Jump to content

రాఘవపాండవీయము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీ రామచంద్రపరబ్రహ్మణే నమః

రాఘవపాండవీయము

తృతీయాశ్వాసము



మద్గౌరీపరమ
ప్రేమాస్పద యాకువీటిపెదవేంకటధీ
ధామ సదాలసదసదృ
గ్భూమ విరూపాక్ష హేమకూటాధ్యక్షా!

1

సదా = ఎల్లప్పుడును, లసత్ = ఒప్పుచున్న, అసదృక్ = సరి లేని, భూమ = మహిమ గలవాఁడా, “పృథ్వాదిభ్యఇమనిచ్ బహోర్లోపోభూచబహోః" అనుసూత్రములచే ఇమనచ్ప్రత్యయముయొక్క యికారమునకు లోపమును బహుశబ్దమునకు భూ అను నాదేశమును.

వ.

అవధరింపు మట్లు రంజిల్లుచున్న యయ్యతీంద్రసామ్రాజ్యధౌరేయుండు.

2

రామ. అతీంద్ర = ఇంద్రుని నతిక్రమించిన, సామ్రాజ్యధౌరేయుండు =దశరథుఁడు.

భారత. యతీంద్రసామ్రాజ్యధౌరేయుండు = మునీశ్వరోత్తముఁడైన నారదుఁడు.

తే.

అతిశుభార్థసంపత్పదంబైనవసుధ
మహిమ నేలుచు వాత్సల్యమధురిమమున
నతని నలరింపుచును బ్రియంబగుసభాజ
నప్రధానహితోక్తిబృందమున నంత.

3


వ.

ఇ ట్లనియె.

4


భారత. అతిశుభ = మిక్కి_లియునింపైన, అర్థసంపత్ = భావపుష్టిగల, పదంబై = వాక్యములు గలవాఁడై, నవ = నూతనమైన, సుధ = అమృతముయొక్క, మహిమను, ఏలుచున్ = అతిక్రమించుచును, అతనిన్ = ధర్మరాజును, అలరింపుచును, ప్రియంబగు = ప్రియమైన, సభాజన = సన్మానమే, “ఆనందనసభాజనే” అని అ. ప్రధానముగాఁ గల హితోక్తిబృందముచేతను.

రామ. అతిశుభమైన, ఆర్థసంపత్, ద్రవ్యసమృద్ధికి, పదంబైన = స్థానమైన, వసుధ = భూమిని, ఏలుచు, వాత్సల్య = నెనరుచేతనైన, మధురిమమునన్ = ప్రేమముచేతను, “స్వాదుప్రియౌ తుమధురౌ” అని అ. సభా = సభయందుఁగల, జనులయొక్కయు, ప్రధాన = సుమంత్రాదిమంత్రులయొక్కయు, హితోక్తిబృందమునన్ = ప్రియవాక్యము చేతను, అతనిన్ = ఆరాముని, అలరింపుచు, ఇట్లనియె నని ముందరి కన్వయము.

క.

క్రమమున ధరణీభరణ, క్షమ మగుతద్ధర్మనీతి చాతుర్యవిశే
ష మశేష మరసి యధిక, ప్రమదుఁ డయి ప్రసంగవశత రప్పించి తగన్.

5

రామ. తత్ = ఆరామునియొక్క, ధర్మనీతి, ప్రసంగవశతచేత, రప్పించి = రాముని రప్పించి.

భారత. తద్ధర్మ = ఆధర్మరాజుయొక్క, ప్రసంగవశతను రప్పించి = ప్రసంగమును చెప్పించి యనుట.

సీ.

బంధురంజన రామభద్ర ధర్మాత్మజ
            యైశ్వర్యశోభిత యన్వయైక
పావన పాండురాజీవరమాధుర్య
            శోభననయనవసుప్రతాప
నిర్మలప్రౌఢివినీతత్వవిజ్ఞాన
            సౌశీల్యశౌర్యాదిసద్గుణములు
విని యుబ్బుచున్నవాఁ డనుమోదగరిమఁ ద
            త్ప్రేరణఁ జేసి యేఁ దివిరి నిన్నుఁ


తే.

బనిచెద సమస్తమహిరాజ్యపాలనముగ
రంబు నుతి కెక్కఁ జేయుము రాజసూయ
మానచంద్రికాస్ఫూర్తియుఁ బోనికీర్తి
మున్నుగాఁ బర్వి కకుబంతములఁ దలిర్ప.

6

భారత. బంధురంజనముచే, రామ = ఒప్పెడి, భద్ర = శుభములుగలవాఁడా, “స్వశ్రేయసం శివం భద్ర" మ్మని అ. ధరాత్మజ, ఐశ్వర్యశోభిత, పాండురాజు, ఈ = నీయొక్క, వరమాధుర్య, శోభననయ, నవసుప్రతాప, నిర్మలప్రౌఢి, వినీతత్వ, విజ్ఞాన, సౌశీల్య, శౌర్యాదిసద్గుణములు విని యుబ్బుచున్నవాఁడు, అనుమోదగరిముచేత, తత్ = ఆపాండురాజుయొక్క, ప్రేరణఁ జేసి = పనుపుటచేత, రాజ్యపాలనము నుతి కెక్క, ఆన = ఆజ్ఞ, తద్భవపదము, కీర్తిమున్నుగా = కీర్తికంటె ముందరఁగా, తలిర్ప, రాజసూయము చేయుమని యన్వయము.

రామ. బంధురంజన, రామభద్ర, ధర్మాత్మ, జయైశ్వర్యశోభిత, అన్వయైకపావన, పాండురాజీవ = తెల్లదామరభంగి, రమాధుర్య = లక్ష్మిని వహించినవై, శోభనములయిన, నయన = కన్నులు గలవాఁడా, వసు = అష్టవసువులయొక్క, ప్రతాపమువంటి ప్రతాపము గలవాఁడా, ఇవి సంబోధనలు. నిర్మలప్రౌఢివి = కళంకములేని ప్రజ్ఞ గలవాఁడవు. నీ = నీయొక్క, తత్త్వసిద్ధాంతమైన, విజ్ఞాన = శాస్త్రజ్ఞానమును, "మోక్షే ధీర్జ్ఞానమన్యత్ర విజ్ఞానం శిల్పశాస్త్రయోః" అని అ. సౌశీల్య = సద్వర్తనము, శౌర్యము నాదిగాఁ గల సద్గుణములను విని, మోదగరిమన్ = సంతోషాతిశయముచేత, ఉబ్బుచున్నవాఁడను, తత్ = ఆయామోదగరిమయొక్క, ప్రేరణచేత, ఏను బనిచెద, రాజ = చంద్రునిచేత, “రాజా ప్రభౌ నృపే చంద్రే” అని వి. సూయమాన = సృజింపఁపడుచున్న, క్రొత్తైనదనుట, చంద్రికాస్ఫూర్తియుఁబోని = వెన్నెలనిగ్గు గలిగిన, కీర్తి, కకుబంతములన్ = దిగంతములయందు, “దిశస్తు కకుభః కాష్ఠాః” అని అ. తలిర్పన్ = ప్రకాశించునట్లుగా, రాజ్యపాలనము చేయుము.
క.

అనుటయు ముకుళితకరుఁ డై
యనఘా మరి నవధరింపు మంతటిశక్తుం
డనె యే నొండొకపని నా
కనుగ్రహింపు మన మఱియు నతఁ డి ట్లనియెన్.

7

రెంటికి సమము సులభము.

చ.

జనకునియాజ్ఞ యన్న నవిచార్యము మున్నిది యెన్ని చూడుమా
యనయముసన్నిధిన్ నిను సమర్థతరుం డని నిశ్చయించి పం
చినపని దీని నీవు దగఁ జేయ సదాత్తసుధర్మతన్ సుఖం
బున హరికొ ల్వొనర్తు నని పూనినవాఁ డనయంబు బుద్ధిలోన్.

8

భారత. జనకునియాజ్ఞ, అన్నన్, ఎన్ని చూడుము, ఆయన = పాండురాజు, యముసన్నిధిన్ = యమునిసముఖమందు, పంచినపనిని దీనిన్ = యాగమును, చేయన్ = చేసినను, సదా = ఎల్లప్పుడును, ఆత్త = పొందఁబడిన, సుధర్మతన్ = దేవసభ గలవాఁ డౌటచేత, పూనినవాఁడు = తలఁచినవాఁ డనుట.

రామ. జనకునియాజ్ఞ, అన్నన్ = అనినను, అవిచార్య మెన్ని చూడుమా, అనయము = ఎప్పుడును, సన్నిధిన్ = సత్పురుషులకు నిధివైన, నిన్ను, సదా, ఆత్త = స్వీకరింపఁబడిన, సుధర్మతన్ = లెస్సధర్మము గలవాఁడనై, హరికొల్వు = శ్రీహరిసేవను, ఒనర్తు నని బుద్ధిలో నయంబును బూనినవాఁ డనుట.

క.

జను లందఱు నీయం ద
త్యనురాగముకలిమి నెరపెదరు సత్త్వమహ
త్వనిరూఢిఁ బొల్పెసఁగునీ
యనుజులు భవదీయశాసనైకాయత్తుల్.

9

రెంటికి సమము - సులభము.

వ.

కావున నమ్మహాకార్యంబు నిర్వహింప.

10


ఆ.

అనఘ నీవె తగుదు వనివారితనయాద
రౌచితిఁ గడు నొప్ప నాయతిశుభ
గుణవశు డనిపించుకొని నిజేచ్చఁ జనని
యత్యుదారుఁ డఖిలకృత్యవిదుఁడు.

11

రామ. దశరథుఁడు రఘునాథునికి నీతి యుపదేశించెడిప్రకారము, అనఘ, అనివారితమైన, నయ = నీతియొక్క, అదర = అమితమైన, ఔచితిన్ = ఔచిత్యముచేత, "ఈషదర్థే దరం స్మృత” మ్మని అ. కడు, ఒప్పన్ = ఒప్పుటచే, నీవె తగుదువు, అయతి = ఉత్తరకాలఫలముచేత, శుభములైన, గుణములకు = నిత్యత్వాదిగుణములకు, వశుఁ డనిపించుకొని, నిజేచ్ఛఁ జనని= తనఇచ్ఛను నడవనటువంటి, అత్యుదారుఁడు = అతిసమర్థుఁ డయినవాఁడు, అఖిలకృత్యవిదుఁడు = సర్వకార్యజ్ఞుఁడు, నీవు నీచెప్పినగుణములు గలవాఁడవు గనుక సకలకార్యములను నెఱుఁగుదు వనుట.

భారత. అనఘ, నీవె తగుదువు, అని పలికి, వారి = పాండవులయొక్కయు, తనయొక్కయు, ఆదరౌచితి కడునొప్పఁగా, శుభగుణ = సద్గుణవంతులకు, వశుఁడు = విధేయుఁడు, ఆయతి = నారదుఁడు, అనిపించుకొని = అంపించుకొని, చనన్ = పోఁగా, నియతి = నియమముచేత, “నియతిర్నియమే దైవే" అని వి. ఉదారుఁడు, అఖిలకృత్యవిదుఁడు, అవనివరేణ్యుఁడని ముందరిపద్యమున కన్వయము.

ఆ.

ఆయవనివరేణ్యుఁ డాయాగమవ్యయా
గమసముచితధర్మగతి నడపుట
కై జయింపవలయు నాశల నన్నింటి
నని కృతిజనగోష్ఠి నాకళించి.

12

భారత. ఆ, అవనివరేణ్యుఁడు = ధర్మరాజు, అవ్యయ = నాశములేని, ఆగమసముచిత = వేదోచితమైన, ధర్మగతిన్ = ధర్మవర్తనచేత, ఆ, యాగమును, నడపుటకై = చేసెడికొఱకు, ఆశలన్ = దిక్కులను, జయింపవలయునని, కృతిజనగోష్ఠిన్ = విద్వజ్జనులతోడి ప్రసంగముచేత, ఆకళించి = తెలిసి, రిపుల నేలఁగలిపె ననుపర్యంతము కుళకము.

రామ. అవనివరేణ్యుఁడు, ఆయాగమ = ఆదాయప్రాప్తికిని, వ్యయాగమ = వ్యయప్రాప్తికిని, సముచిత = తగిన, ధర్మగతి = ధర్మవర్తనను, నడపుటకై, 'సీ. ఆయంబునందు నాలవభాగ మొండె మూఁడవభాగ మొండె నందర్ధ మొండెం, గానివ్యయము సేయరాదు నరపతికిని' అని సభాపర్వములోఁ జెప్పినాఁడు గనుక, ఆశలన్ = వాంఛలను, ఆశలను జయింపనివానికి నుచితధర్మము నడవదు గనుక, అనికృతి = శఠత్వము లేని - కపటము లేనివా రనుట, జనులతోడి = గోష్ఠిచేత, ఆకళించి = తెలిసి, ఆయవ్యయౌచిత్యమును, ఆశాజయోపాయమును దెలిసి నడపు మనుట.
తే.

సత్త్వధర్మకళావిరాజత్ప్రతాప
ఘనుఁడు రాజులలోఁ బెద్ద యనఁగఁ జనుఁ బ్ర
కృష్టతనుజరాసంధుండు కేవలముని
జేష్టకర్మాక్షముం డని యెన్ను మదిని.

13

రామ. సత్త్వ = బలిమిచేతను, ధర్మకళా = ధర్మశాస్త్రముచేతను, విరాజత్ = ఒప్పుచున్న, ప్రతాపముచేతను, మరుఁడు= అధికుఁడైనవాఁడు, పెద్ద యనఁగ, చనున్ = తగును, ప్రకృష్ట = అధికమైన, తను = శరీరముయొక్క, జరా = ముదిమియొక్క, సంధుండు = సంధానము గలవాఁ డైనను, ముదిసినవాఁ డైన ననుట, నిజ = తనకు, ఇష్టమైన, కర్మ = ప్రయోజనమందు, అక్షముండు = అసమర్థుఁడు, తనముదిమిచేత నాచారలోపమే కాని పెద్దతనము కలిగియు నియమము లేక యుండును, అని = ఇటని, మదిన్ = మనస్సున, ఎన్నుము, తాను ముదివాఁడు గనుక రాజ్యపాలనమునకు నీవె తగుదువని తాత్పర్యము.

భారత. సత్త్వ = బలిమిచేతను, ధర్మకళా = ధనుర్విద్యచేతను, ప్రకృష్టతన్ = ఆధిక్యమున, జరాసంధుండు, నిజ = స్వకీయమైన, ఇష్టకర్మ = యాగకర్మమందు, “ఇష్టం యాగాదికర్మస్యా" త్తని అ. కరికలభవత్ప్రయోగము. అక్షముండు = ఓర్పు లేనివాఁడు, అని, ఎన్నుమదిన్ = ఎంచెడిమనస్సుచేత.

తే.

విహితసన్మంత్రుఁ డగుచు వివేకఘనుఁడు
విహతి లేకొప్పునచ్యుతవిజయసంయు
తప్రహితభీమసేనోద్ధతిప్రవృద్ధి
చేత రిపు నేలఁగలపెను సిరులు గొనుచు.

14

భారత. విహిత = చేయఁబడిన, సన్మంత్రుఁ డగుచు = మంచియాలోచన గలవాఁడౌకొంచును, వివేకఘనుఁడు = ధర్మరాజు, ఒప్పుచున్న, అచ్యుతవిజయసంయుత = కృష్ణార్జునసహితముగా, ప్రహిత = అంపఁబడిన, భీమసేనునియొక్క, ఉద్ధతి = ప్రహారములయొక్క, ప్రవృద్ధిచేత, రిపున్ = శత్రుఁడైనజరాసంధుని, నేలఁగలపెన్ = సంహరించెను.

రామ. విహితసన్మంత్రుఁ డగుచున్ = మంచివారితో నాలోచన చేసినవాఁడై, వివేకఘనుఁడైన జనుఁడు, అచ్యుత = జాఱని, విజయముతోడ సంయుతమైన, ప్రహిత = అత్యంతవిహితమైన, భీమ = శత్రుభయంకరమునైన, సేనయొక్క, ఉద్ధతి = ఔద్ధత్యముయొక్క, ప్రవృద్ధిచేత, రిపునేలఁ గల = శత్రువుయొక్క భూమియందుఁ గలిగిన, పెనుసిరులు = అధికసంపదలను, కొనుచు, ఒప్పునని క్రియ.
మ.

స్వనిదేశోన్నతి నంతటన్ నెఱయుచున్ శక్తిం జతుర్దిఙ్నరేం
ద్రనికాయంబును గెల్చి తమ్ము లసమానప్రాప్తవిత్తార్పణం
బునఁ దన్ప న్వశు లైనబ్రాహ్మణులతోఁ బూర్ణాధ్వరారంభుఁడై
యనఘశ్రీఁ బృథివీశుఁ డొప్పెసగు రూఢాపూర్వసత్కీర్తితోన్.

15

రామ. స్వనిదేశోన్నతిన్ = స్వాజ్ఞామహిమచేత, అంతటన్ = అన్నిచోటులను, చతుర్దిక్కులందుల, గెల్చి, తమ్ము, లసమాన = ఒప్పునట్లుగా, ప్రాప్తమైన = ధర్మార్జితమైన దనుట, విత్త = ధనముయొక్క, అర్పణంబునన్ = దానముచేత, తన్పన్ = తనియింపఁగా, తమ్ముఁ దన్పఁగా ననుట, వశులైన = విధేయులైన, బ్రాహ్మణులతోఁగూడ, రూఢ = ప్రసిద్ధమైన, అపూర్వ = వింతైన, సత్కీర్తితోడ, పృథివీశుఁడు, ఒ ప్పెసగున్, క్రియ.

భారత. అంతటను, తమ్ములు = భీమాదులు, అసమానమౌనట్టుగా, పూర్ణ = ఈడేఱిన, అధ్వర = యాగముయొక్క, ఆరంభము గలఁవాఁడై, సగురు = తండ్రితోఁ గూడునట్లుగా, ఊఢ = వహింపఁబడిన, పృథివీశుఁడు = ధర్మరాజు, ఒప్పెన్ = క్రియ.

ఉ.

క్లిష్టత యించుకంతయును లేక మనఃప్రమదంబుతోడ నా
యిష్టము నిర్వహించి పృథివీశులలోపల నర్హభీష్మసం
సిష్టి మెయిం గరం బొనరిచెందుదనుత్తమపూజ చక్రి కు
త్కృష్టత నుర్విలో నసమతేజుఁడవీవని పల్కి నెమ్మితోన్.

16

భారత. అయిష్టము = ఆయజ్ఞమును, నిర్వహించి = చేసి, అర్హమైన, భీష్మునియొక్క, సంసిష్టిమెయిన్ = అనుజ్ఞచేత, తుదన్ = యజ్ఞసమాప్తియందు, అసమతేజుఁడవు, ఈవు, అని, చక్రికిన్ = కృష్ణునికి, ఉత్తమపూజ నొనరించెను.

రామ. నాయిష్టము= నాకోరికను, అర్హ = తగుమైన, భీష్మ = భయంకరమైన, సంసిష్టిమెయిన్ = సమ్యగాజ్ఞచేత, అనుత్తమపూజ = అత్యుత్తముపూజను, చెందుదు = పొందుచున్నాఁడవు, చక్రికిన్ = విష్ణువునకు, సమ = సమానమైన, తేజుఁడవు, అని, పల్కి, నడపెనని ముందరిపద్యమునఁ గ్రియ.

తే.

మఱియుఁ దగుమాటలాడి యమర్త్యకార్య
నియత లీలావతారు నన్నీలవర్ణు

స్నేహరసమున నభిషిక్తుఁ జేయ నతఁడు
లలి నడపె నప్డు తచ్ఛుభలగ్నచింత.

17

రామ. అన్నీలవర్ణున్ = శ్రీరామచంద్రుని, స్నేహరసముతోడ, అభిషిక్తుఁ జేయన్ = పట్టాభిషిక్తునిఁ జేయుటకు, తచ్చుభలగ్నచింత = ఆపట్టాభిషేకశుభలగ్నవిచారమును, నడపెను.

భారత. అన్నీలవర్ణున్ = శ్రీకృష్ణుని, స్నేహరసమున నభిషిక్తుఁ జేయన్ = స్నేహరసము వర్షింపఁగా ననుట, అభిషిక్తుఁ జేసినను, అతఁడు = కృష్ణుఁడు, తత్ = ఆధర్మరాజుయొక్క, శుభమందు లగ్నమైనచింతను నడపెను.

చ.

సువిభవభూతిఁ బేర్చుహరి సొం పవుఁగా దను శ్రీమదాత్మవై
భవము వెలార్చుచుం బ్రబలభవ్యతదీయసుదర్శనంబుచే
దివిభు వినున్నసభ్యవితతిం బరికల్పితసాధులోచనో
త్సవవిధి యైనితాంతము దితత్వముఁ జెందఁగఁజేసె నంతటన్.

18

భారత. హరి = కృష్ణునియొక్క, సొంపును, అవుఁగాదను = నిందించెడి, శ్రీమద = సంపద్గర్వముతోఁ గూడిన, ఆత్మ = తనయొక్క, వైభవము, ప్రబలఁగా, తదీయసుదర్శనంబు = శ్రీకృష్ణునిసంబంధ మైనచక్రము, వినున్నసభ్యవితతిన్ = తిరస్కరింపఁబడిన సాధుజనసమూహము గలవాని, చేదివిభు = శిశుపాలుని, పరికల్పితమైన, సాధు = సజ్జనులయొక్క, లోచనోత్సవవిధి గలదై, సుదర్శనమునకు విధేయవిశేషణము. నితాంతము = మిక్కిలియు, దికత్వమున్ = ఖండితత్వమును, చెందఁగఁజేసెను = సంహరించె ననుట.

రామ. హరి = ఇంద్రునియొక్క, సొంపును, అవుఁగాదను = మించిన, శ్రీమత్ = సమృద్ధిమత్తైన, ఆత్మవైభవము = నిజవిభవమును, వెలార్చుచున్ = ప్రకటించుచు, ప్రబలమైన, భవ్య = శుభముగల, “భావుకం భవికం భవ్య” మ్మని అ. తదీయ = ఆవైభవసంబంధమైన, సుదర్శనంబుచే = సుదర్శనముచేత, దివిభువినున్న = ఆకాశమున భూమిని నుండిన, సభ్యవితతిన్ = సురభూసురసమూహమును, పరికల్పిత, సాధు = లెస్సైన, లోచనోత్సవవిధి గలదై, నితాంతముదితత్వమున్ = మిక్కిలిసంతుష్టత్వమును, చెందఁగఁ జేసెను, అతఁడు = ఆదశరథుఁడని పూర్వపద్యమునఁ గర్త.

సీ.

ఘనధర్మసుతరాజ్యఘటనయాశల నట్లు
            దనరుచునికి గనుఁ గొని యసహ్య
మానతద్వైభవ మందరోన్మథితహృ
            ద్విషధివిషాయిత ద్వేషభరత

జనని గర్హ్యాచారమున కోడ కెట్లొ యే
            మంద్రొ బంధువు లన్వయాదిగుణగు
రుత మాయనాడుదు రోదరం బిట్టిచో
            నూహింప నౌచిత్యయుక్త మనక


తే.

తద్విధిని హరియించె నత్యంతదుష్ట
మతిని దుర్యోధనుఁడు సపత్నితనయుండ
జాతశాత్రవరాజ్యవిభూతి మీఱు
టుల్లమున నించుకంతయు నోర్వలేక.

19

రామ. ఘనధర్మ = అధికధర్మములుగల, సుత = రామునియొక్క, రాజ్యఘటనయందుఁ గల, ఆశలన్ = అపేక్షలచేత, ఉనికి = దశరథునియునికిని, అసహ్యమాన = సహింపఁబడని, తద్వైభవ = రామునివైభవముగల, మందరచేత, ఉన్మథిత = మథింపఁబడిన, హృద్విష = హృదయమనెడు సముద్రమునకు, విషాయిత = కాలకూటవిషముభంగిని బుట్టిన, ద్వేషము గలది, భరతజనని = కైకేయి, గర్హ్యాచారమునకు నోడక, అన్వయాదిగుణ, గురుత = గురుత్వమును, మాయనాడుదురో = తూలింతురో, దరంబు = భయము, “దరో స్త్రియాం భయే శ్వభ్రే" అని అ. ఔచిత్యయుక్తము = ఉచితము, అనక = ఇటని విచారింపక, తద్విధిన్ = ఆపట్టాభిషేకవిధిని, హరియించెన్ = మానిచెను, అత్యంత, దుష్టమతిన్ = దుష్టబుద్ధిచేత, దుర్యోధనుఁడు = పోట్లాడ శక్యము కానివాఁడు, సపత్ని = సవతియొక్క, తనయుండు = కుమారుఁడు, అజాతశాత్రవ = నిష్కంటకమైన, రాజ్యవిభూతిన్ = రాజ్యైశ్వర్యముచేత, మీఱుట = అతిశయించుట, ఉల్లమున నించుకంతయు నోర్వలేక.

భారత. ఘన, ధర్మసుత = ధర్మరాజుయొక్క, ఆశలన్ = దిక్కులయందు, తత్ = ఆధర్మరాజుయొక్క వైభవమనెడి, మందర = మందరపర్వతముచేత, ద్వేషభరతన్ = ద్వేషాతిశయము గలవాఁ డౌటఁ జేసి, జన = లోకులచేత, నిగర్హ్య = నిందింపఁదగిన, ఆచారమునకు నోడక, అన్వయాదిగుణ, గురుత = గురుత్వమును, ఏమంద్రొ = ఏమందురో, మాయనాడు = మాయచేత నాడెడి, దురోదరంబు = జూదము, “పణే ద్యూతే దురోదర” మ్మని అ. ఔచితి = ఔచిత్యముతోడ, అయుక్తము = రహితము, అనుచితమనక యనుట, తద్విధిన్ = ఆమాయాద్యూతవిధిచేత, సపత్నిత = శత్రువుగాఁ జేయఁబడిన, “రిపౌ వైరిసపత్నారిద్విషద్ద్వేషణదుర్హృదః అని అ. నయుండు = నీతిగలవాఁడు, దుర్యోధనుఁడు, అజాతశాత్రవ = ధర్మరాజుయొక్క, రాజ్యవిభూతిని మీఱుట నోర్వలేక హరియించె నని క్రిందటి కన్వయము.

సీ.

అవ్వేళ భవితవ్యతానుసారితఁ బ్రియ
            కైతవదాసీకృతాతిమన్యు
గిళితప్రమోద యై కృష్ణ సారప్రేక్ష
            ప్రబలోగ్రతను స్వకపటము దోఁప
మలయుదుశ్శాసన మత్సరంబున శంకి
            తత్వంబునొంది సత్వరిత యగుచు
స్వపురస్థితిఁ దనర్చు చక్రిలీలామర్త్య
            మూర్తి నుద్దేశించి ముదిత పలికెఁ


తే.

