Jump to content

రాఘవపాండవీయము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీ రామచంద్రపరబ్రహ్మణే నమః

రాఘవపాండవీయము

ద్వితీయాశ్వాసము



పంపాసరసక్రీ
డాపండిత పెద్దవేంకటక్ష్మాపతిచి
త్తోపాసితపద ప్రత్య
గ్రూప విరూపాక్ష హేమకూటాధ్యక్షా!

1


క.

దేవాంశభవులఁ బుత్త్రుల
నీవిధమునఁ బడసి ముదితహృదయుఁ డగుచు ధా
త్రీవరుఁడు పెనుచుచుండె య
థావిధి సంస్క్రియలు మునికదంబము నడుపన్.

2

రెంటికి సమము-సులభము.

సీ.

నానాఁటి కుప్పొంగునవకంపుఁగళలపెం
            పునఁ జిన్నిక్రొన్నెలబోద లనఁగ
నుత్తరోత్తరవృద్ధి నొప్పుతేజోరేఖ
            పసఁ గోమలార్కబింబంబు లనఁగఁ
క్రొత్తక్రొత్తగఁ బొదల్కొమరునెమ్మేనుల
            బలుపుష్టిఁ గరికలభంబు లనఁగ
నంతకంతకు మించు వింతమగంటిమి
            యదుటున సింగంపుఁగొదమ లనఁగ


తే.

వెలసి రిలను ధర్మజభీమవిజయు లనఁగఁ
గ్రాలునృపసుతుల్ దమలోనఁ గవలు గూడి
మనసుమైత్రిచే రామలక్ష్మణచరితము
సనయభరతశత్రుఘ్నఖేలనము మెఱయ.

3

రామ. ధర్మజ = వింటివల్లఁ బుట్టిన, "ధర్మః పుణ్యే యమే న్యాయే స్వభావాచారయోః క్రతౌ, ఉపమాయామహింసాయాం చాపే చోపనిషద్యవి" అని వి. భీమ = భయంకరమైన విజయము గలవారు - అనఁగా, క్రాలు = ఒప్పుచున్న, నృపసుతులు, కవలు గూడి = జోడు గూడుకొని, మనసుయొక్క మైత్రిచే రామలక్ష్మణులయొక్క, చరితము = నడకయు, సనయ = నీతిసహితులైన, భరతశత్రుఘ్నులయొక్క, ఖేలనము = విహారమును, మెఱయ వెలసిరి.

భారత. ధర్మజభీమవిజయు లనఁగ = ధర్మరాజభీమార్జును లనునట్టుగా, కవలు గూడి = నకులసహదేవులను గూడి, సుమైత్రిచే, మనన్ = ఒప్పఁగా, రామ= మనోహరమై, లక్ష్మణ = లక్ష్మీవంతమునైన, చరిత్రమును, సనయభరతన్ = నయాతిశయముతోఁ గూడినవా రౌటచేత, శత్రుఘ్న = శత్రుసంహారకమైన, ఖేలనమును మెఱయ వెలసిరి.

ఉ.

అంత వసంత మొప్పెఁ జరమాగ్రిమభాగచరాఖిలర్తుసా
మంత మనంతజాలకసమంజసరంజితకుంజకుంజరో
ద్వాంతనితాంతసాంద్రమధుదానవిజృంభితబంభరస్వనా
త్యంతనిరంతరీకృతదిగంత మతాంతలతాంతకుంత మై.

4

రెంటికి సమముగా వసంతవర్ణనము. చరమాగ్రిమభాగ = పశ్చాత్పూర్వభాగములయందు, చర = వర్తింపుచున్న, అఖిలర్తువులును, సామంతము = సరిదొరలుగాఁ గలిగినది, సకలఋతుసౌభాగ్యము గల దనుట. ఆనంత = అసంఖ్యములైన, జాలక = మొగ్గలచేత, "క్షారకో జాలకం క్లీబే” అని అ. సమంజస = యుక్తమౌనట్టుగా, “దృశ్యరూపం సమంజసం, యుక్తమౌపయికం లభ్య" మ్మని అ. రంజిత = ఒప్పిన, కుంజ = పొద లనెడి, కుంజర = ఏనుఁగులవల్లనుండి, ఉద్వాంత = వెడలి వచ్చుచున్న, నితాంతసాంద్ర = మిక్కిలి దట్టమైన, మధు = మకరంద మనెడి, "మధు మద్యే పుష్పరసే” అని అ. దాన = మదముచేత, “దానం గజమదే త్యాగే" అని యా. విజృంభిత = గర్వించిన, బంభర = తుమ్మెదలయొక్క, “బంభరశ్చ మిళిందశ్చ హిందోళభసలౌ సమా” అని యా. స్వన = ధ్వనిచేత, అత్యంతమును, నిరంతరీకృత = నిబిడముగాఁ జేయఁబడిన, దిగంతములు గలది, అతాంత = అలయిక లేని, లతాంతకుంతమై = కుసుమాయుధుఁడు గలదై, అంత వసంత మొప్పెను.

సీ.

అచ్చంపులేఁజిగురాకుజొంపము కెంపు
            మేలిచెందిరపుఁగెంధూళి గాఁగఁ
గ్రుచ్చినట్టుగ జాదుకొన్న మొగ్గలగుంపు
            ప్రకటపాటలబిందుపాళి గాఁగ

విచ్చినపరువంపువిరులతండము పెంపు
            శోభితభూతిరింఛోళి గాఁగ
నిచ్చలం బైన తేనియవానజడిసొంపు
            లాలితదానధారాళి గాఁగ


తే.

సుమపరాగముల్ కేళిపాంసువులు గాఁగ
భ్రమరపంక్తులు పైసరపణులు గాఁగ
బుడమినెల్లెడ వాహ్యాళి వెడలుమదను
మదపుటేనుఁగువోలె నామని దనర్చె.

5

భూతి = గజశృంగారముయొక్క, రింఛోళి = పంక్తి, “భూతిర్మాతంగశృంగారే” అని వి. "రింఛోళిః శ్రేణికా స్త్రియా”మ్మని యా. కడమ సులభము. మొదటినాలుగుపాదములయందు నంత్యప్రాసము నియమములు కలుగఁ జెప్పినాఁడు.

రగడ.

పొలిచె మధులక్ష్మి సురపొన్నలను జొన్నలను
            దెలివిపడి పుప్పొడులతిన్నెలను జిన్నెలను
రంగుగఁ దనర్చునారంగములసంగములఁ
            బింగళత చెందె మదభృంగముల యంగములఁ
గొఱలెఁ జిగు రెలమావిగున్నలను జిన్నలను
            బఱిచె మరుఁ డురుల ముదిపన్నలను బిన్నలను
లలిఁ జిక్కెఁ గరువలిబలంగముఁ లవంగముల
            లులిత మై లవలీకుడుంగముల లుంగముల
వెలయుకురువిందపూవిరువులును మురువులును
            దెలిపె మదనునకుఁ బనితెరువులును హరువులును
బెరయుచుఁ బలాశతరుబృందముల నందముల
            విరిమొగ్గ లమరెఁ గురువిందముల చందముల
నెన్నికగ వాసించె నిరువులును బొరువులును
            జిన్ని చెందొవలచేఁ జెరువులును దొరువులును
వీలకొఱ పమరె నరవిందములఁ గుందముల
            లీల దళుకొత్తగ మిళిందముల డెందముల
మెదలె మలయాచలసమీరములు సారములు
            కొదవి రహి కయ్యె నతిఘోరములు క్రూరములు

జడిగొనుమధూళికాసారములపూరముల
            వడి దనరె నవసింధువారముల యీరముల
వదరెఁ గడుఁ క్రొవ్వి పికవారములుఁ గీరములు
            గదిరె వళులందు ఝంకారములు బీరములు
గలఁగి పాంథులు కర్ణికారముల వేరములఁ
            దొలఁగి రిల ఘంటలకు దూరముల దూరములఁ
బొదలె సంపెగలందుఁ బూవులును దావులును
            గుదిగొన, దనర్చెఁ గడుఁగ్రోవులును మోవులును
సారెకడ తాఁకుసంచారికల చేరికల
            జారులు చరించి రభిసారికల కోరికల
నిగురుబోం డ్లెన్నరై రీవులును గీవులును
            దిగజాఱ విడిచి రటు ఠీవులును వావులును
దదనంగతంత్రావతారికల కారికల
            చదు వంటెఁ గేలివనశారికలఁ గీరికల
మితి లేక పరఁగె రతిమెలపులును వలపులును
            నతివ లెంతయు మఱచి రలపులును సొలపులును
బోణిమిగ వకులకుజపూగములఁ బూగముల
            రాణ దనరారెను బరాగముల రాగములఁ
బరఁగె మధుమదనులకు బలుపులును గెలుపులును
            బెరిఁగె యువయువతులకుఁ బిలుపులును బొలుపులును
రంజిలిరి గాణ లనురాగముల రాగములఁ
            బుంజితశ్రీఁ దనరు భోగములఁ జాగముల
నలముకొని పెంటిచెరలాటములు గూటములుఁ
            జలిపె నహిపక్షిమృగఝాటములుఁ గీటములు
సొరిది మధువృష్టి వంజులకములఁ దిలకములఁ
            గురిసెఁ జెదరుచుఁ దేంట్లకులకముల జలకములఁ
గయికొనియె ననువుపసగాటములు వాటములు
            నయి తరులతల పెనుఁగు లాటములు నోటములు
బొరసె విరహిణుల కురుపులకములఁ దిలకములఁ
            బరుసఁధనము కపోలఫలకముల నలకముల

సరిగె నానాలతాజాలములు సాలములు
            జరదళుల నయ్యె వాచాలములు నీలములు
దళు కెసఁగఁ బల్లవవితానములు సూనములఁ
            బులియుఁ బికమధుపములు బోనములఁ బానములఁ
జవి గొనిరి గురువలు పిసాళములు మేళములు
            మివులఁ దపసికి నించె మేళములుఁ దాళములు
దగ మసలుభసలసంతానముల గానముల
            మగువ లెగఁజోఁపి రభిమానముల మానముల
వడిఁ ద్రిప్పి మరుఁడు జయవంతములు కుంతములు
            సడలించె మునిజనస్వాంతములు శాంతములు
మందిరారామవనమాలికల డోలికలఁ
            బందెములు జరిగెఁ గులపాలికల కేలికల
సతతమును గందపువసంతములుఁ బంతములు
            వ్రతులకును నయ్యె రసవంతములుఁ కాంతములు
మరిగి యెపుడును గంఠమాలికల పోలికలఁ
            బరఁగ మగ లిడి రంకపాలికల బాలికల.

6

రెంటికి సరి వర్ణనము. పోణిమి యని ణకారముగాఁ జెప్పవచ్చు నందులకు, ఆ. 'తీవ తీఁగ యనుచుఁ దివిరి పల్కఁగఁ దగుఁ, బగడ మనఁగ నొప్పుఁ బవడ మనఁగ, భోగిశయన పరఁగుఁ బోణిమి పోడిమి, వేగ వేవ నాఁగ వెలయుఁ గృష్ణా' యని యనంతునిఛందమందు, ద్వి. 'రాణివాసద్రోహి రావణుఁ బట్టి, పోణిమిఁ జెఱుపవా బుధులు నుతింప' యని రామాయణద్విపద.

మ.

త్రిజగన్మోహనతన్ వసంతఋతు వీరీతిం బ్రకాశింపఁ గా
యజమానత్వరసప్రకర్షమహిమవ్యాప్తిన్ విజృంభించె ది
వ్యజనుల్ మెచ్చనితాంతసంయమిత విశ్వామిత్రమౌనీశబు
ద్ధి జయప్రౌఢిని మించు టెంతయు ధరిత్రిం దేటతెల్లంబుగన్.

7

భారత. త్రిజగన్మోహనతన్ = మూఁడులోకములవారికి రమ్య మౌటచేత, వసంతఋతువు, ఈరీతిన్ = పూర్వము వర్ణించినప్రకారమున, ప్రకాశింప, కాయజమానత్వర = మన్మథునియొక్క యహంకారవేగము, సప్రకర్షమహిమవ్యాప్తిన్ = అధికప్రభావయోగముచేత, దివ్యజను ల్మెచ్చ, నితాంతసంయమితవిశ్వామిత్రమౌ = మిక్కిలి శిక్షింపఁబడిన సకలాంతశ్శత్రువులు గలదైన, ఈశుబుద్ధిన్ = పాండురాజుబుద్ధిని, జయప్రౌఢిన్ = జయప్రౌఢిచేత, మించుట = చలింపఁజేయుట, ధరిత్రిం దేటతెల్లంబుగ విజృంభించెను. క్రియ.

రామ. యజమానత్వ = సోమయాజిభావమందుఁ గల, రసప్రకర్షమహిమవ్యాప్తిన్ = రాగాతిశయమహిమయొక్క వ్యాప్తిచేత, నితాంతసంయమితన్ = మంచియతిత్వముచేత, విశ్వామిత్రమౌనీశబుద్ధి - కర్తృపదము, జయప్రౌఢిని మించుట = సర్వోత్కర్షమున నొప్పుట, తపోవ్యయము చేయకయ రాక్షసుల సంహరించి యజ్ఞము సేయ యత్నము చేయుట యని ఫలితార్థము. తేటతెల్లంబుగ, విజృంభించెను. క్రియ.

వ.

అప్పుడు.

8


మ.

అనయము మ్రోల నేకతమహార్దగతిం దనచిన్ని రామచం
ద్రునినగుమోముదామరసిరుల్ గనుపండువుగాఁ జెలంగఁ గాం
క్ష నరయుపాండురాజితయశస్కుఁడు రాజవరుం డవారితా
తనువిభవాధిరాజ్యసముదగ్రమనోధృతి యై ప్రవర్తిలన్.

9

రామ. ఏకతమ = మిక్కిలి ముఖ్యమైన, హార్దగతిన్ = స్నేహవర్తనచేత, చిన్ని = ముద్దు వచ్చుచున్న, రామచంద్రునియొక్క నగుమోముతామరసిరులు, చెలంగఁ గాంక్ష నరయు, పాండు = శుభ్రమైన, రాజిత = మనోహరమైన, యశస్కుఁడు = కీర్తిగలవాఁడు - దశరథుఁడు, అవారిత = నివారింపఁబడని, అతనువిభవ = అనల్పవిభవముగల, అధిరాజ్య = సామ్రాజ్యముచేత, సముదగ్ర = ఉన్నతమైన, మనోధృతియై = మనస్సంతోషము గలవాఁడై, “ధృతిర్యోగాంతరే ధైర్యే ధారణాధ్వరతుష్టిషు" అని వి. ప్రవర్తిలఁగా, చేరెనని ముందటిపద్యమునఁ గ్రియ.

భారత. అనయము = మిక్కిలియు, మ్రోలన్ = సమీపమున, ఏకతమ = ఏకాంతమున, తనచిన్నిరామ = తనచిన్నపెండ్లామైన మాద్రియొక్క, చంద్రుని నగుమోముదామరసిరుల్ = చంద్రుని నవ్వెడుముఖపద్మకాంతులు, కనుపండువుగాఁ జెలంగ, పాండురాజు, ఇత = పొందఁబడిన, యశస్కుఁడు = కీర్తిగలవాఁడు, అతనువిభవమున = మన్మథవిభవముచేత నైన, అధి = మనోవ్యధయొక్క, రాణి = శ్రేణిచేత, అసముదగ్ర = అల్పమైన, మనోధృతియై = మనోధైర్యము గలవాఁడై, ప్రవర్తిలఁగా, ఆయమ చేరెనని ముందరిపద్యములోఁ గ్రియ.

క.

ఆయమనియమైకనిధి మ
హాయతధైర్యమహిమగని యసురక్షయమ
త్యాయత్తతఁ దాఁ జేయక
యాయతనుక్రియకుఁ జేరె నతనినియతిచేన్.

10

భారత. ఆయమ = మాద్రి, మహాయతధైర్యమహి = అధికధైర్యస్థాన మైనది, మగని = పాండురాజుయొక్క, అసురక్ష = ప్రాణరక్షను, అమత్యాయత్తతన్ = అబుద్ధివశమున, తాఁ జేయక, ఆయతనుక్రియకున్ = ఆమన్మథక్రీడకు, అతనినియతిచేన్ = ఆపాండురాజు దురదృష్టముచేత, చేరెను.

రామ. ఆయమనియమైకనిధి = యమనియమములకు ముఖ్యస్థానమైన యావిశ్వామిత్రుఁడు, “శరీరసాధనాపేక్షం నిత్యం యత్కర్మ తద్యమః, నియమస్తు స యత్కర్మ నిత్యమాగంతుసాధన” మ్మని అ. మహాయతధైర్య, మహిమ = మహిమను, కని = ఎంచి, మఱియొక యర్థము. మహిమకు, గని = ఆకరమైనవాఁడు, అసురక్షయము = రాక్షసనాశమును, అత్యాయత్తత = ఆసక్తిచేత, అతనుక్రియకు=అధికోద్యోగమునకు, అతనినియతిచే = ఆదశరథునిభాగ్యమున, చేరెను = వచ్చెను.

చ.

మనుజవరుండు నప్డు నడుమన్ ఘటియిల్లెడు విఘ్నవాక్ప్రవ
ర్తనలు గురుప్రయత్నవిహతంబులు సేయుచు రామ యేక్రియన్
నిను విడ నేర్తు నంచుఁ గడు నెమ్మిఁ గవుంగిటఁ జేర్చి యంతటం
దనయసువాంఛ ఉంచి తగఁ దన్పెఁ దదర్థిఁ గృతార్థుఁ గామునిన్.

11

రామ. మనుజవరుండు = దశరథుఁడు, విఘ్నవాక్ప్రవర్తనలు = అంపలేననుమాటలను, గురుప్రయత్న = వసిష్ఠునినిర్బంధముచేత, విహతంబులు సేయుచున్ = మాన్చినవాఁడై, తనయసువాంఛన్ = అధికపుత్రవాత్సల్యమును, డించి, తత్ = ఆరాముని, ఆర్థిన్ = తోడుకపో నిశ్చయించినవాని, మునిని గృతార్థుగాఁ దన్పెను.

భారత. మనుజవరుండు = పాండురాజు, నడుమన్ ఘటియిల్లెడు, విఘ్నవాక్ప్రవర్తనలు = మాద్రిప్రతికూలోక్తులను, గురుప్రయత్నవిహతంబులు సేయుచున్ = అధికప్రయత్నముచేత మాన్పుచు, రామ = మాద్రికి సంబుద్ధి. తనయొక్క, అసువాంఛను డించి, తత్ = ఆప్రాణములను, అర్థిన్ = హరియింప నిశ్చయించినవాని, కృత = చేయఁబడిన, అర్థున్ = ప్రయోజనము గలవాని, సంఘటనకర్త యనుట, తన్ఫెను, మాద్రిమాటలు వినక సంభోగించె ననుట.

తే.

స్వవిధివిఘ్ననిరాసంబు సలుప నతఁడు
రామసాంగత్య మర్థించెఁ బ్రమదగరిమఁ
బెనుచు తదనుయాత్రకు నంతఁ దనువు వొంగఁ
బ్రస్ఫుటం బైనయుత్సాహభరముఁ బూనె.

12

భారత. స్వవిధి = తనవిధి, విఘ్ననిరాసంబు సలుపన్ = విఘ్నము లేకుండఁ జేయఁగా, స్త్రీయొక్క, సాంగత్యమును, అర్థించెను = క్రీడించె ననుట, అంతన్ = అటుతర్వాత, ప్రమద = మాద్రి, గరిమఁబెనుచు = గౌరవహేతువైన, తదనుయాత్రకున్ = తదనుగమనమునకు, ఉత్సాహభరమును బూనెను.

రామ. స్వవిధివిఘ్ననిరాసంబు = స్వానుష్ఠానవిఘ్నరాహిత్యమును, చలుప, అతఁడు = విశ్వామిత్రుఁడు, రామసాంగత్య మర్ధించెన్ = రాముని నంపుమనెను, అంత = దశరథుఁ డంపెదనన్నతర్వాత, ప్రమదగరిమఁ బెనుచు = సంతోషాతిశయమును గూర్చుచున్న, తత్ = ఆరఘునాథునియొక్క, అనుయాత్రకున్ = వెంటవచ్చుటకు, ప్రస్ఫుటం బైనయుత్సాహభరముం బూనెను = త్వరపడె ననుట.

స్రగ్ధర.

తలఁ పి ట్లుత్సాహ మొందం దనయజనపరిత్రాణ మర్థించి యక్కం
దళితాపత్యానురక్తిన్ మహిపుననుగతిం దాను రాఁ బూనకుండన్
వలనొప్పన్ మాన్చి స్వస్థానమునకుఁ జనియెన్ రామునాత్మేశుఁ బ్రేమా
త్యలఘుశ్రేయస్సుమిత్రానవరతనయయోగాఢ్యుఁ దోడ్కొంచు వేడ్కన్.

13

రామ. తన, యజనపరిత్రాణము = యజ్ఞసంరక్షణమును, అర్థించి, అక్కందళితాపత్యానురక్తిన్ = ఆచిగిర్చినపుత్త్రానురాగము కలవాని, మహిపున్ = దశరథుని, మాన్చి = తిరుగనంపి, ప్రేమచేత, అత్యలఘు = అతిశయమౌనట్టుగా, శ్రేయః = శ్రేష్ఠుఁడైన, "శ్రేయాన్ శ్రేష్ఠః పుష్కలశ్చ” అని అ. సుమిత్రా = సుమిత్రయొక్క, అనవరతనయ = అవరతనయుఁడు గానిజ్యేష్ఠుఁడైన లక్ష్మణునియొక్క, “యవీయో వరజానుజా” అని అ. యోగాఢ్యున్ = కూటమి గలవాని, ఆత్మేశున్ = పరబ్రహ్మస్వరూపమైనవాని, రామునిఁ దోడ్కొంచు, స్వ = తనయొక్క, స్థానమునకు = ఆశ్రమమునకు, చనియెను, కందళితాపత్యానురక్తి న్మహిపు ననుదిక్కున, బిందువునకు నకారము యతి చెల్లినందుకు, తే. ‘టతపవర్గాక్షరములకు దాపలించి, యొనర నూఁదినబిందువు లుండెనేని, వరుస ణనములు వళు లగు వానికెల్ల, నవనిఁ గొందఱు సుకవులయనుమతమున' నని కావ్యాలంకారచూడామణి, 'కందళచూత్కారపరంపరల్ పయిపయిన్ మధ్యాహ్నముం దెల్పెడి' నని మనుచరిత్రములోని ప్రయోగము.

భారత. తనయజనపరిత్రాణము = పుత్త్రజనరక్షణమును, అర్థించి, దళిత = పోఁగొట్టబడిన, అపత్య = పుత్త్రులయందుఁ గల, అనురక్తిన్ = వాత్సల్యము గలదాని, అక్కన్ = కుంతిని, అక్కందళిత యనుదిక్కున, క. 'నాంతము లైనపదంబుల, పొంతంబై నున్నశబ్దముల కచటతపల్, దొంతిగజడదబ లగు న, య్యంత నకారంబు సున్న లభినవదండీ' యనులక్షణమున నకారపుఁబొల్లు సున్నైనది. ఏయక్షరమున్నఁ గాన సున్న నిలువఁజెప్పవచ్చునందుకు, లయగ్రాహి. 'కమ్మని లతాంతములకు మ్మొనసివచ్చు మధుపమ్ములసుగీతనినదముల” అని యాదిపర్వమునందు నన్నయభట్టుప్రయోగము. మహిపుననుగతిన్ = రాజువెంటను, మాన్చి, ప్రేమ = ప్రియముచేత, అత్యలఘు = మిక్కిలి నధికమైన, శ్రేయః = పుణ్యమునకు, "స్యాద్ధర్మ మస్త్రియాం పుణ్యశ్రేయసీసుకృత” మని అ. సుమిత్ర = లెస్సచెలికాఁడైన, అనఁగాఁ బుణ్యముతోఁ గూడినవాఁ డనుట, అనవరత = ఎడతెగని, నయ = నీతిగల, యోగ = ఆత్మయోగముచేత, ఆఢ్యున్ =సంపన్నుఁ డైనవాని, రామున్ = మనోహరుని, ఆత్మేశున్ = తనపతిని, తోడ్కొంచు, స్వస్థానమునకున్ = స్వర్గస్థానమునకు, చనియెను.

తే.

అట్లు తండ్రిచేత విసృష్టులైనయట్టి
రాకుమారులు సహజననీకయాత్రఁ
బూని సంయమీశ్వరనీయమాను లగుచుఁ
జనిరి నిజపురమునకు విషాద మొదవ.

14

భారత. అట్లు, తండ్రిచేతన్ = పాండురాజుచేత, విసృష్టులైనయట్టి = విడువఁబడినట్టి, తండ్రి చచ్చినవా రనుట, రాకుమారులు = ధర్మజభీమార్జుననకులసహదేవులు, సహజననీకయాత్రన్ = తల్లియైన కుంతితోఁ గూడిన యాత్రను పూని, సంయమీశ్వరులచేత, నీయమానులగుచున్ = తోడుకొనిరాఁబడినవారై, విషాద మొదవన్ = ఖేదపడుచును, నిజపురమునకున్ = హస్తినగరమునకు, చనిరి.

