రసాభరణము/భూమిక

వికీసోర్స్ నుండి

ఓమ్

భూమిక

1

తిక్కన కొమరుఁ డగు ననంతామాత్యుఁ డీ రసాభరణమును రచించెనని యిందుఁ గల గద్యమునఁ గలదు. ఈ గ్రంథమునకుఁ దుదఁ గల “జానొందన్ శకవర్షముల్" అను పద్యమును బట్టి లెక్కించుచో నితఁడు రసాభరణమును క్రీ. శ. 1435 జనవరిలో దేవాంకిత మొనర్చినటుల నిర్ధారింపనగును. ఈవిషయమును బట్టి యీతనికాలమును నెల్లరును నిర్ణయించుకొనఁగలరు.

ఇతని తండ్రి తిక్కన భారతమును జెప్పిన కొట్టరువు తిక్కయజ్వ కాఁడు. ఈసంగతి నీతఁడు రచించిన భోజరాజీయమునఁ దనకు ముత్తాత యైన బయ్యనమంత్రిని వర్ణించిన పద్యము వలన స్పష్టపడును. ఆపద్య మిది: —

క్షితిఁ గ్రతుకర్తృతామహిమఁ జేకొని పంచమవేదమైన భా
రతముఁ దెనుంగుబాస నభిరామముగా రచియించి నట్టి యు
న్నతచరితుండు తిక్కనకవినాయకుఁ డాదట మెచ్చ భవ్యభా
రతి యనఁ బేరుఁ గన్న కవిరత్నము బయ్యనమంత్రి యల్పుఁడే.

ఈ గ్రంథకర్త కౌండిన్యగోత్రుఁడు. ఇతని ముత్తాత కవిబ్రహ్మ యగు తిక్కన వలన భవ్యభారతి యనిపించుకొనియెను. ఈ బయ్యనకుఁ బినతండ్రి యగు త్రిపురాంతకుని కుమారులలో నొకఁడగు తిక్కన "ప్రశస్తసాహిత్యుఁడ”ని భోజరాజీయముననే తెలుపఁబడినది. తన యన్నదమ్ములను గూర్చి తెలుపు నీ పద్యమునఁ దన తమ్ముఁడు చిట్టనసత్కవి యని తెలిపినాఁడు గ్రంథకర్త.

భూనుతకీర్తి ముమ్మడివిభుండు మదగ్రజుఁ డేను వైష్ణవ
ధ్యానసమాహితాత్ముఁడ ననంతసమాఖ్యుఁడ నాదు తమ్ము ల
జ్ఞానవిదూరు లక్కనయు, సత్కవి చిట్టనయున్, వివేకవి
ద్యానిధి రామచంద్రుఁడు, నుదారుఁడు లక్ష్మణ నామధేయుఁడున్.

వీనిని బట్టి చూడఁగా వీరి వంశము కవితావంశ మనఁ దగి యున్నది. ఇట్టివంశమున జనించినవాఁ డగుటనే యితఁడు పద్యరచనకుఁ బ్రథమసోపాన మగు నొక ఛందోగ్రంథమును, గవితకుఁ బ్రాణ మనఁ దగు రసము స్వరూపమును వెల్లడించుటకై రసాభరణమును గూడ రచించినాఁడు.

ఇతఁడు తా నాఱువేలనియోగి బ్రాహ్మణవంశమువాఁడ నని సగర్వముగా నీ క్రిందివిధమునఁ జెప్పికొనినాఁడు.

“ఈ యార్వురు నొక్కొక్కఁడు, వేయిండ్లకు మొదలుగాఁగ వెలయుదురని కాదే యాఱువేలపే రిడి, రీ యన్వయమునకు నేష్య మెఱిఁగిన పెద్దల్”


ఇతఁడు కృష్ణాతీరమువాఁడు. తండ్రి "శ్రీకాకుళంబున కొడయఁడైన యంధ్రవల్లభ హరిసేవనలరుచుండు"వాఁ డని వర్ణింపఁబడినది. రసాభరణము ధ్రువపురీశున కంకితము చేయఁబడిన దని కవి తెల్పుచున్నాఁడు. ఈధ్రువపురి ప్రస్తుతము గుంటూరుమండలమునఁ గృష్ణాతీరప్రాంతమునఁ గల ధూళిపూడి యను గ్రామమా యని యూహ పొడముచున్నది.

