన్ = సమూహముచేత. నడలంగ = నడలు = నడకలయొక్క, అంగ = చాచి వేసినయడుగు. సంచపురేకున్ = బంగారపురేకును. రేకుమడచన్ = అణఁగఁగొట్టుటకు.

ఉ.

వెన్నెలవన్నెలాడి సెలవి న్నెలకొల్పెడు నవ్వుఁ బువ్వుచాల్
క్రొన్నెలకు న్నెలాగునఁ దళుక్కను నిక్కిన యన్ను నెన్నొసల్

పెన్నెల నున్నెలందమును బేర్కొను బిత్తరిమోముదమ్మియున్
మిన్నెలమి న్నెలంత తలమిన్న మిటారపుకౌనుదీగయున్.

91

91. సెలవిన్ = పెదవిప్రక్కయందు, నవ్వుఁబువ్వుచాల్ = పువ్వువంటినవ్వుయొక్క పఙ్క్తి. క్రొన్నెలకున్నె = బాలచంద్రుఁడు. పెన్నెల మన్నెల = అనేకపూర్ణచంద్రులయొక్క. ఎలమిన్ = శోభచేత. మిటారపు = చాకచక్యముగల.

ఉ.

కమ్మకదంబ మేల చెలిఁగౌఁగిఁట గూర్చినఁ జాలు మించుట
ద్దమ్మును జూడ నేల యలతన్వి కపోలమె చాలుఁ గప్పురం
బిమ్మననేల వీడెమున కింతి నవాధర మానినంతఁ జా
లెమ్మననేల వీణ సుదతీమణి పల్కినఁ జాలు భూవరా.

92

92. కదంబము = అనేకపరిమళద్రవ్యములు కలిపినముద్ద.

సీ.

ఇటులుండవలదా చెలీ నెరుల్ హరిమణుల్
                 దెచ్చి కమ్మచ్చునఁ దిగిచి నటుల
ఇటు లుండవలదా చెలీ సోగ వగచూపు
                 మెఱుఁగువెన్నెలరేకు చఱచి నటుల
ఇటులుండవలదా చెలీ సోయగపుమొగం
                 బేణాంకుఁ జిగిలి సేయించి నటుల

ఇటులుండవలదా చెలీ గుబ్బ లెడ గాని
                 మలదోయినున్న గా మలచినటుల


గీ.

అహహ యిటులుండవలదా యొయారి తొడలు
పద్మికరములు తరుమణిఁ బట్టి నటుల
నంచు మ్రొక్కి నుతించుఁగా కతివఁ గన్న
నంగభవుఁ డోపఁ డవ్వల నడు గిడంగ.

93

93. కమ్మచ్చునన్ = బంగారము తీగఁదీయునట్టి సన్నతొలలు గల యినుపకమ్మియందు, రేకు చరచినట్టు = రేకు వేసినట్టు, చికిలి = మెఱుఁగు, మలదోయి = రెండుపర్వతములు, మలచినట్లు = చెక్కినట్లు, పద్మికరములు = ఏనుఁగుతుండములు, తరుమణి = కఱ్ఱలకు మెరకపల్లములు దిద్దు యంత్రము.

సీ.

చపలానుభవమె కా కిపుడు సాటియె యంబు
                 దంబు విష్ణుపదంబు దండఁగన్నఁ
బదబలమే కాక భ్రమరంబు సమమౌనె
                 కృష్ణాబ్జసాంగత్య మెనసియున్న
ననిశంబు విషమన్న • గుటగా కెనయె శై
                 వల మల శూలితో నలరియున్న
వక్రగతియెకాక చక్రితా నీడౌనె
                 తాపసాశ్రయ శిఖ దండనున్న


గీ.

రసము విడువక కడచూపు లొసఁగి చంప
కాన్వితంబయి భానుమోహకర మగుచుఁ
జిక్కు విడచి జిగి విడక స్నేహ మూనఁ
దగి కొమరు డించకుండు బిత్తరి నెరులకు.

