Jump to content

రంగారాయచరిత్రము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీ హయగ్రీవాయనమః

————

రంగారాయచరిత్రము

ద్వితీయాశ్వాసము

————

క.

శ్రీజానకీంద్రచరణాం
భోజాతాయత్తచిత్రపుష్పంధయఘో
రాజిస్థలీజితాహిత
రాజన్యచమూనికాయరామారాయా.

1


వ.

అవధరింపు మనంతరకథావిధానం బెట్లు జరిగె నని యని
మిషేశ్వరుండు దివిజకర్మంది నడుగుటయు నతం డతని కి
ట్లనియె.

2


చ.

గజఫరజంగుదర్శనవికాసితచారుముఖారవిందుఁ డై
నిజపరివారవారపరిణీతమహాకుతుకంబుతో ధరా
భుజతిలకంబు సొం పెసఁగెఁ బుంఖితనైజమయూఖమంజుల
వ్రజపరివేష్టనాధిగతవర్ణ్యరుచిస్ఫురదర్కవైఖరిన్.

3


సీ.

ఒకవంక నాప్తరాజకుమారసంతతుల్
       సరససల్లాపముల్ సలుపుచుండ
నొకవంక రాజకార్యకళావిశారదు
       లగు ప్రధానులు రహస్యములు దెలుప

నొకవంకఁ గోవిదప్రకరముల్ నిరతంబు
       ఘనతర్కశాస్త్రంబు లనువదింప
నొకవంక నిపుణవైణికవాంశికనికాయ
       గాయకు ల్గానసంగతులు సలుప


తే.

నోలగం బుండి తనలోన నూహఁ జేసి
యతిభయావహయవనసభాంతరస్థ
జనమనోహరభూరివచఃప్రసంగ
శీలు నొక్కవకీలు వీక్షించికొనుచు.

4


క.

యావనసభాంతరంబుల
నీవు బహుప్రౌఢి మెలఁగ నేర్పరివి వచః
ప్రావీణ్యశాలి వని సం
భావింపుచు రాజకార్యఫణితిం బలికెన్.

5


చ.

యవనజనావతంస మగు హైదరుజంగుకచేరిఁ జేరి నీ
వివిధవచోవిచక్షణత వేడుకఁ గొల్పఁ గళింగసీమతోఁ
దవిలిన రాచకార్యము యథావిధిగాఁ బయికంబుతో నిఖా
వివరణఁ జేసి మాకు సెల విం డని తెల్పుడుఁ జేసి వెండియున్.

6


శా.

ముం దెల్లప్పటికిం గళింగమునకున్ మోతాదు గాఁగన్ జమా
బందీద్వాదశలక్షరూపికల కేర్పా టున్న దాచొప్పు పెం
పందన్ సా మిపు డిచ్చి పుచ్చెదము పర్యాయంబునన్ సాము మీ
కుం దోడ్తోడన మీరు లేచి తిరుగా గోదావరిం దాఁటినన్.

7


క.

అని రాజియసంగతు
లనువుపడం దేటపఱచి హైదరుజంగుం

గని పునరుత్తరములు వేఁ
గొనిరమ్మన రాయభారి గొబ్బునఁ జనియెన్.

8


మ.

చని యారాజశిఖావతంసము సమంచత్ప్రీతిఁ దన్ బంపు ని
ప్పనితీరు ల్సరకారుతోఁ గలజమాబందీవిచారంపుజొ
ప్పును దన్నిష్కృతియున్ దదర్థనియమంబుల్ సమ్మదస్ఫూర్తి నొ
య్యన నాహైదరుజంగుసాహెబున కాద్యంతంబునుం దెల్పినన్.

9


ఉ.

 హైదరుజంగుసాహెబు రయమ్మున ని ట్లనియెన్ వకీలుతో
నాదర మొప్పఁ బైకమున కైనవిచారము లేటికమ్మ దీ
నాదరగామొలాజుమతు నామది రంజిలుఁ దద్రిరంస నే
కా దనరా దవశ్యము శ్రికాకుళ మానఁగ వత్తు మిత్తఱిన్.

10


తే.

ఇవ్విధంబున నానతీ నవ్వకీలు
రాలు మలిపిన ప్రతిమను బోలి మరలి
రాచబిడ్డకు విన్నపం బాచరించెఁ
బెనచి హైదరుజంగు పల్కినతెఱంగు.

11


శా.

ఆవార్త ల్విని రామరాజవసుధాధ్యక్షుండు కౌటిల్యచే
ష్టావెదగ్ధ్యము మానసాబ్జమునఁ దొట్టన్ సాహేబుం గొంచు తా
నావిర్భూతమనోవికారగతిఁ బర్యాయంబునం బుట్టు శో
భావృత్తుల్ గనలేక బొబ్బిలిగడీపై డించు దుశ్చేష్టతోన్.

12


శా.

మీతోఁ గొంతప్రసంగసంగతికి నెమ్మిన్ ముచ్చట ల్సేయఁగా
జేతఃప్రీతి జనించి యున్నయది మీచిత్తంబునం దెట్లయ
ట్లే తేజంబున నందు నన్నియును సందేహంబు లే దిందు నేఁ
బ్రాతఃకాలమునందె వచ్చి తమతో భాషించెదన్ సర్వమున్.

13

చ.

అని పునరుత్తరంబులు దదాత్మకు హర్ష మెలర్ప దూత నో
క్కనిఘను నంచి యంచితవికాసమున న్నిదురించి లేచి ప్రొ
ద్దునఁ జని యాప్తవర్గములతోఁ బొడగాంచి యథేష్టగోష్ఠీవ
ర్తనలఁ దురుష్కనేతకు ముదంబొదవం దగురీతి నుండుచున్.

14


వ.

తనయంతరంగంబునఁ బొడమిన యన్యాయసూచకాసూ
యావిశేషంబునకు నశేషంబునకు ననుకూలంబుగా నస
హ్యజనకంబు లగు నుత్తరంబు లయ్యవనపుంగవునకుం గ
ఱపువాఁడై ప్రసంగవశంబున.

15


ఉ.

భూరితరాభిరమ్యరుచిఁ బొల్పగు మాసరకారులో జమీ
దారులు వెల్మవారు భుజదర్పసమాహృతవైరివీరభూ
విూరమణీమనోరమణమేదురరాజ్యరమాంగనామణీ
వారపరిష్క్రియు ల్గల రవార్యులు బొబ్బిలిపట్టణంబునన్.

16


సీ.

 పాండవేయులభుజాపాండిత్యసామగ్రి
       కార్తికేయుని పరాక్రమసమిష్టి
గంగాతనూభవురంగత్ప్రతాపంబు
       హరుని దోశ్శౌర్యమాహాత్మ్యకలన
విక్రమార్కుని భూరివిక్రమప్రక్రియ
       సంకర్షణుని మహాసాహసంబు
కార్తవీర్యార్జునుకలితబాహాశక్తి
       పరశురాముని యుగ్రపౌరుషంబు


తే.

ప్రమదమున సంగ్రహించి శూరప్రపంచ
కల్పనాకల్పచాతురి గానుపింప
నంచితప్రౌఢిమమున నిర్మించఁబోలు
సలిలభవసూతి బొబ్బిలివెలమదొరల.

17

తే.

 ఉగ్రనరసింహమూర్తులై యొప్పువారి
సాహసమ్మున కన్యరాజన్యసమితి
రహి వహింపక యున్నె హిరణ్యకసిపు
లీల లిఁక నేల దచ్ఛౌర్యశీల మరయ.

18


తే.

 అంబరమణిప్రభావవిడంబనంబు
ఘనతరోజ్జృంభితప్రభాకరనిరూఢి
వెలయఁ జూపట్టువా రౌట వెలమవారు
పద్మనాయకు లౌట స్వాభావికంబు.

19


శా.

గారా మొప్పఁగ దాదు లుజ్జ్వలరసాంకప్రౌఢి దోశ్శౌర్యపుం
బీరం బాతని కుగ్గుతోఁ బెనచి త్రావింపంగ బోల్పిన్ననాఁ
డారూఢి న్సహజప్రతాపనిధు లాహా వెల్మవా రందు రం
గారాయప్రభుసాహసం బెసఁగు బంగారంపునెత్తావియై.

20


ఉ.

 భండనభీముఁ డార్యజనబంధుసముద్రుఁడు భాగ్యవైభవా
ఖండలతుల్యుఁ డర్థిజనకల్పమహీజము భూపలోకమా
ర్తాండుఁడు వైరివీరభటదర్పవిదారణబాహువిక్రమో
ద్దండుఁడు రావురంగవసుధావరుఁ డాతని నెన్న శక్యమే.

21


తే.

 అతనిఁ గొల్చిన కమ్మక ట్టైనబలము
బలమురాంతకగాంగేయపాండవేయ
కార్తికేయరఘూద్వహకార్తవీర్య
జామదగ్న్యాదికాంశాభిజాత్యసరణి.

22


మ.

 అకలంకస్థిరధైర్యనిర్మథితమంథాహార్యుఁ డైనట్టి రా
వుకులాగ్రేసరు సన్నిధానమునఁ జెల్వుం జూప నొక్కొక్కసే
వకుఁడే చాలును ఖాన్మహాలఫవుఁజు ల్వంచించితే ఘోటక

ప్రకటాటోపముు వీటిఁ బుచ్చుటకు దృప్యద్దోర్విలాపంబునన్.

23


సీ.

కరుగునఁ బోసెనో ఘనభుజాపాండిత్య
       భావంబు సవరించి యావిరించి
గనిగాఁగఁ దేలెనో గాఢవిక్రమకళా
       కౌశలప్రౌఢి యొక్కంటఁ గూడి
మొలక లెత్తెనొ రసాతలవలత్ఫణివాంత
       విషవహ్నికీల లుర్వికిని వెడలి
పద్మనాయకులరూపములఁ గైకొనియెనొ
       నారాయణుని సహస్రారధార


తే.

దారుణాటోపదీపితౌధ్ధత్యు లగుచు
బొబ్బిలిపురస్థలమ్మునఁ బుట్టుఁ గన్న
వెలమకొమరులవడి యెన్న నలవి యగునె
నలువకైనను వేనోళ్లచిలువకైన.

24


శా.

రంగారాయనృపాలసోదరుఁడు ధైర్యస్థైర్యమంథాద్రియౌ
వెంగల్రాయఁడు బారుటీటెఁ గొని దోర్వీర్యంబునం దూగినన్
గంగానందనుఁ డైన భీముఁ డయినన్ గాండీవి యైన న్వడిన్
భంగం బొందరె ఘోరవీరరణభూభాగంబులన్ వ్రేగుగన్.

25


సీ.

చెలికాని వెంకయ్య యలఘుదోర్వీర్యంబు
       ధనదుని చెలికాని దాఁటనోపుఁ
దాండ్ర పాపయ్య ప్రతాపనైపుణ్యంబు
       పెఱరాచతాండ్రల పెంపు డింపుఁ
దామరదమ్మభూధవుఁడు మార్తురమోము
       దామరసిరులచందము లడంచుఁ

గాకర్లపూడి వేంకటరాయభూజాని
         యనువొంద జయలక్ష్మి కాకరంబు


తే.

ముత్తియము లెల్ల నొకచోట హత్తినట్లు
మగఁటిమిఁ జెలంగు వెలమ లామన్నెపిన్న
వాని బొబ్బిలికోటలో వన్నె మెఱసి
యున్నవా రింక వేయేల యోనవాబ.

26


క.

ఆబొబ్బిలిగడిపై తెర
గాబురుజులపై నెసంగు నాగ్నేయకళా
క్షీబదయోమయమైన య
రాబాసొం పెన్న నెన్నరా దెవ్వరికిన్.

27


సీ.

క్రొవ్వాఁడి వసియార్పుగుమిదొర గా నిడ్డ
       బలితంపు లగ్గదింపుల బెడంగు
మొనలుగా మలచి తీర్చిన నీలిశాసపు
       గురిఱాతి దంచిన గుళ్లసొబగు
నూనెకాకలఁ దేఱి జానైన చిగురుటం
       బలిఁ గాచు పెనములపదనుతీరు
యీగకాలంతైన నెత్తిపాఱని గుఱి
       నలవోని గుండు కోపుల యొయార


తే.

 మారసాతలకలితగభీరనీర
పరిలుఠన్నక్రకమఠాహిభయదపరిఘ
యౌర బొబ్బిలికోటమాహాత్మ్య మరయ
నబ్బురము నింపదే యేరికైన నహహ.

28


ఉ.

బెబ్బులిమీసమైన మెలిపెట్టి తెమల్పఁగవచ్చుగాని హా
నిబ్బరగండఁడైన ధరణీపతి రావుకులీనుఁ డేలు నా

బొబ్బిలికోటపై నడచి పోరఁగ రాదు కిరీటికైన మా
యబ్బపదంబు లాన నిజ మాడెద హైదరుజంగుసాహెబా.

29


మ.

మదదంతావళగండశైల మరిభీమస్యందనక్ష్మావహం
బుదితక్షిప్రహయావళీహరిణ ముద్యోతత్ప్ర తాపాతపా
స్పదపాదాతమృగేంద్ర మవ్వెలమరాజక్రూరమంథాద్రి వై
ర్యుదధిన్ వ్రచ్చుట వింతయే ముసలిమా నుర్వీపతిగ్రామణీ.

30


ఉ.

