మాటా మన్నన/11. సింహావలోకనం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సింహావలోకనం :

సంభాషణ ఎట్లా చెయ్యాలో కొంతవరకు మనం తెలుసుకున్నాం . సంభాషణ ఒక కళ అని, దానిని నేర్చుకోవచ్చునని గ్రహించటం అవసరం. కనుక బాగా మాట్లాడలేనివారు తగు కృషి చేయవలసి వస్తుంది. సహజంగా వచో నైపుణ్యంగలవారికి చెప్పనవసరం లేదు. అట్టి శక్తియుక్తులు లేనివారు మాత్రం తప్పక ప్రయత్నించవలసి వస్తుంది.

బాగాను, మనోహరంగానూ మాట్లాడాలంటే అనేక విషయా లున్నాయి. పెక్కు విషయాల్లో పరిజ్ఞానం కల వారికి మాట్లాడుటకు విషయం దొరకకపోదు. 'నాకు మాట్లాడటానికి విషయమేదీ కనపడటం లేదు' అనేవారి సంగతి గుర్తుంచుకోవాలి. ' నేనేమి మాట్లాడగలను' అంటారు కొందరు. అట్లా అంటంలో తన కిష్టమైన సంగతి ఏమీ లేదు అన్నమాట. మాట్లాడటం కష్టమనుకుంటే తగు కృషి చెయ్యాలి. వారి వారి అభిరుచులు అర్హతలనుబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కృషిచేస్తారు. నే నెందుకూ పనికిరాని వాడిని అని గానీ, ఇతరుల దృష్టిలో మెలగజాలని వాడిని అని గాని తరచు అంటూ ఉండటం వింటాం. అది అతి వినయం, లేక నిరాశావాదం. నీకు ఇష్టం లేనిది ఇతరులకు ఇష్టం కావచ్చు.

బస్సు కండక్టరుకు, దుకాణంలో పనిచేసే మనిషికి ఆ పనుల్లో ఇష్టం లేకపోవచ్చు. కానీ వీరికి ప్రజల మనస్తత్వం బాగా తెలుసు. బహు జనం నిత్యం వీరితో సంబంధం కలిగిఉంటారు. గృహకృత్యాలలో నిమగ్నులైన స్త్రీలు బజారుకువచ్చి ఏమి బావుకుంటారని అనుకుంటారు. కాని వారికి కూడా అనేక అనుభవాలు ఉంటాయి. దుకాణాలకు పోయి వస్తువులను కొనటం, బజారులోని మనుషులను చూడటం మొదలగునవి వీటిని గురించి వారు మాట్లాడ వచ్చు.

అందరూ బాగా మాట్లాడలేరనే సంగతి నిజమే. కానీ తమకు అందుబాటులోని సంగతిని గురించి ఆలోచించి ఆకర్ష వంతంగా మాట్లాడటానికి కృషి చెయ్యాలి.