94

94. చపలానుభవము = చంచలమైన అనుభవము, మెఱుపుయొక్క అనుభవమును. విష్ణుపదంబు = ఆకాశము, విష్ణుస్థానమును. పదబలము = స్థానబలము. కాళ్ళబలము. అనఁగా నారుకాళ్లు గలవనియును. కృష్ణా = నల్లగలువయొక్క, కృష్ణమూర్తియొక్క. అని ధ్వని. విషము = కాలకూటము, నీరును. శూలితోన్ = త్రిశూలీగడ్డితో, శివునితో ననియు, వక్రగతి = వంకరచేష్ట, వంకరనడకయు, చక్రి= పాము. తాపసాశ్రయ = తపశ్శాలుల కాధారభూతుఁడైన శివునియొక్క. శిఖదండన్ = సిగదగ్గరను. మహాతపశ్శాలి దగ్గరనని ధ్వని. రసమున్ = శృంగారరసమును. మేఘమైతే. రసము = నీటిని విడుచును. కడచూపు లొసఁగి చూడఁదగినదై, ఆకాశమైతే కనఁబడదు. చంపకాన్వితంబు = సంపెంగపువ్వులతోఁ గూడినది, తుమ్మెదలైతే అట్లు గావు. భానుమోహకరము = కాంతులచేతఁ గామమును బుట్టించునది, నల్లగ ల్వైతే. భాను = సూర్యునికి మోహకరము గాదు. చిక్కు విడచి, నాచైతే అట్లు గాదు. జిగివిడక = శోభవదలక, గడ్డియైతే కొన్నాళ్ళకు శోభ తగ్గిపోవును. స్నేహమానఁదగి = చముకురు నొందఁదగి, పామైతే. స్నేహము = మైత్రి చేయఁదగినదిగాదు. కొమరు డించక = కోమలత్వము వదలక. శివునిశిఖయైనతే అట్లుగాదు.

చ.

కలికిమొగంబుసాటిఁ గనఁ గంజము పుప్పొడి మంటలో వన
స్థలమున నిల్చి చక్రగతి సంభమితభ్రమ రాక్షదామ మిం
పొలయ మరుచ్చలద్దశజవోష్మత వే తపమాచరించియున్
బలిమి ముడింగి హాస దశ పారము ముట్టక భంగ మొందెడిన్.

95

95. వనస్థలమునన్ = అరణ్యప్రదేశమందు, నీటియందును. చకగతి = గుండ్రగాఁ దిరుగుటచేత. సంభ్రమిత = తిరుగుచున్న. హాసదశ = నవ్వుయొక్క అవస్థ. అనఁగా నందరిచేత నవ్వఁబడుట. వికసించుట.

గీ.

తమకు భవనంబు లీరెంటి దయ దలంపు
మని శృతి శ్రీలు ముఖచంద్రు నడుగులకును
వైచు నెత్తమ్ము లాకొమ్మ లోచనమ్ము
నతఁడు తలనిడ్డకరము సు మ్మతివ చూపు

96

96. శ్రీలు = శ్రీకారములు, లక్ష్ములును. తమకు భవనమ్ములు = లక్ష్ములకు పద్మములు, గృహము. తలనిడ్డ = శరణు జొచ్చినవారిని భయము లేదని శిరస్సుపైఁ జేయియుంచుట ప్రసిద్ధము.

క.

శ్రుతి నుల్లంఘించుట ము
ఖ్యత కెల్లం గొదవ యండ్రు గద మర్యాదా
హృతి చుంచువు లతిచంచల
గతులట్లంచుం జలించుఁ గామిని కన్నుల్.

97

97. శ్రుతిన్ = వేదమును, చెవిని యనియు. ముఖ్యత = ప్రాధాన్యము, ముఖమందనుట. చెవి దాటిపోతే ముఖముమీఁద నుండుట కలుగదు. అతిచంచలగతులు = మనచంచలవ్యాపారములు. మర్యాదాహృతిచుంచువులు = హద్దుయొక్క హరించడముతోఁ గూడినవి.

క.

మాధుర్యమార్గవంబుల
సాధింపన్ యువతి వచనసఖ్యంబున కా
రాధింపఁ జేరినట్టి గు
ణాధిక మణి సుమ్ము రమణి యధరం బధిపా.

98


ఉ.

రామపయోధరంబు లదె రా తనపై ఘనమయ్యెనంచుఁ దా
వేమరు వేరెరూపునఁ బ్రవీణత గ్రిందొనరింప మేరువు

ద్దామత నుండియుం గను స్వతంత్రముగా నఖవజ్రఘాతమున్
గ్రామము లెంత వింతలయిన న్మరి కర్మము లెంత వింతలే.

99

99. పయోధరంబులు = స్తనములు మేఘములును. అదెరా-ఆశ్చర్యము. ఘనము = గొప్పది, మేఘమును. మేరువు = మేరుపర్వతము. వేరెరూపునన్ = హారమందలి మేరువుపూసయొక్క రూపముచేతను. ఉద్దామత్ = అతిశయముచేత, ఉత్ = అతిశయమైన. దామతన్ = ముత్యాలమాలికయౌట చేతననియును. నఖవజ్రఘాతమునన్ = స్తనములయందు నఖక్షతము లుంచునప్పుడు హారమునకు దగులుననుట. పొరుగూరు వెళ్ళినను తనకర్మ తప్పదు.

