Jump to content

రాజగోపాలవిలాసము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీరాజగోపాలవిలాసము

తృతీయాశ్వాసము

శ్రీకలితదానతోషిత
లోకాలోకాంతరస్థలోకాలోక
వ్యాకోచోత్పలరేఖా
రాకేందుసరూప! విజయరాఘవభూపా!

1


గీ.

అవధరింపుము! సూతసంయమివరుండు
శౌనకునితోడ నిట్లను శౌరి యట్ల
భద్ర లక్షణఁ దేలించి ప్రమదమునను
మఱియు గరితలపై చాల మమత యుంచి.

2

విప్రలబ్ధ - జాంబవతి

క.

అంతట నాజాంబవతీ
కాంతారత్నంబు దూలికామణితో నే
కాంతంబునం బలికెడు నల
వింతల నొకకొన్ని వినెడువేడుకతోడన్.

3


చ.

పలచఁగఁ బూసినట్టి కలపంబునఁ బుట్టిన వింతవాసనల్
కొలనికెలంకు పూఁబొదలకున్ నెఱతావుల సొంపునింపఁ బై
వలిపెపుదుప్పటీచెఱఁగు వల్లెడ వైచి యదూద్వహుండు దా
సొలపున మాపి లేఁజిగురుజొంపపుసందులఁ జూచుచుండగన్.

4


క.

కలకంఠకంఠి యచ్చట
చెలువుని వంచనకుఁ దనదు చిత్తములోనం
గలఁగుచు మరుబాములచే
నలమటఁ బడి దూతితోడ నపు డిట్లనియెన్.

5

శా.

చింతాసంతతిఁ జిక్కి చెక్కిటిపయిం జేఁ జేర్చి చింతింప నీ
ప్రాంతారామనికుంజపుంజములచాయ న్నిల్చి వామాక్షి! నీ
కాంతుం దెచ్చెదనంచు వేవుదనకున్ గాసింబడంజేసితే!
కాంతా! యాప్తులు సేయుమాయలకు లోఁగాకుండువా రెవ్వరే?

6


క.

తగవులు తెగువలు బిగువులు
నగవులు పైపూఁతవలపు నయగారములున్
మగువా! యీవగ లెల్లను
మగవానికిఁ జెల్లుఁగాక మగువకుఁ దగునే?

7


ఉ.

తల్లడ మేల? నీవరునఁ దప్పనటంచు ననేకనాయికా
వల్లభుఁ డాడుమాట నెఱవంచన యంచు దలంచనైతినో
హల్లకపాణి! యీవికచహల్లకజాతపరాగజాతముల్
చల్లనిమేనిపై సెకలుచల్లఁగ నేగతి తాళనేర్తునే?

8


ఉ.

ఎన్నఁడు సమ్మతించు నిఁక నెన్నఁడు నన్ దయమీఱఁ జూచు నిం
కెన్నడు మాటలాడు నిఁక నెన్నఁడు కౌఁగిట గారవించు నిం
కెన్నడు పుణ్య మెల్ల ఫలియించునొ? యంచుఁ దలంచునాథుఁడే
నన్నిటు చౌక సేసినను నాతిరొ! యేగతి నోర్వవచ్చునే.

9


చ.

అంచలనంచలుండ మలయానిలముల్ మలయంగ చెంగటన్
పంచమవైఖరుల్ తరులపంచఁ బ్రపంచము సేయఁ గోరుటల్
పొంచి మరుండు నన్ను సురపొన్నలకోరికి సూటి సేయఁగా
వంచన లిట్లు సేయదగవా? పగవారికినైన నక్కటా!

10

సీ.

చెక్కున మకరికల్ చికిలిగోరున వ్రాయు
                 నపుడు నాతోడ నేమనియె మున్ను?
మేడచేరువకుఁ దా మెల్లమెల్లన వచ్చి
                 నను సన్న సేసి యేమనియె నాఁడు?
నిచ్చవెన్నెల గాయ ముచ్చటలాడుచు
                 నతిరహస్యముగ నేమనియె మొన్న?
నెలదోఁటలోన రేయెల్లను విహరించి
                 యకట! వేకువనె నేమనియె నిన్న?


గీ.

పలికి బొంకనివాఁడంచుఁ బలుక దెపుడు
నింతలో వింత లోయింతి! యేమి పుట్టె?
నౌర! యామోహనాకారుఁ డాచరించు
మాయ లిటువంటి వందుకే మాయ నిపుడు.

11


క.

మగవారికిఁ గలగుణముల
మగువల వలపించుదనుక మమకారంబుల్
మగువలు వలచినపిమ్మటఁ
దగవులు మతి వేఱె కావె తామరసాక్షీ!

12


క.

కలలోన నైన నెన్నఁడు
పలుకులు జవదాటకుండు పతికిన్ సతికిన్
కలిగెను సిలుగని సవతులు
కలకలనవ్వంగఁ దాళగలనా! లలనా!

13


సీ.

