మాటా మన్నన/9. యాదృచ్ఛిక సంభాషణ

వికీసోర్స్ నుండి

యాదృచ్చిక సంభాషణ :

తెలియనివారితో మాట్లాడకూడదని నేటి యువజనులలో ఒక భావం పెంపొందింది. కాని మన ప్రాచీనులు ఇందుకు భిన్నంగా ఉండిరి. వారు అందరిని ఆప్యాయతతోనే పలకరించేవారు. పలకరించటమేకాదు; వారి పుట్టుపూర్వోత్తరాలన్నీ తెలుసుకొనే వారు.

ఆంగ్లేయుల సంప్రదాయం దీనికి భిన్నం . ఒకరైలులో ఇద్దరు ఆంగ్లేయులు కలిసి ప్రయాణం చేస్తూఉన్నా, అపరి చితులు మాట్లాడుకోరు. మూడోవ్యక్తి ఎవరో వచ్చి వారి నిద్దరిని పరిచయం చేసినప్పుడే వారు పలకరించుకొనేది.

రైళ్ళల్లోనూ, బస్సులలోనూ, ప్రయాణం చేసేటప్పుడు పుస్తకమో, పత్రికో పుచ్చుకొని కాలక్షేపం చేయటం సహజం. కొంతసేపు చదవగా విసుగుపుడుతుంది. అంతట ప్రక్కనున్నవారిని పలకరించటం తటస్థిస్తుంది. మీ దేవూరు? ఎక్కడనుండి వస్తున్నారు? ఇట్లా ప్రశ్న పరంపరలు సాగుతవి. పట్టణపువారై తే పల్లెటూరి వారిని వారి ఆచార విచారాలను గురించి, వారి కష్టసుఖాలను గురించి, తెలుసుకొన ప్రయత్నిస్తారు.

అట్లాగే ఒకరు మరొకరినికాని అదే గొడవగా ప్రశ్నించే మనిషిని చూస్తే కష్టంగానే ఉంటుంది. అవతల వారి అభిప్రాయాన్ని గమనించి మాట్లాడాలి. .

ప్రపంచం ఒక నాటకరంగం. ఇందులో పాత్రలను పరికించాలంటే ప్రయాణాల్లోనే చూడాలి. భిన్న భిన్న దృక్పథాలు కలవారిని కలుసుకుంటానికి అవకాశం చిక్కుతుంది. దేశాటనమువల్ల మంచి అనుభవం కలుగుతుంది. రైల్లోకూడా మన ముక్కూ ముఖము ఎరుగనివారు మన అవసరాలని గుర్తించి సాయపడుతుంటే, వారియెడల మనకు ఎంతో ప్రేమ కలుగుతుంది. తర్వాత వారి ఊరూ పేరూ తెలుసుకొని వారిని బంధువులుగా భావిస్తాము. ఆ నూతన స్నేహితులు కొందరు మన రక్త బంధువుల కంటే ప్రేమాస్పదు లవుతారు. మరికొందరు ఈ కాలగమనాన్ని గమనించక మడీ దడీ అంటూ కూపస్థ మండూకంలాగా ముడుచుకొని కూర్చుంటారు, మాట్లాడితే నోటి ముత్యాలు రాలిపోతా యనుకొంటారు.

రైలు ప్రయాణాల్లో రాక్షసులను దేవతలను చూడగలం. .

ఇంకా ఈ ప్రయాణాల్లో ఇతర ప్రాంతీయులను కలుసుకొని ఆ దేశాచారాలను, అక్కడి పాడిపంటలను తెలుసుకొని తద్వారా లోకానుభవాన్ని గాంచగలం.

రైళ్ళల్లోను, బస్సుల్లోనేగాక, తీర్థయాత్రల్లో కూడా సంభాషణ ద్వారా మనం నూతన మిత్రులను పొందటానికి అవకాశం కలుగుతుంది.