నాలుగువేలకాల్బల మనారతముం దనుఁ గొల్వ నాపయిం
జాలిన మేటిమాననులు సాహసధుర్యులు పద్మనాయకుల్
కాలునఁగాలు మెచ్చికొనగాఁ దగియుండు సహస్ర మమ్మహీ
పాలునియొద్ద నాఘనుఁ డపారపరాక్రముఁ డెన్నిభంగులన్.

31


ఉ.

కావున బద్మనాయకశిఖామణి యైన మహానుభావుఁ డా
రావుకులాగ్రగణ్యుఁడు దురాగ్రహబాహుబలప్రభూతగ
ర్వావిలమానసుం డయి దివాణమువారలఁ జీరికిం గొనం
డావిభుఁ డెట్టిధన్యుఁడొ భయంపడఁ డెంతటిఖాన్నిఘాలకున్.

32


తే.

సీమలోపల పితరులు చేసికొనుచు
సిస్తు వడనీఁడు పైకంబు దస్తుగాఁగ
నివ్వఁ డవ్వల నిఁక నేమి ఱవ్వబలుక
వారు తమజేరు దస్తులో రారు నిజము.

33


మ.

అని రాజన్యునితప్పుదాట్లు కుటిలవ్యాపారసంభాషణల్
వినుచో హైదరుజంగుసాహెబు కడు న్విస్మేరచేతస్కుఁడై
నిను ము న్విందు మమందశౌర్యకలనానిస్తంద్రసైన్యావళీ
ఘనసంరంభి వటంచు నవ్వెలమ నీకన్నన్ బలాఢ్యుండొకో.

34


మ.

అన నారాజవతంసుఁ డిట్టులను నాహా తాండ్ర పాపయ్యనాఁ
జనువాఁ డొక్కఁడె చాలు మామకభుజాశౌర్యంబుఁ గోల్పుచ్చుం తెం

.

పున కామన్నెకుమారుపౌరుషరసంబు ల్వల్కగా నేల న
ర్జునగంగాసుతకుంభసంభవులనేర్పు ల్గావె తద్దర్పముల్ .

35


తే.

అనుచు నారాజు పలికిన యాగడంపు
ముచ్చటల కబ్బురం బంది మొఱకుతురక
కఱఁకుఁదన మూఁది కొనవేలిఁ గఱచికొనుచు
నాగ్రహమ్మున నతనితో ననియె నిట్లు.

36


శా.

ఏలా జేరుకు రాఁ డతండు పయికం బేలా దివాణాన కీఁ
జాలం డస్మదపారఘోరనిబిడజ్వాలాకరాళాయితా
భీలక్రూరశతఘ్నికానికరగంభీరారవప్రౌఢిమం
బేలా గుర్తెఱుఁగండు చూత మిఁకఁ దద్భీమప్రతాపోద్ధతుల్.

37


శా.

కీలాభీలము లిప్పరాసులఫిరంగీ లగ్నిమూర్తు ల్మహా
కాలుండై నను గాలుఁడైన నెదురంగా నోప రిచ్చోట మ
న్నీలంచుం బలుకంగ నేటికి పఠాణీల న్హిరాణీతురా
ణీల న్గోటను జిమ్మలేదె మును బిన్నీబారులం బోరులన్.

38


సీ.

తలఁపుతాశ్శీళ్లలో మెలఁగఁజేసితిఁ గదా
       శకసింధుఘూర్జరాశ్మంతపతులఁ
జేరుదస్తునకుఁ దెచ్చినవాఁడనే కదా
       మరహాట కరహాట మత్స్యపతుల
ధర బందిగీలఁగాఁ దార్చి తెచ్చితి గదా
       మాళవ చోళ నేపాళనృపుల
తజివీజులో మెల్ల రుజువు జేసితి గదా
      నానావగైరాల నాఁడునాఁట

తే.

ఫాదుషావారి మీరు బరీదు సైదు
ఢక్కను మొగ ల్గరీబుపఠాణు లాది
పౌఁజులఁ బలాయన మొనర్చుపటిమ గల్గు
తురకదొరలము మాకు హిందువులు భరమె.

39


తే.

సిఫహసరదారుగారితో జిడ్డుగొన్న
కవ్వడికి నైనఁ గాందిశీకత గడంగు
మన్నెవా రనఁగా నెంత మాఫిరంగి
మండలంబుల ఘుటికాప్రచండగతికి.

40


చ.

అతనిగడీపటుత్వమును నాతనివిక్రమశక్తి తన్మహా
ద్భుతు లగు పద్మనాయకుల దోర్బలవైఖరి యెన్న నేల మ
ద్వితతశతఘ్నికానికరవేగము మమ్ముల మాఫరాసునం
తతులపరాక్రమక్రమముఁ దల్పఁగ లేవయితే నృపోత్తమా.

41


చ.

అలఁతుల బోవ నేర్తురె దురాగ్రహచిత్తులు నిప్పరాసు లు
జ్జ్వలతరఢాంఢమీనినదసత్వరభూరిభయానకార్భటీ
కలితశతఘ్నికాతతినగాదులు దెల్పుచుఁ గొండలైన బ
ద్దలు వడి వ్రాలఁ జేయఁ గల తద్దతి కిట్టిగడీలు లక్ష్యమే.

42


ఉ.

అంగభవారిభూరినిటలాంబకవహ్నికణంబు లట్టు లు
ప్పొంగుచు గుండు వ్రాలునెడ భూగగనస్ఫుటనాకఠోరతా
భంగురకాలమేఘరవభైరవరావము లుగ్గడింప కా
రంగులు మాఫరంగుల ఫిరంగుల రంగులు మీ రెఱుంగరే.

43


శా.

లాడూఖానుకు మంద మొక్కరుఁడె కిల్లాలెల్ల లగ్గల్లొనెం
గ్రీడాశాలి ఫరాసుఱేని కెదు రేరీ మున్ను లోకత్రయిం
జూడ న్మాయిశిఫాయి గుంపులభుజాస్ఫూర్జత్ప్ర తాపంబు లే
డేడం గన్నవిమాకలక్ష్యములుగా హిందూలదోర్దర్పముల్.

44

శా.

కాని మ్మెంతప్రయోజనం బనుచు న్యట్కారంబుగాఁ బల్కు నా
ఖానోత్తంసముఁ జూచి రాజు మదిలోఁ గౌతూహలం బంది యెం
తైన న్సామము దానభేదములుగా వప్పట్టునం జూడ నా
భూనాథాగ్రణి దండసాధ్యుఁ డని నీబుద్ధి న్వితర్కింపుమా.

45


మ.

అని యాఖానుని మానసం బెఱియఁ గ్రూరాలాపము ల్గొన్ని ప
న్ని నిజాంతఃకరణంబున న్మెలఁగు దుర్నీతిప్రసంగంబు నే
ర్పున విజ్ఞఫ్తి యొనర్చువేళ గలిగెం బోనేఁడుగా మా కటం
చును దీర్ఘప్రతిభావిభాసితముఖాబ్జుం డౌచు రా జంతటన్.

46


మ.

బలవద్విక్రమశాలి నానృపుని మీబల్మి న్నివారించి బొ
బ్బిలిలో మ మ్మభిషిక్తుఁ జేసి పిదపం బెంపేది తద్రాజ్య మె
ల్ల లసత్ప్రీతిని మా కొసంగినను లీల న్మీకుఁ బండ్రెండుల
క్షలరూపాయ లుపాయనంబులుగ రొక్కం బిత్తు నిక్కంబుగన్.

47


శా.

ఆమాట ల్విని ఖానుఁ డర్థకృతమౌ నత్యాశ దీపింపఁగా
నామీఁదం బ్రభవించుహానికిని బాపాయత్తదుర్వృత్తికిన్
మోమాట ల్గనలేక మంచి దని సమ్మోదంబునం బొందెఁ జా
లాముఖ్యంబుగ నర్థకాంక్షకుల కేలా యూర్జితాలోచనల్.

48


మ.

అలఘుప్రాభవరాజవర్య భవదీయాశాస్య మెట్లట్ల బొ
బ్బిలిఖిల్లా కధికార మిచ్చి నిను నొప్పింతుం దదావాసులన్
మలలం జొన్పుదు సాహుకారుతసిలీ మ్మా కిచ్చి కట్ణంబుతోఁ
గల కార్యం బిది రూఢి సేయు మన నాక్షత్రాగ్రగణ్యుం డొగిన్.

49


తే.

పారసీకాగ్రగణ్య నీపరమమైన
చారుకారుణ్యరస మిట్లు సంభవించె

దాన విశ్వాస ముదయింపఁ దగినకొలఁది
నమ్మికలు సేయు టిది మాకు సమ్మతంబు.

50


క.

పరిధాన మిచ్చుపలుకులు
కొఱఁ గాదన మిపుడు మీరు కోరినవారిన్
నెఱతనపుసాహుకారులఁ
గర మరుదుగఁ గూర్చి పూఁటకాఁపులఁ జేతున్.

51


క.

విశ్వాసపుట్టు నట్లుగ
శశ్వద్గతి మాకు నమ్మఁజాలినరీతిన్
విశ్వస్తుతగుణయవనా
ధీశ్వర ప్రామాణ్య మొసఁగు మిత్తఱి ననుడున్.

52


శా.

తేజం బంది తురుష్కనేత తనయుక్తిస్పూర్తి దీపింప రా
జాజీ నీమదిలోన నింతవసవాసాసర్వదిఙ్మండలీ
భ్రాజత్సత్యపరాక్రమప్రకటితప్రాంచద్యశశ్శాలికిన్
నైజం బొక్కటికాక మారు గలదే నావాక్యము ల్పొల్లులే.

53


క.

హల్లా సేయుదు బొబ్బిలి
కిల్లా తజ్జయము నీకుఁ గీల్కొల్పుదు నే
కల్లాడఁ జుమ్మి యిది నా
యల్లాచరణంబు లాన యధిపవతంసా.

54


మ.

 అని రాజన్యుని పాణిపల్లవము స్వీయంబైన కెంగేల గై
కొని రమ్మంచును దోడుకొంచుఁ జనుచుం గోదావరీ తీరకా
ననదేశంబున నొంటిపాటున శమేనాలోనఁ గూర్చుండి యా
జననాథాగ్రణి యాత్మ మెచ్చఁగ నభీష్టాలాపము ల్సేయుచున్.

55

తే.

కపట మొక్కింత లేక నిక్కము గాఁగ
ఖానుఁ డర్థంబుపై దృష్ణఁ గట్టిపఱచి
నృపమణికి నిచ్చె నమ్మిక ల్కృప దలిర్ప
ఘోరతరమైన యొకతరవారు ముట్టి.

56


శా.

కత్తిం గొట్టి ప్రమాణపూర్వకముగా ఖానుండు నమ్మించినం
జితస్వాస్థ్యము నొంది క్షత్రియకులశ్రేష్ఠుండు తౌరుష్కరా
హుత్తగ్రామణిమానసం బలర సాహూకారుటీపిచ్చి సో
ద్వృత్తి న్వాని యనుజ్ఞఁ గైకొనుచుఁ జేరెన్ వేల మాత్మీయమున్.

57


వ.

ఇవ్విధంబున విజయరామరాజధరారమణవతంసంబు సంప
త్ప్రకారంబునఁ దనమనోరథంబునకు ననురూపాటోపంబు
లాచరింప నిరపాయం బగు సహాయంబున కనుకూలించు
కతనం జతనం బగు మనంబున జనించు నప్రతీపప్రమోదం
బప్రమాదంబునం బరఁగ నారేయి నిలచి చలిచీముకాటు
గా దనయొనర్చు కుయుక్తిచేష్టావష్టంభంబు లోకులకు నిం
చుకించుక సూచించుచు మఱునాఁటియుదయకాలంబున.

58


శా.

రాచక్రంబున మేలుబంతి యనఁగా రాజిల్లు నారాజుకూ
చీఁ జేయించి సమంచితాత్మ బలవత్సేనాసమేతంబుగా
భూచక్రం బదువంగ బూరటిలు విస్ఫూర్జత్సమిద్భేరిస
ధ్రీచీనంబుగ మున్నుగాఁ గదలి యర్థిం జేరెఁ బెద్దాపురిన్.

59


తే.

 ఖానుఁ డంతట నతులితోత్కర్ష మెఱయ
నుద్ధతులముల్కుగారితో నొయ్యనొయ్య
రాజుఁ దానును సలుపు వార్తారహస్య
మంతయును దెల్పె నతనికి హర్ష మొదవ.

60

క.

మూసాబూసీవారిదు
బాసీలక్ష్మణసమాఖ్యఁ బరఁగు నతం డు
ద్భాసితమనస్కుఁడై తా
నాసాహెబుపన్నుగడకు ననుకూలించెన్.

61


శా.

ఆరాజన్యుఁ డొనర్చు దుర్నయవిచారాలాపచేష్టావిధుల్
మేర ల్మీఱుచు నంతకంత ప్రచురోన్మేషక్రియావైఖరీ
రారాజద్గతి నెల్లవారలకుఁ గర్ణాసహ్యతం బర్వె రం
గారాయప్రభుమౌళియు న్వినియెఁ దత్కౌటిల్యవార్తాస్థితుల్.

62


సీ.

ఈరాచబిడ్డని క్రూరకర్మవిచార
       మిదియ నూర్జిత మని యెన్నువారు
పౌరుషశాలి రంగారాయనృపమౌళి
       వెనుకఁ ద్రొక్కం డని యనెడువారు
ఘనులు వీరుం డొరు ల్కలహింపఁ దద్ధరా
       జనులకుఁ ద్రొక్కటం బనెడువారు
జయపరాజయములచందము ల్దెలుప దై
       వాధీన మిది యని యాడువారు

62


తే.