దా మునుపుగన్న యాత్మనాథవరశక్తి
గడు పరాజిత యై యప్డు గానుపింప
ధర్మ పాశసంయుతనిరుత్తరనిజాధి
పతిసదైన్యేక్షితాననపద్మ యగుచు.

20

భారత. భవితవ్యతానుసారితన్ = అదృష్టానుసారముచేత, ప్రియ= ప్రియుఁడైన ధర్మరాజుయొక్క, కైతవ = జూదముచేత, దాసీకృత = దాసిగాఁ జేయఁబడ్డదై, అతిమన్యుగిళితప్రమోదయై = అత్యంతశోకగ్రస్తహర్షయై, కృష్ణ = ద్రౌపది, సారప్రేక్ష = సారమైనబుద్ధి గలది, ప్రబలమైన, ఉగ్రతను = శౌర్యముచేత, స్వకపటము = స్వకీయమైన వస్త్రమును, దోఁపన్ = దోఁచుటకు, మరియు = తీవ్రపడుచున్న, దుశ్శాసన = దుశ్శాసనునియొక్క, మత్సరంబున, శంకితత్వంబు నొంది = మానభంగమునకు దెస చెడి, స్వపుర = తనపట్టణమందుఁగల, స్థితిచేత, లీలామర్త్యమూర్తిని, చక్రిన్ = కృష్ణుని, ఉద్దేశించి = కూర్చి, తా, మునుపు, కన్న = ఎఱిఁగిన, ఆత్మనాథులయొక్క పరమైన శక్తి, నిజాధిపతులచేతను సదైన్యమౌనట్టుగా కడమ సులభము.

రామ. ప్రియమైన, కైతవ = కపటముగల, దాసీ = మందరచేత, కృతమయిన, అతిమన్యు = అత్యంతక్రోధముచేత, గిళితప్రమోదయై, కృష్ణసారప్రేక్ష = హరిణేక్షణ కైక, “కృష్ణసారరురున్యంకురంకుశంబరరౌషిషాః” అని అ. మలయు = మలయునట్టి, దుశ్శాసన = అణఁచశక్యము గాని, మత్సరంబును, అశంకితత్వంబును, మత్సరమునకు విశేషణము, పొంది, స్వపురస్థితిన్ = తనముందట, చక్రి = విష్ణువుయొక్క, లీలామర్త్యమూర్తియైన రాముని, ఆత్మనాథ = దశరథునియొక్క, వరశక్తి = వరసామర్థ్యము, పరాజితయై = పరులచేత నపారణీయమైనదై యనుట, ధర్మపాశముచేత, సంయుత = బద్ధుఁడై, నిరుత్తరుఁడైన, నిజాధిపతి = దశరథునిచేత, కడమ సమము, పలికెను = క్రియ.

చ.

వినుముదయాభివృద్ధి ప్రభవింపఁగ నిద్ధర యేలురాజు మ
త్తనయుఁడు నాకు మాపతి ముదంబునఁ బూర్వము నం దనుగ్రహిం

చినవరలాభ మిప్పు డిటు సేసె నిజాత్మ నుపేక్ష మాని నీ
సునియతి నిల్పు మాన హతి సోఁకక యుండఁగఁ జేసి యిత్తఱిన్.

21

రామ. వినుము, ఉదయాభివృద్ధి = అభ్యుదయాభివృద్ధి, మత్ = నాయొక్క, తనయుఁడు ధరయేలురాజు, నాకు, మాపతి = మాయొక్కపతి దశరథుఁడు, అనుగ్రహించిన = ఇచ్చిన, వరలాభము = వరప్రాప్తి, ఇప్పుడు, ఇటు సేసెన్ = రాజ్యము గైకొనునట్టుగాఁ జేసెను, ఆత్మయందు నుపేక్ష మాని, ఆన = తండ్రియాజ్ఞ, హతిసోఁకకయుండఁగఁ జేసి, నీ = నీయొక్క, సునియతి = నియమమును - పుత్త్రధర్మమును, నిల్పుము.

భారత. వినుము, దయాభివృద్ధి, ఇద్ధరయేలురాజు = ధృతరాష్ట్రుఁడు, మత్తనయుఁడు = మత్తునియొక్క నీతివంటినీతి గలవాఁడు - అవివేకి యనుట, నాకు, ఉమాపతి = పరమేశ్వరుఁడు, అనుగ్రహించిన = ఇచ్చిన, వర = పతులయొక్క, లాభము, ఉపేక్ష సేసెనని యన్వయము. మానినీ = మానవతులయొక్క, సునియతి నిల్పు, మానహతి = మానభంగము, సోఁకకయుండఁగా.

ఉ.

ఏకము నీ వెఱుంగనిది యెయ్యెది సర్వవిదుండ వీవు సో
త్సేకనిరూఢి నెల్లెడల శ్రీపసనాతన యుండుదంచితా
స్తోకవిభూతి మీఱ నొరుచొప్పున నీయెడ నుండవచ్చునో
నీకును గావునన్ మదిగణింపఁగ నెమ్మెయిఁ గాన ది క్కిఁకన్.

22

భారత. సోత్సేకనిరూఢిన్ = అతిశయయుక్తప్రౌఢిచేత, శ్రీప - సనాతన-సంబుద్ధులు. ఎల్లెడల నుండుదువు, కావునన్ = నను రక్షింపుమా, ఎమ్మెయిన్ = మఱేరూపముననైనను, దిక్కు గానను.

రామ. శ్రీపసన్ = ఐశ్వర్యాతిశయముచేత, నాతనయుండు, ఉదంచిత, ఒరుచొప్పునన్ = అమాత్యాదులరీతిని, కావునన్ = అటుగనుక, కాన = అడవి, దిక్కు, వనవాసమునకుఁ బొమ్మనుట.

సీ.

ఇట్లు పల్కెడునంత హృదయసాహసమున
            దాక్షిణ్యము లవంబు దనకుఁ లేమిఁ
దోరంపుబిరుసున దుశ్శాసనుఁడవని
            విభునూరకునికి భావింప నితని
కే నన్నపని సేయు టెంతయు నభిమతా
            ర్థం బని కని యవారణ మగువన
వాసస్థితిని గూర్పు స్వాంతవర్తనమున
            న్వీతగర్హణభయనిష్ఠఁ దోఁప

తే.

రామ కపటభావం బెందు నేమియునుజ
నింపదేమన నెంతటిపెంపు నీదు
నెమ్మనమునందు నెఱయ నా యమ్మ పాదు
కొలుపుభూతభవద్భవ్యగురుమహాజ్ఞ.

23

రామ. ఇట్లు పల్కెడునంత = ఇపుడు తాఁబల్కెడుపాటి, హృదయసాహసమున, దాక్షిణ్యము, లవంబు దనకు లేమిన్ = ఇంచుకంతేనిఁ దన కుండకుండుటఁబట్టి, తోరంపుబిరుసున, దుశ్శాసనుఁడవని = శిక్షింప శక్యము కానివాఁడ వనియు, విభు = దశరథునియొక్క, ఊరకునికిన్ = మాటాడకుండుటను, భావింపన్ = విచారింప, ఇతనికిన్ = ఈరాజునకు, ఏనన్నపని చేయుట = రాజ్యము విడిచి వనవాసమునకుఁ బోవుట, ఎంతయు నభిమతార్థం బని, కని = తెలిసి, అవారణమగు = అన్యశంక లేక యనుట, వనవాస మనెడుస్థితియందు, అన్వీత = ఆనుసరింపఁబడ్డ, గర్హణభయ = పితృవచనోల్లంఘననిందాభయము గల, నిష్ఠన్ = సౌజన్యమనుట, తోఁపన్ = ప్రకాశింపఁగా, స్వాంతవర్తనమును గూర్పుమని యన్వయము. వనవాసమునకుఁ బూనుమనుట, రామ = సంబుద్ధి, నీదు = నీయొక్క, నెమ్మనమునందుఁ గపటభావం బెందు నేమియు జనింపదు, ఇది స్తోత్రపూర్వకముగా వనవాసమునకుఁ బురికొలుపుట, భూత = అయిన, భవత్ = నీయొక్క, భవ్యగురు = పూజ్యుఁడైన తండ్రియొక్క, మహాజ్ఞచేత, నెఱయన్ =ఇంకఁ బదిలముగా, నాయమ్మ = న్యాయమునె, ఇది తద్భవపదము. నెమ్మనమునందుఁ బాదుకొలుపుమని యన్వయము.

భారత. ఇట్లు పల్కెడు, అంతన్ = అంతటిలోన, దుశ్శాసనుఁడు, అవనివిభునూరకునికిన్ = ధృతరాష్ట్రునియూరకునికిచేత, ఏను, ఆన్నపని = దుర్యోధనునిపని, చేయుట, అవారణన్ = అడ్డగింపు లేని, మగువన్ = ద్రౌపదిని, అవాసస్స్థితిన్ = వస్త్రరహిత మైనస్థితిని, కూర్పుస్వాంతవర్తనమునన్ = విగతవస్త్రఁ జేయుతలఁపునందు, వీత = పోఁగొట్టఁబడిన, గర్హణభయముగల, నిష్ఠన్ = తలపెట్టుటచేత, తోఁపఁగా, రామకున్ = ద్రౌపదికి, అపటభావంబు= వస్త్రరాహిత్యము, ఏమియును జనింపదు, ఆయమ్మ = ద్రౌపది, పాదుకొలుపు = తలఁచునట్టి, భూతభవద్భవ్యగురు = భూతభవిష్యద్వర్తమానములకుఁ గర్త యైనహరియొక్క, మహాజ్ఞ యెంతటిపెంపు నీదు, అని కవివాక్యము.

సీ.

తొల్లి యొకప్పు డెందును గన్న యది గాక
            తనరునాయరిదివర్తనకు మెచ్చి
స్వవరమహారాజ్యసంపదల్ భూనాయ
            కుఁ డొసంగ రామ చేకొన్నదానఁ

దజ్జ్యేష్ఠసుతుఁ డవాప్తవిషాదతను జెంది
            మగుడ నమందాక్షమాయ చత
గురుదత్తరాజ్యంబు హరియించెదోదూయ
            మాను లై జనులు లోలోనఁ దిట్ట


ఆ.

ననికృతాత్మగురువచోనుపాలనునాత
తప్రభావు ననఘు ధర్మసూతి
నంద యోటువఱిచి యాచతుర్దశవర్ష
భోగ్యమగు ప్రవాసమునకుఁ బనిచె.

24

భారత. తనరు = ఒప్పుచున్న, ఆయరిదివర్తనకున్ = ఆయక్షయవస్త్రములకు, మెచ్చి, స్వ = తనయొక్క, పరులనుమహారాజ్యసంపదలను, భూనాయకుఁడు = ధృతరాష్ట్రుఁడు, ఒసంగ, రామ, ద్రౌపది, చేకొన్న, దానన్ = ఆచేకొనుటచేత, తత్ = ఆధృతరాష్ట్రునియొక్క, జ్యేష్ఠసుతుఁడు, అవాప్త, విషాదతన్ = ఖిన్నత్వమును, చెంది, అమందమైన, అక్షమాయచేత, “రక్షోరథస్యావయవే పాచికేప్యక్షమింద్రియ” మ్మని వి. దోదూయమానులై = మిక్కిలిఁ బరితపింపుచుచున్నవారై, అనికృత = తిరస్కరింపఁబడని, ఆత్మ = తనయొక్క, గురు = అధికమైన, వచోనుపాలనున్ = వాక్యపాలన గలవాని, ధర్మసూతిన్ = ధర్మజుని, అంద = ఆపునర్ద్యూతమునందే, ఆచతుర్దశవర్ష = పదునాలుగవయేఁటిపర్యంతము, పదుమూఁడేఁడులు నిండుదనుక ననుట, భోగ్యమగు ప్రవాసమునకుఁ బనిచెను.

రామ. తొల్లి = పూర్వమందు, చేకొన్నదానను, తత్ = ఆదశరథునియొక్క, జ్యేష్ఠసుతుఁడవు, ఆప్త = పొందఁబడ్డ, అమందాక్ష = లజ్జారహితమైన, “మందాక్షంహ్రీస్త్రపావ్రీడా" అని అ. మాయచేత = కపటవర్తనచేత, హరియించెదో = తీసికొనెదవా, దూయమానులై = పరితపించుచున్నవారలై, అని, ధర్మసూతిన్ = ధర్మమునకుఁ గారణమైన రాముని, అంద = ఆమాటయందే, ఓటుపఱిచి = ఓడించి - నిరుత్తరునిఁ జేసి యనుట, ఆ, చతుర్దశవర్ష = పదునాలుగేండ్లు నిండుపర్యంతమును, "ఆఙ్మర్యాదాభివిధ్యోః" అని అభివిధ్యర్థము. భోగ్యమగుప్రవాసమునకుఁ బనిచెను.

సీ.

అతఁడు తద్వచనానుసృతి నాత్మసామ్రాజ్య
            మొకవికారము లేక యుజ్జగించి
ప్రియతరానుజకళత్రయుతంబుగా నుగ్ర
            కాననంబునకు నేగంగ నంత
వత్స రామ లసత్ప్రవర్తనల్ జనులకు
            నప్రకాశంబుగ నాచరింపఁ

బూని యరిగెదయ్య మానెమ్మనంబుల
            వేడుక లన్నియు వృథ చనంగఁ


తే.

జేసితె కటకటా యంచుఁ జింతఁ జాల
వగచువారును బతిఁ దిట్టువారు నగుచుఁ
బౌరవృద్ధులు వెనువెంటఁ బాయ కరిగి
రతఁడు వారల మగుడంగ ననిచి చనియె.

25


వ.

అంత.

26

రామ. అతఁడు = రాముఁడు, తద్వచనానుసృతిన్ = కైకవాక్యానుసరణముచేత, అనుజకళత్రయుతంబుగాన్ = లక్ష్మణసీతలతోఁ గూడ, ఉగ్రకాననంబునకు నేగంగన్ = వనవాసమునకుఁ బోఁగా, అంతన్ = ఆసమయమందు, జను లనెడుమాట, వత్స, రామ, రెండును సంబుద్ధులు. అరిగెదయ్య = పోవుచున్నావుగదా, మానెమ్మనంబుల, అతఁడు = రాముఁడు, వారలను = ఆపౌరవృద్ధులను, మగుడంగ ననిచి చనియెను.

భారత. అతఁడు = ధర్మరాజు, తద్వచనానుసృతిన్ = ఆదుర్యోధనువాక్యానుసారమునను, ఆంత, వత్సర = పదుమూఁడవయేఁటియందుఁగల, అమలసత్ప్రవర్తనలను, అప్రకాశంబుగ నాచరింపన్ = అజ్ఞాతవాసమునకు ననుట, అరిగెను, దయ్యమా = జనుల విచారవాక్యము, కడమ సరి.

ఆ.

పుత్త్రమోహమున విభుండు పోయినపోక
కును వగచుచు మఱియుఁ గూడ వచ్చి
కడుఁ బ్రయాణవిఘ్నకరు లగుభరతము
ఖ్యుల బ్రయత్నమున మగుడ్చి వెసను.

27

భారత. విభుండు పోయినపోకరున్ = ధృతరాష్ట్రుఁడు నడిచిననడవడికకు, ప్రయాణ = శీఘ్రగమనమునకు, విఘ్నకరులగు, వృద్ధులు గనుక శీఘ్రగమనము గూడదనుట, భరతముఖ్యులన్ = భీష్మబాహ్లికాదులను, ప్రయత్నమున మగుడ్చి, చనియెనని క్రిందటిపద్యమునఁ గ్రియ.

రామ. పుత్త్రమోహమున, విభుండు పోయినపోకకున్ = దశరథుఁడు నొచ్చిపోవుటకు, వగచుచు, ప్రయాణవిఘ్నకరులగు = తిరిగి పట్టణమునకు రమ్మనువారి ననుట, భరతముఖ్యులన్ = భరతాదులను, కడమ సరి.

చ.

బహువనచిత్రకూటముఖపర్వతచక్ర మతిక్రమించి వి
శ్వహితుఁడు దండకాశ్రమనివాసు లెదుర్కొని కొంచుఁబోవఁ ద
త్ప్రహితసపర్యుఁడై యలరెం బావని యాత్మవిశుద్ధసత్త్వవి
గ్రహఘనలక్ష్మి చూపఱకుఁ గన్నులపండువు గాఁగ నంతటన్.

28

రామ. బహువనములుగల, చిత్రకూటముఖ = చిత్రకూటము మొదలయిన, పర్వతములయొక్క, చక్రము = సమూహమును, అతిక్రమించి, విశ్వహితుఁడు = రాముఁడు, దండకాశ్రమనివాసులు = మునులు, కొంచుఁబోవన్ = తోడ్కొనిపోఁగా, తత్ = ఆమునులచేత, ప్రహిత = కృతమైన, సపర్యుఁడై = పూజగలవాఁడై, “సవర్యా తర్పణం బలిః” అని అ. ఆత్మ = తనయొక్క, విశుద్ధసత్వగుణముగల, విగ్రహ = శరీరముయొక్క, “శరీరం వర్ష్మ విగ్రహః” అని అ. ఘనలక్ష్మి, పావని = పవిత్రమైనది, లక్ష్మికి విశేషణము, చూపఱకుఁ గన్నులపండువుగాఁగ నలరెను.

భారత. బహువనములచేతఁ జిత్రములైన, కూటముఖ = శిఖరాదులుగల, “కూటో స్త్రీ శిఖరం శృంగ” మని అ. పర్వతచక్రమును, విశ్వహితుఁడు = ధర్మరాజు, దండకున్ = సమీపమునకు, ఆశ్రమనివాసులు, అలరెను, పావని = భీముఁడు, “పవనస్యాపత్య” మ్మను నర్థమందు అత ఇఞ్ = అని యిఞ్ ప్రత్యయాంతము. ఆత్మ = తనయొక్క, విశుద్ధసత్త్వ = మంచిబలిమిగల, విగ్రహలక్ష్మిచేత, కన్నులపండువుగాఁగ, కిమ్మీరునిఁ గూల్చె ననుపర్యంతము నేకయోజన.

క.

సతియును దానును నతివి
శ్రుత మగుతనబలిమి నమితసుమనఃకిమ్మీ
రతరశ్రీదృత మగునతి
వితతాటవిఁ గొంకులేక విహరించుతఱిన్.

29

భా. సతియును దానును = ద్రౌపదియు దానును, తనబలిమి చేత, అమిత= అణఁపఁబడిన, సుమనః = దేవతలు గల, కిమ్మీర = కిమ్మీరుఁ డనురాక్షసునియొక్క, తర = బలిమియొక్క, “ద్రవిణం తరస్సహోబలశౌర్యాణి" అని అ. శ్రీ = సంపదచేత, దృత = ఆదరింపఁబడినదైన, అటవియందు.

రామ. సతియును దానును = సీతతోఁ గూడి, బలిమిన్ = బలిమిచేత, అమితసుమనః = అధికపుష్పములచేత, “స్త్రియస్సుమనసః పుష్ప” మ్మని అ. కిమ్మీరతర = మిక్కిలిఁగర్బురవర్ణ మైన, "చిత్రకిమ్మీరకల్మాషశబలైతాశ్చ కర్బురే" అని అ. కడమ సరి.

శా.

దోరాస్ఫాలకరాళితోద్ధతి విరాధున్ నీలశైలోపముం
దారధ్వానయుతాట్టహాసవిసరద్దంష్ట్రామయూఖాళిఁ గి
మ్మీరాభిఖ్యఁ దనర్చురాక్షసు మదమిష్టోక్తు లాటోపదు
ర్వారాకృష్టమహీజుఁ డై వదరుగర్వగ్రస్తుఁ గూల్చెన్ ధరన్.

30

రామ. దోః = భుజములయొక్క, “దోః ప్రవేష్టభుజో బాహుః” అని వి. ఆస్ఫాల = మల్ల చఱచుటచేత, కరాళిత = అతిభయంకరముగాఁ జేయఁబడిన, ఉద్ధతిన్ = ఔద్ధత్యము, గలవాని, తార = అధికమైన, "తారోత్యుచ్చైః" అని అ. ధ్వాన = ధ్వనితోడ, “ధ్వనీధ్వానరవస్వనాః” అని అ. యుత = కూడిన, అట్టహాసముచేత, విసరత్ = వ్యాపించుచున్న, దంష్ట్రా = కోఱలయందుఁగల, మయూఖాళిన్ = జ్వాలాపరంపరలచేత, “మయూఖస్త్విటరజ్వాలా” అని అ. కిమ్మీరాభిఖ్యన్ = చిత్రవర్ణమైన కాంతిచేత, “అభిఖ్యా నామ శోభయోః" అని అ. తనర్చురాక్షసుని, ఆటోప = వేగముచేత, దుర్వార మౌనట్టుగా, ఆకృష్ట = అపహరింపఁబడిన, మహీజుఁడై = సీత గలవాఁడై, మదమువల్ల, మ్లిష్ట = స్పష్టముగాని, “అథమ్లిష్ట మవిస్పష్ట" మని అ. ఉక్తులు = మాటలను, వదరు = వదరెడి గర్వగ్రస్తుని, విరాధున్ = విరాధుఁ డనెడివాని, కూల్చెను.

భారత. దోరాస్ఫాలకరాళితోద్దతియొక్క, విరాధున్ = ప్రాప్తిగలవాని “రాధనం సిద్దౌ” ఆనుధాతువున ఘఞంతము. విరాధున్ = ధూర్తుని ననియుఁ జెప్పవచ్చును. “రాధో మృగయుదుష్టయోః" అని వి. కిమ్మీరాభిఖ్యఁ దనర్చు రాక్షసున్ = కిమ్మీరుఁ డనురాక్షసుని, ఆకృష్ట = తివిచికొనఁబడిన, మహీజుఁడై = వృక్షములు గలవాఁడై, కడమ సులభము.

ఆ.

ఆనిశాటుఁ డట్లు హతుఁ డయి దేవతా
తుష్టిఁ జేసి వారు దొడఁగినట్టి
విపినవాసకార్య మపవిఘ్న మై సాఁగఁ
బ్రథమహత మగుబలిపశువుఁబోలె.

31

రెంటికి సమము సులభము.

వ.

అది యట్లుండె మహారణ్యంబు దఱియంజొచ్చి యారాజమూర్ధన్యుండు.

32

భారత. ఆరాజమూర్ధన్యుండు = భీముఁడు.

రామ. ఆరాజమూర్ధన్యుండు = రాముడు.

క.

ఈ తెఱఁగున సతితో స
భ్రాతృకుఁ డై వరుసఁ జని ప్రపంచితసుమనో
ద్వైతవనభూములందుఁ
భూతామోదమున నెలమి వొందుచు నంతన్.

33

రామ. సతితోన్ = సీతతోఁగూడ, సభ్రాతృకుఁడై = లక్ష్మణసహితుఁడై, ప్రపంచిత = విస్తరింపఁబడ్డ, సుమనః = పుష్పములతోడ, అద్వైత = ఐక్యముగల, వనభూములందు, పుష్పితవనములయం దనుట, ఎలమిఁ బొందుచు.

భారత. సతితోన్ = ద్రౌపదితోఁగూడ, సభ్రాతృకుఁడై = రాజాదులతోఁ గూడినవాఁడై, ప్రపంచిత = ప్రసిద్ధులైన, సుమనః = సజ్జనులు గల, ద్వైతవనభూములందు, ప్రభూత = ప్రచురమైన, కడమ సరి.

చ.

మొలచువచఃప్రసంగముల ముందరఁ గాఁగలకార్యరేఖ పెం
పెలయ బరాత్మచింతనసుహృచ్ఛరభంగసుతీక్ష్ణకుంభజా
దులహితశాసనక్రమముతోఁ జరియించెద రత్యనూనత
త్కలితబహూపచారతకతంబున రంజిలి యంచు నెంచుచున్.

34

భారత. ముందర = ఆజ్ఞాతవాసమునకుఁ దరువాత, కాఁగలకార్యరేఖ = యుద్ధ మనుట, పర = పరు లైనదుర్యోధనాదులయొక్కయు, ఆత్మ = తనయొక్కయు, చింతన్ = బలాబలవిచారముచేత, అసుహృత్ = శత్రువులయొక్క, శరభంగమందు, సుతీక్ష్ణ = ప్రచండులైన, కుంభజాదులు = ద్రోణాదులు, అహిత = దుర్యోధనునియొక్క, శాసనక్రమముతో, అత్యనూన = పరిపూర్ణముగా, తత్కలిత = ఆదుర్యోధనకృతమైన, రంజిలి, చరియించెదరు, క్రియ, అంచు, ఎంచుచును.

రామ. ముందరఁ గాఁగల కార్యరేఖ పెంపు, ఎలయన్ = ప్రకాశింపఁగా, పరాత్మచింతన = పరమాత్మధ్యానమునకు, సుహృత్ = బంధువులైన, ధ్యానముతోఁ గూడినవా రనుట, శరభంగ, సుతీక్ష్ణ, కుంభజ, అగస్త్యుఁడు, ఆదుల = మొదలైనవారియొక్క, హితశాసనక్రమముతోన్ = హితోపదేశానుచారమున, రతి = వేడుకచేత, అనూన = అధిక మౌనట్టుగా, తత్కలిత = ఆమునికృతమైన, రంజిలి చరియించెదను.

సీ.

కడుఁ దన్మహాశ్రమగమనోదితోత్సాహుఁ
            డయ్యె నాసమయంబునందు నమిత
తుంగహృద్రిపుశరభంగమునీశ్వరు
            నంబకమున్మహిమాస్పదమును
ఘనతపశ్శక్తిఁ దెమ్మని విధి దయచేసి
            వెస జిష్ణుఁ బంచెఁ దవ్వేళ వచ్చి
తత్పితామహుడు సత్యవిధానుఁ డట్లంప
            నాఘనుఁ డింద్రకీలాశ్రమప్ర


తే.

వేశ మొనరించి యవ్విధివిభుశురేశు
నఖిలనుతుని భజించెద యాత్వరాతి
రాముఁ డాదిత్యకులభర్తరమణ వచ్చి
కరుణ సేయు నంతకుఁ దగుగట్టితాల్మి.

