మాటా మన్నన/1. సంభాషణా ప్రయోజన ప్రాముఖ్యాలు

వికీసోర్స్ నుండి

సంభాషణా ప్రయోజన ప్రాముఖ్యాలు

ఆదిమ సమాజమునుండి అత్యున్నత స్థితిగాంచిన నేటివరకు తన అభిప్రాయాలను తెలియ జేయటానికి మానవుడు ఎడతెగని కృషిచేశాడు. పశు పక్ష్యాదులు కూడా తమతమ అరుపులవల్ల తమ భావాలను ఇతర జంతుజాలానికి తెలుపుతవని కొందరు ఆలోచనాపరులు అంటున్నారు. అనటమే కాదు; పూర్వము పశుపక్షుల భాషలను మానవులు కొందరు నేర్చినట్లు గ్రంధాలద్వారా తెలుస్తున్నది. పాశ్చాత్యులు అధికపరిశ్రమ చేసి వానరాది జంతువుల భాషలను తెలుసుకొన్నట్లు తెలుస్తున్నది.

ఆది మానవుడు ప్రధమంగా ధ్వనుల వల్లనే తన అభిప్రాయాలను తెలియపర్చాడు. కనుక మానవుడు సంభాషణవల్లనే తన అభిప్రాయాలను ఇతరులకు తెలియ జేయును. తన అభిప్రాయాన్ని ఇతరులకు చెప్పటమే సంభాషణ. కనుక దీన్ని సాధ్యమైనంతవరకు జయప్రదంగా జరుపుటకు ఎందుకు కృషి చేయకూడదు? సంభాషణ అంటే మనస్సుల కలయిక అని నానుడి పుట్టింది. కనుక ఆ కలయికవలన కలిగే ఉత్తమ లాభాన్ని మనము ఎందుకు పొందగూడదు?

పరస్పర మన సమ్మేళనవల్ల మానసికాభి వృద్ధి పొందటమే సంభాషణా ప్రయోజనం. ఈ ప్రయోజనం పొందుటకు అనేకులతో సంభాషించు టవసరం. గుహలో నివసించిన మానవునకు అతని అవసరాలు, అతని లోకము, అంతా అల్పమే. అందుచేతనే అతని ఆలోచనలు చాలా తేలికైనవి. అతని జ్ఞానం స్వల్పం. అతని మేధ పెరగ లేదు. అతనిది కొంచపులోకం . కనుక ఆ సంఘానికి కొద్దిపాటి సంభాషణే అవసరమైనది. కాని ఈ నాటి లోకం అతివిశాలం. అయినప్పటికి అందరూ అన్ని విషయాలు తెలసినవారుకారు. ఏదో విషయం అధికంగా తెలిసిన వారున్నారునేడు. కనుక మన జ్ఞానాభివృద్ధికి ఈ అందరితోను సంభాషించటం అవసరం. దేశాటనం, వారాంగనా పండిత మిత్ర సంభాషణ అవసరమన్నారు పూర్వులు. వారాంగనలు ఈ నాటివారివలె కేవలం శరీరాన్ని అర్పించే వారు కారు. వారు సమస్త విద్యల్లోనూ ఆరితేరిన వారు. అందుచేతనే వారిని కళావంతులు అన్నారు. కనుక వారితో మాట్లాడటమే విద్య.

పల్లీ యుల సంబంధం పరిమితం, వారు తోటివారితోను, వైద్యుడు, పురోహితుడు, టపాబంట్రోతు మొదలగు కొద్దిపాటి మిత్రులతో సంభాషింతురు.

కాని పట్టణవాసి అసంఖ్యాకులతో ముచ్చటించాలి. కనుక భావాలను సరిగా వెల్లడించటానికి సంభాషణ అవసరం. డాక్టరులతో తన జబ్బును, వర్తకునితో తన అవసరాలను, వకీలుతో తన తగాదాలను, కూలీలతో తన పనులను చెప్పవలసివున్నది.

