Jump to content

రాజగోపాలవిలాసము/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీరాజగోపాలవిలాసము

చతుర్థాశ్వాసము

శ్రీపదనిజపదసేవక
నేపాళక్షితిప శత్రునిగ్రహ జాగ్రత్
ద్వీపాంతరశుభవిభవ
ప్రాపకజయహారి! విజయరాఘవశౌరీ!

1


గీ.

అవధరింపుము సూతసంయమివరుండు
శౌనకునితోడ నిట్లను శౌరి యట్లు
వెలయ జాంబవతీమిత్రవిందలను సు
దంతఁ దేలించి కాంతలఁ దలఁచి మఱియు.

2

ప్రోషితభర్తృక - కాళింది

సీ.

పార్శ్వభాగాభోగపరిలక్ష్యమౌక్తిక
                 ప్రభలు చామరముల రహివహింప
పరిసరపరిచరాంచద్భర్మపాలిక
                 లుడిగంపుచెలువల యొఱపు నెఱప
కనకపంజరకీరకలితగీరచనలు
                 సాహోనినాదమ్ము సవదరింప
దివ్యమణిగణదివ్యద్విభాశ్రేణి
                 కరదీపకలికలకరణిఁ దనర


గీ.

గుంభితమయూఖ ఘనశాతకుంభకుంభ
భానునిర్యత్న నిర్యత్రభానుభావ
మనఁగ పీతాంబరద్యుతు లమరనుండి
రాజగోపాలుఁ డొకసౌధరాజమందు.

3

క.

ముందుగ ప్రోషితభర్తృక
యందం బరయంగ దూతి నంపితినని గో
విందుఁడు కాళిందీసతి
చందం బరయంగనున్న సమయమునందున్.

4


గీ.

తామరసనేత్రుఁ డొకయింత తామసింప
నొక్కనిమిషంబు యుగముగా నూహసేయు
నట్టి కాళింది తనపార్శ్వమందునున్న
ప్రాణసఖితోడ నిట్లని పల్కె నపుడు.

5


ఉ.

వద్దికివచ్చు నాథుఁడను వార్తలు నీవన నమ్మియుండి యే
నద్దమరేయిదాఁక నడియాసల నాతని రాకఁ గోరఁగా
ప్రొద్దునువోయె నన్ను మరి ప్రోషితభర్తృకఁగా నొనర్చి యే
గద్దరిసుద్దు లెంచి వడిగాఁ జనెనో హరి గొల్లపల్లెకున్?

6


శా.

వాడల్ వాడలనుండి మన్మథకథావ్యాపారముల్ మీఱఁగా
వ్రీడాభారమునన్ బిగించి కడు నువ్విళ్లూరు డెందంబులన్
గ్రీడాసౌధము లెక్కి యొక్కమొగి సంకీర్ణంబుగా దేవతా
చూడారత్నముఁ జూతు రంబుజముఖుల్ సొంపుల్ పిసాళింపగన్.

7


చ.

పలుకులఁ దెచ్చుకోల్వలపు పైఁబచరించుచు వింతవింతలౌ
కులుకుల లేనిమచ్చికలఁ గూర్పుచుఁ గైతవనర్మమర్మముల్
సొలపులఁ జూపు జంతలకుఁ జొక్కుదు రింతయకాక గట్టిగా
వలచినవారిపట్ల మగవారల కెక్కడిమోహ మక్కటా!

8


ఉ.

ఎన్నడువచ్చు వీథికడ కెన్నడు చూతము సొంపు మీఱఁగా
నెన్నడు మామనోరథము లెల్ల ఫలించు నటంచు వానికై

క్రొన్ననవింటివేలుపును కొన్ననలం దగఁ బూజసేయు నా
కన్నెలు సేయుభాగ్యములు కామిని! నేడు ఫలించెనే కదా!

9


ఉ.

వెక్కసమైన మోహమున వేమరు నాతని దూర నేలనో
చక్కెరబొమ్మ! యింకిట విచారము లేటికి? నొంటిపాటుగా
నక్కట! యెవ్వతైన మనసారఁగ నవ్విభు నిండుఁగౌఁగిటన్
జొక్కఁగ జేసి వేఱొకతె జూడఁగనిచ్చునె? వాఁడు వచ్చునే?

10


సీ.

ఆజానులంబిబాహార్గళంబులవాఁడు
                 శైలశృంగోన్నతాంసములవాఁడు
శారదవిధుబింబచారువక్త్రమువాఁడు
                 ధవళాబ్జమిత్రనేత్రములవాఁడు
కనకకవాటికాకఠినవక్షమువాఁడు
                 కంబులక్షణలక్ష్యగళమువాఁడు
భాగ్యరేఖాంకితపాదపద్మమువాఁడు
                 తరుణప్రవాళహస్తములవాఁడు


గీ.