ఎంత నేరము చేసి యేనియు నాచెంత
                 నిలిచినఁగోపంబు నిలుపనేర
చూపులలో వింతసొగసులు చిగురించఁ
                 జూచిన వెగటుగాఁ జూడనేర

నాగడంబులు డాఁచి యతివినయంబుగాఁ
                 బలికిన మరుమాట వలుకనేర
మమతతోఁ దొల్లింట మచ్చికలెన్ని యే
                 నెన్నినఁ గొడవల నెన్ననేర


గీ.

వనిత యొకతప్పు గావంగవలయు ననుచు
నున్న నెటువలె గడిఁ దేఱి యుండఁదొడఁగె
వలచి నట్లుండి వలవని వల్లభునకు
వలచినటువంటి తప్పు నావలన నింతె.

14


క.

అని పతిచేసిన వంచన
కనుపించును నేర మెన్నఁగా నావేళన్
విని వినయంబు నయంబునుఁ
బెనఁగొన నిట్లనియె చెలియ బిత్తరితోడన్.

15


మ.

వలదే కోకిలవాణి! మేమిటికిఁగా వ్యాఖ్యానముల్ మీరలా
సెలయున్ వెన్నెలయుంబలెం దనరఁగా నెయ్యంపుఁ గయ్యంబునన్
గలకల్ వుట్టవొ? తేరవో? తొలుత నీకాంతాళముల్ గంటిమే?
కులకాంతల్ పతినేర్పునేరముల కెగ్గుల్ పట్టిపల్లార్తురే?

16


గీ.

గుణము గోరంతఁ గలిగిన కొండ సేయు
నెంతనేరంబు చేసిన నెన్నఁ డెపుడు
చాడి చెప్పిన మనవిగా సంగ్రహించు
రాజగోపాలు గుణ మిది రాజవదన!

17

ఉ.

ఎంతతపంబు చేసితివొ! యెంతటివేలుపు భక్తి గొల్చితో
యెంతవ్రతంబు సల్పితివొ? యెంతటిభాగ్యము సంతరించితో?
యెంతటినోము నోచితివొ! యెంతటిదానము నాచరించితో
యంతటివాఁడు నీకుఁ బతి యౌటకు నంబుజపత్రలోచనా!

18


చ.

కలకలు మీకు నెన్నటికి గల్గునొ యంచుఁ దలంచి నేర్పుగా
నలుకలు పుట్టఁజేయుచుఁ బ్రియంబులు వల్కినయట్టి పిమ్మటన్
వలపులు కొన్నికొన్ని కొనవైచి మిముం జత గూర్చునట్టి యా
కలికి పిసాళి జంతలము గాముగదే! గజరాజగామినీ!

19


క.

అని పలుకు దూతి పలుకుల
మనమునఁగల కోపభరము మట్టుపడంగా
తనరాకలు మదిఁగోరెడు
వనజానన హృదయ మెఱిఁగి వల్లభుఁ డంతన్.

20


శా.

ప్రోడల్ చూచి సజీవచిత్రముల సొంపుల్ మించ నౌనౌ ననన్
నీడల్ దేఱెడు నిల్వుటద్దముల వన్నెల్ మీఱు జాబిల్లిరా
గోడల్ కాంతల బింబసంపదల దిక్కుల్ నింప లేఁగెంపురా
మేడం జేరెను జాళువావలువ క్రొమ్మించుల్ దువాళించఁగన్.

21


ఉ.

అందు విలాసరేఖ యిటులాకృతిచే రహి గాంచెనో యనం
గుందనపుంబసిండితళుకుల్ వెదజల్లుచు క్రొమ్మెఱుంగె యీ
యందమునందెనా నలరు నంగన చెంగట వచ్చినిల్చినన్
గందళితానురాగరసకందళమానసుఁడై ముదంబునన్.

22


గీ.

లేమ కెంగేలు కేలఁ గీలించి పట్టి
సరసనున్నట్టి విరవాది చప్పరంబు
చవికెలోపలి పసిఁడిమంచంబునందు
విరులునించిన శయ్యపై వెలఁది నుంచి.

23

సీ.

పాన్పుపైఁ గూర్చుండి బాగా లొసంగుచో
                 చేసోఁకుటకుఁ గొంత చిత్తగింప
తనుఁజూచి మాటాడ ధవుఁడుఁ బ్రార్థింపంగ
                 మాటలాడంగ నెమ్మదిఁ దలంచి
సకినల బటువులు సరసకు దివియంగ
                 మొలచిన జిలిబిలి ముద్దుబలుకు
రవళికం గెరలు పారావతమ్ముల మించు
                 కలరవమ్ముల మాటుగా నొకింత


గీ.

తెలిసి తెలియదటన్న సందేహ మలర
చిగురుకెమ్మోవి ననలొత్త చిన్నినగవు
బెళకుచూపుల రాగంబు పెనగొనంగఁ
బ్రమద పలికినపలుకులఁ బ్రమదమందె.

24


మ.