వేయేల? మాటవల్ల నేగదా మైత్రి. మాట లేని వాని బ్రతుకు బ్రతుకుకాదు. కనుక సంభాషణ విలువ అంతా ఇంతా కాదు; అత్యధికమైనది. రచనద్వారాకూడా అభిప్రాయ ప్రకటన జరిగేమాట వాస్తవమే. మన ప్రాచీన సాహిత్యమే ఈనాటి సంస్కారాని కంతకూ కారణం. కాని ఎందరు మనలో రచయితలు? కనుక మన అభిప్రాయాలు ఇతరులకి తెలియజేయటానికి, పరుల ఆలోచనలు తెలుసుకోవటానికి సంభాషణ తప్పనిసరి అని గ్రహించాలి. సంభాషణ ఒక లలితకళ. అది ఒక కళేకాదు ఒక శాస్త్రం కూడా, మంచి మాటకారులం కావాలంటే మనం కొన్ని నియమాలు అభ్యసించాలి. మనలో కాస్తఓపిక, ధ్యానము, పరిశీలన ఉంటే దీన్ని అభ్యసించటం ఏమంత కష్టంకాదు.

సంభాషణ మనకు తెలుసుననీ అది సహజంగానే అలవడుతుందనీ అనుకుంటాం. కనుక వేరే నేర్చుకోవలసిన అవసరం లేదని తలుస్తాం. బాగామాట్లాడటం. సంభాషించటం ఒకటని అనుకోకూడదు. బాగా మాట్లాడేవారిలో చాలామంది బాగా సంభాషించలేరు. గొప్ప గొప్ప కవులుకూడా మంచి సంభాషణ కర్తలుకారు. మంచి సంభాణ కర్తలతో మనము మాట్లాడుతున్నప్పుడు మన అశక్తత గోచరం అవుతుంది. అప్పుడు వారి ఎదుట మూగవారివలే వుండి సిగ్గుపడవలసి వస్తుంది.

సంభాషణను అయిదు విధాలుగా విభజింపవచ్చు. వర్తక వాణిజ్యాల సంబంధం, సాంఘిక సందర్భాలు, మిత్రులమధ్య, పండితగోష్ఠి, నిత్య వ్యవహారాలు,

మొట్ట మొదటగ మనం వ్యాపార సంబంధమైన సంభాషణసంగతి ఆలోచించుదాం. సరీగా సంభాషణ చేయకపోతే చాలా దెబ్బతింటాం. ఉదాహరణకు ఒక వ్యాపారస్తుడు తనకు కొందరు పనివారు కావాలని ప్రకటించాడనుకోండి. అప్పుడతను వచ్చిన దరఖాస్తుదారులను వరసనే పిలచినప్పుడు వారు సరిగా సంభాషణ చేయలేకపోతే వారు వచ్చిన దారి పట్టవలసిందే. నేర్పు లేనిదే ఏమీ ప్రయోజనం లేదు. యజమాని పలకరించగానే తనయందు సద్భావము కలిగేటట్లుగా సమాధానం చెప్పవలసి వస్తుంది. అట్లా చెప్పినవాడే జయం పొందగలడు. అట్లా సరిగా సమాధానం ఎంతమంది చెప్పగలరు?

అట్లాగే వర్తకంలోకూడా. వస్తువులను అమ్మటంలో నేర్పరత్వం అంటే మాటకారితనం అన్నమాట. షాపులోకి వచ్చినవారిని మర్యాదగా పలకరించి, వారు అడిగే వస్తువుల నాణెమును గురించి, ధరలను గురించి వారికి నచ్చేటట్లు చెప్పి, వారిని కొనేటట్లు చెయ్యాలి. వారితో వాద వివాదాలు పెట్టుకోరాదు. వ్యాపారమంతా సంభాషణా చాతుర్యంమీదనే ఆధారపడివుంది.

వైశ్యులకు ఇతరులకూ వర్తకంలో తేడా ఇదే. వారివలె మర్యాద మన్ననగ, ఓపికతో వచ్చినవా రందరితో మాట్లాడగల నేర్పు ఇతరులకు తక్కువ.

పెట్టుబడికంటె వర్తకులకు ముందు మాటల పొందిక ముఖ్యమని గుర్తించాలి.

ఇతర వృత్తులవారుకూడా రాణించాలంటే సంభాషణ చక్కగా తెలిసినవారై ఉండాలి. బాగా చదువుకున్న వారి కంటె, బాగా మాట్లాడటం నేర్చినవారే తమ పనులలో నెగ్గటం మనం కళ్లారా చూస్తున్నాం . సంభాషణలో నేర్పరత్వం లేనిది ఎవరూ ఎందులోను నెగ్గలేరు.

