Jump to content

రసాభరణము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

రసాభరణము[1]

ప్రథమాశ్వాసము[2]

శ్లో.

శృంగారహాస్యకరుణారౌద్రవీరభయానకాః
బీభత్సాద్భుతశాంతాఖ్యా రసాః పూర్వైరుదాహృతాః.


సీ.

చారుశృంగారరసస్థాయి రతి యగు హాస్యరసస్థాయి హాస మరయఁ
గరుణరసస్థి పరఁగ శోకంబు రౌద్రస్థాయి క్రోధమై తనరుచుండు
వీరరసస్థాయి వెలు నుత్సాహంబు తలఁప భయానకస్థాయి భయము
ప్రకట జుగుప్స బీభత్సరసస్థాయి విపులాద్భుతస్థాయి విస్మయంబు
విమలశాంతరసస్థాయి శమ మనంగ, నిట్లు నవరసములకు నూహింపఁగలిగి
యంచితస్థాయిభావంబు లతిశయిల్లుఁ, బ్రసవఫలరాసులకుఁ బాదపంబులట్లు.


క.

రత్యాది నవకమునకుం
బ్రత్యేకము లక్షణములు పన్నుగ నార్య
స్తుత్యములై హృద్యము లగు
నత్యుత్తమలక్షణముఁ బ్రియంబునఁ దేర్తున్[3].


క.

తరుణులుఁ బురుషులు నితరే, తరసంభోగేచ్ఛ లెలమి దలకొనఁగాఁ ద
త్పరమతిఁ దిరువుట శృంగా, రరసజ్ఞులమతమునందు రతి యన నెగడున్.

రతికి నుదాహరణము—

ఉ.

మారుఁడు రూపవంతుఁడు, హిమద్యుతి చల్లనివాఁడు, రమ్యసం
చారవినోదశీలుఁడు వసంతుఁడు, వెండియు సద్గుణాఢ్యు లు
న్నారు మహీశు లెవ్వరును నాహృదయంబున కింపు గారు నా
కోరిక సర్వసేవ్యుఁ డగు గోకులనాయకుఁడే తలోదరీ.


క.

క్రూరత లేని వికారా, కారాద్యము లెచటనైనఁ[4] గలిగినవేళన్
బోరనఁ దోతెంచు మనో, హారివికాసంబుపేరు హాసం బయ్యెన్.

హాసమున కుదాహరణము—

ఉ.

శౌరి రఘుప్రభుండు రవిజాతపయోనిధి యంచు గోపికల్
తోరపుఁదీఁగెతోఁకలును దోఃపదయానముఁ బూని వానరా
కారమెలర్పఁ దాఁటుచును గంతులు వేయుచుఁ బాఱుతెంచి త
త్తీర*నగంబునన్[5] శిలలు దెచ్చి గుభుల్లున వేతు రార్చుచున్.

క.

విధివశమునఁ దనప్రజకగు
నిధనాదులు వినినఁ దనదు నెమ్మనమున న
త్యధిక మగు నెగులు వొడమిన
నధీరమతిఁ బొగుల శోక మపగతశోకా!

—శోకమున కుదాహరణము—

ఉ.

అన్న! సభాస్థలంబున దురాత్మకులై తలవట్టి యీడ్చి రం
దున్న ప్రభుల్ గనుంగొనఁగ నొల్వఁ దొణంగిరి చీర శూరులు
న్నన్ను నుపేక్ష చేసిరి యనాధఁ జుమీ కరుణింపు దిక్కు నీ
వన్న వధూటిమాట విని యక్షయ మంటివి నెత్తమాడుచున్.


క.

ఏపున నితరులద్రోహా
లాపాదులు తనదువీనులన్ సోఁకినచో
నేపురుషునిమదిఁ బొదలుఁ బ్ర
కోపజ్వలన మరి నెగడఁ గ్రోధ మనంగన్.

—క్రోధమున కుదాహరణము—

ఉ.

తిట్టులు పెక్కు సైఁచితి మతి న్మనుజాధముఁ డేల క్రొవ్వెనో
యిట్టులు ధర్మరాజుసభ నెగ్గులు వల్కిన దైత్యకోటి ము
ప్పెట్టులఁ దూలఁదోలు మదభీప్సితదర్శన మీసుదర్శనం
బెట్టులు సేయునో యిచట నిందఱుఁ జూతురుగాక చైద్యునిన్.


