Jump to content

రాజవాహనవిజయము/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీ

శ్రీ పరమాత్మనే నమః

రాజవాహనవిజయము

పంచమాశ్వాసము

శ్రీమదలమేలుమంగా
సీమంతప్రాంతకాంధసింధూరగవ
క్షోమానఖాంకశంక్యు
ర్వీముఖహాసదాస్యసోమ వెంకటధామా.

1

1. అలమేలుమంగయొక్క. సీమంతప్రాంత = పాపిటదగ్గరనున్న. కాంత = సుందరమైన. సిందూర = సిందూరమును. గ = పొందిన. వక్షః = వక్షస్థలమందు. మా = లక్ష్మియొక్క. నభాంక = నఖక్షతములను. శంకి = ఊహించుచున్న. ఉర్వీ = భూదేవియొక్క. ముఖ = ముఖమునుగూర్చి. హసత్ = నవ్వుచున్న. ఆస్యసోమ = చంద్రునివంటి ముఖము గలవాడా.

వ.

అవధరింపు మప్పుడమిఱేఁ డూరివాకిలి వెడలి కడలి
వెల్లివిరిసిన పెల్లున సకలబలంబులం గూడుకొని
కుమారుని దర్పసారునిఁ గతిపయపరివారునిం గావించి
కోటలో నుంచి రాజవాహనుపాలెంబు దివియించెద
నని చలపట్టి చెరువుకట్ట యుత్తరంపుగట్టున బారు

వెట్టించి మెండుగ దండు గుడారు బిడారులంట నూ
గారు లంటించి బాణంబులు పరగించిన.

2

2. పాలెంబు = సేనాస్థానము. తివియించెదన్ = సంహరించెదను. గుడారులు = ఢేరాలు. బిడారు = సమూహము.

క.

అలబలముల నల బలముల
యెలగో లేమేమి యెక్కడెక్కడ నిలు నిల్
దలతల పదపద పొడుమని
కలఁగెం దండెల్ల హల్లకల్లోలంబై.

3

3. అల బలములన్ = ఆ సేనలను. అలబలముల = ధాటులయొక్క. ఎలగోలు = గందరగోళము. తలతల = ప్రతిమనుష్యుఁడును. హల్లకల్లోలము = కలవిలపడ్డది.

శా.

కల్లెంబుల్ సవరింప కశ్వముల నెక్కంబూను రాహుత్తులుం
బల్లెంబు ల్గొని యర్ధభోజనము లబ్బన్ లేచు యోధాగ్రణు
ల్కల్ల ల్బల్కుచు నొంటిఁ బంచల నగళ్ళన్ వెళ్ళు భూవల్లభుల్
జల్లింపం దలపోయు కూటమిదొరల్ జవ్వాడి రవ్వాడికిన్.

4

4. అగళ్ళన్ = సందులయందు. జల్లింపన్ = నరుకుటకు. కూటమిదొరల్ = కూడినరాజులు. సహాయు లనుట. జవ్వాడిరి = చలించిరి.

సీ.

ఓయి నాడొక మాట కొడ్డోలగముననే
                 మంటివి చూడు నే డనెడువారు

నిల్చినాఁ డితడు పోనిం డల్కనుంట బం
                 ట్రౌతు పాడియె యని డాయువారు
నెల కేఁబదిదినా లనెడు తుష్టి లెక్కల
                 కరణాలఁ బొడఁ గని కదియువారు
బంతికూళ్లకుఁ బాలు పడు పోటుబంట్లు వా
                 రేరయాయని యని కేగువారు


గీ.

బంటు నెఱుఁగవు గాస మిమ్మంటెఁ గసరె
దవసరము వచ్చె మముఁ జూడు మనెడువారు
నైరి మగధేంద్రుపాలెంబునందు రిపులు
డాసి చేవాసి యెలజాలు చేసినపుడు.

5

5. గాసము = జీతము. చేవాసి = భుజపరాక్రమము. ఎలజాలు = వ్యాపించినది.

క.

 ఆయెడ మాగధ వసుధా
నాయకుఁడు గుడారు వెడలి నానావిధసే
నాయోధసనాథుండై
యాయోధనసముచితాయుధాయతభుజుఁడై.

6


క.

పరదళముఁ గనిన పార్థివు
డరదంబుల కరదములను హరులకు హరులం
గరులకుఁ గరుల న్నరులకు
నరులం దగఁ బంచి వైచి నడచెం గలనన్.

7


సీ.

సింధురాజీలబ్ధబంధురానందుండు
                 నవముక్తశరతుష్టనారదుండు
తన యాభ్యుదయలీలఁ గని పోటు నెరపుచుఁ
                 బాటుఁ జూపిన యట్టి ప్రబలకీర్తి

మందరాగమ్ము నుమ్మలిఁ బారమును జేర్చు
                 తరి బుధస్తుతిఁ గన్నఁ తత గుణమణి
వడిగల వారినిఁ బడబాది బల మిట్లు
                 గడలఁ బోవఁగనీక నడపు దాత

మన

క.

సాగ రమ్మను పలుకుమించంగఁ గరము
వీచి బైటికిఁ జెత్తలఁ ద్రోచి వైచి
వాహినీనాథుఁ డొకఁ డొకఁ డాహవమునఁ
గలయఁ బడుటయుఁ గనిపట్టె ఖచరతతికి.

8

8. ఈ పద్యమందు (వాహినీపతి = సేనానాయకుఁడు అనియు నదులకుఁ బెనిమిటియగు సముద్రుఁ డనియు) రెండుపక్షములయం దర్ధము గలదు. సింధురాజీ = సింధుర = ఏనుఁగులయొక్క. ఆజీ = యుద్ధ మందు అని. సింధు = నదులయొక్క, రాజీ = పఙ్క్తిచేత అనియును. నవ...నారదుఁడు = నవ = నూతనముగా. ముక్త = విడువబడిన. శర = బాణములచేత. తుష్ట = సంతోషించుచున్న. నారదుండు = నారదమునిగలవాఁడు అని, నవముక్త = కొత్త ముత్యములుగలవాడును. శర = ఉదకముచేత. శుద్ధ = సంతోషించుచున్న. నారదుండు = మేఘములుగలవాడును అనియును. తన కీర్తి = తనయొక్క. అభ్యుదయ = అభివృద్ధి సంబంధమయిన, లీలన్ = చేష్టను. పోటునెరపుచున్ = ఆయుధప్రయోగముఁ జేయుచు, పాటుఁజూపిన = ఆయాసముఁ జూపించి. ప్రబల = ప్రకృష్ణసేన యొక్క. కీర్తి = యశముగలవాఁడు అని. తనయ = కొమారుఁడైన చంద్రునియొక్క. అభ్యుదయ = ఉదయముయొక్క. లీలన్ = విలాసమును. పోటు నెరపుచున్ = పొంగుచు. పాటుఁ జూపిన = తగ్గునుజూపిన. ప్రబలకీర్తి = గొప్పబురదగలవాఁడు. సముద్రము పోటెక్కినప్పుడు కలతచే బురద బయలుదేరును. అనియును. మంద... మణి = మంద = కొద్దియైన. రాగమ్మును = ప్రేమయును. ఉమ్మలిన్ = కోపమును. పారమును జేర్పుతఱిన్ = కడముట్టించినపుడు, నిగ్రహములు జూపించునపు డనుట. బుధస్తుతిన్ =విద్వాంసుల స్తోత్రమును.గుణ మణి = మణులవంటి గుణములుగలవాఁడు అని. మంచరాగమ్ము = మందరపర్వతముయొక్క. ఉమ్మలిన్ = మథముచేత. పారమును= ఒడ్డును. బుధస్తుతిన్ = దేవతలయొక్క పొగడికను. తతగుణ = విస్తారపుగుణములు గల. మణి = చింతామణి మొదలగురత్నములుగలవాడు అనియును. వడి...దాత = వడిగలవారిని = వేగముగలవారిని. పడనూది = పడఁగొట్టి. బలము = సేనను. కడలఁబోవఁగనీక = పైకిఁ బోనీక. దాత = నరికేవాఁడు అని. వడిగల వారిని = వేగముగల నీటిని. బడబాది = బడబాగ్ని మొదలగు. ఇక్కడబడబకును, అగ్నికిని అభేదము. బలము= సమూహము. కళలన్ = తరంగములచేత. దాత = దాతృత్వముగలవాఁడు. సాగన్ = జరుగునట్లు. రమ్మను = రావలసినదనునట్టి. కరము వీచి = చెయ్యి విసరి. చెత్తలన్ = . బలహీనులను అని. సాగరమ్మను = సాగరమనునట్టి. కరము = మిక్కిలి. వీచినన్ = తరంగముచేత. చెత్తలన్ = తుక్కులను. అనియును.

క.

అరదం బరదము హరి హరి
కరి కరియు న్ఫటుఁడు భటుఁడు గాఢచ్ఛలనం
జొరఁ బారి పోరు తఱి బం
ధురమై తర మెన్నరాని దురమై దొరసెన్.

9


ఉ.

మాళవ మాగధుల్ వరపుమార్గణ మొక్కటి పెక్కురూపులై
వ్రాలిన వాజి రాజి మహి వ్రాలె రథధ్వజపాళి నుగ్గులై
వ్రేలె భటచ్చటాంగములు వ్రీలె మదావళదంతకుంతముల్
గూలె సమస్తభూతములు గ్రోలెఁ గళేబరముక్తరక్తముల్.

10

10. దంతకుంతముల్ = ఈటెలవంటి దంతములు.

చ.

సరసికిడాయు మత్తకరిచాడ్పున మాగధుపైని దంతిరా

జరిగినఁ గేసరిప్రకృతి నమ్మగధుండును మాళవేంద్రుపై
దుర మొనరించె మాళవుఁడు దోడనె జాంబవదాకృతి న్భుజా
సరసతఁ జూప మాగధుఁడు జాంబవతీపతి భాతిఁ బోరుచున్.

11

11. జాంబవదాకృతిన్ = జాంబవంతునివలె. జాంబవతీపతి భాతిన్ = కృష్ణునివలె. ఈ యుపమానములవల్ల జాంబవంతుఁడు కొమార్తెను కృష్ణమూర్తి కిచ్చినట్టు యుద్ధమం దోడిపోయి మానసారుఁ డవంతిని రాజహంసుని కిచ్చుట తోఁచుచున్నది.

సీ.

చేరి యెక్కినచోటఁ బూరి మెక్కినచోట
                 భయదోక్తి దయశక్తి బరగఁ జూపి
బోరుముట్టిన చాయఁ బేరువెట్టిన చాయఁ
                 గరహేతి సరభూతి గడలుకొల్పె
దండ వెట్టినవారి దండ ముట్టినవారి
                 శయశక్తి నయయుక్తి సంఘటించెఁ
గిట్టఁబూనిన చక్కిఁ బుట్టలానిన చక్కి
                 గురుశక్తి యురుభక్తి గుదురుపరచె


గీ.

