Jump to content

మాటా మన్నన/2. సంభాషణలో పాటించదగిన విషయాలు

వికీసోర్స్ నుండి

సంభాషణలో పాటించదగిన విషయాలు :

కళల అన్నిటిలోవలే సంభాషణ కళలోకూడ కొన్ని నియమాలను తెలుసుకోవాలి. సంభాషించేటప్పుడు తప్పనిసరిగా ఈ నియమాలను పాటించాలి. వీటిని పాటిస్తే మనం విజయం గాంచామన్నమాటే. మాట్లాడే పద్దతి, మాట్లాడే విషయం, సంభాషణలోని సంగతులని గుర్తించాలి. ఆవి నియమాలని అనుకోరాదు. మాటల శక్తియుక్తులు మాట్లాడేటప్పుడు మనం పాటించే పద్ధతినిబట్టే ఉంటవి. కనుక ఆ పద్దతులను జాగ్రత్తగా పాటించాలి మనం.

చిరునవ్వు, స్పష్టం, సంగ్రహం, నిరాడంబరం, మర్యాద, నేర్పు, నిజాయితీ, ఉపజ్ఞతని, మాధుర్యం , ఇవన్నీ మంచి సంభాషణకు అవసరాలు.

అందంగా వుండటానికి ఎన్నో నగలూ, నాణ్యాలు, దుస్తులు ధరిస్తారు. చిరునవ్వు లేకపోతే ఎన్నున్నా శవాలంకారమే. చిరునవ్వే అందర్నీ ఆకర్షించేది,

మాటలకంటె అభినయమే అధికంగా ఆకర్షించేది, 'నీవంటె నాకిష్టం. నిన్ను చూచి ఆనందించాను' అని అది చెపుతుంది.

తెచ్చి పెట్టుకొన్నది కాగూడదు. చిరునవ్వు. హృదయము నుండి వెలువడాలి. నవ్వు అంటె సానుభూతి అన్నమాట.

గంభీర హృదయులను గాంచినపుడు భీతి, మూతి ముడుచుకున్నవారిని చూచినపుడు అయిష్టం; చిరునవ్వుగల వారిని చూచినపుడు పరమానందం కలుగుతుంది. ఇది నిత్య జీవితంలో అందరకు తెలిసిన విషయమే.

అనుభవంగల వర్తకులు చిరునవ్వుతో ఆహ్వానిస్తారు. అందుచేతనే “చిరునవ్వు నవ్వనివారు దుకాణము పెట్టరాద”ని చీనాదేశపు సామెత. కనుక సంభాషణలో ప్రధానమైనది. చిరునవ్వు. నవ్వుతూ మాట్లాడుతుంటే సమాధానం నవ్వుతూ చెపుతారు. ఇది నిత్య జీవితంలో రాజమార్గం.

నవ్వుతూ మాట్లాడేవారిని అందరూ ప్రేమిస్తారు. అతను అధికంగా స్నేహితులను అందువల్ల సంపాదించుకొంటాడు. అందరకూ మంచివా డవుతాడు.

ఆదరాభిమానాలను అందుకోవడానికి ఈ లోకంలో ఉన్నదల్లా చిరునవ్వు ఒక్కటే. ఈ దరహసిత వదనం జ్యోతిలాగా ప్రజ్వరిల్లి తన కాంతిచేత ఎనలేని ప్రయోజనాన్ని చేకూరుస్తుంది.

అందుచేత మిత్రులు కనబడగానే చిరునవ్వు నవ్వాలి. అది మాటలకంటె అధిక ప్రయోజనకారి

ఇతరులను చిరునవ్వుతో పలకరించడం నేర్చుకుంటే, ప్రపంచంలో చిర చిరలాడే ముఖం ఉండదని ఒక నుప్రసిద్ధ ఆంగ్లేయుడు అన్నాడు.

స్పష్టత :

మనం మాట్లాడేది అవతలవారికి తెలిసేటట్లు చెప్పవలసి ఉంటుంది. మనస్సులోని సంగతి యితరులకు తెలిసేటట్లు చెప్పకపోతే ప్రయోజనమేమి ?

తెలిసేటట్లు మాట్లాడటానికి ముందు మనం మాట్లాడే సంగతి మనకు బాగా తెలియాలి. మన అభిప్రాయాల్లో తికమకలు ఉంటే, వినేవారికీ ఎట్లా తెలుస్తుంది ? కొందరికి మంచి అభిప్రాయాలు ఉంటవి. కాని అవి ఇతరులపై ప్రభావం కలుగజేయలేవు. దీనికి కారణం వారి అభిప్రాయాల్లో తికమక , లేక చక్కగా వెలిబుచ్చ లేకపోవటం.