35

రామ. తత్ = ఆశరభంగాదులయొక్క, మహాశ్రమములఁ గూర్చి, గమన = తర్లిపోవుటకు, ఉదిత = పుట్టిన ఉత్సాహము గలవాఁ డాయెను, నమిత, తుంగ = పొడవులైన, హృద్దిపు = అంతశ్శత్రువులు గలవాని, అంబక = నేత్రములకైన, మున్మహిమ = సంతో షాతిశయమునకు, ఆస్పదమును, నేత్రోత్సాహ మైనవాని ననుట. “అంబకం నేత్ర శరయోః” అని వి. ఆస్పదశబ్దము నిత్యనపుంసకము. ఘనమైన తపశ్శక్తి గలవాని - శరభంగమునీశ్వరుని, తెమ్మని = పిలుచుకరమ్మని, విధి = బ్రహ్మదేవుఁడు, జిష్ణున్ = ఇంద్రుని, పంచెన్ = అంపెను, తద్వేళ వచ్చి = తదుచితవేళ రాఁగా ననుట, సత్యవిధానుఁడు = తత్పితామహుఁడు, అట్లు-అంపన్ = ఆలాగు చెప్పి యంపఁగా, ఆఘనుఁడు = శరభంగుఁడు, అనుమాట, ఇంద్ర - సంబుద్ధి, కీల = అగ్నిజ్వాలయందుఁ గల, “ద్వయోర్జ్వాలకీలౌ” అని అ. ఆశ్రమప్రవేశ మొనరించి, అవ్విధిన్ = బ్రహ్మదేవుని, భజించెదను, యాత్వరాతి = రాక్షసవైరి, “యాతురక్షసి” అని అ. రాముఁడు వచ్చి, కరుణసేయునంతకున్ = నాకుఁ దనసేవ ననుగ్రహించుదనుక, గట్టితాల్మి తగున్ = విలంబమును వహింపఁదగు ననుట, ఇందుకు భావము రాముఁడు శరభంగాశ్రమమునకు వచ్చెడివేళ బ్రహ్మ యింద్రునిం బంపి శరభంగునిఁ బిలిపింపఁగా నాయన రాముని సేవించినవెనుక నగ్నిప్రవేశము చేసి బ్రహ్మసన్నిధికి వచ్చెననుట.

భారత. తత్ = ఆయెన్నికచేత, మహాశ్రమగ = అధికశ్రమమునుబొందిన, మనః = మనస్సుచేత, దితోత్సాహుఁ డయ్యెన్ = ఖండితోత్సాహుఁ డాయెను, ఆసమయంబునందు, అమితములైన, తుంగహృత్ = ఉన్నతచిత్తులైన, రిపు = శత్రులయొక్క, శరములను, అమితపదము శరవిశేషణము, భంగము = భంగించెడిదాని, ఈశ్వరునంబకమున్ = పాశుపతాస్త్రమును, మహిమకు, ఆస్పదమైనదాని, మనతపశ్శక్తిచేత, విధి దయచేసి = మంత్రవిధానము నుపదేశించి, సత్యవిధానుఁడు = వ్యర్థముగాని శాసనము గలవాఁడు, తత్పితామహుఁడు = వ్యాసమునీశ్వరుఁడు, తద్వేళ వచ్చి = ఆధర్మరాజువిచారవేళయందు వచ్చి, జిష్ణున్ = అర్జునుని, పంచెనని క్రిందటి కన్వయము. అట్లంపన్ = ఆరీతి నంపఁగా, ఆఘనుఁడు = ఆయర్జునుఁడు, ఇంద్రకీలాద్రియందున్న యాశ్రమప్రవేశ మొనరించి, అవ్విధిన్ = ఆమంత్రవిధానముచేత, సురేశున్ = ఇంద్రుని, భజించెను. దయాత్వరా = కృపాతిశయముచేత, అతిరాముఁడు = మిక్కిలి నభిరాముఁడు, ఆదిత్యకులభర్త = దేవతాపతియైన యింద్రుఁడు, కరుణ సేయునంతకున్ = ప్రసన్న మగుపర్యంతము, తగు = తగిన, గట్టితాల్మిచేత, భజించెనని క్రిందటి కన్వయము.

తే.

ప్రీతి వచ్చి నాకీశుఁడు నాతపోవి
భూతిఫలము దా నైయత్యపూర్వవృత్తి
నధికశివమనురూపసన్నిధి యొసంగ
నతని నంచి కృతార్థుండ నగుదు ననుచు.

36

భారత. ప్రీతి వచ్చి, నాకీశుఁడు = ఇంద్రుఁడు, ఆతపోవిభూతియొక్క ఫలమును, తాన్ = తాను, నైయత్యపూర్వ = నియతత్వపూర్వకమైన, వృత్తిన్ = వర్తనగల దాని, అధికమైన, శివమనురూప = శివమంత్రరూపమైన, సన్నిధి = లెస్సైననిధానమును, పెన్నిధివంటి పంచాక్షరి ననుట, ఒసంగన్ = ఇచ్చినను, అతనిన్ = ఇంద్రుని, అంచి = అంపి, కృత =చేయఁబడ్డ, అర్థ = శివారాధనరూపప్రయోజనము గలవాఁడను, అగుదు ననుచు, ఇంద్రుఁడు శివమంత్రోపదేశము చేసినతర్వాత నర్జునుఁ డీప్రకారమున, జింతించెను.

రామ. ప్రీతి వచ్చి = సంతోషము వచ్చి, నాకు, ఈశుఁడు = రాముఁడు, అధికశివము = అతిశుభమైన, అనురూపసన్నిధి = నాకుఁ దగినసాన్నిధ్యమును, ఒసంగన్ = కృప చేసినతర్వాత, అతనినంచి ఆరఘునాథుని నంపినవాఁడనై, కృతార్థుండ నగుదున్ = అలాగె బ్రహ్మలోకమునకు వచ్చెద ననుచు.

వ.

యథోచితవినయోపచారపూర్వకంబుగా నింద్రుని మగుడ ననిచి.

37


క.

తనమనమున నెంతయు మిం
చినతాత్పర్యమున రాజశేఖరు శుభద
ర్శనుని రఘునాథుఁ దలఁచుచు
ననుపమభూయస్సమాధి నతఁడు దలిర్చెన్.

38

రామ. రాజశేఖరున్ = రాజశ్రేష్ఠుఁడైనవాని, రఘునాథునిఁ దలఁచుచు, భూయః = మఱియు.

భారత. రాజశేఖరున్ = ఈశ్వరుని, నిరఘున్ = నిష్కల్మషమైనవాని; నాథుని దలఁచుచు, భూయః = తఱుచైన, తపస్సమాధిని దలిర్చెను.

చ.

అతఁడును దత్తపోమహిమ యచ్చటిమౌనులు వచ్చి చెప్పఁగా
నతికుతుకంబునన్ వినుచు నచ్చటికిం జనియెం బరాజితో
ద్ధతివిలసద్వయోమృగయుతన్ వనలక్ష్మి నశేషలోకసం
స్తుతగుణకున్ ధరాత్మజకుఁ జూపియుఁ జెప్పియు వేడ్క సేయుచున్.

39

భారత. అతఁడును = ఈశ్వరుఁడును, తత్ = ఆయర్జునునియొక్క, తపోమహిమను, అచ్చటికిన్ = అర్జునాశ్రమసమీపమునకు, పర = పరులచేత, అజిత = నివారింపఁబడని, ఉద్ధతి = ఔద్ధత్యముచేత, విలసత్ = ఒప్పుచున్న, వయః = ప్రాయము గల, మృగయుతన్ = కిరాతత్వముచేత, “మృగయు ర్థుబ్దకశ్చసః" అని అ. వనలక్ష్మిని, ధరాత్మజకున్ = పార్వతికి, “ఆహార్యధరపర్వతాః” అని అ. చూపియఁఁ జెప్పియు వేడ్క సేయుచును, చనియెనని క్రియ.

రామ. అతఁడును = ఆరాముఁడును, పరాజిత = తిరస్కరింపఁబడిన - లేనిదనుట, ఉద్ధతి = ఔద్ధత్యము గల - వైరము గలవై యనుట, విలసత్ = ఒప్పెడి, వయః = పక్షులతోడను, “'ఖగబాల్యాదినోర్వయః” అని అ. మృగములతోడను, యుతన్ = కూడిన, వనలక్ష్మిన్ = శరభంగాశ్రమవిలాసమును, ధరాత్మజకు =సీతకు, చూపియఁఁ జెప్పియు వేడ్క సేయుచును, అచ్చటికి, చనియెనని క్రియ.

చ.

వలసినవన్యవర్తన మవాక్యగతిన్ జరిగింపుచుం బ్రవ
ర్ధిలుతమిఁ బేర్చుతమునియతిస్థిరభక్తిఁ బ్రమోదసంపదల్
దలకొనఁగా నరణ్యచరతన్ భజియించి యతండు ముఖ్యభృ
త్యులమరసంయముల్ ముదముతో మది మ్రొక్క నటించె మర్త్యతన్.

రామ. వన్యవర్తనము = కందమూలఫలాదికమును, జరిగింపుచున్ = ఆహారము చేసికొంచును, ప్రవర్ధిలుతమిన్ = అధికారముచేత, పేర్చు = ఒప్పునట్టి, తమ్ముని = లక్ష్మణునియొక్క, అతిస్థిర, భక్తిన్, = భక్తిచేత, ప్రమోదసంపద ల్తలకొనఁగా, అరణ్యచరతన్ = వనసంచారమును, భజియించి = చేకొని, అతండు = ఆరాముఁడు, ముఖ్యభృత్యులు = ఆత్మసేవకులైన, అమరసంయముల్ = దేవమునులు, మది మ్రొక్కన్ = మనస్సులయందే మ్రొక్కఁగా, మనుష్యావతారుఁడై యున్నాఁడు గనుక, మర్త్యతను నటించెను.

భారత. వలసిన, వన్యవర్తనము = వనవిహారమును, తమ్మును, అరణ్యచరతన్ = కిరాతత్వమును, భజియించియ = పొందినవారయ్యే, తండుముఖ్యభృత్యులు = నందిప్రముఖసేవకులును, “తండునందినౌ నందికేశ్వరే” అని అ. అమరఁగా, సంయముల్ = మునులు, ముదముతో మదిన్ = సంతోషముతోఁ గూడిన మనస్సుచేత, మ్రొక్క, మర్త్యతన్ = మనుష్యరూపమున, నటించెన్ = వర్తించెను.

వ.

అది య ట్లుండె నట్టిసమయంబున.

41


చ.

బిరుదునఁ బేర్చు దేవరిపుభీమవరాహవపుష్కరాక్షసుం
దరసవిశేషధామసముదంచితసత్వమయాంగరాజుకుం
జరకుధరాకృతిం బ్రబలుసర్వపలాశిచయంబు గూల్చుసు
స్థిరునినుమావిభుం డనుమతిన్ వెనుదౌలెద మాదరంబునన్.

42

భారత. దేవ = దేవతలకు, రిపు = శత్రుఁడైనవాని, భీమ = భయంకరమైన, వరాహవపుష్క = సూకరాకారము గలిగిన, రాక్షసున్ = మూకాసురు ననుట, తరస = మాంసముయొక్క, “పిశితం తరసం మాంస” మ్మని అ. విశేష = భేదమునకు - క్రొవ్వున కనుట, ధామ = స్థానమైన, సముదంచిత = ప్రకాశింపుచున్న, సత్త్వమయ = బలప్రచురమైన, ప్రాచుర్యమున మయట్టు, అంగరాజకున్ = శరీరశ్రేష్ఠము గలవాని, చర = చరించెడి, కుధరాకృతిన్ = పర్వతాకారముచేత, ప్రబలెడువాని, సర్వ, పలాశిచయంబు = వృక్షసమూహమును, “పలాశీద్రుద్రుమాగమాః” అని అ. కూల్చు సుస్థిరుని, వరాహవ పుష్కరాక్షసునని క్రిందటి కన్వయము, ఉమావిభుండు = ఈశ్వరుఁడు, దమ = అణఁచుటయందుఁ గల, ఆదరంబున వెనుదౌలెను, రాక్షసున్ తరసవిశేష, అంగరాజకున్ చరకుధర, అనెడిదిక్కుల సంధిలక్షణము. క. 'నాంతము లైనపదంబుల, పొంతం బై నున్నశబ్దములకచటతప, ల్దొంతి గజడదబ లగున, య్యంత నకారంబు నున్న యభినవదండీ' యని యాంధ్రభాషాభూషణము.

రామ. దేవరిపుభీమ, వరాహవ = లెస్సయుద్ధము గలవాఁడా, “సంగ్రామాభ్యాగ మాహవాః” అని అ. పుష్కరాక్ష = రాజీవాక్ష, "బిసప్రసూనరాజీవపుష్కరాంభోరుహాణి చ" అని అ. సుందరమునై, సవిశేషధామ = విశేషతేజస్సహితమునై, సముదంచిత = పూజితమునై, సత్త్వమయ = సాత్త్వికగుణప్రధానమునైన, అంగము గలవాఁడా, రాజకుంజర = రాజశ్రేష్ఠుఁడా, "సింహశార్దూలనాగాద్యాః పుంసి శ్రేష్ఠార్థగోచరాః” అని అ. ఇవి సంబుద్ధులు. ప్రబలు = ప్రబలెడి, సర్వ, పలాశిచయంబు = రాక్షససమూహమును, నిను, మావిభుండు = మాధవుఁడు, అను = అనెడి, మతిన్ = మతిచేత, వెనుతౌలెదము.

సీ.

అని కోర్కి మీఱ నిజాలోకపరు లతీ
            తాశ్రమాలయులు దన్ననుసరింప
నవనిభూదారానుయానోచితాధ్వని
            క్షిప్తాంఘ్రిగతులను జెన్ను మిగుల
నాత్మభక్తునిసత్త్వ మరసి ప్రోచుటకు రా
            జవతంసుఁ డట్లు వత్సలత నేఁగి
యావనక్రో డంబు నం దాతపస్వియుఁ
            దానును గూడ సత్ఫలత నొప్పు


తే.

నంబకము లేసిరి వహించె నది తదుభయ
సంగరాగమనోర్జితోత్సవధురాని
మిత్తతఁ గరంబు నుతి గాంచి మించె నప్పు
డొగిఁ దదన్యోన్యజన్యముద్ద్యోతి యగుచు.

43

రామ. అని = ఇటని, అవనిభూ = సీతయొక్క, ఉదారమైన, అనుయాన = కూడ వచ్చుటకు, ఉచిత మగునట్టుగా, అధ్వ = మార్గమందు, నిక్షిప్త = పెట్టఁబడిన, అంఘ్రి = పాదములయొక్క, గతులచేతఁ జెన్ను మిగులునట్టుగా, ఆత్మభక్తుని = శరభంగునియొక్క, సత్త్వము = సత్త్వగుణమును, ఆవనక్రోడంబునందున్ = వనమధ్యమం దనుట. "క్రోడస్సూకరపాతంగ్యోః క్రోడః క్రోడం చ వక్షసి” అని అ. ఆతపస్వియు దానును గూడన్ = శర భంగరాములు సంధింపఁగా, సత్ఫలతన్ = లెస్సఫలము గలవౌట చేత, ఒప్పెడి, అంబకములు = కన్నులు, ఏసిరి = ఏయొప్పిదమును, వహించెను. అది = ఆయొప్పిదము, తదుభయ = ఆయిద్దరియొక్క, సంగమందు రాగముగల, మనః = మనస్సుచేత, ఆర్జిత = సంపాదింపఁబడ్డ, ఉత్సవధురా = ఉత్సవాతిశయమునకు, “ఋక్పూరబ్ధూఃపథామానక్షే” అనుసూత్రమున టచ్ప్రత్యయాంతము. నిమిత్తతన్ = సూచక మగుటచేత, తత్ = ఆశరభంగరాములయొక్క, అన్యోన్యజన్య = ఒకరొకరివలనఁ బుట్టిన, ముత్ = సంతోషముచేత, ద్యోతి యగుచున్ = ప్రకాశింపుచున్నదై, అది యొప్పిదము మించెనని యన్వయము. ఇందుకు భావము శరభంగుడు రాముఁడును గూడఁగాఁ గన్నులవికాస మేది కలదో యావికాసము వారిమనస్సులయందలి యుత్సవమును సంతోషమును దెలిపె ననుట.

భారత. అని = యుద్ధమందుఁ గల, కోర్కి మీఱఁగా, నిజాలోకపరులు, అతీత = విడువఁబడిన, ఆశ్రమములు నాలయములు గలవారు, మునులు, అనుసరింప, భూదార = వరాహముయొక్క, “ క్రోడోభూదారఇత్యపి" అని అ. అనుయాన = వెంటఁ బోవుటకు, ఉచితమౌనట్టుగా, అధ్వని = ధ్వని లేకుండునట్టుగా, క్షిప్త= పెట్టఁబడిన, అంఘ్రిగతులచేత, అవని = భూమి, చెన్ను మీఱఁగా, ఆత్మభక్తుని = అర్జునునియొక్క, సత్త్వము = బలమును, ఆరసి = పరీక్షించి, ప్రోచుటకు, రాజనతంసుడు = చంద్రశేఖరుఁడు, వీగి, ఆవనక్రోడంబునందు = అడవిపందియందు, ఆతపస్వియుఁ దానును = అర్జునుండును దానును, కూడ, సత్ఫలక = మంచిముల్లులు గలవౌటచేత, “సస్యబాణాగ్రయోః ఫల” మ్మని రత్నమాల. ఒప్పు, అంబకములు = బాణములను, ఏసిరి, అది = ఆయేయుట, తదుభయ = ఆయిద్దఱియొక్క, సంగర = యుద్ధముయొక్క, ఆగమనమనెడి, ఉత్సవధురా = ఉత్సవాతిశయమునకు, నిమిత్తతన్ = కారణత్వమును, వహించెనని క్రిందటి కన్వయము. తత్ = ఆకిరాతార్జునులయొక్క, అన్యోన్యజన్యము = పరస్పరయుద్ధము, “యుద్ధమాయోధనం జన్య” మ్మని అ. ఉద్యోతియగుచున్ = ప్రకాశింపుచున్నదై, నుతి గాంచి మించెనని క్రిందటి కన్వయము.

వ.

వారలిద్దఱు గొంతతడవు.

44


క.

నుతసత్త్వాధికరణలస
దితరేతరజాత్యుచితసమిద్ధసపర్యా
యతిరోహితభావు లగుచు
ధృతి నెరపుచు ధర్మపటిమ దృఢత నెరపుచున్.

45

భారత· నుతసత్త్వ = వర్ణనీయబలముగల, అధికరణ = ఘనయుద్ధముచేత, లసత్ = ఒప్పుచున్న, ఇతరేతరజ = ఒకరొకరివలనఁ బుట్టిన, అత్యుచితమానట్టుగా, సమిద్ధ = ప్రదీప్తమైన, సపర్యాయ= పర్యాయముతోఁ గూడిన, తిరోహితభావు లగుచున్ = తిరోహితత్వము గలవారై - ఓటమిగలవా రౌచుననుట, ధృతి = ధైర్యమును, నెరపుచును, ధర్మపటిమ = వింటినేర్పుయొక్క, దృఢత = దార్ఢ్యమును, నెరపుచును.

రామ. నుత, సత్త్వ = సత్త్వగుణమునకు, అధికరణ = స్థానమైనదియునై, లసత్ = ఒప్పుచున్న, ఇతరేతరజాతి = అన్యోన్యబ్రహ్మక్షత్త్రజాతులకు, ఉచిత = తగిన, సమిద్ధమైన, సవర్యా = పూజలయొక్క, “సవర్యా తర్పణం బలిః" అని అ. ఆయతి = నిడివియందు, రోహిత = మొలిపింపఁబడ్డ, భావ = తాత్పర్యము గలవారౌచును, ధృతి = సంతోషమును, “ధృతిర్యోగాంతరే ధైర్యే ధారణాధ్వరతుష్టిషు” అని అ. ధర్మపటిమ = ధర్మాతిశయముయొక్క.

వ.

ప్రవర్తిల్లి రయ్యవసరంబున.

46


మ.

అరుదార న్నరభావవిస్ఫురితశౌర్యాలోకఖేలన్మనో
హరమాహాత్మ్యము మీఱ లుబ్ధకరణవ్యావర్తనాశక్తిని
ర్భరుఁ డై తాపసుఁ డంపలేమిఁ బ్రకటింపం జూచి యీరాట్కులా
భరణం బిందునె చిక్కునో యని నిలింపవ్రాత మెంచె న్మదిన్.

47

రామ. అరుదారన్ = అరుదగునట్టుగా, నరభావ = మనుష్యత్వముచేత, విస్ఫురితుఁడైన, శౌరి = విష్ణువైన రామునియొక్క, ఆలోక = సందర్శనమనెడి, ఖేలన్ = క్రీడచేత, మనోహరమైన మాహాత్మ్యము మీఱఁగా, భావము. విష్ణుసందర్శనమువల్లఁ దపోమహత్త్వము ప్రకాశింపఁగా ననుట, లుబ్ధ = ఎడఁబాయఁజాలని, కరణ = ఇంద్రియముయొక్క, లోభముయొక్క యనుట. “కరణం సాధకతమక్షేత్ర గాత్రేంద్రియేష్వపి” అని అ. వ్యావర్తన = త్రిప్పుటయందుఁ గల, అశక్తిచేత నిర్భరుఁడై, అశక్తి యధికమనుట, తాపసుఁడు = శరభంగుఁడు, అంపలేమిన్ = అంపలేకుండుటను, ఈరాట్కులాభరణంబు = ఈరామచంద్రుఁడు, ఇందునె = ఈయాశ్రమమందే, చిక్కునో = రాక్షససంహారము చేయక నిలుచునో, అని = ఇట్లని, నిలింపవ్రాతము = దేవతాసమూహము, ఎంచెను.

భారత. నర = అర్జునునియొక్క, భావమందు విస్ఫురితమైన శౌర్యముయొక్క, ఆలోక = పరీక్షయందు, ఖేలత్ = విహరింపుచున్న, మనః = మనస్సుగల, హరునియొక్క, మాహాత్మ్యము = జయము, మీఱఁగా, లుబ్ధక = కిరాతరూపమైనహరునియొక్క, “మృగయుర్లుబ్ధకశ్చ సః" అని అ. రణ = యుద్ధమును, వ్యావర్తన = మాన్చుటయందుఁ గల, అశక్తి = శక్తిరాహిత్యముచేత, నిర్భరుఁడై = అతిశయము లేనివాఁడై, “భరోతి శయభారయోః” అని వి. తాపసుఁడు = అర్జునుఁడు, అంపలేమిన్ = అమ్ములయొక్కలేమిని, ప్రకటింప = ప్రకాశము చేయఁగా, అమ్ములు పొదులలోఁ గానక వెదుకు లాడఁగా ననుట, ఈరాట్కులాభరణంబు = ఈయర్జునుఁడు, ఇందునె = ఈబాణములేమిచేతనే, కడమ సులభము.

క.

తనకును శరభంగమునీ
శునకు సమరసత్వభరము సొరిది నొదువుచుం
దనరుట గడు నెన్నికలం
గని ప్రబలధృతిం దనర్చు క్షత్త్రియుఁ డంతన్.

48

భారత. క్షత్త్రియుఁడు = అర్జునుఁడు, తనకు, శరభంగము = బాణములు లేకపోవుటయు, ఈశునకు సమరసత్వభరము, ఎన్ని, కలంగని = చలింపని.

రామ. తనకును, శరభంగమునీశునకును, సమ = సమానమైన, రసత్వభరము = అనురాగాతిశయము, ఎన్నికలన్ = కొనియాడుటలచే, బలధృతిన్ = అధికసంతోషముచేత, క్షత్త్రియుఁడు = రాముఁడు.

సీ.

అతిదృఢం బైనట్టి యాత్మసఖ్యాతిచా
            పలత యెంతయుఁ దనబలిమిఁ ద్రిప్పి
ఘనతేజు నమ్మహాత్ముని నీకు నలబ్రహ్మ
            కట్టడ యె ట్లట్ల కాక దాఁట
నగునె పొ మ్మనుచుఁ దా ననిపెనుగడఁక మొ
            త్తంబై నిలింపసంఘంబు విరులు
గురిసె నప్పుడు నిజస్థిరచండహేతిపా
            తమునవికారలేశముఁ బొరయక


తే.

మెఱయు నారణ్యకేంద్రుపై మెచ్చుదనర
నర్హగతివిధిఁ జేరంగ నరిగె నాస
మిద్ధశౌర్యుఁడు శుభమౌనియుద్ధవశత
ఘనపదవి నెల్లఖచరులు వినుతి సేయ.

49

రామ. ఆత్మ = తనయొక్క, సఖ్య = చెలిమియందుఁగల, అతిచాపలత = అత్యంతచపలత్వమును, త్రిప్పి = మరలించి, రాముఁ డనెడుమాట, అమ్మహాత్మునిన్ = శరభంగుని, నీకు, బ్రహ్మకట్టడ = బ్రహ్మదేవునియాజ్ఞ, అనుచు ననిపెను, నిజ = స్వకీయమైన, స్థిర = నిత్యకృత్యమైన, చండ, హేతి = అగ్నిహోత్రునియం దగు, ఔపాసనాగ్నియందలి యనుట, పాతమునన్ = ప్రవేశించుటచేత, మెఱయు, అరణ్యకేంద్రుపైన్ = మునిశ్రేష్ఠుఁడైన శరభంగునిమీఁద, నిలింపసంఘంబు, అర్హగతిన్ = తగినక్రమముచేత, విధిన్= బ్రహ్మదేవుని, చేరంగన్ = చేరుచుండఁగా, విరులు గురిసెనని క్రిందటి కన్వయము. ఆసమిద్ధశౌర్యుఁడు = ప్రదీప్తమైన శౌర్యముగల రాముఁడును, శుభ, మౌని = శరభంగునియొక్క, ఉద్ధవ = సంతోషములయొక్క, శతములచేత ఘనమైన పదవిని ఎల్లఖచరులు వినుతి సేయఁగా నరిగెనని యన్వయము. ఫలితార్ధము రాముఁడు శరభంగునికి ముక్తికి ననుమతించి యాముని దివ్యపుష్పవర్షములతో బ్రహ్మలోకమునకుఁ బోవుచుండఁగాఁ దాను సుతీక్ష్ణునియాశ్రమమునకు సాఁగివచ్చె ననుట.