వగలు మీఱఁ బొదలు దూర సిగల జార
గదలు జారఁ గ్రమకమక్షమలు జరపె
సమరతలమున నమరె విక్రమరసమున
రణవిహరణాధ్వరధ్వంసి రాజహంసి.

12

12. చేరి యెక్కినచోటన్ = ఎదురుకొన్నచోటు. పూరి మెక్కినచోటన్ = గడ్డి గరఁచినచోట. భయద = భయము నిచ్చునట్టి. ఉక్తిన్ = వాక్యమును. పేరుబెట్టినచాయన్ = మారుపేరు బెట్టినచోట. హేతి = కత్తి. దంట బెట్టినవారిన్ = దండెత్తి వచ్చినవారిని. దండము = నమస్కారము. ఉట్టినవారికిన్ = ఉట్టుధాతువునకు జారుట అర్థమైనను ఇక్కడ లక్షణచేత అర్పించుట చెప్పవలెను. శయ = హస్తముయొక్క. రణవిహరణ = యుద్ధవిహారమందు. అధ్వరధ్వంసి = రుద్రుడైన.

సీ.

అఖిలసీమామూల మైనదుర్గమ్ము లు
                 మ్మలికలు గల కమ్మ వెలమ దొరలు
చేతి కైదేసి వేల్ శివరాయల వరాల
                 నెలకట్టడల పటాణీ ల్గరీబు
లూళ్ళాయములమీఁద హొరపుత్తరువు గన్న
                 రాయ కైజీతంపురాయవారు
పగటిగాసంబు దప్పకయుండ దినరోజు
                 మాదిరి నొంటిరి జోదుమూక


గీ.

మొదలుగాగఁల బారులు మొనకు నిచ్చి
పొడిచి పేర్వాడి వీథు లేర్పడఁగఁ జేసి
గాసిఁ గావించి యరులఁ జేవాసియెదుట
జూపి నిలరేఁడు మూడు మెచ్చులునమెచ్చ.

13

13. సీమామూలమైనదుర్గమ్ములు = దేశపుసరిహద్దుకోటలు. ఉమ్మలికలు = మొఖాసాలు అని తోఁచుచున్నది. శివరాయలవరాలు = వరహాలలో భేదము. నెలకట్టడలు = నెలజీతములు, పటాణీలు. గరీబులు = ఆయాదేశస్థులు. ఊళ్లాయములమీద హొరపుత్తరువుగన్న = గ్రామము సొమ్ముల దస్తు చేయుటకు హుకుమును బొందిన. రాయ కైజీతపురాయవారు = నెలజీతములు లేకుండా గొప్పగొప్ప ముజరాలు గల అధికారులు. పగటిగాసంబు దప్పక యుండన్ = బత్తెము మానకుండగా. దినరోజుమాదిరిన్ = ఏరోజుసొ మ్మారోజే ముట్టే పద్ధతినున్న. ఒంటరిజోదు = అసహాయశూరులైన యోధులయొక్క

మ.

భటులం గీటణఁగించి ఘోటకములన్ భర్జించి భద్రేభరా
డ్ఘటలం జెక్కలుచేసి సైనికశతాంగశ్రేణి నుగ్గాడి యు
ద్భటకాలానలకాలకంఠనిభజాగ్రద్విక్రమోదగ్రుఁడై
దిటమై మాగధుఁ డొప్పిన న్మరలె భీతి న్మానసారుం డనిన్.

14

14. ఘోటకములన్ = గుఱ్ఱములను. ఘటలన్ = యేనుఁగుసమూహములను. కాలకంఠ = రుద్రుఁడు. దిటమై = దృఢమై.

సీ.

గడగడ వడకి నల్గడ ల్విడచి క
                 కాపిక లైపోయె గడల పౌజు
చేతిక్రోవులు వైచి భీతిఁ జైవులు జారె
                 బగ్గము పాడై తుపాకిమూక
కేడెముల్ విడి మాని వేడెముల్ పంచ
                 బంగాళమై పారె గుఱాలబారు
కర మెత్తి ఘీంకారభర మెత్తి పరువెత్తి
                 యళికి యధాయధ లయ్యెఁ గరులు


గీ.

గగనమణిఘృణి విక్రమక్రమధురీణ
మగధ మహిధవ భుజదండమండలాగ్ర
దవ ధనంజయ ధగధగద్ధగల బెగడి
మానసారుండు వెనుకముందైన యపుడు.

15

15. గడలు - కొవ్వీటెలు. క్రోవులు = తుపాకులు. కేడెముల్ = డాళ్ళు. వేడెముల్ = శౌర్యములు. అత్తి = పొంది. అళికి = భయపడి. యధాయధలు = చెదిరిపోయినవి. గగనమణి = సూర్యునియొక్క. ఘృణి = కిరణములవంటి. మండలాగ్ర = కత్తియనెడు. దవధనంజయ = కార్చిచ్చుయొక్క.

క.

దగదొట్టి కలన బెట్టిన
మగఁటిమి వెన్నిచ్చి పారు మాళవ నృపతిన్
మగధపతి యట్టితతి నా
శుగతి న్వెన్నాడి కోటఁ జొరదోలి వడిన్.

16

16. దగదొట్టి = దాహముగొని, అట్టి తరిన్ = ఆసమయమందు. ఆశుగతిన్ = వేగిరపునడకచేత.

చ.

అటుల జయంబుఁ గాంచిన ధరాధిపయోధులు వంకదార మి
క్కుటముగఁ జొచ్చిరాఁగ విని గొబ్బున వైచిరి వీఁటికోటవా
కిటి భటు లంత మాగధునికిం గల బం ట్లిరుగంట నిప్పుకల్
చిటచిటరాల నేనుఁగులచేరువ కానికిఁ బంపు వెట్టినన్.

17

17. వంకదార = కోటవాకిటి వంకత్రోవ. వైచి = తలుపు వేసిరి. నిప్పుకల్ = అగ్నికణములు. చేరువ = సమూహము. యేనుఁగులచేరువకానికిన్ = గజసేనానాయకునికి. పంపువెట్టినన్ = నీపనియని చెప్పఁగా.

క.

గోపురకవాటపాటన
నైపుణచణచరణవారణసమారోహో
ద్దీపితభాషావరసం
జ్ఞాపటుగతి మావటీఁడు చనుదెంచె వడిన్.

18

18. పాటన = బ్రద్దలు చేయుటయందు. నైపుణచణ =నేర్పుతోఁ గూడిన. చరణ = పాదములుగల. వారణ = ఏనుఁగుయొక్క. మావటీఁడు = ఏనుఁగు నెక్కినవాఁడు.

చ.

వడిఁ జనుదెంచి కోట తలవాకిటి గాఢకవాటపీఠముల్
పడ గెడిపించి దంతి బొరఁబారఁగ నిల్చిన తత్పురీభటుల్
గడల మదవళోరసము కాయము గాయముఁ జేసి మై జిరా
పొడిపొడి సేయుడుం దిరిగిపోవక మావతుఁ డాగ్రహోగ్రుఁడై.

19

19. పడగెడిపించి = పడఁదన్నించి. మదావళోరసము = రొమ్మెదిరించి యుద్ధముచేయు ఏనుఁగు. జిరా = కవచము. మావతుఁడు = యేనుఁగువాడు.

గీ.

మోటుపలుక నిజాంగంబు మాటుగాఁగ
వెలయ మావంతుఁ డెసకొల్ప మలయు మత్త
వారణేంద్రంబు ద్వారంబుఁ జేరి పెద్ద
బారిచే వైరిబారులఁ బారి సమరె.

20

20. మోటుపలుక = పెద్దడాలు. ఎసకొల్సన్ = ప్రేరేపించఁగా. మలయు = ఉద్రేకించునట్టి. బారిచేన్ = ఏనుగుకాలిగొలుసుచేత. బారులన్ = పఙ్క్తులను, సమరెన్ = చంపెను.

శా.

ఈజాడం జెడమోదు దంతిఁ బ్రతి మత్తేభంబు నానించి త
ద్రాజత్కుంజరపార్శ్వయోధవరులం దండించి నేజాలు నా

రాజుల్ గైకొని కోటలోఁ గొలుచు నారాజుల్ తదంగంబు లు
గ్రాజిం జెక్కలు సేయుచో మరలె గంధానేకపం బార్భటిన్.

21

21. ప్రతిమత్తేభంబున్ = ఎదురేనుఁగను. నేజాలు = కత్తులు. నారాజుల్ = ఒకతరహాకత్తులు. గంధానేకపంబు = మదగజము.

గీ.

బాణముల జివ్వవిలచిన బాణములను
గ్రోవులను గుంటిక్రోవుల గోటమూక
యలముఖంబునఁ దొట్టిన బలము నెల్ల
మంగలములోని పేలాలమాట్కిఁ బేల్చె.

22


వ.

అట్టియెడ.

23


ఉ.

తొంటి నృపాలజాలములతోఁ దులదూగెడు మాగధేంద్రు చే
నంటిన వింటిమంటకు భయద్రుతుఁడై సరివారు నవ్వఁగా
గొంటుతనంబునం దుదిని గోటమరుంగున డాగియుండెనే
బంటిఁక మానసారుఁడని పల్మరు మాగధయోధు లాడినన్.

24

24. గొంటుతనంబు = కాఠిన్యము.

చ.

పగ మరలింపఁ దండ్రి పనుపం బనిఁబూని యవంతి కోటపై
జగడము సేయఁబూని యటు సాయకు రాక యరాబుకొమ్మచాల్

తెగువను దేరిచూచుటకు దిట్టఁడుగాడట రాజహంసికిన్
మగతనమేడదా యనియె మాళవభృత్యుఁడు కొత్తడంబునన్.

25

25. తండ్రి = రాజహంసుఁడు. అటు సాయకున్ = అటువైపునకు, అరాబుకొమ్మచాల్ = కోటకొమ్మలవరుస అని తోచుచున్నది. కొత్తడంబునన్ = కోటబురుజుమీఁద.

చ.

కటిని ఘటిల్లు కొమ్మపుడు గైకొని మందు తుపాకి నించి గుం
డటుల శలాకఁగూరి తగునట్లుగ రంజకముంచి కొమ్మమీఁ
దట నిడి క్రోవి పత్తి వెసఁ దార్చి పిరంగికి గండిఁజూచు త
ద్భటుఁ బడనేసి యార్చె మగధక్షితినాథునియొద్ద నుధ్ధతిన్.

26

26. శలాకన్ = తుపాకి గజముచేత. రంజకము = నిప్పంటించుటఉకు మందుగూరిన చిన్నసందు. కొమ్మ = తోటకొమ్మ. గండి = సందు.

క.