భారతకవియగు తిక్కయజ్వకు శిష్యుఁడును దిక్కనయనువాని పుత్రుఁడు నగు మారనయు నితనివంశ్యుఁ డేమో యని సందేహము పొడముట కవకాశము గన్పట్టుచున్నది. తిక్కయజ్వచే భవ్యభారతి యను బిరుదము నందిన బయ్యనమంత్రికిఁ బినతండ్రియగు త్రిపురాంతకుని యారుగురు కొమరులలోఁ జివరవాఁడు ప్రశస్తసాహిత్యుఁడు తిక్కన కలఁడు. వానికి సమకాలికుఁడే తిక్కయజ్వ. ఆతిక్కన కుమారుఁడు విద్యాభ్యాసము చేయువాఁడై కవితాసామ్రాజ్యపట్టభద్రుఁడైన తిక్కనను శుశ్రూషఁ జేసినాఁడన నూహకు లోపముండదు. కాని, యిందలి యథార్థమును బెద్దలు నిర్ణయింతురుగాత మని యీప్రస్తుతముగాని విచారణ నింతతో వదలుచున్నాను.

ఇప్పటికిఁ గవిని గూర్చి మనకుఁ దెలిసిన చరిత్రాంశములు:- ఇతఁడు కౌండిన్యగోత్రుఁడగు నియోగి; కృష్ణాతీరవాసి; విద్వత్కవివంశమువాఁడు; భోజరాజీయ మను ప్రబంధమును, ఛందోదర్పణ మను లక్షణగ్రంథమును, రసాభరణ మను కావ్యలక్షణగ్రంథమును జెప్పినాఁడు; క్రీ. శ. 1435 ప్రాంతమున నున్నవాఁడు.

2

తెనుఁగు బాసను గావ్యము లక్షణము లాదిగాఁ గల వానిని విచారించు సాహిత్యశాస్త్రము లతిస్వల్పముగా నున్నవి. ఇప్పటికి వెల్లడి యైనవానిలో రసాభరణమే ప్రాచీన మనఁదగి యున్నది. ఈ కవి తన భోజరాజీయ మునఁ “గావ్యంయశసే౽ర్థ కృతే వ్యవహారవిదేశివేతరక్షతయే సద్యఃపరనిర్వృతయే కాంతాసమ్మితతయోపదేశయుజే" యను మమ్మటాచార్యుఁడు నుడివిన కావ్యప్రయోజనమునే,

“సకల విద్యలయందుఁ జర్చింపఁ గవిత యుత్కృష్టమండ్రది నిత్యకీర్తికొఱకు, నర్థాప్తికొఱకు, నా వ్యవహారలక్షణం బెఱింగెడుకొఱకు, ననేకవిధములగు నమంగళముల హరియించుకొఱకు, నుచితనిత్యసౌఖ్యసంసిద్ధికొఱకు, నొనరఁ గాంతాసమ్మితోపదేశమ్మునఁ బ్రీతిమై హిత మాచరించుకొఱకు, నయ్యెఁ గాన.........

అని నుడివినాఁడు. సాహిత్యశాస్త్రగ్రంథములను బరిశీలింపఁ గావ్యమున కాత్మ రసమని మొదట నొడిచినవాఁడు క్రీ.శ. 13-5 ప్రాంతమున భారతభూమి నలంకరించిన సాహిత్యదర్పణకారుఁ డైన విశ్వనాథకవిరాజే. వారిమతమున కనువుగ రసాభరణమును దెనుఁగున వ్రాసిన యనంతామాత్యుఁడు విశ్వనాథుని దర్పణమును మమ్మటుని కావ్యప్రకాశమును గూడ మేలవించి యెం దే విషయము ప్రశస్తమైనదో దాని నెల్ల గ్రహించినాఁ డనవచ్చును.