కలయం బర్విన చూపుతూపు లెలగో ల్గావించి వేమించి య
య్యలినీలాలకయున్ విభుండు తమి బాహాబాహిఁ బోరాడఁగా
వల రాయండు ప్రసూనవర్షములఠేవల్ చూపినట్లయ్యె న
య్యలరుంబోడికి కొప్పువీడివడి క్రిందై క్రొవ్విరుల్ చిందఁగన్.

25


గీ.

చూపుచూపును సరివోవఁ జూచి యపుడు
హృదయములు రెండు సరియౌట నెఱుఁగ వేఁడి
గాఢపరిరంభసంభ్రమకైతవమున
బాయకుండిరి వేడ్కతోఁ బతియు సతియు.

26


క.

రతి చాటువులను నిర్జిత
రతియగు సతి మనము గరంచి రాగము మీఱన్
రతులం దేలిచె యాహరి
యతులితసమ్మోదగర్భితాశయుఁ డగుచున్.

27

ఖండిత మిత్రవింద

చ.

అల యెలదోఁటలోనఁ దరళాయత లోచనఁ దేల్చి వేడుకన్
వెలువడి మిత్రవింద గడు వేఁడుకొనం దమకించు నేర్పులం
దలఁపున నిల్పి యవ్వికచతామరసేక్షణ పైడిమేడఁ దా,
సొలపునఁ జేరె రూపజితసూనశరాసనుఁ డొయ్యనొయ్యనన్.

28


ఉ.

చెక్కిట గోరులున్ నిదురచిన్నెలు చూపెడి వాలుఁజూపులుం
బుక్కిటి వీడియంబును గుబుల్ కొను మేను జవాదివాసనల్
టెక్కులుచూప మీన్బిరుదుటెక్కమువాని విలాసవైఖరిం
జొక్కుచు వచ్చు నాయకునిఁ జూచి కషాయితలోచనాంత యై.


గీ.

వెగ్గలంబయి మది వెలి విసరినట్టి
కోపరసవేగ మొకకొంత కుదురుపఱచి
చతురగావున నప్పు డాసరసిజాక్షి
పలికె నిట్లని హేతుగర్భంబుఁ గాఁగ.

30


మ.

కలయం జాగరరాగరంజితకటాక్షశ్రీలు సాంధ్యప్రభ
న్నెలకొల్పన్ సమయానుకూలముగ నీ నిద్దంపులేఁజెక్కునం
దలచూపెన్ నెలవంక దానిఁ గని యానందంబు సంధిల్లఁగాఁ
బలుమారుం గరపద్మముల్ మొగుడ సంభావించెదన్ వల్లభా!

31


చ.

చెలువుఁడ! నీవు తామసము సేయుట కిప్పు డుపాయభేదముల్
పలుకఁగ నూహ సేసెదవు భావములో విను క్రొత్తలత్తుకల్
తిలకము వింతవింత వగ తీరున దిద్దినయట్టి తీరులే
తెలిపెను మాకు నెంతయు తేటపడంగ విళంబహేతువున్.

32

ఉ.

లోలత నీవు నామనసులోపల నెప్పుడు సంచరించఁగా
నాలిజనంబు నిన్నుఁ దమి నచ్చట నచ్చట నుండి వచ్చె నీ
వేళకునంచుఁ బల్కు నవివేకపుమాటకుఁ గోప మేఁటికిన్?
దాళుము సర్వలోకవిదితంబులుగా భవచ్చరిత్రముల్.

33


మ.

కలయం జెక్కుల ఘర్మవారికణముల్ గ్రమ్మంగ నొయ్యారపుం
దళుకు న్నిద్దపుమేనిపై చిటులుగంధం బందమై మించ నూ
ర్పులనెత్తావికి గండుతుమ్మెదలు గుంపుల్ గూడి వెన్నాడఁగా
భళిరా! వచ్చితి వీవు వేగ, రమణీపాంచాల! నాపై దయన్.

34


మ.

నటనల్ జూపెడి యూర్పుదావులు, నలంతల్ చూపు వాల్ చూపులున్
చిటిలుంగుంకుమ క్రొత్తలేఁజెమటయున్ శీర్నాలకశ్రేణియున్
నిటలాలక్ష్యవిశేషకంబుగల యా నీలాలకంబాసి యు
త్కటమోహంబునఁ జేరవచ్చితివి వేగన్ నీవు నాపై దయన్.

35


సీ.

కులుకుగుబ్బల సోఁకు కుంకుమరేఖల
                 మైపూఁతచేతను మాటి నపుడె
గళమునఁ గనుపించు నెలవంకగోరులం
                 గంటసరంబుచేఁ గప్పి నపుడె
జడవ్రేటు మరుపడఁ గడవన్నెబంగారు
                 వలిపెదుప్పటి వల్లె వైచి నపుడె
సందిదండలు యొత్తు జాడల బాహాంగ
                 దముల పూనికచేత దాఁచి నపుడె


గీ.