క.

ఇంపువిరుల్ గుణహితముల్
తెంపున సరసిజశరుఁడు శిలీముఖములకున్
సొంపిది గాదని విడిచిన
సంపెఁగ సరియగుటయెట్లు సఖి మేనునకున్.

100

100. గుణహితముల్ = పరిమళముచేత నిష్టములు, నారికి ఇష్టమైనవి. తెంపుకన్ = సాహసముచేత, తెగిపోవడముచేతననియును. శిలీముఖములకున్ = తుమ్మెదలకు, బాణములకును. ఇది = ఈ తెగిపోయిన నారి, ఈ సంపెంగపువ్వును.

చ.

కలువలయొప్పు నీలములకప్పు చకోరపు ఖంజరీటపుం
గొలములసొంపు తేఁటి జిగి గుంపును యౌవన శిల్పి మార్చి వ
ర్తుల కుచదృష్టియొత్తఁ గరతూలిక బొ ట్టిరుగుబ్బసంది యం

దులఁ బడి నాభిపై దిగియెనో యనఁ జెల్వకు నారు దెల్వగున్.

101

101. కప్పు = నలుపు. ఖంజరీటము = కాటుకపిట్ట. ఒత్తన్ = వ్రాయగా. తూలిక = చిత్తరువు వ్రాయు కలము. యౌవనశిల్పి = యౌవనమనునట్టి ముచ్చివాఁడు. బొట్టు = రంగుచినుకు. సంది = మధ్యభాగము.

క.

చనుగొండ టెంకి గల యౌ
వనమదకరి యూరు కదళి పట్టుకుఁ జనునో
యని నిగళము వెనుబడఁ ద్రొ
క్కినఁ గర్తక మారుతో సఖీనాభి నృపా.

102

102. టెంకి = నివాసము. నిగళము - సంకిలి. వెనుబడిన్ = వెనుకనుండునట్లుగా. తొక్కిన = త్రవ్విన. నూగారుతో గూడిన నాభి సంకిలితోఁగూడిన గొయ్యివలె నుండుననుట.

క.

ఒసపరి యడుగుల కెనయన
వసమా నానాట మొదటివర్ణము దొలఁగం
గిసలయము పసరు చూపఁగ
నస దనవల దపుడు తెలియ నాకులపాటున్.

103

103. ఒసపరి = సుందరి. వసమా = తరమా. మొదటివర్ణము = ఎఱుపు. కిసలయశబ్దములో మొదటియక్షరము పోఁగా, సలయము = అణఁగిపోటతోఁగూడినది. పసరు=పసరురంగు, హీనవర్ణమును. అసదు = తక్కువ, ఆకులపాటు = వ్యాకులపడుట, ఆకులయొక్కరీతి.

క.

చిత్తరువున వ్రాయఁగ రాఁ
దత్తరుణి కనత్తనూమహత్తరకుచముల్
ముత్తరులు నెరులు మఱియుం
జిత్తరులో చిత్తజన్మ చెలువయ తక్కన్.

104

క.

రెండవ రతి సతి సుమకో
దండుని మూఁడవభుజంబు దర్సకు తుర్యో
ద్దండతరశక్తి శుకవే
దండుని యైదవబలాంగ మారవశరమే.

105


సీ.

భవజటాటవిఁ గట్టువడకున్న శశిరేఖ
                 బ్రమరిచేఁ ద్రొక్కుడువడని తమ్మి
సూదివాటులు లేని సుగుణరత్నశలాక
                 కై నంట మాయని కలికి యద్ద
మొకపూట నే తావి యుడివోని విరిదండ
                 పైఁబెట్టు సోకని పసిఁడికుండ
దినగండములు లేని తేటవెన్నెల సోగ
                 పొడి పొడిగాని కప్పురపుఁగుప్ప


గీ.

యే నేరసు లేని యయ్యింతి దాని యమిత
కళ నిటలదీర్ఘనయనముల్ కమ్మమోవి
తరుణ గండద్వయామ్లానతనుపృథుకుచ
మండలాజడహాసము ల్మధురవాణి.

106

106. భ్రమరి = ఆడుతుమ్మెద. కైన్ = చేతిచే. కలికి = సొగసైన, పైఁబెట్టుసోకని = మీఁద దెబ్బదగలని, నెరసు = కళంకము. ఆయింతి వెనుకఁ జెప్పినవానివలె నున్నది. మఱియు దాని నిటలము మొదలగువి వరుసగా చంద్రకళ మొదలగువానివలె నున్నవియనుట.

క.