వానిఁ జొక్కించి కౌఁగిఁట వలపు నించి
ముచ్చటలు మీఱ మనసార మోవియాని
ముద్దు వెట్టుక సొలపుల ముంచి వేడ్క
మరులు కొలుపక విడుతురా మానవతులు.

11


ఉ.

ఊరికిఁ బోయివత్తునని యూరటసేయక నిర్దయాత్ముఁడై
యారడిఁ బెట్టి ప్రాణవిభుఁ డాతనియొద్దికి దూతి నెట్లు నే
నూరికినూరు బొమ్మనుదు నొంటిగఁ బొమ్మనకున్న నక్కటా!
యూరక యుండరాదనుచు నుల్లమునం బరితాప మొందుచున్.

గీ.

అటుల కాళింది మదనదురంతవిశిఖ
సంతతాసారజాతవిచార యగుట
ననుఁగునెచ్చెలి కనుఁగొని యధిపురాక
యరసివచ్చెదనని తెల్పి యరగునపుడు.

13


క.

చెలువుఁడు దేశాంతరమున
నిలిచెను నెచ్చెలులు పోవ నేర్తురె? యటకున్
చిలుకలె వలంతులని తన
చిలుకం గాళింది ముద్దుచిలుకం బలికెన్.

14


మ.

చిలుకా! పల్కవ దేమి? నీకు నలుకా! చింతాసముద్రాంబువుల్
తలమున్కల్ సవరింప తేపవగుచుం దాపంబు వారింపవే
తొలుత న్నీవొనరించు మన్మథకథాదూత్యంబునన్ బ్రాణముల్
నిలువంజేసితి నీమహామహిమ వర్ణింపంగ నే నేర్తునే?

15


ఉ.

ఱెక్కలు దువ్వి నీయెద నెఱింగి మెఱుంగుకడానిగిన్నెలో
చక్కెరమేపి యేఫలరసంబులు గ్రోలఁగనిచ్చి పావడన్
ముక్కున జిడ్డు వోఁదుడిచి ముద్దిడి వేఁడెదఁ గాంతుఁడున్న యా
దిక్కున కేఁగి యోచిలుక! తెల్పఁగదే వలిదేనె చిల్కఁగన్.

16


మ.

తొలుదొల్తం గుసుమాస్త్రశాస్త్రమతమౌ దూత్యంబునం
బ్రోడవై
పొలయల్కల్ వోలయంగ దంపతులకున్ బోధించి సంయోగముల్
గలుగం జేసిన నీమహామహిమ విఖ్యాతంబు లోకంబునన్
జిలుకా! నాపలు కాదరించి పతికిం జిత్తంబురాఁ దెల్పవే!

17

గీ.

అనుచుఁ బలికెడువేళ నయ్యంబుజాక్షు
మేని జవ్వాదిపస కదంబించ దిశల
నాయకునిరాక యరయఁగఁ బోయివచ్చు
ననుఁగునెచ్చెలి వల్కె నయ్యతివతోడ.

18


ఉ.

హెచ్చెను దిగ్విభాగముల నెల్లెడ మేని జవాదివాసనల్
వచ్చెను నాథుఁ డీనగరివాకిటికి న్నెఱరాజసంబుతో
మెచ్చవె యింకనైన మెరమెచ్చుల సుద్దులు వల్క నెన్నడున్
పచ్చనవింటివేల్పునకు భామిని! జాతర సేయు మింకిటన్.

19


గీ.

అనుచుఁ బలికెడువేళ కంసాసురారి
మందహాసంబు చెక్కులఁ గందళింప
వలిపె వలిదుప్పటీవల్లెవాటుతోడ
మెల్లమెల్లనె చెలియున్న మేడఁ జేరి.

20


మ.

కలవీణారణనాంకకంకణగణక్వాణంబు రాణింపగా
కులుకుంజన్నుల సాలుపైయ్యెదల కొంగుల్ జాఱు నొయ్యారముల్
మొలవంజూచు మిటారిచూపులను సొంపుల్ నింపుచున్ గుంపులై
కలకంఠుల్ రతనంపుటారతు లొసంగం జూచి యుప్పొంగుచున్.

21


గీ.

రాజసము మీఱ గక్షాంతరములు గడచి
విరహకాతరయై యున్న వెలఁదిఁ జూచి
చిలికిచూపుల వలపులు చిగురులొత్తఁ
బలికెఁ బలుకులఁ గపురంపుఁబలుకు లొలుక.

