రాజగోపాలవిలాసము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీరాజగోపాలవిలాసము

ద్వితీయాశ్వాసము

శ్రీరాజగోపకరుణా
పూరాపూరితసమస్తపురుషార్థనిధీ!
వారణఘోటకహాటక
రారాజత్సదన! విజయరాఘవమదనా!

1


గీ.

అవధరింపుము సూతసంయమివరుండు
శౌనకునితోడ నిట్లను శౌరి యట్లు
భోజతనయను సమ్మదాంభోధిఁ దేల్చి
తక్కినటువంటి సతులపైఁ దలఁపు నిల్పి.

2

జారిణి భద్ర

సీ.

పలకవజ్రపు తేటతెలినీటిచిట్టూట
                 చలువల గుబురుగా మొలచి హెచ్చు
పచ్చరాతీవెలపై లేటతుదలను
                 జిగురించు కెంపురాచిగురుగుంపు
సందుసందులయందుఁ గందలించినయట్టి
                 కట్టాణిముత్యాల కమ్మవిరుల
వైడూర్యముల తెర వలిదేనియకు మూఁగు
                 కప్పురాతేంట్లఝంకారసరణి


గీ.

కరణిఁ దనరారు గాయనీగానతాన
మానమానితనవసుధామధురిమముల
జీవబంధంబు గన్న విచిత్రచిత్ర
రాజి రాజిలు నొకసౌధరాజమందు.

3

మ.

తళుకున్నిద్దఁపుఁదారవజ్రములచేతన్ మించు పైయంచులన్
వలగోఁ జెక్కిన కెంపురాపలకమిన్నల్ జాజుపట్టెల్ వలెన్
వెలయంగా వెలలేనిరత్నముల నెంతే వింతయౌ తిన్నెపై
కలకంఠీమణి దూతిరాక మది నాకాంక్షించి కూర్చుండఁగన్.

4


గీ.

ఎల్లగరితలు తనజాడ లెఱుఁగకుండ
జారభావంబు మదిఁగోరు శౌరికడకు
భద్రచెంతకు నంపిన ప్రౌఢదూతి
నెమ్మి మీఱంగ వచ్చి వినీతితోడ.

5


మ.

తొగరారాతెగమేడయోవరుల జోతుల్ తేటనిద్దంపులేఁ
జిగురు న్వెన్నెలచల్వచప్పరమునన్ చిన్నారిపూగుత్తులన్
నెగడం జేయఁగ బాటనుండి వలిదేనెల్ చిందు చందంబునన్
చిగురుంబోడి మురారిఁ జేరి పలికెన్ జిత్తంబు రా నత్తరిన్.

6


గీ.

స్వామి! యెంచినకార్యంబు సఫలమయ్యె
నెచట సంకేతమో యానతీయవలయు
ననుచుఁ బలికిన శౌరియు ననుచు వేడ్క
నల శుకాలాపతోడ నిట్లనియె నపుడు.

7


చ.

కలికిరొ! నీవు వచ్చుదనకన్ సురపొన్నలపజ్జ గొజ్జగుల్
వలగొను తేటమంచు తెలివాఁకలచెంతల మావిమోకలన్
మలకలుగాఁగ నల్లికొను మాధవికాలతికల్ మరందముల్
చిలికెడు పువ్వుచప్పరము చెంగటి యాపొదరింట నుండెదన్.

8


క.

అని గుఱుతుగ సంకేతము
వనజాక్షికిఁ దెలిపి పోయివచ్చెదవా? నీ
వని యనిచిన నవ్వనితయుఁ
జనియెం జెలియున్న కేళిసౌధముకడకున్.

9

చ.

చని యలదూతి యవ్వికచసారసలోచనఁ గాంచి యచ్చటన్
వనజమృణాళచంద్రహిమవారిపటీరలతాంతసంతతుల్
గొని యుడిగంపుఁజేడియలు గొందఱు సందడి సేయుచుండఁగా
నెనరునఁ జేర నేఁగి మది నెయ్యము తియ్యము దోఁప నిట్లనున్.

10


మ.

'లలనా! చక్కెర వెట్టవే' యనుచు చిల్కల్ సారెకుం
బల్కఁగా
నలరుల్ కుమ్ముడిఁ జేర్పుమంచుఁ జెలు లంతంతన్ నిను న్వేఁడఁగా
జలకంబన్నను భోజనంబనిన వేసారంగ నేకార్యమో
కులుకున్ జవ్వని! నన్నువంటిచెలి నీకుం గల్గ నిం తేటికిన్?

11


చ.