భారత. ఆత్మ = తనయొక్క, సఖ్యాతి = ఖ్యాతితోఁ గూడిన, చాపలత = ధనుర్లతను గాండీవమును, తనబలిమిచేత, త్రిప్పి = విసరి, అమ్మహాత్మునిన్ = ఈశ్వరుని, నీకు, బ్రహ్మకట్టడ = బ్రహ్మవ్రాఁత, దాఁటనగునె పొమ్మనుచున్ = ఈపెట్టు దగిలించుకొని యణఁగునట్టుగా నీవ్రాఁత యుండెననుచు, తాను = అర్జునుఁడు, అని పెనుగడఁకన్ = యుద్దమందలి యధికరోషముచేత, మొత్తన్ = కొట్టఁగా, పైన్ = అర్జునునిపై, నిలింపసంఘంబు విరులు గురిసెను, నిజస్థిరచండహేతి = గాండీవముయొక్క, 'రవేరర్చిశ్చ శస్త్రంచ వహ్నిజ్వాలాచ హేతయః' అని అ. పాతమునన్ = పెట్టుటచేత, మెఱయుచున్న, ఆరణ్యకేంద్రుపైన్ = కిరాతరూపమున నున్నయీశ్వరునిమీఁద, మెచ్చు దనరఁగా, అర్హగతివిధిన్ = సమయోచితగతి విధానముచేత - వేగిరముగా ననుట, ఆసమిద్ధశౌర్యుఁడు = అర్జునుఁడు, శుభమౌ = శుభ మగునట్టి, నియుద్ధవశతన్ = బాహుయుద్ధపరతచేత, “నియుద్ధం బాహుయుద్ధే స్యా” త్తని అ. ఘనపదవిన్ = ఆకాశమార్గమున, ఎల్ల, ఖచరులు = దేవతలు, వినుతి సేయఁగాఁ జేరంగ నరిగెను.

వ.

అంత.

50


శా.

మాయామర్త్యుఁడుమాధవుం డవిచలన్మైత్రిన్ సుతీక్ష్ణాశ్రమ
స్ఫాయత్సత్త్వవిహారమప్రవిశదీషద్వేషరోషాంకురం
బై యేపారఁగఁ జూచుచుం బరువడిన్ హర్షదయం బెక్కఁగా
జాయం దమ్ము నిరూఢదృష్టిఁ గన భ్రూసంజ్ఞన్ నియోగించుచున్.

51

భారత. ఉమాధవుండు, అవిచలత్ = చలింపని, మైత్రి = అర్జునునిమీఁది మైత్రిచేత, సుతీక్ష్ణమై, అశ్రమ = శ్రమరహితమై, స్ఫాయత్ = పెరుఁగుచున్న, సత్త్వ = బలిమియొక్క, విహారము = పెనఁగులాట యనుట, అప్రవిశత్ = ప్రవేశింపని, ఈషద్ద్వేషరోషాంకురములు గలదై, పరు-వడిన్ = అర్జునునియొక్క వడిచేత, జాయన్ = పార్వతిని, తమ్మున్ = అర్జునుని దన్నును, నిరూఢదృష్టిన్ = సావధానదృష్టిచేత, కనన్ = చూచునట్టుగా, నియోగించుచును.

రామ. మాయామర్త్యుఁడైన మాధవుండు = రాముఁడు, సుతీక్ష్ణాశ్రమమందు, స్ఫాయత్ = వృద్ధిఁ బొందుచున్న, సత్త్వ = జంతువులయొక్క, విహారము, మైత్రి చేతన ప్రవిశదీషద్ద్వేషరోపాంకురంబై యేపారఁగా, జాయన్ = సీతను, తమ్మునిన్ = లక్ష్మణుని, రూఢ, కడమ సులభము.

క.

ప్రీతి దనర భూరితప
శ్చాతుర్యసుతీక్ష్ణసత్త్వసందర్శనసం
జాత మగువేడ్క యంతటఁ
జేతోరంజనము మిగులఁ జేయ నలరుచున్.

52

రామ. సుతీక్ష్ణమునియొక్క సత్త్వగుణముయొక్క సందర్శనమువలన, అలరుచును.

భారత. తపశ్చాతుర్యముయొక్కయు, సుతీక్షణ = తీవ్రమైన, సత్త్వ = బలిమియొక్కయు, కడమ సరి.

క.

భద్రగతి నరుగ లోపాముద్రానందస్వరూపమునిదర్శితని
ర్ణిద్రప్రసన్నతాసం, పద్రుచిరత మెఱయ నేత్రపర్వ మొనర్చెన్.

53

రామ. భద్రగతిన్ = మంచిగమనముచేత, అరుగన = పోఁగా, లోపాముద్రానందస్వరూపముని = లోపాముద్ర కానందస్వరూపమైనముని అగస్త్యుఁడు, దర్శిత = చూపఁబడిన, నిర్ణిద్ర = స్ఫుటమైన, ప్రసన్నతాసంపదయొక్క రుచిరత మెఱయ, నేత్రపర్వ మొనర్చెన్ = కనుపట్టెను, రాముఁ డగస్త్యాశ్రమమునకుఁ బోయెననుట.

భారత. భద్రగతిన్ = శుభలీలచేత, అరుక్ = నిరామయమైన, అలోప = అక్షయమైన, అముద్ర = నిరవధికమైన, ఆనందముగల, స్వ = తనయొక్క, రూపము, నిదర్శిత, రుచిరతచేత మెఱయఁగా, ఉమాధవుండు, నేత్రపర్వ మొనర్చెన్ = ప్రత్యక్షమాయె ననుట.

వ.

అప్పుడు.

54


సీ.

దివిమోచి యున్నయద్రిని ధర్మకార్యార్థ
            మానతంబుగఁ జేసి నట్టిఘనుని
మించిలోకము నావరించినవిషరాశి
            నాపోశనము గొన్న యద్భుతాత్ము
జీవనదోషవిద్రావణజ్యోతిర్మ
            యస్వమూర్త్యాలోకుఁ డగుమహాత్ము
నఖిలవేదాంతవేద్యాత్ముఁ డై భువనవం
            ద్యతఁ బెంపు మీఱుమహానుభావు


తే.

నమర నిమ్నగానిత్యసేకముల నెలయు
జడలలేఁగెంపు విమలతఁ గడు మెఱయఁగ
మెకముతోలు విభూతి సమిద్ధతనువు
నొండొకటి కంద మైయొప్ప నొప్పువాని.

55

భారత. దివి = స్వర్గమును, మోచియున్న, అద్రిన్ = మేరువును, ధర్మ = వింటియొక్క, "ధర్మ పుణ్యే యమే న్యాయే స్వభావాచారయోఃక్రతౌ, ఉపమాయామహిం సాయాం చాపే చోపనిషద్యపి" అని వి. కార్యార్థము, ఘనునిన్ = బలవంతుని, విషరాశిన్ = కాలకూటమును, ఆద్భుతాత్మున్ = విచిత్రధైర్యము గలవాని, “ఆత్మాయత్నో ధృతిర్బుద్ధిస్స్వభావో బ్రహ్మవర్ష్మచ” అని అ. జీవనదోష = సంసారదోషమును, విద్రావణ = పోమొత్తెడి, జ్యోతిర్మయమైన స్వమూర్తియొక్క, ఆలోక = సందర్శనము గలవాఁడగు, మహాత్మున్ = పవిత్రరూపుని, వేదాంతవేద్యాత్ముఁడు, మహానుభావున్ = ప్రభావము గలవాని, నెలయున్ = చంద్రుఁడును, కడమ సులభము.

రామ. దివిమోచియున్న = మిన్నుముట్టిన, అద్రి = వింధ్యమును, ధర్మకార్యార్థము = సంధ్యావందనాదిధర్మములు నడిచెడికొఱకు, అనతంబుగన్ = అణఁగునట్టుగా, విషరాశి = సముద్రమును, జీవనదోష = నీళ్లకళంకును, “జీవనం భువనం వన” మ్మని అ. విద్రావణ = మాన్పెడి, జ్యోతిర్మయ = నక్షత్రరూపమైన, స్వమూర్తియొక్క, ఆలోక = ప్రకాశము గలవాఁడగు, "ఆలోకౌ దర్శనోద్ద్యోతౌ" అని అ. " ప్రససాదోదయా దంభఃకుంభయో నేర్మహౌజసః” అని రఘు. వేదాంతములను, వేది = తెలిసిన, ఆత్మ = బుద్ధిగలవాఁడై, అమరునట్లుగా, ఎలయుఁ = పుట్టుచున్న, కడమ సరి.

తే.

చూచి యాదిత్యకులరాజసుతుఁడు హర్ష
వినయభక్తులసాష్టాంగవినుతి సేసె
నపుడు గాకున్న యట్టితదస్త్రసిద్ధి
దమప్రయోజన మని సుర ల్డనరి రాత్మ.

56

రామ. ఆదిత్యకుల = సూర్యవంశమందుఁ బుట్టిన.

భారత. ఆదిత్యకులరాజ = దేవేంద్రునియొక్క, దమప్రయోజనమని = నివాతకవచకాలకేయాదిసంహారహేతు వని.

వ.

అట్టిసమయంబున.

57


క.

స్వతపఃఫలసాక్షాత్కా
రతఁ గృతసాన్నిధ్యుఁ డైనరాజవతంసున్
హతకలుషుఁడు దపసి ముద
న్విత మగుచిత్తమున ని ట్లని ప్రశంసించెన్.

58

భారత. రాజవతంసుని, తపసి = అర్జునుఁడు, చిత్తముతోడ.

రామ. చిత్తమునన్ = చిత్తమందు.

క.

విశ్వేశ్వరవిశ్వాత్మక, విశ్వాధిష్ఠాన యఖిల వేదాంతవచ
శ్శశ్వదభివర్ణ్యమానమ, హైశ్వర్య నిరీహనిత్యయభవశుభమయా.

59

రెంటికి సమము సులభము.

మ.

నిశితప్రజ్ఞతఁ జూడ నేవికృతియున్లే దండ్రు నీయందు నీ
దశరూపాశ్రయణం బొనర్చుట మదిం దర్కింప లోకంబులం
దశుభప్రక్షయమున్ శుభోదయము నుద్యద్భక్తవాత్సల్యతా
తిశయాయత్తతఁ జేయ నింతియ గుణాతీతా ప్రసన్నాత్మకా.

60

రామ. నీ, దశరూప = దశావతారములయొక్క, ఆశ్రయణంబును, ఒనర్చుట = వహించుట.

భారత. ఈదశన్ = ఈప్రకారమున.

క.

అది సకలసదాచారం
బది సర్వజ్ఞాన మది సమస్తజనిఫలం
బొదవినకొలఁది నొకప్పుడు
హృదయము నీయందుఁ జేర్తురేని మహేశా.

61

రెంటికి సరి. సులభము.

క.

అతివాఙ్మనసాస్పద యీ, నుతికొగ్గినసాహసమ్మును సహింపు దయన్
మతి నాకు నేన లజ్జిం,చితి నోయచ్యుత యనంత శివగుణరాశీ.

62

భారత. అతివాఙ్మనసాస్పద = వాఙ్మనస్సులకు గోచరము గానిస్థితి గలవాఁడా, వాఙ్మనసపదము - అచతురాదిసూత్రమున నిపాతము. అచ్యుత = స్థిరా, శివ.

రామ. శివగుణరాశీ.

క.

అనుచుఁ బునః పునరభివం, దనములు నెమ్మనమునం దుదంచితసమ్మో
దనితాంతభక్తిసంతత, వినయంబులు సందడింప వేమఱుఁ జేసెన్.

63

భారత. నెమ్మనమునందు వేమఱుఁ జేసెనని యన్వయము, కడమ రెంటికి సమము.

వ.

తదనంతరంబ.

64


క.

విమలుఁడు రాజన్యోత్తముఁ,డమితతపశ్శక్తిమహిమహర్షీశకృపా
సమవాప్తినిష్టదివ్యా, స్త్రమతల్లీసిద్ధి గని ముదం బందెఁ గడున్.

65

రామ. తపశ్శక్తికి, మహి = స్థానమైన, మహర్షీశ = అగస్త్యునియొక్క, దివ్యాస్త్రమతల్లీ = వైష్ణవచాపబ్రహ్మాస్త్రములయొక్క, సిద్ధి = ప్రాప్తిని.

భారత. తపశ్శక్తిమహిమచేత, హర్షి = హర్షముగల, ఈశ = ఈశ్వరునియొక్క, అస్త్రమతల్లీ = పాశుపతముయొక్క, కడమ సులభము.

శా.

అక్షుద్రప్రథమానదివ్యశరసంప్రాప్తిం బ్రకాశించునా
కుక్షిద్వంశవతంసుఁ గన్గొని మహాగోదావరీతీరస
ద్రక్షోపాయపథంబు నేఁడు దొరకె న్రండంచు సంరక్షణా
పేక్షం దద్వనభూమిదేవతలు సంప్రీతిం గడు న్మూఁక లై.

66

భారత. కుక్షిద్వంశ = భూపవంశమునకు, "గోత్రా కుః పృథివీ పృథ్వీ" అని అ. వతంసున్ = అర్జునుని, మహాగః = అధికాపరాధములచేత, “ఆగోపరాధో మంతుశ్చ" అని అ. దావరీతి = దవాగ్నిభంగిని, “దవదావౌ వనారణ్యవహ్నౌ" అని అ. రీతిశబ్ద మీకారాంత మైనందుకు, క్తిచ్ త్కౌచసంజ్ఞాయమ్మనిక్తిన్ - రాక క్తిచ్-వచ్చినది గనుక, “సర్వతో౽క్తిన్నర్థాదిత్యేకే” అని జీష్ వచ్చి యీకారాంతమైనది. రసత్ = మ్రోయుచున్న, రక్షః = రాక్షసులయొక్క, అపాయపథంబు = వధోపాయపథము, తద్వనభూమి యందు, దేవతలు= ఇంద్రాదులు, పొడచూపి. రామ. కుక్షిద్వంశవతంసున్ = రాముని, మహాగోదావరీతీరమందున్న, సత్ = సజ్జనులయొక్క, రక్షా = సంరక్షణముయొక్క, ఉపాయమార్గము, తద్వనమందున్న, భూమిదేవతలు = బ్రాహ్మణులు, పొడచూపి యుపచార మొనర్చి రని ముందరి కన్వయము.

వ.

యథోచితప్రకారంబునం బొడసూపి యతని ప్రణామాదివినయ
కృత్యంబులు గైకొని.

67


క.

అరుదుగ నుపచార మొన
ర్చిరి దీవన లెలమి నిచ్చిరి తమతమమహా
శరసాదరార్పణంబులఁ
గర మమరుచు నుండ వేడుకను సప్రభులై.

68

రామ. తమతమ, మహాశ = అధికకాంక్ష, రస = అనురాగముయొక్కయు, ఆదరముయొక్కయు, అర్పణంబులన్ = ప్రకటనములచేత ననుట, అమరుచు నుండఁగా, సప్రభులై = ప్రభాసహితులై దీవన లిచ్చిరి.

భారత. తమతమ, మహాశర = దివ్యాస్త్రములయొక్క , సాదరార్పణంబులవల్ల, సప్రభులై = ఇంద్రసహితులై దీవన లిచ్చిరి.

తే.

అంత నాత్మపురస్థితిఁ గొంతకాల
ముండి తమకార్యములకొద లుడిపి చనుట
గోరి వారలు దనుఁ దోడుకొంచుఁ జనఁగఁ
జనియె వేడ్కఁ దదావాసజగతి కతఁడు.

69

భారత. ఆత్మపురస్థితిన్ = స్వర్గస్థితిచే.

రామ. ఆత్మపురః = తనుముందరనగు, స్థితిని, వారలు = ఆఋషీశ్వరులు, కడమ సులభము.
క.

అందు సమందశుభోదయ
మొందఁగనిబిడౌజుఁ డలరుచుండె సుమిత్రా
నందనజనకసుతానిశ
సందర్శితనవనవోల్లసద్భజనరతిన్.

70

రామ. అందున్ = ఆవనమందు, నిబిడ = సాంద్రమైన, ఓజుఁడు = తేజస్సు గల రాముఁడు, కడమ సులభము.

భారత. అందున్ = ఆస్వర్గమందు, కని, బిడౌజుఁడు = ఇంద్రుఁడు, "బిడౌజాః పాకశాసనః " అని అ. సుమిత్ర = సన్మిత్రులకు, ఆనందనజనక = ఆనందకరుఁడైన, సుత = కుమారుఁడైన యర్జునునిచేత, అనిశ = ఎల్లప్పుడు, సందర్శితమైన భజనరతిచేత నలరుచుండెను.

సీ.

ఆసక్తిఁ దనరిన వాసవసేవామి
            షానుభవనిరంతరానువృత్తి
నడఁగక పేర్చుపేరాసఁ గుందెడియుర్వ
            శీతలోదరిపరిస్ఫీతతరస
కామసంభ్రమత నొక్కతె యహిమాంశువం
            శాకల్ప మైనయారాకుమారుఁ
డున్నచోటికిఁ దమి నొక్కనాఁ డేతెంచి
            కెళవున నుండి యాకృతివిలాస


తే.

మరసి చూచి విశృంఖలస్మరశరార్తిఁ
బూనె నాసురవనిత దాఁ గాన యోగ్య
మైన కాంతాకృతి వహించి కానుపించె
సిగ్గుఁ జిఱునవ్వుఁ జూడ్కులఁ జెన్ను మీఱ.

71

రామ. ఆసక్తిఁ దనరి, నవమైన, ఆసవసేవా = మద్యపానముయొక్కయు, ఆమిషానుభవ = మాంసభక్షణముయొక్కయు, “పలలం క్రవ్యమామిష” మ్మని అ. నిరంతరానువృత్తిచేత, పేరాసన్ = అధికాశచేత, ఉరు-అశీతలోదరి = గొప్పయునై చల్లగాని కడుపు గలది, తనియనిది యనుట, ఒక్కతె = ఒకరాక్షసి, పరిస్ఫీత = సమగ్రమైన, తరస = మాంసమందుఁగల, కామ = కోరికయొక్క, సంభ్రమతన్ = త్వరచేత, అహిమాంశు = సూర్యునియొక్క, వంశమునకు, ఆకల్పమైన = అలంకారమైన, రాజకుమారుఁడు = రాముఁడు, ఉన్నచోటికి, కెళవునన్ = సమీపమున, ఆర్తిని బూనెను, అసురవనిత తాఁ గాన్ = తాను రాక్షసస్త్రీ గాఁబట్టి, కానుపించెను.

భారత. ఆసక్తిఁ దనరిన వాసవసేవ యనెడి, మిష = వ్యాజముచేతనైన, అనుభవ = సందర్శనముయొక్క, ఊర్వశీ తలోదరి = ఊర్వశి యనెడువనిత, పరిస్ఫీతకర = ఘనమునై, సకామ = మన్మథసహితమైన, సంభ్రమతన = సంభ్రమము గలది యౌటచేతఁ, ఒక్కతెయ = ఒకతెయే, హిమాంశువంశ = చంద్రవంశమునకు, ఆకల్పమైన = భూషణమైన, “ఆకల్పవేషౌ నైపథ్య” మ్మని అ. రాకుమారుఁ డున్నచోటికిన్ = అర్జునునివద్దికి, తమిన్ = రాత్రియందు, “రజనీయామిసితమీ” అని అ. ఏతెంచి ఆసురవనిత = ఆయప్సరస, కానయోగ్యమైన = వర్ణనీయమైన, కాంత = ఒప్పుచున్న, ఆకృతి వహించి, కనుపించెన్ = వచ్చెననుట.

వ.

ఇట్లు గానుపించి పరస్పరసందర్శనసమయసముచితసంభాషణంబులు
నడపి తనమదిం బొదలెడు మదనవికారంబు తెఱం గెఱింగించిన
నతండు.

72

రెంటికిని సరి.

తే.

తనకుదారయోగితకల్మితగఁ దెలుపుచు
మదనుజవశకలితనిజమతిని బ్రబలు
మనసుచేత నాచతురగామిని నెఱయఁగ
నానలేకతన్గదియ రా మానుపుచును.

73

భారత. ఉదారమైన, యోగిత = యోగిత్వముయొక్క, కల్మిని దెలుపుచును, మదను = మన్మథునియొక్క, జవ = వేగముచేత, శకలిత = భేదింపఁబడిన, నిజమతిగలదాని, ఆచతురగామినిన్ = ఊర్వశిని, ప్రబలుమనసుచేత, ఆనలేక = తాళలేక, తన్గదియరాఁగా మానుపుచును, ఆచతురగామినిన్, పల్కెనని ముందరిపద్యమునఁ గ్రియ.

రామ. తనకు, దారయోగితకల్మి = భార్యాసంగతి కలుగుటను, తెలుపుచును, మత్ = నాయొక్క, అనుజ = తమ్ముఁడైన, లక్ష్మణునికి, వశకలిత = ఆధీనముగాఁ జేయఁబడిన, నిజమతిచేత, లక్ష్మణునిఁ గోరి యనుట, ప్రబలు మనఁగా, సుచేతనా = మంచిబుద్ధిచేత, “ప్రతిపద్ జ్ఞప్తిచేతనా” అని అ. చతుర, కామిన్ = కాకుండుటచేత, చతురగామి ననుదిక్కున సంధికి లక్షణము. "క. ప్రథమాంతవిభక్తులపైఁ, గథితములగుకచటతపలు గసడదవ లగు" నని యనంతునిఛందము. నాన లేక కదియరాఁగా, లక్ష్మణుఁడు పల్కెనని ముందరిపద్యములోఁ గర్తయుఁ గ్రియయు.

సీ.

జ్యేష్ఠసౌభ్రాత్రసుస్థితిలక్ష్మణుఁడు పల్కె
            నరయక యిటు వచ్చి తబల నన్ను

బ్రహ్మచర్యస్థితి భజియింపఁ బరమతా
            పసనాథసత్యాజ్ఞ పసఁ బనిచిన
నాయగ్రజునియోగమీ యోజఁ జెఱుచుకో
            నర్హమె మగిడిపొమ్మనిన వలపు
పొలుపుగా రాము నూల్కొలుపుచుఁ గదిసి య
            తం డట్ల పలుకనెందాఁకగుట్టు


ఆ.

జరిపె దనుచుఁ దిరిగి తిరిగి పైకొనుకోర్కి
నతనినతని మదవదసమవిశిఖ
దళితహృదయ యగుచుఁ దెలచి యందు నొకింత
గలఁకలేమి చూచి నెలఁత గనలె.

74

రామ. జ్యేష్ఠునితోడి సౌభ్రాత్ర మందలి సుస్థితిగలవాఁడు లక్ష్మణుఁడు పల్కెను, బ్రహ్మచర్యస్థితి గలవాని నను భజియింప వచ్చితివి, తాపముతోడ, సనాథ = కూడిన,సతీ = భార్యయొక్క, ఆజ్ఞయొక్క పసచే, పనిచిన నాయగ్రజునియొక్క యోగము, రాముని నూల్కొలుపుచును, రాముఁడును, అట్ల మునుపటివలెనే, పలుకఁగా, ఎందాఁక గుట్టు, జరిపెదు = జరిపెదవు, అనుచు, తిరిగి తిరిగి = రామునివద్దికిని లక్ష్మణునివద్దికిని దిరిగి తిరిగి, మదవంతుఁడైన, ఆసమవిశిఖ =మన్మథునిచేత, దళితహృదయ యగుచు, అతనినతనిన్ = రాముని లక్ష్మణుని, తెలచి = తెల్చి.

భారత. లక్ష్మణుఁడు = లక్ష్మీవంతుఁడైన యర్జునుఁడు, “లక్ష్మీవాన్లక్ష్మణఃశ్రీలః" అని అ. పల్కెను, నన్నరయక యిటు, వచ్చితి = వచ్చితివి, పరమతాపసనాథ = వ్యాసులయొక్క, ఆజ్ఞపసచేత, బ్రహ్మచర్యస్థితిని భజియింపఁబనిచిన, నాయగ్రజు = ధర్మజునియొక్క, నియోగమునని యన్వయము. బ్రహ్మచర్యమునఁ దపము చేయుమన్న పనుపు ననుట, వలపుపొలుపు = రాగాతిశయమును, గారాము = నెనరును, నూల్కొలుపుచున్ = ప్రకటించుచును, కదిసి = ఊర్వశి చేరి, తిరిగితిరిగి =మఱిమఱి, పైకొనుకోర్కిన్ = పైకొనెడికోరికచేత, అతనిమ = తనుత్వము లేని, దవత్ = దావాగ్నివలె నాచరింపుచున్న, అసమవిశిఖ, అతనిన్ = అర్జునుని, తెలచి యని యన్వయము.

సీ.

ఏమని చెప్ప నిం పెసఁగెడునునుఁబల్కు
            లలర నేత్రైకపర్వాంగలక్ష్మి
నొప్పురాకాసితద్యుతిమానితానన
            యంబుజాత్యుచితరూపంబు లైన
దృక్పాణిపదగతుల్ దీపింపఁగ మహాస్త్ర
            గూఢగంధంబులు రూఢిఁ బర్వ

మేను సాంద్రతరసార్ద్రానులేపనముచే
            నవగుణాధిక్యవైభవము సూపఁ


తే.

బ్రేమమదనలీలలపయిఁ బెరిఁగి పెరిఁగి
మది గలంపంగ నిట్టట్టు గదిసి కదిసి
సప్రకర్షబీభత్సాత్మకప్రజనిత
వికృతయై తుదఁ గోపంబు వెలయఁ బలికె.

75

భారత. నేత్రైకపర్వ = నేత్రోత్సవమైన, అంగలక్ష్మిచేత నొప్పెడి, రాకాసితద్యుతి = పున్నమచంద్రునిభంగిని, మానిత = బహూకరింపఁబడిన, ఆనన = ముఖముగలది, అంబుజ = పద్మములకు, అత్యుచితరూపంబులైన = మిక్కిలిఁ దగినసౌందర్యము గలవైన, దృక్పాణిపద = నేత్రహస్తపదములయొక్క, గతులు = విలాసరీతులు, దీపింపఁగా, మహాస్రక్ = కల్పవృక్షపుష్పమాలికలచేత, ఊఢ = వహింపఁబడిన, గంధంబులు, పర్వన్ = ప్రకాశింపఁగా, మేను, సాంద్రతర = మిక్కిలిదట్టమునై, సార్ద్ర = సాత్త్వికస్వేదముగల, అనులేపనముచే, నవ = క్రొత్తైన, గుణాధిక్యవైభవము సూప, చెమటను దడిసిన మైపూఁతయందుఁ బరిమళమెచ్చు గనుక, మదనలీలలపయిన్ = మన్మథవిలాసములపై, ప్రేమ పెరిఁగి పెరిఁగి, సప్రకర్ష = ధైర్యసహితమైన, బీభత్సాత్మకున్ = అర్జునునిమనస్సునకు, అప్రజనిత = పుట్టింపఁబడని, వికృతయై = వికారము గలదై, వికారమును బుట్టింపలేనిదై యనుట, కోపంబు వెలయఁ బలికెను.

రామ. ఏమనిచెప్ప, ఒప్పురాకాసి = శూర్పణఖ, తద్ద్యుతి = ఆమానుషస్త్రీరూపకాంతిని, మాని, తాను, అనయంబు, జాత్యుచితరూపంబు లైన = రాక్షసజాతికిఁ దగిన యాకారముగలవైన, మహాస్ర = బలునెత్తురులచేత, “అస్రమశ్రుణి శోణితే” అని అ. గూఢ = ఆవృతమైన, సాంద్రమైన, తరస = మాంసముయొక్క, అనులేపనముచేత, అవగుణాధిక్యవైభవమును, ప్రేమము, అదనలీలలపయిన్ = భక్షణక్రియలపై, బీభత్సాత్మక = జుగుప్సారూపమౌనట్టుగా.

