Jump to content

మాటా మన్నన/7. స్త్రీల సంభాషణ

వికీసోర్స్ నుండి

స్త్రీల సంభాషణ:

స్త్రీలు తమలోతాము మాట్లాడుకొనేటప్పుడు సాధారణంగా దిగువస్థాయిలోనే మాట్లాడుకుంటారని విచారకరంగా చెప్పకతప్పదు. అసలు వారు స్వవిషయాలు చెప్పుకొనే పద్ధతికి అలవాటు పడ్డారు. బజారులోగాని, బుస్సులో గాని ఎక్కడైనా స్త్రీలు మాట్లాడుతుంటే వినండి, తరచుగా వినబడే దేమంటే: "ఆమెతో నేనామాటన్నాను” “తర్వాత ఆమె నాతో అన్నది” ఆమె అన్నది - నేను అన్నాను” ఇదే ధోరణి. ఇదంతా ఒక కధగాతోస్తుంది. తమస్థాయిలో వారు చెపుతారు. సంభాషించరు. ఇదంతా బాతాఖాని, ఇది సంభాషణ కాదు. ఇటువంటి మాటలవల్ల స్త్రీలు పొందేదేమీ లేదు. ఇట్లా చెప్పిందే చెప్పటం ఒక పద్ధతి. మరొకటి, పిల్లలను గురించి చీరలను గురించి అధికం, అనంతరం కొద్దిగా గృహకృత్యాలను గురించి.

సహజంగా స్త్రీలు మాట్లాడేదానిలో తెలుసుకొనేటందుకు ఆనందించేటందుకు ఏమీ ఉండదు, ఉబుసుపోకకు చెప్పుకొనే కబుర్లు అవి. మనదృష్టిలో ఇవిఅన్నీ అల్పమే. కానీ స్త్రీలదృష్టిలో వీటికంటే గొప్పసంగతులు లేవని అనుకోవాలి. వారు మంచి మంచి చీరలు జాకెట్లు ధరించారంటే వారేకాదు సంతోషించేది, లోకమంతా శోభాయ మానంగా ఉంటుంది. సుందర వస్తువులను చూచి సౌందర్యా రాధకులు ఆనందిస్తారు.

అట్లాగే వారు తమ ఇల్లు వాకిలిని గురించి, అన్న పానీయాలను గురించి గృహోపకరణాలను గురించి, మాట్లాడ తారంటే ఆశ్చర్యమేమిటి? స్త్రీ ఘర్కీరాణి, గృహలక్ష్మి గృహదేవత. ఆందుచేతనే ఇల్లుచూచి ఇల్లాలునుచూడమన్నారు. ఇల్లాలే ఇల్లు. 'నగృహమ్ గృహమిత్యాహు గృహిణీ గృహముచ్య తే.'

ఆమె తమ పిల్లలను గురించి మాట్లాడుతుంది. వారి విద్యా బుద్ధులను గురించి ముచ్చటిస్తుంది. అంటే ఇందులో తప్పేమున్నది ! ఆమె నవమాసాలు మోసి కన్నది. స్త్రీకి సంతానమం దుండే ప్రేమకంటే అధికం మరొకటి లేదు. పిల్లలకై తల్లి సర్వస్వమూ త్యజిస్తుంది. గృహసంబంధమైన విషయాలు మాట్లాడుకోవటంలో వారు కొందరికి సలహా లిస్తారు. మరికొందరి సలహాలు పొందుతారు. ఈవిషయంలో సిగ్గుపడవలసిందేమీ లేదు. అయినప్పటికీ ఇదంతా సంభాషణ అనిపించుకోదు. సంభాషణ నిజంగా నవ్యభావోదయం ద్వారా సంతోషం కలిగించాలి. గృహసంబంధమైన మాటలు ఆపని చేయలేవు. సంభాషణానంతరం “సంభాషణ చాలా బాగున్నది, సంతోష ప్రదమైనది" అనే భావాన్ని కలిగించాలి.