వెలఁదుల నాతఁ డేలు మరి వేలకొలందుల వారిలోన నన్
దలఁపున నిల్పునా యని వితావిత యీవెతఁ జింత సేయఁగా
వలవదు నీపయిన్ వలపువాఁడని నమ్మికపుట్ట గట్టిగా
బలికెదనమ్మ యీకనకపంజరకీరము సాక్షిగాఁ జెలీ!

12


క.

సమయోచితశృంగారము
సముచితముగఁ బూనవమ్మ! సారసముఖి! నీ
రమణుఁడు నాతోఁ జెప్పిన
సమయస్థలిఁ జేర నిపుడె చనవలయుఁజుమీ!

13


సీ.

కొలముసాము లటంచుఁ గూడి రాకుండను
                 బాదాంగదమ్ములఁ బరిహరింపు
మొగిలిమొత్త మటంచు మూఁక సేయకయుండ
                 గీలుగంటునఁ జేర్పు మేలిముసుంగు

వెలఁది వెన్నెలయంచు వెంటరాకుండను
                 తళుకుఁగన్నులఁ జూపు బెళకనీకు
మనుఁగుఁజుట్టమటంచు నంటి రాకుండను
                 చన్ను లఁ బయ్యెద జాఱనీకు


గీ.

మనుచు గైసేసి నవచంద్రికార్హముగను
హంసకేకీచకోరరథాంగకులము
లనుసరింపక యుండ నుద్యానమునకు
నెలఁతఁ దోడ్కొని వచ్చెను నేర్పుమీఱ.

14


గీ.

అంతఁ బతియును నచట నక్కాంతనంత
నెపుడు చూచెద ననువేడ్క లిగురులొత్త
నల వసంతుని నగరికి నలరువిలుతుఁ
డేఁగువిధమున వనివీథి కేఁగఁదలఁచి.

15


గీ.

జాఱుసిగఁ బూవుటెత్తులు చక్కఁ జెరివి
దండ వేడండగమన కైదండ యొసఁగ
తరణి యొక్కతె పాదావదాన యనఁగ
డిగ్గునను లేచి గద్దియ డిగ్గి యపుడు.

16


సీ.

పరవంజికెలఁకులఁ బంజకీరమ్ము
                 లెచ్చరించినఁ జూచి వెచ్చనూర్చు
నెమ్మిబోదలు చెంత నెమ్మి లాస్యముఁజూప
                 వెగడుపాటున మారుమొగము వెట్టు
మణిజాలకమ్ముల మలయంపువలిగాడ్పు
                 సొలయుమార్గంబులు తొలఁగి యేఁగు
సిగజాఱునరవిరిచెంగల్వమొగడల
                 వలగొనుతేంట్లకు కలఁగి నిలుచు

గీ.

నిలిచి, మదిలోన నేమేమొ తలంచు, తలఁచి,
యెచట కేఁగెద నిపుడని యెంచు, నెంచి
బలిమిఁ దనుఁదానె యొకకొంత తెలియుఁ దెలిసి
చింతతోడుత నెలఁదోఁట చేరి యందు.

17


చ.

మలయతటీపటీరతరుమాంసలసౌరభభారమందసం
చలనసమీరలోలజలజాతసుజాతపరాగరాగసం
కలితమనోహరాస్తరణకాంతనిశాకరశాంతవేదికా
తలముననుండి యవ్వికచతామరసాక్షిఁ దలంచి నెమ్మదిన్.

18


ఉ.

కమ్మనియూర్పులౌ సురటిగాడ్పులచే మకరాంకకేళి మైఁ
గ్రమ్మిన ఘర్మవారికణికల్ హరియింపుచు సేదదీఱఁగా
ఘమ్మనుమోవిపానకము గ్రమ్మర నిచ్చి పునారతిక్రియన్
సమ్మద మందఁజేయు నలసారసలోచనఁ గూడు టెన్నఁడో?

19


మ.

కలయం గ్రుమ్ముడి వీడి జాఱెడుకురుల్ గాటంపుపెన్మబ్బుగా
వలపుల్ గ్రమ్మఁగ రాలుపూలు కరకవ్రాతంబులై నిండ, మైఁ
బులకల్ పుట్టఁగఁ జేయు నూర్పువలిగాడ్పుల్ మించ నింకెన్నఁడో
కలకంఠీమణి పంచసాయకనిదాఘంబుం దొలంగించుటల్.

20


ఉ.

వెన్నెలఁగాయ నాయురము వీపునఁ జేరఁగ నొత్తగిల్లి తాఁ
జన్నుల తంబురా నిలిపి చల్లఁగ నాపయి పంతువాడుచున్
తిన్నఁగ నర్థముల్ తెలుపు తీరున మర్మముసోఁక పాడిక్రే
కన్నుల నవ్వునట్టి కలకంఠినిఁ గౌఁగిఁటఁ జేర్చు టెన్నఁడో?