22

మ.

జలజాతాయతనేత్రి! యే నొకనిమేషంబైన నిం జూడ కే
నిలువ న్నేర్తునే! యెట్లు దోచె మది సందేహంబు నావల్ల నే
తలఁపుల్ లేవని కిట్లు ప్రోషితసతీధర్మంబు వాటించి లో
దలఁకంగా నిపు డేటికంచు హరి యత్యంతానురాగంబునన్.

23


క.

అని యీరీతిని బలుకుల
నెనరులు చిలుకుచును మానినీమణిహృదయం
బనురాగంబునఁ దేల్పుచు
మనసిజసందీప్యమానమానసుఁ డగుచున్.

24


చ.

నిలుపఁగరానిమోహమున నీరజలోచనఁ జేర్చి కౌఁగిటన్
చలువలు గుల్కు క్రొవ్విరులశయ్యకు నొయ్యనఁ దార్చి తేనియల్
చిలికెడుమోవి పల్మొనలచేఁ గసిగాటులు సేసి వీనులం
జిలిబిలి ముద్దుబల్కులనుఁ జేర్పుచు నేర్పులు పల్లవింపఁగన్.

25


క.

వరరాచకేళిఁ దేలిరి
చెలువయు చెలువుండు వింతచెలువము మీఱన్
కలరవగళరవములకుం
కలరవములు మెచ్చ పొగడఁగా నవ్వేళన్.

26

స్వాధీనపతిక - సత్యభామ

సీ.

బటువుగుబ్బలమీఁది పయ్యంట లరజార
                 రమణులు మణిచామరములు వీవ
తారహారంబులు పేరెముల్ వారంగ
                 వనితలు వలిపెపావడలు వైవ

చెక్కులగమ్మడాల్ చిందులు ద్రొక్కంగ
                 పంకజాక్షులు బరాబరులు సేయ
పాణిపద్మప్రభల్ వల్లటీల్ గొన చెంత
                 హరిణనేత్రలు కొనియాడుచుండ


గీ.

రాజసంబున పూర్ణిమారాజవదన
సత్య గొలువుండ నపుడు నాసత్యమూర్తి
వినయ మీరీతి మూర్తీభవించె ననఁగ
వెన్నుఁ డరదెంచె దూతికవెంట నెలమి.

27


క.

వచ్చినమాధవుఁ గనుగొని
నెచ్చెలు లందరును మానినీమణి! విభుఁడే
వచ్చె నిదె నీదు నగరికి
విచ్చలవిడి ననిన నిండువేడుకతోడన్.

28


మ.

పులకల్ గుబ్బలమీఁద జాదుకొనఁగా పుంఖానుపుంఖంబులై
బెళకుంగౌ నసియాడ ముద్దులనడల్ బింకంబు బొంకింపఁగా
తలఁపుల్ మీఱఁగ హెచ్చుకోర్కు లొకచెంతన్ బిట్టు గెర్లాడఁగాఁ
దళుకుంజూపులఁ జూచె భామ విభు నుద్దామప్రమోదంబునన్.

29


గీ.

చూచి యెదురుగ వచ్చి యాశోభనాంగి
రమణు కైదండ గైకొని రాజసమున
మెల్లమెల్లన కెంపురామేడపొంత
వింతయైనట్టి మణివేదిచెంత కరిగి.

30


చ.

చిలుకలు వింతలౌకతలు చెప్పఁగ నొప్పున వాటినన్నిటిన్
బలుమరు నారజంపువగ పారువముల్ మది మెచ్చి మచ్చికన్

జెలఁగి నుతించునందములు చెల్వలరం గలనాదవైఖరుల్
కెలఁకులనించు నించుజవికెన్ నవకంబగు పువ్వుబాన్పునన్.

31


గీ.

ప్రాణనాథుండు దానును ప్రౌఢి మెఱయ
నందు గూర్చుండి యుడిగంపుటిందుముఖులు
చిత్తమలరంగ సేవలు సేయుచుండఁ
బ్రమదమున బల్కె విభుఁ జూచి ప్రమద యవుడు.

32


మ.

తలఁతే మున్నొకనాఁడు నెచ్చెలులు చెంతం జేరి మాటాడఁగా
నెలరా మిన్నలతిన్నెనుండి బయటన్ నిద్దంపులేవెన్నెలన్
నెలవంకన్ సవరించి నెన్నొసటిపై నెమ్మిన్ సరోజాక్ష! నా
కళుకుంజెక్కిలి నొక్కి యొక్కనెలవంకన్ నెక్కొనం జేయుటల్.

33


శా.