క.

లోకోత్తరకృత్యంబులు
గైకొని యవి [6]యెడపకుండఁ గావించు దృఢా
స్తోకప్రయత్న మది సుగు
ణాకర యుత్సాహ మనఁగ నభినుతి నొందున్.

—ఉత్సాహమున కుదాహరణము—

ఉ.

బాణునిఁ గాతునంచుఁ బటుబాహుబలంబున నడ్డగించి యా
స్థాణుఁడు దానునుం బ్రమథసంఘముఁ బన్నినఁ బన్ననీ రణ
క్షోణిఁ బరాక్రమస్ఫురణ సూపెద శత్రుని యేపు మాపెదన్
శోణితపట్టణంబు వెసఁ జొచ్చెదఁ ద్రుంచెద దైత్యుహస్తముల్.


క.

ఘోరము లగునత్యుగ్రా
కారాదులవలన మనసు కళవళపడఁగా
సైరింపరాక తూలుట
యారయ భయ మనఁగ నెగడు నభయవిధాయీ.

—భయమున కుదాహరణము—

ఉ.

మించుగఁ బాచజన్య మెలమిం గరపద్మయుగంబునందుఁ గీ
లించి నిజాధరోష్ఠమున లెస్సగఁ గూర్చి మురారి లీనఁ బూ
రించిన గుండియ ల్వగిలి ద్రెక్కొను భీతి నశేషదైత్యులుం
జంచలచిత్తులై నలుదెసం జెడి పాఱిరి తద్ఘనధ్వనిన్.

క.

మేదోమాంసాసృక్శ
ల్యాదివివిధదుష్టదర్శనాదులవలనం
బ్రాదుర్భవించుహేయం
బేది యది జుగుప్స యనఁగ నెన్నికకెక్కున్.

—జుగుప్స కుదాహరణము—

ఉ.

చిక్కిరి నేఁడు రక్కసులు సీ బలభద్రునిముష్టిఘట్టనం
బుక్కిటిమద్యమున్ రుధిరపూరము నొక్కటిగా బుగుల్కొనం
గ్రక్కుచు సీరధారఁ దెగి కండలు గుండెలుఁ గీకసంబులుం
దక్కక చిక్కుజీరువడి దగ్గఱ రాలిపెఁ బూతిగంధమున్.


క.

క్షితిఁ గారణంబుకంటెను
వ్యతిరిక్తం బైనయట్టి యభినవకార్య
స్థితిదర్శనచేతోవి
స్మృతి[7] విస్మయ మనఁగ నుల్లసిల్లు ముకుందా.

—విస్మయమున కుదాహరణము—

చ.

కొడుకఁడ వైననీకు నిదె కొమ్మనుచున్ సెలవిం గరాంగుళం
బిడి భువనప్రపంచము లనేకము లంగిటఁ గాంచె నందులోఁ
గొడుకున కుగ్గువెట్టు తనకోమలరూపము నొప్పఁగాంచి య
ప్పడఁతి యశోద నివ్వెఱఁగుపాటు వహించె మనోగతంబునన్.


క.

ఎరవగు[8] సంసారం బ
స్థిరముగఁ గని నిర్వికారచేతనుఁ డగు న
ప్పురుషుని సుఖదుఃఖాద్య
స్మరణము లోకంబునందు శమమై చెల్లున్.

—శమమున కుదాహరణము—

చ.

కటకట! రాజ్య మంత్యనరకం బటె దేవపదంబు లన్నియుం
గుటిలనిశాటభర్జనలకు న్సదనం బటె యింక సౌఖ్య మే
మిటఁ గల దంచు సర్వమును మిథ్యగఁ జూచు బుధాళిలోని సం
కటములు బాహ్యదుర్దశలుఁ గ్రాఁగు గదాధరరక్షణంబునన్.


క.

స్థాయిత్వం బీభావని
కాయంబున కేమిట న్విఘాతము లేకు
చ్ఛ్రేయమగు వెండి యేమిటఁ
బాయక తలకొను రసానుభవ మనిరేనిన్.


వ.

స్థాయిభావములు సజాతీయ విజాతీయంబులం జెడక దృఢవిభావ సదమలానుభావ సాత్త్వికభావ సంచారికభావముల రసములై వర్తించు
నందు సజాతీయ విజాతీయభావము లెట్టి వనిన.