రామ. తండ్రిచేత, విసృష్టులైనయట్టి = అంపఁబడినట్టి, రాకుమారులు = రామలక్ష్మణులు, సహజన్ = కులాచారయోగ్యమైన - స్వభావసిద్ధమైన దనుట, అనీకయాత్రను = యుద్ధయాత్రను, "అస్త్రియాం సమరానీకరణాః" అని అ. సంయమీశ్వర = విశ్వామిత్రునిచేత, నిజపురమునకున్ = ఆయోధ్యకు, విషాద మొదవన్ = ఖేద మగునట్లుగా, చనిరి.

సీ.

అత్తెరంగునఁ జను నప్పుడు దమవార్త
            దవుదువ్వులను విని తత్పథంబు
నందు మదప్రౌఢి మందాటకమహేభ
            హరిశతాంగసమృద్ధిఁ గరముమించు
సముదగ్రతరబలసంపద నెదురుగాఁ
            గనిజపితృజ్యేష్ఠుఁ డనుప నతని
ప్రియముగా రాముసంశ్రితధర్మగుణమైన
            యమ్ము బుధాళికి సమ్మదకర


ఆ.

మగుచుఁ బరగె నమ్మహాబలముదము భ
జించి యమరనగరిఁ జేర నంత
నక్కుమారు లరిగి రావలమానని
గాఢధృతినిమౌనికథలు వినుచు.

15

రామ. మదప్రౌఢిమన్ = గర్వోద్రేకముచేత, మహేభ = మత్తేభములయొక్కయు, హరి = సింహములయొక్కయు, శత = నూఱులసంఖ్యలైన, అంగ = శరీరములయొక్క, సమృద్ధిన్ = స్ఫూర్తిచేత, కరము మించు, సముదగ్రతరబలసంపదను = అత్యంతబలసమృద్ధి గలదాని, తాటక నెదురుగాఁ గని, జపితృజ్యేష్ఠుఁడు = మునిశ్రేష్ఠుఁడైన విశ్వామిత్రుఁడు, అనుపఁగా నతనిప్రియముగా, రాము = రామునియొక్క, సంశ్రితధర్మగుణమైన = వింటియల్లెయందు సంధింపఁబడిన దనుట. "మార్వీ జ్యా శింజినీ గుణః" అని అ. అమ్ము = బాణము, బుధాళికిన్ = దేవశ్రేణికి, సమ్మదకర మగుచు, అమ్మహాబల = తాటక, ముదము భజించి, అమరనగరిన్ = స్వర్గమును, చేరన్ = చేరునట్టుగా, పరఁగెన్ = పఱచెను. అంత, అక్కుమారులు = రామలక్ష్మణులు, మానని = అణఁగని, గాఢధృతిన్ = అధికసంతోషమున, ఆవల నరిగిరి.

భారత. మదప్రౌఢిచేత మంద మౌనట్టుగా, ఆటక = చరింపుచున్న, "అట గతౌ" ఆనుధాతువుమీఁద ఘఞ్ప్రత్యయాంతము. మహేభములయొక్కయు, హరి = గుఱ్ఱములయొక్కయు, శతాంగ = రథములయొక్కయు “శతాంగః స్యందనో రథ " అని అ. సమృద్ధిన్ = అతిశయముచేత, కరము మించు, బలసంపదన్ = చతురంగబలసంపదను, నిజపితృజ్యేష్ఠుఁడు = ధృతరాష్ట్రుఁడు, ఎదురుగా ననుప అతనిప్రియము, గారాము, సంశ్రితధర్మగుణమై, నయమ్ము = నీతియు, బుధాళికిన్ = పెద్దలకు, సమ్మదకర మగుచుఁ బరఁగె నమ్మహాబలము తము, భజించి యమరన్ = కొల్చి యొప్పఁగా, ఆవలమాన = ఇంచుకంత చలింపుచున్న, “ఆజీషదర్థే౽భివ్యాప్తౌ" అని అ. నిగాఢధృతిన్ = అధికధైర్యముచేత, అక్కుమారులు, మౌనికథలు = వెంటవచ్చెడుమునులవాక్యములను, వినుచు, అరిగిరి = హస్తిపురికిఁ బోయిరి.

సీ.

ఆరీతిఁ జని తమయానగరంబు ప్ర
            వేశించి మెలఁగ నుద్వృత్తి నడరు
నస్రపయోధుల నంబకంబుల నాఁగి
            తన్మహాశ్రమశోకదైన్యభరము
హరియించుటకుఁ దమకురువృద్దు లొసఁగెడు
            బహుళతాపసహితభాషితములు
దీవెనల్ వినయవిధేయతతోడఁ జే
            కొనుచును వెండియు నెనరుదొరలు


ఆ.

గౌరవము లొనర్పఁ గైకొంచుఁ గ్రమమునఁ
బితృవియోగచింతఁ బ్రిదిలి క్రీడ

సలిపి రెల్లప్రొద్దు సన్మానసస్థితిఁ
జాల ధార్తరాష్ట్ర లీలఁ దగిలి.

16

భారత. తమ, ఆనగరంబు = ఆహస్తినగరమును, ప్రవేశించి, అస్ర = కన్నీ ళ్లనెడి, పయోధులన్ = సముద్రములను, “అస్రమశ్రుణి శోణితే” అని అ. అంబకంబులన్ = నేత్రములయందు, “అంబకం నేత్రశరయోః" అని వి. ఆఁగి, తత్ = ఆవ్యధచేతనైన, మహాశ్రమ = అధికమైన బడలికగల, శోక = ఖేదముయొక్క, దైన్యముయొక్కయు, భరమున్ = అతిశయమును, “భరో౽తిశయభారయోః” అని వి. హరియించుటకు, తమ, కురువృద్ధులు = భీష్మాదులు, ఒసఁగెడు, బహుళతాప = ఆధికపరితాపముతోడ, సహిత = కూడిన, భాషితములను, నెనరుదొరలు = నెనరులు గలరాజులు, గౌరవములు = పూజలను, ఒనర్పఁ గైకొంచు, పితృవియోగచింతన్ = పాండురాజు పోయినవిచారమును, ప్రిదిలి = విడిచి, సన్మానసస్థితిన్ = మంచిమనోవ్యాపారముచేత, ధార్తరాష్ట్ర = దుర్యోధనాదులయొక్క, లీలఁ దగిలి క్రీడ సలిపిరి.

రామ. ఆరీతిఁ జని, తమయాన = తమయాజ్ఞ, “ఆజ్ఞప్తి యానతి యాజ్ఞ యాస”యని యాంధ్రభాషాభూషణమందుఁ దద్భవములలోఁ జెప్పినది. అస్రప = రాక్షసులైన, యోధులన్ = వీరులను, అంబకంబులన్ = బాణముల చేత, ఆఁగి = వారించి, తత్ = ఆవిశ్వామిత్రునియొక్క, మహాశ్రమ = తపోవనమందుఁగల, తమకు, ఉరువృద్ధులు = అభివృద్ధులను, ఒసఁగెడు బహుళతాపసులయొక్క, హితభాషితముల = ప్రియోక్తులయందుఁగల, దీవెనలను జేకొనుచు, వెండియున్ = మఱియు, నెనరుదొరలు = ప్రియము గూఱిన, గౌరవములను, ఒనర్పన్ = మునీశ్వరులు చేయఁగా, సత్ = సత్పురుషులయొక్క, మానస = మన స్సనెడి మానససరస్సునందుఁ గల, శ్లిష్టరూపకము. “సీతాంశువర్ణై ర్వయతి స్మ తద్గుణైః” అని నైషధప్రయోగము. స్థితిన్ = వర్తనచేత, ధార్తరాష్ట్రలీల = హంససామ్యమును "ధార్తరాష్ట్రా స్సితేతరైః” అని అ. తగిలి క్రీడ సలిపిరి.

మ.

అమితప్రౌఢిగధార్మికాగ్రియపితృవ్యాదిష్టవృత్తిన్ మహో
త్తమభక్తిన్ గ్రహియించి శాంతనవసత్త్వశ్రీచమత్కారప
క్త్రిమసౌభాగ్యధురీణతన్మహిమహర్షిస్వాంతలీలోచితో
త్తమసంక్రీడ లొనర్చి రక్కొమరు లాత్మజ్ఞాతిసఖ్యాఢ్యులై.

17

రామ. అమితప్రౌఢిని, గ = పొందినవాఁడునై, ధార్మిక = విలుకాండ్రలోపల, అగ్రియ = శ్రేష్ఠుఁడైన, "పరార్థ్యాగ్రప్రాగ్రహరప్రాగ్రాగ్ర్యాగ్రీయమగ్రియ" మని అ. పితృ = దశరథునిచేత, వ్యాదిష్ట = ఆజ్ఞాపింపఁబడిన, వృత్తి = వర్తనను, గ్రహియించి, శాంత = పరస్పరవిరోధము లేనివియు, నవ = ప్రాయపువియు నైన, సత్త్వ = సింహాదిమృగములయొక్క, శ్రీ = సమృద్ధియొక్క, సమూహముయొక్క యనుట, చమత్కార = చెల్లాటములచేత, పక్త్రిమ = పరిపక్వమైన, సౌభాగ్య = ఒప్పిదమును, ధురీణ = వహించిన, తన్మహి = ఆతపోవనభూమియందున్న, మహర్షి = మునీశ్వరులయొక్క, స్వాంత = మనస్సులయొక్క, లీలా = ఉల్లాసమునకు, ఉచిత = తగిన, ఉత్తమసంక్రీడల నొనర్చిరి, ఆత్మజ్ఞ = బ్రహ్మణ్యులతోడనైన, అతిసఖ్యాఢ్యులై.

భారత. అమిత, ప్రౌఢిగన్ = ప్రౌఢి యగునట్టుగా, ధార్మిక = ధర్మాతుఁడైన, అగ్రియపితృవ్య = పెదతండ్రి యైనధృతరాష్ట్రునిచేత, “పితృభ్రాతా పితృవ్యస్స్యా" త్తని అ. ఆదిష్ట = ఉపదిష్టమైన, వృత్తిని, శాంతనవ = భీష్మునియొక్క, సత్త్వశ్రీ = బలసంపదయొక్క, తన్మహిమ = ఆధృతరాష్ట్రునియైశ్వర్యముచేత, హర్షి = సంతోషముగల, ఆత్మజ్ఞాతి = దుర్యోధనాదులతోడ నైన, కడమ సరి.

శా.

శశ్వద్విస్ఫురితస్వబాహుబలభీష్మప్రౌఢచాపక్రియల్
విశ్వామిత్రవితానవిఘ్నభయవిశ్లేషం బొనర్పన్ జగ
ద్విశ్వాస్యస్థితిఁ జాలి యున్కి నటు లవ్వీరార్భకుల్ గాంచి ర
త్యైశ్వర్యాహమికావిశృంఖలవిహారారంభవిస్రంభముల్.

18

భారత. భీష్మునియొక్క, విశ్వ = సమస్తమైన, అమిత్ర = శత్రువులయొక్క, వితాన = సమూహముచేత నైన, అవ్వీరార్భకుల్ = కౌరవపాండవులు, ఆత్యైశ్వర్యమును, అహమికా = పరస్పరాతిశయాహంకారమును, విశృంఖలవిహారములను, ఆరంభములయందుఁ గల, విస్రంభములు = విశ్వాసములను, “సమా విస్రంభవిశ్వాసౌ” అని అ. సిద్ధఫలములైన యుద్యోగములను ననుట, కాంచిరి.

రామ. స్వబాహుబలముచేత, భీష్మ = భయంకరములైన, ప్రౌఢచాపక్రియలు, విశ్వామిత్రునియొక్క, వితాన = యజ్ఞముయొక్క, “క్రతువిస్తారయోరస్త్రీ వితానం త్రిషు తూచ్చకే" అని అ. అవ్వీరార్భకుల్ = ఆరామలక్ష్మణులు, అత్యైశ్వర్య = ఈశ్వరకృత్యము నతిక్రమించిన, "అత్యాదయః క్రాంతాద్యర్థే ద్వితీయయా” అని ద్వితీయాతత్పురుషము. ఐశ్వర్యశబ్దము "గుణవచన బ్రాహ్మణాదిభ్యః ష్యఞ్” అని కర్మధారయమందలి ష్యఞ్ప్రత్యయాంతము. అహమికా = అహంకారముచేత, విశృంఖల = అనివారితములైన, విహారారంభ = క్రీడోద్యోగములయందుఁ గల, విస్రంభములు = అసంకోచవృత్తుల ననుట, కాంచిరి.

సీ.

ఇమ్మాడ్కి నయ్యన్నదమ్ములపాపల
            వార్యఖేలల నతివ్యాప్తమైన
యాసవనక్షోణియందును సరసుల
            గరిడి నిష్టపురాణపరిచితిఁ బ్రియ

మందెడుసమయంబునం దాటకాకుమా
            రులలోలసద్భలరూఢి నెందు
మాఱుద్ది లేకొప్పుమాఱుభీమోద్ధతి
            ప్రబలంగఁ దారాసరణి మెలంగ


ఆ.

గడఁక చాలక కడుఁ గలఁగెడు తాపస
నాథహృదయవర్తనంబు దిరము
గాఁగఁ చేర్చి బాఢకలితసుయోధనా
దు లగురాజనందనులు గడంగి.

19

రామ. ఇమ్మాడ్కిని, అయ్యన్నదమ్ములు = ఆరామలక్ష్మణులు, అపాపలవ = పాపలేశరహితులైన, ఆర్య = పెద్దలయొక్క, ఖేలలన్ = విహారములచేత, అతివ్యాప్తమైన, ఆసవనక్షోణియందు = ఆయజ్ఞభూమియందు, సరసులగరిడిన్ = రసికుల వెంబడిని, ఇష్ట, పురాణపరిచితిన్ = పురాణశ్రవణమువలన, ప్రియమందెడు సమయంబున, తాటకాకుమారులు = సుబాహుమారీచులు, అలోల = చలింపని, సద్బల = మంచిసేనయొక్క, భీమ = భయంకరమైన, తారాసరణిన్ = ఆకాశమున, మెలంగఁగా, తాపసనాథ = విశ్వామిత్రునియొక్క, హృదయవర్తనంబు తేర్చి, బాఢకలిత = మిక్కిలిఁ జేయఁబడిన, సుయోధ = శూరులయొక్క, నాదులు = సింహనాదముగలవారనుట, కలితప్రారంభులైరని ముందటిపద్యములోఁ గ్రియ.

భారత. ఇమ్మాడ్కిని, అన్నదమ్ములపాపలు = కౌరవపాండవులు, అవార్య = విశృంఖలమైన, ఖేలలన్ = విహారములయందు, ఆసన్ = అపేక్షచేత, వనక్షోణియందున్ = ఉద్యానవనభూమియందును, సరసులన్ = కొలఁకులయందును, గరిడియందును, ఇష్టపురాణ = వేడుకయొక్క, పరిచితిన్ = ఎడతెగమిచేత, సమయంబునందు, ఆటకు నాకుమారుల లోలసద్బలనిరూఢిచేత, భీమోద్ధతి = భీముని యౌద్ధత్యము, ప్రబలంగ, తారు = తాము, ఆసరణిన్ = ఆరీతిని, మెలంగ, కడఁక = ధైర్యము, చాలక, తాపసనాథ = విచారయుక్తమైన, హృదయవర్తనంబు తేర్చి, బాధ = సంహరించెదమనెడి ప్రతిజ్ఞచేత, 'భృశప్రతిజ్ఞ యోర్బాఢ” మని అ. కలిత = కూడిన, సుయోధనాదులు = దుర్యోధనాదులు.

మ.

అసమామ్నాయనయాధ్వరక్షణవిభూతాపాదియై మించురా
క్షసకర్మంబునకుం దలంకక సమగ్రస్థైర్యధౌరేయమా
నసు లై డెందములోన ధర్మపటిమం దద్భీమసేనాంగద
ర్పసముద్రేకము రూపుమాపఁ గలితప్రారంభు లై రంతటన్.

20

భారత. అసమ = సరిలేని, ఆమ్నాయ = కులముయొక్క, “ఆమ్నాయ స్సంప్రదాయకః" అని అ. నయాధ్వ = నీతిమార్గముయొక్క, రక్షణమునకు, రాక్షసకర్మంబునకున్ = క్రూరకృత్యమునకు, లోను, అధర్మపటిమన్ = అధర్మపునేర్పుచేత, కడమ సులభము.

రామ. అసమమైన, ఆమ్నాయనయ = వేదవిధిగల "శ్రుతిః స్త్రీ వేద ఆమ్నాయః” అని ఆ. అధ్వరక్షణ = యజ్ఞోత్సవముయొక్క, “నిర్వ్యాపారస్థితౌ కాలవిశేషోత్సవయోః క్షణః" అని అ. రాక్షసకర్మంబునకు = రాక్షసులయత్నములకు, తలంకక, ధర్మపటిమన్ = వింటినేర్పుచేత, తత్ = ఆరాక్షసులయొక్క, భీమ = భయంకరములైన సేనలయొక్క, అంగ = అంగములైన రథకరితురగపదాతులయొక్క, దర్పసముద్రేకమును రూపుమాప డెందములోన, కలితప్రారంభు లైరి = ఉద్యోగించి రనుట.

ఉ.

తోరపుటల్క నారిపులు దొమ్మిగఁ బైపయిఁ గ్రమ్మ వారిలీ
లారణవృత్తిఁ గిట్టి కడు లావరిభీముఁడు రామభద్రుఁ డే
పారెడువేడ్కతో నెరపె నప్పుడు కాండపటుప్రహారదు
ర్వారవిధిన్ సుబాహుఁ డనువాఁ డిల సద్గతి గాంచి మించఁగన్.

21

రామ. అరిభీముఁడు = రామభద్రుఁడు, అప్పుడు, కాండ = బాణములయొక్క, సుబాహుఁ డనువాఁడు, ఇల సద్గతి గాంచి మించఁగా, కడు, లావు = బలిమిని, నెరపెనని యన్వయము.

భారత. తోరపుటల్కను, ఆరిపులు = దుర్యోధనాదులు, వారిలీలా = జలక్రీడయందగు, రణవృత్తిన్ = పోరాటముచేత, పైపయిఁ గ్రమ్మఁగాఁ గడులావరి, రామభద్రుఁడు = మంచుయదృష్టము గల, “స్వశ్రేయసం శివం భద్ర” మని అ. భీముఁడు, సుబాహుఁ డను = లెస్సభుజములు గలవాఁ డనెడి, వాఁడి = ప్రతాపము, లసద్గతి గాంచి = ప్రఖ్యాతిని గాంచి, మించఁగా, కాండ = ఉదకముయొక్క, “కాండో౽స్త్రీ దండబాణార్వవర్గావసరవారిషు” అని అ. పటుప్రహారవిధిని నెరపెనని క్రిందటి కన్వయము.

వ.

అప్పు డతండు మఱియును.

22


క.

వెసఁ దజ్జ్యేష్ఠుని నతిసా, హసుని హృదర్పితమహాశుగాశుగవేగో
ల్లసనప్రసభాచరితా, ధిసముద్రనిపాతుఁ జేసె దృఢదోశ్శక్తిన్.

23

భారత. వెసను, తజ్జ్యేష్ఠునిన్ = దుర్యోధనుని, మహాశుక్ = అధికశోక మనెడి, “మన్యుశోకౌతుశుక్ స్త్రియా" మని అ. ఆశుగ = బాణములయొక్క, ఆధిసముద్ర = చింతాసముద్రమందు, నిపాతున్ = పాటుగలవానిఁగా, చేసెను.

రామ. తజ్జ్యేష్ఠునిన్ = మారీచుని, ఆశుగాశుగ = వాయవ్యాస్త్రముయొక్క, "ఆశుగౌ వాయువిశిఖా” అని అ. ఆచరితమైన, అధిసముద్ర = సముద్రమందు, అవ్యయీభావము, నిపాతున్ = పాటుగలవానిఁగా, చేసెను.
చ.

అతఁడును నట్ల బాల్యదశయంద కడుం బిరుదైనయాబలా
ద్భుతునిదురంబరిస్ఫురణదూలఁ బ్రవర్తిలువేళఁ గ్రూరచి
త్తతఁ దనమూఁకతోఁ బొదివి తాఁ దదజయ్యతచూచుటన్ భయా
హతమతిఁ గట్టి వైచె వెస నాపగలోన నానారతంబుగన్.

24

రామ. అతఁడును = ఆమారీచుఁడును, ఆబలాద్భుతుని = రామునియొక్క, దురంబు = యుద్ధము, అరిస్ఫురణ = శత్రుసామర్థ్యము, తూలన్ = కొంచెము పడునట్టుగా, ప్రవర్తిలువేళ, తత్ = ఆరామునియొక్క, అజయ్యత = జయింప శక్యము గానివాఁ డౌటను, "క్షయ్యజయ్యౌ శక్యార్థే” అని నిపాతము. చూచుటవల్ల, లోనన్ = మనసులోన, ఆపగ = భ్రాతృవధద్వేషమును, అతఁడు, కట్టివైచెను = అణఁచెను, అని యన్వయము.

భారత. అతఁడును = దుర్యోధనుండును, అట్ల = పూర్వోక్త ప్రకారమున, బలాద్భుతున్ = భీముని, నిదురన్ = నిద్రచేత, పరిస్ఫురణ దూలఁ బ్రవర్తిలువేళ = ఏమఱియుండునప్పు డనుట, ఆపగలోనన్ = నదియందు, 'స్రవంతీనిమ్నగాపగా” అని అ. వారితంబుగ, కట్టివైచెన్ = బంధించి పడవేసెను, కడమ సులభము.

వ.

అప్పుడు.

25


క.

ఘనవిగ్రహజృంభణమున
ననయము దనకట్లు దెగఁగ నవ్వాహిని గ్రీ
డన గెలిచి వచ్చునబ్బా
లుని గని వెఱఁ గంది రాత్మలో నచటిజనుల్.

26

భారత. విగ్రహ = శరీరముయొక్క, “విగ్రహస్సమరే కాయే విస్తారప్రవిభాగయో!” అని వి. జృంభణమునన్ = నీల్గుటచేత, కట్లు దెగఁగా, అవ్వాహినిన్ = ఆనదిని, "స్రవంత్యామపి వాహినీ” అని అ. గెలిచివచ్చు = తరించివచ్చుచున్న.

రామ. విగ్రహజృంభణమునన్ = యుద్ధాతిశయముచేత, అవ్వాహిని = రాక్షససేనను, తనకు, అట్లు = ఆరీతిని, తెగఁగన్ = తెగిపోఁగా.

క.

ఆతఁడు మదిఁ జతురాత్మ
భ్రాతృసహాయతఁ గరంబు రంజిలుచుం ద
ద్జ్ఞాతులయాగస్ఫుటవిధు
లీతెఱఁగున జరుగ నిర్వహించె విజయతన్.

27

రామ. ఆతఁడు = రాముఁడు, చతుర = సమర్థుఁడైన, ఆత్మభ్రాతృ = లక్షణునియొక్క, తద్జ్ఞ = విశేషజ్ఞుఁడైనవిశ్వామిత్రునియొక్క, అతుల = సరి లేని, యాగముయొక్క, స్ఫుటవిధులను, విజయతన్ = విశిష్టజయము కలవాఁ డౌటచేత, నిర్వహించెను.

భారత. ఆతఁడు=భీముఁడు, చతుః = నలుగురైన, ఆత్మభ్రాతృ = ధర్మాదులయొక్క, తద్జ్ఞాతుల = ఆదుర్యోధనాదులయొక్క, ఆగః = అపరాధములయొక్క, “ఆగోపరాధో మంతుశ్చ” అని అ. స్ఫుటవిధులు = కనిపించుకొని చేయుటలు, “శర్పరే ఖరివా విసర్గలోపః" అని విసర్గలోపము జరుగఁగా, విజయతన్ = విజయత్వమును, నిర్వహించెను.

సీ.

అతఁడు దానవిహత యైనవసుధయంద
            మును మించుప్రఖ్యాతి ఘనసమృద్ధిఁ
దనర విశ్వామిత్ర తాపసుహృత్ప్రమో
            దస్ఫూర్తి సాధించి తద్గురుత్వ
శక్తి నంబకఘనాశనిగదాస్యాదులు
            వర్ణింప నెక్కుడై వఱలఁ గాంచెఁ
గావున నవ్వీర్యకలితుఁ డాశత్రుల
            యమ్మనాకులవృత్తి నిమ్ముకొనఁగఁ


తే.

జేసె నంత ఘనఖ్యాతి భాసిలఁ గృప
నామునిఁ బురస్కరించి నానామహాస్త్ర
గరిమ వడసి రాకుమారు లాగురునిరూఢిఁ
దిరము కొలిపెఁ దదచ్యుతతేజ మిలను.