21

గీ.

విరహిజనములపై వేఁట వెడలు మరుని
జిగురుఁగండెలు కాఁబోలు చెలువచూపు
లందు గట్టిగ నంటిన యట్టి నాదు
మనసు మరలక యున్న దేమనఁగ నేర్తు?

22


సీ.

వలకారిచూపులు దెలిపెను భావంబు
                 కలికి యేమోకాని పలుకదయ్యె?
నిఱుకుగుబ్బలచాయ లెదురుకోలు ఘటించె
                 పడఁతి యేమో యోరపాటు సేసె?
ముసిముసినగవు సొంపులు సేదఁ దేర్చెను
                 వెలఁది యేమిటికినో వెతలఁ బెట్టె?
ననురాగమంతయు గనుపించె వాతెఱ
                 తెఱవ యేమో సమ్మతించదయ్యె?


గీ.

నేమి యనవచ్చు నక్కటా! మామకీన
సమసమయజాతభావనాసాహచర్య
కందళన్మోహసన్నాహఘనఘనాఘ
నాంతవిద్యున్నిశాంతంబు లింతి సటలు.

23


గీ.

కలువ విరిదండ సారించు కరణినున్న
నున్నతామోదమునఁ దేలియుంటి గాని
బాలచూపుల వెంటనే వాలుదూపు
లించువిలుకాఁడు సంధించి యేయు టెఱుఁగ?

24


గీ.

ఎపుడు వచ్చునొ యిచట కయ్యిందువదన
ఇంత తామసమౌటకు హేతువెద్ది?
ఏయుపాయంబుచేత నీరేయి గడచు
ననుచు జింతింపుచున్నట్టి యవసరమున.

25

చ.

కొలకొలమంచు నంచగమి గొబ్బున నాసురపొన్నగున్నలన్
వలగొను కన్నెగొజ్జఁగులవైపునఁ బాఱెడు మంచుగాల్వ చెం
తల గుబురైన కప్రపుటనంటుల నంటుల జల్వలూఱఁ జెం
గలువ కొలంకు చెంగటను ఘమ్మను పూఁబొదరిల్లు చేరినన్.

26


క.

కలకంఠి యచట నుండఁగ
కలహంసలు ముద్దునడలఁ గలిగిన సొలపుం
గులుకులు నేర్వం జనియెను
పలికించెద నింతి ననుచుఁ బతి యిట్లనియెన్.

27


ఉ.

నేరము గల్గెనేని మది నిల్పకు మేఁ దలంపఁగ లాఁతినే
వారణరాజయాన! యనివారణ నీ వొకశిక్ష సేసినం
గౌరవ మంతకన్న మరి కల్గునె? ఊరకె యల్గి కేళికాం
తారలతాగృహంబున వితావిత నేటికి దాఁగ నేఁటికే?

28


ఉ.

కానకయుండ డాఁగుటలుగా మరి నేరుపు, కన్నపిమ్మటన్
మానిని! డాఁగియుండుట చమత్కృతియే? కృతిఁ జేసి నన్ను నీ
యాననచంద్రచంద్రికల యందము చందము చూపి మన్మథ
గ్లాని యడంప కిప్పుడు విళంబము సేసిన నిల్వనేర్తునే?

29


ఉ.

జవ్వని యివ్వనిం బొదలచాటున నీటునఁ బల్కకుండుటల్
నవ్వులతో నిజాలకునొ నాయెడ నీ వొకతప్పుఁ గంటివో?
చివ్వలు గోరి నీచెలులు సేసినసేతలొ? యైన నేమి! యా
పువ్విలుబోయ యేయ నిటఁబొంచెను వంచనయేల? యేలవే!

30


గీ.

వింతవాఁడనె యకట! నీవింత యలుగ
కోపనా! యేల చాలు! నీకోపనటన

రమ్ము నీగుబ్బచన్ను లురమ్ముఁ జేర్పు
నానపూనిన వలరాజు నాన నీకు.

31


క.

అని యనురాగము మీఱఁగ
వనజాక్షుఁడు సరసవాక్యవైఖరిఁ గేళీ
వనకుంజపరిసరంబున
సనునయ మొనరింపుచున్న యంతటిలోనన్.

32


సీ.