చ.

అలవి యెఱుంగలేక యిత రాంగనలం బలె నన్ను నిమ్మెయిం
గలఁచుట యుక్తమే యెదవుఁ గాక భవత్కృతదుష్టచేష్టితం
బులకు ఫలంబు నేఁ డొకటి పూర్ణముగా నుపభోగ్యమై కడున్
జలమున నెందు నీమగతనంబు కడంకలరూపుమాలుటల్.

76

రామ. భవత్కృతదుష్టచేష్టితంబులకు, నేఁడు, ఉపభోగ్యమై ఫలంబొదవుఁగాక, అట్టిఫల మేదనఁగా, మగతనంబు కడంకల = పరాక్రమములయొక్క, రూపుమాలుటలు, చంపెద ననుట.

భారత. ఫలంబును = ఫలమును, ఏఁడొకటి పూర్ణముగాన్ = ఏఁడాదినిండుపర్యంతము, మగతనంబుకడంకలరూపుమాలుటల్ = పేడితనము వచ్చుట యనుట, ఒదవుఁ గాక.
వ.

అని పలికి తదనంతరంబ.

77


సీ.

మదిచపలతఁ దన్ను నెదిరిఁ గానమిని సీ
           తాదేవరామ లాస్యాదితత్వ
విశ్రుతినాస యై వేల్పులు దనరాక
           పోకలు గాంచి యుబ్బునఁ జెలంగ
నుండనేరక మర్త్యయోగేచ్ఛఁ జని యిట్లు
           వచ్చెనే యని కన్నవారు నవ్వ
సిగ్గు లే కేమని యగ్గలికను జన
           స్థానంబు చేరి తత్సంశ్రయఖర


తే.

దూషణాదులచేత నా దుర్లలితము
లంతకంతకు దీపింప నాత్మవార్త
జరిపెదను జాతివికృతిచేష్టలు దివిజుల
ప్రీతి నుడిగించె ననుచింతఁ బెట్టి మదిని.

78

భారత. కానమిని, ఇసీ = నిందావాక్యము, తా- దేవరామ = తాను దేవతాస్త్రీ, లాస్యాది = నృత్తగీతవాద్యములయొక్క, తత్త్వ = సిద్ధాంతజ్ఞానముయొక్క, విశ్రుతిన్ = ప్రసిద్ధిచేత, ఆసయై = ఆసపుట్టి యనుట, వచ్చెనేయని, కన్నవారు = చూచినవారు, నవ్వ సిగ్గులేక యేమని, జనస్థానంబు చేరి, సభకుఁ బోయి, తత్సంశ్రయ = ఆసభయాశ్రయముగాఁగల జనులయొక్క, ఖర = క్రూరములైన, దూషణాదులచేత, నా, దుర్లలితములు = చెడ్డవలపులు, దీపింప, ఆత్మవార్త = ఆత్మభరణమును, జరిపెదను, జాతివికృతిచేష్టలు = అప్సరోజాతికిఁ దగనిచేష్టలు, దివిజులప్రీతి నుడిగించెను, అనుచింతన్ = అనెడి విచారమును, మదిని బెట్టి, నివాసమున కరిగెనని ముందరిపద్యమునఁ గ్రియ.

రామ. కానమిని, సీతాదేవర = సీతకు మఱఁదియైన లక్షణునియొక్క, "స్యాలాస్స్యుః భ్రాతరఃపత్న్యాఃస్వామినో దేవృదేవరౌ” అని అ. ఆమల = స్వచ్ఛమైన, అసి = ఖడ్గముచేత నైన, "చంద్రహాసాసిరిష్టయః” అని అ. ఆదితత్వ = మిక్కిలిఖండితత్వముచేత, అంటఁబట్టి కోయఁబడినదౌటచేత ననుట, విశ్రుతినాసయై = చెవులు ముక్కు లేనిదై, సిగ్గులేక, ఏను, మని = బ్రతికి, జనస్థానంబు చేరి = ఖరునిపట్టణమునకుఁ బోయి, తత్సంశ్రయ= అందున్న, ఖరదూషణాదులయొక్క, చేతనాదుర్లలితములు = బుద్ధిదుశ్చేష్టలు, "ప్రతిపద్ జ్ఞప్తిచేతనా” అని అ. దీపింప, ఆత్మవార్త = తనవృత్తాంతమును, “వార్తా ప్రవృత్తిర్వృత్తాంతః” అని అ. జరిపెదన్ = నడిపించెదను. చెప్పెదననుట, అనుచిం తన్ = అనుగతవిచారమును, అను = ఉపసర్గము, మదిన్ = దేవతలమనస్సున, పెట్టి = పెట్టినదై, దివిజులప్రీతి నుడిగించెను.

క.

అనివార్యము ఖరవాహిని
దనవార్త పురఃప్రయాణత వెడలఁగ రా
మనివాసమున కరిగె మ
న్యునిరూఢతఁ గదలి యుద్ధృతోత్సాహగతిన్.

79

రామ. అనివార్యము = అణఁపరానిది, ఖరవాహిని = ఖరునిసేన, “వాహినీ పృతనా చమూః” అని అ. తనవార్త = తా వచ్చెడువార్త, పురఃప్రయాణతన్ వెడలఁగన్ = ముందుగానే వినఁబడఁగా, మన్యు = రోషముయొక్క, నిరూఢతన్ = పూర్తిచేత, "మన్యుర్దైన్యే క్రతౌ క్రుధి" అని అ. యుత్ = యుద్ధమందు, "సమిత్యాజిస్సమిద్యుద్ధ" మని అ. ధకారాంతము, ధృతమైనయుత్సాహగమనము చేత రామునివాసమునకు నరిగెను.

భారత. అనివార్య = వారింపశక్యము కానిదై, ముఖర = మ్రోసిపాఱునట్టుగా, వాహిని = ప్రవహింపుచున్న, ఎంత గుప్తము చేసినను వినఁబడునది యనుట, తనవార్త, మన్యు = శోకముయొక్క, ఉద్ధృత = పెకలింపఁబడిన, రామ = ఊర్వశి, కడమ సులభము.

సీ.

అది యంతయును వినియపుడు వేఱొకచంద
           మైచింతనున్న యత్యాత్మఖేద
జనకుననుంగుపట్టిని దగఁ బిల్చి నీ
           యీశాపదానంబు నే నెఱుఁగుదు
మదిచింత వలదు నీ కిది యనిష్టసమాగ
           మము గాదు నాదగుమాటఁ జేసి
ఘనమోదమున నుండుమనుచు జిష్ణుఁడు సుమి
           త్రానందనుఁడు దేర్చె బూనియంత


ఆ.

సారతరబలారి శాసనోద్దీప్తసం
రంభవిభవుఁ డగుచు రామవిభుఁడు
భుజవశీకృతాజివిజయుండు వేల్పుల
జయజయస్వనాతిశయము నిగుడ.

80

భారత.అత్యాత్మఖేదజనకున్ = ఆత్మఖేదమును పుట్టింపుచున్నవాని, అనుంగుపట్టిన్ = అర్జునుని, పిల్చి, ఇంద్రుఁ డనెడుమాట, ఈశాపదానంబు = శాప మిచ్చుటను, యిది = శాపము, అనిష్ట = ప్రియము గాని, సమా = సంవత్సరమందు, ఆగమము = రాక గలది, కాదు, వుండుమనుచు, సుమిత్రానందనుఁడు = సుమిత్రుల కానందకారి, జిష్ణుఁడు = యింద్రుఁడు, తేర్చెన్ = వూరడించెను, అంతట, సారతరమైన, బలారి = యింద్రునియొక్క, శాసనముచేత, రామవిభుఁడు = మంచికాంతి గలవాఁడు. రామునివంటి కాంతి గలవాఁడనియు జెప్పవచ్చును. భుజవశీకృతమయిన, ఆజి = యుద్ధము గలవాఁడు,విజయుండు, చెండు బెండాడెనని ముందరఁ గ్రియ.

రామ. అత్యాత్మఖేదన్ = చాలావిచారము గల, జనకుననుంగుపట్టి = సీతను, లక్ష్మణుఁ డనెడుమాట, నీ = నీయొక్క, ఈశ = రామునియొక్క, ఆపదానంబు = పౌరుషమును, "ఆపదానం కర్మవృత్త" మ్మని అ. అనిషముయొక్క సమాగమము రాక, కాదు, అనుచు, జిష్ణుఁడు = జయశీలుఁడు - సుమిత్రయొక్క నందనుఁడు, తేచెన్ = తెలియఁజెప్పెను, అంత, సారతరబలముగల, అరి = శత్రువులయొక్క, శాసనశిక్షయందు, అది = విజయము గలవాఁడు, రామవిభుఁడు = రఘునాథుఁడు, కడమ సరి. 3

తే.

సర్వదివ్యాస్త్రదుర్వారసారయుత ని
వాతకవచాదిరక్షోర్జితాతులరణ
విహరణోద్సాహదైవతవిమతసేన
పై నడరి చెండు బెండాడెఁ బ్రభుయుతముగ.

81

రామ. సర్వదివ్యాస్త్రదుర్వారమయిన, సార = బలముతోడ, "సారో బలే స్థిరాంశేచ" అని-అ. యుతములయిన, నివాత = గాలి దూఱని, "నిర్ణిశ్చయనిషేధయోః" అని అ. కవచాదులదేతిరక్షచేత నూర్జితమైన యతులరణవిహరణోత్సాహముగల దైవతవిమతసేనపైన్ = రాక్షససేనపై అడరి = లంఘించి ప్రభుయుతముగన్ = ఖరాదియుతముగా చెండు బెండాడెను.

భారత. సారయుతులైన, నివాతకవచాదిరాక్షసులచేత, ఆర్జిత =సంపాదింపబడిన, కడమ సులభము.

క.

తమిఁదద్ద్వంసనిమిత్త, ప్రమదదశాస్యుఁడగు నాసురప్రభుకడ కే
గి మనోదోచితసం, భ్రమతం బ్రణమిల్లె నతనిపాదంబులకున్.

82

భారత. తద్ధ్వంస = ఆరాక్షససంహారము, నిమిత్త = కారణముగా గల, ప్రమదదశ = సంతోషావస్థ గల, ఆస్య = ముఖము గలవాఁడగు. ఆ, సురప్రభు = యింద్రునియొక్క, కడకున్ = వద్దికి, యేగి, మనోదోచిత = మనస్సంతోషమునకు దగిన, సంభ్రమతం = సంభ్రమము గలవాఁ డౌటచేత, ప్రణమిల్లెను.

రామ. తద్ధ్వంసనిమిత్తప్రమద = ఖరాదులవధకారణమయిన స్త్రీ - శూర్పనఖ, దశాస్యుఁడగు = పదితలలుగల, అసురప్రభు = రాక్షసేంద్రుఁ డయిన రావణునియొక్క మనస్సునందు గల, ఆమోద, దుఃఖమునకు, కడమ సులభము.

ఆ.

అతఁడు తన యవరజయాకర్ణనాసాస్ర
ములు నిజాక్షులనఘవిలసనమ్ము
గడు నిగుడ్చ నడిగి యడిగి తత్కథితస
భార్యరామవృత్తకార్యుఁ డగుచు.

83

రామ. అతఁడు= రావణుఁడు, తన, అవరజ = చెల్లెలైన శూర్పణఖయొక్క, ఆకర్ణనాసాస్రములు = చెవుల ముక్కున నంతట నుండెడు నెత్తురులు, “అస్రమశ్రుణిశోణితే” అని వి. నిజాక్షుల = తననేత్రములయందు, అఘవిలసనమ్ము = దుఃఖోద్రేకమును, "దుఃఖాంహో వ్యసనేష్వఘ" మని అ. నిగుడ్చ, అడిగి యడిగి, తత్ = ఆశూర్పణఖచేత, కథిత = తెలుపఁబడిన, సభార్య = సీతాసమేతుఁడైన, రామునియొక్క, వృత్త = అతీతమైన, కార్యము గలవాఁ డగుచు, తదాశ్రమంబునకు వచ్చె నప్పు డని నాలుగుపద్యములతర్వాతఁ గ్రియ.

భారత. అతఁడు, ఇంద్రుఁడు-తనయ = అర్జునునియొక్క, వర = శ్రేష్ఠమైన, జయముయొక్క ఆకర్ణనా = వినుటచేత, సాస్రములు = ఆనందబాష్పములతోఁ గూడిన, నిజాక్షులు, అనఘవిలసనమ్ము, తత్కథిత = ఆయర్జునునిచేతఁ జెప్పఁబడిన, సభార్య = సభయందలి పెద్దలకు, రామ = హృద్యమైన, వృత్త, కార్య = రక్షోయుద్ధము గలవాఁడౌచును, ఒసఁగెనని ముందరఁ గ్రియ.

క.

తనకారుణ్యము మిక్కిలిఁ, గనుదామరగమిఁ దలిర్పఁగా గ్రక్కున లే
చి నిజాసనార్ధభాగం, బునఁ దనయున్నతగభీరమూర్తి నునుచుచున్.

84

భారత. తన, కారుణ్యము = దయ, నతగభీరమూర్తిన్ = వినయావనతమైన గంభీరమూర్తి గలవాని, తనయున్ = అర్జునుని, కడమ సులభము.

రామ. తనకు, కారుణ్యము = రక్తిమ, కనుదామరగమియందుఁ దలిర్పఁగా కోపమునఁ గండ్లెఱ్ఱ చేసికొని యనుట, ఆసనార్థభాగంబునన్ = పీఠార్ధమందు, తనయొక్క యున్నతమునైన, మూర్తిన్ = శరీరమును, ఉనుచుచును, అప్పుడే యుద్ధయాత్రకు లేవ నుద్యోగించి యనుట.

తే.

దివ్యకోటీరమాహరతీవ్రశక్తి
యుద్ధసహునకు నాకీశుఁ డొసఁగె నీన
రుండు మద్బంధువై రమారూఢి నిర్వ
హించె నెఱవేరెఁ జెప్పెడి దేమి యనుచు.

85

రామ. రావణుఁ డనుకొనుమాట, దివ్యకోటీ = దేవతాకోటియొక్క, రమా = సంపదను, హర = హరించెడి, తీవ్రశక్తిన్ = అధికశౌర్యమును, యుద్ధసహునకున్ = యుద్ధ క్షముఁడైన, నాకున్ = తనకు, ఈశుఁడు = ఈశ్వరుఁడు, ఒసఁగెను, ఈనరుండు = రాముఁడు, మద్బంధువైరము = నాజ్ఞాతులతోడి ద్వేషమును నిర్వహించెను, మనుష్యుఁడు రాక్షసద్వేషము చేసికొనెను గదా చెప్పెడి దేమి యనుచు.

భారత. దివ్యమైన, కోటీరము = కిరీటమును, ఆ-హరతీవ్రశక్తియుద్ధసహునకున్ = ఆహరునియొక్క తీవ్రశక్తిగల యుద్దము నోర్చినవానికి - నర్జునునికి, నాకీశుఁడు = దేవేంద్రుఁడు, ఒసఁగెను, ఈనరుండు, మత్ = నాకు, బంధువై = ఆప్తుఁడై, రమారూఢి నిర్వహించెను = తనయైశ్వర్యమును నిలిపెను, అనుచుఁ గోటీర మొసఁగునని క్రిందటి కన్వయము.

సీ.

అప్పుడు దనమదియందుఁ దద్విజయవా
           ర్తాశ్రవణంబుచే నశ్రమోత్థ
మగుమన్యుకలననిలాత్మజయమలస
           ద్రూపప్రవృత్తిమాధుర్య మడఁపఁ
ద్వరితభవ్యస్వాంతవర్తనోచితతీర్థ
           యాత్ర సల్పి తపోమహత్త్వసాధు
సహచరీకృతసింహశరభశార్దూలకు
           మారీచరాక్షసుమత్తతరుణ


తే.

హరిణమై రామపర్ణశాలాంచితవన
భూముల బెడంగుదృక్పర్వముగ మెలఁగుచుఁ
బ్రబలుమార్తాండసంతతిప్రభువు మోస
పుచ్చుటకు సంచితామోద మచ్చుపడఁగ.

86

భారత. అప్పుడు = అర్జునుఁ డింద్రునియొద్ద నుండెడుసమయమందు, తద్విజయవార్తా = ఆయర్జునుని వృత్తాంతముయొక్క, అశ్రవణంబుచేన్ = వినకుండుటచేత, అశ్రమ = తగ్గుపడక, ఉత్థమగు = పుట్టిన, మన్యుకలన్ = శోకాతిశయమును, “మన్యుర్దైన్యే క్రతౌ క్రుధి” అని అ. "కలా శిల్పే గౌరవేచ” అని వి. అనిలాత్మజ = భీమునియొక్కయు, యమ = నకులసహదేవులయొక్కయును, లసత్ = ఒప్పుచున్న, రూప = సౌందర్యముయొక్కయు, ప్రవృత్తి = నడకలయొక్కయు, మాధుర్యము = మనోహరత్వము, అడఁప, అర్జునవియోగదుఃఖమును భీమాదిసందర్శనమున నణఁపఁగా ననుట, త్వరిత = తీవ్రపడుచున్న, భవ్య = శుభమైన, స్వాంతవర్తన = మనోవ్యాపారమునకు, ఉచిత = తగిన, తీర్థయాత్ర సల్పి, తపోమహత్త్వముచేత, సాధు = లెస్స యౌనట్టుగా, సహచరీకృత = సహాయముగాఁ జేయఁబడిన, సింహశరభ శార్దూలములయొక్క, కుమారీ = పెంటిపిల్లల యందు, చరాక్ష = తగులు చున్న కన్నులుగల - సాదరముగాఁ జూచునవి యనుట.“సక్థ్యక్ష్ణోః స్వాంగాత్ షచ్" అనెడుసూత్రమున బహువ్రీహియం దుకారాంతము. సుమత్త = లెస్సగా మదించిన, తరుణహరణమై = లేఁడిపిల్లలు గలదై, ఫలితార్థము తపోమాహాత్మ్యముచేత జాతివైరము విడిచి కూడియున్న సింహాదుల పెంటిపిల్లలమీఁద లేఁడిపిల్ల లెక్కు ననుట, ఒప్పునట్టి, పర్ణశాలలయొక్క సమీపమైన వనభూములయొక్క, బెడంగు = ఒప్పిదము, దృక్పర్వముగన్ = నేత్రపర్వ మౌచునుండఁగా, మెలఁగుచున్ = చరించుచును, ప్రబలెడి, మార్తాండసంతతిప్రభువునిన్ = ధర్మజుని, ప్రభుశబ్దము పుత్త్రవాచకము, మోసపుచ్చుటకు నంచితామోద మచ్చుపడఁగ, జటుఁడు వచ్చెనని ముందరిపద్యమున కన్వయము.

రామ. అప్పుడు, తత్ = ఆరామునియొక్క, విజయవార్తయొక్క, శ్రవణంబుచేన్ = వినుటవల్ల, మన్యుకలనన్ = కోపమహిమను, ఇలాత్మజ = సీతయొక్క, తెనుఁగు షష్ఠి. అమల = నిర్మలమైన, సద్రూప, ప్రవృత్తి = వార్తయొక్క మాధుర్యము, అడఁపన్ = అణఁచఁగా, అప్పుడు పుట్టినకోపమును సీతసౌందర్యమును విని యణఁచెననుట, త్వరిత = శీఘ్రముగా, భవ్య = కాఁగల, స్వ = తనయొక్క, అంతవర్తనా = నాశవర్తనకు, ఉచిత = తగిన, తీర్థ = రేవైన - ద్వార మైన దనుట, యాత్ర = ప్రయాణమును, చల్పి, తపోమహత్త్వముచేత సాధువైనవాని, సహచరీకృతములైన సింహశరభశార్దూలములు గలవాని, స్వార్థకప్రత్యయము. మారీచరాక్షసున్ = మారీచుఁడను రాక్షసుని, మత్తతరుణహరిణమై = హరిణరూపముచేత, రామునియొక్క పర్ణశాలాంచితవనభూములందు మెలంగుచున్న, ప్రబలున్ = బలవంతుడైనవాని, మారీచునికి విశేషణము. మార్తాండసంతతిప్రభువు = సూర్యవంశపురాజైన రాముని, మోసపుచ్చుటకు, అంచి = అంపి, తాన్ = తాను.

క.

ఘనదర్పోన్మూలితబహు
మునిజటుఁ డనుపరమకలుషమూర్తియసురకాం
తినికేతనమై యతిభా
వనియతిఁ బ్రకటించునట్టి వర్ణ్యాకృతితోన్.

87

రామ. ఘనదర్ప = అధికమైన త్రుళ్లుచేత, ఉన్మూలిత = పెకలించి పాఱ వేయఁబడిన, బహుమునిజటుఁడు = అనేకమునులయొక్క జడలు గలవాఁడు, అనుపరమ = అణఁగుట లేని, కలుష = పాపముగల, మూర్తి = శరీరముగలవాఁడు, అసుర = రాక్షసుఁడు, కాంతికి, నికేతనమై = నివాసమయి, యతిభావనియతిన్ = సన్న్యాసిత్వనియమమును, ప్రకటించునట్టి, వర్ణ్య = వర్ణింపఁదగిన, ఆకృతితో.

భారత. ఘనదర్పముచేత, ఉన్మూలిత = చెఱుపఁబడిన, బహుమునులు గలవాఁడు,

జటుఁడను = జటాసురుఁ డనెడి, పరమకలుషమూర్తి = పాపాత్ముఁడు, వర్ణీ = బ్రహ్మచారియొక్క, ఆకృతితో వచ్చెనని ముందరి క్రియ.

వ.

తదాశ్రమంబునకు వచ్చె నప్పుడు.

88


క.

కుతుకంబున మహితనయా, పతితదనుజవంచనప్రపంచనమృగధీ
చతురిమము లేక తానా, శ్రితబుద్ధిం జూచి యుల్లసిల్లెడుమదితోన్.

89

భారత. మహిత = శ్రేష్ఠమైన, నయ = ధర్మమార్గముచేత, ఆపతిత = ఆగతుఁడైన, దనుజ = జటాసురునియొక్క, వంచనప్రపంచన = కపటప్రతిపాదకముయొక్క, మృగ = తెలియుటయందుఁ గల, "మృగ అన్వేషణే" అను ధాతువుమీఁద, అచ్ప్రత్యయాంతము. ధీ = బుద్ధియొక్క, చతురిమము = సామర్థ్యము, లేక, జటాసురుఁడు బ్రహ్మచారియై రాఁగా రాక్షసుఁడని తెలియ కనుట, తాను, ఆశ్రితబుద్ధిన్ = ఆప్తుఁ డనెడు బుద్ధిచేత, చూచి, క్షితిజనపతి చేర ననుకూలించెనని ముందరిపద్యమునఁ గర్తయుఁ గ్రియయు.

రామ. మహితనయా = సీతయొక్క, పతి = ప్రియుఁడైన రామునియొక్కయు, తదనుజ = ఆయనతమ్ముఁడైన లక్ష్మణునియొక్కయు, వంచన = మోసపుచ్చుటను, ప్రపంచన = ప్రకటింపుచున్న, “పచ విస్తారే” అనుధాతువునఁ గర్తరిలుడంతము. మృగ = మృగరూపమైన మారీచునియొక్క, ధీచతురిమములను, ఏకతానాశ్రితబుద్ధిన్ = ఏకాగ్రచిత్త మౌనట్టుగా నాశ్రయింపఁబడినబుద్ధిచేత, చూచి, “ఏకతానోనన్యవృత్తిః" అని అ. సావధానుఁడై చూచి యనుట, క్షితిజను జేరనని ముందరి కన్వయము.

క.

క్షితిజనపతి సన్నిధియం
దతనిమహితవృత్తిఁ జేర ననుకూలించెన్
మతియతి విశ్వాససమ
న్వితగతి దృఢతరాఘవసతి నిశిచరుఁ డంతన్.

90

రామ. క్షితిజన్ = సీతను, అపతిసన్నిధియందున్ = పతిసన్నిధి లేనియెడ, అతనిమ = తనుత్వములేని, హితవృత్తిన్ = మంచివాఁడుంబలె ననుట, చేరన్ = దగ్గఱికి రాగా, రాఘవసతి = సీత, మతి = బుద్ధి, యతివిశ్వాస = సన్న్యాసియనెడు విశ్వాసముతోడ, సమన్వితగతిన్ = కూడినదౌచునుండఁగా, దృఢతన్ = ధైర్యముచేత - వెఱపులేక యనుట, అనుకూలించెనని క్రిందటి కన్వయము. ఉపచరించె ననుట, నిశిచరుఁడు = రావణుఁడు, అంతట, హరించెనని ముందరిపద్యమున కన్వయము.

భారత. క్షితిజనపతి = ధర్మరాజు, సన్నిధియందు, అతనిన్ = జటాసురుని, చేరను, అనుకూలించెన్ = సమ్మతించెను, మతి, అతివిశ్వాససమన్వితగతిన్ = అధికవిశ్వాస యుక్తము గాఁగా, అనుకూలించెనని యన్వయము. అంత, దృఢతర = ఘనమైన, అఘ = పాపములకు, వసతియైనవాఁడు, నిశిచరుఁడు = జటాసురుఁడు.

తరళ.

గుణవిదూరత సంధిలన్ శ్రుతి ఘోరనిష్ఠురదుష్టభా
షణము లాడుచుఁ దద్వసత్యుటజంబు జొచ్చి స్వరూపభీ
షణతనాయమనందనున్నతశౌర్యవిశ్రుతితో సగ
ర్హణతఁ బట్టి హరించెఁ దత్ప్రమ దాపహారము మున్నుగాన్.

91

భారత. గుణవిదూరత సంధిలన్ = భీమునియొక్క దూరముపోవుట కలుగఁగా, భీముఁడు దగ్గఱ లేకుండఁగా ననుట. "గుణః ప్రధానే శబ్దాదౌ మౌర్వ్యాం సూదే వృకోదరే” అని వి. తత్ = ఆధర్మజునికి, వసతి = నివాసమైన, ఉటజంబున్ = పర్ణశాలను, “సంస్త్యాయముటజం ధామ" అని అ. చొచ్చి, స్వరూప = తనరాక్షసరూపము చేతనైన, భీషణతన్ = భయంకరత్వముచేత, నత = అణఁగిన, శౌర్యముయొక్క, విశ్రుతితోన్ = ఖ్యాతితో వంచనతోడ ననుట, సగర్హణతన్ = నిందతోఁ గూడినవాఁడై యనుట. ఆయమనందనున్ = ధర్మజుని, తత్ప్రమదా = ఆద్రౌపదియొక్క, అపహారము మున్నుగా హరించెను, ధర్మరాజును ద్రౌపదీసహితముగాఁ బట్టుకపోయె ననుట.