నిర్నిమిత్తవిచార మీదుర్నయంపుఁ
బనులు బలనాశకర మని పల్కువారు
నెవ్వ రె ట్లయ్యెదరొ వీర లిట్టికలత
ననుచుఁ జింతానిమగ్నులై రఖిలజనులు.

63


తే.

అత్తెఱంగునఁ దమలోన నఖిలజనము
లిలఁ గలుగువారు పలువురుఁ బలుదెఱఁగుల
పలుకులవిచారములఁ గుంది కలఁతనొంది
డెందములయందు ఖిన్నతఁ జెంది రంత.

64

శా.

రంగారాయనిగారు గారుడశిలారంగద్వితర్దీజ్వల
చ్చృంగారాయతనంబునందుఁ బెలుచం జెంగల్వ రాచెల్వరా
సింగంపుం దనువైన గద్దియపయిం జెల్వొప్పఁ గూర్చుండి స
ప్తాంగప్రాంచదమేయరాజ్యభరణప్రజ్ఞామహోదగ్రుఁడై.

65


మ.

హితులు న్మంత్రులు గాయకు ల్కవులు సాహిత్యప్రధాను ల్పురో
హితులు న్నాయకులు న్సఖు ల్సహజులు న్హేలాగతిం గొల్వ న
ప్రతిమోల్లాసవికాసలాలనమనఃపంకేరుహుండై నిజా
ప్తతతిం జూచి రసోచితంబుగ వినం బల్కె న్మృదూక్త్యార్భటిన్.

66


సీ.

సరకారుభారంబు వరియించి పెల్లుగా
       వడి ఫరాసెకిమీడు వచ్చుటయును
విజయరామక్షమావిభుఁ డాదిగా జమీ
       దారులెల్లను వానిఁ జేరుటయును
దత్ప్రధానత్వంబు దాల్చు హైదరుజంగు
       రాచయేలికపక్షమై చనుటయు
మనమీఁదివైరంబు పెనఁకువతో రాజుఁ
       జొప్పించి కొండెము ల్సెప్పుటయును


తే.

లక్షలకొలంది పైకంబు లంచ మిచ్చి
రాజు మనపైకి జాతివారలఁ గురించి
వచ్చి కలహించి యీరాజ్యవైభవంబు
తా ననుభవింపఁ దలఁచుట దా నెఱింగి.

67


క.

అనిమిత్తవైర మీచొ
ప్పునఁ దలపెట్టినవిరోధి భూపతి యాఖా

నుని వెనుకొని రా తద్ద
ర్శన మొనరింపంగ మనకుఁ జన నొ ప్పగునే.

68


ఆ.

తగు వకీలుఁ బనిచి తన్మనోగతములఁ
దెలిసికాని పోవ వలనుగాదు
ఖానుఁ డర్థకాంక్ష నానరాధీశ్వరు
పిశునకృత్యమునకు వశగుఁ డగుట.

69


క.

తనధనబలసంపన్నత
కెన యగువా రెవ్వ రనుచు నెంతయు గర్వం
బునఁ బెనగొని యుండుట యా
యన మన పౌరుషముతీరు లరయమిఁ గాదే.

70


తే.

తగవు ధర్మంబు విహితంబుఁ దప్పనీని
నయవిచారమ్ముచే దివాణమ్మువారు
మనల వారల సమదృష్టి నెనయునట్లు
చూచిరా లెస్స కాదేని సూటిపడదు.

71


ఉ.

 చూతము మీఁదిదైవగతిచొప్పునఁ గాఁగలయర్థ మెట్లొ త
ద్రీతిని నానృపాలకులదీపకుఁ డాతఁ డొనర్చు దుష్టక
ష్టాతతతంత్రయుక్తుల కొడంబడి ఖానుఁడు నిర్నిమిత్త మే
లా తగ వాలకింపక చలమ్మున నాలపుదొమ్మి కొప్పెడున్.

72


ఉ.

ఖానునిచేత నమ్మికలు గైకొని లంచము లియ్యకొల్పి కా
ర్యానకు వచ్చువాఁ డయి ఫరాసులతోఁ జను రామరాజభూ
జానిప్రయత్న మెల్లఁ గొనసాగఁగనీని యుపాయ మెన్ని దూ
రాననె తప్పఁ ద్రోచుటయె రాజతనం బని తోఁచు నామదిన్.

73


చ.

ఒరులధనంబుఁ గోరు రిపుయోజనదవ్వులఁ దూలపుచ్చు ని
ర్భరతరమంత్రశక్తికి నపాయము లేనియుపాయ మిఫ్డు బం

దరుపురి కొక్కనిం బనిచి ధార్మికలోకవతంసమౌ కుమం
దరుఁ బొడఁగాంచి శాత్రవువిధంబులఁ దెల్పి మరల్చు టొప్పదే.

74


మ.

మనల న్భూరికృపానురాగములచే మన్నింతు రారెడ్డినా
యనిగారుం గపితాన్ కుమందరును నెయ్యం బొప్పఁగా వారిఁ గ
న్గొని తన్మూలముగా విరోధిజనులం గుంఠీభవత్క్రౌర్యవ
ర్తనులం జేసి తొలంగఁద్రోచుటయె యుక్తం బెన్నిచందంబులన్.

75


మ.

మనతోఁ గూడిన కార్యమెల్ల తమజిమ్మాయున్న దారావునం
శనిధానం బగురంగరాయమహిభృచ్చంద్రుండు మా కిష్టుఁ డా
యన మే లొప్పనిరాజుమాట లవి మీ రాలింపరా దంచు ఖా
నునకు న్బూసికిఁ దగ్గ యుత్తరము లెన్నో యన్నియుం దేఁ దగున్.

76


శా.

గోరుం దోరుహితోపదేశమునకుం గొండొక్కటాడండుదు
శ్చారిత్రుండు మియామయావిలుఁడు మూసాబూసి హర్షాదయో
దారాత్రుం డగురాజుఁ దల్చు కుటిలౌద్ధత్యంబ సత్యంబునం
జేరు న్సూర్యకరప్రసారణమునన్ శేషించు మంచో యనన్.

77


ఉ.

హైదరుజంగుతోఁ బలుక నక్కఱ యించుక లేకయుండ నౌఁ
గా దని సీమతోఁ గల నిఘాసరకారుక్రమంబునం బరి
చ్ఛేద మొనర్చి యందె యరసేయక పూట యొసంగి తగ్గ తా
ఖీదులు వీరిపేరట లిఖింపఁగఁ జేయుట మంచిదేకదా.

78


మ.

అని మంత్రాంగనిరూఢి యేర్పఱచి ధైర్యస్థైర్యవాక్చాతురీ

ఘనునిం బంతెనవంశ్యు బుచ్చన యనంగాఁ బేర్చువాని న్వకీ
లు నిజాప్తుం బనిచెం గుమందరుని నాలోకించి కార్యంబు సం
తన గూడం దగురీతిగాఁ బలికి ఫోక్తా సేయు మంచు న్వడిన్.

79


శా.

చాతుర్యోక్తులఁ బంతెనాన్వయమునన్ సర్వంకషప్రౌఢిప్ర
ఖ్యాతిం గాంచిన కొండమంత్రిమణికిన్ గారాలపు౦బట్టి వై
సీతారామన వెంకనాహ్వయులకుం జెల్వంపుసైదోడువౌ
నీతో నీ డెవరంచుఁ బుచ్చె నను మున్నే యన్ని మన్నించుచున్.

80


తే.

అనుపమానప్రభావుఁ డజ్జనవరేణ్యుఁ
డనుప మసలక యతనిచే నాజ్ఞ వడసి
అతులితస్వర్ణపల్లకీకాధిరూఢ
గాఢసామాజ్యరమ నేలి కదలివచ్చి.

81


ఉ.

ఆపరమప్రగల్భవచనామరదేశికుఁ డౌవలు పె
ద్దాపురిమీఁదుగా నరిగి తత్పురసంస్థితురాజుఁ గాంచి స
ల్లాపము లొక్కకొందడువు లాననచేఁ బచరించి యందుఁ జూ
పోపమి యాత్రలో నెఱిఁగి యూర్పు నిగుడ్చుచు లేచి దిగ్గునన్.

82


చ.

 ఇతనిమనంబు క్రూరత వహించినచొ ప్పెఱిఁగించుచున్న ది
మ్మత మిటువంటి దమ్ముసలిమాన్దొర మానసవృత్తి యట్టిదో
కతిపయవాక్ప్రసంగములఁ గానఁగ నయ్యెడు నంచు సత్వరా
యతగతి నప్పుడే కదలి యాయన లస్కరు చేర నేగుచున్.

83


చ.

కడువడి పిన్నపెద్ద లగుఖానులకు న్నజరు ల్నయించుచుం

చ.

బొడగనియెం దురుష్కజనపుంఖితపుష్టసభాంతరంగునిన్
గుడపరిమిశ్రధూమచయగుంభితభూత్కరణానుషంగునిన్
జడరసమద్యపానమదసంగుని హైదరుజంగు నొయ్యనన్.

84


తే.

గుడిగుడీధూమపానవిఘూర్ణమాన
చకితదృగపాంగు హైదరుజంగుఁ గాంచి
నజరుగుజరానుపఱచె సొన్నాకడాని
జాలె మాతఁడు కూర్నీనిషాతు చేసి.

85


శా.

ప్రాంచద్విక్రమశక్రసూతి యగు నా రంగావనీభర్త దాఁ
బంచె న్వీఁడె వకీలు హాజరుగ రీ ప్పర్వర్మెహార్బాన్ సలా
మంచుం గొంచక చోపుదారు లెదుటన్ హర్షంబునం దెల్పఁగాఁ
గాంచెన్ హైదరుజంగు క్రోధరసయుక్తామ్రాక్షుఁడై యాతనిన్.

86


శా.

ఖానుం డ ట్లతనిం గనుంగొనుచు రంగారావ్ జమీదారు కే
జానీహేతుమిదల్కెమాయ యని యస్తవ్య స్తపున్నైజభా
షానైపుణ్యముఁ జూపుచుం బలుక హాసాహేబు మాఱాడకన్
జానేవాస్తెహమా యటంచు నతఁడున్ స్వా లిచ్చెఁ బ్రత్యుద్ధతిన్.

87


తే.

ఈవకాలతుపసహారహీ వహించు
బహుతుగుండాతరాజితుబమ్మ ననుచు
కోపవల్లులు చివురింప గూఢపఱచి
మెల్లమెల్లన నతనితో మ్లేచ్ఛుఁ డనియె.

88


శా.

రంగారాయఁడు మామొలాజుమతుకై రాకేటికిం జిక్కె నా
బంగాళాపురగౌతమీతటనటద్బహ్విష్ఠధాత్రీశు లె
ల్లం గూర్మిన్ మదనుజ్ఞఁ జెంది హిత లీల న్వచ్చు నిష్టాప్తిఁ జొ

క్కం గానం డొకొ వెల్మబిడ్డ మములం ఖాతీరుకుం దేఁడొకొ.

89


మ.

ధరణీమండలి నుండు నెల్లరు జమీదారు ల్భయం బంది మా
ఫరమానా శిరసావహించుకొనిరా పాటింప కారాయఁ డీ
సరణిన్ రామికి నేమి చెప్పదన కేల్ శెంషేరుతారీపుచే
నరుదేర న్మదిఁ దల్పఁడేమొ యతఁ డాహా మేల్సిఫాయీగదా.

90


చ.

తురకల రాజ్య మౌట మదిఁ దోచక యున్నదొ నాధ్వసావహూ
ద్ధురరణరంగవిక్రమము దోగెడువారు ఫరాను లన్నపే
రెఱుఁగఁడొ రావు రాకునికి హేతువు గానని మాకుఁ దోఁచె ని
ప్పఱుసుదనాన మ మ్మతఁడు భావమునందు ఫసందుసేయఁడో.

91


చ.

విపులపరాక్రమాతిశయవిశ్రుతమూర్తి నటంచుఁ దోడిధా
త్రిపులు దొఱంగి పాఱ బెదరించెడిచాడ్పున నిప్పరాసులం
గపటమనస్కతం జులక గాఁ దలపోయుట లెల్ల వేఁడి గా
లపుసిడిగా నిగంపసిడిలాగున నుండదు మన్నెఱేనికిన్.

92


శా.

ఫల్లామంచిది రావుగారు తనదోఃపాండిత్యసంపద్బలా
ద్యుల్లాసంబున గర్వితుం డగుచు రా కున్నాఁడు గాఁబోలు మే
మెల్ల న్మీదొరదర్శనంబునకుఁ గా నేతెంతు మంచు న్మనా
గ్భల్లుండై ఖరడాజవాబు నడపెన్ ఖానుండు తద్దూతతోన్.

93


ఉ.

అంతట నవ్వకీలు వినయమ్మున లేచి సలాము చేసి మీ
యంతటిఖానుసాహెబుల నాదరణోక్తులఁ బల్కఁ బాడియే
సంతతధర్మశాలి విలసన్నయశీలి మదీశ్వరుండు గో

రంతయు వింత నేరనిమహాత్ముఁడు మీకు విధేయుఁ డెన్నిటన్.

94


చ.