కర్నాటకపుతీరు గలనిక్కుకొప్పున
                 సవదరించిన సన్నజాదిసరుల
గుత్తంపువలిగబ్బిగుబ్బచన్నులమీఁద
                 నసియాడు ముత్తేలహారములను
రవిక పూనినయట్టి రహివహింపఁగ మేనఁ
                 దనరారు చల్వగందంపుఁబూఁత
నుదుటు లేజాబిల్లి యొరపొందు నుదుటను
                 దీర్చిన కపురంపుఁదిలకమునను


గీ.

మొలచి చిగురించి యంతట మొనయనల్లి
పూచు వెలినిగ్గుతీవెలప్రోది గన్న
పండువెన్నెలతేటలు పైఁజెలంగు
మేలి తెలిసాలియ ముసుంగు మించునించ.

33


ఉ.

వెన్నెలతేటయో? చెఱకువిల్తుని గెల్పులపువ్వుఁగోలయో?
కన్నులఁ గానుపించు త్రిజగన్నుతమోహనమంత్రవిద్యయో?
మన్ననఁగన్న యన్నలువ మానససృష్టియొ? యంచు నెంచగా
గన్నియ ముద్దునెన్నడలఁ గౌ నసియాడఁగ నిల్చె నయ్యెడన్.

34

సీ.

గుబ్బచన్నులు కేలఁగూర్చిపట్టకమున్న
                 మిసమిసల్ కైదండ లొసఁగఁదొడఁగె
వాతెఱతేనియల్ వలపింపకయెమున్న
                 చవు లంతకంతకు సందడించె
మక్కువతో జేరి మాటలాడకమున్న
                 మున్నాడుభావంబు మొలకలెత్తె
నిండుగౌఁగిటఁ జొక్కి యుండునంతకమున్న
                 యంగంబు మిగుల నుప్పొంగుచుండె


గీ.

పల్లవాధర పొదరింటిపజ్జ నిలిచి
చంచలకటాక్షపాతసంజాతహర్ష
బంధురసవర్షధారాతిపరిచయమునఁ
బతికి ననురాగలతికలఁ బాదుకొల్ప.

35


క.

జల్లున మైఁ బులకింపఁగ
నుల్లం బనురాగజలధి నోలాడంగా
పల్లవపాణిని లలనా
పల్లవసాయకుఁడు చూచె ప్రమదం బెసఁగన్.

36


గీ.

అమృతరసధార మనసార నానుకరణి
తళుకు సంపంగిదండ మై దార్చుసరణి
కౌఁగిట బిగించి వెన్నుండు గారవించి
నిలిపె విరిసజ్ఁ దనచెంత నెలఁత నంత.

37


ఉ.

నానలు దీర్చునట్టి వచనంబుల శయ్యకుఁదార్చు పల్కులున్
మానము మీటు మాటలును మర్మములన్ వెలిఁదేర్చు సుద్దులున్

దేనియ లూఱు నారజపుతీరుల వింతరహఃప్రసంగముల్
మానసికమ్ములై చెలఁగె మానినికిన్ మధుకైటభారికిన్.

38


సీ.

సరసంపు బలికింపు సరణుల సడలించి
                 యుత్తరప్రత్యుత్తరోక్తులెల్ల
చిఱునవ్వు తేటలచేతనే ప్రకటించి
                 మనసులోఁ గలిగిన మమతలెల్ల
గాటంబులౌ నిండుగౌఁగిళ్ల వివరించి
                 ప్రబలానురాగసంపదల నెల్ల
మోము మోమునఁ జేర్చి ముద్దాడుటను దెల్పి
                 కలయికఁ గలుగు నాకాంక్షలెల్ల


గీ.

వచనరచనాదికములైన వైపులెల్ల
బరిహరించియు నుల్లంబు పల్లవింప
సమయసముచితసురతప్రసంగరీతి
నంగనఁ గరంచె నల మోహనాంగుఁ డపుడు.

39


గీ.

హరియించె వారి బడలిక
పరిసరకాసారతీరపరిచితహంసీ
గురుదంచలహతిచంచల
సరసిజదళతాళవృంతజాతానిలముల్.

40


సీ.

కేళీగృహములోవ కెలఁకున వెన్నెల
                 బయట కేశాకూళిపజ్జ పసిఁడి
చవికబవంతిలో జలసూత్రముల నుబ్బి
                 దుముకెడు పన్నీటిధూమ్రములను

పొడమెడు చలువచేఁ బ్రొ ద్దొకవింతఁగాఁ
                 బొదవెడు గొజ్జంగిపొదలయందు
చిందుతేనియకునై చిందులు ద్రొక్కుచు
                 మెదలెడు గండుతుమ్మెదల రొదలు


గీ.