లీలామన్మథ! నేఁడు నీతలఁపులో లేదా? రహస్యంబుగా
కాళిందీపటకుంజపుంజముల వేడ్కల్ మించఁ గ్రీడించఁగా
హాళిందేఁటులు నాకటాక్షములచాయన్ డాయఁగా నీవు చే
నాళీకంబునఁ జోఁపఁ దావికవి చెంతంజేర నేనవ్వుటల్.

34


మ.

కలకంఠీమణు లొక్కనాఁడు నను శృంగారింపఁగాఁ జూచి వా
రల వారింపుచు నేర్పుమీఱ కొనగోరన్ పెన్నెరుల్ దువ్వి నీ
వలరుందండలు గొప్పునం దురుము నొయ్యారంబు లేమేచ్చనా
తలిరున్ వాతెఱ మెచ్చుగా నడుగుచందం బందమై యుండెగా.

35


శా.

నెత్తంబాడిన పందె మిమ్మనుచు నే నీకౌస్తుభం బంటఁగా
హత్తెన్ నాకొనగోరు నీయురమునందౌ మంచిదే యంచు నా
గుత్తంపున్ వలిగుబ్బిగుబ్బలపయిన్ గోరుంచి లాలించి నా
చిత్తంబుం గలఁగించుటల్ మఱతువా? శృంగారలీలానిధీ!

36

గీ.

అనుచుఁ బలికిన మాధవుఁ డనియె నపుడు
నిష్కళంకమృగాంకాస్య! నెమ్మనమున
నిపుడు తొల్లింటిమచ్చిక లెంచు టెల్ల
నమర మదిసేవ సేయుమీ వనుటగాదె.

37


శా.

బాలేందూపమఫాల! యేల యిఁక నీభావాతిసంగోపనం
బేలీలన్ విహరింప నీవు మదిలో నేలాగు చింతితువో
యాలీలన్ సమకూర్చువాఁడ భవదాయత్తంబు చిత్తంబు నీ
వేళల్ గాచుక సేవ సేయుటకునై వేమారు నేఁ గోరుదున్.

38


చ.

మలయజగంధి నేర్పునను మాధవుఁ డాడినమాట కిట్లనున్
నళినదళాక్ష! యే నెఱుఁగ నామది నాఁటిన ప్రేమ నిట్లు వి
చ్చలవిడి నాడెదేమి యుపచారవిశేష మశేషభామినీ
వలయమునెల్ల నీవు నెఱవంచన సేయుట నన్ను నెంచియే!

39


గీ.

చిన్నిగోరున మున్ను నాచెక్కులందు
మకరికలు నీవు వ్రాయుట మదిఁదలంతు
కేళి నీ జానిరూపునం గేలిసేసి
డాలుగైకొన్న బిగుదంపువ్రాలు గాఁగ.

40


చ.

అని యిటు వారు పల్కుసమయంబున నాప్తసఖీజనంబు తాఁ
జనియెను వేఱువేఱ నుపచారముఁ గూరుచుకైతవంబునన్
వనజదళాక్షుఁడు సతియు వైభవ మొప్పఁగ వింతవింతగా
బెనఁకువమాటనేర్పు నడిపించిరి యుల్లము పల్లవింపఁగన్.

41


మ.

మలయక్షోణిధరాగ్రశృంగములఁ బ్రేమంజూడఁగా నెమ్మదిన్
గలికీ! వేడుక లయ్యె నంచుఁ బలుకంగా నేల? గందంబునా

కులుకున్ వట్రువగబ్బిగుబ్బలపయిం గూర్పంగ నీనేర్పు నే
తెలియన్ లేనొకొ నీదువంచనకు వ్రేతెంగాను గోపాలకా!

42


సీ.

చిలుకపల్కుల ముద్దు చిల్కుట చూతమా?
                 యెక్షవవ్యవహార మమర కెట్లు?
కలికి! జక్కవకవల కలయిక చూతమా?
                 యరుణగంధంబు పై నలమ కెట్లు?
కలకంఠరవము లాకర్ణించ చూతమా?
                 యిగురుమోవులమేఁత లియ్య కెట్లు?
నెమ్ములు పురివిచ్చు నేర్పులు చూతమా?
                 యుపరిఘనస్ఫూర్తి యొదవ కెట్లు?


గీ.

లమృతములు చిల్కు విధుఁ జూచు నద్ద మెట్టు
లిందు కిది యుత్తరంబని యెఱుఁగ నిపుఁడు
తొలుతఁ బలికినవాటికి తోడుతోడ
హరువు లొనఁగూర్చి సుఖముల ననుభవింపు.

43


మ.