సరిగాయము లరికాయముఁ
గరకరి గావించి చాయఁ గని మాగధరా
ట్కరితురగస్యందనభట
మరిగె న్నిజశిబిరమునకు నయ్యెడఁ గడకన్.

27

27. కరకరి = బాధ, చాయఁగని = త్రోవఁజూచి. శిబిరము = సేనాస్థానము.

క.

పూని మరునాఁడు మగధ
క్ష్మానాథుం డలుక రేగి మది లగ్గలకున్
సేనానీకాన్వితుఁ దన
సేనానిం జూచి కోట సెలవిడియె వడిన్.

28

28. లగ్గలు = గోడలు దిగి వెళ్ళి దోచుకొనుట. సేనానిన్ = సేనానాయకుని.

శా.

దిగ్రాజాగ్రణి పంపునం జని యరాతి క్రూరనారాచపా
తాగ్రజ్వాలల నాత్మ బెగ్గిలక తృణ్యాగణ్యభూరుణ్నికా
యగ్రావాళి నగర్తఁ బూడ్చి నృపయోధాగ్రేసరుల్ కేసరీం
ద్రగ్రైవేయకమండలాగ్రకరజాగ్రగ్విక్రమోదగ్రులై.

29

29. తృణా... వాళిన్ - తృణ్యా = గడ్డిమోపులయొక్క. అగణ్య = లెక్కించ శక్యముగాని, భూరుట్ = చెట్లయొక్క. నికాయ = సమూహములయొక్క. గ్రావ = రాళ్ళయొక్కయు. అళిన్ = పఙ్క్తిచేత. కేసరీంద్ర = సింహశ్రేష్ఠమువంటి, గ్రైవేయక = కంఠాలంకారముగల, అనఁగా సింహతలాటము పిడిగలది. మండలాగ్ర = కత్తులుగల.

ఉ.

చివ్వునఁ గోటయెక్కి బలుచివ్వ యొనర్చి విరోధి వప్రముం
గొవ్వునఁ గొంట యొండె, రిపుఘోరకఠోరకుఠారధారలం

ద్రెవ్వుట యొండె యెవ్వరటఁ ద్రిమ్మరి వచ్చిన నొట్టటంచు వా
క్రువ్వఁగ రాని యాన లిడి కోటకు నెక్కిరి నాల్గుదిక్కులన్.

30

30. చివ్వ = యుద్ధము, కొంట = పుచ్చుకొనుట, త్రెవ్వుట = తెగిపోవుట, ఆనలు = ఒట్లు.

చ.

లసికిరి జోదు లగ్గలకెక్కినఁ గుంతపఙ్క్తులన్
వసుమతిఁ గూల్చియున్ గదలవైచియుఁ గత్తుల వ్రక్కలించియున్
వసుల వధించియున్ ముసలవర్గములం బడమోది వాలుకల్
మసలక వేసి వంచియును మందులతిత్తులు గాల్చి వైచియున్.

31

31. జగ్గలికన్ = కార్యముచేత, లగ్గలు = గోడలు, వసులన్ = కొనలు సన్నముగాఁజెక్కిన కొయ్యలు, వాలుకల్ = ఇసుకలు, లసికిరి = నశింపజేసిరి.

సీ.

నిబిడంబుగా వైచు నిశ్రేణీకాశ్రేణి
                 తోడ బాణిఁ కృపాణిఁ దునిమి తునిమి
యున్న నిచ్చెనలు బో నొకనిపై నొకఁ డెక్కి
                 కోట కెక్కఁగ ఱాలఁ గూల్చి కూల్చి
గట్టిగా సారువల్ గట్టి యట్టడిమీఁది
                 కురికి వచ్చినఁ దలల్ నరికి నరికి

వెనుక బారు శరంబులను బేర్చి పై నిల్చి
                 జగడవించినఁ బార జంపి చంపి


గీ.

కడమ భటసంఘములు సురంగం బిడంగ
గాంచి పొంచియె మరు సురంగమునఁ ద్రుంచు
మాళవాధిపు బలము లిమ్మాట్కి నొంచె
మగధనృపుసేన నొకనాటి పగటిలోన.

32

32. నిశ్రేణికా = నిచ్చెనలయొక్క. కృపాణి = కత్తి. సారువల్ = దిబ్బలు, సురంగము = కన్నము. వెనుకబారు = వెనుకవైపు, అట్టడి = గృహవిశేషము.

వ.

ఇట్టి తెరంగునం బిట్టువడి గుట్టు చెడి గట్టువడిం
జేరుటకై యగడతంబడి మునింగి దరిఁ జేరి పారి రోఁజు దిన
రోజు రాహుత్తులును, రాహుత్తులకుం దోడు తుపాకి
వేట్లకు నిలుపోపక గుభులు గుభుల్లునం బరిఖాక్రోడంబునం
బడి చేయాడింప నేరమి నడుగు వట్టి బిట్టిలి యొడ్డునకుం
దేలిన మెండొండు నాయకవాడీలును, నాయకవాడీ
లం గాంచి భీతాంతరంగులై మాతంగపాతంగంబు జిబురు
జంగుల రవలిం దగిలి గుండియ లవిసి యవనిపై వ్రాలి
శవనిచయంబులకరణి నిశ్చేష్టితులై వడియేమరించి
చనుతోడు చూపరి సోమరి దొరపోతులను దొరపోతుల
నీక్షించి రోసి యాభీలంబుగా నాలంబుఁ గావించి కాలు
కాలుం బెనచికొని యనింబడి పెనుగు బలగంపు ప్రాంతపరి
వారంబునుం గని జునిగి యనీకంబులకు స్రుక్కి తృణౌ
నీకంబులు మెక్కి, వల్మీకంబు లెక్కి చెయ్యెత్తి మ్రొక్కి
కుంతలంబులు విడి కుంతలంబులు దిగనాడి వ్రేళ్ళు గఱచి

భయభరంబునం బరచి చను గాటంపుకూటమిమూకల
య్యె, నయ్యవసరంబున హతశేషుల శేషంబు విన్నవించిన
రాజవాహనుండు కటకటం బడి కటంబులు నౌడుగఱచి
కోహాటోపం బంకురింప శంకారహితహుంకారపూర్వకం
బుగా రేపు సర్వలగ్గ యని చాటింపం బంచి కకుబంత
సామంతుల నవలోకించి యిట్లనియె.

33 రోజు = వగర్చునట్టి. రాహుత్తులు = యోధులు. క్రోడంబునన్ = మధ్యమందు. బిట్టిలి = తేలి. నాయకవాడీలు = ఉద్దారులు. మాతంగపాతంగంబు = మిడతగుంపువలె గ్రమ్మిన యేనుగులు. జబురు = క్రమ్మిన. జంగులు = మువ్వలు, లేక అగ్నిప్రసారణములు. రవలి= ధ్వని. ఏమరించి = పరధ్యానముగా నుండుటఁ గానిపెట్టి. జునిగి = అడలి, ఔడుగఱచి = పళ్లు బిగించి. సర్వ లగ్గ = అంతయు దోచుకొనుట. కకుంత = దిగంతములయం దైన.

క.

రే పామాళవనాథునిఁ
జేపట్టుగఁ బట్టి కోటఁ జేకొనకున్నన్
నా పేరు రాజవాహనుఁ
డే పుట్టిన యట్టి వంశ మిది యైందవమే.

34

34. చేపట్టుగన్ = చేతులతోఁ బట్టుకొనునట్టుగా. అనఁగా సాధనము లేకుండఁగా. ఐందవము = చంద్రుని సంబంధమైనది.

శా.

అంచు బల్కు టెఱింగి మాళవవిభుం డారాజుతో మైత్రి వా
టించం బంచె నమాత్యు లవ్వచనధాటీపాటితాంభోధిరా
ట్కాంచీభృద్ధరమంత్రుల న్నిజమహీకాంతానుకూలక్రియా

చంచత్రజ్ఞు లభిన్నసంధిఘటనాచాతుర్యమాధుర్యులన్.

35

35. వచనమంత్రులన్ = వచనధాటి = వాక్యపటుత్వముచేత. పాటిత = గొట్టఁబడిన. అనఁగా జయింపఁబడిన. అంభోధిరాట్ = సముద్రములు. కాంచీ = మొలనూలుగల భూమి. భృత్ = భరించుచున్న పర్వతములను. హర = కొట్టిన. యింద్రునియొక్క మంత్రులన్ = మంత్రియైన బృహస్పతి గల. నిజ.. ప్రజ్ఞులన్ = నిజమహీకాంత = తమరాజుయొక్క. అనుకూలక్రియాచంచత్ = అనుకూలములయిన పనులతో నొప్పుచున్న. ప్రజ్ఞులన్ = ప్రజ్ఞలుగల. భిన్నసంధిఘటనా = విడిపోయినా కలయికను గూర్చుటయందలి. చాళుక్య = నేర్పుయొక్క. మా = సంపత్తిగాయొక్క. ధర్యులన్ = భారమును వహించిన.

సీ.

ఆగుల్భ లలితంపుటంచు దోవతి కావి
                 యరచిట్ట పింజల కరుణ మెసఁగఁ
దళుకొంద నడుదట్టి దౌరు దన్నెడి యింద్ర
                 గోపంబు పాపోసు లేపుచూప
వలివంపుటంగిపై వలెవాటు వేసిన
                 పైఠాణి తగటు దుప్పటి నటింప
దగుపాటిగా వెన్క సిగ నిల్పిచుట్టిన
                 నిడుద యందపుపాగ నీటుగుల్క


గీ.

నుభయ కటముల శ్రీముద్ర లూర్ధ్వపుండ్ర
సంగతాంగార నవయవక్షారలోహి
తాక్షణ శ్రీల హేజీబు లపుడు వచ్చి
రగణితస్థితి సాహేబునగరి కడకు.

36

36. ఆగుల్బ = చీలమండలపర్యుంతము. పింజెలకున్ = పైమీఁదిఖండువా పింజెలకు. అరుణము = ఎరుపు. దౌరు = కాంతి. ఇంద్ర గోపంపు పాపోసులు = ఆర్ద్రపురుగువంటి పైజార్లు. వలివంపు = పలచనైన. అంగార = బొగ్గుమసి. అక్షీణ = తక్కువగాని. హేజీబు = మంత్రులు. సాహేబు = ప్రభువు, నగరి = సేనాస్థానము.

క.

వచ్చిన మంత్రుల నృపతివి
యచ్చరనాయకు ననుజ్ఞ నవసర సచివుల్
చెచ్చెర హుజూరునకుఁ బిల
వచ్చిన డిగ్గున నరుంగు వడి డిగ్గి తగన్.

37

37. నృపతి వియచ్చరనాయకుఁడు = రాజదేవేంద్రుడు. హుజూరునకున్ = రాజసమీపమునకు.

చ.