లక్షణానుక్షణాప్రేమ లక్ష్యలక్ష్య
మదనమాంత్రికమోహనమంత్ర మగుచు
మదనజనకుండు మదికి సమ్మదము సేయ
వేడ్కతో నుండె శశికాంతవేది నంత.

41

జారిణి - లక్షణ

ఉ.

పారము నేఁడెయంచు యదువల్లభురాకను గోరి లక్షణా
సారసగంధి కేళీమణిసౌధము తాఁగయిసేసి వేడుకన్
హారపదాంగదప్రముఖహరిణియై తపనీయమందిర
ద్వారమునందు నిల్వ నొకవారిజలోచన చేరి యిట్లనెన్.

42


శా.

బంగారానకు వన్నెవెట్టినగతిన్ పద్మాక్షి! నీమేనిపై
సింగారంబు చెలంగె కేళిభవనశ్రీసంవిధానంబులున్
రంగై మించెను నాథుఁ డేమిటికిఁగా రాడంచు చింతింప కీ
సాంగత్యం బొనరింతు నంచు చెలి యుత్సాహంబు సంధిల్లగన్.

43


సీ.

కొనగోర మొగలిరేకునఁ గమ్మకస్తూరి
                 వలపువక్కణచీటి వ్రాయవమ్మ!
మచ్చికతో జేరి మాటలాడెదనైనఁ
                 బలుకుదోడుగ చిల్కఁ బంపవమ్మ!
అతఁడు నీవును రహస్యంబున గుఱుతుగా
                 బలికిన బలుకులు దెలుపవమ్మ!
తనుఁ జూచి నటువలె తరుణిఁ జూడ మటంచు
                 నిచ్చిన యుంగర మియ్యవమ్మ!

గీ.

రాజగోపాలుఁ డన్నింట రసికుఁడౌను
నయిన దెలిపెద నానేర్పు నతిశయిల్ల
నతని చిత్తంబు నీభాగ్య మైక్య మంద
మందగజయాన! నమ్ము ముమ్మాటి కిపుడు.

44


క.

అనవుఁడు నెచ్చెలిఁ గనుగొని
వనితామణి చిలుకతోడు వలయునె? నీవే
చనినం గార్యంబగు నన
ననిపించుక జనియెఁ జెలియు నల హరికడకున్.

45


గీ.

కోటిమన్మథలావణ్యకోటియైన
వల్లవీజారుముందర వచ్చి నిలిచి
మందమందాక్షరంబుగ మందగమన
పలికెఁ బలుకులఁ గపురంపుఁబలుకు లొలుక.

46


మ.

తరుణీరత్నము నీదురాకలకు సౌధద్వారభాగంబునం
జరియింపన్ మణిహంసకారవము సాజాత్యంబునం గేళికా
సరసీజాకరతీరచారులగు నంచల్ వెంబడించంగ నీ
ర్భరసంతాపము జెందకుండ ననుకంపన్ నీవు గావందగున్.

47


చ.

అరవిరులన్నఁ జూచుటకునైనను సమ్మతి సేయనట్టి యా
సరసిజనేత్ర బంగరువుచప్పరమంచము చంచలాక్షులన్
సరిగ నలంకరించుఁడని సారెకుసారెకు నెచ్చరించి పూ
సరముల నిచ్చు నీవు రభసంబున నింటికి వచ్చు వేడుకన్.

48


గీ.

ఎదురుచూచుచు నీరాక కిందువదన
కమ్మకస్తూరిచే తిలకంబు దీర్చె

భావిమన్మథసంగరప్రౌఢవిజయ
కారియైనట్టి యల చిక్కటారి యనఁగ.

49


చ.

చెలువుఁడ! నీదు భావరసచిత్రము నేర్పులు మీఱ వ్రాసి యా
కెలకుఁన వింతవింతగ లిఖించిన యాత్మవిలాసభావమున్
జెలులు కనుంగొనంగ నునుసిగ్గున నవ్వుచు తేటచెక్కులం
దలమికొనంగ నున్న చెలియందము లేమని విన్నవించెదన్.

50


సీ.

కనకపాత్రికలఁ బంకజరాగదీపిగా
                 కలికల నారాత్రికల నమర్చి
మణులసంబెళలతో మగరాలబాగాల
                 బరణులు తగ నడపంబు గట్టి
మలయంపువలిగాడ్పు మొలకలు చిగిరించ
                 నలరు వీజనములు నలవరించి
ఘనసారమృగమదగంధసారమ్ముల
                 ఘమ్మనం గలపంబుఁ గలయఁగూర్చి


గీ.