భాషా దారిద్ర్యమే సుస్పష్టంగా చెప్పలేనందుకు కారణమని మన కొకప్పుడు తోస్తుంది. ఈ లోపం లేకుండా ఉండాలంటే చిన్న చిన్న వాక్యాలతో మాట్లాడటం మంచిది.

స్పష్టంగా చెప్పలేకపోవటానికి గల కారణాలలో ఒకటి మన భావాలను తగ్గుస్థాయిలోచెప్ప ప్రయత్నించటం. ఒక ప్రొఫెసరు తన భావాలను చిన్నపిల్లలకు చెప్ప ప్రయత్నించినపుడు ఇటువంటిది జరుగుతుంది. తర్వాత తన మాతృభాషలోగాక పరభాషలో మాట్లాడేటప్పుడు కూడా జరుగుతుంది.

ఏమాట ఎట్లా వాడితే, వాక్యరచన ఎట్లా చేస్తే వాక్యం భావ యుక్తంగా స్పష్టంగా ఉంటుందో వారికి తెలియదు.

స్పష్టంగా మాట్లాడేవారు శ్రోతల ఆమోద, హర్షాల్ని పొందగలరు.

సంగ్రహం:

సంభాషణ సంగ్రహంగా ఉండటం అన్నివిధాల మంచిది. గొప్పవారు ఎప్పుడూ వాచాలురుకారు. వారు మితముగ భాషింతురు. వారి భావములు పలుకులు సమానముగ తూగును. ఆ మిత భాషలో జగత్తును నడుపు సూత్ర ముండును. వారి వచనములు సూత్రప్రాయములై ఉండును. ధనం ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో అంతకంటే పొదుపుగ మాట్లాడటం నేర్చుకోవాలి. అట్లా మాట్లాడితే వినేవారికి సొంపుగా ఉంటుంది. కాలహరణం వుండదు. సాధ్యమైనంతవరకు సంగ్రహంగా మాట్లాడటం ఉభయ తారకం.

నిరాడంబరం:

నిరాడంబరత్వం కళలన్నిటికి మూలసూత్రం. ఆడంబరం లేనిమాట అందరిని ఆకర్షిస్తుంది. - గాంధీమహాత్ముని మాటలు బహు నిరాడంబరంగా వుండేవి. గొప్పవారి గుణమే అది. భగవాన్ రమణమహర్షి అంతే. వారి పలుకెంత ఆడంబర రహితంగా ఉండేదో అంత అందంగా వుండేది.

సంభాషణలో వాగాడంబరం, పాండిత్య ప్రకర్ష చూపటం, గ్రాంధికంగా మాట్లాడటం పనికిరావు. ఏదైనా విద్యద్గోష్ఠి జరిగినపుడు కొంతవరకు సమయోచితంగా మాట్లాడవచ్చు.

తమ గొప్పదనాన్ని చూపెట్టుటకు కొందరు గూడార్థాలతో మాట్లాడతారు. అది మంచిపనిగాదు. సంభాషణ ఎంత సంగ్రహంగా, సుబోధకంగా ఉంటే అంత మంచిది. నాటక రచన గొప్పగా భావించబడుటకు కారణము ఇదే, సంభాషణ సహజంగానూ, సంగ్రహంగానూ వుండాలి.

“Be simple, uneffected; be honest in your speaking and writing. Never use a long word when a short one will do........ Where a

short word will do, you always lose by using a long one. You lose in clearness, you lose in expression of your meaning; and in the estimation of all men who are competent to judge, you lose in reputation for ability"

-BEYANT.

మర్యా ద:

మాట మన్నన తేవాలి. మన్ననలేని మాట మాటకాదు. కనుక సంభాషణలో మర్యాద మన్నన చాలా అవసరం. సంభాషణలో అప్రియానికి నిష్కపటత్వానికి భేదం తెలియని వారున్నారు. అప్రియం మర్యాదకు భిన్నమైనది, తను భావించినట్లు నిజంగా మాట్లాడవచ్చును. కాని అది వినేవారికి అప్రియంగా వుండరాదు. సత్యం చెప్పేటప్పుడుకూడా అప్రియం చెప్పరాదు, అందుచేతనే 'సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ ; నభ్రూయాత్ సత్య మప్రియం' అన్నారు. కనక ప్రియంగా మాట్లాడటం నేర్చుకోవాలి. నిష్కాపట్యం అప్రియంకాదు; దానికి భిన్నమైనది.

