మారిషస్‌లో తెలుగు తేజం/శుభాకాంక్షలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శుభాకాంక్షలు

తెలుగు భాషన్నా, తెలుగు ప్రజలన్నా చచ్చిపడే స్వభావం గలవారు శ్రీ మండలి వెంకట కృష్ణారావుగారు. ఈయన ఆంధ్రప్రదేశ్ విద్యా సాంస్కృతిక శాఖామాత్యులుగా యున్నప్పుడు ప్రథమ ప్రపంచ తెలుగు మహా సభలను 1975లో హైదరాబాద్ మహానగరంలో అతివైభవముగా జరిపించి, క్రీ.పూ. 2వ శతాబ్దినుండి క్రీ.శ. 3వ శతాబ్ది వరకు భారతదేశంలోని సగం భాగాన్ని పరిపాలించుటయే గాక జావా, సుమత్రా, మలయా, బర్మా, కంబోడియా వంటి దేశాలలో కళింగ, మలాకా, శ్రీ విజయ వంటి రాజ్యాలను కూడా స్థాపించి వాటికి రాజులుగాను, రారాజులుగాను ఉండి తెలుగు జెండాను ప్రపంచమంతా ఎగురవేసిన తెలుగు శాతవాహనుల కాలమున జగమంతా చెల్లాచెదురైన తెలుగు జాతిని ఒక్క వేదికపైకి తెచ్చిన ఘనతకు పాత్రులయ్యారు.

"పులికి పుట్టినది పిల్లి కానేరదు" అన్నట్లు శ్రీ బుద్ధప్రసాద్ గారు తండ్రికి తగ్గ తనయుడుగా, శ్రీ మండలి వెంకట కృష్ణారావు - ప్రభావతి పుణ్యదంపతుల జ్యేష్ఠ పుత్రుడుగా జన్మించి, తన తండ్రి అడుగు జాడలలో నడుచుట పొగడదగ్గదగును.

శ్రీ మండలి బుద్దప్రసాద్ గారు వ్రాసిన "మారిషస్ లో తెలుగు తేజం' అన్న గ్రంథాన్ని చదివి, అందులో చక్కగా వర్ణింపబడిన విదేశాంధ్రుల చరిత్ర, సమస్యలను చదివి తెలుసుకొని అమితానందభరితుడనయ్యాను. మలేషియా ఆంధ్ర సంఘ (1955) వ్యవస్థాపకునిగానూ, ద్వితీయ ప్రపంచ తెలుగు మహాసభల (మలేషియా) ప్రధాన కార్యదర్శిగానూ ఈ యువ, నవ రచయితకు నా శుభాకాంక్ష లందిస్తున్నాను.

"భాష జాతికి ప్రాణం! భాష నశిస్తే జాతి నశిస్తుంది" అన్నది నగ్న సత్యం. అందు వల్లనే విదేశాలలోను, ప్రవాసాంధ్రలోను నివసించు తెలుగు తల్లి తనయులు తమ మాతృభాషనూ, సంస్కృతినీ నశించకుండా కాపాడుటకు యితర జాతుల, యితర భాషల మధ్య యుంటూ అష్టకష్టాలు పడుతున్నారు. తమకు చేతనైనంత కృషి సల్పుతున్నారు.

ఆకలైనప్పడు పిల్లలు అమ్మను అన్నమడుగుతారు. అలానే తన శక్తికి మించినపనులు ఎదురైనప్పడు తెలుగు భాషకు తల్లియైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సహాయపడమని విన్నవించుకుంటారు విదేశప్రవాస ఆంధ్రులు. ఇటువంటి క్లిష్ట సమస్య ఏర్పడిన దక్షిణాఫ్రికా ఆంధ్రులు, తమ మాతృ భాషను కాపాడుకోడానికి సహాయపడమని ఎంతో వినయ విధేయతలతో కోరడం గ్రంథకర్త చాలా చక్కగా వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు తోడుగా, తోడు నీడగా ఉంటుందని కలలు కంటూ యుంటారు ఈ పిచ్చి విదేశ, ప్రవాస ఆంధ్రులు. అవి పగటి కలలైతే బిక్కమొుగం పెట్టడం తప్ప మరేం చేయగలరు?

"మారిషస్‌లో తెలుగు తేజం అన్న ఈ గ్రంథంలో చిరంజీవి మండలి బుద్ధ ప్రసాద్ గారు 1975, 1981, 1990వ సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్, మలేషియా, మారిషస్ దేశాలలో జరిగిన మూడు ప్రపంచ తెలుగు మహాసభలను గూర్చి చక్కగా వివరించారు. చివరిగా జరిగిన మూడవ ప్రపంచ తెలుగు మహాసభల తీర్మానాలకు స్పష్టమైన, చక్కని లిఖిత రూపకల్పన చేశారు. ఇదివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమో, ప్రపంచ తెలుగు భాష అభ్యుదయానికి "సేవ చేయటానికై ప్రత్యేకముగా స్థాపించిన అంతర్జాతీయ తెలుగు సంస్థయో చేయని ఒక మహత్తర కార్యాన్ని చేసి ఈ గ్రంథం ద్వారా ప్రపంచ తెలుగు జాతికి వెలుగు చూపిన ప్రజ్ఞాశాలియైన ఆంధ్రప్రదేశ్ యువ ప్రజానాయకుడు శ్రీ మండలి బుద్ధప్రసాద్‌గారిని "శభాష్ వీరాంధ్ర సోదరా" యని పొగుడుతున్నాము.

తెలుగు తల్లి ఈ తెలుగు తనయుని ఆశీర్వదించుగాక!

ఇట్లు

మదిని సోమనాయుడు

మలేసియా ఆంధ్ర సంఘ వ్యవస్థాపకుడు మరియు

ద్వితీయ ప్రపంచ తెలుగు మహాసభల ప్రధాన కార్యదర్శి

మలేసియా