కడువడి వీడియం బుమిసి గ్రక్కునఁ బాదసరోజపాదుకల్
కడు నట దీడఁదన్ని పొసఁగన్వలెవాటు ఘటిల్లు శాటి నె
న్నడుము బిగించి పాగ జతనంబునఁ గైఁ గరమంటి మీసముల్
వడినిడి యంగిచేతు లెగవైచుచు వచ్చి రమాత్యు లత్తరిన్.

38


గీ.

వచ్చి కొలువున్నయెడ నరవరవతంసు
నుడుగర లొసంగి పొడఁగని యుచితసరణి
వంత బరివార మేకాంత మగు టెఱింగి
చనిన నిట్లన పల్కి రా సచివమణులు.

39

39. ఉడుగరలు = కానుకలు.

శా.

క్ష్మారక్షానిధి రాజహంసునికి క్షేమంబే, యయోబాలకుల్

మీరల్ భోగులు దండు సేయఁగలరే మీకమ్మ యింతంపుచో
రారాదిక్సతులెల్లఁ గప్పములు దేరాయంచు మీ కెంతయున్
మా రాజెంతయు విన్నవించు మనియెన్ రాజాన్వయగ్రామణీ.

40

40. కమ్మ = ఉత్తరము. బాబు. కప్పములు = పన్నులు

గీ.

తండ్రి కొడుకుల కెం దన్న దమ్ములకును
గలహములు గల్గు నొరులకు గల్గు టెంత
కలదు మారాజుతో మీకు గల న టంచు
గల నెఱుంగుదుమే గ్రహగతియ గాక.

41

41. కలను = యుద్ధము.

సీ.

ఔగాములకు నెన్నడైన రెండిళ్ళరా
                 జులు వట్టియాడిన చోటుగలదె
మీమీకుఁ బోదు సు మ్మీ మేమే తుద వేర
                 గునె నీళ్ళ నడుముఁ గొట్టినను రెండు
హెచ్చు మాటల కేమి యింక నొక్కటి మనే
                 దారులు దారినఁ దారసిలిన
పంపుచేతనె పారఁ బట్టించి నపుడు గ
                 దా స్వామివారి చిత్తంబువచ్చు


గీ.

నీ నియోగులు సీమలో లేని సుద్దు
లుం గదసి మాయసాగి రనంగ వలదు
మాటొకటి సేతోకటిగా ద దేటి కింత
నాటి నాటికిఁ దెలియుఁగా నడతలోన.

42

42. మనేదారులు = సామంతరాజులు. తారినన్ = డాగియున్నను. తారసిలినన్ = ఎదురైనను. పంపుచేతనె = ఆజ్ఞాప్రకారమే. అనఁగా సామంతరాజులు పన్నియ్యక చిక్కులు బెట్టుచుండఁగా, మీ సెలవుప్రకారము పట్టుకొని మీ కప్పగింతుమని తాత్పర్యము. నీనియోగులు = నీ యాజ్ఞలోనివారు. మాయసాగిరి = మాయ చేయుట కారంభించిరి.

క.

మీరాజధాని కడకున్
మారా జనుపంగవలయు మంత్రుల నని ముం
దేరుపరచినాఁ డొకపని
కీరలె చనుదెంచినార లేమనవచ్చున్.

43


ఉ.

రూపకళాకలాపకు సురుగ్జితదీపకు నిట్టి కోకిలా
రాపకుఁ జిన్నిపాపకు విలాసబిసప్రసవాయుధుం డహా
హా! పతి ఛాత్రి నెవ్వఁడొ కదాయని చూచి భవద్గుణాభిలీ
లాపటిమంబు మాదొరఁ గలంపఁగ మాటలువేయు నేటికిన్.

44

44. సురగ్జితదీపకున్ = లెస్సయగు కాంతిచేత జయింపబడిన దీపముగలదియైన విలాసముల చేత. బిసవాయుధుండు = పద్మ మాయుధముగల మన్మథుఁ డైన

క.

అల మానసారుఁ డాత్మజ
లలనామణి నుబుసుపోకలకుఁ బిన్నపుడే
కలభాషిణి యెవ్వనిఁ బెం
డిలియాడెదవన్న మగధనృపునని పల్కెన్.

45

45. ఉబుసుపోకకు = కాలక్షేపమునకు.

క.

మాళవపతి నిజనందన
మేలారసి పెండ్లిఁ జేసి మీకాత్మభుజా
పాలితమేది న్యర్ధము
బాలిక పసపున కొసంగ భావించె నృపా.

46

46. ఆత్మభుజాపాలిత = తన భుజముచే నేలఁబడుచున్న మేదిని = భూమియొక్క అర్థము = సగము భాగము.

గీ.

పంచమిని రాత్రి లగ్నంబు మంచి దనుచు
జెప్పిరిట యత్న మొనరించు టొప్పునన్న
నాస్యపంకజమున హాస మంకురింప
నృపతి కడకంటిచూపుచే నియ్యకొనియె.

47

47. కడకంటిచూపుజేన్ = కటాక్షదృష్టి చేత. ఇయ్యకొనియెన్ = అంగీకరించెను.

క.

ఇయ్యకొని యయ్యమాత్యుల
వెయ్యా రుడుగరలొసంగి వెస విభుఁ డనుపన్
వియ్యము గతి మాళవపతి
లియ్యంబున విని వినిర్మలితహృదయుండై.

48

48. ఉడుగరలు = కట్నములు. లియ్యంబునన్ = నమ్రతచేత.

క.

ఆ సనుయమున మహీశుఁడు
గైసేయం బనుపఁ గనకకౌశేయమణి
న్యాసప్రాసాదంబై
వాసవపురి నయ్యవంతి వాదున కొరసెన్.

49

49. కైసేయన్ = అలంకరించుటకు. న్యాస = విస్తారము.

క.

మేరువుల తీరు కురుజుల
సౌరు వితాన ప్రతాన చతుర పతాకా

చారు విపణి గారుడమణి
తోరణ ఘృణి యేమి చెప్పుదుం బురిలోనన్.

50

50. కురుజులు = కోటగురుజులు. వితాన = చాదినీలయొక్క.

ఉ.

అత్తరి మానసార వసుధాధిపచంద్రుఁడు సాంద్రవైభవో
దాత్తత నేగి యాత్మపురి కమ్మగధాధిపుఁ దోడి తెచ్చి త
చ్చిత్తము రంజిలన్ విడిదిఁ జేసి నిజాప్తులఁ గాంచి యవ్విభుం
గ్రొత్తమనోజుఁ బెండ్లికొడుకున్ రహిఁ జేయుఁ డటంచుఁ బల్కినన్.

51


మ.

ధవళాంశూజ్జ్వలపీఠిపై నునిచి యంతం జోడుగాఁ గూడుచున్
ధవళం బింపుగం బాడుచున్ జయరమాదాంపత్యనిశ్శంకునిం
గువలాక్షీమకరాంకుఁ గుంకుమ నలుంగుల్ వెట్టుచుం బాయపుం
జివురుంబోడులపిండు పెండ్లి కొడుకుం జేసెం బ్రమోదంబునన్.

52

52. ధవళంబు = మంగళ పాట. జయరమా = జయలక్ష్మితోడ. దాంపత్య = భార్యాభర్త లౌటయందు. పాయపుం జివురుంబెడలు = యౌవనవతులు.

చ.

జిలుగు మడుంగు కొంగుఁ గటిఁ జిక్కగ జెక్కి సమంబుగా నిజాం

ఘ్రులు ఘటియించి పెన్నెరుల గుంపిరు వాయఁగ గోరఁ దీర్చి తా
బలితపుతావినూనెఁ దలపై నిడి వెంట్రుక లుగ్గఁబెట్టి తొ
య్యలి రతనం బొకర్తు తల యంటె ధరాతలవజ్రపాణికిన్.

53

53 ఇరువాయ = రెండుపాయలు. ఉగ్గఁబెట్టి = ముడతలు వేసి

క.

అటగలికి యొకతె గంధపు
టటకలికిం బసిడిగిన్నియలఁ బన్నీరం
తటఁ జిలికి యలకవికలత
నటపలికి వసుంధరాధినాథున కిడియెన్.

54

54. అటకలికిన్ = తలరుద్దునట్టి సీకాయ మొదలగు పులుసునకు.

చ.

ఇల నిజసామ్యవర్తులపయిం దమవారిగదల్చు నాత్మహ
స్తలలితభర్మకుంభములదంభ మణంపఁగ వంతు వోక య
న్యులగతి నీవు నీవనుచు నొంటక గుబ్బలు రాయిడింపఁగా
జలకము దేల్చి రిద్ద రలి జాల కచాలకచా శిరోమణుల్.


చ.

ఒక లికుచస్తనీమణి మహోన్నతి మై జలకంబు వంచ గొ

ప్ప కనకపాత్రికం జిలుగుపావడఁ బెన్నెరులంటఁ జుట్టె నొ
క్కకలికి పెట్టెఁ బెట్టిన సకంచుక మేచకభోగిఁ దెల్పఁగా
నొకవికచాంబుజాక్షి తడి యొత్తె నృపోత్తమమౌళి కత్తఱిన్.

56

56. జిలుగుపావడ = సన్నమైన గాగరా (ఇది బట్టకు నుపలక్షణము.) పెట్టె = గుండ్రముగా పాము పరుండుట. మేచకభోగి = నల్లత్రాచు.

చ.

ముకురకపోల యోర్తు నృపుముందర దర్పణ ముంచె బంభరీ
చికుర యొకర్తు దీర్చె నెరిచిక్కు లొకానొకమందహాసయున్
సికముడి పూలు జుట్టే మెయిఁ జేర్చె సువర్ణ సువర్ణభూషణ
ప్రకర మొకర్తు కుంకుమము పంకజగంధి యొకర్తు పూయఁగన్.

57

57. బంభరీ = ఆడుతుమ్మెదలవంటి. సువర్ణ = మంచిరంగుగల స్త్రీ.

క.

ఆరతి యిచ్చిరి గుణవతు
లారతిపతిఁ బ్రతికిఁ బెనఁగు నధిపతికిఁ గళా
భారతికి దో రతి మహో
దూరతిరస్కృతవిరోధితుండద్యుతికిన్.

58

58. ప్రతికిన్ = సామ్యమునకు. కళాభారతికిన్ = విద్యలకు సరస్వతియైనవాఁడు. దోః = భుజములయొక్క. అతిమహః = గొప్పతేజస్సుచేత. దూర = మిక్కిలి. తుండ = ముఖముల యొక్క.

ఉ.

అంత దినాంత మింత చనునప్పుడు విప్రుఁడు లగ్న మెంతయుం
జెంతకు నేగుదెంచె నని చెప్పినఁ బెండ్లిదొరల్ గురుల్ హరుల్
దంతురి తాపపత్ర బిరుదధ్వజ దుందుభి ముఖ్యచిహ్నముల్
వింతలుగాఁగ నేర్పరచి వేడుకఁ జూపిరి పౌరకోటికిన్.