గంభీర నాభినటనా
రంభకళారంభయూరురంభాస్తంభో
త్తంభితకుంభికర తరమె
జంభ కుచం బొగడ జంభసంభేధి కహా.

107

107. నటనారంభకళారంభ =నాట్యారంభవిద్యచేత రంభ యైనది. ఊరురంభాస్తంభ = అరటిస్తంభములవంటి తొడలచేత. ఉత్తంభిత = మ్రానువడఁ జేయబడిన. కుంభికర = యేనుఁగుతుండముగలది. జంభకుచన్ = నిమ్మపండ్లవంటి స్తనములుగల యవంతిని, జంభసంభేదికిన్ = ఇంద్రునికి.

క.

గానము సొబగులసోనై
తేనెలవానై సరస్వతీకరవీణా
తానపుటక్కై యమృతవి
తానము తానైతగును సుదతి సుతి గూడన్.

108

108. సోన= ప్రవాహము. తానపు = స్వరవిశేషముయొక్క. టక్కు = మోసము. తాను = తానే, సుతి = స్వరమును ప్రవర్తింపచేయుస్వరము.

క.

రతి మదనునకున్ మదనుఁడు
రతికిన్ భారతికి బ్రహ్మ బ్రహ్మకు నల భా
రతి దగు సంగతి నట్టి యు
వతి కీవు న్నీకు నయ్యువతి దగు నృపతీ.

109


క.

పంచముఖమధ్యమకు వై
పంచసమంచత్కళాప్రపంచఖనికి నీ
పంచశరకేళి వంచన
బంచలు పాటించు టరుదె పంచజనేశా.

110

110. పంచముఖముధ్యము = సింహముయొక్క నడుముగలది. వైపంచ = వీణాసంబంధమైన. సమంచత్కళాప్రపంచ = ఒప్పుచున్న విద్యాతిశయమునకు. ఖని = గనియైనది. పంచశరకేళి వంచనన్ = సంభోగమందైన మోసమును. పంచలు పాటించుట = చెల్లాచెదరుఁ జేయుట. పంచజన = మనుష్యులకు. ఈశా = ప్రభువైనవాఁడా.

క.

అని యిట్లు బాలచంద్రిక
వినిపించిన విన్నపంబు విని యాడం బో
యిన తీర్థ మెదురుగా వ
చ్చిన యట్లని పలికి కలికిచెలి కిట్లనియెన్.

111


శా.

ఏలా చింతిల మీ యవంతికిని యింతీ దారుణాస్మద్భుజ
వ్యాళావక్రపరాక్రమక్రమణచర్య ల్మాళవాధీశుపై
జాలం జూపి సమస్తలోకములు మెచ్చ న్నాల్గు మున్నాళ్ళలో
బాలారత్నము నూత్నరత్న మన సంభావించి లాలించెదన్.

112


వ.

అని దుకూలాదుల నబ్బాలచంద్రికాతలోదరి నాదరించి
పంచిన నవ్విపంచికావాణియు నిజప్రాణవయస్యోప
వనంబునకుఁ బవనవేగంబునం జనుదెంచి.

113

113. దుకూలాదులన్ = పట్టుబట్టలు మొదలగువానిచేత. విపంచికావాణి = వీణవంటి వాక్యములుగల బాలచంద్రిక.

క.

దృక్తరళజీవభారన్
ముక్తాహారన్ నిరస్తముక్తాహరన్
నక్తం దివాశ్రుధారా
సిక్త కటం ద్యక్తవలయఁ జెలియం గాంచెన్.

114

114. దృక్తరళజీవభారన్ = దృష్టివలెఁ జలించుచున్న ప్రాణసమూహముగల. అనఁగాఁ బ్రాణములు విరహబాధచేఁ గదలిపోవుచున్నవనుట. ముక్తాహారన్ = ముక్త = విడువబడిన. ఆహారన్ = భోజ నముగల. నిరస్త =విడువఁబడిన. ముక్తా = ముత్యములయొక్క. హారన్ = హారములు గల. నక్తం దివ = రేయుంబగళ్ళు, కటన్ = గండస్థలములు గల. త్యక్తవలయన్ - విడువఁబడిన కడియములుగల.

క.

కాంచి దృగంచలవంచిత
చంచల మదచంచరీకచంచచ్చికురం
గుంచితముకురకపోల ను
దంచితగతిఁ జేరి హృదయ దయ దయివారన్.

115

115. దృంగచల = నేత్రకోణములచేత. వంచిత = వంచించఁబడిన. చంచల = మెఱుపుగలది. చంచరీక = తుమ్మెదలవలె. కుంచిత = వంచఁబడిన. ముకుర = అద్దములవంటి. కపోల = గండస్థలములు గలది. దయివారన్ = అతిశయించగా.