ఎటువంటి సన్నిహితులతో మాట్లాడినా అప్రియంగా (Blunt) మాట్లాడరాదు. ఆమాట 'ఈటి' వంటిది. పరులకు వ్యధ కలిగేటట్లు ఎప్పుడూ మాట్లాడరాదు. కొందరి నోరు మాట్లాడుతూవుంటే నొసలు ఎక్కిరిస్తవి. ఇది అనర్ధకరమైనది. మర్యాద ఇచ్చి మర్యాద తెచ్చుకో మన్నారు . మర్యాదనేది దానంతట ఎవరికీ అది రాదు. మర్యాదవల్లనే లభిస్తుంది.

కాలు జారితే తీసుకోవచ్చును గానీ నోరు జారితే తీసుకోలేం .

నరం లేని నాలుక అని ఎట్లాబడి తే అట్లా మాట్లాడ రాదు.

నాలుక స్వాధీనంలో వుంటే నరలోకమంతా స్వాధీన మవుతుంది.

నేర్పరత్వం :

సంభాషణ సరసంగా వుండాలంటే నేర్పరత్వం అవసరం, మనం ఏదో తొందరలో వేడితో మాట్లాడుతాం. ఆ మాటవల్ల ఎవరి హృదయానికై నా నొప్పి కలిగిందేమో నని గమనించాలి. గమనిస్తే వెంటనే ఆ విషయాన్ని మార్చి వెయ్యాలి.

పదిమందిలో క్షమాపణ కోరటం పుండుపై కారం చల్లినట్లవుతుంది. అవసరమైతే ఒంటరిగా వున్నప్పుడు క్షమాపణ చెప్పటం మంచిది.

సంభాషణలో వివాదాస్పదమైన విషయాలు, వ్యక్తిగత విషయాలు విడువటం మంచిది.

నిజాయితీ :

మర్యాద నేర్పరత్వాన్ని పాటించవలసిందని చెప్పిన తరువాత సంభాషణలో నిజాయితీ అవసరమనీ చెప్పవలసిన పని లేదని తలచవచ్చు, కాని అట్లా తలచరాదు. నిజాయితీ అనగా నిష్కాపట్యము (Candour). కాని వీటిని మర్యాదగ భావించరాదు. తెలివిగలవారి ముందు యుక్తిపరుల ఎదుట సిన్సియర్ ఒపీనియన్ నిష్ప్రయోజనం.

మన విశ్వాసాలు సరియైనవి అయినట్లయితే వాటిని వెల్లడించడానికి సంకోచించరాదు. అభిప్రాయాలు (opinions) విశ్వాసాలు (convissions) ఒకటి కాదు. అట్లాగే ఆచారాలు విశ్వాసాలు ఒకటి కాదు.

ఆచారం పరంపరగ వచ్చేది. అది విశ్వాసం వున్నా లేకపోయినా ఆచరించేదే. అందుచేతనే లోకంలో చాలా మంది ఆచారవంతులున్నారు గాని విశ్వాసవంతులు కారు.

ఉపజ్ఞ:

సంభాషణాపద్ధతులన్నింటిలో ఉపజ్ఞ కష్టమైనది . ఉపజ్ఞతోకూడిన సంభాషణకు శైలి అవసరం. దీన్ని సంభాషించటానికి సంస్కృతిగలవారితో సంబంధం పెట్టుకోవటం సంభాషణాపద్దతులు నేర్చుకోవటం మంచి సాహిత్యం చదవటం అవసరం.

ఒక విషయాన్నిగురించి ఆలోచిస్తున్నప్పుడు పరాభిప్రాయాన్ని గాక, తాను స్వయంగా ఆలోచించి చెప్పటమే ఉపజ్ఞ. చాలా విషయాలు నిరుత్సాహంగా వుంటవి, ఎందుకంటె విన్నవగుట చేత, ఒక విషయాన్ని గురించి మనకు బాగా తెలుసును అనుకుంటే మనం దానినిగురించి బాగా ఆలోచించలేదన్నమాట. ప్రతిభ నవనవోన్మేషమైనది. సైంటి స్టులు ఒక వస్తువునుగురించి తీవ్ర పరిశోధనచేసి ఎట్లా తెలుసుకుంటారో అట్లా మనం కృషి, చెయ్యాలి.

మన సొంత అభిప్రాయాలు చెప్పేటప్పుడు దానికి తగిన ఉపమానమో తదనుగుణ్యమైన పరాభిప్రాయమో చెపితే బాగుంటుంది. ఈమాదిరి సంభాషణ ఎప్పుడు అధిక ఆకర్ష వంతంగా వుంటుంది.