59


క.

పాణవరవంబు పాటహ
ధాణంధణ్యము మృదంగ తమ్మఠ ఢక్కా
శ్రేణి ధ్వని వీరణములు
రాణంబులు భూనభోంతరంబులు నిండెన్.

60

60. పాణవ = చిన్నతప్పెటల సంబంధమైన. పాటహణ = పెద్దతప్పెటల సంబంధమైన. తమ్మఠ = తమ్మట. ఢక్కా = ఢమణము. రాణంబులు = ధ్వనులు.

క.

కొమ్ముల నినదమ్ములు శం
ఖమ్ముల శబ్దములు సన్నగాణెల సంరా
వమ్ములు నాగస్వరనా
దమ్ములు నపిరీరవంబు దరులం బర్వెన్.

61

61. కొమ్ములు = వంకబూరలు. సన్నగాణెలు - సన్నాయిలు. నాగస్వరములు = ఊదునట్టి యానుబకాయలు. నపిరీలు = బూరాలలో భేదము.

క.

పంజులును పగలువత్తుల
పుంజము లాకాశబాణములు చేబిరుసుల్
వింజామరకోపులచా
లుం జెలువు వహించె లోకలోచనములకున్.

62

62. పంజులు = దివిటీలు. పగలువత్తులు = మహతాబువత్తులు. ఆకాశబాణములు = తారాజువ్వలు. చేబిరుసుల్ = సిసింద్రీలని తోచుచున్నది. వింజామరకోపులు =వింజామరవత్తులు.

మ.

చెవి కేపానిన పల్కు పల్కు నొకరాజీవాక్షి పూర్వాద్రిపై
రవికే జోడగు చంద్రకావిరవికెం రాజిల్లగా బూని నా
సవికే యీఁడదు రాజుఁ జూచి మయి హెచ్చన్ మట్టుగాకున్న నా
రవికే కాదిది యేడదో యని సఖిన్ రారాపుఁ జేసెం గడున్.

63

63. ఏపానిన= ఆనందముఁ గలుగజేయు. చంద్రకావి = సిందూరపుటెరుపుఁదల, మట్టుగాకున్నన్ = సరిపడకుండఁగా.

మ.

కలకంఠీమణి సౌధజాలములఁ గాంశుంజూడ నమ్మక్క చు
క్కలరా జద్దిరకాడుగా సురనదీకంజాత మోహో పురే
యలఘుస్వర్ణశిరోగృహైకముకురం బంచుం బురీవాసు ల

గ్గలముం బందెము వైచి చూచిరపు డాకాంతాముఖాంభోజమున్.

64

64. పురే = ఆశ్చర్యార్థమైన యవ్యయము.

శా.

రాఁడంటే యదె పువ్వులంగడికిఁ జేరన్ వచ్చె సింగారముల్
నేఁడే కావలె నెంత వేగిరమె యింతీ కూడిరా నీవె పూ
బోడీ యాతఁడు నిన్నె యన్యులఁ గనం బోడే పయిన్ వ్రాలకే
వీడే చాటయెమేన నీ వలన పో పెక్కేటి కంచుం బురిన్.

65


సీ.

సెట్టిచేతం గొని చే తడియారదే
                 ముక్కెర పదిలమే ముకురవదన
యరవుల సొమ్మువా రెరువది వళుకింత
                 యిటుల చే వీచకే చటులనయన
నీమీఁది చూపే మన్నెకొమాళ్ళ కొకవింత
                 గుట్టుతోనుండవే కుందరదన
తోఁద్రోపులకును బోదురటె యెఱుంగవా
                 వలపుకత్తియ లుంట కలువకంటి


గీ.

చెంతకై వచ్చి వీడెంబు చేతి కిచ్చి
రమణుఁ డనుమాట వీన వయోరాజుఁ జూచి
మగని మరువంగఁ దగునటే యిగురుబోణి
యనుచు నుత్సవ మీక్షించి రబ్జముఖులు.

66

66. సెట్టి = నగలమ్ము కోమటి. చేతడియారదు = కొద్దికాలమయ్యె ననుట. వళుకు = వదులు. గుట్టు = ధైర్యము.

క.

అచ్చటి యిరువంకల మే
ల్మచ్చులపై బారుదీరు మగువల మొగముల్
నిచ్చలపు మేలుకట్లం
గ్రుచ్చిన యద్దంబులని తగుల్పడు జగముల్.

67

67. మచ్చులు = డాబాలు.

చ.

తమతమయింటిముందటికిఁ దామరతోరణముల్ ప్రవాళముల్
సుమములుఁ జామరోచ్చయము సోగ యరంటులఁ గట్టి నట్టెకా
గుమిఁగొని రాజుఁ జూచు లతకూనల యంగములుం బురే యనుం
బ్రమదము నొంది యారెకుల బాములఁ జెందక వైశ్యబృందముల్.

68

68. ఆరెకులు = పట్టణమును గాచువారు.

సీ.

పెండ్లికొడుకును నైలబిలసూనుఁడని చూచి
                 చిరునవ్వుతో రంభ సిగ్గు గులుక
కృతశుభ్రదంతి నీక్షించిన కంచుకుల్
                 మన గజంబని మహేంద్రునికిఁ దెల్ప
హల్లీసకోల్లాసి వల్లీతనులఁ గాంచి
                 యచ్చరలని వజ్రి మెచ్చు లొసఁగఁ
జెవిసోకఁ బాడు మానవులఁ గిన్నరులని
                 ధననాథుఁ డొక్కనిధాన మొసఁగ

గీ.

నగర సౌభాగ్య మీక్షించి నాకశంక
విబుధచయ మాత్మసౌధముల్ వెదుకఁ బోవఁ
బ్రజ విలోకించె నుత్సాహపరత రాజ
వాహనేంద్ర వివాహసన్నాహ మపుడు.

69

69. ఐలబిలసూనుఁడు = కుబేరుని కొడుకైన నలకూబరుఁడు. హల్లీసక = మండలాకారనాట్యమందు. వల్లీతనులన్ = స్త్రీలను.

మ.

కటకంబుల్ గల యుత్కటద్విపఘటల్ ఘంటాపదప్రస్ఫుట
త్కటకంబుల్ మొరయంగ జక్కదన వాచ్యధ్వానశక్తిన్ మహా
కటకంబుల్ ప్రతినాదమీనవిభవోత్కంఠల్ దిశాభూమి భృ
త్కటకంబుల్ గనరాఁగ రాజు చనియెం దన్మందిరాళిందమున్.

70

70. కటకంబుల్ గల = దంతపుకట్లుగల. ఘటల్ = సమూహములు. ఘంటా = ఘంటలును. పదప్రస్ఫుటత్ = పాదములయందు స్ఫుటముగానున్న. కటకంబుల్ = కడియములు, మహాకటకంబుల్ = గొప్ప కొండచరియలు. విభవోత్కంఠల్ = వైభవముచేత నైన వేడుకలు. దిశా...కంబుల్ =దిక్కులయందైన రాజుల పట్టణములు. లక్షణచేఁ బట్టణములందలి జనులు. అళిందము = ద్వారప్రాంతము.

వ.

అంత నచ్చట.

71


క.

అల మాళవ మేచక కచ
కెలమిం దలయంటి యటక లిడి పన్నీటం
జలకంబారిచి వలువం
జెలువుగఁ దడియొత్తి హత్తి శిర సార్చి తగన్.

72

సీ.

జవ్వాది పదనిచ్చి చందురా దువ్వెన
                 దువ్వి పాపిటఁదీర్చి తురుముఁ జేర్చి
ముడిపూలు జుట్టి కెంపులబొట్టు సవరించి
                 చెవుల ముత్తెపుపువ్వు లవణుపరచి
తళుకు వజ్రపుడాలు బెళుకుకమ్మ లమర్చి
                 యరిది నీలంపుముక్కెర ఘటించి
గొప్ప మేల్కటాణికుతికంటుతోఁ గూడ
                 జాతిపచ్చల బన్నసరము నిల్పి


గీ.

సందెదండల దండఁబొంజాతిమొగ్గ
లుంచి చెంగావినెరుకపై వాంచికూర్చి
యంఘ్రి కటకంబు రవ మట్టియలును బెట్టి
సఖులు దెచ్చిరి సతిఁ బెండ్లిచవికె కపుడు.

72

72. చందురాదువ్వెన = చంద్రకాంత మాణిక్యపు వన్నె. కమ్మలు = కర్ణపువ్వులు. ముక్కెర = అడ్డబాస. కట్టాణి = మిక్కిలి ప్రశస్తమైన. బన్నసరము = హారవిశేషము. సందెదండలు = దండకడియములు. పొంజాతిమొగ్గలు = బంగారపుజాజిమొగ్గలు. చెంగావి = ఎఱ్ఱబట్. నెరుక = గాగరా.

సీ.

ఆఅట మున్నె వాకిటి కరుదెంచి మదదంతి
                 డిగ్గి పాదములపై మొగ్గి నట్టి
రాజహంసునిఁ బట్టె నోజు మాళవభర్త
                 యెత్తి దీవించి కే లిగురు వట్టి
ఘనతరాభ్యంతరాగారంబునకుఁ దోడు
                 కొనిపోవువేళ భామిను లొసంగు
నీరాజనాద్యుపచారముల్ గైకొని
                 ద్వారభూముల శుభార్ణముగ నిడిన

గీ.

పూర్ణఘట ర్పణములు సౌవర్ణచేల
చమరవాలవితానజాలములు గనుచు
మామ యనుమతి మగధరాణ్మణి వివాహ
వేదికాపీఠిపై నుండె విభవమెసఁగ.

73

73. కేలిగురు = చిగురువంటి హస్తము. చమరవాల = వింజామమరలు.

క.

మధురతిపతి మధురంజిత
మధురత్వవిలాసఖనికి మగధేంద్రునకున్
మధుమధనభజనధనునికి
మధుపర్కం బప్పు డెసగ మామ యొసంగెన్.

74

74. మధురతిపతి = వసంతమన్మథులయొక్క. మధు=రుచిచేత. మధురత్వ = సౌందర్యమునకున్ను, మధుమధన = విష్ణువుయొక్క. భజన = సేవ. ధనునికిన్ = ధనముగాగల.

మ.

జననాథాగ్రణి ధారవోసె మగధక్ష్మాభర్తకుం బుత్త్రికం
దనచుట్టంబులు ప్రాలపుట్టికల మద్యక్షోణి నేపథ్యశా
టి నటించన్ మగధాధినాథుని వధూటిం డాయఁగాఁజేసినం
గని రన్యోన్యకటాక్షసూక్ష్మతను వీక్షాపర్వమై యిర్వురున్.