నేరుపరి వౌదు వన్నింట నీవె జగతి
ముదురుచందురుఁగావి కెమ్మోవిమీఁద
నాఁటనొత్తిన పలుగంటి మాటుపట్ల
మఱపువచ్చిన నది నేరమా? తలంప.

36

ఉ.

వాసన వీడి వాడి సిగవ్రాలెడు పువ్వులు నిన్నమాపు మైఁ
బూసిన యంగరాగములు వూని రయంబున వచ్చి తౌర! మేఁ
గాసిలియుండ నావిధమె కైకొని వల్లభ! ప్రాణవల్లభుల్
వేసటనున్న నాయకులు వేడుకతోఁ గయిసేయరే కదా!

37


ఉ.

బాసలు సేసి నిన్ను నెడబాయను నెచ్చెలి! యీప్రభాతమం
బాసలఁ బెట్టి వచ్చియిపు డద్దమరేతిరి దానికన్నునన్
వాసిఁగ బల్కె దిట్లు నెఱవంచన సేయఁగ నేల? యౌర! యా
చాసలవంటివే యిపుడు వల్కినబాసలు ప్రాణవల్లభా!

38


చ.

జలరుహనాభ! నాదు మణిసౌధముపజ్జకు వత్తు వెప్పుడున్
వలగొన సంధ్య నీ వటులె వచ్చితి విప్పుడు పూర్వసంధ్యగాఁ
దెలియఁగలేక నీ వది మదిం గణియింపకుమీ కొఱంతగా
కలయఁగ రాగసంపదలు కన్నులఁ గ్రమ్మగఁ దెల్వికల్గునే?

39


గీ.

పచ్చిగాయమ్ము లీరొమ్ముపైని హెచ్చ
మెచ్చి యారతు లీయంగవచ్చు నిపుడె
వెన్నుపై నున్న చెనకులవిధముఁ జూడ
గెలుపు నోటమి నేమియుం దెలియరాదు.

40


మ.

అల జాబిల్లికి హెచ్చుగాఁ గలిగె సంధ్యారాగ మారాగ మీ
తళుకున్మోమున నొందకున్న నెటులొందన్ వచ్చు నౌపమ్యమం
చలమన్నెమ్మది చింత నేర్పుననె యాయందంబు చేకూర్చియున్
భళిరా! తాల్చితివందు మించుగఁ గళాపాండిత్య మౌనౌ ననన్.

41


మ.

కలయన్ సంధ్యలు గ్రుంకువేళలఁ గదా! కాంతుల్ తమిం గాంతలన్
గలయంగా గమకింతు రెందు నిపు డుత్కంఠాతిరేకంబులన్

వెలుకంబారఁగ దిక్కులెల్ల రభసావేశంబునన్ వచ్చితీ
తలఁపుల్ వింతలు చక్రవాకములచేతన్ నేర్చితో వల్లభా!

42


మ.

తెలివిం జెందెను దిక్కులెల్ల నతిసందీప్తంబులై దీర్ఘికా
జలజంబుల్ వికసిల్లె కంటె జలజాక్షా! నీదు వీక్షాంబుజం
బుల నిద్రాలసభావముల్ చెలఁగ నేమోయంచు నీ వెంచ కా
కలకంఠీమణిమోము చందురుని చక్కంజూచు నుత్కర్షముల్.

43


క.

వనితామణి యివ్విధమునఁ
దనుఁ గనుగొని హేతుగర్భితముఁగాఁ బలుకన్
విని చతురవచనరచనల
ననునయపరుఁ డగుచుఁ బలికె నట హరియంతన్.

44


మ.

నెనరుల్ పుట్టెడి మాటలాడి యలివేణీ! సోపచారంబుగా
మినుకుల్ పుట్టఁగ మాటలాడె దిపు డేమీ? తేటకన్గొనలన్
వినయంబుల్ కనుపించఁ జూచెదవు నీవే వేఱు గావింతువా?
విను! నాపట్లను తప్పు కల్గినను రావే! శిక్ష గావింపవే?

45


చ.

కలువలు నీకటాక్షములఁ గల్గిన నేర్చులొకింత నేర్పుటన్
ములుకులు చేసి వాటి గొని మోహనవిద్యల నేర్చి మారుఁడో
యలికులవేణి! నీ వల కటాక్షములం దయసేయు మిప్పు డా
కలువలగర్వమున్ మరునిగర్వ మఖర్వముగా ఘటించెదన్.

46


సీ.

అదలించవదియేమి? యాననద్యుతులచే
                 బింకంబు పూను జాబిల్లి నిపుడు
గద్దించ వది యేమి? కమ్మనియూర్పుచే
                 వలగొను నల గంధవాహు నిపుడు

బెదరించవదియేమి? బెళకుచూపులచేత
                 దాటడు మగతేంట్ల దాఁటు నిపుడు
నిరసించ వది యేమి? నిద్దంపుమోవిచే
                 నిగనిగమను మావిచిగురు నిపుడు


గీ.