ఉ.

చక్కని మేనఁ గట్టిన బిసప్రసవాదులు ద్రోచివైచి లేఁ
చెక్కుల నప్పళించిన యశీతదృగంబులు చేల నద్ది చన్
జక్కవ జారు పయ్యెదయుఁ జక్కఁగఁ జేర్చి వికీర్ణకేశముల్
మక్కువ దువ్వి క్రొవ్వెద యమర్చి సఖీమణిఁ గూర్చి యిట్లనెన్.

116

116. బిసప్రసవాదులన్ = పద్మములు మొదలగువానిని. అశీత = వెచ్చనైన. దృగంబులు = కన్నీళ్ళు. చేలన్ = బట్టచేత. క్రొవ్వెద = కొప్పు.

ఉ.

నీ చలపట్టినట్టి పని నిశ్చల మాయెఁ గదమ్మ, కొమ్మ, నీ

నోచిన తొంటినోము లవి నూరు ఫలించెఁ గదమ్మ, సత్యభా
షాచతురుండు ద్విత్రదివసంబులలోఁ గరుణింతునన్ దయం
జూచెఁ గదమ్మ, యమ్మరుని సోకుల కుల్కకు మమ్మ, నెచ్చెలీ.

117

117. చలపట్టినట్టి = పట్టుబట్టి నటువంటి. ద్విత్రదివసంబులలోన్ = రెండు మూడు రోజులలో. ఉల్కకు = భయపడకు.

మ.

నల దీవంత యనంగ దంతజితభాస్వత్కుందసానందయై
జలకం బాడి దుకూలమూని వరచర్చాగాత్రియై కాంచనో
జ్జ్వలచంచన్మణినూపురధ్వనికి వంచె ల్బారులై ముంచి యం
చలఁ బొంచం జనుదెంచి పాసె వసియించం కేళిసౌధంబునన్.

118

118. దంతజితభాస్వత్కుంద = దంతములచేత జయించబడిన ప్రకాశించుచున్న మల్లెపువ్వులు గలవి. అంచల్ = హంసలు. అంచలన్ = ప్రాంతములందు. పాసెన్ = వదలెను.

సీ.

చినుకు వెల్తురు మబ్బుచే నడ్డపాటింత
                 వోకార్చు రేరాచరేక యనఁగ
దన చిప్ప యున్కిఁ బోఁదట్టి వచ్చిన హురు
                 మంజి మేల్కట్టాణిమౌక్తిక మన

ముంచిన దట్టంపు మంచి జాడించిన
                 తలిరుపాయంపునెత్తమ్మి యనఁగ
నప్పసం బెడయని కుప్పసం బూడిచి
                 కొఱఁతఁ ద్రోఁచిన త్రాచుకూన యనఁగ


గీ.

నింతి దొగరేకు చిగురాకు టేకుఁదమ్మి
దొమ్మిగాఁ గ్రమ్మిన మిటారి దొర కటారి
వాడిమై వేఁడి మై తెల్పు వీడనాడి
పోడిమిఁ జెలంగె నప్పు డప్పువ్వుఁబోఁడి

119. పోకార్చు = పోగొట్టిన. రేరాచరేక = చంద్రరేఖ. హురుమంజి = హురుమంజి దేశమందైన. కట్టాణి = మిక్కిలియాణెమైన. జాడించిన = పోగొట్టిన. అప్పసంబు = ఎల్లప్పుడును. ఎడయని = విడువని. కుప్పసము = పొర. త్రాచుకూన = పాముపిల్ల. చిగురాకు టేకున్ =దూదిపింజెవంటి చిగురాకును. దొమ్మిగాన్ = సమ్మదముగా. క్రమ్మిన = వ్యాపింపఁజేసిన. మిటారి = మదముగల. దొర = మన్మథునియొక్క. కటారివాడి మైన్ = కత్తియొక్క తీక్ష్ణత్వముచేత నైన, వేడిన్ = కాకచేతఁగల. మై తెల్పున్ = శరీరపాండిమను. విడనాడి = పోఁగొట్టి.

వ.

అట్టియెడ నమ్మాగధేయ వసుధామండలాఖండలుం
డుద్దండవేదండకాండాదిబలంబుల గూడుకొని
మానసార మానవపాలశైలభేదను మీఁదికిం గదలి
కదలికాక్రముకాది వనవాటంబుల వాటంబై కోటకుం
బాకపాటనదిశ పిరంగి వాటునకుం జోటని యొక్క
తటాకతటాగ్రంబున మెండుగా దండువిడిచి యుండె
నంత నయ్యనంతీపురంబున.