ఏ విషయాన్ని గురించి మాట్లాడాలో తెలియని వారు కొంత కృషిచెయ్యాలి. ఎట్లాగంటే పొర్తా పత్రికలను చూస్తాం. దానిలో కొన్ని ప్రధానమైన వ్యాసాలుంటవి. వాటిని గురించి కొన్ని భావాలు కలగటం సహజం. వాటి యందు ఇష్టము అయిష్టము గూడా ఉంటుంది. అప్పుడు వాటిని గురించి మాట్లాడటం చాలా సులభం. కాకపోతే తెలియని విషయాలను తెలుసుకోవటం జరుగుతుంది. కొన్ని పట్టణాలలో మ్యూజియములు, పార్కులు ఉంటవి. అక్కడికి చాలామంది వెళ్ళుతారు. అట్లా వెళ్ళటం నీకు ఇష్టం లేకపోతే వారు కాలాన్ని ఎలా వృధా చేస్తున్నారో దానిని గురించి మాట్లాడవచ్చు. అది నచ్చేటట్లైతే వాటికి సంబంధించిన పుస్తకాలు చదివి యింకా అనేక సంగతులు నేర్చుకోవచ్చు. ప్రపంచంలో సుఖశాంతులు చాలామంది గోల్చోవటానికి కారణం 'దానిలో ఏముంది లే' అని అనుకో వడమే. దీనికి సాదృశ్యంగా ఒకసంగతి చెబుతాను, కొందరు మహాబలిపురం చూడడానికి ఒక కారుమీద వెళ్ళారు. ఆ డ్రైవరు అనేకసార్లు వచ్చినవాడే, కానీ అతను ఎప్పుడూ చూడాలని తలచ లేదు. ఒకనాడు అందులో వచ్చినవారు ఆ డ్రైవరునుకూడా వెంట పెట్టుకొని వెళ్ళదలచారు. ఆయన రానన్నాడు. కాని వారు పదే, పదే చెప్పడంవల్ల వచ్చాడు. మొట్టమొదట ఆయన కేమీ నచ్చలేదు. కాని అవన్నీ చూచినందువల్ల ఆయనకు కూడా అభిరుచి కలిగింది. అనంతరం ఆయనకు వీటియందు అభిమానం అధికమై వాస్తు శాస్త్రాలు చదవసాగాడు. అభిరుచి, అభిమానం కలగకపోతే బాగా మాట్లాడటానికి కృషి చెమ్యూలి. ఇతరులకు నచ్చేటట్లుగా మాట్లాడటం గ్రహించటం అవసరం. అభివృద్ధి అనేది ఏదీ దానంతట అది రాదు. నిరంతరం కృషి చేస్తూ ఉండాలి. దీనివలనే అభివృద్ధి గాంచగల మనేది గుర్తుంచుకోవాలి. నీకు ఏది ఇష్టమో దేనిని గురించి బాగా మాట్లాడగలవో ఆ విషయాన్ని గురించి మాట్లాడటం మంచిది.

సంభాషణంటే కథమాదిరిగా ఒకరు చెప్పటం; ఒకరు వినటంకాదు. ఉభయులు కలసి మాట్లాడుకోవటం, సంప్రదించుకోవటం. ఆ పద్దతి ఉభయులకు ఉపయోగకారి. సంభాషణ అంటే గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవటం కాదు. అవతలమనిషి మాట్లాడే దానిమీద నీ అభిప్రాయంచెప్పటం. ఒకరు మాట్లాడుతూఉంటే మరి ఒకరు “అచ్చా, బాగుంది అదే నేను ఆలోచించేది” అని అనరాదు. సంభాషణ అంటే చదరంగం వంటిది. ఇద్దరూ పాల్గొని ఆడాలి. ఒకరు మాట్లాడుతుంటే రెండవవ్యక్తి కేవలం వినటం సంభాషణ కానేకాదు. అది ఉపదేశం, నీతిబోధ అవుతుంది. సంభాషణ అనగా ఇద్దరు కలిసి సంప్రదించుకోవటం అన్నమాట. ఒకరు ఒక విషయం చెప్పితే, రెండవవారు దానిని గురించి తమ అభిప్రాయాన్ని కూడా వెల్లడించాలి. 'ఆయనతో మాట్లాడాను. చాలా అద్భుతంగా ఉన్నది. అఖవంటిది ఎప్పుడూ వినలేదు.' అనటం సంభాషణ కాదు. అబ్లామాట్లాడే వ్యక్తికి విషయవైవిధ్యం లేదనీ, .ఆయన చెప్పిన నారిదగ్గర నుండి చాలా విషయాలు తెలుసుకున్నాడన్నమాట. నీకు వినటంకాదు, నీకు తెలిసిన విషయాలను గురించి ఇతరులతో మాట్లాడటం, దానిపై ఇతరులు మాట్లాడటం అదీ సంభాషణ

సంభాషణఅంటే ఒకరు చెప్పుతూ ఉంటే ఊకొట్టటం కాదు, కలసి మెలసి మాట్లాడటం. రెండవవారు మాట్లాడుతుంటే బిడియపడి మాట్లాడకుండా ఉండరాదు. తాను కూడా మాట్లాడ ప్రయత్నిస్తే ఆ బిడియము అదేపోతుంది. Practice makes a man perfect. సాధనమున పనులు సిద్ధిస్తాయి. ఎవరూ ఏవిషయాలను పుట్టుకతో నే నేర్చుకొని రాలేదు. నిరంతర సాధనవల్ల నే గొప్పవారు కాగలరు.