75

75. ప్రాలపుట్టికల = తలబ్రాలబుట్టలయొక్క. నేపధ్యశాటి = తెరబట్ట.

మ.

వలిగుబ్బల్ వెలికుబ్బఁ గుప్పసముఁ ద్రోవం గక్ష కాంతుల్ దటి
త్కులముం దోరణఁగట్టఁ గల్వగమిచూడ్కుల్ చుట్టిరానేర్మికం
దళుకుం గంకణముల్ ఝణంఝణనినాదం బెత్తఁ గ్రొమ్ముత్తెపుం
దలఁబ్రాల్ జేరిచె మత్తకాశిని నృపోత్తంసోత్తమాంగంబునన్.

76

76. కుప్పసమున్ = రవికెను. కక్ష = భుజమూలములయొక్క. నేర్మికిన్ = నేర్పునకు. మత్తకాశిని = అవంతి. ఉత్తమాంగంబునన్ = తలయందు.

క.

జలజాక్షి చేర్చు తలఁబ్రాల్
జనపతి మూర్ధమున నుండి జల్లున రాలెం
దన తలఁ గర మిడ మును తల
మునుకల యగు మదనబాణములు జారుక్రియన్.

77

77. కరమిడన్ = అవంతి, నీకుభయము లేదని హస్తముంచఁగాఁ.

శా.

కట్టె న్మంగళసూత్ర మబ్జకులరా డ్గంధేభమాపూర్ణిమా
నిట్టీకేందుముఖీవతంస కలకంఠూకంఠపీఠిం బికీ
కుట్టాకధ్వని పుష్పదామబిరుదం గుందాభహారక్ లగ
ద్ఘోట్టాణైకమృగీమదన్ స్మరకరాక్షుద్రాంబుజద్రావికన్.

78

77. పూర్ణిమానిట్ = పున్నమనాటిరాత్రియందు. టీక = సంచరించుచున్న. ఇందు = చంద్రునివంటి. ముఖీ = ముఖముగల స్త్రీలకు. వతంస = అలంకారమైన. పికీ = ఆడుకోయిలను. కుట్టాక = లెంపదెబ్బలు గొట్టుచున్న. ధ్వని = స్వరమువిషయమై. పుష్పదామ = పువ్వులదండయనెడు. బిరుదన్ = బిరుదుగల. ఘోట్టాణ = దేశవిశేషమందలి. ఏక = ముఖ్యమగు, మృగీమదన్ = కస్తూరి గలిగిన. స్మరకర =మన్మథహస్తమందలి. అక్షుద్ర = శ్రేష్టమైన, అంబుజ = శంఖమునకు, ద్రావికన్ = పారిపోవునట్టు గాఁ జేయునట్టి. (పికీత్యాది కంఠమునకు విశేషణములు.)

గీ.

హోమధూమంబుచే రక్తయుక్తనేత్రు
డగుచు నృపుఁడొప్పె నంతజా యాసరోజ
బంధమున కుల్కెడు పయోదపఙ్క్తిబ్రోది
సేయు పొగమీఁదఁ గన్నెఱ్ఱఁ జేసె ననఁగ.

79

79. బ్రోదిసేయు = (లక్షణచే) పుట్టించుచున్న.

సీ.

మేలుకుళ్ళాయితో డాలొందు ముత్యాల
                 బాసికంబు లలాటపట్టిఁ బెరయఁ
గరకంకణంబుతోఁ గంబళతంతుసం
                 యుతహరిద్రాకంద మొరపు నెరప
కట్టాణిపూసల కంఠమాలికలతోఁ
                 బిత్తరి విరిదండ తత్తరింప
గటితటీహాటకపటముతోఁ బచ్చచె
                 రంగు వల్పెపుదోవి రంగు నిలుపఁ


గీ.

దలపఁ బొలుపారె జోకనా ధరణినాథ
పాకమదభేది స్థావికపాకవేళఁ
గాకలీనైకలీలాకలాక లీన
తానమానోన్నతుల సతుల్ ధవళ మనఁగ.

80

80. హరిద్రాకందము = పసపుదుంప, పచ్చచెరంగు = పచ్చనియంచుగల. వల్పెపుదోవి = సన్నబట్ట. ధరణీనాథ, పాకమదభేది = రాజేంద్రునియొక్క. కాకలీ = సూక్ష్ముమధురధ్వనియొక్క. నైకలీలా = అనేకవిలాసములయొక్క, కలాక = విద్యలుగల. లీన = అణఁగిన, తాన = స్వరవిశేషముయొక్క. మాన = ప్రమాణముయొక్క,

సీ.

సకలాగమజ్ఞకావ్యకళానిధుల్ వసు
                 వ్రజము గాంచిరి ముహూర్తంబునాఁడు
గ్రంథత్రయీవిధుల్ ఘనసువర్ణక్రమా
                 భ్యున్నతిఁ గనిరి పా కెన్ననాఁడు
బంధువుల్ కాంచనాంబరములు చదివించి
                 వన్నెఁ జెందిరి నాగవల్లినాఁడు
యాజ్ఞికుల్ దక్షిణ లర్పింప రాజు వై
                 రుల్లసద్గతిఁ గంబవల్లినాఁడు


గీ.

ఆర్యు లయ్యారె యనిరి పుంఖానుపుంఖ
జవనకంఖానరవశంఖసంఘఘుంఘు
మంఘుమద్విపఘంటాఘణంఘణాది
భిన్నభూభృద్బిల బేగుఁ బెళ్ళినాఁడు.

81

81. వసువ్రజము = ధనసమూహము. గ్రంథత్రయీ = వేదశాస్త్రశ్రౌతములు. కంబవల్లి = వివాహాంతదినముందుఁజేయు స్తంభపూజ. పుంఖానుపుంఖము =ఎడతెరపి లేని, జవన = వేగము. కంఖాణ = గుఱ్ఱములయొక్క, ఏగుఁబెళ్ళి = ఊరేగింపుటుత్సవము.

క.

యక్షాధ్యక్షుఁడు వింశతి
లక్షల కమ్మిన ప్రదక్షలక్షణరూక్ష

న్నక్షత్రకంఠమాలిక
లక్షోణీభర్త యప్పు డల్లున కొసఁగెన్.

82

82. ప్రదక్ష = మిక్కిలి సమర్థము లైన. లక్షణ = చిహ్నములచేత, రూక్షన్ = అతిశయించిన. నక్షత్రకంఠమాలిక = ఇరువదియేడు ముత్యములుగల మాలిక.

గీ.

కొండ్ర వేల్పండు పంటలకును కొటార్లు
పాడి వ్రేపల్లెలెల్ల సంపదల యిండ్లు
స్వర్గఖండంబులగు గ్రామవర్గకములు
వసుమతీభర్త పసపున కొసఁగె సుతకు.

83

83. కొండ్ర = దున్నునపు డేర్పరచిన భాగము. కొండ్రకు వేయి చొప్పున పండునట్టివి.

మ.

నునుబంగారపు చెక్కడంపు సొబగు ల్నూల్కొన్న దంతంపుదే
వనటీకోటి ఘటిల్లు పార్శఫలకద్వందంబుతో జాళువా
పని చూపట్టిన పట్టుబట్ట తెరతో బల్ముత్యపుంగుచ్చు లొం
దినపన్నాగముతోఁ జెలంగు నృపపుత్రీపల్లకిం బొల్చుచున్.

84

84. దేవనటీ = అప్సరస్త్రీలయొక్క. పన్నాగము = పల్లకీదండె.

శా.

చేటీకోటకటీతటీపటసమాశ్లిష్టస్ఫుటద్వీటికా

పేటీహస్తకలాచికావ్యజనముల్ పెంపార నేతేరఁగా
శాటీభూషణపేటీకాకనకచంచన్మంచపాటీరధో
ర్వాటీకంబుల మాగధుండు నిజగేహంబు బ్రవేశింపుచున్.

85

85. చేటికోటి = దాసీసమూహము. కటీతటీపటసమాశ్లిష్ట = ఒడియందుంచబడిన. వీటికాపేటీ = పాందానులు. కలాచికా = తమ్మపడిగె. అటీకంబులన్ = ఆతిశయములచేత.

సీ.

పగడంపుముక్కులఁ బచ్చరెక్కల నిక్కు
                 చిలుకల మదనచేతుల ఘటిల్లు
పటికంపుగుండుగంబము తళత్తళరుచుల్
                 దరిఁ జేర్చు దంతంపుదంతె లింపు
పొసఁగు రాజావర్తపుంబారువములకు
                 బొంచు వైడూర్యంబు మించు గన్ను
మగఱా గొనబు వెల్లి నిగనిగల్ గనుపట్టుఁ
                 వగచుట్టుఁ జుట్టుఁ బవంతిలోనఁ


గీ.

బద్మరాగంపు బోదెల పడకటింటి
సన్నసున్నంపుఁ దిన్నియ చందుచుట్టు
మెట్టుకల నీలపుంగేలు మెకము దోయి
పరఁగి యొప్పారు గొప్ప యుప్పరిగ కరిగి.

86

86. మదనచేతులు = మిద్దెకడ్డీలు. గుండుగంబము = గుండ్రముగానున్న స్తంభము. దంతెలు = స్తంభపీఠములు. రాజావర్తము = మణివిశేషము. పారువములు = పావురములు. పొంచు = పట్టుకొనుటకుఁ గాచియున్న. వైదూర్యంబుమించు = వైడూర్యకాంతిగల. కన్ను = నేత్రములుగల పిల్లి. బవంతి = రాజగృహము. బోదెలు = అరుగులు. మెట్టుకలు = మెట్లు. కేలుమెకము = ఏనుఁగులయొక్క. దోయి = జోడు. ఉప్పరిగ = చప్పరము,

సీ.

పసిమిబంగరుతీగెపనులచే దీరిన
                 తావు సూర్యపటంబు దగు కురాళ
మింత పైకెక్కిన యెకరంగి పరుపఱు
                 పైకుంకుమ పుటంబు పటపుపోయి
మురువొప్ప గొప్ప చప్పరకోళ్ళమంచంబు
                 వలప్రక్క వక్కలాకులుఁ జెలంగ
జాళువా జలపోత , జాలవల్లిక తూర్పు
                 చెంగటఁ గొరలు ప రంగిపీట


గీ.

దండ జముకాణమునఁ జేర్చు దండెయును బ
సిండి బురుసా మిసిమి గవిసెన సడలుచు
నిద్దపు విపంచియును నిల్వుటద్ద మమర
బడకయిలు జొచ్చె నప్పు డప్పుడమిఱేఁడు.