తలిరున్ మోవులు నొక్కి నొక్కి కడునుద్దామప్రమోదంబునన్
గలకంఠుల్ కలకంఠరావముల జోకల్ జూప వేడ్కల్ చెలీ!
కలకంఠాళియు నట్లె వర్తిలఁగ నౌఁగాదన్నవా రెవ్వ రీ
తలపుల్ రూపవిలాసపోషితవసంతా! నీకు చేకూడవా!

44


మ.

జలజాక్షీ! విను చందమామకు సుధాస్యందంబు లందంబులై
చెలఁగంజూడఁగ వేడుకయ్యెడిని నీచిత్తంబునన్ లేదకో
జలజాక్షా! జలధిన్ మధింపఁగ సుధాస్యందంబు లందంబులై
చెలఁగం చందురునందు నింతయవి వాసిన్ మించ నే నెంచెదన్.

45

గీ.

అనుచు వారలు మాటల ననుచు వేడ్క
గాఢపరిరంభసంభ్రమకౌశలముల
వినిమయకృతాధరాస్వాదవిభ్రమముల
కలితకిలికించితమ్ముల గలసి రపుడు.

46


చ.

కలిగె సమానురాగములు గల్గిన వీరికి నేఁడుకూటముల్
నెలకొనె నాదుకీర్తులని నెమ్మది వేడుక పంచసాయకుం
డలకులసోన నించెనన నయ్యలికుంతల కుంతలంబులన్
జలజలరాలె పూలు సుమసాయకసంగరకౌశలంబునన్.

47


మ.

తళుకుంజూపుల వెంబడించిన యలంతల్ వింతలేనవ్వులం
గలయంబర్విన కమ్మవీడియపుచెంగావుల్ దువాళించగా
వలపు సంపంగిదండవోలె వసివాళ్వాడం దనూవల్లి యా
నలినాక్షీమణి చూడనొప్పె హరి యానందాబ్ధి నోలాడఁగన్.

48


గీ.

అంత శశి జాఱె తిమిరంబు లడఁగఁబాఱె
కువలయంబులు వాఁడి జక్కవలు కూడి
దెసలు తెలివొందె విరహులదెసలు డిందె
తపనుఁ డుదయించె సాంధ్యకృత్యములు మించె.

49


క.

చతురాననముఖులందఱు
నతు లొనరింపంగ దక్షిణద్వారకలో
క్షితిలక్ష్మీనీళాదులు
కుతుకంబునఁ గొల్వ రాజగోపకుఁ డుండెన్.

50

ద్వారకావర్ణన

గీ.

వాసుదేవుని సంతతావాసమునను
భాగ్యములకెల్ల నెల్లయై పరగునట్టి

తన్నివాసంబు మహిమ యే ధన్యమతిని
తెలిపెదను నీకు మునీలోకతిలక! వినుము.

51


సీ.

శ్రీధరావీక్షణ శ్రీభరామ్రేడిత
                 కమలతోరణదామకవచితంబు
ప్రత్యుషశ్రుతిపాఠ పరధరామరసుత
                 సహపాఠి శౌరికాసముదయంబు
ప్రతిమాసకల్పితప్రతిముహూర్తారణ
                 రాజగోపోత్సవరాజితంబు
కనక గోపురరత్నకలశనక్తందివ
                 నాటితామితసూర్యనాటకంబు


గీ.

కీర్తనీయనికేతన కేతనాగ్ర
పక్షిరాజహిరణ్మయపక్షవితత
విద్యుదంశుసముద్ద్యోతవితతతమము
దక్షిణద్వారకాపురోత్తమము దనరు.

52


మ.

అలనీలాలక లందు రత్నమయగేహద్వారబంధారర
మ్ముల పొందమ్ములయందుఁ దేఁటిగమిసొంపుల్ నింపు నాత్మీయచం
చలవీక్షాంచలపాళి కుల్కఁ గని యిచ్చన్ నవ్వుచున్నట్టి చి
ల్కల శిక్షింతురు పల్కుటందముల జోకల్ నేర్పు నేర్పుల్ తగన్.

53


మ.

తలఁప వేలకొలందులై తనరు కాంతారత్నముల్ మేనిపైఁ
గలయన్నించిన మన్మథాంకము లెసంగ న్నాథుఁ డేతేరఁగా
లలనల్ కన్నులఁ జూచియుండి మును నల్కల్ పూన రుద్యుక్తుఁడై
వలరాయండు ధనుర్ధరుం డగుచు నిల్వన్ తద్ గృహాగ్రమ్ములన్.

54

మ.