గొప్ప తెలివి తేటలు గలవారుకూడా సంభాషణలో గొప్పవారు కారు. కవులు, గాయకులు, రాజకీయవేత్తలు ప్రఖ్యాతులై ఉండవచ్చును. వారి వారి వృత్తులలోనే ప్రఖ్యాతులుగాని సంభాషణలో అందరూ రాణించరు. దీనికి కారణం వారు వారి సంబంధంలేని విషయంలో జోక్యం కలుగచేసుకోకుండా ఉండటమే. అందుచేతనే వారి దగ్గరకు వెళ్ళినప్పుడు వారు మనలను హర్షింప జేయలేరు. వారుకూడా భిడియపడిమాట్లాడటానికి జంకుతారు. ఇదంతా చూచి సాధారణ వ్యక్తి కొంచం తృప్తిపడవచ్చు. సంభాషణలో శ్రద్ధ తీసుకుంటే తెలివిగలవారికంటే అధికముగా మాట్లాడగలరు.

సిగ్గు, మౌనం సంభాషణలో పాల్గొన ఇష్టంలేకుండా ఉండటం, ఎంత చెడ్డదో రెండవవారికి అవకాశం ఇవ్వకుండా ఎప్పుడూ తానే చెవికోసిన నక్క.మాదిరి మాట్లాడటం అంతకంటే చెడ్డది. ఆ వినే వ్యక్తి ఈ మాటలపోగు నాకు ఎక్కడ దాపురించాడురా! అని అనుకుంటాడు. ఇది సాధారణంగా జరిగే పద్దతి.

లోకంలో అతిగా మాట్లాడేవారు, నోరు మెదపని వారు అధికంగా ఉన్నారు. సక్రమంగా సంభాషణ చేసే వారు స్వల్పం. కనుక ఈ రెండు చెడ్డ గుణాల నుండి తప్పించుకుని బాగా మాట్లాడటం నేర్చుకోవాలి. అతిగా మాట్లాడేవారు అవతలవారు తన మాటలు వినటానికి ఇష్టంగా ఉన్నారో లేదో, వారి ముఖాలు పరీక్షించాలి. కనుక అతిగా మాట్లాడే మనిషి జాగ్రతవహించి, అవతల మనిషికి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి.

లోకంలో గొప్ప అనుభవజ్ఞులు అతి తెలివి తేటలు గలవారు ఈ విషయమై గుర్తుంచుకోవాలి. ఎప్పుడూ తన సొద చెప్పుకునేవారి మాటలు ఎవరూ వినరు. వారికి మర్యాద మన్నన తగ్గుతుంది. మాట్లాడేవారు సర్వము తమకే తెలుసని దృష్టితో మాట్లాడుతుంటే, వినేవారు బుద్దిహీనులని దృష్టితో వినటానికి అంగీకరించరు. మాట్లాడటం ముగించిన తరువాత అది నా అభిప్రాయం ఇది నీ కెంత నచ్చుతుంది అనాలి వివేక వంతుడు. అంతేకాని తాను చెప్పిందే సరని, తాను చెప్పిందంతా అంగీకరించనివారు మూర్ఖులని తలచరాదు.

సంభాషణలో మరొకదోషం స్వోత్కర్ష , ఆత్మస్తుతి, పరనింద ఎప్పుడూ పనికిరాదు. కొందరు పరోక్ష పద్దతిని స్వోత్కర్ష ప్రారంభిస్తారు. సంభాషణలో ఇవన్నీ తప్పులే.

మరొకదోపం, . ఒకరు మాట్లాడుతుంటే ఆ మనిషిని సాంతం మాట్లాడనీక తనకు ఇష్టం లేనపుడు ఎదుర్కొంటారు; వ్యతిరేకిస్తారు. చివరివరకు వినే ఓర్పు లేకపోవటం మంచి పద్దతికాదు. ఓర్పు, సహనం ఉండాలి. ఒకరు మాట్లాడిన తరువాత మరొకరు మాట్లాడటం సభ్యత.

