Jump to content

మారిషస్‌లో తెలుగు తేజం/అభినందనలు

వికీసోర్స్ నుండి


అభినందనలు

శ్రీ మండలి బుద్ద ప్రసాద్ రచించిన ఈ "మారిషస్ తెలుగు తేజం" ఒక విహార యాత్రగా కన్పించినా, విదేశాలలో నివసించుచున్న ఆంధ్రుల జీవనవిధానాలను, పూర్వ జీవితానికి ఈనాడు ఆయా ప్రాంతాలలో వున్న వారి కలయికలలో కలిగిన పరిణామాలు పూసగుచ్చినట్టు వివరించారు.

ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాదులో ప్రారంభంకాగా, రెండవ మహాసభలు కౌలాలంపూరులో జయప్రదంగా జరిగితే, ఈ మూడవ మహాసభలు మారిషస్‌లో జరగడంతో అన్నీ చరిత్రే అయిపోయినవి. హైదరాబాదులో జరిగినప్పడు ఏ అపశృతులు లేకుండా మహా జయప్రదంగా జరిగాయి. ప్రపంచ మహాసభలు నిర్వహించటానికి అంతర్జాతీయ తెలుగు సంస్థ ఆవిర్భవించింది.

రెండవ మహాసభ కౌలాలంపూరులో జరుగుతుంటే భారతదేశం నుండి ప్రతినిధులు వెళ్ళే సందర్భాలలో అవకతవకలు జరగడం - ఆంధ్ర ప్రజలలో అపోహలు కలగడం జరిగినా, కౌలాలంపూరులో మహాకోలాహలంగా జరిగినవి. వారి ఆతిధ్యం, వారి కళాఖండాల ప్రదర్శనలు, సమావేశాల నిర్వహణ నిరంతరాయంగా మహావైభవోపేతంగా జరిగినవి. అంతర్జాతీయ తెలుగు సంస్థ, తెలుగు విశ్వ విద్యాలయంలో లీనమై పోయింది.

మూడవ మహాసభలు మారిషస్‌లో జరుగుతున్న సందర్భంలో భిన్న భిన్న పోకడలతో భారతేదేశంలో కొన్ని అవకతవకలు జరిగినా, ఆహ్వనితులను పిలిచి పేరంటానికి రమ్మని, పాస్ పోర్టులు పంపమని కోరి చివరకు మీరు రావద్దని కబురు పంపడం జరిగినా, వెళ్ళిన వారికి మారిషస్‌లో అక్కడి తెలుగు వారు చూపిన ఆదరణ, కళాఖండాల ప్రదర్శన, భోజన బాజనాలలో వైవిధ్యం, పాతస్మృతుల సంస్మరణలు దిగ్విజయంగా జరిగిన వనుటలో సందేహం లేదు.

ఆ విధంగా వస్తుతత్వంలో తెలుగు మహాసభలు ప్రపంచ వ్యాప్తంగా జరగడంలో విజయపరంపరగా సాగినవనే చెప్పాలి. ఈ పుస్తకం ఆయా సంఘటనల కన్నా నిజంగా మారిషస్‌లో మనవారి జీవిత విశేషాలు, ఉద్యమాన్ని సజీవంగావించి చేస్తున్న వారి జీవిత గాథలు, తెలుగు నిలబెట్టుకోవడానికి సాగించిన, సాధించిన సాధనోపాయాలు కళ్ళకు కట్టినట్టుగా వివరించారు.

కూలీలుగా వెళ్ళి అష్టకష్టాలకు లోనై తమ స్వేదంతో సంపద చేకూర్చి సహనాన్ని కోల్పోకుండా తమ మాతృభాష యడల, తమ మాతృ భూమి యడల గల ఆపేక్షతో తాము వలస వచ్చిన ప్రాంతాన్ని కూడా మాతృ భూమిగా తలచి ఆదేశ దేశప్రజల సంస్కృతులతో, సహజీవనంలో వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడంలో చేసిన కృషి హృదయరంజకంగా విపులీకరించటం జరిగింది.

ఈ గ్రంథం చదువుతూపోతే, ఒకచోట విహార యాత్ర, మరొకచోట సాంస్కృతిక సమాజపరిణామ వివరణగా, మరొకచోట లోతులకు వెళ్ళిన చరిత్ర పరిశీలనగా, మరికొన్ని చోట్ల వివిధ ప్రాంతాలలో, దేశ దేశాలలో వున్న తెలుగువారి జీవన సరళి ఒక్క మారిషస్‌కు మాత్రమే కాక, దక్షిణ ఆఫ్రికా, ఫిజీ మరి యితర దేశాల్లో వున్న తెలుగు వంశ పరంపరలు కూడా చాటి చెప్పుతూ వచ్చినవి.

నాల్గవ ప్రపంచ మహాసభను దక్షిణ ఆఫ్రికావారు ఆహ్వానించడం హర్షదాయకం. నల్ల తెల్ల వివక్షతలతో మగ్గిపోయి, దానిని తుదముట్టించుటకు ఆనాడు మహాత్మాగాంధీ, ఈనాడు నెల్సన్ మండేలాలు సాగించుతున్న పోరాటం విజయం సాధించితే మనం వెళ్ళగలం. ఈలోగా వారు సాధించితే సరే, లేనిచో అమెరికాలోని తెలుగువారు ఆహ్వానించటానికి ముందుకు రావడం సంతోషించదగిన విషయం.

తెలుగువారు ఎక్కడ వున్నా తమ మాతృభాషను, మాతృభూమిని మరవకుండా ఆయా దేశ ప్రజలతో సహజీవనం సాగించి, తెలుగు గౌరవాన్ని యినుమడించుటకు ఈ గ్రంథం స్పూర్తినిస్తుందని విశ్వశిస్తాను. ఈ రచన సాగించిన శ్రీ బుద్ధ ప్రసాద్‌కు అభినందనలు.

వావిలాల గోపాలకృష్ణయ్య

అరండర్ పేట

గుంటూరు-2