కర మరుదైనపేర్మిని శ్రీకాకుళపు న్సరకారుభార మీ
సరణి వహించి యోర్పున ప్రజాహిత మొప్పఁగ ఫౌఁజుదారికిన్
నెరపెడివాఁడ వెల్ల ధరణీధవచంద్రులఁ గూడ కట్టు నే
ర్పరయక యిట్టు లాడఁ దగవా నృగవా పగవానికైవడిన్.

95


మ.

తలితండ్రాదులవంటివారలుగదా తల్పం దివాణంపువా
రలు చూడ న్ధరణీజనమ్ములు కుమారప్రాయు లట్లౌటఁ గే
వలరౌద్రోక్తులఁ బల్కఁ జన్నె పితరు ల్వంచింతురే మీరు బి
డ్డలమీఁదం గృపనివ్వటిల్లు కడకంటం జూడ్కి సారింపఁగన్.

96


శా.

మీచిత్తంబున కి ట్లసూయ పొడమన్ మ్లేచ్ఛాగ్రణీ యింతదు
ర్వాచాతంత్రము లెవ్వరెవ్వరలు మద్వైరు ల్నివేదించిరో
యీచాటూక్తికుయుక్తికల్పనలచే నీబుద్ధి నీకుండెనా
మాచేఁ దీఱదు తగ్గవారు దెలుపన్ మానేర్పు నీధౌర్త్యముల్.

97


చ.

అని తెగనాడి యాయవనుఁ డర్ధకృతాశలరాచవారికో
పునఁ బడి దుర్ణ యంపుఁబని బూనినవాఁ డని యాత్మ నించి యి
క్కినుక యణంపఁగాఁ దగినకీర్తిధురంధరుఁ డగ్గుముందరుం
డని కృతనిశ్చయుం డగుచు నాయన బందరుమార్గగామియై.

98


తే.

అచట నడచినవృత్తాంత మాత్మనృపతి
కంతయు నెఱుఁగఁ బనిచి యనంతరమున
ఘోరకాంతారగిరిగుహాకుంజపుంజ
నదనదీదుర్గముల దాఁటినాఁడు నాఁట.

99


చ.

చని చని కాంచెఁ గాంచననిశాతశిరఃపరిచుంబితాంబర
మ్మును లవణాంబురాశిజలపూరనిరంతరదూర్మిమాలికా
నినదసమగ్రజాగ్రదవనీజనబంధురమున్ ఫరాసువా

రిని భరియించు బందరుపురవరముం గర మొప్ప డాయుచున్.

100


సీ.

అభ్రంలిహాదభ్రహరిహయాయుధశిలా
       కలితసౌభావళు ల్గాంచి కాంచి
మందురామందిరసందీప్తజవనాశ్వ
       సుందరాకృతిగతు ల్సూచి చూచి
వివృతాస్యగహ్వరవిస్తారితాయోమ
       యాగ్నేయయంత్రంబు లరసి యరసి
సమదసామజఘటాచటులగమాగమా
       తిప్రసంగములను దెలిసి తెలిసి


తే.

రక్తరాంకనకంచుకయుక్తదృప్త
పాణితలచాలితకృపాణపటలజటిల
భీకరకరాళవదను లై పేర్చువారిఁ
గ్రూరులఁ బరాసుజనులఁ గన్గొనుచు నరిగి.

101


ఉ.

రాయవకీలు కట్టెదుట రాజిలు నొక్కచిరత్నరత్న నూ
త్నాయతనంబునందు గొలువై చెలువైన యొయార మింతయౌ
రా యనఁ గానుపించి రుచిరాయనకీర్తిదురంధరుండు నా
రాయణుఁడో యనం జెలఁగు రాయని గాంచెను రెడ్డినాయనిన్.

102


తే.

కాంచి యాభాగ్యసంపత్తి కౌరవేంద్రు
సాంద్రకరుణాతరంగముల్ సంగ్రహించి
సరస గూర్చుండి తనకార్యసరణి యప్పు
డతని కంతయుఁ దెల్పెఁ బండితవరుండు.

103


చ.

అతఁడును నట్టికృత్యమున కద్భుత మంది యనింద్యకీర్తిరా
జతనికి నేమిటం గొఱత యన్యులసొమ్ముల కాస గోరి దు

ర్మతి మునువాని కమ్ముసలిమానున కెవ్విధి కోపముట్టఁగా
నతికెనొ యెట్టిమానవుఁడొ యంచు నహా యని వెచ్చ నూర్చుచున్.

104


ఉ.

రాజున కెంత వెఱ్ఱి యపరాజితమూర్తులు వెల్మవార లా
పై జగతిం బ్రసిద్ధు లురుభండనభూముల రావువార ల
వ్యాజము గాఁగఁ బ్రో ల్దుడిపి రన్నయశం బటు కావునం దదు
ద్వేజకచేష్టలెల్లఁ గొఱవిందల గోకికొనం దలంచుటల్.

105


మ.

ప్రకటీభూతబలావలేపకలితప్రజ్ఞావిశేషాప్తి గొం
కక నిష్కారణ మిట్టిదుర్ణయపుమార్గం బంట వర్తించు క్ష
త్రకులగ్రామణి కింతెకా దొగి నధర్మం బన్నచో నప్పురా
రికి నైన న్వెనుకంజ వైవరుగదా రేచెర్లగోత్రోద్భవుల్.

106


తే.

గర్వితారాతిరాజన్యకాండకఠిన
కంఠలుంఠనజాతరక్తాంబుపూర
మజ్జనవ్రతదీక్షాభిమానఘనులు
రావువారలు వట్టివారా తలంప.

107


మ.

తమపైఁ గీ డొనరించువారలపయి న్దర్పించుట ల్రాజస
త్తము లౌవారికి ప్రీతిలోకులవిషద్వైషమ్యసంప్రాప్తిగా
ర్యములో నడ్డము వచ్చి కాచుటలు క్షత్రాచారము ల్గాన ధ
ర్మమె యీరాజకుమారమన్మథున కారా వాతనిం బోరుటల్.

108


చ.

తురకలునుం బరాసు లతిదుర్మదు లర్థముమీఁది తృష్ణ నె
వ్వరియెడనేని తెంపు తెగువ ల్గొనఁజూతు రిఁకెందు వచ్చి యెం
దరుగునొ యట్టిదుర్ణయపుటారడి కెంతయు నియ్యకొల్పుటల్
నెరవరి గాడు రా జనుచు నిష్ఠురవాక్యము లుగ్గడించుచున్.

109

క.

ఆరెడ్డినాయకుఁడు రం
గారాయవకీలు నతికృపావనలోలున్
గారా మొప్పఁగ రమ్మని
గోరుం దొరదర్శనమునకుం గొనిపోవన్.

110


చ.

ముదితమనస్కుఁడై యతఁ డమూల్యమణిఖచితంబులైన రా
ట్సదనము లాపణంబులు విశాలశిలామయవేదు లద్భుతా
స్పదవిజయధ్వజావళులు పద్మసరఃప్రకరంబులుం జర
న్మదవదిభప్రకాండము లమందగతిం గనుఁగొంచు నేగుచున్.

111


శా.

ఘోరాకారులు శొభితాననులు రక్షొవీరసంకాశులున్
ఫారా గ్రుమ్మరు ద్రిమ్మరీ లెదుర సంభావించుచు న్మంచిశృం
గారం బైనహజారమున్ విధుశీలాకక్ష్యాంతరంబు ల్దృష
ద్వారద్వారకవాటము ల్గడచి సౌధం బెక్కి యాచెంగటన్.

112


సీ.

రత్నపాంచాలికారాజత్కరాంభోజ
       కీలితవాలప్రకీర్ణకంబు
మణిపంజరాంతరామానసౌకస్సంఘ
       సంఘటితాలాపజనచయంబు
చంద్రోపలస్తంభచకచకద్యుతిమృషా
       కౌముదీముదితవీక్షణచకోర
మభ్రంకషాభోగహర్త్యగవాక్షాగ
       తర్క్షప్రతానముక్తావితాన


తే.

మగుచుఁ గనుపండు వైన సౌధాగ్రభాగ
చంద్రశాలాంతరంబునఁ జందమామ
ఱాతికురిచీలమీఁది ఫరాసుదొరల
సొంపు దొరలఁ గనుఁగొని చోద్యమంది.

113

మ.

కుతుకం బొప్పఁగఁ గాంచె నందుఁ గఫితు న్గోరుం దొరం బ్రస్ఫుర
ద్ధృతిసంరంభనిరస్తమేరుహిమవద్వింధ్యాద్రిరాణ్మందరున్
శతకోటిప్రసవాస్త్రమందరు రమాచంద్రాననాపాదప
ద్మతులాకోటిఝళంఝళారవయుతోదంచన్మణీమందిరున్.

114


తే.

ఇట్లు గనుఁగొన్న మన్నీనిహేజుబారి
కప్పరాసులయెకిమీఁడు చెప్పరాని
మెప్పురాఁ గప్పురపువీడ్య మప్పు డొసఁగి
కుశలసంప్రశ్న మొనరించి కుతుక మొదవ.

115


క.

ఆరాయభారి వచ్చిన
దూరాగమనంబుఁ జూచి దోడ్తో నడిగెన్
నీరాక కేమిగత మని
గోరుం దొరతనదుబాసికులమూలముగాన్.

116


క.

మద్దాల రెడ్డినాయఁడు
తద్దయు నారాచవారిధౌర్త్యము సర్వం
బుద్దవిడిఁ దెలుపఁ దెలియుచు
నద్దిఱ యని మిక్కుటంపుటక్కజ మందెన్.

117


ఉ.

బందరుపట్టణాధిపతి భాసురభోగపురందరుండు గో
రం దొరగారు విస్మయకరం బిటువంటిదురాగతంబు రా
జుం దురకాతఁడుం దలఁచుచు న్వెస రావుకులాగ్రగణ్యుపై
కిందిటమూఁది యేగ గమకించుట చోద్యము గాదె యారయన్.

118


ఉ.

మానితకీర్తిఁ గాంచు నభిమానధను ల్ధర రావువారు స
న్మాన మొనర్ప నర్హు లనమానపరాక్రము లట్టివారిపైఁ
బూనిక చేసి కార్యగతి పొంకము సేయుట లెస్సగాని దు

ర్మానితమూను నమ్ముసలిమానును రాజును బుద్ధిమంతులే.

119


మ.

మును రాచాతఁడు వెల్మబిడ్డఁడును మమ్ముం జూడఁగా వచ్చి వా
రును వారు న్వివరించుచోఁ దగదు మీరు న్మీరు చూపోపకుం
డని వైరంబునఁ బోరు పెట్టుకొని యి ట్లాడంగరాదంచు నా
కినుక ల్మానిపిపుచ్చినారము మృదూక్తి న్వారి నత్యంతమున్.

120


మ.

అభిమానంబె ధనంబుగాఁ గలుగువా రారావువార ల్మహా
విభవుం డీతఁ డటంచు నోడరు రణావిర్భూతమై పేర్చ ప్రా
ణభయావేశము లేశమైనఁ గనుగాన న్రాక రేచర్లగో
త్రభవు ల్చావనుజంప రాజున కయుక్తం బిట్టిచో వైరముల్.

121


తే.

రావువారిగడీమీఁద రాచవారి
పనుపునఁ బరాసువారు కోపంబు జేసి
నడచినా రనుదుష్కీర్తి పొడమకున్నె
మామకీనుల కిదియ ధర్మంపుఁ దెరవు.

122


తే.

నేర మొదవినచో నెట్టి క్రూరమైన
కర్మమున కొప్పు టిది జగత్ఖ్యాతిగాని
నిరపరాధులపై నిట్టిపరుసఁదనఁపుఁ
బని యసంభావ్య మని దూలఁ బలికికొనుచు.

123


శా.

భీమాటోపుని నాభిజాత్యపురుషున్ భీమప్రతీకాశు మూ
సామర్త్యేనుసమాఖ్యునిం బనిచె లష్కర్లోనికిం బోయి మ
త్సామర్థ్యం బెఱిఁగించి ఖానునకు మూసాబూసికిం దెల్పి ర
మ్మామాయామయుఁ డైన రాజుపలుకు ల్మన్నింపరాదం చొగిన్.

124


తే.

రాజుపిశునో క్తి చెవి నాని రావువారి

తెరవు బోరాదు మనకుఁ దద్దేశరాజ
కార్య మెల్లను మేమె సౌకర్యపఱచి
యర్థ మొనఁగూర్తు మిది ముఖ్య మనుచుఁ బలికి.

125


మ.

మన కత్యంతహితంబుఁ గూర్చిన జగన్మాన్యుల్సుమీ రావువా
రనియు న్వారు కుటుంబసంగతులరై యచ్చోఁ బ్రవర్తిల్లువా
రనియు న్వారికి రాచవారికినిఁ బ్రత్యాసక్తివైరంబు ము
న్ననియుం దెల్పుఁడిచేసి యీవిషమకార్యంబు న్నివారింపుమీ.

126


చ.

అని నియమించి రావుకులజాగ్రణి పంచిన మంత్రివెంట మ
ర్తెనుఁ డను జాతివాని నతితీవ్రముగాఁ దగు నుత్తరంబులె
ల్లను లిఖియించి యిచ్చి కుశలంబుగఁ బొండని పంప నంత వా
రును బయనంబు సాగి చని రుగ్రతరత్వరగాఁ జరించుచున్.

127


తే.

