మాటా మన్నన/8. ఆపన్నులతో
ఆపన్నులతో:
మానవుడు సంఘజీవి. ఈ లోకం కేవలం ఆనంద ప్రదమైనది కాదు. సుఖదుఃఖాలతో కూడుకున్నది. కనుక మనం తరచు రోగులను చూచుటకో బిడ్డనో భర్తనో భార్యనో పోగొట్టుకున్నవారిని పరామర్శించుటకో వెళ్ళవలసి వస్తుంది. అటువంటప్పుడు వారితో ఎట్లా మాట్లాడాలి-అన్నది తేలికైన సంగతి కాదు. ఆపదలోవున్న మన బంధుమిత్రుల సానుభూతికై అనగా వారి దుఃఖ నివారణకై వెళతాం. వారి అనారోగ్యాన్ని గురించిగాని, ఆపదను గురించిగాని మాట్లాడటం తెలియదు. వారిని ఎట్లా ఓదార్చాలో బోధపడదు.
ఒక దీర్ఘరోగి ఆస్పత్రిలోఉండి కోలుకొనే సమయంలో మనం చూచినట్లయితే అతనికి ప్రయోజనం కలుగుతుందని తలుస్తాం. మనం ఆ రోగియెడల సానుభూతితోనే వెళతాం. అతనికి ఏమికావాలో కనుక్కొన కోరుతాం. పుస్తకాలు కావాలా, పత్రికలు కావాలా, ఉత్తరాలు వ్రాసిపెట్టాలా"అని అడగటం మంచిది.
కొందరు వచ్చినవారు వచ్చినట్లుండక రోగి స్థితిగతులు గమనించకుండా తమ సొద చెప్పుకొని ఆరోగిని విసిగించేవారుంటారు. అసలు రోగులకు ఇటువంటి విషయాలంటే చిరాకు. వారు అసలు బాధలో ఉన్నారు. వారిని మరింత బాధ పెట్టటమా ? మనం ఉన్న కాసేపైనా వారిని బాధ మరచేటట్లు చెయ్యాలి.
రోగులు తరచు తమ కష్టాలు, తమ బాధలు చెప్పుకోవటం సహజం. ఏమన్నా బాధా? అని అడిగితే వారికి బాధేమైనా ఉంటే దాన్ని గురించి చెపుతారు. కనుక జబ్బుగా ఉన్నవారితో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు ప్రధ మంగా వారి ఆరోగ్యాన్ని గురించి, వారి బాధను గురించి మాట్లాడాలి.
రోగులు పరాయిచోట ఉన్నప్పుడు వారు సహజంగా తమ కుటుంబాన్ని గురించి, స్నేహితులగురించి విన కోరతారు. సభలు, సమావేశాలు, విందులు, వినోదాలూ మొదలైనవాటిని గురించి కూడా తెలుసుకొన కుతూహల పడతారు.
దీర్ఘ రోగులు తరచు మిత్రులను చూడగోరుతారు. వచ్చినవారు వారిని ఎట్లా సంతోష పెట్టాలా అను సంగతిని ఆలోచించాలి. వారికి ఇష్టమైన మాటలను మాట్లాడాలి. వారి అభిరుచినిబట్టి మాట్లాడాలి. వారికి కులాసా కలిగించాలి. "Discreation of speech is more than eloquence; and to speak agreebly to him with whom we deal is more than to speak in good words or in good order" --Bacon,
రోగివద్ద దుఃఖకరమైన విషయాలు, అనిష్టకరమైన సంగతులు మాట్లాడరాదు. ప్రపంచంలోవున్న దుఃఖాలను గురించి అతని ఎదుట ఎత్తరాదు, దుఃఖంలో కొట్టుమిట్టాడు వారితో ఇంకా దుఃఖాలను గురించి మాట్లాడటం అవివేకం.
రోగి తనవల్ల కాస్త సుఖసంతోషాలు పొందేటట్లు భావించి మాట్లాడాలి.
శోకంలో వున్నవారి సందర్భంలోకూడా ఈ సంగతినే పాటించాలి. ఆపదలో వున్న వారిని చూడటం మన ప్రధాన ధర్మంగా భావించి, ప్రధమంగా చూడాలి, వారి శోకావస్థను గురించి మనం మాట్లాడటం మంచిది కాదు. దుఃఖంలో వున్నవారిని గురించి మరింత దుఃఖపెట్టటం అవుతుంది. మనం వారి శోకభారాన్ని గమనించే వచ్చామని వారికి తెలుసు. ఆ బాధ భరించలేక వారే మాట్లాడతారు ఇతరులతో చెప్పుకోవటంవల్ల శోకభారం తగ్గుతుంది. ఆపని వారే చేస్తారు. మన ఉనికే అక్కడ అవసరం; మనమాట కాదు. అందుచేతనే పూర్వకాలంలో ఎవరైనా పోతే పెద్దలు వారింట్లో దుఃఖోపశమనం కలిగేవరకు ఉండేవారు.
తన తండ్రి మోతీలాల్ నెహ్రూ అస్తమించినపుడు గాంధీమహాత్ముడుకి తను గృహంలో వుండుట తమ కెంతో దుఃఖోపశమనం కలిగించిందని జవహరలాల్ తనఆత్మకధలో చెప్పుకొన్నాడు.
"Speak but little and well if you would be esteemed a man of merit" --- Trench.
మన శక్తియుక్తులను బట్టి ఏదో లోకపు సంగతులను చెప్పి వారి దుఃఖాలను మరపించటానికి మరొకవైపుకు మార్చాలి.
కాని ఆట్లా చేయరు.
ఒక వృద్ధుని కుమార్తె పోయిందనుకొండి.
"ఒకాయన మీరు చాలా దురదృష్ట వంతులండీ" అంటాడు.
మరొకాయన “మీరు కాళ్ళు కడుక్కొని కూర్చున్నారు. మీకీ సమయంలో దుఃఖంపెట్టి పోయింద"ని అంటాడు. “మీరు అన్నీ తెలిసినవారు, మీరు శోకించరాదు” అంటారు. ఇంకొకరు.
ఇవన్నీ దుఃఖాన్ని పెంచేవే. వారు వచ్చింది దుఃఖోపశమనం చేయటానికి, వచ్చినదానికి భిన్నంగా మాట్లాడటం జరుగుతుంది. తమ ఉనికి వల్లనే దుఃఖోపశమనానికి దోహదం కలుగ చేయాలి. మాటలవల్ల కలగదు.
కాల పురుషుడే ఈ గాయాన్ని మార్చాలి. మానవులు చేయలేరు. మరుపుఅనే మహాభాగ్యాన్ని ఈశ్వరుడు మనకు ప్రసాదించాడు. 'అందువల్ల నే మనం జీవించ కల్గు తున్నాం .
గమనించవలసింది ఏమిటంటే, అనారోగ్యంగా ఉండనీ, ఆపదలో ఉండనీ వారిని చూడటానికి వెళ్ళినప్పుడు మన మాటలు వారి దుఃఖాన్ని మరపించి కొంచెమైనా భారం తగ్గి కాస్త ఊపిరి పీల్చుకొనేటట్లు చెయ్యాలి.
మనం మాట్లాడి వెళ్ళినతర్వాత ఈ వ్యక్తివల్ల కాస్త శాంతి చేకూరింది అనుకొనేట్లుండాలి.