28

భారత. అతఁడు = భీముఁడు, తాను, అవిహతయై, నవసుధయందమును = అమృతరీతిని, మించు, ప్రఖ్యాతి = కీర్తి, తనర, విశ్వామిత్రతాప = అఖిలశత్రుతాపముయొక్కయు, సుహృత్ప్రమోద = మిత్రసంతోషముయొక్కయు, స్ఫూర్తిని సాధించి, తత్ = ఆస్ఫూర్తియొక్క, గురుత్వశక్తిచేత, అఘనాశనిగన్ = దుఃఖమును విడిచిన దగునట్టుగా, ఆంబకున్ = తల్లియైన కుంతికి, దాస్యాదులు = సేవాదులను, కాంచెఁ గావున, ఆవ్వీర్యకలితుఁడు = భీముఁడు, ఆశత్రుల = దుర్యోధనాదులయొక్క, అమ్మను = గాంధారిని, ఆకులవృత్తి నిమ్ముకొనఁగఁజేసెన్ = విచారపడఁజేసెను, అంత, ఆకుమారులు = కౌరవపాండవులు, కృపనామునిన్ = కృపాచార్యుని, పురస్కరించి యస్త్రగరిమను బడసిరి, తత్ = ఆకుమారులయొక్క, అచ్యుత = జాఱని, తేజము, ఆగురుని = కృపునియొక్క, రూఢిన్ = ప్రసిద్ధిని, తిరము కొలిపెను, అని యన్వయము.

రామ. అతఁడు = రాముఁడు, దానవి = తాటక, హతయైన వసుధయంద = నొచ్చిపోయినభూమియందే, మును = మునుపు, విశ్వామిత్రతాపసు = విశ్వామిత్రునియొక్క, హృత్ = హృదయమునకు, ప్రమోదస్ఫూర్తిని సాధించి, తద్గురుత్వశక్తి = ఆయనయొక్క గురుత్వముతోఁ గూడిన సామర్థ్యముచేత, వర్ణింప నెక్కుఁడై వఱల, అంబక = బాణములైన, ఘన = మేఘములును, అశని = పిడుగులును, గదా = గుదియలును, అసి = చంద్రహాసమును, ఆదులు = మొదలుగాఁ గలవాని, వారుణాస్త్ర-ఇందాస్త్ర-యామ్యాస్త్ర-రౌద్రాస్త్రములు మొదలైనయస్త్రము లనుట, “చంద్రహాసారిష్టయః” అని అ. కాంచెన్ = పరిగ్రహించెను, కావున, అవ్వీర్యకలితుఁడు = రాముఁడు, శత్రులయము = శత్రుసంహారమును, అనాకులవృత్తిన్ = అనాయాసముననే, చేసెను, స్వతఃసిద్దమైన మహిమగలరఘునాథుఁడు విశ్వామిత్రునివల్ల నస్త్రముల నభ్యసించి శత్రుజయమును జేయుటకు హేతువుఁ జెప్పుచున్నాఁడు, తత్ = ఆ, అచ్యుత = విష్ణువుయొక్క, తేజము = అంశమయిన రాముఁడు, అంత = అంతైన, రఘునాథునికిని గురువనెడి యనుట, ఘనఖ్యాతి భాసిల, కృపన్ = తనదయవలన, ఆమునిన్ విశ్వామిత్రుని, పురస్కరించి యస్త్రగరిమనుబడసి, రాకుమారు = రాజపుత్త్రునియొక్క, లాగు = రీతిని, ఉరునిరూఢిచేతఁ దిరము కొలిపెను, తాను శిష్యుఁడై విశ్వామిత్రునికిఁ బ్రసిద్ధి గల్పించె ననుట.
వ.

అంత.

29


సీ.

సంయమిదివ్యతేజమునఁ గుంభిని జనిం
            చినయాదిలక్ష్మి నజేయుఁ డైన
విమలశీలుని రఘువీరకులోత్తంసుఁ
            దాగూర్చువాఁ డయితన్నృపాల
వరకుమారకులకు గురువై మనః ప్రీతి
            దనర నత్యాశ్చర్యజనకధామ
భీమబాణాసనస్థేమవార్తాప్రవ
            ర్తనమనుభవ్యసుధన్వినూత్న


తే.

విరచితావధానశ్రుతివీథికలను
ద్రోణులసదాదరైకధురీణుఁ డగుచుఁ
బ్రౌఢి మన్నించె మేదినీపతిసుతులును
దద్ధనుశ్శక్తిపస గాంచుతమిఁ బొదలిరి.

30

రామ. సంయమి = విశ్వామిత్రుఁడు, కుంభినిన్, భూమియందు, దివ్యతేజమున, జనించినయాదిలక్ష్మిన్ = సీతను, రఘువీరకులోత్తంసున్ = రామునిని, కూర్చువాఁడయి = వివాహము చేయించు యత్నము చేసిననాఁడై, మనఃప్రీతి, గురువై = ఆధికమై, తనర, జనక = జనకునియొక్క, ధామ = గృహమందున్న, భీమ = పరమేశ్వరునియొక్క, బాణాసన = వింటియొక్క, స్థేమ = బలిమియొక్క, స్థిరశబ్దముమీఁద నిమనచ్ప్రత్యయము. వార్తాప్రవర్తనము, అను = అనెడి, సుధ = అమృతమును, శ్రుతివీథికలను = కర్ణరంధ్రము లనెడు, ద్రోణులన్ = దొన్నెలయందు, “ద్రోణీ కాష్ఠాంబువాహినీ” అని అ. ప్రౌఢిమను, నించెన్ = నిండించెను-నిలిపె ననుట.

భారత. సంయమిదివ్యతేజమున = భరద్వాజమునివీర్యమున, కుంభిన్ = కలశమందు, జనించి, నయాదిలక్ష్మిన్ = నయాదిగుణసంపదచేత, అజేయుఁడైన విమలశీలుని, నిరఘున్ = అఘరహితుఁ డైనవాని, అత్యాశ్చర్యజనకమైన, ధామ = ప్రతాపముచేత, భీమ = భయంకరమైన, బాణానన = వింటివల్లనైన, స్థేమ = స్థైర్యగుణముయొక్క, వార్తాప్రవర్తనచేత, మను = ఒప్పుచున్న, భవ్యసుధన్వి = మంచివిలుకాఁడైనవాని - ధనుర్ధరుని ననుట. నూత్న మౌనట్టుగా విరచితమైన, అవధాన = ఎచ్చరికగల, శ్రుతివీథికలను = వేదమార్గవిచారముగలవాని, ద్రోణున్ = ద్రోణాచార్యుని, తన్నృపాలవరకుమారకులకు = కౌరవపాండవులకు, తాను, కూర్చువాఁడయి = ఆప్తుఁడై, గురువై = ఆచార్యుఁడై, తనర, మేదినీపతి = ధృతరాష్ట్రుఁడు, మన్నించెను, అని యన్వయము. సుతులును, కాంచుతమిన్ = అభ్యాసాపేక్షచేత, పొదలిరి = వర్తించిరి, కడమ సులభము.

వ.

అందు.

31


మ.

గురుసంకల్పముచొప్పు దప్ప కెలమిన్ క్షోణీజనాశ్చర్యవి
స్ఫురణం బొంద ఘనోగ్రకార్ముకవరంబున్ వంప నెంతే మహా
శరసోత్కర్షరయప్రయుక్తిఁ బొదలన్ సామర్థ్యసంపద్ధురం
ధరుఁ డారామవిభుండు జిష్ణుఁడు సముద్భాసిల్లె నత్యంతమున్.

32

భారత. జనాశ్చర్యమైన, విస్ఫురణంబు = ఖ్యాతిని, ఒందను, శర = బాణములయొక్క, రామవిభుండు = మనోజ్ఞకాంతిగలవాఁడు, జిష్ణుఁడు = అర్జునుఁడు, సముద్భాసిల్లెన్ = లెస్సగాఁ బ్రకాశించెను. క. 'సల్లలితైకపదముపై, ని ల్లుండుట యగుట యనఁగ నెల్లెడఁ జను రా, జిల్లుట ప్రభవిల్లుట శో, భిల్లుట వర్తిల్లు టనఁగఁ బెనుపై యునికి' నని యాంధ్రభాషాభూషణమందుఁ గ్రియాపదములలోఁ బ్రభవిల్లుట యని యెత్తినాఁడు గనుక నుపసర్గముతోఁ గూడఁ జెప్పినాఁడు.

రామ. గురు = విశ్వామిత్రునియొక్క, సంకల్పముచొప్పు, ఆశ్చర్యవిస్ఫురణము = వింతైనకాంతిగల, క్షోణీజను = సీతను, పొంద = వరించునట్టుగా, ఉగ్రకార్ముకవరంబున్ = రుద్రచాపమును, వంపన్ = ఎక్కుఁబెట్టుటకును, మహాశరసోత్కర్షరయప్రయుక్తిన్ = అనురాగమహిమవేగప్రేరణచేత, ఎంతేన్ = మిక్కిలి, పొదలన్, అత్య ధికమqచునుండఁ గాననుట, జిష్ణుఁడు = జయశీలుఁడు, రామbfభుండు, సముద్భాసిల్లెను = సంతసిల్లెను, సామర్థ్యసంపద్దురంధరుఁడు గనుక నీశ్వరునివిల్లు వంచి సీతను వరించెదనని మిక్కిలి తెలివి గలిగియుండె ననుట.

సీ.

అపు డేమి చెప్పన న్యాసాధ్యతద్ధను
            ర్వార్త సర్వక్షత్రవంశ్యులందు
మిగులఁ గర్ణాసహ్యముగఁ బర్వ నతఁడు త
            న్మహిమపెంపునరాతి మత్సరవిధి
నాత్మలో సరకుసేయక సభ్రమించె స
            న్మునికృప జనకునింటను వివాహ
మగుటకు మున్ను తదంబకాశ్చర్యమం
            త్రమహత్త్వకృతచండధామయుక్తి


తే.

నుదయ మందినమేటియన్యులకలఁగునె
యరయ ని ట్లర్కసంతతి ఖ్యాతిమహిమ
ధాత్రిపైఁ గుంద సూతసంతానభావ
గణనఁ బ్రబలుట తత్పోషకారణమున.

33

రామ. అతఁడు = రాముఁడు, తత్ = ఆవింటియొక్క, మున్ను = మునుపు, మహిమపెంపును, అరాతి = శత్రులయొక్క, మత్సరవిధిన్ = తనజయమును సహింపనివారితోడి ద్వేషమును, సరకు సేయక జనకునింట వివాహ మగుటకు, సంభ్రమించెన్ = త్వరపడెను. ఇంకఁ గవివాక్యము. తదంబక = ఆవిశ్వామిత్రునిబాణములయొక్క, ధామయుక్తిన్ = ప్రతాపయోగముచేత, ఉదయ = అభ్యుదయమును, అందినమేటి = రఘునాథుఁడు, అన్యులకున్ = పరులకు, అలఁగునె = లోపడునా, ఇట్లు, అర్కసంతతి = సూర్యవంశముయొక్క, ఖ్యాతి = మహిమ, తత్పోషకారణమునన్= ఆరాముఁడు పోషించుటవల్ల, ధాత్రిపై, కుంద = మొల్లలయొక్కయు, “మాఘ్యం కుంద” మని అ. సూత = పాదరసముయొక్కయు, “రసస్సూతశ్చ పారదే” అని అ. సంతాన = కల్పవృక్షములయొక్క, భా = కాంతియొక్క, అవగణనన్ = తిరస్కారమువల్లఁ బ్రబలుట.

భారత. తత్ = ఆయర్జునునియొక్క, ధనుర్వార్త మిగుల, కర్ణాసహ్యముగఁ బర్వ = కర్ణునికి నసహ్యముగాఁ బరఁగ, అతఁడు = ఆకర్ణుఁడు, తన్మహిమ = ఆధనుఃప్రావీణ్యముయొక్క, పెంపును, నర = అర్జునుమీఁదనున్న, మత్సరవిధిచేత సరకు సేయక సంభ్రమించెను, ఇంకఁ బూర్వకథాసూచనముగాఁ గవివాక్యము. తత్ = ఆయర్జునునియొక్క, అంబకున్ = తల్లియైన కుంతికి, వివాహ మగుటకు, మున్ను = మునుపే, జనకుని = కుంతిభోజునియొక్క, ఇంటను, సన్ముని = దూర్వాసునియొక్క, కృపన్ = అనుగ్రహమువల్ల, ఆశ్చర్యమంత్రమహత్త్వకృతమైన, చండధామయుక్తిన్ = సూర్యయోగముచేత, ఉదయమందిన = పుట్టిన, మేటి = కర్ణుఁడు, అన్యుల కలఁగునె, కాకుస్వరము. అర్కసంతతి = సూర్యపుత్రుఁ డనెడి, ఖ్యాతి = మహిమ, కుందన్ = అణఁగఁగా, సూతసంతానభావ = సూతపుత్రత్త్వముచేత నైన, గణన = ఎన్నికచే, బ్రబలుట, తత్ = ఆసూతునియొక్క, పోషకారణమున.

చ.

అది యటులుండెఁ గన్గొనుసమస్తజనుల్ దమలోన ఫల్గును
న్మదఘనశత్రుభంగగరిమన్ గురుదక్షిణ సేసి యొప్పుశ
శ్వదనఘుఁ జారుమూర్తిమనువంశవతంసు నుతించి రిమ్మహా
భ్యుదయునిఁ గన్న నెంతలరునో జనకుం డనుచింత సంధిలన్.

34

భారత. మదఘన = గర్వపూర్ణుఁడైన, శత్రు = ద్రుపదునియొక్క, భంగ = పరాజయముయొక్క, గరిమన్ = అతిశయముచేత, మను = మనెడి, వంశవతంసున్ = తనవంశమునకు శేఖరమైనవాని, ఫల్గునున్ = అర్జునుని, కన్నన్ = చూచినను, జనకుండు = పాండురాజు, ఎం తలరునో యను, చింత = విచారము, సంధిలఁగా నుతించిరి, అర్జునుఁడు ద్రుపదునిఁ బట్టి తెచ్చి ద్రోణునకు గురుదక్షిణ చేసినాఁడని విస్తారముగా నాదిపర్వమందుఁ జెప్పినారు గనుక.

రామ. జనులు, తమలోను, అఫల్గున్ = సారవంతుని, “అసారం ఫల్గు” అని అ. ఉన్మదఘన, గురు = విశ్వామిత్రునికి, మనువంశమునకు, యోజన సులభము.

వ.

అంత.

35


సీ.

తనయకలుషయత్న ఘనతరనిర్బంధ
            మున రాజు వనుచుటయును గపటధు
రావారణావతారచితాతిమంజులా
            క్షామయశోభిప్రశస్తధామ
ఘనకేళికలనుండగణ్యుఁ డాత్మస్వామి
            యనియు నిజోచితియును గణించి
యురుతరాదరము సేయుచు భ్రాతృయుతముగా
            నమ్మనువంశరత్నమ్ముఁ గొంచు


తే.

నరిగె సపరిచ్ఛదముగ రాజాన్వయముని
తనదుసుఖదుఃఖవిరహవర్తనలు సరకు
గొనక సమవర్తితనయుండు జనకుఁడేలు
పురమున కరాళగతివాసి సరళసరణి.

36

రామ. తన, అకలుష = ధర్మార్థమైన, యత్నముయొక్క, నిర్బంధమున్ = బలాత్కారముచేత, రాజు = దశరథుఁడు, పనుచుటయును, కపటధురా = కపటభారమును - అధర్మమును, “ఋక్పూరబ్ధూఃపథామానక్షే” అనుసూత్రమున అకారాంతము. వారణ = మాన్పునటువంటి, అవతార = మత్స్యాద్యవతారములచేత, చిత = సంపాదింపఁబడిన, మంజుల = సుందరమైన, అక్షామ = అధికమునైన, యశస్సుచేతను, అభిప్రశస్తమైన, ధామ = మహిమచేత, “గృహదేహత్విట్ప్రభావాధామాని” అని అ. ఘనమైన, కేళికలనుఁడు = క్రీడావిధి గలవాఁడు, అగణ్యుఁడు = అమేయుఁడైన, ఆత్మస్వామి = పరబ్రహ్మ మైనవాఁడు, అనియు గణించి, అమ్మనువంశరత్నమ్మున్ = రాముని, భ్రాతృయుతముగాన్ = లక్షణసహితముగా, రాజాన్వయముని = విశ్వామిత్రుఁడు, సపరిచ్ఛదముగన్ = నిజపరిజనముతోఁ గూడ, కొంచునరిగెన్ = తోడ్కొని పోయెను, తనదు, సుఖదుఃఖవిరహవర్తనలు, ద్వంద్వాంతే శ్రూయమాణం పదం ప్రత్యేకమభిసంబధ్యతే” అను న్యాయమున, సుఖవిరహదుఃఖముయొక్కయు విరహసుఖముయొక్కయు వర్తనలను, సరకుగొనక, సమవర్తితన = సమవర్తిత్వమునే, ఉండు, జనకుఁ డేలుపురమునకున్ = మిథిలకు, అరాళగతి వాసి = వక్రమార్గమును బాసి, సరళసరణిన్ = చాయ తెరువున, అరిగెనని క్రిందటికన్వయము.

భారత. తనయ = దుర్యోధనునియొక్క, కలుషయత్న = పాపయత్నముకొఱకు, ఘనతరమైన నిర్బంధముచేత, రాజు = ధృతరాష్ట్రుఁడు, కపటధురా = కపటభారముచేత, వారణావతమందారచితమైన, ఆతిమంజు = అతిమనోహరమైన, లాక్షామయ = లత్తుకచేత నిబిడమైనదై, ప్రాచుర్యార్థమున మయట్టు, శోభి = ప్రకాశించుచున్న, ప్రశస్త = యోగ్యములునైన, ధామ = గృహములయందుఁ గల, ఘనకేళికలను = అధికక్రీడలచే, ఉండన్ = ఉండెడుకొఱకు, పనుచుటయున్ = అంపుటను, ఆత్మస్వామి = తనకుఁ గర్త యైనధృతరాష్ట్రుఁడు, గణ్యుఁడు = ఆదరణీయుఁడు, అనుటను, నిజోచితియున్ = ధార్మికుఁడైన తనకు నుచిత మౌటను, గణించి, భ్రాతృయుతముగాన్ = భీమార్జుననకులసహదేవసహితముగా, వంశరత్నమైన, అమ్మన్ = కుంతిని, కొంచున్ = తోడ్కొంచు, రాజాన్వయముని = రాజర్షి, సమవర్తితనయుండు = ధర్మజుఁడు, జనకుఁ డేలుపురమునకు = పాండురా జేలిన వారణావతపట్టణమునకు, పాండురాజు వారణావతము నేలినవాఁడని భారతమం దున్నది గనుక, అరాళగతి వాసి = విచారపడక, సరళసరణిన్ = ఋజువర్తనచే, అరిగెను.

తే.

పరమమునియతివశతమన్యురతిహేతు
వున మహాశాపహతిఁ జేసీ తనువికృతిగ
నున్న నేల యంత వచింపనొగి నరు దని
తత్కథల్ రుచిగొనుచు రాట్తనయులందు.

37

భారత. నియతివశత = దైవాధీనత, పరమము = అలంఘ్య మనుట, మన్యు = శోకమును, రతి = వేడుకయు ననెడి, హేతువునన్ = కారణముచేతను, మహాశా = పేరాసయొక్క, అపహతిఁ జేసి = వ్యర్థతఁ జేసియుండియు, తనువికృతిగన్ = దేహవైవర్ణ్యముగా, ఉన్నన్ = ఉండినను, ఏల = ఏమిటికి, అరుదని = ఆశ్చర్యమని, అంత వచింపఁగా, అందున్ = ఆమార్గమందు, తత్కథల్ = ఆధర్మరాజుకథలను, రుచిగొనుచున్ = ఆదరింపుచు, రాట్తనయులు = రాజకుమారులు, అరుగునప్పుడని ముందరిపద్యమున కన్వయము.

రామ. పరమముని = గౌతమునియొక్క, అతివ = అహల్య, శతమన్యు = ఇంద్రునియొక్క, రతిహేతువున శాపహతిఁ జేసి, తనువికృతిగనున్న = దేహవికారతఁ జెందియున్న, నేల = భూమి, అంత వచింపన్ = అంతటఁ జెప్పఁగా, రాట్తనయులు, అందున్ = ఆభూమియందు, తత్కథల్ = ఆవిశ్వామిత్రుఁడు చెప్పినయహల్యాజారతాప్రసంగములను, రుచిగొనుచు.

సీ.

ఆలీల నలరుచు నరుగునప్పుడు తత్పు
            రస్ఫూర్తి మిగులఁ జిత్రం బొనర్చె
రమణీయ మైనయారామపాదపరాగ
            మాశాపవారణ మాచరింప
నాయతివసుశోభ నాకృతియును సర
            సీకృతమానసహ్రీకలనయు
ఘననవరత్నకాంచనధామశోభన
            వన్యాభరణవైభవస్ఫురితయు


ఆ.

విపులతరపయోధరపదవ్యతిక్రమ
కరనవాంశుకాంతవరణనిరతి
శయసమున్నతియును నయి వారలందఱు
గౌరవమునఁ దన్నుఁ గనుఁగొనంగ.

38

రామ. అప్పుడు, తత్ = వారియొక్క, పురః = ముందట, స్ఫూర్తిన్ = ప్రకాశించుటచేత, ఆరామపాదపరాగము శాపవారణము నాచరింపఁగా, ఆయతివ = అహల్య, సరసీకృతమానసహ్రీకలనయున్ = పచ్చిగాఁ జేయఁబడినమనోలజ్జాస్థితి గలది, రత్నములయొక్కయు, కాంచన = బంగారుయొక్కయు, ధామ = కాంతివంటి కాంతి గలది, పద్మరాగమౌక్తికఛ్ఛాయ గల యధరదంతములును సువర్ణచ్ఛాయ గల దేహమును గలది, శోభనములైన, వన్య = వనభవములైన నారచీరలు మొదలయిన, ఆభరణ = అలంకారముయొక్క, "అలంకారస్వాభరణ” మని అ. వైభవముచేత స్ఫురితయు, “సరసిజ మనువిద్ధం శైవలేనాపిరమ్యం మలినమపి హిమాంశోర్లక్ష్మలక్ష్మీం తనోతి, ఇయమపిచమనోజ్ఞా వల్కలే నాపి తన్వీ కిమివహి మధురాణాం మండనం నాకృతీనా” మని కాళిదాసును శాకుంతలమందుఁ జెప్పినాఁడుగనుక, పయోధరపదవ్యతిక్రమకర = కుచస్థలాతిక్రమమును జేయుచున్న - జాఱుచున్నదనుట, నవ = మనోహరమైన, అంశుకాంత = పైటయొక్క, వరణ = కప్పుటయందు, నిరతి = ఆసక్తిగల, శయ = హస్తములయొక్క, “పంచశాఖశ్శయః పాణిః" అని అ. సమున్నతియును = ఉపచారము గలదియు, ఐ, చిత్రం బొనర్చెనని క్రిందటి కన్వయము.

భారత. అలరుచున్ = వికారరహితుఁడై, తత్పుర = ఆవారణావతముయొక్క, స్ఫూర్తి, ఆరామ = ఉద్యానవనములయందున్న, పాదప = వృక్షములయొక్క, రాగము = వర్ణము, “రాగోనురక్తౌ మాత్సర్యే క్లేశాదౌ లోహితాదిషు” అని వి. ఆశా = దిక్కులయొక్క, అపవారణము = ఆచ్ఛాదనమును, “అంతర్ధిరపవారణ" మని అ. ఆచరింప, ఆయతి = ఉత్తరకాలఫలముచేతను, వసు = ద్రవ్యములచేతను, శోభనాకృతియు, సరసీ = కొలంకులచేత, కృతమైన, మానస = మానససరస్సుయొక్క, హ్రీకలనయున్ = లజ్జాస్థితి గలదియు, రత్నకాంచనములయొక్క, ధామ = గృహముయొక్క, శోభన్ = శృంగారముచేత, అవని = భూమికి, ఆభరణములైన వైభవములచేత, స్ఫురితయు, పయోధరపదవీ = మేఘమార్గముయొక్క, అతిక్రమమును, కర = చేయుచున్న, నవాంశువులచేత, కాంత = మనోహరమైన, వరణ = కోటయొక్క, నిరతిశయ, సమున్నతియున్ = ఔన్నత్యము గలదియు, ఐ, పురస్ఫూర్తిచిత్రం బొనర్చెనని యన్వయము.

తే.

హరిపురాభోగవార్తపెం పపుడు వారి
మదిఁ బొడమఁ దలపోసి రట్టిది యటంచుఁ
జెలువసంకోచవిభవవైచిత్రిఁ బరఁగఁ
బరఁగునానగరంబు గన్పట్టఁ జూచి.

39

భారత. చెలువు = ఒప్పిదము, పరఁగ, ఆనగరంబును జూచి, హరిపుర = అమరావతియొక్క, ఆభోగ = విరివియొక్క, వార్తపెంపు మదిఁ బొడమ, “సదృశాదృష్టచింతాద్యాః స్మృతిబీజస్య బోధకాః” అను న్యాయముగనుక, అట్టిది = అమరావతివంటిది, అటంచుఁ దలపోసిరి.

రామ. హరి=ఇంద్రునియొక్క, పురాభోగ = తొంటిసంభోగముయొక్క, వార్తపెంపు, వారి = రామాదులయొక్క, మదిఁ బొడమఁగా, రట్టు = పరపురుషసంగతివల్ల నైన దూఱు, ఇది యటంచుఁ జెలువ, సంకోచవిభవ = మిక్కిలి కొంకుచేతనైన, వైచిత్రిన్ = వింతలాగుచేత, పరఁగు = ప్రవర్తిల్లుచున్న, ఆన = ఆజ్ఞ, కన్పట్టఁజూచి, నుతి చేసిరని ముందటిపద్యమున కన్వయము.

తే.