87

87. సూర్యపటము = మేలుతరమైన మొకములు. కురాళము = చప్పరము. ఎకరంగి = చిత్రపురంగు గలది. పరువఱు = పరుపుదగ్గఱ. చప్పరకోళ్ళు - తరుమణికోళ్ళు. జలపోత = మలామా. జాలవల్లిక = తమలపాకులకట్ట. పరంగిపీట = హూణదేశపుపీట. జముకాణము = జంబుఖానా. దండె = కిన్నెర. బురుసా = ఎఱ్ఱపట్టు. గవిసెన = గుడ్డతొడుగు. విపంచి = వీణ.

క.

అచ్చటి కయ్యెడ వచ్చిన
నెచ్చెలు లచ్చెలువఁ దెచ్చి నృపుతోఁ జదురుల్
పచ్చిగ నాడుచుఁ బొడుచు
మచ్చిక నొకరొకరె పనుల మరుగున జరుగన్.

88

88. చదురుల్ = చతురవాక్యములు.

క.

పడఁతుల వెంటనె ప్రియసతి
నడిఁ జనఁ బడవైవఁగాఁ గవాటము సందిం
బడి యొక్క తె జడ జిక్కెం
గడు విభు నెద నాటు మదనఖడ్గముఁ బోలెన్.

89


క.

రమణీరత్నం బయ్యెడ
రమణుఁడు చేయంటి లాఁగ రాక మణిస్తం
భము వట్టి పెనఁగి తరువ
ల్లిమతల్లిక చెల్వునఁ గదలెను దమకమునన్.

90


మ.

కులుకుం దోరపుగుబ్బ లంటుదునొ తళ్కుం బెన్నెరుల్ వట్టి కెం
దలిరుందేనియమోవి యానుదునొ యందంపుందనూవల్లికన్
సొలయం గౌఁగిటఁ జేర్తునో కనుగవం జుంబింతునో యంచు మిం
చొలయన్ రాజు మనం బపూర్వకృతి కిట్లుఱ్ఱూత లోగెం గడున్.

91


క.

ధరణీరమణుఁడు పయ్యెద
సరవిం గొని తివియ మగువ స్వస్తికబంధో
ద్ధురబాహాంతర యగుచో
స్మరసంగరమునకు మల్ల చరుచుటఁ దెల్పెన్.

92

92. స్వస్తికబంధ = చేతు లొండొంటితో దండచేతులు బట్టుట. బాహా = భుజముల యొక్క. స్మరసంగరమునకున్ = మన్మథ యుద్ధమునకు. మల్ల చరచుట = ఎడమచెయ్యి బ్రక్కను వంచి కుడిచేతితో దండపైఁ జరచుట.

సీ.

ప్రార్థనాదృతవధూవదనఖండితనాగ
                 వల్లీదళార్థచర్వణచణుండు
ఘనహారమణిపరీక్షామిషాంబురుహేక్ష
                 ణాపయోధరబోధనక్షముండు
తరుణీమణీకారితస్వాంగపరిరంభ
                 ణౌద్ధత్యకృచ్ఛివదాంకపాళి
ఘనసారవీటికాగంధగ్రహణదంభ
                 మానిన్యధరసుధాపానతతుఁడు


గీ.

కాంచికాస్థలవైకృత్యగళనకటక
యవతి నీవి విమోచనోద్యుక్తుఁ డగుచు
నవరతానందుఁడైన మానవపతీంద్రుఁ
డాతఁ డనవరతానందుఁ డయ్యె నపుడు.

93

93. ప్రార్ధనా = బ్రతిమాలుకొనుటచేత. అదృత = ఆదరించఁబడిన, వధూ = అవంతియొక్క. వదన = ముఖముచేత. ఖండిత = కొరకఁబడిన. నాగవల్లీదళ = తమలపాకుయొక్క. అర్ధ = ముక్కయొక్క. చర్వణచణుండు = నమలుటతోఁ కూడినవాడు. కారిత = చేయించఁబడిన. స్వాంగపరిరంభణోద్ధత్యకృత్ = తన శరీరాలింగనమందలి దురుసుతనమును జేయునట్టి. శివద = సుఖమునిచ్చునట్టి. అంకపాళి = ఆలింగనము గలవాడు. కాంచికా = మొలనూలుయొక్క (అనఁగా నొడ్డాణముయొక్క) స్థలవైకృత్య = స్థలభేదముచేత. గళన = జారుటగల. కటక = పిరుందుగల. నవరత =నూతనసంభోగమందు. అనవరత - ఎడతెగని.

చ.

తిలకినిభర్త దెల్పఁ జవిఁ దేలి రతిం బతిఁ బూరుషాకృతిం

గలసెఁ గరాబ్జకృత్యకృతకంకణఝంఝణనిక్వణాంకయై
గలదలకాంచితాళికము ఘర్మకణమ్ములు గ్రమ్మ మైఁ గళల్
దళముగ రా ననర్గళగళధ్వను లగ్గల మగ్గడింపుచున్.

94

94. గలదలక = జారుచున్న ముంగురులచేత. అంచిత = ఒప్పుచున్న. అళికము = లలాటము, అగ్గలము = అతిశయముగా. ఉగ్గడింపుచున్ = పలుకుచు.

శా.

కించిత్కుంచితనేత్రకోణము రణద్గ్రీవంబు కూజత్కన
త్కాంచీకంబు నటత్కటీరము గళద్ధమ్మిల్లమాస్యోల్లస
చ్చంచద్ఘర్మము పాణిసక్తపతికేశంబన్యహస్తక్రియా
ప్రాంచత్కంకణనిక్వణం బలరుఁ బుంభావ్యంబు సంభావ్యమై.

95

95. కించిత్కుంచిత = కొంచెము ముణవఁబడిన. రణత్ = ధ్వని చేయుచున్న. గ్రీవంబు = కంఠముగలది. కూజత్ = ధ్వనించుచున్న. కనత్ = ప్రకాశించుచున్ . కాంచీకంబు = ఒడ్డాణముగలది. నటత్ = కదలుచున్న. కటీరము = పిరుదుగలది. గళత్ = జారుచున్న. ధమ్మిల్లము = కొప్పు గలది. ఆస్యోల్లసత్ = ముఖమందుఁ బ్రకాశించుచున్న. చంచత్ = అతిశయించుచున్న. ఘర్మము = చెమట గలది. పుంభావ్యంబు = పురుషాయితము. సంభావ్యమై = గౌరవించదగినదియై.

సీ.

గిలిగింతఁ జనుగుబ్బ లలమనీని వధూటి
                 యెదనాని కుచపాళి నదమ నేర్చె
మోవిపై మొగమీని ముదిత వీడెపు వీడు
                 తోడు దంతక్షతోద్ధురత నేర్చె
నెలవంక శంకఁబైఁ బలువంకఁ జనుజోటి
                 కొనగోర నిక్కువల్ చెనక నేర్చె
రతికూరు సంయుక్తి తతిఁ బెనంగు లతాంగి
                 పుంభావ బహుబంధపూర్తి నేర్చె


గీ.

మణితరవ మన్నఁ జెవియీని మధురవాణి
కలరవారవకలకలగళరవముల
గాఢరతిఁ బతిఁ దేల్పె నవోఢతాని
రూడి దిగ నాడి సమయవాక్ఫ్రౌడి దనరి.

96

96. గిలిగింతన్ = కితకితలచేతను. ఆదమన్ = నొక్కుటకు. వీడెపువీడు = తాంబూల మిచ్చుట. నెలవంకశంకన్ = నఖక్షతభయముచేత. పలువంకన్ = అనేకదిక్కులకు. జోటి = స్త్రీ. ఇక్కువలు = కళాస్థానములు. ఊరు = తొడయొక్క సంయుక్తి = కలియుట యొక్కి. తతిన్ = సమయమందు. పెనంగు = పెనఁగులాడునట్టి. మణితరవము = సంభోగకాలమందుఁ గంఠమందుఁబుట్టు చప్పుడు. కలరవ = పావురములయొక్క. నవోఢతా = క్రొత్తగా వివాహమౌటయొక్క. దిగవాడి = విడచిపెట్టి. సమయవాక్ = సమయోచితములగు యుక్తులయందు. ప్రౌఢిన్ = నేర్పు చేత.

సీ.

అపుడింపు కపురంపు విపులంపు దిన్నెలఁ
                 జలిగుప్పు లలినొప్పు చప్పరములఁ
దలకట్టు వెలవెట్టు నెలచుట్టు చవికెలఁ
                 బారావతారావభవన మనుల

శుకపోతనికరేతశికతాతలంబుల
                 ఘనమహావనరుహాకరతలముల
సమరందతమకుందసుమబృందకుంజాళి
                 గతఛాద్రికృతకాద్రికందరముల


గీ.

స్తోత్రబలపాత్రజలసూత్రగోత్రసదలి
కదలికలఁ బొల్చు కదలికాగమనవాటి
భాసురము లైన నైదాఘవాసరముల
మగువతోఁగూడఁ గ్రీడించె మగధనృపతి.

97

97. విపులంపు = విస్తారములగు. గుప్పు =విసరునట్టి. చప్పరములన్ = పందిరులయందు. తలకట్టు = ముఖ్యమైన. వెలపెట్టు = ఖరీదు బెట్టునట్టి. నెలచట్టు = చంద్రకాంతములయొక్క. చవికెలన్ = చిన్న యిండ్లయందు. పారావత = పావురములయొక్క, శుకపోత = చిలుకపిల్లలయొక్క. నికర = సమూహముచేత. ఇత = పొందఁబడిన. వనరుహ = పదములకు. ఆకర = స్థానములైన. సమరందతమ = మిక్కిలి మకరందములతో గూడిన. కుందసుమ = మల్లెపువ్వులయొక్క. బృంద = సమూహముగల. కుంజాళి = పొదలపఙ్క్తిని. గత = పొందిన. భా = శోభతోఁగూడిన. అద్రి = చెట్లు గల. కృతకాద్రి = కృత్రిమపర్వతములయొక్క. కందరములన్ = గుహలయందు. స్తోత్ర = పొగడికయొక్క, బల = అతిశయమునకు. పాత్ర = అర్హములైన. జలసూత్ర = నీటినాళములుగల. గోత్ర = పర్వతములయందైన. సత్ = యోగ్యములైన. అలి = తుమ్మెదలుగల. కదలికలన్ = అరటిచెట్లచేత. కదలికా = లేళ్లలోని భేదములయొక్క. గమన = సంచారముగల. వాటిన్ = వృక్షముల, ఆవరణయందు. నైదాఘ = గ్రీష్మర్తు ‘సంబంధమైన.

క.

అసవి సుమ వసదలి తతి
వాస విఘన ఫల రసాల వాసవి గహన

వ్యాస విదాహన వాసవి
వేసవి తానంత జెలఁగె వేసవిజయమై.