కొందరు పురుషులు స్త్రీలను చాలా చెడ్డగా చిత్రించారు. ఆడదాని నోటిలో నూవుగింజ నానదని, ఆడబుద్ధి అపరబుద్ధని, ఆడది గాడిదని, స్త్రీబుద్ది ప్రళయంకరి, కోడిపుంజూ ఒక పిట్టేనా, ఆడదీ ఒక మనిషేనా అని. ఇదంతా ఇప్పుడు మారుతున్నందుకు సంతోషం.

స్త్రీలు సాంఘిక ఆర్థిక రాజకీయ విషయాలను గురించి మాట్లాడుకోరని ఆక్షేపించటం ఎందుకు ? అందులో వారికి అవకాశం లేకుండా చేశారు మొగ మహారాజులు. ఇల్లూ పిల్లలు, భర్త ఇదే వారి ప్రపంచమన్నట్లు చేశారు. అటువంటప్పుడు ఎవరో కొందరికి తప్ప అందరికీ ఆలోచన అదే.

ఈ సంగతులే మనం ప్రమదావనంలోనూ (ఆంధ్ర ప్రభ వారపత్రిక) వనితాలోకంలోనూ (ఆంధ్రవారపత్రిక) చూస్తూవుంటాము. స్త్రీల మనస్తత్వాన్ని బాగాగుర్తించింది చిన్నదైనా మాలతీ చందూర్. ఆమె ఈనాడు స్త్రీలకు స్నేహితురాలు, తత్వవేత్త, గురువు (Friend, philospher and guide) అది ఒక అదృష్టము. స్త్రీలు ఆంధ్రప్రభను కధలకంటే ప్రమదావనంకొరకే తెప్పిస్తారంటే అతిశయోక్తి కాదు.

స్త్రీలు గృహవిషయాలలో పడి విసుగుపుట్టి కాస్త తీరిక కలగ్గానే కులాసా పొందగోరుతారు. అప్పుడు వారు మరొకరిని కలుసుకొన్నప్పుడు పిచ్చాపాటి మాట్లాడు కోవటంలో నూతన సంగతులు తెలుసుకుంటూ ఉంటారు. చదువు నేర్చినవారు, విద్యార్థినులు పుస్తకాలను గురించీ రాజుకీయాలను గురించి, ఈనాటి సమస్యలను గురించి మాట్లాడు కొంటారు. సహజంగా వారు వివాహాలను గురించి పిల్లలను గురించీ చర్చించుకొంటారు. అప్పుడు అమ్మా! ఈనాడు మంచి సంభాషణ జరిగింది. అదృష్టవంతులము అనుకొంటారు. ఈనాడు కాస్త తెలిసిన స్త్రీలు మాట్లాడుకోవలసిన సంగతులు అనేక మున్నాయి. రేడియో కార్యక్రమాలు, సినిమాలు, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు, మహిళా సంఘాలు, స్థానిక సంస్థలు మొదలగునవి ఎన్నో ఉన్నవి.

స్త్రీలలో విద్యా వ్యాప్తి ఆర్ధికస్తోమతు మొదలగు అవకాశాలు లభిస్తే పురుషులవలే వారికి అభిరుచి కలుగుతుంది. నేడు యువతులు కొందరు నూతన అవకాశాలు పొంది గౌరవాలు పొందుతున్నారు.

స్త్రీలుకూడా నేటిపరిస్థితి గమనించి పిల్లలే ప్రపంచం ఇల్లే స్వర్గమని, కూపస్థ . మండూకంలాగా గాక, ప్రపంచ ధోరణిని గ్రహించాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు తమ గొడవలను మాని, లోక వ్యవహారాలను మాట్లాడాలి. సంభాషణవలన ప్రయోజనాన్ని పొందాలి. .

కనుక వారుకూడా సంభాషణా చాతుర్యాన్ని అలవరచు కోవాలి.

నేడు మనం తానీషాలనాడువలె లేము. రాజులు, రాణులూ పోయారు. బ్రాహ్మణులూ శూద్రులూ అనే బేధం పోయింది. అంటరానితనం అడుగంటింది. ఇంతే కాదు. ప్రపంచమంతటా ప్రజాస్వామ్యము ఏర్పడింది. స్త్రీ పురుషులు సమానమన్న మాట పాటించ బడుతుంది.

స్త్రీ పెరగాలి - పెంచాలి.