ఇంతియ కాదు. ఇంకొక యూహము పొడము వచ్చును. ఇతఁడు కేవలము రసమును గూర్చియే యీ గ్రంథమును వ్రాయుట వలనను, దక్కిన గుణ, దోష, ధ్వన్యలంకారాదులను వివరింపకపోవుటచేతను దృశ్యకావ్యప్రశంసయే మనమునం దిడికొనినాఁ డేమో యనవచ్చును. రసము నాట్యమునకు ముఖ్యముగా సంబంధించినది గాని శ్రవ్యకావ్యములకు ముఖ్యము కా దని పలువుర పూర్వాలంకారికుల మత మనునది యే యీకవికిని నచ్చినదేమో. కావ్యకౌతుకమునఁ ‘బ్రయోగత్వ మనాపన్నే కావ్యే నాస్వాద సంభవః' అని యున్నదని యభినవగుప్తుఁడు చెప్పి “కావ్యం తావ న్ముఖ్యతో దశరూపాత్మక మేవ ... నాట్యే ఏవ రసాః నలోకే। కావ్యం చ నాట్యమేవ।” యని తన యభిప్రాయమును నుడివి “నానాభావాభి వ్యంజితాన్ వాగఙ్గసత్వోపేతాన్ స్థాయిభావా నాస్వాదయన్తి సుమనస్యప్రేక్షకాః హర్షాదీంశ్చాధిగచ్ఛన్తి, తస్మాన్నాట్యరసా ఇత్యభివ్యాఖ్యాస్యామః" యను భరతాచార్యుని వాక్యమును బ్రమాణీకరించెను. ఈభరతవాక్యమే యనంతామాత్యునకుఁ బ్రమాణమై యీగ్రంథమును రచించుటకుఁ బురికొల్పిన దేమో. ఈ యూహ కాదనుట కొకసందేహము కలుగవచ్చును:———ఇతఁడు నాట్యరసములు నెనిమిదింటినే తెలుపక శాంతమును గూడ తెలిపినాఁడు గదా యని. ఈ విషయమున నాట్యాచార్యుఁడు పూర్వుల మతమును స్వమతానుకూలమనియే “ఏవం నవరసా దృష్టా నాట్యాజ్ఞైర్లక్షణాన్వితాః"అని పేర్కొనెను గావున శాంతముతో నాట్యరసములు తొమ్మిదియని యనంతుని మతమునై యుండునన విప్రతిపత్తి యేమియుఁ గన్పింపదు. ఇతఁడు భరతమును మనమున నిడికొని స్వగ్రంథమును వ్రాసెనా యనుప్రశ్న ముత్పన్నమగుట కేయవకాశము లేదు; కాని, రసాధిదేవతలను బేర్కొనునపుడు బ్రహ్మ యద్భుతరసమున కధిదైవ మని 'అద్భుతో బ్రహ్మదైవతః' అను భరతు వాక్యమునే గ్రహించెను గాని “అద్భుతో విస్మయస్థాయిభావో గంధర్వదైవతః" అను దర్పణకారాది వాక్యములను గ్రహింపమిచే నితఁడు భరతాచార్యు ననుసరించె ననవచ్చును. ఈ యూహను ద్రోసిపుచ్చుయుక్తి తెనుఁగున రూపకములు లేమియే యనవచ్చును. కాని, యిచట మా మనవి యొకటి కలదు. సంసృతము నందు వలెఁ దెనుఁగున లక్ష్యములనుగాఁ జూపుటకు దశరూపకములు, నుపరూపకములును బ్రస్తుత మలభ్యము లనుట నిజమే. ఐనను యక్షగానాదులను బరికించినచో రూపకోపరూపకము లొక కొన్ని మన తెనుంగు బాసను గూడఁ గల వని నిర్ధారింపనగును. ఆదృశ్యములను బండితులైన కవులు వ్రాసిరా యనఁగూడదు. నారికేళపాకమున నజచరిత్రమును వ్రాసి రాజాస్థానములఁ బండితులతో వ్యాకరణాది శాస్త్రముల శాస్త్రార్థము లొనర్చి పెక్కుజయములు గొన్న మతుకుమల్లి నృసింహవిద్వత్కవి సుమారు వందయేండ్లలోగా నివసించినవాఁడు శ్రీకృష్ణజలక్రీడ లను నొక నాటకము నతిమృదుశైలిని రచించినాఁడు. కావున రూపకముల ధోరణుల కనువగు మార్గమున రసస్వరూపము నితఁడు తెలిపి యుండవచ్చును.