అనిశశివవాస మైనపుణ్యపురమణివ
ఘాపహస్మృతి వనుచు నాయపకలంక
మానసోత్కర్షయుక్తులనూననుతులు
సేసి యందఱు తత్పురస్థితిని బరఁగ.

40

రామ. అనిశశివవాసమైన = నిరంతరశుభప్రదమైన, పుణ్యపురమణివి = పుణ్యాంగనవు, అఘాపహస్మృతివి = పాపహరణమైన స్మరణ గలదానవు, “అహల్యా ద్రౌపదీ సీతా” అని స్మృతి గనుక, అనుచు, ఆయప = ఆయమయొక్క, కలంక = కలఁక, మానన్ = మానునట్లుగా, సోత్కర్షయుక్తులచేత, ఊనన్ = మనస్సున స్థిరమగునట్టుగా, నుతులు సేసి, తత్ = ఆయహల్యయొక్క, పురస్థితిని బరఁగన్ = ముందర నుండఁగాను, జనిరి.

భారత. శివవాసమైన = రుద్రనివాసమైన, పుణ్యపురమణివి, కాఁగా, అఘాపహస్మృతివి యనుచు, అపకలంక = నిష్కళంకమైన, మానస = హృదయముయొక్క ఉత్కర్షతోడ, యుక్తులు = కూడినవారు పాండవులు, అనూననుతులు = అధికస్తోత్రములను, చేసి, తత్పురస్థితిని బరఁగన్ = ఆపట్టణమున నుండఁగా.

క.

చనునెడ శ్రీరాముఁడు పా, వనినవనిజరూపవైభవశ్రీ నుల్లం
బున నిడి దానవిచిత్రా, తనురాగప్రౌఢి వచ్చి తనుఁ బైకొనఁగన్.

41

రామ. శ్రీరాముఁడు, పావనిన్ = పవిత్రమైనదాని, అవనిజ = సీతయొక్క, రూపవైభవశ్రీని, ఉల్లంబున నిడి, దానన్ = ఆమనస్సున నుంచుటచేత, విచిత్రమైన, అతనునివల్ల నైన, రాగప్రౌఢి = మోహాతిశయము, తనుఁ బైకొనఁగా, అనుమతించెనని ముందరిపద్యమునఁ గ్రియ.

భారత. శ్రీరాముఁడు = కాంతిచేత నొప్పెడువాఁడు, పావని = భీముఁడు, నవ, నిజ = స్వకీయమైన, శ్రీని, చిత్రమైన యతనురాగప్రౌఢి గలదైన, దానవి = హిడింబ, పైకొనఁగా.

సీ.

ఆసమయమున నేమని చెప్ప నరుదెంచి
            చూడ నద్భుతతమస్ఫూర్తి యగుచుఁ
దద్జ్ఞాతియమితచేతఃకళంకుండు త
            ద్గృహమేధితద్వేషమహిమపేర్మి
ననలసముద్వృత్తిహరము గావింపంగ
            నంచితానఘవిధిసంచితార్థ
సందర్శనుఁడు గామినిందనపెం పెల
            ర్పంగఁ జేకొనియె నారాకొమరులు

తే.

నతనియాదరక్రియ గాంచి యవలఁ జనిరి
స్వీయగురుయుక్తముగఁ దద్విసృష్టు లగుచు
విదురజనదర్శితోచితవివరసరణి
నలఁత యెఱుఁగక దక్షిణానిలజధృతిని.

42

రామ. ఆసమయమున, తత్ = ఆశాపమోక్షప్రకారమును, జ్ఞ = ఎఱిఁగినవాఁడై, తద్గృహమేది = ఆయహల్యాపతి గౌతముఁడు, చూడ నద్భుతతమస్ఫూర్తి యగుచున్ = చూడరాని తేజస్సు గలవాఁ డౌచును, అనలస = అధికమైన, ముత్ = సంతోషముయొక్క, “ముతీతిః ప్రమదో హర్ష " ఆని అ. వృత్తి, తత్ = ఆయహల్యయందుఁగల, ద్వేషమహిమపేర్మి నిహతము గావింపఁగా, అంచిత = పూజితమైన, అనఘవిధిచేత, సంచిత = సంపాదింపఁబడిన, అర్థసందర్శనుఁడు = తత్త్వజ్ఞానము గలవాఁడు, “అర్థో౽భిధేయరైవస్తుప్రయోజననివృత్తిషు" అని అ. 'దర్శనం నయనస్వప్నబుద్ధిధర్మోపలబ్ధిషు" అని వి. కామినిన్ = అహల్యను, చేకొనియెను, రాకొమరులు = రామలక్ష్మణులును, అతని = గౌతమునియొక్క, ఆదరక్రియ = ఆదరణను, కాంచి, స్వీయగురుయుక్తముగన్ = విశ్వామిత్రునితోగూడ, తత్ = ఆగౌతమునిచేత, విసృష్టు లగుచు, దక్షిణానిలమువల్ల, జ = పుట్టిన, ధృతిన్ = సంతోషముచేత, అలఁత యెఱుఁగక, విదురజన = నెళవరులచేత, “జ్ఞాతాతు విదురో విందః” అని అ. దర్శిత = చూపఁబడిన, ఉచితమైన, వి = విశేషించిన, వివరరణిన్ = మంచిత్రోవయందు, చనిరి.

భారత. ఎంచి చూడ నరుదు, ఇది కవివాక్యము. అమితచేతఃకళంకుఁడు, తత్ = ఆధర్మజునియొక్క, జ్ఞాతి = దుర్యోధనుఁడు, అద్భుతమైన తమోగుణముయొక్క, స్ఫూర్తి = ఉద్రేకము గలవాఁడు, అగుచు, తత్ = ఆధర్మజునియొక్క, గృహమును, విధిత = వృద్ధిఁ బొందిన, ద్వేషమహిమయొక్క, పేర్మిన్ = ఆధిక్యముచేత, అనల = అగ్నియొక్క, సముద్వృత్తిన్ = దరికొల్పుటచేత, హతము గావింపంగ, అంచి = ఒకమనుష్యుని ననిపి, తాను, అఘవిధిన్ = పాపపువిధిచేత - ఆగృహదాహవిధిచేత ననుట, సంచిత = సంపాదింపఁబడిన, అర్థసందర్శనుండు = ప్రయోజనప్రాప్తి గలవాఁడు, కామిన్= కాకుండుటచేత, నిందన = అపకీర్తినే, చేకొనియెను, తద్విసృష్టు లగుచున్ = ఆయగ్నిభయముచేత విడువఁబడ్డవారై - అగ్నిభయమును దప్పించుకొన్నవారై యనుట, విదురునియొక్క, జన = దూతచేత, దర్శితమైన, వివరసరణిన్ = బిలమార్గమున, “సుషిరం వివరం బిల” మని అ. దక్షిణ = సమర్థుఁడైన, “దక్షిణస్సరళోదారపరచ్ఛందానువృత్తిషు" అని వి. అనిలజ = భీమునియొక్క, ధృతిన్ = ధారణముచేత, ఆరాకొమరులు = పాండవులు, అతని = దుర్యోధనునివల్లనైన, ఆ, దర = భయముయొక్క, “దరో౽స్త్రియాం భయే శ్వభ్రే" అని అ. క్రియను, కాంచి = ఎంచి, స్వీయగురుయుక్తముగన్ = తమతల్లితోఁగూడ, ఆవల చేకొనియె నని ముందరిపద్యమునఁ గ్రియ.

ఆ.

తొడగి యపుడు దాని తోఁబుట్టుగురుతర
సంగరసముదీర్ణసరణిఁ బరఁగ
వాని నంత గెలిచి స్వగురుకథాదర
మమరఁ బ్రమదయుక్తి కనుమతించె.

43


భారత. దానితోఁబుట్టుగు = హిడింబుఁడు, ఉరుతర, సంగర = యుద్ధమందు, పరఁగ వానిఁ గెలిచి, స్వగురుకథా = కుంతిధర్మజులమాటమీఁదనైన, ప్రమదయుక్తిన్ = హిడింబాసంయోగమునకు, అనుమతించెను.

రామ. దానితోఁ బుట్టు = రాగప్రౌఢితో గూడఁ బుట్టునట్టి, గురుతర, సంగరసము = ఆపేక్ష, ఉదీర్ణసరణిఁ బరఁగ, వానిన్ = ఆమన్మథరాగసంగవాంఛలను, గెలిచి = అణఁచి, స్వగురుకథా = విశ్వామిత్రుని గంగాసంభవాదికథలయందుఁ గల, ఆదరము, అమరఁగా, ప్రమద = సంతోషముయొక్క, యుక్తికి ననుమతించెను.

వ.

అంత.

44


తే.

ఉరుగుణాద్భుతజనకసుతోదయమహి
మాతిశయము సాధించి పుణ్యజన కాంత
సుగుణ యనిపించుకొనిన భాసురపురమణిఁ
జూపుతగులు వహించె నుత్సుకత నతఁడు.

45

రామ. ఉరుగుణాద్భుతుఁడైన జనకునికి, సుతా = కొమార్తె యైన సీతయొక్క, ఉదయ = పుట్టుటచేత నైన, మహిమాతిశయమును సాధించి, పుణ్యజన = సుజనులచేత, కాంత = మనోహరమైనది, భాసురపురమణిన్ = పురశ్రేష్ఠమైన మిథిలయందు, అతఁడు = రాముఁడు, చూపుతగులు వహించెను.

భారత. ఉరుగుణుఁడైన యద్భుతజనకుఁడైన, సుత = ఘటోత్కచునియొక్క, పుణ్యజనకాంత = రాక్షసస్త్రీ హిడింబ, “యాతుధానః పుణ్యజనః" అని అ. అనిపించుకొనినన్ = పోయినను, ఆతఁడు = భీముఁడు, భాసురపు, రమణిన్ = హిడింబయందు, చూపుతగులు వహించెను = అనురాగము నిలిపెను.

ఉ.

అన్నగరంబు ప్రోది దన రారఁగఁ దములఁ గన్న తల్లి నా
సన్నుతఖేలనుండు వికసన్నయనైకవిలాసగౌరవా
భ్యున్నతిఁ దద్వనాంతమునఁ బ్రోచెఁ గడుం దనశ్రాంతి యాత్మలో
నన్నెఱయం గణింపఁడు మనస్స్థిరతన్ వివరించుపూనికన్.

46

భారత. అన్న = ధర్మరాజు, కరంబు = మిక్కిలియు, తమ్ములను గన్నతల్లిని, ఆసన్నుతఖేలనుండు = భీముఁడు, నయ = నీతియొక్క, నైక = ఉన్నతిచేత, ప్రోచెను = రక్షించెను, తన, శ్రాంతి = అలమటను, ఆత్మలోనన్ = మనస్సునందు, నెఱయ, గణింపఁడు = ఎంచఁడు, పూనికన్ = యత్నముచేత, మనస్స్థిరతన్ = మనస్స్థైర్యమును, వివరించును, ఆయనపూనికఁ జూచినను మనస్స్థైర్య మేర్పడుచున్న దనుట.

రామ. అన్నగరంబు=మిథిలాపురి, ప్రోదిఁ దనరారఁగ, తమ్ములఁ గన్నతల్లినాన్ = పద్మముల కుత్పత్తిస్థాన మనఁగా, సన్నుత = వర్ణితమైన, ఖేలన్ = లీలచేత, ఉండు = ఉండెడి, వికసన్నయన = తెలికన్నులయొక్క, ఏక = ముఖ్యమైన, విలాసగౌరవ = శృంగారాతిశయముయొక్క, అభ్యున్నతిచేత, తత్ = ఆపట్టణముయొక్క, వనాంతమునన్ = ఉద్యానవనమందు, ప్రోచెను. పద్మకాంతి గల నయనములచేతఁ బ్రోచె ననఁగాఁ గటాక్షించె ననుట. లక్షణాప్రయోగము. “గిరానుజగ్రాహతరాంనరాధిపః” అని నైషధమందు. తనశ్రాంతిని, మనస్స్థిరతన్విన్ = మనస్సున లగ్నమైన స్త్రీని - సీతను, వరించుపూనిక = వివాహ మగుయత్నమున, శ్రాంతిని గణింపఁడని యన్వయము.

వ.

అది యట్లుండె వారలందఱు తత్ప్రకారంబున విపినమార్గవర్తనంబు
నడపి యథోచితగమనంబున.

47

రెంటికి సరి - సులభము.

క.

చనిరి పురసవిధమార్గం
బున సద్ద్విజలీలలు నడుపుచు మాధుకరా
శన మొనఁగూర్చుచు నపుడుప
వనసంతతి యలరఁ జేసె వారలయాత్మన్.

48

రామ. పుర = మిథిలయొక్క, సవిధ = సమీపమైన, “సదేశాభ్యాససవిధసమర్యాదసదేశవ” త్తని అ. మార్గమందుఁ జనిరి. అపుడు, సత్ = లెస్సైన, ద్విజ = పక్షులయొక్క, లీలలను, నడపుచున్ = చేయుచును, మాధుకర = భ్రమరసంబంధమైన, “తస్యేద”మ్మని అణ్ప్రత్యయాంతము. అశనము = పూఁదేనె ననుట, ఒనఁగూర్చుచు, ఉపవనసంతతి = ఉద్యానపరంపర, వారల = రామాదులయొక్క, ఆత్మన్ = మనస్సును అలరఁజేసెను.

భారత. పుర = ఏకచక్రపురముయొక్క, ద్విజలీలలు = బ్రాహ్మణవేషములను, మాధుకరాశనము = భైక్షమును, పవనసంతతి = భీముఁడు, కడమ సరి.

ఆ.

అందుదారవృత్తి నందితానేకచ
క్రాగ్రహారహితవిహారమహిమఁ
బ్రచురసారసమద బకదర్పహారితఁ
దనరె సరసు లందఱును నుతింప.

49

భారత. అందున్ = ఆవర్తనలందు, ఉదారవృత్తి నంది = సాహసవృత్తిని బొంది యనుట. తాను = భీముఁడు, ఏకచక్రాగ్రహారమునకు, హిత = ప్రియమైన, విహారమహిమచేత, ప్రచురసార = అధికబలము గల, “సారో బలే స్థిరాంశేచ" అని అ. సమద = గర్వసహితుఁడైన, బక = బకాసురునియొక్క, దర్పహారిత = గర్వాపహారిత్వముచేతఁ - చంపుటచేత ననుట, సరసులు = రసికులు, నుతింపఁ దనరెను.

రామ. అందున్ = ఆపట్టణమందు, దారవృత్తి = భార్యావర్తనచేత, నందిత = సంతోషితములైన, అనేకచక్రవాకపక్షులయొక్క, "కోకశ్చక్రశ్చక్రవాకః” అని అ. ఆగ్రహ = కోపముచేత, అరహిత = విరహితమైన, ఔత్సుక్యము గల దనుట, విహారమహిమన్ = సంచారాతిశయముచేతను, సారస = బెగ్గురులయొక్కయు, మదబకములయొక్కయు, దర్ప = విశృంఖలసంచారముచేత నైన, హారిత = మనోహరత్వముచేతను, సరసులు=కొలఁకులు, ఈకారాంతము, తనరెను.

క.

జననేత్రచిత్రదారుణ, వనజగతులనిశలసత్త్వవశత నడచుచోఁ
గన నరుదురమారూఢిం, దనరె జితాంగారపర్ణ ర్పోదయతన్.

50

రామ. ఇంకఁ బురవర్ణన, జననేత్రచిత్రద, అరుణవనజగతులు = కెందామరలప్రకారములు, అనిశ = ఎల్లప్పుడు, లసత్త్వవశత = శోభావశత్వము, నడచుచోన్ = నడచెడిచోట - నాపట్టణమందు, కననరుదు = చూడ నశక్యము, జిత = జయింపఁబడిన, అంగార = అగ్నిశకలములు గల - రక్తవర్ణములు గల వనుట, పర్ణ = రేకులయొక్క, దర్పోదయతన్ = గర్వోన్నతి గలవౌటచేత, రమారూఢిన్, లక్ష్మీప్రాప్తిచేత, తనరెను, అరుణపద్మములు నిత్యశోభావశత వర్తిల్లెడుపట్టున రమారూఢిచేఁ దనరినది గనుకఁ జూడ అద్భుత మనుట.

భారత. జననేత్రములకుఁ జిత్రములును, దారుణ = భయంకరములు నైన, వనజగతులన్ = వనభూములయందు, “జగతీ రత్నగర్భా చ” అని అ. నిశలన్ = రాత్రులయందు, సత్త్వవశతన్ = బలవంతుఁ డౌటచేత, నడచుచోన్ = నడిచెడునప్పుడు, కనన్ = చూచుటకు, నరుదురము= అర్జునునియుద్ధము, జితమైన యంగారపర్ణుఁ డనెడు గంధర్వునియొక్క యహంకారాతిశయము గల దౌటచేతఁ దనరెను.

వ.

అంతట వారియంతరంగంబునందు.

51


క.

వివిధద్విజాళిభూమా
నవరతసంశ్లాఘితస్వయంవరకల్యా
ణవిధివరద్రుపదసుతా
నవమంజులతాప్రవృత్తి నడపెఁ గుతుకమున్.

52

భారత. ద్విజాళి = బ్రాహ్మణసమూహములయొక్క, భూమ = బాహుళ్యముచేత, అనవరతమును సంశ్లాఘితమైన స్వయంవర మనెడు కల్యాణవిధి గల, ద్రుపదసుతా = ద్రౌపదియొక్క, నవ = నూతనమైన, మంజులతా = మనోహరత్వముయొక్క, ప్రవృత్తి = వృత్తాంతము, కుతుకమును నడపెను.

రామ. వివిధద్విజాళి = పక్షిసమూహములయొక్క, భూమ = బాహుళ్యముచేత, సంశ్లాఘితమైన స్వయంవరకల్యాణవిధిచేత, వర = వరులైన, ద్రు = వృక్షములు, “ద్రుద్రుమాగమాః” అని అ, పదస్థానముగాఁ గలవియు నైన, సుతానవ = మంచికోమలత్వము గల, మంజులతాజరమ్యలతలయొక్క, ప్రవృత్తి, కుతుకమును నడపెన్ = సంతోషమును జేసెను, తీఁగెలు తమంతనె చెట్లఁ బ్రాకినను స్వయంవరమున వరించినట్లుంబలె నుండె ననుట; ద్విజశబ్దమున బ్రాహ్మణధ్వని, ఆవృక్షములఁ జూచి వివాహాపేక్ష గల రాముఁడు సంతోషించె నని భావము.

శా.

అంత వారలు రామభద్రుపదరాజ్యారూఢిచే నెంతయుం
జింతాతీతవిశేష యై ప్రబలలక్ష్మి న్మించుచంచద్ఘనో
పాంతం దత్పురి గూఢరాజపదవిప్రాకారరేఖన్ శుచి
స్వాంతుల్ సేరిరి తత్పురోహితముఖవ్యాకౢప్తసన్మాను లై.

53

రామ. వారలు = విశ్వామిత్రాదులు, రామభద్రు = రామునియొక్క, పదరాజి = పాదవిన్యాసపంక్తియొక్క, ఆరూఢిచేన్ = ప్రాప్తిచేత, చింతా = భావనను, అతీత = ఆతిక్రమించిన, "స్యాచ్చింతా స్మృతిరాధ్యాన” మని అ. విశేషయై = వింతగుణములు గలదై, ప్రబల = ప్రబలునట్టుగా, భావింపశక్యముగాని శృంగారములఁ దగునట్టుగా ననుట, లక్ష్మి న్మించు, గూఢ = ఆవృతమైన, రాజపదవి = చంద్రమార్గముల, రఘువంశమందు “వైదేహిబంధోర్హృదయం విదధ్రే” అన్నట్టు, ప్రాకారశ్రేణి గల యని, తత్పురిన్ = ఆమిథిలను, తత్ = ఆపట్టణమందున్న, పురోహితుఁడు మొదలైనవారిచేత వ్యాకౢప్తసన్మానులై చేరిరి, జనకునిపురోహితామాత్యు లెదురుగా వచ్చి తోడుకొని పోఁగాఁ బోయిరనుట.

భారత. రామ = రమ్యమైన, భ = కాంతిగల, స్త్రియాం పుంవద్భాషిత” అనుసూత్రమునఁ బుంవద్భావము. ద్రుపదునియొక్క, రాజ్యము యొక్క యారూఢిచేన్ = రాజత్వప్రాప్తిచేత, చింతాతీత, విశేషయై = తాత్కాలికావస్థ గలదై, “విశేషః కాలికోవస్థా” అని అ. ప్రబలలక్ష్మిన్ = ఉత్కృష్టబలములయొక్క యతిశయముచేత, తత్పురిన్ = ఆద్రుపదునిపట్టణమును, గూఢమైన, రాజపద = రాజచిహ్నముగల, “పదం వ్యవసితత్రాణస్థానలక్ష్మాంఘ్రివస్తుషు" అని అ. విప్రాకారరేఖన్ = బ్రాహ్మణాకృతిచేత సౌందర్యలీలచేత, శుచిస్వాంతులు? వారలు = ధర్మరాజాదులు, తత్ = ఆలాగు ప్రసిద్ధు లయిన, పురః = ముందటికి, హిత = శ్రేయస్కరములైన, ముఖ = సంచారములు గల, “ముఖం నిస్సరణేవక్త్రే ప్రారంభోదయయోరపి” అని వి. వి = పక్షులచేత, “వినిర్విఘ్నే చతు పక్షిణి" అని వైజయంతి. ఆకౢప్త = మిక్కిలిఁ జేయబడ్డ, సన్మానులై = బహుమానము గలవారై "మానశ్చిత్త సమున్నతిః” అని అ. మంచిశకునము లవుచునుండఁగా ననుట, చేరిరి. తచ్ఛబ్దము ప్రసిద్ధవాచక మైనందుకు, “అనుభవతి శచీత్థం సా ఘృతాచీముఖాభిః” అని నైషధమందు.

ఆ.

అందుఁ దన్నృపాలుఁ డాత్మజ కిది యుంకు
వంచు నెక్కిడనియమించినట్టి
కార్ముకోత్తమమును ఘనమైనమూర్తిల
క్ష్యంబు సూచి రానృపాత్మభవులు.

54

భారత. అందున్ = పట్టణమందు, ఘనమైన, మైనమూర్తి = మీనసంబంధ మైనయాకృతిగల, లక్ష్యంబు = గుఱిని - మత్స్యయంత్రము ననుట, కడమ సులభము.

రామ. ఘనమైన, మూర్తి = కాఠిన్యముచేత, “మూర్తిః = కాఠిన్యకాయయోః" అని అ. లక్ష్యంబు = చూడఁదగినదాని, వింటికి విశేషణము, చూచిరి.

వ.

అటమున్న సకలదిగ్దేశాగతులైన రాజకుమారులు నిజశక్తితారతమ్యం
బునం జేసి దర్శనస్పర్శనచాలనోచ్చాలనాదివ్యాపారపారాహం
కారు లగుచు శిథిలప్రయత్ను లయి తొలంగిపోవం జేవ మిగులు
నమ్మహాకోదండంబు గనుంగొనునప్పుడు వారలందు.

55

రామ. వ్యాపారములు పారముగాఁ గలయహంకారము గలవారై, వారలందున్ = రామలక్ష్మణులందు. భారతార్థమునకును నీలాగుననే.

చ.

అనుపమదివ్యవిక్రమసమగ్రుఁడు రామవిభుండు జిష్ణుఁ డా
యనితరభేద్యరౌద్రధను వశ్రమభంగిగ వంచి బాహులీ
ల నెరసె నభ్రగానిమిషలక్షహృదంబకవృత్తి నుర్వరా
జనహృదయాక్షివర్తనముఁ జాలఁగ నద్భుతవార్ధి ముంచుచున్.

56

రామ. జిష్ణుఁడు = జయశీలుఁడు, రామవిభుండు, రౌద్ర = రుద్రసంబంధమైన, ధనువును, ఉకారాంతము. “సోయం ధనురజనివక్రః" అని నైషధమందుఁ బ్రయోగము. అశ్రమ = అనాయాసముననే, భంగిగన్ = భంగము గలదానిఁగా, వంచి = విఱిచి యనుట, అభ్రగ = గగనచరులైన, అనిమిష = దేవతలయొక్క, లక్ష = లక్షసంఖ్యలయొక్క, హృదంబకవృత్తిన్ = హృదయముయొక్కయుఁ గన్నులయొక్కయు వ్యాపారమును, అద్భుతవార్ధిని ముంచుచును బాహులీలల నెరపెను.

భారత. అభ్రగ = ఆకాశమందుఁ జరించుచున్న, అనిమిష= మత్స్యమనెడి, “సుర మత్స్యావనిమిషా” అని అ. లక్ష = గుఱిని, "లక్ష్యం లక్షం శరవ్యం చ" అని అ. హృత్ = హరించునట్టి, అంబక = బాణముయొక్క, “అంబకం నేత్ర శరయోః” అని వై. వృత్తిన్ = వర్తనచేత - ప్రయోగముచేత ననుట, కడమ సరి.
చ.

ఉదుటున నట్లు తన్మహిపుఁ డొడ్డినయొడ్డు జయించి యేమనం
దదసహకర్ణశల్యసముదగ్రతరప్రథనాశ్రితాధికా
భ్యుదయతఁ జెందె భీమభుజపుష్టిసహాయతఁ దజ్జయార్థులై
కదిసి సమస్తభూపతులు గైకొని రంతకమున్న భంగమున్.