93

98. ఆసవి = మకరందములుగల. సుమ = పువ్వులయందు. వసత్ = ఉంచున్న. అలితతి = తుమ్మెదగుంపుయొక్క. వాస = నివాసముగల. విఘన = మిక్కిలిగొప్పవైన, ఫలములుగల. రసాల = తియ్యమామిడిచెట్లయందు. వాస = నివాసముగల. వి = పక్షులు గల. గహన = అరణ్యములయొక్క. వ్యాస = విస్తారముయొక్క, విదాహన = దహింపఁజేయుటయందు. వాసవి = అర్జనుఁ డైన. (ఇకఁడు ఖాండవవనముఁ గాల్పించెను.) వే = త్వరగా. సవిజయమై = జయముతో కూడినదియై.

క.

పెటపెటపెట గాసెన్ రవి
పటపటపటమనుచు గిరులు పగిలెన్ రగిలెం
జిటచిటచిటమనుచున్ వని
గిటగిటగిటమనుచు జనము కృశియించె సెగన్.

99

99. కాసెన్ = ఎండఁగాసెను. రగిలెన్ = కాలెను.

గీ.

ఏమి చెప్పెద నయ్యెండ దామరసభ
వాండభాండంబులెల్ల నుద్దండసాల
జాలకప్రాశనకరాళకీల గ్రాల
గుమ్మరావము కరణి జగమ్ము దొరసె.

100

100. ఉద్దండ = అతిశయించిన. సాల = చెట్లయొక్క. జాలక = సమూహముయొక్క. ప్రాశన = తినుటచేత. కరాళ = భయంకరమైన. కీలన్ = అగ్నిజ్వాలచేత.

సీ.

సికతాతలాధ్వగుల్ తెకతెక నడుగంట
                 దుప్పట్లు ద్రొక్కి పాదుకలు దలఁప
వెసఁ బాదుకాధ్వన్యు లిసుము లూడ్పులు నిండ
                 నిట్లటు విడఁదన్ని యిల్లు గోర

నిలుచేరు నధ్వనీనులు పెల్లువడచల్లఁ
                 జల్లని గుజ్జుమామిళ్ళు గోర
గుజ్జుమామిడి మోకఁ గూర్చు పాంథులు చూత
                 పటలికిఁ జలువచప్పరము లడుగఁ


గీ.

జప్పరంబుల పథికాళి యప్పుడెల్ల
చాయ పన్నీటికాల్వ కాసలు ఘటింప
జంట పడ గుప్పెఁ బంకకాసారమగ్న
కాసరము లైన నైదాఘవాసరముల.

101

101. సికకౌతలాధ్వగుల్ = ఇసుకనేలత్రోవ నడచువారు. పాదుకాధ్వన్యులు = చెప్పులు తొడఁగిన మార్గస్తులు. ఊడ్పులు = చెప్పులు. అధ్వనీనులు = మార్గస్థులు. జంటవడ = జమిలివేడిగాలి. పంకకాసార = బురదగల మడుగులయందు. మగ్న = మునిఁగిన. కాసారములు = దున్నపోతుల గలవి.

సీ.

గతిచెడు రాయంచఁ గలఁగించి గ్రౌంచాద్రి
                 కంచి మయూరి మన్నించు కించు
మేల్జూపు జిగిమించు మించుశరాళిం బు
                ట్టించి నెత్తమ్ముల నొంచుదంట
చలువఁజల్లి కదంబములకుఁ దావి యొసంగు
                 తేట మైదీగ నందిన మిటారి
గేదంగిక్రొవ్విరుల్ జాదిక్రొన్ననచాలు
                 నెరివేణి భరియించి మెరయు మేటి


గీ.

ఇంద్రగోపంబు పరపుల నెరయుజాణ
గురుపయోధరపాళియంబరములోనఁ

దళుకు గులుకంగఁ దగువర్ష దగిలెనేని
యడుగిడఁగనీదు నిజపురీయాత్ర కనుచు.

102

102. ఈపద్యమందు స్త్రీ యొక్కతె ధ్వనించుచున్నది. వర్షాకాలమందు హంసలు క్రౌంచంపర్వతరంధ్రములోనుంచి మానససరస్సుకుఁ బోవుసని ప్రసిద్ధి. నడకచేత హంసను జయించినదనియును. కించు = పట్టుదల గలది. మేల్జూపు = శోభను బుట్టించునట్టి. జిగిన్ = తళుకుచేత. మేలైనచూపులనెడు శోభచేత, నొప్పుచున్న తళుకుగల బాణపఙ్క్తిని బుట్టించి పద్మములను జయించినదనియును, కదంబములకున్ = కడిమిచెట్లకు. చలువగలిగినట్టియు, ననేకపరిమళద్రవ్యములు గల మైపూతకుఁ పరిమళముగలిగించు శరీరము గలది యనియును. గేదంగిక్రొవ్విరుల్ = మొగలిపువ్వులు. జాదిక్రొన్ననలు = జాతిపుష్పములు. వేణి = జలప్రవాహము. అర్ధాంతరము సృష్ఠము. పరపులన్ = విశాలస్థలములయందు. ఎరయు = ఎఱుపెక్కిన. ఎఱ్ఱనిపరుపుమీదఁ బరుండునదియనియును. పయోధరపాళి = మేఘపఙ్క్తి. అంబరములోనన్ = ఆకాశములోన. గొప్పకుచప్రదేశము పైటబట్టలోఁ బ్రకాశించునది యనియును. వర్ష = వర్షర్తువు. ఇది నిత్యబహువచనమైనను ధ్వన్యర్థానురోధముచే నేకవచనముగా బ్రయోగింపఁబడినది. స్త్రీలింగమువల్ల నొకస్త్రీయనియును. అడుగిడఁగనీదు = నీటివల్లను బాడివల్లను ప్రయాణము సాగనీదు. స్త్రీ లభించినయెడల విడచిపోవుటకుఁ గాలు సాగనీదనియును.

శా.

అంభోధిప్రియసంభవాన్వయుఁ డతం డత్యుగ్రుఁ డంతం జయ
స్తంభం బుత్తరవార్థి నిల్పి నిజకాంతాసైన్యసంయుక్తుఁడై
జంభారిక్రియఁ జేరి యాత్మపురి నిచ్చల్ దల్లిదండ్రుల్ ప్రజల్

సంభూషింప సమస్తరాజ్యపదవీసౌఖ్యంబుఁ జెందెం దగన్.

103

103. అంభోధిప్రియసంభవ = సముద్రుని యిష్టపుత్రుఁడైన చంద్రునియొక్క. అన్వయుఁడు = వంశముగలవాఁడు. జంభారిక్రియన్ = ఇంద్రునివలె.

ఆశ్వాసాంతము

శా.

ఆధివ్యాధివిరోధికీర్తనతరంగాధార గాధారమా
ప్రాధీనస్తుతిధీరవాగమృతధారాధార రాధారసీ
యోధైర్యచ్యుతికృద్ధృతీ క్షతమహీయోధారయోధారథీ
మాధుర్యస్తవయుక్తరంగపురసీమాధారమాధారకా.

104

104. ఆధి = మనోవ్యధకును. వ్యాధి = రోగమునకును. విరోధి = పోఁగొట్టునాట్టి, కీర్తనతరంగ = తరంగములవంటి స్తోత్రములకు. ఆధార = ఆధారమైనవాఁడా. గాధారమా = ప్రతిష్టాలక్ష్మికి. ప్రాధీన = స్వాధీనమైన. స్తుతి = స్తోత్రముగల. ధీర = విద్వాంసులయొక్క. వాక్యామృతధారను ధరించువాఁడా. రాధా = రాధాదేవియొక్క. రసీయః = మిక్కిలిరసముగల. ధైర్యము యొక్క జారడమును జేయునట్టి సంతోషముగలవాఁడా. క్షత = కొట్టఁబడిన. మహీయః = మిక్కిలి విస్తారమైన. ధార = కత్తియంచులుగల. యోధా = యోధులుగలవాఁడా, రథీ = రథికుఁడైనవాఁడా. మా = జయలక్ష్మియొక్క. ధుర్య = భారమును వహించిన. స్తవ = స్తోత్రముతోడ. యుక్త = కూడినవాఁడా. రంగపురసీమా = శ్రీరంగస్థలము. ఆధార = నివాసము గలవాఁడా. మా = లక్ష్మిని. ధారకా = ధరించినవాఁడా.

క.

అలమేల్మంగాపాంగా
చలచంచచ్చంచలాభిజననసముద్య
త్కలికాశ్రువర్షహర్షిత
పులకాంకురసస్యకృష్ణభూసదృశాంగా.

105

105. అలమేల్మంగయొక్క, అపాంగ = క్రేఁగంటిచూపనెడు. అచల = అంతటను గదులుచున్న. చంచత్ = ప్రకాశించుచున్న. చంచలా = మెఱుపుయొక్క. అభిజనన = పుట్టువు చేత. సముద్యత్ = పుట్టుచున్న. కలికా = మొగ్గలవంటి. అశ్రు = ఆనందబాష్పములయొక్క. వర్ష ము చేత. హర్షిత = గగురుపొడిచిన. పులకాంకురములనెడు. సస్య = చేనికి. కృష్ణభూసదృశ = నల్లనేలతో సమానమైన. అంగా = శరీరముగలవాఁడా.

పృథ్వీవృత్తము.

ధరాధరధనుర్ధనుర్దళనలబ్ధసీతారుగా
ధరాధరధరాధరాధరణధన్యబాహావితా
పరాధరహితాఖలప్రభలభూసురాగ్రేసరా
సరాధరవినందనాంచలవిహారపారాయణా.

106

106. ధరాధర = పర్వతమే. ధనుః = విల్లుగల శివునియొక్క. ధనుః = వింటియొక్క. దళన = విరచుటచేత. లబ్ధ = పొందఁబడిన. సీతా = సీతాదేవి యనునట్టి. అరుణాధర = స్త్రీ గలవాఁడా. ధరధరా = గోవర్ధనపర్వతమును ధరించినవాఁడా. ధరా = భూమియొక్క. ధరణ = ధరించుట. చేత. ధన్య - కృతార్థమైన. బాహా - భుజముచేత. అనిత - రక్షించబడిన. అపరాధరహిత - నేరము లేని. సరాధ - రాధతో గూడినవాఁడా. రవినందనాంచల - యమునాతీరమందు. విహార - క్రీడించుటయందు. పారాయణా - ఆసక్తుఁడా.

ఇది శ్రీరామభద్రభజనముద్రకవి పట్టభద్రకాద్రవేయాధిప
వరసమాగత సరససారస్వతలహరీ పరిపాక కాకమానిమూర్తి
ప్రబోధబుధకవి సార్వభౌమపౌత్ర రామలింగభట్ట
పుత్ర కౌండిన్యగోత్ర భాగధేయమూర్తి
నామధేయప్రణీతం బైన రాజవాహనవిజ
యంబను మహాప్రబంధంబు నందు
సర్వంబును పంచమాశ్వాసము.
సంపూర్ణము.
శ్రీ శ్రీ శ్రీ