మలయు రతనంపు కీలుబొమ్మలను గూడి
పడఁతి నడయాడు మాకు నేర్పఱుపఁదరమె?
యింతి యిది బొమ్మ లివి యంచు నెఱిఁగి వేడ్క
సేవ సేయించికొన జాణ వీవె జగతి.

51


చ.

సొలపుల నీదు రాకలనుఁ జూచు మృగేక్షణ వాలుచూపులం
గలువలతోరణంబులనుఁ గట్టినకైవడి సౌధమార్గమున్
జెలగుచునుండ మున్నె కయిసేయుట గాఁగ బ్రసాధికామణుల్
పలుకఁగఁ జూచి నవ్వు మణిపంజరకీరములెల్ల గేరుచున్.

52

చ.

కెలఁకున జిత్రమందును లిఖించిన నీప్రతిబింబ మందమై
నెలకొని నిల్వుటద్ద మొకనెచ్చెలి దేరఁగఁజూచి దవ్వునం
జెలువుఁడు వచ్చెనంచుఁ గయిసేయుచునుండి విభూషణావళుల్
నెలవులు దప్పఁబూను రమణీమణి తత్తర మేమి చెప్పఁగన్.

53


చ.

తలిరులు వాతెఱన్ విరులదండలు చూపుల నాణిముత్తెముల్
పలువరుసన్ సరోజములు పాదయుగంబున మించుటద్దముల్
తళుకుమెఱుంగుఁ జెక్కులనుఁ దా సవరింపుచు నీదురాకకై
కలికి ప్రసాధికామణుల కన్న నలంకృతిఁ గూర్చె మేడకున్.

54


సీ.

మొగము సోయగముచేఁ బగటువో మీటిన
                 యలనాఁటి పగదీర్తు ననియె విధుఁడు
కులుకుఁబల్కులచేత నలుక పుట్టించిన
                 యలనాఁటి పగదీర్తు ననియెఁ జిల్క
ముద్దునెన్నెడలచే గద్దించి కదిమిన
                 యలనాఁటి పగదీర్తు ననియె నంచ
నెఱిగొప్పుకప్పుచే నెఱదప్ప దరమిన
                 యలనాఁటి పగదీర్తు ననియెఁ దేఁటి


గీ.

ఏల యొకమాట మాటఁగ నించువిలుతుఁ
డెపుడు సెలవనునని మది నెంచియున్న
యతని బలగంబునెల్ల నిట్టట్టు సేసి
రామ నేలర యేలరా రాజసములు.

55


గీ.

అనుచుఁ బలికెడు దూతితో ననియె విభుఁడు
సారసారెకు నిట్టులో సారసాక్షి!
ఇంత దెలుపంగ వలయునే! యింతికొఱకు
నిపుడె వచ్చెదఁ జనుమని యెసక మెసఁగ.

56

సీ.

వీరినిగ్గు వెలిఁజిమ్ము వింతయోర రుమాలు
                 మీఁద ముత్తెపుతురా యించుమించ
మెఱుఁగుఁజామనచాయమేనిపై నెత్తావు
                 లడరఁ గుంకుమగంద వొడియలంది
జూరికట్టినయట్టి సరిగె దుప్పటికొంగు
                 వామాంసమున వల్లెవాటు వైచి
పైగోవకెంపురాపలకచెక్కడముల
                 వెలహెచ్చుకడియమ్ము లలవరించి


గీ.

వజ్రమాణిక్యమయబహువలయరుచులు
రహి వహింపంగ తారహారములు పూని
మురువుచెవిచెంత నొకవింతమురుపు చూప
మేఘవర్ణుండు చెలియున్నమేడ చేరి.

57


శా.

లీలామందిరశిల్పకల్పకలనాళీలోక మాలోకన
శ్రీలాలిత్యము మీఱ సత్వరముగాఁ జెంతం జరింపన్ సరః
కేళీహంసము లాత్మనూపురరవాకృష్ణంబులై క్రుమ్మరన్
నాళీకేక్షణవిభ్రమోచితవిధానైపథ్యముల్ మీఱఁగన్.

58


క.

తనరాక కెదురుచూచుచు
కనుఁగవ దరహాసచంద్రికలం బైఁజిలుకన్
గనుఁగొని యప్పుడు హరియును
మనసిజసంచాల్యమానమానసుఁ డగుచున్.

59


గీ.

చకితసారంగలోచనసరస కరిగి
వెలయ భవనాత్మశృంగారవిభవములను
మేలుమేలునఁ దనమీఁది మేలుఁ దెలుపు
నిందుబింబాస్యతోడఁ దా నిట్టు లనియె.

60

మ.