క.

అరయ సజాతీయములై
జరగు నిజస్థాయిభావజనితాంతరముల్
సొరిది విజాతీయములై
జరగుఁ బరస్థాయిభావజనితాంతరముల్.

వ.

మఱి విభావం బెట్టిదనిన.


క.

చను నాలంబన ముద్దీ
పన మనఁగా ద్వివిధమై విభావము మఱి యం
దున నాలంబన మన్నది
ననుపమసమవాయికారణము రసమునకున్.


వ.

మఱియు నిమిత్తకారణం బగు నుద్దీపనవిభావం బెట్టిదనిన.


క.

ఇల నుద్దీపన మొకటియు
నలి నాలంబనగుణం బనంగాఁ దచ్చే
ష్టలు నా దదలంకృతి యన
నలరుఁ దటస్థములునాఁగ నగు నలుదెఱఁగుల్.


క.

తొలఁగదు కార్యము మొదలం
గలసియుఁ జేయు సమవాయికారణ మది తాఁ
గలయక కార్య మొనర్చును
నలిఁ దొలఁగు నిమిత్తకారణం బనునది తాన్.


క.

అనుభావంబు కటాక్షం
బును భుజవిక్షేపణంబు మొదలయి కార్య
త్వనిరూఢి నుల్లసిల్లును
వినుతస్తంభాదు లష్టవిధసాత్త్వికముల్.


క.

తగు సంచారము లనఁగా
మొగి నిర్వేదాదిభావములు ముప్పదిమూఁ
డగు రసికులమతమున నవి
జగమున సహకారు లగుచు సన్నుతి కెక్కున్.


గీ.

కారణముఁ గార్యమును సహకారిచయము
నై విభావాదు లిబ్భంగి నతిశయిల్లు
నీసమూహంబు రసములం దెట్లయట్ల[9]
నడచుఁ దత్తద్రసానుగుణంబుగాఁగ.


ఉ.

ఆదట వర్ధమానవిభవాతిశయంబున వార్ధులట్లు ర
త్యాదులు వీచుల ట్లదయమౌ నడఁగుం బెరభావపంక్తి ని
ర్వేదముఖోపభోగరుచివృద్ధిరసం బది నాట్యసంగతిన్
మోదమెలర్ప సభ్యుల మనోగతులం[10] దగు కార్యమై చనున్.


క.

రసములవలన రసంబులు
పొసఁగఁగ నుదయించుననియుఁ బూర్వోక్తమగున్
వసుమతి నొకరసమున కొక
రసము విరస మనియుఁ జను పురాకృతకృతులన్.


సీ.

శృంగారమునఁ బుట్టెఁ జెచ్చెరహాస్యంబు గలుగు రౌద్రంబునఁ గరుణ మఱియు[11]
వీరంబువలన భావింప నద్భుతమగుఁ బటుభయానకము బీభత్సఁ బొడముఁ
బరఁగు శృంగారబీభత్స లొండొంటికి హాస్యంబుఁ గృపయు నన్యోన్యరిపులు
రౌద్రాద్భుతములు పరస్పరద్విషులు మిథ్యాహితు ల్వీరభయానకములు
త్రివిధలక్షణముల[12] దీపించు నన్నియు
రూపమునఁ దలిర్ప రూపరసము
వాక్ప్రవృత్తి దోఁప వాగ్రసంబగుఁ గ్రియ
లందుఁ గానఁబడుఁ గ్రియారసంబు.


సీ.

శృంగార ముత్పలాంచితము విష్ణుఁడు రాజు[13] తెలుపు హాస్యము గణాధిపుఁడు భర్త[14]
కరుణ కషాయంబు కాలుఁ డేలిక రౌద్ర మవ్యక్తరాగంబు హరుఁడు వరుఁడు

వీరంబు గౌరంబు విభుఁడు వజ్రి భయానకము ధూమ్రరుచి మహాకాళుఁ డీశుఁ
డసితంబు బీభత్స మధిపతి నంది యద్భుతము పీతము దయితుండు బ్రహ్మ
వర్ణముల నెల్ల మీఱి యస్వామిపరత
వెలయు నిర్వేదధృతిభావములను శాంత
మిట్లు రసవర్ణముల రసాధీశ్వరులను
గోరి యెఱుఁగుట రసికత గోపకృష్ణ.