ఇఁక నొక్క యూహ. అనాది నుండియు నాట్యశాస్త్రము వేఱుగాను, శ్రవ్యకావ్యములకు సంబంధించి యలంకారశాస్త్ర మని వాడఁబడు సాహిత్యశాస్త్రము వేఱుగాను దర్పణకారుని వఱకుఁ బరిగణింపఁబడినయవి. రూపకములకుఁ బ్రధానమైనది రస మనియు, శ్రవ్యములకుఁ ప్రధానమైనది ధ్వని యనియుఁ బలువురు చెప్పిరి. ఆధ్వనియందు భేద మగు నసంలక్ష్యక్రమ మనుదానియందు రసాదులు పేర్కొనఁబడినవి. అందుచేతనే కావ్యప్రకాశము ధ్వన్యాలోకము మున్నగు గ్రంథములయందు రూపకప్రకరణమే లేదు. రూపకములను దెలుపుటకు దశరూపకాది గ్రంథములును, నాయికాది భేదములను దెలుపుటకు రసమంజరి ప్రభృతి గ్రంథములును వెలువడినవి. దర్పణకారుఁడు రసాత్మకమగు వాక్యము కావ్య మని తెలిపి రూపకములను గూర్చిన విషయమును గూడఁ దన గ్రంథమున వ్రాసినాఁడు. నాఁటి నుండియుఁ గూడ గంగానందాదులు రసమును గూర్చియే ప్రత్యేకగ్రంథములను వ్రాసినారు. మఱియు శారదాతనయాదులు భావప్రకాశాదులను గేవల రసవిషయబోధకములను నిర్మించిరి. కనుక మన సాహిత్యశాస్త్రమున నాట్యమును గూర్చియు, నాయికాదులను గూర్చియు శ్రావ్యకావ్యములను గూర్చియు, రసభావాదులను గూర్చియుఁ బ్రత్యేకగ్రంథములు పెక్కులు వెలువడినవి. ఈ సమస్తవిషయసంగ్రహమును గలవియు దర్పణ, ప్రతాపరుద్రయశోభూషణాదులు, బయలువెడలినవి. అట్టులనే తెనుఁగునఁ గూడఁ కేవల రసమును గూర్చి యీ రసాభరణము వెలువడి యుండనగు.

ఈ పైవిషయ మప్రస్తుత మని పలువురకుఁ దోఁపవచ్చును, ఒక దృష్టిని నిది ప్రస్తుతమే యని నా మనవి ఇట్టి గ్రంథము లనేకములు తెనుఁగున నొకప్పుడుండి కాలవశమున మన కప్రాప్తములై మరల నన్వేషణమున లభ్యములు కావచ్చు ననియు నీదృష్టితో వెదకుట యత్యవసర మనియు సహృదయులకుఁ దెలుపుటకే యింత వ్రాసితిమి.

3

ఈ గ్రంథము స్వతంత్ర మైనదో లేక యేసంస్కృతగ్రంథమునకైనఁ బరివర్తనమో తెలియదు. మాతృక కన్పించువఱకు స్వతంత్రగ్రంథమే యిది యని యనుకొనవలెను.

దీనికి 'రసాలంకార'మను నొక పర్యాయనామము కూడఁ గలదని ప్రథమాశ్వాసాంతగద్యమునఁ దెలియఁగలదు. ఆయాయి వ్యాఖ్యలందుఁ బేర్కొనఁబడు రసాలంకార మను సంసృతగ్రంథమున కిది తెనుఁగు సేఁత యేమో యని భ్రమను గొలుపుచున్నది. ఉదాహరణముగా నీవిషయమును దెలుపుచున్నాను. హరవిలాసము శ్రీనాథుని స్వతంత్రగ్రంథమని గదా లోక మనుకొనుచున్నది. హేమచంద్ర కృత కావ్యానుశాసన వ్యాఖ్యానమున 'సుజనదుర్జనస్వరూపం యథాహరవిలాసే' అని కన్పించుచున్నది. ఆవ్యాఖ్యానోదాహృత మగు హరవిలాసము మృగ్యమగుటచే నిపుడు మన మే మనుటకు నవకాశము లేదు. కనుక స్పష్టనిదర్శనము కన్పించువఱకు నీ రసాభరణమును స్వతంత్రగ్రంథమే యనవలయును.

4

రసాభరణమునఁ బ్రథమాశ్వాసమున స్థాయిభావములకు లక్ష్యలక్షణములను, విభా వానుభావ సాత్త్విక భావలక్షణములను శృంగారాది నవరసములకు నుదాహరణముల నొసంగి కవి రసము సామాజికానుభావ్య మని నిర్ధారించెను.