120

120. వసుధామండలాఖండలుండు = భూదేవేంద్రుడు. కాండాది = గుఱ్ఱములు మొదలుగాఁగల, మానవపాలశైలభేదనుఁడు = రాజదేవేంద్రుఁడు, పాకపాటన = దేవేంద్రునియొక్క. దిశ = దిక్కు. తూర్పనుట. పిరంగి వాటునకున్ = పిరంగి దెబ్బకు. చోటు = తగినస్థలము.

ఉ.

కన్నడరాయఁ డాత్మకరకంజసమాహితబాహుమూలుఁడై
వన్నెగఁ గొల్వ నశ్వపతి వస్త్రసమన్వితహస్తవక్త్రుఁడై
విన్నపమాచరింప నరవిందముఖీశయచామరానిలా
భ్యున్నతి నిర్దళత్కచము లుత్కలభర్త పొసంగ దువ్వఁగన్.

121

121. కన్నడరాయుఁడు = కర్ణాటదేశపురాజు, ఆత్మకరకంజసమాహితబాహుమూలుఁడు = తన హస్తపద్మములచేతఁ గూర్చఁబడిన చంకలుగలవాఁడు. అనఁగా మడిచేతులు బట్టినాఁడు. వస్త్రసమన్వితహస్తవక్త్రుఁడు. గొప్పవారితో భృత్యులు మొదలగువారు మాటాడునప్పుడు నోటియొద్ద బట్టనుంచుకొనుట వినయలక్షణము. అరవించముఖీ = స్త్రీలయొక్క. శయ = హస్తములయందైన. చామర = వింజామరలయొక్క. అభ్యున్నతి = అతిశయముచేత. నిర్గళత్ = పారుచున్న, కచములు = వెండ్రుకలు.

సీ.

గాయనీగానరేఖాద్రవన్మణిచంచు
                 బకదాత్మభూహయప్రతిమకంబు
వైణికీవల్లకీవాద్యశ్వసద్భృంగ
                 శంకాపదస్తంభశక్రశిలము
గణికాకటాక్షాంబకప్రయోగప్రవీ
                 ణధనుర్ధరచ్చిత్రనలినశరము

పరిచారికాభుజాప్రచలచామరచంద్రి
                 కాచంద్రదురుభిత్తికాముకురము


గీ.

భూసురాశీర్విజృంభమాణాసమాంచ
దర్హపట్టాభిషేకధామాభిరామ
పటలికాపటుమంటపాభ్యంతరమున
మానసారుఁడు గొలువుండె మహిత మహిమ.

122

102. గాయని = గానముఁ జేయు స్త్రీలయొక్క, గానరేఖచేత. ద్రవత్ =జలము గారుచున్న. మణిచంచు = మాణిక్యవికారములగు ముట్టెలుగల. బకత్ = కొంగలవలె నాచరించుచున్న. ఆత్మభూహయ = మన్మథుని గుఱ్ఱములైన చిలుకలయొక్క. ప్రతిమకంబు = ప్రతిమలుగలది. స్త్రీలపాటలవల్ల చిలుకబొమ్మలముట్టెలు మాణిక్యములౌటచేత నని కరఁగి నీరు గారుటచేత కొంగలవలె నుండు ననుట. కొంగముట్టెలు నీరు గారుచుండుట న్యాయము. వైణికీ = వీణ బాడు స్త్రీలయొక్క. వల్లకీవాద్య = వీణాధ్వనులచేత. శ్వసత్ = ప్రాణములు గలవైన. ఇది నీలములకు విశేషము. భృంగశంకాప్రద = తుమ్మెదలన్న సంశయము నిచ్చుచున్న స్తంభములయందైన. శక్రశిలము = ఇంద్రనీలములుగలది. వీణపాటవల్ల నింద్రనీలములు ప్రాణయుక్తములై తుమ్మెదలన్న భాంతిని గల్గించుచున్నవి. గణికా = వేశ్యలయొక్క. కటాక్షాంబక = క్రేగంటిచూపు లనెడు బాణముయొక్క ప్రయోగమందు. ప్రవీణ = నేర్పుగల. ధనుఁ = ధనుస్సును. ధరత్ = ధరించుచున్న. చిత్రనలినశరము = చిత్తరువైన మన్మథుఁడు గలది. చంద్రత్ = చంద్రునివలె నాచరించుచున్న. అసమ = సమానము లేనట్టుగా. అంచత్ = ఒప్పుచున్న. ధామ = తేజస్సులయొక్క. అభిరామ =.మనోహరమగు. పటలికా = సమూహముచేత.

క.