57

భారత. అట్లు తన్మహిపుఁడు = ద్రుపదుఁడు, ఒడ్డిన, ఒడ్డు = పందెమును, జయించి, తత్ = ఆజయమును, అసహ = సహింపని, కర్ణశల్యులతోడ నగు సముదగ్రతరమైన, ప్రథన = యుద్ధమందు, "ప్రథనం ప్రవిచారణ” మని అ. అధికాభ్యుదయతను = ఉచ్ఛ్రయమును, భీమ = భీమునియొక్క, భుజపుృష్టిసహాయతవలనఁ జెందెను, తత్ = ఆయర్జునునియొక్క, జయార్థులై భూపతులు, అంతకమున్న = ఆకర్ణశల్యులయుద్ధముకంటె ముందే, భంగమున్ = అపజయమును, కైకొనిరి.

రామ. తత్ = ఆవిల్లు విఱుచుటవల్ల, అసహ = ఓర్వనివారియొక్క, కర్ణములకు శల్యమైన, ప్రథన్ = ఖ్యాతిచేత, “ప్రథాఖ్యాతా” యని యమరసంకీర్ణవర్గులో ఆశ్రితాధిక, అభ్యుదయత = అభ్యుదయము ననుట, భీమ = భయంకరమైన, తత్ = ఆవింటియొక్క, కడమ సరి.

ఆ.

అతఁడు వీర్యశుల్కయగు రాజసుత నట్లు
దనదుసొమ్ముఁ జేసికొని భృశప్ర
కాశితాత్మవంశుఁ డై శోభిలెను మామ
కసదృశప్రమోద మావహిల్ల.

58

రామ. అతఁడు = రాముఁడు, వీర్యశుల్క యగు = పరాక్రమమే యుంకువగాఁ గల “శుల్కో స్త్రీస్త్రీధనేపిచ” అని అ. భృశప్రకాశిత, ఆత్మవంశుఁడై = తనవంశమునకు ఖ్యాతిఁ దెచ్చినవాఁడై శోభిలెను.

భారత. అతఁడు = అర్జునుఁడు, భృశ = మిక్కిలియు, ప్రకాశిత = తెలుపఁబడిన, తామును దమవంశమును గలవాఁడై, శోభిలెను.

సీ.

అసమానపాండుకీర్తిసమృద్ధిజనకుండు
            ధర్మరాజీడితకర్మపరుఁడు
స్వజననియుక్తియు వరగుణవ్యాసము
            నీశ్వరాజ్ఞయుఁ దనహృదయగతియు

నేకమై తనుఁ జాల నెచ్చరింప నిజాను
            జులసన్మతిని బిల్చి తెలియఁ జెప్పి
తమకు నందఱకు సుదారభావంబున
            నాచరింపఁగ బాత్ర మగుట యరసి


తే.

యునికి నపు డాసుబాహుజయోపశోభి
తము లైనకుమారరత్నముల కాభు
జద్రవిణశుల్క యనుజలజాతబాంధ
వరుచి ఘనహృదబ్జామోదగరిమ నొసఁగె.

59

భారత. పాండు = పాండురాజుయొక్క, కీర్తిసమృద్ధికి, జనకుండు = ఉత్పత్తిస్థాన మైనవాఁడు, ధర్మరాజు, ఈడిత = స్తోత్రము చేయఁబడిన, “ఈడిత శస్త పణాయిత పనాయిత ప్రణుత ప్రణిత పనితాని" అని అ. కర్మ = ప్రయోజనములయంచు, పరుఁడు, స్వజనని = కుంతియొక్క, ఉక్తియున్ = వాక్యమును, వరగుణుఁడైన వ్యాసమునీశ్వరునియొక్క యాజ్ఞయును, ఎచ్చరింప, నిజానుజులన్ = భీమాదులను, తమకు నందఱకును = అయిదుగురికిని, దారభావంబునన్ = భార్యాత్వముచేత, ఆ, సుబాహుజయోపశోభితములైన = భుజశౌర్యశోభితులైన, కుమారరత్నములకు, రత్నశబ్దమునకు విశేషణము గనుక శోభితశబ్దము నపుంసకము, ఆభుజద్రవిణశుల్క యను = భుజసత్త్వమె యుంకువగాఁగల ద్రౌపది యనెడి, "ద్రవిణంతురో బలశౌర్యాణి” అని అ. జలజాతబాంధవరుచి = సూర్యదీప్తి, హృత్ = హృదయములనెడి, అబ్జ = తామరలకు, ఆమోద = హర్ష మనెడి సౌరభ్యముయొక్క, శ్లిషరూపకము. “అమోదో హర్షగంధయోః” అని వి. గరిమన్ = అతిశయమును, ఒసఁగెను.

రామ. అసమానమై, పాండు = శుభ్రమైన, కీర్తిసమృద్ధి గలవాఁడు, జనకుండు, ధర్మరాజి = ధర్మపంక్తిచేత, ఈడిత = స్తోత్రము చేయఁబడిన, స్వజన = తనయాప్తజనులయొక్క, నియుక్తియున్ = నియోగమును, వర = వరుల యొక్క, గుణవ్యాసము = గుణవిస్తారమును, “విస్తారో విగ్రహో వ్యాసః" అని అ. "శ్రితోరుర్వ్యాసోమహాభారతసర్గ యోగ్యః” అని నైషధప్రయోగము. ఈశ్వరాజ్ఞయు, నిజానుజున్ = తనతమ్ముఁ డైనకుశధ్వజుని, ఉదారభావంబునన్ = మహత్త్వముచేత, సుబాహు = సుబాహుఁ డనురాక్షసునియొక్క, జయముచేత, ఉపశోభి = ప్రకాశించెడు రామునియొక్క, తమ్ము లయిన కుమారరత్నములకు = లక్ష్మణభరతశత్రుఘ్నులకు, ఆ, భుజద్రవిణశుల్క = సీతయొక్క, అనుజలన్ = చెల్లెండ్రైనయూర్మిళామాండవీశ్రుతకీర్తులను, జాత = పుట్టిన, బాంధవ = బంధుత్వమునందుఁ గల, రుచిన్ = అపేక్షచేత, “అభిషంగే స్పృహాయాంచ గభస్తౌ చరుచిస్స్త్రియా” మ్మని అ. ఘనహృదబ్జామోదగరిమచేతను నొసఁగెను, భరతశత్రుఘ్నులును సమీపమున లేకున్నను వారికి నిచ్చెదనని వెళ్లనాడె ననుట.

వ.

అంతఁ దత్ప్రవృత్తి యాకర్ణించి.

60


క.

తనయులు దాను నపుడు త
జ్జనకుం డరుదెంచి చూచు జనులకు ననుభా
వనిరూఢి మానితానం
తనవోత్సవముగ నొనర్చెఁ దత్పరిణయమున్.

61

రామ. తత్ = ఆకుమారరత్నములయొక్క, జనకుండు= దశరథుఁడు, తనయులు = భరతశత్రుఘ్నులును, అనుభావనిరూఢిన్ = ప్రభావమహిమచేత, మానితానంతనవోత్సవ మయియుండఁగా, తత్పరిణయమున్ = ఆరామాదులవివాహమును. “తథాపరిణయోద్వాహోవయామాః పాణిపీడన” మని అ. ఒనర్చెను.

భారత. తత్ప్రవృత్తి = ఆధర్మరాజుయొక్క ప్రవర్తనను - పెండ్లియాడవలె ననెడి ప్రయత్నము ననుట, ఆకర్ణించి, తనయులు, ధృష్టద్యుమ్నాదులు, తత్ = ద్రౌపదియొక్క, జనకుండు = ద్రుపదుఁడు, అరుదు, ఎంచి చూచుజనులకు, అను = అరు దనెడి, భావనిరూఢి = తలఁపుయొక్క దార్థ్యమును. మాని = చాలించి, తాను, అంత.

వ.

అందు.

62

అందు = ఆవివాహమందు.

క.

త్రిజగద్భూషణ మగుభూ, మిజనాదృతశీలఁ గృష్ణమృగనేత్రఁ బురం
ధ్రిజనులు గయిచేసిరి సొం, పు జనింప వివాహయోగ్యభూషావిధులన్.

63

భారత. భూమిజనాదృతశీలను, కృష్ణన్ = ద్రౌపదిని, కడమ సులభము.

రామ. భూమిజను = సీతను, ఆదృతశీలను, కృష్ణమృగనేత్రన్ = హరిణాక్షిని, పురంధ్రిజనులు = ముత్తైదువలు, పురంధ్రిశబ్ద మికారాంతమునకు, "పురంధ్రిభిశ్చక్రమశః ప్రయుక్త” మని కాళిదాసుప్రయోగము. కయిచేసిరి = అలంకరించిరి.

మహాస్రగ్ధర.

లలనం గైసేసి కాంత ల్రమణగృహమహా
            లక్ష్మివై యొప్పు మంచుం
గలితాశీర్వాద లై రక్కడ మము గురుభా
            గ్యస్థితుల్ మీఱ నీదృ
గ్బలవన్మాల్యాంగరాగాభరణవసనసౌ
            భాగ్యలక్ష్మీకలై కాం
తలగత్సంసేవలందుఁ దలఁపు మనుచు ను
            త్కంఠఁ బ్రాపించి రందున్.

64

రామ. అక్కడమముగురు = ఊర్మిళామాండవీశ్రుతకీర్తులు, ఈదృక్ = ఈసీతాలంకారమువంటి, మాల్యాంగరాగాభరణవసనములయొక్క, సౌభాగ్యలక్ష్మీకలై = సౌభాగ్యాతిశయము గలవారై, కాంత = పతులయందు, లగత్ = తగిలిన, సంసేవలందున్ = పతిసేవలం దనుట, తలఁపు = కోరికను, మనుచు = పోషింపుచున్న, ఉత్కంఠను బ్రాపించిరి = పతిసేవకు వేగిరించి రనుట.

భారత. లలనంగైసేసి రమణులయొక్కగృహములకు, మహాలక్ష్మివై = ఒప్పిదమవై, ఉండుమంచుఁ గృతాశీర్వాద లైరి, ఆకాంత లనెడుమాట, అక్కడన్ = ఆపతిగృహములయందు, మమున్ = మమ్మును, గురుభాగ్య, ఈదృక్ = ఇప్పటిశృంగారమువలెనే, సౌభాగ్యలక్ష్మీకలా = సౌభాగ్యసంపత్సమృద్ధియొక్క, ఏకాంత = మిక్కిలియు, లగత్ = తగిలిన - ఆసక్తి గలయట్టి వనుట, సంసేవలందున్ = అనుభవములయందును, ఫలితార్థము, ఇటువంటియలంకారములు ధరియించెడువేళ ననుట, తలఁపుమనుచు నుత్కంఠఁ బ్రాపించిరి.

వ.

తద్వధూజనకుండును
దత్కాలసముపస్థితం బైననరసమాగమం
బున కత్యంతసంతుష్టుం డగుచు ననంతవిభవసంపదలు వొదల నెదు
రుకోలు సేయించి తత్ప్రవేశోత్సవంబు నడపునప్పుడు.

65

రెంటికి సరి - సులభము.

సీ.

నృపకన్యకలకనిందితనవభ్రమరకా
            స్యవిలాసలక్ష్మీనిరస్తపూర్ణ
తారకాధిపతుల కారయఁ దత్పూర్వ
            భవసంచితోరుతపఃఫలంబు
లేగురుశుభగుణభోగాంచితులు వీర
            లీరీతిఁ దగఁ బతులై రటంచు
లోకరక్షణచతురాకారభాగ్దివ్య
            విమలతేజోవిలాస మిది యనుచు


తే.

నర్థి నేతెంచి చూచెఁ బౌరాళి యత్యు
దారమణిభూషణోజ్వల దాశరథుల
మాంగలికవస్త్రరత్నభూషాంగరాగ
పాండుసూనులఁ గన్నులపండువుగను.

66

భారత. అలకనిందితనవభ్రమరకు "అలకాశ్చూర్ణకుండలాః" అని అ. ఆస్యవిలాసలక్ష్మిచేత, నిరస్త = తిరస్కరింపఁబడిన, తారకాధిపునియొక్క, తులకున్ = సామ్యము గలదానికి, నృపకన్యకున్ = ద్రౌపదికి, తత్పూర్వభవ = ఆద్రౌపది పూర్వజన్మమందు, సంచిత = సంపాదింపఁబడిన, తపస్సుయొక్క ఫలంబులు, ఏగురుపతు లై రటంచును, చతుర = సమర్థములైన, ఆకారములను, భాక్ = పొందిన, దివ్య = ధర్మానిలశక్రాశ్వినులయొక్క, తేజః = అంశలయొక్క మణిభూషణములచేత, ఉజ్జ్వలత్ = ప్రకాశింపుచున్న, ఆశ = దిక్కులుగల, రథులన్ = రథములు గలవారిని, మాంగలిక = శుభార్థములైన, వస్త్రాదులు గల, పాండుసూనులన్ = పాండవులను, కన్నులపండువుగఁ బౌరాళి యేతెంచి చూచెనని యన్వయము. ద్రౌపది పూర్వజన్మమందు నీశ్వరునిఁ గూర్చి తపస్సు చేసి యైదుగురుపతుల వేఁడెనని యాదిపర్వములో విస్తారముగాఁ జెప్పియున్నది.

రామ. నృపకన్యకలకు, అనిందిత = నిందింపఁబడని, నవ, భ్రమరక = ముంగురులు గల, “తే లలాటే భ్రమరకాః” అని అ. ఆస్య = ముఖములయొక్క, విలాసలక్ష్మిచేత, నిరస్త = తిరస్కృతుఁడైన, పూర్ణతారకాధిపతి గలవారికి, లోక = భువనములయొక్క, "లోకస్తు భువనే జనే” అని అ. రక్షణార్థమైన, చతుః = నాలుగైన, ఉజ్జ్వల = ప్రకాశించుచున్న, దాశరథులన్ = దశరథపుత్రులను, అంగరాగ = మైపూతలును, పాండు = ధవళములైన, సూనులన్ = పుష్పములును గలవారిని, దాశరథులఁ బౌరాళి చూచెను.

చ.

అలఘుతరాజవంశమణులై విలసిల్లెడునక్కుమారకుల్
నలుగురు రూపవైభవకళల్ గడు మీఱుచు సద్గుణాతిశీ
తలచతురాకృతిన్ మెఱయు తజ్జనకాన్వయభాగ్యలక్ష్మి నా
నలరెడు పెండ్లికూఁతుల సదాదర మొప్పఁగ నోలిఁ బెండ్లి యై.

67

రామ. అలఘుతర, అజ = అజునియొక్క, వంశమునకు, మణులై = అలంకారమైనవారై, విలసిల్లెడు, నలుగురు = రామలక్ష్మణభరతశత్రుఘ్నులు, చతుః = నాల్గైన, ఆకృతిన్ = ఆకారములచేత, మెఱయు, తత్ = ఆ, జనక = జనకునియొక్క, అన్వయభాగ్యలక్ష్మినా నలరెడు పెండ్లికూఁతుల - జనకునిభాగ్యలక్ష్మి నాలుగాకారములై యున్నవారి నని యుత్ప్రేక్ష. పెండ్లియై, అతులితానందమునఁ బేర్చిరి యని ముందరిపద్యములోఁ గ్రియ.

భారత. అలఘుతన్ = అలఘుత్వమున, రాజవంశ = చంద్రవంశమునకు, "రాజాప్రభౌ నృపే చంద్రే" అని వి. అక్కుమారకులు = పాండవులు, చతురాకృతిన్ = మనోహరాకృతిచేత, నలు = నలునియొక్క, గురురూపవైభవకళలను, మీఱుచు, తత్ = ఆద్రౌపదియొక్క, జనక, పెండ్లికూఁతు, లసదాదర మొప్పఁగ, కడమ సరి.

తే.

అతులితానందమునఁ బేర్చి రంత విదుర
మంత్రి ధృతరాష్ట్రుఁ డమ్మహామహులతండ్రి
వినిహతమనోవిచారుఁ డై తనదుపురికిఁ
గొడుకుల వధూయుతముగఁ దోడ్కొంచు రాఁగ.

68

భారత. విదురమంత్రి = విదురుఁడు మంత్రిగాఁ గల, ధృతరాష్ట్రుఁడు, అంత = వివాహవృత్తాంత మంతయు, విని, హతమనోవిచారుఁడై, పాండవు లేమైరో యనువిచారమును విడిచి, తనదుపురికి, కొడుకులన్ = ధర్మరాజాదులను, వధూయుతముగన్ = ద్రౌపదితోఁ గూడ, తోడ్కొంచురాఁగ = తోడి తెచ్చుటకు, అనుప నని ముందరిపద్యమున నన్వయము.

రామ. అంత, విదుర = వివేకులైన, “జ్ఞాతాతువిదురోవిందః” అని అ. మంత్రి = ప్రధానులచేత, ధృత = ధరింపఁబడిన, రాష్ట్రము గలవాఁడు, వినిహతమనోవిచారుఁడై, పుత్త్రుల కనుకూలవివాహము లాయెను గనుక, రాఁగన్ = రాఁగా.

సీ.

ప్రౌఢాఁ బేర్చినవారిభావ మెలర్పంగ
            ననుపశాంతాత్మత నరుగుదెంచి
రాకుమారుల వైరిలోకాభిగమ్యభు
            జావిజృంభణగుణశ్లాఘనుండు
వీరు నర్జునుఁ బరశూరు లసత్ప్రతా
            పాన్వితభీమబాహాసహాయుఁ
డై యోర్చినట్టియాహవజయశోభిరా
            ముండని వేడ్క పెంపున వెదకుచుఁ


తే.

బఱపె మిక్కిలిఁ జూడ్కులందఱిని గడచి
యవల దాశరథిశ్రేష్ఠుఁ డైనయతని
పైఁ బురస్థితజనకదంబకము చిత్త
ముల మహాదరసంభ్రమ మొలయ నపుడు.

69

రామ. నవ = నూతనమైన, అరిభావము = శత్రుత్వము, ఎలర్పంగ, అనుపశాంత = శాంతము గాని, ఆత్మతన్ = బుద్ధి గలవాఁ డౌటచేత, ఆరుగుదెంచి, రాకుమారులవైరి, శ్లాఘనము గలవాఁడు, అర్జునున్ = కార్తవీర్యార్జునుని, పరశు = గండ్రగొడ్డలిచేత నగు, ఊరు = అధికమైన, లసత్ప్రతాపముతోడ, అన్విత = కూడిన, బాహా = భుజములు, సహాయముగాఁ గలవాఁడై, ఓర్చినట్టి = జయించిన, రాముండు = పరశురాముఁడు, అనిన్ = యుద్ధమందు, పురః = ముందట, స్థితజనకదంబకముయొక్క, చిత్తములను, మహా, దర = భయమువల్ల నైన, సంభ్రమము = బెగడుట, ఒలయన్ = వర్తింపఁగా, అతనిపైన్ = రామునిపై, చూడ్కులఁ బఱపెను.

భారత. ప్రౌఢిఁ బేర్చినవారిని, అనుపన్ = అంపినను, ఆకుమారు లరుగుదెంచిరి, ఆవైరిలోకాభిగమ్య = శత్రుజనమునకుఁ బొందరాని, భుజా = బాహువులయొక్క, “దోః ప్రవిష్టో భుజో బాహుర్భుజాసంకథ్యతే బుధైః” అని యా. విజృంభణగుణ, శ్లాఘన్ = శ్లాఘనచేత, ఉండువీరున్ = అర్జునుని, భీమ = భీమునియొక్క, బాహాసహాయుఁడై పరశూరులన్ = శత్రువీరులను, ఓర్చినట్టి, ఆహవజ = యుద్ధజన్యమైన, యశ = కీర్తిచేత, అభిరాముండు, అని వెదకుచు, అవలత్ = చలింపని, ఆశన్ = అపేక్షచేత, పుర = పట్టణమందు, స్థితజనకదంబకము, కర్త.

వ.

కనుంగొనుజనులు తదనంతరంబ.

70


సీ.

ఎంతయు నద్భుతం బీరామభార్గవ
            రామలసత్ప్రౌఢి యేమి చెప్ప
బలవదనేకపతుల నానుగుణ్యంబు
            జగదుపశ్లోకితంబుగ భజించెఁ
గంటిరే యనువారు గడఁక నేతద్వర
            పురుషు లన్యోన్యంబు నొరసి యెవ్వ
రెట్టు గాఁగలవారొ యిటమీఁద ననుశంక
            మదిఁ బెట్టువారు నక్కొదవ లేల


తే.

యొదవు మనభాగ్యమహిమ కయోనిజాత
మహితనయ కృష్ణమృగనేత్ర మంజుగాత్ర
యైదువతనంబుప్రోక మాయమ్మ యనుచు
సతికిఁ గేలోడ్చువారు నై సందడిలిరి.

71

భారత. ఈరామ = ద్రౌపది, భార్గ = భర్గసంబంధమైన, వర = వరములయొక్క, అమల = నిర్మలమైన, సత్ప్రౌఢి = మహత్వమును, బలవత్ = బలవంతులైన, అనేకపతులన్ = అయిదుగురుభర్తలను, భజించెను. ఏతత్ = ఈద్రౌపదియొక్క, వర = పతులైన, పురుషులు, అన్యోన్యంబు నొరసి యెట్టు గాఁగలవారొ, జనులు ద్రౌపదితో ననెడుమాట, మనభాగ్యమహిమకు నక్కొదవ లేల యొదవు, మహితమైన, నయ = నీతిగలదానా, కృష్ణ = ద్రౌపదీ, అనుచు సందడిలిరి.

రామ. ఈరామభార్గవరాముల, లసత్ప్రౌఢి, అనేకప = గజములయొక్క, “ద్విరదో నేకపోద్విపః” అని అ. తులన్ = సామ్యముచేత, ఏతత్ = ఈ, వరపురుషులు, మహితనయ, కృష్ణమృగనేత్ర, కడమ సులభము.

వ.

మఱియును.

72


చ.

చనియెఁ బ్రశాంత మై యనలసత్వరహేతివిహారవృత్తిచే
తన యని వింటి మిట్టియతిధర్ము యమోదయు రాజమానశా

సనుఁ గొనివచ్చెఁ దానవరజస్ఫురణాఢ్యునిఁ జేసి క్రమ్మఱన్
మనపృథగూఢభాగ్యమహిమస్థితి యిట్టిది వో విచిత్రముల్.

73


రామ. అనలస = అమందమైన, త్వర = వేగముగల, హేతి = ఖడ్గముయొక్క, “రవేరర్చిశ్చ శస్త్రం చ వహ్నిజ్వాలాచ హేతయః" అని అ. విహారమందు, వృత్తి = వర్తన గల, చేతన = బుద్ధి, "ప్రతిపద్జ్ఞప్తి చేతనా” అని అ. ప్రశాంతమై చనియె నని వింటిమి. ఇట్టియతిధర్మున్ = మునిధర్మము గలవాని, యమోదయున్ = యమముయొక్క, యుదయము గలవాని, “శరీరసాధనాపేక్షం నిత్యం యత్కర్మ తద్యమః” అని అ. రాజమానశాసనున్ = క్షత్రియగర్వాపహారి యైనపరశురాముని, మన = మనయొక్క, పృథక్ = వేఱువిధముగా, ఊఢ = వహింపఁబడిన, భాగ్యమహిమస్థితి, కర్త, క్రమ్మఱ, నవ = నూతనమైన, రజోగుణముయొక్క, స్ఫురణాఢ్యునిఁ జేసికొనివచ్చెను. అని యనేకు లనేకవాక్యములు పలుకనని ముందటిపద్యమున కన్వయము.

భారత. గూఢమైన భాగ్యమహిమస్థితి గలది, మనపృథ = కుంతి, అనల = అగ్నియొక్క, సత్వర = తీవ్రమైన, హేతి = జ్వాలలయొక్క, విహార, వృత్తిచేతన = వర్తనచేతనే, ప్రశాంతమై చనియెనని వింటిమి, అతిధర్ముని, యమోదయున్ = ధర్మజుని, రాజమాన = ప్రకాశింపుచున్న, అవరజ = తమ్ములయొక్క, “యవీయో వరజానుజాః” అని అ. స్ఫురణాఢ్యునిఁ జేసి క్రమ్మఱఁ దాను గొనివచ్చెను.

తే.

అని యనేకు లనేకవాక్యములు పలుక
నట్లు చనుదెంచినట్టి భీమాగ్రజన్ము
నిజపురస్స్థాయిగాఁ గాంచి నిఖిలలోకు
లును సముద్వేగవినతు లై వినుతి సేయ.

74

భారత. సముద్వేగ = సంతోషాతిశయముతోఁ గూడునట్టుగా.

రామ. భీమ = భయంకరుఁడైన, అగ్రజన్మున్ = బ్రాహ్మణునిఁ - బరశురాముని, 'ద్విజాత్యగ్రజన్మభూదేవబాడబాః” అని అ. నిజపురః = తనముందట.

ఉ.

పేర్మినివిగ్రహించినను భీమధనంజయలీలఁ బేర్చుత
ద్ధర్మజతేజ మాత్మజుప్రతాపసమృద్ధి నడంచు నంచు నం
తర్మనుఁ డై మహీధవుఁడు తత్సమరాజ్యసమర్పణంబుఁ దా
నిర్మలవృత్తిఁ జేయుటయనీతిగ నెంచెఁ గడున్ మనంబునన్.