రెండవ యాశ్వాసమున నాలంబనోద్దీపన విభావములకు లక్షణమును దెలిపి, భావహావాదులగు శృంగారచేష్ట లుద్దీపనాంతర్గతము లని లక్ష్య లక్షణములతో వాని నొడివి, యుద్దీపనాలంకృతులను నుద్దీపనస్థలంబులఁ బేర్కొని యనుభావమును దెలిపి, యష్టవిధసాత్త్వికభావములకు, ముప్పది మూఁడు సంచారిభావములకు సోదాహరణముగా లక్షణములను జెప్పెను. ఇందు సంచార్యాది భావలక్షణముల నొండురెండు చోటుల మతభేదము కన్పించును గాని యది పాటింపఁదగినది కాదు. ఈకరణమున నేర్చుకొనఁదగిన విషయ మొకటి కలదు. సంస్కృతమున నాలంకారికులు పలువురు తెలుపని శృంగార, భక్తి, వాత్సల్యములకు నైకకంఠ్య మును గవి సాధించినాఁడు.---

"రతి దా నాయకనాయికాదిపరతన్ రంజిల్లు శృంగారమై
క్షితిలో దేవగురుద్విజాదిపరతం జెన్నొందు సద్భక్తియై
సుతమిత్రాశ్రిత సోదరాది పరతన్ సాంపారు వాత్సల్యమై”

తృతీయాశ్వాసమున సంభోగ విప్రలంభ శృంగారములను జూపి యాలంకారికులు సంసృతమున సాధారణముగాఁ బేర్కొనని, నాట్యవేదమున మాత్రమే తెలుపఁబడిన, పంచవిధ మగు వాగ్విలసన, నైపధ్యాంగక్రియా, సంకీర్ణ, మిశ్ర, శృంగారమును గూడ విస్పష్టముగాఁ గవి దెలిపినాఁడు; పిదప భావోదయాదులను రససాంకర్యములను దెలిపెను. నాల్గవ యాశ్వాసమున నాయికానాయకులఁ గూర్చి దిఙ్మాత్రముగా వ్రాసినాఁడు.

5

స్థాలీపులాకన్యాయమునఁ బార భేదముల నొకింతఁ జూపుదును. రసాభరణము రెండవపుటలో నుత్సాహలక్షణముఁ దెలుపునపుడు “లోకోత్తరకృత్యంబులు గైకొని యవి యెడఁ కుండ”నను పాఠము నాదరించి "యవి యడఁపకుండ”ననుపాఠమును సూచించినారు ప్రకాశకులు. రెండుపాఠములకు సామాన్యతాత్పర్యమున భేద మంతగాఁ బొడకట్టకపోయినను సూక్ష్మముగ నాలోచించినచో భేదము విస్తారముగా నున్న దని 'కార్యారంభేషు సంరంభః స్థేయా నుత్సాహ ఉచ్యతే" మొదలుగాఁ గల వాక్యములను జూచినపుడు తోఁపకపోదు. మఱియు మూఁడవపుటలో విస్మయలక్షణమునఁ 'జేతోవిస్మృతి విస్మయ..." అను పాఠమునే ప్రకాశకు లేల యంగీకరించిరో తెలియదు. "విస్మయశ్చిత్తవిస్తారః పూర్వాదృష్ట విలోకనాత్" మొదలగు నాలంకారికవాక్యములను జూచినచో “విస్తృతి" యనుపాఠమే సరియగు నర్థబోధమునకుఁ దోఁడగు ననియు 'విస్మృతి' యనర్థబోధక మనియుఁ దెలియకపోదు. నాల్గవపుటలో, “నీసమూహంబు రసముల కెల్ల నిట్లు" అనియే యుండ నగును గాని యాదృతమైన పాఠ మనర్థబోధక మని తెలియనగు. పదునొకండవపుటలోఁ జకితలక్షణమును జెప్పు పద్యమునఁ "జూపులు చలింపఁగాఁ గడు" ననుపాఠమునే సహృదయులు గ్రహింపనగు. పందొమ్మిదవపుటలో వ్యాధి కుదాహరణమైన పద్యమునఁ “దరుణి హరి బాళి" యను పాఠమే సొగసైనది. బాళి యనఁగాఁ గాంక్ష. ఇరువదిరెండవపుటలో మొదటిపద్యమునఁ “దగు నాతని కీకపటప్రయోగముల్ " అనుదాన వ్యంజిత మగు నర్థమే యాదృతపాఠము నర్థము కంటె బాగుగనున్నదని సహృదయులు తెలియకపోరు.