కలకంఠీ! యపరంజిమేడకు నలంకారంబుఁ గావించు నె
చ్చెలులన్ సారెకు దూర నేమిటికి? నా చెంతన్ దరాపాంగముల్
సొలయన్ నీ వొకమారు చూడ నవియే సొంపుల్ పిసాళింపఁగా
నలర న్మొత్తములై దుకూలలతలై హారంబులై మించవే.

61


శా.

సింగారించుట మామకాగమశుభశ్రీసిద్ధికై కాక యా
బంగారంపుమెఱుంగుదీవెలకుఁ బైపై మించుల న్నించు నీ
యంగం బంగజురాణి రత్నములబొమ్మా! కొమ్మ! నీచంచలా
పాంగంబుల్ పచరించ సేసలిడె సుప్పాణుల్ మణుల్ చిందఁగన్.

62


క.

అంగన! కై సేయుచు భవ
నాంగణమున నున్న వనుచు నప్పుడె వింటిన్
బంగారువంటి మేనికి
సింగారము వేఱె కలదె? శీతాంశుముఖీ!

63


చ.

అని సరసోక్తు లాడి దరహాసము కన్గొనలంది గూర్పఁగా
మనసిజరాగమగ్ననిజమానసుఁడై నెలరాల సంతనన్
మినుకుల నీను బంగరువుమేడకడన్ బువుచప్పరంబులో
ననుపమరత్నవేదిపయి నంగన నుంచి మనోహరంబుగన్.

64


శా.

లోలాక్షీ! విను నీకటాక్షసరసాలోకంబు లోకంబునన్
గాళిందీసవిలాసవైఖరుల జోకల్ మించె నావల్లభుం
డాలీలావతినాథుఁ డన్యసతిఁ దానాత్మం బ్రశంసించినన్
దా లోనల్గిన నల్గ నేఁటికని దా నల్గెన్ విభుం డత్తరిన్.

65


గీ.

ఇటు లమాటలవెంబడి నేకశయ్య
విరహతాపంబు మిగుల నుద్వేలమైన

మదనజనకుండు నప్పు డమ్మదవతియును
తలఁచి రీరీతి తమతమతలఁపులందు.

66


ఉ.

చీటికిమాటి కల్గి తమచెంతలనున్న సఖీజనంబు నా
నాఁటికి ప్రేమబంధముల నర్మములం గొన వైచి నేర్పునం
గూటమి సంఘటింప జత గూడిన వారలఁ గేరి నెమ్మదిన్
నాఁటిననాటి నెమ్మి నెఱనమ్మిన పట్టున నింతపుట్టునే?

67


మ.

వలగోఁబన్నినఁ బూవుచప్పరముక్రేవన్ మించు నెత్తావికిం
గలయం గ్రుమ్మరు గండుతుమ్మెదలు రాకల్ గాంచి యామన్మథుం
డలుకల్ మానఁగఁ జేయుదూత్యమువిధంబై తోప సంతాపముల్
చెలఁగన్ మున్నుగ గుట్టువీడుటకునై చింతింతు రన్యోన్యమున్.

68


చ.

సరసత మీఱఁగా విరులశయ్యను నెయ్యముతోడ నున్నవా
రిరువురు నంచు జిత్తమున నెంచు సఖీమణు లిప్పు డక్కటా!
విరహనితాంతవేదనల వేఁగుట నించుక యేనెఱుంగ రె
వ్వరు మరుపెట్టిసేయు విధివంచనలం దొలఁగింప నేర్తురే?

69


మ.

వలిదిచ్చోనిఁక మాకు నెచ్చెలులు సేవల్ సేయ నీజాళువా
తళుకుంబొమ్మలె చాలునంచు మది మోదంబంది యేమున్న నీ
కలకల్ పుట్టినయట్టి పట్ల మరి యౌగాదంచు బోధించఁగా
వలఁతుల్ గావని యెన్నవైతి మివి యెవ్వా రింక వారింతురో!

70


గీ.

కలికి చిలుకలఁ జదివించి గారవించి
ప్రోడలనుఁ జేసి దూత్యంబు జాడఁ దెలిపి
యున్న బట్టున నూరకయుండె వింటి
పక్షపాతు లటంచును బల్కఁదగునె?

71

మ.

తలిరుంబాన్పులు పండువెన్నెలలు నెత్తంబుల్ లతాగేహముల్
చలిగాడ్పుల్ హరియించు తాపమని యెంచన్ వీటిచే మించె ను
జ్జ్వలసంతాపభరంబు లేమనుచు చర్చల్ సేయఁగావచ్పు దు
ర్లలితుండై వలరాచవేల్పు ప్రతికూలత్వంబు వాటింపఁగన్.

72


చ.