క.

ఎసఁగం దొమ్మిది విలస
ద్రసములు తత్తదధిదేవతాసహితముగా
రసశాస్త్రకోవిదులమా
నసములకు నుదాహరింతు నవపద్యములన్.

శృంగారరసము

ఉ.

శ్రీకుచకుంభకుంకుమరుచి న్మణిరోచులు వైజయంతికా
స్తోకమరీచులుం గనకశోభితవస్త్రములు న్నిజోజ్జ్వల
శ్రీకి నవీనస్ఫురణఁ జేయఁగ గోపవధూసమేతుఁడై
గోకులవీథుల న్మెఱయు గోపకుమారుఁ డుదారలీలతోన్.

హాస్యరసము

ఉ.

నిక్కి జటాపుటస్థతటినిం దనతొండము సాఁచి పేర్చి యా
చక్కటి గౌరి సూడ నిలఁ జల్లినఁ బెక్కుముఖంబులై చనన్
గ్రక్కున శూలిహస్తదశకంబున నాఁపినభంగి[15] సూచి మై
గ్రక్కదలంగ నవ్వుచును గంతులువేసె గజాస్యుఁ డుబ్బుచున్[16].

కరుణరసము

చ.

హరి నొకనాఁడునుం గొలువరా బహుబాధల నొంద నుక్తులై
తిరి నరులార దిక్కు గలదే భవదుత్కటశోకబాష్పముల్
పొరిఁ బొరి నేరులై మిగులఁ బొంగి సముద్రసమంబులయ్యెఁ దె
ప్పరముగ నంచు నారకులఁ బల్కెఁ గృతాంతుఁడు గన్కరంబునన్.

రౌద్రరసము

చ.

కుపితకపర్దిదుర్దమతఁ గూలుఁ బురత్రయ మొండెఁ గాక యీ
త్రిపురనిశాటరోషమునఁ దీఱుజగత్త్రితయంబు నొండె నా
విపులపరాక్రమం బొకని వీడ్కొన నేర్చునె నాఁగ భూరథం
బపుడు త్రినేత్రుఁ డెక్కె నిశితాస్త్రసువర్ణశరాసనాఢ్యుఁడై.

వీరరసము

ఉ.

స్రుక్కక చక్కనై నిలువు శూరుఁడ వైనను మార్కొనంగ నీ
వెక్కడఁ బోయెదంచుఁ గడు నేపున వృత్రుని బెట్టు దాఁకె ను

క్కెక్కిన వజ్రధారల నహీనమయూఖము లంతరిక్షమున్
దిక్కులు బిక్కటిల్లఁ నదితిప్రియపుత్రుఁ డుదగ్రలీలతోన్.

భయానకరసము

ఉ.

ఆలమునందు ఘోరదనుజావళిఁ గూల్చి నిజాస్యరేఖ నా
భీలత దోఁప వాలు జళిపించుచు హుంకృతు లుల్లసిల్లఁగా
శూలికిఁ దత్పరాక్రమముఁ జూపెడువేడుక నేగు నమ్మహా
కాళి విజృంభణంబుఁ గనఁ గాలునికైనను భీతివుట్టదే.

బీభత్సరసము

చ.

దురమున నందికేశ్వరుఁడు దుర్దముఁడై నుఱుపంగ రాక్షసో
త్కరవరగాత్రముల్ మెదిగి కాళ్ళును జేతులు నుత్తమాంగముల్
బరులును వీఁపులుం బిఱుఁదుఁ బ్రక్కలు రూపర స్రగ్గి రొంటె[17] మైఁ
బురపుర మ్రింగుచుం[18] గదురు భుగ్గున నామట నున్నవారికిన్.

అద్భుతరసము

చ.

చెలువుగఁ బచ్చిమంటఁ దగఁజేసి కుండను దేహ మందులో
జల మనలంబు నాయనలసంఘము మీఁదట నోలివాయు వి
[19]ట్టలముగ నొక్క బట్టబయలం బదిలంబుగ నిల్పి పెక్కురూ
పుల సృజియించె బ్రహ్మ తలపోయఁగఁ జిత్రచరిత్రుఁ డెయ్యెడన్.

శాంతరసము

ఉ.