75

రామ. ధనంజయ = అగ్నియొక్క, “వీతిహోత్రో ధనంజయః" అని అ. లీలఁ బేర్చు, తద్ధర్మజతేజము = ఆపరశురామునివింటివలనఁ బుట్టిన శౌర్యము, అంతర్మనుఁడై = ఖిన్నమనస్కుఁడై, “దుర్మనా విమనా అంతర్మనాః" అని అ. మహీధవుఁడు = దశ రథుఁడు, తత్ = ఆరఘునాథునియొక్క, సమర = యుద్ధ మనెడి, ఆజ్యముయొక్క సమర్పణంబుఁ జేయుట, యనీతిగ నెంచెను.

భారత. భీమ = భీమునియొక్కయు, ధనంజయ = అర్జునునియొక్కయు, ఆత్మజు = దుర్యోధనునియొక్క, మహీధవుఁడు = ధృతరాష్ట్రుఁడు, తత్ = ఆధర్మజునకు, సమ, రాజ్యసమర్పణంబుఁ జేయుటయ, నీతిగ నెంచెను.

సీ.

అ ట్లాత్మ నెంచినయర్ధరాజ్యమహిమ
            తేజప్రదీప్తుఁ డారాజు ప్రియము
తో నమర్చి యనుపమానసపర్యాప్తి
            నెరపుచు నాదరోన్మేష మొప్ప
సప్రణతిగ నమ్మహిప్రభునానతి
            గైకొని నిలక శీఘ్రంబ యరిగి
ప్రథితమహాచలేంద్రప్రస్థపుటభేద
            నప్రభువైశిఖోగ్రప్రతాప


తే.

కలితుఁ డురుదండనీతిభార్గవుఁడు నిజభు
జైకవశసర్వధరణిపార్థాఢ్యుఁ డగుచు
నవరజస్థితిబంధురాజ్యవిరళరతిఁ
బొదలి యభిరామవర్తనంబునఁ జెలంగె.

76


భారత. అర్ధరాజ్యమహిమను, అమర్చి = ఇచ్చి యనుట, అనుపఁగా, మానసపర్యాప్తిన్ = మనఃపూర్తిని - సంతోషము ననుట, సప్రణతిగన్ = నమస్కారసహితముగా, అమ్మహిప్రభుని = ఆధృతరాష్ట్రునియొక్క, ఆనతి = వాక్యమును, కైకొని, ప్రథిత = ప్రసిద్ధమైన, మహ = ఉత్సవములచేత, “మహ ఉద్ధవ ఉత్సవః” అని అ. అచల = స్థిరమైన, ఇంద్రప్రస్థ మనెడి, పుటభేదన = పట్టణమునకు, “పట్టణం పుటభేదన” మని అ. ప్రభువై, శిఖా = జ్వాలభంగి, “అర్చిర్హేతిశ్శిఖాస్త్రియా" మ్మని అ. ఉగ్రమైనప్రతాపముతోడ, కలితుఁడు = కూడినవాఁడు, ఉరుదండనీతియందు, భార్గవుఁడు = శుక్రునిఁబోలినవాఁడు, ధరణి = భూమిగలవాఁడు, పార్థాఢ్యుఁడు = పృథాపుత్త్రజ్యేష్ఠుఁడు, అవరజస్థితిన్ = తమ్ములకూటమిచేతను, బంధురాజి = ఆత్మజనసహాయముయొక్క, అవిరళరతిన్ = అధికానురాగముచేతను, చెలంగెను.

రామ. అట్లాత్మ నెంచి, నయ = నీతిచేత, ఋద్ధ = వృద్ధిఁ బొందింపఁబడిన, “అద్గుణః” అని సూ. రాజ్యమహిమచేతను, తేజ = ప్రతాపముచేతను, ప్రదీపుఁడు, ఆరాజు = దశరథుఁడు, అనుపమాన = అసమానమైన, సపర్యాప్తిన్ = పూజావిధిని, "సపర్యా తర్పణం బలిః" అని అ. నెరపుచు, సప్రణతిగన్ = సప్రణతిసహితుఁ డౌచు నుండఁగా ప్రణమిల్లుచుండఁగా ననుట, అమ్మహిప్రభునియొక్క, ఆనతి = ఆనమస్కారమును, కైకొని, నిలక = నిలువక, సేవాదులను జేకొనక యనుట, మహాచలేంద్ర = క్రౌంచపర్వతముయొక్క, ప్రస్థ = చరిపట్టుయొక్క, “ప్రస్థోస్త్రీ సానుమానయోః" అని అ. పుట = బంధనముయొక్క, భేదనమందు, ప్రభు = సమర్థమైన, వైశిఖ = విశిఖసంబంధమైన, ఉగ్రప్రతాపముతోడ, కలితుఁడు, ఉరుదండనీతి, భార్గవుఁడు, నిజభుజైకవశము లైన, ధరణిప = భూపతులయొక్క, అర్థాఢ్యుఁడు, అర్థప్రాణముగలవాఁడు, నవమైన, రజ = రజోగుణముయొక్క, స్థితిచేతను, బంధుర = సమర్థమైన, ఆజి = యుద్ధమందుఁగల, ఆవిరళరతిచేతను, పొదలి, అభిరామ = రాముని కెదురైన, వర్తనంబునఁ జెలంగెను.

వ.

ఇట్లు ప్రవర్థిల్లుచుండ.

77


క.

సత్యైక్యముకతమున వీ
రత్యంతము నిర్విభేదు లయ్యు నతనుమా
యాత్యాజిత మైత్రీసా
తత్యతఁ దమలోనఁ బోరెదరొ యనుశంకన్.

78

రామ. సత్య = యథార్థమైన, ఐక్యముకతమునన్ = ఇద్దఱు నావిష్ణువునవతారము లైన నిమిత్తమున, వీరు రామభార్గవరాములు, నిర్విభేదు లయ్యును, అతనుమాయా = ఆధికమైన మాయచేత, త్యాజిత = విడిపింపఁబడిన, మైత్రి యొక్క సాతత్యతన్ = ఎడతెగమి గలవా రౌటచేత, పోరెదరొ యనుశంకను, కయ్యంబుల వేడుకకాఁడు వచ్చెనని ముందటిపద్యములోఁ గ్రియ.

భారత. సతీ = భార్యయొక్క ఐక్యముకతమున, వీరు = పాండవులు, నిర్విభేదు లయ్యున్ = బెరకు లేనివా రయ్యును, అతనుమాయా = మన్మథమాయచేత.

క.

కయ్యంబులవేడుకకాఁ, డయ్యున్నతకలహకేళికాకాంక్షకుఁ డై
నెయ్యమున వచ్చె నారదుఁ, డయ్యెడ దివినుండి వారి నభిదర్శింపన్.

79

భారత. కయ్యంబులవేడుకకాఁ డయ్యున్ = యుద్ధాపేక్ష గలవాఁడై యుండియు, నత = అణఁగినట్టి, కలహకేళికా = కలహక్రీడయందుల, ఆకాంక్ష గలవాఁడై, పాండపులమీఁదిదయచేఁ గలహకాంక్ష విడిచి యనుట, దివినుండి = స్వర్గముననుండి, వారిన్ = పాండవులను, అభిదర్శింప = చూచునిమిత్తమై, నారదుఁడు వచ్చెను.

రామ. కయ్యంబులవేడుకకాఁడు, అయ్యున్నతకలహకేళికి, ఆకాంక్షకుఁడై, వారిక్ = రామభార్గవులను, చూచెడి కొఱకు.

వ.

అప్పుడు.

80

ఉత్సాహ.

ఆనరాధిపతికుమారకాగ్రయాయి దమ్ములుం
దాను బరశుభాసమాన ధాముఁడైనమునికిఁ బెం
పూన నర్ఘ్యముఖ్యవిధులనూనముగ నొనర్ప న
మ్మౌనివరుఁడు నవగణితసమస్తతదుపచారుఁ డై.

81

రామ. ఆనరాధిపతికుమారకాగ్రయాయి = దశరథునికి జ్యేష్ఠపుత్త్రుఁడైన రాముఁడు, పరశు = గండ్రగొడ్డలిచేత, భాసమాన = ఒప్పుచున్న, ధాముడైన = ప్రతాపము కలవాఁడైన, మునికిన్ = పరశురాముని కనుట, ఆమ్మౌనివరుఁడును, అవగణిత = ఎంచఁబడని, తత్ = ఆరామునిచేతను, ఉపచారములు గలవాఁడై.

భారత. అనరాధిపతికుమారకాగ్రయాయి = ఆరాజకుమారశ్రేష్ఠుఁ డైనధర్మరాజు, పరశుభాసమానధాముఁడైన = పరులకు శుభకరమై యసమాన మైన తేజస్సు గలవాఁ డైన, మునికిన్ = నారదునికి, అమ్మౌనివరుఁడు, నవ = క్రొత్తవునట్టుగా, గణిత=ఆదరింపఁబడిన, తత్ = ఆపాండవులయొక్క, కడమ సరి.

వ.

పదంపడి నిజభ్రూచలనదూరనిరస్తసమస్తజనుం డగుచు నతని నుప
లక్షించి తదనుజసమక్షంబున.

82


క.

అకళంకిత ని ట్టనుఁ గొం
చకయేమీమనముసమరసముదారక్రీ
డకు నొండొరుమాఱ్కొనుట దొ
రకు నసి వచ్చితి నెఱుంగ రావా కినుకల్.

83

రామ. ఇట్టనున్ = పరశురాముఁడు రామునితో ననెడుమాట, ఏమీ, మనము = ఇద్దఱమును, సమర = యుద్ధమనెడి, క్రీడకు మాఱ్కొనుట దొరకునని కొంచక వచ్చితిని, కినుకలు = కలహోద్యోగములు, ఎఱుంగరావా = తెలియఁబడవా, భర్త్సనావాక్యము.

భారత. ఇట్టనున్ = నారదుఁ డనెడుమాట, ఏను, మీమనము = అన్నదమ్ములైన మీమనస్సు, దారక్రీడకు = ద్రౌపదీసంభోగమునకు, సమరసము = సమానరాగమైనది, "శృంగారాదౌ రసే వీర్యే గుణే రాగే ద్రవే రసః” ఆని వి. అటుగనుక, ఒండొరు మాఱ్కొనుట = మీ రొకరొకరితోఁ గలహించుట, దొరకున్ = సంభవించును, అని, వచ్చితిన్ = ప్రతీకారము సేయ వచ్చితి ననుట, ఎఱుంగరావు, అకినుకులు = ఆలాగు స్త్రీమూలమైన కోపములు, చెప్పినట్టు రావనుట.

క.

చేతశ్చిత్రము గాదె స, మాతతగుణసార్థసిద్ధిమద్రామమహా
ఖ్యాతి పతివ్రత యి ట్లవి, ఘాతముగ ననేకభర్తృకత నడపు టిలన్.

84

భారత. సమాతత = విస్తృతమైన, గుణసార్థ = గుణసమూహముయొక్క, “సంఘసార్థౌ” అని అ. సిద్ధిమత్ = సిద్ధిగల, రామ = రమణి ద్రౌపది, మహాఖ్యాతి = అధికఖ్యాతి గలది, పతివ్రత, ఇ ట్లవిఘాతముగ, అనేకభర్తృకత = పెక్కండ్రుభర్తలు గలదౌటను, నడపుట, చేతశ్చిత్రము గాదె.

రామ. సమాతతగుణములచేత, సార్థసిద్ధి = అర్థసిద్ధిసహితమైనది, మత్ = నాయొక్క, రామ = రాముఁ డనెడి, మహత్ = అధికమైన, ఆఖ్యా = నామధేయ మనెడి, అతిపతివ్రత, అనేకభర్తృకతన్ = అనేకభర్తలు గలదౌటను, నడపుట = అసాధారణముగా నాయం దుండెడి రామాఖ్య మఱియొకరియం దుండుట, చిత్రము గాదె.

ఆ.

ఇదియ నాకు మీకు నితరేతరద్వేష
హేతు వనుచుఁ దోఁచె నేకతన్వి
భూతినెరపు నేను బుంవ్యక్తులకు నాలి
తనముతో సమాఖ్య మనుచుటెట్టు.

85

రామ. ఇదియ = ఈరామశబ్దమే, నాకు మీకును ద్వేషహేతు వనుచుఁ దోఁచెను, ఏకతన్ = ముఖ్యత్వమున, విభూతి = ఐశ్వర్యమును, నెరపు నేను, పుంవ్యక్తులకు = పురుషులకు, నాలితనముతోన్ = కొంచెపుతనముతో, సమాఖ్య = సమమైనయాఖ్యను, మనుచుటెట్టు, ఆఁడువారికి రామాఖ్యగాక నాముందటఁ బురుషులకునా యనుట.

భారత. ఇదియ = ఏకపత్నీభోగము, మీ కన్యోన్యవైరమూల మనుచు నాకుఁ దోఁచుచున్నది, ఏకతన్వి = ఏకయైనకాంత, భూతి నెరపు నేనుబుంవ్యక్తులకున్ = ఐశ్వర్యమును నెరపెడియయిదుగురుపురుషులకును, ఆలితనముతోన్ = భార్యయయి, సమాఖ్య మనుచు టెట్టు = కీర్తి చెడకుండ నిర్వహించు టేలాగు.

చ.

భవదుపయామకాలమునఁ బర్వినసుద్దులు విన్నవాఁడ నా
భవువరధర్మ మట్టగుట భావములో నిడి మాకు శంక లె
య్యవి యని యుబ్బు టొప్ప దివి యావరశక్తికి లోనుగా వశ
క్యవిజయముల్ మదీరితమహాశరమణ్యవరుద్ధయుద్ధముల్.

86

ఉపయామకాలమునక్ భారత. భవత్ = మీయొక్క, ఉపయామకాలమున = వివాహసమయమందు, పర్వినసుద్దులు = వ్యాసులు చెప్పిన పంచేంద్రోపాఖ్యానము మొదలయినవార్తలను, విన్నవాఁడను, అభవు= ఆయీశ్వరునియొక్క, వరధర్మము = వరమురీతి, అట్టగుట = అయిదుగురుపతుల నిచ్చుటను, ఇవి = స్త్రీమూలములైన వైరములు, ఆవరశక్తికి = ఈశ్వరవరమాహాత్మ్యమునకు, లోను గావు, జగడాలు పుట్టకుండ వరము లేదనుట, అటు గనుకనే, అశక్యవిజయముల్ = జయింపరానియట్టివి, మత్ = నాచేత, ఈరిత = పలుకఁబడిన, సుందోపసుందోపాఖ్యాన మనుట, మహాశ = అధికసురతాపేక్షగల, రమణీ = స్త్రీలచేత, అవరుద్ధ = నిలుపఁబడిన - కల్పింపఁబడిన వనుట, యుద్ధము లశక్యవిజయములని యన్వయము.

రామ. నాభవు = నాగురువైన యీశ్వరునియొక్క, వరధర్మము = దొడ్డవిల్లు, అట్టగుట = విఱువఁబడుటను, ఆవరశక్తికి = ఆవిల్లు విఱిచిన సత్త్వమునకు, మత్ = నాచేత, ఈరిత = ప్రయోగింపఁబడిన, మహాశరమణి = మహాస్త్రశ్రేష్ఠములచేత, అవరుద్ధ = నిలుపఁబడ్డ - చేయఁబడ్డ వనుట.

క.

విను మంతపనులరాకకు
మునుపుఁగ దచ్ఛాంతిమార్గముం దెలిపెద నొం
డొనరింపుము సమయము ధరఁ
గొనసాఁగి తనర్చెద మనుకోర్కి గలిగినన్.

87

రామ. సమయము = నొవ్వము, ధరన్ = భూమియందు, కొనసాఁగి తనర్చెదము = ఉత్తరోత్తరముగా నుండెదము, అనుకోర్కి గలిగినను, ఒండు = ఒకటిని, ఒనరింపుమని క్రిందటి కన్వయము.

భారత. ఒండు =ఒకటైన, సమయము = సంకేతమును, ఒనరింపుము.

చ.

సమరసరూఢిమచ్చరితసాధ్వసమాకృతిఁ బర్వ రాజస
త్వమదనిరాసివక్త్రమగువం దనధర్మము పూని కొల్వు సే
యు మనుము నీకుఁ దమ్ములకు నొక్కనియొక్కనియింట నేఁడు పూ
ర్ణముగ వసించి సొంపు లమరన్ సమయం బిటు సేయు టొప్పగున్.

88

భారత. సమరసన్ = సమానరాగము గలదాని, రూఢిమచ్చరితను = ప్రసిద్ధిగలచరిత్రము గలదాని, సాధు = సుందరమునై, అసమ = సరి లేని ఆకృతి గలదాని, పర్వరాజ = పున్నమచందురునియొక్క, సత్వమద = చారుత్వగర్వమును, నిరాసివక్త్రన్ = తిరస్కరించెడు ముఖము గలదాని, మగువన్ = ద్రౌపదిని, తనధర్మము పూని = పతివ్రతాధర్మముఁ బూని, ఒక్కనియొక్కనియింటను, ఏఁడు = వత్సరము, పూర్ణముగ నమరఁ గొల్వు సేయుమనుము.

రామ. సమర = యుద్ధమందు, సరూఢి = ప్రసిద్ధితోఁ గూడిన, మత్ = నాయొక్క, చరిత = చరిత్రమువల్ల నైన, సాధ్వసము = భయము, ఆకృతిఁ బర్వ = ఆకారమునఁ గానరాగా, రాజసత్వ = రజోగుణముచేత నైన, మద = మదమును, నిరాసి = విడిచిన, వక్త్రమగు = ముఖము గల - ఆరంభము గలదైన యనుట. వందనధర్మముఁ బూని కొల్వు సేయుము, మనుము = బ్రతుకుము, నీకుఁ దమ్ములకు నొక్కనియొక్కనియింట, నేఁడు = ఈప్రొద్దు, నేఁ డని యర్ధబిందు వున్నందుకు, ఉ. 'వాఁడిమయూఖము ల్గలుగువాఁ డపరాంబుధిఁ గ్రుంకె ధేనువు, ల్నేఁ డిట వచ్చె' నని నన్నయభట్టు ప్రయోగము. సొం పులు = విలాసములు, అమరన్ = అమరుటకు, సమయంబు = వేళ, ఇటు సేయు టొప్పగున్ = వందనము సేయునది మేలు.

వ.

మఱియు నొక్కనియమం బెఱింగించెద.

89


క.

విను రామ యొరుని శాంతం
బున సేవయొనర్చుకాలమున నెవ్వఁడు దాఁ
జను దండకార్యగతి నా
యన వర్షాచరితతీర్థయాత్రుఁడుగఁ దగున్.

90

రామ. రామ = సంబుద్ధి, శాంతంబునన్ = శాంతిచేత, "కర్తరిక్తః" సేవ యొనర్చుకాలమున, ఒరుని, దండకార్యగతిన్ = దండోపాయమున, ఎవ్వఁడు, చను = ప్రవర్తించును, ఆయన, వర్ష = వర్షాకాలమందు, ఆచరిత= చేయఁబడిన, తీర్థయాత్ర గలవాఁడు గాఁదగును. “వర్షాకాలే ప్రయాణ" మని యతిక్లేశము గనుక.

భారత. రామ = ద్రౌపది, ఒరు = ఒకరియొక్క, నిశాంతంబునన్ = గృహమందు, “నిశాంతవస్త్యసదన” మని అ. దండకున్ = సమీపమునకు, ఎవ్వఁడు దాఁ జనును, ఆయన, ఆర్యగతిన్ = సన్మార్గమున, వర్ష = సంవత్సర మెల్ల.

క.

అని శమదమహిమవర్తనుఁ
డనిపించుకొని చనియెను సహస్రకరుఁడు నా
యనలసమానౌజస్స్పృ
ష్టిని జిత్రపతంగలీలఁ జెందెఁ జనునెడన్.

91

భారత. అని = పూర్యోక్తప్రకారమునఁ జెప్పి, శమ = అంతరింద్రియనిగ్రహముచేతను, దమ = బహిరింద్రియనిగ్రహముచేతను, హిమ = చల్లనైన, “తుషారశ్శీతలశ్ళీతోహిమః" అని అ. వర్తనముగల నారదుఁడు, అనిపించుకొని = అంపించుకొని, చనియెను, చనునెడ = నారదుఁ డాకాశగమనమునఁ బోవునప్పుడు, సహస్రకరుఁడును = వేయికిరణములు గల సూర్యుఁడును, ఆయనయొక్క, లసమాన = ఒప్పుచున్న, ఓజస్స్పృష్టిని = తేజస్స్పర్శచేత, చిత్రపతంగ = చిత్తరువు సూర్యునియొక్క, "పతంగః పక్షి సూర్యయోః" అని అ. లీలఁ జెందెను.

రామ. అనిశ = ఎల్లప్పుడును, మదమహిమ = గర్వాతిశయముచేత నగు, వర్తనగలవాఁడు, అనిపించుకొని = ఖ్యాతి గని - ఎంచఁబడినవాఁడై యనుట, సహస్రకరుఁడు = కార్తవీర్యుఁడు, చనియెను = నొచ్చెను, నా = నాయొక్క, అనల = అగ్నికి, సమానమైన, ఓజ = తేజస్సుయొక్క, స్పృష్టి చేత, చనునెడన్ = నొచ్చునపుడు, చిత్ర = అద్భుతమైన, పతంగ = మిడుతయొక్క, “సమౌ పతంగశలభౌ” అని అ. లీలన్ = సామ్య మును, చెందెను, ప్రియము చెప్పనందువలన నాప్రతాపాగ్నియందుఁ గార్తవీర్యుఁడు మిడుతవలెనే పడ్డది వినియుండవా యనుట.

ఉత్సాహ.

అంతరహితసమయవృత్తినర్జునుండు ధర్మరా
జాంతికమున కరిగె దృఢనిజాయుధగ్రహేచ్ఛన
త్యంతము గురుధేనుదస్యుతాపితాతిమన్యుమ
త్స్వాంతబాడబప్రశాంతి సలుపనేర కొండుమైన్.

92

రామ. ఇంక రెండుపద్యములఁ గార్తవీర్యార్జునుని భంగములె యుత్ప్రేక్షించుచున్నాఁడు. అంతరహిత = అంతశ్శత్రువులయొక్క, సమయవృత్తిన్ = సమష్టివ్యాపారముచేత, ఆర్జునుండు = కార్తవీర్యార్జునుఁడు, దృఢమైన, నిజాయుధగ్రహేచ్ఛన్ = తనయాయుధగ్రహణమును మానక యనుట, గురు = తమతండ్రి జమదగ్నియొక్క ధేనువుయొక్క, దస్యుతా = చౌర్యముచేత, ఆపిత = పొందఁబడిన, అతిమన్యు = మిక్కిలికోపముగల, మత్ = నాయొక్క, స్వాంతమనెడి బడబాగ్నికిఁ బ్రశాంతిని, ఒండుమైన్ = ఉపాయాంతరమున, చలుపనేరక, ధర్మరాజ = యమునియొక్క, అంతికమునకు నరిగెను. మా కాగ్రహమును బుట్టించి మఱి భూలోకమున నిలువఁగూడదు గనుక ననుట.

భారత. అంతన్ = అంతట, రహిత = విడువఁబడిన, సమయ = సంకేతముగల, “సమయాశ్శపథాచారకాలసిద్ధాంతసంవిదః” అని అ. వృత్తిన్ = వర్తనచేత, అర్జునుండు, గురు = పూజ్యములైన, ధేను = పాడియావులయొక్క, "ధేనుస్స్యాన్నవసూతికా" అని అ. దస్యు = దొంగలచేత, “దస్యుతస్కరమోషకాః" అని అ. తాపిత = తపింపఁజేయఁబడ్డట్టియు, అతిమన్యుమత్ = మిక్కిలిశోకవంతమైన, స్వాంతము గల, బాడబ = బ్రాహ్మణునికి, "ద్విజాత్యగ్రజన్మభూదేవబాడబాః" అని అ. ప్రశాంతిన్ = చిత్తశాంతిని, కడమ సులభము.

క.

ఉదుటున న ట్లరిగి యతం
డది ప్రాయశ్చిత్తతీర్థయాత్రాలీలన్
వదలక పూతము సేయన్
సదమలగతి పూనె వృథయె సత్సంగరముల్.

93

భారత. అతండు = అర్జునుఁడు, అది = పడకింటిలోని ధర్మరాజువద్దికిఁ బోయిన ప్రతిజ్ఞాభంగదోషమును, తే. 'ప్రాణిపదములు వెలిగాఁగఁ బ్రథమలెల్ల, నరయ నొక్కొక్కచో ద్వితీయార్థ మిచ్చు' పూతము సేయన్ = పరిశుద్ధము చేయ, గతి = గమనమును, పూనెను, సత్సంగరముల్ = సత్పురుషుల ప్రతిజ్ఞలు, "ప్రతిజ్ఞాజిసంవిదాపత్సు సంగరః” అని అ. వృథయె = వ్యర్థముగాదు, అని యర్థాంతరన్యాసాలంకారము.