రా. ఆయమన్ = సీతను, అందు = ఆపర్ణశాలయందు, అనున్నత = నీచమైన, శౌర్యప్రసిద్ధితోడ, తత్ప్రమద = సీతాసంతోషముయొక్క, అపహారము మున్నుగా హరించెను, దిగులుపడఁ జేసి హరించెననుట, కడమ సరి. క =

క.

నానాప్రకారదీనవ
చోనిచయము నడపుధర్మసూతిని సతి న
ద్దానవవరుఁ డట్లు నిజ
స్థానమునకుఁ గొనుచు గగనసరణిం జనఁగన్.

92

రామ. ధర్మసూతి = ధర్తమునకుఁ గారణమైనదాని, సతిన్ = సీతను.

భారత. ధర్మసూతిని, సతిన్ = ద్రౌపదిని, కడమ సులభము.

వ.

అది యంతయు విని కోపోద్దీపితుం డగుచు నడ్డంబు పఱతెంచి.

93

రెంటికి సరి.

చ.

తిరుగుము పోకుపోకు మని తిట్టుచు వాని నెదిర్చి విక్రమో
ద్ధురుఁ డగుచున్ మహాబలసుతుండపతత్త్రపదోర్జితప్రహా
రరభసభీషణం బగుదురం బొనరించె జటాయు వంత నా
నిరుపమబాహుసాహసవినిద్రునిచేత నడంగె నెంతయున్.

94

భారత. వానిన్ = ఆజటాసురుని, మహాబల = వాయువుయొక్క, సుతుండు = భీముఁడు, అపతత్ = జాఱనట్టి, త్రప = లజ్జగల- శౌర్యముగలననుట, దోః = బాహువులచేత, “భుజబాహూ ప్రవేష్టోదోః" అని అ. జిత = అభ్యస్తములైన, ప్రహార = గ్రుద్దులయొక్క, రభస = వేగముచేత, భీషణంబగు, దురంబు = యుద్ధమును, ఒనరించెను, అంత, ఆనిరుపమబాహుసాహసవినిద్రునిచేత, జటాయువు = జటునియొక్క యాయువు, అడంగెను, జటాసురుఁడు చచ్చెననుట.

రామ. వానిన్ = రావణుని, ఎదిర్చి, మహాబల = అధికబలముగల, సు = లెస్సైన, తుండ = ముఖముయొక్కయు, “వక్త్రాస్యే వదనం తుండ” మని అ. పతత్త్ర = ఱెక్కలయొక్కయుఁ “గరుత్పవచ్ఛదఃపత్త్రం పఠేత్త్రం చ తనూరుహ” మ్మని అ. పద = పాదములయొక్కయు, ఊర్జిత = దృఢములైన, ప్రహారములయొక్క, దురంబును జటాయు వొనరించెను, అంత, అడంగె = రావణుని చత నొచ్చెను.

వ.

అక్కాలంబునందు.

95


సీ.

తనప్రియమును వేడ్క పెనుపుశోభిలఁ గృష్ణ
           సారంబు సౌవర్ణ సారసమధి
కశ్రీలఁ గ్రాల నొక్కటి దైవగతిఁ జూచి
           తాదృగబ్జముల కుత్కంఠ వెంచి
నలిఁ దదానయనంబు నకుఁ బంప దానిజే
           యంగ నబ్బకదానవాంతకుండు
రామభద్రుండు గరంబు దూరంబుగా
           నరిగి యంతటను దామరలు దృష్టి


తే.

కొనరు గైకొని పౌలస్త్య ఘననియుక్త
తచ్చమూరుదర్పమడంచి త్రాసచకిత
దారవచనాగతభ్రాతృదర్శనమున
మానసములోన మోదంబు పూనె నంత.

96

రామ. తనప్రియ = సీత, మును = మునుపు, కృష్ణసారంబు = లేఁడి, సౌవర్ణ = సువర్ణవికారభంగిని, సార = శ్రేష్ఠములైన, సమధికములైన, శ్రీల = కాంతులచేత, క్రాలన్ = ఒప్పఁగా, చూచి, తాన్ = తాను, దృగబ్జములకు = నేత్రపద్మములకు, ఉత్కంఠ వెంచి = అపేక్షించి యనుట, తత్ = అమృగముయొక్క, ఆనయనంబునకున్ = తెచ్చుటకు, పంపఁగా, అబ్బక = కూడక, దానవాంతకుండు = రామభద్రుండు, తాన్ = తాను, మరలుదృష్టికి = తిరిగివచ్చెడు యత్నమునకు, ఒనరు గైకొని = ఇంపుఁ బూని, పౌలస్త్య = రావణునిచేత, ఘనమౌనట్టుగా - నిర్బంధించి యనుట, నియుక్త = నియోగింపఁబడిన, తచ్చమూరు = ఆమాయామృగముయొక్క, “చమూరుశ్చేతిహరిణః" అని అ. దర్పమడంచి = సంహరించి, త్రాస = భయముచేత, “మణిదోషే భయే త్రాసః” అని అ. చకిత = భయపడిన, దార = సీతయొక్క, వచనములవలన నాగతుఁడైన, భ్రాతృ = లక్ష్మణునియొక్క, దర్శనమున, మానసములో, అమోదంబు = ఖేదమును, పూనెను.

భారత. తన ప్రియమును వేడ్క పెంపును శోభిలఁగా, కృష్ణ = ద్రౌపది, సారంబు = శ్రేష్ఠమైన, సౌవర్ణసారస = బంగారుతామర, అధికశ్రీలచేత, తాదృక్ = అట్టి, అబ్జములకున్ = పద్మములకు, అబ్బకదానవాంతకుండు = బకాసురశత్రుడైన భీముఁడు, రామభద్రుండు = ఒప్పెడి భద్రము గలవాఁడు, తామరలు = పద్మములను, దృష్టి కొనరు = కంటి కింపైనవాని, తామరలకు విశేషణము కైకొని, పౌలస్త్య = కుబేరునిచేత, ఘనమౌనట్టుగా, నియుక్త = అంపఁబడిన, తత్ = ఆలాగున సన్నద్ధమై వచ్చిన, చమూసేనయొక్క, “పృతనానీకినీ చమూః” అని అ. ఉరు = అధికమైన, దర్పము నడంచి, త్రాసచకితులునై, దారవచన = ద్రౌపదివాక్యమువల్ల, ఆగత = వచ్చిన, భ్రాతృ = అన్నదమ్ములయొక్క, దర్శనమున, మోదంబు = హర్షమును, పూనెను, అంతన్ = ఆతర్వాత.

క.

ముగుద యెఱుంగక పంచినఁ
దగునే యి ట్లేగుదేరఁ దమ్ముఁడ యౌద్ధ
త్యగరిష్ఠయక్షరక్షో
విగాఢ మీయడవి యిది వివేకము తెఱఁగే.

97

రెంటికి సమము సులభము.

వ.

అని యతనిం బలుకుచు.

98


ఆ.

అంత నిజమహాశ్రుగాధిక్యసంప్రాప్తి
శంసిసవ్యసాచిసముపగమవి
యోజితవ్యధత్వ మొదవ వైవస్వత
సంతతినృపలోకసత్తముండు.

99

రామ. అంతట, నిజ = స్వకీయమైన, మహాశున్ = అధికశోకముయొక్క, “మన్యుశోకా తు శుక్ స్త్రియా" మ్మని అ. ఆధిక్య = అతిశయముయొక్క, సంప్రాప్తిని, శంసి = చెప్పుచున్నవై, సవ్య = ఎడమదిక్కునకు, సాచి= అడ్డముగా, సముపగమ = రాకగల, వి = పక్షులచేత, అపశకునములచేత ననుట, యోజిత = కూర్పఁబడిన, వ్యధత్వము = వ్యధగలవాఁడౌట, ఒదవఁగా, వైవస్వతసంతతి = సూర్యవంశమందుఁగల, నృపలోకసత్తముండు = రాజేంద్రుఁడైన రాముఁడు, తిరిగివచ్చి యని ముందరిపద్యమున కన్వయము.

భారత. అంతన్ = అటుతర్వాత, మహాశుగ = పాశుపతాద్యస్త్రములచేత నగు, అధికసంప్రాప్తి = మహత్త్వసిద్ధిని, శంసి = చెప్పుచున్న, సవ్యసాచి = అర్జునునియొక్క, సముపగమ = రాకచేత, వియోజిత = పోఁగొట్టఁబడిన, వ్యధత్వము = వ్యధగలవాఁడౌట, వైవస్వతసంతతి = ధర్మజుఁడు.
సీ.

తిరిగి వచ్చి యొకప్డు దీర్ఘకాలాదర్శ
           నావస్థఁ జెందనియతివశకలి
తార్తిఁ బావనిఁ గాన కడవుల వెదకుచు
           నంతఁ గానంబడి యాత్మహితత
నెరపుజటాయుర్వినేతపదంబుల
           జాడను జనిచని సకలకాన
నోగ్రజంతుత్రాసయోజనాయతదోఃప్ర
           భావభీమాంగకబంధమర్ద


తే.

నాతిదీప్తబలాధిక్యుఁ డగుచు నున్న
దారుణాహితాద్భుతదేహుఁ దత్ప్రదుష్ట
రూపభరణనిమిత్తర్షి శాపశంసిఁ
ద్రిదశపదవాసిఁ జూచి పార్థివవరుండు.

100

భారత. తిరిగివచ్చి, ఒకప్డు = ఒకనాఁడు, దీర్ఘకాల = తడవుగా, ఆదర్శనావస్థ జెందన్ = కానకుండుటఁ బట్టి, నియతివశ = అదృష్టవశముచేత, కలిత = పొందఁబడిన, ఆర్తిన్ = పీడగలవాని, జటాయుః = జటునియొక్క యాయువును, వినేత = పో మొత్తిన భీమునియొక్క, పదంబుల = అడుగులయొక్క, జాడను, జంతువులకు, త్రాస = భయముయొక్క, యోజన = పుట్టించుటయందు, ఆయత= అధికమైన, దోఃప్రభావభుజశక్తి గల, భీమునియొక్క, అంగక = శరీరముయొక్క, బంధ = కట్టుటయందును, మర్దన = పీడించుటయందును, అతిదీప్తమైన బలాధిక్యము గలవాఁడై, ఉన్న = ఉండిన, దారుణ = భయంకరమైన, అహితా = సర్పత్వముచేత, అద్భుతదేహుని, తత్ = ఆ, ప్రదుష్టమైన రూపభరణమునకు నిమిత్తమైన, ఋషిశాప = సప్తర్షిశాపమును, శంసిన్ = చెప్పుచున్నవాని - నహుషుని ననుట, పార్థివవవవరుండు = ధర్మరాజు, జరిపెనని ముందరి కన్వయము.

రామ. తిరిగివచ్చి యొకప్పుడును, దీర్ఘకాలమదర్శనావస్థఁ జెందని = తడవు చూడకుంటలేని, అతివన్ = సీతను, శకలిత= ఖండింపఁబడిన, ఆర్తిగలదానిన్ = సకలమైనయాపదలను మరలించుదాని ననుట, పావనిన్ = పవిత్రమైనదాని, కానక, అంత, కానన్ = అడవిలో, పడి, జటాయుర్వినేత = జటాయఁ వనెడి పక్షిరాజుయొక్క, పదంబులజాడన్ = వాక్యసరణిని, సకలకానన = సమస్తాటవులయందున్న, ఉగ్రజంతు = సింహాదిమృగములను, త్రాస = వెఱపించెడి, యోజనాయతదోః = దీర్ఘబాహులయొక్క ప్రభావముచేత భీమాంగుఁ డైన కబంధునియొక్క మర్దనచేత నతిదీప్తమైన బలాధిక్యము గలవాఁ డగుచు, నున్న = పోమొత్తఁబడిన, దారుణమైన యహితమైన యద్భుతదేహముగలవానిన్ = రాక్షసదేహము గలవాని ననుట, తత్ప్రదుష్టు = ఆలాగు మిక్కిలిఁ గష్టమైన, రూపభరణమునకు నిమిత్తమైన ఋషిశాపమును, శంసిన్ = చెప్పెడువాని, త్రిదశపదవాసిన్ = ఆకాశమందు నిలిచినవాని - గంధర్వరూపమును బొందిన యాకబంధుని ననుట. చూచి, పార్థివవరుండు = రాముఁడు.

తే.

అతనిఁ బూర్వనామాదిక మడిగి వినుచు
సరవితోడఁ దచ్ఛాపమోచననిమిత్త
ము లగుప్రశ్నోత్తరములు వొల్పలరఁ బ్రీతి
జరిపెఁ గృతకృత్యత నతండు సనియె దివికి.

101

రామ. అతనిన్ = కబంధుని, ప్రశ్నోత్తరములు = రాముఁ డడుగఁగాఁ గబంధుఁడు వినుపింపఁగా, అతండు = కబంధుఁడు, చనియెను.

భారత. అతనిన్ = ఆనహుషుని, తత్ = ఆనహుషునియొక్క, శాపమోచననిమిత్తములు = శాపపరిహారహేతువులు, అయిన ప్రశ్నోత్తరములు - నహుషుఁ, డడుగఁగా ధర్మరాజు చెప్పఁగా, అతండు = నహుషుఁడు.

క.

వనదేవత లర్చించిరి
పనుపడఁ దచ్ఛాపమోక్షపరిమోచితభీ
మునిజననుతు నానృపనం
దనునిశుభానిలతఁ జలలతాకుసుమములన్.

102

భారత. తత్ = ఆనహుషునియొక్క, శాపమోక్షముచేత, పరిమోచిత = విడిపింపఁబడిన, భీముఁడు గలవాని, ఆనృపనందనునిన్ = ధర్మరాజును, అర్చించిరి.

రామ. తత్ = ఆకబంధునియొక్క, శాపమోక్షముచేత, పరిమోచితభీ = విడిపింపఁబడిన భయముగల, మునిజనులచేత నుతుఁడైన, ఆనృపనందనునిన్ = రాముని, అర్చించిరి.

వ.

ఇవ్విధంబున.

103


తే.

అడవులఁ జరించునాభవ్యు నరయ వచ్చె
నంతటను శివతేజోమయస్వరూపుఁ
డై వెలయుహరి యాత్మేశుఁ డనుపమహిత
బుద్ధివర్తన మెంతయుఁ బొల్పుమీఱ.

104

రామ. శివతేజోమయస్వరూపుఁడై = రుద్రవీర్యజనితుఁడై, వెలయు, హరి = వానరుఁడు - హనుమంతుఁ డనుట. ఆత్మేశుఁడు = సుగ్రీవుఁడు, అనుపఁగా, ఆభవ్యున్ = రాముని, అరయన్ = తెలియ వచ్చెను.

భారత. శివ = శుభమైన, “శ్వశ్రేయసం శివం భద్ర” మని అ. తేజోమయ = జ్యోతిర్మయమైన, స్వరూపముగలవాఁడు, హరి = శ్రీకృష్ణుఁడు, ఆత్మ = జీవులకు, ఈశుఁడు = కర్త, అనుపమ = సరి లేని, కడమ సులభము.

క.

వచ్చి తగురీతి దర్శన
మిచ్చి తదీయ మగువృత్త మెల్ల వినియెఁ దాఁ
జెచ్చెరఁ గుశలప్రశ్నస
ముచ్చారణపూర్వకముగ నుచితప్రౌఢిన్.

105

భారత. సులభము.

రామ. తదీయమగు = ఆరామునిసంబంధమైన, వృత్తమెల్లన్ = దశరథుఁ డంపినది మొదలుకొని యావఱ కయినవృత్తాంతమంతయు, తాను వినియెను, కుశలప్రశ్న = నేర్పుగా క్షేమవార్త నడుగుటయొక్క, సముచ్చారణవాక్యపురస్సరముగా.

క.

విని తనదువృత్త మంతయు
వినిపించి పరస్పరార్హవిధి నిష్టాలా
పనిరూఢి జరుగ నపు డా
తనిమది మాటబడిఁ దెలిసి తనమదిలోనన్.

106

రెంటికి సరి.

చ.

అనిమిషరాట్తనూభవభుజాతిశయప్రతికారనిత్యచిం
తను రవినందనుం దనకు నచ్చిన బంటుగ నేలి తత్ప్రియం
బనయము సల్పుచుం బ్రబలు నాత్మరిపుం దుదిఁ దా జయింపఁ జా
ల ననుమతి సృజించుట యలంఘ్యత నీతనియందుఁ దోఁచెడున్.

107

రామ. హనుమంతుఁ డెంచినప్రకారము, అనిమిషరాట్తనూభవ = వాలియొక్క, భుజాతిశయ = బాహుబలిమియొక్క, ప్రతికార = ప్రతిక్రియయందుఁ గల, నిత్యచింతను = నిత్యవిచారము గలవాని, రవినందనున్ = సుగ్రీవుని, బంటుగ నేలి, తత్ప్రియంబు = ఆసుగ్రీవునికిఁ బ్రియమును, సల్పుచు = చేయుచు, ప్రబలున్ = బలవంతుఁడైన, ఆత్మరిపున్ = రావణుని, తుదిన్ = ఆతర్వాత, జయింప = సంహరించుటకు, చాలన్ = మిక్కిలి, అనుమతిన్ = అనుసరించినబుద్ధితోడ, భజియించుట దోఁచెడును.

భారత. అనిమిషరాట్తనూభవ = అర్జునునియొక్క, భుజాతిశయప్రతికారముయొక్క, నిత్యచింత = నిత్యవిచారముచేత, రవినందనున్ = కర్ణుని, నచ్చినబంటుగ నేలి = ఆత్మభృత్యునిఁగా నేలినవాఁడై, తత్ప్రియంబు = ఆకర్ణునికిఁ బ్రియమును, చల్పుచు, ప్రబలు = ప్రజలెడునట్టి, ఆత్మరిపున్ = దుర్యోధనుని, తుదిన్ = అజ్ఞాతవాసాంతమందును, జయింపఁజాలను, అను = అనెడునట్టి, మతిని భజియించుట యీతనియందుఁ దోఁచెడును.

వ.

అని యూహించి యతనితోడ.

108

రెంటికి సరి.

మ.

నలు వొప్ప న్బవమానసూతి యనియె న్నందన్మనస్థైర్యభం
గులు భావింపఁగ భూవరప్రవర మీకున్ మాకు వర్ధిల్లుని
శ్చలసౌహార్దవిశేషవర్తన లిఁకం జర్చింపఁగా నెట్టిశ
త్రులనుం ద్రుంచుట యెంతకార్య మని చేతోవృత్తిఁ దర్కించెదన్.

109

భారత. కృష్ణుఁ డనెడుమాట, పవమానసూతి = భీమునియొక్క, అని = యుద్ధమును, ఎన్నన్ = యోజించినం గాని, తత్ = ఆభీమునియొక్క, కడమ సులభము. అందఱము సుఖమున నుండెదము విచారపడకు మనుట.

రామ. పవమానసూతి యనియెన్ = హనుమంతుఁడు పలికెను, నందత్ = సంతోషింపుచున్న, మనః = మనస్సుయొక్క, స్థైర్యభంగులు భావింపఁగా, అర్థాంతరము నన్ = నన్నును, తను = ఆసుగ్రీవుని, కడమ సులభము.

మ.

ఇటుము న్నుర్వరఁ బర్వుచున్న విజయోదీర్ణప్రతాపాద్భుతో
త్కటవార్తల్ రిపుకోటికిం బిడుగులై గర్జిల్లెడు న్నీకు నెం
తటివాఁడైన నెదిర్చి ప్రాణములతోఁ దాఁ గ్రమ్మఱన్ లేమి ప్ర
స్ఫుట మోభూపయరాతిచేష్టలు భవద్భ్రూభంగపర్యంతముల్.

110

రామ. ఉర్వరన్ = భూమియందు, విజయ = విరోధాధిజయములు గలదౌటచేత, ఉదీర్ణ = ప్రకటములైన.

భారత. విజయ = అర్జునునియొక్క, కడమ సరి, స్తుతి.

క.

అని పలికి యంత రవినం, దనచింతాభారనిరస ననిమిత్తములై
తనరారెడువాక్యము లా, యనవలనన్ వినుచు నలరె నజ్జనవిభుఁడున్.

111

భారత. రవినందన = కర్ణునివల్ల నైన.

రామ. రవినందన = సుగ్రీవునియొక్క, కడమ సరి.

చ.

మన మలరారఁగాఁ దనరుమాధవుమైత్రికి యుక్తమైనప
ల్కెనయఁగఁ బల్కి వీడ్కొలిపి యీహనుమంతునార్యధర్మవ

ర్తనభృశఖిన్ను నన్నుఁ గడు రంజిలఁ జేసె నితండు వచ్చి యి
ట్లనుఁగుఁదనంబు సూపునె య టంచు దదుత్సుకతం బ్రవర్తిలెన్.

112

రామ. తనయొక్క, రుమాధవు = సుగ్రీవునియొక్కయు, మైత్రికి, ఈహనుమంతునియొక్క, ఆర్య = శ్రేష్ఠమైన, తత్ = ఆహనుమంతునితోడి బంధుత్వమందుఁ గల.

భారత. తనరు = ఒప్పెడి, మాధవు = కృష్ణునియొక్క, వీడ్కొలిపి, కృష్ణుని నంపి, ఈహన్ = కోరికచేత, ఇతండు, మంతు = అపరాధముచేత, ఘనమైన, అరి = శత్రువైన దుర్యోధనునియొక్క, అధర్మవర్తనచేత, భృశ = మిక్కిలియు, ఖిన్నుఁడైనవాని, రంజిలఁజేసె, అనుఁగుఁదనంబు = బంధుత్వమును, అంచు, తత్ = ఆకృష్ణునియందుఁగల, ఉత్సుకతన్ = వేడుకచేత, ప్రవర్తిలెను.

తే.

అంతటను భవ్యనవ్యసఖ్యప్రకటన
భృశసుఖితకర్ణశకునివా గ్వశగుఁ డగుచు
వాలి తమ్ముఁడు నిజకార్యవర్తనలకుఁ
గడుఁ బ్రధానమంత్రస్థితి నడపుచుండ.

113

భారత. అంతట, దుర్యోధనుండని మీఁదటి పద్యములోనున్నది కర్త, వాలి = మీఱి, తమ్ముఁడు, దుశ్శాసనుఁడు, సులభము.

రామ. అంతట, వాలితమ్ముఁడు, సుగ్రీవుఁడు, భవ్య = కాఁగల, నవ్య = నూతనమైన, సఖ్య = రామసఖ్యముయొక్క, ప్రకటన = తెలుపుట చేత, భృశ = మిక్కిలి, సుఖిత = సుఖింపఁజేయఁబడిన, కర్ణములుగల - విననింపైన వనుట, శకునివాక్ = పక్షివాక్కులయందు, వశగుఁ డగుచున్ = ప్రసంగపరుఁడై, ప్రధాన = ప్రధానులతోడ నగు, మంత్రస్థితి = ఊహాపోహణలను, నడపుచుండ, తెలిపెనని మీఁదటిపద్యమునఁ గ్రియ.

సీ.

ఎలమిఁ బొంగుచు మహాబలసంతతిసమగ్ర
           సంభ్రమ మొప్పగఁ జని వినిశ్చ
లత రాఘవేశుఁ డుద్దతహృదయారిదు
           ర్యోధనుండు కళత్రయుతుఁడు ననుజ
యుతుఁడు నై నిజనితాంతోజ్జ్వలతేజోమ
           హాస్ఫూర్తిభీమనరాదులనుడి
కింపఁ దదాస్పదీకృతవనంబులఁ బ్రవ
           ర్తిలుచుండ నతని దేవులఁ జెఱ యను


తే.

దారుణార్తి చెందుటయు నా ధర్మసూతి
తద్విముక్తికై తమ్ముల సద్విధి నల

రించి యప్పుడు ఘనయశశ్శ్రీల నేల
వచ్చుటయు యుక్త మగుటయు వరుసఁ దెలిపె.

114

రామ. మహాబలసంతతి = హనుమంతుఁడు, సుగ్రీవునితో ననెడుమాట, రాఘవేశుఁడు = రాముఁడు, ఉద్దతహృదయులైన, అరి = శత్రువులచేత, దుర్యోధనుండు = యుద్ధము సేయ శక్యము గానివాఁడు, కళత్రయుతుఁడు, సీతాసమేతుఁడును, అనుజయుతుఁడు = లక్ష్మణసహితుఁడునై, నిజ = స్వకీయమైన, నితాంత = మిక్కిలి, ఉజ్జ్వలమైన, తేజః = ప్రకాశముయొక్క, మహాస్ఫూర్తి = స్ఫురణము, భీమ = భయంకరులైన, నరాదులన్ = నరభోజులను, ఉడికింపన్ = పీడించునట్టుగా, తత్ = ఆరాక్షసులచేత, ఆస్పదీకృతము లైనవనంబులయందుఁ బ్రవర్తిలుచుండఁగా, అతనిదేవులన్ = సీతను, చెఱయను = చెఱఁబట్టుట యనెడి, ఆర్తి = పీడను చెందుట, ఆధర్మసూతి = ధర్మమునకుఁ గారణమైన రాముఁడు, తత్ = ఆసీతయొక్క, విముక్తికై, తముమ్ను, యశఃశ్రీలతోడ, ఏలవచ్చుటయున్ = రక్షింపవచ్చుటను, వరుసఁ దెలిపెను.

భారత. బలసంతతి = చతురంగబలసమూహముయొక్క, వినిశ్చలతర = స్థిరతరములైన, అఘవేశుఁడు = పాపప్రవేశములు గలవాఁడు, ఉద్ధతములైన యంతశ్శత్రువులు గలవాఁడు, స్ఫూర్తిన్ = స్ఫురణచేత, భీమనరాదుల = భీమార్జునులు మొదలైనవారిని, ఉడికింపన్ = విచారము పెట్టునిమిత్తమై, ప్రవర్తిలుచుండఁగా, అతనిన్ = దుర్యోధనుని, దేవులన్ = స్త్రీలను, చెఱయనునార్తి, చెందుటయున్ = పొందుటవల్ల, వారికిఁ జెఱరాఁగా ననుట, తమ్ముల = భీమాదులను, యశశ్శ్రీల నేలవచ్చుటయున్ = శత్రునికి నాపద నివర్తింపఁజేయుట కీర్తి యనియు, యుక్త మగుటయుఁ దెలిపెను, స్వకులాభిమానరక్షణము యుక్తము గనుక.

వ.

తెల్పి యి ట్లనియె.

115


మ.