పేరోలగ మీగతి జగ
తీరమణుం డొంద వసుమతీనందనుఁ డీ

చేరువకు నచ్చె ననుచుం
జారులు వినిపించి రపుడు చారుప్రౌఢిన్.

123


సీ.

విడిదియల్ బలుసేసి వెస నందుకొనుటకై
                 చెవిఁ జేరి యదలించి చెప్పు బంధు
లొండొరుల్ బొమసన్న లొందిచి యరచేత
                 నడివ్రేసి తొడ నింత యదుము మంత్రు
లే నిందులకు సామి లోనీకుమని యంత
                 చాటి చెప్పితి నను పోటుబంట్లు
మోచి వచ్చిన దాఁక ముందెఱుంగఁడు కార్య
                 మిటుపయి నేమంచు నెంచు హితులు


గీ.

తండ్రివలెఁగాఁడు తా బంటు తాకుతప్పు
లెఱుఁగు బ్రజపట్టుమానిసి యితఁడు మగధుఁ
డనెడు పరివారములు గాంచి రతని కొల్వు
రాజవాహనధాటికాశ్రవణవేళ.

124

124. విడిదియల్ = రాజవాహనునకుఁ దగిన బసలు. పలు = విస్తారముగా. అందుకొనుటకై = అతనితోఁ గలుసుకొనుటకు. అనఁగా నతనిని దీసుకరమ్మని. అరచేతనడి వ్రేసి = అరచే యడ్డుచేసుకొని, తమరహస్యము లితరులకుఁ దెలియకుండ మొగముప్రక్కను చేయుంచి. కార్యము మించినపుడు ఏమియుఁ దోచక తొడనొక్కుకొనుట గలదు. ఇందులకు = ఇందునిమిత్తమే. లోనీకుమని = శత్రువుల కెడమియ్యవద్దని. ఏను అని ప్రత్యేకవివక్షచేత నేకవచనము. తాకుతప్పులు = దెబ్బ వేయుటయుఁ దప్పించుకొనుటయును. ప్రజపట్టుమానిసి= ప్రజలయందుఁ బక్షపాతము గలవాఁడు, ధాటికాశ్రవణవేళన్ = దాడివచ్చినట్టు విన్న సమయమందు.

శా.

ఆసద్దుల్ విని చేఁగృపాణిఁ గొని బాహాయుగ్మ మీక్షించి బల్

మీసంబుల్ వడిఁ గొల్పి బల్మీ నగవుల్ మీరం దృగారుణ్యముల్
మోసుల్ బూనఁగ మానసారమహిపాలుం డాప్తులం గాంచి యో
హెూ సూరుం డరుదెంచె నంచుఁ బలికెన్ హుంకార మేపారఁగన్.

125

125. కృపాణిన్ = చిన్న కత్తిని. దృగారుణ్యముల్ = కన్నుల యెఱుపులు. మోసుల్ బూనఁగన్ = మొలక లెత్తగా. సూరుడు = శూరుఁడు.

క.

జంబుకము చెనకి మత్తగ
జంబుం బొరిఁగొనఁగ మొనయు జగమున మండూ
కంబు ప్రభంజనభుజు జగ
డంబునకు బిలిచె నక్కటా వింతలుగా.

126

126. ప్రభంజనభుజున్ = పామును.

శా.

ఔరా మాగధరాజకుంజరము నేఁ డత్యద్భుతాహంక్రియన్
మేరం జెందిన మాళవాధిపహరిన్ మేల్కొల్పె నస్మద్భుజా
ధారానర్గళమండలాగ్రలతికాధారారుచుల్ మానునే
యారాజన్యుని తండ్రి కిప్పటికి శౌర్యౌదార్యముల్ గల్లెనే.

127

127. మాళవాధిపహరిన్ = మానసారుఁడను సింహమును. అస్మ. . . రుచుల్ = అస్మద్భుజ = మాచెయ్యి. ఆధార = ఆధారముగల మండలాగ్రలతికా = లతవంటి కత్తియొక్క. ధారా = అంచుయొక్క. రుచుల్ = కాంతులు. ఔదార్యముల్ = అతిశయములు.

క.

దగఁబరచి చనిన గిరి చె
ట్టిగిరించెనె దొనలు నిండె నే మెట్టినచో
ట్లొగి మాసెనె తామర చివఁ
బొగడొందిన భిల్లవల్లభుఁడు మరఁడంచున్.

128

128. దగన్ = భయముచేత. దొనలు = అంబులపొదులు. మునుపటి యుద్ధములో బాణశూన్యములైన యంబులపొదులలో మరల బాణములు సంపాదించెనా యనుట. పొగడొందిన భిల్లవల్లభుఁడు అనఁగా మునుపు భిల్లరాజు చేత మానసారుఁడు రాజహంసుని జయింపఁజేసినట్టు తోచుచున్నది.