కరముల్ సాఁపుచు చూపి చెప్పఁగ మరుత్కాంతల్ జయంతాదులౌ
నరుదుల్ చూచితిమంచు మెచ్చి మదిలో హర్షింప వైడూర్యముల్
తెఱలెత్తన్ మణిదీపముల్ చెలఁగ హాళిన్ జాళువామేడలన్
సొరిదిం గన్నెమెఱుంగు గుంపులు నటించున్ మెచ్చుగా నచ్చటన్.

55


శా.

తారామార్గము మీఱు సౌధగృహసంతానంబుపై బంగరుం
రారేకల్ నవనూనసౌరభములన్ రాణింప పొందమ్ములన్
బేరాసన్ సురసింధుపద్మములలో భృంగాళి యే తెంచి ఝం
కారంబుల్ సవరించుఁ దన్మహిమకుం గైవారముల్ నాతగన్.

56


మ.

తళుకుంగెంపులయండ నీలనికరథ్వాంతంబున గోకముల్
కలయంగా గమకించి పాయుటకునై కాంతామణుల్ నవ్వ నా
జిలుగున్ వెన్నెలఁ జంద్రకాంతవళభీసీమల్ పయోధారలం
దలకొల్పంగఁ దదగ్రగేహ మమరున్ ధారాగృహంబో యనన్.

57


మ.

వలువల్ కోరినయట్లు కల్పలతికావ్రాతం బొసంగన్ మరు
జలజాతుల్ గయికోఁదలంచునెడ నాసౌధాగ్రహీరప్రభల్
వలువల్ నాఁగఁ దదంతరాళములఁ బర్వన్ వాటిఁబూనంగ చే
తులు సాఁపం గని గొల్లున న్నగుదు రింతుల్ తద్గవాక్షమ్ములన్.

58


మ.

రమణుం డందరు వేరువేరను శరద్రాకాశశాంకాస్యలం
గ్రమముల్ మీఱఁగ నేలువైఖరులఁ దత్కాంతాశిరోరత్నముల్
సమరాగంబున వానికిన్ వలచు నాసయ్యాటపుంనేర్పులం
దమి పుట్టించు నిలింపదంపతులకుం దచ్చిత్రలేఖాంకముల్.

59

శా.

రాణింపన్ తుదసజ్జలన్ వెలిగుడారంబుల్ దిగంతంబులన్
నాణీయస్తరకరత్నగుంభముల చాయల్ మోహరింపన్ శచీ
ప్రాణాధీశ్వరు సౌధముం గెలిచి తత్ప్రాసాదరాజంబు త
న్మాణిక్యంబులడాల్ హరించె భళి! సన్మానార్హ మౌనౌ ననన్.

60


ఉ.

మ్రొక్కుచు వేఁడుచుం గదిసి ముద్దిడుచున్ నునుమోవి
నొక్కుచుం
జొక్కుచు గోపికల్ ప్రియునిఁ జొక్కఁగ జేయు విలాసచిత్రముల్
చిక్కనిసిగ్గులం బ్రియునిచెంతలఁ జేరక చంద్రశాలలం
దొక్కెడఁజూచు నచ్చటి నవోఢల మూఢలఁ జేయు నెంతయున్.

61


మ.

వలభీప్రాంతమునందు కార్మొగిలుక్రేవన్ డాఁగుచున్ గ్రమ్మఱం
దళుకుల్ చూపుచు చంచలల్ మెలగుచందంబుల్ విలోకించి
వేడ్కలమీఱన్ హరినీలదీధితి తమస్కాండంబులో నచ్చటం
లలనల్ డాఁగిలిముచ్చు లాడుదురు లీలన్ నాథుఁ డుప్పొంగగన్.

62


ఉ.

ముక్కులఁ గెంపురాతళుకుమొక్కల మేటికిరీటి పచ్చరా
ఱెక్కల మించఁగా నద నెఱింగి మెలంగు మెఱుంగుబోడులం
జక్కెర వేడుచో నచట జాతివిజాతుల నేర్పరింతు రా
చక్కెరబొమ్మలో వరులచక్కిని నిల్చిన చిల్కగుంపులన్.

63


మ.

కరిదంతమ్ముల పువ్వుబోదె తుదసింగంబుల్ పిసాళింపఁగా
సరసం బెంపుడులేళ్లు వాటిగని చాంచల్యంబుచేఁ దాఁటి కా
తరసారంగవిలోచనామణులచెంతన్ నిల్వ చెల్వుండు తా
నరయు న్నచ్చట వీక్షణంచలములం దౌపమ్య మామేడలన్.

64

శా.

