మాటా మన్నన/10. పిన్నా పెద్దల సంభాషణ

వికీసోర్స్ నుండి

పిన్నా పెద్దల సంభాషణ :

సాధారణంగా పెద్దలతో మాట్లాడటానికి పిన్నలు శ్రద్ధవహించరు. కుటుంబాల్లో అయితే పిన్నలు పెద్దలతో మాట్లాడటం తప్పనిసరిఅవుతుంది. పెద్దలకు తమకు అభిరుచుల చేత, అంతరాలచేతగల వ్యత్యాసాన్ని గుర్తించుటకు పెద్దలలో సంభాషించుట ఆమోదప్రదమని కొందరు యువకు లనటం కూడా కద్దు. యువకులు సాధారణంగా తమకంటె ముందు తరంవారి అనుభవాలను, అభిప్రాయాలను, అభిరుచులను, పెంపకంలోగల తారతమ్యాలను వినగోరతారు; కాని మరొక విషయం గమనించవలసి ఉంటుంది. నాటికీ నేటికీ గల తారతమ్యాన్ని పోల్చి చూపుటకు వారు ఇష్టపడరు. వారి కది అనుకూలంగా ఉండదు. ఈనాటి యువకులు నా చిన్నతనంలో ఉన్నట్లు చెయ్యరు-అని ఏదో పెద్దలు చెప్ప బోయే మాటలు వారికి విసుగుపుట్టిస్తవి. గత 20, 30 సంవత్సరాల్లో పరిస్థితులు ఎట్లా మారింది, పిన్న పెద్దలందరకు తెలుసు. అందుచేతనే నేటి యువజనులు అధిక స్వాతంత్ర్యాన్ని, అనుభవిస్తూ స్వేచ్చా సౌఖ్యంలో ఉన్నారు. ఈ నూతన వాతావరణంలో పుట్టి పెరగటంచేత వారు నూతన ప్రపంచంలో ఉన్నట్టు భావిస్తారు. పూర్వకాలానికి గాని, ఆ మార్గానికిగాని, అవి ఎంత మంచివైనా వారు సుతరామూ ఇష్టపడరు. పూర్వకాలపువారు తమకంటె సచ్చారిత్రులన్న మాట వారికి ఏవగింపుగా ఉంటుంది. వీరే గాదు; ప్రతివారు తమ తరాన్ని గురించి గొప్పగా చెప్పుకోవటం సహజమే. తానీషాలనాడుకూడా తండ్రులు తమ పిల్లలు పాడైపోతున్నారని ఆక్రోసించారు. యువజనులు అర్హతలేనివారి విమర్శలను పాటించరు. నాటికి నేటికి చాలా తేడా ఉన్నదనీ, పూర్వ జీవితం చాలా సుళువైనదనీ నేటి సాధక బాధకాలు పెద్దలు గ్రహించలేరని వారిభావన.

ఈ ధోరణితోనే సలహా, విమర్శన లుంటాయి. అయాచితంగానే పెద్దలు సలహాలు ఇవ్వబోతారు. “ నేనే ఈ దశలో ఉంటే ఆపని చేసేవాడిననో, ఆమాదిరిగా ప్రవర్తించటం బుద్ధిహీనతకాదా అనో ఏదోవిధంగా పిల్లలమీద విరుచుకు పడతారు. పిల్లలు పైకి అనరుగాని, 'నీ అభిప్రాయాన్ని ఎవరు అడిగారు? అడగందీ పెట్టందీ ఇవన్నీ ఎందుకు'? అని తమలో తామైనా అనుకొంటారు. నిజంగా పెద్దవారి సలహా, అభిప్రాయం కావలసివస్తే పిల్లలు న్యాయంగానే గౌరవిస్తారు. మొత్తంమీద పెద్దవారి సలహాను పిన్నలు పాటించటానికి ఇష్టపడరు. పెద్దవారికి తమ యందు సానుభూతి లేదని, తమ స్థితిగతులు ఆలోచించి మాట్లాడరని వారి విశ్వాసం.