ఇట్లు చనుచుండ రాజమహేంద్రపురముఁ
గదలి పెద్దాపురమున లస్కరు వసించె
వారు కలియకమున్నె దుర్వారఘోర
వితతచతురంగసైన్యసంగతము గాఁగ.

128


మ.

అటఁ బెద్దాపురిపట్టణంబుననె ము న్నావాసముం జేసి మీఁ
దటికృత్యంబు కృతప్రయత్న మయి చెంద న్జాగ్రదాలోచన
స్ఫుటవైషమ్యమనోవికారుఁ డగుచున్ జూపట్టుచున్ ఖానుఁ డ
చ్చటికి న్వచ్చు టెఱింగి డెందమున హర్షం బందె రా జెంతయున్.

129


తే.

ఖానుఁ డచ్చట నిల్చి నిఖా యొనర్చె
పోలునాఁ డాది యగు సర్వభూమిపతుల
రాజ్యములు వారివారికిఁ బూజ్యఫణితిఁ
దేరుగడ జేసి యిచ్చుచు ధీరమతిని.

130

తే.

 అచట నొకరెండుదివసంబు లధివసించి
కదలి చేరెను లష్కరు కసిమికోట
యందు గలసిరి వచ్చి కుమందరనుపు
మర్తెనాహ్వయుఁడును రాయమంత్రిమణియు.

131


ఉ.

 వచ్చినవానిఁ గాంచి చెలువంబున బూసియు నెమ్మనంబునన్
హెచ్చిన కౌతుకంబున నహీనయశుండగుమందరుండు పెం
పచ్చు పడంగఁ బంపిన మహామహు మర్తెను గారవించుచున్
ముచ్చట సల్పి యంతటఁ గుముందరు పల్కు హితోక్తి మెచ్చుచున్.

132


ఉ.

 హైదరుజంగునిం బిలిచి యాయనకుం దెలియంగఁ జెప్పి య
త్యాదరణీయుఁ డైన సుగుణాఢ్యుఁడు మాకు గురూపమానుఁడున్
సోదరసన్నిభుం డతనిసూక్తులు లెస్స గ్రహించు టుత్తమ
స్వాదుసుధారసైకపరిచర్యలు సుమ్మని సమ్మదంబునన్.

133


చ.

 అదియునుగాక రావుకులజాగ్రణితోడి నిఖా సమస్తమున్
మదుపరినిష్ఠితం బతని మన్నన సేయుట మంచిమాటరా
జుదితవిరోధబద్ధుఁ డయి యోర్వక చేయు కుయుక్తి నీరబు
ద్బుద మని వ్రాసి పంపె నిది బుద్ధిపరం బని యెంచి చూదుమా.

134


తే.

 ఇంక మన మిట్టు బొబ్బిలి కేగుపనికిఁ
గారణం బేమి గనుక సికాకులంబు
మార్గమునఁ బోదమనుచు సమ్మతిగఁ బలికె
నొడఁబడియె ఖానుఁడును బూసియుక్తి కపుడు

135


తే.

 అప్పటికి మంచి దని వచ్చి యాత్మలోన

ఖానుఁ డూహించెఁ దమ్ములఁ గణుతిగొనక
బందరుకుఁ బంపి యచ్చోట బట్టు సేసి
యుత్తరము దెచ్చినా రన్నయుత్తలంపు.

136


తే.

క్షత్రవర్యుండు హైదరుజంగుఁ గలిసి
చూచితిరె మి మ్మొకింతైన సూటిగొనక
రావుకులసంభవుం డైన రంగనృపతి
కార్య మితరప్రపంచంబుగా నొనర్చె.

137


మ.

మును నే నెంతయు విన్నవించు పొరపు న్ముచ్చట్లకు న్వారుచే
సినతంత్రంబునకు న్సమాన మయి మీచిత్తానకుం దోఁచియుం
డెనొ లేదో తమచేరుదుస్తునకు రా డీరావువంశోదయుం
డనుమాట ల్నిజమేకదా యనుచు రోషావేశ మెక్కించుచున్.

138


క.

ఎక్కడిబందరుపట్టణ
మెక్కడిబొబ్బిలిగడీ మరెటగోరుందో
రిక్కార్యము వడి మించం
ద్రొక్కుటె మే లనుచు రాచదొర పల్కుటయున్.

139


తే.

ఖానుఁ డట మున్ను జ్వలితకృశానులీల
నుండుటకు దోడు నా రాజునుడువు లంత
వన్నియ వహించె మిగులఁ బ్రవర్గ్యఁజల్లు
బాలచందంబుఁ దెలుపుచు భగ్గురనఁగ.

140


మ.

కలితక్రోధరసాంతరంగుఁ డగుచున్ ఖానుండు దర్పించి చా
రులఁ బంచె న్బహుగూఢపూర్వగతుల న్రూఢంబుగా నేగిబొ
బ్బిలిఖిల్లానలుదిక్కు లారసి తదాభీల స్థితిస్ఫూర్తిజం
గలుఝాడీమయిధానులం దెలిసి రంగారాయనిం గాంచుచున్.

141

తే.

ఖాన్ఖుహా మిమ్ము రమ్మని కాగితంబు
వ్రాసినాఁ డని చూపి శీఘ్రంబుగాఁగ
వర్తమానంబుఁ దెమ్మన వారు నట్ల
నరిగి గిరికాననమ్ముల తెఱఁగు లరసి .

142


మ.

హరకాలా లిటు వచ్చినారు భవదీయాలోకనేచ్ఛారతిం
దురకాతం కనిపించినాఁ డనిన సంతోషించి రంగక్షమా
వరచంద్రుండును గొల్వుగూటమునకు న్వారిం గడు న్వేగ రా
నరు నంపించిన వారు వచ్చిరి మహానందంబు సంధిల్లఁగన్.

143


క.

హరకాలా ల్గొనివచ్చిన
ఫరావానా చూచి హర్షపరవశుఁ డగుచున్
శిరసావహించికొనుచుం
దిరమగు బహుమానజలధిఁ దేల్చె న్వారిన్.


మ.

తగు ప్రత్యుత్తరము ల్మహావినయసంధాబంధురస్ఫూర్తిమై
నగధీరుం డగురంగరాయనృపుఁడు న్వ్రాయించి పంపించె నిం
పుగ నా వచ్చినవారిసంగతముగా భూరిప్రతాపైకర
మ్యగుణాలంకృతు దామెరాన్వయుని దమ్మన్నప్రభుగ్రామణిన్.

145


మ.

అతఁడుం దగ్గబలంబుతో నరిగి ధూమ్రాక్షప్రతీకోద్ధతా
కృతీయౌ హైదరుజంగు నుగ్రతమదృగ్వేల్లద్రుషాపావకో
ద్ధతకీలాముఖవిస్ఫులింగుఁ గని యాత్మ న్నివ్వెఱం గందుచున్
హితముం దెల్పుచు నర్జుదాస్తు గుజరాయించె న్సమంచద్గతిన్.

146


తే.

అట్టు లరుదెంచి పొడఁగనునంతలోన
నెరపరము కన్నుదోయికి నెగరఁబాఱి
యెఱ్ఱడా ల్సూప ఖానుసాహేబుగారు

అలిగి దామెరదమ్మన్నవలనుఁ జూచి.

147


శా.

ఏలా రాఁడు భవత్ప్రభుం డిటకు రాఁడేనిన్ మఱిన్ మేల్గడీ
ఖాలీ చేసి యథేచ్ఛ నేగు మని మీఖావందుకున్ వ్రాయుమీ
వాలాయంబుగ నిప్పు డీవని జ్వలద్వైశ్వానరుండో యనం
జాలాకోపముతోడ మండిపడి పాశ్చాత్యుండు పల్కె న్వడిన్.

148


తే.

అట్టిపలు కాలకించి దమ్మన్న యనియె
కోట ఖాలీ యొనర్చుట కేటిసబబు
మావలన నేర మేమి మారావుగారు
తమ్ము దైవంబుమాఱుగాఁ దలఁచుచుండు.

149


ఉ.

నేరము లేనివారి మము నిష్ఠురవాక్యము లాడ మీకుఁ జ
న్నే రుచిరాంతరంగుఁ డవనీధవచంద్రుఁడు రంగరాయనిం
గారు భవన్నిరీక్షణనికామమనఃప్రమదంబె కైకొనం
గోరినవాఁ డతండు తమకుం గరుణింపఁగ నర్హుఁ డన్నిటన్.

150


ఉ.

ఓపిక లేక యిట్లు దగు నోటు భయోక్తులు పల్కు మీరు హా
కీములి కించు కేని పరికింపక యస్మదరాతిరాజు లే
మేమి వచించినారొ యవనేశ్వర వారలు పల్కినట్లుగా
మీమన సిట్టిదైనఁ దరమే యెదురాడఁగ మాకు మీయెడన్.

151


ఉ.

రాయనిగారివద్ద నపరాధ మొకించుకయేని లేదు ము
న్నే యిటు వచ్చి మిమ్ము రమణీయగతిం బొడఁగాంచు యుక్తికిన్
మాయకుఁ డైన యస్మదరిమానవనాయకుఁ డిందుఁ గల్గుటన్
రాయడి పుట్టునన్న విధురం బగు బుద్ధిని రామి తక్కఁగన్.

152


తే.

మాయెడల నిట్టితక్సీరు మాపుచేసి

కౌలు దయచేసినను రావుగారి నిపుడు
తావకీనావలోకనోత్సవము నెఱవఁ
బిలువ నంపింతు ననవుడు నలుక వొడమి.

153


చ.

తరమిడి చూచి దమ్మనృపుధర్మనయప్రకటప్రసంగముల్
కరమును గర్ణశల్యములు గాఁగఁ బొరింబొరి నాటిన న్మహో
ద్ధురగతి ఖానుఁ డిట్టు లను దోర్బల సంపద విఱ్ఱవీఁగి య
ప్పురుషుఁడు మాకు మా ర్మసలి పోరఁదలంచినచూడ్కిఁ దెల్పెడిన్.

154


శా.

కౌలున్ వ్రాయము తాను రావలవ దింకం గోటపై ల్వెల్లి జా
గాలో నుండక లేచి పొ మ్మనుచు లేఖ ల్వ్రాసి పుత్తెంచు మీ
వేళం గూడకయుండెనేని నిఁక నీవే పోయి వేగంబ ఖి
ల్లాలో నుంచి వెడల్పు మంచు నతఁ డల్కం బల్క సెల్వందుచున్.

155


ఉ.

బొబ్బిలి వచ్చి దమ్మనప్రభుప్రవరుం గని ఖానునొద్ద నా
గుబ్బుకొనం జనించు పలుకు ల్సెవి నించిన ధైర్య మూఁది లో
నుబ్బెడు నర్థమోహమున నుక్కు మెయి న్బెదరించునేరుపుల్
దబ్బర సుద్దులాడుటలు తల్ప దివాణపువారినైజముల్ .

156


మ.

గరిమన్ జూపి దివాణ మర్ధకృతకాంక్ష న్వంచనాపూర్వభీ
కరచాటూక్తులఁ బల్కునంతనె గడీ ఖాలీయొనర్ప న్రిపూ
త్కరము ల్నవ్వఁ బలాయనంబు మదిలోఁ గావింప నెంతాటపా
టరుషాదర్పితుఁ డత్తురుష్కుఁ డనుచుఁ దక్కోడఁగా నేటికిన్.

157


ఉ.

కోరివయర్థ మెంతయినఁ గొమ్మని యీ నొడఁబాటుఁ జెందియు

న్నారము నేర మించుకయు నాయెడలన్ సరకారుపట్ల లే
దూరక క్రూరకర్మమున కొప్పి వధూజనతాసమేతులౌ
వారల మైన మాపయికి వారలు వత్తురె ద్రోహబుద్ధికిన్.

158


మ.

అపరాధం బనుమాట లేనియెడ నర్థాపేక్షచే భీకరా
లపనంబు ల్బచరింతు రింతియ రణోల్లాసంబుచే నెత్తివ
చ్చుపను ల్వుట్టవు బైక మెంతయిన నజ్జోడింప కర్పింతు మ
ర్థపుటాసం గమకించువారలక యుక్తంబు ల్దురంపుంబనుల్.

159


ఉ.

 కావున నిందుకై జడియఁ గాఁ బని యేమని యాత్మవర్గచిం
తావలమానసంశయకృతాఖలచింతలు మాన్చి పుచ్చి ధై
ర్యావసధాయమానహృదయాంబురుహుం డయి రంగరాయధా
త్రీవరుఁ డుండె నంత రుషదీండ్రిలఖానుఁడు బూసిచెంగటన్.

160


తే.

చేరి యిష్టానులాపము ల్సేసికొనుచు
రాచకార్యంపుసరళిలో రావువారి
ముచ్చటలు కొన్ని దెచ్చి సమ్మోద మొదువఁ
దాను రాజును డాసి మంతనము సలిపి.

161


మ.

మనకు బందరు నుండి వచ్చిన సుధామాధుర్యవాక్సంగతుల్
వినతిగ్రాహ్యము లిందుమీఁద నొకఁ డావెల్మాతఁ డర్థాఢ్యుఁ డా
యనచేఁ గట్నముపేరు వాడుకొని యర్థాకృష్టిఁ గావించి పైఁ
జనుట ల్సూటియ నా నతండు మది హర్షం బందెఁ దద్రీతికిన్.

162


ఆ.