మును తత్పార్థివు చేసినట్టి చరితంబుల్ రాక్షసౌధ్ధత్యఖం
డనపాండిత్యధురంధరంబు లని యెన్నం బెక్కు తాదృక్ప్రవ
ర్తనుకార్యంబున కిట్టివేళ మనకార్యప్రస్తుతత్వం బెల
ర్ప నొగిం గూడుకొనంగఁ గల్గుట మహాభాగ్యంబుగా కల్పమే.

116

భారత. మును, తత్పార్థివు చేసినట్టి చరితంబుల్ = దుర్యోధనునియొక్క చేసినకృత్యములు, రాక్షసౌద్ధత్యమును, ఖండన = అతిక్రమించిన, పాండిత్య = నేర్పుయొక్క, ధురంధరంబులు = బలిమిఁ బొందినవి, రాక్షసకృత్యములకంటె మించినవి యనుట, తాదృక్ప్రవర్తను = అట్టినడువడిగల దుర్యోధనునియొక్క, కార్యంబునకు, ఇట్టివేళన్ = ఈచెఱ నున్నసమయమున, మనకు, ఆర్యప్రస్తుతత్వం బెలర్పన్ = ఘనులను ప్రసిద్ధిరాఁగా, అల్పమే.

రామ. మును, తత్పార్థివు = రామునియొక్క, మనకార్యప్రస్తుతత్వంబు = ప్రయోజన్మప్రసక్తి, అల్పమో.
తే.

అని యనుపమానదోర్బల ఘనతఁ జేసి
యొకడ యాచెఱ విడిపింప నోపు నమర
శూరుఁ డాదిత్యకులరాజసూనుఁ డేమి
చెప్ప సయిదోడు ప్రాపు సుస్థిరతఁ దనర.

117

రామ. అనుపమాన = సరిలేని, దోర్బలఘనతచేత, అని = యుద్ధమును, చేసి, ఆదిత్యకులరాజసూనుఁడు = రాముఁడు, సయిదోడు = లక్ష్మణునియొక్క, కడమ సులభము.

భారత. అని = ఇటని, అనుపన్ = అంపఁగా, మాన = ధైర్యముయొక్కయు, "మానశ్చిత్తసమున్నతిః” అని అ. దోర్బల = భుజములయొక్కయు, ఘనతఁ జేసి, విడిపింపనోపు = విడిపింప సమర్థుఁడైన, ఆదిత్యకులరాజసూనుఁడు = అర్జునుఁడు, సయిదోడు = భీమునియొక్క, ప్రాపు తనరఁగా, విడిపించెనని రెండర్థములకు మీఁదటిపద్యమునఁ గ్రియ.

శా.

దుర్వారస్వచమూఘనధ్వజమరుద్ధూతాభ్రతిగ్మాంశుగం
ధర్వున్ దర్పితుఁ జిత్రసేను ఖరునిన్ దండించి విడిపించె హృ
ద్గర్వాసాధుసుయోధను న్నిజభుజౌద్ధత్యప్రథల్ దిక్కులం
బర్వంగా సకళత్రసోదరపరిప్రాప్తవ్యధాసంగమున్.

118

భారత. దుర్వారమైన, స్వచమూ = తనసేనయందున్న, ఘనధ్వజములయొక్క, మరుత్ = వాయువుచేత, ధూత = చలింపఁజేయఁబడిన, అభ్రమందున్న, తిగ్మాంశున్ = సూర్యుఁడుగలవాని, ఆయనసేనవల్ల సూర్యునికిని గగనమందు నిల్వరాదనుట, ఖరునిన్ = క్రూరుని, చిత్రసేనుఁడను గంధర్వుని, దండించి = శిక్షించి, హృదయమందలి గర్వముచేత, అసాధు = చెడ్డవాఁడైన, సుయోధనున్ = దుర్యోధనుని, సకళత్రసోదర = పెండ్లాము తమ్ములతోఁగూడ, పరిప్రాప్త = పొందఁబడిన, వ్యధాసంగమును, విడ్పించెన్ = పోఁగొట్టెను.

రామ. తిగ్మాంశుగంధర్వున్ = సూర్యునిగుఱ్ఱములవంటి గుఱ్ఱాలు గలవాని, చిత్రసేనున్ = చిత్రము లైనసేనలు గలవాని, ఖరునిన్ = ఖరుఁడను రాక్షసుని, దండించి = సంహరించి, హృద్గర్వముచేత, అసాధు = ధూర్తులయిన, సుయోధ = సద్భటులను, నుత్ = విరియఁగొట్టెడి, “నుద ప్రేరణే” అను ధాతువునఁ గృదంతము. నిజభుజౌద్ధత్యములయొక్క, ప్రథల్ = ప్రసిద్ధములు, పర్వంగా, సకళ = సమస్తమైన, లళలకభేదము, త్రస = ప్రాణములయొక్క, "త్రసలింగం చరాచరే” అని అ. ఉదర = కడుపులయందున్న, వ్యధయొక్క సంగమును విడ్పించెనని క్రిందటి కన్వయము. ఖరునిఁ జంపి చరించెడి జం తువులకన్నిటికిని గడుపులోనివ్యథను మాన్పెననుట, అర్థాంతరము. సకళత్రసోదర = కళత్రసోదరులయందు, పరిప్రాప్త = పొందిన, వ్యథయొక్క, అసంగమున్ = పొందమిని, విడిపించెను, ఖరునిఁ జంపి వానిసోదరకళత్రాదుల సంతోషమును పోఁగొట్టెననుట, పూర్వపద్యములతోఁ గుళకము.

సీ.

అతనిమహితబలోదగ్రత్వమున వాలి
           క్రొవ్వినతనయ సంకోచిత మగు
మహిమఁ బేర్చినవాఁడు మనుజేశవర్యుఁ డూ
           ర్జితశాసనప్రౌఢి సింధురాజు
తద్భార్య నొకనాఁడు దళశాల నొంటిను
           న్నపుడు గోరికుచేష్ట నాక్రమించి
ఘనమనోవిభ్రాంతి గాక వయోరూప
           ధారణంబున మించు దానవుండు


తే.

దానవానిమిషావార్యతన్మహాశు
గానలజ్వాల వెనుకొనఁగా నటవిని
వర్తనకు నొండుగతి లేక వందురుచును
గావున న్రామ నన్నేలు కరుణననుచు.

119

రామ. అతని = రామునియొక్క, మహితబలోదగ్రత్వమున, వాలి క్రొవ్వు = వాలిగర్వము, ఇనతనయ - సుగ్రీవ-సంబుద్ధి, సంకోచితమగున్ = ఆడఁగుననుట, మనుజేశవర్యుఁడు = రాముఁడు, శాసన = శిక్షావిధియొక్క, ప్రౌఢియందు, సింధురాజు = వరుణునిఁ బోలినవాఁడు, అటుగనుక వాలి నణఁపఁగలఁ డనుట, తత్ = ఆరామునియొక్క భార్యను, దళశాలన్ = పర్ణశాలయందు, గోరికుచేష్టన్ = నఖదుశ్చేష్టచేత, ఆక్రమించి = చీరి, ఘనమైన మనోవిభ్రాంతి గలవాఁడు, కాకవయోరూప = కాకి యనెడు పక్షిరూపముయొక్క, “ఖగ బాల్యాదినోర్వయః” అని అ. ధారణంబున మించుదానవుండు = కాకాసురుఁ డనుట, దానవులకును, అనిమిష = దేవతలకును, అవార్యమైన, తత్ = ఆరామునియొక్క, మహాశుగానలజ్వాల = బాణాగ్నిజ్వాల, “ఆశుగౌ వాయువిశిఖౌ" అని అ. వెనుకొనఁగా, అట, వినివర్తనకున్ = ఆబాణాగ్నిని ద్రిప్పుటకు, ఒండుగతిలేక, వందురుచును = విచారపడుచును, నన్ = నన్ను, కావు = రక్షింపుము, రామ-సంబుద్ధి, కరుణన్ = దయచేత, న న్నేలుమనుచు, శరణాగతుండయి యని ముందటిపద్యమున కన్వయము.

భారత. అతనిమ = తనుత్వము లేని, వాలి = మీఱి, క్రొవ్విన, తనయొక్క, అసంకోచితమగు = స్ఫుటమైన, ఊర్జితమైన, శాసనప్రౌఢిగలవాఁడు, సింధురాజు = సైంధవుఁడు, తత్ = ఆపాండవులయొక్క, భార్య = ద్రౌపదిని, కోరి = కామించి, ద్రౌపదితో ననెడుమాట, ఘనమనోవిభ్రాంతి గాక, వయస్సుయొక్కయు, రూప = సౌందర్యముయొక్కయు, ధారణంబున మించుదానవు, ఉండుదానవా = ఉండగలవా, నిమిష = క్షణమేని, అవార్యతన్ = వారింప శక్యముగాని దౌటచేత, మహాశున్ = అధికశోకమనెడి, అనలసంబంధమైనజ్వాల వెనుకొనఁగా, అటవిని, వర్తనకున్ = జీవనమునకు, ఒండుగతి లేక వందురుచును, ఉండుదానవా యని క్రిందటి కన్వయము, కావునన్ = అటుగనుక, రామ - ద్రౌపదికి-సంబుద్ధి, కరుణను; ననుచు = అంకురింపఁజేయుమా, ముందటిపద్యములోఁ గుళకము.

సీ.

అసమాస్త్రశిఖినిదయావృష్టి నార్చి హృ
           త్తాప మెల్లను దీఱఁదన్ను మనుచు
నాథులు లేమి నెంతయుఁ బ్రేలుచును సాధ్వ
           సమ్మతివికృతోక్తి ముమ్మరముగ
శరణాగతుం డయి సరగునఁ దద్రామ
           ఘనఘృణార్ణవమున మునుఁగఁబట్టి
కొనిపోయె నాత్మీయతనువును మగుడ నా
           వింటిబల్మిఁ బరిభవించి త్రిప్పఁ


ఆ.

గలఁడె భీముఁ డైన బలభేదిసుతుఁ డైన
నితరుఁ డైనవీరుఁ డెవ్వఁ డైన
నని కడంక నమ్మహాబలాన్వితుఁడు రా
జన్యపరుఁడు యాత్ర సలుపు నపుడు.

120

భారత. అసమాస్త్ర = మన్మథుఁడనెడి, శిఖిన్ = అగ్నిని, దయావృష్టిచేత నార్చి తన్నుము, అనుచు, పాదప్రహారము శృంగారచేష్ట యైనందుకు, “సాలక్తకేన నవపల్లవకోమలేన పాదేన నూపురవతా మణిసింజితేన, య స్తాడయతే దయితయా ప్రణయాపరాధాత్సోంగీకృతో భగవతా మకరధ్వజేన” అని యమరుకశ్లోకము, సాధు = సత్పురుషులకు, అసమ్మతి = సమ్మతిరహితమైన, శరణాగతుండయి = ఇల్లుచొచ్చినవాఁడై, "శరణం గృహరక్షిత్రోః” అని అ. తద్రామన్ = ఆద్రౌపదిని, మృణార్ణవమునన్ = జుగుప్పాసముద్రమందు, మునుఁగన్ = మునుఁగుచుండఁగా, పట్టికొనిపోయెను, అప్పుడు సైంధవుఁ డనుకొనెడుమాట, నావింటిబల్మిని, పరిభవించి = అణఁచి, భీముఁ డైనను, బలభేదిసుతుఁ డైనన్ = అర్జునుఁ డైనను, ఇతరుఁ డైనవీరుఁ డెవ్వఁ డైన = ధర్మజనకులసహదేవులలో నెవ్వరైనఁగాని, ఆత్మీయతనువు = నిజస్త్రీని, త్రిప్పఁగలఁడె యని యాత్ర సలుపునపుడు, ముందటిపద్యములతోఁ గుళకము, "బహ్వాదిభ్యశ్చ" అను సూత్రమున జీప్పువికల్పము గనుకఁ దన్వి యన్నట్టు తనుశబ్దమును స్త్రీవాచకముగాఁ బ్రయోగించినాఁడు. ఇందుకుఁ బ్రయోగము నలోదయమందు, “తనుచ్చటోత్తమాలయా తయాభవోత్తమాలయా, అహాని శీతమాలయా, యనిలావధూతమాలయా” అనుశ్లోకమునందుఁ దనుచ్చటశబ్దము స్త్రీసమూహమని వ్యాఖ్యానమందుఁ జెప్పినది.

రామ. అసమాస్త్రశిఖిన్ = అధికమైన బాణాగ్నిని, ఆర్చి, తన్ను, మనుచునాథులులేమిన్ = రక్షించెడివారు లేకుండుటచేత, సాధ్వసమ్ము = భయము, "భీతిర్భీస్సాధ్వసంభయ” మ్మని అ. అతివికృతోక్తిన్ = అధికదైన్యవికృతోక్తిచేత, మమ్మరముగన్ = మించి కానరాఁగా ననుట, శరణాగతుండయి, తద్రామ = ఆరామునియొక్క, ఘనమైన, ఘృణా = దయ యనెడి, "ఘృణా జుగుప్సాకృపయోః" అని వి. అర్ణవమున, మునుఁగఁ = మునుఁగుటవలన, రాముఁడు దయదలఁచఁగా ననుట, ఆత్మీయతనువున్ = తనశరీరమును, మగుడఁ గొనిపోయెను. నాన్ = అనఁగా, వింటిని, భీముఁడైన = భయంకరుఁడైన, బలభేదిసుతుఁ డైనన్ = వాలి యైనఁగాని, రాజన్యవరుఁడు = రాముఁడు, యాత్ర = జయయాత్రను, చలుపునపుడు, అనికడంకన్ = యుద్ధసన్నాహమును, త్రిప్పఁగలఁడే యని యన్వయము.

క.

అనివారితవ్యథాసం, జననం బగురామవార్త స్వజనము చెప్పన్
విని సంభ్రమ మొదవఁగఁ జ, య్యన నాసుగ్రీవకపి హితాధికచింతన్.

121

రామ. అని = ఇట్లని, వారిత = వారింపఁబడిన, వ్యధా = విచారముయొక్క, సంజన = పుట్టువుగల, రామవార్త = రఘుపతివృత్తాంతమును, స్వజనము = హనుమంతుఁడు, చెప్పగా విని, సుగ్రీవకపి, హితాధికచింతను, అరిగి యని ముందటి కన్వయము.

భారత. అనివారిత, రామవార్త = ద్రౌపదివృత్తాంతమును, ఆసుగ్రీవకున్ = మంచికంఠము గలద్రౌపదికి, అపిహిత = ప్రకటమైన, అధికిన్ = మనోవ్యధ గలదానికి, "పుంస్యాధిర్మానసీ వ్యధా" అని అ. అచింతన్ = సంతోషముచేత, ఎంచుచునని ముందటి కన్వయము.

సీ.

శుభమగుచంద మెంచుచు మంగళావహ
           స్వనపత్రరథగతిసౌష్ఠవమునఁ
జిత్తంబు రంజిల్ల శీఘ్రయానంబున
           నరిగి యానృపునిఁ బ్రహర్ష మొప్పఁ
గని యఫ్టు భీమవిక్రమశక్రసుతదర్ప
           యమనవరణనిష్ఠసమధిక మగు
తద్బలవిభవంబు తాఁ జూడఁగా మించి
           వర్తిల్ల మానవేశ్వరవరుండు

తే.

ధర్మరాజితజయమహోత్సాహుఁ డగుచు
నుగ్రజవనైకబాణప్రయోగమహిమ
నచలసంఖ్యతాలంబుల నధికసార
తరుల ధరఁ గూల్చెఁ జూపఱు వెరఁగుపడఁగ.

122

భారత. శుభమగుచంద మెంచుచు, మంగళావహ = శుభసూచకములైన, స్వన = సగిలింతలు గల, పత్ర = గుఱ్ఱములు గల, 'పత్రం వాహనపక్షయోః' అని అ. రథములయొక్క గతిసౌష్ఠవమున, ఆనృపునిన్ = సైంధవుని, కని, భీమునివిక్రమమును, శక్రసుత = అర్జునునియొక్క, దర్పమును, యమ = ఆమడ లైననకులసహదేవులయొక్క, నవమైనరణమందుఁ గల, నిష్ఠ = తాత్పర్యమును, తత్ = ఆసైంధవునియొక్క, బలవిభవంబు = బలాతిశయము, చూడఁగా, మించి వర్తిల్ల, ధర్మరాజు, ఇత = పొందఁబడిన, జయముచేత, మహోత్సాహుఁ డగుచున్ = చాలనుత్సాహము గలవాఁడై, ఉగ్రమునై, జవన = వేగము గల, “ప్రజనీ జవనో జవః” అని అ. ఏక = ముఖ్యమైన, “ఏకేముఖ్యాన్యకేవలాః” అని అ. బాణములయొక్క ప్రయోగమహిమచేత, అచలసంఖ్యతా = చలింపనియుద్ధము గలవారౌటను, ఆలంబులన్ = అవలంబించినవారిని, అధికసారతరులన్ = ప్రబలశ్రేష్ఠులను, కూల్చెను.

రామ. శుభ మగుచంద మెంచుచు మంగళావహములయిన, స్వన = వాక్కులుగల, పత్రరథ = పక్షులయొక్క, “పతత్పత్రరథా౦డజాః” అని అ. గతిసౌష్టవమునన్ = మంచిగతులచేత, శకునములు లెస్సగా నౌచునుండఁగాననుట, ఆనృపునిన్ = రాముని, భీమవిక్రముఁడైన, శక్రసుత = వాలియొక్క, దర్పమును, యమ = అణఁచెడి, నవరణనిష్ఠచేత, తత్ = ఆరామునియొక్క బలవిభవంబును, చూడన్ = పరీక్షింప, కామించి = కోరి, వర్తిల్లగా, మానవేశ్వరవరుండు = రాముఁడు, ధర్మ = వింటిచేత, రాజిత = ఒప్పుచున్న, జయముచేత మహోత్సాహుఁ డగుచు, అచలసంఖ్య = గిరిసంఖ్యగల - ఏడైనవి యనుట, తాలంబులన్ = త్రాటిచెట్లను, అధికసారతరులన్ = మంచిచేవమ్రాఁకు లైనవాని, కూల్చెను.

సీ.

అకలుషాత్మప్రమదాప్తి నుబ్బుచు వాలి
           తమ్ముఁ డాసింధు భూధవకుమారు
సఖ్యాతిబలముపసం దగుల్పడఁ జేసి
           యన్న యహీనదర్పాధికతలు
మనుజాధినాథుసమ్యక్ప్రయుక్తవిశిఖ
           త్వంబున భంగించి తప్పకతన

పనుపునఁ గ్రమ్మఱఁ దనకీశబల మెందుఁ
           గడు ననుకూలమై నడచుటకును


తే.

రంజిలుచు రామకార్యవర్తనకుఁ దగిన
యట్టిమాటల నాహ్లాదమాచరించె
నంత నురువనవాసకాలాంత మగుడు
నుపరికృత్యంబునకు మహోద్యోగుఁ డయ్యె.

122

రామ. అకలుష, ఆత్మ = తనయొక్క, ప్రమద = సంతోషముయొక్క, ఆప్తిని, వాలితమ్ముఁడు = సుగ్రీవుఁడు, ఆసింధుభూధవకుమారు = చతురుదధివేష్టితభూపతియైన రాముని, సఖ్య = స్నేహముయొక్క, అతిబలముపసను, అన్న వాలియొక్క, అహీనములైన, దర్పము నధికత్వమును, మనుజాధినాథు = రామునిచేత, సమ్యక్ప్రయుక్త = లెస్సగాఁ బ్రయోగింపఁబడిన, విశిఖత్వమునన్ = బాణము గలవాఁ డౌటచేత, విశిఖసమ్యక్ప్రయోగముచేత ననుట, భంగించి = రామునిబాణముచే వాలిని జంపించి యనుట, కీశబలము = వానరసేన, “మర్కటో వానరః కీశః" అని అ. రామ = రఘుపతియొక్క, కార్యవర్తనకుఁ దగినయట్టిమాటలన్ = దండెత్తిపోయి సీతను హరించినవాని సంహరింత మనెడుమాటలచేత, అంత, ఉరువన = అధికజలమునకు - వృష్టికి ననుట, వాస = నివాసమైన, కాలముయొక్క, అంతము = శరత్కాలము, అగుడున్ = అవుటవలన, కడమ సులభము.

భారత. అకలుషా = పతివ్రతయైన, ఆత్మప్రమదా = ద్రౌపదియొక్క, ఆప్తిన్ = ప్రాప్తిచేత, విడిపించుకొనుటచేత ననుట, వాలి = మీఱి, తమ్ముఁడు = భీముఁడు, ఆసింధుభూధవకుమారున్ = సైంధవుని, సఖ్యాతితోఁ గూడిన, బలముపసను, నయహీనమైన దర్పముచేత నధికమైన, తలున్ = స్వరూపముగలవాని, "అధస్స్వరూపయోరస్త్రీ తల” మ్మని అ. మనుజాధినాథున్ = సైంధవుని, సమ్యక్ప్రయుక్తవిశిఖత్వంబునన్ = శిఖారహితత్వముచేత, భంగించి శిఖ గోసి యనుట, తనపనుపున, క్రమ్మఱన్ = తిరిగిరాఁగా, తనకు, ఈశబలము = ఈశ్వరానుగ్రహ మనుట, ఆర్యవర్తనకున్ = సద్వర్తన గలదానికి, రామకున్ = ద్రౌపదికి, తగినయట్టి మాటల చేత, ఆహ్లాదమాచరించెన్ = చెఱఁబోయె ననువిచారమును మాన్పె ననుట, వనవాసకాలముయొక్క, అంతమగుడున్ = సమాప్తి యగుటచేత, ఉపరికృత్యంబునకున్ = అజ్ఞాతవాసమునకు, మహోద్యోగుఁ డయ్యెను.

వ.

అప్పుడు.

123


క.

చూపట్టి నిర్ణిరోధది, శాపతితాభినుతభానుసంతతిచోద్యం
బై పరఁగ హరిణభావము, కైపువడసి మిగుల వింతగతి నెలయించెన్.

124

భారత. నిర్ణిరోధ = అవరోధము లేని, దిశాపతితా = దిక్పతిత్వముచేత, అభినుతుఁ డయిన, భానుసంతతి = యముఁడు, హరిణభావము = లేఁడిరూపముయొక్క, కైపు వడసి, ఎలయించెన్ = బ్రాహ్మణుని మోసము పుచ్చెను.

రామ. ఇంక మూఁడుపద్యములు శరత్కాలవర్ణనము. నిర్ణీరోధ= అవిచ్ఛిన్నముగా, దిశా = దిక్కులయందు, పతిత = వ్యాపించిన, అభినుత = స్తుతింపఁబడిన, భానుసంతతి = కిరణసమూహము, “భానూ రశ్మిదివాకరా” అని అ. చోద్యంబై పరఁగఁగా, హరిణభావము = ధావళ్యముయొక్క, 'హరిణః పాండురః పాండుః' అని అ. కైపు = విలాసమును, పడసి, వింతగతిచేత, నెల = చంద్రుఁడు, ఇంచెన్ = ఇంపాయెను.

సీ.

భాసురశృంగలీలాసముత్కృష్టమ
           హారణితాఖిన్నసారసద్ద్వి
జప్రార్థితవ్యవస్థాపనం బై కడు
           నాహరిణముదిరంబగుపొలుపున
విలసిల్లుచున్న యావేళయందును రాజు
           దమ్ములు నతులితోత్కర్షశాలి
బాణాసనశరప్రపంచంబు విస్ఫూర్తిఁ
           బరఁగంగఁ దవిలి వెంబడి నలసిరి


తే.

మివుల వర్తిల్లెఁ దచ్ఛరదవసరభస
లీల సత్కృష్ణసారరత్నాలఘుమహి
మకుఁ దృణకణాయమానమై మానసంబు
గడుఁ జలింపంగ నివ్వెఱపడియె నృపుఁడు.

125

రామ. భాసుర = ఒప్పుచున్న, శృంగ = ప్రాధాన్యముయొక్క, "శృంగం ప్రాధాన్య సాన్వోశ్చ" అని అ. లీలా = విలాసముచేత, సముత్కృష్ట = మిక్కిలి నుత్కృష్టములయిన, మహారణిత = అధికస్వరముగల, అఖిన్న = సంతోషపడుచున్న, సారసద్విజ = బెగ్గురు లనెడు పక్షులయొక్క, "పుష్కరాహ్వస్తు సారసః దంతవిప్రాండజా ద్విజాః" అని అ. ప్రార్థిత = కోరఁబడిన, వ్యవస్థాపనంబై = నిలుపుట గలదై, ఫలితార్థము. ప్రాధాన్యముచేత మోయుచున్న సారసపక్షు లింకను నీశరత్కాల మొప్పుచునుండవలెనని కోరెననుట, కడు, హరిణ = శుభ్రమైన, ముదిరంబు = మేఘము, “ఘనజీమూతముదిరజలముగ్ధూమయోనయః" అని అ. అగుపొలుపునన్ = ఆవుచున్న యొప్పిదముచేత, విలసిల్లుచున్న, ఆవేళయందున్ = శరత్కాలమందు, రాజు = చంద్రుఁడును, “రాజా ప్రభౌ నృపే చంద్రే ” అని వి. తమ్ములును = పద్మములును, అతులితోత్కర్షముగల, శాలి = రాజనముయొక్కయు, "శాలయః కలమాద్యాశ్చ" అని అ. బాణా = రంటయొక్కయు, “నీలీ ఝింటీ ద్వయోర్బాణా” అని అ. ఆసన = వేగిమ్రాఁకులయొక్కయు, “సర్జకాసన బంధూకపుష్పప్రియకజీవకాః" అని అ. శర = రెల్లుయొక్కయు, “గుద్రస్తేజ నకశ్శరః" అని అ. ప్రపంచంబు మహిమ, విస్ఫూర్తిచేతఁ బరఁగంగ, తవిలి = లగ్నమై, వెంబడిని, అలసిరి = ఆకాంతి, మివులు వర్తిల్లెను, చంద్రాదులయందును మిగుల లక్ష్మి కలిగి యుండెననుట. తత్ =ఆ, శరదవసర = శరత్కాలమందున్న, భసలీ = భృంగస్త్రీ లనెడి, "బంభరశ్చ మిళిందశ్చ హిందోళభసలౌ సమా" అని హలాయుధము. లసత్ = ఒప్పుచున్న, కృష్ణ = నీలవర్ణములైన, సారరత్న = శ్రేష్ఠరత్నములయొక్క, అలఘుమహిమకు, తృణకణాయమానమై = హరింపఁబడ్డదియై యనుట, నీలాలు తృణగ్రాహులు గనుక, మానసంబు చలింపంగ, నృపుఁడు = రాముఁడు, నివ్వెఱపడియెను, విరహి గనుక.