రామ. అతండు = కార్తవీర్యుఁడు, అది = ధేనుచౌర్యదోషమును, పూతము సేయ, ప్రాయశ్చిత్త = పాపపరిహారకర్మమునకు, తీర్థ = రేవైన - ప్రవేశాస్పద మైనదనుట. “యోనౌ జలావతారేచ మంత్రాద్యష్టాదశస్వపి, పుణ్యక్షేత్రే కథా పాత్రే తీర్థం స్యాచ్చ” అని హలాయు. యాత్రా = యుద్ధయాత్రయొక్క, లీలచేత, సదమలగతి = సద్గతిని, పూనెను. సత్సంగరముల్ = లెస్సయుద్ధములు, వృథయె, ఎంతపాపాత్ముఁడేనియు యుద్ధమందుఁ బడినను సద్గతిని బొందును గనుక, ఇందుకు స్మృతి. “ద్వావిమౌ పురుషౌ లోకే సూర్యమండలభేదినౌ, పరివ్రాడ్యోగయుక్తశ్చ రణే చాభిముఖో హతః” ఇటనఁగాఁ బ్రియముఁ జెప్పవలె లేదా లెస్సగాఁ బోట్లాడవలె ననుట.
వ.

అందు.

94


తే.

అతనురణరసభోగికన్యార్థపరతఁ
దా నిలావంతుఁ డనుమహాద్రవిణనిధిని
సుతుల సద్వృత్తిఁ బడద మితయశస్స్వ
లీల సుఖయింతు ననుచింత లే దెపుడును.

95

రామ. అతనురణరసభోగికిన్ = అనల్పమైనయుద్ధము చవి యెఱిఁగినవానికి, అన్యమైన, అర్థ = ప్రయోజనముమీఁది దైన, పరతత్ = తాత్పర్యముచేత, తాను, ఇలావంతుఁడను = భూమి గలవాఁడను, “గౌరిలా కుంభినీ క్షమా” అని అ. ద్రవిణనిధిని = ధనవంతుఁడను, “ద్రవిణం తు ధనం బల" మ్మని అ. సుతులను సద్వృత్తిఁ బడసెదను, మితమైన, యశః = కీర్తి గల, స్వలీలన్ = తనవిలాసముచేత, సుఖియింతు ననుచింత లేదు, యుద్ధప్రియునకు జయతృప్తి లే దనుట.

భారత. అతను = మన్మథునియొక్క, రణ = యుద్ధమందు, రస= వేడుకగల, భోగికన్యా = నాగకన్యయైన ఉలూచియొక్క, అర్థపరతన్ = ప్రయోజనవశతచేత, తాను, ఇలావంతుఁ డనెడు, ద్రవిణనిధిని = బలాఢ్యుని, లసద్వృత్తిని సుతుఁ బడసెను, దమిత = ఆణఁపఁబడ్డ, యశః = కీర్తి గల, స్వలీల = తనక్రీడచేత, సుఖియింతు ననుచింత లేదు, కీర్తి విడిచి తీర్థయాత్రకు నడుమ స్త్రీభోగమును గోరఁడని భావము.

సీ.

తీర్థయాత్రాసమాప్తిఁ గరంబు దనరి రా
            జోపభోగ్యం బైనయుద్ధవసుధ
నతిసరస మగుచిత్రాంగదానామల
            తాంగీకృతసురతావాప్తిఁ జేసి
భాసురనందనప్రసవభూషితవర
            వర్ణినీగురుచిత్రవాహనుండు

తదదూరదేశసిద్ధసరసీపుణ్యతీ
            ర్థోపసేవల మహాశాపకలుష


తే.

నైకనిర్జరీధృతమకరీకలాప
రూపలోపకృజ్జలవిహారుఁడును దివ్య
ధామకలితుండు నై శూరతరుఁ డగునరుఁ
డొప్పెసగురుచిరయశోమహోదయతను.

96

భారత. తీర్థయాత్రాసమాప్తిన్ = వత్సరపరిపూర్తిచేత, ఉద్ధవసుధన్ = ఉత్సవామృతముచే, చిత్రాంగద యనెడినామముగల, లతాంగీ = స్త్రీయందు, కృతమైన, సురత = సంభోగముయొక్క ఆవాప్తిచేత, నందన = పుత్త్రుఁడైన బభ్రువాహనునియొక్క, ప్రసవ = పుట్టుకచేత, భూషిత = అలంకరింపఁబడిన, వర్ణినీగురు = చిత్రాంగదాజనకుఁడైన, చిత్ర వాహనుఁ డనెడిరాజు గలవాఁడు, చిత్రాంగదకుఁ బుట్టినవానిఁ జిత్రవాహనునికి నర్జునుం డిచ్చెద నన్నాఁడని యాదిపర్వమందుఁ జెప్పియున్నది గనుక, తత్ = ఆచిత్రవాహనుని పట్టణమునకు, అదూరదేశ = సమీపదేశమందు, సిద్ధమైన = కలిగిన, సరసియొక్క, పుణ్య = మనోహరమైన, తీర్థ = రేవుల, ఉపసేవలన్ = స్నానములచేత, మహాశాపకలుషలైన, నైకనిర్జరీ = అనేకదేవతాస్త్రీలచేత, ధృత = ధరింపఁబడిన, మకరీకలాపరూప = మకరీసమూహదేహములయొక్క, లోపకృత్ = నాశమును జేసినట్టి, జలవిహారము గలవాఁడు, వారిమకరీరూపశాపమోక్షమును జేసి యనుట, దివ్య = మనోహరమైన, ధామ = తేజస్సుతోడ, కలితుండు = కూడినవాఁడు, నరుఁడు = అర్జునుండు, సగురుచిరయశోమహోదయతన్ = ఘనమైన చిరకీర్త్యతిశయముతోడఁ గూడినవాఁ డౌటచేత, ఒప్పెను.

రామ. తీర్థయాత్రకు, సమ = సమానమైన, ఆప్తిన్ = వ్యాప్తిచేత, యుద్ధవసుధ = రణభూమియందు, అతిసరసమగు = మిక్కిలిప్రియమైన, చిత్ర = ఆశ్చర్యమైన, అంగదాన = శరీరచ్ఛేదమువల్ల నైన, “దో అవఖండనే” అను ధాతువున నిష్ఠాంతశబ్ధము. అమలతా = నిష్కల్మషత్వముచేత, అంగీకృతమైన, సురతా = దేవత్వముయొక్క, అవాప్తిఁ జేసి = ప్రాప్తిచేత, శూరతరుఁడైన, నరుఁడు = పురుషుఁడు, నందన = నందనవనముయొక్క, ప్రసవ = పుష్పములచేత, భూషితములునై, వరవర్ణినీ = ఉ త్తమస్త్రీలచేత, గురు = వ్రేఁగైన, చిత్రవాహనుండు = చిత్తరువుతోఁ గూడిన విమానములు గలవాఁడు, తత్ = ఆనందనవనములకు, అదూరదేశ = సమీపదేశమందున్న, సిద్ధసరసీ = ఆకాశగంగయొక్క, మహాశ = ఆధికాశ గలవారైన, అపకలుష, మకరీకలాప = మకరికాపత్రాలంకారముచేతనైన, “ కలాపో భూషణే బర్హే తూణీరే సంహతావపి” అని అ. రూప = సౌందర్యముయొక్క, "రూపం స్వరూపే సౌందర్యే" అని అ. దివ్యధామ = దివ్య గృహములయందు, ఒప్పెసగు = క్రియ, కడమ సులభము.

తే.

అంత శౌర్యాశ్రయం బైన యట్టిమేటి
వీడు నాకాహవస్పృహాన్వీతధామ
కాంతిఁ జూచిపోయెద నని కదలి వచ్చి
నాఁడ నెఱి సూపుమదనుగుణక్రమమున.

97

రామ. అంతయైన, శౌర్యాశ్రయం బైనయట్టిమేటివి, ఈడు నాకు = నాకు సరియైనవాఁడవు, ఆహవస్పృహ = యుద్ధవాంఛతోడ, అన్వీత = కూడిన, శౌర్యముతోఁ గూడిన దనుట, ధామ = ప్రతాపముయొక్క, కాంతి = స్ఫురణచేత, ఈడైనవాఁడవని క్రిందటి కన్వయము, కాంతిపదము. కముకాంతౌ అన్న యుదాహరణమున నిచ్ఛాపరమైన నవును. యుద్ధవాంఛను బ్రతాపవాంఛను నీడైనవాఁడవు. అటు గనుకనే నచ్చినాఁడను, మత్ = నాకు, అనుగుణక్రమమున, నెఱిసూపు = ఎదిరింపుమా.

భారత. అంతట, శౌరి = కృష్ణునికి, ఆశ్రయం బైనయట్టిమేటివీడు = ద్వారకను, నాక = స్వర్గముతోడ నగు, ఆహవ = యుద్దముయొక్క, స్పృహ = కోరికతోడ, సామ్యముతోడ ననుట, అన్వీత = కూడిన, ధామ = గృహములయొక్క, కాంతిగలదాని, చూచి పోయెదనని వచ్చి, నాఁడ = నాఁడే, మదనునియొక్క, గుణక్రమమునన్ = గుణానుసారమున, చేరి యని ముందటిపద్యమున కన్వయము.

క.

తెరలక మనము సుభద్రా
కరనాళీకగ్రహేచ్ఛ గప్పఁగఁ జనునా
దొర యదుపురిఁ జేరి జనవి
సరముల కెఱుకపడనీక శౌర్యతనుఘృణన్.

98

భారత. మనము = మనస్సును, సుభద్రా = సుభద్రయొక్క, కరనాళీకగ్రహేచ్ఛ = హస్తపద్మగ్రహణవాంఛ, వివాహేచ్ఛ యనుట, కప్పఁగన్ = ఆక్రమింపుచుండఁగా, చనునాదొర = చనుచున్న యర్జునుఁడు, యదుపురిన్ = ద్వారకను, శౌరి = కృష్ణునియొక్క, అతను = ఆనల్పమైన, ఘృణన్ = దయను, "ఘృణా జుగుప్సాకృపయోః” అని వి. ఎఱుకపడనీక, తిరంబై పోయె నని ముందటిపద్యములోఁ గ్రియ.

రామ. మనము = ఇద్దఱమును, సుభద్రాకర = శుభాస్పదమైన, నాళీకగ్రహేచ్ఛ = శరగ్రహేచ్ఛను - యుద్ధవాంఛ ననుట, “నాళీకం శరపద్మయోః” అని వి. కప్పఁగఁ జనునా = అణఁపవచ్చునా, నీకు, అశౌర్యత = శౌర్యహీనత్వముచేతను, ఘృణన్ = జుగుప్సచేతను, పురిన్ = అయోధ్యను, చేరి జనవిసరములకు, యెఱుకపడన్ = కనుపట్టునట్టుగా, దొరయదు = యుక్తము గాదు.

మ.

అనయంబున్ మదనామితాస్త్రకలనాత్యంతార్తి రాకుండఁ జ
య్యన మౌనిత్వకృతేష్టసిద్ధితఁ దిరంబై పోయె దేదీప్యమా
ననిరూఢిం బయిఁబడ్డయాదవులనానావీరధర్మప్రవృ
త్తినిరర్థం బనిపించి యాత్మపురికిం దేవేరితోఁ గూడఁగన్.

99

రామ. మత్ = నాయొక్క, అనామిత = అణఁపఁబడని, అస్త్రకలన = బాణప్రయోగముచేత నైన, అత్యంతార్తి రాకుండ, మౌనిత్వ = నిరుత్తరుత్వముచేత, కృత = చేయఁబడ్డ, ఇష్టసిద్ధితన్ = అభీష్టసిద్ధి గలుగుటచేత, దీప్యమాననిరూఢిచేత, పయిఁబడ్డ = ఆరోపితమైన, ఆ, దవుల = దూరములనున్న, నానావీరధర్మప్రవృత్తి = వార్త, ఆత్మపురికి, పోయెదే = పోయెదవా.

భారత. మదన = మన్మథునియొక్క, అమితమైన, ఆస్త్రకలనా = బాణవిద్యచేత నగు, మౌనిత్వ = మునిత్వముచేత, కృతేష్టసిద్ధితను, సన్న్యాసివేషమున సుభద్రను వరించినవాఁడై యనుట, దేదీప్యమాననిరూఢిం బయిఁబడ్డ, యాదవులయొక్క, దేవేరితోన్ = భార్యతోఁగూడ, పోయెను.

చ.

అనికృతధర్మవీక్షుఁ డయి యావరవర్ణినికామసంభ్రమం
బు నడపుచుం గరం బమరపూజ్యసమిజ్జయశోభిమన్యునా
మునిసుతుఁ గాంచి లక్ష్మణుఁ డముద్రితదీప్తిధనంజయుండు నే
ర్పె నయగభీరవీరసమవేక్ష్యతరోచ్చరణప్రగల్భతన్.

100

భారత. అనికృత = తిరస్కరింపఁబడని, ధర్మవీక్షుఁడయి = ధర్మదృష్టి గలవాఁడై, ఆవరవర్ణిని = సుభద్రయందు, కామసంభ్రమంబు నడపుచును, అమరపూజ్య = దేవతాశ్లాఘనీయమైన, సమిజ్జ = యుద్ధమందుఁ బుట్టిన, యశ = కీర్తి గల, అభిమన్యుఁ డనునామము గలవాని, సుతున్ = పుత్త్రుని, కాంచి, లక్ష్మణుఁడు = లక్ష్మీవంతుఁడు, “లక్ష్మీవాన్ లక్ష్మణః శ్రీలః" అని అ. అముద్రితదీప్తి = అనర్గళమైనదీప్తి గలవాఁడు, ధనంజయుండు = అర్జునుఁడు, నయ = నీతిచేత, గభీరమునై, వీరులచేత, సమపేక్ష్యతర = మిక్కిలి నాశింపఁదగిన, ఉచ్ఛ = ఉన్నతమైన, రణమందుఁగల, ప్రగల్భతన్ = ప్రౌఢిమను, నేర్పెన్ = ఉపదేశించెను.

రామ. అని = ఈలాగునఁ బలికి, కృతమైన, ధర్మవీక్షుఁడయి = వింటియందు దృష్టి గలవాఁడై, వి ల్లెక్కుఁబెట్ట నిశ్చయించినవాఁడై యనుట, ఆవరవర్ణి = ఆనైష్ఠికబ్రహ్మచారి పరశురాముఁడు, “వర్ణినో బ్రహ్మచారిణః" అని అ. నికామ = అత్యంతము, సంభ్రమంబు నడపుచును, కరంబు = మిక్కిలి, అమరఁగా, అముద్రితదీప్తిచేత, ధనంజయుండు = అగ్నిని బోలినవాఁడు, లక్ష్మణుఁడు, పూజ్య = శ్లాఘ్యమైన, సమిజ్జయ = యుద్ధజయములచేత, శోభి = ఒప్పుచున్న, మన్యున్ = క్రోధము గలవాని, ఆమునిసుతు = పరశురాముని, నే ర్పెనయన్ = చాతుర్యయుక్తముగా, ఉచ్ఛరణప్రగల్భతన్ = ఉచ్చారణశక్తిచేత, ఇ ట్లనునని ముందటిపద్యమునఁ గ్రియ.

తే.

కొసర నిట్లను భావంబు పస నెరపుచు
నమ్మహాత్ముతో జిష్ణుతేజోతిశయము
మిక్కిలిఁ బ్రకాశముగ భాతృమిత్రబంధు
సచివులసమాదృతిని జూపి రుచితసరణి.

101

రామ. జిష్ణు = జయశీలమైన, సమాదృతిన్ = అత్యాదరమున, రుచిత = ఒప్పెడి,సరణిచేత.

భారత. ఇట్లు, అనుభావంబు, అమ్మహాత్ముతోన్ = అభిమన్యునితోఁ గూడి, జిష్ణు = అర్జునునియొక్క, ప్రకాశముగన్ = ప్రకటము కాఁగా, సచివులు, అసమ= అతులమైన, ఆదృతిన్ = ఆదరమును, చూపిరి, ఉచితసరణిన్ = తగినరీతిని.

క.

మగలయిలువరుస గలపెను
దగ వరు లొకఁడొకడొకొక్కతనయు రుచిరశౌ
ర్యగతినుతిఁ జెంద ఘనకీ
ర్తిగ నలరంగలరుద్రోవది వరక్రమతన్.

102

భారత. ఘనకీర్తిగ, అల, రంగలరు = రంగు మీఱు, ద్రోవది = ద్రౌపది, తద్భవపదము. ఉ. 'ద్రోవదిబంధురం బయినక్రొమ్ముడి గ్రమ్మన వీడ్చి వెండ్రుకల్, దావలకేలఁ బూని యసితచ్ఛవిఁ బొల్చు మహాభుజంగియో, నా విలసిల్లి వ్రేలఁగ మనంబునఁ బొంగ విషాదరోషముల్, గావగలేక బాష్పములు గ్రమ్మఁగ దిగ్గున లేచి యార్తయై' అని యుద్యోగపర్వమందుఁ బ్రయోగము. తగ, వరులు = పతులు, రుచిర = ప్రకాశించుచున్న, శౌర్యగతి = శౌర్యవర్తనచేత నైన, నుతి = స్తుతి గలవాని, ఒకొక్క, తనయున్ = కుమారుని, చెందఁగా, పరక్రమతన్ = పెద్దపిన్నవరుసను, లేక, వర = శ్రేష్ఠమైన, క్రమతన్ = మర్యాద గలదౌటచేత, మగలయిలువరుస గలపెను.

రామ. మగలయిలువరుస గల = వంశానుగపౌరుషము గల, పెనుదగవరులు = మంచినేర్పరులు, ఒకఁడొకఁడు = ఒక్కొక్కపురుషుఁడే, ఒకొక్క = ఒకానొకటైన, వింతైన దనుట. ఉరు = అధికమైన, చిర = స్థిరమైన, శౌర్యగతి = శౌర్యవర్తనము, నుతిఁ జెందన్ = ప్రసిద్ధ మగునట్టుగా, అలరంగలరు = ప్రకాశింపఁగలరు, అక్రమతన్ = క్రమము దప్పి, త్రోవదివరు.

సీ.

అంత శౌర్యాప్తిచే నధికప్రవర్షసం
            పన్నత దగఁ గాంచియున్న తమగు
దండితనమున వీరుండనేనస్ఫుట
            పటుశక్తి విజయుండ బాలిశుండ
నీకాభిముఖ్యంబు గైకొని సుమనోబ
            లంబుతోఁ దగ నుత్తరంబుఁ జెప్పఁ
జతురుండ నాతపస్థితివనాదృతవివి
            ధవిహారభోగవర్తనల నొనరి


తే.

తనరునచ్యుతయోగశోభనత నుండ
పనికిఁ బనివడి విప్రుఁడై యనలుఁ డేగు
దెంచె ననవరదీప్తి నేతెంచి యిట్లు
పలికె దీవనలసగర్వకళ నెరపుచు.

103

రామ. అంతైన = పూర్వోక్తమైన, దండితనమున, వీ రుండన్ = ఈబంధుమిత్రాదు లుండఁగా, నేను, అస్ఫుట = వ్యక్తముగాని, పటుశక్తియు విజయము గలవాఁడను, బాలిశుఁడను = బాలకుండను, నీకు, అభిముఖ్యంబు గైకొని, సు= లెస్సైన, మనోబలంబుతోన్ =బుద్ధిబలముతో, ఉత్తరంబుఁ జెప్పఁ జతురుండనా, తపస్స్థితివి = తపస్సునందు నిలుకడ గలవాఁడవు, అనాదృత = ఆదరింపఁబడని, వివిధవిహారభోగములు గలవర్తనల నొనరి తనరెడి, అచ్యుత = నిలుకడైన, యోగ = అష్టాంగయోగముచేత, శోభనమైన, తనుండవు = మేను గలవాఁడవు, అనికిఁ బనివడి విప్రుడై యనలుఁ డేగుదెంచె నన, ఈవు, అనలస = అమందమైన, గర్వకళన్ = గర్వప్రాప్తిని, నెఱపుచుఁ బలికెదవు.

భారత. అంతట, శౌరి = కృష్ణునియొక్క, ఆప్తిచేన్ = ఆగమనముచేత, వీరుండు, అనేన = పాపరహితమైన, “కలుషం వృజినైనోఘ” మని అ. స్ఫుటమైన పటుశక్తి గలవాఁడు, అబాలిశుండు = బుద్ధిమంతుఁడు, విజయుండు = అర్జునుఁడు, అనీక = యుద్ధమునకు, "సమరానీకరణాః” అని అ. సుమనోబలంబుతోన్ = దేవబలముతోడ, చతురుండు, అనాతపస్థితి = ఆతపస్థితి లేని, వన = వనమందు, ఆదృత = ఆదరింపఁబడి, తనరు = ఒప్పుచున్న, అచ్యుతయోగ = కృష్ణసఖ్యముచేత నైన, శోభనతను = శోభనత్వమున, ఉండఁగా, అనవర = శ్రేష్ఠమైన, దీప్తిచేత, అసగర్వ= గర్వయుక్తము గాని, కళన్ = వర్తనచేత, దీవనలను, నెరపుచున్ = ఇచ్చుచు, పలికెను.

క.

విను విజయశక్తిమీరితి
ననుగాఢాహమిక చెల్లునామదిలో నెం

దును బహుతరాశనుండం
జనునే మి మ్మడుగవలయు సకలార్థంబుల్.

104

భారత. విజయ = సంబుద్ధి, తినన్ = భక్షించునట్లుగా, గాఢాహమిక, నామదిలో, చెల్లున్ = చెలంగుచున్నది, బహుతరాశనుండన్ =బహ్వశనుండను, నే = నేను, వలయు = వలసినట్టి, సకలార్థములను మిమ్మడుగ, చనున్ = తగుదుననుట.

రామ. విను = విజయశక్తి మీరితిని, అను = అనెడి, గాఢాహమిక చెల్లునా, ఇక్కడ - ప్లుతయతి. మదిలో, బహుతరాశన్ = అధికాపేక్షచేత, ఉండఁ జనునే, సకలార్థంబులు = సకలప్రయోజనములు, మి మ్మడుగవలయున్ = మిమ్ము నడిగి తెలిసికోవలెను.

మ.

అని వాలాయముగా నభీష్టతమమౌ నన్నం బొసంగన్ స్వనీ
తిని ము న్నెంతయు నియ్యకొల్పి మఱియు ద్వృత్తిం బ్రవర్తిల్లుము
జ్జనితోల్లాసముతోడఁ బల్కె సముదంచత్ఖాండవాస్వాదవ
ర్తన మిష్టం బని రాజపుత్త్రునకు శస్త్రం బౌశుచిత్వంబునన్.

105

రామ. అని = యుద్ధము, అభీష్టతమమౌను, అన్నన్ = అన్నట్టాయెనా, స్వనీతిన్ = బ్రాహ్మణధర్మమును, పొసంగన్, ప్రవర్తిల్లుము, ఉజ్జనితోల్లాసముతోడ, పల్కె = భాషణమె, సముదంచత్ = ప్రకాశించుచున్న, ఖాండ = ఖండశర్కరాసంబంధమైన, “స్యాత్ఖండశ్శకలే చేక్షువికారమణిదోషయోః" అని వి. "తస్యేద” మ్మని అణ్ప్రత్యయాంతము. వాః = ఉదకముయొక్క, “వార్వారి సలిలం కమలం జల” మ్మని అ. స్వాద = రుచివంటిరుచి గల, వర్తనము = వర్తన గలది, శస్తంబౌ, శుచిత్వంబునన్ = అప్రతిహతుఁ డౌటచేత, “శుచిశ్శుద్ధేనుపహతే శృంగారాషాఢయోరపి, గ్రీష్మే హుతవహేపి స్యా" త్తని వి. అని = యుద్దము, ఇష్టంబు = ప్రియమైనది, రాజపుత్రునికి వాఙ్మాధుర్యమును యుద్ధకార్కశ్యమును స్వతస్సిద్ధమైనది గాదా యనుట.

భారత. అని = ఇటని, అన్నంబును, ఒసంగన్ = ఇచ్చెడికొఱకు, అన్నశబ్దము - అద భక్షణే, అనుధాతువున నిష్పన్నము గనుక ఆహారవాచకము. స్వనీతిన్ = తనబ్రాహ్మణాకృతిధర్మముననే, ఇయ్యకొల్పి = ఆలాగుననే ఇచ్చెద మనిపించి, మఱి= అనుపించుకొన్నపిమ్మట, ముత్ = సంతోషముచేత, జనిత = పుట్టిన, ఉల్లాసముతోడ, శస్తంబౌ = చెప్పఁబడిన, శుచిత్వంబునన్ = అగ్నిత్వము గలవాఁడై, పల్కెన్ = పలికెను.

ఉత్సాహ.

ఈవిధమునఁ బల్కి మఱియు నిట్టులనియె నట్టికాం
క్షావిధి నొకవిఘ్న మిపుడు గలదు నిన్ను నారయం
గా వినుము నివారణాధికారమునకు దగుదువే
తావదర్థగతియు మున్ను దలఁచినాఁడ నామదిన్.

106

భారత. అట్టికాంక్షావిధికిన్ = ఆఖాండవవనభక్షణవాంఛకు, నిన్ను నారయంగా వినుము, నివారణాధికారమునకున్ = ఆవిఘ్నము మాన్పెడుపనికి, తగుదువు, ఏతావదార్థగతియున్ = ఇంతపూనికను, మున్ను = మునుపె, తలఁచినాఁడను.