క.

అట హరి విక్రముఁ డత్యు
ద్భటహయభటహస్తిఘటలు దగరా నగరా
దట హవణిక వెడలిన మహి
పటహరమై చటుల లటకపటహము మొఱసెన్.

129

129. ఘటలు = ఏనుఁగు గుంపులు. నగరు = పట్టణము. హవణిక వెడలినన్ = అలంకారశూన్యము గాఁగా. మహిపట = సముద్రము. లటక =దుష్టమైన.

శా.

లంకారాణ్మదభంగభంగనిభనీలా నీలవేణీవల
త్సంకేతోద్యదపాంగ పాంగవపదాబ్జక్లేశహృద్ధీనిరా
తంకోత్సాహతరంగ రంగదిషుసుధాభిన్నమాయావి ని

శ్శంకస్వర్ణకురంగ రంగపతిసంజ్ఞాశేషశయ్యాశయా.

130

130. భంగ ... పాంగ = భంగనిభ = తరంగమువంటి. నీలానీలవేణీ = నీలాదేవియొక్క. వలత్ = చలించుచున్న. సంకేత = సంజ్ఞయందు. ఉద్యత్ = అభిముఖమైన. అపాంగ = క్రేఁగంటిచూపు గలవాడా! పాంగవ... తరంగ = పాంగవ = సొట్టవాని సంబంధమయిన, పదాబ్జక్లేశహృత్ = పాదాయాసమును బోఁగొట్టిన. ధీ = బుద్ధియందు. నిరాతంకోత్సాహకరంగ = అడ్డులేనితరంగమువంటి యుత్సాహము గలవాఁడా. రంగదిషు... కురంగ = రంగత్ = ప్రకాశించుచున్న. ఇషు = బాణముయొక్క. సంధా = కూర్చడముచేత. భిన్న = కొట్టఁబడిన. మాయావి = మాయగలిగినట్టియు. నిశ్శంక = భయము లేని. స్వర్ణకురంగ = బంగారపులేడిగలవాఁడా. శేషశయ్యాశయా = శయ్యయందుఁ బరున్నవాఁడా.

క.

ప్రవిదారణ రాత్రిమట
ప్రవిదారణదారుణారిపాణిపయోజా
పవిధారణపరిబృఢకో
పవిధారణదశ సహస్రభాస్వత్తేజా.

131

131. ప్రవిదా..పయోజా = ప్రవిదారణ = యుద్ధమందు. రాత్రిమట = రాక్షసులయొక్క. ప్రవిదారణ = కొట్టడమందు. దారుణ = భయంకరమయిన. అరి = చక్రాయుధము. పాణిపయోజా = హస్తపద్మమందుఁ గలవాఁడా. పవిధారణ ... దశ = పవిధారణ = వజ్రాయుధమును ధరించిన. పరిబృఢ = ప్రభువైన యింద్రునియొక్క. కోపముయొక్క. విధా = కొట్టివేయడమువిషయమై. రణదశ = యుద్ధావస్థ.

తోటకము.

కమలాలికుచాకృతి కమ్రకుచా
సమమేచక చామర చారుకచా

భిమతోత్సవ చాపల పేలవచా
రమనో నవ చాటుసరాగ వచా.

132

132. కమలా = లక్ష్మియొక్క. లికుచాకృతి = నిమ్మపండ్లయాకారముగల. కమ్ర = మనోహరములైన. కుచ = స్తనములయందును. అసమ = సమానము లేకున్నట్టుగా. మేచక = నల్లనైనట్టియు, చామరచారు = వింజామరవలె సుందరమైన, కచ = కేశములయందును. అభిమత = ఇష్టమైన ఉత్సవమందైన. చాపల = చాంచల్యముచేతను. పేలవ = మృదువైన. చార = ప్రవృత్తిగల. మనః = మనస్సుచేత. నవ = నూతనములైన. చాటు = హితములైన. సరాగ = అనురాగముతోఁగూడిన. వచా = వాక్యములు గలవాఁడా.

గద్య
ఇది శ్రీమద్ద్రామభద్రభజనముద్రకవి పట్టభద్రకాద్రవేయాధిప
వరసమాగత సరస సారస్వతలహరీ పరిపాక కాకమాని
ప్రబోధబుధకవి సార్వభౌమపౌత్ర రామలింగభట్ట
పుత్ర కౌండిన్యగోత్ర భాగధేయమూర్తి
నామధేయప్రణీతం బైన రాజవాహనవిజ
యంబనుమహాప్రబంధంబునం
దు జతుర్థాశ్వాసము