అంత నపుడు వార లఖిలసైన్యములతోఁ
గసిమికోటఁ గదలి కడురయమున

నొప్పు మిగుల నడచి యొడ్డాదిమీఁదుఁగా
బోయి దేవులపలిపొంతఁ దిగిరి.

163


చ.

మనసరిహద్దునన్ ముసలిమానుఁడు రాకొమరుండు బూసియున్
మొనకొన వచ్చి డిగ్గి రను ముచ్చట లందెను రావుగారి క
య్యనుపమధైర్యుఁ డప్పుడు రయంబు మెయిం జెలికానివంశజున్
ఘనయశు వెంకభూధవశిఖామణి నంపఁదలంపు వేడుకన్.

164


ఉ.

పోడిమి మీఱ రాముఁ డనుపూరుషుఁ జిట్టెలవంశజుం గడుం
దోడుగఁ గూర్చి సమ్మదముతోఁ దగు నుత్తరము ల్రచించి యా
ఱేఁ డనిచెం బ్రతాపవిధురీకృతసర్వదిగంతవైరిస
మ్రాడుదయున్ దయామయు సమగ్రయశోహరిణాంకు వెంకయన్.

165


చ.

అతఁడును నేగి యయ్యవనునానతిఁ గట్టెదుట న్నిషణ్ణుఁడై
హితము నయమ్మ దోఁపఁగ నొకించుక కొంచక యుగ్గడించుచో
నతఁడును గోపఘూర్ణితహృదంతరుఁడై నడపె న్వెస న్భవ
త్క్షితిపతికోటఁ దా వెడలి శీఘ్రమె పోయెనొ లేదొ నావుడున్.

166


ఉ.

హైదరుజంగుతో ననియె నప్పుడు వెంకనృపాలమౌళియు
న్మాదొరగా రొకింత యనుమానము లేక కృపార్ద్రమైన మీ
యాదరణ న్మొలాజుమతుకై చను దేరఁ దలంచినాఁడు న
మ్మోదముచేత రమ్మనెడి ముఖ్యముగాఁ దమకౌలు వచ్చినన్.

167


తే.

వచ్చినయనంతరమ్మున వారు తమరు
గలసి ముచ్చటలాడెడు గారవమున
వ్యగ్రత యనంగ రాక విూవచనసరణి
నడపఁగలవాఁ డతం డని నుడువుటయును.

168

చ.

పలికెద వేల యిట్లు పసిబాలులతోడుత మాటలాడి న
వ్వులు పచరించినట్లు చనువు ల్నెరపే వది మంచిమాటగా
దలఘుపరాక్రమాతిశయు నాతనికోట వదల్చురీతిగాఁ
దెలియఁగ వ్రాయు మిప్పు డని తీవ్రతఁ జూపుచు ఖానుఁడ ల్గుటన్.

169


తే.

కస రొకించుక దొట్టి వెంకయ్య యనియె
రావువారికి నీకు పూర్వంబు వైర
మున్నదా యేమి కార్పణ్య ముప్పతిల్లు
కారణం బేమి నీ కయో ఖానవర్య.

170


సీ.

సరకారుపట్టున దురహంకృతి వహించి
       మరలుఁబాటుతనాన మసలినామొ
పైక మీఁజాలక బాకీ కటాయించి
       యొఱగొడ్డెములఁ బల్కుచుండినామొ
తమకు నిష్టము గాని దారి గ్రుమ్మరుమతి
       గేడించి రుజువుగా నోడినామొ
నాఁడునాఁ డేమైన నయరహితము లైన
       నడక లేమేనియు నడచినామొ


తే.

దొంగలము మేమొ యిలు వెళ్లి తొలఁగునంత
పనులు మా కేమి నేరము ల్పంచినావు
సాహెబుసుబావు నీ వను జంకు వొడమి
కౌలు గావలె ననుటయే కంటకంబె.

171


క.

స్త్రీబాలవృద్ధజనముల
తో బహుకాలంబునుండి దొరతనపుఁ బసన్
శాబాసి గీలుగొంటిమి
మీబోటిసుబాలవద్ద మే మలఁతులమే.

172

క.

అవరోధజనముఁ దోడ్కొని
భువిజనములు నవ్వఁ గోటఁ బోనిడి పో హే
తువు మాకు నేమి నీ కీ
యవివేకపుఁ దెరవు బుట్టనగునా ఖానా.

173


మ.

అధికారంబు వహించి వచ్చిన సుబావామీఁద ఖావంద వె
వ్విధి నైన న్సరకారుశిస్తుఫణితిన్ విత్తంబు చిత్తంబురా
వ్యధలం గొల్పక కొందు నే ననక మీ రాకోట ఖేటింపుఁడన్
పథము ల్ధప్పినపల్కు వల్కఁ దగునే పాశ్చాత్యలోకేశ్వరా.

174


చ.

ఇఁక నొకమాట కోట వెడలించెద నన్న ప్రతిజ్ఞ నీకుఁ బూ
నిక యయి యుండెనేని ధరణీధవచంద్రునిఁ జిన్నవారితో
నకలుషవృత్తి బైట దిగునట్టుగఁ జేసెద నీవు వచ్చి కొం
కక బలుకోటలో డిగు సుఖంబుగ నస్మదరాతి దక్కగన్.

175


చ.

పొగలుచు మీర లిల్వెడలిపొ మ్మను సుద్దులు కోటలోన మా
పగతురఁ దెచ్చి డింతు మనుభాషణము ల్వివరించి చూడఁగాఁ
దగవులు గావు నూర్జితపథమ్ములు గా వవి మీకు నిట్టి వి
య్యగణితపౌరుషాధికుల మౌ మముబోంట్లకు గావు నర్హముల్.

176


శా.

సాహంకారుఁడవై మదీయరిపువాచాపద్ధతిం బోయినన్
ద్రోహంపుంబనిఁ గూఁడఁ బెట్టుకొను టెంతో నిక్కమౌ నీకు సం
దేహం బే మిఁకఁ గోట వీడుటలు మాదేహాలతో నొప్పలే
మాహా యిట్టిదురాగ్రహంపుఁబను లేలా ప్రేల ఖాన్ సాహెబా.


ఉ.

 నాయము దప్పి మీపయి రణం బొనరించుట కెత్తిరాము మా
యాయతనస్థలు ల్దొలఁగి యన్యగృహంబుల గోరి పోము మీ

చేయఁ గలంతచేయుఁ డజుచే మును నెన్నుదుట న్లిఖించునం
తాయువు దప్ప నేరదని యాయన రాయనిఁ జేరెఁ గ్రమ్మఱన్.

178


క.

రంగారాయనృపాలుని
చెంగటికిం జేర నరిగి చెలికానికులుం
డంగీకృతార్హనిధి యై
సంగరమె ప్రధాన మనుచు సర్వముఁ దెలిపెన్.

179


తే.

తెల్పి యచ్ఛిద్రకర్ణునితెఱఁగుఁ జూడ
బవరమున కోహటింతు నన్పలుకెకాని
సంధి కొడఁబడుమాటల జాడ లేదు
మీఁదటిప్రయత్న మొనరింప మేలు మనకు.

180


మ.

కలనైన న్మనకు న్దివాణముపయిన్ ఖడ్గంబు సారించుటల్
కలలోన న్విహితంబు గానియది నిక్కం బింక స్త్రీబాలవృ
ద్ధుల దూరమ్ముగ నంచి పొంచికొని యస్తోకస్థితిం గోటలో
పలనిల్తా మటుగానిచో ననిపడన్ భంగంబు వచ్చున్ నృపా.

181


ఉ.

క్రూరత రాజు ఖానుమతిఁ గోమలమై చిగురొత్తఁగా మహా
వైరముఁ బెంచుచున్నెడ దివాణమువారు నయమ్ము దప్పి దు
ర్వారగతిన్ శతాంగహయవారణఘోరచమూశతఘ్నికా
వారముతోడ మిన్నొఱయువైఖరి రా నిటు లుండ యుక్తమే.

182


ఉ.

వె య్యననేల రంగపృథివీవర జాగ్రత నొంది యుండుటే
తియ్యము నెయ్యమైన మదుదీరితనీతి గ్రహింపు మంచు వెం
కయ్య వచించుడున్ నృపశిఖామణి యిట్లను డాగియుండినన్
దయ్యమునెత్తికోల్తలఁపు దప్పదుపో మన మెట్లు చేసినన్.

183


ఉ.

వానికచేరి భీకరత వానిజవాబులు వానిచెయ్దముల్
కానిక గావు విూర లవి గన్గొని భీతిలనేల యర్థ మె

ట్త్లెన గ్రహింపఁగాఁ దలఁచి యాడెద రిందుల కెంతవింత మీ
కైనవిచార మేమి చనుఁడా యని యించుక యూరడించుచున్.

184


క.

విమతత గొని యొక్కదివా
ణమువా రెక్క డికి దూగి నడచిరయేనిన్
సమయానుగుణక్రమమే
గమనాగమనంబు లెన్నఁగా నుచితంబుల్.

185


ఆ.

మనవిరోధి రాజుఁ గొని వారు వచ్చుచో
వెనుకఁ ద్రొక్కి పోవు టనుచితంబు
వీరవర్యు లయిన వెల్గోటిశాసనాం
కులవిధంబు గాదు తలఁగు చూడ్కి.

186


చ.

మనగడిదుర్గపుంబలుపు మత్కులధర్మము మమ్ముఁ గొల్చుని
మ్మొన గలయట్టిపోటరుల మొక్కలు వోని మగంటుము ల్బళీ
యన కిటులాడ నీకుఁ దగునా మృగనాభి యలంది చంక లె
త్త నిఁకఁ బనేమి యాత్మబలదార్థ్యముఁ దా గణుతింప నేటికిన్.

187


తే.

ప్రథనభూములఁ బీరు దీక పగఱ నొడిచి
జయముఁ జేకొన్న సత్కీర్తి జగ మెఱుంగు
రణము గుడిపిన వీరులు రావువారు
మార్తురకు దౌలఁ దొలఁగుట మంచిపనియె.

188


చ.

వెలమ లమోఘవిక్రములు విశ్వధరాస్థలినందు నెల్లది
క్కుల విన కారు రేచరలగోత్రుల పౌరుషమందు రావువా
రల భుజశక్తి యద్భుతకరం బటుగావున నట్టిదైన యి
క్కులమునఁ బుట్టి రంగనృపకుంజరుఁ డోరసిలంగ నొప్పునే.

189


తే.

వేపిఁ జేపట్టి గజరాజు విడిచినట్ల
గత్వరము లైన ప్రాణముల్ గాచికొనుట

కామృగాంకర్కతారాగ్రహంబుగాగ
వెలయు సత్కీర్తి గోల్పోవు వెఱ్ఱి గలఁడె.

190


శా.

లాసూముఖ్యుల కెల్ల నొడ్డుగ రసాలావారియెల్గోల్తుపా
కీసామాను గుఱాలపౌఁజునకు రాట్కేనర్యుపాలంభదో
ర్వ్యాసంగంబు వరింపఁ దాండ్రకులజు న్వప్రంబరాబాకుగా
జైసాచన్ బురికొల్పి శాశ్వతయశస్సంపాదినై పొల్చెదన్.

191


ఉ.

ఆదిమవీరయోధతతి నైన వెరం గొనరింపఁజాలు మ
త్సోదరుఁ డల్గె నావిమతశూరవరేణ్యులు వల్గతంబులౌ
నాదినిశీలతత్తదధిపాగ్రణు లైనఫరాసువారి నా
హైదరు జంగు నొక్కమొగి నాహుతి సేయఁడె రోషవహ్నికిన్.

192


ఉ.

ఈగడిదుర్గ మీగయిత లీతెలగాబల మీతుపాకిబా
రీగజవాజిరాజతతు లీమనబాంధవవర్గ మీయరా
బాగమి యీముకుందపురిబల్లెపురాణువ రిత్త బోవునే
భూగగనంబు లొక్కతరి బొక్కిపడన్ జగడంబుఁ జూపకన్.

193


తే.

ఇంత సామగ్రి గలిగి మీయంతలేసి
మడమ దిరుగనిమగటిమి మారుమసలు
పద్మనాయకబలముతోఁ బగతు రెదుర
మార్మొగము జూప బాపురే మనల కగునె.

194


చ.

అని బహుభంగులం దనబలాబలదర్పవిజృంభణంబు నే
ర్పున వివరించి పైననియె భోరున నాచెయి మించె నాధరా
జనము నుతింప నిప్పుడమి సర్వము నేలుదు వారిచేయి మిం
చిన సురరాజ్య మేలుదుఁ బ్రసిద్ధముగా సకుటుంబినై కడున్.

195


క.

మాతో పాటున కొడఁబడి
భీతిల్లక నిలుచువారిఁ బేర్కొన నేలా

యీతెఱఁ గొప్పనివారలు
చేతఃప్రమదంబుకొలఁది సేయుం డనుచున్.

196


క.

ఆజికి పై కాపన యా
రాజున కెదురొడ్డుఁజేసి రాజాంకోటం
దేజమునఁ దాండ్రపాప
క్ష్మాజానిం గుదురుకొలిపి సంభ్రమ మెసఁగన్.

197


సీ.

నక్తందివంబును నాదుపాదుకొనంగ
       సాహేబునౌబత్తు చరుపఁబనిచి
కడుగడీపై నలంగముచుట్టు నెల్లెడ
       గస్తు గ్రుమ్మఱునట్లు గట్టిపఱచి
బురుజులమీఁద నిష్ఠురతరాయోధన
       సాధనసామగ్రి పాదుకొల్పి
బిరుదువస్తాదులఁ బేర్వేఱ నాడాడ
       ముస్తాదుగా నిల్వఁ గుస్తరించి


తే.