రామ. విను, మునివి, ఆరణాధికారమునకు, తగుదువే = తగుదువా, తావదర్థగతియున్ = అంతైనకార్యరీతిని, మునీశ్వరుఁడవని తాళుకొన్నాఁడ నని తాత్పర్యము.

తే.

వఱలునచ్యుతసఖ్యాతివర్ణితాతు
లప్రదీప్తి ని ట్లలరు నీ విప్ప్రభావ
మెందుఁ బెట్టనికోటగా నెసఁగుచుఁ గడ
చేర్తువస్మన్మహాశరాజితనిరూఢి.

107

రామ. ఆచ్యుత = స్థిరమైన యోగముచేత, సఖ్యాతి = ఖ్యాతిసహితమైన, వర్ణితా = బ్రహ్మచారిత్వముయొక్క, అతులప్రదీప్తిన్ = అత్యంతప్రసిద్ధిచేత, నీ, విప్రభావము = విప్రత్వము, అస్మత్ = మాయొక్క, శర = బాణములయొక్క, అజితనిరూఢిన్ = అప్రతిహతమైన శక్తిని, కడచేర్తువు = అతిక్రమింతువు, నీవు బ్రాహ్మణుఁడవు గాఁబట్టి కొంకుచున్నామనుట.

భారత. వఱలు = ఒప్పెడి, అచ్యుత = కృష్ణునియొక్క, సఖ్యముచేత, నతివర్ణితమైన, యతులమైన ప్రదీప్తిన్ = తేజస్సుచేత, ఇట్లలరునీవు, ఇది కృష్ణునిసాంగత్యమును జూచి చెప్పెడిమాట, ఇప్ప్రభావము = ఈమహిమ, రాజితనిరూఢి = మంచియస్త్రాభ్యాసమందలి నేర్పుచేత, అస్మత్ = మాయొక్క, పూజాబహువచనము, మహాశన్ = అధికాపేక్షను, కడచేర్తువు = సఫలము చేతువు.

ఉత్సాహ.

ఎన్న నేవరించువరసమిన్మహావనంబులో
నన్నగారి గినిసినను ఘనాతిచండకాండవృ
ష్టి న్నలంప వచ్చు జగదజేయదండ నుండుమా
యన్నబ్రాహ్మణునకు విరచితాంజలి యగుభక్తితోన్.

108

భారత. ఎన్న, నేవరించు = నేను గోరెడి, వర = శ్రేష్ఠమైన, సమిత్ = సమిధలుగల, "ఇధ్మమేధస్సమిత్ స్త్రియా” మ్మని అ. మహావనంబులోను, అన్నగారి = ఆయింద్రుఁడు, కినిసి, నన్ = నన్ను, ఘన = మేఘములయొక్క, అతిచండ = మిక్కిలి నుగ్రమైన, కాండవృష్టిన్ = ఉదకవర్షముచేత, “కాండో స్త్రీ దండబాణార్వవర్గావసరవారిషు” అని అ. నలంపవచ్చున్ = నలగించెడికొఱకు వచ్చును, జగదజేయ-సంబుద్ధి, దండనుండు మా, అన్నన్ = అనినను, బ్రాహ్మణునకున్ = బ్రాహ్మణాకృతి యైనయగ్నికి, విరచిత మైనయంజలి గలదైన, పంచమీబహువ్రీహి, భక్తితో, ఇట్లనునని ముందరఁ గ్రియ.

రామ. ఎన్ననే = ప్రసిద్ధమగునట్లుగానే, వరించు = స్వీకరించు, వరసమిత్ = మహాయుద్ధ మనెడి, మహ = ఉత్సవముయొక్క, “సమిత్యాజిస్సమిద్యుద్ధః మహస్తూత్సవతేజసోః” అని అ. ఆవనంబులోనన్ = రక్షణములోపల, నగారి గినిసినన్ = ఇంద్రుఁ డెదిరించినప్పటికిని, కాండవృష్టిన్ = శరవర్షముచేత, జగదజేయదండనుండు = జగములకు నతిక్రమింపరాని యాజ్ఞ గలవాఁడు, మాయన్న = రఘురాముఁడు, నలంపవచ్చున్ = అణఁచుయత్నము చేయును, అట్లైనను దాళినందునకు హేతువు, బ్రాహ్మణునకు విరచితాంజలి యగును, “గవాగ్రజన్మనామగ్రే న శూరో రోషవానయ” మ్మని రామవాక్యము గనుక.
స్రగ్ధర.

ఆరాజన్యోత్తముం డిట్లనుదితరభసుండై భవత్సత్వరవ్యా
హారం బి ట్లోర్చియుం టన్యముగఁ గొనకుమాత్మాంగనాశుల్కతాదృ
క్సారోగ్రేష్వాస మిట్లశ్రమజిత మగుటెంచంగ నాచేతికాఁటం
గ్రూరేష్వాసంబు లేదొక్కొఁడు గలుగునె తద్ఘోరయుద్ధంబు సైఁపన్.

109

రామ. ఆరాజన్యోత్తముండు = రాముఁడు, ఇట్లు, అనుదితరభసుండై = పుట్టనట్టియాగ్రహము గలవాఁడై, భవత్ = నీయొక్క, సత్వర = తీవ్రమైన, వ్యాహారంబు = వాక్యమును, “వ్యాహారఉక్తిర్లపిత" మ్మని అ. ఓర్చియుంట నన్యముగ, కొనకుము = ఎంచకుమా, తాదృక్సార = అట్టిచేవ గల, ఉగ్రేష్వాసము = ఈశ్వరునివిల్లు, ఎంచంగ, ఆచేతికిన్ = ఆరఘునాథునిహస్తమునకు, ఆఁటన్ = తాళునట్టుగా, క్రూరేష్వాసంబు = దురుసైనవిల్లు, శరాసన మనినట్టు, లేదు, ఒక్కొఁడు = ఒకపురుషుఁడు, ఒకఁడు, ఒకొఁడు అని రెండుప్రయోగములు గలవు గనుక, తత్ = అట్టిరఘునాథునియొక్క, కలుగునె క్రియ.

భారత. ఆరాజన్యో త్తముండు = అర్జునుఁడు, ఇట్లను, దిత = ఖండితమైన, రభసుండై = వేగము గలవాఁడై, త్వరపడక యనుట, ఓర్చియుంట = నించున్నయునికి, నాచేతికి, క్రూరేష్వాసంబు = గట్టివిల్లు, ఒక్కొఁడు = ఒకటి, ఉ. 'ఇప్పు డేను రాకుండ నొకండు వచ్చి మఱియొండునె' అని పెద్దిరాజుప్రయోగము. తత్ = ఆయింద్రునియొక్క, కలుగునె = కలిగెడినా, అని క్రియ. నా చేతికిఁ దగినవి ల్లొకటి యిచ్చినను నింద్రునితో యుద్ధము సేయఁగల ననుట.

సీ.

అనుటయు నాతఁ డాజననాథ వరకుమా
            రాగ్రణిఁ జూచి నీయాత్మయందు
నిటువంటితలఁపున్న నిదిగో మహాబలో
            ద్ధామంబు కమలేశదత్త మయ్యె

నాకీశచాపంబునకు నెక్కు డిది గాండి
            వం బనుభారతీవరుధనుర్మ
తల్లికశేషోగ్రతరగుణప్రౌఢి న
            త్యధికంబు క్రమమున నన్యదేవ


తే.

ధృతములైనవానిని గణుతింప నేల
దీని నెక్కడి నీభుజస్థేమఘనవి
జృంభణముఁ జూపు మని తనచేతివిల్లు
దృఢరణస్థితి నరదంబుఁ దెచ్చి యిచ్చె.

110

భారత. కమలేశ = జలాధిపతియైన వరుణునిచేత, దత్తమయ్యెను = ఇవ్వఁబడెను, నాకీశ = దేవేంద్రునియొక్క, చాపంబునకు నెక్కుడు, గాండివంబను = గాండివ మనెడి, ధనుర్మతల్లిక = ధనుశ్రేష్ఠమైనది, “మతల్లికా మచర్చికా ప్రకాండముద్ఘతల్లజౌ ప్రశస్తవాచకాని”అని అ. “శేషునిభంగి నుగ్రతరమైన, గుణ = నారియొక్క, "మౌర్వీ జ్యాశింజినీగుణః” అని అ. ప్రౌఢిచేత నత్యధికంబు, అన్యదేవ = బ్రహ్మాదులచేత, ధృతములైనన్ = ధరించుటలు గలిగినను, వానిన్ = ఆధారణములను, గణుతింపనేల, అని. తన చేతివింటిని, దృఢమైనరణమందుల, స్థితిన్ = ఉనికి గలదాని, అప్రతిహతమైనదాని ననుట, అరదంబును = రథమును, తెచ్చి యిచ్చెను.

రామ. ఆతఁడు = పరశురాముఁడు, జననాథవరకుమారాగ్రణిన్ = దశరథకుమారజ్యేష్ఠుఁ డైనరాముని, చూచి, అనుమాట, నాకు, కమలేశదత్త మయ్యెన్ = ప్రీతిచేత నియ్యఁబడెను. ఈశచావంబునకు నెక్కుడిది, ధనుర్మతల్లికిన్ = ధనుశ్శ్రేష్ఠమునకును, ఆశేషోగ్రతరగుణప్రౌఢిచేత నత్యధికంబు, దృఢరణస్థితి = దృఢమైనరణస్థితి గల, నర = పురుషులను, ద = ఖండించుదాని, “దోఅవఖండనే, అతోనుపసర్గే కః” అని కప్రత్యయాంతము. తనచేతివింటి నిచ్చెను.

మ.

నుతశక్తిన్ నృపసూనుఁ డట్టిధనువున్ మోపెట్టి యైంద్రాయుధో
ద్ధతిపాథోదనిరాసి యయ్యె నపు డాతండు సముద్వేగయు
క్తతఁ గీర్తించి కృతావృథాగ్రహతదస్త్రశ్రామితస్వర్గప
ద్ధతియై యిష్టమహావనీచరతఁ జెందం గాంచి పొంగెన్ మదిన్.

111

రామ. ఐంద్రాయుధోద్ధతిపాథోదనిరాసియయ్యెన్ = ఇంద్రధనుస్సుతోఁ గూడిన యున్నతి గల మేఘమును దిరస్కరించినవాఁ డాయెను. నీలమేఘశ్యాముఁడు గనుక, అతండున్ = పరశురాముఁడును, సముద్వేగయుక్తతన్ = భయయోగముచేత, కృతమైన, అవృథా = వ్యర్థము గాని, గ్రహ = గ్రహణము గల - ఎక్కుఁబెట్టుట గల, తదస్త్ర = ఆరామునిబాణము చేత, గ్రామిక = ఆక్రమింపఁబడ్డ, పోఁగొట్టఁబడ్డదనుట, స్వర్గముయొక్క, పద్ధతి = మార్గము గలవాఁడై, ఇష్టమైన, మహా, అవనీచరత = భూసంచారమును, చెందంగాంచి మదిని, పొంగెన్ = సంతసిల్లెను.

భారత. నృపసూనుఁడు = అర్జునుఁడు, అట్టిధనువు = గాండీవమును, ఐంద్రాయుధోద్ధతి = ఇంద్రుని యాయుధములయొక్క యుద్ధతితోఁ గూడిన, పాథోద = మేఘములను, నిరాసి యయ్యెన్ = పోఁగొట్టినవాఁ డాయెను. ఇంద్రునివజ్రము మొదలైనయాయుధములను మేఘములను బోఁగొట్టెననుట. సముల్ = సంతోషముతో గూడిన, వేగ = సంభ్రమముతోడ నైన, “సమౌ సంవేగసంభ్రమౌ” అని అ. యుక్తతన్ = కూటమిచేత, ఆతండున్ = ఆయగ్నియు, కీర్తించి, కృతమైన, అవృథా = వ్యర్థము గాని, ఆగ్రహ = చలముగల, తత్ = ఆయర్జునునియొక్క, అస్త్రములచేత, శ్రామితస్వర్గపద్ధతియై= కప్పబడ్డాయాకాశమార్గము గలవాఁడై, ఆర్జునుఁడు శరపంజరము గట్టెఁ గనుక, ఇష్టమైన, మహా, వనీ= వనముయొక్క, చరతన్ = భక్షణమును.

తే.

తనకనలుచేష్ట లంతభీతిని ఘటింప
మగిడి శరణన్నఁ దన్మహి మయుఁ దదాత్త
తన్మహాదైన్యము గణించి దయ దలిర్పఁ
గాచె నేమన నప్పు డారాచపట్టి.

112

భారత. తనకు, అనలుచేష్టలు, అంతభీతిన్ = నాశభయమును, ఘటింప, శర ణన్నన్ = శరణు వేఁడినను, తన్మహిన్ = ఆఖాండవవనభూమియందు, మయున్ = మయుఁ డనువాని, తదా = తత్కాలమందు, ఆత్త = పొందఁబడిన, తత్ = ఆమయునియొక్క, మహాదైన్యమును గణించి, ఆరాచపట్టి = అర్జునుఁడు, కాచెన్ = రక్షించెను.

రామ. తనయొక్క, కనలుచేష్టలు = కోపచేష్టలు, అంతైన, తత్ = ఆపరశురామునియొక్క, మహిమయున్ = మహిమను, కడమ సరి.

ఉ.

స్రుక్కక భూమిభృత్కులవిరోధి కడంక నడంచి యిమ్మెయిం
దక్కక హేతిధారి కుచితం బగుకార్యము నిర్వహించి పెం
పెక్కుడు గాఁగ నాత్మపురి కేఁగె హరిన్నుతకీర్తిఁ గూడి న
ల్దిక్కులఁ బిక్కటిల్లుచుఁ దలిర్చు ప్రతాపవిజృంభణంబునన్.

113

రామ. భూమిభృత్కులవిరోధియైన పరశురామునియొక్క, కడంకన్ = గర్వమును, హేతిధారికిన్ = శస్త్రధారునకు, “రవేరర్చిశ్చ శస్త్రంచ వహ్ని జ్వాలా చహేతయః” అని అ. హరిత్ = దిక్కులయందు, “ఆశాశ్చ హరితశ్చ తాః” అని అ. నుతమైన, ఏఁగెను = క్రియ, కడమ సులభము.

భారత. భూమిభృత్కుల = పర్వతసమూహములకు, "భూభృద్భూమిధరే నృపే” అని అ. విరోధియైనయింద్రునియొక్క, హేతిధారికిన్ = జ్వాలావహుఁడైనయగ్నికి, నుతకీర్తిని, హరిన్ = కృష్ణుని, కూడి, ఆత్మపురికిన్ = ఇంద్రప్రస్థపురమునకు, ఏఁగెను.
సీ.

సర్వేశ్వరుఁడు కృష్ణు సఖ్యాతిమహిమకు
            నెంతపెంపును దగు నేమి చెప్ప
దక్షుఁ డానరుఁ డట్లు దనర రాక్షసకుల
            తక్షకుం డతివిచిత్రతరశక్తి
మయుఁ డతిక్రాంతవాఙ్మానసభావిశే
            షంబు వైవస్వతసంతతికిని
దనదులీలోదయంబునను సంపాదించి
            పెట్టె నత్యంతంబు పెంపుసొంపు


తే.

సంఘటిల మరుచ్ఛతమఖసంతతుల క
తఁడు గదాదండమును సమిద్ధజయనాది
కంబువరము నిచ్చెను హరికిం బడరఁగఁ
బలుదెఱంగుల నార్యులుఁ బ్రస్తుతింప.

111

భారత. సర్వేశ్వరుఁడగు కృష్ణునియొక్క సఖ్యము చేతనైన యతిమహిమకు, దక్షుఁడు, ఆనరుఁడు = ఆయర్జునుఁడు, అట్లు దనర = ఆలాగున నొప్పుచుండఁగా, రాక్షసకులముయొక్క, తక్షకుండు, విశ్వకర్మ, “తక్షకో నాగవర్ధక్యోః" అని అ. అతివిచిత్రతరమైన శక్తి గలవాఁడు, మయుఁడు, అతిక్రాంత = అతిక్రమింపఁబడిన, వాక్కులయొక్క, మాన = పరిమాణముగల, వాగగోచర మనుట. సభావిశేషంబును, వైవస్వతసంతతికిన్ = ధర్మజునకు, తనదు, లీలోదయంబునన్ = క్రియాచాతుర్యముచేత, సంపాదించి పెట్టెను, మరుచ్ఛతమఖసంతతులకు = వాయువుయొక్కయు నింద్రునియొక్కయుఁ బుత్త్రుల - భీమార్జునులకు, అతఁడు, మయుఁడు, గదాదండమును, సమిద్ధ = ప్రకాశింపుచున్న, జయ = జయము గలుగునట్టుగా, నాది = మ్రోసెడి, కంబువరమును = శంఖశ్రేష్ఠమును, “శంఖస్స్యాత్కంబురస్త్రియా” మ్మని అ. హరికిన్ = శ్రీకృష్ణునికి, ఇంబడరఁగన్ = ఇంపగునట్టుగా, “ఇంబడరఁగా భజసనంబు" లని యనంతుని ఛందఃప్రయోగము.

రామ. కృష్ణు = విష్ణువుయొక్క, సఖ్యాతి = ఖ్యాతితోఁ గూడిన, దక్షుఁ డానరుఁడు, తక్షకుండు = శాసకుఁడు, శక్తిమయుఁడు, అతిక్రమింపఁబడిన, వాఙ్మనస = వాక్కును మానసమును గల, అవాఙ్మానసగోచర మనుట. భావిశేషంబు = కాంతివిశేషమును, వైవస్వతసంతతికిన్ = వైవస్వతమనువుయొక్క వంశమునకు, తనదు = తనయొక్క, లీలా = విలా సార్థమైన, ఉదయంబునన్ = అవతారముచేత, మరుచ్ఛత = దేవతాశతములకును, మఖసంతతులకున్ = యాగసమూహములకును, అతఁడు గదా= ఆవిష్ణువు గదా, దండ = ఆధారము, మును = పూర్వమందు, జయన = జయము, “జయనే జయః" అని అ. ఆదికంబు = ఆదిగాఁ గల, వరమును, హరికిన్ = ఇంద్రునకు, ఇచ్చెను. రఘునాథునిమహిమను వర్ణింప శక్యము గాదనుట.

చ.

అది యటులుండె నట్టిసభయానతశత్రుదయాళుఁ డాజిదీ
వ్యదరిహృదంతవహ్ని సమవర్తిసుతుం డతిలోకభాగ్యసం
పద లమరంగఁ జేకొని శుభస్థితిఁ దమ్ములు దాను నెంతయుం
బొదల శుచిత్వశాలి యజపుత్త్రుడు మిక్కిలి సంతసిల్లుచున్.

115

రామ. సభయ = భయసహితమౌనట్టుగా, ఆనత = నమ్రులైన, శత్రువులందు దయాళుఁడు, ఆజి = యుద్ధమందు, దీవ్యత్ = ప్రకాశింపుచున్న, అరి = శత్రువులయొక్క, హృత్ = హృదయములయందు, అంతవహ్నిసమ = ప్రళయాగ్నికి సమమౌనట్టుగా, వర్తించుచున్నవాఁడు, సుతుండు = రఘునాథుఁడు, అతిలోక = లోకముల నతిక్రమించిన, “అత్యాదయః క్రాంతాద్యర్థే ద్వితీయయా” అని ద్వితీయాసమాసము. భాగ్యసంపదలచేతఁ బొదలఁగా, అజపుత్రుఁడు = దశరథుడు, పెంపొందెనని ముందరిపద్యమునఁ గ్రియ.

భారత. అది యటులుండె, అట్టిసభయందు, ఆనతశత్రుదయాళుఁడు, అంత వహ్ని యయినవాఁడు, సమవర్తిసుతుండు = ధర్మజుఁడు, శుచిత్వ = ధావళ్యముచేత, శాలి = ఒప్పెడివాఁడు, ఆజపుత్త్రుఁడు = బ్రహ్మపుత్త్రుఁడైన నారదుఁడు, చనుదెంచి యని ముందటిపద్యమునకు నన్వయము.

క.

చనుదెంచి సర్వదిగ్వ
ర్తనఁ దేజము మెఱయఁ దత్పురస్థితిఁ బెంపొం
దె నతం డనుజులు దానుం
బొనరించుమహోపచారముల రంజిలుచున్.

116

భారత. సర్వదిగ్వర్తనను దేజము మెఱయగా, తత్ = ఆధర్మజునియొక్క, పురః = అభిముఖమందు, స్థితిన్ = ఉనికిచేత, పెంపొందెను.

రామ. తత్పురస్థితిన్ = ఆపట్టణస్థితిచేత, ఆతండు = రాముఁడు, అనుజులు దానును పొనరించునుపచారములచేత, దశరథుండు, రంజిలుచును పెంపొందెన్ = సుఖమున నుండెను.

శా.

మాహానాథవిహారవాహన కృపామాహాత్మ్యసాహాయ్యకో
త్సాహిశ్లక్ష్ణకటాక్షవిక్షపితభక్తవ్రాతసంసార శ్రీ

బాహుళ్యప్రదపాదసంస్మరణ పంపాహేమకూటాద్రిఖే
లాహేవాకవిపాకవిస్మరితకైలాసాదికేళీరసా.

117

మాహానాథ = గోరాజైన వృషభమే, “మాహేయీ సౌరభేయీ గౌరుస్రా మాహాచ శృంగిణీ" అని అ. విహారార్థమైన వాహనము గలవాఁడా, కృపామాహాత్మ్య మనెడి, సాహాయ్యక = సహాయముచేత, ఉత్సాహి = ఉప్పొంగిన, శ్లక్ష్ణకటాక్ష = కటాక్షలేశముచేత, “శ్లక్ష్ణం దభ్రం కృశం" అని అ. “కటాక్షోపాంగదర్శనే” అని అ. విక్షపిత = చెదరమీటఁబడిన, భక్తవ్రాతముయొక్క, సంసార = జన్మాదిబంధము గలవాఁడా, భక్తుల నిత్యులఁ జేసెడివాఁ డనుట, శ్రీబాహుళ్య = ఐశ్వర్యపరంపరను, ప్రద = చాలా ఇచ్చెడి, పాదసంస్మరణము గలవాఁడా, పాదారవిందస్మరణమువల్ల సంపదను, ప్రసన్నతవల్ల మోక్షము నిచ్చెడివాఁడు గనుక, పంపానదియందుఁ గల, హేమకూటాద్రియందుఁ గల, ఖేలా = విహారముయొక్క, "క్రీడా ఖేలా చకుర్దన” మని అ. హేవాక = హృదయంగమ మైన, విపాక = పరిచయముచేత, విస్మరిత = మఱువఁజేయఁబడిన, కైలాసాది = కైలాసగంగలయొక్క, కేళీరసా = విహారాపేక్ష గలవాఁడా, హేమకూటపంపానదులు కైలాసగంగలకంటె శ్రేష్ఠము లనుట.

క.

పెదవేంకటాద్రిహృదయా, స్పదపదవిన్యాసతుంగభద్రావీచీ
మృదుశీకరవిరచితనిజ, సదనాంగణరంగవల్లిసౌభాగ్యకళా.

118

రంగవల్లి = ముగ్గులయొక్క.

స్రగ్విణి.

బ్రధ్నకోటీసమభ్రాజితేజోఘనా
బుధ్నభావాప్తిసంపుష్టసృష్టిద్రుమా
ఋధ్నవద్భోధసంహృష్యదృష్యర్చితా
గృధ్నుతాపూర్వకాకృష్టశిష్టార్చనా.

119


గద్యము.

ఇది నిఖిలసూరిలోకాంగీకారకవిత్వవైభవ పింగళి యమర
నార్యతనూభవ సౌజన్యజేయ సూరయనామధేయప్రణీతం బైన
రాఘవపాండవీయంబునందు ద్వితీయాశ్వాసము.

బ్రధ్నకోటీసమ = కోటిసూర్యసమ మౌనట్టుగా, భ్రాజి = ప్రకాశింపుచున్న, తేజస్సుచేత ఘనమైనవాఁడా, బుధ్నభావ = మూలమౌటయొక్క, “మూలం బుధ్నోంఘ్రినామకః” అని అ. ఆప్తి = ప్రాప్తిచేత, సంపుష్ట = పోషింపఁబడిన, సృష్టి యనెడి, ద్రుమా = వృక్షము గలవాఁడా, ఋధ్నవత్ = వృద్ధిఁ బొందుచున్న, బోధ = జ్ఞానముచేత, సంహృష్యత్ = సంతోషించుచున్న, ఋషులచేత, అర్చితా = పూజింపఁబడ్డవాఁడా, గృధ్నుతా = ఆపేక్షచేత, “గృధ్నుస్తు గర్ధనః - లుబ్ధోభిలాషుకస్తృష్ణ" క్కని అ. అపూర్వకమౌనట్టుగా, ఆకృష్ట = అంగీకరింపఁబడిన, శిష్టులచేతియర్చనలు గలవాఁడా.

గద్యము.

ఇది శ్రీమన్మదనగోపాలకృపాకటాక్షసంప్రాప్తసారసారస్వత
సంపదానంద నందవరకులక్షీరపారావార తారకాసుధాధామముద్ద
రాజు గణపయామాత్య పెదరామధీమణిప్రదర్శితం బైన రాఘవ
పాండవీయాదర్శంబునందు ద్వితీయాశ్వాసము.