కోకకుచ! నీవు నామీఁదఁ గోప ముంచి
యూరకుండిన నింట నే నుండ దరమె?
వాటివగ లెన్న తొల్లింటివలపు నించి
మించి కౌఁగిట నను గారవించరాదె?

47


మ.

అలివేణీ! నను నీవు మన్ననలు సేయన్ నమ్మి యేపట్ల నీ
చెలులన్ వేఁడమి నీ వెఱుంగుదువె? నీచిత్తంబులో నిప్పు డీ
కలఁకల్ పుట్టెడివేళ చూచుకొని యేకార్యంబు బోధించిరో?
కలవే! యిట్టివి లోకమందు మరి యౌఁగాముల్ విచారింపవే?

48


ఉ.

వాడినమోముతోడ నెనవచ్చును చంద్రుఁడు సారసాక్షి! నీ
వీడినసోగపెన్నెరుల వెంటఁబడున్ సమదాళులంచు నేఁ
జూడఁగఁజాల కావిధము సూచనఁ జేసితి నింతె మన్మథ
క్రీడలకన్న నీదు కిలికించిత మేమిటఁ దక్కువయ్యెనే?

49


మ.

సుమనస్సాయకలోలచాపమదఖర్జూతర్జనల్ సేయునీ
బొమ పొల్పంబు తదీయబాణముల సొంపుల్ వంపు వాల్ జూపులుం
బ్రమదాంభోనిధిఁ దేల్చె సౌఖ్యముల నాపాదించె నూహించగా
రమణీ! కోపము సేయునట్టి యుపకారం బెన్నఁగా శక్యమే?

50

సీ.

కుటిలకుంతల! నీదుకురులు చిక్కులఁ బడ్డ
                 దాఁటులు వేయదె తేఁటిదాటు
కాంత! నీయూరుపు లింత వేఁడిమి గన్న
                 నామోదిగాదె మందానిలంబు
పడఁతి! నీవెన్నంటు జడను గాంచినఁ జూచి
                 కేకలు వేయవే కేకులెల్ల
నింతి! నీనెమ్మొగ మించుక వాడిన
                 చాల మిన్నందదే చంద్రబింబ


గీ.

మలుకవూనంగ నీ విప్పు డంబుజాక్షి!
విన్ననై యున్నవిట్టి నీవేళ చూచి
గెలువ దమకించు నివియెల్లఁ గేలి సేసి
పగలు నీఁగుట యొక్కక్కపట్లఁ గాదె!

51


గీ.

అనుచుఁ దా పల్కుపల్కుల కాత్మలోని
కలఁకఁ దేఱిన చూపులఁ గమలనయన
యించుకించుక తనుఁ జూచు టెఱిఁగి విభుఁడు
నిండువేడుకతోడ నానెలఁత నంత.

52


ఉ.

చక్కనిసిబ్బెపుంగులుకు జక్కవగుబ్బలనుబ్బు మీఱఁగా
నక్కున నొక్కి చొక్కి దరహాసము మోమున నంకురింప వేఁ
జెక్కునఁ జెక్కు చేర్చి రతిచిన్నెల వన్నెల వాఁడిగోరులన్
నెక్కొన గ్రక్కునన్ గళల నెన్నెలవుల్ గరఁగించ కాంతయున్.

53


శా.

సంభోగశ్రమబిందువుల్ ముఖవిధుస్వచ్ఛామృతస్యందమై
సంభావింపఁగ లోచనాబ్జములపజ్జన్ బెన్నెఱుల్ గుంపులై
యంభోజమ్ముల వ్రాలు తుమ్మెదల యెయ్యారంబు చాటింపఁగా
పుంభావంబున నాథుఁ దేల్చె పులకల్ పుంఖానుపుంఖంబుగన్.

54

గీ.

మెలఁత పతియును సరి మేలు మేలనంగ
నంగములు వేడ్కతోడ నుప్పొంగుచుండ
రతుల వింతలచే నభిరతులు వెలయఁ
గూడి యానందవార్ధి నోలాడి రపుడు.

55

విరహోత్కంఠిత సుదంత

గీ.

అంత శౌరియు విరహదురంతమైన
యల సుదంతను గనుఁగొను నాస మదిని
చిగురులొత్తఁగ నెలదోఁటచెంత కరిగి
యందు నొక్కమనోహరమైనచోట.

56


సీ.

వీణాదివాద్యప్రవీణత రాణించు
                 బ్రతిలేని రతనంపుఁబ్రతిమలెల్ల
జాబిల్లిరాగోడ జాడలఁజాలుగా
                 ప్రతిబింబసంపద పరిఢవిల్ల
వాటిసమ్మోహనవాద్యస్వనంబులు
                 ప్రతిశబ్దసంగతిఁ బరగు నందు
మేళముల్ రెండు సమ్మేళమై కనుపించు
                 మించనియెక్కటి నెంచలేక


గీ.

సమత మన్నించవలెనంచుఁ జాల నెంచి
మించువేడుక నచట రమించు శౌరి
యపుడు శశికాంతమణిజాలకాంతరముల
నలసుదంతను గనుగోరు నట్టివేళ.