మధురంగా మాట్లాడటం :

"కాకేమి తన్ను దిట్టెనె? కోకిల తన కేమి ధనము కోకొమ్మనెనే! లోకము పగయగు ఒరునని, వాకున, జుట్టమగు మధుర వాక్యమువలనన్ .” రసములలో మధురరసం అధికమైనది. దీనివల్ల చిత్తము ప్రసన్నమవుతుంది. మాధుర్యమంటె ఎటువంటి కఠినమూ కానిది. పంచేంద్రియాలలో దేనికైనను మాధుర్యము కలుగవచ్చు. సుందరవస్తువును చూచినపుడు నేత్రములద్వారా అది రూపమాధుర్యమగును. శ్రవణ పేయమైన మాటలు వింటూఉంటే శబ్దమాధుర్యమగును. ప్రసాదము, ఓజస్సు, మాధుర్యము కవితాగుణములకు మాధుర్యము అన్నారు. జయదేవుని గీతగోవిందం కోకిలస్వరమే కనుక మాధుర్యము అన్నారు.

మాధుర్యం కావ్యంలోనే కాదు కావలసింది; లోక సంబంధంలోకూడా. సంభాషణలో మృదుమధురంగా మాట్లాడటమే మాధుర్యం.

మాటలలో ఎంత ఆకర్షణశక్తివున్నదో సాధారణులు ఎరుగరు. న్యూటను ఆకర్షణశక్తికన్నా అధికంగా వున్నది . దేనిలో శబ్దాకర్షణశక్తి ఎంత అధికమో దాని ప్రభావం అధికం. అది మానవులనే కాదు, పశుపక్ష్యాదులను కూడా ఆకర్షిస్తుంది.

కోకిల పంచమ స్వరాలాపన అందరిని ముగ్ధులను చేస్తుంది. దీనినిబట్టి మనం గ్రహించవలసిందేమిటంటే మధురధ్వని అందరకు సుఖప్రదం, కనుక మధురమైన వాక్కులను మనం వాడాలి.

మధుర సంభాషణ అంటే మృదువైన వాక్కు.లే కాదు, మృదువైన భావం కూడా వుండాలి.

మాట్లాడేటప్పుడు ఒక మధురధ్వనితో మాట్లాడటం ఆవసరం, నీళ్ళు నవులుతూ మాట్లాడటం మంచిదికాదు. అది శ్రోతలలో ఉత్సాహం కలిగించదు. ఆ మాటకు ప్రభావం వుండదు. ఒకరు మాట్లాడే విషయం అంత పటుత్వం లేక పోయినా మాట్లాడే పద్దతి బాగావుంటే శ్రోతలను బాగా ఆగర్షించుతుంది.

మధురంగా మాట్లాడుటకు ఉపమాన పరంపరలు అవసరం లేదు. స్పష్టము, మధుర మైన ధ్వని అవసరం. సకిలించటం, తొస్సిగా మాట్లాడడం, మాటలు మింగటం, ముక్కుతో మాట్లాడటం ఇవేమీ మంచి ఫలితాన్ని ఇవ్వవు. మాట ప్రభావంగా వుండాలంటె ఉద్రేకం అవసరం. మధురంగా మాట్లాడాలని అంటే, తొందరగ కాని, బిగ్గరగకాని, మరీ నెమ్మదిగగానీ మాట్లాడరాదు.

నోరు మంచిదైతే ఊరు మంచి దవుతుందన్నమాట మరువ రాదు. మాటల ఇంపు సొంపు శబ్దంద్వారానే గాక చూపులవల్ల కంఠస్వరంవల్ల ప్రకటింపబడాలి. నీ హృదయ మాధుర్యం నీ చూపులలోను కంఠస్వరంలోనూ వ్యక్తంకావాలి. సుప్రసన్నవదనం, సుస్వరం, ప్రేమామృత దృక్కులు మొదలగునవి నీమాట మాధుర్యానికి తోడు నీడగా ఉన్నప్పుడే రాణించేది.

"To acquire self-confidence and to win the confidence of your audience, it is necessary to develop a soft voice, a modest countinance and a simple manner of speaking. This method is especially valuable in those speeches in which one is trying to influence a fair minded judge. Energetic oratory is not always desirable : more favour is to be gained by a gentle demeanour, a soft voice and a simple style."

And a great psychologist has said, “There are three stages in our mental development; the first stage when we are simple through ignorance; the second stage when we become complex through the process of learning; and the third stage when we become simple again through knowledge."

"Men and women range themselves into three classes or orders of intelligence. You can tell the lowest class by their habit of taking about nothing else but persons; the next by the fact that their habit is always to talk about things; the highest by their preference for the discussion of ideas."

BUOKLE