చాలౌమేడలఁ జంద్రకాంతజలనిష్యందంబు లవ్వీటిలో
లోలాక్షుల్ తమిఁ జూచునప్పుడు తదాలోకానుషంగంబునన్
వాలారుల్ మగవాలుగల్ గలుగు ఠేవంబర్వ గేహేందిరల్
మీలంచుల్ ధరియించునట్టి కరణిన్ మించున్ నిశావేళలన్.

65


ఉ.

వేడుకకాండ్ర గూడి తఱివెన్నెలరేలు మిటారికత్తియల్
మేడలమీఁదనుండి మెరమెచ్చులకై జతగూడి చల్లగాఁ
బాడెడు పాట మెచ్చి సురపాదపముల్ తలలూఁప రాలు న
వ్వాడనిపువ్వు లెవ్వరును వాడనివా రట లేరు చూడఁగన్.

66


ఉ.

అల్లన చంద్రశాలల నొయారులు పౌరుషకేళి సల్పుచో
ఝల్లున రాలు ముత్యములు సౌరనదీకనకాంబుజంబులం
దెల్లనుఁ బర్వ నంచగమి యింపలరం దమగ్రు డ్లటంచు మై
చల్లనిరెక్కలం బొదువు చంచువులం బలుమారు దువ్వుచున్.

67


చ.

జలకము లాడి నున్మడుగు సాలియలూని ప్రియానురక్తికై
మలయజగంధు లప్పురము మాడువులన్ స్మరమంత్రవాదపుం
గలరవముల్ బయల్ పరపఁగా విని నేర్చిన యందువల్ల నే
కలరవనామధేయములు గల్గె జగంబునఁ బారువాలకున్.

68


చ.

కులగుణరూపరేఖలనె కోరివరింతురు పల్లవావళిన్
వెలవెలఁదుల్ పసిండికయి వేడరు తక్కినవారి నచ్చటన్
బెళుకుమెఱుంగురంగు నెఱబింకము సుంకము వెట్టుమేని క్రొం
దళుకులచేతఁ దాము సతతంబును పైఁడివసంత మాడగన్.

69


సీ.

వెన్నెల లోక్కొక్కవేళ గాని చెలంగ
                 వవియు నవ్వులకు నీడనఁగరాదు
కమలముల్ దినమందె కానియందముఁ జింద
                 వవియు మోములకు నీడనఁగరాదు

కలువపువ్వుల రేలుగాని నీటువహించ
                 వవియు చూపులకు నీడనఁగరాదు
తలిరు లామనిగాని తలచూపగానేర
                 వవియు మోవులకు నీడనఁగరాదు


గీ.

మేలి తనసాధనమ్ముల మించి వీట
వెలవెలందులయెడ వింటి విభవమనుచు
నతనుఁ డడిదమ్ములుగ వారి నర్చసేయు
టనుమితంబగు గంధమాల్యాదికముల.

70


మ.

శరవేగమ్ముల నాత్మవేగములు మించన్ వేగమున్నాడి మీ
కరపల్లత్కరవాళముల్ విమతపక్షంబుల్ విభాళించఁగా
శరసంధానము లేల మీకు ననువై సాదిప్రజామౌళితో
పురిలో వాహపరంపరల్ చలతరప్రోధంబుగా హేషలన్.

71


చ.

జలదములం బ్రతిద్విరదశంకను కొమ్ముల గ్రుచ్చి చిమ్మఁగా
వెలువడు తద్గతాశనుల వేఁడిమి కోర్చిన వారనాళికిం
బలిమిగ నగ్నియంత్రముల బన్పరపన్ వలదండ్రు వీట యం
తలు రణమన్నపట్ల మదధారలు చిందగ నింత యేఁటికిన్.

72


సీ.

బటువుసిబ్బెపుగుబ్బపాలిండ్లపేరిటి
                 గట్టులపై నున్కిపట్టు సేసి
గప్పుచిప్పిలు గొప్పకొప్పులపేరిటి
                 చీకటిపొదరిండ్లచెంత నిలిచి
కనుచూపుమేరకు గనరాని నడుముల
                 పేరి యెడారుల దారినుండు
జిలుగుఁజాయల వాఁడిచికిలిచూపులపేరి
                 చిలుకటమ్ములుకొన్ని చిలికి చిలికి

గీ.

వంచననుఁ బొంచి తను గానుపించకుండ
సతులచేతనె పురిచెంత సతులమహిమ
నథ్వగుల మానధనముల నపహరించు
వించి విలుపాళెగాని వర్ణించదరమె?

73


చ.