భారత. శృంగ = కొమ్ములయొక్క, లీలా = క్రియచేత - రాచుకొనుటచేత ననుట, సముత్ = బ్రాహణునియొక్క సంతోషముతోఁ గూడునట్టుగా, కృష్ణ = హరింపఁబడిన, మహత్ = అధికమైన, అరణితా = అరణి గలవాఁడౌటచేత, ఖిన్నుఁడైన, సార = శ్రేష్ఠుఁడైన, సద్ద్విజునిచేతఁ బ్రార్థితమైన, వ్యవస్థావనంబై = నిలుపుట గలదై, భావము = కొమ్మున నరణిఁ దగిలించుకపోయెడి హరిణమును నిలుపుటకు బ్రాహ్మణుఁడు ప్రార్థించె ననుట, ఆహరిణము, తిరంబగు పొలుపున విలసిల్లుచున్న, రాజు = ధర్మరాజును, తమ్ములు = భీమాదులును, అతులితమైన యుత్కర్షచేత, శాలి = ఒప్పుచున్న, బాణాసన = విండ్లయొక్కయు, శర = బాణములయొక్కయు, ప్రపంచంబు వ్యాపారము, విస్ఫూర్తిఁ బరఁగంగ, తవిలి = వెంటఁదగిలి, అలసిరి, తత్ = ఆపాండవులయొక్క, శరదవ = దావాగ్నివంటి బాణములయొక్క, ఉపమానోత్తరపదము, సరభసలీల = శీఘ్రవ్యాపారము, సత్ = లెస్సైన, కృష్ణసారరత్న = మృగశ్రేష్ఠముయొక్క, “రత్నం స్వజాతిశ్రేష్ఠే౽పి” అని అ. అలఘుమహిమలు, తృణకణాయమానమై = తృణప్రాయమై, మివుల వర్తిల్లెనని క్రిందటి కన్వయము. నృపుఁడు = ధర్మరాజు, నివ్వెఱపడియెను.

సీ.

విప్రకార్యము గాని వెతఁ జేసి కరము దు
           స్సహ మైనకాండవర్షశ్రమమున
నదటేది కలఁకనీరాని తమ్ములు ఘన
           కాలమహిమచేసి నోలిఁ బొలియ
మగుడంగ మనిపె వారిగురుప్రసాదంబు
           దనయుక్తిసామర్థ్యఘనతచేతఁ
జాలంగఁ బడసి తత్సమయంబునందిత
           కామాళి యాగుణఘనతనుండు

తే.

విరహితాపకారంబు తద్విభవ మతను
వికసనము నెవ్వరిమనంబునకు నొనర్ప
దారయఁగ నది యట్లుండె నపుడు నృపుని
యుపరికృత్యంబునకుఁ దగఁ దపనసుతుఁడు.

126

భారత. విప్ర = బ్రాహ్మణునియొక్క, కార్యమును, కానివెతఁ జేసి, కాండ = బాణములయొక్క, వర్ష = వర్షించుటవల్లనైన, శ్రమమునన్ = బడలికచేత, కలఁకన్ = ఆకులత్వమున, నీరాని = నీళ్లు దాగి, తమ్ములు = భీమాదులు, కాల = యమునియొక్క, మహిమచేత, పొలియన్ = నొచ్చిపోఁగా, వారిన్ = ఆతమ్ములను, గురుప్రసాదంబు = తమతండ్రి యైనయమునియొక్క యనుగ్రహమును, తనయొక్క, ఉక్తిసామర్థ్యఘనతచేత = ఆయనప్రశ్నములకుఁ దా నుత్తరములు చెప్పి యనుట, పడసి = పొంది, దిత = ఖండింపఁబడిన, కామ = కోరికలయొక్క, అళి = సమూహముకలవాఁడు, యోగిసముఁ డనుట, ఆగుణఘనతనుండు = ధర్మజుఁడు, మనిపెనని క్రిందటికన్వయము. ఇది గాక కవివాక్యము, విరహితమైనయపకారము గలది - ఎవ్వరికిని గీడు సేయనిదనుట, అజాతశత్రుఁడు గనుక, తద్విభవము = ఆధర్మరాజు ప్రభావము, అతను = అనల్పమైన, వికసనమున్ = విలాసమును, ఎవ్వరిమనంబునకు నొనర్పదు - అందఱిమనమున కాహ్లాదము చేయుననుట, నృపుని = ధర్మరాజుయొక్క, ఉపరికృత్యంబునకున్ = అజ్ఞాతవాసాదికృత్యములకు, తగన్ = ఉచితమౌనట్లుగా, తపనసుతుఁడు = యముఁడు, అనిపెనని ముందటిపద్యములోఁ గ్రియ.

రామ. విప్రకార్యముగాని = మానుప శక్యముగాని, వెతఁజేసి, కరము = మిక్కిలి, దుస్సహమైన, కాండవర్షశ్రమమునన్ = ఉదకవృష్టిచేత యలమటచేత, అదటేది = బిరుదుచెడి, కలఁకనీరు = కలఁగినయుదకమును, ఆని = పొంది, తమ్ములు = పద్మములు, ఘనకాల = వర్షాకాలముయొక్క, మహిమచేత, నోలిని, పొలియన్ = అణఁగిపోఁగా, వర్షాకాలమందుఁ బద్మముల ప్రకాశము చెడుఁ గనుక, వారి = ఉదకముయొక్క, గురుప్రసాదంబు = లెస్సగాఁ దేఱుటను, తనయొక్క, యుక్తిసామర్థ్య = సంసర్గసామర్థ్యముయొక్క, ఘనతచేతఁ జాలంగఁబడసి, శరత్సంసర్గము గలిగెనే నుదకము తేఱును గనుక, తత్సమయంబు = ఆశరత్కాలము, నందితకామాళి = సంతోషింపఁజేయఁబడిన, మన్మథుఁడు దుమ్మెదలును గలది, శరద్విశేషణము. పద్మములను నిట్టిశరదృతువు మగుడంగ మనిపెనని క్రిందటి కన్వయము. ఇట్టి పద్మపోషణముచేత మన్మథుఁడు దుమ్మెదలను మెఱయించెననుట, గుణఘనతను = గుణాధిక్యమునను, ఉండు = ఉండెడిది, విరహితాపకారంబు = విరహులకుఁ దాపము చేసెడిది, తత్ = ఆశరదృతువుయొక్క, విభవము, అతనువికసనమున్ = మన్మథునివికాసమునను, ఎవ్వరిమనంబునకు నొనర్పదు = అరయఁగ నది యట్లుండెను. అపుడు = శరత్కాలమందు, నృపుని, ఉపరికృత్యంబునకున్ = రావణునిమీఁది దండయాత్రకు, తపనసుతుఁడు = సుగ్రీవుఁడు, అనిపెనని ముందరిపద్యములోఁ గ్రియ.

క.

అజ్ఞాతవాసమహితన, యాజ్ఞాపనరామభాషణార్పితకార్య
ప్రజ్ఞులను జేసి యనిపై ని, జాజ్ఞాకరణైకశరణు లగువారిఁ దగన్.

127

రామ. అజ్ఞాతవాస = తెలియఁబడని యునికిగల, మహితనయా = సీతాదేవికి, జ్ఞాపన = గుఱుతులు చెప్పెడి, రామభాషణములచేత, ఆర్చిత = పెట్టఁబడిన, కార్యప్రజ్ఞలు గలవానిఁ జేసి, రామునిచేతఁ జెప్పింపవలసినగుఱుతులు చెప్పించి యనుట. నిజాజ్ఞాకరణమే, ఏకశరణ = ముఖ్యాధారముగఁ గలవారిని, తనకు నధీనమైనవారి ననుట. అనిపెను.

భారత. అజ్ఞాతవాసమందలి మహితమైన, నయ = నీతియొక్క, ఆజ్ఞాపన = ఉపదేశించుటచేత, రామ = మనోహరములైన, భాషణములచేత, అర్పితమైన కార్యప్రజ్ఞలు గలవానిఁ జేసి - అందుకుఁ దగిననీతి చెప్పి వరమిచ్చి యనుట. వారిన్ = ఆపాండవులను, అనిపెను.

ఆ.

అపుడు వారు మహిజనావిదితస్థితిఁ
జేయుటకుఁ దదుక్తి చేకొని కడు
నుల్లముల నుదంచితోత్సాహు లగుచును
వివిధదిక్ఫురములు వెదకిచూచి.

128

భారత. మహిజనులచేత, అవిదిత = తెలియఁబడని, స్థితిన్ = అజ్ఞాతవాసమును, చేయుటకు, తత్ = ఆయమునియొక్క, ఉక్తిఁ జేకొని, వివిధదిక్పురముల నుల్లముల వెదకి చూచి = ఏపట్టణమునకుఁ బోదమని యెంచుకొని యనుట. మీఁదటిపద్యముతోఁ గుళకము.

రామ. మహిజను = సీతను, అవిదితస్థితిన్ = మిక్కిలిఁ దెలియఁబడ్డ స్థితిగలదానిఁగా, చేయుటకు, సీతయున్నదిక్కు తెలియుటకొఱ కనుట. తత్ = ఆరామునియొక్క, ఉక్తిఁ జేకొని, వివిధదిక్పురములన్ = అన్నిదిక్కులపట్టణములయందును, వెదకి చూచి.

క.

అతిసత్త్వస్థవిరాటవి, తతనగరచితప్రచారతను మది కెక్కన్
ధృతి నరసి రామభార్యను, సతిఁ గానక కాంతిభంగచణతనులీలన్.

129

రామ. అతిసత్త్వ = మిక్కి_లి జంతువులుగల, స్థవిరాటవి = జీర్ణారణ్యములచేత, తత = వ్యాపింపఁబడిన, నగ = పర్వతములయందు, రచిత = చేయఁబడిన, ప్రచారతన్ = ప్రచా రములు గలవా రౌటచేత - ఉపచారము గలవారై యనుట. రామభార్యన్ = సీతను, కానక, కాంతిభంగచణ = కాంతిహానిచేతఁ దెలియఁబడిన, “తేనవిత్తశ్చంచుప్చణపౌ” అని చణప్ప్రత్యయాంతము. తను = శరీరములయొక్క, లీలచేత, వివర్ణులై యనుట, చనిరని ముందరఁ గ్రియ.

భారత. అతిసత్త్వస్థ = అత్యంతసాత్త్వికగుణవర్తియైన, విరాట = విరాటరాజుచేత, వితత = విస్తరింపఁబడిన - పోషింపఁబడిన దనుట. నగర = మత్స్యపురమందు, చిత = సంపాదింపఁబడిన, ప్రచారతన్ = ప్రచారము గలవారౌటను, తత్పురనివాసము ననుట, మది కెక్క ధృతినరసి = అక్కడికిఁ బోవుదమని నిశ్చయించి యనుట. రామను = ఒప్పెడిదాని, భార్యను = ద్రౌపదిని, సతిన్ = పతివ్రతను, కానకకాంతి =కనకసంబంధమైన కాంతియొక్క, భంగచణ = జయించుటచేతఁ బ్రసిద్ధమైన, తనులీలన్ = దేహవిలాసము గలదాని, కనుఁగొని యని మీఁదటి కన్వయము.

క.

వనితామణి నురుశుభగుణఁ
గనుఁగొని దాస్యోచితవిధిగరిమము మిగులం
జనలేమ యకట యిఁకఁ దద
వనిపాలపురస్థితిం బ్రవర్తిలు టెట్టో.

130

భారత. వనితామణిని, శుభగుణకు, ద్రౌపదికి విశేషణములు. కనుఁగొని, దాస్యోచితవిధిన్ = దాస్యమునకుఁ దగిన వ్యాపారముచేత, గరిమము = గౌరవము, మిగులఁజనన్ = మిక్కిలిఁబోఁగా, లేమ = ఈద్రౌపది, తదవనిపాలపురస్థితిన్ = ఆరాజుపట్టణమున నుండుటచేత, ప్రవర్తిలు టెట్టో.

రామ. వనితామణిన్ = సీతను, కనుఁగొని, చనలేమ = పోలేముగదా, అంపినచోటఁ గార్యము చేసికొని పోవుట కొలిచెడువారి ధర్మము, తదవనిపాల = ఆరామసుగ్రీవులయొక్క, పురస్థితిన్ = ముందట నిలిచియుండుటచేత, ప్రవర్తిలు టెట్టో.

తే.

ఏము పనివార మనుచుఁ తద్భూమిపాలు
కడకు మన మేగువార మేకరణి నతని
యుల్లమున కెడయక ప్రవర్తిల్లనేర్తు
మనువిచారంబుచే నాకులాత్ము లగుచు.

131

రెంటికిని సరి.

వ.

పదంపడి తమతోఁచినయుత్తరంబులచే నొండొరులచింత డిందుపఱుచు
చుం దద్దిశాభిముఖు లై చని రప్పుడు.

132

రెంటికిని సరి.

క.

మరుదాత్మజముఖ్యులు ధ, ర్మరాజు దెస నరయువారు మగుడక యంతః
కరణములఁ బర్వుచింతా, భరములతోఁ జలిపి రగ్రపథగమనంబున్.

133

రామ. ధర్మరాజుదెసన్ = దక్షిణపుదిక్కునందు, అరయువారు = వెతకెడువారు, మరుదాత్మజముఖ్యులు = హనుమదాదులు, మగుడక =తిరుగక, కడమ సులభము.

భారత. ధర్మరాజుదెస నరయువారు = ఈయన యేగతిఁ బరునిఁ గొల్చెడినో యని విచారించుచు ననుట. మరుదాత్మజముఖ్యులు = భీమాదులు, మగుడక = ఉడుగక, పర్వుచింతాభరములతో.

క.

ఈతెఱఁగునఁ జనునంతటఁ, జేతోవీథి న్నిజార్థసిధ్యనుగుణసం
పాతిఖగోక్తులముద ము, ద్భూతంబుగ వింత లగువపురభిఖ్యలతోన్.

134

భారత. అర్థసిద్ధి కనుగుణ మౌనట్టుగా, సంపాతి = సంచరింపుచున్న, గమనముచేత, శకునము నిచ్చుచున్న వనుట. ఖగ = పక్షులయొక్క, కడమ సులభము.

రామ. సంపాతియనుపక్షియొక్క, అభిఖ్యలతోన్ = కాంతులతోడ.

వ.

ముందరికిం జనిచని.

135


క.

వారలు గనుఁగొని రతివి, స్తారాద్భుతమత్స్యరాజధానిని లవణాం
భోరాశిఁ గాళిమగుణో, దారతచే మించువనచయముగలదానిన్.

136

రామ. అతివిస్తారముచేత నద్భుతములయిన, మత్స్యరాజ = మీనశ్రేష్ఠములయిన తిమితిమింగిలాదులకు, ధానిన్ = స్థానమైనదాని, కాళిమగుణ = నైల్యగుణముయొక్క, ఉదారతచే, మించు = మించెడి, ననచయము = ఉదకసమూహము, కలదాని, లవణాంభోరాశిని గనుఁగొనిరి.

భారత. వారలు = ధర్మాదులు, విస్తారముచేత నద్భుతమైనదాని, కాళిమగుణోదారత్వముచేత, లవణాంభోరాశిని, మించు = జయించెడి, వనచయము = తోఁటలు, కలదాని, సముద్రమువలెనే నల్లనైయున్న తోఁపులుగల దాని మత్స్యరాజధానినిఁ గనుఁగొనిరి.

వ.

అంత.

137


ఉ.

ఆవనరాశి దాఁటి తగునట్టిక్రమంబున విశ్వవిద్విష
ద్రావణపాలితం బగుపురంబు జనాంతరదుర్దమస్వతే
జోవిభవాభిగుప్తిమయిఁ జొచ్చి మరుత్తనయుండు తద్విభుం
డేవెత లేక యుండఁ బ్రజనేలు తెఱంగున కాత్మ మెచ్చుచున్.

138

భారత. ఆ, వనరాశిన్ = వనసమూహమును, దాఁటి, తగునట్టి క్రమంబునన్ = వేషాంతరములచే ననుట, విశ్వవిద్విషత్ = సమస్తశత్రువులయొక్క, రావణ = పాఱఁ ద్రోలుటచేత, పాలితంబగుపురంబు = విరాటనగరమును, జనాంతరదుర్దమ = అన్యజనులకు భేదింపరాని, స్వతేజోవిభవములయొక్క, అభిగుప్తిమయిన్ = గోపనముచేత, చొచ్చి = ప్రవేశించి, మరుత్తునియొక్క నయమువంటి తయము గలవాఁడు, తత్ = ఆనగరముయొక్క, విభుండు, కడమ సులభము. ఆశ్రయించి రని ముందరిపద్యములోఁ గ్రియ.

రామ. ఆవనరాశిన్ = సముద్రమును, దాఁటి, విశ్వవిద్విషత్ - సకలలోకములకు శత్రువైన, రావణునిచేత, పాలితంబగుపురంబు = లంకను, మరుత్తనయుండు = హనుమంతుఁడు, చొచ్చి, కడమ సరి. ముందరిపద్యములతోఁ గుళకము.

సీ.

అతనిలీలాద్భుతరతిరాజనీతిశా
           స్త్రప్రసంగాదులు సలుపునెడలు
నభిమతభక్ష్యభోజ్యాదిపాకవిశేష
           చణసూదకర్మప్రసక్తియెడలు
శుద్ధాంతకన్యలసురుచిరనాట్యశి
           క్షణవినోదంబులు జరుపునెడలు
గాంధర్వగతిశిక్ష గావించునెడలు న
           త్యంతమాహారక్షణాదివిధులఁ


తే.

గ్రాలునెడలును గ్రమమునఁ గాంచి తత్త
దర్హగతి నాశ్రయించి రయంబు మీఱ
నవనిజాతను నైపుణీవివృతి మెఱసి
పరు లెఱుఁగకుండ నేగురు భవ్యధృతిని.

139

రామ. అతని = రావణునియొక్క, రతిరాజనీతిశాస్త్ర = శృంగారశాస్త్రములయొక్క, ప్రసంగాదులఁ జలఁపునెడలను, గాంధర్వగతి = సంగీతవిద్యయొక్క, శిక్ష = అభ్యాసమును, అత్యంతము, ఆహార, క్షణాది = ఉత్సవాది, తత్తదర్హమైన, గతిన్ = ప్రకారముచేత, కాంచి = చూచి, రయంబు మీఱ, అవనిజాతను = సీతను, ఆశ్రయించి = ఉద్దేశించి, పరు లెఱుఁగకుండనే, గురుభవ్యధృతిని, చరియించుచునని మీఁదిపద్యమున కన్వయము. కడమ సులభము.

భారత. ఆతని = ఆవిరాటునియొక్క, లీలాద్భుతమందైన, రతి = ప్రీతియొక్కయు, రాజనీతిశాస్త్రములయొక్కయు, ప్రసంగాదులను జలుపునెడలను, ధర్మరాజును, సూదకర్మ = పాకప్రయోజనముయొక్క, ప్రసక్తియెడలు = సమయములను, భీముఁడును, “సూదా ఔదనికా గుణాః” అని అ. నాట్యకశిక్షణవినోదంబులు జరుపునెడ లను, అర్జునుఁడును, గాంధర్వగతిశిక్ష = అశ్వసంబంధమైన గమనశిక్షను, కావించునెడలను, నకులుఁడును, “వాజివాహార్వగంధర్వ వాయసైంధవసప్తయః” అని అ. అత్యంత, మాహా = ఆవులయొక్క, “గౌరుస్రా మాహా చశృంగిణీ" అని అ. రక్షణాదివిధులఁ గ్రాలునెడలును, సహదేవుఁడును, క్రమమునఁ గాంచి, తత్తదర్హగతిన్ = అందుకందుకుఁ దగినరూపవర్తనలచేత, అయంబు మీఱన్ = భాగ్యవశమున నన్నియు నిచ్చానుకూలమౌచునుండఁగా ననుట. నవమైన, నిజ = స్వకీయమైన, అతను = అనల్పమునైన, నైపుణీ = నేర్పుయొక్క, వివృతిన్ = విశేషగోపనముచేత, మెఱసి, పరు లెఱుఁగకుండ, ఏగురు = అయిదుగురును, ఆశ్రయించిరి.

క.

అంతటఁ దద్రామ నృపతి
కాంతాసందర్శనాభికాంతాసహిత
స్వాంతతఁ దరియించుచు శు
ద్ధాంతక్రీడావనస్థ యగుతద్దేవిన్.

140

భారత. అంతట, తద్రామ = ద్రౌపది, నృపతికాంతా = సుధేష్ణయొక్క, కడమ సులభము.

రామ. అంతట, తద్రామనృపతికాంతా = సీతయొక్క, కడమ సరి.

క.

చేరి పొడగాంచి యాయమ
చేరిక నతిగూఢతను భజించి వసించెన్
సైరంధ్రీభావమునఁ ద
దారూఢప్రీతి మొగము దగఁ గైసేయన్.

141

రామ. చేరి పొడగాంచి, ఆయమ = సీతయొక్క, చేరికను, సైరంధ్రీభావమునన్ = సైరంధ్రియొక్క రీతిచేత - సైరంధ్రీభావనలచేత ననుట. తదా = అప్పుడు, రూఢ = మొలిచిన, ప్రీతి = సంతోషము, మొగము దగఁ గైసేయ = సీతాసందర్శనమువల్ల నైన వేడుక ముఖమునకు శృంగారము దేఁగా ననుట.

భారత. సైరంధ్రిత్వము, మొగము దగఁ గైసేయ = తిలకాదులు పెట్టునట్టుగా, ఆయమ = సుధేష్ణయొక్క, చేరికను వసించెను.

శా.

పారేమాయవిజృంభమాణపరమబ్రహ్మాత్మ మధ్యేహృద
బ్జారాధ్యామలదివ్యమంగళనిజాంగాజస్రసాక్షాత్క్రియా
ధౌరంధర్యమహత్త్వపాత్రితగుణాధరఃకారితాష్టాంగయో
గారూఢిప్రథమానమౌనిజనభాగ్యశ్రీసముజ్జృంభణా.

142

పారేమాయ = మాయ నతిక్రమించినతర్వాత, “పారే మధ్యే షష్ఠ్యావా” అని షష్ఠీసమాసము. విజృంభమాణ = ప్రకాశించుచున్న, పరమబ్రహ్మాత్మ = నిర్గుణబ్రహ్మ స్వరూపమైనవాఁడా, మధ్యేహృదబ్జ = హృత్పద్మమధ్యమందు, ఆరాధ్య = భజింపఁదగిన, అమల = స్వచ్ఛమైన, దివ్యమంగళ = దివ్యశుభస్వరూపమైన, నిజాంగ = నిజస్వరూపముయొక్క, అజస్రసాక్షాత్క్రియా = నిత్యసాక్షాత్కారముయొక్క, ధౌరంధర్య = వహించెడు చాతుర్యముచేత నైన, మహత్త్వ = మహిమకు, పాత్రిత = పాత్రముగాఁ జేయఁబడినవారై, గుణాధఃకారితా = త్రిగుణములను దిరస్కరించెడువా రౌటచేత, అష్టాంగయోగ = సాంఖ్యయోగమందుఁ గల, ఆరూఢి = అతిపరిచయముచేత, ప్రథమాన = ప్రసిద్ధులైన, మౌనిజన = మునీశ్వరులయొక్క, భాగ్యశ్రీ = అదృష్టాతిశయమును, సముజ్జృంభణా = ప్రకాశింపఁజేసెడువాఁడా!

క.

ఆధునికసాధునికరస, మాధిదురారాధితామహత్తరవార్తా
రోధార్థవిహితమచ్చి, త్తాధిగమా పెద్దవేంకటాధిపసుగమా.

143

ఆధునిక = ఇప్పటివారైన, సాధు = సజ్జనులయొక్క, నికర = సమూహమునకు, సమాధి = యోగనిష్ఠచేతను, దురారాధితా = ఆరాధింప శక్యము గానివాఁ డౌట యనెడి, మహత్తరవార్తా = అధికతరమైన ప్రసంగములయొక్క, రోధార్థ = నిరాకరణనిమిత్తమై, విహిత = చేయఁబడిన, మచ్చిత్తాధిగమా = నాదుహృదయసంగతి గలవాఁడా! నావంటివానికిఁ బ్రసన్నమైనస్వామిని సకలమైనవారికినిఁ బ్రసన్నుండ వౌదువు గనుక నిన్ను నారాధింప శక్యము గాదను వాక్యము సిద్ధాంతము గాదు, అటు గనుకనే, పెద్దవేంకటాధిప = పెదవేంకటాద్రిచేత, సుగమా = లెస్సగాఁ దెలియఁబడినవాఁడా!

మత్త.

భూధరాధిప కన్యకామణి పుణ్యపాదపయోజలా
క్షైధితారుణగైరికద్యుతి హేమకూటవిహారలీ
లాధికాదరసాధుసాధితహైమవత్యనురంజనా
రాధితస్మరమోచితాత్మపురాతనాపకృతిస్మృతీ.

144


గద్యము.

ఇది నిఖిలసూరిలోకాంగీకారతరంగితకవిత్వవైభవ పింగళియమర
నార్యతనూభవ సౌజన్యజేయ సూరయనామధేయప్రణీతం బైనరాఘవ
పాండవీయమునందుఁ దృతీయాశ్వాసము.

భూధరాధిప = హిమవంతునియొక్క, కన్యకామణి = కుమారియైన పార్వతియొక్క, పుణ్య = పవిత్రములైన, పాదపయోజ = పాదపద్మములందున్న, లాక్షా = లత్తుకచేత, ఏధిత = వృద్ధిపొందఁబడిన, అరుణములైన, గైరికద్యుతి = జేగురులకాంతిగల, హేమకూటపర్వతమందగు, విహారలీలా = క్రీడావిలాసమందు, అధికాదర = మిక్కిలి నాదరము గలవాఁడా! సాధుసత్పురుషులచేత, సాధిత = వశముగాఁ జేసికొనఁబడినవాఁడా! హైమవతీ = గౌరి యొక్క, అనురంజన = ప్రేమపురస్సరముగా నడుగుకొనుటచేత ఆరాధిత = ప్రార్థింపఁబడినవాఁడవై, స్మర = మన్మథునినిమిత్తమై, మోచిత = విడిపింపఁబడిన, ఆత్మ = తననిమిత్తమైన, పురాతన = పూర్వకృతమైన, అపకృతి = అపకారముయొక్క, స్మృతీ = స్మరణ గలవాఁడా! పార్వతీప్రార్థనవలన మన్మథునిఁ దిరుగ బ్రతికించినవాఁ డనుట.

గద్యము.

ఇది శ్రీమన్మదనగోపాలకృపాకటాక్షసంప్రాప్తసారసారస్వత
సంపదానందనందవరకులక్షీరపారావారరాకాసుధాధామ ముద్దరాజ
గణపయామాత్య పెదరాయధీమణిప్రదర్శితం బైనరాఘవపాండవీ
యాదర్శంబునందుఁ దృతీయాశ్వాసము.