57


చ.

కలువలబంతులుం జలువగందపుగిన్నెలు తాళవృంతముల్
తలిరులు పువ్వుటెత్తులును తామరతూడు లనంటిమోవులుం

వలిపెములున్ హిమాంబువులవాసనగిండ్లును రేవెలుంగురా
చలువలపీఁటలుం గొని విచారముతో నుడిగంపుచేడియల్.

58


సీ.

కథలు చెప్పెదమైనఁ గలికి! లేజవరాలి
                 కలవరింతలు మాన్పఁగాఁదరంబె?
కలపంబు పైఁజల్లఁగా నలందెదమైన
                 మదిరాక్షి! మైకాఁక మాన్పఁదరమె?
విరుల వీజనలచే వీచెదమైనను
                 నెలఁతయూర్పులఁవేఁడి నిలుపఁదరమె?
పసిఁడియుయ్యల నుంచి పాడెదమైనను
                 పడఁతి జాగరము నిల్పంగదరమె?


గీ.

యవనిఁ గలిగిన శిశిరవస్తువులు దెచ్చి
సవదరించెద ముపచారసరణులెల్ల
నెట్టివిధమున నమరునో? యీక్రమంబు
చెలియప్రాణంబు వలరాజుచేతి దింక.

59


సీ.

ఉవమానములు లేవె? యుర్వి నెమ్మోముతో
                 జాబిల్లి నెంచఁ బ్రసంగ మేమి?
సరివోల్ప మరి లేవె? జగతి గన్నులకును
                 వెలిదమ్మిరేకులఁ దలఁపనేమి!
పోలికల్ మరి లేవె! భూమిలో బొమలకుఁ
                 జెఱకుసింగిణులఁ జర్చింపనేమి?
సవతుగా మరి లేవె? యవనిలో మోవికిఁ
                 దళుకుఁ గెంజిగురాకుఁ దడవనేమి?

గీ.

చక్కదనమున శౌరికి సాటి లేరె
యించువిలుకానిఁ బోల్చి వర్ణించనెంచు
నెంచుఁ దమలోన నేరంబు లెంచుకొనుచుఁ
జెలులు శిశిరోపచారముల్ సేసి రెలమి.

60


ఆ.

రాజగోపుఁ డిచట రాజాస్య యచ్చట
నెటులఁ గలుగు కూట మిరువురకును?
వనితపాల గలిగి వలరాచవేలుపు
కన్నుఁ దెఱచెనేని గల్గు శుభము.

61


సీ.

కందుకుందును లేని కలువలచెలికాఁడు
                 గలిగిన చెలిమేనికాఁక దీఱు
నిత్యవికాసంబు నెగడుతమ్ములు సంభ
                 వించిన చెలిమేనివేఁడి దీఱు
పగలురే లొకరీతిఁ బరగువెన్నలతేట
                 చేకూర చెలిమేనిసెకలు దీఱు
ననిశమార్దవమున నలరెడు తలిరాకు
                 లొదవినం జెలిమేనియుడుకు దీఱు


గీ.

ననినఁ జెలులార! యిట్టివి యందు జగతి
నతనిసమ్ముఖ మతనిహస్తావలంబ
మతనిదరహాస మాతనియంఘ్రిసేవ
గలిగినప్పుడె యివియెల్ఁ గలుగుఁ జెలికి.

62


క.

అని పలుకుచెలులఁ గనుగొని
కనుగొనలన్ వేఁడితేటకన్నీ రొలుకన్
వనజానన యి ట్లనియెను
మనమున సంతాపభరము మల్లడిగొనఁగన్.

63

చ.

ఫలకమునందు వ్రాసి తమప్రాణవిభుం బలుమారు వేడుచున్
బలపల వేగునంతకు నపారవియోగభరార్తలైన యా
నెలఁతలచెంత నవ్విభుఁడె నెమ్మది సమ్మదమంద నిల్చినన్
లలనరొ! వారివేడుక కొలంకులు నిండి తొలంకకుండునే?

64


మ.

వెలలేనట్టి పదాంగదంబు చెలఁగన్ వింతల్ భళీ! మేలనం
దళుకున్ వట్రువ గొప్పముత్తియపుటందం బొప్పు బాహాంగదం
బులు రాణింపఁగ ముత్తెపున్ సరపణుల్ ముంజేతులన్ మించఁగా
సొలవుల్ మీఱఁగ వాఁడు వచ్చి కనుమెచ్చుల్ సేయఁ డేమందునే?

65


సీ.

ఏలలువాడుచో నిపుడేటికో? చంద
                 మామమీఁది పదాలు మానినార
లధికంబుగాఁగూర్చి రదియేమొ? పన్నీరుఁ
                 గర్పూరమునుఁ జల్వగంధమునను
సన్న జాదు లిదేమొ యిన్నాళ్లవలెగాదు
                 పాన్పుపైఁ దఱచుగాఁ బఱచినారు
చేఁబూనుటయెకాక చెలువలు నేఁడేమొ
                 కీరశారికులఁ బల్కించలేదు


గీ.