యసి ముసల కుంత పరశు పట్టసముఖాది
పరుషహేతిచ్ఛటల కెల్ల బదను దీర్చి
తగుబలస్తోమములతోడఁ దగినరీతి
రావుకులహేళి యుండె బీరమున నంత.

198


సీ.

 తురగరింఖాముఖోద్దూతభూతలరేణు
       జాతంబు దివికిఁ బ్రచ్ఛదము గాఁగఁ
గరిఘటాపటలఘీంకారనిర్ఘోషంబు
       గర్జారవమ్ముల గారవింపఁ
జటులధ్వజానీకఝంపాప్రకంపన
       ప్రతతియభ్రావళిఁ బాఱఁదోల

రథచక్రనేమిపరంపరాఘాతకా
       తదితమై పాతాళతలము బెగడ


తే.

నగణితాయుధచయధగద్ధగితకాంతి
సవితృబింబంబు నొరఁబట్టుజాడఁ దెలుప
రాజమణిసంగతముగా ఫరాసుబలము
లగ్గడీడగ్గరకు డాయ నరుగుదెంచి.

199


క.

గవ్యూతిమాత్రనికటత
లవ్యుత్పాదితవినిర్మలస్థలసరసీ
దివ్యోదపానవిగతప
థవ్యథులయి సేద దేఱి తద్దయుఁ బ్రీతిన్.

200


సీ.

 జలజపత్రాంచలచ్ఛాయావినిద్రిత
      కమనీయకోకస్తనముల దాని
శైవాలనీలరోమావళీవళితని
       మ్నాభిరామావర్తనాభిదానిఁ
జంచరీకోత్కరచ్ఛదరుచికజ్జలాం
       తరితాంబుజాతనేత్రముల దానిఁ
గాదంబవలయకాంచీదామవేష్టన
       ప్రబలసైకతనితంబముల దానిఁ


తే.

గంటి కింపైన నెచ్చెలివంటిదాని
నచ్చెరువు గాంచి యచ్చెరు వందుకొనుచు
నిలిచె నచ్చేరువన నవనీపకుటజ
తరువరశ్రేణినీడలఁ దురకబలము.

201


ఆ.

 రాచపుడమిఱేడు రాజిల్లి తత్తటీ
కాంతసీమ నొక్కకాంతమైన

రాతిగుట్టయెడ సరాతిభయమ్మున
నండ యిది యటంచు దండు విడిసె.

202


తే.

అట్లు విడి మట్టు నేయ దిగంతదంతి
కర్ణకోటరపాటనక్షమ వహించి
మన్నెహంవీరుకోటలో మిన్ను పగుల
మొఱయు సాహెబునౌబత్తుకరము దనరె.

203


తే.

కఱకుములుకులచాడ్పున నుఱక మెఱయు
నాదువీన్గవ డాసి నోనాఁటిపాఱఁ
బారసీకవతంస మపారరోష
భీషణారుణితాక్షుఁడై బెదరి లేచి.

204


మ.

వితతోద్వృత్తికనీనికాభయదదుర్వీక్షాకృశాను న్విని
ర్జితహిందూవసుధాధిపవ్రజమహాసేనావధాను న్సము
ద్దతమాయామయవాఙ్నిధాను నతిరక్తశ్మశ్రుసంతానవే
ల్లితవక్త్రోపరిదోర్విధాను హసనల్లీఖాను నీక్షించుచున్.

205


సీ.

ప్రళయకాలపయోదపటలీపరిస్ఫుర
       ద్గర్జాసమూర్జితాఖండశక్తి
శైలశిఖాతటస్ఖలితగండోపల
       జనితనిర్ఘొషప్రచండపటిమఁ
బురభిదుద్యత్కరాంభోరుహోచ్చాలిత
       కల్పాంతఢక్కానికామకలన
మందరక్షొణిభృన్మథితమహార్ణవ
       ఘుమఘుమారభటికాగుంభనంబుఁ


తే.

దెలుపు నిది యేమి కలకలం బలుకు నినుచు
ననుడు రా జడ్డగోలుగా నగ్గడీని

వెగ్గలంబుగ మ్రోయించు వెలమఱేని
యనుపమంబైన నౌబత్తు నినద మనిన.

206


క.

కసరుట్టియుట్టి పడుచు
న్విస మొల్కెడు వేఁడిచూడ్కి వెదజల్లుచు న
ల్దెస లారసి యిట్లను నో
హసనల్లీఖానవర్య యనుపమశౌర్యా.

207


శా.

నీ వచ్చోటికి నేగి యప్పుడమిఱేనిం గాంచి నోనాడి యీ
క్రేవం డిగ్గినవాఁడు సాహెబుసుబాకేలాచకిట్టు ల్భయా
భావం బై నమనంబుతో నుదుటున బత్తుం బజాయించుచు
న్నా విక్కార్యము మాని యింక గడిలోనన్ లేచి పోనోడవో

208


క.

అని తెలియ నడిగి రమ్మని
ఘనకోపనిరీక్షణంబు గదురఁగ ఖానుం
డనిపినఁ జనువేడుకతోఁ
దనదూత్యద్రఢిమ మివులఁ దనివి సొరంగన్.

209


మ.

మురువై పేర్చుకడానివన్నియజరీమున్నూలు పుస్తుంగుబం
గరుపల్లంబు నిగారపుంబనితరాకళ్లెంబు విన్నాణపుం
బిరుదు ల్దిద్దిననిద్దమౌ నొకయరబ్బీ నెక్కి చొక్కంపుఁదా
ల్మి రహిం జొప్పడ నేగుదెంచె హసవల్లీఖానుఁ డామోదియై.

210


ఆ.

అతనిరాకఁ జూచి హర్షించి కంచుకి
దెలుప నరిగె నంత నిలుపరాని
సమ్మదంబు బొంగుఁ జంద్రోదయారంభ
వేళ జలధిఁ బోలె వెలమదొరకు.

211

తే.

 హర్షమగ్నాంతరంగుడౌ నానృపాలుఁ
డతని కెదురేగి కౌఁగిట నామతించి
తోడుకొనివచ్చి యొక్కయస్తోకచిత్ర
కంబళావృత మైనకూటంబులోన.

212


క.

ఆసీనుఁ జేయ నాతం
డాసారసుధారసాయితాసారస ము
ల్లాసంబు నెఱపు నిష్టక
థాసల్లాపములఁ గొంతదడవు వసించెన్.

213


వ.

 ఇవ్విధంబునం బ్రొద్దు జరపి యిష్టకథాప్రసంగంబులవల
నను గణికానికాయనటనచమత్కారజనితాభంగురవిలా
సతరంగంబులవలనను నంతరాంతరంబుల నయ్యనంతాకాం
తుం డొసంగు నుడుగరలవలనను గుతుకం బంతరంగంబునం
బొడమనీని యంగీకారానంగీకారంబులు కార్యసౌకర్యా
నంతరకరణీయంబులుగా నెఱుంగం బలుకుచుం దనయే
లిక యనిపిన రాకరాకానిశాకరప్రతీకాశుం డగు నమ్మన్నె
దొరకు నెఱుకపఱచినం గనలి యతం డతని కిట్లనియె.

214


చ.

ప్రబలతరప్రభుత్వమున భాసిలు ఫాదుషహా యొసంగఁగా
నిబిడతమప్రభావమున నేర్పుమెయిం గొనినాముగాని సా
హెబునవుబత్తు దీని నెవరేని యెఱుంగక యుండ దొంగవే
డబమునఁ దెచ్చికొంటిమె తడంబడ కిట్టు లనంగ న్యాయమే.

215


మ.

బలవంతమ్మున నన్యులం గదిమి యప్రామాణ్యదుర్నీతిచే
నిలు వెళ్లింపుచు నా క్రమించుకొనలే దిచ్చోటు గాణాచిగా
నెలవై యుండెడుతావు మా కిదియ యెన్నే నాపద ల్వచ్చినన్
వలస ల్పోయి యెఱుంగ మేమిపనిగా వంచింప నిప్పల్కులన్.

216

తే.

 ఏడుమూఁడుతరంబుల నిందెయుండి
యాపదలు వాపికొనుచు భాగ్యానుభవము
గొన్న వారముగాని యీకోట వదలి
పోవుట యెఱుంగ మకట యీపూటదనుక.

217


శా.

మా కత్యంతవిరోధిరా జతని సన్మానించి చేపట్టి మా
రాకున్నట్టి దినౌబతు ల్సలుపుట ల్ప్రాధాన్యము ల్గాగ న
స్తోకప్రౌఢిని నీరుకాకినెపము ల్జొడించి పల్మా ఱయో
హాకీము ల్దమ రిట్లు పల్కుటకు నర్హంబే విమర్శింపకన్.

218


శా.

లక్షద్వాదశశుభ్రదానకలితోల్లాసంబున న్మీమనం
బక్షీణప్రభచేఁ జెలంగ భవదీయాంచత్కృపాపాంగస
ద్వీక్షావైభవ మంది మద్విమతపృథ్వీజాని మాకోట నేఁ
డక్షుద్రోద్ధతిఁ గైకొనం దలఁచెఁ గాదా భూరివైరంబునన్.

219


ఆ.

మమ్ము గెలిచి కాని మాకోటఁ జేకొన
నేరఁ డెంతయేని వీరుఁడైన
శూరధర్మమునకుఁ జొప్పడు నగురీతి
బారుదీర్చి నడచి పోరు టెందు.

220


చ.

నలువదివేలకాల్బలమున న్బలవత్తరుఁ డైనవాఁడు రా
ట్కులమణి నాల్గువేలుదళ గొల్వఁగ నుండెడువార మేము వా
రలపస మత్ప్రతాపము దురమ్మున బారునఁ గాని కానరా
దలఘుమనోవినోదగతి నారసి తారసిలించి చూడుఁడీ.

221


క.

 ఆరాచవారి మమ్మున్
బాఱునకుం దీర్చి యొక్కపసిమినిశానీ
వారలచేతికి నిచ్చిన
ఘోరాహవ మోర్చి దానిఁ గొంటిమ యేనిన్.

222

చ.

పదపడి మాయథాస్థలికిఁ బాత్రులఁ జేయుఁడు మమ్ము లేకయ
క్కదనమునందు నోడి తిరుగం బడి చచ్చితిమేని మీర లె
య్యది యపరాధ మూన్చినఁ దదర్హత మాఙ్ఞకు నియ్యకొల్పి యుం
డెద నిరువాగువారల కడిందిమగంటిమి కాన నయ్యెడున్.

223


మ.

అది గా దేని యతం డొసంగుధన మెంతౌ నంతకే నిబ్బడి
చ్చెద నారాచకుమారుఁ డెలు పురి తత్సీమాసమేతంబుగా
మదధీనం బొనరింపుఁ డెంతయును ధర్మప్రక్రమం బంచు వె
ల్లిదమౌ సాహసిరావు పల్క హసనల్లీఖానుఁ డాపిమ్మటన్.

224


ఉ.

మన్నెకుమార నీనిరుపమానవచోనియమంబు నీతిసం
పన్నత గల్గువారిచెవిఁ బట్టెడుఁ గాని దురాగతోద్ధతిం
జెన్నెసలార మీపగతుచే మును పల్కఁగనైన కొండెముల్
విన్నకృతఘ్నుఁ డెవ్విధిఁ జెవిం దవిలింపఁగ నోపునవ్యమున్.

225


చ.

అకలుషసాగరాంతవసుధాధిపుఁ డయ్యుఁ దురుష్కుఁ డయ్యు బై
నొకరిదురుక్తి డెందమున కొప్పిదమై ప్రసరించి యుండియుం
బ్రకటితవైరబద్ధుఁడయి భాసిలునప్పుడు నిప్పుద్రొక్కుకోఁ
తికి శివమెత్తుచంద మది ద్రిప్పుట కేరితరంబు భూవరా.

226


చ.

భవదభియాతి కిచ్చెనఁట బాస పదార్థపుటాస మున్ను గై
దువుఁ గొని ముట్టి తప్పడని తోఁచుచునున్నది దాని నింక న
య్యవనుఁడు దుష్టమానసుఁ ఢహంకృతిచే నభిమాన మూది పై
నెవరును జెప్పిన న్వినఁ డదెట్టి మతంబకొ రా దెఱుంగఁగన్

227


మ.

ఇది దుస్తంత్రము దీని కియ్యకొని నీ వీపద్ధతి న్రాచవా
రిదురాలోచన వింట మంచిపనియే రేచెర్లగోత్రీయుఁ డే

మి దివాణానకుఁ దప్పుఁ జేసె గతమే మీవారి వేధింప నీ
యుదితక్రోధరసంబు డింపుమని వేయుం జెప్పినా రందఱున్.

228


చ.

పనివడి వారితోడి చలపాదితనంబు వహింప నేల పై
కొని చనెనేని త్రొక్కటము గూడును వైచినయట్లు వై చినన్
మొనకొని వేదురైనను నమోఘముగా జయమందు నండ్రె గా
వున ధరణీశముంటములు వుచ్చిన మేలు సుమీ తలంచినన్.

229


చ.