అలుకలు పుట్టె నేమిటికి నక్కట! యక్కటికంబు మీఱఁగా
పలుకకయుండ నేల యని పల్కగజూతురు చూచి యంతలో
నెలకొను మానగౌరవము నిల్పఁగ నిల్తురు నిల్చి యాత్మలో
గలఁగుదు రింతెకాక పలుకం గమకించరు మంచి యెవ్వరున్.

73


చ.

మలయసమీరసంగతిని మైగల తావులు గూడి పైపయిన్
మలయుచునుండ కూటమి దమిం దలపోయుచునుండి తోడనే
తొలఁగిన మేనికాఁకలనుఁ దూలుట సోలుట దక్క నక్కటా
జలమునుఁ బూన రింతయుఁ ప్రసన్నత కోపభరమ్ము లెట్టికో?

74


చ.

తలఁచినయట్టు లెల్లను ముదంబున ముద్దులు గుల్కు పల్కులన్
బలుమరఁ బల్కి పల్కి రసభావముచే నరమోడ్పుకన్నులం
గలరవదంపతుల్ మెలగఁగా మరి కన్నులఁ జూచు చెట్టు లీ
తెలియని మూఁగయల్క కడతేఱుట లెన్నటికింక దైవమా!

75


ఉ.

పాలును నీరు నేర్పఱచి పాలు గ్రహించిన యంచలట్లనే
మేలునుఁ గీడు నేర్పఱచి మేలు గ్రహింపుచు వేడ్కనుండి యే
వేళల నల్గునట్టి యవివేకుల నవ్వుదు మట్టిపట్ల నా
వాలినప్రేమ డిందఁ బగవారలఁ గూడెను దైవ మక్కటా!

76

చ.

మొలిచిన మోహభారమున ముందర నంత బ్రియానులాపముల్
బలికినయట్టులైన తమభావముల న్నెలకొన్న గూర్మిచేఁ
దొలుతటియల్కలన్ మఱచి తోడనె వారు రసాతిరేకతం
జెలఁగిరి మాధవుం డపుడు చిత్తమునన్ ననలొత్త వేడుకన్.

77


గీ.

నేర్పుమాటల మచ్చిక లేర్పరించి
చూపు వెంబడి వలపులసోన గురియ
చికిలి క్రొవ్వాడి కొనగోరు చిఱుత సోఁకు
లంది నొకకొంత గిలిగింత యంకురింప.

78


చ.

మనసిజుశాస్త్రమర్మములు మాటికిమాటికి నేర్పు మీఱఁగా
బెనఁకువలందు దెల్పుచును బింకపుజంకెన వాఁడిచూపులన్
మనములయందు సందుకొను మచ్చిక హెచ్చఁగ నిండుఁగౌఁగిటన్
వనరుహనేత్రి దేల్చె యదువల్లభుఁ డుల్లము పల్లవింపఁగన్.

79

ఆశ్వాసాంతము

మ.

అవనీయాచకహర్షదాయి వసుధారాజీవ! రాజీవస
న్నవనాహారణలక్ష్యలక్షణకళానాసత్య! నాసత్యమా
ర్గవిరోధిక్షితిపావరోధితమహాకాంతార! కాంతారణ
న్నవమంజీరనినాదమోదితమనోనాళీకనాళీకనా!

80


క.

ధారాధరలాలస దసి
ధారాదళితారి రక్తధారాళ ధరా
ధారాటనభానిర్జిత
ధారాధరధైర్యదానధారాధారా!

81

కవిరాజవిరాజితము.

ప్రతిగజవారణభీకరవారణపాటితవారణశృంగఘటా!
తతపురకారణవైరివిదారణదారణకాగణసైన్యభటా!
క్షితిహితధారణకృత్యవధారణసిద్ధసుధారణకీర్తిభటా!
చతురవిచారణసద్గుణచారణసంభ్రమచారణగాంగతటా!

82


క.

అపమానమానమానిత
తపనీయధరేంద్ర సాంద్రతరకాంతిమహా
స్తపనాభ్యాంతధ్వాంత
ద్ద్రిపుయూథా! "ముద్దుచంద్రరేఖా”నాథా!

83


గద్య.

ఇతి శ్రీమత్కాళహస్తీశ్వరకరుణాకటాక్షలబ్ధసిద్ధసారస్వతనయ
చెంగల్వ వెంకటార్యతనయ విజయరాఘవ భూపప్రసాదాసా
దితవివిధరాజచిహ్నచిహ్నితభాగధేయ కాళయనామధేయ
ప్రణీతంబైన రాజగోపాలవిలాసంబను మహాప్రబంధంబునం
ద్వితీయాశ్వాసము.

84