సంభాషణలో మొదటి సంగతి మర్యాదగా ప్రవర్తించటం. ఎదటిమనిషి. మాట్లాడుతుంటే వినటం ధర్మం. అది ఇష్టం ఉన్నా. ఇష్టం లేకపోయినాసరే. ఇతరుల మనస్సుకు కష్టం కలిగేటట్లు సంచరించరాదు. మన్నన పొందాలంటే సంభాషణలోగాని, వాదనలోగాని మర్యాదగా మాట్లాడాలి. అప్పుడు ఆ మాటలు అందరూ హర్షంతో వింటారు. ఇతరుల అభిప్రాయాలను ఖండించ దలచు కుంటే పెద్ద గొంతుతోను, కోపంతోనూ మాట్లాడరాదు. సకారణంగానూ, శాంతంగానూ మాట్లాడుతుంటే అందరూ బాగా వింటారు. రేడియోలో ఒకరు మాట్లాడిన తర్వాత మరిఒకరు మాట్లాడుతుంటే వినటం మనకెంతో ఇంపుగా ఉంటుంది. అక్కడకూడా చర్చలలో పాల్గొని నెమ్మదిగా, శాంతంగా ఒకరి అభిప్రాయాలను మరిఒకరు విమర్శించుకుంటారు. వాదాలతో దిగి త్వం శుంఠంటే త్వం శుంట అనుకోవటం మంచిది కాదు.

ఎదటి మనిషిని మాట్లాడనివ్వడం మర్యాద. అవతల వ్యక్తి సిగ్గుపడుతున్నప్పుడు దానిని పోగొట్టి మాట్లాడటానికి ప్రోత్సహించాలి. నీ సంగతి నీవు చూచుకోవటం మంచిదికాదు. ఎదుటివారి సంగతి గమనించటం మంచిది.

త్రికరణశుద్ధి, మర్యాద ఉండటం మంచిది. ఆత్మవంచన, పరవంచన మంచిది కాదు.

ఇతరుల ఆలోచనలు అభిప్రాయాలు వినటానికి కుతూహల పడాలి. జ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకోవాలంటే తెలిసింది తెలుపు, ఇతరులు చెప్పేది విను, వారి మాటలు వినటం ఇష్టమున్నట్లు వర్తించాలి. అవి వినసొంపుగా లేక పోయినా వినటం ధర్మం. అతను ముగించిన అనంతరం ఇష్టమైన సంగతిని గురించి నీవు మాట్లాడు.

సంభాషణ అంటే ఒకరు నొకరు గౌరవించుకోవటం-సమాన ప్రతిపత్తి చూపటం. ఇతరుల యెడ మర్యాదగా ప్రవర్తించడం అభివృద్ధికి మంచి మార్గం. ఇతరులతో సంభాషించేటప్పుడే మనిషి సంస్కారం కనిపించేది. సరియైన సంభాణ గురించి తుదిమాట చెప్తున్నాను. అది అధికంగా నిస్వార్ధం, నిష్కాపట్యంమీద ఆధారపడి ఉంటుంది. ఇతరుల ఆనందాన్ని గురించి ఆలోచించటం సిగ్గుతో మాట్లాడలేని వారిని ప్రోత్సహించి మాట్లాడేటట్లు చేయటం, తన లోపాలను దిద్దుకోవటం. నీ విధిని నీవు నిర్వర్తించటం కర్తవ్యం.

నిత్యమూ కొత్త సంగతులు తెలుసుకోవటం, నూతన అభిప్రాయాలు గ్రహించటం అవసరం. ఈ విధంగా చేస్తూ ఉంటే ఇతరులు నీ మాటలను చెవి యుగ్గి వింటానికి ఇష్టపడతారు. ఇది కొంచెం కష్టమైనపని కావచ్చు. కాని అభివృద్ధి నిరంతరం పరిశ్రమవలనే లభిస్తుంది. నిత్యమూ చదవటం, లోకంలో జరిగే సంగతులను సరిగా గ్రహించటం, కళ్ళనూ చెవులనూ సరిగా ఉపయోగించటం చేయవలసిన పని. పంచేంద్రియాలను నీ అభివృద్ధికై ఉపయోగించాలి. ఈ మాదిరి సౌధన నీ అభివృద్ధికి ఆధారభూతంగా ఉంటుంది.

కనుక పరిశ్రమ అవసరం. కొందరు సహజంగా ప్రతిభావంతులు. కానివారు కొద్దిమంది మాత్రమే. సంభాషణసరిగా చేయా లనుకునే ప్రతివారు ప్రయత్నించాలి. అట్లా కృషిచేసే మనిషి. నిజంగా జయం గాంచగలడు. నిన్ను గురించి గాక ఇతరుల గురించే ఆలోచిస్తే పయోజనం ఏమిటి? కనుక ఏవిధంగా సంభాషణలో ఇతరులను ఆనందింప చేయగలవో ఆ సంగతులను నేర్చుకుంటే నీవు మంచి సంభాషణ కర్తవు కాగలవు.