యెంకి పాటలు/సాలు! సాలు!
స్వరూపం
సాలు! సాలు!
మనిసే సాలు! మనిసి మాటే సాలు!
మనిసి వోసనె సాలు! మనసే సాలు!
ఏతాము కెదురుంగ యెంకుంటే సాలు!
వొంటరిగ సిటికేసి కంటకలిపేను!
మనిసే సాలు!. . . . .
యెంకి సందల గలగ లినబడితే సాలు!
కళ్లు మూసుక నీరు మళ్లకెత్తేను!!
మనిసే సాలు! . . . . .
యెంకి గా లొకపాలి యిసిరినాసాలు!
తోటంత రాజల్లె తొవ్విపోసేను!!
మనిసే సాలు! . . . . .
అందాల నాయెంకి వుందంటె సాలు!
నిబ్బరముగా రేత్రి నిదరపొయ్యేను!!!
మనిసే సాలు!......