సంభాషించేటప్పుడు మన ధోరణిలో మనం ఉండరాదు. మన మాటలను వారు ఎట్లా స్వీకరిస్తున్నారో గ్రహించాలి. అవతల వారితో మాట్లాడేటప్పుడు వారి అభిమానాలు, అయిష్టాలు గుర్తించాలి. వారి ముఖ కవళికను గమనించాలి. మన మాటలు వారిమీద ఎట్లాపనిచేస్తున్నవో కని పెట్టవలసి ఉన్నది.

ఎవరైనా రాగానే ఎందుకు వచ్చారో గ్రహించి, అందుకు తగినట్లు మాట్లాడాలి.

వచ్చినవా రందరితోనూ ఒకే మాదిరిగా మాట్లాడరాదు. వారి వారి స్థాయిని గుర్తించి వ్యవహరించాలి.

మనస్తత్వ శాస్త్రజ్ఞుడే మంచి సంభాషణకర్త కాగలడు. ఆ శాస్త్రం చదవాలని కాదు; అనుభవం ద్వారా గ్రహించాలి.

సాంఘిక జీవితంలో సంభాషణ నిత్యావసరం. మాట్లాడుతూ ఉంటే, చూస్తూ నోరు మెదపకుండా ఉండేవారు అగౌరవం పొందుతారు. అతను ఒంటరితనం అనుభవిస్తాడు. మానవుడు సంఘజీవి కనుక సంభాషణ చక్కగా చేయవలసిన అవసరం అధికం. అతడు సాంఘికంగా జయం గాంచాలంటే చక్కని సంభాషణకర్తయి ఉండాలి.

విందులకు వినోదాలకుగాని నలుగురు కలిసిఉన్నప్పుడు గాని మౌనవ్రతం పూనితే ప్రయోజనం శూన్యం. కలసి మెలసి చక్కగా మాట్లాడాలి. అందరితో అప్పుడు మైత్రి ఏర్పడుతుంది. సంభాషణద్వారా ఆకర్షించాలి, అకర్షింప బడాలి. నాలుగు సంగతులు తెలియాలన్నప్పుడు నలుగురుతో మెలగాలి.

చక్కగా సంభాషించగలవారికి జీవితంలో కావలసింది ఏమిటి ? వారు పొందే ఆనందం అనితరలభ్యం.

సంభాషణకర్త లందరు ఒక శ్రేణికిచెందిన వారు కారు. సంభాషణా సంబంధమైన పుస్తకాలు చదివినవారు కొందరు, బాగా చదువుకొన్న వారు కొందరు, ఇంకా గొప్ప సంస్కారం గలవారితో మెలిగి నేర్చుకున్న వారు మరికొందరు. మొత్తంమీద వీరంతా సంభాషణను గుర్తించిన వారే. సంభాషణా ప్రయోజన ప్రాముఖ్యాలను గుర్తించకపోతే మన సంభాషణ రాణించదు.

సంబాషించే నేర్పుగలవారికి సంస్కృతి గలవారి సరసన కూర్చునే యోగ్యత కలుగుతుంది. నేర్పుగా సంభాషించేవారు కొద్దో గొప్పో మానవ ఆలోచన (thought) అభివృద్ధికి ఆధారభూతులు.

మంచి సంభాషణకర్తలు సాంఘికంగా రాణిస్తారు. సంభాషణద్వారా తెలివితేటలు పొందుతారు. సాంఘిక గౌరవం పెరుగుతుంది. నలుగురితో మాట్లాడితే గాని భిన్న దృక్పధాలు మనకు తెలియవు. మంచి ఉద్దేశాలు మనకు కలగవు.

మాట్లాడేటప్పుడు సమయాన్ని గుర్తెరిగి మాట్లాడాలి. వారు ఏస్థితిలో వున్నారు, ఏదైనా దీర్ఘాలోచనానిమగ్నులై వున్నారా, లేక కులాసాగా మాట్లాడుకుంటున్నారా అని. చదువుకున్న వారు తాము చదివిన గ్రంధాలనిగురించి మాట్లాడుకోవటం అవసరం. ఒక్కొక్కరు ఎట్లా భావించారో తెలుస్తుంది.

బంధుమిత్రులు, ఇంట్లోవారు కలసి సంభాషించటం అల్పసంగతి అని ఎంచరాదు. దీనివల్ల లాభం లేదని కొందరు తలుస్తారు. మన అనుభవాలను పెంపొందించు కొనుటకు ఇదికూడా ఎంతో ప్రయోజనకారి.