వెలి విసరినటు లున్న దీవిరహచిహ్న
మింతి! నీచెంత కాయన యిపుడె వచ్చు
ననెడు నీమాటలకుఁ జాల నలరియుంటి
నింతతామస మౌట యే నెఱుఁగ నకట!

66

క.

కలఁగన్న మేలుకొన్నను
కళవళముననైన వాని గాంచియు మఱియున్
పలుమరు కనుగొనఁ గోరెద
మెలతరొ! మరి యాస కెందు మేరలు గలవే?

67


మ.

పదియార్వన్నెపసిండికి న్మెఱుఁగురాఁ బై జాదుఁగావించు న
ట్లెదపై కుంకుమమీఁద హేమరసనాహీనప్రభల్ బర్వఁగా
మదనాగేంద్రములీల వచ్చు విభుమర్మంబుల్ విలోకించినన్
మదనావేశముతోడ నెవ్వతె కళామర్మంబు లూటాడవే?

68


సీ.

మొగము చూడక మారుమొగము పెట్టుదమన్న
                 నతనిఁ గ్రమ్మరఁజూడ నాసయగను
చెలులతో నేమైనఁ బలుకఁబోయెదనన్న
                 నతనిపేరే మాటలందు దొరలు
నలుక యాయనమీఁద నిలిపెదనన్ననుఁ
                 బ్రమదంబు తనుదానె పల్లవించు
తలఁపులో నాతనిఁ దలఁపకుండెదనన్న
                 నతనిమీఁదిదె బాళి యగుచునుండు


గీ.

నతనిపై నేరముల నెన్నునట్టివేళ
నతనిసద్గుణగణములే యాత్మఁదోచు
మమత లిటువంటి వతనికి మరులుకొంటి
తామసించిన యింక నే దాళంజాల!

69


గీ.

ఎన్నివిధములఁ బలికిన నెఱుఁగనైతి
వింత నామేనిసంతాప మింత మేన
ననుచు చెలి దూరి వలవంత నాసుదంత
కంతుమందానిలేందులఁ గనలి పలికె.

70

శా.

నవ్వుల్ శారదచంద్రచంద్రికలుగా నమ్మించి యాచంద్రికల్
పువ్వుల్ గా సవరించి వాటి వెసనమ్ముల్ సేసి యా యమ్ములన్
మవ్వంబుల్ జతగూర్చునంచుఁ దుద నా మర్మంబు నాఁటింపుచున్
చివ్వల్ సేసెద వింద్రజాలములెకా! చింతింప నీవైఖరుల్

71


మ.

అలరుంజప్పర మీలతావలయ మాహా! మెచ్చువుట్టించె నిం
దలఁపుల్ దీరెదనంచు నెంచి యిటు డాయన్ బోయచందంబునన్
వలలో బోనునఁ జిక్కునట్టు లకటా! వంచించి వేఁటాడె దీ
కులుకుంగుబ్బెత లందెకా మదన! నీకోదండపాండిత్యముల్.

72


సీ.

పక్షపాతము నచ్చి పరభృతమ్ముల మెచ్చి
                 కంటి కింపైన చెంగావు లొసఁగి
మాటవాసుల గొల్చి మనినఁజిల్కలఁ బిల్చి
                 మేలిమివహి పచ్చడా లొసఁగి
తగునడకల కెల్లయగు నంచలకు నెల్ల
                 బహుమతిపద్మాల పట్టు లొసఁగి
వడిగలతన మెంచి వరుసదేంట్లకుఁ బంచి
                 వేర్వేర సేవంతివిరు లొసంగి


గీ.

చెఱకుసింగణిఁ జెంగల్వచిలుకు దొడిగి
పంచసాయక! నను గుఱి పఱచి తీవు
చుఱుకు చూపిన హరుచూపు సూడమఱచి
మించి యబలలపై విక్రమించె దౌర !

73


శా.

స్వాహాప్రాణసహాయకీలములకున్ సాహాయ్యముం జేసి యా
మాహామోహనవేషభూషలకు సంపాదించి సంజీవనం
బాహా! మంధరగంధవాహపథికప్రాణాపహస్వాంత! భూ
వాహం బైతివె యింక నెక్కడిది నిర్వాహంబు పాంథాళికిన్?

74

మ.

పలుమారు న్నిను నమ్మియుండ నకటా! ప్రాణంబు
ప్రాణంబులై
కలయన్ మోహనచూర్ణముం జిలికి చొక్కం జేసి గూఢంబుగా
లలనల్ దాఁచినయట్టి మానధనమెల్లన్ పొంచి లాగించితౌ
తలఁపన్మందసమీర! లేదుగద నీదాక్షిణ్య మీపట్టునన్.

75


శా.