మరొక కష్ట మేమిటంటే, యువజనులలో అధిక సంఖ్యాకులు తీవ్రమైన విషయాలను గురించి పెద్దలతో సంభాషించుటకు జంకుతారు. వారి కాలంలోని కష్టాలను గురించి, సమస్యలనుగురించి, మాట్లాడుటకుకూడా వారు ఇష్టపడరు. ఇంతేగాదు; కొన్ని కొన్ని విషయాలనుగురించి వారు తలిదండ్రులతో సంభాషించుటకు కూడా సందేహిస్తారు. తలిదండ్రులు కొందరు తమ పిల్లలయెడల ప్రేమ, అనురాగం, మొదలగునని అధికంగా చూపించినా వారి మధ్యగల అంతరువు అట్లాగే ఉండిపోతుంది. విద్యనుగురించి, వివాహాన్ని గురించి, ఒక్కొక్కప్పుడు రాజకీయాలను గురించి భేదాభిప్రాయాలు ఉంటూనే ఉంటవి. యువకులు సాధారణంగా తమ స్వాతంత్ర్యాన్ని, చంపుకోరు. తమ అభిప్రాయాలనీ, ఆశయాలనీ, మార్చుకోరు. సాధారణంగా యువజనరక్తం వేడిగా ఉంటుంది. పాత అభిప్రాయాలనూ ఆచారాలనూ వారు వ్యతి రేకించడం సహజం. వారికీ తలిదండ్రులయందు ఎంతప్రేమఉన్నా, వారొకప్పుడు ఇట్లా అంటూ ఉంటారు; “మానాన్న ఈమాట మాట్లాడటం నాకు చాలా కష్టంగా ఉన్నది " కనుక పెద్దలు పెద్దరికాన్ని నిలుపుకోవాలంటే, పిన్నలడిగే వాటికి సమాధానం ఇవ్వటమే మంచిది. పిన్నా పెద్దా కలసి ఏదైనా ఒక విషయాన్ని గురించి తర్జన భర్జన చేస్తున్నప్పుడు పెద్దలు నిగ్రహం చూపటం అవసరం. వారు తమ స్వానుభవంతో, 'ఆబ్బాయీ, నీ వేమి మాట్లాడుతున్నావో నీకు సరిగా తెలియదు.' ఈ మాదిరిగా మాట్లాడటం ఏ కుర్రవాడి కయినాసరే వ్యతిరేకభావాన్ని కలిగిస్తుంది. అనుభవమే ప్రధానం కాదని వా రనుకొంటారు. నే నీ విధంగా అనుకొంటానికి నాకు హక్కు ఉన్నదని యువజనులు అనుకొంటారు. పెద్దలు తమ అనుభవాన్ని పురస్కరించుకొని, విమర్శించినప్పుడు పిన్నలు చాలా బాధపడతారు. కనుక పెద్దలు వారితో ఘర్షణ లేకుండా సమరసంగా పోవటం ఉచితం.

పిల్లల్ని పిల్లలగా గాక, మిత్రులనుగా భావించినట్లయితే తలిదండ్రులకు తగాదాలు రావు.

బాల్యంలో రాజుగానూ, కౌమారంలో మిత్రుని గానూ, పాటించవలసినదని నీతిశాస్త్రం చెపుతున్నది. కాని తండ్రులు సంతానాన్ని తమ ఆస్థిపాస్థులవలె భావించి వారిని స్వేచ్చగా పెరగనివ్వకుండా అడ్డు పడుచున్నందువలననే ఈ అనర్ధకాలు వస్తున్నవి.

"They have come through you not by you” పిల్లలు తలిదండ్రులద్వారా వచ్చారు. కాని, తలిదండ్రులవల్ల రాలేదన్న ఖలీల్ జిబ్రాన్ అన్నమాట సత్యం.

తానిట్లా చేశానని తలచి, తన కుమారుడు కుడా అట్లాగే చెయ్యాలని చెప్పడం సముచితంకాదు. వారి అనుభవం నేటికి సరిపోతుందని గ్రహించాలి. ఈనాటి కాల పరిస్థితుల ననుసరించి, సమస్యలను గురించి ఆలోచించాలి. పిన్నలుకూడా పెద్దవారి స్వభావాన్ని గమనించి, వారు వృద్ధులు, వారు అట్లాకంటె మరొకవిధంగా మాట్లాడలేరని భావిస్తే యువజనులుకూడా బాధపడనవసరం లేదు. పెద్దవారు వృద్దాప్యంవల్ల, ఒకొక్కప్పుడు నిగ్రహాన్ని గోల్పోతారు. అసలు పెద్దవారెప్పుడూ తమ పాత అనుభవాలను పదిలపరచుకొంటారు, అవే గొప్పగా పిల్లలతో పదే పదే సంభాషిస్తారు. వద్దన్నా, కద్దన్నా వారు చేసే పనే అది, 'ఇదివరకు మీరు ఈ సంగతి చెప్పారు' అని పిల్లలు వారిని విసిగించకుండా, వారి ధోరణికి వారిని విడిచిపుస్తే, పాపం వారు ఆ విధంగా సంతోషపడతారు!

క్షణ క్షణం మారే ఈ ప్రపంచంలో పెద్దవారు నూతన అభిప్రాయాలకుతట్టుకోలేక దిగ్ర్భాంతి చెందుతారు. వారు ఒకొక్కప్పుడు చాలా బాధపడతారు.

పైన పేర్కొన్న సాధక బాధకాలన్నీ, ప్రేమ, సానుభూతులతో తప్పించుకోవచ్చును. వా రుభయులకు ఇదే మంచిమార్గం. పిన్నలయెడల సానుభూతిగల పెద్దలు, వారి అభిప్రాయాలను, ఆలోచనలను, భంగపర్చచూడరు. అటువంటివారు విని, డయాదాక్షిణ్యాలతో ఉంటారు. అట్లాగే యువజనులు పెద్దలయెడ ప్రేమ గౌరవాలతో ఉన్నట్లయితే పెద్దవారిని బాధించుటకు ప్రయత్నించరు. ఈ విధంగా వీ రిరువురు ఉంటే బాధలేదు.