విను మిసుమంత మామనవి వింత యొనర్పక యొక్కమాస మీ
వనుపమధైర్య మంది చని యంతట నంతట యుండితేని యే
నినుఁ గొనివచ్చి క్రమ్మఱను నిల్పెద నీదగుకోటలోన నీ
మనమున సంశయింపకుము మన్నెకుమారశిరోవతంసమా.

230


ఉ.

వారు దివాణమౌట బలవంతుల రింతటి కెన్నఁగా జమీ
దారులు మీర లట్లగుట దాష్టిక మెల్లను వారిసొ మ్మహం
కారము మీకుఁ జెల్లుబడిగా నొరగొడ్డెము లాడి యోర్వఁగా
లే రెవరేని వారి కదళీదళకంటకసామ్య మౌటచేన్.

231


సీ.

కేకయాత్మజ చేయు కృత్రిమంబునఁ గాన
       బాములఁ బడఁడె శ్రీరామమూర్తి
గడుసుయోధనుచేత నిడుములఁ గుడువఁడే
       ద్వైతవనంబున ధర్మసూతి
కలికృతం బైన దుష్కరబాధ నొందఁడే
       లలనాసమేతుఁడై నలవిభుండు
గాధిసూనుఁ డొనర్చు కస్తికి నోర్వఁడే
       సతియుఁ దానును హరిశ్చంద్రనృపతి

తే.

యక్కటా యంతవారి కొక్కొక్కవేళ
గ్రహగతులు దప్పి వచ్చును గష్టపడియు
దుద శుభం జందరొక్కొ యాపదల కోర్చి
సంపదలఁ గాంచు మనెడు శాస్త్రంబు దలఁచి.

232


ఉ.

కాన నృపాలవర్య తురక ల్బలవంతులు వారితో విరో
ధానకుఁ బోవఁగూడ దది తథ్యము సామము దాన మాదిగా
నైన నయమ్ముల న్విజయ మందఁ దలంచుట మేలగు న్నయు
ద్ధే నకథాచనేతి బుధుడే యనె శాస్త్రము మీ రెఱుంగ రే.

233


సీ.

బ్రాహ్మణద్రోహంబు పరమధర్మవిచార
       మన్యాంగనాసక్తి యాత్మశుద్ధి
వృత్తివిచ్ఛేదంబు నిహితసదాచార
       మన్యాయవర్తనం బధికతపము
నిత్యకర్మము మేదినీజనక్షోభంబు
       ధార్మికపీడ హితవ్రతంబు
దుష్టభాషణము లభీష్టదైవస్తుతు
       ల్కేవలనియమంబు దేవఘాత


తే.

మ్లేచ్ఛులరు నిక్క మందులో మెఱుఁగుపాఱి
పాటిదప్పిన దుర్గుణప్రాణి యైన
వానితో నీకుఁ జల మేల వలదు వలదు
తొలఁగి చనుటయె మిగుల సంతోష మనుచు.

234


చ.

 నయము భయమ్ము దోఁప యవనప్రభుదూత వచించుడుం గడున్
రయమునఁ గోపచిత్తుఁ డయి రంగనృపాలుఁడు నిట్లనున్ జయా
జయములు దైవవేద్య మని శౌర్యముఁ గల్గినవార లొప్ప రీ

క్రియను బరాఙ్ముఖంబునకు గేవలశాత్రవు లెత్తి వచ్చినన్.

235


తే.

మాననీయతఁ గాంచి యస్మద్విరోధి
జవనయవనాశ్వికులతోడ సంభ్రమించి
యెత్తి వచ్చినయపుడు మే మొత్తిగిలుట
రావువంశంబు దుష్కీర్తితావుఁ గనుట.

236


ఉ.

 కావున విూర లెంతనయ గౌరవభాషణము ల్రచించినన్
భావ మొకింతయు న్విముఖభావము గాంచదు మాకు శౌర్యసం
భావితకీర్తియౌ వెలమపట్టికి ధర్మము గానిరీతి యే
లా వచియించు టర్ధకృతలంపట మొప్పెద నెంతయేనియున్.

237


మ.

ధృతి నర్పింతుఁ బదార్థ మెంతయిన నిర్దేశించినం బైనసం
గతము ల్పౌరుషహానికృత్యములు దుర్గం బిచ్చి పొమ్మంట నౌ
బతు జాలించుమటంట వీనికి నొడం బా టొందుట ల్లేవు మా
మతిలోఁ గీర్తిధనాఢ్యు లెందు బిరుదు ల్మాయింతురే యుర్వరన్.

238


క.

బిరు దుడిగిపోవుకన్నను
మరణంబే మేలు మాకు మఱియు విచారం
బరయఁగ లే దిది తుదివ
త్సర మనికొనియెదను దీన సందియమేలా.

239


క.

ఋభులోకవిభునియంతటి
శుభలక్షణలక్షితునకు సొలిగెనె నహుష
ప్రభవాపత్ప్రథ యిప్పటి
కభిమానం బెడలుకంటె హైన్యము గలదే.

240


తే.

అర్థ మెంతైన నిచ్చెద మంతమీఁద
నొడఁబడఁడయేని ప్రాణము ల్విడుచువార

మంతయేకాని పౌరుషహాని కొప్పి
వెడలనోపము దీనికి నడల ననుచు.

241


మ.

నయసంధాయకచాతురి న్మెలఁగు శాణా వైతివా యర్దని
ర్ణయ మేర్పా టొనరించి సంధియ యొనర్పం జూడు మీవింక దు
ష్క్రియకుం బూనిన వానిడెంద మది చక్కం జేర్పలే మన్నచోఁ
బుయిలోడం జనదంతమాత్రలకు మాబోం ట్లిందు రాఁజెల్లునే

242


క.

మంచిది మాకర్మము వై
రిం చనకృత మెట్లొ యట్టిరీతిని జరుగుం
గొంచక చనుఁడీ యన మే
లంచు న్హసనల్లిఖాను డరిగెం దిరుగన్.

243


శా.

రాజీవాసనవంశసంభవశిఖారత్నంబు నాఁ బొల్చునా
గోజీరాయఁడు రాజు మేటితురక ల్గూర్చుండఁగా నోలగం
బై జంభాసురుపోల్కి నుండెడు సుబాపజ్జం ప్రవేశించి కే
ళీజైవాతృకుఁ డైనవాఁడు హసనల్లీఖానుఁ డుత్సాహియై.

244


మ.

 ధన మెంతైన నొసంగు వార మని యాథార్థ్యంబుగాఁ గోట యీ
మని నౌబత్తు సడల్ప నోప మని యన్యాయంబుచే నెత్తి వ
చ్చినఁ బ్రాణంబుల కాసఁ జెంద మని నిశ్చింత న్మముం జంపఁ జూ
చినఁ జచ్చే మని పల్కినా రవల మీచిత్తం బనం గ్రుద్ధుఁడై.

245


తే.

తోఁకఁ ద్రొక్కిన యురగంబుతో సమత్వ
మూని హైదరుజంగు దుర్మానగరిమ
రాజు వినుచుండ నంతంత రాజునగ్ని
యట్టుల రవుల్కొనుచుఁ బల్కె నిట్టు లనుచు.

246

క.

ఫల్లా కా ని మ్మిపుడా
ఖిల్లాకిల్లాకు నడఁచి కించిన్మాత్రం
హల్లాకు నూలుకొలుపుచుఁ
జెల్లాకుం బెదరఁ జేతు శీఘ్రమె వారిన్.

247


ఆ.

అనుచు నుడువునంత హసనల్లిఖానుఁడు
హసితవదనుఁ డగుచు నతని కనియె
నీకుఁ దగునె యిట్టి నీతిశూన్యం బైన
జాడ పలుకుఁ బలుక సాహెబేంద్ర.

248


మ.

పయికం బీమనిరో దివాణముపయి న్బాహాబలోద్వృత్తిచే
నయము ల్దప్పిన చెయ్దము ల్నడచిరో నమ్మించి రమ్మన్న ని
ర్భయులై రాక పరాకు చేసిరొ శిరోభారంబు నీ కేమి దు
ర్ణయము ల్రాజు వచించుకొండెమున నన్యాయంబునం గ్రమ్మఱన్.

249


మ.

వెలమ ల్వా రభిమానవంతులు జగద్విఖ్యాతచర్యు ల్విని
స్తులశౌర్యోన్నతు లాపయిన్ నిరపరాధు ల్వారిపై నిర్నిమి
త్తలసతౌర్యవివర్ధమానవిపు లౌద్ధత్యంబు వాటించి ని
శ్చలమౌ నీచల మూదు టెల్ల నివి నీసర్వాధిపాహంక్రియల్.

250


ఉ.

తప్పులు లేనివారియెడఁ దప్పు ఘటించి నిరర్థకంబుగా
నొప్పని పూనికం గినుక యూనినఁ జేకుఱు టెట్లు నీతలం
పప్పురుషప్రతాపవిజితాఖిలవైరి నియుద్ధులైనవా
రెప్పగిది న్వశం బగుదు రెందఱ నొంచెదరో దురమ్మునన్.

251


మ.

బలవంతంబున వారిపై నడచి చంపజూచిన న్వార లె
ట్టుల నిన్నోర్తు రనేకవృద్ధశిశుబంధుప్రాణశుద్ధాంతకాం
తలతో నుండెడివారి గీములపయి నర్పించి యుద్ధార్థిపై
నిల కి ట్లేగుదు నన్నమీఁదట ఖొదా ని న్నెట్లు గావించెడిన్.

252

మ.

గడిదుర్గం బది వానిపై నడరు రంగల్లోహనాళావళుల్
పిడుగు ల్గ్రాసినయట్టిపిట్టలముగా భీమోద్ధతి న్వేఁడి గు
ళ్లడలింపంబడిపోవవే పిడుక వేట్లాటా సుబావన్న నీ
చెడుగు ల్బేరికి నోడునే యరుగునే చిచ్చమ్ము దా కిమ్మహిన్.

253


తే.

ఎదిరిచావును దనచావు నెఱుఁగకుండ
వెలమవర్ణంబుతేఱఁ గేగు వెఱ్ఱి గలఁడె
భీతిలఁగఁ బైకి వా రిట్టి బెడద డాసి
వచ్చుచో నిల్తురే పిన్నవారితోడ.

254


ఉ.

వారలు ధర్మమార్గ మెడఁబాయక పైక మనేక మిచ్చుచు
న్నారమ నాయనాదరమున న్గ్రహియింపక పండువంటిసం
సారులయింటిమీఁది కతిసాహసవృత్తిని జంప నేగు దు
ర్వారతరాఘ మిప్పుడ యవారితమై నినుఁ జుట్టుముట్టదే.

255


క.

కులహాని పాపహేతువు
కలహం బరయంగ యశము గలుగదు దీనిన్
వల దుడుగు మంచు నెంతయు
నలుక న్హసనల్లిఖానుఁ డాడిన పిదపన్.

256


తే.

కొలువునం గలవారు నాగోజిరాయఁ
డాదిగాఁ గల్గువారు న్యాయంబు దొరల
నట్ల పల్కిరి యుదుటురా జంతలోన
చిరివిసపుమాట ఖానునిచెవిని సోఁక.

257


తే.

వీరు సరకారు తా జమీదారుఁ డరయ
నెదిరిసత్వంబు తనసత్వ మెఱిఁగికొనక
హుకుముచొప్పున నడవక వికటమతిని
దిరుగఁబడి యుంట సరసంపుఁ దెఱఁగె యనియె.

258

తే.

అట్టిపలు కాలకించి యయ్యార్యు లెల్ల
విన్ననై మిన్నకుండి రాసన్న యెఱిఁగి,
చెన్ను మిగిలెను ఖానునిచిత్తవృత్తి
మంటకును వాఁడిపెట్టిన ట్టంటరాక.

259


ఉ.

అంతటఁ గొల్వువారలు నిజావసథంబుల కేగి రుగ్రతా
క్రాంతమనోవికారు లయి భానుఁడు రాజును లక్ష్మణాఖ్యుఁ డా
చెంత వసించు బూసికి వచించిరి యాయన యాప్రసంగ మా
ద్యంతము వించు నప్పుడె దురాగ్రహుఁడై సెల విచ్చె నాజికిన్.

260


ఉ.

సూరిజనస్తవార్హత మశుభ్రయశోజితపుండరీకడిం
డీరమరాళనారదపటీరమహేశ్వరహీరతారకా
సౌరతరంగిణీదరతుషారహిమాచలశేషశారదా
శారదచంద్రచంద్రహరిచందనకొండల రాయనందనా.

261


క.

దివ్యద్రుమకుసుమసమ, ప్రవ్యక్తసుగంధసారభాసురకీర్తీ
ద్రవ్యార్జనాతివికస, న్నవ్యమనఃపద్మ పద్మనాయకతిలకా.

262


మాలినీ.

శ్రుతశిఖరిగుడాద్రిక్షోణిభృచ్చక్రవర్తీ
సతతనిఖలధర్మస్థాపనోదారకీర్తీ
వితరణకృతసద్యోవిద్వదాశాప్రపూర్తీ
శ్రితజనవశలీలా సేవధీభూతమూర్తీ.

263


గద్యము.

ఇది శ్రీమత్కాశ్యపగోత్ర దిట్టకవివంశపవి త్రాచ్చ
నామాత్యపౌత్ర పాపరాజకవిపుత్ర శ్రీరామచంద్రచర
ణారవిందధ్యానపరాయణ నారాయణాభిధానప్రధాన
మణిప్రణీతం బైన రంగారాయకదనరంగచరిత్రం బను
మహాప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము.

—————