ఈ గ్రంథప్రకాశకులు తా మొసఁగిన పాఠములు చెన్నపురి దొరతనమువారి లిఖతపుస్తకభాండాగారప్రతినుండి గ్రహింపఁబడిన వని తెలుపుచున్నారు. అట్టి పాఠములను గ్రహించుట యవసరమే కాని యపపాఠములను బద్యమున నచ్చొత్తించి సరియగు పాఠములను క్రింద గుర్తించుటకై వదలుట న్యాయముగా లేదని నా తలంపు. బీభత్సరసోదాహరణ పద్యమునఁ బ్రకాశకు లాదరించిన పాఠమున కెట్లర్థము చెప్పవలయునో నాకు బోధపడుటలేదు. క్రింద వా రుదాహరించిన పాఠభేదము నంగీకరించిన నేరైనఁ బద్యమర్ధము కాలే దనఁగలరా యని నాకు సందేహము. బహుపాఠముల నిచ్చుట యవసరమే, కాని గ్రంథమున నాదరణీయపాఠము నచ్చొత్తించుటయు నవసరమే యని నా విన్నపము.

ఇంక నొక్కమాట. ఇందును లేఖకప్రమాదములు నచ్చుతప్పులును సంభవించియున్నవి. చూ. “బొదవిననీలవేణియునుబున్నమచందురు నాదరించు నవ్వదనము” ఇత్యాదులు.

రసాభరణమునఁ గైతను గూర్చి విస్తారము చెప్పఁదగిన దేదియు లేదు. పద్యములు శ్రుతిమాత్రతో౽ర్థబోధకములగు శబ్దముల కూర్పును గలిగి ప్రసాదగుణవిలసితములై యలరారుచున్నవి. ఇట్టి గ్రంథముల ప్రయోజన మనల్పముగా నిప్పుడు మనభాషకుఁ గలదు. దీనిని బైకిఁ దెచ్చినందులకుఁ బ్రకాశకులు సర్వవిధముల గేయులు. మఱియు నిట్టిగ్రంథములను లోకమునకు నాంధ్రసాహిత్యపారిషదులు ప్రసాదింతు రని నమ్ముచున్నాను. ఇచ్చటికే భూమిక మితిని మీఱినది. ఇతో౽ధిక మనపేక్షణీయము. సెలవు.

కాకినాడ

విద్వాన్ కోపల్లె శివకామేశ్వరరావు

23-2-1931

F.A.R.U. & P.O.L.

రసాభరణము.

ఈ గ్రంథము పరిషత్తునకుఁ జాలకాలముక్రిందటనే కాకినాడ సమీపమునం దున్న కుయ్యేరు గ్రామనివాసులు బ్ర॥ హరిసోమయాజుల సుబ్బరావుగారు పంపినది. క్రోధన సం॥ ఆషాఢ బ 8 శుక్రవారమున శృంగారకవి వెంకయ్యగారు వ్రాసినది. పరిషత్పుస్తకభాండాగారములో సంఖ్య 1781 గలదిగా నున్నది. తాళపత్రపతి. దీనిని, చెన్నపురిలో దొరతనమువారి పుస్తకభాండాగారములోని రెండుప్రతులతో సరిచూపించితిమి. ఆరెంటిలో నొకటి కాగితప్రతి. రెండవది తాళపత్రపతి. అందు నిందును గూడ గృత్యాదిని బద్యములు లేవు. కవి యట్లే ప్రారంభించెనా యనఁజాలము. కొన్ని సందేహములును లేఖక ప్రమాదములును నెందును దీఱలేదు. ఒక విధముగా నీ ప్రతిని లోకములో విడిచినారము. ఎవ్వరియొద్ద నైనఁ బూర్ణగ్రంథ మున్న వారు తప్పులు సవరణలుఁ దెలిపినచో ద్వితీయముద్రణ మింతకంటెఁ బరిశుభ్రముగాఁ జేయింపఁదలఁచుచున్నారము. సంపూర్ణప్రతి నిర్దుష్టమైనది ముందు దొరకునను నూహలో నిపుడు స్వల్పప్రతులే ముద్రింపించినారము.

ఈపుస్తకమునకు భూమిక వ్రాసియిచ్చి మాకు సాయపడిన విద్వాన్ కోపల్లె శివకామేశ్వరరావుగారియెడల మేమెంతయుఁ గృతజ్ఞులము.

ఆం. సా. ప.

పుట:రసాభరణము.pdf/11 పుట:రసాభరణము.pdf/12 పుట:రసాభరణము.pdf/13