వీరంతా మనలోవారుకనుక వెరపులేకుండా మన భావాలను చెప్పుకోవటానికి అవకాశం ఉంటుంది. పరస్పర క్షేమాభిలాషులైన వీరి సంభాషణ పరమ ప్రయోజనకారి.

నాల్గవది విద్వద్గోష్ఠి. ఇది మన మెదడు అభివృద్ధి పొందటానికి అధికంగా తోడ్పడుతుంది. వారి సంభాషణ అంతా క్రమబద్ధమై పాండిత్య ప్రకర్షలను ప్రదర్శించేదిగా ఉంటుంది. ఉన్నత భావలబ్ధికి జ్ఞానాభివృద్ధికి ఇటువంటి గోష్ఠులు అధికంగా తోడ్పడుతాయి. పూర్వం విద్వద్గోష్ఠులు అధికంగా ఉండేవి. ఉపన్యాసాలకంటే ఇటువంటి గోష్ఠుల వలన ప్రయోజనం అధికం.

చివరికి మిగిలింది దైనందిన సంబంధం. ఇది పరిమితమైన వాక్కులతో కూడింది. కాని ఇదికూడా అల్పమని అనుకోరాదు. దీనిలోనూ ఎంతో మర్యాద మన్నన ఉన్నవి. ఇతరులతో స్నేహ గౌరవాలు దీనివల్ల కలుగుతవి. విశేషంగా ఇది ప్రేమానురాగ సంబంధం. పరిచయులు కనపడగానే 'క్షేమమా?' అనటంతో వారియం దెంతో మనం ప్రేమ కన్పరుస్తున్నామన్నమాట. ఆమాట మన హృదయం నుంచి రావాలి. పెదవినుండి రాకూడదు. అదెంతో ప్రయోజనకరమైనది.

అట్లాగే పెద్దలు కనపడగానే 'నమస్కారం' అనాలి. అదొక మర్యాద. మర్యాద హీనుడు మానవుడు కాడు. ఇవి చూడటానికి అల్పమే. ప్రయోజనం అధికం. ఇటువంటి అల్ప విషయాలే మనకు గౌరవా గౌరవాలు తెచ్చేవి.

చిరునవ్వుతో వచ్చినవారిని కూర్చోమనాలి. వచ్చిన మనిషి కూర్చోడా అనేవారు లేకపోలేదు. వారికి మర్యాదా మనస్తత్వాలు రెండూ తెలియవన్నమాట. మన సంస్కారం ఈ ఆహ్వానంలో కనబడుతుంది.

బయటనుండి ఇంటికి రాగానే భార్యను నవ్వుతూ పలకరిస్తే ఆమె కష్టాలన్నీ ఈడేర్చినట్లే.

అట్లాగే శ్రమపడి వచ్చిన భర్త ఇంటికిరాగానే ఆప్యాయతతో పలకరిస్తే అతని భారమంతా దింపినట్లే.

మాటలోనే అంతావుంది. అదిగుర్తెరిగి మాట్లాడాలి.

సర్వేసర్వత్రా సంభాషణేసంబంధాలను కలుపుతుంది. మాటంటే మనస్సు, మనస్సంటే మాట. మనస్సు కలిసేటట్లు నేర్పుకలిగి మాట్లాడాలి.

సంభాషణ అంటే కేవలం అభిప్రాయ వినిమయంకాదు. మనస్సుల కలయిక అని గుర్తించినపుడు మనం అభివృద్ధి గాంచగలం. అప్పుడు లోకకల్యాణం కలగ గలదు. సంభాషణా ప్రయోజనాన్ని గురించి ఎమర్సన్ ఇట్లా వ్రాశాడు:

"It is very certain that sincere and happy conversation doubles our powers, that in the effort to unfold our thought to a friend, we make it clearer to our selves, and surround it with illustrations that help and delight us. It may happen that each hears from the other a better wisdom than anyone else will ever hear from either. Speech is power; speech is to persuade, to convert, to compel. It is to bring another out of his bad sense into your good sense. You are to be a missionary, a carrier of all that is good and noble" So we can judge the value of our conversation by its influence on others.

Let us sum up in the words of Stevenson : "The first duty of man is to speak; that is his chief business in this world; and talk, which is more harmonious speech of two or more, is by far the most accessible of pleasure. It costs nothing; it is all profit; it completes our education; it founds and fosters our friendships and it is by talk alone that we learn our period and our selves"