చంద్రాపూరితచంద్రకాంతఫలకస్వచ్ఛప్రఘాణంబులన్
సాంద్రానందరసాతిరేకములు హెచ్చన్ నిల్వ నెమ్మేన ని
స్తంద్రంబై కనుపించె తాప మకటా! దైవంబు రోషించి యో
చంద్రా! చంద్రసమాఖ్యఁ గల్గునెడలన్ సంతాపముల్ గూర్చునే!

76


క.

రామామణు లెటులోర్తురు
రామా! యీ సెకలుచెల్లు రారాఁపులకున్
మామాయని వారింపఁగ
మామాటలు వినవు చందమామా! చలమా!

77


మ.

రమణీలోకమునెల్ల నేఁపుచును మేరల్ మీఱి వర్తిల్లఁగాఁ
గమలాకాంతసహోదరుండయిన చక్కం జూడరాదంచుఁ దాఁ
గమలాగారదళారరమ్ములను వేగంగప్పు నీరాక కీ
యమితంబైన కళంక మేమిటను పాయంజాలు దోషాకరా!

78


క.

అలుక నిటు లింతి మన్మథ
మలయానిలతుహినకరుల మాటికిఁ దెగడెన్
చెలి చూచి పలికె నేర్పున
పలుకుల నెన రుట్టిపడఁగఁ బ్రమదముతోడన్.

79

చ.

కలికిరొ! నీదు చిత్త మెఱుఁగ న్మది నెంచి ముదంబుతోడ నీ
చెలువుఁడు కేళికావనము చెంగటి బంగరుమేడలోన నీ
పలుకులు వించు కోరికలు పల్లవితంబులు గాఁగ నున్నవాఁ
డెలమి నటన్న నన్నెలఁత హెచ్చిన సిగ్గున మోము వాంచినన్.

80


గీ.

అపుడు కనుసన్నచేఁ బిల్వ నామురారి
వనితచెంతకు వేడుక వచ్చి నిల్వ
నలరుటెత్తులు తెచ్చెద ననుచు నొక్క
పని నెపంబున నేఁగినఁ బ్రౌఢదూతి.

81


శా.

ఆనందాతిశయంబు మించు నొకసయ్యాటంబుచే నొయ్యనన్
నానల్వూని మొగంబు వాంచినను నన్నాళీకపత్రేక్షణన్
నానాసూనమనోజశాస్త్రకలనానర్మక్రియానైపుణిన్
దేనెల్ చిందెడు పువ్వుటింటిమణివేదిన్ నేరుపుల్ మీఱఁగన్.

82


ఉ.

ఉల్లము పల్లవించు సరసోక్తుల లేనగ వుల్లసిల్లఁగాఁ
బల్లవశయ్యపై సరసభావము మీఱఁగ నిండుగౌఁగిటన్
హల్లకపాణిఁ జేర్చి మనసారఁగ పల్కెడు కుల్కుపల్కులన్
ఝల్లన మేనిపై పులకజాలము నిండఁగ నిండువేడుకన్.

83


చ.

విడుమర లేని జెయ్వులను వింతయొయారము చూపు చూపులన్
తడబడు మాటమాటు వగదంటతనమ్ముల వింతవింతలై
పొడమెడు భావబంధముల పొంగుచునున్న మనోరథమ్ములన్
బడఁతుకఁ దేల్చె మాధవుఁ డపారవిలాసరసైకలోలుఁడై.

84


శా.

అత్యారూఢవిలాసినీజనవిలాసాధార! సాధారణ
ప్రత్యాదేశసదేశనమ్రవిహితాబ్రహ్మణ్య! బ్రహ్మణ్యతా

సత్యాపాదితసత్యవాఙ్ముఖసుధీసత్రాస! సత్రాసగీ
ష్పత్యంతవిచారకృన్నయవిదాసంసార! సంసారతా!

85


క.

వరుణాధితపుర కరుణా
కరుణాధిక కాంతిపూరకలితాభరణా
భరణార్థి వైరిశరణా
శరణాగత జయపయోధిజ సంవరణా!

86


స్రగ్వణి.

భావభూశోభిశోభా ప్రభావోపమా
భూవిభా వైభవా భూష్ణు భూమోద్భవా!
భావిభూతోద్భవద్భవ్యవద్భూమిభృ
ద్భావుకోద్భావి పద్మాభవప్రాభవా!

87


క.

అతిభీతి వినతవిమత
క్షితిపాలకతిలకసతతసేవితసదనా!
చతురానన చతురవధూ
శ్రితవదనా 'ముద్దుచంద్రరేఖా' మదనా!

88


గద్య.

ఇతి శ్రీమత్కాళహస్తీశ్వరకరుణకటాక్షలబ్ధసిద్ధసార
స్వతనయ చెంగల్వ వేంకటార్యతనయ విజయరాఘవభూప
ప్రసాదాసాదితరాజచిహ్నచిహ్నితభాగధేయ కాళయనామ
ధేయప్రణీతంబైన రాజగోపాలవిలాసంబను మహాప్రబంధంబు
నందుఁ దృతీయాశ్వాసము.

89