మ్రొక్కిన వెక్కిరించినను మోదిన గందము దెచ్చి పూసినం
ద్రొక్కిన నెత్తుకొన్నఁ గృపలోఁ గుడిపించినఁ బస్తువెట్టిన
న్నిక్కును స్రుక్కులేక తరుణీజనులందును మ్రాఁకులందుఁ దా
నొక్కవిధంబ కా మెలఁగుచుండు మహాత్ములఁ జెప్ప నొప్పగున్.


క.

నవరసములయందును గా
రవమున శృంగారవీరరౌద్రాద్భుతముల్
భువి లోకోత్తరనాయకు,
నవిరళముగ నాశ్రయించు నది యె ట్లనినన్.


సీ.

రసము నాయకసమాశ్రయమునఁ బ్రావీణ్యుఁ డగునటు చేష్టలనైనఁ దత్క
థాకర్ణనంబున నైన సామాజికప్రకరానుభావ్యమై పరఁగుచుండుఁ
బరగతంబయ్యు సద్భావనచే రసోదయవిశేషము విరుద్ధంబు గాదు
మఱియుమాలత్యాదిమహిళాప్రసంగంబు వినుచు సభ్యులు[20] నిజవనితలందుఁ

దలఁపు నిలుప[21] రసాశ్రయత్వంబు గలుగు[22]
ననుకరణమాత్రమై యుండు నాశ్రయంబు
గాదు, భావకత్వాదులు గలిగెనేని
వాఁడు సామాజికులయట్టివాఁడ యపుడు.


క.

ప్రకటనటుఁ డరయ సామా
జకసముఁ డగునేని వానిచే ననుభావా
దిక మె ట్లొదవు ననిన వా
నికి నిది యభ్యాసజనితనిపుణత యయ్యెన్.


ఉ.

వాసన నొప్పుప్రేమ మిరువంకల లే కొకవంకఁ జెప్పిరే
నేసతియైనఁ బల్వురకు నిచ్చయొనర్చుటఁ జెప్పిరేని త
ద్భాసురలీల మ్లేచ్ఛమృగపక్షిగతంబుగఁ జెప్పిరే రసా
భాసముగా నెఱుంగుదురు భావకు లీత్రివిధప్రయోగమున్.


వ.

అందును—


క.

అరయ సంజ్ఞాప్రకరణ
మీరీతిఁ దనర్చి వెలయు నిట రత్యాది
స్ఫారప్రకరణమును శృం
గారప్రకరణము నాయకప్రకరణమున్.


క.

నవరసనాథశ్రీనిధి
నవఖండమహీతలంబునకు నొడయఁ డొగిన్
నవనలినాసనజనకుఁడు
నవనిధిసదృశుండు సజ్జనవ్రజమునకున్.

గద్యము
ఇది శ్రీవాణీవరప్రసాదలబ్ధవాగ్విభవ తిక్కనామాత్యసంభవ సుకవిజన
విధేయ అనంతనామధేయ ప్రణీతం బైన రసాలంకారంబునందు[23]
నవరసస్థాయిభావంబులును సజాతీయవిజాతీయంబులును
విభావానుభావసాత్త్వికభావసంచారికాభావంబులును
రసజన్మరసవిరోధాదులును సంజ్ఞాప్రకర
ణంబు నన్నది ప్రథమాశ్వాసము.

  1. ఇందలి పాఠభేదములు చెన్నపురి దొరతనమువారి లిఖితపుస్తకభాండాగారప్రతినుండి గ్రహింపఁబడినవి.
  2. కృత్యాదిపద్యములు లభింపలేదు.
  3. దేల్తున్
  4. లెచటికైనన్
  5. త్తీరనగరంబులున్
  6. యడపకుండ
  7. విస్తృతి
  8. ఇరవగు
  9. కెల్లనిట్లు
  10. మనోగతులుం
  11. రౌద్రమునఁ బ్రఖ్యాతకరుణ
  12. లక్షణములు
  13. భర్త
  14. ఱేఁడు
  15. నాఁడినభంగి
  16. డుబ్బుగన్
  17. రొంటిమై
  18. బొంగుచున్
  19. ట్టలముగ నొక్క బయిటం బదిలంబు నిల్పియు వాని పెక్కురూ
  20. సభ్యుల
  21. నిలుపు
  22. గలదు
  23. రసాభరణ మని వాడుకలోను గ్రంథాదిని గలదు.