పలుమొనకెంపుగుంపు పయిపై నిగుడం జిగురాకుమోవులం
గలసి మెలంగునట్టి గణికావిటపాళులకేళి చూచి యో
పలుమొనకెంపుగుంపు పయిపై నిగుడం జిగురాకుమోవులం
గలిసిమెలంగు వీట గణికావిటపాళి వనాంతరంబులన్.

74


సీ.

విప్పారు చెంగల్వవిరు లమర్చినయట్టి
                 యద్దంబు మేలుమే లనఁగవలయు
తెలిమొల్లమొగ్గలు దినుసేర్చికూర్చిన
                 మగటిమి హెచ్చని పొగడవలయు
పసిఁడిసంపెంగలు పొసంగించినటువంటి
                 హరువులౌనని కొనియాడవలయు
నరవిరులౌ పొన్న లలవరించిన యట్టి
                 నెఱజాణతనము వర్ణించవలయు


గీ.

నలువ నిర్మించె నను చెల్వు గలుగవలయు
నట్టిసురలకు మీకు నెంతైన పిలువ
ననుచుఁ బలికెడి సరసుల కపుడు వీటఁ
బుష్పలావుల నవ్వులం బులకలొదవు.

75


మ.

తనియన్ మావులు పువ్వుఁదేనియలఁ గేదారంబుల న్నిచ్చలుం
జినుకం బ్రొద్దొకవన్నె నందు గళమశ్రేణుల్ ఫలంబంది వే
వినతుల్ సల్పును వాటిపాదముల కుర్వింవ్రాలి లోకంబులన్
దనుబోషించినవారిపట్ల మరివింతల్ గావు నమ్రత్వముల్.

76

శా.

వెంటం జాఱులు కూరలన్నమును వేఱ్వరం దగబూని తత్
ఘంటామార్గమునందు జాఁగటలచేతన్ బెట్టు చాటించి యిం
టింటం బాంధకులంబు నారయుచు నెంతే తృప్తిగావింతు రా
కంటం జెందకయుండ రేయిపగ లుత్కంటన్ నృపాజ్ఞాపరుల్.

77


చ.

మలయజమానిమేనమును మాపటిపూటలయందుఁ జల్లగా
జలకములాడి రింతులను సారెకు నప్పురవీథులెల్ల దా
వలగొని తెల్పు కేళి రసవాటులచెంగటి చంద్రకాంతపుం
గొలఁకుల నీటితావి విరికోటికి దూతికరీతిఁ జాతురిన్.

78


చ.

మలయసమీర మప్పురముమాడువలందు రతాంతతాంతలౌ
చెలువలు దేర్చి లేఁజమట చిత్తడులం దొలగించి వాలు మై
వలచు సుగంధముల్ తన కవారణమై యొసఁగంగ ద్రిమ్మరుం
గలుగదె లోకమందు నుపకారికిఁ బ్రత్యుపకార మెన్నగన్.

79


శా.

కంజాక్షీహృదయానురంజనకళాగంధర్వ! గంధర్వభూ
మంజీరధ్వనిధాటికాతిఘటనామందేహ! మందేహతా
పుంజీభూతవిరోధివిద్రవవిధాంభోజాప్త! భోజాప్తవ
త్తంజాపట్టణహారనాయకమణీదామాంక! థామాంకనా!

80


క.

రామాభిరామధామా
ధామాధికభీతభూమిధవకృతనామా
నామాంకితజయభూమా
భూమానితగుణవసంత పుష్పారామా!

81

అశ్వగతి - నిరోష్ఠ్యము

భూరమణీమణిభాగ్యవశంవదభూరిభుజాయుగమానబలా
మారవిసృత్వరభాసముదిత్వరమంజిమసమ్మదభాగబలా
వారిరుహాప్తసమగ్రరుచిప్రతివాదిమహాపరిపాల్యబలా
వీరగుణావృతహృత్యసుహృత్పృథివీధవదావికృపాణబలా.

82


క.

శ్రీ ‘‘ముద్దుచంద్రరేఖా"
ప్రేమస్థేమాభిరామ! బిరుదాంకకథా
నామాంకిత శాత్రవభూ
భూమాపహవిజయ సమరపుంఖితపటహా!

83


గద్య.

ఇతి శ్రీమత్కాళహస్తీశ్వరకరుణాకటాక్షలబ్ధసిద్ధసార
స్వతనయ చెంగల్వ వెంకటార్యతనయ, విజయరాఘవ భూప
ప్రసాదాసాదికవివిధరాజచిహ్నచిహ్నితభాగధేయ కాళయ
నామధేయప్రణీతంబైన రాజగోపాలవిలాసంబను మహాప్ర
బ్రంధంబునందు చతుర్థాశ్వాసము.

84